జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, December 9, 2013

ఇదేం సినిమారా ''బుజ్జీ'' (సినిమా రివ్యూ - 'ఆడు మగాడ్రా బుజ్జీ!')



       ఒక నటుడికి ఒక హిట్‌ వస్తే సమయ, సందర్భాలతో సహా ఏయే అంశాలు కలిసొచ్చాయో గమనించుకోవాలి. అది చూసుకోకుండా, అంతా తమ ప్రతిభేనని ఇటు ఆ తారలు కానీ, అటు దర్శకులు కానీ అనుకొంటే అంతకన్నా అజ్ఞానం మరొకటి ఉండదు. ఈ చిన్న విషయాన్ని నటుడు పోసాని సుధీర్‌బాబు, ఆయన దర్శక - నిర్మాతలు మర్చిపోయినట్లున్నారు. 'ఆడు మగాడ్రా బుజ్జీ!' సినిమా చూశాక అదే అనిపిస్తుంది. 

సీనియర్‌ హీరో కృష్ణకు ఆఖరు అల్లుడూ, నవతరం స్టార్‌ మహేశ్‌బాబుకు బావా అయిన సుధీర్‌బాబుకు ఆ కుటుంబం నుంచి అండదండలు, అలాగే అభిమాన బలం కొంత మేరకు ప్లస్‌ పాయింటే. కానీ, అదే సమయంలో కేవలం మూడే మూడు సినిమాల (అందులో హీరోగా చేసినవి రెండే చిత్రాలు) వయస్సున్న నటుడు తనకు తగిన కథలు, పాత్రలు ఎంచుకోవడం అవసరం. కానీ, 'ఆడు మగాడ్రా బుజ్జీ'లో ఆ పని చేయలేదు - సుధీర్‌బాబు. 'ఏం మాయ చేశావె'లో హీరోయిన్‌ సమంతకు అన్నయ్యగా తెరరగేట్రం చేసిన సుధీర్‌బాబు ఆ తరువాత 'ఎస్‌.ఎం.ఎస్‌' (శివ మనసులో శ్రుతి)తో హీరో అయి, ఈ ఏటి హిట్‌ 'ప్రేమ కథాచిత్రమ్‌' ద్వారా తొలి విజయం అందుకున్నారు. కానీ, మరీ మూడో సినిమాకే ఇంత భారీ మాస్‌ టైటిల్‌తో, మాస్‌ డైలాగులతో సినిమా చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో అర్థం కాదు. 
తండ్రి ప్రసాద్‌ (సీనియర్‌ నటుడు నరేశ్‌) మీదకు నానా గొడవలు తెచ్చి ఇబ్బంది పాలు చేస్తుంటాడు చిన్నప్పటి నుంచి సిద్ధు. దాంతో, అతణ్ణి ఇంటికి దూరంగా హాస్టల్‌లో పెట్టి చదివిస్తాడు తండ్రి. అలా పెరిగి పెద్దవాడైన సిద్ధు (సుధీర్‌బాబు), ఇందు (అస్మితా సూద్‌) అనే ఓ కాలేజీ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆమెకు దగ్గర కావాలనే ఉద్దేశంతో ఆమె చదివే కాలేజీలోనే చేరతాడు. చెల్లెలిని అతిగా కాపాడే అన్నయ్యను బోల్తా కొట్టిస్తూ, ఆమెకు దగ్గరవుతాడు. 

అదే సమయంలో అనుకోకుండా ఊళ్ళోని ఓ రౌడీ రాజకీయ నాయకుడు శంకరన్న అలియాస్‌ బుజ్జి (అజయ్)తో గొడవ పడతాడు. హీరోయిన్‌ అన్నయ్యకూ, కాలేజీలోనే చదువుతున్న అంజలి (పూనమ్‌కౌర్‌)కీ ప్రేమ ముడి పడేలా చేస్తాడు. తీరా చూస్తే, ఆ అమ్మాయి విలన్‌ శంకరన్నకు మరదలు. ఆమెను పెళ్ళి చేసుకోవాలన్నది విలన్‌ ఆలోచన. ఈ ట్విస్టుతో సినిమా ఫస్టాఫ్‌ అయిపోతుంది. ఇక, సెకండాఫ్‌లో హీరో సదరు విలన్‌ను ఎలా బురిడీ కొట్టించాడు, అతని ఇంట్లోనే చేరి అతణ్ణి ఎలా ఆట పట్టించాడన్నది వస్తుంది. చివరకు అన్ని సినిమాల్లో లాగానే విలన్‌కు అసలు కథ తెలుస్తుంది. విలన్‌తో పోరాడి, హీరో గెలవడంతో సినిమా సుఖాంతమవుతుంది. 

నిజానికి, ఈ చిత్ర కథ కొత్తదేమీ కాదు. హీరోయిన్‌ అన్నయ్యకు ఓ బిస్కెట్‌ వేసి ఆమెను ప్రేమలో దించడం, విలన్‌ ఇంట్లోనే ఉంటూ అతణ్ణి దద్దమ్మను చేసి హీరో ఆడుకోవడం లాంటివన్నీ ఇప్పటికి సవాలక్ష తెలుగు సినిమాల్లో వచ్చేసినవే! గతంలో సక్సెసైన ఈ ఫార్ములా ఈ మధ్య బాక్సాఫీస్‌ వద్ద గోడకు కొట్టిన బంతిలా వెనక్కి తిరిగి వస్తూ, 'బూమెరాంగ్‌' అవుతున్న సంగతీ తెలిసిందే. అయినా సరే ఈ చిత్ర దర్శక, నిర్మాతలూ అలాంటి ఫార్ములా కథనే ఎంచుకున్నారు. 

