(‘‘ఖలేజా: కథాంశం మంచిదే... కథనమే.... ’’- పార్ట్ 2)నిజానికి, మహేశ్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లోని ‘ఖలేజా’ చిత్ర కథకు తీసుకున్న ‘దైవం మానుష రూపేణ’ అన్న అంశం మంచిదే. సాటి మనిషిని కాపాడాలంటే, దేవుడు కానక్కర లేదు. మంచి మనసున్న మనిషిలోనే దేవుడుంటాడు. తన కోసం కాక, సాటి వారి బాగు కోసం ఆ మనసుతో ఆలోచిస్తే, అనుకున్నదల్లా అవుతుంది. అప్పుడలా ఆ మనిషే దేవుడన్నది ఈ సినిమాలో చెప్పదలుచుకున్న సారాంశంగా కనిపిస్తుంది.
బాగోగులు ఏమిటంటే...ఈ విషయాన్నే వీలైనంత వినోదాత్మకంగా చెప్పాలని దర్శక - రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రయత్నించారు (ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - అన్నీ ఆయనవే). అంతవరకు బాగానే ఉంది. అందుకే, ఈ సినిమాలో హీరో పాత్రచిత్రణ, ప్రవర్తన, హీరోయిన్ తో ఎదురయ్యే సంఘటనలు, చుట్టుపక్కలి పాత్రలు - అన్నీ వినోదమే కేంద్రంగా నడుస్తుంటాయి. అది వినోదానికి బాగా ఉపకరించినా, విషయానికి వచ్చే సరికి - చివర కాసేపు తప్ప, మిగిలిన చోట్ల కూడా సీరియస్ విషయం కూడా సరదా బాటలో పడి గాడి తప్పినట్లనిపిస్తుంది.
అలాగే, మనిషిలోని దేవుడి తత్త్వాన్ని ప్రభావశీలంగా చెప్పాలని రెండు, మూడు సన్నివేశాల్లో ప్రయత్నించారు (ఉదాహరణకు, హీరో తన కోసం 10 రూపాయలు అడిగితే ఎవరూ ఇవ్వరు కానీ, మరొకరి కోసం 10 అడిగితే 100 రూపాయలు రావడం లాంటివి). కానీ, అవి విజువల్ గా ఆశించిన ఇంప్యాక్ట్ ఇవ్వలేదు. ఫలితంగా ఆ వాదనతో ప్రేక్షకులు కన్విన్స్ కావడం కొద్దిగా కష్టమే.
పాత్రలు - పాత్రధారుల పనితనం ఎలా ఉందంటే... అందంలో, అభినయంలో ఎప్పుడూ మార్కులు పడే మహేశ్ ఎప్పటిలానే చక్కగా నటించారు. కష్టపడి ఫైట్లు చేశారు. ఎప్పుడూ హుందాగా, తక్కువ మాటలు, ఎక్కువ భావప్రకటన ధోరణిలో వెళ్ళే మహేశ్ ఈ సినిమాలో ఎన్నడూ లేనంత ఎక్కువగా మాట్లాడతారు. ఈ మధ్య కాలంలో మహేశ్ ఇంతగా డైలాగులు చెప్పిన సినిమా బహుశా ఇదే కావచ్చు.
దర్శక - రచయిత సృష్టించిన ఈ తరహా పాత్ర కోసం త్రివిక్రమ్ సారథ్యంలో మహేశ్ తన శారీరక భాషను సమర్థంగా మార్చుకున్నారు. పూర్తి వినోదభరితమైన పాత్రచిత్రణతో మహేశ్ ను తెరపై ఇలా చూపడం ఇదే మొదటిసారి. ఈ రకం నటన అటు మహేశ్ కూ, ఇటు ఆయన అభిమానులకూ కొత్త అనుభవమే. కానీ, ఆ పాత్రే అటు హాస్యం, ఇటు రౌద్రం, మధ్యలో ప్రేమ - అన్నీ చూపెడుతూ వస్తుంది. దాంతో, కథను నడిపే భారమంతా ఆ పాత్ర మీదే పడింది.
ఐరన్ లెగ్ అమ్మాయి పాత్ర హీరోయిన్ అనూష్కది. ఫస్టాఫ్ కామెడీకీ, సినిమాలో పాటలకీ పనికొచ్చే పాత్ర. అంత వరకూ ఆమె ఓ.కె. ఉపాసనతో జోస్యం చెప్పగల ఊళ్ళోని పెద్దాయన పాత్రలో రావు రమేశ్ నటన, వాచికం బాగున్నాయి. ఇదే ఛాయలతో ఉండే పాత్రను ఆయన గతంలో మగధీర (2009)లో బాగా పండించిన సంగతి తెలిసిందే. సిద్ధయ్య పాత్రలో షఫీ బాగా చేశారు. కానీ, మాటి మాటికీ అతనితో హర హర మహాదేవ్ అని పలికించడం కొన్ని చోట్ల అవసరాన్ని మించిపోయిందేమో అనిపిస్తుంది.
జెమినీ టీవీలో కార్యక్రమాల డైరెక్టర్ బాబ్జీగా సునీల్, చెట్లు - కాయల గురించి పరిశోధన చేసే టామ్ క్రూజ్ గా అలీ, లాయర్ మిరియం గా బ్రహ్మానందం సినిమాలో వినోదం పంచుతారు. అయితే, ‘మర్యాద రామన్న’ బిజీలోనో ఏమో, సినిమా సగమైనా కాక ముందే సునీల్ పాత్రను ముగించాల్సి వచ్చినట్లుంది. లాయర్ మిరియంగా బ్రహ్మానందాన్ని కూడా మూడు, నాలుగు సీన్లకే పరిమితం చేశారు. సినిమా మూడొంతులు అయిన దగ్గర నుంచీ క్లైమాక్స్ ముందు వరకు కనిపించేది ఒక్క అలీయే. కానీ, అతనికీ, హీరోకూ అంత సన్నిహిత సంబంధం ఎందుకో, హీరోతో కలసి అతనెందుకు చివరి దాకా తిరుగుతాడో తెలియదు. కమెడియన్ ఎం.ఎస్. నారాయణ ఒకే సీన్ లో మెరిసి మాయమవడాన్ని బట్టి చూస్తే, చిత్రీకరణ ముగిశాక ఎడిటింగ్ కత్తెరకు బాగానే పని పడ్డట్లు అర్థమవుతుంది.
విలన్ ప్రకాశ్ రాజ్ కూడా క్లైమాక్స్ లో గొంతు చించుకు అరవడం, భయం నటించడం తప్ప చేసిందేమీ లేదు. పైగా, రూపురేఖల్లో చాలా తేడా వచ్చిన ప్రకాశ్ రాజ్ మునుపటి ఆకర్షణను కోల్పోయారు. ఆయనను చూడడం కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది. తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు తదితరుల పాత్రలన్నీ ప్యాడింగ్ కే తప్ప, పెద్దగా చేసేదేమీ లేదు.
సినిమాను నిలబెట్టే డైలాగులు ఏవంటే...ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోదగ్గవి కూడా త్రివిక్రమ్ శైలి సంభాషణలే. కొన్ని చోట్ల డైలాగ్స్ బాగా పేలాయి. అయితే, మరికొన్ని చోట్ల అర్థమయ్యీ కాకుండా వేగంగా చెవులు దాటి వెళ్ళిపోతాయి. ‘మీ పేరు’ అని హీరోయిన్ అడిగితే - ‘జెమినీ టి.వి’ అనీ, ‘ఏం చేస్తుంటారు’ అంటే - ‘బాబ్జీ’ అనీ సునీల్ తో డైలాగ్స్ చెప్పించడం మీడియా మనుషుల ఖంగాళీతనానికి త్రివిక్రమ్ మార్కు చురక. ‘‘8,950కి రౌండ్ ఫిగర్ 9 వేలు కదా’’ అని హీరోయిన్ అంటే, ‘‘10000లో రౌండ్లు ఎక్కువ కదండీ’’ అని హీరో చెప్పడం లాంటివి బాగా నవ్విస్తాయి. ‘‘వినపడక అడుగుతున్నావా, లేక అర్థం కాక అడుగుతున్నావా’’ అని హీరో అంటే, ‘‘కాదు. తెలియక అడుగుతున్నాను సార్’’ అని బ్రహ్మానందం అనడం ఫక్కున నవ్వు తెప్పిస్తుంది.
గ్రామాన్ని కాపాడే దేవుడు ఎలా ఉంటాడో పెద్దాయన వర్ణించే ఘట్టంలో ‘‘...నేల ఒళ్ళు విరుచుకుంటుంది సిద్ధా. గాలి హోరుమంటుంది...’’, ‘‘...ఎవడు చూస్తే భయం చస్తుందో, ఎవణ్ణి చూస్తే ధైర్యం వస్తుందో...’’ లాంటి డైలాగులు సన్నివేశంలో గాఢతను పెంచాయి. ‘‘నీ నవ్వు వరం. నీ కోపం శాపం. నీ మాట శాసనం’’ అంటూ దేవుడిగా కొలిచే హీరో గురించి సిద్ధ చెప్పే మాటలు తూటాల్లా దూసుకుపోతాయి. ‘‘అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు. అద్భుతం జరిగిపోయాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు’’ (హీరోతో రావు రమేశ్) లాంటి కొన్ని భావస్ఫోరకమైన సంభాషణలూ ఉన్నాయి.
అలాగే, ఎప్పుడూ మరింత క్లాస్ టచ్ తో నడిచే త్రివిక్రమ్ సంభాషణలు ఈ సినిమాలో కొన్నిచోట్ల ఎందుకనో కిందకు దిగి, మాస్ రంగును పులుముకున్నాయి. హీరో పోషించినది ట్యాక్సీ డ్రైవర్ పాత్ర కావడం అందుకు కారణమని సరిపెట్టుకోవాలేమో. మొత్తం మీద డైలాగ్ కామెడీ మీద ఎక్కువగానే ఆధారపడ్డారు. జల్సా చిత్రంలో లాగానే, ఇందులో కూడా హీరో, కమెడియన్ల మద్యపాన హాస్య సన్నివేశాన్ని త్రివిక్రమ్ మళ్ళీ పెట్టారు.
సాంకేతిక విభాగాల శ్రమ ఏమిటంటే...పాటల సంగతికొస్తే - తెరపై కన్నా విన్నప్పుడే బాగున్నాయి. పైగా, ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ కథాగమనానికి అడ్డంగా వచ్చి, విసిగిస్తాయి. ‘‘ఆరు పాటలు సిద్ధం చేసుకున్నారు కదా అని, ఎక్కడబడితే అక్కడ అతికించేయడమేనా’’ అని ఓ సగటు ప్రేక్షకుడు వాపోయాడు. విన్నప్పుడు బాగున్న ‘పిలిచే పెదవుల పైన...’ పాట కూడా సినిమాలో చరణాలకొచ్చేసరికి మెరుపు కోల్పోయింది. రాజు సుందరం నృత్య దర్శకత్వం వహించిన ‘ఓం నమో శివ రుద్రాయ...’ పాటలోని సాహిత్య గాంభీర్యం కూడా దృశ్యాల్లో అడపా దడపా వస్తూ, పోవడమే తప్ప, నిలకడగా కనిపించదు. పాటల నృత్యపరికల్పన (రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్ వగైరా) ఫరవా లేదే తప్ప, చిరస్మరణీయం కాలేకపోయింది.
అయితే, చిత్ర నిర్మాణ విలువలు, విజువల్స్ పరంగా మాత్రం సినిమాకు వంక పెట్టలేం. చూస్తున్నంత సేపు తెర నిండుగా, కనువిందుగా దృశ్యాలున్నాయి. కెమేరా (యశ్ భట్ తో పాటు 'అతడు' చిత్ర ఫేమ్ కె.వి. గుహన్, 'హమ్ తుమ్' చిత్ర ఫేమ్ సునీల్ పటేల్ కూడా పనిచేశారు), ఎడిటింగ్ (శ్రీకర్ ప్రసాద్), ఫైట్లు (పీటర్ హెయిన్స్, రామ్ - లక్ష్మణ్), సౌండ్ మిక్సింగ్ (సౌండ్ ఇంజనీర్ పి. మధుసూదన రెడ్డి)అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ లోని దృశ్యాలు బాగా వచ్చాయి. గ్రాఫిక్స్ (పిక్స్ లాయిడ్ సంస్థ)కూడా ఎక్కువగానే వాడారు. అయితే, హీరో పరిచయ ఘట్టంలో మహేశ్ చేతిలో కనిపించే పాము గ్రాఫిక్స్ మాత్రం బొమ్మ పాము కన్నా ఘోరంగా ఉంది.
చిత్ర ప్రారంభం, ఇంటర్వెల్ ఘట్టం లాంటివి బాగున్నాయి. కొన్ని చోట్ల దర్శకుడి ముద్రా ప్రత్యేకంగా కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే మాత్రం - తీసుకున్న ఇతివృత్తాన్ని బలంగా చెప్పేలా కథనాన్ని నడిపించ లేదని అనిపిస్తుంది. కాలక్షేపానికి సినిమా ఫరవాలేదని అనిపించినా, కథలోని ఆత్మ మాత్రం కనిపించీ, కనపించకుండా తచ్చట్లాడుతుంటుంది. అందుకే ఈ సినిమా మీద ప్రేక్షకులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది. ఏతావతా, త్రివిక్రమ్ గత చిత్రాలతో పోలిస్తే - ‘ఖలేజా’ యావరేజే.
కొసమెరుపు - అన్నట్లు ఈ సినిమా పేరు వట్టి ‘ఖలేజా’ కాదు. ‘మహేశ్ ఖలేజా’. అదేమిటంటారా. ఈ 16 రీళ్ళ 2.45 – 2.50 గంటల సినిమాస్కోప్ చిత్రం ఆ పేరు మీదే సెన్సారైంది. బహుశా, ‘ఖలేజా’ టైటిల్ ఎవరిదన్న దాని మీద వివాదం జరుగుతుండడంతో, ఎందుకైనా మంచిది లెమ్మని ముందుచూపుతో ‘మహేశ్ ఖలేజా’ అని పేరు నమోదు చేసి, ఆ పేరుతోనే సెన్సార్ చేయించినట్లున్నారు. ఫలితంగా, రికార్డుల సృష్టి ఆశ లేని ఈ సినిమా పేరు రికార్డు పుస్తకాల్లో మాత్రం - ‘మహేశ్ ఖలేజా’.