జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, September 30, 2013

అందరి లానే... బాక్సాఫీస్ దారిలోనే.... (‘అత్తారింటికి దారేది’ సినిమా సమీక్ష - పార్ట్ 2)దాదాపు పదేళ్ళ క్రితం సిల్వెస్టర్ స్టాలిన్, ఆంథోనీ క్విన్ లాంటి ప్రసిద్ధ తారలు నటించగా వచ్చిన హాలీవుడ్ చిత్రం ఎవెంజింగ్ ఏంజెలో. ఆ కథలోని ఓ పాయింట్ ను మాత్రం తీసుకొని, దానితో ఎక్కడా పోలికే లేకుండా, పూర్తిగా మార్చేసి, మన నేటివిటికీ, సెంటిమెంట్ కూ తగ్గట్లుగా అల్లుకున్న కథ ఈ అత్తారింటికి దారేది.... ఇది హాలీవుడ్ చిత్రాలతో లోతైన పరిచయం ఉన్నకొందరు మిత్రులు చెబుతున్న మాట. మూలం ఎక్కడిదైనా, అసలు మేనత్తను వెతుక్కుంటూ మేనల్లుడు వెళ్ళడం, రెండు కుటుంబాలను కలపడం లాంటి థీమ్ లు తెలుగు సినిమాకు కొత్త కావు.
ఈ పాత చింతకాయ పచ్చడి కథే దర్శక, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ చూపిన విధానంతో ఫస్టాఫ్ వరకు చకచకా బాగానే నడిచినట్లు అనిపిస్తుంది. కానీ, సెకండాఫ్ దగ్గరకు వచ్చేసరికి, సినిమా ఆసక్తిగా నడవడం క్రమంగా మానేస్తుంది. అదే పనిగా ఏవేవో మలుపులు తిరుగుతూ, కొత్త పాత్రలను కలుపుకొంటూ, ఇప్పటికే చాలా సినిమాల్లో వచ్చేసిన ఘట్టాలను గుర్తు చేస్తూ, ఊహించగలిగే రీతిలోనే ముందుకు సా...గుతుంది. దాంతో, ఈ 2 గంటల యాభై నిమిషాల నిడివి చిత్రాన్ని విసుగు తెలియకుండా నడపడానికి త్రివిక్రమ్, గడపడానికి ప్రేక్షకులు శ్రమ పడ్డారు.
అయితే, ఈ సినిమాకు పాత్రధారుల నటన, సాంకేతిక నిపుణుల శ్రమ బాగానే కలిసొచ్చిన అంశాలు. ఇప్పటికే గబ్బర్ సింగ్ సూపర్ హిట్ తో జోరు మీదున్న పవన్ కల్యాణ్ ఇందులోని పాత్రను చాలా చులాగ్గా, తనదైన శైలిలో నటించారు. వినోదాన్ని సహజంగా పండించారు. ఒంటి మీద పైట సర్దుకుంటూ, అలవాటైన ఆడ వస్త్రధారణ కామెడీనీ మరోసారి యథాశక్తి పోషించారు. సినిమాను తన భుజాల మీద మోశారు. కొన్ని సెంటిమెంట్ సన్నివేశాల్లో, సింపుల్ గా ఉంటూనే ఎఫెక్టివ్ గా అనిపించే యాక్షన్ సన్నివేశాల్లో ప్రత్యేకంగా అలరిస్తారు.
ఇక, నటి, సిద్ధార్థ్ బావ సహా కొన్ని తెలుగు చిత్రాల్లో నటించిన అనుభవమున్న కన్నడ నటి ప్రణీత చూడడానికి అందంగా ఉంది. కొన్ని సందర్భాల్లో జల్సా లాంటి మునుపటి త్రివిక్రమ్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ పార్వతీ మెల్టన్ ను గుర్తుకు తెచ్చింది. పొట్టిగా ఉన్నా, నటనలో హుషారు తగ్గని సమంత పాటల్లో మెరిసింది. ఇలాంటి పెద్ద కుటుంబ కథా చిత్రంలో నిండుగా ఉండే ఇతర పాత్రధారులందరూ ఉన్న ఒకటీ అరా డైలాగులు, సీన్లతోనే తమ పరిధి మేరకు నటించారు.

ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు, పాటలు హైలైట్. ఆరడుగుల బుల్లెట్టూ..., కిర్రాకు ర్రాకు ర్రాకు పుట్టిస్తావే..., బేట్రాయి సామిదేవుడా..., అమ్మో బాపు గారి బొమ్మో... లాంటి నాలుగైదు పాటలు ఇప్పటికే జనం నోట నాట్యమాడుతున్నాయి. కాబట్టి, సినిమాకొచ్చిన ప్రేక్షకులనూ అవి అలరించే అంశాలే. ఇక, ఛాయాగ్రహణం మునుపటి త్రివిక్రమ్ చిత్రాలతో పోలిస్తే తగ్గినా, లోటుగా అనిపించలేదు.
బయట స్టిల్స్ లో ఉన్న చాలా దృశ్యాలు తీరా తెరపై సినిమాలో కనిపించవు. అంటే, తెరపై కనిపిస్తున్న 169 నిమిషాలలో కాకుండా, ఎడిటింగ్ కత్తెరకు బలై కనిపించకుండాపోయిన అనేకానేక నిమిషాల్లో అలాంటి సన్నివేశాలన్నీ ఉన్నాయని ఊహించవచ్చు. దర్శకుణ్ణి ఒప్పించి, కత్తెరకు మరింత పదును పెట్టి, ఇంకొంత నిడివి తగ్గిస్తే ప్రేక్షకులు పెద్ద రిలీఫ్ ఫీలయ్యేవారు. యాక్షన్ పార్ట్, చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓ పాత తరహా కథనే తీసుకున్నా, దాన్ని క్రేజీ కాంబినేషన్ లో, వినోదాత్మకంగా, మాటల బలంతో, హిట్ పాటలతో అందిస్తే ఎలా ఉంటుందనేది అత్తారింటికి దారేది... సినిమా చూసి, అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు బలమూ, బలహీనత రెండూ అదే. కథాంశం పాతదే తీసుకున్నా, దానికి సమకాలీన సరికొత్త నేపథ్యాన్ని సమకూర్చడం మీద త్రివిక్రమ్ తన పాళీతో కసరత్తు చేశారు. హీరోను ఇటలీ నుంచి ఇండియాకు రప్పించి, కథకు ఫారెన్ బ్యాక్ డ్రాప్ కూడా జత చేశారు. కానీ, సెకండాఫ్ కు వచ్చేసరికి, కథను ఎలా నడపాలో తెలియలేదు. హీరో పాత్రకు కూడా ఒక నిర్ణీత గమనం లేక, రకరకాల పాత్రల వెంట ఎటుపడితే అటు కథ వెళుతుంటుంది.
అయితే, ఈ క్రమంలో తనదైన రీతిలో సినిమాను సకుటుంబ కథా చిత్రంగా తీర్చిదిద్ది, పవన్ కల్యాణ్ కు మరింత సమగ్రమైన ఇమేజ్ ను సంతరించేందుకు త్రివిక్రమ్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కొద్ది కాలంగా తనను ఊరిస్తున్న భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడానికి హీరో ఇమేజ్ నూ, వినోదాన్నీ మేళవిస్తూ సినిమాలో ఎన్ని చేయాలో అన్నీ చేశారు. గబ్బర్ సింగ్ లోని పాపులర్ పాట కెవ్వు కేక... వరుసలోనే ఓ సెటైరికల్ పాట పెట్టారు.
ఆఫ్రికా నుంచి వచ్చిన వజ్రాల గనుల వ్యాపారి బద్దం భాస్కర్ అయిన బ్రహ్మానందం బ్యాచ్ తో అహల్య అమాయకురాలు అంటూ (దాదాపు ప్రేక్షకులకు విసుగొచ్చేలా నాలుగు సార్లు) ఓ రిపీట్ నాటక ఘట్టం పెట్టారు. సమకాలీన సమాజంలోని నిత్యానంద స్వామి లాంటి దొంగ సాధువులు, బాబాల మీద ఓ సైటెర్ పెట్టారు. అబద్ధం చెబితే, ఆకులు రాలే వృక్షమంటూ ఓ ఎపిసోడ్ చేశారు. ఇలా సెకండాఫ్ లో చేయనిదంటూ లేదు... ఒక్క సినిమా కథను సాఫీగా ముందుకు నడపడం తప్ప.
మనదైన భాష, సంస్కృతి, శాస్త్రీయ, జానపద గీతాల మీద ఎంతో అభిరుచి, కొంత అభినివేశం ఉన్న త్రివిక్రమ్ ఈ సినిమాలో దేవదేవం భజే దివ్యప్రభావం... అంటూ అన్నమయ్య రాసిన సంస్కృత కీర్తన పల్లవితో మొదలై వచ్చే కొత్త పాటనూ, అలాగే ప్రసిద్ధ జానపద దశావతార గీతమైన బేట్రాయి సామిదేవుడా...నూ బాగా వాడారు. మొదటి శాస్త్రీయ కీర్తనకు హీరోయిన్ ప్రణీతతో నర్తింపజేశారు కూడా. ఎన్నో ఏళ్ళ క్రితమే బి.ఎన్.  రెడ్డి తీసిన వాహినీ వారి సుమంగళి (1940)లో వచ్చినదే అయినా, పవన్ కల్యాణ్ మరింత ఊపుతో స్వయంగా పాడించి బేట్రాయి సామిదేవుడా... పాటను పెట్టారు. కానీ, తీరా దాన్ని ఓ హాస్య సన్నివేశం కోసం వాడిన తీరు పెద్దగా అతకలేదు. పైగా, అసలు సినిమాలో కన్నా ఆ పాట పవన్ రికార్డింగ్ దృశ్యాలతో కూడిన టీజర్ లోనే బాగుందని ప్రేక్షకులు భావిస్తే ఆశ్చర్యం లేదు.
ఇంటర్వెల్ కు ముందు హీరో ఎవరన్నది నదియా హఠాత్తుగా కనిపెట్టడానికి కానీ, అలాగే సెకండాఫ్ లో రావు రమేశ్ అకస్మాత్తుగా హీరోను తన ఇంటి నుంచి వెళ్ళిపొమ్మనడానికి కానీ సరైన కారణాలు కనిపించవు. కథ కోసం రచయిత తన పాత్రలతో అలా బలవంతాన ప్రవర్తింపజేశాడని సరిపెట్టుకోవాల్సిందే.
ఇక, సినిమాలో లాయరైన రావు రమేశ్ పోషించిన పాత్ర పేరు శేఖర్. ఫ్లాష్ బ్యాక్ లోనూ అతని భార్య పాత్ర సునంద (నదియా) ఆ పేరే చెబుతుంది. కానీ, అతనికి బుల్లెట్ గాయమైన ఘట్టంలో మాత్రం ....సిద్ధూ, సిద్ధూ... అంటూ వేరే పేరు పలవరిస్తుంది. నిజానికి, సిద్ధార్థ అలియాస్ సిద్ధు అన్నది డ్రైవర్ వేషం కోసం సినిమాలో హీరో పెట్టుకొనే దొంగ పేరు. ఎడిటింగ్ లోనో, కనీసం విడుదలకు సిద్ధమైన ఆఖరు క్షణంలోనో అయినా ఈ పొరపాటును సులభంగానే సరిదిద్దుకోవచ్చు. కానీ, యూనిట్ ఆ తప్పును గుర్తించినట్లే లేదు.
సినిమాలో అలీ డాక్టరో, నర్సో, జీపు డ్రైవరో అర్థం కాదు. అలాగే, సిద్దప్పతో తొలి కొట్లాట కానీ, చివరలో రైల్వే స్టేషన్ లో కొట్లాట కానీ, బలవంతాన కథ కోసం ఆగిపోయినవేనని అనిపిస్తాయి. హీరో వెంట పడి అక్కడ దాకా వచ్చిన ఈ బడా ఫ్యాక్షనిస్టుల బ్యాచ్ న్యూస్ పేపర్ అడ్డం పెట్టుకొని, తల దాచుకోవడం లాంటివి నప్పలేదు.
          సుదీర్ఘంగా నడిచినట్లు అనిపించే ఈ చిత్రంలో త్రివిక్రమ్ మార్కు కొత్తదనం కనిపించదు. కొన్ని డైలాగులు సందర్భశుద్ధి లేకుండా హీరోయిజమ్ కోసం, హీరో నోట నాలుగు మంచి మాటలు చెప్పించాలనే తపనతో వచ్చినట్లు అనిపిస్తాయి. అయితేనేం, మొత్తం మీద అనుప్రాసతో కూడిన తన శైలి డైలాగులతో త్రివిక్రమ్ థియేటర్ లో మోత మోగించారు. ‘‘తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది... విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది’’ (రావు రమేశ్), ‘‘ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు...’’ (ఎమ్మెస్ నారాయణ) లాంటి కొన్ని డైలాగులు బహుశా చాలా కాలం పాటు సినీ ప్రియులు చెప్పుకొనేవిగా మిగిలిపోతాయి.   

కానీ, మాస్ మసాలా దర్శకులందరి చిత్రాలలో లాగానే హీరో ఇంట్రడక్షన్ ఫైటు, పంచ్ డైలాగులు, క్లబ్బులో ప్రత్యేక నృత్యగీతం, బ్రహ్మానందం కామెడీ ట్రాక్, అబ్బాయిల కన్నా అమ్మాయిలే స్పీడుగా ఉన్నారన్నట్లు వారి ప్రేమ, పెళ్ళి తొందరలను చూపే సన్నివేశాలు, ఘాటైన చూపులు, మాటలు, చేష్టలు అన్నీ ఈ త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్ సినిమాలోనూ ఉండడం విచిత్రం. కొన్ని చోట్ల, ముఖ్యంగా సెకండాఫ్ లో దర్శకుడు శ్రీను వైట్ల చిత్రాల మార్కు స్క్రీన్ ప్లే అనుకరణలు కూడా కనిపిస్తాయి.
అయితే, కేవలం యూత్ నే టార్గెట్ చేయకుండా, పిల్లా పెద్దా అందరితో కుటుంబంలోని ఆడా, మగా కలిసి హాలుకు వచ్చేలా సినిమాను డిజైన్ చేసిన తెలివితేటలూ ఉన్నాయి. అందుకే, అత్తారింటికి దారేది...ని అస్సలు బాగా లేదనీ చెప్పలేం... అలాగని, ఆహా, ఓహో, బ్రహ్మాండం అనీ అనలేం. ముచ్చటైన మూడు గంటల కుటుంబ కాలక్షేపంగా ఈ సినిమా పాసై పోతుంది.
ఏతావతా, ఇన్ని సక్సెస్ ఫార్ములాల కలబోతగా, వంట తెలిసిన దర్శక, హీరోల వడ్డింపుగా ఈ అత్తారింటికి దారేది... సినిమా అపూర్వ విజయాన్ని అందుకోవచ్చు. రికార్డులు సృష్టించనూ వచ్చు. రేపు పొద్దున ఏ టీవీ చానల్ లోనో హాలులో కన్నా ఎక్కువ షోలు ఆడేసి, అక్కడా ప్రకటనల మధ్య కాసుల పంట పండించవచ్చు. కానీ ఇలా అన్నీ ఉన్నా, అభిరుచి గల త్రివిక్రమ్ చిత్రాల అభిమాన ప్రేక్షకులకు మాత్రం ఈ చిత్రంతో ఏదో తెలియని అసంతృప్తే కలుగుతుంది. చివరకు, ఆలోచనలో, రాతలో, తీతలో ఇంతకన్నా మెరుగైన చిత్రాలను గతంలోనే తీసేసిన సృజనశీలిగా త్రివిక్రమ్ కు సైతం ఈ చిత్రం ఆత్మ తృప్తినిస్తుందా అన్నది అనుమానంగానే మిగులుతుంది. 

- రెంటాల జయదేవ
...................................................Sunday, September 29, 2013

అపూర్వ విజయానికి దారేది.... ఇదేనా.... (సినిమా సమీక్ష) - పార్ట్ 1


దర్శక, రచయిత త్రివిక్రమ్ సినిమా, హీరో పవన్ కల్యాణ్ తో కాంబినేషన్ అనగానే, సగటు తెలుగు సినీ ప్రియులకు ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. సినిమా రావడం ఆలస్యం చూసేయాలని ఉంటుంది. పైపెచ్చు, వీరిద్దరి కాంబినేషన్ లోని అత్తారింటికి దారేది... సినిమా ఇప్పటికే రాష్ట్రంలోని ఉద్యమాలతో సహా రకరకాల అవాంతరాలను ఎదుర్కొంటూ, నిరీక్షణను పెంచేసింది. తీరా సెప్టెంబర్ 23, సోమవారం నాడు ఈ సినిమా ఫస్టాఫ్ దాదాపు 80 నిమిషాలు పైరసీ జరిగి, ఆన్ లైన్ లోకి వచ్చేసి, ఊరూరా యాభై రూపాయలకో సీడీ చొప్పున పప్పు బెల్లాల్లా అమ్మకమైందన్న వార్త మరో సంచలనమైంది. ఆ పైరసీకి కారణమైన ఇంటి దొంగల్ని పట్టుకొనే లోగా, నిర్మాతలు ఇక లాభం లేదు లెమ్మని చివరకు సినిమా విడుదలను అక్టోబర్ 9 నుంచి దాదాపు రెండు వారాలు ముందుకు జరిపారు. అలా సెప్టెంబర్ 27న సినిమా ఎట్టకేలకు జనం ముందుకు వచ్చింది.

          కథాకథనాల గురించి ఏ మాత్రం ముందుగా తెలుసుకోకుండా, నేరుగా థియేటర్ లో సినిమా చూసి, ఓ అభిప్రాయానికి రావడం అలవాటు. ఈ సినిమాకు అదే పాటిస్తూ, రిలీజ్ రోజు ఉదయాన్నే చూడాలని ప్లాన్. తీరా, అనుకోని వ్యక్తిగత ఇబ్బందులు వచ్చి, ఊరెళ్ళాల్సి వచ్చింది. ఆర్టీసీ బంద్ ల మధ్య ప్రయాణం ఖరీదై, ప్రాణానికి నరకంగా మారిన పరిస్థితుల్లో అనివార్యంగా సినిమా చూడడం రెండు రోజులు ఆలస్యమైంది. ఎట్టకేలకు సినిమా చూశాను - ఎవరి నుంచీ కథ, ఇతర వివరాలు కనుక్కోకుండా.

తీరా సినిమా చూశాక, ఇది త్రివిక్రమ్ మార్కు సినిమాయేనా అనిపిస్తుంది. ఇప్పటికే, గతంలో రచయితగా, దర్శకుడిగా నువ్వు నాకు నచ్చావ్, అతడు, జల్సా లాంటి ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు ఇచ్చిన అతనికి ఈ సినిమా ప్రమోషనా, డిమోషనా అన్న సందేహం వస్తుంది. ఆశించిన అద్భుత విజయం అందీ అందకుండా ఊరిస్తున్నప్పుడు ఏ దర్శక, రచయిత అయినా దాని కోసం ఎన్ని రకాలుగా మార్కెట్ లో ఉన్న సక్సెస్ సూత్రాలను తానూ అనుసరిస్తాడో అర్థమవుతుంది. వెరసి, ఈ సినిమాను అత్తారింటికి దారేది... అని కాకుండా, అపూర్వ విజయానికి దారేది... అని అనుకొని మరీ, ఆ చట్రంలో డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది.
.........................................................................................
చిత్రం - అత్తారింటికి దారేది, తారాగణం - పవన్ కల్యాణ్, సమంత, నదియా, ప్రణీత, ముఖేశ్ ఋషి, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం, రఘుబాబు, సంగీతం - దేవిశ్రీ ప్రసాద్, పాటలు - రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం - ప్రసాద్ మూరెళ్ళ, యాక్షన్ - పీటర్ హెయిన్, కూర్పు - ప్రవీణ్ పూడి, నిర్మాతలు - భోగవల్లి ప్రసాద్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్, రచన - దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్
...........................................................................................

మేనత్తను వెతుక్కుంటూ వచ్చిన ఓ మేనల్లుడి కథ ఇది. తాతతో తగాదా పడి, కుటుంబ బంధాలను తెంచేసుకొని, వారందరికీ దూరంగా బతుకుతున్న మేనత్తనూ, తమ కుటుంబాన్నీ మళ్ళీ కలపాలని ప్రయత్నించే ఓ కథానాయకుడి ప్రయాణం, ప్రయత్నాల అల్లిక ఇది. ఇటలీలోని మిలన్ లో కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీలు నిర్వహిస్తుంటాడు - పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ రఘు నందన్ (బొమన్ ఇరానీ). కీళ్ళ వ్యాధితో బాధపడుతూ, చక్రాల కుర్చీలో నుంచి లేవనైనా లేవలేని ఈ 80 ఏళ్ళ ముసలాయనకు ఓ కొడుకు (ముఖేశ్ ఋషి), ఓ మనుమడు గౌతమ్ నందన్ (పవన్ కల్యాణ్). ఇష్టం లేని పెళ్ళి చేసుకొని, వెళ్ళిపోయిన ఆత్మాభిమానవంతురాలైన కూతురు సునంద (నదియా) ఎలాగైనా తన దగ్గరకు తెమ్మని ఆ ముసలాయన, మనుమణ్ణి కోరతాడు. దాంతో, హీరో ఇటలీ నుంచి ఇండియాకు ప్రత్యేక విమానంలో, చుట్టూతా పది మంది నౌకర్లు, చాకర్లతో వచ్చేస్తాడు. ఇక, అక్కడ నుంచి తన సహాయకులైన భాను (ఎమ్మెస్ నారాయణ) బృందం వెంట రాగా, హీరో తన మేనత్త ఇంట్లో పాగా వేయడానికి ప్రయత్నిస్తాడు.
గుండెపోటుకు గురైన మామయ్య శేఖర్ (రావు రమేశ్)ను సమయానికి కాపాడి, వాళ్ళ ఇంట్లోనే డ్రైవర్ గా సిద్ధార్థ అలియాస్ సిద్ధూ అనే మారుపేరుతో చేరతాడు హీరో. అత్తయ్యకు ఇద్దరు కూతుళ్ళు ప్రమీల (ప్రణీత), శశి (సమంత). ఓ పక్క వారితో స్నేహం సాగిస్తూనే, మరోపక్క వ్యాపారంలో నష్టాల్లో ఉన్న అత్తయ్యను కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు. ఆ క్రమంలో హీరో తన మేనల్లుడేననీ, తనను ఇటలీకి తీసుకువెళ్ళడానికే పని మిషతో తన ఇంట్లో చేరాడనీ సునంద (నదియా) గ్రహించేస్తుంది. ఆ పప్పులేమీ తన వద్ద ఉడకవనీ తెగేసి చెబుతుంది. అక్కడికి ఇంటర్వెల్ బ్యాంగ్.
ఇక, సెకండాఫ్ లో ముందు పెద్దమ్మాయిని లైన్ లో పెట్టడం ద్వారా, పని సులువు చేసుకోవాలనుకుంటాడు హీరో. తీరా ఆ అమ్మాయి వేరొకరిని ప్రేమిస్తున్నట్లు తెలిసి, వారిద్దరినీ కలుపుతాడు. ఆ క్రమంలో ఫ్యాక్షనిస్టు సిద్ధప్ప (కోట శ్రీనివాసరావు) లాంటి వాళ్ళతో కొట్లాడతాడు. ఆ తరువాత సాక్షాత్తూ రావు రమేశే, హీరోను ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మంటాడు. అప్పుడిక హీరో, తన మేనత్త రెండో కూతురుతో ఏం చేశాడు, చివరకు కథ ఎలా సుఖాంతమైందన్నది మిగతా సినిమా.


.....................................................

