జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, August 14, 2016

దేవిశ్రీ ప్రసాద్ మోగించట్లేదు!

బాలకృష్ణ వందో చిత్రానికి  మ్యూజిక్ 'కంచె'

ఇవాళ తెలుగు సినీ రంగంలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డెరైక్టర్ అంటే - దేవిశ్రీ ప్రసాద్. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, చారిత్రక కథా చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ నుంచి దేవిశ్రీ తప్పుకోవడం! చేతి నిండా సినిమాలు, మరో విదేశీ పర్యటన కూడా ఉండడంతో, ఈ చారిత్రక కథాచిత్రానికి దేవిశ్రీ తగినంత టైమ్ కేటాయించలేకపోతున్నారట!

ఆ ముగ్గురిలో... కొత్త మ్యూజిక్ డెరైక్టర్ ఎవరు?
దర్శకుడు క్రిష్ ఇప్పుడు మరో సంగీత దర్శకుడి అన్వేషణలో పడ్డారు. గతంలో ‘శ్రీరామరాజ్యం’కి సంగీతం అందించిన ఇళయరాజా, భక్తిరస ప్రధానమైన ‘పాండు రంగడు’తో పాటు తాజా ఇండస్ట్రీ సెన్సేషన్ ‘బాహుబలి’కి బాణీలిస్తున్న కీరవాణి - ఇలా కొన్ని పేర్లు కృష్ణానగర్‌లో ప్రచారంలో ఉన్నాయి.
‘సాక్షి’ సేకరించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం క్రిష్ బృందం అసలు ఇళయరాజాను ఇంతదాకా సంప్రతించనే లేదట! ఇక, గతంలో క్రిష్ ‘వేదం’కు సంగీతం అందించిన కీరవాణి విషయానికి వస్తే ప్రస్తుతం చేస్తున్నవి ‘బాహుబలి 2’, ‘ఓం నమో వెంకటేశాయ’ - రెండే. పైగా పౌరాణికం, జానపదం, సాంఘికం - ఇలా అన్ని తరహా సినిమాలకూ బాణీలు కట్టిన అనుభవం ఆయనకుంది. కానీ, ‘వేదం’ తరువాత మళ్ళీ కీరవాణి కాంబినేషన్‌ను రిపీట్ చేయని క్రిష్ ఆయన వైపు మొగ్గుతారా అన్నది సందేహమే. అన్నట్లు, క్రిష్ పెళ్ళికి దర్శకుడు రాజమౌళి బృందం వచ్చినా కీరవాణి ఏ బిజీ వల్లో కానీ హాజరు కాలేదు.

దేవిశ్రీతో తేడా ఎక్కడొచ్చినట్లు?
అసలు ఈ భారీ హిస్టారికల్ సినిమా అనుకోగానే ఇళయరాజా, కీర వాణి సహా పలువురి పేర్లు చర్చకు వచ్చాయట. క్రిష్ లేటెస్ట్ సెన్సేషన్ దేవిశ్రీ వైపే మొగ్గారు. దేవిశ్రీ కూడా మొదట్లో ఉత్సాహపడ్డారు. కానీ, ఆ తరువాత వరుసగా అంగీకరించిన అనేక ప్రాజెక్ట్స్ మధ్య రెగ్యులర్ చిత్రా లకు భిన్నమైన ఈప్రెస్టీజియస్ ఛాన్స్‌కు దేవిశ్రీ ఎందుకనో తగినంత సమయం కేటాయించట్లేదని వినికిడి. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న తొలిసారిగా ఈ చిత్రం డిజిటల్ మోషన్ పిక్చర్ రిలీజ్ చేశారు. దానికి కూడా దేవిశ్రీ తగినంత సమయం కేటాయించ లేదని వినికిడి. అప్పటికి ఓ డిజిటల్ ప్రచార మాధ్యమ సంస్థ చేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజి క్‌తోనే పోస్టర్ రిలీజ్ కానిచ్చేశారు. ఆ తరువాత దేవిశ్రీ కొట్టి(ం)చ్చిన నేపథ్య సంగీతం అంతంత మాత్రంగా ఉండడంతో, ఇప్పటి దాకా ఆ డిజిటల్ మోషన్ పోస్టర్‌ను చిత్రయూనిట్ అధికారికంగా రిలీజ్ చేయలేక పోయింది.

ఒక పక్కన సినిమా షూటింగ్ శరవేగంతో జరిగిపోతున్నా, ఇప్పటి వరకు ఆయన రెండు పాటల కోసం 4 ట్యూన్లే చేశారట. అవి యూనిట్‌కు అంత తృప్తికరంగా అనిపించలేదు. కానీ, కొత్త ట్యూన్‌లకు కూర్చొనేందుకు దేవిశ్రీ సమయం ఇవ్వలేకపోతున్నారు. ఆ మధ్య దేవిశ్రీ తన తండ్రి సత్యమూర్తి జయంతి జరుపుతూ ఆయనతో పనిచేసిన హీరో లందరి నుంచి వీడియోలో అభిప్రాయం తీసుకున్నారట. కానీ, అప్పట్లో మొరాకోలో షూటింగ్‌లో ఉన్న బాలకృష్ణ గుర్రంపైనుంచిపడి ప్రమాదం పాలై, ఆస్పత్రి హడావిడిలో వీడియో బైట్ ఇవ్వలేకపోయారట. అది కూడా దేవిశ్రీలో అసంతృప్తి పెంచిందా అని కృష్ణానగర్‌లో ఒకటే చర్చ.

చారిత్రక చిత్రానికి చిరంతన సంగీతం!
 గత ఏడాది తన ‘కంచె’కు మ్యూజిక్ చేసి, అవార్డులూ రివార్డులూ పొందిన బొంబాయి మ్యూజిక్ డెరైక్టర్ చిరంతన్‌భట్ వైపు క్రిష్ చూపు ఉందని ‘సాక్షి’కి అందిన సమాచారం. ఇప్పటికే మూడు సిచ్యుయేషన్స్ ఆయనకు క్రిష్ చెప్పారట. అందులో ఒక దానికి ఇప్పటికే చిరంతన్ ట్యూన్ కట్టేశారనీ, ఆ ట్యూన్ బాగుందనీ వినికిడి. మొన్న ఆదివారమే పెళ్ళి చేసుకొని, ప్రస్తుతం విహారయాత్రలో ఉన్న క్రిష్ తిరిగి వచ్చే లోగా చిరంతన్ మరికొన్ని ట్యూన్లు సిద్ధం చేసే సూచనలున్నాయి. హనీమూన్ నుంచి రాగానే ఆ ట్యూన్లు విని, అధికారికంగా కొత్త మ్యూజిక్ డెరైక్టర్‌ను క్రిష్ ఎనౌన్స్ చేస్తారు. ఏమైనా, చాలారోజులకొస్తున్న ఓ చారిత్రకచిత్రానికి సంగీతమిచ్చే అరుదైన ఛాన్స్ దేవిశ్రీప్రసాద్ వదిలేసుకున్నట్లే!

- రెంటాల జయదేవ

.........................

ఫ్యామిలీతో... నేను... శైలజ... ( ‘నేను... శైలజ’ మూవీ రివ్యూ)

ఫ్యామిలీతో... నేను... శైలజ...

చిత్రం: ‘నేను... శైలజ’
తారాగణం:  రామ్, కీర్తీ సురేశ్, సత్యరాజ్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కెమేరా: సమీర్‌రెడ్డి
కళ:  ఏ.ఎస్. ప్రకాష్
ఎడిటింగ్:  శ్రీకర్‌ప్రసాద్
నిర్మాత: ‘స్రవంతి’ రవికిశోర్
రచన - దర్శకత్వం: కిశోర్ తిరుమల

లైఫ్‌లో చాలా ఈజీ - ప్రేమలో పడడం. కానీ, చాలా కష్టం - 
ఆ అమ్మాయికి ఆ మాట చెప్పడం!’ ‘నేను... శైలజ’లో హీరో 
ఓ సందర్భంలో కాస్త అటూ ఇటుగా ఇదే అర్థమొచ్చేలా డైలాగ్ 
చెబుతాడు. సినిమా కూడా అంతే! ప్రేమకథ చెప్పడం ఈజీ.
 కానీ, దాన్ని తెరపై అందరికీ నచ్చేలా చెప్పడం చాలా కష్టం. 
మంచి హిట్ కోసం చూస్తున్న హీరో రామ్, మంచి చిత్రాలను
 అందించడంలో ముందుండే నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ 
ఈ సారి అలాంటి ప్రేమకథాచిత్రాన్ని తలకెత్తుకున్నారు.    

ఇది ‘హరి’ (రామ్) అనేవాడి ప్రేమ కథ. హరి, అతని 
సోదరి కీర్తి - ఇద్దరూ కవలలు. ఎవరు పెద్దో, ఎవరు 
చిన్నో తెలీదు కాబట్టి, ‘అక్కయ్యా’ అని అతను,
 ‘అన్నయ్యా’ అని ఆమె పిలుచుకొనేంత క్లోజ్. వాళ్ళ 
అమ్మా నాన్న (నరేశ్, ప్రగతి) పిల్లలను ప్రేమగా పెంచే
 టైప్. క్లబ్‌లో డీజేగా పనిచేస్తున్న హీరో చిన్నప్పటి 
నుంచి చాలామందికి ఐ లవ్‌యూ చెప్పి, నో 
అనిపించుకుం టాడు. చివరకు యాడ్ ఏజన్సీలో 
పనిచేస్తున్న శైలజ (కీర్తి సురేశ్) అనే అమ్మాయితో కనెక్ట్ అవుతాడు.

చిన్నప్పుడు తాను ఆరాధించి, విడిపోయిన శైలూయే ఈ శైలజ
 అని గ్రహిస్తాడు. ఆ అమ్మాయీ అతణ్ణి ప్రేమిస్తుంది.
 అతనే చిన్నప్పటి తన ఉంగరం ఫ్రెండ్ అని గుర్తిస్తుంది.
 తీరా హీరో వాళ్ళ ప్రేమ కథ ఒక కొలిక్కి వచ్చే టైమ్‌కి, 
ఆ అమ్మాయికి అయిన సంబంధం కుదురుస్తారు 
అమ్మా నాన్న. ‘ఐ లవ్ యు.. బట్ అయామ్ 
నాట్ ఇన్ లవ్ విత్ యు’ అనేసి హీరోయిన్ 
వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్
 హీరోయిన్ అసలు కథలోకి వెళితే - ఆమె నాన్న
 శ్రీనివాసరావు (సత్యరాజ్). పిల్లల బంగారు భవిత
 కోసం కాంట్రాక్టులంటూ దేశాలు పట్టి అతను వెళితే, 
అమ్మ (రోహిణి) హీరోయిన్‌నీ, ఆమె అన్న (ప్రిన్స్)నీ
 జాగ్రత్తగా పెంచుతుంది.

దాంతో, పిల్లల పట్ల ప్రేమ ఉన్నా చెప్పని తండ్రికీ, 
తన మనసులోని భావాల్ని బాహాటంగా వ్యక్తం చేయలేని 
కూతురిగా హీరోయిన్‌కూ మధ్య అంతరం పెరిగిపోతుంది. 
మరోపక్క మాట పట్టింపుతో పాతికేళ్ళ క్రితం శ్రీనివాసరావు
 తన తండ్రికీ, చెల్లికీ దూరమవుతాడు. తీరా చెల్లెలే వచ్చి 
తన కొడుక్కి (చైతన్య కృష్ణ), హీరోయిన్‌ని ఇచ్చి చేసి, 
కుటుంబాలు దగ్గరవుదామంటుంది. ఈ ఫ్యామిలీ ట్విస్ట్
 వల్లే హీరో యిన్ దూరమైందని గ్రహించిన హీరోకు- హీరోయిన్ అన్న,
 తన అక్క ప్రేమించుకుంటున్నారని తెలుస్తుంది.

ఇంకేం... పెళ్ళి కానున్న హీరోయిన్ ఇంటికి వెళతాడు. 
అక్కడ హీరో ఏం చేశాడన్నది మిగతా సినిమా.  
 ఎక్కువగా మాస్ చిత్రాల్లో హుషారుగా కనిపించే రామ్ 
ఈ హరి పాత్ర కోసం నియంత్రణలోకొచ్చారు. ఫస్టాఫ్‌లో
 అక్కడక్కడ పవన్ కల్యాణ్ శైలి తొంగి చూసినా, 
తరువాత కుదురుకున్నారు. హీరోయిన్ కీర్తీ సురేశ్
 తెలుగుకు కొత్త. కాబట్టి, చూడగానే గుర్తుపట్టడం
 కానీ, గుర్తుపెట్టుకొనే నటన ఆశించడం కానీ 
అత్యాశ. హీరోయిన్ తండ్రి పాత్రలో సత్యరాజ్‌కు
 డైలాగులు తక్కువ. ముఖంలోనే చూపాల్సిన 
హావభావాలెక్కువ. రోహిణి, నరేశ్, ప్రగతి లాంటి 
అనుభవజ్ఞులు ఎలాగూ ఉన్నారు. బాల తారలతో 
బాగా నటింపజేశారు.

దర్శక, రచయిత తిరుమల కిశోర్ డైలాగుల్లో 
రచయితగా తన బలాన్ని మరోసారి చూపించారు.
 కొన్ని డైలాగులు నవ్విస్తాయి. కొన్ని గుర్తుండిపోతాయి.
 ‘ఎరేంజ్డ్ మ్యారేజ్ అంటే... సిస్టమ్‌లో సినిమా చూడడం 
లాంటిది. లవ్ మ్యారేజ్ అంటే థియేటర్‌లో సినిమా
 చూడడం లాంటిది. సినిమా ఒకటే అయినా, ఫీల్‌లో
 తేడా ఉంటుంది’ లాంటివి యూత్‌కు నచ్చుతాయి. 
ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ పాటలు, సమీర్‌రెడ్డి
 సినిమాటోగ్రఫీ కలిసొచ్చే అంశాలు. దేవిశ్రీ తరహా 
క్లబ్ గీతం ‘నైట్ ఈజ్ స్టిల్ యంగ్...’ (రచన సాగర్)
 సరదాగా అనిపిస్తుంది.

‘ఇఫ్ యు గో టు హెల్ యముడేమో థ్రిల్’ లాంటి
 ఎక్స్‌ప్రెషన్స్ కొత్తనిపిస్తాయి. నేపథ్యసంగీతం కొన్ని
 సీన్లకు ఉత్తేజమిచ్చి, సెకండాఫ్‌లో ఒక దశ దాటాక
 పాత రికార్డేదో పదేపదే విన్నట్లుంది. ఫస్టాఫ్ 
అందమైన ప్రేమ క్షణాలతో, యూత్‌ఫుల్‌గా 
అనిపిస్తూ, చిరునవ్వులు విరబూయిస్తూ 
సాగుతుంది. కీలక మలుపు తిరిగిన హీరో 
హీరోయిన్ల ప్రేమకథకు సెకండాఫ్‌లో కన్‌క్లూజన్
 చెప్పే క్రమంలో ‘మనసంతా నువ్వే’, ‘నువ్వే నువ్వే’, 
‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ దాకా 
సినిమాలు, వాటి ఫీల్ గుర్తుకొస్తాయి. నిజానికిది
 రెండుంబావు గంటల పైచిలుకు వ్యవధి సినిమానే. 
కానీ, సెంటిమెంట్ సీన్ల బరువుతో సెకండాఫ్ 
భారంగా గడుస్తుంది.

అయితే, క్లైమాక్స్‌కు ముందు హీరోతో సత్యరాజ్
 మాటలు, సత్యరాజ్‌తో హీరోయిన్ మాట్లాడే మాటలు
 కీలకం. అలాంటి ఘట్టాలు కొన్ని ఉంటే, సినిమా పట్టు
 పెరిగేది. ప్రేమలో విఫలమైన రౌడీగా మహర్షి పాత్రను 
విలన్ ప్రదీప్ రావత్‌తో వేయించడం వెరైటీ. ఒకప్పుడు
 స్వర్గీయ శ్రీహరికి నప్పే ఈ పాత్రను ఇంకా
 వాడుకోగలిగితే, కామెడీ కలిసొచ్చేది.

ఆల్రెడీ పెళ్ళి కుదిరిన హీరోయిన్. ఆమెను ప్రేమిం చిన
హీరో. హీరోయిన్ ఇంటికే హీరో వచ్చి, ఆమె ఇంట్లో వాళ్ళను
 ఇంప్రెస్ చేసి, తమ ప్రేమని పెళ్ళిపీటలకెక్కించ డం - 
ఈ బాక్సాఫీస్ ఫార్ములా మనకు కామనే. 
‘నేను శైలజ’ కున్న బలమూ, బలహీనత కూడా అదే! 
అందుకే, ఒక ప్రముఖ సినీ రచయిత ఆ మధ్య 
ఆంతరంగికంగా అన్నట్లు, మన వరకు ‘దిల్‌వాలే 
దుల్హనియా’ ఒకసారి కాదు... ‘బార్.. బార్...
 లే జాయేంగే’! ఈ ఫ్యామిలీ ఫిల్మ్ దానికి
 లేటెస్ట్ ఎగ్జాంపుల్.

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' Telugu daily, 2nd Jan 2016, Saturday)
....................................................

ప్రేమ, కామెడీ జత కలిసే? ('జత కలిసే' మూవీ రివ్యూ)

ప్రేమ, కామెడీ జత కలిసే?

చిత్రం : 'జత కలిసే'
తారాగణం : అశ్విన్ బాబు, తేజస్వి
సంగీతం : ఎం.సి.విక్కీ, సాయి కార్తీక్
కెమేరా : జగదీశ్
ఎడిటింగ్ : కార్తీక్ శ్రీనివాస్
నిర్మాతలు : నరేశ్ రావూరి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రాకేశ్ శశి

ప్రయాణంలో పదనిసలు తరహా రోడ్ జర్నీ కథలు తెరపై సుపరిచితమే. 
ఆ బ్యాక్‌డ్రాప్ తీసుకొని, ప్రేమ, పెళ్ళి, జీవితాశయం లాంటి అంశాలను 
కలగలిపి కథ అల్లుకుంటే? ఈ ఆలోచనతో చేసిన యత్నం- ‘జత కలిసే’.

 అమెరికాలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ నడుపుతుంటాడు ఋషి (అశ్విన్ బాబు). 
అతను తన స్నేహితుడి పెళ్ళి కోసం వైజాగ్ వస్తాడు. తీరా అక్కడ
 పెళ్ళికొడుకుతో తాగుడు పందెం కట్టి, ఆ పెళ్ళి ఆగిపోవడానికి 
కారణమవు తారు - హీరో, అతని ఫ్రెండ్స్. హైదరాబాద్‌లో 
అమెరికా తిరుగు ఫ్లైట్ ఎక్కడానికి వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు
 ట్యాక్సీలో బయలుదేరతాడు హీరో.

వైజాగ్‌లోనే సూర్య (సూర్య) దంపతుల కూతురు తేజస్వి
 అలియాస్ పింకీ (తేజస్వి). ఐ.ఏ.ఎస్. ఇంటర్వ్యూ కోసం 
ఈ హీరోయిన్ కూడా హీరోతో ఒకే ట్యాక్సీలో హైదరాబాద్‌కు
 ప్రయాణించాల్సి వస్తుంది. తన స్నేహితురాలి పెళ్ళి 
చెడిపోయింది తాగుబోతులైన హీరో బృందం వల్లేనని
 గుర్తించిన హీరోయిన్ వాళ్ళకు బుద్ధిచెప్పాలని 
రంగంలోకి దిగుతుంది.

కలసి ప్రయాణిస్తున్న హీరో గారికి తెలియకుండానే, 
ఎఫ్.ఎం. రేడియో, ఫేస్‌బుక్, యూ ట్యూబ్ లాంటి 
వాటిని ఆశ్రయించి, హీరో బ్యాచ్ గురించి గబ్బు
 రేపుతుంది. ఈ లోగా ఒకటీ అరా పాటలు... 
హీరో హీరోయిన్ల లవ్ సిగ్నల్స్... హీరోయిన్ మంచితనం
 చూపే ఘట్టాలు వస్తాయి. ఇంతలో ఆ అమ్మాయే
 తమపై దుమారం రేపుతోందని హీరో కనిపెడతాడు.
 అక్కడికి ఇంటర్వెల్.  

సెకండాఫ్ మొదలయ్యాక తాను మంచివాడినేనన్న
 సంగతి హీరోయిన్‌కు అర్థమయ్యేలా చేస్తాడు హీరో. 
ఒక దశలో హీరోయిన్ అక్క తన భర్తతో పొసగక,
బెంగుళూరులో ఆత్మహత్య చేసుకోబోతుంటే, ‘స్వీట్ మెమొరీస్’
 సీడీ చూడమంటూ ఫోన్‌లోనే చెప్పి, ఫ్యామిలీ కౌన్సెలర్ 
అవతారమూ ఎత్తుతాడు. ఆ తరువాత ఏమైంది?
 హీరో, హీరోయిన్ల మధ్య మనస్పర్థలు ఏమయ్యాయి 
అన్నది మిగతా సినిమా. 

నట-దర్శకుడు ఓంకార్  సోదరుడు అశ్విన్‌బాబు 
హీరోగా హుషారుగా చేసిన మరో ప్రయత్నమిది.
తేజస్వి ఎప్పటిలానే చలాకీతనంతో కనిపిస్తారు. ఇక, 
లేడీ ట్యాక్సీ డ్రైవర్ బంగారంగా స్నిగ్ధ, వారానికి ఆరు రోజులే
 డ్యూటీలో ఉండే దొంగ కల్యాణ్‌బాబు పాత్రలో షకలక శంకర్
 లాంటివాళ్ళు వినోదమందిస్తారు. ధన్‌రాజ్, విద్యుల్లేఖా రామన్, 
సప్తగిరి లాంటి ఇతర కమెడియన్లు కూడా ‘ఆఖరి నిమిషంలో 
పాలుపంచుకొని’, తెరపై నవ్విస్తారు. ‘గబ్బర్‌సింగ్’ మొదలు
 తాజా ‘శ్రీమంతుడు, కుమారి 21 ఎఫ్, బెంగాల్ టైగర్’ దాకా
 పలు చిత్రాల్ని అనుకరిస్తూ, సైటైరికల్ స్పూఫ్ ఒకటి చేశారు.

మందు సీసా మీద ఓపెన్ అయి, ఒక పాటతో సహా చాలాసేపు
 మద్యం వాసన కొట్టే ఈ సినిమా ముగింపు కూడా ఆసక్తికరంగా
 మద్యం తాగననే హీరో ఒట్టుతోనే! కథ చిన్నది కాబట్టి,
కథనం కోసం సందర్భాలు, సన్నివేశాలు అనేకం అల్లుకుంటూ
 వెళ్ళిన ఈ ఫిల్మ్‌లో లాజిక్‌లు వెతకకూడదు. ఇటు పూర్తి
 కామెడీ సినిమా చేయాలా, అటు రోడ్ జర్నీలో రొమాంటిక్ ఫిల్మ్
 తీయాలా అనే విచికిత్స దర్శక, నిర్మాతలను వెంటాడి నట్లు 
అనిపిస్తుంది.

ఆ సక్సెస్ ఫార్ములా అన్వేషణలో పాత్రల ప్రవర్తన తీరు ఇ.సి.జి. 
గ్రాఫే. కథలానే సినిమా ఎక్కడో వైజాగ్‌లో మొదలై ఇక్కడ 
హైదరాబాద్ దాకా వస్తుంది. దర్శకుడు కె. రాఘవేంద్రరావు 
కొన్నేళ్ళ క్రితం పెట్టిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో బహుమతి 
అందుకొన్న రాకేశ్ శశికి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. అతనికి 
ఆ పాత వాసనలు ఇంకా పోలేదని గుర్తుచేస్తుంది. 
ఏమైనా స్పూఫ్ కామెడీ, సవాలక్ష ప్రేమకథల 
రెడీ మిక్స్  ‘జత కలిసే’నా?

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' Telugu daily, 26th Dec 2015, Saturday)
................................

నాగరి 'కథ'..... ‘మొహెంజొ దారో’ సినిమా చరిత్ర -

మొహెంజొ-దారో... వేల ఏళ్ళ క్రితం విలసిల్లిన ప్రాచీన భారతీయ పట్టణం.  క్రీ.పూ. 2600 ఏళ్ళ క్రితం నాటి అఖండ భారతదేశానికి అగ్రపీఠం... ప్రపంచానికి మన సంస్కృతీ మూలాల్ని సగర్వంగా చాటే ‘సింధులోయ నాగరికత’కు కేంద్రం.  ఇప్పటి పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో ఉన్న ఈ నగరంలో అన్ని వేల సంవత్సరాల క్రితమే భారీ స్నానఘట్టాలు, విశాలమైన వీధులు, పద్ధతి ప్రకారం సాగిన నగర నిర్మాణం, అన్ని వేల ఏళ్ళ క్రితమే అద్భుతమైన మురుగునీటి పారుదల వసతులు....  అన్నీ ఉండేవట! 1920లలో తవ్వకాల్లో బయటపడిన ఆధారాలే అందుకు సాక్ష్యం. 

మరి అంత నాగరికత వెలసిన ఆ నగరమెందుకు భూస్థాపితమైపోయింది? ఉన్నట్టుండి అంత సంస్కృతి అదృశ్యమై, అస్తిపంజరాల గుట్టలే మిగిలాయంటే ఏమై ఉంటుంది? అద్భుతమైన ప్రాచీన నాగరికత విలసిల్లిన ఆ నగరం నేపథ్యంలో అందమైన కల్పిత ప్రేమకథను బ్రహ్మాండస్థాయిలో వెండితెరపై చూపిస్తే? ‘లగాన్’, ‘జోధా అక్బర్’ చిత్రాల ఫేవ్‌ు దర్శకుడు ఆశుతోష్ గోవారీకర్ ఇప్పుడు ఆ పనే చేశారు. హృతిక్ రోషన్, పూజా హెగ్డేలతో ‘మొహెంజొదారో’ పేరిట 115 కోట్లతో ‘‘ఎపిక్ ఎడ్వంచర్ -రొమాన్స్ ఫిల్మ్’’ తీశారు.
 
చరిత్రలో...  ‘మొహెంజొ దారో’ 

 ప్రపంచంలో ప్రాచీన నాగరికతల్లో ఒకటైన మన సింధులోయ నాగరికతలోవే హరప్పా, మొహంజొ దారో నగరాలు.  ఈ నగరాల్ని క్రీ.పూ. 2500 ప్రాంతంలో కట్టారని లెక్క. నిజానికి, ఈ చారిత్రక నగరం అసలు పేరు ‘మొహెంజొ దారో’ కాదు. అప్పటి హరప్పా లిపి ఇప్పటికీ సరిగ్గా చదివి, అర్థం చెప్పి, గుట్టు విప్పలేకపోవడంతో అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు.  ‘మొహెంజొ దారో’ అనే పదానికి ముక్కకు ముక్కగా అర్థం - ‘మృతుల దిబ్బ’ అని!  1922లో తవ్వకాల్లో బయటపడ్డ ఈ నగర నిర్మాణ ప్రణాళిక, రహదారులు అబ్బురం.   ‘పశుపతి ముద్ర’ని బట్టి ‘పశుపతి’ని దైవంగా పూజించేవారని అర్థమవుతోంది.  ఇంత వైభవోపేతంగా వెలిగిన నాగరికత ఎలా విధ్వంసమైందో కారణం తెలియదు. ఆర్యుల దాడి, కరవు, జలప్రళయం- ఇలా ఎన్నో ఊహించినా, కారణం ఇంకా పజిలే.
 
కల్పిత ప్రేమపురాణం
క్రీ.పూ. 2016లో జరిగినట్లుగా తెరకెక్కిస్తున్న కాల్పనికకథ ఇది. శర్మన్ (హృతిక్ రోషన్) అనే యువ నీలిమందు రైతు మొహెంజొదారో వెళతాడు. సరికొత్త సమాజానికి మూల మవుతుందని జోస్యులు చెప్పిన చాని (పూజా హెగ్డే)తో ప్రేమలో పడతాడు. అప్పటికే ఆమెకి మరొకరితో పెళ్ళి నిశ్చయమైంది. నగరిపై పెత్తనం చేసే దుష్టుడితో పోరులో హీరో త్యాగం తెరపై చూడాలి.

వెండితెర హిస్టారియన్
సమకాలీన హిందీసీమలో ఏళ్ళ తరబడి ఒక అంశాన్ని శోధించి, నెలల తరబడి శ్రమించి, కోట్ల ఖర్చుతో భారీ కలల్ని వెండితెరపై వడ్డించే దర్శకుడంటే గుర్తొచ్చేపేరు - ఆశుతోష్ గోవారీకర్. ఇరవయ్యేళ్ళకే నటుడైన ఆయన మూడు పదులు రాక ముందే దర్శకుడిగా మారారు. గత 23 ఏళ్ళలో తీసిన సినిమాలు ఎనిమిదే!
 
‘లగాన్’కు వెళ్ళినప్పుడే...
బ్రిటీష్ పాలనా కాలంలో సామాన్య గ్రామీణులకూ, వారికీ మధ్య క్రికెట్ నేపథ్యంలోని పోరాటంగా ఆశుతోష్ తీసిన చిత్రం ‘లగాన్’ (2001). ఆ చిత్ర షూటింగ్‌కి లొకేషన్లు వెతుకుతూ, గుజరాత్‌లోని భుజ్ ప్రాంతానికి వెళ్ళినప్పుడే ఆశుతోష్‌లో ఈ ‘మొహెంజొదారో’ ఆలోచనకి బీజం పడింది. పదహారేళ్ళ తరువాత ఆ కల నెరవేర్చుకుంటున్నారు. 3 ఏళ్ళు శ్రమించి, తెరపై ప్రాణం పోశారు.

ఆశుతోష్ కాపీ కొట్టారా?
చరిత్రను సరిగ్గా చూపించడం లేదన్న వివాదాలు చాలదన్నట్లు... ఈ సినిమా కథ తనదనీ, ఆశుతోష్ కాపీ కొట్టారనీ ముంబయ్‌లోని అసిస్టెంట్ డెరైక్టర్ కమ్ రైటర్ ఆకాశాదిత్య లామా రచ్చ చేశారు. బాంబే హైకోర్టుకెళ్ళారు. 1995లో ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో పనిచేస్తున్నప్పుడే ‘మొహెంజొ దారో’ స్క్రిప్ట్ రాసుకున్నాననీ, 2002లో స్క్రిప్టును ఆశుతోష్‌కు పంపితే, ‘పీరియడ్ ఫిల్మ్ తీసే ఆలోచన లేదు’ అంటూ వెనక్కి ఇచ్చేశారనీ, తీరా ఇప్పుడు ‘మొహెంజొ దారో’ తీశారనీ ఆరోపించారు. మీడియాలో సంచలనమైన ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. లామాకు లక్షన్నర జరిమానా వేసింది.
 
లొకేషన్‌లో 3 వేల మంది
భుజ్‌లో మండే ఎండల్లో 100 రోజులకు పైగా జరిగిన షెడ్యూల్‌లో పని సజావుగా జరగడానికి రోజూ 300మంది తెర వెనక కష్టపడేవారు. భారీ నగర దృశ్యాల్లో వేల కొద్దీ జనం కావాలి. స్థానిక భుజ్ వాసులకు ఆడిషన్ పెట్టి ఎంపిక చేశారు. లొకేషన్లో ఒక్కోసారి 3 వేలమంది దాకా ఉండేవారట!  ‘లగాన్’ షూటింగ్ టైవ్‌ులో భుజ్‌లోని నివాసగృహాల్లోనే యూనిట్ మొత్తం బస చేసేది. ఇప్పుడు ఆ ప్రాంతం కొద్దిగా అభివృద్ధి చెందింది.  ఔట్‌డోర్ జరిగినంతకాలం హృతిక్ అక్కడే మొబైల్‌జిమ్ పెట్టారు.
 
మనకు తెలిసినవాళ్ళూ ఉన్నారు!
చిత్ర హీరోయిన్ పూజా హెగ్డే తెలుగులో నాగచైతన్య ‘ఒక లైలా కోసం’, వరుణ్‌తేజ్ ‘ముకుంద’ల నాయికే.విలన్ కబీర్‌బేడీ మన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో విలనే.  ‘రుద్రమదేవి’, ‘గౌతమిపుత్ర...’ల కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లాయే దీనికీ డిజైనర్. గతంలో ఆశుతోష్ ‘లగాన్, స్వదేశ్, జోధా అక్బర్’ చిత్రాలకు పనిచేసిన ఎ.ఆర్. రహమాన్ ఈ సినిమాకూ సంగీతం సమకూర్చారు.
 
ఇండియన్ స్క్రీన్‌పై... హాలీవుడ్ యాక్షన్
తల పెకైత్తి చూడాల్సినంత భారీ నగరం నేపథ్యంలో అప్పటి కాలానికి తగ్గట్లు ఆయుధాల్లేకుండా గాలిలోకి ఎగిరి కురిపించే ముష్టిఘాతాలు, 20 అడుగుల భారీ మొసళ్ళు, క్రూరమైన పులులు, దున్నపోతులతో ఫైట్స్ ‘మొహెంజొ దారో’లో పుష్కలం. ‘టైటానిక్’, ‘ది మ్యాట్రిక్స్’, ‘ది హాబిట్’ చిత్రాల హాలీవుడ్ స్టంట్ కోఆర్డినేటర్ గ్లెన్ బోస్వెల్‌ను ఏరికోరి పెట్టుకున్నారు ఆశుతోష్. 42 ఏళ్ళ హృతిక్ డూప్ లేకుండా ఫైట్స్ చేసి, గాయాల పాలయ్యారు. గ్రాఫిక్స్‌కి హాలీవుడ్ నిపుణుడు కరేన్ గౌలేకస్ వర్‌‌క చేశారు.

సెన్సార్... కట్ చేయని మూడు ముద్దులు
బ్రిటీషు పాలకుల కన్నా, మెఘలుల కన్నా, బౌద్ధం కన్నా, క్రీస్తు కన్నా మునుపటి కాలానికి, ఇప్పటి దాకా మనం చూడని ఇండియాకు సంబంధించిన కాలానికి చెందిన కథ అని దర్శక, నిర్మాతలు సగర్వంగా ప్రకటించారు. కాలం ఏదైనా ప్రేమ, ప్రణయం తప్పవుగా! ఈ బాక్సాఫీస్ ప్రేమకథలో ఏకంగా మూడు ముద్దు సీన్లున్నాయి. హృతిక్, పూజా హెగ్డేల మధ్య సినిమాలో ‘అధర బంధన చుంబనాలు’ (లిప్ లాక్) గురించి మీడియా కోడై కూస్తోంది. సెన్సార్ బోర్డ్ కట్స్ లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది.
 
రిలీజ్ రోజునే... లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో...
ప్రపంచం నలుమూలల్లో గొప్ప చిత్రాలను గుర్తించేది ‘లోకార్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’. ఎటా జరిగే ఈ ఫెస్టివల్‌లో ఈసారి ముగింపు చిత్రం ‘మొహెంజొ దారో’. వివిధదేశాల నుంచి 8 వేలమంది హాజరయ్యే ఈ 69వ ఫెస్టివల్‌లో ఆరుబైట ప్రపంచ భారీ తెరల్లో ఒకదానిపై ఈ చిత్రాన్ని ఆగస్ట్ 12న ప్రదర్శిస్తున్నారు. గతంలో ‘లగాన్’ని ఇక్కడే వేశారు. పదిహేనేళ్ళ తర్వాత మరోసారి ఆ అనుభూతి ఆశుతోష్‌కి దక్కుతోంది.

- రెంటాల జయదేవ

(published in 'sakshi' Telugu daily, Family Page, 12th Aug 2016, Friday)