జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, October 31, 2012

‘‘తెలుగు సినిమాపై నా పరిశోధన కొనసాగుతూనే ఉంటుంది!’’ - ‘ఆంధ్రజ్యోతి’లో నా ఇంటర్వ్యూ



‘‘తెలుగు సినిమాపై నా పరిశోధన కొనసాగుతూనే ఉంటుంది!’’ : 

 ‘నంది’ అవార్డు విజేత రెంటాల జయదేవ
 
ఉత్తమ సినీ విమర్శకుడిగా నన్ను ఎంపిక చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు ప్రకటించిన సందర్భంగా,
ఇది ఇవాళ్టి (30 అక్టోబర్ 2012, మంగళవారం) ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక తమిళనాడు ఎడిషన్(పేజీ నంబర్ 7)లో
ప్రచురితమైన నా ఇంటర్వ్యూ...

రెండు గంటల పైగా భేటీ వేసి, ఎన్నెన్నో అడిగి, ఎంతో రాసుకొని, ఒకటీ అరా పొరపాట్లున్నా తారీఖుల్లో మాత్రం (పరిశోధనే పుట్టిన తేదీ గురించి కాబట్టి) ఎక్కడా తప్పులు లేకుండా ఆ భేటీకి అక్షర రూపమిచ్చిన ఆంధ్రజ్యోతి జర్నలిస్టు మిత్రులకు కృతజ్ఞతలు.


కోడంబాక్కం: తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని పత్రికా రచనపై మక్కువతో దాదాపు రెండు దశాబ్దాలుగా
జర్నలిస్టుగా కొనసాగుతున్న వ్యక్తి డాక్టర్ రెంటాల జయదేవ. తెలుగు సినిమా పుట్టుపూర్వోత్తరాలపై పరిశోధన
జరిపి, 80 ఏళ్ళ తెలుగు చరిత్రను తిరగరాసిన ఉత్తమ సినీ విమర్శకుడు. 2011 సంవత్సరానికి గాను నంది
పురస్కారానికి ఎంపికైన రెంటాలతో చిన్న ఇంటర్వ్యూ...

 * సినిమాపై ఆసక్తి ఎలా కలిగింది?

చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం, ఆసక్తి. నాన్న గారు రెంటాల గోపాలకృష్ణ ఆంధ్రప్రభ దినపత్రికలో సినీ
జర్నలిస్ట్ గా పనిచేశారు. ఆ సమయంలో నాన్న గారిని కలిసేందుకు వచ్చే గొప్ప గొప్ప నటులు, రచయితలతో
పరిచయం, నాన్న గారు రాసే సినిమా వ్యాసాలు చదవడం వంటివి తెలియకుండానే నాకు సినిమాపై ఆసక్తిని
కలిగించాయి.

* తెలుగు సినిమా చరిత్రపై పరిశోధన చేసేందుకు కారణం?

నాన్నగారి ప్రభావంతో జర్నలిజంలోకి వచ్చిన తరువాత నేనే సినిమా వ్యాసాలు రాయడం మొదలుపెట్టాను.
సినిమా వ్యాసమంటే అందులో చరిత్ర తప్పక చెప్పాలి. దాంతో సినిమా గురించి మరింతగా తెలుసుకోవడం
ప్రారంభించాను. ఆ జిజ్ఞాసే తెలుగు సినిమా చరిత్రపై పరిశోధనకు నన్ను పురిగొల్పింది.

* పరిశోధనల దిశగా మీలో స్ఫూర్తి నింపిందెవరు?

ఇంతకు ముందు చెప్పినట్టుగానే నాన్న గారి ప్రభావం చాలా ఉంది. అయితే, పరిశోధన దిశగా ఆరుద్ర గారు
స్ఫూర్తి. ప్రతి విషయాన్నీ పరిశోధనాత్మకంగా చూడడం ఆయనకు అలవాటు. ఆయన రాసిన ‘సమగ్ర ఆంధ్ర
సాహిత్యం’ అలా రూపొందిందే.

* తెలుగు సినిమా పుట్టిన తేదీపై పరిశోధన చేయడానికి కారణం. కొన్నేళ్ళుగా జరుపుకొంటున్న తేదీ తప్పు అని మీకెందుకనిపించింది?