''సినిమా ఓ మాయాబజార్‌!'' - హీరో రజనీకాంత్

  •  అలరించిన కమల హాసన్, రజనీకాంత్‌ల ప్రసంగాలు
తమిళ సినిమా వేడుకల సందర్భంగా చెన్నై వేదికపై శనివారం సాయంత్రం కమలహాసన్‌, రజనీకాంత్‌లు చేసిన ప్రసంగాలు సభికులను ఆకట్టుకున్నాయి. అయిదో ఏటనే సినీ రంగంలోకి వచ్చి, ఇప్పటికి దాదాపుగా 55 ఏళ్ళుగా సినీ కళామతల్లికి సేవ చేస్తున్న కమలహాసన్‌ను దర్శకుడు కె.ఎస్‌. రవి కుమార్‌ ప్రత్యేకంగా పరిచయం చేశారు. కమల్‌ సినీ జీవిత ప్రస్థానాన్ని చూపెడుతూ, దాదాపు 6 నిమిషాలు సాగిన ఆడియో-విజువల్‌ ప్రదర్శన సభికులను పాత జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్ళింది. అప్పటి దాకా వేదిక ముందు పక్కపక్క కుర్చీల్లో కూర్చొని, కబుర్లాడుకుంటున్న రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ వేదికపైకి వచ్చి, తమదైన శైలిలో ప్రసంగించారు.
రజనీకాంత్‌ సినీ జీవిత ప్రస్థానాన్ని దర్శకుడు పి. వాసు పరిచయం చేస్తూ, ఆయన నుంచి తాను నేర్చుకున్న జీవిత పాఠాలను తెలిపారు. తెరపై ఆడియో-విజువల్‌ ప్రదర్శన అనంతరం రజనీకాంత్‌ను వేదికపైకి ఆహ్వానించినప్పుడు సభాంగణమంతా లేచి నిల్చొని, హర్షధ్వానాలతో స్వాగతించింది. కేవలం 38 ఏళ్ళుగానే సినీ రంగంలో ఉన్న రజనీ, సినీ రంగంలో కమల్‌ తనకు అన్నయ్య లాంటివాడని చెబుతూ, ''నేను ఇంత అయ్యానంటే అది నాకు సినిమా పెట్టిన భిక్ష'' అని పేర్కొన్నారు. ''కమల్‌ తన కెరీర్‌లో చేసిన పాత్రలన్నీ ఇష్టపడి చేసినవి. నేను చేసినవన్నీ కష్టపడి చేసినవి'' అని రజనీకాంత్‌ చమత్కరించారు.
రజనీకాంత్‌ తన ప్రసంగంలో తాత్త్విక ధోరణిలోకి వెళ్ళి, సినిమా రంగంలోని విచిత్ర పరిస్థితులపై వ్యాఖ్యానం చేశారు. ''నన్ను ఇంత పైకి తీసుకు వచ్చినవాళ్ళంతా దర్శకులు, రచయితలే. వాళ్ళంతా నన్ను పైన కూర్చోబెట్టి, వెళ్ళిపోయారు. ఎప్పుడైన అత్యున్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళందరూ ఒంటరే! సభలో పది మంది మధ్యలో ఉన్నా, వారికి అది ఒంటరితనమే! ఒక్కోసారి, దీనికా నువ్వు ఆశపడింది శివాజీరావ్‌! అని నాకే అనిపిస్తూ ఉంటుంది'' అని అన్నారు. 'మాయాబజార్‌', 'గుండమ్మ కథ' చిత్రాలను ప్రత్యేకంగా ప్రస్తావించిన రజనీకాంత్‌ ఇంత సాంకేతికత పెరిగినా, అలాంటి కళాఖండాలు ఇప్పుడు తీయలేకపోతున్నామన్నారు. 'చంద్రలేఖ', 'అవ్వయ్యార్‌' లాంటి తమిళ కళాఖండాలు తీసిన జెమినీ ఎస్‌.ఎస్‌. వాసన్‌, ఇవాళ్టి కమలహాసన్‌ లాంటి కొందరు చూపిన బాటలో సినిమా రంగం నడవాలని అన్నారు.
''సినిమా ప్రపంచం విచిత్రమైనది. ఇది ఓ మాయా బజార్‌! సినిమాల్లో జయించిన చాలామంది జీవితంలో ఓడిపోయారు. జీవితంలో ఓడిపోయిన చాలా మంది సినిమాల్లో గెలిచారు. ఏమైనా, దీన్ని జీవనోపాధిగా తీసుకున్నవారు పక్కదోవ పట్టకుండా ముందు తమ కెరీర్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ తరువాత మిగతా వాటి మీద దృష్టి పెట్టాలి!'' అని రజనీకాంత్‌ తాత్త్విక ధోరణిలో సూచన చేశారు.
కమల్‌ మాట్లాడుతూ, ''వేదిక ముందు కూర్చొని, మేము కలసి పనిచేసిన ఆ పాత చిత్రాల కబుర్లు గుర్తు చేసుకుంటున్నాం. నేను ఈ స్థాయికి రావడానికి నన్ను తీర్చిదిద్దిన గురువులు శివాజీ గణేశన్‌, దర్శకుడు కె. బాలచందర్‌లకు నమస్కారాలు. ఇంత పేరు ప్రతిష్ఠలు వస్తాయని కెరీర్‌ తొలి రోజుల్లో ఊహించనైనా ఊహించలేదు. కెరీర్‌లో నేను ఓడిపోతే ఆశ్చర్య పోవాలి కానీ, గెలిస్తే ఆశ్చర్యపోనక్కర లేదు. ఎందుకంటే, నాకు విద్య నేర్పిన గురువుల గొప్పతనం అది'' అని కమల హాసన్‌ వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఈ వేడుకలో రజనీకాంత్‌, కమలహాసన్‌ల ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
- చెన్నై నుంచి 'ప్రజాశక్తి' ప్రత్యేక ప్రతినిధి రెంటాల జయదేవ 

ఆర్బాటంగా తమిళ సినీ షో!


నూరేళ్ళ భారతీయ సినిమా ఉత్సవాల సందర్భంగా తొలి రోజైన శనివారం నాడు సాయంత్రం తమిళ సినిమా వేడుకలు ఆర్భాటంగా జరిగాయి. అందులో భాగంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పలువురు పెద్ద, చిన్న తమిళ సినీ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. టాకీలు మొదలైనప్పటి నుంచి ఇటీవలి వరకు తమిళ చిత్రాల్లో వచ్చిన మార్పులను ప్రతిబింబించేలా దశాబ్దాల వారీగా, కొన్ని పాటలను ఎంచుకొని, వాటికి పలువురు సినీ నటీనటులు వేదికపై అభినయించారు.
ముఖ్యంగా, భారతీరాజా, బాలూ మహేంద్ర, మణిరత్నం తదితర సుప్రసిద్ధుల చిత్రాలతో తమిళ సినిమాకు స్వర్ణమయమైన దశాబ్దం అని చెప్పదగిన 1980 - '90వ దశకం గురించి దర్శకుడు ఎం. రాజా ('ఎడిటర్‌' మోహన్‌ కుమారుడు), అతని సోదరుడైన హీరో 'జయం' రవి, బృందం చేసిన ప్రదర్శన అర్థవంతంగా ఉంది. తమిళ సూపర్‌స్టార్లు కీర్తిశేషులు ఎం.జి. రామచంద్రన్‌, శివాజీ గణేశన్‌ల పాటలకు డ్యాన్సులు వేసినప్పుడు ఆహూతులు, ప్రేక్షకులు ఉత్సాహంగా స్పందించారు.
టాకీల తొలినాళ్ళలో తమిళ అగ్ర నటుడైన ఎం.కె. త్యాగరాయ భాగవతార్‌గా అభినయిస్తూ, కమెడియన్‌ వివేక్‌ హాస్యం పండించారు. స్టంట్‌ మెన్లు చేసిన ప్రత్యేక విన్యాసాలు, ఈ వేడుక కోసం వారు ప్రత్యేకంగా స్టంట్లు చేయగా, వాటిని చిత్రీకరించి, దర్శకుడు ఆర్‌.కె. సెల్వమణి చూపిన వీడియోలు కార్యక్రమంలో వినూత్నంగా నిలిచాయి. హీరో సూర్య, కార్తి, విశాల్‌, జీవా, 'రోజా పూలు' ఫేమ్‌ శ్రీకాంత్‌, భరత్‌ తమ నృత్యాలతో అలరించారు.
కమల్‌, రజనీల నుంచి నేర్చుకోవాల్సినవి...
దర్శకుడు లింగుస్వామితో హీరో సూర్య చేసిన టాక్‌ షో తరహా కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. అందులో 'సింగం'లోని ఓ పంచ్‌ డైలాగ్‌ను తమిళంతో పాటు తెలుగులో చెప్పి, సూర్య అలరించారు. అలాగే, తమిళ అగ్ర హీరోలు రజనీకాంత్‌, కమలహాసన్‌లను చూసి, వారి నుంచి తాను పొందిన స్ఫూర్తిని సైతం సూర్య గుర్తు చేసుకున్నారు. ''విజయాలు ఎన్ని వరించినా తలకెక్కని గర్వం, ఇంత స్థాయికి ఎదిగినా ఇప్పటికీ ఎక్కడా తప్పించుకోకుండా శ్రమపడే తత్త్వం వారిని చూసి నేర్చుకోవాలి'' అని సూర్య చెప్పినప్పుడు సభా ప్రాంగణం చప్పట్లతో నిండిపోయింది.

విక్రమ్‌, శరత్‌ కుమార్‌, అర్జున్‌, యువ హీరోలు సూర్య, కార్తి, ధనుష్‌, శింబు, యువ హీరోయిన్లు కార్తిక, హన్సిక, కాజల్‌ అగర్వాల్‌, పాత తరం నాయికలు - ఇలా అందరూ పాల్గొనడంతో తమిళ సినిమా కార్యక్రమాలు ఆర్భాటంగా సాగాయి. తమలో తమకు విభేదాలు ఎన్ని ఉన్నా, తమిళ దర్శక, నిర్మాతలు, సినీ ప్రముఖులు అధిక భాగం మంది ఈ వేడుకకు సమష్టిగా శ్రమించిన విధానం వేదికపై కార్యక్రమాల్లో కనిపించింది.

'అమ్మ' దారిలోకే అంతా...
అయితే, సినిమా తారలు అందరూ జయలలితను పొగడడంలో పోటాపోటీ పడడం కార్యక్రమం అంతటా కనిపించింది. సినిమా పండుగగా కాక, జయలలిత ప్రభుత్వ విజయోత్సవ సభగా మారిందన్న విమర్శలూ వచ్చాయి. సినీ పరిశ్రమకు ఏం కావాలో అది జయలలిత చేస్తారంటూ, ''పిల్లలకు ఏం కావాలో 'అమ్మ'కు తెలియదా?'' అని త్యాగరాయ భాగవతార్‌ వేషంలో ఉన్న కమెడియన్‌ వివేక్‌ చమత్కరించారు. ఇక, రాజకీయ ఆకాంక్షలను వెలిబుచ్చి, ఆ మధ్య 'తలైవా' (తెలుగులో 'అన్న'గా విడుదలైంది) రిలీజు సందర్భంగా అనేక చిక్కులను ఎదుర్కొన్న హీరో విజయ్ని సైతం మెడలు వంచి, తమ దారిలోకి తెచ్చుకోవడంలో జయలలిత, ఆమె ప్రభుత్వం ఈ వేడుకల్లో సక్సెసైంది.
ఎప్పుడూ ఇలాంటి ఫంక్షన్లకు దూరంగా ఉండే హీరో విజయ్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరై, జయలలితనూ, ఆమె ప్రభుత్వాన్ని వేదికపై ప్రశంసించారు. ''ఒక నటిగా జీవితం ప్రారంభించి, జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని, చివరకు ఒక రాష్ట్రాన్ని పాలించే అధినేత్రిగా ఎదగడం ఎంతో గొప్ప'' అని విజయ్ పొగడ్తల జల్లు కురిపించారు. గమ్మత్తేమిటంటే, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన కాసేపటికే జయలలిత సభా ప్రాంగణం నుంచి వెళ్ళిపోయినా, వక్తలు మాత్రం ఆమెను పొగడడం మానకపోవడం! రాత్రి పది గంటలు అవుతున్నా కార్యక్రమాలు సుదీర్ఘంగా సాగుతుండడంతో, అధిక శాతం మంది జనం ఇంటిముఖం పట్టారు. 

- రెంటాల  జయదేవ 
.............................................

Saturday, September 28, 2013

ఆద్యంతం 'అమ్మ' రాజకీయ వాసనలే!


