జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, November 2, 2013

సాంకేతికంగా మరో ముందడుగు - 'క్రిష్‌ 3' (సినిమా సమీక్ష)




     మానవ జాతిని నాశనం చేయాలనీ, ప్రపంచం మీద తన ఆధిపత్యం నెలకొల్పాలనీ అనుకొనే విలన్ల కథలు, వాళ్ళను మట్టి కరిపించే శాస్త్రవేత్తలు, హీరోల కథలు మనకు తెలియనివేమీ కావు. ఇలాంటి సూపర్‌ హీరో సినిమాలు, సైన్స్‌ ఫిక్షన్‌ - ఫ్యాంటసీ సినిమాలు హాలీవుడ్‌లో కోకొల్లలు. కానీ, మన వెండితెర మీద మాత్రం ఖర్చు, సాంకేతిక పరిజ్ఞానాల రీత్యా అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి. 'క్రిష్‌3' అచ్చమైన అలాంటి హాలీవుడ్‌ తరహా కథ. కాకపోతే, దానికి భారతీయ సినిమా కథల తరహా ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. పిల్లల్ని ఆకట్టుకొనే అంశాలు మునుపటి భాగాలతో పోలిస్తే తగ్గినా, ఫరవాలేదనిపించారు. 
..........................................................................
చిత్రం - క్రిష్ 3, తారాగణం - హృతిక్ రోషన్, ప్రియాంకా చోప్రా, వివేక్ ఓబెరాయ్, కంగనా రనౌత్, సంగీతం - రాజేశ్ రోషన్, కెమేరా - ఎస్. తిరు, నిర్మాత, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - రాకేశ్ రోషన్
..........................................................................

దాదాపు పదమూడేళ్ళ క్రితం 'కహో నా ప్యార్‌ హై' సినిమాతో తెరంగేట్రం చేసిన హృతిక్‌ రోషన్‌ కెరీర్‌ మొదట్లో ఫ్లాపులను ఎదుర్కొన్నా, తరువాత హీరోగా నిలబడ్డారు. దర్శక - నిర్మాత అయిన తండ్రి రాకేశ్‌ రోషన్‌ సారథ్యంలో కృష్ణ అలియాస్‌ 'క్రిష్‌' పాత్రలో మన భారతీయ వెండితెరపై సూపర్‌హీరోగా ఎదిగారు. ఆ తండ్రీ కొడుకుల కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో సినిమా - 'క్రిష్‌3'. ఈ సైన్స్‌- ఫిక్షన్‌ చిత్రం 'కోయీ... మిల్‌ గయా', 'క్రిష్‌' చిత్రాల సూపర్‌హిట్ల తరువాత అదే సిరీస్‌కు కొనసాగింపుగా వచ్చిన మూడోది.

సూపర్‌ మ్యాన్‌ లాంటి హీరో, 'ఎక్స్‌ మెన్‌' లాంటి విలన్‌ ముఠా సభ్యులు, వాళ్ళ మధ్య పోరాటం - అనే హాలీవుడ్‌ సినీ వాణిజ్య కథలను బాగా కలగలిపి, ఈ సినిమాలో యథేచ్ఛగా వాడుకున్నారు. 'ఎప్పటికైనా, చెడు మీద మంచి విజయం సాధిస్తుంది' అనే వెండితెర సూత్రానికి తగ్గట్లుగా సినిమాను నడిపారు. కృష్ణ అలియాస్‌ క్రిష్‌ (హృతిక్‌ రోషన్‌) చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ గడిపేస్తుంటాడు. ఆపదలో ఉన్నవాళ్ళను ఆదుకొనేందుకు అవసరమైనప్పుడల్లా 'క్రిష్‌'గా అవతారమెత్తి, తన సూపర్‌మ్యాన్‌ శక్తులతో రక్షిస్తూ ఉంటాడు. జర్నలిస్టు ప్రియ (ప్రియాంకా చోప్రా) అతని భార్య. కృష్ణ తండ్రి డాక్టర్‌ రోహిత్‌ మెహ్రా (ద్విపాత్రాభినయంలో హృతిక్‌ రోషన్‌) ఓ శాస్త్రవేత్త. వెలుతురు జీవం పోస్తుందన్న దానిపై పరిశోధనలు చేస్తుంటాడు. 

ఇక, మెదడుతో ఆలోచించి, చేతి వేళ్ళతో ఏదైనా చేయగల శక్తిసంపన్నుడైన వికలాంగుడు కాల్‌ (వివేక్‌ ఓబెరారు) ఓ దుష్టుడు. తన డి.ఎన్‌.ఏ.కు సరిపడే బోన్‌ మ్యారో (ఎముక మూలగ)ను శరీరంలో ప్రవేశపెట్టుకొని మామూలు మనిషి కావాలనీ, మానవాళిని ధ్వంసం చేయాలనీ తనదైన లోకంలో ప్రయోగాలు చేస్తుంటాడు. రకరకాల జంతువుల నుంచి మ్యుటేషన్‌ ద్వారా అతను సృష్టించిన రకరకాల మానవ మృగాలు అతని బంట్లు. రంగులు మార్చే ఊసరవెల్లి నుంచి అలా తయారైన మానవ మృగం కాయ (కంగనా రనౌత్‌). కాల్‌ ఓ ప్రాణాంతక వైరస్‌ను కనిపెట్టి, దాన్ని ప్రపంచంపై ప్రయోగించి, దానికీ విరుగుడు కూడా తన డి.ఎన్‌.ఏ. నుంచే చేసి, కోట్లు గడిస్తుంటాడు. భారత్‌లో అతను ప్రవేశపెట్టిన వైరస్‌ను అరికట్టే మందును హీరో డి.ఎన్‌.ఏ. నుంచి అతని తండ్రి తయారు చేస్తాడు. అదెలా సాధ్యమైంది? అది తెలిసి విలన్‌ ఏం చేశాడు? విలన్‌కూ, హీరోకూ ఉన్న సంబంధమేమిటి? చివరకు ఆ విలన్‌పై హీరో ఎలా విజయం సాధించాడు? లాంటి వన్నీ మిగతా సినిమా.
   మొదట కాసేపు నెమ్మదిగా సాగే ఈ చిత్రం క్రమంగా పుంజుకొని ఇంటర్వెల్‌ దగ్గర కీలకమైన మలుపుతో ఆగుతుంది. ద్వితీయార్ధం రకరకాల మలుపులతో కొంత వేగం అందుకుంటుంది. చివరకు మాత్రం సుదీర్ఘమైన హీరో, విలన్‌ పోరాటంతో ముగుస్తుంది. క్లిష్టమైన ప్రోస్థెటిక్‌ మేకప్‌తో వృద్ధుడైన తండ్రి పాత్రను చక్కటి బాడీ లాంగ్వేజ్‌తో హృతిక్‌ చక్కగా అభినయించాడు. ఇక, కుమారుడు క్రిష్‌ పాత్రలో సిక్స్‌ - ఎయిట్‌ ప్యాక్‌తో దృఢంగా కనిపిస్తాడు. హీరోయిన్‌ ప్రియాంక కన్నా, కంగనా రనౌత్‌ పోషించిన విలన్‌ తరహా పాత్ర కథకు కీలకం. ఆ పాత్రను ఆమె పండించారు. అలాగే, విలన్‌గా వివేక్‌ ఓబెరారు కేవలం చక్రాల కుర్చీకే పరిమితమై కూడా ఆకట్టుకున్నారు. 

కెమేరా వర్క్‌ బాగున్న ఇంత భారీ కథను ఊహించడం, దాన్ని కెమేరా కన్నుతో తెరపై చూపించడం కష్టమే. టీమ్‌ వర్క్‌గా సాగిన ఆ పనిలో దర్శక, నిర్మాత సఫలమయ్యారు. చాలాభాగం మన హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ జరుపుకొన్న ఈ చిత్రం సాంకేతికంగా బాగుంటుంది. సినిమాలో వాడిన కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ (సి.జి.ఐ - కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజెస్‌) కానీ, యాక్షన్‌ సన్నివేశాలు - వాటి చిత్రీకరణ కానీ ఆశ్చర్యానందాలను కలిగిస్తాయి. ఏదైనా హాలీవుడ్‌ సినిమా చూస్తున్నామేమో అనిపిస్తాయి. హృతిక్‌ రోషన్‌ చెప్పినట్లు ''విజువల్‌ ఎఫెక్ట్‌ ్సకు సంబంధించినంత వరకు మన భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపై నిలుపుతుంది - 'క్రిష్‌3'. 

అయితే, హృతిక్‌ రోషనే ఈ మధ్య అన్నట్లు, ''ఏ సినిమా అయినా అనుకున్న ఫలితం సాధించాలంటే, టెక్నాలజీ ఒక్కదాని మీదే ఆధారపడితే సరిపోదు. టెక్నికల్‌గా సినిమా ఎంత బాగున్నా కథ ఉండాలి. అందులో విషయం ఉండాలి. సినిమాలోని ఆ పాత్రలతో ప్రేక్షకులు తాదాత్మ్యం చెందాలి. అది చాలా కీలకం'' అన్నారు. ఈ సినిమాలో లోపం ఏదైనా ఉందంటే, పెద్ద హృతిక్‌ రోషన్‌ పాత్ర చివరికి ఏమైంది లాంటి ఒకటి రెండు ఘట్టాలు మినహా ప్రేక్షకులకు భావోద్వేగాలు కలిగించే సన్నివేశాలు తక్కువగా ఉండడం. చావు బతుకుల్లో ఉన్న హీరోను చూసి, తండ్రి బాధపడడం లాంటి దృశ్యాలు ఆశించినంత పండలేదు.

సినిమాను సుదీర్ఘంగా చిత్రీకరించి, రెండున్నర గంటలకు కుదించడం వల్లనో, ఏమో కొన్ని చోట్ల లింకులు కనిపించవు. ఉదాహరణకు, హీరో తండ్రి, శాస్త్రవేత్త అయిన పెద్ద హృతిక్‌ రోషన్‌ సింగపూర్‌ వెళ్ళాక, అతను కిడ్నాప్‌ అయ్యాడనే దృశ్యమే కనిపించదు. నేరుగా అతణ్ణి విలన్‌ డెన్‌లో చూపెడతారు. ఇలాంటివి ఒకటి రెండు కనిపిస్తాయి. అలాగే, సర్వశక్తిమంతుడిగా చూపుడువేలుతో ఏ.కె. 47 గన్‌లను వంచేస్తూ, గుప్పిట మూసి ఆకాశంలోని హెలికాప్టర్లను కూడా పేల్చివేయగల సామర్థ్యం, ఎక్కడేం జరుగుతోందో ఇట్టే తెలుసుకొనే సత్తా ఉన్న విలన్‌ తీరా చివరలో హీరో భార్య ప్రియాంకా చోప్రా ఎక్కడుందంటూ వెతకడం లాంటివి మరీ సిల్లీగా ఉన్నాయి. విలన్‌కు కావాల్సింది తన డి.ఎన్‌.ఏ.కు సరిపడే 'ఎముక మూలగ' (బోన్‌ మ్యారో). ఆ అన్వేషణలో ఉన్న విలన్‌ డి.ఎన్‌.ఏ. ద్వారా వైరస్‌ను సృష్టించడం, మానవ మృగాల ద్వారా విధ్వంసం జరపడం లాంటివి అతని ప్రాథమికమైన లక్ష్యానికి తగినట్లుగా కనిపించవు.

అయితే, ఇప్పటికే 'కోయీ మిల్‌ గయా', 'క్రిష్‌' చిత్రాలు చూసి, ఆనందించినవాళ్ళు ఆ రకమైన ఆలోచనా దృక్పథంతో, ముందుగానే ట్యూన్‌ అయి ఈ 'క్రిష్‌3'కి వస్తారు కాబట్టి, వాళ్ళను ఈ సినిమా అధునాతనమైన సాంకేతికతతో అబ్బురపరుస్తుంది. అందుకే, స్క్రిప్టులో లోపాలున్నా, మిగిలిన హంగులు, ఆర్భాటాలతో సినిమా పాసై పోతుంది.

కొసమెరుపు: అన్నట్లు, ఈ సిరీస్‌లో మొదటి సినిమా పేరు - 'కోయీ మిల్‌ గయా'. రెండో సినిమా పేరు -'క్రిష్‌'. మరి, వీటి తరువాతి తాజా సినిమా ఏకంగా 'క్రిష్‌3'. మరి, మధ్యలో 'క్రిష్‌2' అనేది రానే లేదు. ఒకటి తరువాత 2వ నంబర్‌ రాకుండానే, 3వ నంబర్‌ రావడమేమిటంటారా? ఇలాంటి సినిమాల కథలోనే కాదు, పేరులోనూ లాజిక్‌ వెతకడం వృథా శ్రమే!
- రెంటాల జయదేవ

(ప్రజాశక్తి దినపత్రిక, 2 నవంబర్ 2013, శనివారం, పేజీ నం. 8లో ప్రచురితం)
........................................................................

0 వ్యాఖ్యలు: