ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్. రవి సహ నిర్మాతగా వ్యవహరించగా, దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు కూడా ప్రమేయమున్న సినిమా 'సెకండ్ హ్యాండ్'. మొన్నటి 'ప్రేమ... ఇష్క్... కాదల్' లాగానే ఈ సినిమా కూడా మూడు ప్రేమ కథల మేళవింపు. మొదటి కథలో సంతోష్ (సుధీర్ వర్మ) ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. తొలి చూపులోనే అతను దీపూ (ధన్యా బాలకృష్ణన్) ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కూడా అతణ్ణి ప్రేమిస్తుంది కానీ, అంతకన్నా డబ్బు, హౌదా ఉన్న మెరుగైన సంబంధం ఇంట్లోవాళ్ళు కుదిర్చే సరికి, ఆ పెళ్ళి చేసేసుకుంటుంది. సంతోష్‌ను వదిలేస్తుంది. ''ప్రాబ్లమ్స్ లేకుండా గెలవడం విక్టరీ... ప్రాబ్లమ్స్‌ను ఎదుర్కొని గెలవడం హిస్టరీ'' అనే సంతోష్ చివరకు ఆత్మహత్యకు పాల్పడాలనుకుంటాడు.
ఈ కథంతా తన దగ్గరకు వచ్చిన సుబ్బారావు (కిరీటి దామరాజు)కు చెప్పుకుంటాడు. ఆత్మహత్య ద్వారా పగ తీర్చుకోవాలనుకుంటాడు. దానికి సుబ్బారావు నవ్వేసి, తనతో పెళ్ళి చేసుకొని కూడా పాత బారుఫ్రెండ్‌ను వదిలిపెట్టని స్వేచ్ఛ (మళ్ళీ ధన్యా బాలకృష్ణనే) గురించి చెప్పుకొస్తాడు.
ఇది రెండో ప్రేమ లేదా పెళ్ళి కథ.
ఇది రెండో ప్రేమ లేదా పెళ్ళి కథ.
వేర్వేరు అమ్మాయిల చేత జీవితంలో దెబ్బతిన్న ఈ ఇద్దరికీ సహస్ర (ముచ్చటగా మూడో పాత్రలోనూ ధన్యే) అనే అమ్మాయి ఎదురవుతుంది. పెళ్ళి కాకుండానే తనను తల్లి చేసిన స్నేహితుడు చైతన్య (శ్రీవిష్ణు)కూ, ఆ సమయంలో తన వెంటే ఉండి అబార్షన్ చేయించిన మరో స్నేహితుడు సిద్ధూకూ మధ్య ఆమె ప్రేమ ఊగిసలాడుతుంటుంది. ఎవరిని పెళ్ళికి ఎంచుకోవాలో తెలియడం లేదనే పాత్ర ఆమెది. అది మూడో ప్రేమ కథ. ఈ మూడు కథలు, ఇందులోని ఈ ముగ్గురి జీవితం చివరకు ఏమైందన్నది మిగతా సినిమా.
తమిళంలో ఇప్పటికే పలు పాత్రలు పోషించినా, తెలుగు తెరకు కొత్త అయిన ధన్య అందం, అభినయం ఈ సినిమాకు ప్లస్. ఆమెతోనే మూడు స్త్రీ పాత్రలూ ధరింపజేయడం ప్రయోగమే. ఇతర నటీనటులు, ముఖ్యంగా సుబ్బారావు పాత్రధారి సహజంగా నటించారు. వారి నుంచి ఆ నటనను రాబట్టుకున్న దర్శకుణ్ణి మెచ్చుకోవచ్చు. సహస్రను ప్రేమించే తమిళ శరవణన్‌గా సెకండాఫ్‌లో కొన్ని సీన్లలో దర్శకుడూ తెరపై మెరిశాడు.
అందరి అభినయం బాగున్నా అసలు కథలోనే కొన్ని లోటుపాట్లున్నాయి. ఘంటసాల పాడిన కరుణశ్రీ 'పుష్పవిలాపం'లోని బిట్‌తో మొదలయ్యే ఈ సినిమాలో చూపిన కథలన్నీ చివరకు తప్పంతా అమ్మాయిలదే అన్న పురుషాధిపత్య భావజాలాన్నే ప్రతిఫలించాయి. మొన్నటికి మొన్న 'ప్రేమ...ఇష్క్... కాదల్' లోనూ ఈ తరహా ట్రీట్‌మెంటే చూశాం. ఇది సమాజంలోని వాస్తవికతను పాక్షికమైన దృష్టితో చూడడమే! దాంతో, 'లవ్, కెరీర్, వ్యాపారం - ఈ మూడింటిలో నమ్మకంతో ఓ చేయి పట్టుకొని వెళ్ళాలి. ఒక వేళ ఆ చేయి ఎక్కడైనా వదిలేసినా, జీవితాన్ని అంతం చేసుకోకుండా మరో చేయి (సెకండ్ హ్యాండ్)ని పట్టుకొని ముందుకు వెళ్ళాల'ంటూ ఆఖరులో చెప్పిన గీతోపదేశం తూతూ మంత్రమైంది. 'అప్పటికే ఉపయోగించేసిన' అన్న డబుల్ మీనింగే ఈ టైటిల్ అంతరార్థంగా మారింది.
పైగా, గతంలో తమిళంలో సినిమాలు తీసినా, తెలుగులో మాత్రం తొలి చిత్ర దర్శకుడైన కిశోర్ తిరుమల ఈ యువతరం ప్రేమకథల్ని తెరపై డీల్ చేయడంలో కొంత తడబడ్డాడు. సంతోష్, సుబ్బారావుల కథలతో ఫస్టాఫ్ చకచకా సాగిపోతుంది. కానీ, సహస్ర కథ వచ్చే సెకండాఫ్ జీడిపాకంగా మారింది. చివరకు వచ్చేసరికి డాక్టర్ పాత్రలో పోసానితో చెప్పించిన ఉపదేశాలు కథకూ, పాత్రల స్వభావాలకూ సరిగ్గా అమరలేదు.
పరిమిత బడ్జెట్‌లో, 5డి కెమేరా లాంటి వాటితో, ఇద్దరు కెమేరామన్లతో తీసిన ఈ సినిమా పెద్ద తెరపై విజువల్‌గా క్రమరహితంగా కనిపించేస్తుంది. సంగీతం కూడా సో..సో. పాత హిట్ పాటలనే నేపథ్యంలో వినిపిస్తూ, చాలా భాగం పని కానిచ్చేశారు. అయితే, కొత్త తరాన్ని ఆకట్టుకొనే నవీన యుగపు ప్రేమ కథ కావడం, క్లైమాక్స్‌లో టైటిల్స్ పడుతుండగా 'సుబ్బారావు...' అంటూ సింగిల్ షాట్‌లో ఓ పాటంతా తీయడం లాంటి ప్రయోగాత్మక వైఖరి, విజువల్‌గా రొటీన్‌కు కొత్తగా ఉండేందుకు చేసిన ప్రయత్నం ఈ సినిమాను ఫరవాలేదనిపిస్తాయి. కానీ, చివరకు వచ్చేసరికి సెకండాఫ్ బలహీనత ప్రేక్షకులకు కడుపు నిండని భోజనంగానే సినిమాను మార్చేస్తుంది. - రెంటాల జయదేవ
(ప్రజాశక్తి దినపత్రిక, 15 డిసెంబర్ 2013, ఆదివారం, పేజీ నం.8లో ప్రచురితం)
.........................................
0 వ్యాఖ్యలు:
Post a Comment