జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, November 22, 2016

నివాళి ----- దర్శకుడు త్రిలోకచందర్!

ఎన్టీయార్, ఎమ్జీయార్, శివాజీ గణేశన్, సూపర్‌స్టార్ కృష్ణ, రజనీకాంత్‌లతో పని చేసిన నిన్నటి తరం దర్శకుడు డాక్టర్ ఎ.సి. త్రిలోకచందర్ ఇక లేరు. ఆరు దశాబ్దాలుగా సినీ రంగంతో అనుబంధమున్న ఆయన బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని వెల్లూరు జిల్లా ఆర్కాట్ ప్రాంతానికి చెందిన త్రిలోకచందర్ పూర్తి పేరు - ఎ. చెంగల్వరాయ ముదలియార్ త్రిలోకచందర్. తమిళ, తెలుగు, హిందీల్లో 65 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

ఎ.వి.ఎం.తో అనుబంధం!
త్రిలోకచందర్ పేరు చెప్పగానే ఎన్టీయార్ ‘రాము’, ‘నాదీ ఆడజన్మే’, హీరో కృష్ణ ‘అవే కళ్ళు’ సహా పలు హిట్స్ గుర్తొస్తాయి. విద్యావంతులు సినిమాల్లోకి రావడమనే ధోరణికి తొలి ఆనవాళ్ళలో ఒకరు - త్రిలోకచందర్. ఆ రోజుల్లో ఎకనామిక్స్‌లో ఎం.ఏ చేసి, సివిల్ సర్వీస్ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతూ, సినిమాల్లోకొచ్చారు.

షేక్స్‌పియర్ లాంటి ప్రసిద్ధుల రచనల తమిళ అనువాదాలు తల్లి ద్వారా చిన్న నాటే పరిచయమయ్యాయి. దాంతో ఊహాశక్తి, సృజనాత్మకత పెరిగాయి. మిత్రుడైన నటుడు ఎస్.ఎ. అశోకన్ ద్వారా ఏ.వి.ఎం. అధినేత ఏ.వి. మెయ్యప్ప చెట్టియార్ కుమారుడు ఎం. శరవణన్‌తో జరిగిన పరిచయంతో త్రిలోక్ ప్రస్థానం మారిపోయింది. ఏ.వి.ఎం. కుటుంబంలో అందరితో ఆయనకు చివరి దాకా సాన్నిహిత్యం.  

తెలుగులో... ఇళయరాజా పరిచయకర్త!
దక్షిణాది సినీరంగంలో తొలితరం మార్గదర్శకులైన ఆర్. పద్మనాభన్, కె. రామనాథ్ లాంటి వారితో కలసి పనిచేసిన అరుదైన అనుభవం త్రిలోకచందర్‌ది. మొదట్లో ‘ఎ.సి.టి. చందర్’ అనే పేరుతో కథ, స్క్రీన్‌ప్లే రచయితగా, ఆ పైన సహాయ దర్శకుడిగా ఆయన ప్రస్థానం సాగింది. ఎ.వి.ఎం ‘వీర తిరుమగన్’ (1962)తో దర్శకులయ్యారు. ‘మాయాబజార్’లో చిన్ననాటి శశిరేఖ పాత్ర దారిణి సచ్చుకి నాయికగా ఇదే తొలి చిత్రం. తమిళ నటుడు శివకుమార్ (హీరో సూర్య తండ్రి)ని ‘కాక్కుమ్ కరంగళ్’ ద్వారా పరిచయం చేసిందీ త్రిలోకే! ‘భద్రకాళి’(’77) ద్వారా మ్యూజిక్ డెరైక్టర్ ఇళయరాజాకు తెలుగు తెరంగేట్రం చేసిందీ ఆయనే.

అటు శివాజీ... ఇటు ఎమ్జీయార్...
తమిళ రంగంలో రెండు భిన్న ధ్రువాలైన అగ్రనటులు శివాజీ గణేశన్, ఎమ్జీయార్‌లు - ఇద్దరితో పనిచేసిన ఘనత త్రిలోకచందర్‌ది. శివాజీతో 25 సినిమాలు రూపొందించారు. ఎ.వి.ఎం. సంస్థ ఎమ్జీయార్‌తో తీసిన ఒకే చిత్రం ‘అన్బే వా’కు త్రిలోకే దర్శకుడు.  

సాహిత్య ప్రభావంతో... ‘అవే కళ్ళు’!
బ్రిటీషు రచయిత సర్ ఆర్థర్ కానన్ డాయల్ సృష్టించిన ప్రైవేట్ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ అపరాధ పరిశోధనల తమిళ అనువాదాల్ని ఇష్టంగా విన్న, చదివిన అనుభవం త్రిలోకచందర్‌ది. చిన్నప్పటి ఆ డిటెక్టివ్ సాహిత్యపు పోకడల వల్లే ఆయన తెలుగులో కృష్ణ, కాంచన నటించిన ‘అవే కళ్ళు’(’67) కథ సొంతంగా రాసుకొన్నట్లు కనిపిస్తుంది. అపరాధ పరిశోధన చిత్రాల్లో ఇవాళ్టికీ ‘అవే కళ్ళు’ ప్రత్యేకంగా నిలిచిందంటే అందుకు త్రిలోక్ ప్రతిభే కారణం.

ఎల్వీ ప్రసాద్‌కు ఏకలవ్య శిష్యుడు!
ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ‘ఆస్కార్’ అవార్డులకు మన దేశం పక్షాన ఎంట్రీగా వెళ్ళిన తొలి దక్షిణ భారత సినిమా ‘దైవ మగన్’ కూడా త్రిలోకచందర్ దర్శకత్వం వహించినదే! తెలుగు దర్శక - నిర్మాత ఎల్.వి. ప్రసాద్‌కి ఏకలవ్య శిష్యుడినని చెప్పుకొ న్నారు. కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం - ఈ విభాగాల్ని బలంగా నమ్మిన త్రిలోక్ 5సార్లు ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డులు, తమిళనాడు ప్రభుత్వ ‘కలైమామణి’ బిరుదు అందుకున్నారు.

అనుభవాలే ఉపాధ్యాయులన్న సూత్రాన్ని నమ్మిన ఆయన ఎవరి జీవితం నుంచి వారు పాఠాలు నేర్చుకోవాల్సిందే అనేవారు. కానీ, స్వీయానుభవాలు ఎన్ని ఉన్నా, సాహిత్యంతో అనుబంధం త్రిలోక్‌ను దర్శకుడిగా ప్రత్యేకంగా నిలిపిందన్నది నేటి సినీ తరం తెలుసుకోవాల్సిన పాఠం! 

- రెంటాల

(Published in Sakshi daily, 16th June 2016)
................................

Monday, October 31, 2016

షష్టి స్ఫూర్తి (చిన్న జీయర్ స్వామీజీతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ)

త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ (చిన్న జీయర్ స్వామీజీ)తో  

 సాక్షి ఫ్యామిలీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ 

భగవద్ రామానుజస్వామి...  వారిది మిలీనియమ్ మార్చ్!
దళితులను గుడిలోకి తీసుకువెళ్ళారు! 
అతి శక్తిమంతమైన నారాయణ మంత్రం దాచుకోకుండా పంచిపెట్టారు!

పెద్ద జీయర్‌స్వామి... వీరిది ఫ్రీడమ్ మార్చ్!
తన భూమినంతా దానం చేసి, స్వరాజ్యం కోసం పోరాడారు... 
నిరతాగ్నిహోత్రంతో... దేశమంతటా... 108 శ్రీరామక్రతువులు చేశారు. 
భక్తులతో రామకోటి రాయించి, సమతా స్తూపాలను ప్రతిష్ఠించారు. 
మహానుభావులు... ధర్మం కోసం కృషి చేశారు.

చిన్న జీయర్ స్వామి... వీరిది ప్రోగ్రెసివ్ మార్చ్!
వేదానికి అధ్యయన జ్యోతి... అంధులకు అక్షర కాంతి... గిరిజనులకు విద్యాక్రాంతి.
భగవద్ రామానుజ, పెద్ద జీయర్ స్వాముల పరంపరకు జెండాపై కపిరాజు
మనకు తెలిసిన స్వామి... మనలో ఒకడైన స్వామి... 
కళ్ళతో పలకరిస్తారు... చిరునవ్వుతో సాంత్వన కలిగిస్తారు.
ఊరి పెరటిలో... తులసి మొక్క...
సమాజంలోని సర్వరోగాలకూ నివారిణి!
వీరికి 60 ఏళ్ళు...
వీరి పరంపరకు వెయ్యేళ్ళు...
వీరి స్ఫూర్తి... పదికాలాలు విరాజిల్లు!!   
 .......................................................

నమస్కారం స్వామీజీ! మీకు 60 వత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా తిరునక్షత్ర మహోత్సవం చేస్తామని భక్తులు ప్రతిపాదన తెచ్చినప్పుడు ఏమనిపించింది? 
(సాలోచనగా ఆగి... దేహం వంక చూపిస్తూ) 60 ఏళ్ళనేది ఈ శరీరానికి గడిచాయని అంటున్నారు. నిజానికి, సన్న్యాసికి శారీరకమైన జన్మ, వయస్సు ఉండవు. సన్న్యాసం స్వీకరించినప్పటి నుంచి మరుజన్మ కిందే లెక్క. అయితే, భక్తులు ప్రేమగా చేసుకుంటామని అన్నప్పుడు కాదనడానికి మనమెవరం! అయితే ఏదైనా ఘనకార్యం సాధిస్తే, అప్పుడు ఆ ఘనకార్యానికి ఉత్సవం చేసుకోవచ్చు. అలాంటివి ఏం చేశామని!
గడచిన 36 ఏళ్ళ పైచిలుకు సన్న్యాసాశ్రమ ప్రస్థానంలో అంధులకు విద్యాలయాలు, వేద పాఠశాలలు, ఆసుపత్రులు, గిరిజన విద్యాలయాల లాంటివెన్నో ఏర్పాటు చేశారు కదా!
(చిరు దరహాసంతో...) అవును. కానీ, సమాజానికి చేయాల్సినది ఇంకా ఎంతో ఉంది!

విదేశాలకు వెళ్ళి, వేదధర్మాన్ని ప్రచారం చేసిన తొలి జీయర్ కూడా మీరే! విదేశాలకు వెళ్ళడమే తప్పు అనుకొనే సంప్రదాయంలో అంతటి సాహసం ఎలా చేశారు? 
విదేశాల్లో భారతీయ ధర్మ ప్రచారానికి వెళ్ళడం వెనుక ఒక దైవికమైన ఘటన ఉంది. 1992లో, 1993లో కూడా ధర్మప్రచారానికి నన్ను విదేశాలకు రమ్మని అడిగారు. కానీ, మేము రామని చెప్పాము. 1993లో ఒక సన్నివేశం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఏడాది దీపావళి వేడుక తరువాత అర్ధరాత్రి విజయవాడ దగ్గర సీతానగరంలోని మా ఆశ్రమం నుంచి మేము ఆరాధించే కోదండ రామస్వామి విగ్రహాలు చోరీ అయ్యాయి. మూడు రోజుల పాటు ఆశ్రమంలో నిద్రాహారాలు లేవు. ఆ రాత్రి అక్కడ బీట్‌లో ఉన్న కోటేశ్వరరావు అనే ఎస్.ఐ. ఇదంతా చూసి, ‘దేవుడి విగ్రహాలు దొరికే వరకు కట్టుకున్న దుస్తులు కూడా మార్చను’ అని దీక్ష పట్టారు. నాలుగో రోజున దొంగల్ని పట్టుకున్నారు. విగ్రహాలు సాధించారు.