  • పత్రికల వారికి 'పాసు' కష్టాలు 
  • మైకందుకుంటే 'అమ్మ' నామ స్మరణే!
  • సాంస్కృతిక కార్యక్రమాలు, స్కిట్లలోనే అదే భజన!!
(చెన్నై నుంచి రెంటాల జయదేవ)   
నూరేళ్ళ భారతీయ సినిమా వేడుకలంటూ శనివారం చెన్నైలో మొదలైన కార్యక్రమాలు, వాటికి చేసిన ఏర్పాట్లు, చుట్టుపక్కలి వాతావరణం చూస్తే, అది అచ్చమైన తమిళ రాజకీయ సభల లాగా ఉండడం గమనించదగ్గ విషయం. ఈ ఉత్సవాల కోసం రూ. 10 కోట్ల మేర విరాళమిచ్చి, అంత కన్నా ఎక్కువ మొత్తంలో పత్రికల్లో వాణిజ్య ప్రకటనల ద్వారా ఈ ఉత్సవాలకు భారీ ప్రచారం కల్పించిన తమిళనాడు ప్రభుత్వం సహజంగానే ఈ మొత్తం కార్యక్రమాన్ని తమ చేతుల్లోకి తీసేసుకున్నట్లు కనిపించింది. పాసుల జారీ మొదలు కార్యక్రమ నిర్వహణ దాకా ఈ ఉత్సవాలు పూర్తిగా తమిళనాడులోని అధికార పక్షమైన అన్నా డి.ఎం.కె. పార్టీ వ్యవహారం లాగా మారాయి. వేదిక మీద జరిగిన ప్రసంగాలు, సినిమాల కార్యక్రమాలు సైతం ఆద్యంతం 'పురట్చి తలైవి' (విప్లవ నాయకి), 'అమ్మ' అంటూ జయలలిత భజన స్తోత్రాలతోనే సాగిపోయాయి. 
ఈ నాలుగు రోజులూ సభా వేదిక అయిన పట్టే నెహ్రూ ఇండోర్‌ స్టేడియమ్‌లో గరిష్ఠంగా 4,500 మంది దాకా పడతారు. అయితే, తొలి రోజున ఆ ప్రాంగణం దాదాపు మూడొంతులు ప్రభుత్వ అధికారులు, అధికార పక్ష కార్యకర్తలు, నేతలతోనే నిండిపోయింది. ఆఖరికి సమాచార సాధనాల వారికి సైతం పాసులు లేవు. ఎంపిక చేసిన కొద్దిమంది స్థానిక పత్రికా రచయితలకే అవి పరిమితమయ్యాయి. ఇక, తెలుగు మీడియా పరిస్థితి మరీ కనాకష్టమైంది. తెలిసిన దర్శక, నిర్మాతల ద్వారా దక్కిన ఒకటి, అరా పాసులతో లోపలకు వచ్చిన అతి కొద్దిమంది కూడా సామాన్య ప్రేక్షకుల గ్యాలరీల్లో సర్దుకోవాల్సి వచ్చింది. వేదిక మీద జరుగుతున్నదేమిటో తెలియని స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. 
కార్యక్రమంలో చివరి దాకా రాజకీయాలదే ప్రధాన పాత్ర అయింది. ''నేను సినిమాకు మద్దతుగా నిలిచే మనిషిని'' అని తన ప్రారంభ ప్రసంగంలోనే ప్రకటించుకున్న జయలలిత పనిలో పనిగా సొంత గొప్పలు కూడా చెప్పుకున్నారు. బద్ధశత్రువు, డి.ఎం.కె. అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన ఎం. కరుణానిధిని అన్యాపదేశంగా విమర్శించారు. వాళ్ళ పేర్లేవీ ప్రస్తావించకుండానే, మునుపటి (డి.ఎం.కె) ప్రభుత్వంలో సినీ పరిశ్రమ కొందరి కబంధ హస్తాల్లో చిక్కుకొని, ఇబ్బందుల పాలైందనీ, రెండేళ్ళుగా తమ ప్రభుత్వంలో తమిళ సినిమాలు హాయిగా, స్వేచ్ఛను అనుభవిస్తున్నాయనీ గొప్పలు చెప్పుకున్నారు. సభకు హాజరైన వారు, సత్కారాలు అందుకున్నవారిలో చాలామంది వేదిక మీదే 'అమ్మ'తో కష్టాలు చెప్పుకోవడం, పాదాభివందనాలు చేయడం కనిపించింది. సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ గౌరవ కార్యదర్శి ఎల్‌. సురేశ్‌ అయితే, ఏకంగా ఈ నూరేళ్ళ సినిమా పండుగ అనే తమ క్షీరసాగర మథనంలో ముందుగా దక్కిన 'లక్ష్మీదేవి' జయలలిత అనీ, అమృతాన్ని అందరికీ గొడవలు లేకుండా పంచడంలోనూ, హాలాహలాన్ని ధైర్యంగా మింగడానికీ 'అమ్మ' ఉందని తమ భరోసా అని సభాముఖంగా మైకులో ప్రకటించారు. 
సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పిల్లల చేత జయలలితకు స్వాగత గీతాలు పాడించడం, వేదికపై ప్రదర్శించే వీడియో క్లిప్పింగుల్లో ఎమ్జీయార్‌, జయలలితల ప్రభుత్వ పథకాలను పదే పదే చూపడం చూస్తే, వచ్చింది సినిమా ఫంక్షన్‌కో, రాజకీయ పార్టీ మీటింగ్‌కో అర్థం కాక, సినీ ప్రియులు తలలు పట్టుకున్నారు. స్టంట్‌మ్యాన్లు చేసిన ప్రదర్శనలతో సహా చాలా వాటిలో తమిళంలో 'అమ్మకు జిందాబాద్‌' లాంటివి దృశ్యరూపంలో కనిపించాయి. ఇక, సభా వేదికకు దారి తీసే దారుల నిండా జరుగుతున్నది సినిమా పుట్టిన రోజు కాదు, జయలలిత పుట్టినరోజేమో అని భ్రమపడేలా అన్నీ జయలలిత బ్యానర్లు, బారులు తీరిన పార్టీ శ్రేణులు దర్శనమిచ్చాయి. వెరసి, ఈ వేడుకల్లో తెలుగు సినిమా పరిశ్రమ భాగస్వామ్యం విషయంలో సినిమాలో రాజకీయాలు చోటుచేసుకుంటే, తమిళ వేడుకల్లో రాజకీయాలే సినిమాగా పరిణమించడం యాదృచ్ఛికమైనా, విస్మరించలేని విచిత్రం!
........................................................

సినిమా పండుగ షురూ!

ఎస్‌.ఐ.ఎఫ్‌.సి.సి. అధ్యక్షుడు, ప్రముఖ తెలుగు సినీ నిర్మాత సి. కల్యాణ్‌, ఏ.వి.ఎం.స్టూడియో అధినేత - నిర్మాత ఎం. శరవణన్‌, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, సన్మాన గ్రహీతలు వేదికపై ఆసీనులయ్యారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషా సినీ పరిశ్రమలు నాలుగింటికీ మాతృసంస్థ లాంటి ఎస్‌.ఐ.ఎఫ్‌.సి.సి. చేస్తున్న ఈ భారీ ఉత్సవానికి సహాయ సహకారాలు అందించినందుకు గాను కల్యాణ్‌ తన ప్రసంగంలో జయలలితకు కృతజ్ఞతలు తెలిపారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ గౌరవ కార్యదర్శి - తమిళ పంపిణీదారు ఎల్‌. సురేశ్‌ వందన సమర్పణ చేశారు. సినీ రంగంలో విశేష కృషి చేసిన దాదాపు 60 మందిని ఈ కార్యక్రమంలో భాగంగా జయలలిత సత్కరించారు. బయోస్కోప్‌ ఆకారంలోని సూక్ష్మ కళాకృతిని వారికి జ్ఞాపికగా అందజేశారు. ఈ ప్రారంభోత్సవ సభ అనంతరం తమిళ సినీ పరిశ్రమకు చెందిన తారలు, స్టంట్‌మెన్లు, నృత్య తారలతో సాంస్కృతిక కార్యక్రమాలు
సాగాయి. హీరోలు సూర్య, కార్తి, జీవా, విశాల్‌, ఆర్య, కమెడియన్లు వివేక్‌, సంతానం, హీరోయిన్లు హన్సిక, కాజల్‌ అగర్వాల్‌, అంబిక, సుహాసిని, రాధ, రోజా, పూర్ణిమా భాగ్యరాజ్‌, దర్శకులు కె.ఎస్‌. రవికుమార్‌, పి. వాసు, తదితరులు ఆడి పాడి అలరించారు. 'జాతీయ గీతం' లాగా, సినిమాకు 'సినిమా గీతం' (సినిమా యాంథమ్‌) అంటూ నా. ముత్తుకుమార్‌ రచించగా, ఇళయరాజా బాణీ కట్టిన గీతాన్ని ఈ కార్యక్రమంలో మనో, టిప్పు, రంజిత్‌, తదితరులు పాడారు.
ఇవాళ ఏమిటంటే...
ఉత్సవాల రెండో రోజైన ఇవాళ ఉదయం 9 గంటల నుంచి కన్నడ సినీ పరిశ్రమ వేడుకలు, సాయంత్రం తెలుగు సినీ పరిశ్రమ వేడుకలు జరగనున్నాయి. తొలి రోజు ఉత్సవాలకు నిర్మాతలు డి. రామానాయుడు, డి. సురేశ్‌బాబు, కె.ఎస్‌. రామారావు, కాట్రగడ్డ ప్రసాద్‌, ఎం.ఎల్‌. కుమార్‌ చౌదరి, అశోక్‌కుమార్‌, నారా జయశ్రీదేవి, బోనీ కపూర్‌ - శ్రీదేవి జంట, హీరోలు కృష్ణంరాజు, రాజేంద్ర ప్రసాద్‌, రచయితలు పరుచూరి బ్రదర్స్‌ తదితర తెలుగు ప్రముఖులు హాజరయ్యారు.
రాష్ట్రంలో నెలకొన్న ఉద్యమ పరిస్థితుల దృష్ట్యా తమ సభ్యులైన నటీనటులు ఈ ఉత్సవాల్లో పాల్గొనరాదంటూ హైదరాబాద్‌లోని తెలుగు 'మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌' పేర్కొనడంతో ఇవాళ్టి తెలుగు వేడుకల్లో పెద్ద తారలెవరూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపించడం లేదు. మిగిలిన కొంతమంది చిన్నా చితకా నటీనటులతోనే డ్యాన్సులు, స్కిట్లు చేయించి, కార్యక్రమం అయిందని అనిపించడానికి ఎస్‌.ఐ.ఎఫ్‌.సి.సి. ప్రయత్నిస్తోంది. తెలుగు తారలు ఈ వేడుకలో పాలు పంచుకోవడం గురించి ప్రారంభోత్సవానికి కొద్దిగా ముందు సి. కల్యాణ్‌ను 'ప్రజాశక్తి' ప్రశ్నించగా, ''తెలుగు వాళ్ళను నా మనస్సులో నుంచి తీసేశాను. నేను వారి గురించి ఆలోచించడం లేదు. నా ఆలోచనలన్నీ వేరే అంశాల మీద ఉన్నాయి'' అని కుండబద్దలు కొట్టేశారు.
'అమ్మ' చేతితో అపూర్వ సత్కారం
మొదటిరోజు ఉత్సవాల ప్రారంభోత్సవ సభలో జయలలిత చేతుల మీద నుంచి అలా సన్మానం అందుకున్న వారిలో పాత తరం తమిళ హీరో ఎస్‌.ఎస్‌. రాజేంద్రన్‌, తమిళ సూపర్‌స్టార్లు కమలహాసన్‌, రజనీకాంత్‌, శివకుమార్‌, నిర్మాత 'ఏ.వి.ఎం' శరవణన్‌, ప్రసాద్‌ ల్యాబ్స్‌ ఏ. రమేశ్‌ ప్రసాద్‌, విజయా ప్రొడక్షన్స్‌ బి. వెంకట్రామరెడ్డి, తెలుగు హీరో బాలకృష్ణ, తమిళ హీరో ప్రభు, దర్శకుడు సి.వి. రాజేంద్రన్‌, సంగీత దర్శకుడు ఇళయరాజా, గాయనీమణులు ఎల్‌.ఆర్‌. ఈశ్వరి, జమునారాణి, నటుడు ప్రభు, దర్శకుడు పి. వాసు, పాత తరం హీరోయిన్లు 'షావుకారు' జానకి, కృష్ణకుమారి, జమున, రాజశ్రీ, కాంచన, శారద, బి. సరోజాదేవి, జయప్రద, జయసుధ తదితరులు ఉన్నారు. తరువాతి తరం నాయికలైన మీనా, సిమ్రాన్‌, త్రిష, అలాగే సీనియర్‌ మేకప్‌ మ్యాన్‌ సి. మాధవరావు, పాత సినిమాటోగ్రాఫర్‌ ఎన్‌.ఎస్‌. వర్మ, ఎడిటర్‌ ఆర్‌. విఠల్‌, కొరియోగ్రాఫర్లు తార, సుందరం మాస్టర్‌ (ఆయన బదులు కుమారుడు రాజు సుందరం తీసుకున్నారు), స్టంట్‌ మాస్టర్‌ కె.ఎస్‌. మాధవన్‌ సన్మానం అందుకున్నారు. దక్షిణాదిలో తొలి తరం ఎగ్జిబిటర్‌ అయిన సామికన్ను విన్సెంట్‌ ప్రారంభించగా, 1914 ప్రాంతం నుంచి ఇవాళ్టికీ కోయంబత్తూరులో నడుస్తున్న 'డిలైట్‌' సినిమా థియేటర్‌ యజమాని జవహర్‌ను సైతం ఈ సభలో జయలలిత సన్మానించడం విశేషం. సినీ రంగంలోని మేకప్‌, కాస్ట్యూమ్స్‌, సెట్‌ డిజైనింగ్‌, స్టిల్‌ ఫోటోగ్రఫీ, ప్రొడక్షన్‌ అసిస్టెన్స్‌, సెట్‌ డిజైనింగ్‌ విభాగాల్లోని సినీ శ్రామిక జీవుల్లో కొందరిని కూడా గుర్తించి, అందరితో పాటు సత్కరించారు. 
- రెంటాల జయదేవ
...................................................................

