జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, April 28, 2014

దైవం మానవ రూపంలో...

దైవం మానవ రూపంలో...
(మార్చి 3, 
సోమవారం,  
శ్రీరామకృష్ణ 
పరమహంస 
జయంతి)
 స్వామి
వివేకానంద
లాంటి ఎందరినో తన
ఉపదేశాలతో
 మహామహులుగా
తీర్చిదిద్ది మానవాళికి అందించారు రామకృష్ణ పరమహంస.
భక్తి, దైవం లాంటి ఎన్నో అంశాల గురించి సామాన్యులకు
 సైతం అర్థమయ్యేలా శతాబ్దిన్నర క్రితం ఆయన చెప్పిన
 మాటలు ఇవాళ్టికీ స్మరణీయాలు, ఆచరణీయాలు. వాటిలో కొన్ని....

ఉన్నాడు... అతడున్నాడు... 

అసలు దేవుడనేవాడున్నాడా? ఉంటే మనం
చూడలేకపోతున్నామేం? అని చాలామంది అంటూ
 ఉంటారు. నిజమే. మామూలు చూపుతో దేవుణ్ణి
చూడలేకపోతున్నాం. కానీ, అంతమాత్రాన ఆయన
లేడని చెప్పవచ్చా? దీనికో చిన్న ఉదాహరణ.
రాత్రివేళ మనకు నక్షత్రాలు కనిపిస్తున్నాయి. కానీ,
పగటిపూట అవేవీ కనిపించవు. అంతమాత్రాన
అసలు అవి లేవని భావమా? అజ్ఞానంతో,
సంకుచిత దృష్టితో చూస్తే, మనం దేవుణ్ణి చూడలేం.
అంతమాత్రాన దేవుడు లేడనీ, ఆయన అవసరమే
 లేదనీ అంటే శుద్ధ తప్పు.

పిలిస్తే పలుకుతాడు: 

ఏకకాలంలో అటు సగుణుడూ, ఇటు నిర్గుణుడూ,
అటు నానారూపధారి, ఇటు ఏ విధమైన రంగూ
రూపం లేనివాడూ భగవంతుడు. ఏ మతమైతే
ఏమిటి? ఏ మార్గమైతే ఏమిటి? అందరూ
ఆ ఒకే ఒక్క భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. కాబట్టి,
ఏ మతాన్నీ, మార్గాన్నీ ద్వేషించకూడదు.
కించపరచకూడదు. కులం, మతం ఏదైనా
సరే, ఎవరైనా, ఎలాగైనా ఆ దేవదేవుణ్ణి పిలవచ్చు.
మనస్ఫూర్తిగా, హృదయాంతరాళంలో నుంచి
 పిలిస్తే చాలు... ఆయన నిశ్చయంగా
పలుకుతాడు. దర్శనమిస్తాడు.

మరి, అలాంటప్పుడు తీర్థయాత్రలు
చేయడం, మెడలో మాలలు ధరించడం
మొదలైన ఆచారాలన్నీ ఎందుకని
ఎవరికైనా సందేహం రావచ్చు.
ఆధ్యాత్మిక జీవిత ప్రారంభంలో అవన్నీ
 అవసరం. అయితే, జిజ్ఞాసువులు క్రమంగా
బాహ్యాడంబరాలన్నిటినీ దాటుకొని వస్తారు.
అప్పుడిక కేవలం భగవన్నామ జపం,
స్మరణ, చింతనే మిగులుతాయి.

అందరూ ఆయనే ... 

వయస్సు ఎంత మీద పడ్డా, కుటుంబం మీద,
కుటుంబ సభ్యుల మీద మమకారం,
ఈ బంధాల పట్ల వ్యామోహం పోనివారు
ఎంతోమంది ఉంటారు. తీర్థయాత్రకు వెళ్ళినా
వారి ధ్యాస అంతా ఇంట్లో ఉన్న పిల్లల మీదే.
అలాంటివాళ్ళు తమ బిడ్డలు, మనుమలు,
మనుమరాళ్ళనే సాక్షాత్తూ దైవస్వరూపులని
భావించడం మొదలుపెట్టాలి. అప్పుడు మనుమరాలి
 మీద ప్రేమ అంతా ఆ దేవి మీద భక్తిగా మారుతుంది.

పిల్లను ఆడిస్తున్నా, అన్నం పెడుతున్నా, చివరకు
నుదుట బొట్టు పెడుతున్నా అంతా ఆ అమ్మవారికే
 చేస్తున్నానని ఊహించుకోవాలి. దాని వల్ల
ఇంట్లోనే ఉన్నప్పటికీ, దైవ సాన్నిధ్యంలో
ఉన్న భావన, లాభం కలుగుతాయి. అందుకే,
తల్లి, తండ్రి, బిడ్డ, స్నేహితులు - ఇలా ఎవరినీ
 ప్రేమించినా సరే, ఆ వ్యక్తి సాక్షాత్ భగవత్
స్వరూపమేననీ, దేవుడి అవతారమేననీ
అనుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఎంతో సులభమైన ఈ మార్గం మన
 మనస్సునూ, జీవితాన్నీ
 మాలిన్య రహితం చేసుకొనేందుకు
ఉపకరిస్తుంది.

 - డా॥ రెంటాల జయదేవ

............................................................

Saturday, April 26, 2014

‘‘నా తప్పేమీ లేదు. ఈ వివాదం అతని పనే!’’ - ప్రకాశ్‌రాజ్



 ‘‘ఒక మనిషిని అసభ్యంగా తిట్టడం నా ప్రవృత్తి కాదు. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఉంది. ఏ నిర్మాతలు, ఎవరైతే నా గురించి ఫిర్యాదు ఇచ్చారో, వాళ్లని పిలిపించండి. జరిగినది మొత్తం వాళ్ల ముందే నేను వివరిస్తాను. మొత్తం విన్న తర్వాత ఎవరు తప్పు చేశారో నిర్ణయించండి’’ నటుడు, దర్శక, నిర్మాత ప్రకాశ్‌రాజ్ వాదన ఇది. శుక్రవారం నాడు మధ్యాహ్నం ఆయన ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొద్ది రోజులుగా తన మీద వినిపిస్తున్న వివాదాలకూ, మీడియాలో వస్తున్న వార్తలకూ వివరణనిచ్చారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పుకొచ్చారు. మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న ‘ఆగడు’ చిత్ర షూటింగ్ సందర్భంగా దర్శకత్వ శాఖలో సూర్య అనే ఓ కో-డెరైక్టర్‌ను ప్రచురించడానికి వీలు లేని భాషలో దూషించారంటూ ప్రకాశ్ రాజ్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ వివాదంపై ‘తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘా’నికి సదరు కో-డెరైక్టర్ నుంచి ఫిర్యాదు అందడం, దానిపై ప్రకాశ్‌రాజ్ నుంచి వివరణ కోరుతూ ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా)కు సంఘం లేఖ రాయడం, పది రోజుల పైనే అయినా ప్రకాశ్‌రాజ్ వివరణ రాకపోవడంతో ఆయనను సినిమాల్లోకి తీసుకోవద్దంటూ దర్శకుల సంఘానికి చెందిన ఒకరిద్దరు తమ ఆంతరంగికులకు వ్యక్తిగతంగా ఎస్.ఎం.ఎస్.లు పెట్టడం, వ్యవహారం మీడియాకు పొక్కడం.... ఇలా కొద్ది రోజులుగా ఈ వ్యవహారం చినికి చినికి గాలివాన అయింది.

 శ్రీను వైట్లతో విభేదాలు నిజమే!


 ప్రకాశ్‌రాజ్ స్వీయ దర్శకత్వంలోని సొంత సినిమా ‘ఉలవచారు బిర్యానీ’కి కూడా చిక్కులు తప్పవని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ ఇలా విలేకరుల ముందుకు వచ్చి మాట్లాడుతూ, ‘‘ఈ అన్నిటి వెనకా ఓ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని బయటకు తీసుకువస్తా. ఆ వ్యక్తి తాను చేసిన తప్పును దాచుకోవడానికీ,  తాను తప్పించుకోవడానికీ, ముగ్గురు నలుగురితో రకరకాల ఫిర్యాదులు ఇప్పించాడు. పరిశ్రమలో ఒకరి మీద మరొకరికి అపార్థాలు ఏర్పడేలా చేశాడు. ఆ వ్యక్తి ఎవరో త్వరలోనే బయటికి వస్తుంది. ఆ తర్వాత నిజమేంటో తెలుస్తుంది. అప్పటివరకు దయచేసి సినిమాని ప్రేమించే, నన్ను ప్రేమించే ప్రేక్షకులు ఊహాగానాలు నమ్మకండి’’ అని అభ్యర్థించారు.     ‘‘ ‘మా’కు వచ్చిన ఫిర్యాదులను వారు నాకు పంపిస్తే, సమాధానం ఇచ్చాను. ‘మా’కూ, దర్శకుల సంఘానికీ మధ్య ఇంకా వ్యవహారం తేలలేదు కాబట్టి, నేను బహిరంగంగా నా అభిప్రాయాన్ని తెలియజేయలేదు. కానీ, అది ఆలస్యమవుతున్న నేపథ్యంలో ‘నిషేధం’ అంటూ రకరకాల గాలివార్తలు వస్తుండడంతో ఈ సమావేశం ఏర్పాటు చేశా’’ అని ఆయన చెప్పారు.

 అయితే, తనకూ, ‘ఆగడు’ చిత్ర దర్శకుడు శ్రీను వైట్లకూ మధ్య కథాపరంగా సృజనాత్మక అంశాల్లో ‘‘కొన్ని అభిప్రాయభేదాలు వచ్చాయి’’ అని ఆయన ఒప్పుకున్నారు. ‘‘ఒకరినొకరు మాట అనుకున్నాం. కానీ, దాన్ని వక్రీకరించి ఫిర్యాదు చేశారు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘ఇప్పుడు మీరు నన్ను చెంప మీద కొడితే, నేను వెంటనే కొట్టాను. నేను కొట్టానని ఫిర్యాదు చేసినప్పుడు, ఎందుకు కొట్టానో సంబంధిత వ్యక్తులు అడగాలి కదా. నన్ను నమ్మండి. నేను ఏ తప్పూ చేయలేదు.  ‘మా’ మీద నాకు నమ్మకం ఉంది. నాకు న్యాయం జరుగుతుంది’’ అని అన్నారు.

 నా వివరణ కూడా వినాలిగా!


 ‘ఆగడు’ షూటింగ్‌లో ప్రకాశ్‌రాజ్ ఓ రోజు పాల్గొని, ఆ తర్వాత గైర్హాజరయ్యారనీ, దాంతో ఆయన స్థానంలో దర్శక - నిర్మాతలు సోనూ సూద్‌ను తీసుకున్నారనీ తెలిసిందే. ప్రకాశ్‌రాజ్ దానికి కూడా వివరణనిస్తూ, ‘‘ ‘ఆగడు’ సినిమా నేను అంగీకరించిన విషయం నిజమే. మొదటి రోజు షూటింగ్‌లో పాల్గొని, నా మీద తీసిన అన్ని సన్నివేశాల్లో నటించాను. ఆ తర్వాత కొన్ని అభిప్రాయభేదాల కారణంగా నన్ను కాదనుకొని వేరే నటుణ్ణి తీసుకున్నారు. ఏ నటుడైనా తనకు కావాల్సినట్లుగా నటించకపోతే ఏ దర్శకుడికైనా వేరే నటుణ్ణి ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. అది నేను ఒప్పుకుంటాను. కానీ, అంతటితో ఆగకుండా దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేయడం, నా మీద చర్య తీసుకోవాలని అనుకోవడం బాధాకరం’’అన్నారు. ‘‘ఇరవై ముప్ఫయేళ్లుగా పరిశ్రమలో ఉంటున్నాను కాబట్టి, ఒక  ఫిర్యాదు వచ్చినప్పుడు నా అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం సదరు అసోసియేషన్‌కి ఉంటుంది. తప్పొప్పులను చెప్పుకునే హక్కు నాకుంటుంది. నా వివరణ కూడా విన్న తర్వాత ఎవరు తప్పో, ఎవరు కరెక్టో నిర్ణయించుకోవాలి. కానీ, చాలా ఆవేశంగా ఇచ్చిన ఓ ఫిర్యాదుని నమ్మి, నాకు సహాయ నిరాకరణ చేయాలని ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపించడం బాధ కలిగించింది’’ అని గతంలో కూడా అనేక వివాదాలకు కేంద్రబిందువైన ప్రకాశ్‌రాజ్ అభిప్రాయపడ్డారు.


 మీద విసిరిన రాళ్ళతో ఇళ్ళు కట్టేస్తా!

 ‘‘ఈ రోజు నేను మీ ముందు ఉన్నానంటే నా చదువో, అవగాహనో, ప్రతిభో కారణం కాదు. ఇలా చెప్పడానికి నేనే మాత్రం సిగ్గుపడటంలేదు. దర్శకులు, రచయితలు, నిర్మాతలే కారణం. నేను సినిమా కన్నా పెద్దవాణ్ణి కాదు. నా వివరణ తెలుసుకోకుండా ‘వీడు కచ్చితంగా తప్పు చేసి ఉంటాడని’ అని నమ్మడం మాత్రం బాధగా ఉంది’’ అన్న ప్రకాశ్‌రాజ్ ‘‘ముక్కుసూటిగా మాట్లాడటంవల్ల ఇబ్బందులపాలయ్యాను. నేను చూసినన్ని నిషేధాలు ఎవరూ చూసి ఉండరు.  నా ఇంటి పేరు వివాదం’’ అని నవ్వేశారు. ‘‘నన్ను రాళ్లతో కొట్టకు... పట్టుకుని ఇళ్లు కట్టేస్తా! నన్ను కాల్చేయాలని నిప్పు పెట్టకు... ఇంటికి దీపం చేసుకుంటా! నన్ను ఇండస్ట్రీ నుంచి తరిమేయాలనుకోకు... నేను చేరాల్సిన చోటుకు త్వరగా చేరిపోతా! దయచేసి చెబుతున్నా నన్ను చంపాలని విషం పెట్టకు... మింగి, నీలకంఠుణ్ణి అయిపోతా!’’ అంటూ కవితాత్మక ధోరణిని ప్రదర్శించారు.  

‘‘ఫిర్యాదు ఇచ్చినవారి వివరణ, నా వివరణ విన్న తర్వాత ఎవరిది తప్పు అనేది కమిటీ నిర్ణయిస్తుంది.  కొంత విరామం తర్వాత ‘ఉలవచారు బిర్యానీ’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నా. ఆ సినిమా తాలూకు పనులను ఎంతో ప్రశాంతంగా చేసుకుంటున్నా. ఈ సమయంలో ఇలా వివాదం రావడం నన్ను డిస్ట్రబ్ చేస్తోంది. కొన్నిరోజులు ఓపిక పట్టండి. నిజమేంటో బయటికొస్తుంది’’ అని ముక్తాయించిన ప్రకాశ్ రాజ్ ఈ వివాదానికి కారణమైన వ్యక్తి పేరును వెల్లడించడానికి సుముఖత చూపలేదు. ఈ నెల 28న వివిధ సంఘాల ప్రతినిధులతో కూడిన ‘సమన్వయ సంఘం’ సమావేశంలో ఈ వివాదం తేలనుంది.కాగా, మీడియా ముందు తాను చెప్పదలుచుకున్నదేదో చెప్పేసిన ప్రకాశ్‌రాజ్ విలేకరులు అడిగే ప్రశ్నలకు మాత్రం అవకాశమివ్వకుండా గబగబా వెళ్లిపోవడం విచిత్రం

..........................

‘‘ప్రకాశ్‌రాజ్ అనుచిత వ్యాఖ్యల విషయమై కోడెరైక్టర్ సూర్య రెండు వారాల క్రితం దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ కోరమని మేం నటీనటుల సంఘానికి లేఖ రాశాం. నిన్ననే ‘మా’ నుంచి ప్రతిస్పందన వచ్చింది. ఈ నెల 28న జరిగే కోఆర్డినేషన్ మీటింగ్‌లో ఇరువురి వాదనల విన్నాక నిర్ణయం వెలువడుతుంది. అంతేకానీ మేం ప్రకాశ్‌రాజ్‌పై నిషేధం విధించాల్సిందిగా అడిగామనడం అబద్ధం. నిషేధం మా పని కాదు. పరిశ్రమ అంతా కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం అది’’.

 - వీరశంకర్, దర్శకుల సంఘం అధ్యక్షులు

.....................

(Published in 'Sakshi' daily, 26th April 2014, Sat)

Thursday, April 24, 2014

సినీ కళా పూర్ణోదయ కర్తకు ఎనిమిది పదులు



నభై రెండేళ్ల తెలుగు సినీ ప్రస్థానంలో కొన్ని వందల మంది నిర్మాతలు, వేలకొద్దీ సినిమాలు వచ్చాయి. కానీ, జాతీయంగా, అంతర్జాతీయంగా తెలుగు సినిమా కీర్తిని వ్యాపింపజేసిన నిబద్ధత గల నిర్మాతలు, సినిమాల సంఖ్య మాత్రం కొద్దే. ముఖ్యంగా, తెలుగు సినిమా కమర్షియల్ ఫార్ములా బాట పట్టిన 1970, ’80లలో అలాంటి అరుదైన మంచి చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకోవడం ఆషామాషీ విషయం కాదు. ‘శంకరాభరణం’ లాంటి ఆణిముత్యాలతో ఆ ఘనతను అందుకున్న అరుదైన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. కాకినాడ కాలేజీ రోజుల్లోనే ‘ఇన్‌స్పెక్టర్ జనరల్’ లాంటి నాటకాలు ప్రదర్శించి, హీరో అవుదామని సినీ రంగానికి వచ్చిన కళాప్రియుడు ఏడిద. డబ్బింగ్ కళాకారుడిగా, తరువాత చిన్నాచితకా వేషాల ఆర్టిస్టుగా ప్రయత్నించిన ఆయన నిర్మాతగా స్థిరపడినప్పుడూ ఆ కళాభిరుచిని వదులుకోకపోవడం విశేషం. నిర్మాతగా ఆయన తీసినవి పట్టుమని పది చిత్రాలే.
 
  ‘పూర్ణోదయా మూవీ క్రియేషన్స్’ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా తెలుగు సినిమా తల్లికి పదికాలాలు నిలిచే పట్టు చీరల్లాంటి సినిమాలు కట్టబెట్టారు. ఏ దేశం వెళ్ళినా, ఇవాళ తెలుగువారు సగర్వంగా చెప్పుకొనే ‘శంకరాభరణం’ (’80), ‘సాగర సంగమం’ (’83), ‘స్వాతిముత్యం’ (’86) లాంటి కళాఖండాలు నిర్మాతగా ఆయన అభిరుచిని పదుగురికీ పంచాయి. ప్రేక్షకుల అభిరుచిని పెంచాయి. మన సినిమాకు ప్రశంసలు, పురస్కారాలు తెచ్చాయి. 



నిర్మాతగా తాను ఇంతటి కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించడానికి దర్శకుడు కె. విశ్వనాథ్, రచయిత జంధ్యాల లాంటి ఎంతోమంది సృజనశీలురు కారణమని ఆయన ఎప్పుడూ నిజాయితీగా నమ్రతతో చెబుతుంటారు. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి సినీ అవార్డుల కమిటీ సభ్యుడిగా వివిధ హోదాల్లో పనిచేసి, ప్రస్తుతం చిత్ర నిర్మాణానికి దూరంగా విశ్రాంతి జీవితం గడుపుతున్నారాయన. వయోభారం ఇబ్బంది పెడుతున్నా, చెన్నై, హైదరాబాద్‌ల మధ్య తిరుగుతూ, ఇప్పటికీ ముఖ్యమైన సినీ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సినిమా పట్ల తరగని ఆయన ప్రేమకు దర్పణం. ఇవాళ్టితో 80 ఏళ్లు పూర్తి చేసుకొన్న ఈ సినీ కళాపూర్ణోదయ కర్తకు శుభాకాంక్షలు.

(Published in 'Sakshi' daily, 24th April 2014, Thursday)
...................................

Tuesday, April 22, 2014

అక్కడ వెలిగిన ఇక్కడి మణిదీపం- ‘సర్’ సి.వై. చింతామణి

అక్కడ  వెలిగిన ఇక్కడి మణిదీపం
 సందర్భం

 ‘సర్’ సి.వై. 

చింతామణి 
జయంతి

 ఇవాళ సర్ సి.వై.
చింతామణి
అన్న పేరు
చెబితే,
నవ తరం
రాజకీయ నాయకుల్లో కానీ,
పత్రికా రచయితల్లో కానీ
గుర్తుపట్టగలిగేవాళ్ళు చాలా
కొద్దిమంది. నిష్ఠూరంగా అనిపించినా అది నిజం.
బ్రిటిషు పాలనా కాలంలో ఇరవయ్యో శతాబ్దపు తొలి
 మూడు దశాబ్దాలలో
జాతీయ స్థాయిలో ఇంగ్లీషు పత్రికా రంగంలో కలం
యోధుడిగా వెలిగిన తెలుగు బిడ్డ - చిర్రావూరి యజ్ఞేశ్వర
చింతామణి. పట్టుమని
పద్ధెనిమిదేళ్ళు నిండకుండానే ఓ పత్రికకు సంపాదకుడైన
 ప్రతిభాశాలి.

 ఆంధ్రదేశం నుంచి అలహాబాద్‌కు వెళ్ళి, ‘లీడర్’ పత్రికకు చీఫ్
ఎడిటర్‌గా అక్కడ స్థిరపడి,
సుమారు 29 ఏళ్ళు సంపాదకత్వం వహించి, జాతీయ
 ప్రముఖుడయ్యారాయన. అటు
 పత్రికా రంగంతో పాటు ఇటు ప్రజాసేవలోనూ పేరు
సంపాదించుకొన్నారు. కాంగ్రెస్
నుంచి బయటకు వచ్చిన మితవాదులంతా కలసి పెట్టిన ‘
లిబరల్ పార్టీ’లో ఆయన
వ్యవస్థాపక సభ్యుడు. 1930లలో లండన్‌లో జరిగిన తొలి
‘రౌండ్ టేబుల్ సమావేశం’లో
 ఆయన ప్రతినిధి. అప్పటి సంయుక్త పరగణాల
(తరువాతి కాలంలో ఉత్తర ప్రదేశ్)
రాష్ట్రంలో ప్రజాహితానికి పాటుపడ్డ తొలి తరం నేత.

 పౌరోహిత్యం వదిలి పత్రికా రచనకు...

 దేశభక్తి, జాతీయతావాదం పుష్కలంగా ఉన్న ఆయనది
విజయనగరం ప్రాంతం. 1880 ఏప్రిల్ 10న తెలుగు
నూతన సంవత్సరాది నాడు చింతామణి జన్మించారు.
 విజయనగరం ఆస్థానంలో రాజపురోహితులైన తాతలు,
తండ్రుల లానే చింతామణి
 కూడా పురోహితులు అవుతారని అందరూ అనుకున్నారు.
అయితే, యువరాజా సూచనతో, విజయనగరం మహారాజా
కాలేజ్‌లో ఇంగ్లీషు చదువు చదువుకోగలిగారు.
చదువుకొనే రోజుల్లోనే పత్రికలకు వ్యాసాలు రాశారు
చింతామణి. అనారోగ్యంతో ఎఫ్.ఎ.
పరీక్ష తప్పినా, రచనా సామర్థ్యంతో విశాఖపట్నంలో
‘వైజాగ్ స్పెక్టేటర్’కు ఎడిటరయ్యారు.
దాన్ని విజయనగరానికి తరలించి ‘ఇండియన్ హెరాల్డ్’గా
నడిపారు. పత్రికకు అక్షరాలు
 కూర్చే ఫోర్‌మన్ నుంచి ప్రూఫ్ రీడర్, రిపోర్టర్,
సబ్ ఎడిటర్, మేనేజర్, ఎడిటర్ దాకా
 అన్నీ ఆయనే!

తర్వాత మద్రాసుకు మారి, ‘మద్రాస్ స్టాండర్డ్’లో పని చేశారు. అక్కడ నుంచి
అనూహ్యంగా అలహాబాద్ చేరి, మదన్ మోహన్ మాలవ్యా స్థాపించిన ‘లీడర్’కు
 యువ సంపాదకుడయ్యారు. ముక్కుసూటి రాతలతో అత్యుత్తమ పత్రికల్లో
ఒకటిగా ‘లీడర్’ను తీర్చిదిద్దారు. వితంతువును పెళ్ళి చేసుకొని, సంచలనం రేపారు.

 రాజకీయాల్లో రాణింపు

 కాంగ్రెస్ వాదిగా మొదలైన ఆయన ఆనక గాంధీ గారి సహాయ నిరాకరణ,
శాసనోల్లంఘన ఉద్యమాలతో విభేదించి, మితవాదిగా వేరే దారి చూసుకున్నారు.
అయినప్పటికీ గాంధీ, నెహ్రూతో సహా నాటి నేతలంతా చింతామణిని అభిమానించే
వారు, గౌరవించేవారు. అలాగే, 1927 - ’36 మధ్య ఆయన ఇటు ‘లీడర్’కు చీఫ్
ఎడిటర్‌గా ఉంటూనే, మరోపక్క యు.పి. లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేతగా
ప్రత్యర్థుల వాదనల్ని చెండాడేవారు. దశాబ్దాల తరబడి ఉత్తరాదిన ఉన్నా,
ఆయనకు హిందీ రాదంటే ఆశ్చర్యం.

 విధి నిర్వహణలో విలువలు!

 ‘భారతీయ జర్నలిజానికి పోప్ లాంటి వాడు’ అని వి.ఎస్. శ్రీనివాస శాస్త్రి లాంటి
 ఆనాటి ప్రముఖుల ప్రశంసలను అందుకున్న ఉత్తమ జర్నలిస్టు చింతామణి.
పత్రికా స్వాతంత్య్రంలో ఆయన రాజీపడేవారు కాదు. ఆయనకూ, పత్రిక బోర్డ్
ఆఫ్ డెరైక్టర్లలో ఒకరైన పండిట్ మోతీలాల్ నెహ్రూకూ మధ్య ఓ అభిప్రాయ
భేదం వచ్చింది. అయినా, చింతామణి మాత్రం తాను నమ్మిన విలువలకే
కట్టుబడ్డారు. దాంతో, చివరకు మోతీలాల్ నెహ్రూయే పత్రిక నుంచి పక్కకు
తప్పుకోవాల్సి వచ్చింది.

పత్రికా నిర్వహణలో దేశ హితానికే పెద్ద పీట వేస్తూ, వ్యక్తిగత స్నేహాన్నీ,
వ్యక్తుల పట్ల తనకున్న గౌరవాన్నీ కూడా పక్కనపెట్టి పనిచేయడం జర్నలిస్టుగా
 చింతామణిలోని విశిష్టత. కొత్తగా జర్నలిజమ్ వృత్తిలోకి వచ్చినవారిని
ప్రోత్సహించడం, తప్పు చేసినప్పుడు మందలించినా, జూనియర్ల ప్రతిభను
బాహాటంగా ప్రశంసించడం ఆయనలోని గొప్పదనం. తన కింది స్థాయి
ఉద్యోగులను సైతం ‘నా జర్నలిస్టు సహచరుడు’ అని పరిచయం చేయడం,
ప్రస్తావించడం చింతామణిలోని సంస్కారం.

 ఆఖరి రోజు దాకా అదే అంకితభావం

‘సర్’ బిరుదాన్నిచ్చి, ఆయనను కొనేయగలమని అప్పటి బ్రిటిషు
ప్రభుత్వం అనుకుంది. మిత్రుల బలవంతం మీద ఆ సత్కారాన్ని
అంగీకరించిన చింతామణి మాత్రం తన విలువలను వదులుకోలేదు.
అక్షరాన్ని కొనడం అసాధ్యమని నిరూపించారు. అరడజను అనారోగ్య
సమస్యలతో బాధపడుతున్నా, ఆయన రోజూ దాదాపు 18 నుంచి 20
గంటలు పని చేసేవారు. చనిపోయే ముందు చివరి రెండేళ్ళు అనారోగ్యం
ఎక్కువై బాధపడ్డ చింతామణి అంత అనారోగ్యంలోనూ ఏనాడూ పని
 చేయడం ఆపలేదు. చనిపోయే రోజు (1941 జూలై 1) కూడా
సంపాదకీయం స్వయంగా ఆయన రాసినదే!

ఈ కలం యోధుడి మరణానికి చింతిస్తూ, నివాళులర్పించని జాతీయ
పార్టీలు, పత్రికలు లేవు. అలహాబాద్ వెళితే, అడిగి మరీ ‘సి.వై.
చింతామణి రోడ్’కు వెళ్ళండి. తెలుగు వాడి అక్షర కీర్తికి జయపతాకైన
ఆ రోడ్డులో వెళుతుంటే, సాటి తెలుగువారిగా ఛాతీ ఉప్పొంగుతుంది.
 - రెంటాల జయదేవ

...................................................................

Sunday, April 20, 2014

‘ఇది నాకు కూడా ఓ సవాల్’ - నాగార్జున

 ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షో ద్వారా  డ్రాయింగ్ రూమ్‌లో వీక్షకులను పలకరించనున్న నాగార్జున కార్యక్రమంలో భాగంగా విలేకరులు సంధించిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాల్లో కొన్ని...

- ఇది నాకు కొత్త అవతారం. అయితే.. ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ ద్వారా అమితాబ్ వేసిన ముద్ర చెరిగిపోయేది కాదు. ఆయన అంత కాకపోయినా... ఆయన దరిదాపులకు వెళ్లేలా ప్రయత్నం చేస్తా. ఈ కార్యక్రమం ఓ విధంగా నాకు కూడా సవాల్. దీన్ని చేయడం అంత తేలికైన విషయం కాదని ఒప్పుకున్న తర్వాత తెలిసింది. ప్రస్తుతం ప్రాక్టీస్‌లో ఉన్నా.
 
- ప్రముఖుల కన్నా... సామాన్యులకే ఈ కార్యక్రమం విషయంలో పెద్ద పీట వేయడం జరుగుతుంది. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా మేం సూచించే టోల్ ఫ్రీ నంబర్‌ల ద్వారా, ఇంటర్‌నెట్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తాం. అడపాదడపా సెలబ్రిటీలు కూడా పాల్గొంటారు. అయితే... అదంతా చారిటీలో భాగం మాత్రమే.



- ఈ కార్యక్రమం నాకు ప్లస్ అవుతుందా, నేను ఈ కార్యక్రమానికి ప్లస్ అవుతానా అంటే... అది పరస్పరం ఉపయోగకరం. చేసేవాణ్ణి, చూసేవాణ్ణి కూడా పూర్తిగా లీనం చేసుకునే కార్యక్రమం ఇది. దీని ద్వారా నా సొంత శైలిని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తా.

- నాన్నకు అమితాబ్ అంటే చాలా ఇష్టం. చాలా విషయాల్లో ఆయనను మెచ్చుకునేవారు. ఈ రోజు మన మధ్య లేకపోయినా... పై నుంచి నాన్న ఆశీస్సులు నాకు ఉంటాయి. టీవీలో ఈ గేమ్ షో ప్రసారం ఎప్పుడు మొదలవుతుందా అని నేను కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాను

(Published in 'Sakshi' daily, 19th April 2014, Saturday0
.......................................................

అమితాబ్ బాటలో... బుల్లితెరపై నాగ్

ప్రముఖ నటుడు నాగార్జున బుల్లితెరపై మెరవనున్నారు. 28 ఏళ్ల సినీ ప్రస్థానం తర్వాత ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షో ద్వారా  డ్రాయింగ్ రూమ్‌లో వీక్షకులను పలకరించనున్నారు. జూన్ మొదటివారం నుంచి ‘మా’ టీవీలో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.
 

హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో ఇప్పటికే విజయవంతమైన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఫార్ములాతోనే ఈ గేమ్ షో రూపొందుతోంది.  రూపొందుతోంది. ఇప్పటి వరకు తెలుగు చానల్స్‌లో వచ్చిన గేమ్ షోలకు భిన్నంగా, ప్రయోజనాత్మకంగా ఈ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ను నిర్మిస్తున్నట్లు  ‘మా’ టీవీ యాజమాన్యం నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్ పేర్కొన్నారు.
 
శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ షో పరిచయ కార్యక్రమంలో ‘మా’ టి.వి. చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ, ‘‘సమాజంలో, ముఖ్యంగా గత నాలుగైదేళ్ళలో చాలా బాధలు పడ్డాం. ప్రతికూల భావనలు ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో మానవీయంగా ఉంటూ, మారుమూల ప్రాంతపు మనిషి కూడా జీవితంలో గెలుపు సాధించి, మరెంతో మందికి ప్రేరణనివ్వడం కోసమే ఈ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చేపట్టాం’’ అని పేర్కొన్నారు.
 

 ఈ గేమ్ షోకు నాగార్జునను హోస్ట్‌గా ఎంచుకోవడంపై ఆయన వివరణనిస్తూ, ‘‘చాలా ఏళ్ళుగా నాగ్ నాకు స్నేహితుడు, సన్నిహితుడు. అయితే, ఈ షోకు దాదాపు 37 - 38 మంది స్టార్లను అనుకున్నా, చివరకు నాగార్జునే సరైన వ్యక్తి అని నిర్ధారణకు వచ్చాం. ఆ రకంగా ఆ వడపోతలన్నీ దాటుకొని నాగార్జున ఈ హోస్ట్ హోదాను తనకు తాను సంపాదించుకున్నారే తప్ప మాకు మేము ఇచ్చింది కాదు’’ అని చెప్పారు. ‘ఆరేళ్ళ క్రితం ‘మా’ టి.వి.ని చేపట్టిన మేము ఓ సవాలుగా తీసుకొని, ఈ ‘మట్టిలోని మాణిక్యాన్ని’ సానబెట్టి, అందమైన రత్నంగా తీర్చిదిద్దాం. ఇవాళ తెలుగులోని సర్వజన వినోదాత్మక టీవీ చానళ్ళ (జి.ఇ.సి)లలో నంబర్ వన్ స్థానానికి తీసుకురాగలిగాం. దీనికి మా సంస్థలో పని చేసిన, చేస్తున్న ఉద్యోగుల కృషే కారణం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.


‘‘కొద్ది నెలలుగా ప్రథమస్థానంలో నిలిచిన ‘మా’ చానల్‌ను ఆ స్థానంలో సుస్థిరంగా నిలబెట్టేందుకు చేస్తున్న విశిష్టమైన కార్యక్రమమే ఈ తాజా గేమ్ షో. ఈ ఆరేళ్ళలో ‘మా’ టి.వి. నిర్వహణలో నేర్చుకున్న మేనేజ్‌మెంట్ పాఠాలను అవ్యవస్థీకృతంగా ఉన్న మన సినీ రంగంలో కూడా అమలు చేయాలని భావిస్తున్నాను’’ అని ‘మా’ టి.వి. బోర్డు డెరైక్టర్లలో ఒకరైన నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. నాగార్జున మాట్లాడుతూ -‘‘ఇంతకాలం సినిమాలతో మిమ్మల్ని అలరించిన నేను బుల్లితెరవైపు ఎందుకు దృష్టిసారించాను? అనే ప్రశ్న మీ అందరికీ కలగొచ్చు.
 

సామాన్యులతో సహా ప్రతి ఒక్కరికీ కలలుంటాయి. వాటిని నిజం చేసుకోవాలని ఉంటుంది. దాన్ని నెరవేర్చడానికే నేను ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మారాను. అయితే... ఈ భారాన్ని మోయడం అంత తేలికైన విషయం కాదు. నిద్రపోతుంటే కలలో కూడా ప్రశ్నలు, సమాధానానే వినిపిస్తున్నాయి’’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అమల, ఈ గేమ్ షో రూపకర్తల బృందమైన సిద్దార్ధబసు, అనిత బసు, షెనాయ్ తదితరులు పాల్గొన్నారు.
 

(Published in 'Sakshi' daily, 19th April 2014, Saturday)
..................................

Friday, April 18, 2014

ఈ వయసులో కొత్త ఉత్సాహం ఈ అవార్డు - సీనియర్ సినీ జర్నలిస్ట్ నాదెళ్ళ నందగోపాల్


‘‘ఎనభయ్యేళ్ళ వయసులో నాకు మళ్ళీ నూతనోత్సాహాన్నిచ్చిన అవార్డు ఇది’’ అని సీనియర్ సినీ జర్నలిస్టు నాదెళ్ళ నందగోపాల్ వ్యాఖ్యానించారు. అయిదేళ్లు శ్రమించి, ‘సినిమాగా సినిమా’ అంటూ ఆయన చేసిన రచన ‘ఉత్తమ సినీ గ్రంథం’గా జాతీయ అవార్డుకు ఎంపికైంది. బుధవారం సాయంత్రం ఈ అవార్డు ప్రకటన వెలువడిన వెంటనే కలసిన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ, ఆయన తన స్పందనను తెలిపారు. మరో 2 తెలుగు సినీ గ్రంథాలతో సహా, దేశం నలుమూలల నుంచి వచ్చిన 43 ప్రముఖుల రచనల మధ్య పోటీలో నందగోపాల్ ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం. ‘‘ఇంత పోటీలో, ఇందరు హేమాహేమీల మధ్య నాకు అవార్డు రాదేమో అని అనుకున్నా.
 
 కానీ, న్యాయం జరిగింది. నిష్పక్షపాతంగా అవార్డు ఎంపిక చేశారు’’ అని నందగోపాల్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి నుంచి మన తెలుగు దాకా సినీ పరిశ్రమలోని వివిధ సాంకేతిక విభాగాల పరిణామాన్నీ, ప్రస్థానాన్నీ ఈ 424 పేజీల గ్రంథంలో స్థ్థూలంగా వివరించారాయన. ‘‘పుణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేసిన ‘ఫిల్మ్ ఎప్రీసియేషన్’ కోర్సు, ఇరవయ్యేళ్ళ పైగా వివిధ జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు హాజరైన అనుభవం, తొమ్మిదిన్నరేళ్ళ సెన్సార్ బోర్డు సభ్యత్వం - ఇవన్నీ ఈ రచనకు నాకు పునాదులు’’ అన్నారాయన. రేపల్లెలో పుట్టి, మద్రాసులో డిగ్రీ చేసి, 1952లో దర్శకుడు కె. ప్రత్యగాత్మ సహాయకుడిగా ‘జ్వాల’ పత్రికతో జర్నలిస్టయ్యారు నందగోపాల్.
 
  ‘తెలుగుతెర’, ‘కినిమా’ లాంటి పత్రికలకు సంపాదకుడిగా పనిచేసిన ఈ కురువృద్ధుడు 1995లో ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు అందు కున్నారు. ‘‘ఇప్పుడీ గ్రంథానికి అవార్డు వచ్చిందంటే నా రచనతో పాటు, దాన్ని ఎంతో అందంగా ముద్రించిన ‘ప్రగతి’ ప్రింటర్స్ హనుమంతరావు పాత్రను మర్చిపోలేను’’ అని నందగోపాల్ అన్నారు. ఈ అవార్డుతో ఉత్తమ సినీ గ్రంథ రచయితగా జాతీయ అవార్డునందుకున్న మూడో తెలుగు సినీ జర్నలిస్ట్ అయ్యారాయన. 


- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 17th April 2014, Thursday, Page 10)
..............................

Thursday, April 17, 2014

సమాజానికి అద్దం... ఈ ‘బంగారు తల్లి’




చిత్ర నిర్మాణ సంఖ్య రీత్యా దేశంలో ద్వితీయ స్థానంలో ఉన్నా, జాతీయ అవార్డుల రీత్యా ఆఖరు స్థానానికే పరిమితమవుతున్న తెలుగు సినిమా బుధవారం నాడు జాతీయ స్థాయిలో తలెత్తుకు నిలబడింది. 2013వ సంవత్సరానికి గాను బుధవారం సాయంత్రం ప్రకటించిన 61వ జాతీయ అవార్డుల్లో రాజేశ్ టచ్‌రివర్ దర్శకత్వంలో రూపొందిన ‘నా బంగారు తల్లి’ మూడు అవార్డులు గెలుచుకుంది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా నిలవడమే కాక, ఉత్తమ నేపథ్య సంగీతానికి (శాంతనూ మొయిత్రా) అవార్డు దక్కించుకుంది. సినిమాలో కీలక పాత్ర పోషించిన అంజలీ పాటిల్‌కు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ‘‘జాలి, దయ లేని సెక్స్ వ్యాపార ప్రపంచం ఎంతగా వేళ్ళూనుకొందో తెరపై అధిక్షేపిస్తూ చూపించిన’’ సినిమాగా ‘నా బంగారు తల్లి’ని జ్యూరీ ప్రశంసించింది.


 ఆలోచింపజేసే కథ... అంతర్జాతీయ ప్రశంసలు...


 సెక్స్ అవసరాల నిమిత్తం ఆడపిల్లల అక్రమ రవాణా, అమ్మకమనే అంశం చుట్టూ ఈ చిత్ర కథ నడుస్తుంది. ‘‘నిత్యం మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాల గురించి పత్రికల్లో చదువుతున్నాం. సమాజాన్ని పీడిస్తున్న ఈ అంశం ఆధారంగా తీసిన సినిమా ఇది. దేశంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జరిగిన కథగా చిత్రీకరించిన ఈ సినిమా అన్ని ప్రాంతాల వారి మనసులనూ కదిలిస్తుంది’’ అని రాజేశ్ అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రేక్షకులకు ‘నా బంగారు తల్లి’ గురించి పెద్దగా తెలియకపోయినా, నిజానికి ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
 
 ఇండొనేసియాలో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ, బెస్ట్ సినిమా ఆఫ్ ఫెస్టివల్, అమెరికాలోని డెట్రాయిట్‌లో జరిగిన ట్రినిటీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2013లో ఉత్తమ చలనచిత్రం సహా పలు అంతర్జాతీయ అవార్డులు సంపాదించుకుంది. ఇప్పుడు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ స్థాయి గౌరవం సాధించుకుంది. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు పేరు వచ్చినా, ఇక్కడ సరైన గుర్తింపు రాలేదని వెలితిగా ఉండేది. కానీ, ఈ జాతీయ అవార్డులతో ఆ వెలితి తీరిపోయింది’’ అని దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్ తన ఆనందం పంచుకున్నారు. ‘బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్’లో పాల్గొనేందుకు వెళ్ళి, ప్రస్తుతం అక్కడే ఉన్న ఆయన ఇ-మెయిల్ ద్వారా తన స్పందనను తెలిపారు.
 
 వాస్తవిక జీవితం నుంచి వెండి తెరకు...

 మనుషుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న స్వచ్ఛంద సేవకురాలు సునీతా కృష్ణన్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించడమే కాక, ‘కాన్సెప్ట్ ఎడ్వైజర్’గా దర్శకుడికి అండగా నిలిచారు. ఆమె స్వయంగా చూసిన నిజజీవిత అనుభవాలు కూడా ఈ చిత్ర రూపకల్పనకు తోడ్పడ్డాయి. ఇక, జ్యూరీ నుంచి ప్రత్యేక ప్రశంస అందుకున్న ఈ చిత్ర నటి అంజలీ పాటిల్ నిజజీవితంలో ఆడపిల్లల అక్రమ వ్యాపారమనే చేదు అనుభవాన్ని చవిచూసినవారే. ‘‘ధైర్యంగా ముందుకు వచ్చి నిజజీవిత కథను ప్రపంచానికి చెప్పినందుకు’’ గాను ఆమె తెగువను జ్యూరీ ప్రశంసించింది.
 
 


ఇక, దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్ శ్రీలంకలోని అంతర్యుద్ధంపై గతంలో ఆయన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ బుద్ధ’ సినిమా తీసి, అనేక అవార్డులు గెలుచుకొన్నారు. ‘‘ఎయిడ్స్, ప్రపంచ శాంతి, అక్రమ రవాణా లాంటి అనేక సమస్యలను ఎత్తిచూపేందుకు దృశ్య మాధ్యమాన్ని వినియోగించుకోవాలని నా భావన’’ అని రాజేశ్ అన్నారు. అందుకు తగ్గట్లే ‘ప్రయోజనాత్మక చిత్ర’ నిర్మాణమే ధ్యేయంగా ఎన్నో ఏళ్ళుగా సినిమాలను నిర్మిస్తున్నారాయన. హైదరాబాద్‌లో స్థిరపడిన ఈ మలయాళీ ఇలా మన తెలుగు సినిమాకు గౌరవం తేవడం విశేషం.

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 17th April 2014, Thursday, Page 10)

తెలుగు సినిమా పుట్టినరోజు


నేడు తెలుగు సినిమా పుట్టినరోజు
 మన తొలి
పూర్తి తెలుగు
 టాకీ
 ‘భక్త ప్రహ్లాద’.
 తెలుగు
 నాట టాకీ
వేళ్లూను
కోవడానికి
ఈ సినిమానే శ్రీకారం
 చుట్టింది. అందుకే
ఈ చిత్రం విడుదలైన
రోజుని తెలుగు సినీ
 ప్రియులందరూ
కచ్చితంగా గుర్తు
పెట్టుకోవాలి. నిన్న
మొన్నటివరకూ ‘భక్త ప్రహ్లాద’ 1931 సెప్టెంబర్ 15న
విడుదలైందనే అనుకున్నారు. అయితే సీనియర్
పాత్రికేయుడు రెంటాల జయదేవ నాలుగేళ్లు శ్రమించి,
ఎంతగానో పరిశోధించి విడుదల తేదీపై వాస్తవ
చరిత్రను వెలికి తీశారు. ఆయన పరిశోధన ప్రకారం
తెలుగు సినిమా అసలు సిసలు పుట్టినరోజు
1932 ఫిబ్రవరి 6. ఇందుకు సంబంధించి ఆధారాలు
కూడా సంపాదించారు. మొత్తం  9,762 అడుగుల
నిడివి గల పది రీళ్ల ‘భక్తప్రహ్లాద’ చిత్రం
1932 జనవరి 22న బొంబాయిలో సెన్సారింగ్ జరుపుకుంది.

 ఆ సెన్సార్ సర్టిఫికెట్ నెంబర్-11032. ‘తొలి 100% తెలుగు టాకీ’గా
సగర్వంగా ప్రకటించుకున్న  ‘భక్త ప్రహ్లాద’ చిత్రం 1932 ఫిబ్రవరి 6న
బొంబాయిలోని కృష్ణా సినిమా థియేటర్‌లో తొలుత
విడుదలైంది. ఆ లెక్క ప్రకారం ఈ సినిమాకు నేటికి 82 ఏళ్లు నిండాయి.
హెచ్.ఎమ్.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సురభి
 నాటక కళాకారులే అధిక పాత్రలు పోషించారు.
మునిపల్లె సుబ్బయ్య, సురభి కమలాబాయి, మాస్టర్
కృష్ణారావు, ఎల్వీ ప్రసాద్ తదితరులు
ఇందులో ముఖ్య పాత్రధారులు. ‘తెలుగు సినిమా
 పుట్టినరోజు’ని ప్రతి ఏటా పరిశ్రమ
ఓ వేడుకగా ఘనంగా నిర్వహిస్తే బావుంటుంది.

................................................

Saturday, April 12, 2014

శక్తి అంతా మీలోనే ఉంది... ధీరులై లేచి నిలబడండి!

శక్తి అంతా మీలోనే ఉంది... ధీరులై లేచి నిలబడండి..!







 కలకత్తాలో భువనేశ్వరీదేవి, విశ్వనాథ దత్తా దంపతులకు
1863 జనవరి 12న నరేంద్రనాథ్ దత్తాగా జన్మించిన ఓ బాలుడు,
చిన్న వయసులోనే శ్రీ రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక
మార్గదర్శకత్వంలో ఒదిగాడు. స్వామి వివేకానందగా ఎదిగాడు.
కేవలం తన ఒక్కడి మోక్షం కోసం సాధన చేేన సాధారణ తపస్విలా
 కాక, సమాజంలోని దీనులను ఉద్ధరించాలని తపించిన
మహోన్నతుడిగా చివరి  దాకా  జీవించారు వివేకానంద.
 ఆధ్యాత్మికత అంటే, ముక్కు మూసుకొని, ప్రపంచానికి దూరంగా
 బతకడమని ఆయన చెప్పలేదు.  తోటి మానవుడిలోనే
మాధవుడున్నాడన్న వాస్తవాన్ని బలంగా ప్రతిపాదించారు. అందుకే
ఆయన  ఓ సందర్భంలో, ‘‘నా మాటంటే మీకు ఏమైనా విలువ ఉంటే,
నేనొక సలహా ఇస్తాను. మీ ఇంటి కిటీకీలు, తలుపులు తెరిచేయండి!
మీ వాటాలో పతనావస్థలో, దుఃఖంలో పేదవాళ్ళు కుప్పలుగా
 పడి ఉన్నారు. వారి దగ్గరకు వెళ్ళి, ఉత్సాహంతో, పట్టుదలతో సేవచేయండి.

జబ్బుపడిన వారికి మందులివ్వండి. యావచ్ఛక్తితో వారికి ఉపచర్య చేయండి.
తిండి లేక మాడిపోతున్న వాళ్ళకు ఆహారం అందించండి. అజ్ఞానులైన వారికి
మీలో ఉన్న జ్ఞానం మేరకు బోధనలు చేయండి..’’
అని అతి పెద్ద ధర్మసూక్ష్మాన్ని అత్యంత సరళంగా చెప్పేశారు. ‘‘ప్రతి పురుషుణ్ణీ,
 స్త్రీనీ, ప్రతి జీవినీ  దైవంగా చూడండి. అత్యంత నిష్ఠను పాటించిన అనంతరం
నేను ప్రతి జీవిలోనూ భగవంతుడున్నాడనే పరమ సత్యాన్ని కనుగొన్నాను.
అది వినా వేరే దైవం లేదు’’ అని తేల్చారు. మరో అడుగు ముందుకు వేని,
... ‘‘ప్రత్యక్ష దైవమైన నీ సోదర మానవుణ్ణి పూజించలేనివాడివి, ప్రత్యక్షం కాని
 పరమాత్ముణ్ణి ఎలా పూజించగలవు?’’ అని సూటిగానే ప్రశ్నించారు. ‘జీవాత్మ
సేవ చేసేవాడు పరమాత్ముని సేవించినట్లే!’ అని పదే పదే గుర్తు చేశారు.

 మహాత్మాగాంధీ అన్నట్లు ‘‘స్వామి వివేకానందుని బోధనలకు ప్రత్యేకంగా
ఎవరి నుంచీ ఎటువంటి పరిచయమూ అవసరం లేదు. చదివేవారి మీద
వాటంతట అవే చెరగని ముద్ర వేస్తాయి.’’ భౌతికంగా కనుమరుగైన
 111 ఏళ్ళ తరువాత కూడా ఇప్పటికీ నిత్య చైతన్య దీప్తిగా
స్వామీజీని నిరంతరం తలుచుకోవడం, అన్నేళ్ళ క్రితం ఆయన చెప్పిన
 మాటలతో నవతరం స్ఫూర్తి పొందడమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
.......................................................

Thursday, April 10, 2014

''సమాజానికి నమస్కరిస్తున్నా!'' - జ్ఞానపీఠ పురస్కార విజేత రావూరి భరద్వాజతో రెంటాల జయదేవ ప్రత్యేక ఇంటర్వ్యూ

2013 అక్టోబరులో జ్ఞానపీఠ పురస్కారం అందుకుంటూ రావూరి భరద్వాజ


 ('జ్ఞానపీఠ' అవార్డు వచ్చిన సందర్భంగా, ఆ ప్రకటన వెలువడిన 2013 ఏప్రిల్ 17న  రెంటాల జయదేవకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది)

హైదరాబాద్‌లోని మసాబ్‌ట్యాంక్‌ ప్రాంతంలోని విజయనగర్‌ కాలనీలోని మధ్యతరగతి నివాసమైన భరద్వాజ ఇల్లంతా పత్రికలు, చానళ్ళ ప్రతినిధులు, కెమేరామన్లు, ఫోటోగ్రాఫర్లతో నిండిపోయింది. ప్రత్యక్ష ప్రసారం కోసం వచ్చిన వాహనాలతో ఆ ఇంటి సందంతా సందడిలో మునిగిపోయింది. వృద్ధాప్యం తెచ్చిన బలహీనత బాధిస్తున్నా, ఇంట్లో వాళ్ళ సాయంతో రావూరి భరద్వాజ మీడియా ముందుకు వచ్చారు. తెల్లటి పంచె, లాల్చీ, నెరిసిన గడ్డంతో అతి సామాన్యుడిలా, అత్యంత నిరాడంబరంగా అందరికీ నమస్కరించారు.
1944 ప్రాంతంలో మొదలుపెట్టి గడచిన ఏడు దశాబ్దాలుగా సాగుతున్న తన రచనల్లోని వాక్యాలలాగే అంతే సాఫీగా, సహజంగా తన మనోభావాలు పంచుకున్నారు. ఒకపక్క ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మీడియా హడావిడి… మరోపక్క అభినందనలందిస్తూ వరుసగా ఇంట్లో మోగుతున్న ఫోన్లు… ఇంకోపక్క ఇంటికి వస్తున్న సాహితీ మిత్రులు, సన్నిహితుల తాకిడి… వీటన్నిటి మధ్యనే రావూరి భరద్వాజ తీరిక చేసుకుంటూ  ఇంటర్వ్యూ ఇచ్చారు. మనసులోని మాటలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు:
    భారతీయ సాహిత్యంలోని అత్యున్నత పురస్కారం 'జ్ఞానపీఠ్‌' మీకు దక్కినందుకు ముందుగా 'ప్రజాశక్తి' పక్షాన అభినందనలు. ఈ పురస్కారం దక్కడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు?
ఈ అరుదైన గౌరవం దక్కడానికి నేను మాత్రమే కారణం అనుకోవడం లేదు. నా జీవితానుభవాలు, ఆ అనుభవాలను ప్రసాదించిన సామాజిక వాతావరణం, ఆ వాతావరణంలోని మనుషులు, దాన్ని మలిచిన పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ కారణం. ఈ సమాజం ప్రసాదించిన గొప్ప అనుభవాలకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. 

ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది?
ఇవాళ మధ్యాహ్నం 12.30 - ఒంటి గంట సమయంలో విశాఖపట్నం నుంచి ఒకరు నాకు ఫోన్‌ చేసి చెప్పారు. ఇంతలో ఢిల్లీ నుంచి 'భారతీయ జ్ఞానపీఠ్‌' వారు కూడా తెలిపారు. 

'జ్ఞానపీఠ్‌' లభిస్తుందని మీరు ఎన్నడైనా ఊహించారా?
(నవ్వేస్తూ...) లేనే లేదు. ఎన్నడూ కల కూడా కనలేదు. జ్ఞానపీఠం కోసం ప్రయత్నించనూ లేదు. అన్నం తిన్నట్టు కల వచ్చింది కానీ, పంచభక్ష్య పరమాన్నాలతో, బంగారు పళ్ళెంలో, రత్నాలు పొదిగిన చెమ్చాతో తింటానని కలగన లేదు. సాహిత్యపరంగా అటువంటి ఉన్నతోన్నతమైనది ఈ అవార్డు. ఇది వస్తే బాగుండునని అనుకోవడం వేరు. రావడం వేరు. మూడు, నాలుగు పర్యాయాలుగా దరఖాస్తయితే చేశాను. పంపించి, ఓ ప్రయత్నం చేశాను కానీ వస్తుందని అనుకోలేదు.

ఊహించని అవార్డు వచ్చిన ఈ క్షణంలో మీ అంతరంగ భావన ?
నేను ఎంతో ఆనందంతో ఉన్నాను. సంతోషాన్ని మించిన స్థాయి ఆనందం. కలలో కూడా ఊహించని సుందరాంగులు, విద్యా సంపన్నులు, సంస్కార సంపన్నులు ముందుకు వస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఈ అవార్డు నేను కలలు కన్నది కాదు. నిజానికి, నా జీవితంలో నేను పిడికెడు మెతుకుల కోసం పాకులాడానే తప్ప, అవార్డుల కోసం ఎన్నడూ పాకులాడ లేదు. వాటి కోసం ఎవరినీ యాచించ లేదు, అర్థించ లేదు, అభ్యర్థించలేదు. 