మాకు ఆ సమాచారమిచ్చారు. అయిదో రోజున విగ్రహాలు రావడంతో, వెయ్యి కలశాలతో మా స్వామికి అభిషేకం చేసి, ఆరాధించాం. అప్పటి నుంచి ప్రతి ఏటా దానికి గుర్తుగా మా ఆరాధ్యదైవమైన కోదండరామ స్వామికి ‘సహస్ర కలశాభిషేకం’ చేస్తున్నాం. ఇవాళ్టికీ కోటేశ్వరరావు గారు ఎక్కడున్నా, ఆ రోజున ఆ కార్యక్రమానికి వస్తారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నతాధికారి. ఆయన వచ్చాక, ఆయన చేతులకు తాకించి కానీ, ఆ అభిషేక కార్యక్రమం మొదలుపెట్టం. ఈ విగ్రహాల చోరీ వ్యవహారం జరిగాక, సాక్షాత్తూ స్వామే ఎలాగూ బయటకు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు, మనమే స్వయంగా తీసుకొని ఎందుకు వెళ్ళకూడదని అనిపించింది. అది స్వామి ఆదేశంగా భావించి, అప్పటి నుంచి ధర్మప్రచారం కోసం విదేశాలకు వెళ్ళి వస్తున్నాం.

సంపన్న అమెరికా నుంచి, వర్ధమాన భారతం దాకా ప్రపంచమంతా తిరిగారు కదా! అన్నిచోట్లా సమస్యలే! అన్నిచోట్లా అశాంతే! కారణం ఏమిటంటారు?
ఇవాళ శాంతి లేకపోవడానికి ప్రధాన కారణాలు... ఒకటి- ఉగ్రవాదం, రెండు - ఆర్థిక అసమానతలు. రెండూ అశాంతికి దారి తీస్తున్నాయి. ఆర్థిక అసమానతలు తొలగించాలంటే, వ్యక్తుల్లో విద్యను పెంచాలి. దిగువ వర్గాల వారు కూడా ఉన్నత వర్గాల వారితో పోటీపడేలా, వారిలో నైపుణ్యం పెంచాలి. అవకాశాలు కల్పించాలి. ఇక, ఉగ్రవాదాన్ని తగ్గించడానికి శాసనాలు, ప్రేమతత్త్వం రెండే మార్గాలు. చాలాదేశాల్లో కఠిన శాసనాలున్నాయి. కానీ, మన దేశంలో ఉన్న శాసనాల్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి. అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని సరిదిద్దాలి. మరోపక్క వ్యక్తిలో తోటివారి పట్ల ప్రేమను పెంచాలి. మనమంతా సహోదరులమనే భావన కలిగించాలి. అలాంటి భావన ఇవ్వగలిగింది మన వైదిక వాఙ్మయం. ఇతర మతాల్లో, వారి గ్రంథాల్లో కూడా ఆ భావన ఉంది. కానీ వాటిని బోధించడంలో, ఆచరించడంలో వస్తున్న తప్పులు, తేడాల వల్ల కొన్నిసార్లు ఉపద్రవం సంభవిస్తోంది.

కానీ, హిందూ ధర్మంలోనూ రకరకాల శాఖలు, రూపాలు ఉన్నాయిగా!? 
మన ‘భగవద్గీత’ మొదలైన గ్రంథాలేవీ, ‘దైవాన్ని ఇలానే నమ్మాలి, ఇలానే పూజించాలి’ అని కట్టడి చేయడం లేదు. పరస్పర విద్వేషం చెప్పడం లేదు. భగవద్గీతలోనే పరమాత్మ ‘యాన్తి దేవవ్రతో దేవాన్...’ అని చెప్పాడు. ‘నన్ను ఏ రూపంలో ఆరాధిస్తే, ఆ రూపంలో కనిపిస్తాను’ అన్నాడు. కాబట్టి ఎన్ని రూపాలు, ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నా దేవుడు ఒక్కడే! ఎవడు ఏ విధానంలో ఆరాధన చేసినా, ఫలితం పొంది తీరతాడు. మతమార్పిడి తప్పు. అందుకే, మేము ‘స్వీయ ఆరాధన... సర్వ ఆదరణ’ అని మేము చెబుతాం. వివరంగా చెప్పాలంటే, ‘నీ మతాన్ని నువ్వు ఆరాధించు. నీది కానిదేదో దాన్ని గౌరవించు, ఆదరించు!’ మన భారతదేశానికి ఇదే జీవనాడి.

మన రాజ్యాంగం కూడా మత స్వేచ్ఛనిచ్చింది కదా! 
మతస్వేచ్ఛ నిచ్చింది. పరస్పరం గౌరవాదరాలతో బతకాలనే చెప్పింది. కానీ, అమలుపరచడం దగ్గరకొచ్చే సరికే సమస్యలు. కొన్ని వేల ఏళ్ళుగా మన పక్కనే ఏ ఆలయం ఉన్నా, మసీదు ఉన్నా, చర్చి ఉన్నా, గౌరవించి, ఆదరించిన సంస్కృతి మనది. కానీ, ఇప్పుడు కొందరు తమ మతగ్రంథాల సారాన్ని తప్పుగా బోధించడం వల్ల ఉగ్రవాదం పెచ్చరిల్లుతోంది. ఈ దేశపు రాజ్యాంగాన్ని గౌరవించం కానీ, ఈ పౌరసత్వం, ఇక్కడి హక్కులు అన్నీ కావాలంటే ఎలా? మనం ముందు భారతీయులం... ఆ తరువాతే ఏమైనా!

ప్రపంచంలోని ఈ సమకాలీన విషయాలు మీకెలా తెలుస్తుంటాయి?  
ఇవాళ ఇంటర్నెట్ వచ్చింది. అవి చూసే భక్తులున్నారు. చెబుతుంటారు.

మీరు కూడా టెక్నాలజీనీ, ల్యాప్‌టాప్ లాంటివి బాగా వాడతారట? 
(నవ్వుతూ... తల పంకించారు...)

సైన్సు, మతం పరస్పర భిన్నమైనవనే వాదన గురించి ఏమంటారు? 
నిరూపణ జరిగిన సిద్ధాంతాలన్నీ సైన్స్ అయితే, నిరూపణ కానివి ఫిలాసఫీ అని అని కదా ప్రసిద్ధి (నవ్వులు...).అయితే, సైన్స్‌కు అందని నిజాలు చాలానే ఉన్నాయి.

సైన్స్‌లో డార్విన్ పరిణామ సిద్ధాంతం లాంటివి మీరు ఒప్పుకోరని విన్నాం! 
పరిణామం అనేది అనివార్యం. కానీ, (నవ్వుతూ...) వాళ్ళు చెప్పే పద్ధతిలో పరిణామ సిద్ధాంతాన్ని మేము అంగీకరించం. చూడండి. మనం గింజ వేస్తే దాని నుంచి ఆకులు, కొమ్మలు, పువ్వులు, పండ్లతో చెట్టు వస్తోంది. అది పరిణామం. కానీ, ఆ గింజలో లేని ఆకు, వేరు, పువ్వు, పండు రావడం లేదు కదా! ఆ గింజలోనే అవన్నీ సూక్ష్మరూపంలో ఉన్నాయి. పరిణామంలో అవి పైకి కనిపించాయి. అంతే! సూక్ష్మరూపంలో లేనిది స్థూలరూపంలోకి రాదు. 

మీరు ఒకప్పుడు దైవాన్ని కూడా ఒప్పుకొనేవారు కాదట! మరి, అటు నుంచి ఇటు వైపు ప్రయాణం...
(నవ్వేస్తూ...) చిన్నప్పుడు అవకాశమున్న పుస్తకమల్లా చదివేవాళ్ళం. ‘ఆంధ్రప్రభ’, ‘ఆంధ్రపత్రిక’ లాంటి వాటిల్లో వచ్చే సీరియల్స్ కాగితాలు చించి, కుట్టుకొని, బైండ్ చేయించుకొని సేకరించిపెట్టేవాళ్ళం. అలా చాలా కథలు చదివాం. ‘ఎ టేల్ ఆఫ్ టు సిటీస్’ లాంటి అనువాద సాహిత్యం చాలా చదివాం. అలా చదివిన సాహిత్యంతో లోలోపల అనేక ప్రశ్నలు వస్తుండేవి. వాటికి సమాధానాల కోసం అన్వేషిస్తుండేవాళ్ళం. అవన్నీ మా పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారి దగ్గరకు వచ్చాక, తీరాయి. తెనాలి దగ్గర నడిగడ్డపాలెంలో గురువులు గోపాలాచార్యుల వద్ద మాకు వేదాంత గ్రంథాల బోధన జరిగింది. గోపాలాచార్యులు, మా పెద్ద స్వామి వారు సహాధ్యాయులు. కలసి వేదాంత ప్రచారం చేశారు. స్వామి వారు ఊరూరా తిరుగుతూ క్రతువులు చేస్తుంటే, గోపాలాచార్యుల వారు నడిగడ్డపాలెంలోని ఆశ్రమంలో ఉంటూ, అందరికీ వేదాంత శిక్షణనిచ్చేవారు. మేమూ అక్కడ కొన్నాళ్ళు ఉండి, అవి అధ్యయనం చేశాం. అలా పూర్తిగా ఇటువైపు వచ్చాం.

స్వామీజీ! ఒకప్పుడు మీలో మార్క్సిస్టు భావాలుండేవనీ, ఆ పుస్తకాలు చదివేవారనీ...
(మళ్ళీ నవ్వేస్తూ...) అవన్నీ ఒకప్పటి సంగతులు.

ఇప్పటికీ సమాజసేవ, దిగువ వర్గాల అభ్యున్నతి లాంటి విషయాల్లో మీది వామపక్ష భావజాలమేనేమో...
(నవ్వులు...) సమాజం మన శరీరం లాంటిది. ఇందులో ఏ అంగం ఎక్కువ, ఏది తక్కువ అంటే ఏం చెబుతాం! సమాజంలో అన్ని వర్గాలూ ఒకదానికొకటి సహకరించుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా ఒకరు, మరొకరిని అణచివేస్తానంటే ఎలా? అదే సమయంలో అందరూ పనిచేయాలి. చేసేవాడు చేస్తూ ఉంటే, తిని కూర్చొనేవాడు కూర్చుంటానంటే కుదరదు. పనిచేయడానికి బద్ధకించేవాణ్ణి పనిచేసేవాడిగా మార్చాలి. అందుకని ప్రతి ఒక్కరిలో నైపుణ్యం పెంపొందింపజేయాలి. ఉన్నత వర్గాలతో పోటీ పడేలా దిగువ వర్గాలకీ అవకాశం కల్పించాలి. వారిని తీర్చిదిద్దాలి. దీన్ని కేవలం వామపక్షం, వామభావజాలం అంటే ఎలా? నిజానికి, ఇది ప్రతి ఒక్క వ్యక్తి కర్తవ్యం అంటాను. అయితే, అదే సమయంలో - నైపుణ్యం లేకపోయినా 20 మార్కులతో పాస్ అయిన వ్యక్తిని విమానానికి పైలట్‌గానో, అల్లోపతి డాక్టర్‌గానో పెడితే... వాట్ హ్యాపెన్స్ టు ది క్వాలిటీ ఆఫ్ దిస్ కంట్రీమొత్తం సమాజమే నష్టపోతుంది. అసమర్థుడైన వ్యక్తిని ఆపరేషన్‌కి డాక్టర్‌గా పంపిస్తే ఏమవుతుందో ఊహించుకోండి!

అన్నట్లు... మీరు కూడా మంచి వైద్యులట! మంచి మందులిస్తారట!
(నవ్వేస్తూ...) హోమియో వైద్యం నేర్చుకుంటున్నా. మందులు ఇస్తుంటా.

మీ తాత గారు, తండ్రి గారిలా వైద్యవిద్య వంశపారంపర్యంగా వచ్చినట్లుందే!
పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారు ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు. ఇక మాకు జన్మనిచ్చిన తండ్రి గారు ఆ రోజుల్లోనే చెన్నైలో చదువుకొన్న ఎల్.ఐ.ఎం (లెసైన్స్‌డ్ ఇండియన్ మెడిసిన్) డాక్టర్. ఇద్దరూ వైద్యంలో దిట్టలే! కానీ, ఇవాళ మనం డాలర్ల జబ్బును రూపాయలిచ్చి కొనుక్కుంటున్నాం. ప్రతిదీ ఖరీదై, అల్లోపతి వైద్యం సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో అది మాత్రమే పద్ధతి కాదు, ఇంకో పద్ధతి ఉందంటూ వచ్చిన హోమియోపతి మంచి ప్రత్యామ్నాయం. సామాన్య ప్రజలు ఎక్కువగా ఉండే మన దేశ పరిస్థితికి శ్రమ, ఖర్చు తక్కువైన ఈ వైద్యవిధానం బాగా సరిపోతుంది. రోగి లక్షణాలు సరిగ్గా తెలుసుకొని ఔషధమిచ్చే మంచి వైద్యుడుంటే మందు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, దీన్ని కూడా వ్యాపారంగా మారుస్తున్నవారు లేకపోలేదు. అందుకనే, అందరికీ ఈ వైద్యం అందుబాటులోకి రావాలని ‘ఇంటిగ్రేటివ్ సిస్టమ్’లో మా శంషాబాద్ ఆశ్రమంలో ‘జిమ్స్’ హోమియో కాలేజ్, ఆసుపత్రి నడుపుతున్నాం.

అంటే, ఇటు ప్రజల శారీరక ఆరోగ్యం, అటు ఆధ్యాత్మికతతో మానసిక ఆరోగ్యం రెండూ మీరు చూస్తున్నారన్న మాట! 
(నవ్వుతూ...) అంతే అనుకోవచ్చు!

కానీ, సన్న్యాసంలో ఉంటూ సామాజిక సంస్కరణ, సముద్ధరణ చేయడమెలా వచ్చింది?
వెయ్యేళ్ళ క్రితం రామానుజాచార్యులూ ఇదే చేశారు. ఆయన కేవలం ఆధ్యాత్మిక నాయకులే కాదు. ఆ రోజుల్లోనే అందరి మోక్షం కోసం గోపురమెక్కి, ‘తిరుమంత్రం’ ఎలుగెత్తి చాటిన సామాజిక సంస్కర్త. ఆయన స్ఫూర్తితో వచ్చిన మా పెద్ద స్వామి వారైతే స్వాతంత్య్ర సమరయోధులు. దేశం కోసం పోరాడారు. ఆ రోజుల్లోనే ప్రజల బాగు కోసం గ్రామాలు పట్టుకు తిరిగారు. సొంత భూములు హరిజనులకిచ్చి, వారి ఉద్ధరణకు కృషి చేశారు. స్త్రీలు ఘోషాలో ఉండే ఆ రోజుల్లోనే భార్యకు రాట్నం మీద నూలు వడకడం నేర్పించి, ఆ నూలు దుస్తులు భుజాన వేసుకొని, ఊరూరా పంపిణీ చేసేవారు. దుర్భిక్ష సమయంలో పొలాల్లో తిరిగి, ఎకరానికి ఒక కట్ట చొప్పున గ్రాసం తీసుకొని, పశువులకు మేత పెట్టేవారు. సన్న్యాసాశ్రమం స్వీకరించాక కూడా ఆయన సామాజిక ఉద్ధరణ మార్గంలోనే వెళ్ళారు. మాది కూడా ఆ బాటే!

ఇన్నేళ్ళ ఈ బాటలో... ఈ షష్ట్యబ్ది పూర్తివేళ మీరు స్మరించుకోవాల్సిన వ్యక్తులంటే..?
(ఆసనంలో ఒక్కసారి వెనక్కి వాలి... దీర్ఘంగా శ్వాస విడుస్తూ...) చాలామంది ఉన్నారు. జన్మనిచ్చిన తల్లితండ్రులు, గురువులు, మా పెద్ద స్వామి వారు, మేము ఈ స్థితికి చేరడానికి కారణమైన వ్యక్తులు, ఈ ప్రయాణంలో పరిచయమైన వ్యక్తులు, తీర్చిదిద్దిన వ్యక్తులు, కలసి ప్రయాణించిన, ప్రయాణిస్తున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. రాజమహేంద్రిలో స్కూలులో చదువుకుంటున్నప్పుడు ‘నారాయణా! నువ్వు తెలివిగలవాడివి. నీకు పాతికకి పాతిక మార్కులు వేస్తే, కొమ్ములొస్తాయిరా’ అంటూ, అంతా సరిగ్గా రాసినా లెక్కల్లో కూడా ఇరవై అయిదుకి ఇరవై నాలుగున్నర మార్కులే వేసిన మా మాస్టారిని స్మరించుకోవాలి. ‘ప్రపంచం గురించి చెప్పి, ఇలా ఉండాలి సుమా’ అని చెప్పిన మార్క్సిస్టు మిత్రులున్నారు. చిన్నప్పటి నుంచి మాలో ఒక క్రమశిక్షణ నేర్పిన రామచంద్ర అనే ఆర్.ఎస్.ఎస్. కుర్రాడు ఉన్నాడు. పొట్టకూటి కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడు జీవితమంటే ఎలా ఉంటుందో నాకు నేర్పిన అనుభవాలున్నాయి. ఇలా ఎందరో, ఎన్నెన్నో!

ఆ పూర్వాశ్రమ జీవితంలో ఎదురైన అనుభవాల వివరాలు ఏమైనా...!
అప్పట్లో మేము సికింద్రాబాద్‌లో క్యారవాన్ దగ్గర ఉండేవాళ్ళం. కోఠీ వైపు వెళ్ళాలి.  పురానాపూల్, అఫ్జల్‌గంజ్, ఘోషామహల్ పక్క నుంచి వెళుతుండేవాళ్ళం. పైసా.. పైసాకి కష్టపడుతూ, కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్ళిన రోజులు గుర్తే! ఒకసారి కష్టపడి ఒక సైకిల్ కొనుక్కున్నాం. కానీ, కొన్న మూడో రోజునే దాన్ని ఎవరో పట్టుకుపోయారు. అదంతా జీవితంలో ఒక దశ. సామాన్య ప్రజల కష్టాలన్నీ స్వయంగా చూశాం, అనుభవించాం.

మరి, ఆధ్యాత్మిక విద్యకు ముందు అప్పట్లో మీరు చదివిన లౌకికమైన చదువులు...
ఆ రోజుల్లో ఆంధ్రా యూనివర్సిటీ మెట్రిక్యులేషన్ చదివాం. ఆ తర్వాత పై చదువుల కోసం ప్రయత్నించినా, ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వచ్చేది. పరీక్షలకు హాజరు కాలేకపోయాం. టైప్, షార్ట్‌హ్యాండ్‌ల్లో హయ్యర్ పాసయ్యాం. మా పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారి దగ్గరకు చేరినప్పుడు ‘ఆలయాల జీర్ణోద్ధరణ కమిటీ’ తరఫున మేము అన్ని రకాల క్లరికల్ జాబ్స్ చేసేవాళ్ళం. లెక్కలు, స్టేట్‌మెంట్స్ తయారుచేసేవాళ్ళం. స్వామి వారి దగ్గరకు వచ్చాక అంతకు ముందు మాకున్న అనేక సందేహాలు తీరాయి. మళ్ళీ మా మనసు మారకుండా ఉండడం కోసం మా సర్టిఫికెట్‌లన్నీ మేమే చింపేశాం.

మీరు అమెరికన్ యాసలో మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. రష్యన్ కూడా నేర్చుకున్నారట!
(నవ్వుతూ...) పూర్వాశ్రమంలో హైదరాబాద్‌లోనే ‘సీఫెల్’ (ఇప్పటి ‘ఇఫ్లూ’)లో సరదా కోసం చదివాం.

కానీ, ఆశ్రమజీవితంలోకి వచ్చినప్పుడు ఆ కఠోర దీక్ష, క్లిష్టమైన వేదాంత విద్య ఎలా అలవడ్డాయి?
ఒక రకంగా నన్ను మా పెద్ద స్వామి వారి పాదాల దగ్గరకు చేర్చింది మా తల్లి గారే! ‘నీకు ఏది మంచిదో వారు నిర్ణయిస్తారు’ అన్న ఆమె మాట! భగవత్ కృప వల్ల చిన్నప్పటి నుంచి అనుకున్నది ఎలాగైనా పూర్తి చెయ్యాలనే మనస్తత్త్వం, పట్టుదల అలవడ్డాయి. అప్పట్లో ఒకసారి పెద్ద స్వామి వారి క్రతువు కోసం కొన్ని మూర్తులు అవసరమయ్యాయి. కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్ళి, అందించి వచ్చే పని నాకు అప్పగించారు. తీరా నేను బయల్దేరితే రైలు మిస్సయింది. బస్సు మిస్సయింది. కానీ, ఆయనకు అవి ఇచ్చే రావాలి తప్ప, ఇంటికి వెనక్కి రాకూడదనే పట్టుదల నాది. అప్పటికి ఈ తరం పిల్లల్లాంటి లోకజ్ఞానం కూడా లేని పల్లెటూరి బైతులం మేము. అయినా సరే, సామర్లకోట దాకా బండిలో, తరువాత మరో వాహనంలో, ఆ పైన నడక... ఇలా ఎట్టకేలకు తెల్లవారు జామున పెద్ద స్వామి వద్దకు చేరాం. అనుకున్న ముహూర్తానికి అన్నీ సక్రమంగా అందించగలిగాం. ఆ తరువాత ఈ ఆశ్రమజీవితంలోకి వస్తున్నప్పుడు కూడా వేద, వేదాంత విద్యల అధ్యయనంలోనూ అదే పట్టుదల.

మరి ఈ సుదీర్ఘ ప్రయాణంలో చుండూరు ఘటన, తిరుమలలో వెయ్యికాళ్ళ మండపం లాంటి కొన్ని సందర్భాల్లో మీ వ్యాఖ్యలపై వివాదాలు, విమర్శలు వచ్చినప్పుడు ఏమనిపించేది? 
అప్పట్లో చుండూరు ఘటనలో వాస్తవాన్ని వెలికితీసి చెప్పడానికే మాట్లాడాను. ఇతరులు చాలామంది, చివరకు మీడియా కూడా వెనుకంజ వేస్తుంటే, చుండూరులో జరిగింది కేవలం రెండు వర్గాల మధ్య ఘర్షణ కాదు... అది మతసంబంధమైన ఘర్షణ కూడా అని వాస్తవం చెప్పాం. అప్పట్లో ఒక ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్ విలేఖరి వచ్చి, నాతో అన్నీ మాట్లాడారు. కానీ, పత్రికలో మాత్రం వాస్తవాన్ని కాస్తంత దాచిపెడుతూనే రాశారు. మీడియా కూడా ఉన్నది ఉన్నట్లు రాయడానికి ధైర్యం చేయలేదు. కానీ, మేము మాత్రం సత్యమే చెప్పాను. చివరకు తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపం విషయంలో కూడా! మేము ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు. క్రమాన్నీ, ధర్మాన్నీ తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు, మనం మాట్లాడకపోతే తప్పు అవుతుంది. మిగతావాళ్ళకు సాహసం లేదు. మేము విమర్శల్ని పట్టించుకోకుండా, వాస్తవం మాట్లాడాల్సిన కర్తవ్యం నిర్వర్తించాం. అంతే!

