సినిమాలో డ్రామా ఉంటుంది...
యాక్షన్ ఉంటుంది... ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది...
ఫస్టాఫ్ ఉంటుంది... సెకండాఫ్ ఉంటుంది... క్లైమాక్సూ ఉంటుంది...
హీరోయిన్లుంటారు... క్యారెక్టర్లుంటాయి...
కామెడీ ఉంటుంది... అబ్బో! చాలానే ఉంటుంది.
అవును... అసలు విషయం మర్చిపోయాం!
సినిమా బయట కూడా డ్రామా ఉంటుంది.
అభిమానులుంటారు. ఆడియన్స్ ఉంటారు.
ప్రొడ్యూసర్లు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లుంటారు.
వాళ్ళంతా హ్యాపీయే!... టెన్షన్ అంతా అభిమానులది.
కటౌట్లు పెట్టాల... దండలు వెయ్యాల... అభిషేకాలు చెయ్యాల...
సమ్‌టైమ్స్... ప్రాణాల మీదకు తెచ్చుకోవాల...
ఇవన్నీ హీరోలకు కల్ట్ ఇమేజ్ తెచ్చిపెట్టాయ్.
గవర్నమెంట్ పందెంరాయుళ్ళపై ఆంక్షలు విధించవచ్చు.
పందెంకోళ్ళను జైళ్ళలోనూ పెట్టవచ్చు.
కానీ, ఈ అభిమాన పందెంపై కంట్రోలు
ఏ ప్రభుత్వం మాత్రం పెట్టగలదు?
దిస్ స్టోరీ ఈజ్ బిగ్గర్ దేన్ టూ మూవీస్టోరీస్!
రెండు సినిమాల కన్నా గొప్ప డ్రామా ఉన్న స్టోరీ! చదవండి.
.......................................................................
ఇది వెండితెర మహా సంగ్రామం..
. సంక్రాంతి ... థియేటర్లలో జరుగుతున్న సినిమా కోడి పందెం... ఒకరు మెగా స్టార్... మరొకరు నందమూరి యుగా స్టార్... ఒకరిది (హీరోగా) 150వ సినిమా... ఇంకొకరిది 100వ సినిమా... ఒకరిది తమిళ సూపర్ హిట్ కథ... ఇంకొకరిది తెలుగు జాతి యోధుడి జీవితం... ఒకరేమో శక్తిపీఠాల్లో పూజలు, మరొకరు ఆలయాల్లో అభిషేకాలు... ఎవరూ తగ్గేది లేదు... ఎక్కడా తలొగ్గేది లేదు... అందుకే... తెలుగు సినీ జనంలో... ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్... ‘ఖైదీ నంబర్ 150’ వర్సెస్ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’... చిరంజీవి సిన్మా వర్సెస్ బాలకృష్ణ సిన్మా.. సంక్రాంతి సీజన్‌లో... మరికొన్ని సినిమాలు బరిలోకి వస్తున్నా...
ఈ ‘స్టార్ వార్స్’ పైనే అందరి దృష్టి.
............................................
కథ కోసం కసరత్తులు
బాస్ ఈజ్ బ్యాక్
కెరీర్‌లో మైలురాళ్ళ లాంటి ఈ సినిమాలు చేయడానికి సరైన
కథల కోసం స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ చాలా కసరత్తులే చేశారు. కొన్నేళ్ళపాటు ఊరించి, పరుచూరి బ్రదర్స్‘ఉ య్యాలవాడ నరసింహారెడ్డి’ స్క్రిప్ట్ దగ్గర నుంచి పూరీ జగన్నాథ్ ‘ఆటో జానీ’ దాకా వందల కథలు విన్న చిరంజీవి చిట్టచివరికి తమిళంలో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ నటించిన హిట్ ‘కత్తి’ (2014) రీమేక్‌కు జెండా ఊపారు. అదీ కుమారుడు రామ్‌చరణ్ నిర్మాతగా తొలి యత్నం కావడం విశేషం. గతంలో ‘ఠాగూర్’(తమిళ ‘రమణ’కి రీమేక్)తో విజయం అందించిన వినాయక్‌కు దర్శకత్వ బాధ్యతలు అందించారు.
తెలుగు వాడి పౌరుషం
హీరోగా 100వ సినిమాకు బాలకృష్ణ చాలా స్క్రిప్ట్‌లు
విన్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో టైమ్‌మిషన్ కాన్సెప్ట్‌తో పాతికేళ్ళ క్రితం వచ్చిన ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ స్క్రిప్ట్‌కు ఓకే చెప్పారు. కుమారుడు మోక్షజ్ఞనీ దాంతో తెరంగేట్రం చేయాలని ఊగారు. తర్వాత రైతుల కష్టాన్ని ప్రతిబింబించే ‘రైతు’ కథ నచ్చి, కృష్ణవంశీ దర్శకుడిగా దాదాపు ఖరారు చేశారు. అదే టైమ్‌లో దర్శకుడు క్రిష్ వచ్చి, తల్లి పేరును తన పేరు ముందుపెట్టుకొన్న చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కథ ఏకధాటిన 2 గంటలు చెప్పారు. విని 24 గంటలైనా గడవక ముందే ఇదే నూరో సినిమాకు కరెక్ట్ అని బాలయ్య అటు మొగ్గారు.
...............................................
ఇంతకీ... కథేంటి?
మెగా రీమేక్
బేసిక్‌గా ఇది తమిళ ‘కత్తి’ చిత్రానికి రీమేక్. కాకపోతే, తెలుగు
నేటివిటీ, చిరు ఇమేజ్‌కు తగ్గట్లుగా పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ సహా పలువురు కలసి, స్క్రిప్ట్‌కు మార్పులు చేశారు. కార్పొరేట్ సంస్థల దురాక్రమణలతో ఉపాధి కోల్పోయి, దిక్కుతోచని రైతులు ఆత్మహత్యలకు పాల్పడడమనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. చూడడానికి ఒకేలా కనిపించే రైతుల కోసం పోరాడే ప్రగతిశీలవాది జీవానందంగా, అల్లరి చిల్లరిగా ఉండే ఖైదీ కదిరేశన్ అలియాస్ కత్తిగా రెండు పాత్రలూ తమిళ్‌లో విజయ్ చేశారు. జీవానందం గాయపడగా, అతని స్థానంలోకి కత్తి వెళ్ళి రైతుల పక్షాన పోరాడతాడు.
హిస్టరీ రిపీట్స్
చిన్న చిన్న గణతంత్ర రాజ్యాలుగా ఉన్న భారతావనిని ఒకే
ఏలుబడికి తెచ్చిన తొలి భారతీయ చక్రవర్తి, తెలుగు యోధుడి కథ ఇది. దర్శకుడు క్రిష్ లభిస్తున్న కొద్దిపాటి చరిత్ర ఆధారాల్నీ తీసుకొని, ఊహ జోడించి, స్క్రిప్ట్ చేసుకున్నారు. క్రీ.శ. 1వ శతాబ్దానికి చెందిన ఈ తెలుగు యోధుడి కథను 1900 ఏళ్ళ తరువాత ఇప్పుడు తెర మీదకు తెస్తున్నారు. శాతకర్ణి జీవితంలో తల్లి ఎంతటి కీలకపాత్ర వహించిందో, భార్యాబిడ్డల కన్నా దేశాన్ని ఒక్క తాటి మీదకు తేవాలన్న ఆకాంక్షకే అతనిచ్చిన ప్రాధాన్యం ఏమిటో ఈ కథ చెబుతుంది. అయితే, ఈ చిత్రం శాతకర్ణి విజయగాథలకే పరిమితం.పూర్తి జీవితం చూపడం లేదు.
