- ఇవాళ (నవంబర్ 12) 'ప్రజాసేవా ప్రసార దినం'
ఏకకాలంలో ఇటు విజ్ఞానాన్నీ, అటు వినోదాన్నీ, మరోపక్క విషయ సమాచారాన్నీ ఎంతో సరళంగా, వేగంగా అందించే సాధనంగా రేడియోను చెప్పుకోవచ్చు. మన దేశంలో ప్రజా ప్రసార సాధనంగా 'ఆకాశవాణి' ఎన్నో దశాబ్దాలుగా ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తోంది. ఇప్పుడు ప్రైవేటు రేడియోలు, ఇంటర్నెట్ రేడియో సేవలు, ప్రైవేట్ ఎఫ్.ఎం. ఛానళ్ళు ఎన్ని వచ్చినా, ప్రజా సేవకు పూర్తిగా కట్టుబడిన సాధనంగా 'ఆకాశవాణి' తన చారిత్రక కర్తవ్యాన్ని విస్మరించకుండా ముందుకు నడుస్తోంది. ఆ కర్తవ్యాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ, ప్రజాసేవకు పునరంకితమవుతూ మన దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నవంబర్ 12న 'ప్రజాసేవా ప్రసార దినం' (పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టింగ్ డే) జరుపుకొంటోంది.
ఈ ప్రత్యేక దినోత్సవానికి ఓ చారిత్రక నేపథ్యం కూడా ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1947 నవంబర్ 12న మహాత్మా గాంధీ తొలిసారిగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రాన్ని సందర్శించారు. రేడియో ద్వారా ప్రసంగించారు. రేడియో కేంద్రానికి వచ్చి గాంధీజీ ప్రసంగించడం అదే మొదటిసారి, చివరిసారి కూడా! దేశవిభజన తరువాత కురుక్షేత్ర ప్రాంతంలోని శిబిరంలో తలదాచుకున్న పాకిస్తానీ శరణార్థులను ఉద్దేశించి, గాంధీ ఆ ప్రసంగం చేశారు. ఆ సందర్భానికి గుర్తుగా ప్రతి ఏటా నవంబర్ 12వ తేదీని 'ప్రజాసేవా ప్రసార దినం'గా పరిగణించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అలా 2001 నుంచి ప్రతి ఏటా ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు.
నిజానికి, భారతీయ కళలు, సంస్కృతికి సంబంధించిన వివిధ రూపాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ప్రజాప్రసార మాధ్యమం 'ఆకాశవాణి' అని చెప్పుకోవచ్చు. శాస్త్రీయ సంగీతం, నాటకం, కవిత్వం, జానపద గీతాల లాంటివాటికి ఇప్పటికీ అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. అలాగే, పంటల సంరక్షణ, కొత్త రకం సేద్య విధానాలపై ఉపయుక్త సమాచారాన్ని తెలియజేస్తోంది. దేశంలో 23 భాషల్లో, 146 మాండలికాల్లో వినోదాన్నీ, వార్తలనూ అందిస్తున్న ఏకైక మాధ్యమంగా ఆకాశవాణి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ముందంజలో నిలుస్తోంది. ఇన్ని భాషల్లో ప్రసారాలు అందిస్తూ, ప్రపంచంలోని అతి పెద్ద ప్రసార సంస్థల్లో ఒకటిగా నిలిచింది. దేశం నలుమూలల్లో మొత్తం 403 'ఆల్ ఇండియా రేడియా' కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా దేశంలోని 92 శాతం ప్రాంతానికీ, మొత్తం జనాభాలో 99.19 శాతం మందికీ ఈ ప్రసారాలు అందుతుండడం విశేషం.
ఈ సారి 'ప్రజాసేవా ప్రసారదినం' సందర్భంగా 'రేడియో ప్రచార సభ' ద్వారా ప్రత్యేక ప్రచారోద్యమానికి ఆకాశవాణి - హైదరాబాద్ కేంద్రం శ్రీకారం చుట్టింది. ''ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరంగా తెలియజేసి, వాటిని వినడం వల్ల కలిగే ప్రయోజనాన్ని చెప్పడం, వారిని చైతన్యవంతుల్ని చేయడం ఈ 'రేడియో ప్రచార సభ' ముఖ్యోద్దేశం'' అని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మంగళగిరి ఆదిత్యప్రసాద్ తెలియజేశారు. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలంలోని బాకారం గ్రామంలోని ప్రజలను నేరుగా కలుసుకొని, వారిని చైతన్యవంతుల్ని చేసే పని చేపట్టింది. అందుకోసం నవంబర్ 10న ఆ గ్రామంలో ఓ ప్రత్యేక సమావేశం నిర్వహిచింది. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్, సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఎల్. జలపతిరావుతో రైతుల సందేహాలకు సమాధానాలు ఇప్పించింది. సరికొత్త సేద్య విధానాల గురించి వారికి అవగాహన కల్పించేందుకు కృషి చేసింది. ఈ కార్యక్రమం మొత్తాన్నీ రికార్డు చేసి, ఓ 30 నిమిషాలకు కుదించి, ఈ రోజు ఉదయం 7.15 గంటలకు ఆకాశవాణి హైదరాబాద్, రెయిన్‌బో ఛానళ్ళలో ప్రసారం చేస్తోంది.
''గడచిన ఏడాది కాలంలో వివిధ ప్రాంతాల్లో ఆహూతుల సమక్షంలో మూడు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలను నిర్వహించాం. ఈ కార్యక్రమాల రికార్డింగులను దేశవ్యాప్తంగా అన్ని రేడియో కేంద్రాలూ రిలే చేశాయి'' అని ఆదిత్యప్రసాద్ చెప్పారు. అలాగే, మెదక్ జిల్లా సిద్ధిపేటలో నిర్వహించిన జానపద కళోత్సవం, నల్గొండలో అందరూ మహిళలే సమర్పించిన దేశభక్తి పూరిత సంగీత - సాహిత్య రూపకం, వంద మంది పిల్లలు పాల్గొన్న రూపకం లాంటివి పలువురిని ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అందిస్తున్న 'లలిత సంగీత సమీరం', 'వేయి పడగలు' ధారావాహిక నాటకం, 'మధుర గీతామృతం', 'రైతుల ఫోన్-ఇన్ కార్యక్రమాల'కు విశేష స్పందన వస్తోందని ఆయన వివరించారు. హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న అయిదు ఛానళ్ళూ శ్రోతల నుంచి ఆదరణ అందుకుంటున్న ట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో టీవీలకు 'సెట్ టాప్ బాక్స్'లు తప్పనిసరి అని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 'డైరెక్ట్ టు హౌమ్' (డి.టి.హెచ్) వేదికపై ఆకాశవాణి ఇరవై నాలుగు గంటలూ నిర్విరామంగా ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ఆ సెట్ టాప్ బాక్సుల ద్వారా టీవీ సెట్లలోనూ కొందరు శ్రోతలు వింటూ ఉండడం విశేషం.
మొత్తానికి, 'రేడియో ప్రచార సభ'ల లాంటి వినూత్న ప్రచారాల ద్వారా ప్రజోపయోగ కార్యక్రమాల వైపు మరింతగా దృష్టిసారిస్తే, అనేక ఆధునిక మాధ్యమాల మధ్యన కూడా 'బహు జన హితాయ - బహు జన సుఖాయ' అన్న తన ఆశయానికి 'ఆకాశవాణి' మరింత దగ్గరవుతుంది.
- రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily dated 12 Nov 2013 -Tuesday, Page No.5)
.....................................................
తోడుకునేవాళ్లకి తోడుకున్నంత
4 years ago
0 వ్యాఖ్యలు:
Post a Comment