ఏ సినీ కథ అయినా జనానికి నచ్చిందంటే, ఆ కథ రూపొందిన కాలమాన పరిస్థితులు, అందులోని అంశాలతో సమాజానికి ఉన్న సామీప్యత, సినిమా రిలీజ్ సమయం లాంటి కారణాలెన్నో ఉంటాయి. అవేవీ గమనించకుండా, గ్రహించకుండా హిట్టయిన ప్రతి సినిమా కథనూ మరోసారి తెరపై సినిమా తీయాలని ప్రయత్నిస్తే, అది దర్శక, హీరోల దురాశ అవుతుంది. పైగా, అసలు కథలోని ఆత్మను వదిలేసి, కేవలం పాత్రలతో, ఆ చట్రంలో విన్యాసాలు చేస్తే, హాలుకొచ్చిన ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. నలభై ఏళ్ళ క్రితం అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన ‘జంజీర్’ (1973 మే 11) చిత్రాన్ని రామ్ చరణ్ తో రీమేక్ చేయడంలో, ఇప్పుడు సరిగ్గా అదే అయింది. ....................................................................... చిత్రం :తుఫాన్, జంజీర్, తారాగ ణం: రామ్‌చరణ్, ప్రియాంకా చోప్రా, శ్రీహరి, ప్రకాశ్ రాజ్, మాహి గిల్, తనికెళ్ళ భరణి, మూలకథ: సలీమ్ ` జావేద్, స్క్రీన్‌ప్లే: అపూర్వ లాఖియా, సురేశ్ నాయర్, తెలుగులో మాటలు: మధుసూదన్ ` వేమారెడ్డి, తెలుగులో పాటలు: చంద్రబోస్, కెమేరా: గురురాజ్, ఎడిటింగ్: చింటూ సింగ్, నిర్మాతలు: రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్, దర్శకత్వం : అపూర్వ లాఖియా ....................................................................... చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ తేజ్ హిందీ తెరంగేట్రమైన ఈ ‘జంజీర్’ కథ నిజానికి హిందీ చలనచిత్ర సీమను కొత్త దోవలోకి మళ్ళించిన 1970ల నాటి వాటిల్లో ఒకటి. సమాజంలోని అవినీతి, అక్రమాలు, అభివృద్ధి లేమిపై జనాగ్రహం పెల్లుబుకుతున్న కాలంలో ఈ కథ తెరపైకి వచ్చింది. అప్పటి దాకా అలరించిన రాజేశ్ ఖన్నా తరహా ప్రేమ కథలను పక్కకు నెట్టి, అన్యాయాన్ని ఎదిరించి, న్యాయాన్ని నిలబెట్టే సరికొత్త సామాన్య హీరో ఫార్ములా పాత్రలకు ఊపిరి పోసింది. హుందాతో కూడిన ప్రాణ్ నటన తోడైన ఈ చిత్రం అప్పటి దాకా అస్తుబిస్తుగా ఉన్న హీరో అమితాబ్ బచ్చన్ కెరీర్‌ను కుదుటపరిచి, ఆయనను ముందుకు దూసుకుపోయేలా చేసింది.
ఈ హిట్ కథ ఆ వెంటనే తెలుగులో ఎన్టీయార్ - సత్యనారాయణల కాంబినేషన్‌లో ‘నిప్పు లాంటి మనిషి’ (1974 అక్టోబర్ 25)గా, తమిళంలో ఎమ్జీయార్ ద్విపాత్రాభినయంలో ‘సిరుత్తు వాళ వేండుమ్’ (నవ్వుతూ బతకాలి అని అర్థం)గా విడుదలైంది. అమితాబ్‌కు మూడు పదుల వయస్సులో ‘యాంగ్రీ యంగ్‌మ్యాన్’ ఇమేజ్ తెచ్చిన ఈ కథ 52 ఏళ్ళ వయస్సున్న ఎన్టీయార్‌కూ పెద్ద హిట్‌గా నిలిచి, కెరీర్‌కు కొత్త ఉత్తేజం నింపడం విశేషం. ప్రాథమికంగా ఇది పగ - ప్రతీకారాల ఫార్ములాలో నడిచే యాక్షన్ కథాంశమైనా, అప్పట్లో దాన్ని మలిచిన తీరే విజయ సూత్రమైంది. నకిలీ ఔషధాలు, కల్తీ మద్యం లాంటి సామాన్యులకు చురుక్కున తగిలేవి, స్నేహం లాంటి సార్వజనీన అంశం, పాత్రల మధ్య అనుబంధాలు ఆ విజయానికి వెన్నెముక అయ్యాయి.
కానీ, తాజా రీమేక్ దగ్గరకు వచ్చేసరికి నలభై ఏళ్ళ క్రితం స్టార్ రచయితల జంట సలీమ్ - జావేద్‌లు వండి వడ్డించిన ‘జంజీర్’ కథాచట్రం, అందులోని పాత్రలనే దర్శక, రచయిత అపూర్వ లాఖియా ప్రధానంగా తీసుకొన్నారు. అయితే, కథలోని అనుభూతిని వదిలేసి, విలన్ నేపథ్యంతో సహా అనేక అంశాల్లో తన ఆలోచనలతో మార్పులు చేర్పులు చేశారు. దురదృష్టం ఏమిటంటే, చమురు మాఫియా లాంటి అవి ఏవీ జనసామాన్యాన్ని తాకేవి కాకపోవడం! ముక్కుసూటిగా పోతూ, అయిదేళ్ళలో 22 సార్లు బదిలీ అయిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ ఖన్నా (రామ్‌చరణ్). హైదరాబాద్ నుంచి ముంబయ్‌కి బదిలీ అయిన అతను, రుద్ర ప్రతాప్ తేజ (ప్రకాశ్‌రాజ్) నడిపే వేల కోట్ల రూపాయల విలువైన చమురు మాఫియా గు ట్టుమట్లు వెలికి తీసే పనిలో పడతాడు. ఆ క్రమంలో విలన్ వేసిన ఎత్తులు, వాటిని హీరో ఎదుర్కొన్న తీరు, చిన్నప్పుడు తన తల్లితండ్రుల్ని చంపింది ఆ విలనే అని తెలుసుకొని అతణ్ణి అంతమొందించడం ఇదీ కథ. ఇందులో హీరోయిన్ - ఓ ఫేస్‌బుక్ ఫ్రెండ్ పెళ్ళి చూద్దామని అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయురాలు మాల (ప్రియాంకా చోప్రా). అనుకోకుండా ఓ హత్య చూసి, ఆమె సాక్షిగా మారుతుంది. (కాసేపట్లో... దీనికి కొనసాగింపుగా పార్ట్ 2) ....................................
0 వ్యాఖ్యలు:
Post a Comment