జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, November 16, 2013

పిల్లల సినిమా పండుగ


  మరో సినిమా పండుగకు హైదరాబాద్‌ నగరం ముస్తాబైంది. ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ దాకా వారం రోజుల పాటు జరిగే '18వ భారత అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం' (ఐ.సి.ఎఫ్‌.ఎఫ్‌.ఐ)తో భాగ్యనగరం మళ్ళీ కళకళలాడుతోంది. ఏకంగా 7 రోజులు, 15 థియేటర్లు, 48 దేశాలు, 198 చిత్రాలు, సుమారు లక్షన్నర మంది ప్రేక్షకులు - ఇదీ స్థూలంగా ఈ తాజా చిత్రోత్సవం పరిమాణం. 2011 నాటి ఉత్సవం కన్నా, ఈసారి మరిన్ని ఎక్కువ దేశాలు, చిత్రాలు ఈ ఉత్సవంలో పాలు పంచుకుంటున్నాయి. దాంతో, సహజంగానే ఏర్పాట్లు కూడా భారీగానే జరుగుతున్నాయి. 

  
 హైదరాబాద్‌లో 1995లో జరిగిన 'భారత అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం' ఘనవిజయం సాధించడంతో, రెండేళ్ళకు ఒకసారి జరిగే ఈ సినిమా పండుగను అప్పటి నుంచి మన భాగ్యనగరంలోనే జరపాలని నిర్ణయించారు. ఈ చలనచిత్రోత్సవానికి శాశ్వత వేదికగా హైదరాబాద్‌ను నిర్ణయిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ఈ చలనచిత్రోత్సవం జంట నగరాల కీర్తికిరీటంలో మరో రత్నంగా వెలుగులీనుతోంది. 

ఈ 'భారత అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం' సినీ వర్గాల్లో 'గోల్డెన్‌ ఎలిఫెంట్‌' (బంగారు ఏనుగు) చిత్రోత్సవంగా ప్రాచుర్యం సంపాదించుకుంది. మన దేశంతో పాటు, విదేశాల్లో తయారవుతున్న బాలల చిత్రాలను ఇక్కడి చిన్నారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి, ప్రదర్శించి, వారిలో ఆలోచన, అపరిమితమైన ఉత్సాహం కలిగించడం ఈ ఉత్సవం ఉద్దేశం. అపురూపమైన కథా చిత్రాలు, లఘు చిత్రాలు, లైవ్‌ యాక్షన్‌ చిత్రాలు, యానిమేషన్‌ చిత్రాలను ఈ వారం రోజుల పండుగలో ప్రదర్శిస్తారు. తాజా చలనచిత్రోత్సవానికి ప్రపంచం నలుమూలల నుంచి కొన్ని వందల మంది సినీ నిపుణులు, ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ పండుగలో పాల్గొని, అంతర్జాతీయ బాలల సినిమాలను చూసే అనుభవాన్ని సొంతం చేసుకొనేందుకు దేశం నలుమూలల్లోని చిన్న చిన్న గ్రామాలు, పట్నాల నుంచి బాలబాలికలు వస్తుంటారు. 
చాచాతో అనుబంధం
భారత ప్రభుత్వంలోని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ 'భారత బాలల ఫిల్మ్‌ సొసైటీ' (సి.ఎఫ్‌.ఎస్‌.ఐ), ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలసి ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తుంటుంది. ఇప్పటికి 58 ఏళ్ళ క్రితం 1955లో స్థాపితమైన ఈ బాలల ఫిల్మ్‌ సొసైటీ పిల్లల్లో వినోదాన్నీ, విజ్ఞానాన్నీ పెంచే చిత్రాలను నిర్మించడం, ప్రదర్శించడం, పంపిణీ చేయడం లాంటివి చేస్తుంటుంది. ఈ సొసైటీ స్థాపనకు ఓ నేపథ్యం ఉంది. ప్రత్యేకంగా పిల్లల కోసం దేశీయంగా చలనచిత్రాలను రూపొందించడం ద్వారా వారిలో సృజనాత్మకతనూ, తార్కికమైన ఆలోచననూ పెంపొందించవచ్చని మన దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ భావించారు. అందుకే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొద్ది కాలంలోనే నెహ్రూ ఈ చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ సొసైటీని నెలకొల్పారు. అందుకే, చిన్నపిల్లలందరూ 'చాచా నెహ్రూ'గా ఎంతో ఇష్టంగా పిలిచే నెహ్రూ జన్మదినమైన నవంబర్‌ 14వ తేదీనే ప్రతిసారీ ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తుంటారు.

ఇవాళ్టి నుంచి... వారం రోజులు
ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఉన్న లలిత కళా తోరణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించాల్సి ఉంది. (రాష్ట్ర విభజన అంశంపై ఢిల్లీలో మంత్రుల బృందంతో సమావేశం ఉన్నందున ముఖ్యమంత్రి ఈ ఉత్సవానికి హాజరు కాలేరని తాజా సమాచారం). ఇక, ప్రారంభోత్సవానికి కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీశ్‌ తివారీ అధ్యక్షత వహిస్తే, ప్రముఖ హిందీ నటుడు రణబీర్‌ కపూర్‌, సుప్రసిద్ధ రచయిత - దర్శకుడు గుల్జార్‌లు అతిథులుగా హాజరు కానున్నారు. మన దేశానికి చెందిన శిల్పా రణడే దర్శకత్వం వహించిన 'గోపీ గవయ్య.. బాఘా బజయ్య' అనే యానిమేషన్‌ చిత్రాన్ని ప్రారంభ సినిమాగా ప్రదర్శించనున్నారు. సత్యజిత్‌ రే ప్రసిద్ధ బెంగాలీ సినిమా 'గుపీ గయే( బాఘా బయే(' సినిమాకు ఇది హిందీ రూపం.
ఈ 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి దాదాపు 5 వేల మంది దాకా బాలబాలికలు ప్రతినిధులుగా హాజర వుతున్నట్లు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ పక్షాన ఈ ఉత్సవాల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న 'ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, రంగస్థల అభివృద్ధి సంస్థ' (ఏ.పి.ఎస్‌.ఎఫ్‌.టి.వి.టి.డి.సి) చైర్మన్‌ ఎన్‌. శివశంకర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం. దానకిశోర్‌లు తెలిపారు. అలాగే, మరో వందమంది దేశ, విదేశీ ప్రతినిధులు, సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు కూడా వస్తున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే బాలబాలికలకు ప్రపంచ దేశాలకు చెందిన అత్యున్నతమైన బాలల చిత్రాలను చూసే అవకాశాన్ని ఈ చిత్రోత్సవం కల్పిస్తోంది. 

తొలిసారిగా 3డిలు... యానిమేషన్లు!
నిజానికి, ప్రపంచవ్యాప్తంగా 74 దేశాల నుంచి 896 బాలల చిత్రాలు ఎంట్రీలుగా వచ్చాయి. వాటిలో 48 దేశాలకు చెందిన 198 చిత్రాలను మాత్రం ఎంపిక చేసి, వారం రోజుల పాటు ప్రదర్శిస్తున్నట్లు 'చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా' సి.ఇ.ఓ. శ్రావణ్‌ కుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌లోని ప్రసాద్‌ ఐ-మ్యాక్స్‌ ప్రాంగణం ఈ చిత్రోత్సవానికి ప్రధాన వేదిక. అందులోని మూడు స్క్రీన్లతో పాటు నగరంలోని మరో ఎనిమిది సినిమా హాళ్ళలో, పబ్లిక్‌ గార్డెన్స్‌లోని లలిత కళాతోరణం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియమ్‌, నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియమ్‌, సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్‌ హౌమ్‌లలో కూడా ఈ వారం రోజుల పాటు సినీ ప్రదర్శనలు జరుగుతాయి. ఈ హాళ్ళలన్నిటిలో కలిపి సగటున రోజూ 30 సినిమాల ప్రదర్శన జరుగుతుంది. సగటున 20 వేల మంది పిల్లలు వాటిని చూడగలుగుతారు. ఈ ప్రదర్శనల్లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. తొలిసారిగా 3డి చిత్రాలను కూడా చూపడం ఈ తాజా చిత్రోత్సవంలోని విశేషం. అలాగే, యానిమేషన్‌ చిత్రాలను ప్రోత్సహిస్తూ, తొలిసారిగా వాటిని కూడా ఈ చిత్రోత్సవంలో ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న బెర్లిన్‌, టొరెంటో ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌, కాన్స్‌ ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌లలో ప్రదర్శితమైన 20 సుప్రసిద్ధ సినిమాలను కూడా ఈ తాజా సినిమా పండుగలో చూసే అవకాశం ప్రతినిధులకు కలుగుతోంది. దక్షిణ అమెరికా, ఆస్ట్రియా, లెబనాన్‌, స్కాట్‌లాండ్‌, మలేసియా తదితర దేశాలు తొలిసారిగా ఈ ఉత్సవంలో తమ చిత్రాలను ప్రదర్శించడం, పాల్గొనడం మరో విశేషం. 

నాలుగు కేటగిరీల్లో పోటీ
ఈ ఉత్సవంలో భాగంగా పోటీ (కాంపిటీషన్‌) విభాగంలో 'లైవ్‌ యాక్షన్‌', 'యానిమేషన్‌ ఫీచర్‌', 'షార్ట్‌ ఫిల్మ్‌', 'లిటిల్‌ డైరెక్టర్స్‌' అనే నాలుగు కేటగిరీల్లో పోటీ జరుగుతుంది. ఈ కేటగిరీల్లో పోటీపడిన వాటిల్లో ఉత్తమంగా నిలిచిన చిత్రాలకు మొత్తం 16 అవార్డులను బహూకరిస్తారు. వాటిలో 12 బంగారు ఏనుగు ట్రోఫీలు కాగా, మరో 4 బంగారు ఫలకాలు.
ఇక, పోటీ రహిత (నాన్‌ కాంపిటీషన్‌) విభాగంలో 'చిల్డ్రన్స్‌ వరల్డ్‌', 'కంట్రీ ఫోకస్‌ రెట్రాస్పెక్టివ్‌', 'చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ సొసైటీ వారి సినీ ఆణిముత్యాల'ను ప్రదర్శిస్తారు. ఈ 'చిల్డ్రన్స్‌ వరల్డ్‌ సెక్షన్‌'లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉత్తమ శ్రేణి చిత్రాలను చూపెడతారు. ఈసారి ఉత్సవంలో ప్రధాన దృష్టి కేంద్రిత దేశం - చెకోస్లోవేకియా. ఆ దేశానికి చెందిన ఉత్తమ బాలల చిత్రాలు, లఘు చిత్రాలు, లైవ్‌ యాక్షన్‌, డాక్యుమెంటరీ చిత్రాలను ఈ 'కంట్రీ ఫోకస్‌' విభాగంలో ప్రదర్శిస్తారు. 2011 నాటి ఉత్సవంలో ఈ విభాగంలో చైనా చిత్రాలను ప్రదర్శించారు. తాజా ఉత్సవాల ముగింపు రోజైన నవంబర్‌ 20న జరిగే ముగింపు సభలో అవార్డు గెలుచుకున్న వారికి పురస్కారాలు అందజేస్తారు. 

ఆహ్లాదం... అవగాహన...
ప్రపంచంలోని అతి పెద్ద బాలల చలనచిత్రోత్సవాల్లో ఈ ఉత్సవం కూడా ఒకటి. పిల్లలను అమితంగా ఆకర్షించే 'బంగారు ఏనుగు' బొమ్మ ఈ ఉత్సవాలకు చిహ్నం. ముద్దులొలికే ఈ గున్న ఏనుగుకు 'గజం' అనే పదాన్ని స్ఫురింపజేస్తూ, 'గజ్జు' అని పేరు. పిల్లలకు యానిమేషన్‌, స్క్రిప్ట్‌ రచన, చిత్ర రూపకల్పన లాంటి అంశాలపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. బాల కళాకారుల హక్కులు, భారతీయ యానిమేషన్‌, పిల్లల సినిమాలకు ఆదరణ - ఆవశ్యకత లాంటి నిర్ణీత అంశాలపై ఈ సారి బహిరంగ చర్చావేదికలు (ఓపెన్‌ ఫోరమ్‌) జరపనున్నారు 

సాంస్కృతిక కార్యక్రమాల సంబరం 
''ప్రారంభ సభలోని సాంస్కృతిక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం పక్షాన జరిగితే, ముగింపు సభలోవేమో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరుగుతాయి. ప్రారంభ సభలో భరతనాట్యం, కూచిపూడి, కథకళి, మోహినీయాట్టం, ఒడిస్సీ తదితర భారతీయ నృత్య కళారూపాలన్నిటితో కలిపి 10 నిమిషాల ప్రత్యేక నృత్యం ప్రధాన ఆకర్షణ కానుంది'' అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్‌ రాళ్ళబండి కవితాప్రసాద్‌, 'ప్రజాశక్తి - జీవన'తో ప్రత్యేకంగా మాట్లాడుతూ చెప్పారు. 
మిగిలిన రోజుల్లో కూడా రోజూ సాయంత్రం లలిత కళా తోరణంలో పిల్లల సినిమాల ప్రదర్శనతో పాటు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటికి ప్రవేశం ఉచితమే! ''వివిధ ప్రాంతాల్లోని 42 పాఠశాలల నుంచి 640 మంది పిల్లలు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరోపక్క పబ్లిక్‌ గార్డెన్స్‌లోని బాలభవన్‌లో పిల్లలతో చిత్రకళ, ఇకెబెనా తదితర కళా నైపుణ్యాల ప్రదర్శన కూడా ఉంటుంది. ప్రతిరోజూ ఇద్దరు బాల మేధావులను గుర్తించి, ప్రత్యేకంగా గౌరవించనున్నాం'' అని కవితాప్రసాద్‌ వివరించారు. ఈ కార్యక్రమాలకు బాలలే వ్యాఖ్యాతలు కూడా కావడం చెప్పుకోదగ్గ విశేషం. మొత్తం మీద ఉత్సవాల ప్రచారంలో చెబుతున్నట్లు, బాలబాలికలకు ''ఇది సినిమాల వేళ... ఇది సరదాల వేళ...''! ఈ వారం రోజులు వారిలో సృజనాత్మకతనూ, అవగాహననూ పెంచడానికి దోహదం చేయగలిగితే అంత కన్నా ఏం కావాలి!
- రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 14th Nov 2013, Thursday, Page No.5)
..........................................................

0 వ్యాఖ్యలు: