జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, October 12, 2013

హాలులో...ఆద్యంతం హింస - 'రామయ్యా వస్తావయ్యా!'



  ఇవాళ పెద్ద హీరోలతో ఓ తెలుగు సినిమా అంటే దాదాపు 30 -40 కోట్ల రూపాయల సాహసం. అంత భారీ మొత్తంతో చేస్తున్న రిస్కు కాబట్టి, మిగిలినవాటి కన్నా ఇలాంటి చిత్రాల్లో కచ్చితంగా నటీనటుల అభినయ ప్రతిభకు ఆసరాగా నిలిచే మంచి కథ, కథనం, అత్యున్నత శ్రేణి ఛాయాగ్రహణం, ఎడిటింగ్‌, వాటన్నిటినీ సమన్వయపరిచే అపూర్వమైన దర్శకత్వం - లాంటి  కొన్ని తప్పనిసరి. 

కానీ, వీటిల్లో అత్యధిక భాగం కలికానికైనా కనిపించకుండా సినిమా తీస్తే అది ఏమవుతుంది? ఫలితం మాటెలా ఉన్నా, అసలు ప్రయత్నమే పచ్చి దుస్సాహసం అవుతుంది. ప్రముఖ నిర్మాత 'దిల్‌' రాజు, 'గబ్బర్‌ సింగ్‌' చిత్ర ఫేమ్‌ హరీశ్‌శంకర్‌తో కలసి చిన్న ఎన్టీయార్‌ హీరోగా చేసిన అలాంటి తాజా దుస్సాహసం - 'రామయ్యా వస్తావయ్యా!'


టైటిల్‌ ఎంతో సాఫ్ట్‌గా అనిపించినా తెర నిండా బోలెడంత హింసను పరిచేసిన సినిమా ఇది. కథగా చెప్పాలంటే, హీరో ఓ కాలేజీ స్టూడెంట్‌. ఏం చదువుతుంటాడో తెలియదు కానీ, ఎప్పుడూ ఓ నలుగురు స్నేహితుల్ని వెంటేసుకొని కబుర్లతో కాలక్షేపం చేస్తుంటాడు. మరో కాలేజీ విద్యార్థిని అక్షర (సమంత)ను చూసి ప్రేమ ముగ్గులో దింపుతాడు. ఆమె ద్వారా ఆమె ఇంటికి వెళతాడు. అక్కడ శత్రువుల నుంచి హత్యాయత్నాలు ఎదుర్కొంటున్న హీరోయిన్‌ తండ్రి మొసళ్ళపాడు నాగభూషణం (ముఖేశ్‌ ఋషి)ని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లే చేస్తూ అతణ్ణి చంపేస్తాడు. హీరో అలా ఎందుకు చేశాడన్న ఆసక్తికరమైన మలుపు దగ్గర 'వెయింట్‌ అండ్‌ సీ' అంటూ విరామం వస్తుంది. 

ఇక ద్వితీయార్ధం మొదలైన కాసేపటికే హీరో పగ ప్రతీకారాల కథ మొదలవుతుంది. అది ఓ గంట నడుస్తుంది. ఆదిత్యపురం అనే గ్రామం. ఆ గ్రామంలో అమ్ములు (శ్రుతీహాసన్‌) అనే అమ్మాయి. ఆ ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆమె ఆశయం.ఆమెకు హీరో ఎలా దగ్గరయ్యాడు, ఆ తరువాత ఆమెకు ఏమైంది, హీరో ఎందుకు పగతో రగిలిపోయాడన్నది ఆ కథలో తెలుస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌ అయిన తరువాత శత్రుశేషాన్ని హీరో ఎలా అడ్డు తొలగించాడన్నది పతాక సన్నివేశం. 

'రామయ్యా వస్తావయ్యా!' అనే ఈ టైటిల్‌ చూసి ఇదేదో కుటుంబ కథా చిత్రమనో, ఆ రకమైన కోవకు చెందిన సకుటుంబ వినోదమనో వెళితే, ప్రేక్షకులు తీవ్రమైన నిరాశకు గురవుతారు. సినిమా పూర్తిగా చూశాక, నిరాశకే కాదు అసంతృప్తికీ, అంతకు మించిన ఆవేశానికీ లోనవుతారు. ప్రాథమికంగా ఇది పగ, ప్రతీకారాల ఫార్ములా కథ. ఇలాంటి కథలు ఇప్పటికే ఎన్నో వచ్చేశాయి. ఆ మధ్య వచ్చిన 'బన్నీ' లాంటివి తాజా ఉదాహరణ. మళ్ళీ అలాంటి కథనే, 'గజిని' చిత్రంలోని ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ హీరోయిన్‌ లాంటి అంశాలతో వండి వడ్డించారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. సినిమా నిండా నరుక్కోవడాలు, చంపుకోవడాలతో రెండు మ్ముప్పావు గంటల్లో ఎక్కువగా హింసనే పండించారు. 

ఈ సినిమాకు పేరు మటుకు పెట్టేసుకొని, కొన్ని సోకాల్డ్‌ పంచ్‌ డైలాగులు, సీన్లు రాసేసుకొన్నట్లున్నారు. వాటన్నిటినీ గుదిగుచ్చి, ఇదే సినిమా అన్నట్లు అందించారు. కథకూ, సినిమాకూ సంబంధం లేకపోవడం  చాలదన్నట్లు, ఈ సినిమాలో హీరో పేరు రాము, నందు ఇలా రకరకాలుగా వినబడుతూ ఉంటుంది. ఇక, టీజర్లలో వినిపించిన 'బుడ్డోడు...', 'పందాలు గుర్రాల మీద ఆడాలి. సింహాల మీద కాదు...' తరహా పంచ్‌లన్నీ సమయం, సందర్భం లేకుండా, సినిమాలో ఇరికించినట్లుండి, అసహనం కలిగిస్తాయి. అలాగే, 'దాన వీర శూర కర్ణ'లోని పెద్ద ఎన్టీయార్‌ సుప్రసిద్ధ సుదీర్ఘ సంభాషణ 'ఆచార్య దేవా! ఏమంటివేమంటివి...' అనే డైలాగ్‌ను కూడా సందర్భం లేని చోట చిన్న ఎన్టీయార్‌కు పెట్టారు. శక్తిమంతమైన ఓ మర ఫిరంగిని కూడా అనవసరంగా తుస్సుమనిపించేశారు. ఆ గెటప్పు కూడా అంతంత మాత్రమే! 

ఇక, కథలో లోపాల సంగతికొస్తే, హత్యాప్రయత్నం జరిగిన తరువాత ముఖేశ్‌ ఋషి ఇంట్లోని వాళ్ళు 'మేము ఎవరికీ ఏ పాపం చేయలేదు. మా మీద ఎవరికి ఇంత ద్వేషం? మమ్మల్ని కాపాడేవాడు ఎవడూ లేడా?' అని ఆక్రోశిస్తారు. కట్‌ చేస్తే, ఆ వెంటనే 'ఉన్నాను. నేనున్నాను' అంటూ సినిమాలో తొలిసారిగా తెరపైకి వస్తాడు చిన్న ఎన్టీయార్‌. అసలు ముఖేశ్‌ ఋషికే బద్ధశత్రువుగా తేలే హీరోను అలా అసంబద్ధంగా, ప్రేక్షకులను తప్పుదోవ పట్టించేలా ఎందుకు ఇంట్రడక్షన్‌ సీన్‌లో చూపారో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. 

అలాగే, ఓ పథకం ప్రకారం హీరోయిన్‌ను ప్రేమ ముగ్గులో దింపుతాడు హీరో. కానీ, అదేదో యాదృచ్ఛికంగా, ప్రకృతి సహకారంతో జరిగిపోయినట్లు చూపారు. ఇక, హీరోయిన్‌ వెంట బామ్మగా బేబీ షామిలి అన్న పేరుతో సీనియర్‌ నటి రోహిణీ హట్టంగడి కనిపిస్తుంది. ఆమెతో చేయించిన ముతకరకం ముసలి రొమాన్స్‌ ఓ జుగుప్స. ఆమెతో ఎలాంటి అభినయం చేయించారు, ఎలాంటి డైలాగులు చెప్పించారు లాంటి సంగతులు పక్కనబెట్టేసినా, ఆమె తాను పెద్ద ఎన్టీయార్‌ను చూసి ప్రేమలో పడి, పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయానంటుంది! మరి, ఆమె హీరోయిన్లకు బామ్మ ఏమిటో, ఎలాగో అన్నదీ స్పష్టత లేదు. 



పాటలే సినిమా భవితవ్యాన్ని తేల్చి వేస్తున్న రోజులివి. ఇలాంటి రోజుల్లో ఈ సినిమాలో ఒక్క పాట కూడా గుర్తుండేలా లేకపోవడం, రీరికార్డింగ్‌ కూడా అంతంత మాత్రంగానే ఉండడం విచిత్రం. హీరో, శ్రుతీహాసన్‌ల మీద వచ్చే 'నేనెప్పుడైన అనుకున్నానా...' పాట ఒక్కటే సాహిత్యపరంగా, సంగీతపరంగా ఫరవాలేదనిపిస్తుంది. మిగతా పాటల సాహిత్యమూ పెద్ద గుర్తుండేలానో, గొప్పగానో లేదు. ఎప్పటిలానే స్టెప్పులు బాగానే వేసిన ఎన్టీయార్‌ ఓ పాటలో సైకిల్‌ను పుచ్చుకొని దాన్ని లాగుతూ, స్టెప్‌ వేశారు. అది చూస్తే, నర్మగర్భ రాజకీయ సూచనలేవో సంకేతించినట్లు అనిపిస్తుంది. ఆర్టిస్టుల మేకప్పు, గడ్డాలు, లుక్కుల దగ్గర నుంచి కంటిన్యుటీల దాకా పలు లోపాలు కనిపించేసే ఈ చిత్రంలో ఎడిటింగ్‌ కూడా నాసిరకంగానే ఉండడం విచిత్రం. సరిగ్గా కట్‌ చేస్తే, సినిమా నిడివి కనీసం మరో 20 నుంచి 30 నిమిషాలు తగ్గేదేమో!

ఎన్టీయార్‌ చాలా కొత్తగా, తెర మీద చూడడానికి అందంగా బాగున్నారు. ప్రత్యేకమైన గెటప్‌ల గందరగోళం లేనప్పుడు ఇలాంటి యూత్‌ఫుల్‌ లుక్‌తో, తాజాగా కనిపించడం ఆయన కెరీర్‌కు ఉపయోగపడే అంశం. ఈ సినిమాకు కూడా అది కొంత చెప్పుకోదగ్గ అంశం. అయితే, అదే సమయంలో ఫైట్లకూ, ఎమోషన్లు పండించడానికీ, ఆఖరుకు కామెడీ కూడా హీరో నెత్తినే పడేస్తే, అది అందరు హీరోలకూ కుదరని పని ఈ చిత్రంలో తేలిపోయింది. 'బృందావనం', 'అదుర్స్‌' లాంటి చిత్రాలతో పోల్చేటంత కాకపోయినా, ఉన్నంతలో ఈ సినిమాలో తెరపై దృశ్యాలను అందంగా చూపారు సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కె. నాయుడు. అతని పనితనం సినిమాకు ఓ ప్లస్. 

చిత్రం ఏమిటంటే, ఇంతటి అసమగ్ర ప్రయత్నానికి తెర వెనుక కష్టపడిన వాళ్ళ జాబితా సుదీర్ఘమైనది. ఒకరు రచనా సహకారం, ఇద్దరు స్క్రీన్‌ప్లే రచయితలు, ముగ్గురు స్టంట్‌ మాస్టర్లు, నలుగురు పాటల రచయితలు, అయిదుగురు డ్యాన్స్‌ డైరెక్టర్లు - ఇక టైటిల్స్‌లో కనిపించని ఎందరో పని చేసి కూడా ఇంత భారీ చిత్రాన్ని ఇలా అవకతవక ఖంగాళీగా రూపొందించారంటే, తప్పెవరిదనాలి? ముప్పెవరికి అనాలి? 

ఇప్పటికే, 'దమ్ము', 'బాద్‌షా' లాంటి వరుస ఎదురుదెబ్బలతో, రాజకీయంగా, కుటుంబపరంగా తెచ్చుకున్న ఇబ్బందులతో ప్రేక్షక వర్గాన్ని కూడా దూరం చేసుకొని సతమతమవుతున్న చిన్న ఎన్టీయార్‌ ఇప్పటికైనా ఆగి ఆలోచించుకోవడం మంచిది. హీరో కల్యాణరామ్‌కు హిట్‌ ఇచ్చారని దర్శకుడు సురేందర్‌ రెడ్డితో 'అశోక్‌', అలాగే అతనే రవితేజకు 
 'కిక్ ' ఇచ్చాడని ఆ వెంటనే  'ఊసరవెల్లి ', బాలకృష్ణకు 'సింహ' లాంటి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చారని బోయపాటి శ్రీనుతో 'దమ్ము', ఇప్పుడు పవన్‌కల్యాణ్‌ను 'గబ్బర్‌సింగ్‌'గా చూపారని హరీశ్‌ శంకర్‌తో ఈ చిత్రం - ఇలా చేస్తున్నారు చిన్న ఎన్టీయార్. కానీ, వాటి వల్ల ఆయనకు దక్కిన ఒక్క హిట్టూ లేదు. 