సమాజోద్ధరణ ధ్యేయమైన మీ లాంటి కొందరిని మినహాయిస్తే, ఇవాళ అసలు గాడ్ కన్నాగాడ్‌మన్ల హవా ఎక్కువైందని ఒక విమర్శ!
నిజమే. దానికి కారణం - దైవాన్ని గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా, ఒక శాస్త్రీయమైన అధ్యయన ప్రక్రియ లేకుండా కొందరు ఒక స్థానంలో కూర్చోవడమే! అధ్యయనం లేకుండానే ఒక పీఠంపై కూర్చొన్నప్పుడు, వేలమంది వచ్చి మొక్కుతూ ఉంటే, తెలియని ఉద్ధతి, గర్వం వస్తాయి. మనకు తెలియకుండానే రెండు, నాలుగు, ఎనిమిది, పదహారు - ఇలా కొమ్ములు మొలుస్తాయి. అందుకే, ఎప్పుడూ అవి లేకుండా, రాకుండా అధ్యయనం చేస్తూనే ఉండాలి. అది మా పెద్ద స్వామి వారు చెప్పిన మాట! ఒకసారి ఆ గర్వం వస్తే అందరూ మన మాటే వినాలనుకుంటాం. కాదని ఎవరైనా అంటే, వారి మీద కసి, కోపం పెరుగుతాయి. దాంతో, ఏదో అంటాం. ఇవన్నీ అధ్యయనం, వినయం లేకపోవడం వల్ల వచ్చే పర్యవసానాలు. రోజూ తెల్లవారు జాము నుంచి రాత్రి దాకా మానవ సేవ, మాధవ సేవ, భక్తజనం మధ్య ఉండడంతో, మాకైనా అధ్యయనానికి తీరిక దొరకదు. కానీ, అధ్యయనం చేయాలి. మానకూడదు.

వేదకాలం నుంచి ఉన్నత స్థితిలో ఉన్న స్త్రీ ఇవాళ్టి పరిస్థితి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది?  
స్త్రీలను గౌరవించడం మనందరి విధి. వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే సమాజానికి క్షేమం. అందుకే, ‘ఉమెన్స్ హెల్త్ కేర్’ అనే ప్రాజెక్ట్ పెట్టాం. ఇవాళ స్త్రీలలో ఎక్కువ మందిని బాధిస్తున్నవి - సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. వీటి పట్ల స్త్రీ మూర్తుల్లో చైతన్యం కలిగిస్తూ, వాళ్ళకు ఉచితంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేస్తున్నాం. ఇప్పటి దాకా తెలుగు నేలపై 5 లక్షల 25 వేల మందికి ఉచితంగా ఈ స్క్రీనింగ్ చేశాం. ఇక, స్త్రీల ప్రవర్తన విషయానికి వస్తే ఆధునిక తరంలో ధర్మం పట్ల లక్ష్యం తక్కువవుతోంది. తమిళనాడు, ఉత్తరాది లాంటి చోట్ల స్త్రీలలో ధర్మం పట్ల జాగృతి కాస్త ఉన్నా, మన తెలుగు నేలపై ధర్మం పట్ల సుముఖత తగ్గుతున్నట్లుంది. వేదాలు, ఆగమాలు చదివిన పురోహితుల్ని పెళ్ళి చేసుకోవడానికి పిల్లలు, పిల్లనిచ్చేవారు సిద్ధంగా లేరంటే ఏమనాలి? అందరూ సాఫ్ట్‌వేర్ వరుల వెంటపడుతున్నారు. నిజానికి, స్త్రీలు ఇవాళ విద్యలో, సహనంలో, కృషిలో చాలా ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి, ఇక వారిలో మనది ఈ జాతి, మనది ఈ ధర్మం, మనది ఈ సంప్రదాయం అనే భావన కలిగించాల్సి ఉంది. అందు కోసం కృషి చేస్తున్నాం.

మరోపక్క, స్త్రీని కేవలం ఒక భోగవస్తువుగా చూసే పురుషులూ ఇవాళ ఎక్కువయ్యారేమో?  
నిజమే. అది కూడా మన విద్యావిధానంలోని లోపమే. వ్యక్తిని వ్యక్తిగా చూడాల్సిన విజ్ఞత నేర్పాల్సింది విద్యే కదా! కానీ, పిల్లలకు మంచి చెడు చెప్పే తీరిక, మన సంస్కృతి, సంప్రదాయం నేర్పే ఓపిక తల్లితండ్రులకు లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయే సరికి, పిల్లలకు అవన్నీ నేర్పే తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలు ఇంట్లో లేరు. ఎంతసేపూ చదువులు, మార్కుల మీదే శ్రద్ధ. విద్య సంస్కారాన్ని కలిగించాల్సింది పోయి, సంస్కారాన్ని తొలగిస్తోంది! ఇప్పటికే జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. ఒక తరం నష్టపోయింది. దాని ప్రభావమే స్త్రీల పట్ల చులకన భావం. అందుకే, ఇప్పటికైనా మనం మేల్కోవాలి. పిల్లల్లో మన ధర్మం మీద శ్రద్ధ, రుచి కలిగించాలి. వాళ్ళను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి.

మరి, అందుకు ఏం చేయాలంటారు? 
పెద్దలకూ, పిల్లలకూ మన సంస్కృతి, సంప్రదాయాలు తెలియాలి. మన దేశ ఘనచరిత్రకు ప్రతిరూపాలైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలెన్నో ఉన్నాయి.  కానీ, జీర్ణోద్ధరణ అనో, సుందరీకరణ అనో పేరు పెట్టి, వాటి రూపాన్ని మార్చకూడదు. శంకరాచార్యులు, రామానుజాచార్యుల కాలం నాటి నిర్మాణాలున్నాయి. వేదవ్యాసుడు తిరుగాడిన బదరికాశ్రమం లాంటివి ఉన్నాయి. ఆ ఆశ్రమ ప్రాంతానికి వెళితే, కొన్ని వేల ఏళ్ళ నాటి మన జాతి చరిత్ర తెలిసి, మనకు పెద్ద అండ వచ్చినట్లవుతుంది. మన దేశాన్నీ, శ్రీలంకనూ కలుపుతూ సముద్రంలో శ్రీరామచంద్రుడు నిర్మించిన ‘నల సేతు’ ఇప్పటికీ ఉందని ‘నాసా’ వారి ఉపగ్రహ ఫోటోలు చూపిస్తున్నాయి. ఇవాళ్టికీ దర్భశయనం దగ్గరకు వెళితే 6 అడుగుల లోపల నీటిలో ఆ సేతువు రూపం కనిపిస్తుంది. మేము చూశాం. రామాయణ కాలం నాటి ఆ వారధిని కాపాడుకొంటే, మనం అక్కడకు వెళ్ళినప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల వెనక్కి మానసికంగా వెళతాం. మనలో హనుమంతుడి అంత శక్తి వస్తుంది. ఇంత చరిత్ర, వారసత్వం ప్రపంచంలో మన భారత జాతికి తప్ప మరొకరికి లేదు. జనంలో ఈ చైతన్యం తేవాలి.

రామానుజాచార్యుల సహస్రాబ్ది వేళ మీరు చేపట్టిన సమతామూర్తి స్ఫూర్తికేంద్రం అలాంటిదేనా? 
అవును. విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసిన భగవద్ రామానుజాచార్యులు 1017లో జన్మించి, 120 ఏళ్ళు కృషి చేశారు. ఆయన కేవలం మతాచార్యులే కాదు, దిగువ వర్గాల సముద్ధరణకు కృషి చేసిన సాంఘిక సంస్కర్త. ఆయన సహస్రాబ్ది సందర్భంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. ‘జీయర్ ఇన్‌టిగ్రేటెడ్ వేదిక్ అకాడెమీ’ (జీవా)కు అనుబంధంగా 45 ఎకరాల్లో 216 అడుగుల ఎత్తై రామానుజాచార్యుల వారి పంచలోహ మూర్తి నిర్మాణం ప్రారంభమైంది. వచ్చే 2017లో ఈ పాటి కల్లా దాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం. ఇంకా, 108 దివ్యదేశాలు, వైదిక ధర్మ ప్రదర్శనశాలల నిర్మాణం కూడా చేస్తాం. విజయవాడ, సీతానగరం దగ్గర కొండ మీద 108 అడుగుల మరో భారీ విగ్రహం పెట్టాలని కూడా యోచన. అంతా భగవత్ సంకల్పం!

ఇన్నేళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో మీకు తృప్తినిచ్చిన విషయం? 
ఇవాళ్టికీ గ్రామాలకు వెళ్ళి, వాళ్ళకు ఏదైనా చెబితే చక్కగా వింటారు. అర్థం చేసుకుంటారు. ఆచరిస్తారు. అలా గ్రామ గ్రామానికీ వెళ్ళి, మన ధర్మాన్ని ప్రచారం చేస్తూ, సమాజ ఉద్ధరణకు పాల్పడడం బాగుంటుంది.

మరి, మీరింకా చేయాలని అనుకుంటున్నవి? 
మనం చేయగలిగినవి, చేయాల్సినవి, జరగాల్సినవి (చేతులు చాచి చూపిస్తూ...) బోలెడన్ని ఉన్నాయి! ఇప్పటి దాకా చేసింది కేవలం సముద్రంలో నీటిబొట్టే!

చివరిగా, ఈ దీపావళి పండుగ వేళ ప్రజలకు మీరిచ్చే సందేశం?
ఇవాళ చుట్టుపక్కల నుంచి దేశానికి అభద్రత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో దేశ భద్రతకు సరైన చర్యలు చేపట్టే ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఆ రకంగా ప్రజలకు అదృష్టకాలం వచ్చింది. ప్రజలంతా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్క రూపాయి మన సైనిక సంక్షేమ నిధికి ఇచ్చినా, అది కొన్ని వందల కోట్ల నిధిగా మారి, దేశ భద్రతకు పనికొస్తుంది. దేశానికి నిప్పు పెట్టే స్థితి కొంతైనా అడ్డుకుంటాం. ఈ ఉద్యమంలో కుల, మత, జాతి విచక్షణ లేకుండా భారతీయులందరూ పాల్గొనాలి. ఒక భారతీయ హిందువుగా, ఒక భారతీయ ముసల్మానుగా, ఒక భారతీయ క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరం మన భారతదేశ భద్రతకు తోడ్పడాలి. వ్యక్తిగత విశ్వాసాలు ఎవరివి ఏమైనా, భారతదేశమనే ఈ గృహరక్షణ మనందరి ప్రథమ కర్తవ్యం కావాలి. దానికోసం సమాయత్తం కావాల్సిన సమయం ఇదే. అది చేయడమే నిజంగా మనకు దీపావళి.

-  డాక్టర్ రెంటాల జయదేవ

......................................