మీరు చాలా ఏళ్ళ క్రితం రాసిన 'పాకుడు రాళ్ళు' నవల ద్వారా మీకు ఈ అవార్డు వచ్చింది కదా! ఆ నవలా రచనా నేపథ్యం పాఠకులకు వివరిస్తారా? 
(నోట్ - అవార్డు ప్రకటన రోజున మొదట మీడియాలో ప్రచారం జరిగినట్లుగా, చాలామందిమి పొరపాటు పడినట్లుగా ఆ నవలకు గాను ఆయనకు జ్ఞానపీఠ్ ఇవ్వలేదు. తెలుగు సాహిత్యానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆ అవార్డును ఇస్తున్నట్లు ఎంపిక కమిటీ వెలువరించిన అధికారిక ప్రకటన స్పష్టం చేస్తోంది. కానీ, ఇప్పటికీ చాలామంది అది గుర్తించక, మొదటి తప్పునే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. - రచయిత) 

నేను దాదాపు మూడున్నరేళ్ళు మద్రాసులో ఉన్నాను. ఆ రోజుల్లో రచయిత ధనికొండ హనుమంతరావు సన్నిహితుడైన కొలను బ్రహ్మానందరావు నడిపిన 'చిత్రసీమ' అనే సినీ పత్రికలో పనిచేశాను. నేను తెనాలి నుంచి మద్రాసు వెళ్ళి పోతున్నప్పుడు నా మిత్రుడు ఒకరు నాకు ఓ డైరీ ఇచ్చాడు. ఆ డైరీలో నా దిన చర్య, రోజువారీ అనుభవాలు రాసుకొనేవాణ్ణి. సినిమా పత్రికలో పనిచేస్తూ, సినిమా ప్రపంచాన్నీ, మను షులనూ దగ్గర నుంచి చూస్తూ, డైరీలో రాసుకున్న అనుభవాలు, జ్ఞాపకాలతో కథ ఎందుకు రాయకూడదని నాకు అనిపించింది. అలా నేను ఓ కథ రాశాను. 

మరి, అది నవలగా ఎలా మారింది?
ఆ కథను సాహితీ దిగ్గజం మల్లంపల్లి సోమశేఖర శర్మ గారికి చూపించాను. ఆయన అంతా చదివాక, 'బాగుంది. కానీ, పది మందిని కూర్చోబెట్టాల్సిన చోట వంద మందిని కూర్చోబెట్టావేమిటి?' అన్నారు. నా మట్టిబుర్రకు మొదట వెలగ లేదు. వివరం అడిగితే, 'ఇది మూడు, నాలుగు వందల పేజీల నవలగా సరిపడే అంశాన్ని ఒక కథగా రాశావు' అన్నారు. ఆ మాట నా మనస్సులో ఉండిపోయింది. ఆ తరువాత హైదరాబాద్‌ వచ్చాక, అప్పటి 'కృష్ణాపత్రిక' అధిపతి ముదిగొండ సుబ్రహ్మణ్య శర్మగారు నన్ను ఏదైనా రాయమని అడిగారు. నేను ఈ కథాంశాన్ని దృష్టిలో పెట్టుకొని, సినిమా వాళ్ళ మీద సీరియల్‌ రాస్తాను అన్నాను. వాళ్ళ మీద రాయడానికి ఏముంటుందన్నారాయన. చాలా ఉందని చెప్పి, ముందుగా 12 వారాలకు సరిపడా భాగాలు భాగాలుగా సీరియల్‌ రాసి, తీసుకువెళ్ళాను. అది నచ్చి, 'కృష్ణాపత్రిక'లో ధారావాహికగా ప్రచురించారు. ముందుగా 30 - 40 పేజీల కథగా అనుకున్నది, చివరకు మూడు నాలుగేళ్ళు పెద్ద సీరియల్‌గా వచ్చింది.ఆ నవలకు విశేష ఆదరణ లభించింది. 

ఆ నవల వల్ల ఇప్పటికే మీకు రెండోసారి 'ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు', తొలిసారిగా 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు' వచ్చాయి. ఇప్పుడిలా 'జ్ఞానపీఠం'! అది ఇంతటి పేరు తెస్తుందని మీరనుకున్నారా?
లేదు. అసలు ఆ నవలకు ముందు నేను అనుకున్న పేరు 'మాయ జలతారు' అని. కానీ, అప్పట్లో 'కృష్ణా పత్రిక'లో పని చేస్తున్న సాహితీమిత్రుడు, చిత్రకారుడు శీలా వీర్రాజు దానికి 'పాకుడు రాళ్ళు' అని నామకరణం చేశారు. పాచిపట్టి, జారిపడతామని తెలిసినా అందరూ సినీ రంగం వైపు ఆకర్షితులవుతుంటారు... జారి పడుతుంటారు... దెబ్బలు తగిలించుకుంటారు... మళ్ళీ మళ్ళీ దాని మీదే వెళుతుంటారు... అనే విశాలమైన అర్థంతో ఆయన పెట్టిన పేరు అది. ఆ నవల తమిళ, కన్నడ భాషల్లోకి కూడా అనువాదమైంది. అక్కడా అందరి ఆదరణ పొందింది. ఆ నవలను ఆకాశవాణి వారు ఓ గంట వ్యవధితో నడిచే శ్రవ్య నాటకంగా మలిచారు. ఆ నవలపై సిద్ధాంత వ్యాసాలూ వచ్చాయి.

పాకుడు రాళ్ళుతో సహా మీరు చేసిన రచనల్లో వాస్తవమెంత? కల్పన ఎంత
రచన అంటేనే అందులో కల్పన, వాస్తవం కలగలిసి ఉంటాయి. వాస్తవానికి, కొంత కల్పన జోడిస్తాం. అలాగే, కల్పన ప్రాతిపదికగా వాస్తవం ఉంటుంది. దాన్ని ఒకే ఒక్క దృక్కోణంతో చూడడం సాధ్యం కాదు. 

ఆ నవలను ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది?
ఇవాళ్టికీ ఆ నవలలోని ఏ పేజీ చూసినా, అందులోని పాత్రకు నాకు ప్రేరణగా నిలిచిన నిజజీవిత నటీనటులు, వారి స్వభావాలు, ఆ సంఘటనలు గుర్తుకు వస్తాయి. అయితే, ఆ వ్యక్తుల పేర్లు నేను చెప్పడం బాగుండదు. 

ఆ నవల అంతటి ఆదరణ పొందడానికి కారణం ఏమిటంటారు?
మనం చెబుతున్నది నిజమైనప్పుడు... నిజాన్ని నిజంగా చెబుతున్నప్పుడు... అవతలి వాళ్ళను నొప్పించ కుండానే నిజాయతీగా చెబుతున్నప్పుడు... ఏ రచనకైనా ఎంతో పేరు వస్తుంది. అది అందరి ఆదరణా పొందుతుంది. 'పాకుడు రాళ్ళు'లో ఉన్నవన్నీ నిజాలు... నిజాయతీగా చెప్పిన నిజాలు. ఇప్పటికే ఆ నవల మూడు, నాలుగు సార్లకు పైగా ముద్రణకు నోచుకోవడమే అందుకు నిదర్శనం.

'పాకుడురాళ్ళు' నవలలోని మంజరి పాత్రకూ, మహానటి సావిత్రి జీవితానికీ చాలా పోలికలు ఉన్నాయనీ, అందులోని కొన్ని ఘట్టాలు ఆమె జీవితంలో జరిగినవేననీ సాహితీలోకంలో ఓ మాట ప్రచారంలో ఉంది. దానికి మీరేమంటారు?
ఆ మాట చాలా వరకు నిజమే! నటి సావిత్రి తరచుగా మా ఇంటికి వస్తుండేది. నన్ను 'బావ' అనీ, మా ఆవిడను 'పిన్ని' అనీ పిలిచేది. 'అవేమి వరసలే! నన్ను బావ అని పిలిస్తే, మా ఆవిడను అక్కా అని పిలువు! ఆమెను పిన్ని అని పిలిస్తే, నన్ను బాబాయ్ అని పిలువు' అన్నాను. అందుకు, సావిత్రి సరదాగా 'సినిమా వాళ్ళకు వరసలేమిటి బావా!' అని నవ్వేసింది. 

సినీ జగత్తులోని వ్యక్తుల అంతరాంతరాలను ప్రతిభా వంతంగా బొమ్మ కట్టించారు. ఆ వ్యక్తుల పేర్లు బయటకు వస్తే...
సినీ జగత్తు ఓ చిత్రమైన ప్రపంచం. అక్కడ తండ్రీ కొడుకులిద్దరితో దోస్తీ కట్టిన నటీమణులతో సహా చాలా మంది, చాలా వ్యవహారాలు నాకు తెలుసు. నా డైరీల్లో నా అనుభవాలన్నీ రాసుకున్నాను. అవన్నీ పేర్లతో సహా బయటకు రావాలంటే, నేను చనిపోయాక, నా డైరీలు బయటపెట్టాలి. 'పాకుడు రాళ్ళ' లాంటి సినీ రంగంతో సన్నిహితంగా ఉంటూ కూడా జారకుండా జాగ్రత్త పడినవాళ్ళలో ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు, నేను - ఇలా కొంతమంది ఉన్నాం. 
మీ రచనల ఆధారంగా సినిమాలు రాలేదా...?
నేనూ ఒకటీ అరా సినిమాలకు పనిచేశాను. వాటి పేర్లు ఇప్పుడు వద్దులెండి. ప్రముఖ నిర్మాత, సహజకవి ఎం.ఎస్. రెడ్డి గారు 'కరి మింగిన వెలగపండు' అనే నా కథ ఆధారంగా 'ఓ ప్రేమ కథ' అనే సినిమా తీశారు.

మీరు వందల సంఖ్యలో కథలు, పదుల సంఖ్యలో నవలలు, నాటకాలు, వ్యాసాలు, పిల్లల కథలు రాశారు. మీ రచనల్లో మీకు బాగా నచ్చినదంటే ఏం చెబుతారు?
మీ కన్నబిడ్డల్లో ఏ బిడ్డ ఇష్టమంటే ఏం చెబుతాం? అయితే, నా రచనల్లో నాకు బాగా నచ్చింది - 'జీవన సమరం'. సమాజంలోని వివిధ జీవన రంగాల్లోని సామాన్య వ్యక్తులను స్వయంగా కలసి, ఇంటర్వ్యూలు రికార్డు చేసి, వారి మాటలో, వారి యాసలో రాసిన వాక్చిత్రాలు అవి. అందులో కత్తులు సానబట్టేవాడు, చెవిలో గుబిలి తీసేవాడు, సోది చెప్పే అమ్మి, చిలక జోస్యగాడు... ఇలా సమస్త శ్రామిక జీవుల జీవితాలు, వారి జీవన గమనాలు వారి మాటల్లోనే అక్షరబద్ధం చేశాను. 'ఈనాడు' దినపత్రిక అధినేత రామోజీరావు ప్రోద్బలంతో, దాదాపు 50 - 60 వారాలు ఆ సిరీస్‌ రాశాను. సామాన్య వ్యక్తులు బతకడం కోసం చేసిన సమరమైన 'జీవన సమరం'లో బడుగు జీవులు, మధ్యతరగతి వారు... ప్రతి ఒక్కరూ కనపడతారు. 

అయితే, మీరు జీవితంలో చేసిన పనులు, రాసిన రచనలు అన్నీ ఇలా చిత్తశుద్ధితో నమ్మి, నిజాయతీగా చేసినవేనంటారు! ఇవాళ్టి రచయితలు చిత్తశుద్ధితో రాయాలంటారు!
(సాలోచనగా...) అలా చెప్పలేను. చిత్తశుద్ధిగా నమ్మని పనులు కూడా బతకడం కోసం నేను ఎన్నో చేశాను. ఉద్యోగ రీత్యా నా యజమానులు, నా పై అధికారులు కోరినవి, చెప్పినవి కూడా రాశాను. వృత్తి రీత్యా కానివ్వండి... డబ్బు కోసం కానివ్వండి... బతకడం కోసం అనుకోండి.. నేనూ కొన్ని రాయాల్సి వచ్చింది. రచన ప్రింటులో అనుకున్నంత రాలేదని ప్రచురణకర్త చెప్పినప్పుడు, రూపాయికి పేజీ వంతున రాసిన ఘట్టాలూ ఉన్నాయి. నాకు ఇష్టం లేని పనులు కూడా ఇష్టమున్నట్లు నటిస్తూ చేయడం కూడా అప్పుడప్పుడు తప్పలేదు. కాబట్టి, కాబట్టి, ఆ మాట చెప్పే హక్కు నాకు లేదు. 

వాస్తవ జీవితంలోని ఘటనలతోనే కాక, సైన్స్‌ ఫిక్షన్‌ లాంటివీ చేసినట్లున్నారు!
అంతరిక్ష ప్రయాణం ఇంకా తెలియని రోజుల్లో 1950 - '52 ప్రాంతంలో 'చిత్ర గ్రహం' అంటూ స్పేస్‌ ట్రావెల్‌ మీద 'ఆంధ్రప్రభ'లో సీరియల్‌గా రాశాను. అలాగే, 'జయప్రళయం' అంటూ మరో పాపులర్‌ సైన్స్‌ రచన కూడా చేశాను. 

కథ, నవల, నాటకం, వ్యాసం, బాలసాహిత్యం, శ్రవ్య రూపకం... ఇలా ఎన్నో సాహితీ ప్రక్రియల్లో మీకు అభినివేశం ఉంది. వీటిలో ఏ ప్రక్రియ కష్టమైనదంటారు?
నా అభిమానులు చాలా మందికి నేను రాసిన చిన్న కథలంటే చాలా ఇష్టం. అలా రాయడం చాలా కష్టమని కూడా అంటారు. కానీ, నా దృష్టిలో రేడియోకు రూపకం రాయడం ఎంతో కష్టం. చాలా క్లిష్టమైన రచనా ప్రక్రియ అది. అందులోనూ ఆకాశవాణి వారి నిబంధనలకు తగ్గట్లుగా, వారికి నచ్చేలా రాయడం మరీ కష్టం. 

ఆకాశవాణిలో ఉద్యోగానికి మీ జీవితంలో ఎలాంటి పాత్ర ఉంది?
(ఉద్వేగానికి గురవుతూ...) కడుపు నిండా తినడానికి పట్టెడన్నం కోసం కష్టపడిన రోజులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి నేను, నా భార్య, నా బిడ్డలు కడుపు నిండా ఇంత తినడానికి జీతభత్యాలతో కూడిన ఉద్యోగమిచ్చిన సంస్థ - ఆకాశవాణి. అప్పట్లో 185 రూపాయల జీతమంటే చాలా ఎక్కువ. హైదరాబాద్‌ ఆకాశవాణిలో నాకు ఉద్యోగర రావడానికి కారణమైన రచయిత త్రిపురనేని గోపీచంద్‌ను మర్చిపోలేను. నాకు ఎన్నో పుస్తకాలు చదువుకొనే అవకాశం, ఆలోచించే తీరిక, రాసే అవకాశకం ఇచ్చింది ఆకాశవాణే. నాకున్న పరిధిని విస్తృతీకరించిన మహౌన్నత కళాసంస్థ అది. ఆ జీవితాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. (గొంతు గద్గదికం అవుతుండగా...) నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. అది తీరుతుందో, లేదో కానీ... నేను చనిపోయాక, నా పార్థివ శరీరాన్ని ఆకాశవాణి ప్రాంగణంలో భూస్థాపితం చేయాలి. ఆకాశవాణిలోకి వచ్చే కళాకారులు, సాహితీవేత్తలందరూ దాని మీద నుంచే నడుచుకుంటూ పోవాలి. అవకాశం ఉంటే, వచ్చే జన్మలో ఆకాశవాణిలో ఓ చిన్న గరికపోచగా పుట్టాలని కోరిక! 

- ఇంటర్వ్యూ : రెంటాల జయదేవ

(రావూరికి జ్ఞానపీఠ్ ప్రకటించిన వెంటనే  ప్రజాశక్తి దినపత్రిక, 18 ఏప్రిల్ 2013, శుక్రవారం సంచికలో ప్రచురితం.... 
............................................................................................

Tuesday, April 8, 2014

'వందకోట్ల`దిశగా తెలుగు సినిమా (2013వ సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమ)



  (2013 ఇయర్ రివ్యూ)
  మరో రెండు రోజుల్లో ఈ 2013వ సంవత్సరం సెలవు తీసుకుంటోంది. ముగిసిపోతున్న ఈ ఏడాది తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు ఎన్నెన్నో ఘటనలకు 'మౌన ప్రేక్షకురాలు'గా నిలిచింది. గడచిన కొన్నేళ్ళ కన్నా భిన్నంగా ఈ ఏడాది ఎన్నో చిత్ర విచిత్రాలు తొలిసారిగా జరిగాయి. సినిమా విడుదల కాక ముందే పైరసీ సీడీలు మార్కెట్లోకి వచ్చేయడం తమిళనాట కొన్నేళ్ళ క్రితమే జరిగినా, ఆ జాడ్యం ఈ ఏడాది తొలిసారిగా తెలుగుకూ పాకింది. పెద్ద హీరోల చిత్రాల రిలీజులు సైతం పదే పదే వాయిదా పడ్డాయి. అదే అదనుగా ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా చిన్న సినిమాలు పెద్ద సంఖ్యలో చకచకా విడుదలయ్యాయి. సరుకున్న సినిమాలు చిన్నవైనా, జనం బ్రహ్మరథం పట్టారు. మరోపక్క, తొలిసారిగా దాదాపు వంద కోట్ల వసూళ్ళ స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. విదేశాల్లో తెలుగు సినిమా కలెక్షన్లు మునుపెన్నడూ లేనట్లు మిలియన్‌ (పది లక్షల) డాలర్ల స్థాయికి పెరిగాయి. మునుపటి తరం పెద్ద హీరోలందరూ క్రమంగా తెర మరుగవుతున్న సూచనలు గోచరించాయి. లఘు చిత్రాలు తీసి, యూ-ట్యూబ్‌లో పెట్టిన యువతరం దర్శకులు పలువురు వాటిని చూపెట్టి, వెండితెర అవకాశాలు అందుకొన్నారు. కొత్త దర్శకులు కొంతలో కొంత కొత్తగా వెళ్ళి, సమకాలీన ప్రేమ, ఆకర్షణ, పెళ్ళికి ముందే లైంగిక సంబంధాల లాంటి ఆధునిక కాలపు పోకడల్ని సినిమాల్లో చూపెట్టారు. ఇలా... తెలుగు చిత్రసీమలో ఎన్నెన్నో మలుపులు! ఈ మలుపుల్లో గెలుపులూ...! పరిశ్రమకు ఎన్నో చెరుపులూ....! 
 డబ్బింగ్‌ కన్నా స్ట్రెయిటే మిన్న!
   ఈ ఏడాది మొత్తం 179 దాకా తెలుగు చిత్రాలు, 92 దాకా అనువాద చిత్రాలు విడుదలైనట్లు సినీ పరిశీలకుల లెక్క. అయితే, ఇన్ని సినిమాల్లో సరైన విజయం సాధించి, నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక శాఖలు మూడింటికీ లాభాలు తెచ్చినవి మాత్రం తక్కువే. ఫ్లాపైన చిత్రాల దర్శక, నిర్మాతలు భోరున బయటే విలపిస్తే, కొన్ని చిత్రాలు సూపర్‌ హిట్టయినా ఆ చిత్రానికి పనిచేసినవారు ఆంతరంగికంగా వాపోతున్నారు. సినిమా రిలీజుకు ముందే టేబుల్‌ ప్రాఫిట్‌ వచ్చినా, మునుపటి చిత్రాల తాలూకు అప్పులన్నీ తీర్చడానికే ఆ డబ్బులు నిర్మాతలకు సరిపోని వైనాలూ ఉన్నాయి. ఎవరెవరి మాట సాయంతో, మధ్యవర్తిత్వం సాయంతో తీరా సినిమా రిలీజై, సూపర్‌ హిట్టయినా కనీసం పారితోషికాలైనా ఇప్పటికీ నిర్మాతల నుంచి పూర్తిగా అందుకోక, టెక్నీషియన్లు చాలామంది బాధపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. 

వెరసి, ఎప్పటిలానే ఈసారి కూడా కేవలం 8 నుంచి 10 శాతం సినిమాలే సక్సెస్‌ అయ్యాయి. ''ఈ ఏటి తెలుగు చిత్రాల్లో కేవలం ఓ డజనుకు పైగా సినిమాలకు మాత్రమే పాజిటివ్‌ ఫలితాలు వచ్చాయి. అందులోనూ ఆరేడు సినిమాలు యావరేజ్‌లే. మిగిలిన అయిదారు మాత్రమే నిఖార్సయిన హిట్లు. ఈ కొద్ది సినిమాలు మినహా మిగతావన్నీ నష్టాలు మిగిల్చినవే'' అని 'తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌' పెద్ద తలకాయల్లో ఒకరైన ప్రముఖ సినీ ఎగ్జిబిటర్‌ విజయేందర్‌ రెడ్డి, 'ప్రజాశక్తి'తో మాట్లాడుతూ అన్నారు. ''తెలుగు చిత్ర పరిశ్రమలో ఏటా రూ. 1200 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అయితే, అందులో 800 నుంచి 900 కోట్లు కూడా వెనక్కి రావడం లేదు. మిగతా మూడొందల కోట్లు నష్టమే'' అని ఆయన వివరించారు. ఈ ఏటి పరిస్థితి కూడా అదే! 

దానికి తోడు రాష్ట్రంలోని ఉద్యమాల ఉధృతి కూడా సినిమాపై బాగానే ప్రభావం చూపింది. ముఖ్యంగా, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, తెలంగాణ మినహా ఇతర రాష్ట్రమంతటా నెలల కొద్దీ సాగిన ఆర్టీసీ సమ్మె, బంద్‌ల దెబ్బ గట్టిగా తగిలింది. చాలా కేంద్రాల్లో సినిమా హాళ్ళలో ప్రదర్శనలకు తాళం పడింది. చాలాచోట్ల నాలుగు ఆటలూ ఆగిపోతే, కొన్నిచోట్ల సాయంకాలపు షోలు అంతంత మాత్రంగా నడిచాయి. ఇవన్నీ కలసి రిలీజ్‌లను వాయిదా వేయించాయి. పరోక్షంగా తెలంగాణలోనూ ఈ ఉద్యమాల సెగ తగిలింది. ''దాదాపు రెండు నెలల పైచిలుకు కొత్త సినిమాలు లేక, వసూళ్ళు రాక, మేము జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోయింది'' అని తెలంగాణలోని ఓ ఎగ్జిబిటర్‌ కమ్‌ డిస్ట్రిబ్యూటర్‌ 'ప్రజాశక్తి'తో ఆ సంగతులను తలుచుకున్నారు. 

వివాద నామ సంవత్సరం
సినిమా రిలీజవగానే వెంటపడే పైరసీ భూతం ఈసారి చిత్ర యూనిట్లలోని 'ఇంటి దొంగలు', వారి వెనుక ఉన్న 'పెద్ద మనుషుల' పుణ్యమా అని ఏకంగా రిలీజ్‌కు ముందే కోరలు సాచింది. జూలైలో రావాల్సిన 'అత్తారింటికి దారేది' చిత్రం వాయిదా పడి, రిలీజ్‌ డేట్‌ కోసం రెండున్నర నెలలుగా నిరీక్షిస్తూ ఉండగానే, ఎడిటింగ్‌ రూమ్‌లోని 'ఇంటి దొంగ' వల్ల ఉన్నట్టుండి ఇంటర్వెల్‌ దాకా సినిమా ఇంటర్నెట్‌లో వచ్చేసింది. రోడ్డు మీద పాతికా పరకకు పైరసీ సీడీలు పప్పుబెల్లాలుగా అమ్ముడయ్యాయి. దాంతో, హడావిడిగా సినిమాను హాళ్ళలో విడుదల చేసేయాల్సి వచ్చింది. పైరసీ దెబ్బతో వచ్చిన ప్రచారం, డిజిటల్‌ ప్రింట్‌ క్వాలిటీ సినిమాను పైరసీలో చూసిన జనం కూడా హాళ్ళలో చూడడానికి మొగ్గు చూపడం కలిసొచ్చి, హాళ్ళన్నీ క్రిక్కిరిశాయి. అఖండ విజయం దక్కింది. మునుపటి 'గబ్బర్‌ సింగ్‌' తరువాత ఈసారి మరో కొత్త బాక్సాఫీస్‌ రికార్డు హీరో పవన్‌ కల్యాణ్‌ పేర దక్కింది. 'పైరసీ వ్యవహారంలో తెర వెనుక ఉన్న అసలు పెద్దల తాట తీస్తా'నంటూ అభిమానుల ఎదుట ఆయన చూపిన ఆవేశం మరో సంచలనమైంది. 

పిన్నితో హీరోయిన్‌ అంజలి వ్యక్తిగత వివాదం, కొద్దిరోజులు ఆమె కనిపించకుండాపోవడం వార్తల్లోకెక్కాయి. ఇక, రామ్‌గోపాల్‌ వర్మ 'సత్య-2' సెన్సార్‌ జాప్యం, మంచు విష్ణువర్ధన్‌బాబు 'దూసుకెళ్తా' చిత్రం ప్రచార చిత్రానికి దక్కిన 'ఎ' సర్టిఫికెట్‌ లాంటివీ వివాదాలయ్యాయి. 'మధుమతి'లో వేశ్య పాత్ర పోషించిన బుల్లితెర నటి ఉదయభాను ఆ చిత్ర ప్రచారానికి సహకరించ లేదని దర్శక, నిర్మాతలు వీధికెక్కారు. తీరా రిలీజు ముందేమో సినిమా తనకు చూపలేదంటూ పోలీసులను ఆశ్రయించి సినిమా చూసిన ఉదయభాను, రిలీజు రోజున మీడియా ముందుకు వచ్చి, తనకు చెప్పిన కథొకటి తీసిన సినిమా వేరొకటి అని ఆరోపించారు. ప్రచార చిత్రాల్లో తన బొమ్మలను 'మార్ఫింగ్‌' చేశారని విరుచుకుపడి, కొన్ని సినీ వెబ్‌సైట్ల పైనా కేసులు పెట్టారు. ఈ ప్రచార హంగామా సాగుతుండగానే, సినిమా మాత్రం ఇంటిదారి పట్టేసింది. 
కాగా, బ్రాహ్మణ వర్గాన్ని కించపరచారంటూ కేసుల దాకా వెళ్ళిన రెండేళ్ళ క్రితం నాటి 'దేనికైనా రెఢ' ఆ విషయంలో కోర్టులో ఊరట పొందింది. కానీ, కేంద్రప్రభుత్వమిచ్చే ఉన్నత పౌర పురస్కారాల్లో ఒకటైన 'పద్మశ్రీ'ని వాణిజ్యపరంగా సినిమా టైటిల్స్‌లోనూ దుర్వినియోగం చేస్తున్నారంటూ హైకోర్టు ఆగ్రహించడంతో ఇప్పుడు నిర్మాత - నటుడు మోహన్‌బాబు, నటుడు బ్రహ్మానందం ఇరుకునపడ్డారు. 

బాక్సాఫీస్‌ వాకిట్లో కలెక్షన్లు కొట్టు!
పెరిగిన టికెట్‌ రేట్ల వల్ల అయితేనేం, ఉన్న చిత్రాల్లో ఓసారైనా చూడవచ్చులెమ్మన్న ప్రేక్షకుల ఉదారత వల్లనైతేనేం సక్సెస్‌ఫుల్‌ సినిమాలకు వసూళ్ళ స్థాయి ఈ ఏడాది బాగానే పెరిగింది. నాలుగైదు సినిమాల వసూళ్ళు రూ. 50 కోట్ల మార్కు వైపు పరుగులు తీశాయి. ఇక, పవన్‌ కల్యాణ్‌ - త్రివిక్రమ్‌ల మాయాజాలం 'అత్తారింటికి దారేది' ఏకంగా తొలి వంద కోట్ల వసూళ్ళ సినిమాగా నిలిచే స్థాయికి వెళ్ళింది. అయితే, ఆఖరి కొద్ది దూరంలో ఆగిపోయింది. తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రంగా మాత్రం కొత్త రికార్డు సృష్టించింది. 

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'అత్తారింటికి దారేది', ప్రభాస్‌ 'మిర్చి' (దర్శకుడిగా మారిన రచయిత కొరటాల శివ) లాంటివి నాటకీయమైన కుటుంబ కథలకు జనాదరణ ఉన్నట్లు నిరూపించాయి. మరోపక్క రొటీన్‌ మాస్‌ కథలను ఈసారి ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. కానీ, హీరో ఇమేజ్‌, రిలీజ్‌ టైమ్‌ కలిసొచ్చినప్పుడు అలాంటి చిత్రాలకూ (రామ్‌చరణ్‌ తేజ్‌ 'నాయక్‌', చిన్న ఎన్టీయార్‌ 'బాద్‌షా') వసూళ్ళు కట్టబెట్టారు. జీవితంలో కరవైన కాసింత వినోదం కనీసం వెండితెర మీదైనా పలకరిస్తే చాలని రవితేజ 'బలుపు' లాంటి వాటినీ లాభాల బాట పట్టించారు. రవితేజ ఫ్లాపుల పరంపరకు కాస్త విరామం ఇచ్చారు. తమిళ 'వేటై ్ట'కి రీమేకైన 'తడాఖా'తో నాగచైతన్య విజయం సాధించారు. 

పాఠం నేర్పే పరాజయాలు
చాలా కాలం తరువాత మళ్ళీ నేరుగా తెలుగులో 3డి చిత్రాలు ఈ ఏడాది వచ్చాయి. కానీ, కథలో, కథనంలో సరుకు లేని 'అల్లరి' నరేశ్‌ 'యాక్షన్‌' చిత్రానికి కానీ, హీరో కల్యాణరామ్‌ కష్టపడి తీసిన 'ఓం' చిత్రానికి కానీ ఈ 3డి పరిజ్ఞానమేదీ ఉపయోగపడలేదు. ప్రేక్షకాదరణ కరవై, కనీసం ఖర్చులు కూడా రాని పరిస్థితి వచ్చింది. ఇక, నాగార్జున ('గ్రీకు వీరుడు', 'భారు'), వెంకటేశ్‌ ('షాడో', 'మసాలా'), జూనియర్‌ ఎన్టీయార్‌ ('రామయ్యా వస్తావయ్యా') లాంటి పలువురు పెద్ద హీరోల సినిమాలు కూడా ఘోరంగా ఫ్లాపయ్యాయి. ఎప్పుడూ వరుసగా రిలీజులతో బిజీగా ఉండే 'అల్లరి' నరేశ్‌ ఈసారి విజయాలు అందుకోకపోవడం ఆలోచింపజేసే విషయం. ఇక, కొందరు హీరోల చిత్రాలు ఈ ఏడాది కాలంలో వెండితెరపై కనిపించనే లేదు. 

బాలకృష్ణ నటించిన కొత్త సినిమా ఏదీ ఈ ఏడాది విడుదలకు నోచుకోకపోవడం విచిత్రం. దాదాపు మూడు దశాబ్దాల కెరీర్‌లో ఇలా జరగడం ఆయనకు ఇదే తొలిసారి. మరో పక్క సీనియర్‌ హీరో వెంకటేశ్‌ క్రమంగా సోలో హీరో అన్న ఇమేజ్‌ను వదిలించుకోవడం మొదలుపెట్టింది ఈ ఏడాదే! 'సీతమ్మ వాకిట్లో...', 'మసాలా' లాంటి చిత్రాలలతో మల్టీస్టారర్ల వైపు రూటు మార్చారు. సినిమా పూర్తయి, నెలలు గడిచేస్తున్నా, ఆర్థిక ఇబ్బందులతో రిలీజుకు నోచుకోని చిత్రాల్లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 'ఇంటింటా అన్నమయ్య', కృష్ణవంశీ రూపొందించిన 'పైసా' లాంటివి ఉండడం మింగుడుపడని చేదు నిజం! పాత అమితాబ్‌ 'జంజీర్‌'ను కొత్తగా చూపెడుతూ, బాలీవుడ్‌లో హంగామాగా రంగప్రవేశం చేయాలనుకున్న హీరో రామ్‌చరణ్‌ తేజ్‌ ప్రయత్నం ఫలించనే లేదు. ఆ సినిమా తెలుగు రూపం 'తుఫాన్‌' సైతం వసూళ్ళ వాన కురిపించకుండానే, తొలిరోజే బాక్సాఫీస్‌ తీరం దాటిపోయింది.

కలిసొచ్చిన కాలం... నడిచొచ్చిన చిత్రాలు, దర్శకులు
అయితే, ఉద్యమాల నేపథ్యంలో పెద్ద చిత్రాల వాయిదా చిన్న సినిమాలకు బాగా కలిసొచ్చింది. ఎన్నడూ లేని రీతిలో వారానికి ఆరేడు చిన్న సినిమాలు వచ్చిన సందర్భాలు ఈ ఏడాదిలో అనేకం. ప్రేక్షకుల మాటెలా ఉన్నా, కనీసం హాలు దాకా సినిమానైనా తీసుకురాగలిగామన్న సంతోషం చాలామంది దర్శక, నిర్మాతలకు మిగిలింది. మరో విశేషం ఏమిటంటే, సరుకున్న చిన్న సినిమాలు కొన్ని పెద్ద చిత్రాల హంగామా మధ్య కూడా తమ సత్తా చాటడం! 
గడచిన కొన్నేళ్ళలో ఎప్పుడూ లేని రీతిలో ఈసారి చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు నమోదు చేసుకున్నాయి. పైగా, ఇవన్నీ కొత్త దర్శకులు తీసినవి కావడం మరీ విశేషం. నిఖిల్‌ - స్వాతి నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ 'స్వామి రారా!' (నూతన దర్శకుడు సుధీర్‌ వర్మ), మహేశ్‌బాబు బావ సుధీర్‌బాబు హీరోగా వచ్చిన 'ప్రేమ కథా చిత్రమ్‌' (దర్శకుడిగా మారిన కెమేరామన్‌ ప్రభాకరరెడ్డి), నితిన్‌ 'గుండె జారి గల్లంతయ్యిందే!' (విజరుకుమార్‌ కొండా), సందీప్‌ కిషన్‌ హీరోగా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' (మేర్లపాక గాంధీ) లాంటి సినిమాలు ఆ కోవలోవే! 

ఇక, మేర్లపాక గాంధీతో పాటు పవన్‌ సాదినేని ('ప్రేమ.. ఇష్క్‌.. కాదల్‌'), విరించి వర్మ (ఈ వారం వచ్చిన 'ఉయ్యాలా జంపాలా') లాంటి వారందరూ లఘు చిత్రాలు తీసి, వాటిని 'యూ - ట్యూబ్‌'లో పెట్టి, అవే 'విజిటింగ్‌ కార్డు'లుగా, ఆనక వెండితెరకు ప్రమోట్‌ అయినవారే! ఇలా షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్లు సినిమా దర్శకులుగా అవకాశాలు అందుకోవడం ఈ ఏడాది తెలుగులో మొదలైన ఓ కొత్త ట్రెండ్‌. 

మరోపక్క, పెళ్ళికి ముందే సహజీవనమనే కత్తి మీద సాము లాంటి కథాంశంతో ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన 'అంతకు ముందు.. ఆ తరువాత..', ఆడపిల్ల ప్రేమ - పెళ్ళిలోని మరో కోణాన్ని చూపిన 'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' (కొత్త దర్శకుడు జి.వి. రామరాజు), జనజీవన స్రవంతిలో కలుద్దామనుకొన్న నక్సలైట్ల కోణం నుంచి రాజ్యవ్యవస్థతో ఉండే చిక్కులను చూపెట్టిన 'దళం' (రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడు, కొత్త దర్శకుడు ఎం. జీవన్‌) లాంటి కొన్ని మంచి ప్రయత్నాలు ఈ ఏడాది జరిగాయి. చిన్న చిత్రాల థియేటర్ల సమస్య, రాష్ట్రంలోని అనిశ్చిత పరిస్థితుల లాంటివి వాణిజ్య విజయానికి అడ్డం పడినా, విమర్శకుల ప్రశంసలనైతే పుష్కలంగా అందుకున్నాయి. ఇక, మునుపటి పెద్ద దర్శకుల్లో పలువురు తెరపైకి రాకపోవడమో, వచ్చినా పరాజయాలే మూటకట్టుకోవడమో (పూరీ జగన్నాథ్‌ 'ఇద్దరమ్మాయిలతో..', తేజ '1000 అబద్ధాలు') జరిగింది.

'సం'గీతం - కొత్త నీటి జలపాతం
సంగీత దర్శకుల విషయానికి వస్తే, ఈ ఏడాది 'అత్తారింటికి దారేది'తో పాటు మరికొన్ని చిత్రాల హిట్‌ గీతాలతో దేవిశ్రీ ప్రసాద్‌ హల్‌చల్‌ చేశారు. గడచిన రెండు మూడేళ్ళలో తారాజువ్వలా దూసుకొచ్చిన తమన్‌ జోరు ఈసారి అంతగా కనబడలేదు. ఇక, మణిశర్మ, కీరవాణి లాంటి నిన్న మొన్నటి స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ల పేర్లు అడపా దడపానే వినిపించాయి. చక్రి, ఆర్పీ పట్నాయక్‌లు కానీ, అప్పుడప్పుడొచ్చి హిట్లు అందించే మిక్కీ జె. మేయర్‌ ('సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మినహాయింపు) కానీ వినపడింది తక్కువే.
అలాగే, బాణీలకు ఒకరు, నేపథ్య సంగీతానికి మరొకరు అనే ధోరణి కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. నిన్నటి అనంత్‌ శ్రీరామ్‌ తరువాత ఇవాళ్టి గీత రచయితల్లో నవ యువకుడు శ్రీమణి ('జులాయి' పాటలు) లాంటి కొందరు ప్రచారంలోకి వచ్చారు. ఇక, ఈ ఏటి మేటి హిట్‌ పాటలంటే, 'ఆరడుగుల బుల్లెట్టు...' లాంటివి గుర్తుకొస్తాయి. 

పేర్లు గుర్తుండేటంత ప్రభావం చూపకపోయినా, అన్ని రంగాల్లో లాగానే సినీ సంగీతంలోనూ ఈ ఏడాది కొత్త ముఖాలు పెరిగాయనే చెప్పుకోవాలి. గాయనీ గాయకుల సంగతీ అంతే! కెమేరా, ఎడిటింగ్‌ విభాగాల్లోనూ చిన్న చిత్రాలతో పాటు కొత్త నీరు వచ్చింది. బ్రహ్మానందం లాంటి స్టార్‌ కమెడియన్లు ఇప్పటికీ తమ హవా కొనసాగిస్తున్నా, అందుబాటులో ఉండే కొత్త కమెడియన్ల కోసం పరిశ్రమ అన్వేషణ ఈ ఏడాది ఫలితాలిచ్చింది. 'తాగుబోతు' రమేశ్‌, ధన్‌రాజ్‌, తాజాగా సప్తగిరి ('వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'), దామరాజు కిరీటి ('సెకండ్‌ హ్యాండ్‌') లాంటి కొందరు పాపులారిటీ తెచ్చుకున్నారు. నిన్న మొన్న దాకా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసిన స్టార్‌ హీరోయిన్ల స్థానంలో ఈ ఏడాది శ్రుతీహాసన్‌, సమంత, అమలాపాల్‌, అంజలి లాంటి నవ తరం తారలు కలకలం రేపారు. 

అనువాదాలు అంతంతే!
ఈ ఏడు అనువాద చిత్రాలు బాగానే వచ్చినా, వాటిలో ఆడినవి మాత్రం కొన్నే. గమ్మత్తేమిటంటే, డబ్బింగ్‌లకు దాదాపు రెట్టింపు సంఖ్యలో స్ట్రెయిట్‌ చిత్రాలు రావడం.
ఏడాది మొదట్లో తమిళనాట పెను వివాదం రేపిన కమలహాసన్‌ సొంత చిత్రం 'విశ్వరూపం', ఆసక్తికరంగా సాగిన 'పిజ్జా', తమిళ హీరో సూర్య నటించిన 'సింగం-2' లాంటి కొన్నే ప్రేక్షకాదరణ పొందాయి. విజరు 'అన్న', అజిత్‌ 'ఆట ఆరంభం', కార్తి 'బిరియాని' లాంటివి ఆకర్షించలేకపోయాయి. సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో అనుష్క, ఆర్య నటించిన భారీ గ్రాఫిక్స్‌ చిత్రం 'వర్ణ' నిర్మాణానికీ, రిలీజుకూ ఏళ్ళూ పూళ్ళూ పట్టింది కానీ, డబ్బాలు వెనక్కి పంపడానికి మాత్రం ప్రేక్షకులు ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. ఇక, అనువాదాలుగా వచ్చిన బాలీవుడ్‌ భారీ చిత్రాలైన హృతిక్‌ రోషన్‌ 'క్రిష్‌-3', అమీర్‌ఖాన్‌ యాంటీ హీరోగా నటించిన 'ధూమ్‌-3'లు తెలుగులోనూ మంచి వసూళ్ళే రాబట్టాయి. 

మొత్తం మీద ఈ ఏడాది కొసరు తెలుగు చిత్రాల కన్నా అసలు తెలుగు చిత్రాలే ఎక్కువగా రావడం, ఆదరణ పొందడం, చిన్న చిత్రాల జోరు పెరగడం విశేషం. మునుపే అందుబాటులోకి వచ్చిన 5డి కెమేరా లాంటి పరిజ్ఞానాలు ఈ ఏడాది మరింత విస్తరించి, తక్కువ ఖర్చుతో డిజిటల్‌గా సినిమా తీసేందుకు ఉత్సాహం పెంచాయి. అలాగే, తళుకుబెళుకుల సినీ లోకంలో సక్సెస్‌ పరిమితమే అయినా, దర్శకత్వ, నిర్మాణ, నట, సాంకేతిక విభాగాల్లో కొత్త నీరు రావడం పెరుగుతోంది. ఈ ధోరణి రానున్న 2014లోనూ కొనసాగే సూచనలున్నాయి. మరి, ఇవన్నీ తెలుగు సినిమా మరో అడుగు ముందుకు వేయడానికి తోడ్పడితే అంతకన్నా ఏం కావాలి! ఎంతైనా, ఈ ఏటి అత్యంత పాపులర్‌ డైలాగ్‌ ధోరణిలో చెప్పాలంటే, ''...లాస్ట్‌ పంచ్‌ మనదైతే దాని కిక్కే వేరప్పా!'' కాదంటారా?
-   రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 29th Dec 2013, Sunday Supplement, Pg 9 to 11)
.....................................................

Saturday, April 5, 2014

ఒకే టికెట్‌పై నాలుగైదు సినిమాలు ('బాద్‌షా' - సినిమా రివ్యూ)

వైకుంఠ ఏకాదశికీ, మహాశివరాత్రికీ జనం రాత్రి పూట అంతా జాగారర చేయడం 

కోసం ఒకే టికెట్‌పై రెండు సినిమాలు వేసే  పద్ధతి తెలుగునాట బాగా ప్రాచుర్యంలో 

ఉండేది. దర్శకుడు శ్రీను వైట్ల తన తాజా చిత్రం బాద్‌షా తో ఆ పద్ధతిని ఈ వేసవి 

మొత్తానికి విస్తరింపజేశారు. చిన్న ఎన్టీయార్‌ హీరోగా, బండ్ల గణేశ్‌ నిర్మాతగా 

రూపొందిన ఈ వేసవి వినోద చిత్రంలోని విశేషం అదే !


హీరో గారు తన కుటుంబానికి శోకం మిగిల్చిన విలన్ల బృందాన్ని, అందులోనూ 
మాఫియా ముఠాను అంతం చేయడానికి కత్తులు నూరి, విమానాలెక్కి విదేశాలు 
వెళ్ళిన సినిమాలు మనం ఎన్ని చూడలేదు! మరి, హీరోయిన్‌ను కావాలని ప్రేమ 
ముగ్గులోకి దింపి, ఆమెను ప్రేమించేలా చేసుకొన్న హీరో కథ... కూడా చాలాసార్లే చూసేశాం. ప్రేమించిన హీరోయిన్‌ను వేరెవరికో కట్టబెడుతుంటే, ఆ పెళ్ళిని హీరో 
చెడగొట్టే ఉప కథ అయితే, ఎన్నిసార్లు తెర మీదకొచ్చిందో లెక్కే లేదు. ఇక, 
సినిమా అంతా హీరో ఓ రౌడీ లాగానో, మాఫియా డాన్‌ లాగానో కనబడుతూ, 
ఆఖరికి  పోలీసు డ్రెస్‌లో ప్రత్యక్షమవడమనే ట్విస్టు అంటారా... పోకిరి తాతల 
రోజుల నుంచి తెరపై కనిపించిన ఫార్ములాయే! ఇవన్నీ సవాలక్ష సినిమాల్లో, 
వేర్వేరు  హీరోలతో కనిపించిన ఘట్టాలు. వీటన్నిటినీ ఒకే వంటలో ఒకే 
హీరోతో చేయించేస్తే, అది జూనియర్‌ ఎన్టీయార్‌ నటించిన బాద్‌షా.
కథగా చెప్పాలంటే...తండ్రి కోసం మాఫియాలోకి వచ్చిన కొడుకుగా బాద్‌షా
(జూనియర్‌ ఎన్టీయార్‌)ను పరిచయం కావడంతో సినిమా మొదలవుతుంది.
అక్కడ నుంచి అతను ఇటలీలోని జానకి (కాజల్‌ అగర్వాల్‌)ను కలుసుకోవడానికి
వెళ్ళడంతో, కథ అక్కడకు మారుతుంది. సానుకూల దృక్పథానికి సంబంధించిన
సవాలక్ష సూక్తులతో జీవితం గడిపేసే జానకిని ప్రేమలో పడేస్తాడు హీరో. ఆమె
చుట్టూ కథ కామెడీగా ఓ గంట నడిచిపోయాక, సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌ ఘట్టం
 మొదలవుతుంది. హీరో తండ్రి ధన్‌రాజ్‌ (ముఖేశ్‌ ఋషి) ఎవరు, మాఫియాలో
 పెద్దవాడిగా ఎదిగేందుకు హీరో గతంలో ఏం చేశాడన్న కథతో ఆ ఫ్లాష్‌బ్యాక్‌,
చిత్ర ప్రథమార్ధం ముగుస్తాయి. ద్వితీయార్ధానికి వచ్చేసరికి, హీరోయిన్‌కు పెద్దలు
 నిశ్చయం చేసిన పెళ్ళిని తప్పించి, ఆమెను తాను పెళ్ళాడడానికి అందరితో కలసి
హీరో ఇండియాకు వస్తాడు. ఓ పక్కన మ్యారేజ్‌ ఈవెంట్‌ ప్లానర్‌గా ఆ పని
చక్కబెడుతూనే, మరోపక్క మాఫియా డాన్‌ సాధూను హీరో ఎలా
ఎదుర్కొన్నాడన్నది మిగతా కథ. అసలు ఆ మాఫియా డాన్‌కూ, హీరోకూ
 మధ్య వార్‌ ఎందుకు మొదలైందన్నది మరో ఫ్లాష్‌బ్యాక్‌. హీరో అసలు రూపం
 ఏమిటన్నది క్లైమాక్స్‌లో దర్శక, రచయితలు వెల్లడిస్తారు.
ఈ చిత్ర కథంతా చూసేసరికి, గతంలో తెర మీద చూసేసిన పోకిరి, దూకుడు,
కింగ్‌ వగైరా చిత్రాల్లోని ఘట్టాలు గుర్తుకొస్తే అది ప్రేక్షకుల తప్పుకాదు. ఒక
ఫార్ములా క్లిక్‌ అయ్యాక, దాని నుంచి బయటపడడం ఎవరికైనా కొంత కష్టమే.
పైపెచ్చు సినిమావాళ్ళకు, అందులోనూ మన సగటు తెలుగు సినీ దర్శక -
రచయితలకైతే అది మరీ కష్టం. అందుకే కావచ్చు, ఈ చిత్ర కథా రచయితలు
 కోన వెంకట్‌, గోపీ మోహన్‌లు తమ పాత సినిమాల ఛాయల నుంచి
బయటపడలేకపోయారు. కథ వాళ్ళదంటూ టైటిల్‌ కార్డ్‌ వేసి, మరో ఇద్దరికి
కథా సహకారమని కూడా క్రెడిట్‌ ఇచ్చిన ఈ చిత్ర కథ ఇప్పటికే తెర మీద చూసేసిన
సవాలక్ష చిత్రాలను కలిపి చేసిన పంచకూళ్ళ కషాయం.
పాత్రధారుల సంగతికొస్తే, హీరో చిన్న ఎన్టీయార్‌ తన నేర్పుతో పాత్రలోని రకరకాల
మార్పులను పండించారు. వెడ్డింగ్‌ ప్లానర్‌ రామ్‌ వేషంలో వచ్చినప్పుడు తెలంగాణ
 మాండలికంలో మాట్లాడడం లాంటి బిజినెస్‌ ఎత్తుగడలూ పోయారు. ఎప్పటిలానే
నృత్యాల్లో, డైలాగ్‌ డెలివరీలో తన ప్రత్యేకత నిలబెట్టుకున్నారు. బంతి ఫిలాసఫీతో
నడిచే హీరోయిన్‌ పాత్ర చిత్రణ, పొగడ్తలు ఇష్టం లేవంటూనే ప్రశంసల కోసం అర్రులు
చాచే ఆమె వైఖరి నవ్విస్తాయి. కాజల్‌ ఉన్నంతలో బానే చేశారు. కానీ, పొడుగ్గా
కనిపించే ఆమె తెరపై హీరో పక్కన అంతగా అమరలేదు. విలన్లుగా ఆశిష్‌
విద్యార్థి, వగైరా ఎందరో ఉన్నా ప్రేక్షకుల మనస్సుపై ముద్ర వేసే ప్రదర్శనలు తక్కువే!
మిగిలిన పాత్రధారులూ కథానుసారం కనిపించి, వెళ్ళేవారే!
నిజానికి, ఈ సినిమాకు పేరున్న ఇతర హీరోల సహకారమూ చాలానే ఉంది. హీరో
మహేశ్‌బాబు ఈ చిత్ర కథను నేపథ్యంలో నుంచి తన గళం ద్వారా వినిపిస్తారు. యువ
హీరో సిద్ధార్థ్‌ సైతం రెండు మూడు సన్నివేశాల్లో అతిథి పాత్రలో కనిపిస్తారు. ఇంకో
హీరో నవదీప్‌ ఇందులో నెగటివ్‌ టచ్‌ ఉన్న పాత్ర పోషించారు. అలాగే, పోలీసు
ఉన్నతాధికారిగా నాగబాబు, హీరో తల్లిగా సుహాసిని, పోలీసు ఇన్ఫార్మర్‌గా రాజీవ్‌
కనకాల, హీరో అనుచరుడిగా షఫీ, ఇటలీలో హీరో సహచరుడు దాసుగా వెన్నెల కిశోర్‌
- ఇలా సుపరిచిత ముఖాలెన్నోసినిమాలో ఎదురవుతాయి. క్యాస్టింగ్‌తో పాటు ఖర్చు
 కూడా తెరపై భారీగానే కనిపిస్తున్నా, ఆ సానుకూలత అంతా ఈ సినిమా కథ,
కథనంలోని కన్ఫ్యూజన్‌తో కొట్టుకుపోయింది. ప్రధానమైన బలం ఈ సినిమాకు
ఉన్నంతలో కామెడీయే. దర్శకుడు శ్రీను వైట్ల ఎప్పటిలానే వినోదం మీద ఎక్కువ
దృష్టే పెట్టారు. దాస్‌గా వెన్నెల కిశోర్‌, దర్శకుడు రివెంజ్‌ నాగేశ్వరరావుగా ఎమ్మెస్‌
నారాయణ, పోలీసు పద్మనాభ సింహగా బ్రహ్మానందం కనిపించే ఘట్టాలు జనానికి
కాలక్షేప హాస్యాన్ని అందిస్తాయి. ఆ దర్శకుడి వేషం ఏ టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖుణ్ణి
దృష్టిలో పెట్టుకొని రాసిందో ఇట్టే అర్థమైపోతుంది. ఇవాళ సగటు పెద్ద హీరోల సినిమాలన్నిటి
లానే ఈ చిత్రంలోనూ ఒక్కొక్కరు రాసిన ఒక్కో వెర్షన్‌ డైలాగుల నుంచి
దర్శకుడు తనకు కావాల్సిన ముక్కలేవో అక్కడొకటి, అక్కడొకటిగా ఏరుకున్నట్లున్నారు.

అందుకే, ''మాటలు - కోన వెంకట్‌'' అని టైటిల్‌ కార్డు వేసినా, మళ్ళీ ''స్క్రీన్‌ప్లే,
మాటలు, దర్శకత్వం - శ్రీను వైట్ల'' అని క్రెడిట్‌ తీసుకున్నారు. ఏమైనా,
''తన భద్రతను గురించి ఆలోచించేవాడు కుక్కను  పెంచుతాడు. సమాజం
గురించి ఆలోచించేవాడు మొక్కను పెంచుతాడు'' (హీరోయిన్‌), ''సమస్యనేది
బంతి లాంటిది. దగ్గర నుంచి చూస్తే పెద్దదిగా కనిపిస్తుంది. దూరానికి
విసిరేస్తే చిన్నదైపోతుంది'' (హీరోయిన్‌) లాంటివి సందర్భానుసారంగా
నవ్విస్తాయి. ఫస్టాఫ్‌ కాసేపు నవ్వించినా, ఫ్లాష్‌ బ్యాక్‌ ఘట్టం
నుంచి గాడి తప్పినట్లు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కామెడీ ఘట్టాలు
మినహా, మిగతాదంతా మాఫియా గోలగానే నడుస్తుంది.
కానీ, బలహీనతలదే పైచేయి అయింది. అర్ధ ఘడియకో పాట,
అది అయిన కాసేపటికో ఫైటు అన్న రొటీన్‌ చట్రంలోనే
ఈ సినిమా కూడా తిరిగింది. పాటలు, బాణీల్లో గుర్తుండేవీ,
గుర్తుంచుకోదగ్గవీ ఏవీ లేవు. గాయకుడు బాబా సెV్‌ాగల్‌
పాడిన బంతి పూల జానకీ నీకంత సిగ్గు దేనికీ... వైవిధ్యంగా
వినిపిస్తుంది. ఇది కాక, మాస్‌ ప్రేక్షకుల కోసం అన్నట్లుగా
సినిమాలో నా పైటే పచ్చని జెండా నీ కోసం తెచ్చా కలకండ...
అంటూ ప్రత్యేక నృత్య గీతమూ పెట్టారు. నటిస్తున్నది
చిన్న ఎన్టీయార్‌ కాబట్టి, అతని తాతయ్య అయిన
 పెద్ద ఎన్టీయార్‌ను గుర్తు చేస్తూ, సినిమాలో డైలాగులు,
పాత హిట్‌ పాటల కదంబం, 'జస్టిస్‌ చౌదరి' గెటప్‌ వగైరా
జిమ్మిక్కులన్నీ వాడారు. కె.వి. గుహన్‌ ఛాయాగ్రహణం,
ఎం.ఆర్‌. వర్మ ఎడిటింగ్‌ కథకు తగ్గట్లు నడిచినవే.
ఒక్క ముక్కలో చెప్పాలంటే, మాఫియాలో ఒకడుగా కనిపిస్తూ,
ఆ మాఫియా మొత్తాన్నీ ఏరిపారేసే రామారావు అలియాస్‌
బాద్‌షా (చిన్న ఎన్టీయార్‌) కథ ఇది. దానికి దర్శకుడు
 కాస్తంత కుటుంబ సెంటిమెంట్‌ కలిపారు. హాస్యం కూడా
చాలానే మిళాయించారు. అయితే, కథనే కాసేపు ఇటలీలో,
కాసేపు హ్యాంగ్‌కాంగ్‌లో, మరికాసేపు హైదరాబాద్‌లలో నడిపించి,
బోలెడంత గందరగోళం సృష్టించారు. లెక్కలేనంత మంది
విలన్‌లు... ఎవరు, ఏమిటో, ఏం చేస్తున్నారో, ఎందుకు
చేస్తున్నారో అర్థం చేసుకొందామనుకొనే లోపలే
 ప్రేక్షకుల సహనం చచ్చిపోతుంది.
తెలుగు సమాజంలో, జీవితంలో వేరే కథలే లేవన్నట్లు -
మన దర్శక, రచయితలు తరచూ మాఫియాలు, దుబారు
 డాన్‌ల పాత్రలనే అంటిపెట్టుకొని, ఆ కథలే ఎందుకు
అల్లుతున్నారో అర్థం కాదు. ఒక తుపాకీతో, ఒంటి చేత్తో
మన హీరో బుల్లెట్లు కురిపిస్తూ, గాలిలోకి ఎగురుతూ
పదుల సంఖ్యలోని మాఫియా మనుషుల్ని మట్టి కరిపించడం
ప్రతి సినిమాలో పదే పదే చూసేస్తున్న ఫార్సు.
బాద్‌షా కూడా అచ్చం అదే పంథాలో సా...గే చిత్రం.
కొసమెరుపు : సినిమా పతాక సన్నివేశంలో హీరోను చూసి ఆశ్చర్యపోతూ,
దర్శకుడు రివెంజ్‌ నాగేశ్వరరావు (ఎమ్మెస్‌ నారాయణ) పాత్ర హీరో గురించి
 ప్రస్తావిస్తూ, ''ఒకే క్యారెక్టర్‌లో ఇన్ని వేరియేషన్సా?'' అని నోరెళ్ళబెడతాడు.
రెండు గంటల నలభై నిమిషాల పైగా మధ్య మధ్యలో కామెడీతో తెరపై
 చాలా హింసను భరించిన ప్రేక్షకుడు కూడా హాలులో నుంచి బయటకొస్తూ
అనే మాట మాత్రం - 'ఒకే సినిమాలో ఇన్ని సినిమాలా' అనే!
- రెంటాల జయదేవ    
(Published in 'Praja Sakti daily, Saturday, 6th Apr 2013)
.................................................