ఈ విషయంలో చాలామంది పొరపాటు పడుతున్నారు. తెలుగు సినిమా పుట్టుక తేదీ తప్పు అని నేను ఏనాడూ
భావించలేదు. కనీసం ఆ ఆలోచన కూడా రాలేదు. తెలుగు సినిమా చరిత్రపై పరిశోధన చేస్తున్న సమయంలో
తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ చరిత్రకారుడిని కలిశాను. ఆయనతో జరిగిన సంభాషణలో ఒకసారి తొలి
తమిళ - తెలుగు టాకీ ‘కాళిదాస్’ గురించి చర్చ వచ్చింది. తమిళులు ‘కాళిదాస్’ని తమిళ టాకీగానే భావిస్తారు.
ఆ సినిమా విడుదల తేదీని నిర్ధారించే ఆధారాన్ని నాకు చూపిస్తూ, తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ 1931
సెప్టెంబర్ 15వ తేదీనే విడుదలైందనడానికి ఆధారం ఏమిటని ప్రశ్నించారు. ఆ ప్రశ్నే నేను తెలుగు సినిమా
పుట్టుక తేదీపై పరిశోధన చేయడానికి కారణం. తెలుగు సినిమా గురించి పరిశోధన చేస్తున్న నాకు పుట్టుక తేదీకి
ఆధారాన్ని కనిపెట్టాలన్న సంకల్పం కలిగింది. కేవలం ఆధారం కనిపెట్టాలన్న లక్ష్యంతోనే పరిశోధన
ప్రారంభించాను. కానీ, సమాచార సేకరణలో అసలు సెప్టెంబర్ 15వ తేదీన తొలి సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త
ప్రహ్లాద’ విడుదల కాలేదన్న విషయం తెలిసింది.

* మరి ఆధారం ఎలా లభించింది? ఖచ్చితమైన తేదీని ఎలా కనుగొనగలిగారు?

సెప్టెంబర్ 15న తొలి తెలుగు టాకీ విడుదలైంది అని చూపించే ఆధారం ఎవరి దగ్గరా లేదు. దాని కోసం మద్రాసు,
విజయవాడ, రాజమండ్రి, ఢిల్లీ, పూణే తదితర తెలుగు సినిమా జాడలున్న ప్రాంతాల్లో పర్యటించి, చరిత్రకారులను
కలుసుకొని వివరాలు సేకరించాను. ఎన్నో పుస్తకాలు చదివాను. అదే సమయంలో పూణే ఫిలిం ఇనిస్టిట్యూట్ లో
‘ఫిలిం అప్రిసియేషన్’ కోర్సులో చేరాను. అక్కడికి అతి సమీపంలో ‘నేషనల్ ఫిలిం ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా’ ఉంది.
అందులో పాత గ్రంథాలు, సినిమాలు, సెన్సార్ సర్టిఫికెట్లు భద్రపరిచి ఉన్నాయి. వాటిలోనే ‘భక్త ప్రహ్లాద’తో సహా
అప్పటి చిత్రాల సెన్సార్ సర్టిఫికెట్ వివరాలున్న గవర్నమెంట్ గెజిట్ కనపడింది. 1932 జనవరి 22న ‘భక్త ప్రహ్లాద’
సెన్సార్ జరిగినట్లు అందులో ఉంది. అప్పటికి దశాబ్దం క్రితమే సెన్సార్ చట్టం అమలులో ఉంది కాబట్టి, సెన్సార్
జరగకుండా సినిమా విడుదలయ్యే ప్రశ్నే లేదు. దీనిని బట్టి 1931 సెప్టెంబర్ 15న ‘భక్త ప్రహ్లాద’ విడుదల కాలేదని
నిర్ధారణైంది. ఆ తరువాత అసలు తేదీని కనిపెట్టేందుకు శ్రమించి, మరింతగా శోధించాను. అప్పటి పత్రికల్లోని
ప్రకటనలను బట్టి 1932 ఫిబ్రవరి 6న ముంబయ్ లోని కృష్ణా సినిమా థియేటర్ లో తొలి సంపూర్ణ తెలుగు టాకీ
విడుదలైందని తేలింది. సుమారు రెండు నెలల తరువాత, అంటే 1932 ఏప్రిల్ 2న ‘భక్త ప్రహ్లాద’ మద్రాసులో
విడుదలైంది.

