జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, November 28, 2015

ఎప్పటిలానే... 'స్పెక్టర్' బాండ్ ( 'స్పెక్టర్' మూవీ రివ్యూ)

ఎప్పటిలానే... 'స్పెక్టర్' బాండ్
చిత్రం - ‘స్పెక్టర్’
తారాగణం - డేనియల్ క్రెగ్, క్రిస్టఫ్ వాల్ట్జ్, లీ సేడాక్స్, మోనికా బెలూచీ 
కెమేరా - హొయ్‌టే వాన్ హోయ్‌టెమా
దర్శకత్వం- శామ్ మెన్‌డెస్
నిడివి- 147 నిమిషాలు 

‘బాండ్... జేమ్స్‌బాండ్...’ ప్రపంచం మొత్తాన్నీ ఊపేసిన డైలాగ్ ఇది. 
తెరపై ఆ డైలాగ్.., ‘ట..డ..ట్టడా...య్...’ అనే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ 
వినని వాళ్ళూ, విని ఇష్టపడనివాళ్ళూ అరుదు. జేమ్స్‌బాండ్ జానర్
 సినిమాలకున్న ఎడ్వాంటేజ్ అది. అశేష అభిమానులు, నిర్ణీతంగా
 సినిమాకొచ్చే ప్రేక్షకులూ ఎప్పుడూ రెడీ! తాజా జేమ్స్‌బాండ్ చిత్రం
 ‘స్పెక్టర్’ మీద అమితమైన ఆసక్తికి అదే కారణం. హాలీవుడ్
 జేమ్స్‌బాండ్ చిత్రాల సిరీస్‌లో ఇది 24వ సినిమా.

 ఒకప్పుడు సీన్ క్యానరీ, రోజర్ మూర్, పీర్స్ బ్రోస్నన్ లాంటి 
నటులు జేమ్స్‌బాండ్‌గా అలరిస్తే, ‘క్యాసినో రాయల్’, 
‘క్వాంటమ్ ఆఫ్ సోలేస్’, ‘స్కై ఫాల్’ లాంటి సినిమాల నుంచి
 డేనియల్ క్రెగ్ ఆ పాత్రను చేపట్టారు. ‘ఇదే నా ఆఖరి బాండ్ సినిమా’ 
అని డేనియల్ చెప్పినట్లుగా వార్తలు వస్తున్న ఈ సినిమా 
కథ కూడా సగటు జేమ్స్‌బాండ్ సినిమాల్లో కథలానే ఉంటుంది. 
కాకపోతే, హీరోపై విలన్‌కు కాస్తంత పాత వ్యక్తిగత ద్వేషం 
కూడా ఉన్నట్లు కలిపారు. ‘స్పెక్టర్’ అనేది ఒక రహస్య
 సంస్థ పేరు. దాన్ని నడిపే ఒక విలన్. పేరు ఫ్రాంజ్ 
ఒబెర్‌హాసర్ (క్రిస్టఫ్ వాల్ట్జ్). అతను అలా సరికొత్త ఇంటెలిజెన్స్ 
సర్వీస్ నడుపుతూ దేశాల రహస్యాలను కనిపెట్టి, అందరినీ 
ఆట ఆడిస్తుంటాడు. ఆ టైమ్‌లో జేమ్స్‌బాండ్ 007 (డేనియల్ క్రెగ్) 
రంగప్రవేశం. ‘స్పెక్టర్’ కథా కమామిషు తెలుసుకోవడానికి ప్రయత్నాలు
 మొదలుపెడతాడు. ఆ క్రమంలో కథ లండన్, మొరాకో, ఆస్ట్రియా -
 ఇలా పది దేశాల మీదుగా తిరుగుతుంది.

 ఒకప్పుడు ‘స్పెక్టర్’లో పనిచేసిన ఒక ముసలి వ్యక్తిని హీరో 
కలుసుకుం టాడు. డాక్టరైన అతని కూతుర్ని (లీ సేడౌక్స్) 
కాపాడతానంటూ వాగ్దానం చేస్తాడు. వెంటాడుతున్న విలన్ 
అనుచరుల నుంచి తప్పించుకుంటూ, వాళ్ళ బారి నుంచి 
ఆ అమ్మాయిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తాడు. 
ఆ క్రమంలో కారు ఛేజ్‌లు, వైమానిక విన్యాసాలు,
 కాల్పులు, పేలుళ్ళ లాంటి అంశాలన్నీ మామూలే. 
చివరకు ‘స్పెక్టర్’ను నడిపే ప్రధాన విలన్ ఆటకట్టించాడన్నది 
మన తెలుగు సినిమాల లెక్కన రెండున్నర గంటలు 
తెరపై చూడాల్సిన కథ.

 ‘క్యాసినో రాయల్’ మొదలు మొన్నటి ‘స్కై ఫాల్’, 
ఇవాళ్టి ‘స్పెక్టర్’ దాకా జేమ్స్‌బాండ్ అంటే... డేనియల్ క్రెగ్గే. 
అతని బాడీ లాంగ్వేజ్, చేసిన యాక్షన్ ఘట్టాలు బాండ్ 
పాత్రకు కొత్త రూపం తెచ్చాయి. ప్రపంచాన్ని ఒంటిచేత్తో కాపాడే
 బ్రిటీష్ గూఢచారి పాత్రలో ఎప్పటికప్పుడు జీవించడానికి ఆయన
 కృషి చేస్తూనే ఉన్నారు. విశేషమేమంటే, ఈ సినిమాలో 
విలన్ అంతే దీటుగా ఉండడం. ఆస్కార్ లాంటి అత్యున్నత 
పురస్కారాలెన్నో అందుకున్న క్రిస్టఫ్ వాల్ట్జ్ విలన్ పాత్రనూ, 
క్రూరత్వాన్నీ నేర్పుగా చూపించారు.

 ఈ సినిమా కోసం భారీయెత్తున పెట్టిన ఖర్చు, చాలా శ్రమతో 
చేసిన యాక్షన్ సీన్లు, వేసిన సెట్లు, తిరిగిన దేశదేశాలు 
తెరపై కనిపిస్తుంటాయి. విజువల్స్ వండర్‌ఫుల్ అనిపిస్తాయి.
 ముఖ్యంగా, రీ-రికార్డింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రత్యేకించి 
చెప్పుకోవాలి. కానీ, కథ మాత్రం పాత సినిమాల్లోని 
ఘట్టాలకు కొత్త తిరగమోత. అలాగే, పాత్రల మధ్య ఎమోషన్లూ
 సహజమనిపించవు. యాక్షన్ సీన్లను మినహాయిస్తే, 
మిగిలిన సందర్భాల్లో కథ సుదీర్ఘంగా సాగు తుంది. 
అందుకే, ‘స్కైఫాల్’ దర్శకుడు, రచయితల బృందమే 
ఈ సినిమాకూ పనిచేస్తోందంటే కలిగిన ఉత్సాహం 
ఈ సినిమా చూస్తుండగా నిలవదు.  

 అయితే, జేమ్స్‌బాండ్ తరహా సినిమాలను ఇష్టపడేవాళ్ళకు
 ఈ సినిమా మంచి కాలక్షేపమే. వరుసగా జేమ్స్‌బాండ్ 
సినిమాలన్నీ చూస్తూ వస్తున్న వాళ్ళకు వీటిలో కొత్త 
సంగతులు ఉండకపోవచ్చు. సరికొత్త విశేషాలు కనపడకపోవచ్చు. 
చాలా భాగం సంఘటనలు పదే పదే రిపీట్ అవుతున్నవే
 కావచ్చు. కానీ, వాటన్నిటినీ ఎప్పటికప్పుడు కొత్త తరహా దృశ్యాలుగా... 
ఉద్విగ్నభరితమైన సన్నివేశాలుగా... కుర్చీ అంచున కూర్చొని 
చూడాల్సిన విన్యాసాలుగా... తీర్చిదిద్దడంలోనే నేర్పు ఉంది. 
సక్సెస్‌ఫుల్ జేమ్స్‌బాండ్ సినిమాలు తీసేవాళ్ళకు అది తెలియాలి. 
చూసేవాళ్ళు అది తెలిసీ చూడాలి. హాలీవుడ్ మేకింగ్ వ్యాల్యూస్‌తో
 ‘స్పెక్టర్’ అలానే అనిపిస్తుంది. మునుపటి చిత్రాలతో పోలిస్తే 
నిరాశపరిచినా, లాజిక్ వెతకని సామాన్య బాండ్ ప్రేమి కుల్ని 
అలరిస్తుంది. పైగా, నాలుగు భాషల్లో (ఇంగ్లీషు, హిందీ, 
తెలుగు, తమిళం) వెయ్యికి పైగా హాళ్ళలో రిలీజవడం 
‘స్పెక్టర్’కు కలిసొచ్చే అంశం.
.........................................
నిజానికి, ‘స్పెక్టర్’ చిత్రం బ్రిటన్‌లో ఈ అక్టోబర్ 26న, అమెరికాలో, ఇతర ప్రాంతాల్లో ఈ నెల 6న రిలీజైపోయింది. మన దేశంలో మాత్రం ఆలస్యంగా వచ్చింది. ‘ప్రేమ్త్రన్ ధన్ పాయో’ లాంటి భారీ చిత్రాలు ఉండడంతో పంపిణీదారులైన సోనీ పిక్చర్స్ ఇండియా వారు ఈ చిత్రాన్ని ఇక్కడ ఆలస్యంగా రిలీజ్ చేశారని ఒక కథనం.
................................

 రెంటాల జయదేవ
..........................

Thursday, November 26, 2015

చాలా మెచ్యూరిటీ అవసరం..! ( ‘కుమారి 21ఎఫ్’ మూవీ రివ్యూ)

కొత్త సినిమాలు గురూ!
 చాలా మెచ్యూరిటీ అవసరం..!