ఆయన ఇప్పటికైనా హిట్‌ దర్శకుల వెంటపడడం మానేసి, ప్రతిభనూ, తనకున్న సానుకూల అంశాలనూ నమ్ముకొని, కొత్త కథలను ఆశ్రయిస్తే, కొత్త దర్శకులకు అవకాశమిస్తే బాగుంటుంది. లేదంటే, ప్రేక్షకుడి వంక చూస్తూ, 'హిట్‌ ఎప్పుడిస్తావయ్యా!' అని ఎదురుచూడడమే మిగులుతుంది!

కొసమెరుపు: సినిమా చూసి బయటకు వచ్చేస్తూ ఓ యువ ప్రేక్షకుడు, 'బాబోయ్! ఇది - మరో 'శక్తి' సినిమా! తెర నిండా హింసలో 'దమ్ము- పార్ట్‌ 2' అని వ్యాఖ్యానించారు. అలాగే, 'రామయ్యా వస్తావయ్యా... అయిపోయింది. ఇక, నెక్స్‌ ్ట 'ఎవడు'?' అని ముక్తాయించారు. 

- రెంటాల జయదేవ
(ప్రజాశక్తి దినపత్రిక, 12 అక్టోబర్ 2013, శనివారం, పేజీ నం. 8లో ప్రచురితం)
.........................................................

3 వ్యాఖ్యలు:

సుజాత వేల్పూరి said...

ఫస్ట్ హాఫ్ నిండా విచ్చల విడిగా ద్వంద్వార్థపు డైలాగ్స్! వెంటనే వాటికి కి పాజిటివ్ అర్థాన్ని సూచిస్తూ వివరణలు.. చిరాకు పుట్టించాయి.

ఇలాటి సినిమాలు ఎక్కువ రోజులు ఆడవనే కాబోలు మాకు ఇక్కడ 17 డాలర్లు వసూలు చేసారు టికెట్ కి !!

దానవీర శూరకర్ణ డైలాగ్స్ సీను పూర్తిగా అనవసరం. ఆ సింహం బొమ్మ మీద చేయి వేసి కూచుంటే సాక్షాత్తూ మరో సింహం అన్నట్లు కనిపించే నటరత్న ఠీవీ చిన్న ఎన్ టీయార్ లో వెదికి చూసినా లేదు

ఇది చూసిన పాపం పోవాలంటే యూ ట్యూబ్ లో వెదుక్కుని దానవీర శుర కర్ణ దృశ్యం మరో సారి చూడాల్సిందే!

మొత్తం మీద డబ్బు, టైము దండగ చేసిన సినిమా!


Unknown said...

హిట్టిచ్చిన దర్శకుల వెంట పడటం చిన్న ఎన్టిఆర్ కు అచ్చోస్తున్నట్లు లేదు!మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది!దర్శకుడు ముందస్తు హోం వర్క్ చేయకుండా షూటింగ్ మొదలెట్టకూడదు!ఒక విజయాన్ని వెంటనే క్యాష్ చేసుకుందామని తాపత్రయపడకూడదు!కథ,కథనం లేకుండా ఎక్కువ సినిమాలు హడావిడిగా చేసేద్దామని దర్శకుడు ఆబగా తొందరపడకూడదు!సినిమా దర్శకుడి మాధ్యమం!ఎన్టిఆర్ లాంటి నటుడు కథను నమ్ముకోవాలి కాని ఒకేమూసలోపడి నలిబిలి కాకూడదు!తన శ్రేణిని పెంచుకోవాలికాని తగ్గించుకోకూడదు!

Anonymous said...

ఇది అసలు దిల్ రాజు ఫామిలీ సినిమాలానే లేదు. దిల్ రాజు మళ్ళీ మొదటి సినిమా స్టైల్‌కి వెళ్ళిపోయాడు. అంత హింస అవసరమా? ఈ సినిమాని (ముఖ్యంగా సెకండ్ హాఫ్) హరీష్ శంకర్ బహుశా పవన్ కల్యాణ్ కోసం రాసుకున్నాడనిపించింది.

అయితే మొదటిసారి NTRని క్యూట్‌గా, సమంతాని సెక్సీగా హరీష్ చూపించాడు. ఫస్ట్ హాఫ్ పరవాలేదు. ఈ మధ్య ప్రతీ సినిమాలో బ్రహ్మానందాన్ని ఇరికించినట్లు ఈ సినిమాలో ఆ వేషాన్ని రోహిణీ హట్టంగడికి ఇచ్చారు. అక్కడక్కడ కొన్ని డైలాగులు పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. నిర్భయ ఉదంతాన్ని గుర్తుకుతెచ్చారు.

ఆదిత్యపురం అన్నపూర్ణ లాంటిదని చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్ అని అర్థమా? అమ్ములు తెలుగుతల్లా? వైదేహి స్టీల్స్, బ్రహ్మిణి స్టీల్సా?