....................................................
ముసురుకున్న వివాదాలు
కథ ఎవరిది?:
తమిళ ‘కత్తి’ సినిమా ఒరిజినల్ కథ తనదేననీ, పేరు, డబ్బులు –
ఏమీ ఇవ్వకుండా ఆ కథను అడ్డంగా వాడేసుకున్నారనీ దర్శక – రచయిత ఎన్. నరసింహారావు వీధికెక్కారు. ఆ కథ ఒరిజినల్‌గా నరసింహారావు రిజిస్టర్ చేసుకున్న స్క్రిప్ట్‌లోదేనని ‘రచయితల సంఘం’ కమిటీ కూడా తేల్చింది. తమిళ దర్శక, నిర్మాతల నుంచి డబ్బుల వ్యవహారం తేలే లోగానే, ‘కత్తి’ని చిరంజీవి రీమేక్ చేస్తున్నారనే వార్తతో కాపీరైట్ వివాదాన్ని మళ్ళీ ఫిల్మ్‌నగర్‌లో గుప్పుమనిపించారు. అలా ‘ఖైదీ నంబర్ 150’ షూటింగ్ కన్నా ముందే వార్తల్లో నిలిచింది.
నో పర్మిషన్:
‘ఖైదీ నంబర్ 150’ ట్రైలర్ కమ్ ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌కు విజయవాడలో
అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ మరో వివాదం రేగింది. నిజానికి, మొదట డిసెంబర్ ఆఖరులో విజయవాడలోని మునిసిపల్ స్టేడియమ్‌లో చిత్ర ఆడియో ఫంక్షన్ జరపాలనుకొని, ఏర్పాట్లు చేసుకున్న చిత్ర నిర్మాతలు ‘శాతకర్ణి’ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ ఫంక్షన్‌నే రద్దు చేసుకొన్నారు. తీరా సినిమా రిలీజ్‌కు పట్టుమని వారం రోజులైనా లేక ముందు ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం పెట్టుకొన్నారు. అయితే, ఆ ఫంక్షన్‌కు స్టేడియమ్‌లో అధికారపక్షం ఉద్దేశపూర్వకంగానే అనుమతి ఇవ్వడం లేదని చిరు అభిమాన వర్గం ఆరోపించింది. అధికారులు మాత్రం మునిసిపల్ స్టేడియమ్‌లను, బయటి ఫంక్షన్లకివ్వరాదంటూ ఉమ్మడి రాష్ట్ర కాలంలో వచ్చిన జీవో వల్లే అనుమతులు ఇవ్వడం లేదంటూ సన్నాయినొక్కులు నొక్కారు. చివరకు చిరు వర్గం తమ వేదికను బెజవాడ – గుంటూరు మధ్యకు మార్చి, కార్యక్రమం శనివారం చేసింది.
ఎవరు లెజెండ్?
డేట్ ముందుకు మార్చుకొని, జనవరి 11న రిలీజ్‌కు వచ్చిన
‘ఖైదీ...’ వర్గం ‘ఇద్దరు అగ్రహీరోల సినిమాలు ఒకే రోజు రావడం మంచిది కాదని నాన్న (చిరంజీవి) గారన్నారు’ అంటూ తెలివిగా ప్రకటించింది. అలా పోటీ సినిమా సేమ్ డే రిలీజ్‌కి రాకుండా, ముందరి కాళ్ళకి బంధం వేసింది. ఈ పరిస్థితుల్లో రకరకాల ఒత్తిళ్ళ మధ్య జనవరి 3వ తేదీ రాత్రి పొద్దుపోయాక, క్రిష్ సైతం పోటీ సినిమాకు స్నేహహస్తం చాపుతూ, ‘‘ఈ సంక్రాంతికి ఇద్దరు లెజెండ్స్ తమ మైలురాళ్ళ లాంటి సినిమాలతో వస్తున్నారు... స్వాగతిద్దాం’’ అని ట్వీట్ చేశారు. కానీ, ఇరు వర్గాల అభిమానులూ ఎవరికి వారు ‘మా హీరో తప్ప మరొకరు లెజెండ్ ఎలా అవుతారు’ అంటూ బుస కొట్టారు. సోషల్ మీడియాలో విషం కక్కారు.
అంత మాటంటారా? ఖబడ్దార్!
డిసెంబర్ 26న తిరుపతిలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’
పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, దర్శకుడు క్రిష్ మాటల ఉరవడిలో ‘సంక్రాంతికి వస్తున్నాం. ఖబడ్దార్’ అనే పదప్రయోగం చేయడం వివాదమైంది. అది చిరు వర్గాన్ని ఉద్దేశించి అన్న మాటలుగా సోషల్ మీడియాలో ప్రచారమైంది. దానికి తోడు ‘అన్నయ్య’ కోసం మెగా బ్రదర్ నుంచి వచ్చిన వరుస ఫోన్‌కాల్స్! ఒకరికి నలుగురు హీరోలు చేతిలో ఉన్న మెగా ఫ్యామిలీతో వ్యవహారం కావడంతో, ఈ ఉక్కిరిబిక్కిరి మధ్య, క్రిష్ మెగా ఫ్యామిలీతో తనకున్న అనుబంధం, అపార గౌరవం గురించి వివరణ ఇవ్వాల్సొచ్చింది.
..........................................................
సోషల్ మీడియాలో వార్ !
బాలకృష్ణ సినిమా వస్తున్న రోజున అసలు బయటకే
రావద్దంటూ ఎగతాళి వాట్సప్ మెసేజ్ సోషల్ మీడియాలో బాగా తిరిగింది. మరోపక్క, చిరంజీవి సిన్మాలో ‘అమ్మడు... కుమ్ముడు’ లాంటి మరీ మాస్ పాట ఏమిటని నెట్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి ‘ట్రాలింగ్’లను పక్కన పెడితే, ‘మా టీజర్, ట్రైలర్ లుక్‌కు ఇన్ని లక్షల వ్యూస్ వచ్చాయి’ అని మొదట ఒక సిన్మా వారు ప్రకటించారు. మా పాటనీ అంతమంది చూశారంటూ మరొక సినిమావారు అంతకన్నా పెద్ద అంకెలతో, పోటీ ప్రకటన చేశారు. ఇలా ప్రకటనలతో పోటాపోటీలు పడుతున్నారు. మీడియాలో స్టార్ వార్ చూసి, హద్దు మీరినా, బ్యానర్లు చింపినాlచర్య తప్పదని ఏపీ రాష్ట్ర డీజీపీ ప్రకటించారు. హాళ్ళ వద్ద బందోబస్తు పెట్టారు.
.....................................................
అందరూ సర్‌ప్రైజ్ అవుతారు!
– ‘ఖైదీ...’ దర్శకుడు వినాయక్
⇔ తొమ్మిదేళ్ళ తర్వాత చిరంజీవినెలా చూపిస్తున్నారు?
వినాయక్: సినిమా రిలీజయ్యాక చూస్తే, అసలు ఆ తొమ్మిదేళ్ళ
గ్యాపూ చెరిగిపోతుంది. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, దాదాపు 20 ఏళ్ళ క్రితం ‘చూడాలని ఉంది’ (1998) టైమ్‌లో ఎలా ఉన్నారో, అలా అనిపిస్తారు చిరంజీవి. ఆయనను చూసి అందరూ సర్‌ప్రైజ్ అవుతారు. నో డౌట్. ఆయన డ్యాన్స్‌లు, ఫైట్లు చూసి అదిరిపోతారు.
⇔ ఇది తమిళ ‘కత్తి’కి రీమేక్ కదా! మరి తెలుగులో...?
చాలా మార్పులు చేర్పులు చేశాం. అక్కడ యువ హీరో
విజయ్ కోసం, అతని ఇమేజ్‌కి తగ్గట్లుగా చేసిన స్క్రిప్ట్ ఇది. దాన్ని మన తెలుగు నేటివిటీకీ, ‘అన్నయ్య’ బాడీ లాంగ్వేజ్‌కీ తగ్గట్లు మార్చడం కోసం సమష్టిగా కృషి చేశాం.
⇔ ‘ఠాగూర్’ లానే ‘ఖైదీ నంబర్ 150’లో కూడా
సామాజిక సమస్యను ప్రస్తావించినట్లున్నారు!
ఏ బాధ్యతా లేని ఒక వ్యక్తి – ఒక ఊరిలో ఒక రైతుకు జరిగిన
అన్యాయం తెలుసుకొని కదిలిపోతాడు. ‘నేను వీళ్ళ కోసమే బతకాలి’ అని నిర్ణయించుకొని, ఆ దిశలో చేసే అలుపెరుగని పోరాటం చిత్ర కథ. రైతు సమస్య, నీటి సమస్య లాంటి అంశాలెన్నో వస్తాయి.
⇔ రైతు గురించి వచ్చే ‘నీరు నీరు నీరు...’ పాట ఇవాళ
మీడియాలో హాట్‌టాపిక్ అయినట్లుంది!
చాలా మంచి పాట అది. దేవిశ్రీ సంగీతం, రామజోగయ్యశాస్త్రి
సాహిత్యం, శంకర్ మహదేవన్ గానం – అద్భుతం. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుందీ పాట.
⇔ చిరంజీవి కమ్‌బ్యాక్ ఫిల్మ్ వరమాల ఎందరినో
దాటి మీ మెడలో పడినప్పుడు ఏమనిపించింది?
చిరంజీవి గారు పిలిచి, ‘కత్తి’ సినిమా తెలుగులో చేద్దామన్నారు.
వెంటనే ఆ దృష్టితో సినిమా చూశాను. చూస్తుండగా నా మనసులో తిరిగిన ఆలోచనలు, మార్పులు చేర్పులతో – నాదైన పద్ధతిలో ఆయనకు కథను నేరేట్ చేశాను. నా అప్రోచ్ నచ్చి, చేసేద్దామన్నారు.
∙మీకు ఈ సినిమా పెద్ద ఎఛివ్‌మెంట్. మరి, ప్రేక్షకులకు
ఎలాంటి అనుభూతి అంటారు?
ఒక్క మాటలో చెప్పాలంటే, ‘ఠాగూర్’లో ఉన్న నిజాయతీ,
‘రౌడీ అల్లుడు’లోని కామెడీ, ‘ఇంద్ర’లోని పాటలు – ఇవన్నీ కలిసే ఒకే సినిమాలో ఉంటే? అదే – ‘ఖైదీ నంబర్ 150’!
⇔ అంచనాలతో పాటు సినీ పోరాటమూ
భారీగానే ఉంది! మరి, టార్గెట్...
అంచనాలన్నీ అందుకుంటాం. ఇంకా చెప్పాలంటే,
అధిగమిస్తాం. సినిమా సూపర్ హిట్.
..........................................................
చరిత్రలో గౌతమీపుత్ర శాతకర్ణి
చరిత్రలోకి వెళితే, శాతవాహనులు తెలుగు వారు.
ఇప్పటి తెలంగాణ ప్రాంతంలోని కోరులింగాల (కోటి లింగాల) నుంచి తెలుగు ప్రాంతంతో పాటు భారత భూభాగాన్నే ఏలినవారు. ఆ వంశానికి వన్నె తెచ్చిన చక్రవర్తి – గౌతమీపుత్ర శాతకర్ణి. క్రీ.శ. 78 –102 (కొందరు 60 నుంచి 90 దాకా అంటారు) మధ్య పరిపాలన సాగించిన గౌతమీపుత్ర శాతకర్ణి నిజానికి శాతవాహన వంశంలో ఏ రాజూ సాధించనన్ని విజయాలు సాధించాడు. శత్రువులైన శకులు, పల్హవులు, యవనులను (గ్రీకులు) జయించి, జంబూద్వీపాన్ని (భారతభూభాగానికి పురాణనామం) పరాయి పాలన నుంచి విముక్తం చేసిన అరుదైన చక్రవర్తి. తాత, ముత్తాతలు కోల్పోయిన భూభాగాలనే కాక, కొత్త భూభాగాలను జయించి, సువిశాల సామ్రాజ్యంగా విస్తరించాడు. అలా మూడు సముద్రాల పర్యంతం తన ఆధిపత్యాన్ని స్థాపించి, ‘త్రిసముద్ర తోయ పీతవాహన’ (మూడు సముద్రాల నీళ్ళు తాగిన గుర్రాన్ని వాహనంగా కలవాడా) అనే బిరుదు పొందాడు. తన బొమ్మను ముద్రించిన వెండి నాణాలను విడుదల చేసిన మొదటి భారతీయ చక్రవర్తి అతనే! పేరుకు ముందు తల్లి (గౌతమీ బలసరి/బాలాశ్రీ) పేరు చేర్చుకొన్న తొలి భారతీయుడూ అతనే! కొత్త యుగానికి ఆదిగా ‘యుగాది’ (ఉగాది, మహారాష్ట్రలో ‘గుడీ పడవా’) ఆయన మొదలు పెట్టిందనే అంటారు. శాలివాహన శకమనే కొత్త శకాన్ని స్థాపించి, కాలాన్ని మలుపు తిప్పిందీ ఈయనే అని కొందరి భావన.
....................................................
"చిన్నతనంలో మా తాతయ్య గారి ఊరికి వెళ్ళినప్పుడు
అమరావతి చాలాసార్లు చూశా. అమరావతి రాజధానిగా పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ లీలగా విన్నా. కొన్నేళ్ళుగా ఈ కథ నా మనసు తొలిచేస్తోంది. మన తెలుగు వాడి కథ మనకి కూడా తెలియకపోవడం కోపం వచ్చింది. 2013 నుంచి ముంబైలో ఉన్నప్పుడు ఆ చరిత్ర మరింత తెలిసింది. ఇది అందరికీ చెప్పాల్సిన కథ అనిపించింది. అందుకే, ఈ సినిమా తీశా. సినిమా తీస్తున్నంత సేపూ ఏదో అదృశ్యశక్తి నా వెంట ఉండి నడిపింది. ఇది నిజం."
– ‘...శాతకర్ణి’ చిత్ర దర్శకుడు క్రిష్
.................................
రిలీజ్ దోబూచులాట.. రచ్చ
నిజానికి, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం 2016 ఏప్రిల్
ప్రారంభమైనప్పుడే ఎట్టి పరిస్థితుల్లోనూ 2017 జనవరి 12న రిలీజ్ చేస్తామని దర్శక, నిర్మాతలు ప్రకటించారు. అయితే, చారిత్రక నేపథ్యం, యుద్ధ సన్నివేశాలున్న భారీ చిత్రం తీయడం కాబట్టి, అది జరిగేపని కాదని పరిశ్రమ వర్గీయులు, ప్రత్యర్థి చిత్రాల వాళ్ళు పెదవి విరిచారు. వాళ్ళ అంచనాల్ని తలకిందులు చేస్తూ, రికార్డు టైమ్‌లో చిత్ర యూనిట్ సినిమా పూర్తి చేసింది.
ఇలా ఉండగా, ‘శాతకర్ణి’ ప్రారంభమైన రెండు నెలల తర్వాత 2016
జూన్ 23న చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ షూటింగ్ మొదలైంది. దాన్ని కూడా సంక్రాంతికే జనవరి 13న రిలీజ్ చేస్తామంటూ నిర్మాతలు మొదట ప్రకటించారు. అయితే, తీరా రెండు సినిమాలూ షూటింగ్ పూర్తి చేసుకొని, రిలీజ్‌కు దగ్గర పడుతుండేసరికి రచ్చ మొదలైంది.
కలిసొచ్చిన ‘నరసింహనాయుడు’ రిలీజ్ డేట్ జనవరి 11కే ఈ సినిమానూ
రిలీజ్ చేయాలంటూ బాలకృష్ణ ఫ్యాన్స్ ఒత్తిడి చేస్తూ వచ్చారు. అందుకు, దర్శక, నిర్మాతలు కూడా సరేనంటూ, బాక్సాఫీస్ వద్ద ప్రత్యర్థుల వ్యూహాల్ని బట్టి, తుది రిలీజ్ డేట్ ప్రకటిద్దామని కూర్చున్నారు. ఆడియో రిలీజ్ వేదికపైనా డేట్ చెప్పనిది అందుకే!
అయితే, ఇంతలో ‘ఖబడ్దార్’ పదప్రయోగంపై వివాదం క్రిష్‌ను
చుట్టుముట్టింది. ఒక ఏరియా ‘శాతకర్ణి’ రిలీజ్‌లో భాగస్థుడూ, చేతిలో పలు థియేటర్లూ ఉన్న ఒక అగ్ర నిర్మాత మధ్యవర్తిగా రంగప్రవేశం చేశారు. ఆ నిర్మాత తమ్ముడితో నెక్స్›్ట సినిమా చేయడానికి సిద్ధమవుతున్న ‘శాతకర్ణి’ దర్శక, నిర్మాతలతో జనవరి 12న ‘శాతకర్ణి’ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన కమిట్ చేయించారు. ఆ ప్రకటన వచ్చాక, పోటీ నివారించడానికి ఒక రోజు ముందే జనవరి 11న చిరు సినిమా రిలీజ్ చేస్తున్నామంటూ ఆ చిత్ర నిర్మాత – హీరో రామ్‌చరణ్ ప్రకటించారు.
దాంతో, రిలీజ్ డేట్ విషయంలో అగ్ర నిర్మాతతో కుట్ర చేయించారని
బాలకృష్ణ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. పూజలు, అభిషేకాలు, జెండా పండగలకే తప్ప, సిన్మా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం దర్శక – నిర్మాతలు తమ కన్నా, ప్రత్యర్థి చిత్ర వర్గీయుల మాటకే తలొగ్గారంటూ విమర్శించారు. జనవరి 5, గురువారం నాడు వంద మంది దాకా అభిమానులు సాక్షాత్తూ హైదరాబాద్‌లోని ‘శాతకర్ణి’ చిత్ర ఆఫీసుకు వెళ్ళి, జనవరి 11నే తమ హీరో సిన్మా రిలీజ్ చేయాలంటూ ఆందోళన చేయడం కొసమెరుపు. కానీ, చివరకు జనవరి 12నే ‘శాతకర్ణి’ రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు ఖరారు చేసేశారు.
............................................
ఒక్క రోజు ముందొస్తే... 10 కోట్లు!
ఒక రోజు ముందు రిలీజ్ కావడం వల్ల అత్యధిక థియేటర్లు
అందుబాటులో ఉండి, రికార్డు కలెక్షన్లకు వీలు చిక్కుతుంది. తమ హీరో గొప్ప అంటే, తమ హీరో గొప్ప అనుకొనే ఫ్యాన్స్‌కూ, బాక్సాఫీస్ రికార్డులే ప్రమాణం అనుకొనే సినీజీవులకూ, నంబర్ వన్ స్థానంపై కన్నేసిన తారలూ రిలీజ్ డేట్‌పై పట్టుపట్టేది అందుకే! ‘మా సినిమా అన్ని వేల థియేటర్లలో రిలీజ్, ఇన్ని వేల థియేటర్లలో హంగామా’ అని కొందరు సినిమావాళ్ళు చెబుతుంటారు కానీ, వాస్తవాలు వేరు.
ఉన్న థియేటర్లెన్ని?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1650 చిల్లర
థియేటర్‌లే (మల్టీప్లెక్స్‌లలోని స్క్రీన్స్ కూడా కలిపి) ఉన్నాయి. ఇక, తమిళనాడు, కర్ణాటక, విదేశాల్లో క్రేజీ తెలుగు సినిమాలకు అందుబాటులో ఉండేవి కూడా కలుపుకొన్నా, మహా అయితే, 2 వేల స్క్రీన్స్‌కు మించవు. ఆర్భాటపు కబుర్లను పక్కనపెట్టి, అసలు లెక్కల్లోకి వెళితే – థియేటర్లపై పట్టున్న ‘దిల్’ రాజు ‘శతమానం భవతి’కి దాదాపు 250 థియేటర్లు, ఆర్. నారాయణమూర్తి ‘హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య’కు సుమారు 50కి పైగా థియేటర్లు ఈ సంక్రాంతికి అందుబాటులో ఉంటాయని అంచనా. ఇక, మిగిలిన 1700 స్క్రీన్స్‌నే చిరు, బాలయ్య సిన్మాలు పంచుకోవాలి. వీటిలో ‘గీతా ఆర్ట్స్’ పట్టు మూలంగా సుమారు 900 దాకా స్క్రీన్స్ చిరు సిన్మాకీ, 800 దాకా స్క్రీన్స్ బాలయ్య సిన్మాకొస్తాయని అంచనా.
అయితే, ‘శాతకర్ణి’ కన్నా ఒక రోజు ముందే చిరు సిన్మా
రిలీజ్ వల్ల ఆ ఒక్కరోజుకీ, ‘శాతకర్ణి’ సిన్మాకు దక్కాల్సిన స్క్రీన్స్‌లో అధిక భాగం కూడా లభించడం ‘ఖైదీ నం. 150’కి ఎడ్వాంటేజ్ అవుతుంది. అలా ప్రత్యర్థి సిన్మా కన్నా ముందు రావడం వల్ల థియేటర్లన్నీ చేతిలో ఉండి, ఆ ఒక్క రోజులో దాదాపు 7 నుంచి 10 కోట్ల మేర ఓపెనింగ్ కలెక్షన్స్ అదనంగా వస్తాయి. ఆ ఎడ్వాంటేజ్ కోసం ‘ఖైదీ నం. 150’ వ్యూహం వేస్తే, అది లేకుండా రెండు సిన్మాలూ ఒకే రోజు వచ్చి, బాక్సాఫీస్ బలపరీక్షకు నిలబడాలని ‘శాతకర్ణి’ అభిమానులు కోరుకున్నారు. అందుకే, జనవరి 11నే ‘శాతకర్ణి’నీ రిలీజ్ చేసెయ్యమంటూ బాలకృష్ణ ఫ్యాన్స్ ఒత్తిడి చేశారు.
.........................................
నైజామ్‌లో... ఎత్తులు పై ఎత్తులు
సినీ వ్యాపారంలో మొదటి నుంచి నైజామ్ ఏరియాది
ప్రధాన వాటా. ఒకప్పుడు అది చిరంజీవి సినిమాలకు కంచుకోట. తాజా పోటీ వాతావరణంలోనూ మంచి రెవెన్యూ తెచ్చే ఆ ఏరియాపై పట్టు కోసం రెండు వర్గాలూ వ్యూహ ప్రతివ్యూహాలు సాగిస్తున్నాయి. ‘ఖైదీ...’ చిత్ర నిర్మాతలు ఒక అడుగు ముందుకేసి, నైజామ్ ఏరియాలో సినిమాను అమ్మకుండా, అలాగని సొంతంగా కాకుండా, చాలా థియేటర్స్ చేతిలో ఉన్న ‘గ్లోబల్’ డిస్ట్రిబ్యూటర్స్ సునీల్ నారంగ్ ద్వారా డిస్ట్రిబ్యూషన్‌కిచ్చారు. నిజానికి, ‘గ్లోబల్’లో భాగస్వామి అయిన నిర్మాత ఎన్. సుధాకరరెడ్డే ‘శాతకర్ణి’ని ఆ ఏరియాకు కొన్నారు. కానీ, ఇప్పుడు ‘ఖైదీ...’ డిస్ట్రిబ్యూషన్‌కి గ్లోబల్ ఒప్పుకోవడంతో, రెండు సినిమాలకూ హాళ్ళను సర్దుబాటు చేయక తప్పదు. ఆ రకంగా ‘ఖైదీ...’ వ్యూహంతో నైజామ్‌లో ‘శాతకర్ణి’కి హాళ్ళ సంఖ్యలో గండి పడనుంది.
.............................................
ఊరికొక్క థియేటరైనా ఇవ్వండి బాబూ!
ప్రముఖ పంపిణీదారు, థియేటర్ల లీజుదారు కావడంతో,
‘దిల్’ రాజు సినిమాకు మల్టీప్లెక్స్‌ల నుంచి మామూలు థియేటర్ల దాకా తగినన్ని స్క్రీన్స్ దొరుకుతాయి. అయితే, ఎటొచ్చీ ‘హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ లాంటి చిన్న సినిమాలకే పెద్ద తలనొప్పి. థియేటర్లన్నీ ఈ స్టార్ల వార్‌తో నిండిపోవడంతో, ‘పీపుల్స్ స్టార్’ ఆర్. నారాయణమూర్తికి థియేటర్లే లేని పరిస్థితి. ‘‘ఇలా అయితే చిన్న సినిమాలు ఎలా బతుకుతాయి? కనీసం ఊరికొక్క థియేటరైనా ఇవ్వండి బాబూ’’ అని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
..............................................
బిజినెస్ అదుర్స్!
చిరంజీవి హీరోగా, ఆయన కుమారుడే నిర్మాతగా
వస్తున్న ‘ఖైదీ నంబర్ 150’ను 86 డేస్‌లో పూర్తి చేశారు. నిర్మాణ వ్యయం 40 కోట్ల పైమాటే కావచ్చని అంచనా. తొమ్మిదేళ్ళ తరువాత వస్తున్న చిరంజీవి సిన్మా కావడంతో, భారీ క్రేజ్ ఉంది. హక్కులు తీసుకున్నవారిలో ఎక్కువమంది కొత్తవాళ్ళు, రోజువారీ‡ సినీ వ్యాపారంతో సంబంధం లేనివాళ్ళేనని భోగట్టా. గుంటూరు, నెల్లూరు, తూర్పు గోదావరి ఏరియాలు సొంత మనుషులతో రిలీజ్ చేసుకుంటున్న నిర్మాతలు వైజాగ్, సీడెడ్ ప్రాంతాల హక్కుల్ని తమకు అత్యంత సన్నిహితులైన ఆ ప్రాంత రాజకీయ నేతలకూ (గంటా శ్రీనివాసరావు, సి. రామచంద్రయ్య), వారి బంధువులకూ ఇచ్చారట. ఇవి కాక, కర్ణాటక, శాటిలైట్ రైట్స్ (‘మా’టి.వికి రూ. 10.5 నుంచి 12 కోట్లకి) అమ్మారు. అన్నీ కలిపి రూ. 50 కోట్ల పైగా అయింది. ఇక రూ. 25 కోట్ల పైగా విలువైన కృష్ణా, నైజామ్, ఓవర్సీస్– నిర్మాతలే అట్టిపెట్టుకొని, సొంత రిలీజ్ చేస్తున్నారట. అన్నీ చేరి, రూ. 75 కోట్ల పైగా లావాదేవీలు జరిగినట్లు లెక్క.
రికార్డు టైమ్‌లో 85 రోజుల్లో షూటింగ్ పూర్తి అయిన
బాలకృష్ణ చారిత్రక కథా చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి దాదాపు రూ. 40 కోట్ల పైగా వ్యయమైనట్లు భోగట్టా. ఈ క్రేజీ ప్రాజెక్ట్ హక్కులు హాట్‌కేక్స్‌లా అమ్ముడవడంతో, సుమారు రూ. 60 కోట్లకు పైగా వ్యాపారమైంది. అలా ఏకంగా రూ. 20 కోట్ల టేబుల్ ప్రాఫిట్ రావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. హీరోల సొంత సంస్థలు కాక, బయటి నిర్మాత సిన్మాకింత టేబుల్ ప్రాఫిట్ రావడం ఇటీవల లేదని సినీ వర్గాల మాట. శాటిలైట్ రైట్లే రూ.8.5 కోట్లు (‘మా’ టివి) పలికాయి. ఇంకా తమిళ, హిందీ చిత్రాల థియేటరికల్ రైట్స్‌తో అదనపు ఆదాయం వచ్చే ఛాన్సుంది.