పాత్రధారుల విషయానికి వస్తే, సుధీర్‌బాబు నటన క్రమక్రమంగా మెరుగుపడుతున్నా, భావోద్వేగాల వ్యక్తీకరణ విషయంలో ఆయన ఇంకా ఓనమాల దగ్గరే ఉన్నారు. కసరత్తులు చేసి, సిక్స్‌ ప్యాక్‌ బాడీని తీర్చిదిద్దుకోవడం, డ్యాన్సులు, ఫైట్లు మెరుగుపరుచుకోవడం లాంటివి మాత్రం చేశారు. ఆ ఫలితం తెర మీద కనిపిస్తుంది. హీరోయిన్‌, అలాగే పూనమ్‌ కౌర్‌లు పోషించిన పాత్రలకు పెద్దగా పరిధే లేదు. అందుకు తగ్గట్లే వారి నటనా అంతంత మాత్రమే! విలన్‌గా అజయ్ కూడా తేలిపోయాడు. దర్శకుడు శేఖర్‌ కమ్ముల 'గోదావరి' చిత్రంలో ప్రవేశపెట్టిన కుక్క పాత్రతో డైలాగుల వ్యవహారాన్ని మరింత విస్తరించి, ఈ సినిమాలో దాన్ని కామెడీకి వాడుకున్నారు. కుక్క పాత్రకు ప్రత్యేక మాండలికంలో రాసిన డైలాగులు కొన్ని చోట్ల ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. పాటల్లో నృత్యాలు, కెమేరా వర్క్‌, నిర్మాణ విలువలు సినిమాలో బాగానే ఉన్నాయి. కానీ, కథలో ఉన్న సవాలక్ష అవకతవకల్ని అవేవీ కప్పిపెట్టలేవు. 

మహేశ్‌బాబు హిట్‌ సినిమా 'అతడు'లో వచ్చే హిట్‌ డైలాగ్‌ను పట్టుకొని, ఈ సినిమాకు పెట్టుకోవడం వరకు వాణిజ్య వ్యూహం బాగానే ఉంది. కానీ, టైటిల్‌ జస్టిఫికేషన్‌ కోసమంటూ రెండే రెండు సినిమాల వయస్సున్న ఈ పసి హీరోతో పెద్ద పెద్ద డైలాగులే చెప్పించారు. 'పదిమంది కలసి ఒక్కణ్ణి కొడితే అది రౌడీయిజమ్‌! అదే ఒక్కడు పదిమందిని కొడితే అది హీరోయిజమ్‌. నేను కొడితే మీలో ఎవ్వడూ తిరిగి వెళ్ళడు... ఇదే నిజం! రండిరా!!' లాంటి డైలాగుల్ని ఈ హీరో చెబుతుంటే ప్రేక్షకులకు నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. 

గతంలో ఎస్‌.ఎస్‌. రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన గంగదాసు కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది తొలి సినిమా. రాజమౌళి దగ్గర దీర్ఘకాలంగా పనిచేస్తూ, ఆయన దగ్గర కృష్ణారెడ్డి ఏం నేర్చుకున్నారో తెలియదు కానీ, 'స్టూడెంట్‌ నంబర్‌ 1' సినిమాలోని కాలేజీ సీన్లు - రాజీవ్‌ కనకాలతో జూనియర్‌ ఎన్టీయార్‌ ట్రాక్‌ అంతా ఈ చిత్ర ప్రథమార్ధంలో కనిపించేస్తాయి. సరైన కథ కానీ, దానికి పకడ్బందీ స్క్రీన్‌ప్లే కానీ సమకూర్చుకోలేకపోయారు. అయినా ప్రథమార్ధం కుక్కతో చెప్పించిన కామెడీ డైలాగులతో సో సోగా నడిచిపోతుంది. కానీ, ద్వితీయార్ధానికి వచ్చేసరికి కథలో పట్టు లేక, దాన్ని ఎటెటో నడిపి, సాగదీశారు. ప్రేక్షకులకు బోరెత్తించారు. 


ప్రేక్షకుల దిగువ శ్రేణి అభిరుచిని సొమ్ము చేసుకోవాలన్న ప్రయత్నం మాత్రం సినిమాలో కొనసాగించారు. మగ కుక్కతో ఆడ కుక్కల 'క్రాసింగ్‌' లాంటి వెగటు కామెడీని ఆశ్రయించారు. విలన్‌ ఇంట్లోని పెళ్ళి కాని పనిమనిషి పాత్రతో అశ్లీల కామెడీ చేయించారు. పూటుగా తాగేసిన విలన్‌ ఏమో కనబడినవాడినల్లా కొట్టే సీన్‌లోనూ ఇలాంటి కామెడీకే పెద్ద పీట వేశారు. 'చీకటి పడితే చీరొద్దు... రాతిరి అయితే రైకొద్దు...' (రచన చిర్రావూరి విజయకుమార్‌) లాంటి సాహిత్యంతో రచనా మౌర్యతో సమయం, సందర్భం లేని ఓ ఐటమ్‌ సాంగ్‌ ఇరికించారు. కానీ, ఇవేవీ సినిమాకు కమర్షియల్‌ విజయాన్ని కట్టబెట్టేవి కాకపోవడమే విషాదం. వెరసి ప్రేక్షకులకు నిరాశే మిగులుస్తుందీ సినిమా! 

కొసమెరుపు: రెండున్నర గంటలు హాలులో గడిపి బయటకొస్తున్న జనంలో ఓ కుర్రాడు ఈ సినిమా గురించి చేసిన కామెంట్‌ - 'ఇదో టార్చర్‌రా బుజ్జీ!' 

- రెంటాల జయదేవ

(Published in PrajaSakti daily, 8th Dec 2013, Sunday, Page No.8)
...................................................................

0 వ్యాఖ్యలు: