జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, December 10, 2011

నిజం చెబితే నేరమా?
‘శ్రీరామరాజ్యం’పై ఇష్టపదిలో రాసిన మూడు భాగాల సమీక్షపై వచ్చిన ప్రశంసలకు కానీ, విమర్శలకు కానీ వెంటనే స్పందించలేకపోయాను. సమీక్ష రాస్తున్న నాటికే ఉన్న పని ఒత్తిళ్ళు, అనారోగ్య సమస్యలు మరికొంత పెరగడంతో, తీరిక చేసుకొని తాపీగా స్పందించాలన్న ఆలోచన సఫలం కాలేదు. ఏమైనా, అందుకు ముందుగా మన్నించాలి. ఆ హడావిళ్ళ మధ్యనే ఈ నాలుగు మాటలు...


విషయానికి వస్తే, సినిమా చూశాక అందులో కనిపించిన, అనిపించిన తప్పొప్పుల గురించి మాట్లాడుకోవడం మామూలుగా ఎవరమైనా చేసే పనే. సినిమా గురించి సమీక్షిస్తున్నప్పుడు ఎవరైనా సరే తప్పనిసరిగా చేయాల్సిన పని. ఆ మధ్య తాజా ‘శ్రీరామరాజ్యం’ సినిమా గురించి ఈ ‘ఇష్టపది’ బ్లాగులో అదే చేశాను. కానీ, చిత్రంగా ఈ విషయానికి చాలా మందికి కోపాలు వచ్చాయి. కొందరేమో నన్ను, నా సమీక్షనూ దుమ్మెత్తి పోశారు. ఆవేశంతో ఊగిపోయిన వీరవరులేమో ఏకంగా వ్యక్తిగత జీవితాలపై విమర్శలకూ దిగారు. శ్రీరామరాజ్యం దర్శక, రచయితలకూ, హీరోకూ అపారంగా ఉన్న భక్త జనగణం ఎనానిమస్ గా ప్రచురణార్హం కాని వ్యాఖ్యలూ చేశారు.

సినిమా బాగోగుల మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పచ్చు. అందులో అందరి అభిప్రాయాలూ, అన్ని అభిప్రాయాలూ ఒకటేలా ఉండాలన్న రూలూ ఏమీ లేదు. ఏకీభవించడానికి ఎంత అవకాశం ఉందో, అవతలివారి అభిప్రాయంతో గౌరవపూర్వకంగానే విభేదించడానికీ అంతే స్వేచ్ఛ ఉంది. కానీ, విభేదించినంత మాత్రాన దూషణలు, దోషారోపణలు చేయడమన్నది వారి వారి సంస్కారానికి సంబంధించిన విషయం.

ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా ఆ చిత్రం మీద కానీ, ఆ చిత్రానికి పని చేసిన వారి మీద కానీ రాగద్వేషాలు లేకుండా సినిమాను సమీక్షించడం శాస్త్రీయమైన, సమర్థనీయమైన పద్దతి. అది ఎంత చక్కగా చేస్తే, అంత నిష్పాక్షికంగా సమీక్ష ఉంటుందనేది విజ్ఞులకు చెప్పనక్కరలేదు. శ్రీరామరాజ్యంపై ఈ సమీక్షకుడు ఇష్టపదిలో చేసిందీ అదే. పైగా, మన తెలుగు జాతికి కల్ట్ ఫిగర్లయిన బాపు - రమణలంటే గౌరవం, వారి సృజనాత్మక కృషి పట్ల అభిమానం, వారి స్నేహ సౌశీల్యాలతో సన్నిహిత పరిచయం ఉన్నా, వీలైనంత వరకు అవేవీ అవరోధం కాకుండా, శ్రీరామరాజ్యం సినిమాను సమీక్షించాలని ప్రయత్నించడం జరిగింది.

కానీ, ఫలానా వారి సినిమా కాబట్టి, ఫలానా తరహా (పౌరాణికం, జానపదం, వగైరా వగైరా) సినిమా కాబట్టి, ఫలానా కథాంశం మీద కాబట్టి ఎలా ఉన్నా సరే బాగుందనే అనాలంటే, ఇక దానిలో చర్చ లేదు. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలోని లోటుపాట్ల గురించి చేదు నిజాలు చెబితే, ఆ లోటుపాట్ల మీద మాట్లాడకుండా, నాకు నచ్చింది కాబట్టి, నచ్చలేదనడానికి నువ్వెవడివి అంటూ ఒళ్ళంతా కారం పూసుకొంటే చెప్పగలిగిందేమీ లేదు. తేటతెలుగులో తిట్టినా, తిట్టుకున్నా లాభం లేదు.


పాత్ర చిత్రణలోనైనా, చిత్రీకరణలోనైనా, సాంకేతికంగానైనా లోటుపాట్ల గురించి చర్చించుకొంటే, సినిమా మీద అవగాహన పెంచుకోవడానికి తోడ్పడుతుంది. అలా కాకుండా రాజుగారి దేవతా వస్త్రాల కథలో లాగా డూడూ బసవన్నలా ఉందామంటే.... ఏ సినిమా ఎలా ఉన్నా సూపర్ హిట్ అందామంటే.... పుంజాలు తెంపుకొని ఏ దర్శకుడికి, ఆ దర్శకుడికి, ఏ హీరోకు ఆ హీరోకు భట్రాజుల్లా వ్యవహరిద్దామంటే.... దానికి మళ్ళీ బ్లాగులెందుకు? ఇప్పటికే ఉన్న కొన్ని భజన పత్రికలు, చానళ్ళు చాలవా?


ఉన్నది ఉన్నట్లు చెప్పాలనే తప్ప, ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించాలన్నది నా ఉద్దేశం కాదు --- అది సమీక్షలు రాయడంలోనైనా..! పోస్టు వేయడంలోనైనా..! వ్యాఖ్యలు, ప్రశంసలు, విమర్శలు రాసినవాళ్ళకీ, రాళ్ళు విసిరిన వారికీ - అందరికీ కృతజ్ఞతలు.