................................................
ష్... సెన్సార్ అవుతోంది!
ఇంటిపేరుతో కొత్తగా పెట్టిన ‘కొణిదెల ప్రొడక్షన్స్’ పతాకంపై
రామ్‌చరణ్ నిర్మించిన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం విడుదలకు చాలా ముందే, డిసెంబర్ 29నే సెన్సార్ పూర్తి చేసుకుంది. అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం – సినిమాలో ఫస్టాఫ్ ప్రధానంగా వినోదాత్మకం. ఆడవేషంలో అలీ, బ్రహ్మానందం మధ్య కామెడీ సీన్లు వస్తాయి. సెకండాఫ్‌లో కథలో అసలు ఘట్టం సాగుతుంది. ‘రైతు’పై వచ్చే పాట కన్నీరు పెట్టిస్తుంది. ఆరు పదులు దాటిన వయసులోనూ చిరు నవ యువకుడిలా తయారై చేసిన ఇంటర్వెల్ ఫైట్, 2 పాటలకు డ్యాన్సులు అదిరిపోయాయి. మొత్తం మీద 9 ఏళ్ళు గ్యాప్ తర్వాత, ‘యస్... బాస్ ఈజ్ బ్యాక్’ అని అభిమానులు కేరింతలు కొట్టేలా సినిమా ఉందని సెన్సార్ టాక్. ‘యు/ఏ’ సర్టిఫికెట్ వచ్చిన ఈ సినిమా తుది నిడివి 2 గంటల 27 నిమిషాలు.
‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జనవరి 5న సెన్సార్ జరుపుకొంది.
సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ‘సిన్మా బ్రహ్మాండం సార్! ఇంతలా ఉంటుందని ఊహించలేదు’ అన్నారట. అభిజ్ఞ వర్గాల కథనం ప్రకారం – హీరో పాత్రచిత్రణ, యుద్ధ సన్నివేశాలు, ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వచ్చే ఎపిసోడ్ సూపర్. సినిమా ముగింపు సమయంలో హీరో చెప్పే డైలాగులు, ‘ఇది మన కథ... ప్రతి తెలుగువాడి కథ...’అంటూ నేపథ్యం నుంచి వచ్చే మాటలు సినిమా అయిపోయాక కూడా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధంగా నిలబెట్టేస్తాయి. యుద్ధాలే కాక, కర్తవ్యానికీ, కుటుంబ బంధానికీ మధ్య నలిగిపోయే ఒక చక్రవర్తి కథగా ఎమోషన్ సీన్లూ పండాయి. బుర్రా సాయిమాధవ్ డైలాగ్‌లు, సీతారామశాస్త్రి పాటలు, బాలకృష్ణ డైలాగ్ డెలివరీ – అన్నీ కలిసి, ప్రేక్షకులు మీసం తిప్పేలా ఉందీ సినిమా అని సెన్సార్ టాక్. సెన్సారైన రోజు సాయంత్రానికే పరిశ్రమలో దీనిపై ఒకటే చర్చ. రెండు చోట్ల డైలాగుల్లో చిన్న చిన్న సవరణలతో ‘యు/ఏ’ సర్టిఫికెట్ వచ్చిన ఈ సినిమా తుది నిడివి 2 గంటల 14 నిమిషాలే!
.....................................
అప్పుడూ ఇలాగే... బాక్సాఫీస్ యుద్ధం
సంక్రాంతి సీజన్‌లో థియేటర్ల బరిలో ఇలా చిరంజీవి,
బాలకృష్ణ చిత్రాలు ఢీ అంటే ఢీ అనుకోవడం ఇదే మొదటిసారి కాదు. 1987లో తొలిసారిగా చిరు ‘దొంగమొగుడు’ (జనవరి 9), బాలయ్య ‘భార్గవరాముడు’ (జన. 14) సంక్రాంతి పందెం కోళ్ళయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి దాకా గత 30 ఏళ్ళలో – ఏడుసార్లు ఇలాంటి పోటీ జరిగింది. ‘ఖైదీ నంబర్ 150’ వర్సెస్ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఎనిమిదోసారి జరుగుతున్న పోటాపోటీ. ఈ 30 ఏళ్ళలో ఇద్దరి సినిమాలూ ఒకే తేదీన రిలీజైంది ఒక్క 2001లోనే! అదీ సంక్రాంతికే! ఆ తరువాత మరెప్పుడూ ఒకే తేదీకి వాళ్ళ చిత్రాలు పోటీ పడలేదు. గడచిన 7 సార్లలో ఇప్పటి దాకా 3 సార్లు (‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘లక్ష్మీనరసింహా’ – ఈ మూడూ కూడా 70కి పైగా కేంద్రాల్లో వంద రోజులాడాయి) బాలకృష్ణ పైచేయి సాధించారు. మరో రెండుసార్లు (‘అన్నయ్య’, ‘దొంగమొగుడు’) చిరంజీవిదే అగ్రస్థానం. మిగతా రెండుసార్లు (‘మంచిదొంగ’– ‘ఇన్‌స్పెక్టర్ ప్రతాప్’, ‘హిట్లర్’–‘పెద్దన్నయ్య’) ఇద్దరు హీరోలూ బాక్సాఫీస్ వద్ద సమానంగా నిలిచారు.
.........................................
ఎన్నెన్నో హైలైట్స్... ఎవరికీ అందని అంచనాలు!
‘నచ్చిందే చేస్తా’నంటున్న ఖైదీ నంబర్ 150
⇔ ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న
చిరంజీవి చిత్రంలో అభిమానులకు కన్నులపండువ కోసం చాలా హంగామానే చేస్తున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి ఎన్ని కసరత్తులతో ఏం మాయ చేశారో కానీ, తెరపై కనీసం 20 ఏళ్ళు తగ్గినట్లు కనిపిస్తున్నారు. దీని కోసం దాదాపు ఏడాది పాటు శ్రమించినట్లు సాక్షాత్తూ చిరంజీవే ‘సాక్షి’కి చెప్పారు.
⇔ ఒకప్పుడు ఫైట్లు, డ్యాన్సులకు ఫేమస్ అయిన చిరు
మళ్ళీ ఆ ఊపు తరహా మాస్ పాటలు, బీట్స్‌కు నర్తించినట్లు అభిజ్ఞ వర్గాల భోగట్టా.
⇔ రామ్‌చరణ్ నటించిన ‘మగధీర’, ‘బ్రూస్‌లీ’ చిత్రాల్లో
తండ్రి చిరంజీవి గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తే, ఈసారి తండ్రి కమ్‌బ్యాక్ సినిమాను రామ్‌చరణ్ నిర్మించడమే కాక, ‘అమ్మడు’ పాటలో కొద్ది క్షణాలు కనిపించనున్నారు.
⇔ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ‘ఖైదీ నంబర్ 150’లో
తండ్రి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి, సై్టలిస్ట్‌గా వ్యవహరించారు.
⇔ రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా
షూటింగ్ అంతా హైదరాబాద్ పరిసరాల్లో చేశారు. పాటల కోసం ప్రత్యేకంగా స్లొవేనియా, క్రొయేషియా దేశాలకు వెళ్ళి, చిత్రీకరణ జరిపారు.
⇔∙ఫస్టాఫ్ సరదాగా ఉంటే, సెకండాఫ్‌లో దాదాపు 45 నిమిషాలు
ఎమోషనల్‌గా పీక్‌కు చేరుస్తుందని చిత్ర యూనిట్ కథనం. నీటి కోసం కన్నీరు కార్చే రైతుల వెతల్ని చూపే రామజోగయ్య శాస్త్రి రచన ‘నీరు నీరు నీరు... రైతు కంట నీరు...’ పాట కదిలిస్తుందని అంచనా.
....................................
‘శరణమా... రణమా’ అంటున్న శాతకర్ణి
⇔ తెలుగు జాతి చరిత్ర చెప్పే చారిత్రక కథ కావడం,
ఇలాంటి పాత్రలకు నప్పే హీరో బాలకృష్ణకు 100వ సినిమా కావడం ‘శాతకర్ణి’లో విశేషం.
⇔ తెలుగులో ఎన్టీఆర్ ‘పాండవ వనవాసం’– 1965,
‘శ్రీకృష్ణ విజయం’ –1971లో నటించిన హేమమాలిని 46 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెలుగు తెరపైకి వచ్చారు. తండ్రి ఎన్టీఆర్‌తో నటించిన డ్రీమ్ గర్ల్ ఇప్పుడు కుమారుడు బాలకృష్ణకు తల్లిగా చేశారు.
⇔ చరిత్ర కాబట్టి, ‘బాహుబలి’లా ఊహాలోకపు విహారాల
లాంటివి లేకపోయినా, సినిమాలో 3 యుద్ధ సన్నివేశాలు ఆకర్షణ. కబీర్ బేడీ లాంటి అంతర్జాతీయ నటులూ, టెక్నీషియన్లూ అదనపు ఆకర్షణ.
⇔ ఆకట్టుకొనే హీరో పాత్రచిత్రణతో పాటు, ‘సమయం లేదు
మిత్రమా... శరణమా? రణమా?’, ‘దేశం మీసం తిప్పుదాం!’, ‘దొరికినవాణ్ణి తురుముదాం... దొరకనివాణ్ణి తరుముదాం’ లాంటి మోస్ట్ పాపులర్ డైలాగ్స్ బోలెడున్నాయి. ఈ సినిమాతో పాటు ‘ఖైదీ నంబర్ 150’కి కూడా కొన్ని పవర్‌ఫుల్ డైలాగులు రచయిత బుర్రా సాయిమాధవ్ రాయడం విశేషం.
⇔ మొరాకో, జార్జియాలతో పాటు మన దేశంలో మధ్యప్రదేశ్‌లో
ఇండోర్ సమీపంలోని నర్మదా నదీ తీరంలోని మహేశ్వర్ లాంటి చోట్ల షూటింగ్ జరిపారు. చిలుకూరులో కోటి రూపాయల ఓడ సెట్ వేశారు.
................................................
ఎన్టీఆర్ ఆశ తీర్చిన బాలకృష్ణ
పెద్ద ఎన్టీయార్ గతంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని స్వయంగా
నటిస్తూ, నిర్మించాలనుకొన్నారు. 1993 ప్రాంతంలో రచయితలతో చర్చించి, స్క్రిప్ట్ కూడా సిద్ధం చేయించారు. ఈ సుప్రసిద్ధ తెలుగు శాతవాహన చక్రవర్తి జీవితం మొత్తాన్నీ సినిమాగా తెరపై చూపాలని ఆయన భావించారు. గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడైన నవ యువకుడు వాసిష్టీపుత్ర పులుమావి పాత్రను హీరో వెంకటేశ్‌తో వేయించాలని కూడా భావించారు. గెటప్, కాస్ట్యూమ్ స్కెచ్‌లూ వేయించారు. కానీ, అనివార్య కారణాల వల్ల అప్పట్లో అది తెరకెక్కలేదు. అప్పుడు తెరకెక్కని ఆ కథాంశం 23 ఏళ్ళ తర్వాత ఇప్పుడు క్రిష్ మనసులో ఆలోచనగా బాలకృష్ణతో రావడం యాదృచ్ఛికం.
...................................
తప్పని తిప్పలు... మార్పులు!
⇔ ‘ఖైదీ నంబర్ 150’లో ఐటమ్ సాంగ్ కోసం ముందుగా
క్యాథరిన్ థెరిసాను తీసుకున్నారు. అయితే, చిరు కుమార్తె సై్టలిస్ట్ అయిన సుష్మితతో ఈ చిత్రంలో కాస్ట్యూమ్స్ విషయంలో సెట్‌లో తలెత్తిన పేచీతో ఆ అమ్మాయిని పక్కకు తప్పించారు. రాయ్ లక్ష్మితో ఆ పాట చిత్రీకరించారు.
⇔ ‘ఖైదీ..’కీ, ‘శాతకర్ణి’కీ – రెంటికీ మొదట మ్యూజిక్ డైరెక్టర్
దేవిశ్రీ ప్రసాదే! అయితే, తగినంత సమయం కేటాయించడం లేదనే కారణంతో, దేవిశ్రీ స్థానంలో చిరంతన్ భట్‌ను ప్రవేశపెట్టారు.
...........................................
‘రుద్రమదేవి’కి నై..! ‘శాతకర్ణి’కి మాత్రం సై!
తెలుగు జాతి చరిత్రకు సంబంధించిన కథాంశం కావడంతో,
‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి అండగా నిలిచేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలూ ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ చిత్రానికి వినోదపు పన్ను నుంచి మినహాయించగా, ఏపీ ప్రభుత్వం ఆ బాటలోనే ఉంది. వినోదపు పన్ను కట్టనవసరం లేకపోవడంతో, సాధారణంగా అయితే ప్రేక్షకుడికి టికెట్ రేటు తగ్గాలి. అయితే, ఇలాంటి చారిత్రక చిత్రాలు నిర్మించేవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, టికెట్ రేట్ మామూలుగానే ఉంచేసి, పన్ను మినహాయింపు లాభాన్ని నిర్మాతలకు అందజేయాలని భావిస్తున్నారు. దాంతో, సినిమాకు వచ్చే వసూళ్ళలో ఆ మేరకు (దాదాపు 15 శాతం) నిర్మాతకు లాభిస్తుంది. వచ్చిన నికర వసూళ్ళు (షేర్) అదనంగా 7 నుంచి 8 శాతం దాకా పెరుగుతాయని వ్యాపార వర్గాల అంచనా.
వరంగల్ నుంచి తెలుగు ప్రాంతాన్ని అంతటినీ పాలించిన
కాకతీయ సామ్రాజ్ఞి ‘రుద్రమదేవి’ కథను అదే పేరుతో దర్శక – నిర్మాత గుణశేఖర్ ఆ మధ్య సినిమాగా తీశారు. అయితే, ఆ తెలుగు రాణి కథకు తెలంగాణ ప్రభుత్వమే తప్ప, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండదండగా నిలబడ లేదు. దాదాపు 15 నెలల క్రితం వచ్చిన ఆ చిత్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినోదపు పన్ను మినహాయింపు నిచ్చారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ఇదుగో.. అదుగో’ అని తిప్పించుకొని, ఆఖరికి మొండిచెయ్యి చూపించారు. ఈసారి తన బావమరిది – వియ్యంకుడైన బాలకృష్ణ నటించిన ‘శాతకర్ణి’ సినిమాకు రిలీజ్‌కు ముందే పన్ను మినహాయింపునకు సిద్ధమవుతున్నారు. అన్నట్లు అప్పట్లో ఈ పన్ను మినహాయింపు లాభమంతా ఎప్పటిలా ప్రేక్షకులకూ, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకూ కాకుండా చరిత్రను తెరకెక్కించిన నిర్మాతలకే దక్కేలా కేసీఆర్ జీవో జారీ చేశారు. కానీ, ‘రుద్రమదేవి’కి దక్కాల్సిన ఆ ప్రోత్సాహం తాలూకు సొమ్మంతా ఆ చిత్రాన్ని పంపిణీ చేసిన పేరున్న తెలంగాణ చిత్ర నిర్మాత – డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ దగ్గరే ఉండిపోవడం విచిత్రం. పరిశ్రమ వర్గీయులు మధ్యవర్తిత్వం చేసినా, ప్రభుత్వమిచ్చిన ఆ ప్రోత్సాహం అసలు నిర్మాతకు చేరకనేపోవడం విషాదం.
...............................................
పోటీపడుతున్న అభిమానం
అతిథి పాత్రపోషణల్ని కలిపితే, సినిమాల సంఖ్య
పెరిగినా, చిరంజీవి, బాలకృష్ణలు ఈ తాజా చిత్రాల్ని 150... 100... సినిమాలుగానే ప్రకటిస్తూ వచ్చారు. అలా ఇవి ‘మేజికల్ ఫిగర్’ సినిమాలు కావడంతో, చిరు, బాలయ్య అభిమానులు కూడా వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకే, దేశమంతా పుణ్యక్షేత్రాల్లో పూజల దగ్గర నుంచి తమ హీరోల ప్రత్యేక పుస్తకాల విడుదల దాకా అనేకం చేస్తున్నారు. బాలకృష్ణ అభిమానులు తమ హీరో చిత్ర అఖండ విజయం కోసం గత నవంబర్ ఆఖరులో కార్తీక సోమవారానికి 1116 శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించారు. 3 వ్యాన్లలో తిరుగుతూ, సుమారు 9 రాష్ట్రాల్లో 39 రోజుల పాటు, 95 పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసి, ‘భారతదేశ శతపుణ్యక్షేత్ర జైత్రయాత్ర’ చేశారు.
చిరు అభిమానులు తామేం తక్కువంటూ అన్నయ్య రీఎంట్రీ
సిన్మా విజయం కోసం... పుణ్యక్షేత్రాల సందర్శనకు దిగారు. కాశీ విశ్వనాథుడికీ, విశాలాక్షికీ, కొల్హాపూర్‌లో మహాలక్ష్మి అమ్మవారికీ పూజలు చేశారు.
బాలకృష్ణ ఫ్యాన్స్ ఏమో వంద సినిమాల లోగోలు, స్టిల్స్‌తో
‘ఎన్.బి.కె. 100 – నెవర్ బిఫోర్’ అంటూ ప్రత్యేక పుస్తకం, క్యాలెండర్లు, డైరీలు ప్రింట్ చేసి, ఆడియో రిలీజ్ వేదికపై విడుదల చేశారు. ఇక, చిరు వర్గం అండతో, ఆయన సినిమా జీవితంపైనా కొన్ని పుస్తకాలు రిలీజ్‌కు ముందే విడుదలకు సిద్ధమవుతున్నాయి. బాలకృష్ణ అభిమానులు ప్రొద్దుటూరులోని ఒక థియేటర్‌లో ఆయన నటించిన 100 సినిమాల్నీ రోజుకొకటి చొప్పున ప్రదర్శిస్తూ, శతచిత్రోత్సవం చేస్తున్నారు. చరిత్రలో శాతకర్ణి ప్రవేశపెట్టిన ‘గుడీపడవా’ (గుడిసెపై జెండా) పండుగకు గుర్తుగా 100 థియేటర్లపై శాతకర్ణి జెండా ఎగరేసేందుకు సిద్ధమయ్యారు.
మరోపక్క ‘అన్నయ్య’ రీ–ఎంట్రీకి తగ్గట్లు కర్ణాటకలోని
చిరు వీరాభిమాని ఒకరు ప్రత్యేకంగా పాట రాయించుకొని, ప్రముఖ గాయకుడు దీపూతో పాడించి, ‘వచ్చాడు వచ్చాడు చిరంజీవి వచ్చాడు...’ అంటూ దాన్ని ఆల్బమ్‌గా రిలీజ్ చేశారు. ఇక, సిన్మా రిలీజ్ రోజు హంగామాకైతే ఇరు వర్గాల లక్షలాది అభిమానులూ సర్వసన్నద్ధమవుతున్నారు.
.........................................
బరిలో... మిగతా పందెం కోళ్ళు!
గత ఏడాది సంక్రాంతికి ఏకంగా 4 తెలుగు సినిమాలు
వచ్చాయి. ఈ సారీ నాలుగు వస్తున్నాయి. చిరు, బాలయ్య సినిమాల్ని పక్కనపెడితే, శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్‌లతో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘శతమానం భవతి’ సరిగ్గా సంక్రాంతి రోజున జనవరి 14న రిలీజ్ కానుంది. అలాగే, ఆర్. నారాయణమూర్తి చాలా కాలం తర్వాత బయటి నిర్మాతలకు పనిచేసిన ‘హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ కూడా జనవరి 14నే వస్తోంది.
‘శతమానం భవతి’ పూర్తిగా కుటుంబకథా చిత్రం ఫీల్‌తో
సంక్రాంతి పండుగ ఫీల్ తెస్తుంటే, నల్లధనంపై పోరాటమనే లేటెస్ట్ బర్నింగ్ టాపిక్ మీద వస్తున్న ‘హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ ఆలోచింపజేస్తోంది. వరుసగా వచ్చే సెలవులు, ఇంటిల్లపాదీ సినిమాలు, షికార్లతో ఆనందించాలనుకునే పండుగ వాతావరణం ఒకటికి, నాలుగు సినిమాల్ని బాక్సాఫీస్ దగ్గర సునాయాసంగా గెలుపునిస్తుంది. అదే ఇప్పుడీ పోటాపోటీ రిలీజ్‌లకు పెద్ద ఊపిరి. సామాన్య ప్రేక్షక జనం కూడా ఇప్పుడు చెబుతున్నది ఒకే మాట .. ‘మాకు నచ్చిందే చూస్తాం... నచ్చితేనే చూస్తాం...’ మరి, ఈసారి సినిమా బరిలో సంక్రాంతి మొనగాడెవరో? జస్ట్ మరొక్క మూడు రోజులు... లెటజ్ వెయిట్ అండ్ సీ!
– డాక్టర్ రెంటాల జయదేవ
...........................................
|
డియర్ మేరీ
2 months ago