జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, September 30, 2010

ఒక ‘రోబో’! ఎన్నో కథలు!!రేపే విడుదల కానున్న రజనీకాంత్ - శంకర్ ల ‘రోబో’ గురించి ఇప్పటికే ఎంతో ఆసక్తి పెరిగింది. ఈ సినిమా గురించి రోజుకో విశేషం, విచిత్రం తెలుస్తూనే ఉన్నాయి.

* మరి కొద్ది గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ ప్రేక్షకులను అలరించనున్న ఈ చిత్రం దాదాపు రూ. 150 – 160 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందింది. ఆ రకంగా అత్యధిక బడ్జెట్ తో తయారైన చిత్రం ఇదేనని రోబో యూనిట్ ఢంకా బజాయిస్తోంది.

* సన్, జెమినీ వగైరా టీవీ చానళ్ళన్నిటికీ మాతృ సంస్థ అయిన సన్ టీవీ నెట్ వర్క్ తమ సినిమా విభాగమైన సన్ పిక్చర్స్ ద్వారా ఇప్పటికే అనేక తమిళ చిత్రాల హక్కులను విడుదలకు ముందు పొందారు. వాటిని విడుదల చేశారు. అయితే, నిర్మాణ దశలోనే ప్రాజెక్టు మొత్తాన్నీ చేపట్టి, తామే స్వయంగా సినిమాను నిర్మించడం సన్ పిక్చర్స్ కు ఇదే మొదలు. సో, వారికి ఇదే మొదటి స్వీయ నిర్మాణ చిత్రమన్నమాట.

* తమిళంలో ఈ యంతిరన్ అలియాస్ రోబోయే మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా.

* కథ సంగతికొస్తే - సమాజానికి ఉపయోగపడే రోబో (మరమనిషి)ని తయారు చేస్తాడు ఓ శాస్త్రవేత్త. పైగా, అచ్చంగా తన పోలికలతోనే, మనిషిలా ప్రవర్తించేలా చూస్తాడు. తీరా ఆ రోబో దేశద్రోహుల చేతిలో పడుతుంది. అప్పుడు ఆ శాస్త్రవేత్త ఏం చేశాడన్నది మిగతా సినిమా.

* రజనీకాంత్ అటు రోబోగా, ఇటు శాస్త్రవేత్తగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రోబో రజనీకి జంటగా వైద్య పరిశోధక విద్యార్థిగా ఐశ్వర్యారాయ్ నటిస్తున్నారు. ఈ చిత్ర కథలోని అంశాలన్నీ 2020 కాలం చుట్టూ తిరుగుతాయి.

* అయితే, ఇది ఎప్పటి లాంటి రజనీకాంత్ స్టయిల్స్ తో నిండిన సినిమా కాదని యూనిట్ సభ్యులు చెప్పారు. ‘‘మామూలు రజనీకాంత్ సినిమాల లాగా ఇది ఉండదు. రజనీ తరహా స్టయిల్, పంచ్ డైలాగులు ఇందులో ఉండవు. అయితేనేం, రజనీకాంత్ సినిమా కెరీర్ లోనే ఇది అత్యుత్తమ చిత్రం’’ అని రజనీకాంత్ ను రెండు విభిన్న పాత్రల్లో అందంగా చూపిన సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ (యూనిట్ అంతా ఈయనను ముద్దుగా ర్యాండీ అని పిలుస్తారు) చెప్పారు.

* మామూలుగా సినిమాలకు వాడే సాంప్రదాయిక లైటింగ్ విధానానికి భిన్నంగా ఈ సినిమా మొత్తంలో కొత్తరకం లైటింగ్ పద్ధతిని వాడారు. పైపెచ్చు, రజనీ 3డి దృశ్యాలను తీయడానికి ఈ సినిమాలో తొలిసారిగా డోమ్స్ లైట్ టెక్నాలజీని ఉపయోగించారు. ఒకే దృశ్యంలో శాస్త్రవేత్తగా, రోబోగా రజనీకాంత్ కనిపిస్తున్నప్పుడు రెండు పాత్రల శరీర ఛాయకూ జత కుదిరేలా లైటింగ్ చేశారట.

‘‘రోబో రజనీకాంత్ దృశ్యాలను విడిగా తీశాం. శాస్త్రవేత్త రజనీ దృశ్యాలను మరోసారి తీశాం. కానీ, రెండూ సరిగ్గా నప్పేలా లైటింగ్ చేశాం’’ అని రత్నవేల్ చెప్పారు. కేవలం లైటింగ్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవడానికీ, తీస్తున్న ప్రతి షాట్ లోని సాంకేతిక పరామితులను నోట్ చేసుకోవడానికే రత్నవేలు దగ్గర ఓ ప్రత్యేక అసిస్టెంట్ పనిచేశారు. ఈ మొత్తం సినిమా కెమేరా రిపోర్టే దాదాపు 1600 పేజీలు వచ్చింది.

* ఇక, ఈ సినిమా బడ్జెట్ లో దాదాపు 40 శాతం స్పెషల్ ఎఫెక్ట్ లకే ఖర్చు చేశారు. ఈ సినిమాలో రోబో కోసం వాడాల్సిన యానిమేట్రానిక్స్ టెక్నాలజీ కోసం దర్శకుడు శంకర్ ప్రపంచ ప్రసిద్ధ స్టాన్ విన్ స్టన్ స్టూడియోస్ ను ఆశ్రయించారు. అలాగే, హాంగ్ కాంగ్ కు చెందిన కంప్యూటర్ గ్రాఫిక్స్ నిపుణులను కూడా వినియోగించారు. ఆ స్టాన్ విన్ స్టన్ స్టూడియో వారి యానిమేట్రానిక్స్ టెక్నాలజీని వాడిన తొలి భారతీయ చిత్రం రోబోయే. జురాసిక్ పార్క్, ప్రిడేటర్, టెర్మినేటర్, ఇరన్ మ్యాన్, ఇటీవలి అవతార్ లాంటి పలు చిత్రాలలో అద్భుతమైన పనితనం చూపింది ఈ స్టూడియోయే.

* అలాగే, జాకీ చాన్ కు సైతం దర్శకత్వం వహించి, మ్యాట్రిక్స్, కిల్ బిల్ చిత్రాల సీక్వెల్స్ కు పనిచేసిన యాక్షన్ దృశ్యాల రూపకర్త యూయెన్ వూ పింగ్ ఈ రోబో చిత్రానికి స్టంట్ కో-ఆర్డినేటర్ గా పనిచేశారు.

* అన్నట్లు ఈ సినిమా కోసం రజనీ దాదాపు 55 పైచిలుకు కాస్ట్యూమ్ లలో కనువిందు చేస్తారు. ఐశ్వర్యా రాయ్ కూడా అందుకు తగ్గకుండా 57కు పైగా కాస్ట్యూమ్ లలో కనిపిస్తుంది. మెన్ ఇన్ బ్లాక్ లాంటి హాలీవుడ్ చిత్రాల సిరీస్ కు పనిచేసిన మేరీ ఇ. వోగ్ట్ అనే మహిళ ఈ కాస్ట్యూమ్ విభాగానికి పర్యవేక్షణ జరిపారు. భారతీయ సినిమా పరిశ్రమలో పనిచేయడం ఆమెకూ ఇదే మొదటి సారి.

(మరికొన్ని విశేషాలు తరువాతి టపాలో... మరికొద్ది సేపట్లో... )

Wednesday, September 29, 2010

సెన్సారైన సినిమాకు గ్రాఫిక్స్ లేటేంటి? అప్పట్లో చిరంజీవి ‘అందరివాడు’కు అయిందేమిటి!?'రోబో'సినిమా విడుదల సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1కి వాయిదా పడి వారం దాటినా, దాని మీద చర్చ ఇంకా ఆగలేదు. ఆ మధ్య రాత్రి భోజనం వేళ ఓ సినిమా మిత్రుడితో మాటల్లో ‘రోబో' వాయిదా గురించి చర్చ వచ్చింది. అయోధ్య అంశంపై రానున్న తీర్పు వల్ల వాయిదా పడిందేమోనన్న మిత్రుల మాట కూడా మేము చర్చించుకున్నాం. అప్పుడే మా మధ్య మాటల్లో ఓ విషయం చర్చకు వచ్చింది. ప్రింట్ల సమస్య మొదలు ఫైనాన్షియల్ సమస్యల దాకా ఏవి ఎదురైనా సరే, సినిమా విడుదల వాయిదా వేసినప్పుడల్లా మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాలేదనో, గ్రాఫిక్స్ లేట్ అయ్యాయనో చెప్పడం సర్వసాధారణంగా మన వాళ్ళకు అలవాటు. (‘అంజి', 'అరుంధతి' లాంటి చాలా సినిమాలకు అది మనం చూసిన కథే). ఆ మాటే చర్చించుకుంటూ సరదాగా నవ్వుకున్నాం.

ఇంతలో మా మిత్రుడు ఓ గమ్మత్తైన సంగతి గుర్తు చేశాడు. అది మీతో పంచుకోవడమే ఈ టపా ఉద్దేశం. కొన్నేళ్ళ క్రితం 2005 జూన్ 3వ తేదీన చిరంజీవి 'అందరివాడు' సినిమా రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. అభిమానులతో సహా అందరూ ఆ తేదీకి మానసికంగా, సినిమాకు వెళ్ళడానికి శారీరకంగా సిద్ధమయ్యారు. తీరా ఆఖరు నిమిషంలో ఏమైందో, విడుదలకు ఒక్క రోజు ముందుగా ఆకస్మికంగా ప్రకటన వచ్చింది. జూన్ 3 నుంచి 4వ తేదీకి సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

అంతటితో ఊరుకుంటే ఎలా ఉండేదో. ఆ చిత్ర నిర్మాత - చిరంజీవి బావమరిది అయిన అల్లు అరవింద్ మీడియా ముందుకొచ్చి, గ్రాఫిక్స్ సిద్ధం కాకపోవడంతో సినిమా విడుదల తప్పని సరైందంటూ సాకు చెప్పారు. అంతటితోనూ ఆగక, ఆ గ్రాఫిక్స్ వాళ్ళ మీద దావా వేయడానికి తమ వకీళ్ళు సన్నద్ధమవుతున్నారని కూడా ప్రకటించారు.

గమ్మత్తు ఏమిటంటే, ఆ సినిమాకు అప్పటికే సెన్సార్ కూడా చేయించేశారు. గ్రాఫిక్స్ వగైరాలేమీ లేకుండానే, సినిమాకు అసలెలా సెన్సారింగ్ చేశారన్నది ప్రశ్న. (అవేవీ లేకుండానే మన నిర్మాతలు తమ ధనబలం ఉపయోగించి, ఏవేవో ఎత్తులు వేసి, డూప్ నెగటివ్ లతోనే సెన్సార్ పని కానిచ్చేస్తుంటారన్నది వేరే విషయం). ఆ ధర్మసందేహంతోనే ఓ క్రియాశీలుడెవరో, 'అందరివాడు' నిర్మాత మీద, సెన్సార్ బోర్డు మీద ఫిర్యాదు చేశారు.

విషయం వీధి కెక్కేసరికి, ఆ రోజు చేయాల్సిన ఇతర సెన్సారింగ్ పనులన్నీ ఆపేసి, హైదరాబాద్ సెన్సార్ బోర్డంతా 'అందరివాడు' గొడవలో పడింది. 'సెన్సారైపోయిన సినిమాకు ఇంకా గ్రాఫిక్స్ రాలేదంటూ అబద్ధం చెప్పి, కొంప తీశావు కదయ్యా' అంటూ ఆంతరంగికంగా అల్లు అరవింద్ మీద పడింది.

దాంతో, వాయిదాకు అసలు కారణం బయటకు చెప్పలేక, గ్రాఫిక్స్ మీద నెపం నెట్టేద్దామని చూసిన అరవింద్ నాలుక కరుచుకోవాల్సి వచ్చింది. ఆనక, ఆయన ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తిని పిలిపించుకొని, రూ. 5 లక్షల నజరానా చెల్లించుకోవాల్సి వచ్చిందట! ఆ రకంగా రూకలతో రాజీ ఫార్ములా కుదుర్చుకొని, ఎవరూ నోరు మెదపకుండా చేసుకోవాల్సి వచ్చిందట!

ఈ కథను ఎవరు, ఎంత మేరకు నమ్ముతారన్నది వారి వారి వ్యక్తిగత అభిప్రాయం. అయితే, హైదరాబాద్ లోని సినీ జీవుల అడ్డా కృష్ణానగర్ లో మాత్రం ఎవరిని కదిలించినా, ఈ కథ గురించే కథలు, కథలుగా చెబుతారని మా మిత్రుడు నాకు చెప్పాడు. అప్పట్లో ఈ కథ నేనూ విన్నా, ఇప్పుడు మా మిత్రుడు మళ్ళీ చెబుతుంటే కానీ గుర్తుకురాలేదు. 'రోబో' విషయంలో మాత్రం ఇప్పటి దాకా ఎవరూ గ్రాఫిక్స్ మీద నెపం నెట్టేయడం లేదు. అంతవరకు మంచిదే!

Tuesday, September 28, 2010

ప్రేక్షకులకు 'ఖలేజా' పాటల ప్రసాదం

త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ ల కాంబినేషన్ లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఖలేజా' చిత్రం విడుదలకు మరో అడుగు ముందుకేసింది. సినిమా పాటలు నిన్నే రేడియో మిర్చీ స్టేషన్ ద్వారా విడుదలయ్యాయి. ఈ సినిమా రీరికార్డింగ్ పనితో తలకు మించిన భారంలో ఉన్నప్పటికీ, ఈ ఆడియో విడుదల కార్యక్రమం కోసం సంగీత దర్శకుడు మణిశర్మ మద్రాసు నుంచి హైదరాబాద్ కు హడావిడిగా వెళ్ళడం ఓ విశేషం.

హేమచంద్ర, కారుణ్య తదితరులు ఈ సినిమా కోసం పాడారు. అన్నట్లు మహేశ్ బాబు ట్యాక్సీ డ్రైవర్ గా నటిస్తున్న సినిమాలో, "ట్యాక్సీ ట్యాక్సీ..." అంటూ ఏకంగా ఓ పాటే పెట్టేశారు. అయితే, అది అన్ని సినిమాల్లో లాగా హీరో గుణకీర్తిని భజించే ఇంట్రడక్షన్ సాంగ్ కాదని చిత్రనిర్మాణ వర్గాలు చెప్పాయి.

ఇంకా ఇదే సినిమాలో, 'ఓం నమో శివ రుద్రాయ...' అంటూ సందర్భోచితంగా సాగే, ఓ భక్తి గీతం కూడా ఉండడం విచిత్రం. కాగా, 'పిలిచే పెదవులపైన....' అంటూ శ్రావ్యంగా సాగిన యుగళ గీతం కత్తి మీద సాము అనిపిస్తుంది. 'ఈ ఆల్బమ్ లోకెల్లా ఎంతో కష్టపడి చేసినది ఈ మెలోడీ సాంగే'నని మణిశర్మ చెప్పారు. ఏతావతా, సినిమాలోని ఆరు పాటల సీడీ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. విని, ఆనందిద్దాం.

Monday, September 20, 2010

బ్లాగు, ట్విట్టర్, ఫేస్ బుక్ జిందాబాద్!

(ఈ డిజిటల్ యుగంలో జర్నలిజమ్ ఏమై పోతుంది - పార్ట్ 2)

‘‘ఈ డిజిటల్ యుగంలో ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటివి శక్తిమంతమైన పత్రికా రచనలో శక్తిమంతమైన ఉపకరణాలు. వాటిని కూడా సమాచార సేకరణలో, కూర్పులో ఉపయోగించుకోవాలి. అవి వాడని ఎడిటర్ వెనుకబడి పోతాడు’’ అని బ్రిటన్ లోని 'ది గార్డియన్'కు ఎడిటర్ గా వ్యవహరిస్తున్న అలన్ రస్ బ్రిడ్జర్ అభిప్రాయపడ్డారు. ఈ డిజిటల్ యుగంలో జర్నలిజమ్ రంగంలో అనుసరించాల్సిన కొత్త నియమాలను ఆయన వివరించారు. డిజిటల్ మీడియం వేగవంతంగా జీవితంలోకి చొచ్చుకొని వస్తున్న ప్రస్తుత సందర్భంలో పాఠకులు కూడా మరింతగా పాలుపంచుకొనేలా జర్నలిజమ్ ను తీర్చిదిద్దాలనీ, పాఠకుల స్పందనను కోరడం ద్వారా, అనుమతించడం ద్వారా ఆ పని చేయాలనీ ఆయన చెప్పారు.

ప్రచురణకు ముందు దశలో కూడా పాఠకులను సైతం వార్తా సేకరణలో, వార్తల నిర్ధారణలో భాగం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వార్తలను తెలియజెప్పే అధికారం, నైపుణ్యం, ఆసక్తి పాత్రికేయులకు ఒక్కరికే సొంతమని అనుకోవద్దని కూడా సుతిమెత్తగా విమర్శించారు. ‘‘జర్నలిస్టులు కాకపోయినప్పటికీ, సదరు సంఘటనలకు యాదృచ్ఛికంగా సాక్షులైన వారి డిజిటల్ రికార్డులను వార్తాపత్రికలు ఉపయోగించుకోవచ్చు’’ అని అలన్ బ్రిటన్ లోని తమ అనుభవాలను వివరించారు.

