తొలి భారతీయ మూకీ కథాచిత్రం 'రాజా హరిశ్చంద్ర' నాటి నుంచి ఇవాళ్టి డిజిటల్ సినిమా యుగం దాకా గడచిన నూరేళ్ళ కాలంలో మన సినిమా ఎన్నో మార్పులకు గురైంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలోని కొన్ని చెరిగిపోని గుర్తుల గురించి...
తొలి భారతీయ సినిమా హాలు: కలకత్తాలో 1907లో జె.ఎఫ్. మదన్ ఆరంభించిన ఎల్ఫిన్‌స్టన్ పిక్టర్ ప్యాలెస్. ప్రస్తుతం చాప్లిన్ సినిమా హాలు పేరిట మూతబడి, శిథిలావస్థలో మిగిలింది.
తొలి పూర్తి నిడివి చలనచిత్రం : పూర్తిగా మన దేశంలో, మన సాంకేతిక నిపుణుల సాయంతో తయారైన తొలి కథా కథనాత్మక చిత్రం రాజా హరిశ్చంద్ర (1913). 'దాదాసాహెబ్ ఫాల్కే'గా సుప్రసిద్ధుడైన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే ఈ ''స్వదేశీ'' ప్రయత్నానికి దర్శక, నిర్మాత. ఇప్పటికి నూరేళ్ళ క్రితం 1913 మే 3న వాణిజ్యపద్ధతిలో ఈ చిత్రాన్ని తొలిసారిగా ప్రదర్శించారు.
తెరపై తొలి మహిళలు: స్త్రీలు నాటకాల్లో, సినిమాల్లో నటించడాన్ని పెద్ద తప్పుగా భావించే రోజులవి. దాంతో, తొలి భారతీయ సినిమా 'రాజా హరిశ్చంద్ర'లో సైతం కథానాయిక తారామతి పాత్రను సాలుంకే అనే ఓ పురుషుడితోనే నటింపజేశారు - ఫాల్కే. ఆ సినిమా అందరినీ ఆకర్షించడంతో, తన రెండో సినిమా 'మోహినీ భస్మాసుర' (1913)లో స్త్రీ పాత్రలను స్త్రీలతోనే ధరింపజేయగలిగారాయన. ఆ సినిమాలో పార్వతీదేవి పాత్రలో దుర్గాబాయి నటిస్తే, మోహిని పాత్రలో ఆమె కుమార్తె కమలాబాయి అభినయించారు.
తొలిసారిగా ద్విపాత్రాభినయం: 'రాజా హరిశ్చంద్ర'లో తారామతి వేషం వేసిన పురుషుడు అన్నా సాలుంకే ఆ తరువాత కొన్నేళ్ళకు ఫాల్కే 'లంకా దహన్'లో అటు రాముడిగా, ఇటు సీతగా రెండు పాత్రలూ అభినయించారు. ఈ సినిమాను ముంబరులో ప్రదర్శించినప్పుడు, తెరపై శ్రీరాముడి పాత్ర కనపడగానే, ప్రేక్షకులు కాలిజోళ్ళు విడిచి, భక్తిగా చూసేవారట!
దక్షిణాదిలో తొలి చిత్రం : తమిళనాడుకు చెందిన ఆర్. నటరాజ ముదలియార్ అనే ఆటోమొబైల్ విడిభాగాల వ్యాపారి సినిమా మీద ఆసక్తితో ఈ రంగానికి వచ్చారు. ఓ బ్రిటీషు సినిమాటోగ్రాఫర్ వద్ద శిక్షణ పొంది, 'కీచక వధమ్' అనే పూర్తి నిడివి కథాచిత్రాన్ని నిర్మించారు. దక్షిణ భారతదేశంలో రూపొందిన తొలి సినిమా ఈ మూగ సినిమాయే!
తొలి మహిళా నిర్మాత, దర్శకురాలు: ఎక్కువగా పురుషులదే ఆధిపత్యంగా చెల్లుబాటైన ఆ రోజుల్లో, 1926లో తొలిసారిగా నటి ఫాతిమా బేగమ్ తొలిసారిగా నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఫాతిమా ఫిలిమ్స్ పేరిట స్వీయ చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి, 'బుల్‌బుల్-ఇ-పరస్తాన్' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. అది మొదలుగా ఆమె పలు చిత్రాలను కూడా అందించారు.
తొలి భారతీయ టాకీ చిత్రం: అప్పటి దాకా మూకీ చిత్రాలే రూపొందిన మన దేశంలో తొలిసారిగా తెరపై బొమ్మలు మన భారతీయ భాషలో మాట్లాడి, పాటలు పాడి, ప్రేక్షకుల్ని ఆశ్చర్యానందాల్లో ముంచెత్తాయి. హిందీ, ఉర్దూ మిశ్రమమైన హిందుస్థానీ భాషలో రూపొందిన ఆలమ్ ఆరా (1931 మార్చి 14) నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ, భారతీయ సినిమాలో ఓ కొత్త అధ్యాయం ప్రారంభించింది.
తొలి దక్షిణ భారత టాకీ చిత్రం: 'ఆలమ్ ఆరా' దర్శక - నిర్మాత అర్దేషిర్ ఇరానీ కోరిక మేరకు దర్శకుడు హెచ్.ఎం. రెడ్డి దక్షిణాది భాషలైన తమిళం, తెలుగు రెంటినీ వాడుతూ తీసిన తొలి టాకీ 'కాళిదాస్'. ఇందులో హీరోయిన్ టి.పి. రాజలక్ష్మి తమిళంతో పాటు తెలుగులోనూ డైలాగులు చెప్పి, త్యాగరాయ కీర్తనలు పాడారు. కొన్ని పాత్రలు కూడా తెలుగులో, మరికొన్ని పాత్రలు హిందీలో కూడా మాట్లాడిన ఈ సినిమా ''తొలి తెలుగు - తమిళ టాకీ''గా ప్రచారమైంది.
తొలి పూర్తి తెలుగు టాకీ చిత్రం : హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో, సురభి నాటకాల్లో ప్రసిద్ధులైన 'సురభి' కమలాబాయి, మునిపల్లె సుబ్బయ్య, మాస్టర్ సింధే కృష్ణారావులు లీలావతి, హిరణ్యకశిపుడు, ప్రహ్లాద పాత్రలు పోషించగా, 1931 చివరలో 'భక్త ప్రహ్లాద' నిర్మాణం ప్రారంభించారు. 18 రోజుల్లో పూర్తయిన ఈ సినిమా 1932 జనవరి 22న బొంబాయిలో సెన్సార్ జరుపుకొంది. ఆ వెంటనే 1932 ఫిబ్రవరి 6న బొంబాయిలోని శ్రీకృష్ణా సినిమా హాలులో తొలిసారిగా విడుదలైంది. తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలతో లాభాలు ఆర్జించింది.
తొలి రంగుల చిత్రం: పూర్తిగా మనదేశంలోనే తయారైన తొలి భారతీయ రంగుల సినిమా కిసాన్ కన్య (1937). దీనికన్నా ముందు 'సైరంధ్రి' (1933) సినిమా రంగుల్లో వచ్చినా, దాని ప్రాసెసింగ్, ప్రింటింగ్ అంతా జర్మనీలో జరిగింది.
తొలి అంతర్జాతీయ అవార్డు: చేతన్ ఆనంద్ రూపొందించిన నీచా నగర్ (1946) కాన్స్‌లో 'గ్రాండ్ ప్రిక్స్ డ్యూ ఫెస్టివల్ ఇంటర్నేషనల్ డ్యు ఫిల్మ్'గా ఎంపికైంది. హయతుల్లా అన్సారీ రాసిన 'నీచా నజర్' అనే హిందీ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. గమ్మత్తేమిటంటే, ఆ హిందీ కథ రష్యన్ రచయిత మ్యాగ్జిమ్ గోర్కీ రచన 'లోవర్ డెప్త్ స్' ప్రేరణతో రచించినది.
తొలి భారతీయ సినిమాస్కోప్ చిత్రం: హాలీవుడ్‌లో తొలిసారిగా సినిమాస్కోప్ చిత్రం 'ది రోబ్' నిర్మాణమైన ఆరేళ్ళ తరువాత మనదేశంలో గురుదత్ 'కాగజ్ కే ఫూల్' ద్వారా సినిమాస్కోప్‌కు శ్రీకారం చుట్టారు.
..............................................................
0 వ్యాఖ్యలు:
Post a Comment