జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, November 30, 2013

కొత్త దర్శకుడి స్పీడు ప్రయత్నం - 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'మన దర్శక, నిర్మాతలు, రచయితలు రొటీన్‌కు భిన్నంగా ఆలోచించే ప్రయత్నం చేస్తే, రకరకాల కథలను వెండితెరకు ఎక్కించవచ్చు. రెగ్యులర్‌ లవ్‌ స్టోరీలు, రివెంజ్‌ డ్రామాల రొంపి నుంచి తెలుగు సినిమాను బయటపడేయవచ్చు. కానీ, దురదృష్టవశాత్తూ అలాంటి ప్రయత్నాలు ఇటీవల బాగా తగ్గిపోయాయి. ఈ కరవు కాలంలో కొంతలో కొంత కొత్తగా అనిపించే వెండితెర ప్రయత్నం - 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'. సవాలక్ష లోపాలు సినిమాలో ఉన్నా, రొటీన్‌కు భిన్నమైన ప్రయత్నంగా ఈ సినిమా గుర్తుంటుంది. 

పాఠశాలలోనే కాదు, కుటుంబంలోనూ క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని, అతి స్ట్రిక్ట్‌గా ఉండే ఓ రిటైర్డ్‌ హెడ్మాస్టర్‌ రామ్మూర్తి (నాగినీడు). నూరు తప్పుల దాకా క్షమించినా, తప్పుల్లో సెంచరీ కొట్టారంటే, ఎవరినైనా సరే ఇంట్లో నుంచి బయటకు పంపేసి, వారితో బంధుత్వాన్ని తెగ తెంపులు చేసుకొనే నిరంకుశుడు. అలా సొంత తమ్ముడు సుబ్రహ్మణ్యం (పృథ్వీరాజ్‌)ను సైతం దూరం చేసుకున్న మొండివాడు. చండ శాసన రామ్మూర్తికి భార్య, ఇద్దరు కొడుకులు (బ్రహ్మాజీ, హీరో సందీప్‌ కిషన్‌). ఓ కూతురు, అల్లుడు. 

పెద్ద కొడుకు పెళ్ళి కోసమని ఇంటిల్లపాదీ కాచిగూడా నుంచి తిరుపతికి వెళ్ళే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కుతారు. తీరా తల్లి తాళిబొట్టు మర్చిపోవడంతో, తండ్రికి తెలియకుండా వెంటనే తెచ్చేస్తానంటూ హీరో ఇంటికి పరిగెడతాడు. తీరా తాళిబొట్టు తీసుకొచ్చే సరికి బండి బయలుదేరి పోతుంది. పైగా, అదే రైలు ఎక్కాల్సిన హీరోయిన్‌ ప్రార్థన (రకుల్‌ ప్రీత్‌ సింగ్‌) కూడా ట్రైన్‌ మిస్సయిపోవడానికి హీరో కారణమవుతాడు. ఇక అప్పటి నుంచి తండ్రికి తెలియకుండా ఎలాగోలా ఆ ట్రెయిన్‌ మార్గమధ్యంలోనే అందుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు, అతని వెంట హీరోయిన్‌ చేసే అల్లరి ఈ సినిమా. చివరకు వాళ్ళు ఆ ట్రెయిన్‌ను ఎలా అందుకున్నారు, ఆ పెళ్ళి ఏమైంది, అప్పటికే 99 తప్పులు చేసి, తండ్రికి టార్గెట్‌ అయిన హీరో ఈ వందో తప్పు తరువాత ఏమయ్యాడన్నది మిగతా సినిమా. 

సినిమా నిదానంగా మొదలైనా, కాసేపయ్యాక పట్టాల మీదకు ఎక్కుతుంది. ట్రెయిన్‌ ఎపిసోడ్‌ మొదలయ్యాక ప్రేక్షకులకు కూడా కొంత వినోదం, ఆసక్తి పెరుగుతాయి. అలా ప్రథమార్ధం ముగిసేసరికి ఫరవాలేదు బాగానే ఉందని అనిపిస్తుంది. కానీ, ద్వితీయార్ధానికి వచ్చే సరికి కథ, కథనం సాగదీతకు గురయ్యాయి. ట్రెయిన్‌ ఎపిసోడ్‌ ముగిసేసరికి సినిమాలోని ముఖ్యమైన భాగమంతా అయిపోతుంది. ఇక, ఆ తరువాత జరిగే పెళ్ళి వ్యవహారం లాంటివి నిడివిని పెంచాయే తప్ప, ప్రేక్షకులలో ఆసక్తిని కొనసాగించ లేకపోయాయి. 

గతంలో 'ప్రస్థానం', 'గుండెల్లో గోదారి' లాంటి విభిన్న తరహా చిత్రాల్లో అభినయించి, 'రొటీన్‌ లవ్‌ స్టోరీ'లో సోలో హీరోగా కనిపించిన చెన్నై కుర్రాడు సందీప్‌ కిషన్‌ ఈ చిత్ర హీరో. కెమేరామన్‌ ఛోటా కె. నాయుడుకు మేనల్లుడైన ఈ యువకుడు తన శక్తి మేరకు బాగానే నటించాడు. క్రమంగా నటనను మెరుగుపరుచుకుంటున్న ఈ తెలుగబ్బాయి వివిధ రకాల భావోద్వేగాలను పండించడంలో మరింత మెరుగుపడాల్సి ఉంది. ఇక, 'మిస్‌ ఇండియా' ఫేమ్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా కెమేరా ముందు బాగున్నారు. పాత్ర పరిధి మేరకు నటనలో ఫరవాలేదనిపించారు. నాగినీడు, జయప్రకాశ్‌ రెడ్డి లాంటి కొందరు అలవాటైన ఫక్కీలో పాత్రలను నడిపించేశారు. 

అయితే, చిత్ర ఇతివృత్తం, అందులోని పాత్రల చిత్రణ విషయానికి వస్తే - అసలు ఇలాంటి తండ్రులు, ఇలాంటి కుటుంబాలు ఉంటాయా, ఇలాంటి కథలు జరుగుతాయా అన్నది పెద్ద ప్రశ్నే. కాకపోతే, సినిమా కాబట్టి ఏదైనా జరుగుతుంది లెమ్మని సరిపెట్టుకోవాల్సిందే! అందుకే, ఎక్కడికక్కడ ఏదో ఒక పాత్ర రావడం, హీరో - హీరోయిన్ల ప్రయాణానికి వాహనాలు సమకూర్చేయడం లాంటి అతకని సన్నివేశాలను సైతం చూసీ చూడనట్లు పోవాల్సి ఉంటుంది. ఎంత సర్దుకుపోదామనుకున్నా ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర అంత కఠినంగా వ్యవహరించడానికి కారణమేమిటన్నది ప్రేక్షకులకు అర్థం కాదు. పైగా, వంద తప్పులు చేశాడని సొంత తమ్ముణ్ణి సైతం ఆఖరులో పెళ్ళి పందిట్లో కూడా ఆగర్భ శత్రువులా చూడాల్సిన అవసరమేమిటో తెలియదు. 
సినిమా చివరలో తండ్రిని ఎదిరించి మాట్లాడుతూ, హీరో ఓ చిన్న సైజు ఉపన్యాసం దంచుతాడు. (ప్రేక్షకులకు 'బొమ్మరిల్లు' చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, సిద్ధార్థ్‌ల మధ్య సీన్‌ ఛాయలు గుర్తొస్తే, అది వాళ్ళ తప్పు కాదు). ఇక, అంత క్లయిమాక్స్‌ తరువాత కూడా ఆ తండ్రి పాత్ర మారదు సరికదా, వంద తప్పుల పరిమితిని వెయ్యి తప్పులకు మార్చి, ''కుటుంబ రాజ్యాంగాన్ని సవరించా''నని పేర్కొనడం పెద్ద ఫార్సు! 

అలాగే, సాక్షాత్తూ కాబోయే వదిన ఎవరన్నది హీరోకు తెలియదన్నట్లు సినిమాలో చూపడం, సొంత ఇంట్లో జరిగిన నిశ్చితార్థానికి హీరో లేకపోయినా అసలు ఆ అమ్మాయి ఫోటో అయినా అతను చూడలేదనడం కూడా నమ్మశక్యంగా లేని విషయాలు. అయితే, సినిమా నడవాలి కాబట్టి, కథలో రాసేసుకున్న ప్రధాన ట్విస్టుగా దాన్ని క్షమించి, సహించాలేమో!
రౌడీల నుంచి కాపాడి హీరో పెళ్ళి చేసేసిన జంట 'ఎక్కడ సేఫ్‌గా ఉంటారో నాకు తెలుసు. దింపేసి వస్తా'నంటాడు థ్రిల్లింగ్‌గా కారు తోలే భద్ర పాత్రధారి ఎమ్మెస్‌ నారాయణ. మరి, తీరా ఆ జంటను సాక్షాత్తూ ఆ పెళ్ళికి ససేమిరా ఒప్పుకోని తండ్రి (జయప్రకాశ్‌ రెడ్డి) దగ్గరకే తెస్తాడు. అలా ఎందుకు చేశాడంటే జవాబు లేదు. ఇష్టం లేని పెళ్ళిని కాదనుకొని, కోరుకున్నవాడితో పారిపోయి, హీరో అండతో పెళ్ళి చేసుకువచ్చిన ఆ అమ్మాయి కూడా ఆ మరుక్షణమే తండ్రి ఎదుటకే ఎందుకు వచ్చినట్లు? సినిమాలో హీరో ఆటో దగ్గర నుంచి లారీ దాకా నడపని వాహనమంటూ ఉండదు. ఇక, స్పీడుగా వెళ్ళే రైలును ఆటో, బస్సు, లారీల ద్వారా ఛేజ్‌ చేసి మరీ అందుకోవడం లాంటి ఘట్టాలే సినిమాకు ప్రధానమైన కథనం. ఇలా సినిమాను నడపడం కోసం కథనూ, పాత్రలనూ ఆ యా సన్నివేశాలకు ఎలా కావాలంటే అలా మార్చేసుకోవడం ఈ చిత్ర దర్శక, రచయిత చేసిన పెద్ద లోపం. తొలి చిత్ర దర్శకుడైన మేర్లపాక గాంధీ (సీరియల్‌ నవలల రచయితగా ప్రసిద్ధుడైన మేర్లపాక మురళి కుమారుడు) ఇలాంటి లోపాలను కథలో, కథనంలో సరిదిద్దుకొని ఉండాల్సింది. గతంలో లఘు చిత్రాలు తీసిన అనుభవమున్న ఈ యువకుడు హడావిడి పడకుండా తన తదుపరి చిత్రాల కథ, కథనం, డైలాగుల్లో మరింత శ్రద్ధ పెట్టాలి. అప్పుడు కానీ, కెరీర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగాన్ని అందుకోదు. 

ఉన్నంతలో ఈ సినిమాకు ప్రధానమైన పాజిటివ్‌ పాయింట్‌ వినోదమనే చెప్పాలి. 'తాగుబోతు' రమేశ్‌, ''అయామ్‌ దస్తగిరి... ఫ్రమ్‌ వెంకటగిరి'' అంటూ పిహెచ్‌.డి. పట్టా పొందిన నిరుద్యోగిగా సప్తగిరి చేసిన కామెడీ హాలులో ప్రేక్షకులను పదే పదే నవ్విస్తుంది. అలాగే సాహిత్యమంటే చెవి కోసుకొనే రైౖల్వే టికెట్‌ కలెక్టర్‌గా శివన్నారాయణ కూడా సినిమాలో హాస్యం పండించడానికి తోడ్పడ్డారు. 

చాలా రోజుల తరువాత రమణ గోగుల సంగీతం అందించిన ఈ చిత్రంలో ఆడియోలో 3 పాటలున్నా, సినిమాలో రెండే మిగిలాయి. ద్వితీయార్ధంలో వచ్చే హీరో - హీరోయిన స్వప్న గీతం చిత్రీకరణ, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ వర్క్‌ బాగున్నాయి. కెమేరామన్‌ ఛోటా కె. నాయుడు తన మేనల్లుడైన హీరో కోసం తన అనుభవాన్ని బాగానే వినియోగించారు. హీరో ప్రవేశ ఘట్టంలో రంగుల మధ్య ఛేజ్‌ లాంటివి అందుకు ఉదాహరణ. గౌతంరాజు తన కత్తెరకు మరికొన్ని సన్నివేశాల్లో పదునుపెట్టినా బాగానే ఉండేది. 

ఇది 'జెమినీ' టి.వి, జెమినీ సినిమా సంస్థల వారికి చెందిన సినిమా కాబట్టి, చిత్ర నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. అలాగే, ఇకపై టీవీలో ప్రచార ఆర్భాటానికీ లోటు ఉండదు. అందుకే, సరైన సినిమా చూడడానికి లేక మొహం వాచిన ప్రేక్షకులు ఈ మాత్రమైనా రొటీన్‌కు భిన్నమైన సినిమా ఈ మధ్య రాలేదని దీన్ని అక్కున చేర్చుకోవచ్చు. పాత్రల రూపకల్పనతో సహా ఎన్నో లోటుపాట్లున్నా, అశ్లీలత మాత్రం లేని 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' కాసేపు (రెండు గంటల పది నిమిషాలు) వినోద కాలక్షేపంగా పాసై పోవచ్చు. 

- రెంటాల జయదేవ

.........................................................

Friday, November 29, 2013

టెన్ టివి సినిమా సమీక్షల ప్రోగ్రామ్ 'నేడే విడుదల'కు అవార్డు...


హైదరాబాద్: పుట్టిన ఏడాదిలోపే అవార్డుల వేటలో 'టెన్ టివి' తొలి అడుగు వేసింది. 'టెన్ టివి' లో ప్రతి శుక్రవారం ప్రసారమవుతోన్న 'నేడే విడుదల' కార్యక్రమానికి ' బెస్ట్ ఫిల్మ్ షో ఆఫ్ ద ఇయర్' అవార్డు లభించింది. 

పద్మమోహన ఆర్ట్ ధియేటర్స్ నిర్వహిస్తున్న పద్మమోహన థర్డ్ టివి అవార్డ్స్ - 2013 సంవత్సరానికి గానూ 'నేడే విడుదల' ప్రోగ్రామ్ కు ఈ అవార్డు దక్కింది.  నవంబర్ 29న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేయనున్నారు. 

'నేడే విడుదల' ప్రోగ్రాం ద్వారా సినిమాలపై టెన్ టివి చేస్తున్న నిష్పాక్షిక విశ్లేషణ ప్రేక్షకుల మనసు చూరగొంది. ఎలాంటి దాపరికాలు లేకుండా సినిమా రివ్యూలు ప్రసారం చేయడంతోపాటు, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఇస్తున్న రేటింగ్ 'నేడే విడుదల' స్థాయిని పెంచింది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న జ్యూరీ కమిటీ 'బెస్ట్ సినిమా ప్రోగ్రామ్' గా ఎంపిక చేసింది.

http://www.10tv.in/news/10max/Best-Programme-Award-to-10-tv-s-Nede-Vidudala-Programme-24326
...........................................

Tuesday, November 19, 2013

'పిజ్జా' అంత టేస్ట్ 'విల్లా'లో లేదు! (సినిమా సమీక్ష)

('విల్లా' - 'పిజ్జా 2' సినిమాపై '10 టివి' ప్రసారం చేసిన సమీక్ష ఇది...)తమిళ డబ్బింగ్ మూవీ 'పిజ్జా' సినిమా టాలీవుడ్‌ లో మంచి హిట్ నే అందుకుంది. ఈ చిత్రానికి ముందు వచ్చినవన్నీ యూత్, లవ్ అంటూ క్యూ కడుతుంటే "మంత్ర" సినిమా తర్వాత మళ్ళీ చాలా కాలానికి 'పిజ్జా' తెలుగు ప్రేక్షకులకు రొమాంటిక్ థ్రిల్లర్ ను అందించింది. ఇక ఈ పిజ్జాకు సీక్వెల్ గా వచ్చిన చిత్రమే "విల్లా". మారుతి "గుడ్ సినిమా గ్రూప్" ఈ మూవీని తెలుగులో నిర్మాణ బాధ్యతలు తీసుకోవడంతో సినిమాకు క్రేజ్ మరింత పెరిగింది. 'విల్లా'తో థ్రిల్లర్స్ ను ఇష్ట పడే ప్రేక్షకులకు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు కొత్త రుచి చూపించాలనుకుంటున్నాడు. మరి 'విల్లా' ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్లింగ్ ను కలిగించిందో తెలుసుకుందాం..


    కథ విషయానికి వస్తే:.. రచయిత అవ్వాలన్న ఆశయంతో ఉన్న యువకుడు జేబిన్ (అశోక్ సెల్వన్). తనకి ఇష్టం లేకపోయినా తండ్రి కోసం వ్యాపారం చేసి అందులో నష్టపోతాడు. అదే సమయంలో జేబిన్ తండ్రి(నాజర్) మరణిస్తాడు . అయన చనిపోయాక అతని లాయర్ ద్వారా జేబీ కి భీమునిపట్నంలో ఒక విల్లా ఉందన్న విషయం తెలుస్తుంది. ఆ విల్లాను అమ్మి తన కష్టాల నుండి బయటపడాలని జేబిన్ అక్కడికి చేరుకుంటాడు. ప్రేయసి ఆర్తి (సంచిత శెట్టి) తో పాటు అక్కడే ఉంటున్న జేబిన్ తన రెండవ రచనను అదే విల్లాలో చెయ్యాలని నిర్ణయించుకుంటాడు అదే సమయంలో వీరిద్దరికి కొన్ని అనుకోని కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. ఆ సంఘటనలు ఏంటి? జేబిన్ రెండవ నవల పూర్తి చేశాడా..? విల్లా లో ఏమయ్యింది..? అనేది మిగతా కథ.

    విశ్లేషణ:.. 'పిజ్జా'కు సీక్వెల్ అంటూ వచ్చిన 'విల్లా' కథకు ఆ సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. కథా, కథనం పూర్తి భిన్నంగా ఉంటుంది. పిజ్జా తో థ్రిల్లింగ్ సక్సెస్ ను అందుకున్న సి.వి. కుమార్ ప్రొడక్షన్ 'విల్లా'లో మాత్రం పిజ్జా రుచి ని అందించలేకపోయింది. థ్రిల్లర్స్ ఇష్ట పడే ప్రేక్షకులు తరవాత సన్నివేశం తమ అంచనాలకు అందకుండా ఉండాలనుకుంటారు. ఆ విషయంలో దర్శకుడు దీపన్ చాలా పేలవమైన పనితనం చూపించాడు. ప్రతి సన్నివేశం సగటు ప్రేక్షకుడు ఊహించగలిగేలా ఉన్నాయి. దీంతో పాటు పేయింటింగ్స్ రూపంలో తర్వాత ఏం జరుగుతుందో హీరో ముందే చెబుతుండడం సినిమాపై ఆసక్తిని తగ్గించింది. అన్ని విషయాలు ముందే తెలిసిన హీరో ఆ విల్లా చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడనేది ప్రేక్షకుల మదిని తోలుస్తున్న ప్రశ్న. సినిమా మొదలైన అరగంట పాటు ఓ డాక్యుమెంటరీ లా అనిపిస్తుంది. మొదటి భాగం చాలా బోర్ గా ఉంటుంది. అయితే విల్లాకు వచ్చాక సినిమాపై కాస్త ఆసక్తి పెరుగుతుంది. అక్కడ ఏదో రహస్యం ఉందని ఊరించిన దర్శకుడు అక్కడి సన్నివేశాలను రోటీన్ గానే చూపించాడు. అదే కాక సమస్యకు పరిష్కారం అందించకుండా. సస్పెన్స్ గా పెట్టి మరో సీక్వెల్ కి రెడీ అయినట్లు కథ ను ముగించాడు. దీంతో ప్రేక్షకులు అసంతృప్తితో థియేటర్ నుంచి బయటకు వస్తారు.

   అశోక్ సెల్వన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాలలో అతను పండించిన ఎమోషన్ సరిపోకపోయినా సన్నివేశానికి సరిపడా అయితే ఇవ్వగలిగాడు. సంచిత శెట్టి నటనాపరంగా ఉన్నంతలో పర్వాలేదనిపించింది. కాని హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. నాజర్, వీర సంతానం నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతర ఆర్టిస్టులు వారి పాత్రలకు తగ్గట్టు నటించారు.

ప్లస్ లు:.. సినిమాటోగ్రఫీ, అశోక్ సెల్వన్, పాటలు.

మైనస్ లు:.. రోటీన్ కథ. బ్యాక్ గ్రౌండ్ స్కోరు. దర్శకత్వం.

    పిజ్జా కోసం వచ్చిన ప్రేక్షకులకు పాత చింతకాయ పచ్చిడిని పిజ్జా ప్యాకింగ్ లో అందించిన గుడ్ సినిమా గ్రూప్ ప్రయత్నం బెడిసి కొట్టింది. అసలే 'రొమాన్స్' తో దెబ్బతిన్న ఈ గ్రూప్ కి 'విల్లా' రూపంలో మరో షాక్ తగిలింది. మారుతి బ్రాండ్ మరో సారి మసకబారింది. 

ఇక 'పిజ్జా' లో ఉండే టేస్ట్ 'విల్లా'లో లేదు. 


ఈ చిత్రానికి '10టివి'ఇచ్చే రేటింగ్.. 1/5

.............................................

Saturday, November 16, 2013

పోటీలో ఓ తెలుగు సినిమా
   ఈ అంతర్జాతీయ చిత్రోత్సవంలో తెలుగు సినిమాల ప్రాభవం అంతంత మాత్రమే కావడం ఓ విషాదం. 'లైవ్‌ యాక్షన్‌' కేటగిరిలో తెలుగు నుంచి '(మిణుకుమన్న) మిణుగురులు' అనే చిత్రం ఒక్కటే ప్రదర్శితమవుతుంది. నలభై మంది అంధులను పాత్రధారులుగా తీసుకొని, ఓ అంధుల హాస్టల్‌లో జరిగే అకృత్యాలు నేపథ్యంగా తీసిన ఈ చిత్రం గోల్డెన్‌ ఎలిఫెంట్‌ అవార్డు కోసం పోటీ పడుతోంది. ''మూడేళ్ళు కష్టపడి ఈ చిత్రం తీశాను. ఇప్పటికే ఏడు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఎంపికైన ఈ సినిమా ఇక్కడ గుర్తింపు తెచ్చుకొంటేనన్నా, ఈ సినిమా విడుదలకు మార్గం సులభం అవుతుందని భావిస్తున్నా'' అని దర్శక - నిర్మాత అయోధ్య కుమార్‌ కృష్ణంశెట్టి, 'జీవన'తో అన్నారు. ఈ సినిమాకు సబ్సిడీ, వినోద పన్ను మినహాయింపు కోసం ఇప్పటికి ఆరు నెలలుగా ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంగా ప్రభుత్వం చుట్టూ ఆయన తిరుగుతున్నారు. మద్దాలి వెంకటేశ్వరరావు రూపొందించిన 'చదువుకోవాలి!' అనే మరో తెలుగు సినిమా ఈ చిత్రోత్సవంలో ప్రదర్శితమవుతోంది.
(Published in 'Praja Sakti' daily, 14 Nov 2013, Thursday, Page no.5)
..........................................................

పిల్లల సినిమా పండుగ


  మరో సినిమా పండుగకు హైదరాబాద్‌ నగరం ముస్తాబైంది. ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ దాకా వారం రోజుల పాటు జరిగే '18వ భారత అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం' (ఐ.సి.ఎఫ్‌.ఎఫ్‌.ఐ)తో భాగ్యనగరం మళ్ళీ కళకళలాడుతోంది. ఏకంగా 7 రోజులు, 15 థియేటర్లు, 48 దేశాలు, 198 చిత్రాలు, సుమారు లక్షన్నర మంది ప్రేక్షకులు - ఇదీ స్థూలంగా ఈ తాజా చిత్రోత్సవం పరిమాణం. 2011 నాటి ఉత్సవం కన్నా, ఈసారి మరిన్ని ఎక్కువ దేశాలు, చిత్రాలు ఈ ఉత్సవంలో పాలు పంచుకుంటున్నాయి. దాంతో, సహజంగానే ఏర్పాట్లు కూడా భారీగానే జరుగుతున్నాయి. 

  
 హైదరాబాద్‌లో 1995లో జరిగిన 'భారత అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం' ఘనవిజయం సాధించడంతో, రెండేళ్ళకు ఒకసారి జరిగే ఈ సినిమా పండుగను అప్పటి నుంచి మన భాగ్యనగరంలోనే జరపాలని నిర్ణయించారు. ఈ చలనచిత్రోత్సవానికి శాశ్వత వేదికగా హైదరాబాద్‌ను నిర్ణయిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ఈ చలనచిత్రోత్సవం జంట నగరాల కీర్తికిరీటంలో మరో రత్నంగా వెలుగులీనుతోంది. 

ఈ 'భారత అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం' సినీ వర్గాల్లో 'గోల్డెన్‌ ఎలిఫెంట్‌' (బంగారు ఏనుగు) చిత్రోత్సవంగా ప్రాచుర్యం సంపాదించుకుంది. మన దేశంతో పాటు, విదేశాల్లో తయారవుతున్న బాలల చిత్రాలను ఇక్కడి చిన్నారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి, ప్రదర్శించి, వారిలో ఆలోచన, అపరిమితమైన ఉత్సాహం కలిగించడం ఈ ఉత్సవం ఉద్దేశం. అపురూపమైన కథా చిత్రాలు, లఘు చిత్రాలు, లైవ్‌ యాక్షన్‌ చిత్రాలు, యానిమేషన్‌ చిత్రాలను ఈ వారం రోజుల పండుగలో ప్రదర్శిస్తారు. తాజా చలనచిత్రోత్సవానికి ప్రపంచం నలుమూలల నుంచి కొన్ని వందల మంది సినీ నిపుణులు, ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ పండుగలో పాల్గొని, అంతర్జాతీయ బాలల సినిమాలను చూసే అనుభవాన్ని సొంతం చేసుకొనేందుకు దేశం నలుమూలల్లోని చిన్న చిన్న గ్రామాలు, పట్నాల నుంచి బాలబాలికలు వస్తుంటారు. 
చాచాతో అనుబంధం
భారత ప్రభుత్వంలోని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ 'భారత బాలల ఫిల్మ్‌ సొసైటీ' (సి.ఎఫ్‌.ఎస్‌.ఐ), ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలసి ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తుంటుంది. ఇప్పటికి 58 ఏళ్ళ క్రితం 1955లో స్థాపితమైన ఈ బాలల ఫిల్మ్‌ సొసైటీ పిల్లల్లో వినోదాన్నీ, విజ్ఞానాన్నీ పెంచే చిత్రాలను నిర్మించడం, ప్రదర్శించడం, పంపిణీ చేయడం లాంటివి చేస్తుంటుంది. ఈ సొసైటీ స్థాపనకు ఓ నేపథ్యం ఉంది. ప్రత్యేకంగా పిల్లల కోసం దేశీయంగా చలనచిత్రాలను రూపొందించడం ద్వారా వారిలో సృజనాత్మకతనూ, తార్కికమైన ఆలోచననూ పెంపొందించవచ్చని మన దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ భావించారు. అందుకే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొద్ది కాలంలోనే నెహ్రూ ఈ చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ సొసైటీని నెలకొల్పారు. అందుకే, చిన్నపిల్లలందరూ 'చాచా నెహ్రూ'గా ఎంతో ఇష్టంగా పిలిచే నెహ్రూ జన్మదినమైన నవంబర్‌ 14వ తేదీనే ప్రతిసారీ ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తుంటారు.

ఇవాళ్టి నుంచి... వారం రోజులు
ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఉన్న లలిత కళా తోరణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించాల్సి ఉంది. (రాష్ట్ర విభజన అంశంపై ఢిల్లీలో మంత్రుల బృందంతో సమావేశం ఉన్నందున ముఖ్యమంత్రి ఈ ఉత్సవానికి హాజరు కాలేరని తాజా సమాచారం). ఇక, ప్రారంభోత్సవానికి కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీశ్‌ తివారీ అధ్యక్షత వహిస్తే, ప్రముఖ హిందీ నటుడు రణబీర్‌ కపూర్‌, సుప్రసిద్ధ రచయిత - దర్శకుడు గుల్జార్‌లు అతిథులుగా హాజరు కానున్నారు. మన దేశానికి చెందిన శిల్పా రణడే దర్శకత్వం వహించిన 'గోపీ గవయ్య.. బాఘా బజయ్య' అనే యానిమేషన్‌ చిత్రాన్ని ప్రారంభ సినిమాగా ప్రదర్శించనున్నారు. సత్యజిత్‌ రే ప్రసిద్ధ బెంగాలీ సినిమా 'గుపీ గయే( బాఘా బయే(' సినిమాకు ఇది హిందీ రూపం.
ఈ 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి దాదాపు 5 వేల మంది దాకా బాలబాలికలు ప్రతినిధులుగా హాజర వుతున్నట్లు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ పక్షాన ఈ ఉత్సవాల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న 'ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, రంగస్థల అభివృద్ధి సంస్థ' (ఏ.పి.ఎస్‌.ఎఫ్‌.టి.వి.టి.డి.సి) చైర్మన్‌ ఎన్‌. శివశంకర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం. దానకిశోర్‌లు తెలిపారు. అలాగే, మరో వందమంది దేశ, విదేశీ ప్రతినిధులు, సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు కూడా వస్తున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే బాలబాలికలకు ప్రపంచ దేశాలకు చెందిన అత్యున్నతమైన బాలల చిత్రాలను చూసే అవకాశాన్ని ఈ చిత్రోత్సవం కల్పిస్తోంది. 

తొలిసారిగా 3డిలు... యానిమేషన్లు!
నిజానికి, ప్రపంచవ్యాప్తంగా 74 దేశాల నుంచి 896 బాలల చిత్రాలు ఎంట్రీలుగా వచ్చాయి. వాటిలో 48 దేశాలకు చెందిన 198 చిత్రాలను మాత్రం ఎంపిక చేసి, వారం రోజుల పాటు ప్రదర్శిస్తున్నట్లు 'చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా' సి.ఇ.ఓ. శ్రావణ్‌ కుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌లోని ప్రసాద్‌ ఐ-మ్యాక్స్‌ ప్రాంగణం ఈ చిత్రోత్సవానికి ప్రధాన వేదిక. అందులోని మూడు స్క్రీన్లతో పాటు నగరంలోని మరో ఎనిమిది సినిమా హాళ్ళలో, పబ్లిక్‌ గార్డెన్స్‌లోని లలిత కళాతోరణం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియమ్‌, నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియమ్‌, సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్‌ హౌమ్‌లలో కూడా ఈ వారం రోజుల పాటు సినీ ప్రదర్శనలు జరుగుతాయి. ఈ హాళ్ళలన్నిటిలో కలిపి సగటున రోజూ 30 సినిమాల ప్రదర్శన జరుగుతుంది. సగటున 20 వేల మంది పిల్లలు వాటిని చూడగలుగుతారు. ఈ ప్రదర్శనల్లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. తొలిసారిగా 3డి చిత్రాలను కూడా చూపడం ఈ తాజా చిత్రోత్సవంలోని విశేషం. అలాగే, యానిమేషన్‌ చిత్రాలను ప్రోత్సహిస్తూ, తొలిసారిగా వాటిని కూడా ఈ చిత్రోత్సవంలో ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న బెర్లిన్‌, టొరెంటో ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌, కాన్స్‌ ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌లలో ప్రదర్శితమైన 20 సుప్రసిద్ధ సినిమాలను కూడా ఈ తాజా సినిమా పండుగలో చూసే అవకాశం ప్రతినిధులకు కలుగుతోంది. దక్షిణ అమెరికా, ఆస్ట్రియా, లెబనాన్‌, స్కాట్‌లాండ్‌, మలేసియా తదితర దేశాలు తొలిసారిగా ఈ ఉత్సవంలో తమ చిత్రాలను ప్రదర్శించడం, పాల్గొనడం మరో విశేషం. 

నాలుగు కేటగిరీల్లో పోటీ
ఈ ఉత్సవంలో భాగంగా పోటీ (కాంపిటీషన్‌) విభాగంలో 'లైవ్‌ యాక్షన్‌', 'యానిమేషన్‌ ఫీచర్‌', 'షార్ట్‌ ఫిల్మ్‌', 'లిటిల్‌ డైరెక్టర్స్‌' అనే నాలుగు కేటగిరీల్లో పోటీ జరుగుతుంది. ఈ కేటగిరీల్లో పోటీపడిన వాటిల్లో ఉత్తమంగా నిలిచిన చిత్రాలకు మొత్తం 16 అవార్డులను బహూకరిస్తారు. వాటిలో 12 బంగారు ఏనుగు ట్రోఫీలు కాగా, మరో 4 బంగారు ఫలకాలు.
ఇక, పోటీ రహిత (నాన్‌ కాంపిటీషన్‌) విభాగంలో 'చిల్డ్రన్స్‌ వరల్డ్‌', 'కంట్రీ ఫోకస్‌ రెట్రాస్పెక్టివ్‌', 'చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ సొసైటీ వారి సినీ ఆణిముత్యాల'ను ప్రదర్శిస్తారు. ఈ 'చిల్డ్రన్స్‌ వరల్డ్‌ సెక్షన్‌'లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉత్తమ శ్రేణి చిత్రాలను చూపెడతారు. ఈసారి ఉత్సవంలో ప్రధాన దృష్టి కేంద్రిత దేశం - చెకోస్లోవేకియా. ఆ దేశానికి చెందిన ఉత్తమ బాలల చిత్రాలు, లఘు చిత్రాలు, లైవ్‌ యాక్షన్‌, డాక్యుమెంటరీ చిత్రాలను ఈ 'కంట్రీ ఫోకస్‌' విభాగంలో ప్రదర్శిస్తారు. 2011 నాటి ఉత్సవంలో ఈ విభాగంలో చైనా చిత్రాలను ప్రదర్శించారు. తాజా ఉత్సవాల ముగింపు రోజైన నవంబర్‌ 20న జరిగే ముగింపు సభలో అవార్డు గెలుచుకున్న వారికి పురస్కారాలు అందజేస్తారు. 

ఆహ్లాదం... అవగాహన...
ప్రపంచంలోని అతి పెద్ద బాలల చలనచిత్రోత్సవాల్లో ఈ ఉత్సవం కూడా ఒకటి. పిల్లలను అమితంగా ఆకర్షించే 'బంగారు ఏనుగు' బొమ్మ ఈ ఉత్సవాలకు చిహ్నం. ముద్దులొలికే ఈ గున్న ఏనుగుకు 'గజం' అనే పదాన్ని స్ఫురింపజేస్తూ, 'గజ్జు' అని పేరు. పిల్లలకు యానిమేషన్‌, స్క్రిప్ట్‌ రచన, చిత్ర రూపకల్పన లాంటి అంశాలపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. బాల కళాకారుల హక్కులు, భారతీయ యానిమేషన్‌, పిల్లల సినిమాలకు ఆదరణ - ఆవశ్యకత లాంటి నిర్ణీత అంశాలపై ఈ సారి బహిరంగ చర్చావేదికలు (ఓపెన్‌ ఫోరమ్‌) జరపనున్నారు 

సాంస్కృతిక కార్యక్రమాల సంబరం 
''ప్రారంభ సభలోని సాంస్కృతిక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం పక్షాన జరిగితే, ముగింపు సభలోవేమో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరుగుతాయి. ప్రారంభ సభలో భరతనాట్యం, కూచిపూడి, కథకళి, మోహినీయాట్టం, ఒడిస్సీ తదితర భారతీయ నృత్య కళారూపాలన్నిటితో కలిపి 10 నిమిషాల ప్రత్యేక నృత్యం ప్రధాన ఆకర్షణ కానుంది'' అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్‌ రాళ్ళబండి కవితాప్రసాద్‌, 'ప్రజాశక్తి - జీవన'తో ప్రత్యేకంగా మాట్లాడుతూ చెప్పారు. 
మిగిలిన రోజుల్లో కూడా రోజూ సాయంత్రం లలిత కళా తోరణంలో పిల్లల సినిమాల ప్రదర్శనతో పాటు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటికి ప్రవేశం ఉచితమే! ''వివిధ ప్రాంతాల్లోని 42 పాఠశాలల నుంచి 640 మంది పిల్లలు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరోపక్క పబ్లిక్‌ గార్డెన్స్‌లోని బాలభవన్‌లో పిల్లలతో చిత్రకళ, ఇకెబెనా తదితర కళా నైపుణ్యాల ప్రదర్శన కూడా ఉంటుంది. ప్రతిరోజూ ఇద్దరు బాల మేధావులను గుర్తించి, ప్రత్యేకంగా గౌరవించనున్నాం'' అని కవితాప్రసాద్‌ వివరించారు. ఈ కార్యక్రమాలకు బాలలే వ్యాఖ్యాతలు కూడా కావడం చెప్పుకోదగ్గ విశేషం. మొత్తం మీద ఉత్సవాల ప్రచారంలో చెబుతున్నట్లు, బాలబాలికలకు ''ఇది సినిమాల వేళ... ఇది సరదాల వేళ...''! ఈ వారం రోజులు వారిలో సృజనాత్మకతనూ, అవగాహననూ పెంచడానికి దోహదం చేయగలిగితే అంత కన్నా ఏం కావాలి!
- రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 14th Nov 2013, Thursday, Page No.5)
..........................................................

Friday, November 15, 2013

హైదరాబాద్ లో 18వ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్

('హైదరాబాద్  లో 18వ బాలల చిత్రోత్సవ0'పై '10 టివి' ప్రసారం చేసినది ఇది...)

హైదరాబాద్ లో 18వ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగనుంది. ఈ మేరకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఈ ఫెస్టివల్ లో రెండు వందల బాలల చిత్రాలు ప్రదర్శనకు అనుమతి పొందాయి. వీటిలో భారతీయ చిత్రాల సంఖ్య తక్కువే ఉంది. తెలుగు భాష నుంచి 'మిణుగురులు` చిత్రం ఈ ఫెస్టివల్ లో పోటీ పడనుంది. ఈ పండుగ బాలల దినోత్సవమైన నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు భాగ్యనగరంలో జరుగనుంది. ఈ చిత్రోత్సవాన్ని రణబీర్ కపూర్ కపూర్ ప్రారంభించనున్నారు. అమీర్ ఖాన్ రూపొందించిన 'తారే జమీన్ పర్` చిత్రంలో నటించి శభాష్ అనిపించుకున్న దర్శీల్ సఫారీ, బాల హాస్యనటుడు సలోని దైనీలు ఈ చిత్రోత్సవాలకు హోస్టులుగా వ్యవహరించనున్నారు. ప్రారంభ చిత్రంగా దర్శక, నిర్మాత శిల్పా రనడే రూపొందించిన ' గోపి గవైయ్య బాఘా బజైయ్యా ' చిత్రాన్ని ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. సత్యజిత్ రే సినిమా 'గుపి గాయెన్ బాఘా బాయెన్' చిత్రం ఆధారంగా ఈ సినిమా తీశారు.

బాలల చలన చిత్రోత్సవం చరిత్ర...
  
ఈ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడానికి ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల నుంచి 894 ఎంట్రీలొచ్చాయి. అందులో 48 దేశాలకు చెందిన 200 సినిమాలను మాత్రమే ఎంపిక చేశారు. బాలల ప్రేమికుడు చాచా నెహ్రూ 1955లో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీకి రూపకల్పన చేశారు. అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి దేశంలోని వివిధ నగరాల్లో బాలల సినిమా పండగలు జరుగుతున్నాయి.1979లో తొలి చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ ముంబైలో జరిగింది. 1981లో చెన్నై, 1983లో కోలకతా, 1985లో బెంగుళూర్, 1987లో భువనేశ్వర్, 1991లో త్రివేండ్రం, 1993లో ఉదంపూర్ లో బాలల చలన చిత్రోత్సవాలను నిర్వహించారు. 1995 నుంచి హైదరాబాద్ నగరం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు శాశ్వత వేదికైంది. అప్పట్లో చలన చిత్రోత్సవ వేదికకు హైదరాబాద్ అనువుగా లేదన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ వేదికను కోలకతాకు మార్చాలని ప్రముఖ నటి నందితాదాస్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.


నగదు పురస్కారం..
   
బాలల సినిమాలకే ప్రోత్సాహం లేదంటే, బాలల చలన చిత్రోత్సవం పై కూడా సర్కారుకు పడుతుందా. ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు చాలా ఉన్నాయి. మొదట్లో పోటీల్లో గెలుపొందిన విజేతలకు కేవలం జ్ఞాపికలు అందించి సంతృప్తి పరిచేవారు. ఆ తర్వాత అవార్డుతో పాటు నగదు బహుమతులను కూడా ఇవ్వటం మొదలుపెట్టారు. ఉత్తమ చిత్రానికి బంగారు నందితో పాటు లక్ష రూపాయల నగదు ఇచ్చేవారు. 2007 నుంచి నగదును రెండు లక్షలకు పెంచారు. ఈసారి 16 అవార్డులను నాలుగు కేటగిరీల కింద ఇవ్వనున్నారు. యాక్షన్, యానిమేషన్, ఫీచర్స్, షార్ట్ ఫిలిమ్స్ అని నాలుగు విభాలుగా విభజించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడికి రెండు లక్షల నగదుతో పాటు బంగారు ఏనుగు ట్రోఫి, రన్నరప్ గా నిలిచిన విజేతలకు లక్ష రూపాయల నగదు ఇవ్వనున్నారు.


పోటీ పడలేకపోతున్న భారతీయ చిత్రాలు..
  
అయితే చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ లో ఆయా దేశాల్లో నిర్మించిన బాలల చిత్రాలు పోటీకి రావడం, ఇక్కడ ప్రదర్శించడం బహుమతులు అందుకుని వెళ్లిపోవడం సర్వసాధారణంగా మారింది. కానీ భారతీయ చిత్రాలు మాత్రం పోటీ పడలేకపోతున్నాయి. బాలలకు సంబంధించి తెలుగులో కూడా పెద్దగా సినిమాలు రాలేదు. గతంలో రాజు-పేద, లేత మనసులు, బాల మిత్రుల కథ, గమ్మత్తు గూఢచారులు, పాపం పసివాడు, రాము, లిటిల్ సోల్జర్స్ లాంటి బాలల చిత్రాలు కొన్ని వచ్చాయి. అయితే ఈ చిత్రాలన్ని కూడా కమర్షియల్ పంథాలో బాలలకు నచ్చే విధంగా నిర్మించినవే. ఇంకా 1936లోనే సతీ అనసూయ అనే చిత్రాన్ని పూర్తిగా బాల నటీనటులతో తెలుగులోనే తీశారు. ఈ మధ్య కాలంలో గుణశేఖర్ దర్శకత్వంలో 'రామాయణం' అంతకుముందు 'బాల భారతం` లాంటి సినిమాలు కూడా పూర్తిగా పిల్లతోనే తీశారు. కళ్లు లేకపోతే సినిమా తీయలేమా? ఇలాంటి కథాంశంతో వచ్చిన తెలుగు సినిమా 'మిణుగురులు'. ఇదొక్కటే తెలుగు నుంచి ఫిల్మ్ ఫెస్టివల్ లో పోటీపడుతోంది. పోర్ట్ లాండ్ నార్త్ వెస్ట్ ఫిలిం ఫెస్టివల్ లో శిక్షణ పొందిన 40మంది కళ్లు లేని బాలలతో దర్శక నిర్మాత అయోధ్య కుమార్ ఈ సినిమాని తీశారు. సుహాసిని, ఆశిష్ విద్యార్ధి ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఇక విద్యపై చైతన్యం రగిలించే కథాంశంతో రూపొందించిన 'చదువుకోవాలి` చిత్రం సాధారణ ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సినిమాను ముద్దాలి వెంకటేశ్వరరావు రూపొందించారు.
ఇండియాలో పట్టించుకునే వారేరీ..
  
పిల్లల్లో నైతిక విలువలు, తమ భవిష్యత్తు, సమాజం పట్ల బాధ్యత, వారి మనస్తత్వాన్ని పెంపొందించడానికి సినిమాను మించింది మరొకటి లేదు. కానీ పిల్లల మానసిక వికాసానికి తోడ్పడే చిత్రాలను భారతీయ చలనచిత్ర పరిశ్రమ పట్టించుకోకపోవటం విచారకరం. భారతీయ చలనచిత్ర పరిశ్రమ వందేళ్ల పండగ జరుపుకుంటోంది. వందేళ్లలో పిల్లలపై తీసిన సినిమాలు ఎన్ని? ఆ సంఖ్య వేళ్లపై లెక్కించే విధంగానే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతర్జాతీయంగా బాలల కోసం ఏటా ఎన్నో చిత్రాలను రూపొందిస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద సినిమా పరిశ్రమగా పేరొందిన ఇండియాలో మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు జరగకపోవడం శోచనీయం.


ఇరాన్ ప్రత్యేక శద్ధ..
  
పిల్లల చిత్రాలు రూపొందించడంలో ఇరాన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం ఓ ప్రత్యేకమైన శాఖను ఏర్పాటు చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు. పిల్లలకు నచ్చే రీతిలో ఆ దేశం సినిమాలు తీస్తోంది. గతంలో పోటీకి రాని దేశాలు ఆస్ట్రేలియా, చిలీ, క్యూబా, లెబనాన్ వంటి 20 దేశాలు ఈసారి ఫిలిం ఫెస్టివల్ కి రావటం గమనార్హం. ఒక్క దక్షిణ అమెరికా నుండే 28 ఎంట్రీలు వచ్చాయి. ఈ సంఖ్యను చూస్తే పిల్లల సినిమాలకు వాళ్లిస్తున్న ప్రాధాన్యత ఏమిటో, వాళ్లకున్న చిత్తశుద్ధి ఎంతో అర్ధమవుతుంది.


ముస్తాబైన లలితా కళాతోరణం..
   
18వ బాలల చలన చిత్రోత్సవానికి హైదరాబాద్ లోని లలితా కళాతోరణం ముస్తాబైంది. చెకస్లొవేకియా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ తదితర 48 దేశాల నుంచి, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేడుకలకు హాజరయ్యే 400 మంది చిన్నారి అతిథుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చలన చిత్రోత్సవంలో భాగంగా 48 దేశాలకు చెందిన 2 వందల చిత్రాలు ప్రదర్శించనున్నారు. ఇందులో త్రీడీ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలన్ని హైదరాబాద్ లోని ఐమాక్స్ తో పాటు 9 థియేటర్లలో ప్రదర్శిస్తారు. తెలుగు లలిత కళాతోరణం, ఇందిరాప్రియదర్శిని, తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలలో కూడా చిత్రాలు ప్రదర్శిస్తారు. ఏ థియేటర్‌లోనైనా చిన్నారులు ఉచితంగా వీక్షించవచ్చు. రోజుకు 20 వేల మంది పిల్లలు పెద్దలు సినిమా చూసే అవకాశముంది. బాలల చలన చిత్రోత్సవంలో ప్రతి ఏటా ఒక దేశానికి చెందిన చిత్ర ప్రదర్శనకు ప్రాధాన్యత నిస్తారు. 17 వ చైల్డ్ ఫెస్టివల్ లో చైనాకు ప్రాధాన్యమివ్వగా, ఈసారి చెక్ దేశానికి చెందిన చిత్రాలు ఎక్కువగా ప్రదర్శిస్తారు.
   అయితే ఇంత పెద్ద ఉత్సవానికి కేవలం 9 థియేటర్లు కేటాయించటంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 9 థియేటర్లలో 2 వందల చిత్రాలు ప్రదర్శించడం సాధ్యమా అన్న ప్రశ్నలొస్తున్నాయి. ఒక్కొక్క సినిమా ఒక్కో స్కూలుకి చూపించగలిగితే గొప్ప విషయమే. అంతేకాదు పిల్లలను థియేటర్లకు తీసుకెళ్లి తిరిగి ఇళ్లకు చేర్చటం కూడా శ్రమతో కూడుకున్న పనే.


ఫెస్టివల్ అంటే ఏంటో తెలియదు..

  ఫిలిం ఫెస్టివల్ అంటేనే తారలు, విదేశీ ప్రతినిధులు వెలుగు జిలుగులతో తళుక్కు మంటుంది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే ఈ ఉత్సవంలో సాదా సీదాగా వచ్చే పేదలకు స్థానముంటుందా? సమాజంలోని ఉన్నత వర్గాల పిల్లలకే పరిమితమవుతున్నాయి ఈ ఫెస్టివల్స్. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చాలా మంది పిల్లలకు చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితి. గత ఫెస్టివల్ లో డెలిగెట్ పాస్ ల కోసం నానా ఇబ్బందులు పడ్డారు. అందరికీ ఉచిత ప్రవేశమని అధికారులు చెప్పినా ప్రతి థియేటర్ లో పాస్ లేకుండా అనుమతించలేదు. పిల్లల పట్ల ప్రభుత్వం ప్రేమ నటించడం కాదు, ఆచరణలో చూపాలి. ఈసారైనా పేద, ధనిక తేడా లేకుండా పిల్లలందర్ని ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనేటట్టు చర్యలు చేపట్టాలి. వారికి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చాలి. అప్పుడే బాలల చలన చిత్రోత్సవానికి సార్థకత సమకూరుతుంది. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. బాలలు మన జాతి సంపద అంటూ పాలకులు ఊదరగొడుతుంటారు. కాని పిల్లల కోసం ప్రభుత్వం చేస్తున్నదేంటి? పిల్లలకోసం సినిమాలు వచ్చేలా చేయలేరా? నిర్మాతలను నిజాయితీగా ప్రోత్సహించలేరా? దానికి కేవలం చిత్తశుద్ధి కావాలి. అంతే!
....................................

ఘాటు తగ్గిన 'మసాలా'! (సినిమా సమీక్ష)

(''మసాలా'' సినిమాపై '10 టివి' ప్రసారం చేసిన సమీక్ష ఇది...)సోలో యాక్షన్ కు ఫుల్ స్టాప్ పెట్టిన 'వెంకీ' ఇప్పుడు మల్టీస్టారర్ గా దూసుకుపోతున్నాడు. దానికి అనుగుణంగానే సినిమాలు చేస్తున్నాడు. వెంకీ సాధారణంగా తన సినిమాల్లో కమెడీయన్ లేకుండానే కామెడీ పండించగలడు. అలా వచ్చిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి. ఇక టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ఈ మధ్య సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో తను కొత్తగా చేయాలని ట్రై చేస్తున్నాడు. 

ఇలాంటి టైమ్ లో ఈ ఇద్దరు హీరోలు 'మసాలా' చిత్రంలో నటించారు. ఈ చిత్రం బాలీవుడ్ లో హిట్ అయిన 'బోల్ బచ్చన్ బోల్' కు రీమేక్. 'వెంకీ, 'రామ్', 'అంజలి, 'షాజన్ పదంసీ' హీరోయిన్లు. ఆలీ, ఎమ్మెస్ నారాయణ, తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించగా. 'సురేష్ ప్రొడక్షన్', 'స్రవంతి బ్యానర్ ' సంయుక్తంగా నిర్మించారు. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఎలాంటి ఫలితాన్నిచ్చిందో.. తెలుసుకునే ముందు కథను చూద్దాం..

    కథ విషయానికి వస్తే:.. భీమరాజపురం అనే ఊళ్ళో బలరాం(వెంకటేష్) అనే జమీందారుంటాడు. ఆయనకి ఇంగ్లీషు భాష అంటే ఇష్టం.. అబద్ధమంటే కోపం. బలరాంకు ఒక్కతే చెల్లెలు మీనాక్షి(షాజన్ పదాంసీ). బలరాం అంటే గిట్టని విలన్ (పోసాని). బలరాం దగ్గర మేనేజర్ గా నారాయణ(ఎమ్మెస్ నారాయణ) పనిచేస్తుంటాడు. ఇతని స్నేహితుడి కొడుకు రెహమాన్(రామ్) కూతురు సరిత(అంజలి). రామ్ ఇళ్లు, ఆస్తి కోర్టు కేసుల్లో ఉంటుంది. పనిలేక ఇబ్బంది పడుతుండడంతో నారాయణ జమీందార్ వద్ద పని ఇప్పిస్తానని అతడిని భీమరాజపురానికి తీసుకెళ్తాడు. అక్కడ రామ్ గా తన పేరు అబద్దం చెప్పి బలరాంకు పరిచయం అవుతాడు. నారాయణ రికమండేషన్ తో కోటలో ఉద్యోగం వస్తుంది. 


రెహమాన్ తన పేరులో ఆడిన ఆబద్ధం కోసం మరికొన్ని అబద్ధాలు ఆడుతుంటాడు. ఇక ఓ రోజు హైదరాబాద్ లో చదువుకుంటున్న బలరాం చెల్లెలు తన ఇంటికి వస్తుంది. ఆమెతో రామ్ లవ్ లో పడతాడు. ఆ విషయం అన్న బలరాంకు తెలుస్తుంది. మరి వారి ప్రేమను బలరాం ఒప్పుకున్నాడా..? రామ్ చెప్పిన అబద్ధాలు బలరాంకు తెలిశాయా..? తెలిస్తే ఏం చేశాడు..? అనేది మిగతా కథ.
    విశ్లేషణ:.. హిందీ మూవీ 'బోల్ బచ్చన్ బోల్' కి రీమేక్ వచ్చిన 'మసాలా'.. అచ్చు ఆ చిత్రానికి కాపీ ఫేస్ట్ గా కనిపిస్తుంది. సహజంగా ఏదైనా సినిమాను రీమేక్ గా తెరకెక్కించే ముందు వాటి బ్యాక్ డ్రాప్ ను పరిశీలిస్తారు దర్శకులు. ఆ కథను ఎంచుకోగానే మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సందర్భాన్ని బట్టి కొత్త వాటిని కలపడం.. అనసరమైన కొన్నింటిని తొలగించడం చేయాలి. కానీ అవేమీ లేకుండా మక్కికి మక్కి దించేశాడు దర్శకుడు విజయ్ భాస్కర్. ఈ 'మసాలా' చిత్రంలో ప్రధానంగా అదే లోపంగా కనిపిస్తుంది. కథకు, పాత్రలకు, మాట్లాడే భాషకు సంబంధం ఉండదు. ఒక అబద్ధం అనేక అబద్ధాలను సృష్టిస్తుంది. వాటిని నిజం చేసేందుకు అనేక పాత్రలను ప్రవేశ పెడుతుంది. ఇలాంటి కామెడీ తెలుగు ప్రేక్షకులు రోటీన్ గా చూస్తున్నదే. 


సెకండాఫ్ బోర్ గా ఉంటుంది. రీమేక్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. పాత్రల, సన్నివేశాల లక్ష్యం ఎంటో అర్థం కాదు. క్లారిటీ లేదు. సినిమాలో కన్సెప్ట్ కనిపించదు. బలరాం, మీనాక్షి మధ్య అన్నచెల్లెలి అనుబంధాలు ఎక్కడా కనిపించవు. జమిందారు అయిన బలరాం.. తన పనులు కాక.. రామ్.. అండ్ 'మసాలా డ్రామా కంపెనీ' చుట్టూ తిరగడం ఆయన పాత్రకు సూట్ కాలేదు.

   'క్యాట్ అండర్ ది హ్యాండ్ సెర్చింగ్ మదర్ ల్యాండ్'. 'ఐ టాక్ ఇంగ్లీష్ బెటర్ దెన్ బ్రిటిష్'. 'మై ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, మై మథర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, మై టోటల్ బాడీ లాంగ్వేజ్ ఇంగ్లీష్'. అంటూ వెంకీ చేసిన కామెడీ ప్రేక్షకులను నవ్వించినా.. అది శృతి తప్పిందనే చెప్పవచ్చు. ఇలాంటి క్యారెక్టర్ లో వెంకీ మొదటి సారి డిఫరెంట్ గా నటించాడు. బట్లర్ ఇంగ్లీష్ కొన్ని చోట్ల పేలితే కొన్ని చోట్ల అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక.. పక్క క్యారెక్టర్ తో చెప్పించాల్సి వచ్చింది. ఇక వెంకటేష్ కి విలన్ గా పోసానిని ఎంచుకొని దర్శకుడు సాహసమే చేశాడు. విలన్ కామెడీ చెయొచ్చుకానీ, కమెడియన్ తో విలనిజం పండించడం సాధ్యం కాదు. ఈ చిన్న లాజిక్ ను దర్శకుడు మిస్ అయ్యాడు. 


చెల్లెలు సంరక్షణ కోసం అన్న పడే తపన ఎదురుగా నిలబడిన పోసాని తో పిచ్చ కామెడీ అయ్యింది. జయప్రకాష్ రెడ్డి నటనలో, వెంకీ కి సపోర్ట్ గా బాగానే మెప్పించాడు. 'రామ్', 'రెహమాన్' పాత్రల్లో రామ్ బాగా నటించాడు. రెహమాన్ గా ఎంట్రీతోనే కేక పెట్టించాడు. అయితే సెంకడాఫ్ లో ఆ క్యారెక్టర్ తేలిపోయింది. షాజన్ పదాంసీ అందంలో గానీ.. నటనలోగానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రామ్ కి అక్కగా, వెంకటేష్ కి ప్రియురాలిగా చేసిన అంజలి, అక్కగానే బెటర్ గా కనిపించింది.

 ఇక కొవై సరళతో చేసిన క్లబ్ డ్యాన్స్ లు కొద్దిగా నవ్వించినా.. చాలా దారుణంగా అనిపించింది. అలీ, ఎమ్మెస్ నారాయణ ఉన్నంతలో పర్వాలేదనిపించారు. ఇక 'గబ్బర్ సింగ్' అంత్యాక్షరి లాగా క్లైమాక్స్ ని పాటలతో నింపడంతో.. ఒక రోటీన్ క్లైమాక్స్ తో ముగిసింది.

   ప్లస్ లు:..రామ్ నటన, కామెడీ, పాటలు, ఫొటోగ్రఫీ, వెంకటేష్.


   మైనస్ లు: సెకండాఫ్, రోటీన్ డ్రామా, కామెడీ, క్లైమాక్స్, హీరోయిన్, శృతి తప్పిన బట్టర్ ఇంగ్లీష్.


   ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళితే అక్కడక్కడా నవ్వుకోవచ్చు.. మొత్తానికి మసాలా కి ఉండాల్సిన ఘాటు తక్కువయ్యింది. దీంతో టెస్ట్ తగ్గింది. 


ఇక ఈ చిత్రానికి '10టివి' ఇచ్చే రేటింగ్..2/5.

Thursday, November 14, 2013

సస్పెన్స్ గా మిగిలిపోయిన 'సత్య-2'! (సినిమా సమీక్ష)

(''సత్య2'' సినిమాపై '10 టివి' ప్రసారం చేసిన సమీక్ష ఇది...)


'రామ్ గోపాల్ వర్మ'.. మన సినిమా ఇండస్ట్రీలో సంచలన కామెంట్స్ కు కేరాఫ్. తన సినిమా విడుదలకు సిద్ధంగా ఉందంటే చాలు.. దానికి సంబంధించి ఎదో ఒక వివాదంగాని, సంచలనాత్మకమైన కామెంట్స్ గానీ చేసి అందరి చూపు తన తనవైపు తిప్పుకుంటాడు. సినిమాను వివాదస్పదంగా మార్చి పబ్లిక్ సిటి చేసుకుంటాడు. అంతేకాదు.. వర్మ సినిమా చేస్తున్నాడంటే.. అటు బాలీవుడ్..ఇటు టాలీవుడ్.. సినిమాపై టాక్ క్రేజీ గా మారిపోతుంది. అతని సినిమా చూడడానికి చాలా మంది అతృతగా ఎదురు చూస్తుంటారు. ఎక్కువగా హారర్, మాఫియా అంటు వచ్చే వర్మ తన సినిమాల్లో ఎదో కొత్త చూపించే ప్రయత్నం చేస్తాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అలాంటి వర్మ.. ఒకప్పుడు సంచలనం సృష్టించిన 'సత్య'కు సీక్వెల్ గా 'సత్య-2' మూవీతో వస్తున్నాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదలయ్యింది. మరి వర్మ స్పెషల్ గా, భారీ అంచనాలతో విడుదలయిన ఈ చిత్ర ఫలితం ఎలా ఉందో.. చూద్దాం..


  కథ విషయానికి వస్తే:

పల్లెటూరు నుంచి ముంబై వచ్చిన ఓ కుర్రాడు సత్య(శర్వానంద్). అక్కడ
తన ప్రాణ స్నేహితుడైన నారా దగ్గర ఉంటాడు. జాబ్ కోసం వేతుకులాటలో భాగంగా..సత్య కొంతమంది
బిజినెస్ మాన్ లతో కలిసి కొత్త రకమైన మాఫియాని సృష్టించడం మొదలు పెడతాడు. "కంపెనీ" అనే పేరుతో
మొదలైన ఈ మాఫియా దేశం మొత్తం వ్యాపిస్తుంది. అదే సమయంలో ఈ కంపెనీ వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకోడానికి ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ని నియమిస్తుంది. అప్పటినుండి సత్య జీవితంలో అనుకోని సంఘటనలు
చోటు చేసుకుంటాయి. అప్పుడే సత్యకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అని తెలుస్తుంది .. సత్య జీవితంలో చోటు
చేసుకున్న ఆ సంఘటనలు ఏంటి ?
 సత్య పోలీస్ ల నుండి తప్పించుకున్నాడా..? లేదా..? అన్నది మిగతా కథ.


విశ్లేషణ:

   ''క్రైమ్ చావదు.. దాని రూపం మార్చుకుంటుందంతే'', ''ఆంధ్ర ప్రదేశ్ లో

 ఉన్న గుండాలు, రౌడీలు, ఫ్యాక్షనిస్టులు ప్రస్తుతం ఏం చేయడం లేదు
కాబట్టి ఓ కొత్త రకం క్రిమినల్ మనముందుకు వస్తున్నాడు'' అనే వర్మ
వాయిస్ ఓవర్ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసింది.
అయితే ఇది చెప్పుకోవడానికి సీక్వెల్ మూవీనే అయినా.. తెలుగులో వచ్చిన మహేష్ 'బిజినెస్ మేన్' లా
అనిపించడంతో ప్రేక్షకులు కొత్త బోర్ గా ఫీలవుతారు.

అయితే.. దీనిలో కథ సింపుల్ గా ఉన్నా.. వర్మ టేకింగ్ మాత్రం చాలా రోజుల తర్వాత పర్వాలేదనిపించింది.
కానీ క్లైమాక్స్ ను సస్పెన్స్ తో ముగించడం ప్రేక్షకుడిలో అసంతృప్తిని మిగిల్చింది. వర్మ సినిమా అంటే ఓ
ప్రత్యేకత ఉంటుంది. అతని మార్క్ మూడ్ ను ఎలివేట్ చేసే ఆర్ ఆర్ ఈ సినిమాలో మరోసారి బాగా ఉపయోగించుకున్నాడు. కొన్ని చోట్ల సన్నివేశాలు ప్రశ్నగా మిగిలిపోతాయి. మాటలు బాగున్నాయి.

క్లైమాక్స్ సీన్స్ లో నిశ్శబ్ధం ఒక ఆసక్తిని క్రియేట్ చేసింది. వర్మ వాయిస్ ఓవర్ పర్వలేదనిపించింది.
కాకపోతే.. అదే పనిగా ఉండడం బోర్ ను తెప్పిస్తుంది. ఇక హీరో నేపథ్యం చూపించడంలో దర్శకుడు
నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సత్యకు సీక్వెల్ గా వచ్చినా.. దానికి.. దీనికి
ఎలాంటి  సంబంధం కనిపించదు. హీరో తను ఏది అనుకుంటే అది అయిపోతుంది. అతని చర్యలకు ప్రభుత్వం
నుంచి ఏలాంటి ప్రతిచర్యా కనిపించకపోవడం సెట్ కాలేదు. సత్య ల్యాప్ టాప్ లో రెండు సార్లు అటు ఇటు
అని ప్లాన్ లు చెప్పడం వంటి సీన్లు చాలా సిల్లీగా అనిపిస్తాయి.

ఇక ఈ చిత్రంలో నటీనటుల గురించి ఓ సారి చూస్తే..
సత్యగా నటించిన శర్వానంద్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నలిచాడు. కళ్లతో అతను పలికించిన భావాలే కథను నడిపించాయి. హీరోయిన్ సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. కేవలం నామమాత్రంగానే మిగిలిపోయింది.

 శర్వానంద్ తప్ప మిగతా ఆర్టిస్టులంతా ఇతర భాషల వాళ్లే కావడం పెద్ద మైనస్. చాలా రోజుల తర్వాత
ఈ సినిమాతో వర్మ తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. అతను పాడిన పాట కూడా బాగుంది. కాకపోతే.. సినిమా అక్కడక్కడ అతుకులుగా అనిపిస్తుంది.

 'సత్య2' తీసేటప్పుడు వర్మ చెప్పిన మాట ప్రకారం మాఫియా కన్సెప్ట్ తో ఇది నాకు చివరి సినిమా అన్నాడు.
అతను అన్నట్టుగానే ఈ మూవీతోనే ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని
సినీ విమర్శకుల అభిప్రాయం.

ప్లస్ లు:.. వర్మ టేకింగ్, శర్వానంద్ యాక్షన్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.

మైనస్ లు చూస్తే:.. పాత స్టోరీ, పాటలు, ఎంటర్ టైన్ మెంట్ లేదు. లాజిక్ లేని కథనాలు, మాటలతో నడిచే సన్నివేశాలు.

ఓవరాల్ గా 'బిజినెమేన్'ను తలపించే ఈ సినిమా చివరకు సస్పెన్స్ గానే మిగిలిపోయింది.
అయితే ఇది వర్మ చిత్రాలను ఇష్టపడేవారికి మాత్రం పర్వాలేదనిపిస్తుంది.

కానీ సాధారణ ప్రేక్షకులు ఇబ్బంది పడతారనడంలోనూ డౌట్ లేదు.

ఇక ఈ చిత్రానికి '10టివి' ఇచ్చే రేటింగ్.. 2/5.
..............................

Wednesday, November 13, 2013

'చండీ'.. 'సముద్రం'లో కలిసిపోయింది.! (సినిమా సమీక్ష)

(''చండీ'' సినిమాపై '10 టివి' ప్రసారం చేసిన సమీక్ష ఇది...)


సాధారణంగా ఏ హీరోయిన్ అయినా.. సినిమాల్లో ఫేడ్ అవుట్ అవుతున్న దశలో టర్న్ తీసుకుని తమ కెరీర్ కి క్లైమాక్స్ ఇచ్చే పాత్రలు చేస్తుంటారు. రీసెంట్ గా ఇండస్ట్రీలో 'ఛార్మి' కూడా ఇలాంటి పాత్రలే చేసింది. ఇక ఈ రూట్ లోకి ఇప్పుడు ప్రియమణి వచ్చి చేరింది. తనకు స్టార్ హీరోయిన్ ఇమేజ్ దూరమయ్యాక హీరోల ప్రక్కన ఛాన్స్ లు దొరక్క ఇలా టర్న్ తీసుకుంది. హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఇక సోలో యాక్షన్ లో తన సత్తా చాటాలని ప్రియమణి ఫిక్స్ అయ్యింది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చిత్రాలలో వస్తుంది. అయితే 'అరుంధతి'లో అనుష్కలా.. అనిపించే 'చండీ'లో నటించింది. భారీ అంచనాలతో ఈ శుక్రవారం విడుదలయిన ఈచిత్రం ఎలా ఉందో .. చూద్దాం..


సాధారణంగా ఏ హీరోయిన్ అయినా.. సినిమాల్లో ఫేడ్ అవుట్ అవుతున్న దశలో టర్న్ తీసుకుని తమ కెరీర్ కి క్లైమాక్స్ ఇచ్చే పాత్రలు చేస్తుంటారు. రీసెంట్ గా ఇండస్ట్రీలో 'ఛార్మి' కూడా ఇలాంటి పాత్రలే చేసింది. ఇక ఈ రూట్ లోకి ఇప్పుడు ప్రియమణి వచ్చి చేరింది. తనకు స్టార్ హీరోయిన్ ఇమేజ్ దూరమయ్యాక హీరోల ప్రక్కన ఛాన్స్ లు దొరక్క ఇలా టర్న్ తీసుకుంది. హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఇక సోలో యాక్షన్ లో తన సత్తా చాటాలని ప్రియమణి ఫిక్స్ అయ్యింది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చిత్రాలలో వస్తుంది. అయితే 'అరుంధతి'లో అనుష్కలా.. అనిపించే 'చండీ'లో నటించింది. భారీ అంచనాలతో ఈ శుక్రవారం విడుదలయిన ఈచిత్రం ఎలా ఉందో .. చూద్దాం..
కథ విషయానికి వస్తే.:. దేవీపట్నం అనే ఓ ఊరి పెద్ద 'అశోక గజపతి రాజు'. అల్లూరి సీతారామరాజు వంశీకుడు. అతని కుమార్తె గంగ(ప్రియమణి). చిన్నప్పటి నుంచి తాత వీరత్వం పునికి పుచ్చుకుంటుంది. ఊరి క్షేమం కోసం గంగ కుటుంబం ఎలాంటి త్యాగానికైనా ముందుటుంది. ఆ ఊరి భూగర్భంలో విలువైన గనులు ఉన్నాయని తెలుసుకున్న ఓ కంపెనీ.. మంత్రి(ఆశిష్ విద్యార్థి) అండతో కబ్జాకు రెడీ అవుతుంది. కబ్జా క్రమంలో విలన్లతో తలపడి గంగ మినహా మొత్తం కుటుంబ బలవుతుంది. తన కుటుంబాన్ని, ఊరి ప్రజలను మట్టుబెట్టిన వారిపై గంగ ఎలా ప్రతీకారం తీర్చుకుందన్నదే 'చండీ' మూవీ కథ.


విశ్లేషణ:.. చండీ సినిమా చూసిన ప్రేక్షకుడికి మొదట టాలీవుడ్ లోని సినిమాలు గుర్తొస్తాయి. విలన్ లను వేటాడే సమయంలో హీరోలందరూ.. గంగ క్యారెక్టర్ లో కనిపిస్తారు. సమర్థుడైన దర్శకుడు ఒక పడవను నడిపే కెప్టెన్ లాంటివాడు. అన్ని క్రాఫ్టులను అనుసంధానం చేసుకుంటూ... సినీమాను ముగింపు వరకు నడిపిస్తాడు. కానీ నిర్లక్ష్యంగా డైరెక్షన్ చేస్తే.. సినిమా అంతా పడవలా మునిగిపోవడం ఖాయం. ప్రస్తుతం చండీ సినిమాతో దర్శకుడు సముద్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటికే వచ్చిన చిత్రాల్లోకి కొన్ని సీన్లను కాపీ కొట్టి దానికి కొత్త రంగులు అద్ది చండీని తెరపైకి తెచ్చాడు. కానీ సినిమా ఎలా ఉండాలనేది మాత్రం మరిచిపోయాడు. 
నిర్మాతతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించేముందు...పేపర్ పై కథ ఎలా ఉండాలి..? సన్నివేశాలు ఎలా సాగాలి...? ఎక్కడ ఎమోషన్ తెప్పించాలి..? అన్న కనీస హోమ్ వర్క్ చేయకుండా 'చండీ'తో ప్రేక్షకులను చెండాడాడు. సినిమా మీద భారీ అంచనాలతో థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులకు దర్శకుడు నరకం చూపించాడనే చెప్పవచ్చు. సినిమా గోల సినిమాదే, ప్రేక్షకుల గోల ప్రేక్షకులదే అన్నట్లు థియేటర్లో చండీ పరిస్థితి తయారైంది. చివరిదాకా సినిమాతో ప్రేక్షకులు ఎక్కడా కనెక్ట్ కాలేదు.

చండీ పాత్రలో 'ప్రియమణి' బాగా పర్వాలేదనిపించింది. పాటల్లో అందాన్ని, ఫైట్లలో తన పవర్ ను బాగా చూపించింది. అదే క్రమంలో కొద్దిగా ఓవరాక్షన్ ను చూపించింది. ఇక 'నేను రెబల్, నా ఫ్యామిలీ రెబల్' అంటూ.. కృష్ణంరాజు చేసిన హంగామా సినిమాకు ఏ మాత్రం ప్లస్ కాలేకపోయింది. శరత్ కుమార్, ఆశిష్ విద్యార్థి, నాగబాబు, వినోద్ కుమార్, అలీ, పోసాని ఇలా అందరి పాత్రలు యావరేజ్ గానే మిగిలిపోతాయి.


సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. గత కొన్నేళ్లుగా ఔట్ డేటెడ్ సినిమాలు చేస్తున్న సముద్ర...చండీతో ప్రేక్షకులను జడిపించాడు. కాకపోతే.. ఇంకా ఎడిటింగ్ చేయాల్సిన అంశాలు బాగానే ఉన్నాయి. కుటుంబాన్ని కోల్పోయిన బాధ ఉన్న ఏ అమ్మాయైనా...క్లబ్ డాన్సులు చేస్తూ పాటలు పాడుతుందా...క్లబ్ డాన్సర్లా పాటలు పాడాక...ఇక ఆ హీరోయిన్ చెప్పే నీతి పాఠాలు ఎవరైనా వింటారా..? అనేది అక్కడ పెద్ద ప్రశ్న సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. సన్నివేశాల్లో లింకులు లేకుండా, బాధ్యతా రహితంగా సినిమా తీశాడు. కథ ప్రేక్షకులకు నచ్చేలా తీయాలన్న నిజాయితీ దర్శకుడిలో ఎక్కడా కనిపించలేదు.


ప్లస్ లు:.. ప్రియమణి నటన ఓకే అనిపించింది. నాగబాబు ఉన్నంతలో బాగానే నటించాడు. ఫోటోగ్రఫీ పర్వాలేదు.

మైనస్ లు:.. పాటలు, మూస కథ, దర్శకత్వం, లింకులు లేని సన్నివేశాలు, ఎడిటింగ్.


పాత చరిత్రకు కొత్త రంగు వేసి సముద్ర తీసిన 'చండీ'కి '10టివి' ఇచ్చే రేటింగ్.. 1/5.

.................................................

Tuesday, November 12, 2013

సేవా బాణీలోనే... ఆకాశవాణి!

- ఇవాళ (నవంబర్‌ 12) 'ప్రజాసేవా ప్రసార దినం'

   ఏకకాలంలో ఇటు విజ్ఞానాన్నీ, అటు వినోదాన్నీ, మరోపక్క విషయ సమాచారాన్నీ ఎంతో సరళంగా, వేగంగా అందించే సాధనంగా రేడియోను చెప్పుకోవచ్చు. మన దేశంలో ప్రజా ప్రసార సాధనంగా 'ఆకాశవాణి' ఎన్నో దశాబ్దాలుగా ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తోంది. ఇప్పుడు ప్రైవేటు రేడియోలు, ఇంటర్నెట్‌ రేడియో సేవలు, ప్రైవేట్‌ ఎఫ్‌.ఎం. ఛానళ్ళు ఎన్ని వచ్చినా, ప్రజా సేవకు పూర్తిగా కట్టుబడిన సాధనంగా 'ఆకాశవాణి' తన చారిత్రక కర్తవ్యాన్ని విస్మరించకుండా ముందుకు నడుస్తోంది. ఆ కర్తవ్యాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ, ప్రజాసేవకు పునరంకితమవుతూ మన దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నవంబర్‌ 12న 'ప్రజాసేవా ప్రసార దినం' (పబ్లిక్‌ సర్వీస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ డే) జరుపుకొంటోంది. 

ఈ ప్రత్యేక దినోత్సవానికి ఓ చారిత్రక నేపథ్యం కూడా ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1947 నవంబర్‌ 12న మహాత్మా గాంధీ తొలిసారిగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రాన్ని సందర్శించారు. రేడియో ద్వారా ప్రసంగించారు. రేడియో కేంద్రానికి వచ్చి గాంధీజీ ప్రసంగించడం అదే మొదటిసారి, చివరిసారి కూడా! దేశవిభజన తరువాత కురుక్షేత్ర ప్రాంతంలోని శిబిరంలో తలదాచుకున్న పాకిస్తానీ శరణార్థులను ఉద్దేశించి, గాంధీ ఆ ప్రసంగం చేశారు. ఆ సందర్భానికి గుర్తుగా ప్రతి ఏటా నవంబర్‌ 12వ తేదీని 'ప్రజాసేవా ప్రసార దినం'గా పరిగణించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అలా 2001 నుంచి ప్రతి ఏటా ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. 


నిజానికి, భారతీయ కళలు, సంస్కృతికి సంబంధించిన వివిధ రూపాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ప్రజాప్రసార మాధ్యమం 'ఆకాశవాణి' అని చెప్పుకోవచ్చు. శాస్త్రీయ సంగీతం, నాటకం, కవిత్వం, జానపద గీతాల లాంటివాటికి ఇప్పటికీ అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. అలాగే, పంటల సంరక్షణ, కొత్త రకం సేద్య విధానాలపై ఉపయుక్త సమాచారాన్ని తెలియజేస్తోంది. దేశంలో 23 భాషల్లో, 146 మాండలికాల్లో వినోదాన్నీ, వార్తలనూ అందిస్తున్న ఏకైక మాధ్యమంగా ఆకాశవాణి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ముందంజలో నిలుస్తోంది. ఇన్ని భాషల్లో ప్రసారాలు అందిస్తూ, ప్రపంచంలోని అతి పెద్ద ప్రసార సంస్థల్లో ఒకటిగా నిలిచింది. దేశం నలుమూలల్లో మొత్తం 403 'ఆల్‌ ఇండియా రేడియా' కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా దేశంలోని 92 శాతం ప్రాంతానికీ, మొత్తం జనాభాలో 99.19 శాతం మందికీ ఈ ప్రసారాలు అందుతుండడం విశేషం. 


ఈ సారి 'ప్రజాసేవా ప్రసారదినం' సందర్భంగా 'రేడియో ప్రచార సభ' ద్వారా ప్రత్యేక ప్రచారోద్యమానికి ఆకాశవాణి - హైదరాబాద్‌ కేంద్రం శ్రీకారం చుట్టింది. ''ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరంగా తెలియజేసి, వాటిని వినడం వల్ల కలిగే ప్రయోజనాన్ని చెప్పడం, వారిని చైతన్యవంతుల్ని చేయడం ఈ 'రేడియో ప్రచార సభ' ముఖ్యోద్దేశం'' అని ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ మంగళగిరి ఆదిత్యప్రసాద్‌ తెలియజేశారు. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌ మండలంలోని బాకారం గ్రామంలోని ప్రజలను నేరుగా కలుసుకొని, వారిని చైతన్యవంతుల్ని చేసే పని చేపట్టింది. అందుకోసం నవంబర్‌ 10న ఆ గ్రామంలో ఓ ప్రత్యేక సమావేశం నిర్వహిచింది. ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్‌, సీనియర్‌ వ్యవసాయ శాస్త్రవేత్త అయిన డాక్టర్‌ ఎల్‌. జలపతిరావుతో రైతుల సందేహాలకు సమాధానాలు ఇప్పించింది. సరికొత్త సేద్య విధానాల గురించి వారికి అవగాహన కల్పించేందుకు కృషి చేసింది. ఈ కార్యక్రమం మొత్తాన్నీ రికార్డు చేసి, ఓ 30 నిమిషాలకు కుదించి, ఈ రోజు ఉదయం 7.15 గంటలకు ఆకాశవాణి హైదరాబాద్‌, రెయిన్‌బో ఛానళ్ళలో ప్రసారం చేస్తోంది.''గడచిన ఏడాది కాలంలో వివిధ ప్రాంతాల్లో ఆహూతుల సమక్షంలో మూడు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలను నిర్వహించాం. ఈ కార్యక్రమాల రికార్డింగులను దేశవ్యాప్తంగా అన్ని రేడియో కేంద్రాలూ రిలే చేశాయి'' అని ఆదిత్యప్రసాద్‌ చెప్పారు. అలాగే, మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో నిర్వహించిన జానపద కళోత్సవం, నల్గొండలో అందరూ మహిళలే సమర్పించిన దేశభక్తి పూరిత సంగీత - సాహిత్య రూపకం, వంద మంది పిల్లలు పాల్గొన్న రూపకం లాంటివి పలువురిని ఆకట్టుకున్నాయి. 

ప్రస్తుతం ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం అందిస్తున్న 'లలిత సంగీత సమీరం', 'వేయి పడగలు' ధారావాహిక నాటకం, 'మధుర గీతామృతం', 'రైతుల ఫోన్‌-ఇన్‌ కార్యక్రమాల'కు విశేష స్పందన వస్తోందని ఆయన వివరించారు. హైదరాబాద్‌ కేంద్రం ప్రసారం చేస్తున్న అయిదు ఛానళ్ళూ శ్రోతల నుంచి ఆదరణ అందుకుంటున్న ట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌, విశాఖపట్నం నగరాల్లో టీవీలకు 'సెట్‌ టాప్‌ బాక్స్‌'లు తప్పనిసరి అని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 'డైరెక్ట్‌ టు హౌమ్‌' (డి.టి.హెచ్‌) వేదికపై ఆకాశవాణి ఇరవై నాలుగు గంటలూ నిర్విరామంగా ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ఆ సెట్‌ టాప్‌ బాక్సుల ద్వారా టీవీ సెట్లలోనూ కొందరు శ్రోతలు వింటూ ఉండడం విశేషం. 

మొత్తానికి, 'రేడియో ప్రచార సభ'ల లాంటి వినూత్న ప్రచారాల ద్వారా ప్రజోపయోగ కార్యక్రమాల వైపు మరింతగా దృష్టిసారిస్తే, అనేక ఆధునిక మాధ్యమాల మధ్యన కూడా 'బహు జన హితాయ - బహు జన సుఖాయ' అన్న తన ఆశయానికి 'ఆకాశవాణి' మరింత దగ్గరవుతుంది.

     - రెంటాల జయదే


(Published in 'Praja Sakti' daily dated 12 Nov 2013 -Tuesday, Page No.5)
.....................................................

సీరియల్ కు ఎక్కువ..సినిమాకు తక్కువ.. ఈ 'చిన్న పిల్ల'! (సినిమా సమీక్ష)

('‘నేనేం చిన్నపిల్లనా..?’' సినిమాపై '10 టివి' ప్రసారం చేసిన సమీక్ష ఇది...)


దాదాపు 50ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత డా.డి. రామానాయుడు చాలా రోజుల తర్వాత నిర్మాతగా తీసిన పూర్తి కుటుంబ కథా చిత్రం ‘నేనేం చిన్నపిల్లనా..?’. ఇప్పటి వరకు ‘గంగ పుత్రులు’, ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ లాంటి సినిమాలను తీసిన పి. సునీల్ కుమార్ రెడ్డి ఈ సారి డిఫరెంట్ గా ఓ కుటుంబ కథా చిత్రానికి దర్శకత్వం వహించాడు. 'అందాల రాక్షసి ఫేం' రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా మాజీ మిస్ ఇండియా 'తన్వి వ్యాస్' హీరోయిన్ గా పరిచయమైంది. వీరందరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'నేనేం చిన్నపిల్లనా..?.


కథ విషయానికి వస్తే..:
కట్టుబాట్లు సంప్రదాయాల మధ్య పెరిగిన స్వప్నకు అవి చాలా ఇబ్బందిగా ఉంటాయి. స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న స్వప్న ఇంట్లో పెద్దలను అతి కష్టం మీద ఒప్పించి పైచదువుల కోసం స్వీడన్ వెళ్తుంది. అక్కడ క్రిష్ పరిచయం అవుతాడు.. తనకు నచ్చినట్టు ఉండే ఆనాథ అయిన క్రిష్ ను స్వప్న ఇష్టపడుతుంది. అలా వారి ప్రేమ సాగుతున్న క్రమంలో ఓసారి తల్లిదండ్రుల 'షష్టి పూర్తి' సందర్భంగా తనతో పాటు క్రిష్ ను ఇండియాకు తీసుకువస్తుంది. అక్కడ తన కుటుంబంలోని అనుబంధాలను చూసి స్వప్న పై మరింత ఇష్టం పెంచుకుంటాడు క్రిష్. వీరి ప్రేమ విషయం స్వప్న ఇంట్లో తెలుస్తుంది. ఆ తర్వాత వారి ప్రేమ ఫలించిందా..? ఆమె తండ్రి పెళ్లికి ఒప్పుకున్నాడా..? అనేది మిగిలిన కథ..

విశ్లేషణ:.. ఒక సినిమాకి కథను ఎంచుకునేముందు థియేటర్స్ కి ప్రేక్షకులను రప్పించేంత బలమైన అంశాలు ఏమున్నాయని దర్శక, నిర్మాతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ ఇలాంటి ఆత్మపరిశీలన లోపించిన కథ.. కథనాలకు రూపమే 'నేనేం చిన్న పిల్లనా ?'. అసలు ఈ టైటిల్ కు కథకు సంబంధం లేదు. హీరోయిన్ ఎక్స్ ప్రెషన్స్ కి, డైలాగ్స్ కి పొంతనే లేదు. ఏ పాత్రకూ క్యారక్టరైజేషన్ సెట్ కాలేదు. మాటలు కొత్తగా అనిపించవు, కొన్ని అర్థంకావు. కమెడియన్స్.. నవ్వించలేక నవ్వుల పాలయ్యారు. ఎల్బీ శ్రీరామ్.. బలవంతంగా ఇంగ్లీష్ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేసినా.. ప్రేక్షకులు నవ్వకపోగా.. అసహనానికి గురయ్యారు. ఇక దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మార్క్ సినిమాలో ఎక్కడా కనిపించదు. గత చిత్రాలతో పోల్చితే అసలు ఈయనే డైరెక్ట్ చేశాడా..? అనే సందేహం కూడా కల్గుతుంది. శత చిత్ర నిర్మాతగా ఖ్యాతి గాంచిన రామానాయుడు.. ఈ కథను ఎంచుకోవడంలో తన అనుభవానికి పనిచెప్పలేదని తెలుస్తోంది. ఎందుకంటే సినిమాలో ఎక్కడా.. కొత్తదనం కనిపించదు. ఎమ్.ఎమ్. శ్రీలేఖ మ్యూజిక్ లో రెండు పాటలు పర్వాలేదనిపించాయి. కాకపోతే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దారుణంగా ఉంది. నటనలో రాహుల్ ఓకే అనిపించాడు. ఇతర ఆర్టిస్టులు ఎవరూ.. పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంట్లో తీరిగ్గా కూర్చుని చూసే సీరియల్స్ లో ఇంతకంటే బెటర్ కథ.. కథనాలు కన్పిస్తాయనడంలో సందేహం లేదు.


ప్లస్ పాయింట్స్: కుటుంబ కథా చిత్రంగా ఉండడం ఒక్కటే దీనిలో ప్లస్.

మైనస్ పాయింట్స్: తన్వీవ్యాస్, ఆకట్టుకోని పాత్రలు, నీరసంగా సాగే కథనం, పండని సెంటిమెంట్.

ఇక.. నేనేం చిన్న పిల్లనా అంటూ వచ్చిన ఈ చిత్రం కనీసం చిన్న పిల్లలకు కూడా నచ్చదని సినీ విమర్శకుల అభిప్రాయం. 
ఈ చిత్రానికి '10టివి' ఇచ్చే రేటింగ్.. 1/5.
..................................

Monday, November 4, 2013

పౌరుషం లేని.. 'పల్నాడు'! (సినిమా సమీక్ష)

('పల్నాడు' సినిమాపై '10 టివి' ప్రసారం చేసిన సమీక్ష ఇది...)

'విశాల్'.. తెలుగులో 'పందెంకోడి', 'పొగరు', వంటి సినిమాలతో ఇక్కడ తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న నటుడు. అయితే చాలా రోజులుగా మంచి హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తీసుకొని 'పల్నాడు' సినిమా చేశాడు. అంతేకాదు తన ఓన్ ప్రొడక్షన్ 'విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ' అనే బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇక 'నాపేరు శివ' వంటి సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన సుశీంద్రన్ దీనికి దర్శకత్వం వహించాడు. చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు కథ గురించి చూద్దాం.. 

చిత్ర కథ విషయానికి వస్తే..      సెల్‌ ఫోన్‌ షాప్‌ నడుపుకునే శివకుమార్‌ (విశాల్‌) స్వతహాగా పిరికివాడు. తమ ఇంటిపైనే అద్దెకుండే మాలతిని (లక్ష్మి మీనన్‌) ప్రేమిస్తాడు. ఆ ఊరికి పెద్ద దాదా అయిన కాటం రవి.. తన మైనింగ్‌ వ్యాపారానికి అడ్డు తగిలాడని, శివకుమార్‌ అన్నయ్యని చంపేస్తాడు. దాంతో శివకుమార్‌, అతని తండ్రి (భారతీరాజా) విడివిడిగా రవిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. వీరు ఆ విలన్ ను చంపుతారా..? ఆ తర్వాత ఏమైందనేది మిగతా కథ. 


విశ్లేషణ:..    సినిమా ఎక్కువగా రీవెంజ్ స్టోరీగానే కనిపిస్తుంది. మొదటి అర్థభాగంలో సరదాగా సాగినా.. సెకండాఫ్ లో కక్ష సాధించడానికి హీరో ప్రయత్నిస్తుంటాడు. దీని వల్ల రెండవ భాగంలో ఎంటర్ టైన్ మెంట్ అసలే ఉండదు. ఇది ప్రేక్షకులకు బోర్ తెప్పిస్తుంది. కథలో ఉన్న పటుత్వం సెకండాఫ్ లో మిస్ అయ్యింది. నటీనటుల పనితీరు.. హీరో విశాల్ నటన బాగుంది. విశాల్ కాస్త డిఫరెంట్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపిస్తుంది. అతని హవాభావాలతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ మంచి అమ్మాయిలా కనిపిస్తూనే అందంతో ఆకట్టుకుంటుంది. తండ్రి పాత్రలో భారతీ రాజా పరవాలేదనిపించాడు. 
కమర్షియల్ కోసం అనవసర హంగులు లేకుండా.. కథను నిజాయితీగా నడిపించేందుకు దర్శకుడు జాగ్రత్త పడ్డారు. పాటలు బాగున్నాయి. కానీ ఈ సినిమా 'పల్నాడు' పౌరుషాన్ని చూపించలేకపోయింది. ఎప్పుడూ కొత్త కథలు చేసే దర్శకుడు సుశీంద్రన్.. ఈ సినిమాలో 'రీవెంజ్' అంటూ వెళ్లడం ప్రస్తుత పరిస్థితులకు సెట్ కాలేదనిపించింది. హీరో అన్నని చంపిన విలన్ ను మట్టుపెట్టడానికి తండ్రితో, విశాల్ చేస్తున్న ప్రయత్నాలేవి సినిమాలో కనిపించవు. రీవెంజ్ కథతో ఎప్పుడు సినిమా తీసినా ఓ ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే దానిలో ప్రధానంగా ఎంటర్ టైన్ మెంట్ లోపిస్తుంది. ఈ సినిమాలో కామెడీ, ఎంటర్ టైన్ మెంట్ లొపిస్తుందని ప్రేక్షకుడికి స్పష్టంగా అర్థమవుతుంది. 


కథలో యాక్షన్ సీన్ లకు ప్రాధాన్యత లేకపోతే.. అది అతుకులుగా మారుతుంది. గతంలో 'నాపేరు శివ' సినిమాలో యాక్షన్ సీన్ లను బోర్ లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు సుశీంద్రన్..'పల్నాడు'లో మాత్రం ఈ లోపాలను సవరించుకోలేక పోయాడు. ఫలితంగా ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ లేని ఈ మూవీ యావరేజ్ గా మిగిలిపోయిందని చెప్పవచ్చు. 


ప్లస్, మైనస్ లు:.. విశాల్ నటన బాగుంది. మ్యూజిక్ ఓకే, ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఇతర నటులు కూడా తమ పాత్ర మేరకు న్యాయం చేశారు.


 మైనస్ లు చూస్తే.. సెకండాఫ్ స్టోరీ సినిమాకు పెద్ద మైనస్ అయ్యింది. ఎంటర్ టైన్ మెంట్ అసలే లేదు. కామెడీ కూడా అంతే. యాక్షన్ సీన్స్ ఒక్కటీ కనిపించదు. సందర్భం వచ్చినప్పుడు ''పిల్లి కూడా పులిలా తిరగబడుతుంది' అనేది దర్శకుడు దీని ద్వారా చూపించాలనుకున్నాడని సినిమా చూసిన వారికి అర్థమవుతుంది.


 చివరగా చెప్పాలంటే.. ఈ సినిమా మిడిల్ క్లాస్ రీవెంజ్ ఫార్ములా చిత్రంగా మిగిలిపోతుంది. 


ఇక ఈ చిత్రానికి '10టివి'ఇచ్చే రేటింగ్.. 1.5/5. 

..............................................................