జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, November 24, 2015

చీకటిలో... చదరంగం..! ('చీకటిరాజ్యం' మూవీ రివ్యూ)


కొత్త సినిమాలు గురూ!

చీకటిలో... చదరంగం..!
చిత్రం:  చీకటి రాజ్యం; తారాగణం: కమలహాసన్, త్రిష, కిశోర్, ప్రకాశ్‌రాజ్,
 ‘మిర్చి’ సంపత్‌రాజ్, యూహి సేతు; స్క్రీన్‌ప్లే: కమలహాసన్; సంగీతం: జిబ్రాన్
 కెమేరా: సానూ జాన్ వర్గీస్; యాక్షన్:  గిల్గెస్ కాంసే యిల్, టి. రమేశ్; 
నిర్మాతలు: ఎస్.చంద్రహాసన్, కమలహాసన్; దర్శకత్వం: రాజేశ్ ఎం. సెల్వా,
 నిడివి: 129 నిమిషాలు

సృజనాత్మకత తక్కువైపోయి సినిమాలన్నీ ఒకే తరహాలో వస్తుంటే..? అది ఎంత 
ఇబ్బందికరంగా ఉంటుందో ఇవాళ ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. మరి,
 సృజనాత్మకత మరీ ఎక్కువైపోతేనో? వెరైటీగా అనిపించినా, అదీ ఇంకో రకమైన
 ఇబ్బందే. కానీ, కొత్త తరహాగా ఆలోచించాలనీ, నలుగురూ వెళుతున్న దోవకు 
భిన్నంగా వెళ్ళాలనీ, కొత్తదనాన్నీ చూపించాలనీ అనుకున్నప్పుడు ఇలాంటి 
ఇబ్బందులు తప్పవు. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకొనే కమలహాసన్ చేసిన 
తాజా ప్రయత్నం - ‘చీకటి రాజ్యం’. చాలాకాలం తరువాత తమిళం
 (‘తూంగావనమ్’)తో పాటు తెలుగులోనూ కమల్ అందించిన స్టైలిష్ క్రైమ్
 థ్రిల్లర్ ఇది. దీపావళికి ఒక రోజు ముందే తమిళ వెర్షన్ అక్కడ విడుదలై, 
విజయవంతంగా ప్రదర్శితమవుతుంటే, సరిగ్గా పది రోజుల తరువాత 
ఇప్పుడీ తెలుగు వెర్షన్ జనం ముందుకొచ్చింది. ఫ్రెంచ్ చిత్రం ‘స్లీప్‌లెస్ నైట్’ 
ఆధారంగా ఈ కథ అల్లుకున్నట్లు కమల్ పేర్కొన్నారు. టైటిల్స్‌లో క్రెడిట్
 కూడా ఇచ్చారు.

సినిమా స్టోరీ ఏమిటంటే... సి.కె. దివాకర్ అలియాస్ సి.కె.డి. (కమలహాసన్) 
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్. డాక్టరైన భార్య విడాకులిచ్చేస్తుంది. 
వాళ్ళబ్బాయి వాసు స్కూల్లో చదువుకొనే పిల్లాడు. ఇద్దరికీ పిల్లాడే ప్రాణం. 
ఊళ్ళో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ జరుగుతుంటే, పది కిలోల కొకైన్ బ్యాగ్‌ను 
దివాకర్, అతని కొలీగ్ మణి (యూహీ సేతు) కొట్టే స్తారు. కొకైన్ దంధా 
నడిపే నైట్‌క్లబ్ ఓనర్ విఠల్‌రావు (ప్రకాశ్‌రాజ్) విషయం తెలిసి, పిల్లాణ్ణి 
కిడ్నాప్ చేయిస్తాడు. కొకైన్ బ్యాగ్ ఇస్తేనే, పిల్లాణ్ణి అప్పగిస్తానని బేరం 
పెడతాడు. బాబు కోసం ఆ బ్యాగ్ ఇచ్చేయ డానికి దివాకర్ సిద్ధపడతాడు. 
ఆ బ్యాగ్ తీసుకొని క్లబ్‌కు వెళ్ళి, టాయి లెట్‌లో దాచిపెడతాడు. నార్కోటిక్స్ 
బ్యూరోలోనే మరో పోలీసైన మల్లిక (త్రిష) అనుకోకుండా దివాకర్‌ను 
వెంబడించి, బ్యాగ్ సంగతి చూస్తుంది. తీసి మరోచోట దాస్తుంది. 
తీరా పిల్లాణ్ణి కాపాడుకొందామని ప్రయత్నిం చిన దివాకర్‌కు 
దాచినచోట బ్యాగ్ కనిపించదు. ఒకపక్క విఠల్‌రావు, అతని
 బిజినెస్ పార్‌‌టనర్ (‘మిర్చి’ సంపత్), అనుచరులు, మరోపక్క 
ఆఫీసర్లు మల్లిక, మోహన్ (కిశోర్) వెంటాడుతుంటే, బిడ్డను 
కాపాడు కోవడానికి అతను తంటాలు పడుతుంటాడు. ఆ రాత్రి
 పోలీస్ డిపార్‌‌ట మెంట్‌తో సహా, నేరసామ్రాజ్యంలోని చీకటి 
కోణాలెన్నో బయటపడ తాయి. అవేమిటి? దివాకర్ కన్నబిడ్డను 
కాపాడుకోగలిగాడా? అవన్నీ తెరపై చూడాల్సిన విషయాలు.

