దర్శక, రచయిత త్రివిక్రమ్ సినిమా, హీరో పవన్
కల్యాణ్ తో కాంబినేషన్ అనగానే, సగటు తెలుగు సినీ ప్రియులకు ఎవరికైనా ఆసక్తి
ఉంటుంది. సినిమా రావడం ఆలస్యం చూసేయాలని ఉంటుంది. పైపెచ్చు, వీరిద్దరి కాంబినేషన్
లోని ‘అత్తారింటికి దారేది...’ సినిమా ఇప్పటికే రాష్ట్రంలోని ఉద్యమాలతో సహా రకరకాల
అవాంతరాలను ఎదుర్కొంటూ, నిరీక్షణను పెంచేసింది. తీరా సెప్టెంబర్ 23, సోమవారం నాడు
ఈ సినిమా ఫస్టాఫ్ దాదాపు 80 నిమిషాలు పైరసీ జరిగి, ఆన్ లైన్ లోకి వచ్చేసి, ఊరూరా
యాభై రూపాయలకో సీడీ చొప్పున పప్పు బెల్లాల్లా అమ్మకమైందన్న వార్త మరో సంచలనమైంది.
ఆ పైరసీకి కారణమైన ఇంటి దొంగల్ని పట్టుకొనే లోగా, నిర్మాతలు ఇక లాభం లేదు లెమ్మని చివరకు
సినిమా విడుదలను అక్టోబర్ 9 నుంచి దాదాపు రెండు వారాలు ముందుకు జరిపారు. అలా సెప్టెంబర్
27న సినిమా ఎట్టకేలకు జనం ముందుకు వచ్చింది.
కథాకథనాల
గురించి ఏ మాత్రం ముందుగా తెలుసుకోకుండా, నేరుగా థియేటర్ లో సినిమా చూసి, ఓ
అభిప్రాయానికి రావడం అలవాటు. ఈ సినిమాకు అదే పాటిస్తూ, రిలీజ్ రోజు ఉదయాన్నే
చూడాలని ప్లాన్. తీరా, అనుకోని వ్యక్తిగత ఇబ్బందులు వచ్చి, ఊరెళ్ళాల్సి వచ్చింది.
ఆర్టీసీ బంద్ ల మధ్య ప్రయాణం ఖరీదై, ప్రాణానికి నరకంగా మారిన పరిస్థితుల్లో
అనివార్యంగా సినిమా చూడడం రెండు రోజులు ఆలస్యమైంది. ఎట్టకేలకు సినిమా చూశాను - ఎవరి నుంచీ కథ, ఇతర
వివరాలు కనుక్కోకుండా.
తీరా సినిమా చూశాక,
ఇది త్రివిక్రమ్ మార్కు సినిమాయేనా అనిపిస్తుంది. ఇప్పటికే, గతంలో రచయితగా,
దర్శకుడిగా నువ్వు నాకు నచ్చావ్, అతడు, జల్సా లాంటి ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ ఎంటర్
టైనర్లు ఇచ్చిన అతనికి ఈ సినిమా ప్రమోషనా, డిమోషనా అన్న సందేహం వస్తుంది. ఆశించిన
అద్భుత విజయం అందీ అందకుండా ఊరిస్తున్నప్పుడు ఏ దర్శక, రచయిత అయినా దాని కోసం
ఎన్ని రకాలుగా మార్కెట్ లో ఉన్న సక్సెస్ సూత్రాలను తానూ అనుసరిస్తాడో
అర్థమవుతుంది. వెరసి, ఈ సినిమాను ‘అత్తారింటికి
దారేది...’ అని కాకుండా, ‘అపూర్వ విజయానికి దారేది...’ అని అనుకొని మరీ, ఆ చట్రంలో డిజైన్ చేసినట్లు
అనిపిస్తుంది.
.........................................................................................
చిత్రం - అత్తారింటికి
దారేది, తారాగణం -
పవన్ కల్యాణ్, సమంత, నదియా, ప్రణీత, ముఖేశ్ ఋషి, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం,
రఘుబాబు, సంగీతం -
దేవిశ్రీ ప్రసాద్, పాటలు - రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం - ప్రసాద్ మూరెళ్ళ,
యాక్షన్ - పీటర్
హెయిన్, కూర్పు - ప్రవీణ్
పూడి, నిర్మాతలు -
భోగవల్లి ప్రసాద్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్, రచన - దర్శకత్వం - త్రివిక్రమ్
శ్రీనివాస్
...........................................................................................
మేనత్తను
వెతుక్కుంటూ వచ్చిన ఓ మేనల్లుడి కథ ఇది. తాతతో తగాదా పడి, కుటుంబ బంధాలను
తెంచేసుకొని, వారందరికీ దూరంగా బతుకుతున్న మేనత్తనూ, తమ కుటుంబాన్నీ మళ్ళీ కలపాలని
ప్రయత్నించే ఓ కథానాయకుడి ప్రయాణం, ప్రయత్నాల అల్లిక ఇది. ఇటలీలోని మిలన్ లో కొన్ని
లక్షల కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీలు నిర్వహిస్తుంటాడు - పెద్ద
బిజినెస్ మ్యాగ్నెట్ రఘు నందన్ (బొమన్ ఇరానీ). కీళ్ళ వ్యాధితో బాధపడుతూ, చక్రాల
కుర్చీలో నుంచి లేవనైనా లేవలేని ఈ 80 ఏళ్ళ ముసలాయనకు ఓ కొడుకు (ముఖేశ్ ఋషి), ఓ
మనుమడు గౌతమ్ నందన్ (పవన్ కల్యాణ్). ఇష్టం లేని పెళ్ళి చేసుకొని, వెళ్ళిపోయిన ఆత్మాభిమానవంతురాలైన
కూతురు సునంద (నదియా) ఎలాగైనా తన దగ్గరకు తెమ్మని ఆ ముసలాయన, మనుమణ్ణి కోరతాడు.
దాంతో, హీరో ఇటలీ నుంచి ఇండియాకు ప్రత్యేక విమానంలో, చుట్టూతా పది మంది నౌకర్లు,
చాకర్లతో వచ్చేస్తాడు. ఇక, అక్కడ నుంచి తన సహాయకులైన భాను (ఎమ్మెస్ నారాయణ) బృందం
వెంట రాగా, హీరో తన మేనత్త ఇంట్లో పాగా వేయడానికి ప్రయత్నిస్తాడు.
గుండెపోటుకు
గురైన మామయ్య శేఖర్ (రావు రమేశ్)ను సమయానికి కాపాడి, వాళ్ళ ఇంట్లోనే డ్రైవర్ గా
సిద్ధార్థ అలియాస్ సిద్ధూ అనే మారుపేరుతో చేరతాడు హీరో. అత్తయ్యకు ఇద్దరు కూతుళ్ళు
ప్రమీల (ప్రణీత), శశి (సమంత). ఓ పక్క వారితో స్నేహం సాగిస్తూనే, మరోపక్క వ్యాపారంలో
నష్టాల్లో ఉన్న అత్తయ్యను కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు. ఆ క్రమంలో హీరో తన
మేనల్లుడేననీ, తనను ఇటలీకి తీసుకువెళ్ళడానికే పని మిషతో తన ఇంట్లో చేరాడనీ సునంద
(నదియా) గ్రహించేస్తుంది. ఆ పప్పులేమీ తన వద్ద ఉడకవనీ తెగేసి చెబుతుంది. అక్కడికి
ఇంటర్వెల్ బ్యాంగ్.
ఇక,
సెకండాఫ్ లో ముందు పెద్దమ్మాయిని లైన్ లో పెట్టడం ద్వారా, పని సులువు
చేసుకోవాలనుకుంటాడు హీరో. తీరా ఆ అమ్మాయి వేరొకరిని ప్రేమిస్తున్నట్లు తెలిసి,
వారిద్దరినీ కలుపుతాడు. ఆ క్రమంలో ఫ్యాక్షనిస్టు సిద్ధప్ప (కోట శ్రీనివాసరావు)
లాంటి వాళ్ళతో కొట్లాడతాడు. ఆ తరువాత సాక్షాత్తూ రావు రమేశే, హీరోను ఇంట్లో నుంచి
వెళ్ళిపొమ్మంటాడు. అప్పుడిక హీరో, తన మేనత్త రెండో కూతురుతో ఏం చేశాడు, చివరకు కథ
ఎలా సుఖాంతమైందన్నది మిగతా సినిమా.
.....................................................
1 వ్యాఖ్యలు:
waiting for your review for last three days :)
thanks for posting!
Post a Comment