సమాచార విస్ఫోటనం సాగుతున్న ఈ రోజుల్లో సమాచారం కోసం వార్తాపత్రికలొక్కటే సాధనం కాదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బ్లాగులు, సామాజిక సంబంధాల సైట్ల ప్రాధాన్యం, ప్రాసంగికత పెరిగిన విషయాన్ని కూడా వివరించారు. అలాగే, గడచిన అయిదేళ్ళలో బ్రిటన్ లో నాణ్యమైన వార్తాపత్రికల మార్కెట్ సైతం పడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ వార్తాపత్రికల పరిస్థితి ప్రస్తుతానికి బాగానే ఉన్నా, మొబైల్ టెక్నాలజీ, బ్రాడ్ బ్యాండ్ సేవలను జనం వినియోగించుకోవడం అంతకంతకూ పెరిగిపోతున్న దృష్ట్యా డిజిటల్ మీడియమ్ సవాళ్ళకు ఇక్కడి పత్రికలు, జర్నలిస్టులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

'డిజిటల్ యుగంలో జర్నలిజమ్ భవిష్యత్తు' అన్న అంశంపై సరిగ్గా గంట సేపు ఉపన్యసించిన అలన్ ఆ తరువాత ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు దాదాపు ముప్పావు గంట సేపు సమాధానాలిచ్చారు. ఇవాళ (భారతీయ) పత్రికల్లో పెరిగిపోతున్న ‘పెయిడ్ న్యూస్’ (వాణిజ్య ప్రకటనలు తీసుకొనో, డబ్బు తీసుకొనో వార్తలు రాసే) సంస్కృతి విషయంలో కూడా ఆయన తన భావాలు పంచుకున్నారు. ‘‘పత్రికలు గనక గౌరవప్రదంగా వ్యవహరిస్తూ, నిఖార్సయిన వార్తలు అందించనట్లయితే, పతనమైపోతాయి. సామాజిక సంబంధాల సైట్లు విస్తరిస్తున్న నేపథ్యంలో పత్రికల అసలు రంగు బయటపడిపోతుంది’’ అని అలన్ అన్నారు.

నా మటుకు నాకు ఈ ఉపన్యాసం ఓ దిక్సూచిగా అనిపించింది. జర్నలిజమ్ లో ఉన్న, ఉంటున్న, ఉండబోతున్న వారందరూ ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడం కచ్చితంగా అవసరం అనిపించింది. ఈ కార్యక్రమంలో నాకు ఆనందం కలిగించిన విషయం ఇంకొకటి ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ‘ది హిందూ’ పత్రిక ఎడిటర్ రామ్ స్వయంగా దగ్గరుండి అందరినీ ఆహ్వానించడమే కాకుండా, ఉపన్యాసం మొదలయ్యాక ఆడిటోరియమ్ లో చివరకు వచ్చి, స్పీకర్లలో శబ్దం సరిగా వినిపిస్తున్నదీ, లేనిదీ చూడడం, నిశ్శబ్దంగా ఆ ఆపరేటర్ దగ్గరకు వెళ్ళి వాల్యూమ్ పెంచాలంటూ సైగ చేయడం గమనించి, అబ్బురపడ్డా.

అంత పెద్ద ఎడిటరై ఉండీ చిన్న చిన్న విషయాల మీద కూడా రామ్ స్వయంగా శ్రద్ధ వహించడం, ప్రశ్నోత్తరాల సమయంలో వేదిక మీదకు వచ్చి అయ్యే వరకు అలన్ పక్కనే నిలబడే ఉండడం, తానూ ఆ చర్చలో భాగస్వామి కావడం చూస్తే -- పేరు ప్రతిష్ఠలతో సంబంధం లేకుండా ఎడిటర్లు ఎంత నిరాడంబరంగా ఉండవచ్చో, ఉండాలో చెప్పకనే చెప్పినట్లయింది. ఆ పరిస్థితిలో మన వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండి ఉండేదన్న ఆలోచనలోకి నేను అనుకోకుండా అయినా, అనివార్యంగా వెళ్ళాను. ఇంకో గమ్మత్తేమిటంటే, ఈ సభలో అలన్ కు శాలువా కప్పే పని కోసం పిలిపించబడిన తమిళనాడు రాష్ట్ర మంత్రి తంగం తెన్నరసు సభారంభానికి ముందే ఠంచనుగా వచ్చేశారు. సభ అయ్యే వరకూ ఉన్నారు. ప్రసంగం ఆసాంతం విన్నారు. వద్దనుకున్నా మళ్ళీ ఇక్కడా మనవాళ్ళతో పోలిక వచ్చేసింది.

కొసమెరుపు - సభ మొదలవడానికి ముందు నేను థియేటర్ బయట జర్నలిస్టు మిత్రులతో నిలబడి ఉన్నప్పుడు ఓ పోలీసు నా దగ్గరకు వచ్చాడు. ‘మీటింగు ఎన్నింటి నుంచి ఎన్నింటి దాకా సార్’ అని అడిగాడు. ‘ఎంత ఆసక్తి’ అని ఆశ్చర్యపోతూనే, ‘ఎందుకు అడిగాడో’ అనుకుంటూ నాకు తెలిసిన సంగతి చెప్పాను. మంత్రి గారి బందోబస్తు కోసమే అదంతా అని ఆఖరుకు కానీ నాకు అర్థం కాలేదు.

Sunday, September 19, 2010

ఈ డిజిటల్ యుగంలో జర్నలిజం ఏమై పోతుంది?(ఫోటో వివరం - ప్రసంగిస్తున్న 'ది గార్డియన్' ఎడిటర్ అలన్ రస్ బ్రిడ్జర్ ).............

ఈ డిజిటల్ యుగంలో జర్నలిజం ఏమై పోతుంది? ఈ ప్రశ్న చాలా ఆసక్తికరమైనదే. అందుకే, 'ది ఫ్యూచర్ ఆఫ్ జర్నలిజమ్ ఇన్ ది డిజిటల్ ఏజ్' అనే అంశంపై ఉపన్యాసమంటే నాకు సహజంగానే ఆసక్తి కలిగింది. పైగా, ఈ సెప్టెంబర్ 25తో 132 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’, వారి భాగస్వామ్యంలో నడుస్తున్న ‘ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజమ్’ సంయుక్తంగా ఈ ఉపన్యాసాన్ని ఏర్పాటుచేశాయి. ప్రపంచ ప్రసిద్ధ ఆంగ్ల పత్రికల్లో ఒకటైన ‘ది గార్డియన్’ సంపాదకుడు అలన్ రస్ బ్రిడ్జర్ ఉపన్యాసకుడు.

వారం రోజుల క్రితం ‘హిందూ’లో ఈ కార్యక్రమం గురించి ఓ చిన్న ప్రకటన చూసినప్పటి నుంచి ఎలాగో ఒకలా వీలు చేసుకొని వెళ్ళాలని అనుకుంటూ వచ్చా. తీరా పనుల్లో పడి ఆహ్వానపత్రం తెప్పించుకోవడం మర్చిపోయా. నిన్న 18వ తేదీ శనివారం సాయంత్రం కార్యక్రమం మరో గంటలో ఉందనగా - తెలిసిన మరో జర్నలిస్టు మిత్రుడికి హడావిడిగా ఫోన్ చేశా - ఇన్విటేషన్ కోసం. మద్రాసు ఎగ్మూరులోని ప్రసిద్ధ మ్యూజియమ్ థియేటర్లో సభ. గబగబా వెళ్ళా.

చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ మ్యూజియమ్ థియేటర్ లోపల అడుగుపెట్టా. పాత కాలపు వాస్తు నిర్మాణరీతిలో వర్తులాకారంలో ఉండే ఆ భవనం, లోపల కూడా అదే పద్ధతిలో ఉండే సభాంగణం, గోడల మీద డిజైన్లు, వేదిక మీద పాతకాలపు నాటక, సినిమా శాలల్లో ఉండే లాంటి నస్యం పొడి రంగు సిల్కు తెర - మనకు తెలియకుండానే మనల్ని ఓ చిత్రమైన మానసిక స్థితిని కలిగిస్తాయి. నాదీ అదే పరిస్థితి. ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజమ్, అన్నా యూనివర్సిటీలకు చెందిన జర్నలిజమ్ విద్యార్థినీ విద్యార్థులతో, ఇతర ఆహ్వానితులతో సభారంభానికి ముందుగానే ఆడిటోరియమ్ దాదాపుగా నిండిపోయింది.

సరిగ్గా చెప్పిన టైముకి సాయంత్రం 5.30 గంటలకల్లా సభ మొదలైపోయింది. ‘హిందూ’ దినపత్రిక ఎడిటర్ - ఇన్ - ఛీఫ్ ఎన్. రామ్ వేదిక మీదకొచ్చి, వక్తను స్థూలంగా పరిచయం చేసి, వేదిక ఆయనకు అప్పగించి కిందకు దిగిపోయారు. 1995 నుంచి ‘ది గార్డియన్’కు ఎడిటర్ గా పనిచేస్తున్న అలన్ తన బ్రిటిష్ ఇంగ్లీషు యాసలో ఉపన్యసించడం మొదలుపెట్టారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో సాగిన ఆ అనర్గళ ప్రసంగాన్ని అలవాటు లేని ఆ యాసలో అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమనిపించినా, కాసేపయ్యే సరికి కొద్ది కొద్దిగా అలవాటవడం మొదలైంది.

‘డిజిటల్ యుగంలో జర్నలిజమ్ భవిష్యత్తు’ గురించి అలన్ రస్ బ్రిడ్జర్ గంటసేపు అనర్గళంగా మాట్లాడారు. అటు అభివృద్ధి చెందిన దేశాలలోని మీడియానూ, ఇటు అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లోని మీడియానూ పోల్చి చూస్తూ, కొన్ని ఆసక్తికరమైన అంశాలు చెప్పుకొచ్చారు. 2004లో ‘ది గార్డియన్’ రూపురేఖలను సమూలంగా మార్చేసిన చరిత్ర అలన్ ది. ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి వార్తా వెబ్ సైట్లలో ఒకటిగా ఆ పత్రికను ఆయన తీర్చిదిద్దారట. ఆ వెబ్ సైట్ కు 3 కోట్ల మంది పాఠకులన్నారట. వాక్ స్వాతంత్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ విషయంలో తమ దేశంలో ఆయన విశేష కృషి చేస్తున్నారట.

సమాచార ప్రసారంలో వేగంగా ఆధునికతను తెచ్చిపెడుతున్న ఈ డిజిటల్ యుగంలో జర్నలిజమ్ లో కూడా ఆ ఆధునిక సాధనాలను ఉపకరణాలుగా చేసుకోక తప్పదని ఆయన స్పష్టం చేశారు. నిజానికి, 110 కోట్ల జనాభా దాటిన భారతదేశంలో ఇవాళ ఇంటర్నెట్ కేవలం 8 కోట్ల మందికే అందుబాటులో ఉంది. అంటే 7 శాతం మంది అన్న మాట. అదే చైనాలో అయితే, 40 కోట్ల మందికి నెట్ అందుబాటులో ఉందట. నెట్ వినియోగం తక్కువగా ఉన్నందు వల్ల భారత్ లో ఇప్పటికిప్పుడు కొత్త డిజిటల్ మీడియాతో ఇబ్బందులు లేవు.

కానీ, మొబైల్, 3జి వినియోగం లాంటివి వేగంగా పెరిగిపోతున్నందు వల్ల కొన్నేళ్ళలోనే భారత్ లోని సమాచార సాధనాలకు, ముఖ్యంగా పత్రికలకు డిజిటల్ మీడియా పెను సవాలుగా మారనుంది. అమెరికా, ఐరోపా లాంటి దేశాల్లో లాగా భారత్ లోని పత్రికలు కూడా పెద్ద కుదుపునకు లోనవడం ఖాయం. ‘‘అందుకు ఎంత సమయం పడుతున్నంది చెప్పలేం కానీ, అక్కడి లాంటి సవాళ్ళే ఇక్కడా రావడం తథ్యం’’ అని అలన్ స్పష్టం చేశారు. ‘ఎప్పుడో కదా అది మీద పడేది’ అని నిర్లక్ష్యంతో కూర్చోకుండా, చేతిలో ఉన్న ఈ సమయాన్ని సమర్థంగా వినియోగించుకొని, తగిన వ్యూహంతో జర్నలిజమ్ రంగంలోని వారు ముందుకు అడుగు వేయడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు.

(మిగతా భాగం మరికాసేపట్లో...)

Saturday, September 18, 2010

'రోబో' వాయిదా కథేంటి?మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా రజనీకాంత్ సినిమా అభిమానుల నిరీక్షణ మరికొన్నాళ్ళు పెరిగింది. రజనీకాంత్ - శంకర్ ల కలయికలో జనమంతా ఎదురుచూస్తున్న 'రోబో' చిత్రం విడుదల అక్టోబర్ 1కి వాయిదా పడింది. ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ సంస్థ ఆ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సరిగ్గా మరో వారం రోజుల్లో సినిమా విడుదల కావాల్సి ఉండగా, సెప్టెంబర్ 17 శుక్రవారం చీకటి పడ్డాక చల్లగా ఈ వార్తను తెలిపింది.

".... ఈ ఏడాదిలో జనమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'యంతిరన్ ' ('రోబో') చలనచిత్రం..." అక్టోబర్ 1న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్నట్లు సన్ పిక్చర్స్ ఆ ప్రకటనలో తెలిపింది. "భారత్ లోనే కాక, అమెరికా, బ్రిటిన్, ఐరోపా, మలేసియా, సింగపూర్, ఆస్ట్రేలియా సహా ప్రపంచవ్యాప్తంగా పలు థియేటర్లలో అదే రోజున సినిమా విడుదల అవుతుంద"ని పేర్కొంది.

చడీచప్పుడు లేకుండా హఠాత్తుగా వచ్చిన ఈ ప్రకటనతో మీడియా ఒక్కసారిగా మేల్కొంది. వివిధ రకాల వార్తా కథనాలు, టీవీ ఇంటర్వ్యూల కోసం సన్నద్ధమవుతున్న సమాచార సాధనాలు గబగబా అసలు విషయం కనుక్కునేందుకు ప్రయత్నించాయి. విలేఖరులు ఆగకుండా ఫోన్లలో మాట్లాడడం మొదలైంది. అయితే, విడుదల వాయిదాకు కచ్చితమైన కారణాలు అధికారికంగా వివరించడానికి నిర్మాణ వర్గాల వారెవరూ అందుబాటులోకి రాలేదు.

ఎవరి సంతకమూ లేకుండా, కేవలం ఆఫీసు ముద్రతో 'సన్ పిక్చర్స్' లెటర్ హెడ్ మీద వచ్చిన ప్రకటన మినహా మరే సమాచారమూ అందలేదు. ఇప్పటి దాకా చిత్రాల పంపిణీలోనే ఉన్న సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఇదే తొలి చిత్రం. సన్ టి.వి, జెమినీ టివి, ఉదయ టి.వి. తదితర తమిళ, తెలుగు, కన్నడ భాషా టీవీ చానళ్ళతో దక్షిణాదిన తిరుగులేని సంస్థగా ఎదిగిన సన్ టి.వి. నెట్ వర్క్ లిమిటెడ్ కు చెందిన ఓ విభాగమే - సన్ పిక్చర్స్. వీటన్నిటికి అధినేత అయిన కళానిధి మారన్ ఎప్పటి లానే ఈ సారి కూడా మీడియాకు దూరంగా ఉన్నారు.

'రోబో'చిత్ర నిర్మాత అయిన కళానిధి మారన్ అలా దూరంగా ఉంటే, ఆయన మిత్రుడూ - 'రోబో' చిత్రానికి కార్యనిర్వాహక నిర్మాత అయిన హన్స్ రాజ్ సక్సేనా సైతం ఈ ప్రకటనపై సంతకం పెట్టకపోవడం గమనార్హం. ఇటీవల మద్రాసులో ఓ పెద్ద హోటల్ పై సన్ టీవీ అధినేత దాడి జరిపించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఆ దాడిలో కళానిధి పక్షాన చక్రం తిప్పింది ఈ మిత్రుడేనని జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఆ కారణంగానే కొద్దిరోజులుగా సక్సేనా ఎవరికీ అందకుండా ఉండిపోయారని కోడంబాకమ్ కబురు.

నిజానికి, 'రోబో' సెప్టెంబర్ 24 రిలీజవుతుందని రజనీకాంత్ గత పక్షంలో తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. సన్ పిక్చర్స్ వర్గాలు సైతం ఆ తేదీని ఖరారు చేస్తూ, అధికారికంగా ప్రకటించాయి. ఆ పైన సినిమా ట్రైలర్ విడుదలప్పుడూ ఆ తేదీనే చెప్పాయి. దాంతో, ఇప్పటికే మద్రాసు లాంటి చోట్ల దాదాపు 30కి పైగా హాళ్ళలో 'రోబో' విడుదలకు సన్నాహాలు పూర్తయ్యాయి. తీరా సినిమా టికెట్లకు అడ్వాన్ బుకింగ్ మొదలయ్యే తరుణంలో కథ ఇలా మలుపు తిరిగింది.

సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కాలేదనీ, అందుకే ఈ వాయిదా అనీ కొందరు చెబుతున్నారు. కానీ, స్పెషల్ ఎఫెక్ట్స్ తో సహా అన్ని పనులూ ఇప్పటికీ పూర్తయ్యాయనీ, సెన్సార్ కు కూడా సినిమా సిద్ధమైందనీ అభిజ్ఞ వర్గాలను ఉట్టంకిస్తూ ఇప్పటికే వార్తలు వచ్చేశాయి. అసలు 'రోబో' సెన్సార్ కూడా అయిపోయిందనీ, కట్స్ ఏమీ లేకుండా, అందరూ చూడవచ్చంటూ యు (యూనివర్సల్) సర్టిఫికెట్ ఇచ్చారనీ కూడా ఇవాళ ఓ అనధికారిక వార్త వెలువడింది. మరి, అలాంటప్పుడు సినిమా విడుదల ఎందుకు వాయిదా వేసినట్లు? 'రోబో' విషయంలో ఇది ప్రస్తుతానికి అంతుచిక్కని మిస్టరీ! అక్షరాలా 150 – 160 కోట్ల రూపాయల విలువైన ప్రశ్న!!

Friday, September 17, 2010

వాయిదా పడ్డ రజనీకాంత్ 'రోబో'ఇప్పుడే అందిన వేడి వేడి తాజా వార్త - అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దర్శకుడు ఎస్. శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్‌ల కలయికలోని 'రోబో' (తమిళంలో 'యంతిరన్') చిత్రం విడుదల అనూహ్యంగా వాయిదా పడింది. ముందు అనుకున్న ప్రకారం ఈ సినిమా ఈ సెప్టెంబర్ 24 (శుక్రవారం) నాడు విడుదల కావాల్సింది. కానీ, ఇప్పుడు ఈ చిత్రం విడుదలను అక్టోబర్ 1వ తేదీ (శుక్రవారం)కి వాయిదా వేశారు. ఈ వార్తను అశేష అంతర్జాల సినీ అభిమానులతో పంచుకోవడానికే ఈ తక్షణ టపా.

(మరిన్ని వివరాలు మరికొద్ది సేపట్లో తరువాతి టపాలో....)

తాజా ఖబర్ - త్రివిక్రమ్, మహేశ్ బాబుల ‘ఖలేజా’ పూర్తయిందోచ్!పెద్ద హీరోతో సినిమా మొదలుకావడం ఎంత కష్టమో, పూర్తి కావడమూ అంతే కష్టం. ఆ కష్టాలు మన దర్శక, నిర్మాతలకు చాలా మందికి తెలిసినవే. కెమేరా ముందు ముఖానికి నవ్వు పులుముకొని, అందరి గురించీ మంచి మాటలు చెబుతారు కానీ, చాటుగా పిలిచి అడిగితే, అసలు కథలు చాలానే బయటకు వస్తాయి.

అయితే, ప్రతిసారీ తప్పంతా హీరోలదే అనుకోవడం పొరపాటే. కొన్నిసార్లు దర్శకులదీ ఉంటుంది. ఒక్కోసారి హీరో, దర్శకుడు అంతా సిద్ధంగా ఉన్నా సరే నిర్మాత చేతకాదని చేతులెత్తేయడంలోనూ ఉంటుంది. చేతకాని ప్రొడక్షన్ ను నెత్తికెత్తుకున్న నిర్మాతలు సినిమా సగంలో చేతులెత్తేసి, అప్పటికే సగం సినిమా పూర్తి చేసిన దర్శక, హీరోలను ఇరుకున పెట్టిన ఘటనలూ మన చరిత్రలో ఉన్నాయి.

కారణాలు ఏమైతేనేం, శింగనమల రమేశ్ నిర్మాతగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా వస్తున్న ఖలేజా కాస్తంత ఆలస్యమైందనే చెప్పాలి. దాదాపు ఏణ్ణర్ధం పైగా ఈ సినిమా షూటింగులో ఉంది. (ఆరంభించి అన్నాళ్ళయింది కానీ, అసలు షూటింగ్ డేస్ మాత్రం తక్కువే అని ఆ సినిమా యూనిట్ లోని ఆంతరంగిక వర్గాల కథనం).

ప్రతికూల వాతావరణంలో రాజస్థాన్ లో షూటింగ్, తెలంగాణ ఉద్యమకారుల దౌర్జన్యంలో కాలిపోయిన సెట్ లాంటి రకరకాల కారణాలతో ఈ చిత్రం షూటింగ్ ఆలస్యమైంది. కానీ, ఒకసారి వాటి నుంచి కోలుకున్నదే తడవుగా, ఓ పక్క షూటింగు, ఇంకో పక్క ఎడిటింగు, మరోపక్క డబ్బింగు - ఇలా అష్టావధానం చేస్తూ, ‘ఖలేజా’ను శరవేగంతో నడిపించింది చిత్ర సాంకేతిక వర్గం. ఫలితంగా, ఖలేజా ఇప్పుడు సర్వాంగ సుందరంగా సిద్ధమైపోతోంది.

ఇప్పుడే అందిన వేడి వేడి వార్త ఏమిటంటే - మూడు రోజుల క్రితం సెప్టెంబర్ 13వ తేదీ సోమవారం రాత్రి ‘ఖలేజా’ షూటింగులోని ఆఖరి ఘట్టం కూడా పూర్తయింది. బెంగుళూరులో చేసిన షూటింగుతో సినిమాలోని పాటలు, ప్యాచ్ వర్క్ సహా సమస్తం అయిపోయినట్లు కృష్ణానగర్ కబురు. దాంతో, చిత్ర యూనిట్ మొత్తం బాగా సంతోషంగా ఉన్నట్లు భోగట్టా. యూనిట్ అంతా బయలుదేరి హైదరాబాద్ వచ్చేసినట్లు సమాచారం.

ఇప్పుడిక ఫైనల్ రికార్డింగులు, మిక్సింగులే బాకీ. ఈ స్పీడులోనే అవి కూడా పూర్తి చేసి, మధ్యలో ఆడియో రిలీజ్ చేసి, ఈ నెలాఖరుకి ‘ఖలేజా’ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తేవాలనుకుంటున్నారు. ఎంతో శ్రమకోర్చి సినిమా తీయడమంటే ఇదే కదూ! సాంకేతిక వర్గం పడ్డ ఈ శ్రమకు తగిన ఫలితం లభించాలని ఆశిద్దాం.

Thursday, September 16, 2010

పెరిగిన ఆసక్తి - సినిమా ట్రైలరా మజాకా!

చీకటి దివాణంలో తెరపై వెలుగు నింపే దృశ్యాలు చూడడం ఎవరికైనా ఓ మరపురాని అనుభవం. ముఖ్యంగా సినిమా తప్ప, ఇవాళ్టి టీవీ వగైరా వినోద సాధనాలు, ఆధునిక సాంకేతికత లేనప్పుడు అదే ఓ మహేంద్రజాలం. అందుకే, అప్పట్లో సినిమాలే కాదు, సినిమాకు ముందూ, సినిమా మధ్యలో విశ్రాంతి సమయంలో హాల్లో చూపించే ట్రయల్ పార్టీలు (తప్పొప్పుల సంగతి తెలియని చిన్నప్పుడు అలానే పిలిచేవాళ్ళం) కూడా ఓ ఉద్విగ్నభరిత అనుభవం.

పైపెచ్చు, రాబోయే సినిమాలకు ముందుగానే ట్రైలర్ సిద్ధం చేసి, హాళ్ళలో ప్రదర్శించేవాళ్ళు. మనం కూడా వాటిని చూసి ఆనందించేవాళ్ళం. అసలు సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూసేవాళ్ళం.

కానీ, ఇటీవల కాలంలో హాలీవుడ్, హిందీ చిత్రాలను మినహాయిస్తే, తెలుగు సినిమాల ట్రైలర్లు రావడం బాగా తగ్గింది. కాగా, తాజా 'రోబో ' సినిమా కోసం ఓ చిన్న ట్రైలర్ ఈ మధ్యనే తమిళంలో విడుదల చేశారు. సోమవారం నుంచి తెలుగులో కూడా ఆ ట్రైలర్ చూపిస్తున్నారు. నిజం చెప్పాలంటే అది ఓ అద్భుతం.

ట్రైలర్ చూడక ముందు వరకు నా మనసులో ఏ మూలో సినిమా గురించి కొద్దిగా సంశయం ఉంది. కానీ, ట్రైలర్ చూశాక షాక్ కొట్టినట్లయింది. భారీతనానికి శంకర్ సినిమాలు పెట్టింది పేరు. కానీ, ఈ సైన్స్ - ఫిక్షన్ కథ ట్రైలర్ చూస్తుంటే, నిజంగానే ఏ హాలీవుడ్ సినిమా ట్రైలరో చూస్తున్నట్లు అనిపించింది. చిరు గడ్డం, ఒత్తయిన జుట్టుతో సైంటిస్టు పాత్రలో రజనీ అందంగా కనిపించాడు. తెరపై మళ్ళీ రజనీకాంత్ ను చూసి జనం కేరింతలు కొడుతున్నారు. మొత్తానికి, సెప్టెంబర్ 24 కోసం నిరీక్షణ పెరిగిపోయింది. నాకైతే చిన్నప్పుడు ట్రైలర్లు చూపిన ‘ఎపటైజర్ ఎఫెక్ట్’ మరోసారి గుర్తుకొచ్చింది.

Monday, September 13, 2010

‘పులి’రాజా ప్రేక్షకుడి మాట వింటుందా? తింటుందా?(‘కొమరం పులి’ సమీక్ష - పార్ట్ 2)


(ఫోటో వివరం - ‘కొమరం పులి’గా పవన్ కల్యాణ్)
..................

ఎంతో ఆసక్తిగా వెళ్ళిన ప్రేక్షకుడికి ‘కొమరం పులి’లో ఫస్టాఫ్ కొంత కాగానే, విసుగు మొదలవుతుంది. ఇంటర్వెల్ కు వచ్చేసరికి అది పై స్థాయికి చేరుతుంది. నిజానికి, ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో రకరకాల ఘట్టాలు, కథలో ముందుకు చలనం ఉన్నాయి. కానీ, చిత్రంగా సెకండాఫ్ కాసేపయ్యాక కథ కానీ, కథలో పురోగమనం కానీ పెద్దగా లేని ‘‘ఫస్టాఫే బెటర్రా నాయనా’’ అనిపిస్తుంది. దానికి బాధ్యులు దర్శక, రచయితలే!

పాత్రలు - పాత్రధారుల పనితనం

ఈ సినిమాకు మొదట అనుకున్న పేరు ‘పులి’ అనే! ఇంతలో పవన్ కల్యాణ్ ప్రమేయమో, అప్పట్లో తెలంగాణ ఉద్యమకారులను మంచి చేసుకొనే ప్రయత్నమో కానీ, దానికి ముందు ‘కొమరం’ వచ్చి చేరింది. (ఇప్పుడు అదే తెలంగాణ విద్యార్థి వర్గంతో వివాదమవుతోంది. అదే వేరే కథ). నిజానికి, మొదలైన దగ్గర నుంచి ఈ సినిమాకు ఏదో ఒక ఇబ్బంది. చిరంజీవి రాజకీయ రంగప్రవేశం, మొదటి వివాహానికి సంబంధించి పవన్ కల్యాణ్ ఎదుర్కొన్న వ్యక్తిగత ఇబ్బందులు, అసెంబ్లీ ఎన్నికలకు పవన్ ప్రచారం - ఇలా రకరకాల స్పీడ్ బ్రేకర్లతో ముచ్చటగా మూడేళ్ళకు ఈ ‘పులి’ జనారణ్యంలోకి వచ్చింది.

పవన్ కల్యాణ్ ను దృష్టిలో ఉంచుకొని రాసుకున్న పాత్ర కాబట్టి, అది ఆయనకు సరైన ఆది చొక్కా తొడిగినట్లు అతికింది. కాకపోతే, ప్రధాని ముందు కవాతు చేస్తూ నడిచొచ్చే లాంటి చోట్ల పోలీసు పాత్ర ఆయన శరీరధర్మానికి సరిపోలేదని తేలిపోతుంది. నవ్వు, ఏడుపు, ధీరత్వం - ఇలా వేర్వేరు భావోద్వేగాలను కూడా ఆ యా ఘట్టాలకు తగినట్లు ఆయన పలికించారు. సుదీర్ఘమైన డైలాగులను కూడా బాగానే చెప్పడానికి ప్రయత్నించారు కానీ, ఆగకుండా ఒకదానిపై మరొకటిగా వచ్చిపడిపోయే అవి సరిగ్గా అర్థం కావాలంటే, కనీసం మూడోసారైనా చూడక తప్పదు. అభిమానులు సరే కానీ, మామూలు ప్రేక్షకుడికి అంత తీరిక, ఓపిక ఉంటాయా అన్నది ఎంతలేదన్నా ప్రతిసారీ ఓ నలభై, యాభై రూపాయల ప్రశ్న (చిన్న ఊరు, మామూలు థియేటర్ కాకపోతే ఈ ప్రశ్న ఖరీదు బాగా పెరిగిపోతుంది).

విలన్ గా మనోజ్ బాజ్ పాయ్ బాగానే చేశారు. కానీ, అసలు ఆ పాత్రలోనే ఓ నిర్దిష్టత కానీ, పాత్రౌచిత్యం కానీ లేవు. రాష్ట్రాన్నీ, దేశాన్నీ గడగడలాడించగల అంత పెద్ద మాఫియా నేత ఓ కారు కోసం గందరగోళపడినట్లు చూపడం అర్థం లేని విషయం. ఇక, ముఖ్యమంత్రి, ఐ.జి. కూడా గుప్పెట్లో ఉన్న సదరు విలన్, ఓ ఐ.పి.ఎస్. అధికారికి అంత చులాగ్గా బెదరడమూ విచిత్రమే. పైపెచ్చు, ఓ దశ దాటాక, విలన్ ను దాదాపు కమెడియన్ స్థాయికి దించేశారు. అయితే, విలన్ కు పి. రవిశంకర్ (‘అరుంధతి’ చిత్రంలో ‘వదల బొమ్మాళీ వదల’ అనే గొంతు గుర్తుందిగా) డబ్బింగ్ అలరిస్తుంది.

హీరో తల్లి పాత్రను కాసేపు సెంటిమెంట్ కూ, కాసేపు జిజియాబాయి తరహా ధీరత్వానికీ బాగానే వాడుకున్నారు. పొట్టిగా ఉన్నా, గుట్టు లేకుండా తెరపై గట్టిగానే కనిపించిన నిఖిషా పటేల్ తన శృంగారోచిత చేష్టలు, మాటలతో (డబ్బింగ్ వేరెవరిదో లెండి) మాస్ ను ఆకర్షిస్తారు. కానీ, పాటలకూ, కామికల్ రిలీఫ్ కే తప్ప, ఆ పాత్రకు ప్రాధాన్యం పూజ్యం.

విలన్ కు గర్ల్ ఫ్రెండ్ గా, క్యాసినోలో ‘...దోచేయ్ దొరికింది దోచెయ్....’ అనే ప్రత్యేక నృత్య గీతంలో శృంగార నర్తకిని మించి నర్తించారు - అతిథి నటి శ్రియ. ఆ పై మరొక్క సీన్ లోనే ఆమె కనిపిస్తారు. అదంతా చూశాక, ఎంతటి హీరోయిన్ కు ఇంతటి దుఃస్థితి అనిపించక మానదు. కర్తవ్యానికీ, మాఫియా బెదిరింపులకూ మధ్య నలిగే ఏ.సి.పి.గా నాజర్, మాఫియా నేతకు చెమ్చాగిరీ చేసే ఐ.జి. రంజిత్ ప్రసాద్ గా చరణ్ రాజ్ ఎదురవుతారు. పేపర్ బాయ్ (బాల నటుడు భరత్), కనిపించకుండా పోయిన హుస్సేన్ (ఎస్.జె. సూర్య ఫోటో మాత్రం కనిపిస్తుంది) లాంటి పాత్రలతో ముందుగా కొన్ని సీన్లు తీసినా, ఆఖరి కూర్పులో అవేవీ మిగలలేదని సినిమా చూసినప్పుడు అనిపిస్తుంది.

సాంకేతిక విభాగాల సంగతి

ఆస్కార్ అవార్డుల విజేత ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతంలోని పాటల్లో ఎక్కువ భాగం వడి వడిగా నడిచే పాటలే. సినిమా నడిచినన్నాళ్ళే తప్ప, విడిగా గుర్తుండేవి కావు. మారాలంటే లోకం.... పాట రెహమాన్ గొంతులో నేపథ్య గీతంగా వినిపిస్తుంది. అలాగే, ‘మా తెలుగుతల్లికీ మల్లెపూదండ...’ అన్న పదాలకు రెహమాన్ తన గొంతులో కొత్త జోష్ తెచ్చే ప్రయత్నం చేశారు. ‘ఓ చెకుముకీ...’ పాట కుర్రకారుకూ, ‘పవర్ స్టార్...’ పాట అభిమానులకూ పట్టవచ్చు. పాటలన్నీ చంద్రబోస్ రచనలు. కాకపోతే, (సంగీత) శబ్దాల హోరులో (సాహిత్య) శబ్దమేమిటో అర్థం కావాలంటే తాతలు దిగొస్తారు. ముంబయ్ కెమేరామన్ బినోద్ ప్రధాన్ తన ప్రతిభ చూపారు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ, థాయిలాండ్ దృశ్యాల లాంటి చోట్ల గుర్తింపు వస్తుంది.

ప్రభాకరన్ ఎడిటింగ్ సో సో. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య శాబ్దిక లయ ప్రధానంగా వచ్చే ఓ వేగవంతమైన పాటలో ఆ లయకు తగ్గట్లు చకచకా షాట్లు కట్ చేస్తూ, దృశ్యభాగాన్ని కూర్చడం ప్రేక్షకుల కళ్ళకు సంతోషం కన్నా, శ్రమే మిగిల్చింది. మధ్యలో ‘...నోటి ముత్యాల్ జారనీయకే...’ అంటూ వచ్చే ఆ పాట మొత్తం ముక్కలు ముక్కల తెలుగు వినడం ఓ నరకం.

హాలీవుడ్ ప్రేరణతో చేసిన యాక్షన్ సన్నివేశాలు (ముఖ్యంగా మొదట్లోనే వచ్చే ప్రధానిపై హత్యాయత్న భగ్నం ఘట్టం) మాస్ కు బాగుంటాయి. వాటికి పడ్డ శ్రమ, ఖర్చు కూడా ఎక్కువే. కానీ, హెలికాప్టర్ లో నుంచి హీరో కిందకు దూకేయడం, భవనాల మీద నుంచి గాలిలోకి, గాలిలో నుంచి భవనాల మీదకు వేసే గ్రాఫిక్స్ గెంతులు నమ్మశక్యంగా లేవు.

సినిమా అంటే కొంత కల్పన, ఎంతో ఎగ్జాగరేషన్ తప్పవనుకున్నా సరే, నర మానవులకు సాధ్యం కాని ఈ విన్యాసాలు నవతరం ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. హాలీవుడ్ చిత్రాల నుంచి ప్రేరణ పొందడం తప్పు కాదు కానీ, సహజత్వానికి దగ్గరగా, నమ్మించేలా లేకపోతే, ఎంతటి శ్రమైనా, బూడిదలో పోసిన పన్నీరే అనడానికి ఇది తాజా ఉదాహరణ.

మితి మీరిన మాటల విన్యాసం

‘జల్సా’ (2008)లో ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర సంజయ్ సాహూ పాత్ర (హీరో పవన్ కల్యాణ్) మనసులోని మాటలు గట్టిగా, సుదీర్ఘంగా బద్దలవడం చూశాం. ఆ ఆవేశభరిత నటన చూసి, దాని ప్రేరణతోనో ఏమో, సినిమా అంతా హీరో అదే పద్ధతిలో మాట్లాడే విధంగా ఈ ‘కొమరం పులి’ కథ, కథనం అల్లుకున్నారు. పిడుగుకీ, బియ్యానికీ ఒకే మంత్రం వాడి, పీకల మీదకు తెచ్చుకున్నారు.

ఈ సినిమాలో చాలా చోట్ల కథానాయకుడు నాన్ స్టాప్ ఎక్స్ ప్రెస్ లా మాట్లాడుతూ, ధ్వనికాలుష్యం చేస్తూనే ఉంటాడు. దేశం గురించి, వ్యవస్థ గురించి ఆ పాత్ర చేసే పరిశీలనలు విలువైనవిగా అనిపించినా, మొదటి రెండు మూడు సార్లు గడిచాక, భరించడం కష్టమే. దాంతో, ‘...చస్తూ బతికేవాడి కన్నా, చచ్చినా బతికేవాడిగా ఉండాలి...’ లాంటి పంచ్ లు కూడా గాలికి పోయాయి.

ఈ సినిమా టైటిల్స్ లో మాటలకు ఇద్దరి పేర్లు వచ్చాయి. మొదట్లో మాటలు - సిప్పీ అని వేశారు. ఆ తరువాత మళ్ళీ ఏమనుకున్నారో ఏమో టైటిల్స్ చివరకొచ్చేసరికి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంటూ ఎస్.జె. సూర్య అని క్రెడిట్ వేశారు. ఈ గొడవేమిటో అర్థం కాదు. లోతుగా గమనిస్తే, కో-డైరెక్టర్, పవన్ కల్యాణ్ దగ్గర సన్నిహితుడూ అయిన సిప్పీ యే మాటలు ఎక్కువగా రాశారేమో అనిపిస్తుంది. దేశం గురించి, వ్యవస్థ గురించి హీరో చేసే సుదీర్ఘ ఉపన్యాసాల్లో పవన్ కల్యాణ్ ప్రేరేపణతో సిప్పీ రాసి ఉండవచ్చని అనుమానం వస్తుంది.

అలాగే, ఇంతా చేసి తండా ప్రాంతంలో పుట్టి పెరిగిన హీరో పేరు కొమరం పులి అయితే, అతని తండ్రి పేరు రాజా రెడ్డి అని సినిమా మొదటి సీనులో మాటల్లో అనిపించారు. (ప్రేక్షకుల అరుపుల మధ్య నాకైతే అలాగే వినిపించింది). సినిమాలో హీరో పేరు - కాసేపు ‘కొమరం’ పులిగా, మరికాసేపు ‘కొమ్రం’ పులిగా కనిపిస్తుంది. హీరో మాటలు కూడా ఉన్నట్లుండి తెలంగాణ మాండలికంలోకి మారడం, ఆ వెంటనే మళ్ళీ అదేమీ లేకుండా పోవడం లాంటి విచిత్రాలు కూడా ఉన్నాయి.

ఇది దర్శకత్వ ప్రతిభే...

నిజానికి, ఈ సినిమా పట్ల సవాలక్ష అసంతృప్తులకు దర్శకత్వం, స్క్రీన్ ప్లే లోపాలే ప్రధాన కారణం. తమిళంలోనే అవకాశాలు లేక అల్లాడుతున్న దర్శకుడు ఎస్.జె. సూర్యను తెచ్చి నెత్తిన పెట్టుకున్న మన వాళ్ళ పొరుగింటి పుల్లకూర అభిరుచికి జోహార్. శృంగారం మీదే తప్ప యాక్షన్ దృశ్యాల మీద పట్టు లేని సూర్య ఇందులోనూ ఆ పనే చేశారు. సీరియస్ గా సాగాల్సిన కథను ఒక రకంగా హీరో, హీరోయిన్ల మధ్య ట్రాక్ తో పక్క దోవ పట్టించారు.

అన్నట్లు పవన్ కల్యాణ్ కు గిటార్ మీద ఎంత మోజుంటే మాత్రం ప్రతి సినిమాలోనూ హీరోయిన్తో, గిటార్ తో కనిపించాలా. ‘తొలి ప్రేమ’, ‘బాలు’... తరువాత మళ్ళీ ఇందులోనూ ఓ పాటలో అదే దృశ్యం. దాంతో, పాత సినిమా చూస్తున్నామని అనిపిస్తే అది ప్రేక్షకుల పొరపాటేమీ కాదు.

ఎంచుకున్న అంశమే అంతంత మాత్రమైనప్పుడు, దాన్ని తెరపైకి ఎలా ఎక్కించాలన్న దానిపైన అయినా శ్రద్ధ పెట్టాల్సింది. కానీ, అందులోనూ దర్శకుడి పనితనం ఏమీ లేకుండా పోయింది. ‘‘...బావ గారూ, కొంచెం తిని, పెట్టండి...’’ (హీరోయిన్ అన్నం ప్లేటు తీసుకురాగానే, అప్పుడే పెళ్ళయిన హీరోతో అలీ అనే మాట), ‘‘...ఏయ్ పవర్ స్టారూ, నీ పవర్ బయటే కాదు. ఇంట్లో కూడా కొంచెం చూపించు.... ’’ (పెళ్ళయినా సరే కర్తవ్యమంటూ ఇల్లు పట్టకుండా తిరిగే హీరోను సంసారం ముగ్గులోకి దింపే ప్రయత్నంలో హీరోయిన్) లాంటి డైలాగులు, చేష్టలతో సినిమాను వినోదాత్మకంగా మలిచినట్లు భ్రమపడ్డారు.

రకరకాల మూడ్స్ పుణ్యమా అని సినిమాల్లో నటించక అభిమానులనూ, నటిస్తున్నప్పుడు దర్శక - నిర్మాతలనూ కొంత ఇరకాటంలో పెడతాడని పవన్ కల్యాణ్ గురించి పరిశ్రమలో చెవులు కొరుక్కుంటూ ఉంటారు. కానీ, ఈసారి మాత్రం ఆయన తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న ‘కొమరం పులి’ సినిమాలో రమారమి మూడేళ్ళు నటించి, తన నుంచి కమర్షియల్ సినిమా కోరుకొనే అభిమానులను సైతం ఇరకాటంలో పడేశారు.

కొసమెరుపు: పేజీల కొద్దీ డైలాగులు ఆగకుండా, అర్థం కాకుండా, పదే పదే చెప్పే హీరో పాత్రను చూసిన మత్తులో హాలులో నుంచి బయటకు వస్తూ ఓ కుర్రాడు చేసిన కామెంట్ - ‘‘అబ్బ... బాలకృష్ణ సినిమా చూసినట్లుంది. ’’ ఇక, సినిమా చూశాక, ఓ సగటు ప్రేక్షకుడు తన మిత్రులకు మొబైల్ లో పంపిన మెసేజ్ - ‘‘బాబా (బో)య్, ‘పులి’ తినేసింది!’’ దానికి అవతలి విశ్లేషక మిత్రుడు ఇచ్చిన రిప్లయ్ మెసేజ్ ఇది - ‘‘ఎవడెళ్ళమన్నాడు - క్రూర జంతువని తెలిసి!?’’

Sunday, September 12, 2010

ఆత్రపడ్డ అభిమానులపై ఆకలిగా పడ్డ 'పులి'(ఫోటో వివరం - ‘కొమరం పులి’గా పవన్ కల్యాణ్)
.................

పెద్ద హీరోల సినిమాలకు ఉండే ఇబ్బందే ఇది. కథ కోసం కాక, హీరో ఇమేజ్ కోసం ఆలోచించడం మొదలుపెడతారు. కోట్లు కుమ్మరించి, ఏళ్ళ తరబడి సినిమా తీస్తారు కానీ, తీరా కథకో, కథనానికో వచ్చేసరికి ఫలానా వర్గం వారి కోసమంటూ ఏవేవో అనవసరపు రాజీలకొస్తారు. వెరసి, సినిమాను అవకతవకగా మార్చేస్తారు. అందరి మీదకూ వదిలేస్తారు. దర్శక, నిర్మాతల పూర్వపుణ్యఫలం వల్లో, హీరో అదృష్టం వల్లో ఏవో కొన్నిసార్లు ఈ వంట ప్రేక్షకులకు రుచించవచ్చు. కానీ, చాలాసార్లు ఆ వంట చెడిపోవడం, చూసినవారి మతిపోవడం సర్వసాధారణం. పవన్ కల్యాణ్ ‘కొమరం పులి’ చిత్రం కూడా సరిగ్గా ఇదే సమస్యకు బాధితురాలైంది.

సమకాలీన తెలుగు అగ్ర హీరోల్లో సమాజం పట్ల కాస్తంత అక్కర, ఆవేశం ఎక్కువే ఉన్న నటుడు - పవన్ కల్యాణ్. ఆయన చదివే పుస్తకాల్లోనూ, మాటల్లోనూ ఆ సంగతి గమనించవచ్చు. ‘కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్’ లాంటి ఆలోచనలతో ఆ మధ్య ఆయన ఊగింది అందుకే. ఇలాంటి పవన్ ఆలోచనలనూ, ఆయన బాడీ లాంగ్వేజ్ నూ దృష్టిలో పెట్టుకొని అల్లుకున్న చిత్రం - ‘కొమరం పులి’. సామాన్యుల కష్టాలను పట్టించుకొని, వాళ్ళకు అండగా నిలవడమే పోలీసు ఉద్యోగానికి పరమార్థమని నమ్మిన ఓ సిన్సియర్ ఇండియన్ పోలీసు సర్వీస్ (ఐ.పి.ఎస్.) అధికారి పాత్ర చుట్టూ ఈ చిత్ర కథ నడుస్తుంది.

కథా సంగ్రహం

పాతికేళ్ళ క్రితం 1985లో బి.కె. నాయక్ తండాలో కథ మొదలవుతుంది. కనిపించకుండా పోయిన పోలీసు అధికారి అయిన తన భర్త కోసం ఓ మహిళ ఆక్రోశిస్తుంటుంది. పోలీసుల దగ్గర న్యాయం జరగక పోగా, ఆ అధికారిని కనిపించకుండా చేసిన ముఠా నేత అల్ సలీమ్ (మనోజ్ బాజ్ పేయి) చేతిలో ఆమె చచ్చి బతుకుతుంది. అప్పటికే తన కడుపున పడిన బిడ్డను నిజాయతీపరుడైన పోలీసు అధికారిగా పెంచాలని అడవిలోని అయ్యప్ప ఆలయం సాక్షిగా నిశ్చయించుకుంటుంది.

అలా ఆమెకు పుట్టి పెరిగిన బిడ్డే - ఐ.పి.ఎస్. అధికారి కొమరం పులి (పవన్ కల్యాణ్). ఇప్పటి కథాకాలానికి వస్తే -థాయిలాండ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని హత్య కోసం విద్రోహులు వేసిన వరుస పన్నాగాలను భగ్నం చేస్తాడు పులి. ప్రాణాలకు తెగించి, సాహసోపేతంగా తన ప్రాణాలు కాపాడిన పులిని అధికారికంగా సత్కరించబోతాడు ప్రధాన మంత్రి పి.వి. సమరసింహారావు (గిరీశ్ కర్నాడ్). అయితే, తనకు ఆ సత్కారం కన్నా, పోలీసు శాఖను సామాన్యులకు దగ్గర చేసి, వారి సమస్యలను తీర్చేందుకు అవకాశమివ్వమని హీరో అభ్యర్థిస్తాడు. ప్రధాని ఆమోదంతో ‘పులి టీమ్’ ఏర్పడుతుంది. కష్టంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే రూపాయి పెట్టి ప్రత్యేక పబ్లిక్ బూత్ ల నుంచి ఫోన్ చేస్తే చాలు, ఆ టీమ్ రంగంలోకి దిగి, వారి కష్టాలను తీర్చేందుకూ, పోలీసుల నుంచి తగిన తోడ్పాటు లభించేందుకూ కృషి చేస్తుంటుంది.

కనిపించకుండా పోయిన తన కొడుకూ, పోలీసు ఇన్ స్పెక్టర్ అయిన హుస్సేన్ (దర్శకుడు ఎస్.జె. సూర్య) కోసం ఆవేదనతో ఓ అమ్మ ఫోన్ చేస్తుంది. అతని జాడ కనిపెడతానని ఆమెకు మాట ఇస్తాడు పులి. హుస్సేన్ ఆఖరుగా అందుకున్న ఫోన్ కాల్ అప్పటికి అంతర్జాతీయ మాఫియా నేతగా ఎదిగిన అల్ సలీమ్ వాళ్ళ ఆఫీసు నుంచే వచ్చింది కాబట్టి, అతని వెంట పడతాడు హీరో. అయితే, ఆ ఫోన్ చేసింది తానే అనడానికి సాక్ష్యం ఏమిటంటాడు ఆ విలన్. సాక్ష్యాధారాల కోసం వెతుకుతున్న హీరో ‘నో పార్కింగ్’లో ఉన్న విలన్ బెంజి కారును స్టేషన్ కు పట్టుకెళతాడు. ఆ కారు వెనక్కి తెచ్చి ఇవ్వాలని పంతం పడతాడు విలన్. హుస్సేన్ సంగతి చెబితేనే ఇస్తానంటాడు హీరో. ఆ పంతం అలా సాగుతుండగా, కోటిన్నర రూపాయల ఆ కారు గురించి హీరో తీగ లాగేసరికి డొంకంతా కదులుతుంది.

ప్రధాని మీద హత్యాయత్నం చేసి, ఇంటర్ పోల్ ఎదురుదాడిలో మరణించాడనుకుంటున్న నిక్సన్ కూ, అల్ సలీమ్ కూ ఉన్న సంబంధం గురించి బయటకొస్తుంది. నిక్సన్ నిజంగా చనిపోతే, అతని వీసా మీద భారత్ కు వచ్చినదెవరు లాంటి అనుమానాలు రేకెత్తుతాయి. ఆ గుట్టుమట్లను హీరో ఎలా బయటపెట్టాడనే కథనంతో కథ క్లైమాక్స్ కు వెళుతుంది. హుస్సేన్ నే కాదు, ఇన్ స్పెక్టరైన తన తండ్రిని కూడా గతంలో చంపింది ఈ అల్ సలీమే అన్న సంగతి హీరోకు ఎలా తెలిసింది, ఏం చేశాడన్నది పతాక ఘట్టం.

ఈ అసలు కథ మధ్యలో పిట్టకథ - హీరోను అమితంగా ప్రేమించి, అతణ్ణి బుట్టలో వేసుకొనే మధుమతి (తెలుగు తెరకు తొలి పరిచయం నిఖిషా పటేల్) ప్రహసనం. సినిమాలో ఉన్న రొమాన్సయినా, కామెడీ అయినా ఆ సన్నివేశాలే.

(మిగతా భాగం మరికాసేపట్లో...)

Saturday, September 11, 2010

‘కొమరం పులి’: ఫస్టు రోజు ఫస్ట్ షో టికెట్ కథ(ఫోటో వివరం - ‘కొమరం పులి’లో పవన్ కల్యాణ్, తెలుగు తెరకు తొలి పరిచయం నిఖిషా పటేల్)
.........

గడచిన నాలుగు రోజులుగా ఆఫీసులో ఇదే చర్చ. ‘కొమరం పులి’ సినిమా ఎప్పుడు, ఏ యే థియేటర్లలో వస్తోంది, దానికి స్పందన ఎలా ఉంటుంది, గిట్టని వైరి పక్ష అభిమానులు సినిమా రిలీజయ్యీ కాక ముందే ఎలాంటి ప్రచారం సాగిస్తారు - ఇలా రకరకాల అంశాలు ఆ మాటల్లో వచ్చాయి. సినిమా మీద ఆసక్తి ఉన్నా, వినాయక చవితి పండగ, ఆదివారం హడావిడి తగ్గాక చూడాలని ఎందుకనో అనుకోకుండానే మనసులో ఓ మూల ఫిక్సయ్యా.

ఇంతలో ఇంగ్లీషే తప్ప తెలుగు సినిమాలంటే ఎప్పుడూ తెగ చీకాకు పడే ఓ సీనియర్ సహోద్యోగి ఆశ్చర్యకరంగా తన వీరాభిమాన ప్రదర్శనగా ‘కొమరం పులి’ టికెట్లు కొన్నాడు. అదీ ఊరికి కాస్తంత పెడగా ఉన్న బాగా ఖరీదైన మల్టీప్లెక్స్ లో. ‘కొమరం పులి’ టికెట్లు ఇంటర్ నెట్ లో బుక్ చేసుకొని, ప్రింట్ అవుట్ తీసుకున్నాడు. ఆ టికెట్ అందరికీ చూపిస్తూ, ఆదివారం ఆ సినిమాకు వెళుతున్నట్లు మా కొలీగ్ చెప్పాడు. అప్పటి దాకా రెండు రోజులు ఆగి, హంగామా తగ్గాక సినిమా చూద్దామనుకున్న నాకు కూడా అది చూసే సరికి కొత్త ఉత్సాహం, ఉద్వేగం పుట్టుకొచ్చాయి.

తీరని పనుల మధ్య సినిమాకు వెళ్ళడం ఎలాగా అనుకుంటూ ఉండగానే, అనుకోకుండా సినిమా రిలీజ్ రోజు వచ్చేసింది. అనుకోకుండా సాయంత్రం ఆఫీసు పని తొందరగా అయిపోయింది. మరో అరగంటలో ఫస్ట్ షో టైము. రిలీజ్ రోజున, అదీ చాలా ఆఫీసులకూ, విద్యాలయాలకూ సెలవు రోజున సాయంకాలపు ఆటకు టికెట్లు దొరుకుతాయా అని సందేహం కలిగింది. అయినా సరే, ప్రయత్నించి చూస్తే తప్పేముందని హాలుకు బయలుదేరా.

బస్సులో పడి హాలుకు చేరేసరికి, సినిమాకు మరో 10 నిమిషాలే టైముంది. కౌంటర్లో ‘ఫుల్’ అని బోర్డు ఎదురైంది. ఊళ్ళో 7 థియేటర్లలో సినిమా రిలీజైనా, సింగిల్ థియేటరే తప్ప మల్టీప్లెక్స్ కాని ఆ థియేటర్ లో జనం కిటకిటలాడిపోతున్నారు. గేటు తీస్తే చాలు, లోపలకు వెళ్ళడానికి నిలబడి ఉన్నారు. 50 రూపాయల టికెట్ బ్లాకులో రూ. 80 నుంచి వంద దాకా పలుకుతోంది.

నాకేమో బ్లాకులో కొనడానికి మనస్కరించలేదు. అందుకే, ‘ఫుల్’ అన్న బోర్డు చూసినా ఆశ చావక, ఫస్ట్ షోకు టికెట్లున్నాయా అని కౌంటర్లో మనిషిని అడిగా, లేవంటే - కనీసం మరునాటికైనా ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుందామని. హాలు లోపలకు వచ్చి, కౌంటర్లో టికెట్ తీసుకోమన్నాడు - ఆశ్చర్యకరంగా. వాళ్ళు అప్పటి దాకా అమ్మకుండా అట్టిపెట్టుకున్న టికెట్లనుకుంటా, మామూలు రేటుకే కౌంటర్ లోనే అమ్మేస్తున్నారు. టికెట్ తీసుకున్నా. మ్యాట్నీ ఆలస్యంగా మొదలైనట్లుంది. ఆలస్యంగా ముగిసింది. అది అయ్యాక సాయంత్రం 7 గంటలకు కానీ మమ్మల్ని లోపలకు వదల లేదు. లోపలకు వెళ్ళి, సీటు చూసుకొని కూర్చున్నా.

హాలంతా స్టూడెంట్లు, సాఫ్టువేర్ ఉద్యోగులు, ప్రేమికుల జంటలే. కొన్ని ఫ్యామీలీలు కూడా ఉన్నాయి. జనం ఈలలు గోలతో సాయంత్రం 6.45 గంటలకు మొదలవ్వాల్సిన ఫస్ట్ షో చివరకు 7.10కి మొదలైంది. అనుకోకుండా అయితేనేం, చాలా రోజుల తరువాత రిలీజ్ రోజునే ఫస్ట్ షోకు ముందుగా టికెట్ బుక్ చేసుకోకుండా (అప్పటికప్పుడు టికెట్ కొనుక్కుని) పెద్ద హీరోల సినిమాకు వెళ్ళడం నాకు ఓ చిన్న కిక్ ఇచ్చింది. ఆ కిక్కుతో చీకటిలో తెరపై కనిపిస్తున్న దృశ్యాలలో లీనమయ్యా.

('కొమరం పులి' కథ, కమామిషు తరువాతి టపాలో...)

Friday, September 10, 2010

అటు వర్తమాన ఉద్యమ రాజకీయాల ప్రస్తావన,ఇటు పాత జ్ఞాపకాలకు ‘గాయం’(ఫోటో వివరం - ‘గాయం-2’లో జగపతిబాబు)
................

కొన్నేళ్ళ క్రితం ‘గాయం’ సినిమా వచ్చినప్పుడు అదో సంచలనం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం, సీతారామశాస్త్రి పాటలు, కోట శ్రీనివాసరావు నటన - ఇవన్నీ ఇప్పటికీ మర్చిపోలేని అంశాలు. ఆ సినిమా వేసిన బలమైన ముద్ర కారణంగా, దానికి సీక్వెల్ గా ‘గాయం -2’ వస్తోందంటే ఆసక్తి కలిగింది. విడుదలైన వారానికి ఇప్పుడు ఆ సినిమా చూడడం, రాయడం కుదిరింది. సినిమా చూశాక నాకు అనిపించిన భావాలే ఈ తాజా టపా.

విజయం అందించిన సూత్రాన్ని విడిచిపెట్టడం ఎవరికైనా అంత సులభం కాదు. అందులోనూ ఏదీ కలసి రానప్పుడు, గతంలో ఎప్పుడో కలిసొచ్చినదాన్ని ఆశ్రయిస్తే, మళ్ళీ విజయం తథ్యమని మనిషి నమ్ముతాడు. ఆ నమ్మకాలు సినిమా వాళ్ళకైతే మరీను. ఒకసారి హిట్ ఇచ్చిన ఫార్ములాను పదే పదే వాడడంలో వారు సిద్ధహస్తులు. కోట్లతో ముడిపడిన సినిమా వ్యాపారంలో ఇది సహజం కూడా. కొంతకాలంగా సరైన విజయాలు లేక అల్లాడుతున్న సినీ హీరో జగపతిబాబు కూడా సరిగ్గా అదే చేశారు. చాలా ఏళ్ళ క్రితం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చి, తన ఇమేజ్ ను మార్చేసి, హీరోగా నిలబెట్టిన ‘గాయం’ సినిమాను తాజాగా మళ్ళీ ఆశ్రయించారు. పాత కథకు కొనసాగింపుగా తెరపై కొత్త సన్నివేశాలు చూపిస్తే, జనం మరోసారి లైఫ్ ఇస్తారని ఆశపడ్డారు. దాని ఫలితమే జగపతిబాబు నటించగా ప్రవీణ్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘గాయం-2’.

వచ్చిన చిక్కేమిటంటే, మొదటి ‘గాయం’ సినిమాలోని పాత్రలను తీసుకున్నారే తప్ప, వాటి ఆలోచనా రీతిని దర్శక, రచయితలు అర్థం చేసుకున్నట్లు లేరు. ఆ యా పాత్రల ప్రవర్తననూ, వాటి మధ్య సైద్ధాంతిక సంఘర్షణనూ తెరపై చూపడం, ప్రేక్షకుణ్ణి అందులో సంలీనం చేయడం మొదటి ‘గాయం’లోని విశేషం. కానీ, అలాంటి శ్రద్ధ లాంటివి ఏమీ ఈ రెండో చిత్రంలో లేవు. దాంతో, పేరు, రూపమే తప్ప, లోపల అసలు సరుకు లేకుండా పాత దానికి సీక్వెల్ తీసినట్లయింది. అందుకే, పాత సినిమా మీద ప్రేమతో ఈ కొత్త సినిమాకు వెళ్ళినవారి మనసుకు ఇది మానని గాయం.

పాత ‘గాయం’తో పోలికలు లేకుండా, తేకుండా ఈ సినిమా చూసినా సరే, అప్పటికీ ఇదేమంత గొప్ప ప్రయత్నం అనిపించదు. సగటు యాక్షన్ సినిమాయే అనిపిస్తుంది. అదే ఈ ‘గాయం-2’కు ఉన్న ఇబ్బంది.

కథ కూడా ముందుగానే అనుకున్న ఓ క్లైమాక్స్‌కు కావాల్సినట్లుగా వెనుక నుంచి ముందుకు సన్నివేశాలు అల్లుకున్నట్లుంది. అంతేతప్ప, పకడ్బందీగా లేదు. హీరో రామ్ (జగపతిబాబు) బ్యాంకాక్ లో ఓ రెస్టారెంట్ నడుపుతూ, భార్య విద్య (విమలారామన్), పిల్లవాడు చైతుతో ఆనందంగా జీవితం గడిపేస్తుంటాడు. హీరోకు ఓ బావమరిది (హర్షవర్ధన్). బ్యాంకాక్ అమ్మాయిని ప్రేమించే ఆ బావమరిదితో కాసేపు కామెడీ.

ఇది ఇలా ఉండగా, రెస్టారెంట్ కు వచ్చి, అమ్మాయి మీద అత్యాచారం చేయబోయిన ఇద్దరు సైకో కిల్లర్లను అనుకోనిరీతిలో హీరో చంపేయడం పెద్ద సంచలనం అవుతుంది. ఆ వార్త బ్యాంకాక్ నుంచి ఆంధ్రదేశం దాకా పాకి, ఇక్కడి తెలుగు టీవీ వార్తా చానళ్ళలో వచ్చేస్తుంది. టీవీలోని ఆ దృశ్యాల్లో రామ్ ను చూసి, ఎప్పటికైనా ముఖ్యమంత్రిని కావాలని తపిస్తున్న అసమ్మతి రాజకీయ నాయకుడు గురునారాయణ్ (కోట శ్రీనివాసరావు), అతని కొడుకు శంకర్ నారాయణ్ (కోట ప్రసాద్) బెంబేలెత్తిపోతారు. ఏళ్ళ క్రితం తాము చంపామనుకుంటున్న దుర్గాకూ, ఈ రామ్ కూ పోలికలు ఉండడంతో, అసలు హీరో ఎవరనే ఆరా వస్తుంది.

ఆ సంగతి కనుక్కోవడం కోసం బ్యాంకాక్ వస్తారు - విలన్ కొడుకు, విలన్ తరఫు లాయర్ సాబ్ (తనికెళ్ళ భరణి). హీరో కుటుంబాన్ని నానా ఇబ్బందులూ పెట్టి, అతనే ఒకప్పటి దుర్గా అన్న నిజాన్ని ఒప్పిస్తారు. తన భర్త ఒకప్పుడు పచ్చి గూండా నేత అనీ, చావుకైనా, చంపడానికైనా సిద్ధపడిన వ్యక్తి అనీ తెలిసి, హీరోయిన్ హతాశురాలవుతుంది. తాను ఎందుకు అలా ముఠా నేతగా తిరిగానో, ఎందుకిలా అందరికీ దూరంగా సగటు మనిషిలా బతుకుతున్నానో హీరోయిన్ కు హీరో టూకీగా చెబుతాడు. (ఈ ఫ్లాష్ బ్యాక్ ఘట్టంలోనే పాత ‘గాయం’ దృశ్యాలను తెరపై 5 నిమిషాల పైనే చూపించి, ప్రేక్షకులతో పునశ్చరణ చేయించారు. హింసను వదిలేసి, మామూలు జీవితం వైపు రావడానికి కారణంగా రేవతి, శివకృష్ణలతో ఒకటి రెండు కొత్త సన్నివేశాలు చూపారు).

పాత కథంతా తుడిచేసి, కొద్దికాలంగా బ్యాంకాక్ లో ప్రశాంత జీవితం గడుపుతున్న హీరో కాస్తా విలన్ల గొడవ పెరగడంతో ఒక్కసారిగా తన అసలు రూపం చూపుతాడు. రామ్ అన్న ముసుగు తీసేసి, మళ్ళీ దుర్గా అవతారమెత్తి, శత్రువులను ఏరేసేందుకు హైదరాబాద్ వస్తాడు. ఇక అక్కడ నుంచి గురునారాయణ్ తదితరులకూ, హీరోకూ మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు, నరకడాలు, చంపడాలతో ద్వితీయార్ధమంతా నడుస్తుంది.

ఇద్దరు భార్యల ముద్దుల మొగుడనే కుటుంబ కథల ఇమేజ్ కు ముందు తనకు యాక్షన్ ఇమేజ్ తెచ్చిన ఒకప్పటి ‘గాయం’ కథ మీద జగపతిబాబు చాలానే కష్టపడ్డారు. వయసు మీద పడినట్లు కనిపించేస్తున్నా, అటు అమాయకుడైన రామ్ లాగా, ఇటు అన్నీ తెలిసిన దుర్గ లాగా రెండు పూర్తి భిన్నమైన షేడ్లను ఒకే పాత్రలో పలికించడంలో ఆయన విజయం సాధించారనే చెప్పాలి. ముఖ్యంగా తాను దుర్గను కాదు, రామ్ ను అని కన్నీళ్ళ పర్యంతమవుతూ నమ్మించే సీన్లో బాగా చేశారు.

హీరో భార్య పాత్రలో విమలా రామన్ ఓ.కె. ఎవరైనా ఎపుడైనా లాంటి చిత్రాల్లో కుర్ర హీరోయిన్ పాత్రల కన్నా ఇలాంటి ప్రౌఢ పాత్రలే ఆమెకు సరిపోతాయనిపిస్తుంది. అప్పటి ‘గాయం’ నాటికి కొత్తగా కనిపించినా, ఇప్పటికొచ్చేసరికి గురునారాయణ్ తరహా పాత్రలు కోట శ్రీనివాసరావు చాలానే చేసేశారు. మనమూ చూసేశాం. అయినా సరే, మళ్ళీ ‘గాయం-2’లోనూ ఆ పాత్రకు అలవాటైన రీతిలో ప్రాణం పోశారు కోట. ఇక ఈ సినిమాలో గుర్తుంచుకోదగ్గ పాత్రలేవీ పెద్దగా లేవనే చెప్పాలి. నిజజీవితంలో కోట శ్రీనివాసరావు కుమారుడైన ప్రసాద్ ఈ సినిమాలో కూడా ఆయన కుమారుడిగా నటించడం, సినిమాలో లానే జీవితంలో కూడా ఇటీవల అర్ధంతరంగా చనిపోవడం విధి వైచిత్రి అనిపిస్తుంది.

ఈ చిత్ర కథా రచయిత, దర్శకుడు ప్రవీణ్ శ్రీ కొత్తవారనుకుంటా, అయినా దృశ్యాన్ని తెరపై చూపడంలో మాత్రం ఇప్పటికే ఎందరో వెళుతున్న బాటనే అనుసరించారు. సంగీతానికి ఇళయరాజా, ఫైట్లకు రామ్ - లక్ష్మణ్ - ఇలా ఈ సినిమాకు పేరున్న సాంకేతిక నిపుణులు చాలామందే పనిచేశారు. కొన్నిచోట్ల రీ-రికార్డింగ్ లో ఇళయరాజా మార్కు కనిపిస్తుంది. అలాగే, ఆయనే పాడిన ‘కల గనే కన్నుల్లో కరగకే కన్నీరా...’ అనే సందర్భోచిత విషాద గీతం ఇప్పటికే విన్న ఆయన పాటల బాణీలోనే ఉన్నా, విన్నకొద్దీ వెంటాడుతుంది. మిగిలిన పాటల మాటెలా ఉన్నా ‘ఎందుకమ్మా ప్రేమా ప్రేమా గుండెలోన ఆగేవమ్మా రా...’ అన్న పాటకు ఆయన బాణీ చెవికి ఇంపుగా తోస్తుంది. కాకపోతే, హీరో హీరోయిన్ల మధ్య సాగే ఈ గీతం చిత్రీకరణ మటుకు పచ్చి ‘మిడ్ నైట్ మసాలా’ పాటల ధోరణిలో వెళ్ళింది. రాగల కొద్దిరోజుల్లో ఈ పాట ఆ తరహా టీవీ పాటల్లో తప్పనిసరిగా పదే పదే కనిపించడం ఖాయం.

‘‘పవర్, పదవి ఒకరిస్తే తీసుకొనేది కాదు బిడ్డా., మనం గుంజుకొనేది’’ (కొడుకు పాత్రధారితో కోట శ్రీనివాసరావు), ‘‘చావు కన్నా భయం చాలా భయంకరమైనది. పారిపోవడం మొదలుపెడితే, చచ్చేవరకూ వెంటాడుతూనే ఉంటుంది’’ లాంటి చోట్ల రవిరెడ్డి,గంధం నాగరాజు రాసిన డైలాగులు మెరిశాయి. గమ్మత్తు ఏమిటంటే, తెలుగునాట ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలను అన్యాపదేశంగా ఈ కథలో వాడుకున్నారు. నాయకుల నిరాహారదీక్షలు, దీక్షా శిబిరాలు, దీక్షా భగ్నాలు, విద్యార్థుల ఉద్యమంలో అసాంఘిక శక్తుల ప్రవేశం, తమ స్వార్థం కోసం విద్యార్థులను బలి తీసుకొని - దొంగ సూసైడ్ నోట్లతో ఆత్మబలిదానాలుగా చిత్రించే ప్రయత్నం లాంటివన్నీ ఇటీవలి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఘటనల ప్రేరణతో తెరపైకి వచ్చినవే. ‘‘మన నీళ్ళు మనం అడిగినం. మన వాటా ఉద్యోగాలు మనం అడిగినం. ఇందులో తప్పేంటి. నోటి కాడ కూడు కొట్టేయద్దని అన్నాం. దీనికే కాల్పులు, బంద్ లా’’ అంటూ కోట నోట వినిపించే డైలాగులు ఎవరివో, సామాన్య తెలుగు ప్రేక్షకుడికి కూడా ఇవాళ చెప్పనక్కరలేదు.

అలాగే, మీడియా మీద విసుర్లు కూడా ఉన్నాయి. టీవీ 9 చానల్ నూ, ఆ నిర్వాహకులను గుర్తుకు తెచ్చే పాత్రలనూ, పేర్లనూ చూపెడుతూ, ‘‘ఇవాళ సెన్సేషనల్ న్యూస్ కూ, పెయిడ్ న్యూస్ కూ తేడా లేదు’’ అని ఓ టీవీ చానల్ నిర్వాహకుడి పాత్ర నోటి వెంట పలికించారు. అయితే, సహజంగానే ఈ అంశాలను వేటినీ లోతుగా చర్చించలేదు. సినిమా కథకో, చాలా వరకు కమర్షియల్ విజయానికో కావాల్సినంత వరకే వాడుకోవడంతో సరిపెట్టారు.

మొత్తం మీద ఇది పక్కా ‘ఏ’ సర్టిఫికెట్ యాక్షన్ చిత్రం. ప్రథమార్ధమంతా కాసేపు కుటుంబ జీవితం, కాసేపు కామెడీ, కాసేపు విలన్ల హంగామా - ఇలా గడిచిపోతుంది. ఒకప్పటి దుర్గాయే హీరో అన్న సంగతి తెలిసేసరికి ఇంటర్వెల్ బ్యాంగ్. అక్కడ నుంచి కథ రసకందాయంలో పడాల్సింది. కానీ, ద్వితీయార్ధం మొత్తాన్నీ విలన్లను వేటాడే హీరో హంగామాగా నడిపేశారు. దాంతో, ప్రేక్షకులకు నిరాశ కలుగుతుంది. పాత సినిమాతో పోలికలు వచ్చి, అసంతృప్తి అనిపిస్తుంది. వెరసి ఇది - మరపురాని పాత జ్ఞాపకాలకు గాయం.

‘రోబో’పై వీడిన సస్పెన్స్ - సర్దుకుంటున్న ఇతర నిర్మాతలు


(ఫోటో వివరం - 'రోబో'లో రజనీకాంత్, ఐశ్వర్యా రాయ్)
...............

మొత్తానికి రజనీకాంత్ తాజా చిత్రం ‘రోబో’ రిలీజ్ డేట్ ఖరారైంది. సంచలన దర్శకుడు శంకర్ - రజనీకాంత్ ల కాంబినేషన్ లో వస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం సెప్టెంబర్ 24న దేశవిదేశాల్లో విడుదల కానుంది. తమిళంలో ‘యంతిరన్’గా, తెలుగు, హిందీ భాషల్లో ‘రోబో’గా సిద్ధమైన ఈ చిత్రం ఇప్పుడు నిర్మాణానంతర కార్యక్రమాల చివరి దశలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 3 వేల థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతున్నట్లు భోగట్టా.

నిజానికి, మొదట ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదల కావాల్సింది. కానీ, అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి అయ్యే పరిస్థితి లేకపోవడంతో అనివార్యంగా విడుదల వాయిదా పడింది. శంకర్, ఆయన సాంకేతిక బృందం సినిమా పనులన్నీ పూర్తి చేసుకుంటూ వచ్చినా, సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ పని కొంత ఆలస్యమైంది. ఓ పక్క ముందు ఇచ్చిన మాట ప్రకారం, ‘కొమరం పులి’ చిత్రం రీ-రికార్డింగ్ వగైరా పనులను మున్ముందుగా రెహమాన్ పూర్తి చేయాల్సి వచ్చింది. మరోపక్క కామన్వెల్త్ క్రీడోత్సవాలకు గీతం సిద్ధం చేయాల్సి వచ్చింది. దాంతో, ‘రోబో’ పని వాయిదా పడక తప్పలేదు.

‘కొమరం పులి’, కామన్వెల్త్ క్రీడోత్సవాలకు గీతం సిద్ధం చేసేయడంతో రెహమాన్ ధ్యాసంతా ఇప్పుడు ‘రోబో’ మీదకు మళ్ళింది. సినిమా ఈ అక్టోబర్ లో కానీ విడుదల కాదంటూ, ఇటీవల గాలివార్తలు కూడా వచ్చాయి. కానీ, ఎట్టకేలకు సెప్టెంబర్ 24న చిత్రం విడుదల అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

దీంతో, ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలోనూ, తెలుగు పరిశ్రమలోనూ ఒక సస్పెన్స్ కు తెరపడింది. రూ. 160 నుంచి 190 కోట్ల వరకు రకరకాల అంకెలు నిర్మాణవ్యయమని వినిపిస్తున్న ‘రోబో’తో పోటీ కష్టమని ఇతర చిత్రాల దర్శక - నిర్మాతలు భావిస్తూ వచ్చారు. ఆ సమయంలో తమకు హాళ్ళు దొరకడం కూడా కష్టమేనని గ్రహించారు. అందుకే ‘రోబో’కు ముందు, వెనుక చాలా ఎడం ఉండేలా తమ సినిమాల రిలీజ్ ఉండాలని వారు తాపత్రయపడుతున్నారు. రోబో విడుదల తేదీని బట్టి తమ సినిమాల విడుదలను ఖరారు చేసుకోవడం కోసం మల్లగుల్లాలు పడుతున్నారు.

తెలుగులో కూడా అగ్రచిత్రాల దర్శక - నిర్మాతలు సైతం కొన్నాళ్ళుగా ఈ తర్జన భర్జనలోనే ఉన్నారు. ‘రోబో’ విడుదల తేదీ ఏమిటో కచ్చితంగా తెలుసుకోవడానికి తెలిసినవాళ్ళందరినీ అడుగుతూ వచ్చారు. ఏమైనా, ఇప్పుడు సస్పెన్స్ విడిపోవడంతో, మహేశ్ బాబు - త్రివిక్రమ్ ల ‘ఖలేజా’ లాంటివి అక్టోబర్ కి కానీ రాకపోవచ్చు. అలాగే, అక్టోబర్ మొదట్లోనే అనుకొన్న జూనియర్ ఎన్టీయార్ ‘బృందావనం’ సైతం ‘రోబో’ దెబ్బతో కొంత వాయిదా పడినా పడవచ్చని కృష్ణానగర్ కబురు. ఎంతైనా రజనీకాంత్ - శంకర్ ల కాంబినేషనా, మజాకా!

Thursday, September 9, 2010

మెగా అభిమానులకు డబుల్ ధమాకా!(ఫోటోలో- ‘కొమరం పులి’గా పవన్ కల్యాణ్)
.......................

డబుల్ ధమాకా అంటే ఇదేనేమో. మిగిలినవాళ్ళ మాటెలా ఉన్నా, హీరో చిరంజీవి కుటుంబంలోని సినీ తారలంటే అభిమానించే వారికి మాత్రం అక్షరాలా ఇది డబుల్ ధమాకానే. ఈ 2010 సెప్టెంబర్ 8వ తేదీ బుధవారాన్ని బహుశా వాళ్ళు ఇప్పుడప్పుడే మరచిపోలేరు. ఎందుకంటే, ఒకటి కాదు, ఏకంగా రెండు శుభవార్తలు వాళ్ళకు ఒకే రోజు లభించాయి.

మళ్ళీ సినిమాల్లో నటించనున్నట్లు ఒకపక్క చిరంజీవి ప్రకటిస్తే, మరోపక్క చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘కొమరం పులి’ విడుదల తేదీ కూడా అదే రోజున పక్కాగా ఖరారైంది. ఇలా ఒకే రోజున రెండు తీపి కబుర్లు అభిమానులకు అందాయి. సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం నాడు ‘కొమరం పులి’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాత శింగనమల రమేశ్ బాబు స్వయంగా ప్రకటించారు.

రవిప్రసాద్ అవుట్ డోర్ యూనిట్ కు భారీమొత్తంలో బాకీ పడడంతో, అది చెల్లిస్తే కానీ, ‘కొమరం పులి’ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వరాదంటూ చెన్నైలోని రవిప్రసాద్ యూనిట్ గత వారం మద్రాసు హైకోర్టుకెక్కింది. నిర్మాతకూ, వారికీ సాగుతున్న వివాదం నేపథ్యంలో ‘కొమరం పులి’ విడుదల ఎప్పుడన్నది అనుమానంలో పడింది. కాగా, బాకీ చెల్లింపునకు గాను బ్యాంకులో తగిన హామీ చూపించి, సినిమా విడుదల చేసుకోవచ్చని కోర్టు చెప్పింది. దాంతో, నిర్మాత కాస్త తెరిపినపడ్డారు. ఫలితంగా, సెప్టెంబర్ 10న రంజాన్ నాడు ‘కొమరం పులి’ విడుదలవుతోంది.

దాదాపు మూడేళ్ళుగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రంపై పరిశ్రమలోనూ, ప్రేక్షకులలోనూ సహజంగానే భారీ అంచనాలున్నాయి. ‘జల్సా’ (2008) తరువాత వస్తున్న పవన్ కల్యాణ్ సినిమా ఇదే. దాంతో, అభిమానులు ఆకలి మీదున్నారు. పైపెచ్చు, హిట్ చిత్రం ‘ఖుషి’ కాంబినేషనైన పవన్ కల్యాణ్ - దర్శకుడు ఎస్.జె. సూర్య కలయికలోనే తాజా ‘కొమరం పులి’ కూడా తయారవడం అంచనాలు పెరగడానికి మరింత దోహదం చేసింది. మరి, ఇన్నేళ్ళ నిరీక్షణనూ, ఈ అంచనాలనూ ‘కొమరం పులి’ నిలబెడతాడేమో చూడ్డానికి మరో 24 గంటల చిల్లరే టైముంది. ఆల్ ది బెస్ట్ కల్యాణ్!

మళ్ళీ నటిస్తున్న చిరు - వచ్చే ఏడాదే సినిమా విడుదల

అంతా అనుకున్నట్లే అయింది. మెగా తారగా ప్రేక్షకుల మనస్సు దోచుకున్న చిరంజీవి మళ్ళీ సినిమాల్లో నటించనున్నట్లు ఎట్టకేలకు స్వయంగా ధ్రువీకరించారు. ఆ రకంగా చిరంజీవి నటించడం ఖాయమే! అంటూ అందరి కన్నా ముందుగా భవిష్యత్తును అంచనా వేస్తూ సరిగ్గా నెల రోజుల క్రితం (ఆగస్టు 7న)ఈ బ్లాగులో రాసిన పోస్టు అక్షరాలా నిజమైంది. సమాజంలో అందరికీ ఉపయోగపడే సందేశం ఇచ్చేలా తన తాజా చిత్రం ఉండబోతున్నట్లు చిరంజీవి ఈ రోజు (సెప్టెంబర్ 8న) ప్రకటించారు. నటుడిగా ఇది ఆయనకు 150వ సినిమా కానుంది.


రజనీకాంత్ - శంకర్‌ల తాజా చిత్రం 'రోబో' తెలుగు ఆడియో విడుదలలో జూలై చివరలో చిరంజీవి మాట్లాడినప్పటి నుంచి ఆయన సినీ రంగ పునఃప్రవేశంపై వార్తలు వస్తూ వచ్చాయి. ఆగస్టు ద్వితీయార్ధంలో పుట్టిన రోజున చిరంజీవి నుంచి సినిమా ప్రకటన వెలువడుతుందని కూడా
ఊహాగానాలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ రోజు చిరు తాజా ప్రకటనతో ఆ సస్పెన్స్‌కు తెరపడింది. మెగాస్టార్ నటించాల్సిందేనంటూ అభిమానుల
నుంచి ఒత్తిడి, జనంలో ఆసక్తి క్రమంగా పెరిగేలా చూసుకుంటూ వచ్చిన చిరు ఆ టెంపోను కావలసినంత మేరకు పెంచి, ఎట్టకేలకు పచ్చజెండా
ఊపారు.


"శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. తదితర చిత్రాల తరహాలోనే ఈ రానున్న సినిమాలో కూడా చక్కటి సందేశం ఉంటుంది. అయితే, నేరుగా సందేశం చెబితే ఎవరికీ ఎక్కదు. అందుకని కథను వినోదాత్మకంగా నడిపిస్తూ, అంతర్లీనంగా సందేశాన్ని చెప్పాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు నేను మళ్ళీ నటించే చిత్రం కూడా అదే పద్ధతిలో ఉంటుంది..." అని చిరంజీవి స్పష్టం చేశారు. "వచ్చే ఏడాదిలో ఆ సినిమా విడుదల అవుతుంద"ని కూడా చిరు తన అభిమానులకు చల్లని కబురు చెప్పారు. కుమారుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా ఈ చిరు 150వ చిత్రం రూపొందనున్నట్లు ఆంతరంగిక వర్గాలు చెబుతున్నాయి.చిరంజీవి ఇప్పుడు కథల ఖరారీ పనిలో పడ్డారు.

దర్శక, నిర్మాతలు, కథ ఖరారు మాటెలా ఉన్నా, దాదాపు మూడేళ్ళుగా పూర్తి స్థాయి నటనకు దూరమై, ఒంటి మీద అదుపు తప్పిన చిరంజీవి తన తాజా 150వ సినిమా కోసం ఇప్పటికే రోజూ వ్యాయామం చేస్తూ, సన్నబడేందుకు కష్టపడుతున్నారు. తప్పదు మరి. ఎంతైనా, 'కష్టే ఫలి' అన్నారు కదా పెద్దలు. మొదటి నుంచి ఆ మాటను నిరూపిస్తూ వస్తున్న చిరంజీవికి ఆ సంగతి మన కన్నా బాగా తెలుసు. కాదంటారా!?

Wednesday, September 8, 2010

మణిరత్నంకి మరో గుర్తింపు!
(ఫోటోల వివరం- 67వ వెనిస్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విక్రమ్, మణిరత్నం, సుహాసిని; పురస్కారం అందుకుంటూ మణిరత్నం)
...................

దక్షిణ భారతదేశానికి వన్నె తెచ్చిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం కీర్తికిరీటంలో మరో మణి వచ్చి చేరింది. చలనచిత్ర రూపకర్తలకు ఇచ్చే ‘జేగెర్ - లే కౌల్ట్రే గ్లోరీ టు ది ఫిల్మ్ మేకర్ అవార్డు’ అవార్డు ఆయనకు దక్కింది. ప్రపంచ ప్రసిద్ధ వెనిస్ చలనచిత్రోత్సవంలో భాగంగా ఈ గౌరవం ఇచ్చారు. సెప్టెంబర్ 6వ తేదీ సోమవారం నాడు కాన్స్ లో మణిరత్నం తాజా చిత్రం ‘రావణ్’ ప్రదర్శనకు ముందు ఇదంతా జరిగింది. ఇలా ‘వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’లో ‘గ్లోరీ టు ది ఫిల్మ్ మేకర్ అవార్డు’తో గౌరవం పొందిన తొలి భారతీయుడు మణిరత్నమే.

ఈ అవార్డు ప్రదానోత్సవం ముగిసిన వెంటనే ‘రావణ్’ చిత్రాన్ని ప్రదర్శించారు. చిత్ర ప్రదర్శన పూర్తయ్యాక 600 మందికి పైగా ప్రతినిధులు లేచి నిలబడి, దాదాపు 5 నిమిషాల పాటు కరతాళ ధ్వనులు చేశారట. ఈ ఉత్సవంలో ‘రావణ్’ హిందీ చిత్రాన్ని సైతం ప్రదర్శించారు.

వెనిస్ చలనచిత్రోత్సవం డైరెక్టర్ మార్కో ముల్లర్ మాట్లాడుతూ, ‘‘సమకాలీన భారతీయ సినిమాలోని అతి గొప్ప సృజనశీలురలో మణిరత్నం ఒకర’’ని ప్రశంసలు కురిపించారు. ‘‘సమకాలీన భారతీయ హిందీ చలనచిత్ర పరిశ్రమకు ఆటెర్ సిద్ధాంతాన్ని పరిచయం చేయడంలో మణిరత్నం దోహదం చేశార’’ని పేర్కొన్నారు. ‘‘ఉత్తమ భారతీయ చలనచిత్ర దర్శకుడైన మణిరత్నం కృషిని గుర్తించి, గౌరవిస్తున్నందుకు మేమెంతో గర్విస్తున్నాం’’ అని ఆయన ప్రకటించారు.

ఈ ‘67. మోస్ట్రా ఇంటర్నేజనల్ డి ఆర్టే సినిమాటోగ్రాఫికా’ (67వ వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం)లో మణిరత్నంతో పాటు ఆయన భార్య - నటి సుహాసిని, ‘రావణ్’ చిత్ర నటీనటులు విక్రమ్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ కూడా పాల్గొన్నారు.

ఇది ఇలా ఉండగా, వచ్చే నెలలో (అక్టోబర్ లో) జరగనున్న పుసాన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కూడా రావణ్ (తమిళం), రావణ్ (హిందీ) చిత్రాలు పాల్గొంటున్నాయి. మొత్తం మీద రావణ్ చిత్రం మన దేశంలో ఎవరినీ పెద్దగా ఆకట్టుకోకపోయినా, మణిరత్నంకి అంతర్జాతీయ గౌరవాలు పెంచడంలో మాత్రం తోడ్పడినట్లే కనిపిస్తోంది.

Tuesday, September 7, 2010

ఆకాశవాణిలో రెంటాల!

కవి -రచయిత రెంటాల గోపాలకృష్ణ తెలుగు పాఠకలోకానికి సుపరిచితులే. మొన్న సెప్టెంబర్ 5వ తేదీ ఆయన 90వ జయంతి . ఆ సందర్భంగా మద్రాసు ఆకాశవాణి కేంద్రం 'రెంటాల జీవితం - రచనలు' పేరిట ఓ ప్రసంగం ప్రసారం చేసినట్లు మునుపటి టపాలో చెప్పుకున్నాం. ఆ ప్రసంగం రికార్డింగు...ఈ దిగువన ఆడియో లింకులో....! అవధరించండి!!

Monday, September 6, 2010

అవిశ్రాంత అక్షర తపస్వి(ఓ బెజవాడ కవి - రచయిత జీవితం -2)


(ఫోటోలో - రెంటాలకు పేరు తెచ్చిన అనువాదాల్లో ఒకటైన 'యమకూపం' నవల ముఖచిత్రం)

రఘువంశం నుంచి రష్యన్ సాహిత్యం దాకా రెంటాల గోపాలకృష్ణ స్పృశించని అంశం లేదు. రష్యన్ నాటకకర్త గొగోల్ రాసిన ప్రఖ్యాత నాటకం ‘ఇన్ స్పెక్టర్ జనరల్’ ను అనుసరిస్తూ, రెంటాల అదే పేరుతో నాటకం రాశారు. ఆ నాటకం బహుళ ప్రజాదరణ పొందింది. ‘ఇన్ స్పెక్టర్ జనరల్’, ‘అంతా పెద్దలే’ లాంటి ఆయన నాటకాలు రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలలో వందలాది ప్రదర్శనలకు నోచుకున్నాయి. నాటక రంగంలో చేసిన విశేష కృషితో రెంటాలకు ప్రజా నాట్యమండలి, ఆంధ్ర ఆర్ట్స్ థియేటర్ లతో పాటు అనేక ఇతర ఔత్సాహిక నాటక సమాజాలతో అనుబంధం ఏర్పడింది.

నాటి నుంచి ఆయన అనేక గీతాలు, నాటికలు, కథలు, అనువాదాలు రాసి ప్రచురించారు. కవిగా, రచయితగా, నాటకకర్తగా, అనువాదకుడిగా, విమర్శకుడిగా సాహితీ రంగస్థలిపై ఆయన బహుపాత్ర పోషణ చేస్తూ వచ్చారు. ‘శిక్ష’, ‘అంతా పెద్దలే’, ‘రజని’, ‘కర్ణభారం’, ‘మగువ మాంచాల’, ‘రాణీ రుద్రమదేవి’, ‘మాయమబ్బులు’.... ఇలా ఎన్నో రంగస్థల నాటికలు, నాటకాలు, రేడియో నాటకాలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి.

ఆరు పదుల నిరంతర సాహితీ సేద్యం

రష్యన్, ఆంగ్ల సాహిత్యాలను తేటతెలుగులో అందించడానికి రెంటాల చేసిన కృషి ఎన్నదగినది. లియో టాల్ స్టాయ్ రాసిన బృహన్నవల ‘వార్ అండ్ పీస్’ రష్యన్ సాహిత్యంలో సుప్రసిద్ధమైనది, సుదీర్ఘమైనది. జార్ చక్రవర్తులను గురించి తెలిపే ఈ నవలా రాజంలో దాదాపు 500 పైచిలుకు పాత్రలున్నాయి. ఈ బృహత్తర రచనను బెల్లంకొండ రామదాసుతో కలసి రెంటాల అనువదించారు. తెలుగు పాఠకులకు ‘యుద్ధము - శాంతి’ పేరిట సులభశైలిలో అందించారు. ఇక, రెంటాల స్వతంత్రంగా విశ్వవిఖ్యాత టాల్ స్టాయ్ నవల ‘అన్నా కెరినినా’ను సరళంగా తెలుగులోకి అనువదించారు. మేలెన్నికగన్న అనువాదంగా ఆ రచన సాహితీవేత్తల ప్రశంసలను అందుకుంది.

అలాగే, అలెగ్జాండర్ కుప్రిన్ రాసిన ‘యమా ది పిట్’ను ‘యమకూపం’గా తెనుగు చేశారు. మాక్సిమ్ గోర్కీ నవల ‘ది మ్యాన్ హు వజ్ ఎఫ్రైడ్’ను ‘భయస్థుడు’గా అనువదించారు. నోబెల్ బహుమతి గ్రహీత నట్ హామ్సన్ రచన ‘హంగర్’ను ‘ఆకలి’గా రెంటాల అందించారు. తెలుగు సాహితీలోకానికి రష్యన్ సాహిత్యామృతాన్ని పంచారు. రవీంద్రనాథ్ టాగోర్, లూయీ చార్లెస్ రాయర్, రష్యన్ రచయితలు అలెగ్జాండర్ పుష్కిన్, చకోవ్ స్కీ, ఫ్రెంచ్ రచయితలు ఆనటోల్ ఫ్రాన్స్, విక్టర్ హ్యూగో, మపాసా - ఇలా ఎంతో మంది ప్రసిద్ధుల రచనలను రెంటాల తెలుగులో అందించారు. అనువాద సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.

బాలల అకాడమీ అవార్డుల నిర్ణేతల దృష్టికి రాలేదేమో కానీ, ఏ తెలుగు ప్రచురణాలయానికి వెళ్ళినా, ‘బాలజ్యోతి’ లాంటి బాల సాహిత్య పత్రికలను తిరగేసినా, రెంటాల బాల సాహిత్యంలో చేసిన అవిరళ కృషి స్పష్టంగా కనిపిస్తుంది. లియో టాల్ స్టాయ్ బాల సాహిత్యాన్నంతటినీ రెంటాల తెనిగించారు. భారత, రామాయణ, భాగవతాదుల నుంచి ‘భట్టి విక్రమార్క కథల’ దాకా, ‘కాశ్మీర గాథల’ నుంచి ‘ఈసఫ్ కథలు’, ‘గ్రీకు గాథల’ దాకా విస్తారమైన సాహిత్యాన్ని సరళమైన వచనంలో చెప్పారు. అరటిపండు ఒలిచి నోటిలో పెట్టినంత సులభరీతిలో పిల్లలకు అందించారు. పెద్దలను సైతం అలరించారు.

ఇక, వాల్మీకి, వ్యాస ప్రణీతాలైన రామాయణ, భారత, భాగవతాలను సంస్కృత మూలాన్ని అనుసరిస్తూ సంపూర్ణంగా తెనిగించారు. అయ్యలరాజు నారాయణామాత్యుని ‘హంస వింశతి’, జయదేవుని ‘గీత గోవిందమ్’, లీలాశుక యోగీంద్రుని ‘శ్రీకృష్ణ కర్ణామృతమ్’, భర్తృహరి విరచిత ‘సుభాషిత త్రిశతి’ మొదలైనవన్నీ ‘స్వాతి’ సాహిత్య మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురితమయ్యాయి.

నాలుగు పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో కామానికి సంబంధించినంత వరకు వాత్స్యాయనుడిదే మొదటి మాటా, చివరి మాటా. అలాంటి వాత్స్యాయనుడు రాసిన ప్రసిద్ధ ప్రాచీన శాస్త్రీయ గ్రంథం - ‘వాత్స్యాయన కామసూత్రాలు’. దాన్ని యశోధరుని ‘జయమంగళ’ వ్యాఖ్యానుసారం మూల శ్లోకాలతో సహా పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో రెంటాల తెనిగించారు. సరళమైన తెలుగు వచన రచనా శైలిలో రసహృదయులైన పాఠకులకు అందించారు. శభాష్ అనిపించుకున్నారు. ఈ రచన అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది. అంతేకాకుండా, తరువాత పుస్తకరూపంలో వచ్చి, అతి స్వల్పకాలంలోనే దాదాపు డజను ముద్రణలకు నోచుకొంది. పండితుల, పామరుల ప్రశంసలకు పాత్రమైంది.

అవార్డులు - రివార్డులు

పదహారో ఏట తొలి పుస్తకం ‘రాజ్యశ్రీ’తో మొదలుపెట్టి 75వ ఏట మరణించే వరకు మొత్తం 60 ఏళ్ళ పాటు రెంటాల అలుపెరగకుండా రచనలు చేస్తూ వచ్చారు. అలా ఆరు పదుల సుదీర్ఘ కాలం పాటు సాహిత్య వ్యవసాయ క్షేత్రంలో నిర్విరామంగా కృషి చేసి, బంగారు పంటలు పండించారు. రెంటాల రచనలు రాశిలోనూ, వాసిలోనూ ఎక్కువే. దాదాపు 200 పుస్తకాలు ఆయన రాయగా, అందులో 170 దాకా గ్రంథ రూపంలో ప్రచురితం కావడం విశేషం.

ఆయన గ్రంథాలు అశేష ఆంధ్ర పాఠకుల ఆదరాభిమానాలను చూరగొన్నాయి. పలు రచనలు పదే పదే ముద్రితమై, బహుళ ప్రచారం పొందాయి. వారణాసి విశ్వవిద్యాలయం లాంటి రాష్ట్రేతర పుస్తక భాండాగారాలలో సైతం స్థానం సంపాదించుకున్నాయి. రెంటాల రచనలను పలు విశ్వవిద్యాలయాలు పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాయి. ఆయన వచన రచన ‘పల్నాటి వీరచరిత్ర’ను బెంగుళూరు విశ్వవిద్యాలయం వారు కన్నడంలోకి అనువదించి, ప్రచురించారు.

రెంటాల గోపాలకృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాల గ్రామమైనా, 1943 ప్రాంతం నుంచి ఆయన బెజవాడలోనే ఉంటూ వచ్చారు. స్వర్గస్థులయ్యే వరకు ఆ నగరాన్ని తన సాహితీ క్షేత్రంగా మలుచుకున్నారు. అలా విజయవాడతో ఆయనది 52 ఏళ్ళ బంధం. పుట్టి పెరిగిన నరసరావుపేట పరిసర ప్రాంతాలతో అనుబంధాన్నీ, ఆత్మీయతనూ కొనసాగిస్తూనే, విజయవాడ కార్యస్థానంగా ఆయన బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించారు.

ఈ పండిత పాత్రికేయుడు అనేక అవార్డులు, సన్మానాలు అందుకున్నారు. ఆంధ్ర నాటక పరిషత్ అవార్డు (1979లో), నెల్లూరు నెఫ్జా నాటక కళాపరిషత్ అవార్డు (1981లో) రెంటాలను వరించాయి. ఉత్తమ సినీ విమర్శకుడిగా వంశీ ఆర్ట్ థియేటర్స్ వారి చేత ‘దాసరి నారాయణరావు స్వర్ణపతకా’న్ని (1987లో) అందుకున్నారు. ఘంటసాల అకాడమీ, విజయవాడ వారిచే ఉత్తమ జర్నలిస్టు అవార్డు (1990 -91లో) పొందారు. కన్నుమూయడానికి సుమారుగా రెండు నెలల ముందు 1995లో ‘క్రాంతి’ ఉత్తమ జర్నలిస్టు అవార్డు రెంటాలకు లభించింది.

ఆశయాలు, ఆకాంక్షలు, బాధలు, వేదనలు. బాధామయ జగత్తును దర్శించి, దరిద్రంలోనే శాంతినీ, అంధకారంలోనే వెలుగునూ కవిత్వం ద్వారా, సాహితీ వ్యాసంగం ద్వారా రెంటాల అన్వేషించారు. ఒకవైపు సాహిత్యంలో అన్వేషణ, మరోవైపు జీవన సమరం. ఇలా రెంటాల అవిశ్రాంత పోరాటం సాగించారు. అవినీతి రాజకీయాలపై అస్త్రసంధానం చేస్తూ, ‘‘...దించండి తెర, దించండి తెర / చాలు చాలు ఈ విషాద సారంగధర... ’’ అంటూ, 1995 జూలై 18వ తేదీ మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాలకు విజయవాడలో కన్నుమూశారు. నిరాడంబరుడు, నిగర్వి, సహృదయుడు, సాహితీమూర్తి రెంటాల గోపాలకృష్ణ భౌతికంగా మన మధ్య లేరు. కానీ, చేసిన శతాధిక రచనల ద్వారా సాహితీ జగాన ఆయన చిరంజీవి!!

భర్తృహరి చెప్పినట్లు,

‘‘ జయన్తి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి తేషాం యశః కాయే జరా మరణజం భయం’’

Sunday, September 5, 2010

60 ఏళ్ళ సాహితీ సేద్యం, 200 పుస్తకాలు: ఓ బెజవాడ కవి - రచయిత జీవితం(ఇవాళ ప్రముఖ కవి - రచయిత కీర్తిశేషులు రెంటాల గోపాలకృష్ణ గారి 90వ జయంతి. ఆ సందర్భంగా ఈ తరం సామాన్య శ్రోతలకు రెంటాలను స్థూలంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో, నిన్న సెప్టెంబర్ 4న ఆకాశవాణి మద్రాసు కేంద్రం 'రెంటాల జీవితం - రచనలు' పేరిట ప్రసంగం ప్రసారం చేసింది. ఆ ప్రసంగ వ్యాసం ఇది. జన్మనివ్వడమే కాక, సాహితీ సంస్కారాన్ని పంచి, పెంచిన ఆ అక్షర మూర్తికి అశ్రునివాళి అర్పిస్తూ....)

‘‘లోకంలో శోకించే పతితుల ప్రాణాలన్నీ / నా పాటల వృక్షంపై / పక్షులుగా విశ్రమించు’’ - అంటారు కవి - రచయిత రెంటాల. ఆధునిక తెలుగు సాహిత్యంలో, పత్రికా రంగంలో రెంటాల ( 1920 – 1995 ) పేరు విననివారు ఉండరు. కవిగా, నాటక కర్తగా, రచయితగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా, వక్తగా ఆయన లబ్ధ ప్రతిష్ఠులు. జనంలో ‘రెంటాల’గా ప్రసిద్ధులైన ఆయన పూర్తి పేరు - రెంటాల గోపాలకృష్ణ.

పుట్టుపూర్వోత్తరాలు


తెలుగునాట తొలితరం అభ్యుదయ కవితా వైతాళికులలో రెంటాల గోపాలకృష్ణ ఒకరు. ఆయన 1920వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ, కృష్ణాష్టమి నాడు గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాల గ్రామంలో జన్మించారు. పాండిత్యం, ప్రతిభ గల కుటుంబం వారిది. చిన్నప్పటి నుంచీ రెంటాలలో సాహిత్య సృజనాభిలాష ఎక్కువ. వివిధ గ్రంథాలు, పురాణాలు, శాస్త్రాలను అధ్యయనం చేశారు. సమకాలీన సాహిత్య, సామాజిక, రాజకీయ ధోరణులకు ఆయన స్పందించేవారు.

నరసరావుపేట - నవ్యకళాపరిషత్ - నయాగరా

స్కూలు ఫైనల్ లో ఉండగానే 1936లో పదహేరేళ్ళ ప్రాయంలో 'రాజ్యశ్రీ’ అనే చారిత్రక నవలను రాశారు. మిత్రుల సాయంతో 1939లో ప్రచురించి, సంచలనం రేపారు. ఈ చారిత్రక నవలకు ప్రముఖ పండితులు, చరిత్ర శాస్త్ర అధ్యాపకులు శ్రీమారేమండ రామారావు ముందుమాట రాశారు. పాఠశాల ప్రాంగణంలో ఉండగానే రెంటాల ఛందస్సును క్షుణ్ణంగా నేర్చుకొని, వివిధ వృత్తాలు, గీతాలలో పద్యరచన చేశారు. 1937లో స్కూల్ ఫైనల్ వరకు నరసరావుపేటలోని మునిసిపల్ హైస్కూల్ లో చదువుకున్నారు. ఆనాడే ఏల్చూరి సుబ్రహ్మణ్యం, అనిసెట్టి సుబ్బారావు, బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, గంగినేని వెంకటేశ్వరరావు లాంటి సాహితీ మిత్రుల సాహచర్యం రెంటాలకు సిద్ధించింది. ప్రముఖ కవి - ప్రధానోపాధ్యాయుడు శ్రీనాయని సుబ్బారావు శిష్యరికం అబ్బాయి. తరువాత గుంటూరులోని కళాశాలలో బి.ఏ. (తెలుగు సాహిత్యం) చదువుకున్నారు.

కళాశాలలో చదువుకుంటూనే ఈ సాహితీ మిత్రులంతా కలసి, నరసరావుపేటలో 'నవ్యకళాపరిషత్’ అనే కవిత్వ, సాహితీ చర్చ వేదికను ప్రారంభించారు. ఆ రోజుల్లోనే సాహితీ చర్చలు జరుపుతూ, నవ్యకవితా ధోరణికి నాంది పలికారు. 1943లో రెంటాల విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. మార్క్సిజమ్ అధ్యయనం, శ్రీశ్రీతో సన్నిహితత్వం, అభ్యుదయ సాహిత్యోద్యమం - వీటితో ఆయన రచనల్లో నూతన దృష్టి మొదలైంది. 1943లో ఆంధ్ర అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభ జరిగాక వెలువడిన తొలి అభ్యుదయ కావ్యం ‘నయాగరా’. అభ్యుదయ కవితా ఉద్యమానికి మేనిఫెస్టోగా చెప్పదగిన ‘నయాగరా' కవితా సంపుటి ప్రచురణలో రెంటాల సహాయకుడిగా పాలుపంచుకొన్నారు. ఏల్చూరి, కుందుర్తి, బెల్లంకొండలకు చేదోడువాదోడుగా ఉన్నారు. అలా ‘నయాగరా' కవి మిత్ర బృందంలో ముఖ్యుడిగా నిలిచారు. మిత్రులతో కలసి తొలినాళ్ళలోనే అభ్యుదయ రచయితల సంఘంలో చేరి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కొనసాగారు.

అభ్యుదయ కవిగా 'సంఘర్షణ', 'సర్పయాగం'

1950లలోనే 'సంఘర్షణ', 'సర్పయాగం'మొదలైన స్వీయ కవితా సంపుటాలను రెంటాల వెలువరించారు. అభ్యుదయ కవిత్వానికీ, శ్రామిక జన ప్రబోధ సాహిత్యానికీ, ఆనాటి నిజామ్ వ్యతిరేక తెలంగాణా సాయుధ పోరాటానికీ ప్రతీకగా కవితా సృజన సాగించారు. "పగలేయి నిజాం కోట / ఎగరేయి ఎర్రబావుటా / విశ్వరూపం దాల్చి / విప్లవాణువు పేల్చి / విలయ నేత్రం కాల్చి / విషకిరీటం కూల్చి / పగలేయి నిజాం కోట / ఎగరేయి ఎర్రబావుటా...." అని నిరంకుశ నిజామ్ ప్రభువుపై కవితా ఖడ్గమెత్తారు. "అమ్మా! ఉమా! రుమా! హిరోషిమా! / విలపించకు, పలవించకు! / విలపిస్తూ, పలవిస్తూ / తపియించకు, శపియించకు! / రాబోయే యుగానికి / నీవేలే మొదటి రోజు! / రాబోయే రికార్డుకు నీదేలే మొదటి పేజీ!...." అంటూ రెండో ప్రపంచ యుద్ధ బీభత్సాన్ని వర్ణించారు. తీసుకున్న అంశం ఏదైనా రెంటాల తనదైన గొంతుకను వినిపించారు. శ్రీశ్రీ సైతం ఈ కవిత్వానికి ముగ్ధుడై, అభినందించారు. భారత పర్యటనకు వచ్చిన జపనీస్ శాంతి సంఘానికి శ్రీశ్రీ అప్పటికప్పుడు రెంటాల కవిత హిరోషిమాకు ఆంగ్లానువాదం చేసి, వినిపించారు. జపనీయులు సైతం రెంటాలను అభినందనలతో ముంచెత్తారు. రెంటాల రాసిన పలు కవితలను ప్రముఖ కవి ఆలూరి బైరాగి లాంటి వారు హిందీలోకి కూడా అనువదించారు.

అలాగే, 'కల్పన' కవితా సంపుటికి సంపాదకులలో ముఖ్యుడిగా రెంటాల వ్యవహరించారు. ఆ సంపుటి వెలుగు చూడడంలో అత్యంత కీలకపాత్ర పోషించారు. భావ కవిత్వం, నవ్య కవిత్వాలకు ముద్దుకృష్ణ 'వైతాళికులు' లాగా, అభ్యుదయ ప్రగతిశీలవాద కవిత్వానికి 'కల్పన' కవితా సంపుటి జయపతాకగా నిలిచింది. ఆనాటి ప్రముఖ అభ్యుదయ కవులందరి కవితల సంకలమైన'కల్పన'ను ఆనాటి ప్రభుత్వం నిషేధించింది.

పాత్రికేయ జీవితం

ఉదరపోషణార్థం ఉద్యోగం చేయడం తప్పనిసరైనా, సాహిత్యాభిలాష కారణంగా రైల్వే, తదితర ప్రభుత్వ ఉద్యోగాలను రెంటాల కాలదన్నారు. 1942 ప్రాంతంలో కొంతకాలం చల్లా జగన్నాథం గారి సంపాదకత్వంలోని 'దేశాభిమాని' పత్రికలో గుంటూరులో పనిచేశారు. చదలవాడ పిచ్చయ్య గారి సంపాదకత్వాన వెలువడిన 'నవభారతి' మాసపత్రికలో మరికొంతకాలం కర్తవ్యనిర్వహణ చేశారు. అనంతరం 1960 ప్రాంతంలో అవసరాల సూర్యారావు, బెల్లంకొండ రామదాసు లాంటి మిత్ర రచయితలతో కలసి నీలంరాజు వెంకట శేషయ్య గారి సంపాదకత్వంలో వెలువడుతున్న 'ఆంధ్రప్రభ' దినపత్రికలో ఉపసంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి దాదాపు మూడు దశాబ్దాల పాటు అదే సంస్థలో వివిధ స్థాయుల్లో ఉద్యోగ నిర్వహణ చేశారు. 'ఆంధ్రప్రభ' దినపత్రిక సంపాదక మండలి సభ్యుడిగా గురుతర బాధ్యతలు నిర్వహించారు.

పాత్రికేయ వృత్తిలో ఉంటూనే, 'పంచకల్యాణి - దొంగల రాణి', 'కథానాయకురాలు' లాంటి కొన్ని చలనచిత్రాలకు రెంటాల మాటలు, పాటలు సమకూర్చారు. 'ఆంధ్రప్రభ'దినపత్రికలో సినీ విశేషాల వారం వారీ అనుబంధం 'చిత్రప్రభ'కు నిరంతరాయంగా సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. కొత్త సినిమాలపై వారం వారం ఆయన రాసే సమీక్షలు పాఠకులకు ఆసక్తికరమయ్యాయి. సుప్రసిద్ధ సినీ విమర్శకుడిగా ఆయనకు పేరు తెచ్చాయి. సినీ - సాంస్కృతిక రాజధానిగా వెలిగిన విజయవాడలో అప్పట్లో జరిగే సినిమా సమావేశాలు, కార్యక్రమాల్లో గురుపీఠం రెంటాల గారిదే.

పత్రికా రచనలో భాగంగా ఆయన సాంస్కృతిక, జ్యోతిష, కళా రంగాలపై ఎన్నో వ్యాసాలు, సమీక్షలు రాశారు. ఆయన రాసిన సంపాదకీయాలు కూడా కోకొల్లలు. యాంత్రికంగా, గడియారం వంక చూసుకుంటూ మొక్కుబడిగా పనిచేసే చాలామంది జర్నలిస్టులకు రెంటాల భిన్నమైన వారు. నిబద్ధతతో, నిర్దేశిత పని గంటల సమయానికి అతీతంగా నిరంతరం శ్రమించేవారు. తనదైన శైలిలో దగ్గరుండి ఎడిషన్ వర్కును పూర్తి చేయించేవారు. జర్నలిస్టుగా రెంటాలకున్న ఆ విశిష్ట గుణం ఆ తరం పాత్రికేయులకు సుపరిచితం.

పత్రికా రచనను చేపట్టినప్పటికీ, రెంటాల తన సాహితీ సేద్యాన్ని ఏనాడూ ఆపలేదు. 'అభ్యుదయ', 'మాతృభూమి', 'సోవియట్ భూమి', 'ఆనందవాణి', 'విజయవాణి', 'విజయప్రభ', 'నగారా' లాంటి ఆనాటి ప్రముఖ పత్రికలలోనూ, 'ఆంధ్రప్రభ' సచిత్ర వారపత్రిక, 'ఆంధ్రజ్యోతి' దిన, వార పత్రికల్లోనూ, 'స్వాతి' వార, మాసపత్రికల్లోనూ, 'బాలజ్యోతి' పిల్లల మాసపత్రికలోనూ రెంటాల రచనలు, ధారావాహికలు అనేకం ప్రచురితమయ్యాయి.

(మిగతా భాగం మరికాసేపట్లో....)

Saturday, September 4, 2010

ఆర్భాటంగా సాగిన సౌందర్య పెళ్ళి
(మొదటి ఫోటోలో - సాంప్రదాయిక వివాహ దుస్తుల్లో రజనీ కాంత్ చిన్న కూతురు సౌందర్య, పెళ్ళి కొడుకు అశ్విన్ రామ్ కుమార్;
రెండో ఫోటోలో - కూతురు అల్లుడుతో రజనీ కాంత్)

...........................

పెద్దింటి పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో చెప్పడానికి సినీ నటుడు రజనీకాంత్ ఇంట జరిగిన వివాహం తాజా ఉదాహరణ. రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య వివాహం ఇవాళ సెప్టెంబర్ 3 శుక్రవారం నాడు మద్రాసులో జరిగింది. రజనీకాంత్ అంతటి వాడు స్వయానా వచ్చి, ఫోన్ చేసి పెళ్ళికి పిలిస్తే రాని వాళ్ళు ఎవరుంటారు. అందుకే, ఎగ్మూరులో పెళ్ళి జరిగిన రాణీ మెయ్యమ్మై కల్యాణ మండపం మొత్తం అతిథులతో నిండిపోయింది. సినీ, రాజకీయ రంగ ప్రముఖులతో కళకళ లాడింది. స్టాన్ ఫోర్డ్ లో చదువుకున్న యువ తమిళ వ్యాపారవేత్త అశ్విన్ రామ్ కుమార్ తో రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య వివాహం సాంప్రదాయిక తమిళ బ్రాహ్మణ పద్ధతిలో జరిగింది.

చిత్ర నిర్మాత - ఓఖర్ స్టూడియో మేనేజింగ్ డైరెక్టరైన సౌందర్య ఇప్పటికే తన తండ్రి రజనీకాంత్ ను ప్రధాన పాత్రగా చేసుకొని సుల్తాన్ - ది వారియర్ పేరిట ఓ యానిమేషన్ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆ సినిమా దాదాపు చివరి దశకు వచ్చిన తరుణంలో ఇప్పుడు సౌందర్యకు పెళ్ళయింది. సౌందర్య పెళ్ళికి నటుడు కమలహాసన్, దర్శకులు బాలచందర్, మణిరత్నం, సుహాసిని, కేంద్ర హోమ్ మంత్రి చిదంబరం, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి తదితరులు హాజరయ్యారు. మన తెలుగు మెగాస్టార్ చిరంజీవి, హీరో వెంకటేష్, రాధిక, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా పెళ్ళికి హాజరైనవారిలో ఉన్నారు.

పెళ్ళికూతురు సౌందర్య ఆకుపచ్చ, ఎరుపు రంగుల తొమ్మిది గజాల పట్టుచీరల్లో మెరిసిపోయారు. ఆమె ధరించిన ఆభరణాలు సాంప్రదాయికంగా, వివాహ సందర్భానికి తగ్గట్లు ఉన్నాయి. పెళ్ళి భోజనం కూడా సంప్రదాయ సిద్ధంగా అరటి ఆకుల్లో బంతి భోజనాల పద్ధతిలో సాగింది. బిస్బేళీ బాత్, మైసూరు రసం లాంటి కర్నాటక తరహా వంటకాలతో సహా మొత్తం 26 వంటకాలతో భోజనం వడ్డించారు. గురు, శుక్రవారాలు రెండు రోజులూ సౌందర్య పెళ్ళి రిసెప్షన్, పెళ్ళితో రజనీకాంత్ ఇంటిలోనే కాక తమిళ మీడియాలోనూ సందడే సందడి. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగుగా సాగిన సౌందర్య పెళ్ళి కొద్దికాలం పాటు తమిళనాట గుర్తుండిపోయే ఘటనే. సౌందర్య వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని కోరుకుందాం.

పి.ఎస్. - విశేషం ఏమిటంటే, ఇంత హడావిడి సాగుతున్నా రజనీ కాంత్ మాత్రం చెరగని చిరునవ్వుతో, వచ్చిన ప్రతి ఒక్క అతిథినీ సాదరంగా స్వాగతించడం. పేరు పేరునా పలకరించడం. పెళ్ళి సమయంలో సాగే పూజ, కన్యాదాన మంత్రాల సమయంలో కూడా రజనీకాంత్ చాలా శ్రద్ధగా, భక్తిగా, సగటు ఆడపిల్ల తండ్రిలా వ్యవహరించడం చూసిన ఎవరికైనా ముచ్చట కలిగిస్తుంది. ఎంత పెద్దింటి వివాహమైనా, సెంటిమెంట్లు మాత్రం అందరికీ ఒకటే కదూ!

Friday, September 3, 2010

రజనీకాంత్ కుమార్తె పెళ్ళి హడావిడి(ఫోటో వివరం....... పెళ్ళి రిసెప్షన్ లో (ఎడమ నుంచి కుడికి) రజనీకాంత్ సతీమణి లత, శ్రీదేవి భర్త బోనీ కపూర్, రజనీకాంత్, కొత్త పెళ్ళికూతురు సౌందర్య, పెళ్ళికొడుకు అశ్విన్, శ్రీదేవి, మహేశ్వరి)
.........................................................

ఓ వారం రోజులుగా మద్రాసు సినిమా వర్గాలలో ఒకటే హడావిడి. సమాచార, ప్రసార సాధనాల వారి సంగతి అయితే, ఇక చెప్పనక్కర లేదు. సెప్టెంబర్ 3వ తేదీ, శుక్రవారం నాటికి ఎలా, ఏం చేయాలన్నది ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఈ హడావిడి అంతటికీ కారణం - రజనీకాంత్ కుమార్తె సౌందర్య పెళ్ళి. దేశం నలుమూలల నుంచి సినీ ప్రముఖులు, దక్షిణాదికి చెందిన రాజకీయ, సామాజిక ప్రముఖులు హాజరయ్యే పెళ్ళి కావడంతో సహజంగానే అందరి దృష్టి ఈ కార్యక్రమం మీద నిలిచింది. ఈ పెళ్ళి సంరంభాన్ని పాఠకులకూ, ప్రేక్షకులకూ వివరంగా అందించాలన్నది మీడియా తాపత్రయం.

దాదాపు గడచిన పక్షం రోజులకు పైగా రజనీకాంత్ స్వయంగా ఎంతోమంది పెద్దల ఇంటికి వెళ్ళి, శుభలేఖలు పంచుతూ వచ్చారు. ఆ సంగతులు, ఫోటోలు మీడియా అందిస్తూనే వచ్చింది. తండ్రి ఓ పక్క శుభలేఖల పంపిణీ హడావిడిలో ఉంటే, మరోపక్క ఆయన కుమార్తె సౌందర్య షాపింగులతోనూ, కట్టుకున్న కొత్త ఇంట్లో కాపురానికి కావాల్సిన వస్తువుల కొనుగోలుతోనూ బిజీగా గడిపారు.

ఈ పెళ్ళి సంరంభాన్ని ఎలా కవర్ చేయాలా అని మీడియా అంతా రకరకాలుగా ఆలోచించింది. కొన్ని చానళ్ళు లైవ్ కవరేజీలకు కూడా సిద్ధమయ్యాయి. తీరా, రజనీ కాంత్ వర్గీయులు మాత్రం సున్నితంగానే నో చెప్పారు. దాంతో, సౌందర్య పెళ్ళికి ఏ రంగు దుస్తులు కట్టుకున్నారో, ఎలాంటి ఆభరణాలు ధరించారో దగ్గరగా చూసి మరీ వివరించాలనుకున్నవాళ్ళకు కొంత ఆశాభంగమే కలిగింది. ముగ్గురు నలుగురు తమిళ విలేఖరులు, వార్తా చానళ్ళ ప్రతినిధులు నిన్నంత ఆఫీసులో దీని మీదే చర్చించుకోవడం చూశా.

ఇది ఇలా ఉండగా, నిన్న సెప్టెంబర్ 2వ తేదీ గురువారం సౌందర్య పెళ్ళి రిసెప్షన్ మద్రాసులోనే ఘనంగా జరిగింది. సినీ ప్రముఖులు శ్రీదేవి, ఆమె భర్త బోనీ కపూర్, శ్రీదేవి కజిన్ - సినీ నటి మహేశ్వరి, బాలీవుడ్ నుంచి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, దర్శకులు బాలచందర్, తదితర సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు దానికి హాజరయ్యారు. ఆ రిసెప్షన్ ఫోటో ఈ టపాలో! సౌందర్య పెళ్ళి వివరాలు, ఫోటో తదుపరి టపాలో! ఆల్ ది బెస్ట్ సౌందర్య!

Thursday, September 2, 2010

భలే మంచిరోజు: నాటి మేటి తారల ఈనాటి కలయిక

ఫోటో వివరాలు -
1. (అందరి కన్నా వెనక వరుసలో) ముఖేశ్, శంకర్, భానుచందర్, అంబిక, శోభన
2. (వెనక నుంచి 2వ వరుసలో) రాధిక, సుమలత, ...., కార్తీక్, ప్రభు, మోహన్, అంబరీశ్, రాధ, ప్రతాప్ పోతన్, లిస్సీ ప్రియదర్శన్, సురేశ్, సుహాసినీ మణిరత్నం
3. (వెనక నుంచి 3వ వరుసలో) అర్జున్, శరత్ కుమార్, మోహన్ లాల్, చిరంజీవి, వెంకటేశ్
4. (ముందు వరుసలో) ఖుష్బూ, పూర్ణిమా భాగ్యరాజ్, రమ్యకృష్ణ, రజనీకాంత్, నరేశ్


..............................................


చిన్నప్పుడు కలసి తిరిగిన వాళ్ళం, కలసి చదివిన వాళ్ళం, కలసి ఎదిగినవాళ్ళం, కొండొకచో కలహించుకున్న వాళ్ళం మళ్ళీ చాలా ఏళ్ళకు కలిస్తే..... ఎంత మధురమైన ఆలోచన. ఇలా పాత స్కూల్ మేట్లు, కాలేజ్ మేట్లు కలుసుకోవడం, ఆ పాత రోజులు గుర్తు చేసుకోవడం ఇటీవలి కాలంలో జరుగుతున్నాయి. అలాంటి గెట్ టుగెదర్ కార్యక్రమాల వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. పేపర్లలో, టీవీల్లో చూస్తూనే ఉన్నాం.

సినిమా వాళ్ళు మాత్రం తక్కువ తిన్నారా. వాళ్ళు కూడా ఇప్పుడు అదే బాట పట్టారు. 1980లలో ప్రముఖ తారలుగా వెలిగినవాళ్ళలో చాలామంది మొన్న ఆగస్టు 29న మద్రాసులో కలుసుకున్నారు. నిజానికి, ఆ నటీనటులు ఇలా కలుసుకోవడం వరుసగా ఇది రెండో ఏడాది. వాళ్ళు తామందరి మధ్య ఉన్న స్నేహ సౌహార్దాలనూ, ఐకమత్యాన్నీ వెల్లడించుకోవడానికి దీన్ని ఓ సందర్భం చేసుకుంటున్నారు.

క్రితం ఏడాది లానే ఈ సారి ఈ రెండో సమావేశాన్ని కూడా నటి - దర్శకురాలు సుహాసినీ మణిరత్నం నిర్వహించారు. మరో నటి లిసీ ప్రియదర్శన్ ఆతిథ్యమిచ్చారు. విశేషం ఏమిటంటే, ఈ సారి మన తెలుగు హీరోలు చిరంజీవి, వెంకటేశ్ కూడా ఈ ఆత్మీయ కలయికలో భాగమయ్యారు. అలాగే, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ హీరో శరత్ కుమార్, తెలుగులోనూ తరచూ కనిపించే తమిళ -కన్నడ నటుడు అర్జున్ కూడా ఈ సారి వచ్చి కలిశారు. ఓ పక్క రెండో కూతురు సౌందర్య పెళ్ళి పనులతో హడావిడిగా ఉన్నా సరే, ఈ సారి కూడా రజనీకాంత్ ఈ మిత్రుల కలయికలో పాలుపంచుకోవడం విశేషం. అన్నట్లు ఏటేటా జరపాలనుకుంటున్న ఈ కలయికకు 'ఎవర్ గ్రీన్ ఎయిటీస్' అని పేరు పెట్టుకున్నారు.

రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, వెంకటేశ్, అంబరీశ్, అర్జున్, శరత్ కుమార్, ప్రభు, కార్తీక్, మోహన్, ప్రతాప్ పోతన్, ముఖేశ్, శంకర్ లు పాల్గొన్నారు. మన భానుచందర్, ఇప్పుడు ఎక్కువగా టీవీ సీరియల్స్ లో వస్తున్న తెలుగు సినీ నటుడు సురేశ్, తండ్రి పాత్రలకు ఎదిగిన అప్పటి కామెడీ హీరో నరేశ్, తెలుగు కుర్రకారును ఆకట్టుకున్న రాధ, ఆమె అక్కయ్య అంబిక, రాధిక, సుహాసిని, సుమలత, శోభన, రమ్యకృష్ణ, ఖుష్బూ, రేవతి, పూర్ణిమా భాగ్యరాజ్, నదియా, లిస్సీ - ఇలా ఆ కలయికలో పాలుపంచుకొన్నవారందరూ మనకు బాగా తెలిసిన తారలే.

ఏటా ఇలా ఏటా ఒక రోజు కలసి, తమ పాత సంగతులన్నీ కలబోసుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక - ఇలా దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన వారంతా ఓ చోట కలవడం విశేషమే. ఈ 1980ల బ్యాచ్ నటీనటులంతా ఇక నుంచి ఏటా ఒక్కో రాష్ట్రంలో కలుసుకోవాలని తీర్మానించుకున్నారు. అంతేకాకుండా, ఇలా సినీ నటులు మాత్రమే కలసి ఓ క్లబ్ లాగా ఏర్పడడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారని (?) కూడా వీళ్ళు గొప్పగా చెబుతున్నారు.

ఆ మాట ఎలా ఉన్నా, వీళ్ళ కలయికను చూసిన తరువాత నా మటుకు నాకు మళ్ళీ విజయవాడ వెళ్ళాలనిపించింది. నా స్కూల్ మేట్లనూ, కాలేజ్ మేట్లనూ మరోసారి కలుసుకోవాలనిపించింది. ఇలాగే, ఏటా కలుసుకొనేలా ఓ ప్రణాళిక వేయాలనిపించింది. "ఆనాటి ఆ స్నేహమానంద గీతం... ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం...." అంటూ పాడుకోవాలనిపించింది. వృత్తి ఉద్యోగాల కోసం భౌగోళికంగా దూరమైన వాళ్ళం, ఒత్తిడిలో మునిగిపోయినవాళ్ళం మళ్ళీ దగ్గర కావడానికి ఇలాంటి కలయికలు తరచూ అవసరమే. కాదంటారా.