తమిళ సినీ ప్రయాణంలో మైలురాళ్ళు

మూగ చిత్రాల రోజుల నుంచి తమిళ ప్రాంతానికి సినీ మాధ్యమంతో సన్నిహిత సంబంధాలున్నాయి. మద్రాసు, కోయంబత్తూరు, మదురై తదితర ప్రాంతాల్లో కదిలే బొమ్మల ప్రదర్శనలు ఎంతో పాపులర్‌. మూకీల నుంచి టాకీల మీదుగా ఇప్పటి దాకా తమిళ సినిమా పయనం సుదీర్ఘమైనది. అందులోని కొన్ని ముఖ్యాంశాలు: 
1896 డిసెంబర్‌: మద్రాసులో తొలిసారిగా సినిమాటోగ్రాఫ్‌ ప్రదర్శన. తెరపై కదిలే బొమ్మలతో ప్రజలకు పరిచయం. 
1905: తిరుచ్చికి చెందిన రైల్వే ఉద్యోగి సామికన్ను విన్సెంట్‌ తమ ఊరి మీదుగా ప్రయాణిస్తున్న డ్యూపాంట్‌ అనే ఫ్రెంచ్‌ పెద్దమనిషి నుంచి టూరింగ్‌ సినిమా సామగ్రి కొనుగోలు చేశారు. దానితో 'ఎడిసన్స్‌ సినిమాటోగ్రాఫ్‌' పేర దక్షిణ భారతదేశంలోనే తొలి సంచార సినిమా నెలకొల్పారు. 'లైఫ్‌ ఆఫ్‌ క్రైస్ట్‌' లాంటి లఘు చిత్రాలను ప్రదర్శిస్తూ ఊరూరా తిరిగారు. తరువాత రోజుల్లో ఆయన సినీ నిర్మాతగానూ ఎదిగారు. 
1907: టి.హెచ్‌. హఫ్టన్‌ అనే వ్యక్తి కొన్ని లఘు చిత్రాలను రూపొందించారు, ప్రదర్శించారు. దక్షిణ భారతావనిలో జరిగిన తొలి చిత్ర నిర్మాణ ప్రయత్నం అదే! తరువాతి కాలంలో 'రాజా హరిశ్చంద్ర' (1913)తో భారతదేశంలో ఫీచర్‌ ఫిల్ముల నిర్మాణం మొదలయ్యాక, హఫ్టన్‌ 'మత్స్యావతార్‌' (1927) లాంటి కొన్ని మూకీ చిత్రాలను నిర్మించారు. 
1911: తంజావూరుకు చెందిన మరుదప్ప మూపనార్‌ లండన్‌ను సందర్శించి, ఆ ఏడాది నవంబర్‌ 11న జరిగిన అయిదవ జార్జ్‌ చక్రవర్తి పట్టాభిషేకాన్ని ఫిల్ముకెక్కించారు. అటుపైన ఆ ఫిల్మును మద్రాసులో ప్రదర్శించారు. 
1914: తెలుగువాడైన రఘుపతి వెంకయ్య నాయుడు మద్రాసులో 'గెయిటీ' థియేటర్‌ను నిర్మించారు. మద్రాసులోనే కాదు, ఏకంగా దక్షిణ భారతదేశంలోనే భారతీయుల సొంత యాజమాన్యంలోని తొలి పర్మనెంట్‌ థియేటర్‌ ఇదే! ఈ హాలు ఈ మధ్యనే కూల్చివేతకు గురై, అక్కడ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ వెలిసింది. 
1916: దక్షిణ భారతదేశంలో తొలి సినీ నిర్మాణ సంస్థ 'ఇండియా ఫిల్మ్‌ కంపెనీ' ఏర్పాటైంది. ఈ సంస్థను నెలకొల్పిన ఆర్‌. నటరాజ ముదలియార్‌ 'కీచక వధమ్‌' అనే మూకీ చిత్రం తీశారు. దక్షిణ భారతదేశంలో తయారైన తొలి మూకీ ఇదే. 
1918: ఇండియన్‌ సినిమాటోగ్రాఫ్‌ చట్టం- 1918 కింద విడుదలకు ముందే సినిమాలను సెన్సార్‌ చేయడమనే ప్రక్రియ మొదలైంది. 
1921: బ్రిటీషు ప్రభుత్వం డబ్ల్యు. ఎవాన్స్‌ అనే సినిమా నిపుణుణ్ణి భారతదేశంలోని సినిమా రంగం గురించి అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాల్సిందిగా నియమించింది. ఆయన మద్రాసును సందర్శించారు. 
1927: ఎస్‌.కె. వాసగమ్‌ ఎడిటర్‌గా 'మూవీ మిర్రర్‌' అనే ఇంగ్లీషు సినీ మాసపత్రిక మొదలైంది. దక్షిణ భారతదేశంలోని తొలి సినిమా జర్నల్‌ ఇదేనని పరిశోధకులు చెబుతారు. తరువాతి కాలంలో ఈ జర్నల్‌ 'ఎమ్యూజ్‌మెంట్‌ వీక్లీ'గా పేరు మార్చుకొని, వారపత్రిక అయింది. 
1927: 'ఎగ్జిబిటర్‌ ఫిల్మ్‌ సర్వీసెస్‌' పేరిట ఏ. నారాయణన్‌ దక్షిణాదిలోనే తొలి చలనచిత్ర పంపిణీ సరస్థను ప్రారంభించారు. 
1929: మద్రాసులో 'జనరల్‌ పిక్చర్స్‌ కార్పొరేషన్‌' ఏర్పాటుతో దక్షిణాదిలో సినిమా ఓ వినోద పరిశ్రమగా వేళ్ళూనుకుంది. 
1929: తెలుగువాడైన వీరంకి రామారావు, తమిళుడైన వి. సుందరేశన్‌లు కార్యదర్శులుగా ఇప్పటి 'సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌'కు ముందస్తు రూపమైన 'ది మద్రాస్‌ ఫిల్మ్‌ లీగ్‌' అనే సంఘం ఏర్పాటైంది. 
1931: హెచ్‌.ఎం. రెడ్డి దర్శకత్వంలో తమిళంలోనూ, తెలుగులోనూ మాటలు, పాటలతో తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ 'కాళిదాస్‌' వచ్చింది. మద్రాసులోని 'కినిమా సెంట్రల్‌' (తరువాతి కాలంలో శ్రీమురుగన్‌ టాకీస్‌గా పేరు మార్చుకొని, ఇటీవలే కూల్చివేతకు గురైంది)లో 1931 అక్టోబర్‌ 31న విడుదలైంది. 
1934: దక్షిణాదిలో రూపొందిన తొలి తమిళ టాకీ 'శ్రీనివాస కల్యాణం' వచ్చింది. 
1935: సినీ తారల స్టార్‌డమ్‌కు బీజం పడింది. తమిళ గాయక - నటి కె.బి. సుందరాంబాళ్‌ 'నందనార్‌' అనే తమిళ టాకీలో ప్రధానపాత్ర పోషించేందుకు లక్ష రూపాయల పారితోషికం అందుకున్నారు. 
1936: తొలిసారిగా తమిళంలో ఓ మహిళ దర్శకురాలైంది. నటి టి.పి. రాజలక్ష్మి దర్శకత్వం వహించిన 'మిస్‌ కమల' చిత్రం విడుదలైంది. 
1937: ఒకే థియేటర్‌లో ఏడాదికి పైగా ఆడిన తొలి తమిళ చిత్రం 'చింతామణి' విడుదలైంది. 
1939: కె. సుబ్రహ్మణ్యం దర్శక - నిర్మాతగా దక్షిణ భారతదేశంలో తొలి హిందీ చిత్రం 'ప్రేమ్‌సాగర్‌' రూపొందింది.
1939: ఆనాటి ప్రముఖ కాంగ్రెస్‌ వాది ఎస్‌. సత్యమూర్తి తొలి అధ్యక్షుడిగా 'సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌' మద్రాసులో ఏర్పాటైంది. 
1940: ప్రముఖ కెమేరామన్‌ - దర్శకుడు కె. రామ్‌నాథ్‌ సారథ్యంలో 'ది సినీ టెక్నీషియన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా' ఆరంభమైంది. 
1943: 'హరిశ్చంద్ర' (1943) అనే తమిళ చిత్రాన్ని నిర్మాత ఏ.వి. మెయ్యప్ప చెట్టియార్‌ కన్నడంలోకి అనువదించారు. ఆ రకంగా అది దక్షిణాదిలో తొలి డబ్బింగ్‌ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. 
1951: నటి కె.బి. సుందరాంబాళ్‌ మద్రాస్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు నామినేట్‌ అయింది. చట్టసభల్లో సినీ తారల రంగప్రవేశానికి అదే శ్రీకారమైంది. 
1952: భారతదేశంలో తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఢిల్లీ, ముంబరు, మద్రాసు, కలకత్తాల్లో జరిగింది. 
1952: దక్షిణ భారతావనిలో తయారైన తొలి హిందీ చిత్రం 'ది జంగిల్‌'ను మోడరన్‌ థియేటర్స్‌ సంస్థ నిర్మించింది. 
1954: పాటలే లేని తొలి తమిళ చిత్రం 'అంద నాళ్‌' విడుదలైంది. 
1955: చలనచిత్రాలకు జాతీయ అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టారు. తమిళంలో ఉత్తమ చలనచిత్రంగా ఎమ్జీయార్‌ నటించిన 'మలై కళ్లన్‌' (తెలుగు వెర్షన్‌ ఎన్టీయార్‌ నటించిన 'అగ్గిరాముడు') ఎంపికైంది. 
1955: తమిళంలో తొలి పూర్తి నిడివి కలర్‌ చిత్రం 'ఆలీబాబావుమ్‌ నాప్పదు తిరుడర్‌గళుమ్‌' చిత్రాన్ని మోడరన్‌ థియేటర్స్‌ సంస్థ నిర్మించింది. 

1960: మద్రాసులోని అడయార్‌లో 'ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ టెక్నాలజీ' ఆరంభమైంది. 
1967: తమిళ సూపర్‌స్టార్‌ ఎం.జి. రామచంద్రన్‌, మరో తమిళ నటుడు ఎస్‌.ఎస్‌. రాజేంద్రన్‌లు వేర్వేరు నియోజకవర్గాల్లో గెలిచి, తమిళనాడు శాసనసభలో ప్రవేశించారు. 
1973: తమిళంలో తొలి సినిమాస్కోప్‌ చిత్రం శివాజీ గణేశన్‌ నటించిన 'రాజరాజ చోళన్‌' విడుదలైంది. 
1985: తమిళంలో తొలి 3డి చిత్రం 'అన్నై భూమి' (మాతృభూమి అని అర్థం) విడుదలైంది. 
1986: తమిళంలో తొలి 70 ఎం.ఎం. చిత్రంగా రజనీకాంత్‌ నటించిన 'మావీరన్‌' విడుదలైంది. 
1980లలో: కె. బాలచందర్‌ తరం తరువాత మళ్ళీ తమిళ చిత్ర సీమను మలుపు తిప్పిన కొత్తతరం దర్శకులు భారతీరాజా, బాలూమహేంద్ర లాంటి వారు వచ్చారు. 
1980 - 1990: సంగీత దర్శకుడిగా ఇళయరాజా తన బాణీలతో తమిళ సినీ పరిశ్రమనే కాక, దక్షిణాది సినీ సీమ మొత్తాన్నీ ఏలారు. మోహన్‌, రామరాజన్‌ లాంటి చిన్న హీరోలకు కూడా పెద్ద మ్యూజికల్‌ హిట్లు దక్కాయి. 
1990లలో: భారతీయ శాస్త్రీయ సంగీతానికీ, పాశ్చాత్య సంగీతానికీ అంటుకట్టి, 'రోజా'తో ఏ.ఆర్‌. రెహమాన్‌ సరికొత్త భారతీయ సినీ సంగీతానికి నిర్వచనంగా నిలిచారు. 
1990లలో: మణిరత్నం, శంకర్‌ లాంటి దర్శకులు జాతీయస్థాయికి తమిళ సినిమాను తీసుకువెళ్ళారు. 
2000-13: కమలహాసన్‌, రజనీకాంత్‌ లాంటి వారు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నటులయ్యారు. 
కమలహాసన్‌ ఏకంగా పది పాత్రలు పోషించిన 'దశావతారం' విడుదలైంది. 
శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించిన 'రోబో' తమిళంతో పాటు, హిందీలోనూ ఘన విజయం సాధించి, దక్షిణాది విజయ పతాకాన్ని దేశమంతటా ఎగురవేసింది. 
తమిళ సంస్క ృతినీ, గ్రామీణ వాతావరణాన్నీ ప్రతిబింబించే కొత్త తరహా చిత్రాలు తీసే దర్శకుల హవా పెరిగింది. 
'కొలవెరి' పాట (2011)తో దేశమంతటినీ ఊపేసిన తమిళ నటుడు ధనుష్‌ తన 'ఆడుక్కళమ్‌' ద్వారా జాతీయ ఉత్తమ నటుడిగా ఎదిగారు. హిందీ చిత్రం 'రాణ్‌ఝానా' ద్వారా జాతీయ స్థాయి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 
- రెంటాల జయదేవ
.......................................................

మన సినిమా పండుగ మద్రాసులోనే ఎందుకంటే...

  • భారతీయ సినిమాలో మద్రాస్‌కు ప్రత్యేక స్థానం
  • తెలుగు సినిమా పయనం ఇక్కడ్నుంచే
  • మొన్నటివరకూ దక్షిణాది సినిమాకు ఇదే రాజధాని
భారతీయ సినిమా శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భమిది. మన దేశంలోకి సినీ ప్రదర్శనలు అంతకు ముందే వచ్చినా, మనవాళ్ళూ సొంతంగా కొన్ని న్యూస్‌రీళ్ళు, లఘు చిత్రాలు తీసినా, తొలి స్వదేశీ ఫీచర్‌ఫిల్మ్‌ జనం ముందుకు వచ్చింది మాత్రం 1913లో! అలా కథకథనాత్మక చిత్రాలు రావడంతో, సినిమా పరిశ్రమగా రూపం తీసుకుందంటూ దాన్ని భారతీయ సినిమా జన్మదినంగా పరిగణిస్తూ వచ్చారు. అలా ఈ ఏడాదితో భారతీయ సినిమాకు నూరు వసంతాలు నిండాయి. ఈ సందర్భంగా చెన్నైలో ఇవాళ్టి నుంచి సెప్టెంబర్‌ 24 దాకా నాలుగు రోజుల పాటు దక్షిణ భారత చిత్ర పరిశ్రమలు నాలుగూ కలసి, ఉత్సవాలు జరుపుకొంటున్నాయి. మరి, ఈ ఉత్సవాలను చెన్నైలో ఎందుకు జరుపుతున్నట్లని ఎవరికైనా సందేహం రావచ్చు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, ఆ సందేహాలను నివృత్తి చేసే సమాధానాలు దొరుకుతాయి. నూటపదహారేళ్ళ క్రితం దక్షిణ భారతదేశంలో తొలిసారిగా సినిమా కాలుమోపింది మద్రాసు (ఇప్పటి చెన్నై)లోనే. బ్రిటీషు పాలనా కాలంలోని మద్రాసు ప్రెసిడెన్సీ (ఉమ్మడి మద్రాసు రాష్ట్రం)లో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషా ప్రాంతాలు కూడా కలగలిసి ఉండేవి. అక్కడి నుంచి టాకీలు వచ్చాక, స్వతంత్ర భారతావనిలోనూ ప్రాంతీయ భాషలన్నిటికీ సినీ రాజధానిగా చాలాకాలం పాటు వెలిగిన వైనం దాకా మద్రాసు పురవీధులెన్నో మన సినీ చరిత్రలోని కథలెన్నో చెబుతాయి. వాటిల్లో కొన్ని...
దక్షిణాదిలో తొలి ప్రదర్శన మద్రాసులోనే!
భారతదేశంలో లూమియర్ల సినిమాటోగ్రాఫ్‌ కాలుమోపిన అయిదు నెలలకే మద్రాసుకు కూడా చలనచిత్ర ప్రదర్శనలు వచ్చేశాయి. ఇప్పటి దాకా అందరూ చెబుతున్నట్లు 1897లో కాక, 1896 డిసెంబర్‌లోనే చెన్నపురికి సినిమా వచ్చినట్లు ఇటీవలి సినీ పరిశోధనల్లో వెల్లడైంది. పైపెచ్చు, ఆ ప్రదర్శనలు ఎవరో అమెరికన్‌ వచ్చి జరిపినవి కాక, నగరంలో నివసిస్తూ, అక్కడే పని చేస్తున్న స్టీఫెన్సన్‌ అనే వ్యక్తి నిర్వహించినవి కావడం మరో విశేషం. మద్రాసులోని విక్టోరియా పబ్లిక్‌ హాలులో సినిమాటోగ్రాఫ్‌తో ఫిల్ములు ప్రదర్శించారు. ఈ విక్టోరియా పబ్లిక్‌ హాలు చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌కూ, ప్రస్తుత నగరపాలక సంస్థ కార్యాలయమైన రిప్పన్‌ బిల్డింగ్‌కూ మధ్య ఇప్పటికీ ఉంది. సరిగ్గా 116 ఏళ్ళ తరువాత ఇప్పుడు భారతీయ సినిమా ఉత్సవాలు జరుగుతున్నది కూడా అదే హాలుకు దగ్గరలోనే నడక దూరంలో ఉన్న నెహ్రూ ఇండోర్‌ స్టేడియమ్‌లో కావడం గమనార్హం.

చెన్నైలోని సెంట్రల్ రైల్వేస్టేషన్ పక్కనే ఇప్పటికీ ఉన్న విక్టోరియా పబ్లిక్ హాలు
తొలి టూరింగ్‌ సినిమా
ఏమైనా, కొత్త పరిశోధనల ప్రకారం చూస్తే - ఇప్పటి దాకా పుస్తకాల్లో పేర్కొంటున్నదాని కన్నా ఏడాది ముందే మద్రాసులో తొలి చిత్ర ప్రదర్శనలు జరిగాయనీ, భారతదేశమంతటా చిత్ర ప్రదర్శనలు వ్యాపించడంలో మద్రాసు కీలకపాత్ర పోషించిందనీ అర్థమవుతోంది. ఆ తరువాత కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఎంతో మంది ఫిల్ములను ప్రదర్శించేవారు. అలా ఫిల్ముల ప్రదర్శన వాణిజ్యపరంగా విజయవంతం అవుతుండడం చూసి, మరికొందరికి ఉత్సాహం కలిగింది. తిరుచ్చికి చెందిన రైల్వే ఉద్యోగి అయిన సామికన్ను విన్సెంట్‌ అనే ఆయన 'ఎడిసన్స్‌ సినిమాటోగ్రాఫ్‌'ను సంచార సినిమాహాలుగా 1905లో నెలకొల్పారు. అలా ఆయన సినిమా ఎగ్జిబిటరైన తొలి తమిళుడయ్యారు.
తొలి శాశ్వత థియేటర్ల శ్రేణి
ఇక, మద్రాసులో స్థిరపడ్డ తెలుగువాడూ, బందరు బిడ్డ అయిన రఘుపతి వెంకయ్య నాయుడు ఆ తరువాత 1909 ప్రాంతంలో టూరింగ్‌ సినిమాను నెలకొల్పారు. ఆ సంచార సినిమాతో భారతదేశం నలుమూలల్లోనే కాక, బర్మా, సిలోన్‌లలో కూడా ప్రదర్శనలిచ్చారు. ఆ పైన మద్రాసుకు తిరిగొచ్చి, 'గెయిటీ' (1914) పేరిట శాశ్వత సినిమా హాలు నిర్మించారు. మౌంట్‌ రోడ్డు సమీపంలో కూవమ్‌ నదికి పక్కనే బ్లాకర్స్‌ రోడ్డులో కట్టిన ఆ సినిమా హాలు మద్రాసులో ఓ భారతీయుడి యాజమాన్యంలో నిర్మాణమైన తొలి శాశ్వత సినిమా థియేటర్‌. ఆ తరువాత మన ఈ తెలుగు సినీ పితామహుడు వెంకయ్యే మద్రాసులో మరో రెండు థియేటర్లు (మింట్‌ స్ట్రీట్‌లో 1916లో 'క్రౌన్‌', పురసవాక్కమ్‌ ప్రాంతంలో 1917లో 'గ్లోబ్‌') కట్టారు. దక్షిణ భారతదేశంలో తొలి గొలుసుకట్టు థియేటర్ల శ్రేణి ఇదే! ఆ మూడు థియేటర్లతో ఆ ఘనత మన తెలుగువాడికి దక్కింది.
మన మూకీలకు పురిటిగడ్డ మద్రాసే!
భారతదేశంలోనే తొలి సినిమాటోగ్రాఫ్‌ ప్రదర్శనలు 1896 జూలై 7న బొంబాయిలో జరిగితే, ఆ తరువాత అయిదు నెలలకల్లా మద్రాసుకు సినిమా వచ్చేసింది. అలాగే, వాణిజ్యరీతిలో చలనచిత్రాల నిర్మాణం కూడా మనదేశంలో ముందుగా బొంబాయిలో మొదలైంది. సరిగ్గా నూరేళ్ళ క్రితం దాదాసాహెబ్‌ ఫాల్కే తీసిన 'రాజా హరిశ్చంద్ర' (1913)తో సినిమా రూపకల్పన పరిశ్రమ శ్రీకారం చుట్టుకుంది. ఆ తొలి భారతీయ మూకీ ఫీచర్‌ఫిల్మ్‌, ఆ తరువాత బొంబాయిలో ఆవిష్కృతమైన సినీ విజయగాథలను ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. ఆ స్ఫూర్తితోనే వెంటనే దక్షిణ భారతదేశంలో తొలిసారిగా మద్రాసులో చిత్ర నిర్మాణం మొదలైంది. దక్షిణ భారత సినీ పరిశ్రమకు శ్రీకారం చుట్టిన ఆ తొలి సినిమా - 'కీచక వధమ్‌' (1916). దాన్ని రూపొందించింది - ఆటోమొబైల్‌ విడి భాగాల వ్యాపారస్థుడైన మద్రాసు వాసి ఆర్‌.నటరాజ ముదలియార్‌.
మద్రాసులోని మౌంట్‌ రోడ్డులో థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలో ఆయన ఆటోమొబైల్‌ విడిభాగాల కార్యాలయం ఉండేది. సినిమా మీద ప్రేమతో ఆయన పూనా వెళ్ళి, స్టీవార్ట్‌ స్మిత్‌ అనే ఓ బ్రిటీషు కెమేరామన్‌ దగ్గర శిక్షణ పొందారు. ఆ పైన మద్రాసుకు తిరిగొచ్చి, మరో మిత్రుడితో కలసి 1916లో ఇండియన్‌ ఫిల్మ్‌ కంపెనీ అనే చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థ పక్షానే తొలి దక్షిణ భారతీయ మూకీ చిత్రం 'కీచక వధమ్‌' తీశారు.
తెలుగు వారి తొలి స్టూడియో అక్కడే!
దక్షిణాదిలో తొలి ఫిల్మ్‌ స్టూడియో కూడా మద్రాసులోనే ఏర్పాటైంది. 'కీచక వధమ్‌' షూటింగ్‌ కోసం నటరాజ ముదలియార్‌ మద్రాసులోని కీల్పాక్‌ ప్రాంతంలో మిల్లర్స్‌ రోడ్డులోని ఓ భవంతిలో దక్షిణ భారతదేశపు తొలి ఫిల్మ్‌ స్టూడియో ఏర్పాటు చేశారు. అలాగే, చిత్రీకరణ జరిపిన ఫిల్మును ప్రాసెస్‌ చేయడం కోసం వాతావరణ కారణాల రీత్యా బెంగుళూరులో ప్రాసెసింగ్‌ లేబొరేటరీ పెట్టారు. చిత్ర నిర్మాణ సంస్థ పెట్టిన 35 రోజుల్లో 'కీచక వధమ్‌'ను రూపొందించారు.
ఆ తరువాత రఘుపతి వెంకయ్య, సినిమా రూపకల్పనపై ఇంగ్లండ్‌లో శిక్షణ పొంది వచ్చిన ఆయన కుమారుడు రఘుపతి సూర్య ప్రకాశ్‌లు నటరాజ ముదలియార్‌ నడిచిన బాటను అనుసరించారు. విదేశాల నుంచి వచ్చిన రఘుపతి ప్రకాశ్‌ రమారమి 1921లో తన తండ్రి రఘుపతి వెంకయ్య అండదండలతో, మద్రాసులోని పరశువాక్కమ్‌ ప్రాంతంలో గ్లోబ్‌ థియేటర్‌ వెనుక 'స్టార్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌' పేరిట ఓ స్టూడియోనూ, 'స్టార్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ ఫిలిమ్స్‌' పేరిట చిత్ర నిర్మాణ సంస్థనూ నెలకొల్పారు. స్టూడియోలో ఫిల్మ్‌ లేబొరేటరీ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అలా మన తెలుగువాళ్ళు కట్టిన తొలి స్టూడియో, చిత్ర నిర్మాణ సంస్థ కూడా మద్రాసులోనే వచ్చాయన్న మాట!
తగినంత సూర్యరశ్మి లోపలకు వచ్చేలా గాజు పలకల పై కప్పుతో కూడిన ఆ స్టూడియో అప్పట్లో 'గ్లాస్‌ స్టూడియో'గా జనసామాన్యంలో ప్రసిద్ధమైంది. మూకీ చిత్రం 'భీష్మ ప్రతిజ్ఞ'తో ప్రకాశ్‌ అక్కడ చిత్ర నిర్మాణం మొదలుపెట్టారు. తెలుగువారు తీసిన తొలి మూకీ ఫీచర్‌ఫిల్మ్‌ అదే! పెగ్గీ కాస్టెల్లో, బన్నీ ఆస్టెన్‌లు ప్రధాన తారాగణం నటించిన ఈ 8 వేల అడుగుల చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్ర ప్రదర్శన వ్యవధి 134 నిమిషాలట !ఈ చిత్ర విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో, ఆయన పలు మూగ చిత్రాలను రూపొందించారు.
తొలి మహిళా సౌండ్‌ రికార్డిస్ట్‌
అలాగే, ఏ. నారాయణన్‌, టి.హెచ్‌. హఫ్టన్‌, ఆర్‌. పద్మనాభన్‌ లాంటి పలువురు మద్రాసు నుంచే మూకీ చిత్రాలు తీశారు. ఏ. నారాయణన్‌ 1929 ఆగస్టులో నెలకొల్పిన 'జనరల్‌ పిక్చర్స్‌ కార్పొరేషన్‌' సంస్థ అధిక సంఖ్యలో మూకీలు తీసింది. భారీ డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌ వ్యవస్థలను ఏర్పాటుచేసుకున్న తొలి దక్షిణాది సంస్థ ఇదే. తరువాతి కాలంలో ఉన్నత స్థాయికి ఎదిగిన పలువురు దక్షిణాది సినీ ప్రముఖులకు ఈ సంస్థ ఓ సినీ విద్యాలయంగా విలసిల్లిందంటే అతిశయోక్తి కాదు.
నారాయణన్‌ భార్య కమల ఆయన చిత్రాలకు సౌండ్‌ రికార్డిస్ట్‌గా పనిచేసేవారు. భారతదేశంలో తొలి మహిళా ఫిల్మ్‌ టెక్నీషియన్‌గా పేరు తెచ్చుకున్నారు.
దక్షిణాదిలో తొలి టాకీ స్టూడియో, చిత్రం
అయితే, హాలీవుడ్‌ చిత్రాలు, బ్రిటీషు సినిమాలు, ఉత్తర భారతదేశపు చిత్రాల నుంచి ఎదురవుతూ వచ్చిన పెను సవాళ్ళను దక్షిణాదిలోని సైలెంట్‌ ఫిల్మ్‌ స్టూడియోలు దీటుగా ఎదుర్కోలేకపోయాయి. దాంతో, 1927 ప్రాంతం నుంచి కొంత కష్టాలను ఎదుర్కొంటూ వచ్చిన ఈ స్టూడియోలు, చిత్ర నిర్మాణ సంస్థలు ఒక్కటొక్కటిగా మూతబడుతూ వచ్చాయి. మరోపక్క 1931 నాటికి మద్రాసుకు కూడా టాకీలు వచ్చేశాయి. తొలి పూర్తి నిడివి భారతీయ టాకీ చిత్రం 'ఆలమ్‌ ఆరా' విడుదల (1931 మార్చి 14)తో, దక్షిణాది భాషల్లోనూ టాకీల నిర్మాణానికి బీజం పడింది. తమిళ - తెలుగు భాషలు రెండూ తెరపై వినిపిస్తూ, తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ చిత్రమైన 'కాళిదాస్‌' (1931 అక్టోబర్‌ 31) జనం ముందుకొచ్చింది. ఆపైన తొలి పూర్తి తెలుగు టాకీగా 'భక్త ప్రహ్లాద' (1932 ఫిబ్రవరి 6) వచ్చింది.
టాకీల తొలినాళ్ళలో అందుకు తగిన సౌకర్యాలున్న స్టూడియోలేవీ మద్రాసులో లేకపోవడంతో, ఈ దక్షిణాది భాషా టాకీలు కూడా కొన్నేళ్ళ పాటు బొంబాయి, కలకత్తాల్లోనే తయారయ్యాయి. ఆ పరిస్థితుల్లో 1934లో ఏ.నారాయణనే మద్రాసులోని తొలి సౌండ్‌ స్టూడియో 'శ్రీనివాసా టోన్‌' నెలకొల్పారు. యావత్‌ దక్షిణ భారతదేశంలోనే తొలి టాకీ స్టూడియో అదే!
మద్రాసులోని వేపేరి ప్రాంతంలో లాడర్స్‌ గేట్‌ దగ్గర (పూనమల్లి హైరోడ్డులో నెహ్రూ పార్కుకు దాదాపు ఎదురుగా) ఈ స్టూడియో ఉండేది. ఈ స్టూడియో టాకీ చిత్రాల నిర్మాణానికి అనువుగా రూపొందినది కావడంతో, దాన్ని 'సౌండ్‌ సిటీ' అని అప్పట్లో జనం పిలుస్తుండేవారు. ఆ సంస్థ ముందుగా 'శ్రీనివాస కల్యాణం' అనే ఓ తమిళ చిత్రాన్ని మద్రాసులోనే నిర్మించింది. మద్రాసులో తయారైన తొలి తమిళ టాకీ అదే! ఆ మాటకొస్తే, భాషల మాట పక్కనబెట్టి చూసినా, యావత్‌ దక్షిణ భారతావనిలో తయారైన తొలి టాకీ చిత్రమూ అదే! ఆ తరువాత పన్నెండు నెలల్లోనే ఏకంగా 36 టాకీలు మద్రాసులో తయారయ్యాయి. ఆ రకంగా దక్షిణాది సినిమా ప్రభంజనం మొదలైంది.
తెలుగు వారి తొలి స్టూడియో, టాకీ
సరిగ్గా 1934లోనే జూలై నెలలో తెలుగు వారి పెట్టుబడి భాగస్వామ్యంతో 'వేల్‌ పిక్చర్స్‌ స్టూడియో' ఏర్పాటైంది. మద్రాసులోని తేనాంపేట ప్రాంతంలో ఎల్డామ్స్‌ రోడ్‌ దగ్గర ప్రస్తుత వీనస్‌ కాలనీ (ఒకప్పుడు వీనస్‌ స్టూడియో)కి దగ్గరలో పిరవాపురం రాజా వారికి 'డన్‌మోర్‌ హౌస్‌' అనే పెద్ద బంగళా ఉండేది. బందరుకు చెందిన వ్యాపారవేత్త, సినీ ఎగ్జిబిటర్‌ పి.వి. దాసు అది తీసుకొని, దానిలో 'వేల్‌ పిక్చర్స్‌' పేరున సినిమా చిత్రీకరణలకు అనువైన స్టూడియోను నెలకొల్పారు. ప్రత్యేకించి లైట్లు లేకుండా సూర్యరశ్మి ఆధారంగానే షూటింగులు జరుపుతూ, 'శ్రీనివాస సినీటోన్‌' నడిచేది.
అయితే, అందుకు పూర్తి భిన్నంగా, 'శ్రీనివాస సినీటోన్‌' కన్నా ఎంతో ఉత్తమంగా, నాణ్యమైన సాంకేతిక వసతులతో 'వేల్‌ పిక్చర్స్‌ స్టూడియో' ఏర్పాటైంది. వేల్‌ పిక్చర్స్‌ స్టూడియో నిర్మాణం, నిర్వహణలకు పి.వి.దాసు ఎంతో శ్రమించారు. 'వేల్‌ పిక్చర్స్‌' కంపెనీ వారు విశేషంగా పరిశ్రమించి, వ్యయానికి లెక్క చేయకుండా, ఉత్తమమైన చిత్రాలను తయారుచేయాలనే లక్ష్యంతో పాటుపడ్డారు. పైగా, వాళ్ళు స్టూడియో నిర్మించుకున్న 'డన్‌మోర్‌ హౌస్‌' అన్ని విధాల వాళ్ళ ఉద్యమానికి అనుకూలమైంది. స్టూడియో కోసం ఆధునిక యంత్ర సామగ్రిని చాలా వరకు తెప్పించారు. అజంతా, ఎల్లోరా చిత్తరువుల సంప్రదాయాలను అనుసరించి, వస్తు వాహనాలను విరివిగా తయారు చేయించారు. ఆంధ్రదేశంలోనూ, అరవ దేశంలోనూ ఉండే శిల్పులు, వడ్రంగుల్లో ప్రవీణులైన కొందరిని రప్పించి, స్టూడియోకు అవసరమైన సంబారాన్ని అంతా అమర్చుకున్నారు.
దక్షిణాది తయారీ తొలి తెలుగు టాకీ 'సీతా కల్యాణము'
'వేల్‌ పిక్చర్స్‌' వారి తొలి చిత్రం - తెలుగు సినిమా 'సీతా కల్యాణము' (1934). వారి స్టూడియోలో ప్రథమంగా నిర్మించినది కూడా ఈ చిత్రమే! ఆ రకంగా మద్రాసులో తెలుగు చలనచిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది - పి.వి. దాసు. అప్పటి దాకా ఉత్తర భారతదేశంలోని నగరాల్లో రూపొందుతున్న తెలుగు చిత్రాలకు భిన్నంగా, దక్షిణ భారతదేశంలోనే తయారైన తొలి తెలుగు చిత్రంగా 'సీతా కల్యాణము' చరిత్ర సృష్టించింది. అటుపైన మద్రాసులోని అడయార్‌లో 'మీనాక్షీ సినీటోన్‌' అంటే మరో స్టూడియో వచ్చింది. 1937 నాటి కల్లా మద్రాస్‌ ప్రెసిడెన్సీలో దాదాపు రూ. 17 కోట్ల మొత్తం సినిమా పరిశ్రమలో పెట్టుబడి అయింది. స్టూడియోలు కూడా మద్రాసులో 9, కోయంబత్తూరులో రెండు, సేలమ్‌లో ఒకటి నడవసాగాయి. మౌలిక వసతులు, సాంకేతిక నిపుణులు, పరిజ్ఞానం విరివిగా అందుబాటులో ఉండడం వల్ల ఖర్చు తక్కువవుతుంది కాబట్టి, క్రమంగా కన్నడ, మలయాళ చిత్రాల నిర్మాణం కూడా మద్రాసులో స్థిరపడింది.
అలా దక్షిణాది సినీ రంగాలన్నిటికీ మద్రాసు తిరుగులేని కేంద్రంగా నిలిచింది. తరువాతి క్రమంలో కన్నడ, మలయాళ, తెలుగు చిత్రసీమలు వాటి వాటి స్వరాష్ట్రాలకు తరలిపోయాయి. అయితే, ఇవాళ్టికీ సంగీతం, కెమేరా, నృత్య విభాగాలతో సహా పలు అంశాల్లో నిష్ణాతులైన సాంకేతిక నిపుణుల కోసం అందరికీ మద్రాసే శరణ్యమవుతోంది. భారతీయ సినిమా తొలినాళ్ళ నుంచి ఉన్న అవినాభావ సంబంధం కారణంగా ఇవాళ నూరేళ్ళ సినీ ఉత్సవం మద్రాసులో జరగడం ఎంతో సమంజసం! కాదంటారా? 

- చెన్నై నుంచి రెంటాల జయదేవ
................................................

Thursday, September 26, 2013

'నూరేళ్ళ సినిమా' ఉత్సవాలు... నేడే మొదలు - దక్షిణాది సినీ రాజధాని చెన్నైలో జోరుగా ఏర్పాట్లు

చెన్నైలోని సత్యం థియేటర్ కాంప్లెక్స్ వద్ద సత్యం థియేటర్ ప్రతినిధి మునికన్నయ్య,
సౌతిండియన్ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు సి. కల్యాణ్, గౌరవ కార్యదర్శి ఎల్. సురేశ్, వగైరా

సినిమాకు చిరునామాగా ఉన్న చెన్నై నగరం నూరేళ్ల సినీపండుగకు ముస్తాబైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు సినిమా ఉత్సవాలతో నగరం కళకళలాడనుంది. భారతీయ సినిమా నూరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, దక్షిణాదిలోని నాలుగు ప్రాంతీయ భాషా సినీ పరిశ్రమల తరఫున దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి (సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ - ఎస్‌.ఐ.ఎఫ్‌.సి.సి) నేతృత్వంలో సాగుతున్న ఈ కార్యక్రమంలో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషా సినీ రంగ ఫిల్మ్‌ చాంబర్లు, ఆ యా సినీ రంగాల ప్రముఖులు, పెద్దలు పాలుపంచుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అండదండలందిస్తున్న ఈ కార్యక్రమానికి చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియమ్‌ ప్రధాన వేదికగా ఈ పండుగ జరుగుతోంది.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శనివారం సాయంత్రం ఉత్సవాలను ప్రారంభిస్తారు. నగరంలోని ప్రధాన కూడళ్ళు, పార్కులు ఇప్పటికే ఈ ఉత్సవ ప్రకటనలు, హోర్డింగులు, తోరణాలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. నగరంలోని ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో సెప్టెంబర్‌ 16 నుంచి 24 దాకా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలను ప్రజలకు ఉచితంగా ప్రదర్శిస్తారు. ప్రధానమైన పార్కుల్లో రోజూ సాయంత్రం పాత సినీ ఆణిముత్యాలను ప్రదర్శిస్తున్నారు. ''తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ సినీ నటి జయలలిత ఈ ఉత్సవం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆ సహకారం లేనిదే ఇంత భారీ స్థాయిలో ఉత్సవాల నిర్వహణ సాధ్యమయ్యేది కాదు'' అని ఎస్‌.ఐ.ఎఫ్‌.సి.సి. అధ్యక్షుడు, ప్రముఖ తెలుగు సినీ నిర్మాత సి. కల్యాణ్‌ చెప్పారు. ''దక్షిణ భారతీయ సినిమాకు మద్రాసు జన్మస్థానం. అందుకే, ఈ నగరాన్ని వేదికగా ఎంచుకున్నాం'' అని ఆయన వివరించారు.
మరోపక్క ఈ ఉత్సవాల సన్నాహాల నిమిత్తం సెప్టెంబర్‌ 18 నుంచి 24 దాకా తమిళనాడుతో సహా వివిధ రాష్ట్రాల్లో సినిమా షూటింగ్‌లను ఆపుచేశారు. రజనీకాంత్‌, కమలహాసన్‌ సహా ప్రముఖ తారలందరూ ఈ వేడుకలో పాలొంటారు. ఇక, రెండో రోజైన సెప్టెంబర్‌ 22 ఆదివారం నాడు ఉదయం కన్నడ చిత్ర సీమ వేడుకలు, సాయంత్రం నుంచి తెలుగు సినీ పరిశ్రమ వేడుకలు జరగనున్నాయి. మూడో రోజైన సెప్టెంబర్‌ 23 సోమవారం మలయాళ పరిశ్రమ వేడుకలు జరుగుతున్నాయి. అలాగే, గడచిన 72 ఏళ్ళుగా సినిమాల్లో నటిస్తూ, నిన్నటితో 90వ ఏట అడుగుపెట్టిన ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను కూడా ఈ వేదికపై జరపనున్నారు. వేడుకలలో భాగంగా ప్రతి రోజూ సినిమా తారలతో జరిపే సినీ, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి.

ఇక, ఉత్సవాలు ముగిసే సెప్టెంబర్‌ 24 మంగళవారం నాడు నాలుగు సినీ పరిశ్రమల తాలూకు తారలతో 'గ్రాండ్‌ ఫైనల్‌' నిర్వహించనున్నారు. భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ముఖ్య అతిథిగా, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, నాలుగు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా ఈ ముగింపు ఉత్సవానికి హాజరు కానుండడం విశేషం. ఈ తుది రోజు వేడుకల్లో దక్షిణాది భాషా తారలందరూ పెద్దయెత్తున పాల్గొనేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ''దక్షిణ భారతీయ సినిమా వారందరూ ఒక గొడుగు కిందకు వచ్చి, ఇంత పెద్ద చేయడం విశేషం'' అని దర్శక, నిర్మాత, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఆర్‌. అన్నారు. ''ఈ ఉత్సవం మన జాతీయ సమైక్యత, సమగ్రతకు ఓ ఉదాహరణగా నిలుస్తుంది'' అని కె.ఆర్‌. అభిప్రాయపడ్డారు.
అయితే, తెలుగునాట నెలకొన్న సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణ వాదాల సెగ ఈ వేడుకలను కూడా తాకింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, ఈ వేడుకలను వాయిదా వేయాలంటూ ఈ నెల మొదటి వారంలో నటుడు - నిర్మాత మోహన్‌బాబు చేసిన అభ్యర్థన కలకలం రేపింది. అన్ని రాష్ట్రాల వారూ కలసి ఎంతో ముందుగా నిర్ణయించుకొని చేస్తున్న ఈ ఉత్సవాలను ఆపడం సాధ్యం కాదంటూ నిర్వాహకులు తెగేసి చెప్పారు. దాంతో, ఉత్సవాలైతే ముందుగా నిర్ణయించిన ప్రకారం జరుగుతున్నాయి కానీ, అనేక ఇగో సమస్యలు, అంతర్గత విభేదాలున్న పలువురు సినీ తారలు మాత్రం వీటికి దూరంగానే ఉంటున్నట్లు ఇప్పటి దాకా అందుతున్న సమాచారం.

 సినిమా ఉత్సవాల్లో అక్కినేని పుట్టినరోజు వేడుకలను కలపడాన్ని కూడా కొన్ని వర్గాల వారు వ్యతిరేకించారు. దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు వర్గం కూడా ఈ ఉత్సవాల పట్ల అంతగా ఆసక్తిని చూపడం లేదని కృష్ణానగర్‌ వర్గాల కథనం. దాంతో, ఈ ఉత్సవాల్లో 22న జరిగే తెలుగు వేడుకల్లోనూ, ఆ తరువాత మన వాళ్ళలో ఎంతమంది, ఏ మేరకు పాలుపంచుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది. 

మరోపక్క ఈ ఉత్సవాల సన్నాహాల నిమిత్తం సెప్టెంబర్‌ 18 నుంచి 24 దాకా తమిళనాడుతో సహా వివిధ రాష్ట్రాల్లో సినిమా షూటింగ్‌లను ఆపుచేశారు. రజనీకాంత్‌, కమలహాసన్‌ సహా ప్రముఖ తారలందరూ ఈ వేడుకలో పాలొంటారు. ఇక, రెండో రోజైన సెప్టెంబర్‌ 22 ఆదివారం నాడు ఉదయం కన్నడ చిత్ర సీమ వేడుకలు, సాయంత్రం నుంచి తెలుగు సినీ పరిశ్రమ వేడుకలు జరగనున్నాయి. మూడో రోజైన సెప్టెంబర్‌ 23 సోమవారం మలయాళ పరిశ్రమ వేడుకలు జరుగుతున్నాయి. అలాగే, గడచిన 72 ఏళ్ళుగా సినిమాల్లో నటిస్తూ, నిన్నటితో 90వ ఏట అడుగుపెట్టిన ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను కూడా ఈ వేదికపై జరపనున్నారు. వేడుకలలో భాగంగా ప్రతి రోజూ సినిమా తారలతో జరిపే సినీ, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి.
ఇక, ఉత్సవాలు ముగిసే సెప్టెంబర్‌ 24 మంగళవారం నాడు నాలుగు సినీ పరిశ్రమల తాలూకు తారలతో 'గ్రాండ్‌ ఫైనల్‌' నిర్వహించనున్నారు. భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ముఖ్య అతిథిగా, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, నాలుగు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా ఈ ముగింపు ఉత్సవానికి హాజరు కానుండడం విశేషం. ఈ తుది రోజు వేడుకల్లో దక్షిణాది భాషా తారలందరూ పెద్దయెత్తున పాల్గొనేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ''దక్షిణ భారతీయ సినిమా వారందరూ ఒక గొడుగు కిందకు వచ్చి, ఇంత పెద్ద చేయడం విశేషం'' అని దర్శక, నిర్మాత, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఆర్‌. అన్నారు. ''ఈ ఉత్సవం మన జాతీయ సమైక్యత, సమగ్రతకు ఓ ఉదాహరణగా నిలుస్తుంది'' అని కె.ఆర్‌. అభిప్రాయపడ్డారు.

అయితే, తెలుగునాట నెలకొన్న సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణ వాదాల సెగ ఈ వేడుకలను కూడా తాకింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, ఈ వేడుకలను వాయిదా వేయాలంటూ ఈ నెల మొదటి వారంలో నటుడు - నిర్మాత మోహన్‌బాబు చేసిన అభ్యర్థన కలకలం రేపింది. అన్ని రాష్ట్రాల వారూ కలసి ఎంతో ముందుగా నిర్ణయించుకొని చేస్తున్న ఈ ఉత్సవాలను ఆపడం సాధ్యం కాదంటూ నిర్వాహకులు తెగేసి చెప్పారు. దాంతో, ఉత్సవాలైతే ముందుగా నిర్ణయించిన ప్రకారం జరుగుతున్నాయి కానీ, అనేక ఇగో సమస్యలు, అంతర్గత విభేదాలున్న పలువురు సినీ తారలు మాత్రం వీటికి దూరంగానే ఉంటున్నట్లు ఇప్పటి దాకా అందుతున్న సమాచారం. 
 సినిమా ఉత్సవాల్లో అక్కినేని పుట్టినరోజు వేడుకలను కలపడాన్ని కూడా కొన్ని వర్గాల వారు వ్యతిరేకించారు. దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు వర్గం కూడా ఈ ఉత్సవాల పట్ల అంతగా ఆసక్తిని చూపడం లేదని కృష్ణానగర్‌ వర్గాల కథనం. దాంతో, ఈ ఉత్సవాల్లో 22న జరిగే తెలుగు వేడుకల్లోనూ, ఆ తరువాత మన వాళ్ళలో ఎంతమంది, ఏ మేరకు పాలుపంచుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది. 

- రెంటాల జయదేవ 
(Published in 'Prjasakti' daily, 21 Sept 1002, Saturday, pageNo. 8)
.........................................................................................