- ఆగస్టు 21కి 'ఎవడు' వాయిదా!
- ముందు ప్రకటించినట్లే ఆగస్టు 7నే 'అత్తారింటికి దారేది'
- మూడు వారాల ఉత్కంఠకు తెర
అభిమానులను ఊరిస్తూ వస్తున్న 'ఎవడు' చిత్రం విడుదల ఆఖరికి వాయిదా పడింది. రామ్‌చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నిజానికి ఈ నెల 31న విడుదల కావాలి. ఆ విషయాన్నే నిర్మాత 'దిల్' రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి కొన్నాళ్ళుగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ విషయాన్ని పదే పదే మీడియాతో నిర్ధారించారు కూడా! తీరా, శనివారం సాయంత్రం సినిమా విడుదలను ఆగస్టు 21కి వాయిదా వేస్తున్నట్లు అనూహ్య ప్రకటన చేశారు. దీంతో, ఆగస్టు 7న రిలీజ్ కానున్న పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల 'అత్తారింటికి దారేది?' చిత్రానికి ఎట్టకేలకు సొంత మెగా కుటుంబం నుంచి పోటీ తప్పినట్లు అయింది.
ఈ అనూహ్య పరిణామాల పూర్వాపరాల విషయానికి వెళితే, నిజానికి గడచిన మూడు, నాలుగు వారాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ చర్చించుకుంటున్న విషయం - రామ్ చరణ్ తేజ్ 'ఎవడు', పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది?' చిత్రాల విడుదల గురించే! రంజాన్ కానుకగా 'అత్తారింటికి దారేది?' చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర దర్శక, నిర్మాతలు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇంతలో 'ఎవడు' చిత్రాన్ని జూలై 31న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించడం చిరంజీవి, పవన్‌కల్యాణ్ తదితర 'మెగా' కుటుంబ అభిమానుల్ని షాక్‌కు గురి చేసింది.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పెద్ద హీరోల, భారీ బడ్జెట్ చిత్రాలు రెండూ వారం తేడాలో పోటాపోటీగా విడుదల అవుతాయనడం వారికి మింగుడు పడలేదు. పదుల కోట్లు వెచ్చించి, వందలాది థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు కావడంతో, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా తమ పెట్టుబడుల గురించి ఆందోళన చెందారు. అయితే, విడుదల తేదీలు మార్చేది లేదంటూ రెండు చిత్రాల వాళ్ళూ తమ వాదనకే కట్టుబడడంతో, పీటముడి పడింది. ఈ ఉత్కంఠ ఇలా రెండు, మూడు వారాలు కొనసాగాక, ఎట్టకేలకు ఇప్పుడు 'ఎవడు' చిత్ర దర్శక, నిర్మాతలే వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
బాబాయి, అబ్బాయిల పోటీనా?
'ప్రజాశక్తి' సేకరించిన అత్యంత విశ్వసనీయమైన తెర వెనుక సమాచారం ప్రకారం 'అత్తారింటికి దారేది?' చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత భోగవల్లి ప్రసాద్, బృందం కొన్ని నెలల ముందే తమ చిత్రం రిలీజ్ గురించి, 'ఎవడు' నిర్మాత 'దిల్' రాజుతో చర్చించారు. ఆయనను పిలిపించి, తమ సినిమా రిలీజ్‌ను ఆగస్టు 7 అని ఖరారు చేసుకుంటున్నట్లు చెప్పారు. వాళ్ళ 'ఎవడు' సినిమా రిలీజ్ ఎప్పుడని కూడా అడిగారు. 'ఎవడు' చిత్రాన్ని జూన్ నెలాఖరులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేస్తున్నట్లు 'దిల్' రాజు చెప్పారు. దాంతో, దానికి కనీసం నెల రోజుల పైగా విరామం ఉండేలా చూడాలని పవన్ కల్యాణ్ బృందం చర్చించుకొని, ఆగస్టు 7న తమ చిత్రం రిలీజ్‌ను నిర్ధారించుకున్నారు.
''ఆ మాటే 'దిల్' రాజుకు చెప్పాం. ఆయన కూడా సమ్మతించారు. తీరా, 'ఎవడు' రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ, జూలై 31కి వచ్చింది. దాంతో, లేని పోటీ కాస్తా వచ్చిపడింది'' అని 'అత్తారింటికి...' చిత్ర యూనిట్‌లోని అత్యున్నత వర్గాల వారు 'ప్రజాశక్తి'కి వివరించారు.
డేటు..పవన్ ముందే చెప్పాడు!
'అత్తారింటికి...' చిత్రం రిలీజ్ డేట్‌ను తమ కన్నా ముందుగానే ప్రకటించారని 'దిల్' రాజు కూడా బాహాటంగా ఒప్పుకున్నారు. అయితే, ఆ యూనిట్ చెప్పిన విధంగా 'అత్తారింటికి...' చిత్రం ఆగస్టు 7న ఎక్కడొస్తుంది లెమ్మని 'ఎవడు' దర్శక, నిర్మాతలు మితిమీరిన ధీమాకు పోయారు. తీరా, అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకొని, ఆగస్టు 7కే పవన్ సినిమా రిలీజ్‌కు సిద్ధమైపోవడంతో, 'ఎవడు' టీమ్‌కు షాక్ కొట్టింది. లేనిపోని పోటీ తలనొప్పి వచ్చిపడింది.
అటు అబ్బాయి రామ్‌చరణ్ సినిమా, ఇటు బాబాయి పవన్ కల్యాణ్ సినిమా కావడంతో అభిమానుల్లో, వ్యాపార వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో, 'అత్తారింటికి...' రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేయించడానికి తెర వెనుక చాలానే ప్రయత్నాలు జరిగినట్లు భోగట్టా.
''తెర వెనుక చాలా తతంగమే జరిగింది. పంచాయతీలూ సాగాయి. కానీ, మేము ముందుగానే అందరినీ సంప్రతించి, అనుమతి తీసుకొని నిర్ణయించిన తేదీ కావడంతో, మమ్మల్ని ఎవరూ తప్పు పట్టలేకపోయారు'' అని పేరు ప్రచురించడానికి ఇష్టపడని 'అత్తారింటికి...' యూనిట్ సభ్యుడొకరు వివరించారు.
చివరకు, హీరో పవన్ కల్యాణ్ సైతం 'ముందే చెప్పి, ఖరారు చేశాం కాబట్టి, 'ఎవడు' కోసం 'అత్తారింటికి...' రిలీజ్ ను మార్చుకోవాల్సిన పని లేద'ని కరాఖండిగా చెప్పినట్లు కృష్ణానగర్ కబురు. 'అత్తారింటికి..' రిలీజ్ మారే సూచనలు లేకపోవడంతో, మరో దారి లేక 'ఎవడు' రిలీజ్ ను 'దిల్' రాజు బృందమే మార్చుకోవాల్సి వచ్చింది. రాఖీ (శ్రావణపూర్ణిమ), మెగాస్టార్ చిరంజీవి జన్మదిన (ఆగస్టు 22) కానుకగా ఆగస్టు 21కి 'ఎవడు' జనం ముందుకొస్తాడని ప్రకటించాల్సి వచ్చింది. ఈ తాజా వాయిదా ప్రకటనకు చిరంజీవి తదితరుల సలహా కూడా కారణమని చెబుతున్నారు.
ఏతావతా, 'జంజీర్' (తెలుగులో 'తుఫాన్') రిలీజ్ ఖరారైపోయినందువల్ల తాము వెనక్కి వెళ్ళడం కుదరని గతంలో పదే పదే చెప్పిన 'ఎవడు' బృందం ఇప్పుడు మాత్రం ఆ మాటను పక్కన పెట్టేయడం విశేషం.
''మనసుంటే మార్గం ఉంటుంది. 'ఎవడు' వాయిదా వేసుకోవడం వాళ్ళ చేతుల్లో పనే'' అని 'అత్తారింటికి..' వర్గాలు 'ప్రజాశక్తి'తో గతంలోనే అన్నాయి. వారు అన్నట్లే, చివరకు మార్గం సుగమం కావడం గమనార్హం. అయితే, రిలీజ్ తేదీల్లో పోటీ నివారణ జరిగింది.
కానీ, రేపు బాక్సాఫీస్ ఫలితం, వసూళ్ళ దగ్గర కూడా ఈ రెండు చిత్రాలకూ పోటీ రాదని గ్యారెంటీ ఏముంది. ఆ సంగతే 'కృష్ణానగర్' వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
మరి, ఈ పోటీని తప్పించే దారేది...? తప్పించగలది ఎవడు..? ఇవన్నీజవాబులేని ప్రశ్నలే.
- రెంటాల జూనియర్
(Published in 'Praja Sakti' daily, 28th July 2013, Sunday, Page No.8)
..............................................................................