జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, March 10, 2016

ఎందరో మహానుభావుల కృషే కారణం.... (తెలుగు సినిమా జన్మదినోత్సవO)


ఎందరో మహానుభావుల కృషే కారణం 













‘‘ఎందరో మహానుభావుల కృషి వల్ల మనమిలా తెలుగు సినిమా తల్లి పండుగను ఆనందంగా జరుపుకోగలుగుతున్నాం. ఇప్పటి తరం కూడా ఈ వేడుకను జరపడం సంతోషకరమ’న్నారు అలనాటి ప్రముఖ నటి జమున.

 తొలి తెలుగు సినిమా ‘భక్తప్రహ్లాద’ ప్రేక్షకుల ముందుకొచ్చి ఈ నెల ఆరో తేదీకి 84 సంవత్సరాలయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తెలుగు సినిమా జన్మదినోత్సవాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ జరుపుకొంది. అందరూ కలిసి కేక్‌ను కోసి ఆనందాన్ని పంచుకున్నారు. 

అనంతరం జమున మాట్లాడుతూ ‘‘నిర్మాతలందరూ గర్వించదగ్గ నిర్మాత కె.రాఘవ. నేను నటిని కావడానికి కారణం ‘కీలుగుర్రం’. హెచ్‌.ఎం.రెడ్డి, కె.వి.రెడ్డి, తాతినేని ప్రకాశరావు వంటి ఎందరో ప్రముఖ దర్శకులు మమ్మల్ని తీర్చిదిద్దారు. ఇది చాలా అదృష్టం. ఇప్పటి తరంలోనూ గొప్ప దర్శకులున్నారు. వీరంతా వారి బాటలో నడుస్తూ ఇప్పడున్న సాంకేతికతను ఉపయోగించుకుని మరింత పురోగతిని సాధించాల’’న్నారు. 

తొలి తరం నటి కృష్ణవేణి మాట్లాడుతూ ‘‘ 1935లో సి.పుల్లయ్య రూపొందించిన ‘సతీ అనసూయ’లో నటించా. అందులో నా పారితోషికం ఆరు వందల రూపాయలు. ఆ తర్వాత నటిగా ఎన్నో చిత్రాల్లో నటించాను. పలు చిత్రాలు నిర్మించాను. అయితే నేను నిర్మించిన ‘కీలుగుర్రం’లో రాక్షసి వేషం వేయమని అంజలీదేవిని అడిగితే నేను పాట పాడితే వేస్తానని షరతు పెట్టి నటించింది. ఆ సినిమా ఆరోజుల్లోనే రూ.40 లక్షలు రాబట్టింది. అలనాటి జ్ఞాపకాలను ఈ వేడుకలో పంచుకోవడం ఆనందంగా ఉంద’’న్నారు. 

కోడి రామకృష్ణ మాట్లాడుతూ ‘‘మనమిలా ఈ వేడుక చేసుకోవడం ఓ జీవితసాఫల్యంగా భావిస్తున్నాను. ఈ వేడుకను మరింత ఘనంగా జరపలేదని అనుకోవద్దు. ఎందుకంటే తెలుగు సినిమా తల్లికి నిత్యమూ పండుగే. ఆనాటి మహానుభావులు సాధించినదానితో పోల్చుకుంటే మనం చేయాల్సింది ఇంకా చాలా ఉందనిపిస్తుంది. నాకు సినిమా భిక్ష పెట్టింది రాఘవగారే’’అని అన్నారు. 

‘‘ఈ వేడుకకు కారణమైన ఎందరో మహానుభావులను తలచుకుంటుంటే శరీరం పులకరించిపోతోంది. అనిర్వచనీయ అనుభూతిని పొందుతున్నామ’’న్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. 

రామ్‌ రావిపల్లి చెబుతూ ‘‘తొలి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’. హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1931 సెప్టెంబరు 15న పుట్టిందనే ప్రచారం ఉంది. తెలుగు సినిమా పుట్టింది 1932 ఫిబ్రవరి 6 అనీ, దర్శకుడు హెచ్‌.ఎం.రెడ్డి అనీ, ఆ సినిమా తొలి టికెట్‌, పోస్టర్‌, కలెక్షన్‌ నివేదికలతో సహా నిరూపించిన రెంటాల జయదేవ్‌ కారణంగానే ఇప్పడీ వేడుకను ఈ రోజున జరుపుకున్నామ’’న్నారు. 

ఈ వేదికపై తొలితరం సినిమా ప్రముఖుల్ని సన్మానించారు. కార్యక్రమంలో తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి, గీతాంజలి, నిర్మాత కె.రాఘవ, కె.ఎస్‌.రావు, రావి కొండలరావు, కాకరాల, రెంటాల జయదేవ్‌, అచ్చిరెడ్డి, కాశీ విశ్వనాథ్‌, సాగర్‌, రామసత్యనారాయణ, బాబ్జీ, సాయి వెంక‌ట్‌ తదితరులు పాల్గొన్నారు.






















(Published in 'Eenadu' daily, Cinema Page, 8th Feb 2016, Monday)
......................................