జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, October 23, 2011

కనుగొంటి కనుగొంటి ఇప్పుడిటు కనుగొంటి... తొలి తెలుగు సినిమా పుట్టిన తేదీ కనుగొంటి...



* ‘భక్త ప్రహ్లాద’ విడుదలైంది 1932 ఫిబ్రవరి 6న!

* తొలి పూర్తి తమిళ టాకీ కన్నా మనదే ముందు!



తొలి సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ చిత్రం విడుదల తేదీ మీద చివరకు నా పరిశోధనే నిజమని తేలింది. ఆ సినిమా అటు సెన్సారైందీ,
ఇటు విడుదలైందీ కూడా 1932లోనే. ఇన్నేళ్ళుగా ప్రచారంలో ఉన్న 1931లో,అందులోనూ సెప్టెంబర్ 15న ఆ చిత్రం విడుదల కానే కాలేదని నేను చేసిన వాదనకు మరిన్ని తిరుగులేని సాక్ష్యాధారాలు దొరికాయి. మన తొలి తెలుగు సినిమా తొలిసారిగా ఎప్పుడు, ఎక్కడ విడుదలైందీ అన్వేషణలో తేలింది.

టి.వి. 9 లాంటి చానళ్ళు నా వాదనను వినిపిస్తూ ప్రత్యేక వార్తాకథనాలు ప్రసారం చేశాయి. అయితే, సత్యాన్వేషణ దృష్టి, పరిశోధన మీద ఆసక్తి తప్ప నాకు మరో ఉద్దేశమేమీ లేకపోయినా, ‘ఆంధ్రప్రభ’తో సహా పలువురు నా పరిశోధనకు దురుద్దేశాలు ఆపాదించారు. అనుమానాలు వ్యక్తం చేశారు. అవన్నీ నా మునుపటి పోస్టు పరిశోధనపై ‘‘ఆంధ్రప్రభ’’ అనుమానాలు, ఆరోపణలు లో తెలిపాను.

వాటిలోని డొల్లతనాన్నినిరూపిస్తూ, నేనిచ్చిన వివరణ ఇవాళ్టి ‘ఆంధ్రజ్యోతి’దినపత్రిక ఆదివారం అనుబంధంలో వచ్చింది. ఆ రిజాయిండర్ ఇదీ --

.......................................................................

పరిశోధన


తొలి తెలుగు టాకీ చిత్రం 'భక్తప్రహ్లాద' విడుదలైన తేదీ ఎట్టకేలకు దొరికింది.

అది 1932 ఫిబ్రవరి 6.


గతంలో (11.9.2011 ఆదివారం ఆంధ్రజ్యోతి సంచిక) ప్రచురితమైన నా పరిశోధనా పత్రంలో- ఇంతకాలం అనుకున్నట్టుగా 'భక్తప్రహ్లాద' 1931 సెప్టెంబర్ 15న విడుదల కాలేదనీ, సగం తెలుగున్న ''తమిళ - తెలుగు టాకీ'' 'కాళిదాస్' 1931 అక్టోబర్ 31న విడుదలయ్యాకే అసలు ఈ పూర్తి తెలుగు టాకీ నిర్మాణమైందనీ చెప్పాను. 1932 జనవరి 22న మాత్రమే భక్త ప్రహ్లాద సెన్సారై, సర్టిఫికెట్ పొందిందని ఆధారం చూపాను. ఆ సెన్సార్ తేదీ నుంచి మద్రాసు రిలీజ్ సమాచారం ససాక్ష్యంగా దొరుకుతున్న ఏప్రిల్ 2వ తేదీ లోపల ఎప్పుడయినా విడుదలై ఉండవచ్చని చెప్పాను. అప్పటికి కచ్చితమైన తేదీ నాకూ సాక్ష్యాధారాలతో లభించ లేదు. ఆ తర్వాత ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మరిన్ని ఆధారాలు సంపాదించి ఈ విషయాలు మీ ముందు పెడుతున్నాను.

తొలి తెలుగు టాకీ 'భక్తప్రహ్లాద', తమిళ - తెలుగు టాకీ 'కాళిదాస్' తర్వాతే వచ్చిందని చెప్పడంలో నాకేవో దురుద్దేశ్యాలు ఉన్నట్లు మరికొంతమంది రాశారు. చరిత్ర పట్ల గౌరవం, పరిశోధన పట్ల ఆసక్తి తప్ప నాకు ఇతరత్రా ఉద్దేశం ఏదీ లేదని మరోసారి తెలియజేసుకుంటున్నాను.


ప్రామాణికమైన సెన్సార్ సర్టిఫికెట్

1931 చివరలో నిర్మాణమై, 1932 జనవరిలో బొంబాయిలో సెన్సారైన 'భక్త ప్రహ్లాద' సెన్సార్ సర్టిఫికెట్ ''నంబర్ 11032.'' ఆ మాటే చెబితే, 'సెన్సార్ అయిన తేదీ కరెక్టేననే నమ్మకం ఏమిటి' అని కొందరు అడిగారు. పైగా 'సెన్సార్ సర్టిఫికెట్ నెంబర్ వేలల్లో (11032) ఎందుకు ఉంది, అప్పుడప్పుడే కదా టాకీలు ప్రారంభమయ్యాయి' అని కూడా సందేహం వెలిబుచ్చారు.

ఆ రోజుల్లో సెన్సారైన చిత్రాలన్నిటి వివరాలనూ సాక్షాత్తూ ప్రభుత్వమే ఏ నెలకానెల చెబుతూ వచ్చింది. 1932 ఫిబ్రవరి 4 నాటి 'ది బాంబే
గవర్నమెంట్ గెజిట్', పార్ట్-1 (పేజీ 313)లో ఆ క్రిందటి నెల సెన్సారైన అన్ని చిత్రాల వివరాలూ ఉన్నాయి. అందులో 'భక్తప్రహ్లాద' కూడా ఉంది. మన దేశంలో సినిమాటోగ్రాఫ్ చట్టం-1918 అమలవడం మొదలైన దగ్గర నుంచి స్వదేశీ ఫిల్ములూ, విదేశీ దిగుమతి చిత్రాలు, డాక్యుమెంటరీలు, న్యూస్ రీళ్లు సైతం సెన్సారింగ్ జరుపుకుని సర్టిఫికెట్ నెంబర్లు పొందుతూ వచ్చాయి.

దాంతో, 1932 వచ్చేసరికి 'భక్తప్రహ్లాద'కు సర్టిఫికెట్ నెంబర్ వేల సంఖ్యలోకి వచ్చింది.


సెన్సారైతేనే రిలీజు! ఒకచోట సెన్సారైతే చాలు!


'సెన్సార్ కాకముందే విడుదలయ్యే అవకాశం లేదా? బొంబాయి కంటే ముందు ఇంకెక్కడయినా సెన్సార్ అయి ఉండొచ్చు కదా' ఇత్యాది
సందేహాలు కూడా లేవనెత్తారు.


ఆ అవకాశం లేదు. ఎందుకంటే 'సినిమాటోగ్రాఫ్ చట్టం - 1918' ప్రకారం 1920 నుంచే దేశంలో సెన్సార్ బోర్డులు ఏర్పాటయ్యాయి. "బొం బాయి, కలకత్తా, మద్రా సు, రంగూన్, ఆ తరువాత (ఏర్పాటైన) పంజాబ్ (అంటే లాహోర్)లలోని ప్రాంతీయ బోర్డ్ ఆఫ్ సెన్సార్స్‌లో ఒక దాని నుంచి మాత్రమే సెన్సార్ సర్టిఫికెట్ పొందాలి. అలా పొందకుండా ఏ ఫిల్మునూ ప్రదర్శించడానికి వీలు లేదు...'' ('మేకింగ్ మీనింగ్ ఇన్ ఇండియన్ సినిమా',సంపాదకత్వం: రవి ఎస్. వాసుదేవన్; పేజీ 52).


అలాగే "భారతదేశం మొత్తానికీ చెల్లుబాటయ్యేలా (చిత్రాలకు) సర్టిఫికెట్లను మంజూరు చేసే అధికారాన్ని ఈ (ప్రాంతీయ సెన్సార్) బోర్డులకు ఇచ్చారు. అయితే ఏ ప్రావిన్షియల్ ప్రభుత్వమైనా సరే, సదరు చిత్రం తమ ప్రావిన్సులో బహిరంగ ప్రదర్శనకు తగినది కాదని భావించినట్లయితే, ఆ ఫిల్ముకున్న సర్టిఫికెట్‌ను రద్దు చేయవచ్చు...'' ('కొలోనియల్ ఇండియా అండ్ ది మేకింగ్ ఆఫ్ ఎంపైర్ సినిమా', రచన : ప్రేమ్ చౌధ్‌రీ; పేజీ 19) అంటే, 1932 జనవరి చివరలో బొంబాయి బోర్డులో సెన్సార్ జరుపుకున్న 'భక్తప్రహ్లాద'కు దేశమంతటా ప్రదర్శనకు ఆ సర్టిఫికెట్ సరిపోతుంది. ప్రతిచోటా మళ్లీ మళ్లీ సెన్సార్ జరుపుకుని, కొత్త సర్టిఫికెట్ నెంబర్ పొందాల్సిన అవసరం లేదు.
ఇక అసలు విషయానికి వద్దాం.


1932 ఫిబ్రవరి 6 : తొలిసారిగా తెరపై 'ప్రహ్లాద'


సెన్సారైన తరువాత సరిగ్గా పక్షం రోజులకు 1932 ఫిబ్రవరి 6, శనివారం నాడు 'భక్తప్రహ్లాద' రిలీజైనట్లు నా తాజా అన్వేషణలో తేలింది. అంటే ఇంకా మూడున్నర నెలలకు గాని పూర్తి తొలి తెలుగు టాకీ చిత్రానికి 80 ఏళ్ళు నిండవు. మరో ముఖ్యమైన విషయం ఈ చిత్రం మన దేశంలో మొట్టమొదటిసారిగా విడుదలైంది- అప్పటికి ఆంధ్రులు పెద్దసంఖ్యలో ఉన్న బొంబాయిలో. సెన్సారైన మరుసటి వారమే "తెలుగులో మాటలు, పాటలున్న భారత్ మూవీటోన్ వారి భక్తి రస చిత్రం 'భక్తప్రహ్లాద్' త్వరలో విడుదల'' అంటూ ప్రకటనలు వేశారు. ('ది బాంబే క్రానికల్', 1932 జనవరి 31).

ఆ ప్రకటన వచ్చిన వారం లోపలే బొంబాయిలోని న్యూ ఛార్నీ రోడ్డులోని 'కృష్ణా సినిమా'లో తొలిసారిగా 'భక్తప్రహ్లాద విడుదలైంది. రిలీజ్ రోజున కూడా బొంబాయి పత్రికలు ప్రకటనలు వేశాయి. ప్రివ్యూ చూడడం వల్ల అదే రోజుకి వచ్చేలా సమీక్షలు రాశాయి.

'సంపూర్ణ తెలుగు టాకీ' అనే శీర్షికతో "భారతదేశంలో తొలి సంపూర్ణ తెలుగు టాకీని నిర్మించిన ఘనత బొంబాయికి చెందిన భారత్ మూవీటోన్ కంపెనీకి దక్కింది. కృష్ణా స్టూడియోలోని యంత్ర సామగ్రిని ఉపయోగించుకుని,నిపుణులైన సాంకేతిక సిబ్బందితో కలిసి పనిచేయడం ద్వారా పూర్తిగా మాటలు, పాటలున్న చిత్రం (భక్త) 'ప్రహ్లాద'ను ఆ సంస్థ పూర్తి చేసింది...'' అంటూ సమీక్ష రాశారు. ('ది టైమ్స్ ఆఫ్ ఇండియా', 1932 ఫిబ్రవరి 6).

దీన్నిబట్టి కూడా 'భక్తప్రహ్లాద' తయారైందీ, తొలిసారిగా విడుదలయిందీ బొంబాయిలోనేనని అర్థమవుతోంది.

మద్రాసులో ఏప్రిల్ 2న! అంతకన్నా ముందే ఆంధ్రాలో!!

ఈ సినిమా మద్రాసుకు రావడానికి మరో రెండు నెలలు పట్టింది. తెలుగు ఉగాదికి నాలుగు రోజుల ముందు 1932 ఏప్రిల్ 2 శనివారం నాడు 'నేషనల్ పిక్చర్ ప్యాలెస్' (ఇప్పటి '(న్యూ) బ్రాడ్వే టాకీస్')లో విడుదలై రెండు వారాలు ప్రదర్శితమైంది. బొంబాయి నుంచి, అప్పటి మన ఉమ్మడి మద్రాసు రాష్ట్ర రాజధాని చెన్నపట్నానికి వచ్చే లోపల 'భక్తప్రహ్లాద' ఇంకెక్కడెక్కడ ఆడిందో తెలియదు గాని "... రాజమహేంద్రవరము నందు వరుసగా మూడు వారముల వరకు ప్రజల నాకర్షించెను...'' ('ఆంధ్రపత్రిక' దినపత్రిక, 1932 ఏప్రిల్
2, పేజీ 14) అనే వాక్యం ఒక్కటే తెలుసు మనకు. ఆ ఒక్క వాక్యం మినహా,తెలుగు నేలపై ఏయే ప్రాంతాలలో, ఏయే తేదీల్లో ఈ తొలి పూర్తి తెలుగు టాకీ ప్రదర్శించబడిందో తెలిపే సాక్ష్యాలు దురదృష్టవశాత్తూ ఇప్పటికీ లభించడం లేదు.


రాజమండ్రిలో, బెజవాడలో రిలీజైందెక్కడ?


రికార్డులను బట్టి చూస్తే, 1932 నాటికి రాజమండ్రిలో 'శ్యామలా టాకీస్'నిర్మాణమే కాలేదు. అప్పటికి ఉన్నవి రెండే హాళ్ళు 'శ్రీకృష్ణా సినిమా', 'బాబ్జీ సినిమా' (ఇప్పటి 'విజయా టాకీస్'). 'భక్తప్రహ్లాద' ఈ రెండిట్లో ఒక దానిలో విడుదలై ఉండాలి. నిడమర్తి వారి 1923-24 నాటి 'శ్రీకృష్ణా సినిమా'ను ఇప్పటికీ 'శ్రీసాయికృష్ణా'గా నిర్వహిస్తున్న మూడో తరానికి చెందిన 58 ఏళ్ళ నిడమర్తి మురళి "తొలి భారతీయ టాకీ 'ఆలమ్ ఆరా', తొలి పూర్తి తెలుగు టాకీ 'భక్తప్రహ్లాద'- రెండూ రాజమండ్రిలో మా హాలులోనే రిలీజయ్యాయి'' అని తమ పెద్దలు చెబుతూ వచ్చిన సంగతుల్ని ఈ పరిశోధకుడికి తెలిపారు. దాన్నిబట్టి ఇది 'శ్రీకృష్ణా సినిమా'లోనే రిలీజయిందని అనుకోవాలి.

నిజానికి అప్పటికి రాజమండ్రి కన్నా బెజవాడ పెద్ద పట్నం. మూకీలు కూడా జోరుగా ప్రదర్శితమైన సినీ కేంద్రం. కాబట్టి, కచ్చితంగా రాజమండ్రి కన్నా ముందే బెజవాడలోనూ 'భక్తప్రహ్లాద' ప్రదర్శింపబడి ఉండొచ్చు.

అప్పటికి బెజవాడలోనూ ఉన్నవి రెండే హాళ్ళు- శ్రీమారుతీ సినిమా, శ్రీదుర్గా కళామందిరం. 1932 డిసెంబర్ తొలినాళ్ళకు గానీ దుర్గా
కళామందిరంలో 'టాకీ' యంత్రాన్ని అమర్చలేదు. కాబట్టి, తొలి విడుదలలో 'మారుతీ'లోనే 'భక్తప్రహ్లాద' వచ్చి ఉండాలి.

అప్పట్లో బెజవాడలో 'భక్తప్రహ్లాద' చూసిన వయోవృద్ధులు తాము 'మారుతీ'లోనే ఆ సినిమాని చూసినట్లు గుర్తు చేసుకున్నారు. ఏడాది
తర్వాత మళ్లీ రిలీజయినపుడు మాత్రం దుర్గాకళామందిరంలో వచ్చింది. ఇవాళ మీడియాలో తరచూ కనిపిస్తున్న 'భక్తప్రహ్లాద' వాణిజ్య ప్రకటన ఆ రెండో రిలీజ్‌కు సంబంధించినదే.


తొలి తెలుగు టాకీల వరుస క్రమం

1932లో సెన్సారైన మొత్తం తెలుగు చిత్రాలు మూడు. వాటి వరుస 'భక్తప్రహ్లాద' (సెన్సార్ సర్టిఫికెట్ నెంబర్ 11032, తేదీ 22 జనవరి 1932. తొలి రిలీజ్ : బొంబాయిలోని 'కృష్ణా సినిమా'లో 1932 ఫిబ్రవరి 6). రెండోది 'శ్రీరామ పాదుకా పట్టాభిషేకము' (నెం. 11739, తేదీ 17 నవంబర్ 1932. తొలి రిలీజ్ : మద్రాసులోని 'కినిమా సెంట్రల్'లో 1932 డిసెంబర్ 24). మూడో టాకీ 'శకుంతల' (నెం. 11830, తేదీ 21 డిసెంబర్ 1932. తొలి రిలీజ్ : అదే 'కినిమా సెంట్రల్'లో 1933 మార్చి 25). చిత్ర నిర్మాణం వరుసలో 'శకుంతల' మూడో తెలుగు టాకీ అయినా, విడుదల విషయానికి వచ్చేసరికి ఐదోది అయింది. ఎందుకంటే 1933 ఫిబ్రవరి 4,5 తేదీల్లో రెండు 'సతి సావిత్రులు' విడుదలయ్యాయి. వాటి తరువాతే 'శకుంతల' మార్చి 25న రిలీజైంది.


కొసమెరుపు :

తమిళం కన్నా ముందే తెలుగు


ఇంత చెప్పాక ఇదేమిటని ఆశ్చర్యపోకండి. సగం తమిళం, సగం తెలుగుతో 'తమిళ- తెలుగు టాకీ'గా 1931లో రూపొందిన 'కాళిదాస్'ను ప్రభుత్వ సెన్సార్ బోర్డు తమిళ టాకీగానే లెక్కలో వేసుకున్నా 1932 ఏప్రిల్ 9న పూర్తి తమిళ మాటలు, పాటలతో విడుదలైన 'హరిశ్చంద్ర'నే ఆనాటి పత్రికలు "మొట్టమొదటి తమిళ టాకీ'' అని పేర్కొన్నాయి ('ది హిందూ', 1932 ఏప్రిల్ 8). అదెలాగున్నా 'కాళిదాస్'ని ఉమ్మడి వారసత్వంలో చేర్చేసుకుని తెలుగు, తమిళాల్ని విడివిడిగా చూస్తే దక్షిణాదిలో తొలి సంపూర్ణ టాకీ చిత్రం రూపకల్పనలోనూ, విడుదలలోనూ తమిళుల కన్నా మనమే రెండు నెలల పైచిలుకు ముందున్నామనేది స్పష్టం.


మూడు భాషల్లోనూ సినిమాకు మాట నేర్పింది మనవాళ్ళే!


ఆ మాటకొస్తే ఒక్క మలయాళం మినహా దక్షిణాది భాషల్లోని మిగతా మూడింటిలో సినిమాకు మాటలు నేర్పిన దర్శకబ్రహ్మలు తెలుగువారే
కావడం గర్వకారణం. ('కాళిదాస్', 'భక్తప్రహ్లాద'లకు హెచ్.ఎం. రెడ్డి, 1934 మార్చి 3న రిలీజైన తొలి కన్నడ టాకీ 'సతీ సులోచన'కు వై.వి. రావు). ఎస్. నోట్టానీ దర్శకత్వంలో వచ్చిన 'బాలన్' (1938) తొలి మలయాళ టాకీ. అయితే గర్వకారణమైన ఇలాంటి ఎన్నో విశేషాల చరిత్ర రచన నమ్మకాల మీద కాక, వాస్తవాల ఆధారంగా సాగాలి.

దురదృష్టవశాత్తూ, ఆ దృష్టి మందగించడం వల్ల మన సినిమా చరిత్ర రచన ఇప్పటికీ ససాక్ష్యంగా, సాకల్యంగా సాగడం లేదు. గురజాడ, చలం, శ్రీశ్రీల పుట్టిన తేదీల్లో దశాబ్దాలుగా చలామణిలో ఉన్న తప్పులను పరిశోధకులు బయటపెట్టినపుడు సరిదిద్దుకున్నాం. సాహిత్యం, సామాజిక చరిత్ర లాంటి ఎన్నో అంశాల్లో ఎంతో సాధారణమైన ఈ చరిత్ర నిర్మాణ సూత్రాన్ని సినీ చరిత్రకూ వర్తింపజేస్తే తప్పేముంది?

- రెంటాల జయదేవ
.....................................................................

Saturday, October 22, 2011

పరిశోధనపై ‘‘ఆంధ్రప్రభ’’ అనుమానాలు, ఆరోపణలు




ఆరోపణలు చేయడం సులభం. తర్కం, ఆధారాలు లేకుండా ఆరోపించడమైతే మరీ సులభం. తొలి సంపూర్ణ తెలుగు టాకీ భక్త ప్రహ్లాద

విడుదల తేదీ మీద నేను సమర్పించిన పరిశోధన పత్రంలోని అంశాలపై
కొందరు ఆ పనే చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. మరికొందరు ఓ మెట్టు పైకెక్కి పరిశోధనకు దురుద్దేశాలు పులిమే ప్రయత్నం చేశారు. వాస్తవాలను నివేదిస్తూ, వాటి ఆధారంగానే వార్తలు, వ్యాసాలు అందించాల్సిన పత్రికా రచయితలలోని సీనియర్లు కొందరూ, దీర్ఘకాలంగా పత్రికా రంగంలో సమున్నత సేవలందిస్తున్న ప్రముఖ పత్రికలలో కొన్నీ - కూడా తొందరపాటుతో ఆ అవాంఛనీయ వైఖరినే అవలంబించడం ఆశ్చర్యకరమే కాదు, బాధాకరం కూడా. తొలి తెలుగు టాకీ పుట్టిన ‘‘తేదీపై వివాదమెందుకు?’’ అంటూ ఆంధ్రప్రభ దినపత్రిక తమ వారం వారీ సినీ ప్రత్యేకానుబంధం ’’చిత్రప్రభ’’లో ఏకంగా సంపాదకుడి సంతకంతో ఎడిటోరియల్ రాసింది (ఆ ఎడిటోరియల్ తాలూకు డిజిటల్ బొమ్మ, అందులోని సమాచారం ఈ పోస్టులోనే పక్కనే చూడగలరు).

తెలుగు సినిమా ఎనభై ఏళ్ళ ఉత్సవాన్ని జరుపుకొంటున్న తరుణంలో ఈ హడావిడి ఏమిటంటూ, పరిశోధన ఉద్దేశాన్నే ప్రశ్నించింది. దురుద్దేశాలు అంటగట్టేందుకు ప్రయత్నించింది. తర్కానికి అందని వ్యాఖ్యలెన్నో చేసింది. చేసిన పరిశోధనను సహృదయంతో అనుశీలించకపోగా, మళ్ళీ తానే గొంతు సవరించుకొని - ‘‘కొత్త తేదీ వెలుగులోకి రావడం వల్ల అసలు తేదీ ఏదనే దానిపై పరిశోధన జరగాల్సిన అవసరం కనిపిస్తోంది’’ - అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. ఆ వెంటనే తానే తీర్పరి పాత్ర పోషిస్తూ - ‘‘అయితే తేదీ ఏదనే విషయం ప్రధానం కాదు. ముందుగా అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 15వ తేదీని తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకగా ప్రతి ఏడు ఘనంగా జరుపుకోవడానికి ప్రయత్నించాలి’’ - అని ఆ పత్రిక ముక్తాయించింది.

పరిశోధన జరపాలని ఓ నాలికతో అంటూ, ఇప్పటిదాకా సరైన సాక్ష్యాధారమేదీ లేని సెప్టెంబర్ 15వ తేదీనే తెలుగు సినిమా పుట్టినరోజు జరుపుకోవాలని అలా తెగేసి మరో నాలికతో తీర్మానించేయడం ఏమిటో అర్థం కాదు. పరిశోధన చేస్తేనేమో దురుద్దేశాలు అంటగడుతున్నారు. కానీ పరిశోధన జరగాల్సి ఉందనీ మళ్ళీ తామే అంటున్నారు. ఇదెక్కడి చిత్రం.


పరిశోధనపై ఆరోపణలు చేసి, అనుమానాలు వ్యక్తం చేసిన ఆంధ్రప్రభ ఎడిటోరియల్ పూర్తిపాఠం ఇదీ --


..........................................
తేదీపై వివాద మెందుకు?


భక్త ప్రహ్లాద విడుదల తేదీపై వివాదం చెలరేగింది. ఇప్పటి వరకు 1931 సెప్టెంబర్‌ 15న ఈ చిత్రం విడుదలైందని చరిత్రకారులు చెబుతూ వస్తున్నారు. ఇటీవలే భక్త ప్రహ్లాద విడుదలైన తేదీని తెలుగు సినిమా పుట్టినరోజుగా పరిశ్రమ ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలోనే కొత్త తేదీ ప్రచారంలోకి వచ్చింది. ఐదు సంవత్సరాల క్రితం వజ్రోత్సవాలను అట్టహాసంగా జరుపుకుని, ఇప్పుడు
ఎనబై యేళ్ళ ఉత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలోనే విడుదల తేదీ, సంవత్సరం సరికాదంటూ వివాదం చేయడం వెనుక వారికి ఉన్న ఉద్దేశాల గురించి రంధ్రాన్వేషణ చేయడం అనవసరం.

సినీ ప్రముఖులు దాసరి నారాయణరావుగారు పేర్కొన్నట్టు తేదీపై సంపూర్ణ సమాచారం లేదు. ఆ రోజుల్లో తొలుత విజయవాడ మారుతీ టాకీస్‌లో తర్వాత రాజమండ్రి శ్యామల టాకీసులో విడుదలైన తర్వాత మద్రాసులో 1932లో విడుదలై ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, దీనిపై శాస్త్రీయంగా పరిశోధన జరగాలని సూచించారు. దాసరిలాంటి ప్రముఖులు ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడరనే విషయం పరిశ్రమకు తెలియంది కాదు. హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన భక్త ప్రహ్లాద తొలి టాకీ తెలుగు సినిమానా, లేక హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలోనే తెలుగు తమిళ సంభాషణలతో, తెలుగు పాటలకు ప్రాధాన్యత ఇస్తూ తమిళ చిత్రంగా రూపొందిన కాళిదాసు తొలి తమిళ చిత్రమా అనేది కూడా తేలాలి.

దీనిపై సినీ పరిశోధకులు ఇంటూరి వెంకటేశ్వరరావు, వి.ఏ.కె.రంగారావు వంటి వారు ఎప్పుడో శోధించారు. వారి సూచన మేరకే 1931 సెప్టెంబర్‌ 15 అని పరిశ్రమ నిర్ణయానికి వచ్చింది. 1932న విడుదలైందంటూ కొన్ని ఆధారాలు చూపుతున్న పరిశోధకులు ఇంతకాలం మౌనంగా ఎందుకున్నారనేది ఆలోచించాల్సిన విషయం. ఎనిమిది దశాబ్ధాల ఉత్సావాన్ని సంబరంగా చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలోనే ఇవిగో సాక్ష్యాలంటూ హడావుడి చేయడం వెనుక ఉన్న వారి ఉద్దేశాన్ని తెలియజేస్తోంది. ఎనిమిది దశాబ్ధాలుగా నిజమని విశ్వసిస్తున్న తెలుగువారి నమ్మకాన్ని కాదని చెబుతున్నారు.

భక్త ప్రహ్లాద విడుదలైన తర్వాత సెన్సార్‌ జరిగి ఉండవచ్చు, లేదా దాసరి చెప్పినట్టు విజయవాడ, రాజమండ్రి తర్వాత మద్రాసులో రిలీజై
వుండవచ్చు కూడా. మన దేశంలో తక్కువ సంఖ్యలో అప్పట్లో టాకీచిత్రాలు (అంతకుముందు మూకీ చిత్రాలు వచ్చాయి) వస్తున్న సందర్భంలో సెన్సార్‌ శాఖ వేలసంఖ్య (11032)ను పొందు పరుస్తూ ఎందుకు సర్టిఫికెట్‌ జారీ చేసిందో మరి. ఏది ఏమైనప్పటికీ, విడుదల తేదీని పెద్ద వివాదం చేయడం సరికాదు. కొత్త తేదీ వెలుగులోకి రావడం వల్ల, అసలు తేదీ ఏదనే దానిపై పరిశోధన జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే తేదీ ఏదనే విషయం ప్రధానం కాదు. ముందుగా అనుకున్నట్టుగానే సెప్టెంబర్‌ 15వ తేదీని తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకగా ప్రతి ఏడు ఘనంగా జరుపుకోవడానికి ప్రయత్నించాలి.

- పి. విజయబాబు,
ఎడిటర్‌
................................

Friday, October 21, 2011

తెలుగు సినిమా పుట్టినరోజు వివాదంపై టి.వి 9 స్టోరీ - వీడియో లింకు

తొలి తెలుగు సినిమా పుట్టిందెప్పుడు అన్న నా పరిశోధన పత్రంలోని అంశాలు పెద్ద చర్చకే దారి తీశాయి. తొలి సంపూర్ణ తెలుగు టాకీ భక్త ప్రహ్లాద 1931 సెప్టెంబర్ 15న విడుదల కానే లేదనీ, కాబట్టి తెలుగు సినిమా పుట్టినరోజంటూ ఆ తేదీని ప్రామాణికంగా తీసుకోవడం సరికాదనీ సాక్ష్యాధారాలతో నేను చేసిన వాదనను కొన్ని టి.వి. చానళ్ళు ప్రస్తావించాయి. సరికొత్త సాక్ష్యాధారాలను పట్టించుకోకుండా తెలుగు సినిమా 80 ఏళ్ళ పండుగంటూ పరిశ్రమ ఏటేటా ఆ రోజు ఉత్సవం చేస్తామన్నసందర్భంలోనే ప్రముఖ ఉపగ్రహ టీవీ చానల్ టి.వి. 9 దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ కథనం తాలూకు వీడియో లింకును మిత్రులు ఈ మధ్యే నాకు మెయిల్ చేశారు.

1932 జనవరి 22న సెన్సారైన భక్త ప్రహ్లాద ఆ తరువాత ఏప్రిల్ 2న మద్రాసులో విడుదలైనట్లు నా పరిశోధనలో సాక్ష్యం దొరికింది. ఆ మధ్యలో ఎక్కడెక్కడ ఏ తేదీల్లో వచ్చిందో ససాక్ష్యంగా వివరాలు లభించలేదు. ఏమైనా, సినిమా సెన్సారైన 1932 జనవరి 22 నుంచి మద్రాసులో సినిమా విడుదల సమాచారం తొలిసారిగా లభిస్తున్న ఏప్రిల్ 2వ తేదీ మధ్యలోనే భక్త ప్రహ్లాద తొలి రిలీజు తేదీ ఉంటుందని నా వాదన.

పరిశోధించి, ప్రాథమిక, ప్రాసంగిక సాక్ష్యాధారాల సహాయంతో నేను చేసిన ఈ వాదనను టి.వి 9 జనం ముందుకు సమర్థంగానే తీసుకువెళ్ళింది. 30 నిమిషాల రికార్డింగును 300 సెకన్లకు కుదించడంలో ఒకటీ, అరా తప్పులు దొర్లినా, చరిత్రను సవ్యంగా అందించే కృషిలో భాగమైనందుకు టి.వి 9 బృందానికి కృతజ్ఞతలు. అక్కడ ప్రసారమైన వార్తా కథనం ఇక్కడ చూడండి.