పాయింట్ చిన్నదైనా, ప్రధానంగా కథనశైలి మీద ఆధారపడి తీసిన
 క్రైవ్‌ు యాక్షన్ థ్రిల్లర్ ఇది. అందుకు తగ్గట్లే నేపథ్య సంగీతం, యాక్షన్
 అంశాలే కీలకమయ్యాయి. భార్య నుంచి విడాకులు తీసుకొని, కొడుకే 
ప్రాణంగా బతుకుతున్న తండ్రి పాత్రలోని బాధను కమల్ బాగా చూపించారు. 
యాక్షన్ సన్నివేశాల్నీ రియలిస్టిక్‌గా పండిం చారు. అలాగే, పోలీస్ 
ఆఫీసర్లుగా త్రిష, కిశోర్, గ్యాంగ్‌స్టర్లుగా ప్రకాశ్‌రాజ్, సంపత్ అందరూ
 సీనియర్లే. పాత్రల్ని సమర్థంగానే పోషించినవారే.

కాకపోతే, కమల్ పోషించిన పాత్రను మొదటి నుంచి కొంత నెగిటివ్ షేడ్ 
ఉన్నదిగా చూపెడుతూ వస్తారు. సెకండాఫ్ సగంలోకి వచ్చే సరికి ఆ 
పాత్ర అసలు స్వరూపం ఏమిటో, ఎందుకలా ప్రవర్తిస్తోందో తెలియజేస్తారు. 
అదీ వట్టి డైలాగులతో. దాంతో, ఆ పాత్ర ఒక్కసారి డార్క్ షేడ్ నుంచి 
బ్రైట్ షేడ్ వైపు గెంతినట్లనిపిస్తుంది.

సినిమా దాదాపు నైట్ క్లబ్‌లోనే జరుగుతుంది. దాంతో, సీన్లన్నీ డ్యాన్స్ ఫ్లోర్,
 కిచెన్, టాయిలెట్స్‌లోనే తిరుగుతుంటాయి. ఒక విభిన్న తరహా ప్రయత్నంగా,
 బడ్జెట్ కలిసొచ్చే అంశంగా దాన్ని సర్దిచెప్పుకోవచ్చు కానీ, పూర్తిస్థాయి
 కమర్షియల్ సినిమాను ఆ పరిధిలోనే సరిపెట్టుకోవడం ఆడియన్‌‌సకు 
ఇబ్బందే. సినిమా చివరలో రోలింగ్ టైటిల్స్ వస్తుంటే, యూనిట్ మొత్తం
 నర్తించిన ప్రమోషనల్ వీడియో తరహా సాంగ్, సాహిత్యం, 
ఆర్కెస్ట్రయిజేషన్ బాగు న్నాయి. ఆ పాటలో కమల్ ఎనర్జీ చూస్తే 
ముచ్చటేస్తుంది.

 వెరసి కొన్ని సినిమాలు కథను బట్టి చూస్తాం. మరికొన్ని దర్శకుణ్ణి బట్టో,
 హీరోను బట్టో చూస్తాం. కానీ, ఒక నటుణ్ణి బట్టి, అతని అభినయం మీద
 ప్రేమ కొద్దీ చూసే సినిమాలు ఇవాళ తక్కువ. యాభై ఏళ్ళ పైగా కెరీర్
 తరువాత కూడా అలాంటి నటుడిగా కమల్ అలా ఆసక్తికరంగా ఆయన
 సినిమాలూ ఉండడం విశేషమే. ఆ ఆసక్తి ‘చీకటి రాజ్యం’ లోకి ప్రేక్షకుల్ని
 తెస్తుంది. కానీ, కమల్ కెరీర్‌లో కొన్నాళ్ళుగా పేరుకున్న బాక్సాఫీస్
 చీకటిని తొలగిస్తుందా అన్నది కొన్ని కోట్ల రూపాయల ప్రశ్న.

...................................................
- కమల్ శిష్యుడే దర్శకుడు రాజేశ్. దర్శకుడిగా అతనికి ఇదే తొలి చిత్రం.
- రామజోగయ్యశాస్త్రితో డైలాగ్‌‌స రాయించాలని కమల్ భావించారట. 
- మణి పాత్రకు తెలుగులో రచయిత అబ్బూరి రవి డబ్బింగ్ చెప్పారు. 
- ఉన్న ఒకే ఒక్క పాట కమలే పాడారు.  
- ఫారిన్ యాక్షన్ మాస్టర్ గిల్గెస్ కాంసే యిల్ కొన్ని ఫైట్స్ కంపోజ్ చేశారు.
.......................................

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 21st Nov 2015, Saturday, Family page)
....................................

0 వ్యాఖ్యలు: