జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, December 11, 2010

‘సిత్ర’మైన సినీ బ్లాక్ మార్కెట్ విధానాలు

అసలు ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా, ఎక్కడికక్కడ లోపాయకారీగా జరుగుతున్న అడ్డగోలు టికెట్ల రేట్ల దోపిడీ విధానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రబలమైన జాఢ్యంగా విస్తరిస్తోంది. తెలుగునాట సినిమా హాళ్ళలో ప్రస్తుతం టికెట్లను రెండు రకాలుగా అక్షరాలా అధికారికంగా బ్లాకులో అమ్మేస్తున్నారు. అందులో మొదటిది - 'ఫ్లాట్‌ రేట్ల విధానం'. అంటే - బాల్కనీ నుంచి నేల వరకు హాలులోని అన్ని తరగతుల టికెట్లనూ 'ఫ్లాట్‌' రేటున బాల్కనీ టికెట్‌ ధరకే కౌంటర్‌లోనే అమ్మేస్తారు. ఈ పద్ధతిలో 'ముందు వచ్చినవారిని మున్ముందు' పద్ధతిలో, పైనుంచి కిందికి తరగతుల సీట్లను క్రమంగా నింపుతారు. ముందుగా హాల్లోకి వెళితే బాల్కనీలో కూర్చుంటే, పై తరగతులు నిండిపోయాక వెళితే బాల్కనీ రేటిచ్చి కొన్న టికెట్‌తో నేల తరగతిలో కూర్చొని సినిమా చూడాల్సి వస్తుంది. ఇది చాలా ఏళ్ళుగా చిన్న కేంద్రాల్లో సాగుతున్న వ్యవహారం.

ఇక, రెండోది - 'జంపింగ్‌ రేట్ల విధానం'. అంటే - సినిమాకున్న క్రేజును బట్టి, బాల్కనీ అసలు రేటుకు అయిదారు రెట్ల ధరకు టికెట్లన్నీ అధికారికంగా కౌంటర్‌లోనే అమ్మేస్తారు. రోజులు గడిచి, క్రేజు తగ్గే కొద్దీ అడ్డగోలు ధరను తగ్గించుకుంటూ అసలు సిసలు అధికారిక టికెట్‌ రేటు వద్దకు వస్తారు. ఆ లోగా సినిమా చూడాలంటే, ప్రేక్షకుడికి పెనుభారమే. ఈ దశాబ్దం మొదట్లో ఆరంభమైన ఈ అక్రమ వ్యాపారం ఒకప్పటి 'ఇంద్ర' దగ్గర నుంచి నేటి 'రోబో', 'ఆరెంజ్‌'ల వరకు అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతోంది.

కొన్ని ఊళ్ళలో అయితే, సినిమా తొలి నుంచి ఆఖరి రోజు వరకూ హాలులోని అన్ని తరగతులకూ ఒకే టికెట్‌ రేటుతో దోపిడీ సాగడం విచిత్రం. ఉదాహరణకు, ప్రకాశం జిల్లా కందుకూరు అనే చిన్న కేంద్రం సంగతే తీసుకుందాం. (తెలుగు సినిమా వ్యాపార పరిభాషలో ‘పాత నెల్లూరు జిల్లా’ పరిధిలోకి వచ్చే ఈ కేంద్రాన్ని చిన్నస్థాయి ‘బి’ సెంటర్ (మైనర్ బి) అంటారు). అక్కడ అధికారికంగా సినిమా హాలులో గరిష్ఠ టికెట్ రేటు సుమారు రూ. 20 మాత్రమే. కానీ, అక్కడ ఏ సినిమా కైనా సరే పై నుంచి కింది దాకా అన్ని తరగతుల టికెట్లనూ రూ. 25 నుంచి రూ. 30 వరకు అమ్ముతుంటారు. ‘‘ఇక్కడ ఆఖరికి నేల టికెట్ కూడా అదే 25 – 30 రూపాయలే. ఈ రోజుతో సినిమా ఆఖరు అన్నప్పుడు మాత్రం ఆ ఒక్క రోజుకు ఏ తరగతి టికెట్ ను ఆ తరగతి రేటుకే అమ్ముతారు’’ అని ఆ ఊరి సినిమా ప్రదర్శన సంగతులు తెలిసిన ఓ ప్రేక్షకుడు వివరించారు.

ఇదీ తమిళం నుంచి దిగుమతే!

రజనీకాంత్‌ లాంటి క్రేజీ పెద్ద హీరోల చిత్రాలకు తమిళనాట ఈ 'ఫ్లాట్‌ రేట్లు', 'జంపింగ్‌ రేట్ల' పద్ధతులు అమలులో ఉన్నాయి. అక్కడ నుంచి ఈ జాడ్యాన్ని తెలుగు చిత్రసీమ కూడా చాలా ఏళ్ళ క్రితమే అంటించుకుంది. అంతకు ముందు ఒకటి రెండు చిత్రాలకు జరిగినా, ప్రధానంగా చిరంజీవి నటించిన 'ఇంద్ర' (2002) చిత్రం నుంచి ఈ 'జంపింగ్‌ రేట్ల విధానం' తెలుగు నాట విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పట్లో చీరాల లాంటి చిన్న పట్నంలోనే మొదటి రోజున ఒక్కో టికెట్ రూ. 400 చొప్పున కౌంటర్ లో అమ్మేసినట్లు తెలుగు సినీ వ్యాపారవర్గాలు ఆ చరిత్రంతా చెబుతున్నాయి. కాగా, జనంలో క్రేజున్న సినిమాలకు ఇలా దర్జాగా కౌంటర్ లోనే అసలు రేటు కన్నా ఎక్కువ రేటుకు టికెట్లను అమ్మే ‘జంపింగ్ రేట్ల’ విధానం తెలుగునాట ఇప్పుడు ఊరూరా పాకింది. ఇలా వచ్చిన అనధికారిక సొమ్ముతో ఏ సినిమాకు ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించి, జబ్బలు చరుచుకుంటోంది.

పెట్టిన ఖర్చును గబగబా వెనక్కి రప్పించుకోవాలని భారీయెత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన 'రోబో' సినిమాకు టికెట్ల రేట్లు కూడా భారీగానే పెట్టారు. తమిళనాట పెద్ద పెద్ద మల్టీప్లెక్సుల్లో సైతం రూ. 120కి మించి టికెట్‌ రేటు ఉండకూడదనే ప్రభుత్వ నిబంధన ఉంది. దాన్ని పాటిస్తున్నట్లు నటిస్తూ, టికెట్‌ మీద మాత్రం మామూలు రేటే ముద్రించి, 'రోబో' / 'యంతిరన్‌' ప్రేక్షకులకు మాత్రం ఒక్కో టికెట్‌నూ రూ. 200 నుంచి రూ. 500 వరకు అధికారికంగా, కౌంటర్‌లోనే అమ్మేశారు. మద్రాసులో సాగిన ఈ నిలువుదోపిడీకి నేను ప్రత్యక్షసాక్షినే కాక, బాధితుణ్ణి కూడా. తమిళనాట తెలుగు అనువాద చిత్రం 'రోబో'ను ప్రదర్శిస్తున్న హాళ్ళు కూడా ఈ దోపిడీలో యథేచ్ఛగా పాల్గొన్నాయి. ఆ రకంగా తొలినాళ్ళలోనే సినిమా చూడాలన్న ప్రేక్షకుల ఆసక్తినీ, బలహీనతనూ ఆసరాగా తీసుకొని, డబ్బులు దండుకుంటున్నారు.

(బ్లాక్ టికెట్లతో మన తెలుగు చిత్రాల భారీ రికార్డుల భాగోతం కథ తరువాయి పోస్టులో...)

0 వ్యాఖ్యలు: