జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, December 28, 2013

ప్రేక్షకుల టైము, డబ్బు దోపిడీయే... (డి ఫర్ దోపిడి - సినిమా సమీక్ష)

(ఇది 10 టి.వి.లో ప్రసారం చేసిన సమీక్ష)

టాలీవుడ్ లో ఈ మధ్య హీరోలు కూడా నిర్మాతలుగా మరుతున్నారు. అలా హీరో నాని తొలిసారి నిర్మాతగా మారిన సినిమా 'డి ఫర్ దోపిడి'. వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న వరుణ్ సందేశ్, సోలోగా నటించిన తొలి సినిమా 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తో హిట్ కొట్టిన సందీప్ కిషన్ ఈ చిత్రంతో మరో సారి తమ లక్ ను పరీక్షించుకోబోతున్నారు. కథ నచ్చి దిల్ రాజు కూడా నిర్మాణంలో భాగస్వామ్యమైన 'డి ఫర్ దోపిడి' ఈ బుధవారం 'క్రిస్ మస్' సందర్భంగా మన ముందుకు వచ్చింది. మరి కమర్షియల్ లుక్ సంతరించుకొని వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మనస్సును దోపిడి చేయగలిగిందా..? లేదా..? అనేది చూద్దాం.

     కథ విషయానికి వస్తే:.. కష్టపడే తత్వం లేకుండా దురలవాట్లకు బానిస అయిన నలుగురు అబ్బాయిల కథ ఈసినిమా. విక్కీ (సందీప్ కిషన్), రాజు (వరుణ్ సందేశ్), (హరీష్ నవీన్), బన్నీ (రాకేష్) అనే నలుగురు స్నేహితులు అమ్మాయిలపై వ్యామోహం, మద్యానికి బానిసవుతారు. లక్ష్యం లేని జీవితాలతో తిరగడం వల్ల వీరికి కష్టాలు కూడా త్వరగానే వస్తాయి. తమ అందరి కష్టాలు తీరాలంటే 45 లక్షల రూపాయలు దొంగతనం చేయాలని భావించిన నలుగురు హీరోలు.. 'ఏపీ నేషనల్ బ్యాంక్' దోపిడికి సిద్ధపడతారు. అలా బ్యాంక్ లోకి వెళ్లిన వారికి ఎలాంటి అనుభవం ఎదురైంది. ఆ తర్వాత ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు జరిగాయనేది మిగతా కథ.



     విశ్లేషణ:.. ఈ సినిమాతో దర్శకుడు 'సిరాజ్ కల్లా' క్రైమ్ ను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాడు. హీరోలను దొంగలుగా చూపి రాబరీ కథలతో ఒప్పించాలంటే దర్శకుడికి ఎంతో నేర్పు కావాలి. హీరోలు దొంగతనాలు చేసేందుకు బలమైన కారణం చూపించాలి. ఓ దొంగతనం వెనకాల మంచి కారణాలు ఉన్నప్పుడే అలాంటి సినిమాలు సక్సెస్ అవుతాయి. కానీ పనీ పాటా లేని ఆకతాయిలు చేసే దొంగతనాలను పాజిటివ్ గా చెప్పాలనుకునే కథలు మాత్రం 'డి ఫర్ దోపిడి'లా ఎందుకూ పనికి రాకుండా పోతాయి. దోపిడి ఇతివృత్తంతో చేసే సినిమాలకు స్క్రీన్ ప్లే, మాటలు చాలా ముఖ్యం. సినిమాను నిలబెట్టేవి కూడా ఇవే. కానీ డి ఫర్ దోపిడిలో పసలేని స్క్రీన్ ప్లే, డైలాగ్స్ వల్ల సినిమాను ఫ్లాప్ లిస్ట్ లోకి పంపించాయనే చెప్పాలి.


    నటీనటుల విషయానికి వస్తే.. దీనిలో ఏ ఒక్క నటుడు ఆకట్టుకోలేకపోయారు. ఒకరకంగా చెప్పాలంటే ఆ అవకాశం దర్శకుడు ఇవ్వలేదు. చాలా సులువైన కథ కాబట్టి నటించడానికి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. మొదట్లో పాత్రలను పరిచయం చేసేటప్పుడు వచ్చే నాని వాయిస్ ఓవర్ ఆకట్టుకుంటుంది. సందీప్ కిషన్, వరుణ్ సందేష్ తో పాటు మిగిలిన ఇద్దరు కొత్త నటులు నటించే ప్రయత్నం చేశారు. సినిమా టెక్నీషియన్స్ లో ఎవ్వరి పనితనం కనిపించలేదు. అక్కడక్కడా డైలాగ్స్ నవ్వించాయి. పాటలు లేకపోవడం వల్ల సినిమా పెద్ద బోర్ గా మారింది. స్ర్కీన్ ప్లే అదుపుతప్పింది. లొకేషన్లు చాలా తక్కువగా ఉంటాయి. కనిపించినవే పదేపదే చూడాల్సి రావడంతో సినిమాపై ఆసక్తి తగ్గింది. ఈ చిత్రంలో దర్శకుడి వైఫల్యం పూర్తిగా కనిపిస్తుంది. గతంలో 'ఐతే' అనే సినిమా సేమ్ లైన్ తోనే వచ్చింది. అయితే...చంద్రశేఖర్ యేలేటి స్క్రీన్ ప్లే, మాటల విషయంలో తీసుకున్న జాగ్రత్త ఆ సినిమాను సక్సెస్ చేసింది.

ఓవరాల్ గా 'డి ఫర్ దోపిడి' యావరేజ్ టాక్ ను అందుకుంది. ఈ సినిమాకు ఒకే ఒక్క ఫ్లస్ పాయింట్ అదే సినిమా నిడివి తక్కువగా ఉండటం. దీనివల్ల త్వరగా థియేటర్లోంచే భయటపడే అవకాశం ప్రేక్షకులకు దక్కింది.

ప్లస్ లు:.. నాని వాయిస్ ఓవర్, తక్కువ నిడివి.
మైనస్ లు:.. దర్శకుడితో సహా అన్ని మైనస్ లే.

డి ఫర్ దోపిడి ఒక్క లైన్ లో చెప్పాలంటే ప్రేక్షకుల విలువైన టైం ను దోపిడి చేసింది. 
ఇక ఈ సినిమాకు '10టివి' ఇచ్చే రేటింగ్.. 1/5. 
...................................

Thursday, December 26, 2013

ఊపు తక్కువ 'ఉయ్యాలా జంపాలా' (రివ్యూ)



     ఒక కథతో ఓ సినిమా వచ్చి సూపర్‌ హిట్టయ్యాక, దాదాపు అలాంటి కథతోనే కొద్దిగా నేపథ్యం మార్చి మరో సినిమా వస్తే? ఇలాంటి సంఘటనలు తెలుగు సినిమాకు కొత్త కాదు. వినూత్నమైన ప్రచారంతో, కొత్త హీరో హీరోయిన్లతో అందరినీ ఆకర్షిస్తూ, తాజాగా వచ్చిన 'ఉయ్యాలా జంపాలా' పరిస్థితి కూడా అచ్చంగా అదే! 

    ఇది ఓ ప్రేమ కథ. గ్రామీణ నేపథ్యంలో జరిగే ప్రేమ కథ. వివరంగా చెప్పాలంటే... గోదావరి జిల్లాల్లోని పచ్చని పంట పొలాలు, చెరువుల నేపథ్యంలోని కూనవరం గ్రామం. ఆ గ్రామంలో సూరి (తొలి పరిచయం రాజ్‌ తరుణ్‌) తండ్రి లేని బిడ్డ. పెద్ద చదువులు చదువుకోని సూరి కోడి పెంటతో చేపల చెరువుకు మేత అందించే వ్యాపారం చేస్తుంటాడు. తల్లిని చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఇంటి పక్కనే మరో ఇల్లు అతని అమ్మమ్మ, తాతయ్య, మేనమామలది. ఆ మేనమామకు ఓ కూతురు. ఆ మరదలు పేరు ఉమాదేవి (తెలుగులో 'చిన్నారి పెళ్ళికూతురు'గా అనువాదమైన హిందీ సీరియల్‌ 'బాలికా వధు' ఫేమ్‌ అయిన అవికా గోరే). బావామరదళ్ళు ఎప్పుడూ ఏవో గిల్లి కజ్జాలు, కొట్లాటలతో కాలం గడిపేస్తూ ఉంటారు. 

   ఉమాదేవిని ఉడికించడం కోసం మరో అమ్మాయితో ప్రేమ నాటకం ఆడతాడు సూరి. ఆ ఉక్రోషంలో మరో అబ్బాయి పరిచయం కాగానే, అతనికి దగ్గరవుతుంది ఉమాదేవి. ఇంటి నుంచి అతనితో పారిపోవడానికి కూడా సిద్ధపడుతుంది. తీరా అతగాడు ఓ మోసగాడు. ఆఖరు నిమిషంలో బావ సూరి వచ్చి కాపాడతాడు. అక్కడికి ఫస్టాఫ్‌ అయిపోతుంది. 

సెకండాఫ్‌కు వచ్చేసరికి, అలాంటి బావను సిన్సియర్‌గా, సీరియస్‌గా ప్రేమించడం మొదలుపెడుతుంది మరదలు ఉమ. మేనమామతో సవాలు చేసి మరీ, ఆమెకు ఓ గొప్పింటి సంబంధం కుదురుస్తాడు హీరో. తీరా పెళ్ళి కుదిరాక మరదలు పడే ఆవేదన ఏమిటి, అది బావకు ఎలా తెలిసింది, ఆఖరుకు బావామరదళ్ళు కలిశారా, లేదా అన్నది మిగతా కథ. 

పరిమితమైన బడ్జెట్‌లో పరిమిత తారాగణంతో తీసిన ఫీల్‌ గుడ్‌ సినిమా ఇది. బావమరదళ్ళ గిల్లికజ్జాలు, పల్లెటూళ్ళలో కూడా పెరిగిపోయిన ఆధునిక ప్రేమలు, అనుబంధాలు, స్నేహాల లాంటివి ఈ సినిమాకు ఎస్సెట్‌. అయితే, ఎప్పటికప్పుడు పాత చిత్రాలు గుర్తుకు వస్తుంటాయి. పైగా, గోదావరి జిల్లా యాసలోని ఆ పాత్రకూ, దాని డబ్బింగ్‌కూ కొత్త నటుడు రాజ్‌ తరుణ్‌ (ఈ సినిమాకు కథ, దర్శకత్వ శాఖల్లోనూ ఆయన పనిచేశారు) చక్కగా అతికినట్లు సరిపోయారు. ఇక, తెలుగు వెండితెరకు తొలిపరిచయమైనప్పటికీ, హీరోయిన్‌గా గుజరాతీ అమ్మాయి అవిక సాంప్రదాయిక దుస్తుల్లో చూడముచ్చటగా కనిపించింది. అల్లరి నటనతో ఆకట్టుకుంది. మేనమామ పాత్రధారి కూడా బాగున్నాడు. హీరోయిన్‌తో పెళ్ళికి సిద్ధమయ్యే పాత్రలో మొన్నటి 'సెకండ్‌ హ్యాండ్‌' చిత్రంలోని సుబ్బారావు పాత్రధారి దామరాజు కిరీటి కనిపించాడు. 

పదమూడేళ్ళ క్రితం వచ్చిన 'నువ్వే కావాలి' సినిమా గుర్తుందిగా! ఆ సినిమా చూస్తే, ఇక ఈ సినిమా కథేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. దాదాపు ఆ ఛాయల్లోనే ఈ సినిమా కూడా నడుస్తుంది. కాకపోతే, అక్కడ హీరో హీరోయిన్లు స్నేహితుల పిల్లలు... పైపెచ్చు తాము కూడా స్వయంగా స్నేహితులు! ఇక్కడ 'ఉయ్యాలా జంపాలా'లో మాత్రం వారిద్దరూ బావా మరదళ్ళు. ఆ సినిమా పట్టణ నేపథ్యంలో నడిస్తే, ఇది గ్రామీణ కథగా నడుస్తుంది. ఇక, ఈ సినిమా క్లయిమాక్స్‌కు వచ్చేసరికి, 'నువ్వే కావాలి'తో పాటు 'నువ్వు నాకు నచ్చావు' లాంటి చాలా కథలు గుర్తుకొస్తాయి. అది ఈ సినిమాకున్న బలం కాకపోగా, పోల్చి చూడడం ఎక్కువయ్యే సరికి బలహీనతగా పరిణమించింది.

ఈ సినిమాకు ఒకరికి నలుగురు డైలాగులు రాశారు. ఇటీవలి సినిమాలన్నిటి లాగానే ఇందులోనూ కాస్త వెటకారపు మాటలతో వినోదం పుట్టించే ప్రయత్నం చేశారు. కొన్నిచోట్ల అందులో సక్సెస్‌ కూడా అయ్యారు. పరిమిత బడ్జెట్‌ సినిమా అన్న విషయం తెర మీద కనపడకుండా ఉండేలా కెమేరాను గోదావరి అందాల వైపు బాగానే తిప్పారు. ఇన్ని చేసినా, సినిమాలో సంగీతం కానీ, పాటలు కానీ వినాలనిపించేలా కానీ, విన్నవి గుర్తుండేలా కానీ లేకపోవడం పెద్ద మైనస్‌. మాట్లాడుతున్నట్లుగా పాట ఉండాలనే ప్రయోగం ఆకట్టుకోదు. టైటిల్‌ సాంగ్‌ పిక్చరైజేషనేషన్‌ కొంత ఫరవాలేదనిపిస్తుంది. పైగా, స్ట్రయిట్‌ నేరేషన్‌తో కూడిన ఈ కథ కాసేపయ్యేసరికల్లా తరువాత జరిగేదేమిటో ఇట్టే తెలిసిపోతూ ఉంటుంది. 
ఓ దశలో వెండితెరపై ఓ చిన్న డ్రామా చూస్తున్నట్లు అనిపిస్తుంది. అప్పటి దాకా హీరోయిన్‌ పట్ల ఏ భావమూ లేనట్లు ఉండే హీరో, తీరా తన తల్లి అన్న ఒక్క మాటతో అంత దిగులుపడిపోయి, తన ప్రేమను తెలుసుకున్నట్లు చూపడం నప్పలేదు. హీరోయిన్‌ తన మనసులో మాట హీరోతో చెప్పి, తన పెళ్ళికి రావద్దని చెప్పిన ఘట్టం నుంచే కొద్దిగా ప్రేక్షకులకు అనుభూతి కలుగుతుంది. క్లయిమాక్స్‌లో మజ్జిగ గ్లాసుతో నాయిక ప్రవర్తన వెరైటీగా అనిపిస్తుంది. 

వెరసి, ఈ గ్రామీణ నేపథ్యపు సినిమా ప్రేమకథతో కన్నా నేపథ్యంతో, ఆకర్షణీయంగా ఉన్న కొత్త ముఖాలతో ఫరవా లేదనిపిస్తుంది. భారీ యాక్షన్‌లు, ఛేజ్‌లకు దూరంగా జరిగే రెండు గంటల నాలుగు నిమిషాల సినిమాయే కాబట్టి, పాస్‌ మార్కులు వేయాలేమో అనిపిస్తుంది. అతి తక్కువ బడ్జెట్‌లో తీసి, నాగార్జున, డి. సురేశ్‌బాబు లాంటి వారికి అప్పగించిన సినిమా కాబట్టి, వాణిజ్యపరంగా విజయం గురించి పెద్దగా ఆందోళన పడక్కరలేదు. కానీ, సినిమా ట్రైలర్లు, ఆకర్షణీయమైన పోస్టర్లు చూసి, అతిగా ఊహించుకొని వెళితే మాత్రం ఇది ఊపు లేని 'ఉయ్యాలా జంపాలా' అనిపిస్తుంది. 

 కొసమెరుపు: ఇంతకీ, ఈ సినిమాకు ఆ పేరు ఎందుకు పెట్టారంటారూ! బహుశా, కుర్ర వయస్సులో ప్రేమకు సంబంధించి, నాయికా నాయకుల్లో ఉన్న ఊగిసలాటకు ప్రతీక అనుకోవాలా? కొత్తగా దర్శకుడైన కుర్రాడు విరించి వర్మను అడగాల్సిందే!

-    రెంటాల జయదేవ 
(Published in 'Praja Sakti' daily, 26th December 2013, Thursday, Page No.8)
...........................................................

Monday, December 23, 2013

ఈ సినిమాతో 'జాగ్రత్త..! (సినిమా సమీక్ష - ''మనుషులతో జాగ్రత్త'')

(ఇది ''మనుషులతో జాగ్రత్త'' సినిమాపై 10 టి.వి.లో ప్రసారమైన సినిమా సమీక్ష)


        'రాజేంద్ర ప్రసాద్', 'సీనియర్ నరేష్' ప్రధాన పాత్రల్లో అక్షయ్, విదర్శ జంటగా నటించిన సినిమా ''మనుషులతో జాగ్రత్త''. గోవింద్ వరహా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ శనివారం విడుదలయింది. రాజేంద్ర ప్రసాద్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈసినిమా ఎలా ఉందో చూద్దాం..

          కథగా చూస్తే:.. రామరాజు(అక్షయ్ తేజ్) నీతిగా నిజాయితీగా ఉంటూ అందరూ అలానే ఉండాలను కుర్రాడు. ఇతనికి ముగ్గురు ఫ్రెండ్స్. నటరాజు అనే వాడికి అమ్మాయిలు ఎక్స్ పోజింగ్ చేస్తే పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతాడు. కామరాజు... పేరులోనే కామం ఉంది కాబట్టి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వీడు కాన్సెప్ట్ ఓన్లీ కామం. దొరబాబు... వీడు డబ్బు కోసం ఏమన్నా చేసే టైపు. నీతిగా నిజాయితీగా లేని ఈ లోకాన్ని చూసి విసుగెత్తిపోయిన రామరాజు చనిపోయి నరకానికి వెళ్తాడు. అక్కడ యమధర్మరాజు (రాజేంద్రప్రసాద్) మీ లోకంలో మంచి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి నీతూ(సోనియా బిర్జీ) ని చూపిస్తాడు. దాంతో మన హీరో హీరోయిన్ ని ప్రేమించడానికి మళ్ళీ భూమి మీదకి వస్తాడు. ఆ తర్వాత జరిగిందనేది మిగతా కథ.

విశ్లేషణ:.. సినిమా యమలోకం బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ పూర్తిగా అక్కడ జరిగిన సన్నివేశాలు మాత్రం ఏమీ లేవు.
             హీరో రామరాజు చుట్టూ కథ తిరుగుతుంది. కానీ అతని గురించి చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే దీనిలో మంచిని చూపించడం కంటే, చెడును ఎక్కువగా చూపించాడు. దీనిలో ప్రేమ కథా ఉంటుంది. కాలేజీ లైఫ్ ఉంటుంది. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అయిన అమ్మాయిలు, అబర్షన్ చేయించుకోవడం లాంటి నిజజీవితంలో జరిగే పరిణామాలు చూపించాడు. అయితే వీటన్నిటిని కలిపడంలో దర్శకుడు గోవింద్ వరహా విఫలమయ్యాడు. దీంతో సినిమా ఓ కిచిడిగా తయారవుతుంది. నీతిని చూపించే క్రమంలో బూతుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు అనిపిస్తుంది.
         

డాన్స్ లు చాలా ఓవర్ గా ఉంటాయి. దర్శకుడు ఎంచుకున్న తీరు చాలా దారుణంగా ఉంది. పెద్ద ఆర్టిస్టులున్నారు, కానీ వారిని కరెక్ట్ గా ఉపయోగించుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. హీరో మొదట సమాజానికి ఏదో చేయాలనే తపనతో కనిపిస్తాడు. కానీ యమలోకం వెళ్లి వచ్చాక కూడా అందరిలాగా నటిస్తున్నాడు. యూత్ లో చేయాల్సిన సీన్లన్నీ చేస్తున్నాడు. డిఫరెంట్ గా నటించడం సినిమా అంత గందరగోళానికి గురిచేశాడు.

ప్లస్:.. స్టార్ కాస్ట్, కెమెరా, గ్రాఫిక్స్, పాటలు, కొరియోగ్రఫీ.
మైనస్ లు: కథ, డైలాగ్ లు, దర్శకుడు.

మనుషులతో జాగ్రత్త.. అంటే సినిమా కోసం వెళ్లిన వారు సినిమాతో జాగ్రత్త అని చెప్పవచ్చు. 
ఇక ఈ చిత్రానికి '10టివి' ఇచ్చే రేటింగ్..0.5/5.
................................................

Sunday, December 22, 2013

బాక్సాఫీస్‌ వద్ద అమీర్‌ 'ధూమ్‌' ధామ్‌! (రివ్యూ)




     సినీ ప్రేక్షకులు ఈ ఏడాది ఎన్నో అంచనాలతో ఎదురుచూసిన సినిమాల్లో ఒకటి - 'ధూమ్‌ 3'. ఇప్పటికే బాగా పాపులర్‌ అయిన 'ధూమ్‌' సిరీస్‌లో ముచ్చటగా మూడోదైన ఈ సినిమా శుక్రవారం నాడు దేశ, విదేశాల్లో కలిపి వేల థియేటర్లలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. 'ధూమ్‌' సిరీస్‌లో కీలకమైన దొంగ పాత్రను ఈ సారి అమీర్‌ ఖాన్‌ పోషించడం ఈ సినిమా స్థాయిని మరింత పెంచింది. మరి, ఈ తాజా చిత్రం ఆ అంచనాలను అందుకుంటుందా?

ఎప్పటిలానే 'ధూమ్‌'లోని ఈ మూడో భాగం కూడా దొంగ, పోలీసు ఆట కథే! కాకపోతే, ఈసారి కథ అంతా అమెరికాలోని చికాగోలో జరుగుతుంది. చికాగోలో 'గ్రేట్‌ ఇండియన్‌ సర్కస్‌' పేరిట ఓ సర్కస్‌ కంపెనీని నడుపుతుంటాడు ఇక్బాల్‌ (జాకీ ష్రాఫ్‌). అయితే, తీసుకున్న భారీ అప్పు తిరిగి చెల్లించలేకపోతున్నాడంటూ, అప్పిచ్చిన 'వెస్ట్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చికాగో' ఆ సంస్థను మూసివేయిస్తుంది. దాంతో, సర్కస్‌ ఇంద్రజాలం చేసే తన సంతానాన్ని అనాథగా మార్చి, ఆత్మహత్య చేసుకుంటాడు తండ్రి. అది కళ్ళారా చూసిన కొడుకు పెద్దవాడవుతాడు (అమీర్‌ఖాన్‌). అతనికి సర్కస్‌లో సహ కళాకారిణి ఆలియా (కత్రినా కైఫ్‌). అతను ఓ పక్కన తమ సర్కస్‌ కంపెనీని ఓ పక్క నడుపుతూనే, మరోపక్క తానెవరన్నదీ ఎవరికీ తెలియకుండా ఆ బ్యాంక్‌ను పదే పదే దోచుకుంటూ, దెబ్బ తీస్తుంటాడు. అది మూతబడేలా చూడాలన్నది అతని ఆశయం. చోరీ చేసిన ప్రతిసారీ అక్కడ హిందీలో ఓ సందేశం వదిలి వెళుతుండడంతో, భారత్‌ నుంచి జై దీక్షిత్‌ (అభిషేక్‌ బచ్చన్‌), అతని సహచరుడు అలీ (ఉదరు చోప్రా)లను అమెరికాకు రప్పిస్తారు. 

ఇక, దొంగ - పోలీసు ఆట మొదలు. ఆ క్రమంలో సర్కస్‌ నిర్వాహకుడి గురించి ఓ పెద్ద సీక్రెట్‌ బయటకు వస్తుంది. అక్కడ నుంచి ఇక ద్వితీయార్ధం. ఆ రహస్యం ఏమిటి, దాని ద్వారా దొంగను పట్టుకోవడానికి పోలీసులు ఏం చేశారు, దానికి దొంగ చేసిందేమిటి, ఈ మధ్యలో సహ సర్కస్‌ కళాకారిణితో ప్రేమానుబంధం, చివరకు దొంగను పట్టుకున్నారా లాంటివన్నీ వెండితెరపై చూడాలి. 

గత రెండు 'ధూమ్‌' భాగాలకూ దర్శకుడు సంజరు గఢ్వ. కానీ, ఈసారి దర్శకుడు మారాడు. ఇప్పటి దాకా ఈ 'ధూమ్‌' సిరీస్‌కు విడవకుండా రచయితగా వ్యవహరిస్తున్న విజరు కృష్ణ ఆచార్యే ఈసారి దర్శకత్వమూ వహించాడు. రచయితే దర్శకుడు కావడంతో సినిమాను బాగానే నడిపించాడు. అయితే, సినిమాలో లాజిక్‌లు ఉండవు. బోలెడన్ని హాలీవుడ్‌ చిత్రాల ఛాయలు ఈ కథలో, స్క్రీన్‌ప్లేలో కనిపిస్తాయి. అన్నిసార్లు అమీర్‌ ఖాన్‌ దొంగతనాలు చేస్తూ ఉంటాడు, మళ్ళీ హాయిగా వచ్చి సర్కస్‌ కంపెనీ నడిపేస్తుంటాడు. అమెరికా లాంటి చోట కూడా ఇలాంటి మామూలు దొంగను పట్టుకోలేకపోతుంటారు. ఇవన్నీ, సినిమా కథల్లో తీసుకున్న స్వేచ్ఛలనుకొని సర్దుకుపోవాల్సిందే. 

కథంతా ప్రధానంగా అమీర్‌ఖాన్‌ పోషించిన సర్కస్‌ దొంగ పాత్ర, సోదరుడితో అతని అనుబంధమనే పాయింట్‌ మీద ఆధారపడింది. అందుకే, ఇతర పాత్రల కన్నా కథలో ఒక రకంగా యాంటీ హీరో అయిన అమీరే హైలైట్‌ అయ్యాడు. సాహిర్‌, సమర్‌ అనే రెండు పాత్రల్లో అమీర్‌ ఖాన్‌ ఆకట్టుకుంటాడు. ఒక రకంగా ఈ సినిమా అంతా అతని ఖాతాలోకి వెళ్లిపోతుంది. పైగా, అభిషేక్‌కు జోడీ ఎవరూ లేకపోవడంతో అతని పాత్రకు పాటలూ లేవు.
 ఇక, అతని స్నేహితుడైన సహ పోలీసు అలీ అక్బర్‌ పాత్రలో ఉదరు చోప్రా తన డైలాగులతో నవ్వించడానికి ప్రయత్నించినా, సఫలం కాలేదు. కత్రినా విషయానికి వస్తే, ఆమె నటనకు అవకాశమున్న సన్నివేశాలు లేవు కాబట్టి, పాటల్లో, సర్కస్‌ ఫీట్లలో ఆమెను చూసి సంతృప్తి పడాల్సిందే! ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో బాల అమీర్‌ఖాన్లుగా నటించిన పిల్లాడు బాగా అభినయించాడు. తండ్రిగా జాకీష్రాఫ్‌ పాత్రకు తగ్గట్లు ఉన్నారు. 
బోలెడంత ఖర్చు, శ్రమతో రూపొందిన సినిమా ఇది. అదంతా తెర మీద తెలుస్తూ ఉంటుంది. అన్నదమ్ములుగా ఇద్దరు అమీర్‌ ఖాన్‌లూ ఒకే దృశ్యంలో తెరపై కనిపించే తీరు, ఆ సన్నివేశాలు 'వావ్‌' అనిపిస్తాయి. ఈ సినిమా కోసం డిజైన్‌ చేసిన మోటార్‌ బైక్‌ ఛేజ్‌లతో సహా అనేక యాక్షన్‌ సన్నివేశాలు హాలీవుడ్‌ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తాయి. కెమేరా పనితనంతో సహా, పోస్ట్‌ ప్రొడక్షన్‌లో తీసుకున్న జాగ్రత్తలు తెరపై కనువిందైన దృశ్యాలను పరిచాయి. అలాగే, సర్కస్‌ విన్యాసాలు, అందుకోసం అమీర్‌ ఖాన్‌, కత్రినాలు పొందిన శిక్షణ, చేసిన శ్రమ తెర మీద మంచి ఫలితాన్నిచ్చాయి. ఈ యాక్షన్‌, సర్కస్‌ సన్నివేశాల్లో వాళ్ళకు డూప్‌లుగా కనిపించిన వారి కృషినీ మర్చిపోలేం. 
కొన్ని చోట్ల చాలా మంచి డైలాగులు హిందీలో ఉన్నాయి. 'నేను ఎవరితో స్నేహం చేయలేదు' అని బయటి ప్రపంచం తెలియకుండా గడిపే సర్కస్‌ కళాకారుడు ఆమిర్‌ ఖాన్‌ అంటే, 'నాతో ఎవరూ స్నేహం చేయలేదు' అని పోలీసు పాత్రధారి అభిషేక్‌ బచ్చన్‌తో అనిపించడం లాంటివి గుర్తుంటాయి. సినిమా పతాక సన్నివేశం, దానికి దారి తీసే ఘట్టాలు బాగున్నాయి. అన్నదమ్ముల అనుబంధాన్ని మనసుకు హత్తుకొనేలా చేసి, హాలు విడిచి ఇంటికి వెళుతున్న ప్రేక్షకుల గుండెను తాకుతాయి.

అయితే, ఈ సినిమాకున్న మైనస్‌ ఏమిటంటే, కొద్ది క్షణాలు తక్కువగా దాదాపు మూడు గంటల వ్యవధితో కూడిన సినిమా ఇది. నిజానికి, అంత సేపు చెప్పదగ్గ కథ లేదు. దాంతో, ఇవాళ, రేపు అన్నీ రెండుంబావు, రెండున్నర గంటల లోపు సినిమాలకు అలవాటైపోయిన ప్రేక్షకులు కొంత అసహనానికి గురవుతారు. అసలు ఈ సినిమా ఫస్టాఫ్‌లో దాదాపు 45 నిమిషాలు పాత్రల పరిచయాలు, వగైరాలకే పోయింది. అమీర్‌ఖాన్‌ ఇంట్రడక్షన్‌ కదా అని అతనికి ఛేజ్‌... అతని కన్నా తగ్గకూడదు కాబట్టి, అభిషేక్‌ని తెర మీద తొలిసారి చూపిస్తూ మరో ఛేజ్‌... పాపం కత్రినాకు మాత్రం తక్కువెందుకు చెయ్యాలని, ఆమెకు ఓ ఇంట్రడక్షన్‌ డ్యాన్స్‌ పాట... ఇలా సాగుతుంది. 
వేటికవిగా ఇవన్నీ బాగానే ఉన్నట్లు అనిపించినా, హాలులో అప్పటికే పెద్దగా కథ లేకుండా, చాలాసేపు సినిమా చూసేసిన అనుభూతి కలుగుతుంది. సంగీతం, పాటలను చెప్పుకోవాలి. మునుపటి 'ధూమ్‌' పార్ట్‌లతో పోల్చినా, పోల్చకపోయినా ఇందులో పాటలు గుర్తుంచు కోదగ్గవిగా లేవు. కత్రినా కైఫ్‌ తదితరులు నర్తించే 'మలంగ్‌...' పాట మాత్రం భారీగా, చూడముచ్చటేస్తుంది.
మొత్తం మీద ఐ-మ్యాక్స్‌ ఫార్మట్‌లో రిలీజవుతున్న తొలి భారతీయ భాషా చిత్రం ఇది. అమీర్‌ ఖాన్‌ అభినయ ప్రతిభకు, 'డాల్బీ ఎట్మాస్‌' శబ్ద సాంకేతిక పరిజ్ఞానం కూడా జత కలసిన ఈ భారీ చిత్రాన్ని ఆ రకమైన ఫార్మట్‌లో చూస్తే మరింత కనువిందవుతుంది. అదీ 'ధూమ్‌ 2'తో పోల్చి చూడకుండా ఉంటే! వెంటనే మరో పోటీ చిత్రమేదీ హిందీలో లేకపోవడంతో క్రిస్మస్‌ సెలవులు కలిసొచ్చే ఈ చిత్రం వసూళ్ళలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తే ఆశ్చర్యం లేదు.
- రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 21st Dec 2013, Saturday, Page No. 8)
...............................................................

Saturday, December 21, 2013

బుర్రలు మారిపోయే 'బన్నీ అండ్‌ చెర్రీ' (సినిమా సమీక్ష)



   
పెద్ద హీరోల చిత్రాలేవీ విడుదలకు లేకపోవడంతో చిన్న సినిమాల పంట పండింది. అందుకే, ఈ మధ్య వారం వారం నాలుగైదు చిన్న సినిమాలు హాలు ముఖం చూస్తున్నాయి. ఆ క్రమంలో మరో కొత్త దర్శకుడు రాజేశ్‌ పులి అందించిన చిత్రం - 'బన్నీ అండ్‌ చెర్రీ'. 
తీసుకున్న కథాంశం వినూత్నంగా అనిపించినా, దాన్ని తెరపై చూపడానికి సరైన స్క్రిప్టు సిద్ధం చేసుకోలేక తడబడిన వైనం ఈ సినిమాతో తెర నిండా చూడవచ్చు. 
తండ్రి లేని పిల్లాడు కార్తీక్‌ అలియాస్‌ బన్నీ (ప్రిన్స్‌). ఇంజనీరింగ్‌ చదువుకొని, ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఇక, అదే ఊళ్ళో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ (పోసాని) కుమారుడు ఇంజనీరింగ్‌ చదువుతున్న చరణ్‌ అలియాస్‌ చెర్రీ (మహత్‌ రాఘవేంద్ర). అనుకోని ఓ ఘటనలో బన్ని నడుపుతున్న నాలుగు చక్రాల వాహనం, చెర్రీ శరవేగంతో నడుపుతున్న మోటార్‌ బైక్‌ గుద్దుకుంటాయి. ఆ యాక్సిడెంట్‌లో కుర్రాళ్ళిద్దరికీ మెదడుకు బాగా దెబ్బతగులుతుంది. ఒకరి మెదడులోని న్యూరాన్‌ మరొకరి మెదడులోకి యాండీబాడీగా ఎక్కిస్తే వాళ్ళు బతకవచ్చని డాక్టర్‌ సక్సేనా (సుమన్‌), డాక్టర్‌ వీరేంద్రనాథ్‌ (యండమూరి) అనుకుంటారు. అదే చేసి, వాళ్ళను బతికిస్తారు. కానీ దాని వల్ల వాళ్ళకు శరీరం ఒకరిదైతే, మెదడు మరొకరిదిగా తయారవుతుంది. మరోరకంగా చెప్పాలంటే, పరకాయ ప్రవేశం లాంటిదనుకోవచ్చు. అలా ఒకరి దేహంలో మరొకరుగా మారిన బన్నీ, చెర్రీలు ఏం చేశారు, తమ చుట్టూ ఉన్న సమస్యల్ని ఎలా పరిష్కరించారు, చివరకు ఎలా మామూలు మనుషలయ్యారు అన్నది స్థూలంగా ఈ చిత్ర కథాంశం.
మొబైల్‌లో చిప్‌ మార్చేసినంత ఈజీగా మెదడు అనే మెమరీ కార్డును మార్చవచ్చా లాంటి సైన్సు సందేహాలు ఎవరికైనా కలగవచ్చు. సినిమా కాబట్టి, అలాంటివన్నీ సాధ్యమే లెమ్మని సరిపెట్టుకున్నా ఈ సినిమా అల్లుకున్న తీరులో, చిత్రీకరణ విధానంలో సర్దుకుపోలేని లోపాలు సవాలక్ష ఉన్నాయి. సినిమా మొదలైన ఓ ముప్పావు గంట దాకా పాత్రల పరిచయం, అర్థం పర్థం లేని అపహాస్యపు సీన్లే తప్ప, కథ ఏమీ ఉండదు. యాక్సిడెంట్‌ అయినప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. 
ఒకరి దేహంలో మరొకరి మెదడు (లేదా మనస్సు) అనే కాన్సెప్ట్‌ వరకు బాగున్నా, ఇక ఆ రెండు పాత్రలూ ఎలా ప్రవర్తించాయి, ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాయి లాంటివన్నీ ఆసక్తి రేపేలా బిగువుగా చూపాల్సింది. కానీ, అలాంటి బలమైన సీన్లు దర్శక, రచయితలు రాసుకోలేకపోయారు. దాంతో, అక్కడ కూడా మళ్ళీ రొటీన్‌ కామెడీ బిట్లే మిగిలాయి. స్క్రిప్టు సరిగ్గా లేకపోవడంతో సినిమాను ఆస్వాదించడం మాట దేవుడెరుగు - ఎవరు బన్నీ, ఎవరు చెర్రీ, ఎవరెందుకు, ఎలా ప్రవర్తిస్తున్నారన్నది గ్రహించడానికే సామాన్య ప్రేక్షకుడు బుర్ర వేడెక్కిపోతుంది. 
సినిమా చివరకు వచ్చేసరికి, ఇద్దరు హీరోలూ మంచి పనులు చేయడం, వేరొకరికి సాయపడడం లాంటి ఉపకథలు పెట్టారు. కానీ, అప్పటికే పట్టు జారిపోయిన సినిమాను ఆ ఆఖరు పావుగంట, ఇరవై నిమిషాల కథతో పైకి లేపడం అసాధ్యమైపోయింది. పాత్ర చిత్రణలో సత్తా లేకపోవడం, దానికి తోడు అభినయ ప్రతిభ పరిమితం కావడంతో ప్రిన్స్‌, మహత్‌ రాఘవేంద్రల నటన ఏ మాత్రం ఆకట్టుకోదు. 
పేరుకు ఈ సినిమాలో కృతి, సబా అనే ఇద్దరు హీరోయిన్లున్నారు. వారిద్దరూ పాటల్లో నర్తించినా, సినిమాలో కనిపించినా - రెంటికీ ఉపయోగపడింది తక్కువే. చంద్రమోహన్‌, సీత, పోసాని లాంటి సీజన్డ్‌ ఆర్టిస్టులు సినిమాకు కొంత వెన్నుదన్నుగా ఉన్నా, కథలో లేనిది కనబడితే వస్తుందా! కొత్త దర్శకుడు రాజేశ్‌ పులి మరింత హౌమ్‌ వర్క్‌ చేసి, బలమైన స్క్రిప్టుతో మరోసారి జనం ముందుకు వస్తే మంచిది. అలాగే కెమేరా వర్క్‌, ఎడిటింగ్‌ల మీద మరింత శ్రద్ధ పెట్టాల్సింది. అలాంటివన్నీ కొరవడడంతో ఈ 'బన్నీ అండ్‌ చెర్రీ' చూసిన ప్రేక్షకులకు కూడా బుర్ర తిరిగిపోయే అనుభవంగా మిగిలిపోయింది. 

కొసమెరుపు: చాలాకాలం క్రితం వచ్చిన 'రావూ గోపాల్రావు' కథాంశం ప్రేరణతో అల్లుకున్న సినిమా కథ ఇదని దర్శకుడు, 'ప్రజాశక్తి'తో మాట్లాడుతూ చెప్పారు. అయితే, సినిమా చూస్తుంటే ఇది హాలీవుడ్‌ చిత్రం 'ఫేస్‌ ఆఫ్‌' నుంచి తీసుకున్న కథ అని అర్థమైపోతుంది. అన్నట్లు, ఇప్పటికి ఆరేడు నెలలుగా అదిగో, ఇదిగో అంటూ విడుదల కాకుండా ఊరిస్తున్న రామ్‌చరణ్‌ తేజ్‌ 'ఎవడు' కూడా ఆ హాలీవుడ్‌ సినిమాకు 'ఫ్రీ'మేకే! ఈ సినిమా వచ్చేసింది... సంక్రాంతికి రానున్న 'ఎవడు' మాత్రమే ఇక బాకీ!

- రెంటాల జయదేవ

(ప్రజాశక్తి దినపత్రిక, 15 డిసెంబర్ 2013, ఆదివారం, పేజీ నం. 8లో ప్రచురితం)
.................................................

Thursday, December 19, 2013

యువత లక్ష్యంగా సెకండ్‌ హ్యాండ్‌ (రివ్యూ)



   ఇప్పటికీ చాలా భాగం తెలుగు సినిమాలు ఫ్యాక్షన్‌, యాక్షన్‌, మాఫియా కథల చుట్టూరానే పరిభ్రమిస్తుండగా, అమావాస్యకో, పున్నమికో ఒకటీ అరా కొత్త సినీ ప్రయత్నాలు వస్తున్నాయి. సమకాలీన సమాజంలో ఆధునిక ఇంజనీర్‌, సాఫ్ట్‌వేర్‌ యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని అల్లుకుంటున్న కథలు అడపాదడపా తెరపై తొంగి చూస్తున్నాయి. యువతరం ఆలోచనలు, ఆకర్షణలు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, వైఫల్యాల లాంటివన్నీ అందులో అంశాలే! అందుకే, యువ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని, ఇలాంటి కథలతో వారు తమను తాము సులభంగా ఆ యా పాత్రల్లో చూసుకొనే సినిమాలు తీయడం ఆధునిక సినీ వ్యాపార సూత్రమైంది. గత వారం రోజుల తేడాలో అలాంటి చిత్రాలు రెండు వచ్చాయి. ఒకటి - 'ప్రేమ... ఇష్క్‌... కాదల్‌' అయితే, రెండోది - తాజా సినిమా 'సెకండ్‌ హ్యాండ్‌'. 
ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్‌. రవి సహ నిర్మాతగా వ్యవహరించగా, దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు కూడా ప్రమేయమున్న సినిమా 'సెకండ్‌ హ్యాండ్‌'. మొన్నటి 'ప్రేమ... ఇష్క్‌... కాదల్‌' లాగానే ఈ సినిమా కూడా మూడు ప్రేమ కథల మేళవింపు. మొదటి కథలో సంతోష్‌ (సుధీర్‌ వర్మ) ఓ ప్రొఫెషనల్‌ ఫోటోగ్రాఫర్‌. తొలి చూపులోనే అతను దీపూ (ధన్యా బాలకృష్ణన్‌) ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కూడా అతణ్ణి ప్రేమిస్తుంది కానీ, అంతకన్నా డబ్బు, హౌదా ఉన్న మెరుగైన సంబంధం ఇంట్లోవాళ్ళు కుదిర్చే సరికి, ఆ పెళ్ళి చేసేసుకుంటుంది. సంతోష్‌ను వదిలేస్తుంది. ''ప్రాబ్లమ్స్‌ లేకుండా గెలవడం విక్టరీ... ప్రాబ్లమ్స్‌ను ఎదుర్కొని గెలవడం హిస్టరీ'' అనే సంతోష్‌ చివరకు ఆత్మహత్యకు పాల్పడాలనుకుంటాడు. 
ఈ కథంతా తన దగ్గరకు వచ్చిన సుబ్బారావు (కిరీటి దామరాజు)కు చెప్పుకుంటాడు. ఆత్మహత్య ద్వారా పగ తీర్చుకోవాలనుకుంటాడు. దానికి సుబ్బారావు నవ్వేసి, తనతో పెళ్ళి చేసుకొని కూడా పాత బారుఫ్రెండ్‌ను వదిలిపెట్టని స్వేచ్ఛ (మళ్ళీ ధన్యా బాలకృష్ణనే) గురించి చెప్పుకొస్తాడు.
ఇది రెండో ప్రేమ లేదా పెళ్ళి కథ. 

వేర్వేరు అమ్మాయిల చేత జీవితంలో దెబ్బతిన్న ఈ ఇద్దరికీ సహస్ర (ముచ్చటగా మూడో పాత్రలోనూ ధన్యే) అనే అమ్మాయి ఎదురవుతుంది. పెళ్ళి కాకుండానే తనను తల్లి చేసిన స్నేహితుడు చైతన్య (శ్రీవిష్ణు)కూ, ఆ సమయంలో తన వెంటే ఉండి అబార్షన్‌ చేయించిన మరో స్నేహితుడు సిద్ధూకూ మధ్య ఆమె ప్రేమ ఊగిసలాడుతుంటుంది. ఎవరిని పెళ్ళికి ఎంచుకోవాలో తెలియడం లేదనే పాత్ర ఆమెది. అది మూడో ప్రేమ కథ. ఈ మూడు కథలు, ఇందులోని ఈ ముగ్గురి జీవితం చివరకు ఏమైందన్నది మిగతా సినిమా. 

తమిళంలో ఇప్పటికే పలు పాత్రలు పోషించినా, తెలుగు తెరకు కొత్త అయిన ధన్య అందం, అభినయం ఈ సినిమాకు ప్లస్‌. ఆమెతోనే మూడు స్త్రీ పాత్రలూ ధరింపజేయడం ప్రయోగమే. ఇతర నటీనటులు, ముఖ్యంగా సుబ్బారావు పాత్రధారి సహజంగా నటించారు. వారి నుంచి ఆ నటనను రాబట్టుకున్న దర్శకుణ్ణి మెచ్చుకోవచ్చు. సహస్రను ప్రేమించే తమిళ శరవణన్‌గా సెకండాఫ్‌లో కొన్ని సీన్లలో దర్శకుడూ తెరపై మెరిశాడు. 
అందరి అభినయం బాగున్నా అసలు కథలోనే కొన్ని లోటుపాట్లున్నాయి. ఘంటసాల పాడిన కరుణశ్రీ 'పుష్పవిలాపం'లోని బిట్‌తో మొదలయ్యే ఈ సినిమాలో చూపిన కథలన్నీ చివరకు తప్పంతా అమ్మాయిలదే అన్న పురుషాధిపత్య భావజాలాన్నే ప్రతిఫలించాయి. మొన్నటికి మొన్న 'ప్రేమ...ఇష్క్‌... కాదల్‌' లోనూ ఈ తరహా ట్రీట్‌మెంటే చూశాం. ఇది సమాజంలోని వాస్తవికతను పాక్షికమైన దృష్టితో చూడడమే! దాంతో, 'లవ్‌, కెరీర్‌, వ్యాపారం - ఈ మూడింటిలో నమ్మకంతో ఓ చేయి పట్టుకొని వెళ్ళాలి. ఒక వేళ ఆ చేయి ఎక్కడైనా వదిలేసినా, జీవితాన్ని అంతం చేసుకోకుండా మరో చేయి (సెకండ్‌ హ్యాండ్‌)ని పట్టుకొని ముందుకు వెళ్ళాల'ంటూ ఆఖరులో చెప్పిన గీతోపదేశం తూతూ మంత్రమైంది. 'అప్పటికే ఉపయోగించేసిన' అన్న డబుల్‌ మీనింగే ఈ టైటిల్‌ అంతరార్థంగా మారింది. 

పైగా, గతంలో తమిళంలో సినిమాలు తీసినా, తెలుగులో మాత్రం తొలి చిత్ర దర్శకుడైన కిశోర్‌ తిరుమల ఈ యువతరం ప్రేమకథల్ని తెరపై డీల్‌ చేయడంలో కొంత తడబడ్డాడు. సంతోష్‌, సుబ్బారావుల కథలతో ఫస్టాఫ్‌ చకచకా సాగిపోతుంది. కానీ, సహస్ర కథ వచ్చే సెకండాఫ్‌ జీడిపాకంగా మారింది. చివరకు వచ్చేసరికి డాక్టర్‌ పాత్రలో పోసానితో చెప్పించిన ఉపదేశాలు కథకూ, పాత్రల స్వభావాలకూ సరిగ్గా అమరలేదు. 

పరిమిత బడ్జెట్‌లో, 5డి కెమేరా లాంటి వాటితో, ఇద్దరు కెమేరామన్లతో తీసిన ఈ సినిమా పెద్ద తెరపై విజువల్‌గా క్రమరహితంగా కనిపించేస్తుంది. సంగీతం కూడా సో..సో. పాత హిట్‌ పాటలనే నేపథ్యంలో వినిపిస్తూ, చాలా భాగం పని కానిచ్చేశారు. అయితే, కొత్త తరాన్ని ఆకట్టుకొనే నవీన యుగపు ప్రేమ కథ కావడం, క్లైమాక్స్‌లో టైటిల్స్‌ పడుతుండగా 'సుబ్బారావు...' అంటూ సింగిల్‌ షాట్‌లో ఓ పాటంతా తీయడం లాంటి ప్రయోగాత్మక వైఖరి, విజువల్‌గా రొటీన్‌కు కొత్తగా ఉండేందుకు చేసిన ప్రయత్నం ఈ సినిమాను ఫరవాలేదనిపిస్తాయి. కానీ, చివరకు వచ్చేసరికి సెకండాఫ్‌ బలహీనత ప్రేక్షకులకు కడుపు నిండని భోజనంగానే సినిమాను మార్చేస్తుంది. - రెంటాల జయదేవ


(ప్రజాశక్తి దినపత్రిక, 15 డిసెంబర్ 2013, ఆదివారం, పేజీ నం.8లో ప్రచురితం)
.........................................

'మతి' పోగొట్టే 'మధుమతి' (సినిమా సమీక్ష)

బుల్లితెరపై యాంకర్‌గా చాలా కాలంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న వ్యక్తి - ఉదయభాను. ఎప్పుడో ఆర్‌. నారాయణమూర్తి 'ఎర్రసైన్యం' రోజుల్లో 1990లలోనే వెండితెరపై మెరిసిన ఆమె చాలా కాలం తరువాత ఓ పూర్తి నిడివి పాత్రలో తెరపై కనిపించిన చిత్రం - 'మధుమతి'. పైపెచ్చు, ఆమెది ఓ వేశ్య పాత్ర. ఇటీవలి కాలంలో అనుష్క ('వేదం'), శ్రియ ('పవిత్ర') లాంటి తారల లాగానే ఉదయభాను కూడా ఏదో విషయమున్న కథనే ఎంచుకొని, ఈ చిత్రం చేసి ఉంటారని అందరం భావిస్తాం. కానీ, సినిమా చూస్తే తీవ్ర నిరాశకు గురవుతాం. 

అమ్మాయిలంటే పెద్దగా పడని ఓ అబ్బాయి కార్తీక్‌ (విష్ణు ప్రియన్‌). ఉద్యోగం చేస్తున్నా, ఇంట్లోవాళ్ళు సొంత మరదలిని ఇచ్చి పెళ్ళి చేస్తామంటున్నా 'నో' చెప్పేస్తుంటాడు. మరదలితో పెళ్ళిని తప్పించుకోవడం కోసం ఏకంగా తనకు పెళ్ళే అయిపోయిందని అబద్ధం చెబుతాడు. భార్యను చూపించమన్న ఇంట్లోవాళ్ళ ఒత్తిడిని తట్టుకోలేక, తన భార్యగా నటించమంటూ మధుమతి (ఉదయభాను) అనే ఓ వేశ్యతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇంట్లోవాళ్ళను నమ్మించడానికి ఆమెను తీసుకొని, సొంత ఊరికి వస్తాడు. అక్కడ మధుమతితో అతనికి ఎదురైన ఇబ్బందులు, ఇంట్లోవాళ్ళ మమతానురాగాలు చూసి మధుమతి వ్యాపారాత్మక వైఖరిలో వచ్చిన మార్పు లాంటి వాటితో మిగతా కథ నడుస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ మధుమతిని అక్కున చేర్చుకున్నా, హీరో బామ్మ ('తెలంగాణ' శకుంతల) మాత్రం ఆమెను శత్రువులా చూస్తుంది. ఆ పరిస్థితుల్లో మధుమతి ఏం చేసింది, మధుమతిని వెతుక్కుంటూ వచ్చిన ఆమె బ్రోకర్‌ ఏం చేశాడు, వగైరా ప్రశ్నలకు సమాధానం ఓపికుంటే వెండితెరపై చూడవచ్చు. 

పెళ్ళయిందంటూ అబద్ధ మాడి, భార్య స్థానంలో ఓ వేశ్యను తెచ్చి, నాటకమాడే కథానాయకుల కథలు ఇప్పటికి తెలుగు తెరపై ఎన్ని చూశామో లెక్కే లేదు. మళ్ళీ అదే కథతో మరో సినిమా అని హాలులోకి వెళ్ళాక అర్థమైన సగటు ప్రేక్షకుడు ఆ తరువాత నుంచి హాలులో నుంచి ఎప్పుడు బయటపడదామా అని అసహనంగా నిరీక్షిస్తూ, కూర్చోవాల్సి వస్తుంది. పైపెచ్చు, దర్శకుడు రాజ్‌ శ్రీధర్‌ సినిమా తీసిన విధానం నాటకం కన్నా అన్యాయం. 

మొదటి ముప్పావు గంట సినిమా కథ, కాకరకాయ ఏమీ లేకుండా దర్శకుడు కామెడీ (అనుకొంటూ తీసిన) దృశ్యాలతో గడిపేశాడు. ముప్పావు గంట గడిచాక తెరపైకి తొలిసారిగా వచ్చిన ఉదయభాను వేశ్య పాత్రను సహజంగా పోషించారు. కానీ, ఆ పాత్ర చిత్రణలో కానీ, కథలో కానీ ఆమె అద్భుతంగా అభియించదగ్గ సన్నివేశాలంటూ ఏమీ లేవు. తమిళంలో డబ్‌ చేసుకొనేందుకు వీలుగా ఉండాలనో ఏమో, సినిమాలో పాత్రధారుల గెటప్‌లు, సినీ నేపథ్యం వగైరా అంతా అడ్డ బొట్ల వ్యవహారంతో అరవ వాసన కొడతాయి. అందుకోసమే కావచ్చు, హీరోది తమిళనాడులోని గ్రామం అన్నట్లుగా కథలో చెప్పిస్తారు. పిచ్చి కామెడీ సన్నివేశాల్లో శీనుగా వేణు, లింగమ్‌గా 'డార్లింగ్‌' శ్రీను లాంటి వాళ్ళు నవ్వించకపోగా, ఇబ్బంది పెడతారు. 



ఇక, కథతో బొత్తిగా సంబంధం లేని ఓ సెకండ్‌ హీరోయిన్‌ పాత్రధారిణి ఉన్నట్టుండి సినిమాలోకి వస్తూ, పోతూ, రెండు 'మసాలా' తరహా పాటలకు పరిమితమైంది. హీరోతో సహా ఈ సినిమాలో అందరి నటనా శూన్యం. ఆ డబ్బింగ్‌లూ అంతంత మాత్రమే. చిత్ర నిర్మాణ విలువలు పూజ్యమైన ఈ సినిమాలో కెమేరా, సంగీతం, ఎడిటింగ్‌ లాంటి సాంకేతిక విభాగాలు ఉన్నాయా, లేవా అని అనుమానం వస్తుంది. 

ఇక, ఈ సినిమా తనకు ప్రివ్యూ వేసి చూపలేదనీ, ఆఖరుకు పోలీసు జోక్యంతో చూపారనీ, సినిమా ప్రచారం కోసం వాడిన ఫోటోలు, ప్రచార చిత్రాల్లో వేరే వారి శరీరానికి తన తలను అతికించి మార్ఫింగ్‌ చేసి అసభ్య చిత్రాలు రూపొందించారనీ సినిమా ముందు రోజు, రిలీజు రోజు దర్శక - నిర్మాతలపై ఉదయభాను ధ్వజమెత్తింది. కథ పోలీసు కంప్లయింట్‌ దాకా వెళ్ళింది. కానీ, సినిమాలో మాత్రం ఇందులో ఆమె పాత్రతో చేయించిన అశ్లీల దృశ్యాలంటూ ఏమీ లేవనే చెప్పాలి. 

ఆ మధ్య 'లీడర్‌' సినిమాలో ఓ ప్రత్యేక నృత్య గీతంలో కనిపించిన ఉదయభాను అసలు ఉన్నట్టుండి ప్రధాన పాత్రధారిణిగా నటించాలని ఎందుకు అనుకున్నారో, అందులోనూ ఈ కథకు ఎలా ఓకె చెప్పారో, ఎందుకు ఈ సినిమాలో నటించారో ఎవరికీ అర్థం కాదు. చిత్రం ఆడియో ఆవిష్కరణకూ, ప్రచారానికీ కూడా రాని ఉదయభాను ఇప్పుడు తనకు పారితోషికం కూడా చాలా పరిమితంగా ఇచ్చారంటూ మీడియా ముందుకు వచ్చింది. 
ఏమైనా, టీవీ సీరియళ్ళ కన్నా అన్యాయమైన ఈ 'మధుమతి' ఓ 'మతి' లేని 'అతి' సినిమాగా మిగిలిపోతుంది. 'మిమ్మల్ని నవ్వించి చివరకు ఏడిపించకపోతే ఒట్టు' అని సినిమా ప్రచారంలో దర్శక, నిర్మాతలు ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ, ఈ సినిమా ఆసాంతం చూస్తే వచ్చేది కచ్చితంగా ఏడుపే! టికెట్‌ డబ్బు, అంతకన్నా జీవితంలో రెండు గంటల పది నిమిషాల కాలం అత్యంత విలువైనవి కాబట్టి, 'మధుమతి' జోలికి పోకపోవడం ఒంటికి క్షేమం.
- రెంటాల జయదేవ

(ప్రజాశక్తి దినపత్రిక, 15 డిసెంబర్ 2013, ఆదివారం, పేజీ నం. 8లో ప్రచురితం)
............................................................................

Wednesday, December 18, 2013

రెండు రోజులు.. మూడు సినిమాలు.. ఒక అమృతాంజనం (సినిమా రివ్యూ)




ఏ సినిమా అయినా ఎందుకు చూస్తాం? కొందరు కాలక్షేపం కోసం... మరికొందరు అలసిన మనసులను ఆహ్లాదపరిచి, ఉత్తేజం కలిగించడం కోసం... ఇంకొందరు కొత్త ఆలోచనల్ని ప్రోది చేసుకోవడం కోసం! కానీ, గడచిన రెండు రోజుల్లో వచ్చిన మూడు తెలుగు సినిమాలు - మధుమతి, సెకండ్ హ్యాండ్, బన్నీ అండ్ చెర్రీ - ఈ ఆశలను పెద్దగా నెరవేర్చేవిగా లేకపోవడం విషాదం. కానీ, వేశ్య పాత్ర, యువతరం లవ్‌ ఫెయిల్యూర్ల కథ, హాలీవుడ్‌ సినిమాకు ఫ్రీమేక్‌ - ఇలా ఏదో ఒక ప్రత్యేకతతో వార్తల్లో మాత్రం నిలవడం విశేషం. నిర్మాతలు పెట్టుబడిగా పెట్టే సొమ్మే కాదు, ప్రేక్షకులు పెట్టే టికెట్టు డబ్బు, ఖర్చు పెట్టే విలువైన సమయం ఖరీదు కట్టలేనివని మన దర్శక, నిర్మాతలు ఎప్పుడు గ్రహిస్తారో ఏమో!


- రెంటాల జయదేవ 

(Published in PrajaSakti daily, 15th Dec 2013, Sunday, Page No.8)


.................................................................

ప్రేమ.. ఇష్క్.. కాదల్.... ఓ మల్టీప్లెక్స్..! (సినిమా సమీక్ష)

('ప్రేమ.. ఇష్క్.. కాదల్....' సినిమాపై '10 టివి' ప్రసారం చేసిన సమీక్ష ఇది...)


   టాలీవుడ్ లో ఈ ఏడాది వచ్చిన చిన్న సినిమాలేవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. తమ టాలెంట్ ను నిరూపించుకోవడంలో చిన్న చిత్రాల దర్శకులు విఫలమవుతున్నారు. ఇక భారీ చిత్రాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏది పట్టుమని పది రోజులు థియేటర్లలో ఆడలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివర్లో వచ్చిన చిన్న సినిమా 'చిత్రం ప్రేమ ఇష్క్ కాదల్'. ప్రేమలోని వెరైటీ.. చెప్తానంటూ.. పవన్ సాదినేని తొలిసారి మెగాఫోన్ పట్టుకున్నాడు. షార్ట్ ఫిల్మ్ లు తీసిన అనుభవం నుంచి ఒకేసారి దర్శకుడిగా మారడంతో సినిమాపై ఆసక్తిని పెంచింది. దీనికి తోడు అందరూ కొత్త వారితో, మ్యూజిక్, ప్రేమ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలయింది. మరి ఇది సక్సెస్ అయ్యిందా..? లేదా..?అనేది చూద్దాం..

కథ విషయానికి వస్తే:.. మూడు జంటల మధ్య జరిగే ప్రేమ కథ ...

     మొదటి జంట:
 సింగర్‌ ప్లస్‌ మ్యుజీషియన్‌ అయిన రాండీ (హర్షవర్ధన్‌) సోషల్‌ సర్వీస్‌ చేస్తుంటాడు. అతనితో తమ కాలేజ్‌లో షో చేయించాలని వెంట పడుతుంటుంది సరయు (వితిక). ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుడుతుంది..? తర్వాత ఏమవుతుంది..?, రెండవ జంట: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజు (విష్ణు) తమ సినిమాకి కాస్టూమ్స్‌ డిజైనర్‌గా పని చేస్తున్న సమీరని (రీతూవర్మ) ప్రేమిస్తాడు. ఎడ్యుకేషన్‌, సోషల్‌ స్టేటస్‌ ఇలా అన్నిట్లోను అస్సలు సారూప్యం లేని ఈ జంట ప్రేమ కథ ఎటు దారి తీస్తుంది..? , మూడవ జంట: కనిపించిన ప్రతి అమ్మాయిని ప్రేమించేసే అర్జున్‌ (హరీష్‌) చెన్నయ్‌ అమ్మాయి అయిన శాంతిని (శ్రీముఖి) కూడా వలలో వేసుకోవాలని చూస్తాడు. మరి అతని ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి..? అనేది సినిమా కథ.

విశ్లేషణ:..
        
ఒకే సారి మూడు జంటల ప్రేమ కథను చూపించడం కొంత ఇబ్బందితో కూడుకున్న విషయమే. అయితే దర్శకత్వంలోకి కొత్తగా అడుగు పెట్టిన పవన్ ఈ విషయంలో కాస్త తడబడ్డాడు. ఈ మూవీలో యువతలోని ఇగోను, ప్రేమ కథల్లోని ట్విస్టుకు ఉపయోగించాడు దర్శకుడు. కాకపోతే.. షార్ట్ ఫిలిం మేకర్ గా మంచి పేరుతెచ్చుకున్న పవన్ తన కొత్త సినిమా 'ప్రేమ ఇష్క్ కాదల్' లో స్ర్కీన్ ప్లేను కరెక్ట్ గా సెట్ చేయడంలో బోల్తా కొట్టాడు. సినిమా అంతా.. సాగతీత ఉండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది. ఇక ప్రేమ గురించే చెప్పే క్రమంలో లాజిక్ లు మిస్ అయ్యాడు. సాధారణ ప్రేక్షకుడికి అర్థంకాకుండా ఉండడంతో అసలు సినిమాలో ప్రేమ ఉందా..? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది.


       సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోహీరోయిన్స్ గురించి.. హర్షవర్థన్ రాణే, విష్ణువర్థన్, హరీష్ వర్మ, వితికా షేరు, రీతూ వర్మ, శ్రీ ముఖి లీడ్ రోల్స్ లో నటించారు. వీళ్లంతా బాగా నటించినా...రాయల్ రాజు పాత్ర పోషించిన విష్ణువర్ధన్ నటన బాగుంది. దర్శకుడు పవన్ కు షార్ట్ ఫిలింస్ చేసిన అలవాటు ఇంకా పోలేదు. సినిమా అంతా.. లఘుచిత్రాన్ని పోలి ఉంటుంది. పొటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ నీట్ గా కనిపించింది. ఇక ప్రొడక్షన్ వ్యాల్యూస్ అంతంత మాత్రమే.

ప్లస్ లు:.. హీరోహీరోయిన్ల నటన పర్వాలేదు, ఫొటోగ్రఫీ, 

మైనస్ లు:.. క్లైమాక్స్, షార్ట్ ఫిల్మ్ తరహా మేకింగ్, సాగతీత కథనం, బోరింగ్ సన్నివేశాలు.

        మొత్తానికి ప్రేమ ఇష్క్ కాదల్ ను అటు షార్ట్ ఫిల్మ్ అనాలో లేక జనరల్ సినిమా అనాలో తెలీని పరిస్థితి చూసిన ప్రేక్షకుడిలో తప్పక కలుగుతుంది. ఈసినిమా ఓ మల్టీప్రెక్స్ గా కనిపిస్తుంది. 

ప్రేమ ఇష్క్ కాదల్ కు '10టివి' ఇచ్చే రేటింగ్-1.75/5.
............................................

Monday, December 9, 2013

ఇదేం సినిమారా ''బుజ్జీ'' (సినిమా రివ్యూ - 'ఆడు మగాడ్రా బుజ్జీ!')



       ఒక నటుడికి ఒక హిట్‌ వస్తే సమయ, సందర్భాలతో సహా ఏయే అంశాలు కలిసొచ్చాయో గమనించుకోవాలి. అది చూసుకోకుండా, అంతా తమ ప్రతిభేనని ఇటు ఆ తారలు కానీ, అటు దర్శకులు కానీ అనుకొంటే అంతకన్నా అజ్ఞానం మరొకటి ఉండదు. ఈ చిన్న విషయాన్ని నటుడు పోసాని సుధీర్‌బాబు, ఆయన దర్శక - నిర్మాతలు మర్చిపోయినట్లున్నారు. 'ఆడు మగాడ్రా బుజ్జీ!' సినిమా చూశాక అదే అనిపిస్తుంది. 

సీనియర్‌ హీరో కృష్ణకు ఆఖరు అల్లుడూ, నవతరం స్టార్‌ మహేశ్‌బాబుకు బావా అయిన సుధీర్‌బాబుకు ఆ కుటుంబం నుంచి అండదండలు, అలాగే అభిమాన బలం కొంత మేరకు ప్లస్‌ పాయింటే. కానీ, అదే సమయంలో కేవలం మూడే మూడు సినిమాల (అందులో హీరోగా చేసినవి రెండే చిత్రాలు) వయస్సున్న నటుడు తనకు తగిన కథలు, పాత్రలు ఎంచుకోవడం అవసరం. కానీ, 'ఆడు మగాడ్రా బుజ్జీ'లో ఆ పని చేయలేదు - సుధీర్‌బాబు. 'ఏం మాయ చేశావె'లో హీరోయిన్‌ సమంతకు అన్నయ్యగా తెరరగేట్రం చేసిన సుధీర్‌బాబు ఆ తరువాత 'ఎస్‌.ఎం.ఎస్‌' (శివ మనసులో శ్రుతి)తో హీరో అయి, ఈ ఏటి హిట్‌ 'ప్రేమ కథాచిత్రమ్‌' ద్వారా తొలి విజయం అందుకున్నారు. కానీ, మరీ మూడో సినిమాకే ఇంత భారీ మాస్‌ టైటిల్‌తో, మాస్‌ డైలాగులతో సినిమా చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో అర్థం కాదు. 
తండ్రి ప్రసాద్‌ (సీనియర్‌ నటుడు నరేశ్‌) మీదకు నానా గొడవలు తెచ్చి ఇబ్బంది పాలు చేస్తుంటాడు చిన్నప్పటి నుంచి సిద్ధు. దాంతో, అతణ్ణి ఇంటికి దూరంగా హాస్టల్‌లో పెట్టి చదివిస్తాడు తండ్రి. అలా పెరిగి పెద్దవాడైన సిద్ధు (సుధీర్‌బాబు), ఇందు (అస్మితా సూద్‌) అనే ఓ కాలేజీ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆమెకు దగ్గర కావాలనే ఉద్దేశంతో ఆమె చదివే కాలేజీలోనే చేరతాడు. చెల్లెలిని అతిగా కాపాడే అన్నయ్యను బోల్తా కొట్టిస్తూ, ఆమెకు దగ్గరవుతాడు. 

అదే సమయంలో అనుకోకుండా ఊళ్ళోని ఓ రౌడీ రాజకీయ నాయకుడు శంకరన్న అలియాస్‌ బుజ్జి (అజయ్)తో గొడవ పడతాడు. హీరోయిన్‌ అన్నయ్యకూ, కాలేజీలోనే చదువుతున్న అంజలి (పూనమ్‌కౌర్‌)కీ ప్రేమ ముడి పడేలా చేస్తాడు. తీరా చూస్తే, ఆ అమ్మాయి విలన్‌ శంకరన్నకు మరదలు. ఆమెను పెళ్ళి చేసుకోవాలన్నది విలన్‌ ఆలోచన. ఈ ట్విస్టుతో సినిమా ఫస్టాఫ్‌ అయిపోతుంది. ఇక, సెకండాఫ్‌లో హీరో సదరు విలన్‌ను ఎలా బురిడీ కొట్టించాడు, అతని ఇంట్లోనే చేరి అతణ్ణి ఎలా ఆట పట్టించాడన్నది వస్తుంది. చివరకు అన్ని సినిమాల్లో లాగానే విలన్‌కు అసలు కథ తెలుస్తుంది. విలన్‌తో పోరాడి, హీరో గెలవడంతో సినిమా సుఖాంతమవుతుంది. 

నిజానికి, ఈ చిత్ర కథ కొత్తదేమీ కాదు. హీరోయిన్‌ అన్నయ్యకు ఓ బిస్కెట్‌ వేసి ఆమెను ప్రేమలో దించడం, విలన్‌ ఇంట్లోనే ఉంటూ అతణ్ణి దద్దమ్మను చేసి హీరో ఆడుకోవడం లాంటివన్నీ ఇప్పటికి సవాలక్ష తెలుగు సినిమాల్లో వచ్చేసినవే! గతంలో సక్సెసైన ఈ ఫార్ములా ఈ మధ్య బాక్సాఫీస్‌ వద్ద గోడకు కొట్టిన బంతిలా వెనక్కి తిరిగి వస్తూ, 'బూమెరాంగ్‌' అవుతున్న సంగతీ తెలిసిందే. అయినా సరే ఈ చిత్ర దర్శక, నిర్మాతలూ అలాంటి ఫార్ములా కథనే ఎంచుకున్నారు. 

పాత్రధారుల విషయానికి వస్తే, సుధీర్‌బాబు నటన క్రమక్రమంగా మెరుగుపడుతున్నా, భావోద్వేగాల వ్యక్తీకరణ విషయంలో ఆయన ఇంకా ఓనమాల దగ్గరే ఉన్నారు. కసరత్తులు చేసి, సిక్స్‌ ప్యాక్‌ బాడీని తీర్చిదిద్దుకోవడం, డ్యాన్సులు, ఫైట్లు మెరుగుపరుచుకోవడం లాంటివి మాత్రం చేశారు. ఆ ఫలితం తెర మీద కనిపిస్తుంది. హీరోయిన్‌, అలాగే పూనమ్‌ కౌర్‌లు పోషించిన పాత్రలకు పెద్దగా పరిధే లేదు. అందుకు తగ్గట్లే వారి నటనా అంతంత మాత్రమే! విలన్‌గా అజయ్ కూడా తేలిపోయాడు. దర్శకుడు శేఖర్‌ కమ్ముల 'గోదావరి' చిత్రంలో ప్రవేశపెట్టిన కుక్క పాత్రతో డైలాగుల వ్యవహారాన్ని మరింత విస్తరించి, ఈ సినిమాలో దాన్ని కామెడీకి వాడుకున్నారు. కుక్క పాత్రకు ప్రత్యేక మాండలికంలో రాసిన డైలాగులు కొన్ని చోట్ల ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. పాటల్లో నృత్యాలు, కెమేరా వర్క్‌, నిర్మాణ విలువలు సినిమాలో బాగానే ఉన్నాయి. కానీ, కథలో ఉన్న సవాలక్ష అవకతవకల్ని అవేవీ కప్పిపెట్టలేవు. 

మహేశ్‌బాబు హిట్‌ సినిమా 'అతడు'లో వచ్చే హిట్‌ డైలాగ్‌ను పట్టుకొని, ఈ సినిమాకు పెట్టుకోవడం వరకు వాణిజ్య వ్యూహం బాగానే ఉంది. కానీ, టైటిల్‌ జస్టిఫికేషన్‌ కోసమంటూ రెండే రెండు సినిమాల వయస్సున్న ఈ పసి హీరోతో పెద్ద పెద్ద డైలాగులే చెప్పించారు. 'పదిమంది కలసి ఒక్కణ్ణి కొడితే అది రౌడీయిజమ్‌! అదే ఒక్కడు పదిమందిని కొడితే అది హీరోయిజమ్‌. నేను కొడితే మీలో ఎవ్వడూ తిరిగి వెళ్ళడు... ఇదే నిజం! రండిరా!!' లాంటి డైలాగుల్ని ఈ హీరో చెబుతుంటే ప్రేక్షకులకు నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. 

గతంలో ఎస్‌.ఎస్‌. రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన గంగదాసు కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది తొలి సినిమా. రాజమౌళి దగ్గర దీర్ఘకాలంగా పనిచేస్తూ, ఆయన దగ్గర కృష్ణారెడ్డి ఏం నేర్చుకున్నారో తెలియదు కానీ, 'స్టూడెంట్‌ నంబర్‌ 1' సినిమాలోని కాలేజీ సీన్లు - రాజీవ్‌ కనకాలతో జూనియర్‌ ఎన్టీయార్‌ ట్రాక్‌ అంతా ఈ చిత్ర ప్రథమార్ధంలో కనిపించేస్తాయి. సరైన కథ కానీ, దానికి పకడ్బందీ స్క్రీన్‌ప్లే కానీ సమకూర్చుకోలేకపోయారు. అయినా ప్రథమార్ధం కుక్కతో చెప్పించిన కామెడీ డైలాగులతో సో సోగా నడిచిపోతుంది. కానీ, ద్వితీయార్ధానికి వచ్చేసరికి కథలో పట్టు లేక, దాన్ని ఎటెటో నడిపి, సాగదీశారు. ప్రేక్షకులకు బోరెత్తించారు. 


ప్రేక్షకుల దిగువ శ్రేణి అభిరుచిని సొమ్ము చేసుకోవాలన్న ప్రయత్నం మాత్రం సినిమాలో కొనసాగించారు. మగ కుక్కతో ఆడ కుక్కల 'క్రాసింగ్‌' లాంటి వెగటు కామెడీని ఆశ్రయించారు. విలన్‌ ఇంట్లోని పెళ్ళి కాని పనిమనిషి పాత్రతో అశ్లీల కామెడీ చేయించారు. పూటుగా తాగేసిన విలన్‌ ఏమో కనబడినవాడినల్లా కొట్టే సీన్‌లోనూ ఇలాంటి కామెడీకే పెద్ద పీట వేశారు. 'చీకటి పడితే చీరొద్దు... రాతిరి అయితే రైకొద్దు...' (రచన చిర్రావూరి విజయకుమార్‌) లాంటి సాహిత్యంతో రచనా మౌర్యతో సమయం, సందర్భం లేని ఓ ఐటమ్‌ సాంగ్‌ ఇరికించారు. కానీ, ఇవేవీ సినిమాకు కమర్షియల్‌ విజయాన్ని కట్టబెట్టేవి కాకపోవడమే విషాదం. వెరసి ప్రేక్షకులకు నిరాశే మిగులుస్తుందీ సినిమా! 

కొసమెరుపు: రెండున్నర గంటలు హాలులో గడిపి బయటకొస్తున్న జనంలో ఓ కుర్రాడు ఈ సినిమా గురించి చేసిన కామెంట్‌ - 'ఇదో టార్చర్‌రా బుజ్జీ!' 

- రెంటాల జయదేవ

(Published in PrajaSakti daily, 8th Dec 2013, Sunday, Page No.8)
...................................................................

Sunday, December 8, 2013

కథ మనది! సీన్లు, కథనం హాలీవుడ్‌వి! (ఆట ఆరంభం- సినిమా రివ్యూ)


తమిళ చిత్రాలు ఇటీవల నైసు దేలాయి. చిత్రీకరణ విధానంలో కొత్త పోకడలు పోతూ, స్టయిలిష్‌గా జనం ముందుకు వస్తున్నాయి. గతంలో తమిళ 'బిల్లా'లో, 
ఆ తరువాత తెలుగులో పవన్‌ కల్యాణ్‌తో 'పంజా'లోనూ ఆ రకమైన స్టయిలిష్‌ మేకింగ్‌ను చూపిన దర్శకుడు విష్ణువర్ధన్‌. ఆయన దర్శకత్వంలో మొన్న దీపావళికి తమిళంలో వచ్చిన చిత్రం - 'ఆరంభం'. అది కాస్త ఆలస్యంగా ఇప్పుడు తెలుగులో 'ఆట ఆరంభం'గా జనం ముందుకు వచ్చింది.

 తమిళ 'బిల్లా'లో లాగానే మళ్ళీ అజిత్‌, నయనతారల కాంబినేషన్‌తో దర్శకుడు చేసిన రూపొందించిన ఈ చిత్రం కథతో కన్నా, కథనం, హీరోల ఇమేజ్‌, చిత్రీకరణ విధానంతో మన ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకొనేలా ఉంది.

.................................................
తారాగణం: అజిత్‌, నయనతార, ఆర్య, రానా దగ్గుబాటి, మహేశ్‌ మంజ్రేకర్‌, అతుల్‌ కులకర్ణి, మాటలు: ఘంటసాల రత్నకుమార్‌, సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా, పాటలు: ఏ.ఎం. రత్నం, శివగణేశ్‌, కెమేరా: ఓం ప్రకాశ్‌, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌, సమర్పణ: ఏ.ఎం. రత్నం, దర్శకత్వం: విష్ణువర్ధన్‌
..................................................

   నిజానికి, ఈ చిత్ర ఇతివృత్తం - మామూలు పగ, ప్రతీకారాల ఫార్ములా. కాకపోతే, దానికి పోలీసు నేపథ్యం. సినిమా ఆరంభమే షాపింగ్‌ మాల్స్‌ లాంటి కొన్ని భారీ భవంతుల్లో హీరో పాత్ర అశోక్‌ (అజిత్‌) బాంబులుపెట్టి పేలుళ్ళు జరపడం! హీరో పాత్ర అలా ఎందుకు ప్రవర్తిస్తోందన్న ఓ ఆసక్తి ప్రేక్షకుడికి కలుగుతుంది. అంతలో కంప్యూటర్‌ హ్యాకింగ్‌లో సిద్ధహస్తుడైన అర్జున్‌ (ఆర్య) పాత్ర ప్రవేశిస్తుంది. అతణ్ణి అశోక్‌, అతని భార్య మాయ (నయనతార) బృందం కిడ్నాప్‌ చేస్తుంది. అర్జున్‌ ప్రియురాలైన టీవీ జర్నలిస్టు అనిత (తాప్సీ)ని కూడా బుట్టలో వేసుకుంటుంది. ఆమెకు హాని తలపెడతామని భయపెడుతూ, అర్జున్‌తో రకరకాల హ్యాకింగ్‌లు చేయిస్తూ, అడ్డొచ్చిన కొందరిని హతమారుస్తూ ఉంటాడు హీరో. ఇదంతా చూసి, అర్జున్‌ తెలివిగా పోలీసులకు క్లూ ఇచ్చి, హీరోను వాళ్ళు పట్టుకొనేలా చేస్తాడు. అక్కడికి ప్రథమార్ధం ముగుస్తుంది. 

హీరోను అపార్థం చేసుకున్న అర్జున్‌కు గతంలో జరిగిన సంఘటనల్ని మాయ వివరించడంతో సెకండాఫ్‌లో ఫ్లాష్‌బ్యాక్‌ వస్తుంది. మహారాష్ట్ర పోలీసు విభాగంలో యాంటీ టెర్రరిజమ్‌ స్క్వాడ్‌ (ఏ.టి.ఎస్‌)లో పని చేస్తుంటారు - హీరో, అతని స్నేహితుడు సంజరు (రానా దగ్గుబాటి). విదేశీయుల్ని బంధించిన తీవ్రవాదులను ఎదుర్కొనే ఘటనలో సంజరు ప్రాణాలు కోల్పోతాడు. పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కుమ్మక్కై నాసిరకం బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు కొనడంతో, ఆ బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించి కూడా శత్రువుల తూటాలకు బలయ్యాడని హీరో గ్రహిస్తాడు. ఉన్నతాధికారులతో తలపడతాడు. కానీ, ఆ క్రమంలో తన కుటుంబాన్నీ, సంజరు కుటుంబాన్నీ విలన్ల వల్ల పోగొట్టుకుంటాడు. వారి నుంచి ప్రాణాలతో బయటపడ్డ హీరో, అతని నెచ్చెలి మాయ ఇప్పుడిలా ప్రతీకార బాట పట్టారన్నది ఫ్లాష్‌బ్యాక్‌. ఇదంతా తెలిశాక అర్జున్‌ కూడా హీరో పక్షాన నిలుస్తాడు. వారంతా కలసి, ముంబ
యి, దుబాయి, హిమాలయాల్లో భారత సరిహద్దుల మీదుగా విలన్లను ఎలా మట్టుబెట్టారన్నది మిగతా సినిమా. 

ప్రథమార్ధం ఓ చిన్న సస్పెన్స్‌తో ఆసక్తికరంగా నడుస్తుంది. ఆర్య, తాప్సీల కాలేజీ ఘట్టాల లాంటివి కూడా చకచకా నడిచిపోతాయి. హీరో ఫ్లాష్‌బ్యాక్‌, ప్రతీకారం తీర్చుకున్న విధానం - అంతా చిత్ర ద్వితీయార్ధంలోనే వస్తాయి. ఫ్లాష్‌బ్యాక్‌ అయిపోయిన తరువాత నుంచి కథ కొద్దిగా పట్టు సడలింది. కొంత సాగదీతకు గురైనట్లు అనిపిస్తుంది. అయితే, మొత్తం మీద మాత్రం సినిమా బోర్‌ అనిపించదు. ప్రత్యేకమైన కామెడీ ట్రాక్‌, హీరో - హీరోయిన్ల ప్రేమ ట్రాక్‌, రొటీన్‌ డ్యూయెట్ల లాంటివి లేకుండానే సినిమాను నడిపించే సాహసం దర్శకుడు చేసినా, ప్రేక్షకుడు పాస్‌ మార్కులు వేసేస్తాడు.

కీర్తిశేషులు గొల్లపూడి శ్రీనివాస్‌ దర్శకత్వంలో మొదలై, అతని ఆకస్మిక మరణంతో తండ్రి గొల్లపూడి మారుతీరావు దర్శకత్వంలో పూర్తయిన 'ప్రేమ పుస్తకం' సినిమాలో శ్రీకర్‌ అనే పేరుతో చాలా ఏళ్ళ క్రితం తెలుగులోనే హీరో అజిత్‌ ప్రస్థానం మొదలైన సంగతి చాలా మందికి తెలియదు. తెలిసినా గుర్తుండదు. ఆ తరువాత అజిత్‌ అన్న పేరుతో అతను స్టయిలిష్‌ స్టార్‌గా తమిళంలో అభిమానుల్నీ, కుటుంబ ప్రేక్షకుల్నీ ఆకట్టుకున్నాడు. తనదైన మార్కెట్‌ను పెంచుకున్నాడు. కనీసం జుట్టుకు రంగు కూడా వేయకుండా, విగ్‌ లాంటివి ఏమీ లేకుండా అజిత్‌ సహజమైన 'లుక్‌'తో, చక్కగా నటించారీ చిత్రంలో! అందం, ఆకర్షణలకు అవకాశం లేని పాత్రను కూడా నయనతార బాగానే చేశారు. హ్యాకింగ్‌ దిట్టగా పాత్రలో ఆర్య ఇమిడిపోయాడు. 

అలాగే, చాలా చిన్న పాత్ర అయినా, కథకు కీలకమైన, గుర్తింపున్న ఓ పాత్రను ధరించారు - రానా దగ్గుబాటి. ఛోటా మోటా నటులు వేసినా సరిపోయే ఆ పాత్రకు రానా అంగీకరించడం విశేషం. అలా 'ఆరంభం' చిత్రం ద్వారా తమిళంలో తెరంగేట్రం చేసిన రానా దగ్గుబాటి అక్కడ గొంతివ్వకపోయినా, ఇక్కడ ఈ తెలుగు అనువాదానికి తానే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకున్నారు. విలన్లుగా ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్‌ మంజ్రేకర్‌, పోలీసు ఉన్నతాధికారి పాత్రలో అతుల్‌ కులకర్ణి తమదైన తరహా నటన చూపెట్టారు. 

సినిమాలో కెమేరా పనితనం, యాక్షన్‌ పార్ట్‌ ఆకట్టుకుంటాయి. ఘంటసాల రత్నకుమార్‌ డైలాగులు డబ్బింగ్‌ వాసనలు లేకుండా బాగున్నాయి. కానీ, తెలుగులోకి వచ్చేసరికి మిక్సింగ్‌లో లోపమో, మరేమో కానీ పాటల్లో సాహిత్యం కన్నా సంగీతమే చెవులు హౌరెత్తించింది. కొన్ని ఆడియో ట్రాక్‌లు మూసుకుపోవడం వల్లనో ఏమో సినిమాలో చాలా భాగం డైలాగులు నూతిలో గొంతుల లాగా ఎక్కడ నుంచో వినపడినట్లు అనిపిస్తాయి. అలాగే, కనీసం ఒకచోట తెర పై కనిపించే టైటిల్‌ కార్డుల్లో 'ముంబయి' అని చూపడానికి తెలుగు బదులు తమిళ లిపిలోనే కనిపించేస్తుంది. ఏ.ఎం. రత్నం లాంటి పెద్ద చిత్రాల అనువాద నిర్మాత సారథ్యంలో ఇలా జరగడం విచిత్రమే. 

నిజానికి, కొన్నేళ్ళ క్రితం ముంబయిలో 'తాజ్‌' హౌటల్‌పై పాకిస్తానీ తీవ్రవాదులు దాడి జరిపిన '26/ 11' ఘటన అందరికీ తెలిసిందే. అప్పట్లో పోలీసు శాఖలో నాసిరకం బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ కొనుగోళ్ళ కుంభకోణం గురించి, దానివల్లే ముష్కరుల దాడిలో కొందరు సిన్సియర్‌ అధికారులు బలై పోయారనీ వార్తలు వెలుగులోకి వచ్చాయి. మనదేశంలో జరిగిన ఆ యథార్థ కథ స్ఫూర్తితో ఈ చిత్ర కథను అల్లుకున్నట్లు కనిపిస్తుంది. 

అయితే, దానికి ఓ హాలీవుడ్‌ సినిమా ఘట్టాలను కలిపారు. ఈ సినిమాలోని కంప్యూటర్‌ హ్యాకింగ్‌ ఘట్టాలు వగైరా అన్నీ 'స్వోర్డ్‌ ఫిష్‌' అనే హాలీవుడ్‌ చిత్రం నుంచి అరువు తెచ్చుకున్నవే. అలా తెలివిగా దర్శకుడు ఓ మామూలు పగ, ప్రతీకారాల ఫార్ములాకు దేశంలో జరిగిన కథనూ, హాలీవుడ్‌ సీన్లు, కథనం కలిపేసి, హీరోల ఇమేజ్‌ ఆసరాగా పాస్‌ చేయించేశాడు. ఈ చిత్ర తమిళ మాతృక ఇప్పటికే తమిళనాట రూ. 100 కోట్ల పైగా వసూలు చేసింది. రొటీన్‌ చిత్రాలతో విసిగిన తెలుగు ప్రేక్షకులకు రిలీఫ్‌గా ఈ తెలుగు డబ్బింగ్‌ కూడా వాణిజ్య విజయం అందుకొనే సూచనలున్నాయి. 

- రెంటాల జయదేవ

(Published in Praja Sakti daily, 7th Dec 2013, Saturday, Page No.8)
.................................