* ఈ పరిశోధనకు ఎంతకాలం పట్టింది ?

ఇది పూర్తిగా నా స్వీయ పరిశోధన. దాదాపు నాలుగున్నరేళ్ళు శ్రమించాను. వ్యక్తిగతంగా చేస్తున్న పరిశోధనలకు
 వ్యవస్థ సహకారం కూడా ఉండాలన్నది నా అభిప్రాయం.

* ఇంతవరకు తెలుగు సినిమా పెద్దలు దీనిపై ఆశించినంతగా స్పందించలేదు. దీనిపై మీ కామెంట్...

పరిశోధకుడిగా వాస్తవాలను బయటపెట్టాలన్నదే నా ప్రయత్నం. ఫిబ్రవరి 6నే తొలి తెలుగు సినిమా పుట్టిందని
సాక్ష్యాధారాలతో సహా నిరూపించాను. ఇక వాళ్ళదే బాధ్యత. సాహితీ లోకం మొత్తం నా పరిశోధనను
అభినందించింది. ప్రజల్లోకి తీసుకెళ్ళడమే తరువాయి.

* మీ భవిష్యత్ కార్యాచరణ?

ఏదో కనిపెట్టాలన్నది నా అభిమతం కాదు. నిరంతర పరిశోధనలో కొత్త విషయాలు బయటపడుతూనే ఉంటాయి.
ఇప్పటికీ మన దగ్గర మూకీ చిత్రాల గురించి పక్కా సమాచారం లేదు. సాక్ష్యాధారాల సహితంగా తెలుగు సినిమా
చరిత్రను నిర్మించాలన్నది నా లక్ష్యం. అందుకే తెలుగు సినిమా నా పరిశోధన సాగుతూనే ఉంటుంది. నా
ముందు తరం నిర్మించిన మెట్లపై నడుచుకుంటూ సాక్ష్యాధార సహిత తెలుగు సినిమా చరిత్ర నిర్మాణానికి నేను
సైతం...!
* * * * * * * * * * * * * * * ***

Tuesday, October 16, 2012

వార్త 'సాక్షి'గా - రెంటాల జయదేవకు నంది అవార్డ్



2011కు గాను ఉత్తమ సినీ విమర్శకుడిగా నాకు నంది అవార్డు రావడంతో సాక్షి దినపత్రిక, తమిళనాడు సంచిక, 14 అక్టోబర్ 2012, ఆదివారంనాడు 12వ పేజీలో ఈ వార్త ప్రచురించింది. ఆ వార్తను మీ అందరితో పంచుకోవడానికే ఈ టపా. నన్ను అభిమానించి, ఆదరించి, నా రాతలను ప్రోత్సహించిన బ్లాగు మిత్రులందరికీ కృతజ్ఞతలు.


వరించిన నంది అవార్డు - ఉత్తమ సినీ విమర్శకుడు రెంటాల జయదేవ




తెలుగు చలనచిత్రాలకు ఏటేటా ఇచ్చే నంది అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొన్న ప్రకటించింది. 2011వ సంవత్సరానికి గాను ఈ అవార్డుల ప్రకటన జరిగింది. ఉత్తమ సినీ విమర్శకుడి అవార్డు నన్ను వరించింది. ఇరవై ఏళ్ళ పైగా నేను సాగిస్తున్న పత్రికా వ్యాసంగంలో ఇది ఓ చెప్పుకోదగ్గ మజిలీ.

ఈ నందుల్లో శ్రీరామరాజ్యం, దూకుడు చిత్రాలకు ఏడేసి అవార్డులు లభించాయి. మహేశ్ బాబు ఉత్తమ నటుడు (దూకుడు చిత్రం)గా, నయనతార ఉత్తమ నటి (శ్రీరామరాజ్యం చిత్రం)గా, ఎన్. శంకర్ ఉత్తమ దర్శకుడు (జై బోలో తెలంగాణ చిత్రం)గా ఎంపికయ్యారు. మొత్తం నంది అవార్డుల పూర్తి వివరాలను పక్కనే ఇచ్చిన జాబితాలో (సౌజన్యం - ఆంధ్రజ్యోతి దినపత్రిక, 13 అక్టోబర్ 2012, ఆదివారం) చూడవచ్చు.