చిత్రం: కుమారి 21ఎఫ్; తారాగణం: రాజ్ తరుణ్, హేబా పటేల్, హేమ; 
మాటలు: పొట్లూరి వెంకటేశ్వరరావు; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; 
కెమేరా: ఆర్. రత్నవేలు; యాక్షన్: డ్రాగన్ ప్రకాశ్;
 కథ, స్క్రీన్‌ప్లే, సమర్పణ: సుకుమార్; 
నిర్మాతలు: విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి; 
 దర్శకత్వం: పల్నాటి సూర్యప్రతాప్; నిడివి: 133 నిమిషాలు


ఒకమ్మాయి, ఒకబ్బాయిని చూసి ‘ఎంతకొస్తావ’ని అడగడం చిత్రమే! 
చూసీచూడగానే ప్రేమలో పడ్డ అబ్బాయికి ఫస్ట్ కిస్ ఇవ్వడం... అతను
 తనను చూడాలనుకుంటున్న రీతిలో చూపడం... కచ్చితంగా విచిత్రమే!
 ‘‘ఫీల్ మై లవ్’’ అంటూ... వన్‌సైడ్ లవ్ (‘ఆర్య’ గుర్తుందిగా) లాంటి విభిన్న
 తరహా న్యూ ఏజ్ లవ్‌స్టోరీలు అల్లే దర్శక- రచయిత బి. సుకుమార్
 ఆలోచనలు ఎప్పుడూ ఇలానే ఉంటాయి. అలా ఆయన రాసుకొని, 
నిర్మాతగా వెండితెరకు అందించిన కథ - ‘కుమారి 21ఎఫ్’.

టచ్ ఫోన్‌లో టైటిల్స్ వేయడం దగ్గర నుంచే రొటీన్ కథలకు విభిన్నమైన
 సినిమాగా ‘కుమారి 21ఎఫ్’ మొదలవుతుంది. కాలనీలో ఫ్రెండ్స్‌తో 
సరదాగా తిరిగే కుర్రాడు సిద్ధు (రాజ్‌తరుణ్). తల్లి నర్సు (హేమ). 
తండ్రి విడిపోయి, వేరొక చోట ఉంటాడు. చదివిన క్యాటరింగ్ చదువుతో 
సింగపూర్‌లో స్టార్ క్రూయిజ్‌లో షెఫ్‌గా చేరాలని హీరో లక్ష్యం. అతనికి 
శంకర్ (నోయెల్), సెల్‌ఫోన్ ఫోటో సురేశ్ (నవీన్), సొల్లు శీను (సుదర్శన్)లు
 ముగ్గురూ క్లోజ్ ఫ్రెండ్స్. ఏ.టి.ఎం.లలో దొంగతనాల లాంటివి చేస్తూ 
ఆ ముగ్గురూ బతికేస్తుంటారు. చిన్నా చితకా సినిమాల్లో చేసే
 మోడల్ కుమారి (హేబా పటేల్) ముంబయ్ నుంచి వాళ్ళ కాలనీలోకి
 ఎంటరవుతుంది. బోల్డ్‌గా మాట్లాడుతూ, బోళాగా ఉండే ఆ అమ్మాయి 
తొలిచూపులో హీరోను ప్రేమిస్తుంది. తొలిముద్దు తొలిప్రేమ అతనితోనే 
పంచుకున్నానంటుంది.

కానీ, మోడళ్ళ జీవితం, హీరోయిన్ ప్రవర్తన గురించి నెగటివ్ కామెంట్స్‌తో
 హీరో మనసులో ఫ్రెండ్స్ అనుమాన బీజం నాటతారు. దాంతో, తీరా హీరో
 తన లవ్ చెప్పే టైమ్‌కి అతనికి మెచ్యూరిటీ లేదు పొమ్మంటుంది హీరోయిన్.
 అక్కడ నుంచి హీరోలో మానసిక ఘర్షణ. ఇక, ఈజీమనీకి అలవాటుపడ్డ
 హీరో ఫ్రెండ్స్ ఏ.టి.ఎం. లూఠీకి తెగబడతారు. అప్పుడేమైంది? హీరో ప్రేమ 
మాటేమిటన్నది మిగతా కథ.

 ‘సినిమా చూపిస్త మావ’ ఫేవ్‌ు రాజ్‌తరుణ్ అచ్చంగా సిద్ధూ పాత్రే 
అనిపిస్తారు. బ్యాక్‌గ్రౌండ్, బయోడేటా బదులు హైట్, వెయిట్, బాడీ కొలతలు 
చెప్పే మీనాకుమారి అలియాస్ కుమారిగా హేబా పటేల్ పొట్టి లాగూలు, 
స్కర్టులతో హుషారుగా కనిపిస్తారు. ఆమెకు తెలుగు డబ్బింగ్ (లిప్సిక)
 బాగా కుదిరింది. హీరో ఫ్రెండ్స్ పాత్రలు నవ్వించడానికి, అడల్ట్ కామెడీకి
 కథలో పనికొచ్చాయి. మ్యూజిక్ (దేవిశ్రీప్రసాద్), కెమేరా (రత్నవేలు) 
బాగున్నాయి. ఇక, సినిమాలోని బ్యాంకాక్ పాట, అలాగే
 ‘లవ్ చేయాలా... వద్దా’ పాటలోని సాహిత్యం నిజజీవితానికి 
అద్దం పట్టిన సమకాలీన భావవ్యక్తీకరణలు.

ఈ ‘ఏ’ సర్టిఫికెట్ సినిమా పెద్దలు చూడాల్సినదే. పెద్దలు కావడానికి 
సిద్ధమవుతున్న టీనేజ్ ప్రేమికులూ చూసి, అర్థం చేసుకొని, 
ఆలోచించాల్సిన అంశాలూ దీనిలో ఉన్నాయి. ‘నేనెలాగైనా తిరగచ్చు
 కానీ, నేను జీవితం పంచుకొనేవాళ్ళు ఎన్నడూ, ఎవరితో తిరగని 
వాళ్ళయ్యుండాలి’ అనే పురుషస్వామ్య ఆలోచనకు ప్రతిబింబం హీరో 
పాత్ర. మరోపక్క, ఏ బంధానికైనా అమిత శత్రువు అనుమానం. 
దీన్ని తల్లి పాత్రలో ప్రస్తావిస్తారు.

ఒక విధంగా చూస్తే - ఇలాంటి అంశాలను ధైర్యంగా తెరపై చర్చించడం 
సాహసమే. ఆ సాహసానికి ఒడికట్టి, నవతరం మాట్లాడుకొనే యాస, భాష 
వాడడంతో అనివార్యంగా సినిమాలో దాదాపు పాతిక దాకా కత్తెరలు
 పడ్డట్లున్నాయి. ఒక డైలాగ్ రైటర్, మరో ముగ్గురు అదనపు రచయితలు 
పనిచేసిన ఈ సినిమాలో మాటలు ‘మ్యూట్’ అయ్యాయి. బొమ్మలు ‘బ్లర్’ 
అయ్యాయి. లవ్ ఏజ్‌లో ఉండే టీనేజర్ల అంతరంగంలోని గందరగోళాల్ని
 పచ్చిగానే అయినా, బోరనిపించకుండా బోల్డ్‌గా చెప్పడం ఫస్టాఫ్‌లో 
కనిపిస్తుంది. సెకండాఫ్‌లో పాత్రలతో పాటు కథ కూడా గుంజాటనలో 
పడుతుంది. క్లైమాక్స్ ముందు నుంచి వేరొక రూపం తీసుకుంటుంది. 
లవ్‌స్టోరీ ఫీల్‌తో సాగే ఫిల్మ్ చివరకొచ్చేసరికి క్రైమ్‌కథగా ముగుస్తుంది.
 విడాకులతో హీరో తల్లీ తండ్రి 20 ఏళ్ళ క్రితం విడిపోయారన్న సంఘటన, 
తండ్రి ప్రవర్తన, ముగింపు లాంటివన్నీ సినిమాటిక్ స్క్రీన్‌ప్లే కన్వీనియన్సే.
 లోటుపాట్లెలా ఉన్నా, ఆలోచించాల్సినవీ, యూత్‌ను ఆకర్షించేవీ ఉన్న
 సినిమాగా ‘కుమారి 21ఎఫ్’ నిలుస్తుంది. ఆకర్షణ సరే కానీ, ఆలోచించే
 మెచ్యూరిటీ ప్రేమించే వాళ్ళతో పాటు, సినిమా తీసేవాళ్ళు, చూసేవాళ్ళకూ
 అవసరమే. అది ఎందరికుందన్నది ప్రశ్న. అంత మెచ్యూర్డ్ కుమారి
 పాత్రల్ని బాహా టంగా ఎవరు, ఏ మేరకు స్వాగతిస్తారన్నది 
వేచిచూడాల్సిన జవాబు.

....................................
- హైదరాబాద్‌లో మలక్‌పేట ఆర్ అండ్ బి క్వార్టర్‌‌సలో 60 శాతం ఫిల్మ్ తీశారు. 
- ఒక్క పాట కోసం బ్యాంకాక్ వెళ్ళారు. 
- 70 వర్కింగ్ డేస్. బడ్జెట్ 6 కోట్లు.  
-దేవిశ్రీప్రసాద్, రత్నవేలు డబ్బు తీసుకో లేదు. సుకుమార్ పార్‌‌టనర్‌‌సగా చేశారు. 
- ‘ఆర్య’ నుంచి సుకుమార్‌తో పని చేస్తూ ‘కరెంట్’తో డెరైక్టరైన సూర్య ప్రతాప్‌కి ఇది రెండో సినిమా.
........................................

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 21st Nov 2015, Saturday, Family Page)
..................................

Tuesday, November 24, 2015

చీకటిలో... చదరంగం..! ('చీకటిరాజ్యం' మూవీ రివ్యూ)


కొత్త సినిమాలు గురూ!

చీకటిలో... చదరంగం..!
చిత్రం:  చీకటి రాజ్యం; తారాగణం: కమలహాసన్, త్రిష, కిశోర్, ప్రకాశ్‌రాజ్,
 ‘మిర్చి’ సంపత్‌రాజ్, యూహి సేతు; స్క్రీన్‌ప్లే: కమలహాసన్; సంగీతం: జిబ్రాన్
 కెమేరా: సానూ జాన్ వర్గీస్; యాక్షన్:  గిల్గెస్ కాంసే యిల్, టి. రమేశ్; 
నిర్మాతలు: ఎస్.చంద్రహాసన్, కమలహాసన్; దర్శకత్వం: రాజేశ్ ఎం. సెల్వా,
 నిడివి: 129 నిమిషాలు

సృజనాత్మకత తక్కువైపోయి సినిమాలన్నీ ఒకే తరహాలో వస్తుంటే..? అది ఎంత 
ఇబ్బందికరంగా ఉంటుందో ఇవాళ ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. మరి,
 సృజనాత్మకత మరీ ఎక్కువైపోతేనో? వెరైటీగా అనిపించినా, అదీ ఇంకో రకమైన
 ఇబ్బందే. కానీ, కొత్త తరహాగా ఆలోచించాలనీ, నలుగురూ వెళుతున్న దోవకు 
భిన్నంగా వెళ్ళాలనీ, కొత్తదనాన్నీ చూపించాలనీ అనుకున్నప్పుడు ఇలాంటి 
ఇబ్బందులు తప్పవు. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకొనే కమలహాసన్ చేసిన 
తాజా ప్రయత్నం - ‘చీకటి రాజ్యం’. చాలాకాలం తరువాత తమిళం
 (‘తూంగావనమ్’)తో పాటు తెలుగులోనూ కమల్ అందించిన స్టైలిష్ క్రైమ్
 థ్రిల్లర్ ఇది. దీపావళికి ఒక రోజు ముందే తమిళ వెర్షన్ అక్కడ విడుదలై, 
విజయవంతంగా ప్రదర్శితమవుతుంటే, సరిగ్గా పది రోజుల తరువాత 
ఇప్పుడీ తెలుగు వెర్షన్ జనం ముందుకొచ్చింది. ఫ్రెంచ్ చిత్రం ‘స్లీప్‌లెస్ నైట్’ 
ఆధారంగా ఈ కథ అల్లుకున్నట్లు కమల్ పేర్కొన్నారు. టైటిల్స్‌లో క్రెడిట్
 కూడా ఇచ్చారు.

సినిమా స్టోరీ ఏమిటంటే... సి.కె. దివాకర్ అలియాస్ సి.కె.డి. (కమలహాసన్) 
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్. డాక్టరైన భార్య విడాకులిచ్చేస్తుంది. 
వాళ్ళబ్బాయి వాసు స్కూల్లో చదువుకొనే పిల్లాడు. ఇద్దరికీ పిల్లాడే ప్రాణం. 
ఊళ్ళో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ జరుగుతుంటే, పది కిలోల కొకైన్ బ్యాగ్‌ను 
దివాకర్, అతని కొలీగ్ మణి (యూహీ సేతు) కొట్టే స్తారు. కొకైన్ దంధా 
నడిపే నైట్‌క్లబ్ ఓనర్ విఠల్‌రావు (ప్రకాశ్‌రాజ్) విషయం తెలిసి, పిల్లాణ్ణి 
కిడ్నాప్ చేయిస్తాడు. కొకైన్ బ్యాగ్ ఇస్తేనే, పిల్లాణ్ణి అప్పగిస్తానని బేరం 
పెడతాడు. బాబు కోసం ఆ బ్యాగ్ ఇచ్చేయ డానికి దివాకర్ సిద్ధపడతాడు. 
ఆ బ్యాగ్ తీసుకొని క్లబ్‌కు వెళ్ళి, టాయి లెట్‌లో దాచిపెడతాడు. నార్కోటిక్స్ 
బ్యూరోలోనే మరో పోలీసైన మల్లిక (త్రిష) అనుకోకుండా దివాకర్‌ను 
వెంబడించి, బ్యాగ్ సంగతి చూస్తుంది. తీసి మరోచోట దాస్తుంది. 
తీరా పిల్లాణ్ణి కాపాడుకొందామని ప్రయత్నిం చిన దివాకర్‌కు 
దాచినచోట బ్యాగ్ కనిపించదు. ఒకపక్క విఠల్‌రావు, అతని
 బిజినెస్ పార్‌‌టనర్ (‘మిర్చి’ సంపత్), అనుచరులు, మరోపక్క 
ఆఫీసర్లు మల్లిక, మోహన్ (కిశోర్) వెంటాడుతుంటే, బిడ్డను 
కాపాడు కోవడానికి అతను తంటాలు పడుతుంటాడు. ఆ రాత్రి
 పోలీస్ డిపార్‌‌ట మెంట్‌తో సహా, నేరసామ్రాజ్యంలోని చీకటి 
కోణాలెన్నో బయటపడ తాయి. అవేమిటి? దివాకర్ కన్నబిడ్డను 
కాపాడుకోగలిగాడా? అవన్నీ తెరపై చూడాల్సిన విషయాలు.

పాయింట్ చిన్నదైనా, ప్రధానంగా కథనశైలి మీద ఆధారపడి తీసిన
 క్రైవ్‌ు యాక్షన్ థ్రిల్లర్ ఇది. అందుకు తగ్గట్లే నేపథ్య సంగీతం, యాక్షన్
 అంశాలే కీలకమయ్యాయి. భార్య నుంచి విడాకులు తీసుకొని, కొడుకే 
ప్రాణంగా బతుకుతున్న తండ్రి పాత్రలోని బాధను కమల్ బాగా చూపించారు. 
యాక్షన్ సన్నివేశాల్నీ రియలిస్టిక్‌గా పండిం చారు. అలాగే, పోలీస్ 
ఆఫీసర్లుగా త్రిష, కిశోర్, గ్యాంగ్‌స్టర్లుగా ప్రకాశ్‌రాజ్, సంపత్ అందరూ
 సీనియర్లే. పాత్రల్ని సమర్థంగానే పోషించినవారే.

కాకపోతే, కమల్ పోషించిన పాత్రను మొదటి నుంచి కొంత నెగిటివ్ షేడ్ 
ఉన్నదిగా చూపెడుతూ వస్తారు. సెకండాఫ్ సగంలోకి వచ్చే సరికి ఆ 
పాత్ర అసలు స్వరూపం ఏమిటో, ఎందుకలా ప్రవర్తిస్తోందో తెలియజేస్తారు. 
అదీ వట్టి డైలాగులతో. దాంతో, ఆ పాత్ర ఒక్కసారి డార్క్ షేడ్ నుంచి 
బ్రైట్ షేడ్ వైపు గెంతినట్లనిపిస్తుంది.

సినిమా దాదాపు నైట్ క్లబ్‌లోనే జరుగుతుంది. దాంతో, సీన్లన్నీ డ్యాన్స్ ఫ్లోర్,
 కిచెన్, టాయిలెట్స్‌లోనే తిరుగుతుంటాయి. ఒక విభిన్న తరహా ప్రయత్నంగా,
 బడ్జెట్ కలిసొచ్చే అంశంగా దాన్ని సర్దిచెప్పుకోవచ్చు కానీ, పూర్తిస్థాయి
 కమర్షియల్ సినిమాను ఆ పరిధిలోనే సరిపెట్టుకోవడం ఆడియన్‌‌సకు 
ఇబ్బందే. సినిమా చివరలో రోలింగ్ టైటిల్స్ వస్తుంటే, యూనిట్ మొత్తం
 నర్తించిన ప్రమోషనల్ వీడియో తరహా సాంగ్, సాహిత్యం, 
ఆర్కెస్ట్రయిజేషన్ బాగు న్నాయి. ఆ పాటలో కమల్ ఎనర్జీ చూస్తే 
ముచ్చటేస్తుంది.

 వెరసి కొన్ని సినిమాలు కథను బట్టి చూస్తాం. మరికొన్ని దర్శకుణ్ణి బట్టో,
 హీరోను బట్టో చూస్తాం. కానీ, ఒక నటుణ్ణి బట్టి, అతని అభినయం మీద
 ప్రేమ కొద్దీ చూసే సినిమాలు ఇవాళ తక్కువ. యాభై ఏళ్ళ పైగా కెరీర్
 తరువాత కూడా అలాంటి నటుడిగా కమల్ అలా ఆసక్తికరంగా ఆయన
 సినిమాలూ ఉండడం విశేషమే. ఆ ఆసక్తి ‘చీకటి రాజ్యం’ లోకి ప్రేక్షకుల్ని
 తెస్తుంది. కానీ, కమల్ కెరీర్‌లో కొన్నాళ్ళుగా పేరుకున్న బాక్సాఫీస్
 చీకటిని తొలగిస్తుందా అన్నది కొన్ని కోట్ల రూపాయల ప్రశ్న.

...................................................
- కమల్ శిష్యుడే దర్శకుడు రాజేశ్. దర్శకుడిగా అతనికి ఇదే తొలి చిత్రం.
- రామజోగయ్యశాస్త్రితో డైలాగ్‌‌స రాయించాలని కమల్ భావించారట. 
- మణి పాత్రకు తెలుగులో రచయిత అబ్బూరి రవి డబ్బింగ్ చెప్పారు. 
- ఉన్న ఒకే ఒక్క పాట కమలే పాడారు.  
- ఫారిన్ యాక్షన్ మాస్టర్ గిల్గెస్ కాంసే యిల్ కొన్ని ఫైట్స్ కంపోజ్ చేశారు.
.......................................

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 21st Nov 2015, Saturday, Family page)
....................................

Monday, November 16, 2015

ఇది ప్రేమ్.. లీల ( ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ (తెలుగులో ‘ప్రేమ లీల’) మూవీ రివ్యూ)

ఇది  ప్రేమ్.. లీల

చిత్రం: ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ (తెలుగులో ‘ప్రేమ లీల’),  
సంగీతం: హిమేశ్ రేషమియా, ప్రొడక్షన్ డిజైనర్: 
నితిన్ చంద్రకాంత్ దేశాయ్, కెమేరా: వి. మణికంఠన్, 
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సూరజ్ ఆర్. బర్జాత్యా, 
నిడివి:  174 నిమిషాలు

భారతీయ సినీ రంగంలో ‘రాజశ్రీ ప్రొడక్షన్స్’కు ప్రత్యేకత ఉంది. 
సకుటుంబంగా చూడదగ్గ సినిమాలకు ఆ సంస్థ తిరుగులేని 
చిరునామా. సల్మాన్‌ఖాన్‌తో కూడా ప్రత్యేక బంధం ఆ సంస్థది. 
‘మైనే ప్యార్ కియా’ (1989) మొదలు ‘హమ్ ఆప్‌కే హై కౌన్’ (1994), 
‘హమ్ సాథ్ సాథ్ హై’ (1999) వాళ్ళ కాంబినేషన్‌లో,
 సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో వచ్చినవే. నాలుగో సినిమా 
ఈ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’. పోస్టర్‌తో సహా ఈ సినిమా
 ఆ పాత హిట్ల వాతావరణాన్నీ, విలువల్నీ గుర్తు చేస్తుంటుంది.

కథేమిటంటే... ప్రేమ్ (సల్మాన్‌ఖాన్) పురాణ కథల్ని రంగస్థలంపై 
ప్రదర్శించే రామ్‌లీలా కళాకారుడు. సంపాదనలో చాలా భాగాన్ని
 సామాజిక సేవాసంస్థ ‘ఉపహార్’ ఫౌండేషన్‌కు ఇచ్చేస్తుంటాడు.
 ఆ ఫౌండేషన్‌ను దేవ్‌గఢ్ రాజకుమారి మైథిలి (సోనమ్ కపూర్)
 నడుపుతుంటుంది. ఆమెను ప్రత్యక్షంగా కలసి, మాట్లాడాలని 
అనుకుంటాడు. ప్రీతమ్‌పూర్ రాకుమారుడు విజయ్ సింగ్ 
(సల్మాన్‌ఖాన్)తో రాజకుమారి పెళ్ళి కుదిరిందనీ, అతనికి
 రాజతిలకం దిద్దే ఉత్సవానికి ఆమె వస్తోందనీ తెలుసుకుంటాడు. 
నేరుగా వెళ్ళి, ఆమెను కలిసి, డబ్బు ఆమె చేతికే ఇవ్వాలనుకుంటాడు. 
మరోపక్క సవతి చెల్లెళ్ళు చంద్రిక (స్వరభాస్కర్), రాధికలను 
నచ్చజెప్పడానికి వెళ్ళిన రాకుమారుడు శత్రువుల పన్నాగంతో 
పెను ప్రమాదానికి గురవుతాడు. లేవలేని స్థితిలో ఉన్న 
రాకుమారుణ్ణి రహస్య ప్రదేశంలో ఉంచి, దివాన్ (అనుపమ్‌ఖేర్),
 రాజాస్థాన సెక్యూరిటీ చీఫ్ వైద్య చికిత్స చేయిస్తుంటారు. 
నాలుగు రోజుల్లో ఉన్న ఉత్సవానికి ఏం చేయాలో వాళ్ళకు
 పాలుపోదు. ఇంతలో సరిగ్గా రాకుమారుడి పోలికలతో ఉన్న
 సామాన్యుడు ప్రేమ్ ఎదురవుతాడు. ఈ సామాన్యుణ్ణి 
రాకుమారుడి స్థానంలో పెట్టి, కథ ముందుకు నడిపిస్తారు.

రాకుమారుడిలా నటిస్తున్న ప్రేమ్ తన ప్రవర్తన, ఆప్యాయత, 
అనురాగాలతో అందరి మనసూ చూరగొంటాడు. రాకుమారుడి
 పట్ల ముభావంగా ఉన్న రాజకుమారిలో ప్రేమ పొంగేలా 
చేస్తాడు. మరోపక్క రాకుమారుడి మీద హత్యాయత్నం 
చేసింది సవతి తమ్ముడు (నీల్ నితిన్ ముఖేశ్), అతని
 అనుచరగణమేనని తెలుస్తుంది. వాళ్ళకీ రాకుమారుడి
 వేషంలో ఉన్నది సామాన్యుడని అర్థమవుతుంది. అప్పుడు
 ప్రేమ్ ఏం చేశాడు? బంధాల్ని కాలదన్నుకుంటున్న 
వాళ్ళనెలా మార్చాడు? రాజకుమారి ప్రేమ కథ ఏమైంది? 
లాంటివన్నీ మిగతా కథ.

ఫ్యాన్‌‌సకు డబుల్ ధమాకా - సల్మాన్ ద్విపాత్రాభినయం. 
రాకుమారుడిగా గాంభీర్యం పలికిస్తూనే, సామాన్యుడైన 
ప్రేమ్ దిల్‌వాలేగా  సల్మాన్ ఇరవై ఏడేళ్ళ వెనక్కి వెళ్ళి,
 ‘మైనే ప్యార్ కియా’ నాటి అమాయకత్వాన్ని పలికించారు. 
‘రాన్‌ఝానా’, ‘ఖూబ్‌సూరత్’ ఫేమ్ సోనమ్ కపూర్‌కు ఇది
 మరో మంచి పాత్ర. రకరకాల కోణాలున్న ఆ పాత్రను చేతనైనంత 
మెప్పించారు. దివాన్‌గా అనుపమ్ ఖేర్ చూపించే ప్రభుభక్తి, 
కర్తవ్యదీక్ష ఆ పాత్ర మీద ప్రేమను పెంచుతాయి. సవతి చెల్లెలు 
చంద్రికగా స్వరభాస్కర్‌ది మరో కీలక పాత్ర. కోపం, ద్వేషం నుంచి
 ప్రేమానుబంధం వైపు ఆ పాత్ర మారే తీరు బాగుంది. దాన్ని
 ఇంకొంత ఎఫెక్టివ్‌గా చెప్పేందుకు మరికొన్ని సీన్లు అవసరం.
 విలన్లుగా నీల్ నితిన్ ముఖేశ్, అర్మాన్ కోహ్లీ నిండుగా కనిపిస్తారు.

పెళ్ళిళ్ళు, ఉత్సవాలు, కుటుంబ బంధాలనే ‘రాజశ్రీ’ వారి 
చట్రంలోనే ఈ సినిమా తయారైంది. అయితేనేం, కెమేరా, 
ఆర్ట్ విభాగాల పనితనం మెచ్చుకోకుండా ఉండలేం. ‘రాజశ్రీ’ 
వారి మ్యూజికల్ డ్రామాలన్నిటి లానే ఈ సినిమాలో 40 
నిమిషాలు పాటలే. కనీసం మూడు, నాలుగు పాటలు బాగున్నాయి.

మొదలైన 20 నిమిషాల చిల్లరకే ఒక మంచి మలుపుతో
 కథపై ఆసక్తి పెరుగుతుంది. కాసేపటికే మార్క్‌టై్వన్
 ‘ప్రిన్స్ అండ్ పాపర్’ (రాజు - పేద) కథ ఫక్కీలో ఒకరి స్థానంలోకి
 మరొకరు వెళ్ళడమనే కమర్షియల్ ఫార్ములా కథ ఇదని 
అర్థమైపోతుంది. ఇక అక్కడ నుంచి కథనెలా ముందుకు 
నడిపిస్తారన్న దాని మీదే ఆసక్తి. అయితే, దర్శకుడు 
అలవాటైన విలువల మార్గాన్నే తాపీగా అనుసరించారు 
తప్ప, వేగం కోసం ఎక్కడా తొందరపడలేదు. దాంతో,
 ఫస్టాఫ్ కాలక్షేపంగా గడిచిపోయినా, సెకండాఫ్ 
మలుపులు లేకుండా స్ట్రయిట్‌గా సాగుతుంది.     

 డబ్బు, అధికారం కోసం సొంత తమ్ముడే - యువరాజైన 
హీరోను చంపాలనుకోవడం ఓకె. కానీ, తీరా హీరోను 
ఎత్తుకొచ్చి, తమ దగ్గరే బంధించాక ఏమీ చేయడేమిటో 
అర్థం కాదు. అలాగే, చివరికొచ్చేసరికి యుద్ధం సీన్‌లో 
తమ్ముడిలో హఠాత్తుగా మార్పొస్తుంది. యువరాజు మీద
 పన్నాగం పన్నినవాళ్ళు ఇంటి దొంగలే అన్న సంగతి
 తెలుసుకోవడానికీ దివాన్ బృందం పెద్దగా కష్టపడదు. 

మొత్తం మీద చెడు కన్నా మంచే ఎక్కువ చెప్పాలనుకోవడం,
 చూపాలనుకోవడం ‘రాజశ్రీ’ వారి ధోరణి. తరాలు మారినా
 ఆ దోవలోనే వెళ్ళడం వల్ల కావచ్చు... ఈ సినిమాలో విలన్ల
 కుట్రలు కూహకాల మీద సీన్లు అల్లుకోలేదు. ద్వేషం
 మనుషుల్ని దూరం చేసేవైతే, ప్రేమ ఎవరినైనా దగ్గర 
చేస్తుందని చెప్పారు. ఆ మేరకు వారు పడ్డ శ్రమ, కథను 
తెరకెక్కించడంలోని నిర్మాణ విలువలు తెరపై కనిపిస్తుంటాయి. 
మంచి విలువల్ని మరోసారి గుర్తుచేసే మనసున్న కుటుంబ
 కథల్ని మ్యూజికల్ డ్రామాలుగా చూపే కథన పద్ధతి 
నచ్చేవారికి ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. 
బరువంతా భుజాన మోస్తూ సల్మాన్ విసిరిన 
సమ్మోహనాస్త్రం. మరి, క్షణమైనా చూపు ఒకేచోట
 నిలవకుండా చేతిలో రిమోట్ తిప్పే, ఇవాళ్టి 
స్మార్ట్‌ఫోన్ తరం మాటేమిటన్నదే ప్రశ్న.
 ...................................................

- ‘ప్రేమ్’ అనే పేరున్న పాత్రని సల్మాన్ పోషించడం 

ఇది 16వ సారి అట!

-  కొన్ని యాక్షన్ సీన్ల కోసం ‘స్కై ఫాల్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్,
 హ్యారీ పోటర్’ ఫేవ్‌ు స్టంట్‌డెరైక్టర్ గ్రెగ్ పోవెల్‌ను తెచ్చారు. 

-  ‘మొఘల్ -ఏ-ఆజమ్’లో చర్చనీయాంశమైన శీష్‌మహల్ సెట్ 
లాంటి దాన్నే కళా దర్శకుడు నితిన్ పునఃసృష్టించారు. 

-  ఈ సినిమా బడ్జెట్ 80 నుంచి 90 కోట్లట. 258 రోజుల పైగా షూటింగ్. 
లైటింగ్‌కే 13 -15 కోట్లు ఖర్చయిందట!  

- ఈ చిత్ర తెలుగు డబ్బింగ్ ప్రేమ లీలలో సల్మాన్‌కు రామ్‌చరణ్ గొంతిచ్చారు.
..............................................................

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 13th Nov 2015, Friday, Family Page)
.......................................

Saturday, November 14, 2015

సకలం... అఖిలం ('అఖిల్' మూవీ రివ్యూ)

సకలం... అఖిలం

చిత్రం: ‘అఖిల్... ది పవర్ ఆఫ్ జువా’; కథ: వెలుగొండ శ్రీనివాస్; 
మాటలు: కోన వెంకట్; సంగీతం: తమన్, అనూప్; 
ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాశ్; కెమేరా: అమోల్ రాథోడ్; 
యాక్షన్: కె. రవివర్మ; ఎడిటింగ్: గౌతంరాజు; 
నిర్మాతలు: ఎన్. సుధాకరరెడ్డి, నితిన్, 
దర్శకత్వం: వి.వి. వినాయక్; నిడివి: 130 ని

అఖిల్ ఎవరో సినీ ప్రియులకు ప్రత్యేకించి చెప్పనక్క ర్లేదు. కానీ, 
లాంఛనంగా చెప్పాలి కాబట్టి... అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన 
కొత్త వారసుడు. నాగార్జున, అమల దంపతుల కుమారుడు. తన పేరే 
టైటిల్‌గా తయారైన సినిమాతో తొలిసారిగా పూర్తిస్థాయి హీరోగా ప్రేక్షకుల 
ముందుకొ చ్చాడు. దసరాకు రావాల్సి ఉన్నా, ‘‘గేమ్ ఎప్పుడైనా గెలుపు 
నాదే’’ అంటూ, దీపావళికొచ్చాడు. ఇప్పటికే తాత, తండ్రి, అన్నలతో 
పరిచయమున్న సినీ ప్రియులకు తెరపై కొత్త బాణసంచా అఖిల్. 
హీరోగా అతను ఎంచుకున్న కథ, సినిమా కూడా అచ్చమైన దీపావళి టపాకాయ.

 కథగా చెప్పాలంటే... అఖిల్ (అఖిల్) అమ్మానాన్న లేని కుర్రాడు. 
ఫ్రెండ్స్‌తో కలిసి జాలీగా తిరుగుతూ, ఫైటింగ్ పోటీల్లో పాల్గొని గెలుస్తూ 
డబ్బులు సంపాదిస్తుంటాడు. దివ్య (సాయేషా)ని తొలిచూపులోనే
 ప్రేమిస్తాడు. బాగా చదువుకొన్న దివ్యకు మూగ జీవాలంటే మహా ప్రేమ. 
ఎంత ప్రేమంటే, తన దగ్గరున్న కుందేలుకు గుండెలో రంధ్రముందని తెలిసి, 
బాగు చేయాలనుకొనేంత ప్రేమ. వెంటనే హీరో కేంబ్రిడ్జ్‌లో చదువుకొన్న
 వెటర్నరీ డాక్టర్‌నని నాటకమాడతాడు. నిజానికి హీరోయిన్ ఒక పెద్ద
 మాఫియా వ్యాపారి (మహేశ్ మంజ్రేకర్) కూతురు. అప్పటికే ఆమెకు
 మరొకరి (‘వెన్నెల’ కిశోర్)తో పెళ్ళి నిశ్చయమవుతుంది. ఆ పెళ్ళిని 
తెలివిగా చెడగొడతాడు హీరో.

పారిపోయి, వేరే ప్రేమ వివాహం చేసుకున్న ఆ పెళ్ళికొడుకునూ, 
పెళ్ళి చెడగొట్టిన అతని ఫ్రెండ్‌నూ వెతుక్కుంటూ, పగ తీర్చుకొనే 
పనిలో పడుతుంది హీరోయిన్. చదువుకుంటానని పైకి చెబుతూ,
 పగ తీర్చుకోవడానికి యూరప్ వెళుతుంది. హీరోయిన్‌నీ, ఆమె 
నుంచి ప్రేమనూ పొందడానికి హీరో రెండు లక్షలతో యూరప్‌కి 
చేరతాడు. అక్కడ అనుకోకుండా, ఒక ఆఫ్రికన్ కుర్రాడి బుల్లెట్
 గాయానికి చికిత్స చేస్తుంది హీరోయిన్. గూండాల వేటలో ఆ 
కుర్రాడు చనిపోతాడు. అప్పటి దాకా ఆ ఆఫ్రికన్ కుర్రాడి కోసం, 
అతను దాచిన రహస్యం కోసం వెతుకుతున్న గూండాలు విషయాలన్నీ
 హీరోయిన్‌కు తెలుసని ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఆఫ్రికా పట్టుకుపోతారు.

ఈ ఆఫ్రికా ట్విస్ట్ వెనుక అసలు కథ మరొకటి ఉంటుంది. అదేమిటంటే, 
సూర్యతాపం నుంచి ప్రపంచ వినాశం జరగకుండా కాపాడే సూర్యకవచం
 ఆఫ్రికాలో ఒక తెగ వాళ్ళ దగ్గర ఉంటుంది. ప్రతి సూర్యగ్రహణం నాడూ 
గ్రహణం విడిచిన వెంటనే సూర్యుడి తొలి కిరణాలు దాని మీద పడాలి. 
లేకపోతే ప్రపంచ నాశనం తప్పదు. స్థానిక ఆఫ్రికన్లు తమ భాషలో 
ఆ కవచాన్ని ‘జువా’ (అంటే సూర్యుడని అర్థం) అంటూ ఉంటారు. 
దాన్ని ఎలాగైనా చేజిక్కించుకొని, ప్రపంచాన్ని తన పాదాక్రాంతం 
చేసుకోవాలని ఒక రష్యన్ శాస్త్రవేత్త ప్రయత్నిస్తుంటాడు. ఆ ‘జువా’ను 
తెచ్చి ఇవ్వడానికి మాఫియా వ్యాపారి అయిన హీరోయిన్ 
నాన్న (మహేశ్ మంజ్రేకర్) ఒప్పుకుంటాడు. గూండాల 
సాయం తీసుకుంటాడు. వాళ్ళకు అది దొరకకుండా చేస్తాడు
 ఆ ఆఫ్రికా కుర్రాడు. ఆ జువాను ఒకచోట దాస్తాడు. తీరా
 గూండాల చేతిలో చనిపోయాడన్న మాట.   

హీరోయిన్‌ను వెతుకుతూ ఆఫ్రికా వెళ్ళిన హీరోకు ఈ కథంతా 
తెలుస్తుంది. హీరోయిన్‌ని కాపాడి, ఆ జువాను తీసుకురావడానికి 
తానే బయల్దేరతాడు. ఆ తరువాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు
 ఎవరైనా ఊహించుకోగలిగినదే. కాకపోతే, అఖిల్ ఆ పనెలా చేశాడు,
 ఏ జీవాన్నైనా పీక్కు తినే కిల్లర్ ఫిష్‌లతో నిండిన ఆ కొలనులో ఏమైంది, 
జీపుతో గాలిలోకి ఎగిరి మరీ నడుస్తున్న విమానాన్ని హీరో ఎలా 
అందుకున్నాడు, ఆ మంటల్లో నుంచి ఎలా బయటపడ్డాడు, 
చివరికి ఆ సూర్యగ్రహణానికి ఏమైందన్నది వి.వి. వినాయక్ 
మార్కు ‘అఖిల్’లో తెరపై చూసి తీరాలి.

అమృతతుల్యమైనవీ, ప్రపంచ నాశనం నుంచి కాపాడేవీ
 అయిన ఆత్మలింగం (చిరంజీవి ‘అంజి’), మహాశక్తి (వెంకటేశ్ ‘దేవీపుత్రుడు’),
 శక్తి (చిన్న ఎన్టీయార్ ‘శక్తి’) లాంటివి గతంలో చూశాం. 
ఈసారి సూర్యకవచం తెర మీదకొచ్చింది. కొన్నేళ్ళ క్రితం 
నాగార్జునకు ‘డమరుకం’ సినిమా కథ ఇచ్చిన రచయితే 
దీనికీ కథారచన. కోన వెంకట్ మార్కు డైలాగ్స్ అదనం. 
హీరోగా తొలి సినిమా అనిపించకుండా అఖిల్ ఈజ్ చూపారు. 
ఫైట్స్, డాన్‌‌స, కాస్ట్యూమ్స్‌లో మార్కులు కొట్టేస్తారు. రూపురేఖల్లో 
అచ్చం బాలీవుడ్ నటుడనిపిస్తారు. కొత్తమ్మాయి సాయేషా 
(దిలీప్‌కుమార్, సైరాబాను దంపతులకు మనవరాలి వరస) 
కూడా డిటో డిటో. ‘వెన్నెల’ కిశోర్, జాన్సన్ అండ్ జాన్సన్‌గా
 సెకండాఫ్‌లో బ్రహ్మానందం, ఒక్క సీన్ ‘పోతే బాబూరావు’గా 
సప్తగిరి.. ఉన్న కథలోనే కామిక్ రిలీఫ్. కథలో కాసేపటి
 తర్వాత కనిపిం చని రాజేంద్రప్రసాద్ బృందమూ అంతే.

మిస్సవకుండా మొదటి నుంచీ చూడాల్సిన సినిమా ఇది.
 ఎందుకంటే, టైటిల్స్ పడుతున్నప్పుడే ‘జువా’ అంటే ఏమిటో, 
అదెందుకు కీలకమో - మొత్తం చెప్పేస్తారు. ఫారిన్ షూటింగ్‌లు, 
పాటల చిత్రీకరణల్లో నిర్మాణ విలువలు కనిపించే ఈ సినిమాలో 
కెమేరా వర్క్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆఫ్రికా గూడెం మొత్తం
 ఇక్కడ మన ఆర్ట్ డెరైక్టర్ ప్రతిభేనంటే నమ్మబుద్ధి కాదు. 
రవి వర్మ యాక్షన్ కంపోజింగ్ బాగుంది. ఇన్నీ ఉన్నా, 
ఒక్క ముక్కలో ఈ సినిమా ‘ఫర్ ది అఖిల్... బై ది అఖిల్... 
అండ్ టు ది అఖిల్’. మొత్తం ఆ హీరో భుజాల మీద, ఆ 
పాత్ర చేతుల మీదుగా నడుస్తుంది. ఏ హీరో అయినా తన 
తొలి సినిమాకు అంతకు మించి ఏం కోరుకుంటాడు!
 ప్రేక్షకులు ఇంకేం ఆశిస్తారు!

......................................
- అఖిల్‌కు సన్నిహిత మిత్రుడైన మరో సినీ హీరో నితిన్ ఈ సినిమాను నిర్మించారు. 
-  ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవా నికి హీరో హీరోయిన్లని పరిచయం చేశారు.
- స్పెయిన్ లాంటి చోట్ల భారీ షెడ్యూల్స్ చేశారు. ఫైట్లు తీశారు.  
- ఈ సినిమాకు మ్యూజిక్ డెరైక్టర్‌గా అనూప్‌ను తీసుకున్నారు. తరువాత తమన్ 
కూడా మ్యూజిక్‌బాధ్యతలు పంచుకున్నారు. 
- ‘అక్కినేని...’ అంటూ సినిమా చివరలో వచ్చే పాటలో నాగార్జున కూడా
 స్పెషల్ అప్పీయరెన్‌‌స ఇచ్చారు. కుమారుడు అఖిల్ కోసం కలసి, స్టెప్పులు వేశారు.
.................................................

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 13th Nov 2015, Friday, Family Page)
.......................................

అఖిల్ ది పవర్ ఆఫ్ జువ - అది... నా గర్ల్‌ఫ్రెండ్! (హీరో అఖిల్ తో ఇంటర్వ్యూ)

ఇంకొక పవర్‌ఫుల్ వారసుడు వచ్చాడండోయ్.

అఖిల్ ది పవర్ ఆఫ్ జువ

అది... నా గర్ల్‌ఫ్రెండ్!
హీరోగా ‘అఖిల్’ ఎంట్రీకి స్వాగతం. ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడానికి చాలా
 కసరత్తులు చేసినట్లున్నారు!
 అఖిల్: నిజమే. ‘మనం’ సినిమాలో చిన్న పాత్ర చేసిన తరువాత నేను ఒక 
జోన్‌లోకి వెళ్ళిపోయా. ఎలాంటి సినిమాలో పూర్తి స్థాయి పాత్ర చేయాలని 
తర్జనభర్జన పడ్డా. చాలా స్క్రిప్టులు విన్నా. చాలామంది దర్శకుల్ని కలిశా. 
ఆ టైమ్‌లో నాకు వినయ్ (దర్శకుడు వినాయక్) గారిలో కాన్ఫిడెన్స్, క్లారిటీ
 కనిపించింది. పైగా ఆయన ఎంచుకున్న ఇలాంటి స్క్రిప్ట్‌తో ఈ మధ్య ఎవరూ 
తీయలేదు. ఇలాంటి సినిమాతో హీరోగా వస్తే బాగుంటుందనిపించింది. పైగా,
 వినయ్ గారు మోస్ట్ సేఫ్ అండ్ కమర్షియల్ డెరైక్టర్. అందుకే, ఈ స్క్రిప్ట్‌తో
 ముందుకొస్తున్నాం.

సర్వసాధారణంగా హీరోగా తొలి సినిమా... అందులోనూ మీ లాంటి
 కుర్రాళ్ళ మీద అంటే ప్రేమకథ తీస్తారు. భారీ ప్రాజెక్ట్
భుజానికెత్తుకున్నారు. బరువనిపించలేదా?

అఖిల్:  ఫలానా రకం సినిమా చేయాలని ముందే ఏమీ అనుకోలేదు.
 నా మనసుకు నచ్చాలి అనుకున్నా. ఈ స్క్రిప్ట్ నచ్చింది. ఎమోషనల్‌గా
 ఫీలయ్యా. అంతే... లవ్‌స్టోరీనా, యాక్షనా - అని చూసుకోలేదు. 
ఎప్పుడైనా ‘యు హ్యావ్ టు ఫాలో యువర్ హార్ట్’ కదండీ!

ఏ    మీ నాన్న గారి సలహాలు, సూచనలూ ఫాలో అయ్యారా?
 అఖిల్: కచ్చితంగా. నేనెప్పుడూ ఆయన ఎడ్వైజ్ తీసుకొంటా. ఈ కథ 
నాకు నచ్చాక, ఆయనకు కూడా వినిపించాం. ఆయన తన సూచనలు 
చెప్పారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని, షూటింగ్ ప్రారంభం కావడానికి
 ముందు 8 నెలలు స్క్రిప్ట్‌పై వర్క్ చేశాం. అప్పుడు షూట్‌కు వెళ్ళాం.

ఈ సినిమాతో వినాయక్‌లో కొత్త స్టైల్‌ను చూస్తామన్నారు.

 అఖిల్: ఆయన గత చిత్రాలతో చూస్తే, ఈ సినిమా కమర్షియల్‌గా 
ఉంటూనే కొత్తగా అనిపిస్తుంది. ట్రీట్‌మెంట్ కూడా ఎప్పుడూ ఉండే 
వినాయక్ సినిమాల పద్ధతిలో ఉండదు. పైగా, కొత్త టీమ్‌తో పనిచేయడం
 వల్ల వినయ్ గారి సినిమాకు ఫ్రెష్ లుక్ వచ్చింది. అందుకే, ‘అఖిల్’ను
 తెరపై డిస్కవర్ చేసే క్రమంలో తనను తాను రీ-డిస్కవర్ చేసుకున్నానని 
ఆయనే నాతో అన్నారు. ప్రతి రోజూ ఇక్కడ ఏదో ఒక కొత్త విషయం 
నేర్చుకోవాల్సిన ఈ రంగంలో ఆయన ఆ మాట అనడం హ్యాపీగా ఫీలయ్యా.

క్రికెటర్ కావాల్సింది యాక్టరైనట్లున్నారు. అజరుద్దీన్, అంబటి 
రాయుడులా మరో మంచి క్రికెటర్‌గా వస్తారనుకున్నామే!
 అఖిల్: (నవ్వుతూ...) సినిమాలు వదిలేసి, క్రికెట్‌కు వెళ్ళిపొమ్మంటారా
 ఏమిటి! నిజానికి, క్రికెట్ నాకు బాగా ఇష్టం. ప్రొఫెషనల్‌గా క్రికెట్ నేర్చుకొని, 
ఆడాలనుకున్నా. దాన్ని సీరియస్‌గా తీసుకున్నా. అంతే తప్ప, నేషనల్ 
క్రికెటర్‌ను అవ్వాలనో, ఆ రంగంలో స్థిరపడాలనో ఎప్పుడూ అనుకోలేదు. 
నాకెప్పుడూ యాక్టింగ్ మీదే ఇంట్రస్ట్. పైగా, అక్కినేని లాంటి పెద్ద సినీ 
కుటుంబంలో పుట్టినప్పుడు మనకు తెలియకుండా చిన్నప్పుడే ‘నటన’ అనే
 పురుగు కుట్టేస్తుంది. అందుకే, ‘నువ్వేమవుతావు’ అని అడిగినప్పుడు 
‘ఇంకేమవుతా... యాక్టర్‌నవుతా’ అని చెప్పేవాణ్ణి.

కానీ అప్పట్లో ఆస్ట్రేలియాకు వెళ్ళి మరీ క్రికెట్ నేర్చుకున్నారుగా!
 అఖిల్: స్పోర్ట్స్ అంటే మొదటి నుంచీ నాకు ఇంట్రస్ట్. మన దగ్గర సౌకర్యాలు
 తక్కువ. కానీ, ఆస్ట్రేలియాలో అన్నీ ఉంటాయి. మా అమ్మ వాళ్ళ అన్నయ్య 
అప్పట్లో ఆస్ట్రేలియాలోని ‘నూసా’ అనే చోట ఉండేవారు. నా చిన్నప్పుడు సెలవులకు
 అమ్మ వాళ్ళతో కలసి వెళ్ళి, అక్కడ రెండు వారాలున్నా. ఆ ప్లేస్ నచ్చి, అక్కడే 
చదువుకుంటానన్నా. ఇంట్లో సరే అన్నారు. అలా పెర్త్‌లో అందరూ మగపిల్లలే 
ఉండే బోర్డింగ్ స్కూల్‌లో రెండేళ్ళు చదువుకున్నా. ఆ స్కూల్‌లో మధ్యాహ్నం
 3 దాకా చదువులు. ఆ తరువాతంతా క్రికెట్ శిక్షణ. నేను రైట్ హ్యాండ్ టాప్ 
ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ని. రైట్ ఆర్మ్ పేస్ బౌలర్‌ని. ఆస్ట్రేలియా క్రికెటర్ టామ్
 మూడీ మా స్కూల్‌లోనే చదివారట!

సినిమాల్లోకి రావడానికీ బాగా శిక్షణ తీసుకున్నట్లున్నారు!
 అఖిల్: అవునండీ! అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో బిజినెస్ స్టార్ట్ చేశా. 
ఏడాది తరువాత అది డిస్‌కంటిన్యూ చేసి, యాక్టింగ్‌లో రెండేళ్ళ పాటు
 డిప్లమా కోర్స్ చదివా. అప్పట్లో చాలా బిడియంగా ఉండేవాణ్ణి.
 ఆ షెనైస్ పోవడానికీ, మనసు విప్పి ఫ్రీగా అందరితో మాట్లాడడానికీ 
ఆ శిక్షణ ఉపయోగపడింది. అక్కడ థియేటర్ పెర్ఫార్మెన్స్‌లు వగైరా చేసి, 
కాన్ఫిడెన్స్ పెంచుకున్నా.

మరి ఫైట్స్, డ్యాన్స్‌ల మాటేమిటి?
అఖిల్: ఫైట్స్ విషయానికొస్తే, థాయిలాండ్‌లోని ‘కిచ్చా’ మాస్టర్ 
(‘ఇద్దరమ్మాయిలతో’, ‘కత్తి’ సినిమాల ఫేమ్) దగ్గర రెండు నెలలు 
సినిమా తరహా ఫైట్స్, రోప్ వర్క్ లాంటివి నేర్చుకున్నా. పంచ్‌లు
 రియల్ అనిపించేలా కనిపించడానికి ఏం చేయాలో తెలుసుకున్నా.
 ఇక, సినిమాకు కావాల్సిన మూడు, నాలుగు స్టైల్స్ ఆఫ్ డ్యాన్సెస్
 కొంత నేర్చుకున్నా. ‘అఖిల్’ ప్రారంభం కావడానికి మూడు నెలల 
ముందు నుంచి సీరియస్‌గా ప్రాక్టీస్ చేశా. గణేశ్, శేఖర్, జానీ 
మాస్టర్ల దగ్గర ఎక్కువ నేర్చుకున్నా.

ఒక పాటకు మీ స్టెప్పులు చూసి, నాన్నగారు థ్రిల్లయ్యారట?
 అఖిల్: ఆ ఇంట్రడక్షన్ పాటకి సెట్స్ వేశాం. చేయగలిగినదంతా చేశాం. 
మామూలుగా మూడున్నర నిమిషాల పాటలుంటాయి. హై ఎనర్జీతో 
సాగే ఆ పాట 5 నిమిషాలుంటుంది. అంతా డ్యాన్స్... డ్యాన్స్. పన్నెండు
 రోజులు షూట్ చేశాం. అది చూసి నాన్న చాలా మెచ్చుకున్నారు.

‘అఖిల్’లో కొత్తమ్మాయి సాయేషా ఎంపిక వెనక కారణం?
అఖిల్:  కథానాయిక పాత్ర కోసం ముగ్గురు, నలుగురు అమ్మాయిలతో
 నాకు టెస్ట్ షూట్ చేశారు. వాళ్ళందరిలోకీ బెస్ట్ - సాయేషానే. 
దిలీప్‌కుమార్ సతీమణి సైరాబానుకు మనుమరాలి వరస ఆమెది. 
ముంబయ్‌లోని క్యాస్టింగ్ ఏజెంట్ల ద్వారానే నిర్మాతలు ఆమెను 
చూశారు. లుక్ టెస్ట్ చేయగానే పర్‌ఫెక్టనిపించింది. ఒక్కరోజులో ఓకె చెప్పాం.

కెమేరా ముందు మీరూ కొత్తే. అమ్మాయీ కొత్తే. మరి మీ మధ్య 
లవ్ కెమిస్ట్రీ వర్కౌట్ అవడానికి ఏం చేశారు?
 అఖిల్: ‘అఖిల్’ అవుట్ అండ్ అవుట్ లవ్‌స్టోరీ కాదు. సినిమాలో హై పాయింట్స్, 
ఎలివేటింగ్ ఎపిసోడ్స్, యాక్షన్ ఉంటాయి. ‘ఏం మాయ చేశావే’
 లాంటి లవ్‌స్టోరీ అయితే, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ మీద 
ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇందులో ఆ అవసరం లేదు. కానీ, తెరపై 
మా జంట బాగుంటుంది. షి ఈజ్ వెరీ గుడ్ డ్యాన్సర్.

‘అఖిల్’ సోషియో - ఫ్యాంటసీ సినిమా అనీ...
 అఖిల్: (అందుకుంటూ...) అలా కాదు. అన్‌నోన్ ఎలిమెంట్స్ 
ఏమీ ఉండవు. రియల్‌గా మనం చూస్తున్నవే ఉంటాయి. 
సూర్యుడు, సౌరశక్తి లాంటివాటి చుట్టూ ఆసక్తిగా సాగుతుంది. 
అందుకే, ‘ది పవర్ ఆఫ్ జువ’ అని క్యాప్షన్ పెట్టాం. ‘జువ’ అంటే
 సూర్యుడని అర్థం.  

సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేసినప్పుడు మీ మానసిక స్థితి?
 అఖిల్: (గంభీరంగా మారి...) మానసిక ఒత్తిడి అనిపించింది. బాగా 
బాధపడ్డా. కానీ, అన్నీ మన చేతుల్లో ఉండవుగా. వాయిదా పడడం
 కూడా మంచికే జరిగింది. ఇప్పుడు మరింత బెటర్ ప్రొడక్ట్‌తో ముందుకొస్తున్నాం.

అప్పుడు గ్రాఫిక్స్ తృప్తిగా రాలేదన్నారు. ఇప్పుడు తృప్తేనా?
 అఖిల్: చూడండి. గ్రాఫిక్స్ విషయంలో యు కెన్ నెవర్ బి శాటిస్‌ఫైడ్.
 వాటిని ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా మెరుగుపరుస్తూనే పోవచ్చు. 
‘బాహుబలి’ ఆలస్యానికి కూడా కారణం అదే! ఒకే ఎఫెక్ట్ మీద రెండు
 నెలలు, రెండేళ్ళు, ఇరవయ్యేళ్ళు కూడా వర్క్ చేస్తూనే పోవచ్చు. 
కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది మనం తెరపై సృష్టించే వాతావరణం.
‘అఖిల్’లో అవన్నీ ప్రేక్షకుల్ని అలరిస్తాయి.

షూటింగ్‌లో మీ కష్టం చూసి తల్లి మనసు తల్లడిల్లిందా?
 అఖిల్: (నవ్వుతూ...) నేనేమీ... చచ్చిపోయేలా కష్టపడలేదండీ!
 బాగా కష్టపడి వచ్చినప్పుడు, నొప్పులు పోవడానికి మా అమ్మ 
ఐస్ బ్యాగ్ ఇచ్చేది. నటుడిగా నిరూపించుకోవడానికి నా కృషి, శ్రమ
 చూసి అమ్మ సంతోషించింది.  

అందరితో ఎప్పుడూ బాగా మాట్లాడే మీ అమ్మ గారు ఆడియో
 రోజున వేదికపై మాట్లాడడానికి మొహమాటపడ్డట్లున్నారు!
 అఖిల్: అవునండీ. షి ఈజ్ ఫీలింగ్ షై. తెలుగులో అనర్గళంగా 
మాట్లాడుతూ, ఫ్యాన్స్‌కు ఉత్తేజం ఇవ్వాలి. అమ్మ అంత తెలుగు 
మాట్లాడలేదు. పైగా, మహేశ్, నాన్న, అన్నయ్య అంత మాట్లాడాక 
అమ్మ ఏం మాట్లాడుతుంది! అయినా, సినిమా ప్రారంభం రోజునే
 ‘మా అబ్బాయిని మీ చేతుల్లో పెడుతున్నా’ అని ఫ్యాన్‌‌సకి చెప్పేసిందిగా!

అక్కినేని కుటుంబ వారసుడిగా ఒత్తిడి చాలా ఉంటుందిగా..
 అఖిల్: నేనే కాదు... ఒక స్టార్ కుటుంబం నుంచి వచ్చే ఎవరికైనా
 ఆ ప్రెజర్ ఉంటుంది. పాతికేళ్ళ తరువాత మహేశ్‌బాబు గారబ్బాయి
 గౌతమ్ హీరోగా వచ్చినా... అంతే! ఎందుకంటే, ఒకప్పటి కన్నా
 ఇప్పుడు మీడియా పెరిగింది. ప్రచారం బాగా వస్తోంది. అంచనాలు 
పెరిగిపోతాయి. అంతెందుకు... నాపై, నా సినిమాపై ఇంతగా 
అంచనాలొస్తాయని ఊహించలేదు. కానీ, ఏ స్టార్ కిడ్‌కైనా ఈ 
ఇబ్బంది తప్పదు. తట్టుకొని ముందుకెళ్ళాల్సిందే!

కానీ, సినిమాకు మీ పేరే పెట్టడం మరీ ‘నార్సిసిజమ్’ 
(స్వయంప్రేమ, ఆత్మస్తుతి) అనిపించలేదా?
అఖిల్: (గంభీరంగా...) మీకు అలా అనిపించిందా?

అనిపించడమెలా ఉన్నా కొందరి గుసగుసలు వినిపించాయి!
 అఖిల్: ఈ సినిమాలో నా పాత్ర పేరు కూడా అఖిల్. అదే సినిమాకూ
 పెట్టాం. దానికి మంచి రెస్పాన్సొచ్చింది.

బ్లాక్‌బస్టర్ ఇస్తానన్నమాట నిలబెట్టుకొనే రోజొచ్చినట్లుంది.
అఖిల్: (నవ్వుతూ...) బ్లాక్‌బస్టర్ హిట్ కోరుకుంటున్నానని చెప్పా.
 అందు కోసమే అందరం శ్రమించాం. ప్రేక్షకుల ఆశీర్వాదమే ఇక
 మిగిలింది. హోపింగ్ ఫర్ ది బెస్ట్.

ఇంతకీ, ఒక నటుడిగా ఇప్పుడు మీరు పెట్టుకున్న లక్ష్యం!
అఖిల్:  తొలి నాలుగైదు సినిమాలూ చాలా ఇంపార్టెంట్. అందుకే 
ఈ మూడేళ్ళూ ఒక్కో అడుగూ జాగ్రత్తగా వేస్తా.   

మరి, ‘అఖిల్’ తరువాతి ప్రాజెక్ట్ ఏమిటి?
 అఖిల్: ఆలోచనలు చాలా ఉన్నాయి. కానీ, అన్నీ ప్రస్తుతం
 ఆపి పెట్టా. ఇప్పుడు దృష్ట్టంతా ‘అఖిల్’ మీదే!

మీ లుక్స్, స్టైల్ బాలీవుడ్‌కి సూపర్. మీకూ ప్లాన్లున్నాయట?
అఖిల్: (నవ్వేస్తూ...) చాలా ప్లాన్స్ ఉన్నాయి. కానీ, ముందుగా నేను
 తెలుగు వాణ్ణి. మన దగ్గర ముందు బాగా పేరు తెచ్చుకోవాలి. 
ఆ తరువాతే ఏదైనా!
 ........................................

ఇప్పటికీ నైట్ క్రికెట్ ఆడతాం!
 సినిమాల్లోకొచ్చినా క్రికెట్ మీద ఇప్పటికీ అదే ఇంట్రస్ట్. ఫ్రెండ్స్‌తో 
ఇప్పటికీ మాకు టీమ్ ఉంది. ఇప్పటికీ హైదరాబాద్‌లో రాత్రి ఫ్లడ్‌లైట్స్‌లో
 సీరియస్‌గా ఆడతాం. అదెక్కడన్నది అడక్కండి (నవ్వులు..)
 ..............................

చాలా ‘క్రష్’లు ఉన్నాయి!

గర్ల్‌ఫ్రెండ్స్, లవర్స్ లేరు. కానీ అందరి లానే నాకూ చిన్నప్పటి నుంచి 
చాలామంది మీద ‘క్రష్’లు (తెలియని ఆకర్షణ) ఏర్పడ్డాయి. నాకు 
ప్రపోజ్ చేసినవాళ్ళూ ఉన్నారు. అవన్నీ అందరి లైఫ్‌లో ఉండేవే.
 ..............................

దీపికా పదుకొనే కనపడితే...
దీపికా పదుకొనే అంటే చాలా ఇష్టం. కలవలేదు కలిస్తే ‘అయామ్ ఎ
 బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు’ అని చెప్పేస్తా. ఆమె సినిమాల్లో ‘పీకూ’,
 ‘యే జవానీ హై దివానీ’ ఇష్టం. ఆమె నటన సహజంగా ఉంటుంది.
 ...................................

తాత గారిలో అది నచ్చేది!

తాత గారిని చూసి, విని, గమనించి ఎన్నో తెలుసుకున్నా. ముఖ్యంగా,
 అవతలి వ్యక్తి హోదాతో సంబంధం లేకుండా అందరితో ఆదరంగా
 మాట్లాడేవారు. అది నేనూ అలవరచుకోవాలని ఉంది.
 .................................

స్నేహమేరా జీవితం!
కెరీర్ ఎంత ముఖ్యమో, పర్సనల్ లైఫ్, స్నేహం అంతే ముఖ్యమని 
నా అభిప్రాయం. ఎమోషనల్‌గా డిపెండ్ అవడానికీ, మనసులో మాట
 పంచుకోవడానికీ మంచి స్నేహితులు కావాలి. ఫ్రెండ్‌‌స లేకుండా 
నేనుండలేను. సినీ పరిశ్రమలో నితిన్ నా బెస్ట్ ఫ్రెండ్. రామ్‌చరణ్ 
కూడా మంచి ఫ్రెండ్. అయితే, అవుట్‌సైడ్ ఫిల్మ్ ఇండస్ట్రీనే నాకు
 ఫ్రెండ్స్ ఎక్కువ. అలా నలుగురు మంచి ఫ్రెండ్స్ చాలాకాలంగా
 ఉన్నారు. షూటింగ్ లేకుండా నేను ఖాళీగా ఇంట్లో ఉన్నానూ అంటే... 
వాళ్ళలో కనీసం ఒకరైనా మా ఇంట్లో ఉండాల్సిందే. వాళ్ళతోనే నా కాలక్షేపం.
 .................................

మేమిద్దరం ఆ క్యాంప్‌లో కలిశాం!

నా వెంటే కనిపించే రతుల్ నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకడు. క్రికెట్ ఆడుతున్న
 రోజుల నుంచి పరిచయం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సి.ఏ) 
పెట్టిన క్యాంప్‌లో కలిశాం. అప్పటి నుంచి మా బంధం బలపడింది. 
మా జర్నీ సాగుతోంది.
 .................................

 వాళ్ళంతా భలే స్వీట్!
 ‘అఖిల్’ ఆడియో లాంచ్‌కి మై బిగ్గెస్ట్ హీరో సచిన్ టెండూల్కర్‌తో
 సహా ప్రముఖులు నాకు బెస్ట్ విషెస్ చెప్పడం చాలా హ్యాపీగా 
అనిపించింది. అమితాబ్‌జీ అంటే మా కుటుంబం మొత్తానికీ 
ఎంతో గౌరవం. ఆయనా మాట్లాడారు. ఒక ఫంక్షన్‌లో కలిసిన 
సల్మాన్‌ఖాన్ భాయ్ అయితే, ట్రైలర్ లాంచ్ చేస్తానంటూ సపోర్ట్‌గా
 నిలిచారు. మహేశ్‌బాబు గారైతే, ఆడియోకి వీడియోలో మాట్లాడమని
 అడిగితే, ‘స్వయంగా వస్తా’ అంటూ ఫంక్షన్‌కొచ్చారు. ఇలాంటి
 పెద్దవాళ్ళ మంచి మనసు, ప్రవర్తన స్వీట్‌గా అనిపించింది.
 ..................................

 రీమేక్ చేయను! రీమిక్స్ అనుకున్నా!
 తాత గారి సినిమాల్లో ‘దొంగరాముడు’, నాన్న గారి సినిమాల్లో 
‘హలో బ్రదర్’ ఇష్టం. కానీ, ఏదీ రీమేక్ చేయను. జనం మెచ్చిన
 ఆ కథలు, సినిమాలను చెడగొట్టడం నాకిష్టం లేదు. కాకపోతే, 
ఒక హిట్ పాట ఈ సినిమాలో రీమిక్స్ చేయాలని అనుకున్నాం.
 కానీ, చివరకు వద్దనుకున్నాం.
...................................

 నేనే షూట్ చేసి, డబ్బింగ్ చెప్పేవాణ్ణి!
 తెలుగు నేర్చుకున్నా. చదవడం, రాయడం వచ్చు. మీ పేపర్, 
ఈ ఇంటర్వ్యూ చదువుతా! (నవ్వు...) కానీ, నటించడం ఒక ఎత్తు.
 డబ్బింగ్ చెప్పడం ఇంకో ఎత్తు. ఎవరైనా సరిగ్గా మాట్లాడలేకపోతే 
తెరపై చూస్తున్నప్పుడు నాకు చిరాకు అనిపించేది. అందుకే,
 ఉచ్చారణపై పట్టు కోసం కష్టపడ్డా. నేనే కొన్ని సీన్స్ షూట్
 చేసుకొని, అన్నపూర్ణా స్టూడియోలో వాటికి డబ్బింగ్ చెప్పుకొనేవాణ్ణి. 
సీన్ రాసుకొని, వాయిస్ ఓవర్‌లా ఎమోషన్స్‌తో పలికేవాణ్ణి. 
దర్శకుడు దేవా కట్టా నాకు హెల్ప్ చేశారు.
 ....................................

నాతో నేను గడుపుతా!

 షూటింగ్ లేకపోతే లేట్‌గా నిద్ర లేస్తా. ఏ పనీ చేయకుండా,
అలా మ్యూజిక్ వింటూ, టీవీ చూస్తూ ఉంటా. అలా ఏమీ 
చేయకుండా, టీవీ చూడడం కూడా నాకు రిలాక్స్ అవడమే! 
ఎక్కువగా నాతో నేను గడుపుతా.
.............................

 బ్లాక్ అండ్ ఎయిట్!

 నేను పుట్టింది 1994 ఏప్రిల్ 8న. అందుకే, నంబర్ 8 అంటే
 నాకు ఫేవరెట్. నా ట్విట్టర్ ఎకౌంట్ కూడా ‘అఖిల్ అక్కినేని8’ 
అని ఉంటుంది. ఇక, నాకిష్టమైన కలర్ బ్లాక్. ఆ రంగు 
డ్రెస్‌లెక్కువ వేసుకుంటా.
 .................................
 అమ్మాయిల్లో నచ్చేది...
 అఫ్‌కోర్స్... అందం, ఆకర్షణ ఉండాలని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 
అమ్మాయిల్లో నాకు బాగా నచ్చేది - జెన్యూనిటీ. మాటలో,
 మనిషిలో నిజాయతీ ఉంటే... నేను కనెక్ట్ అవుతాను.
 ........................................
 అది... నా గర్ల్‌ఫ్రెండ్!
 అన్నయ్యకు బైక్‌లంటే ఇష్టం. నాకు వాచ్‌లంటే చాలా ఇష్టం. 
మా ఇంట్లో చాలా వాచ్‌లున్నాయి. అదో పెద్ద కలెక్షన్. బ్రాండ్స్ 
పేరు చెప్పను కానీ, నిజం చెప్పాలంటే, (చేతికి ఉన్న 
గడియారాన్ని కదుపుతూ...) మై వాచ్ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్!
 ..............................

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, Family Page, 6th Nov 2015, Friday)
..................................