తెలుగు తెరపై వచ్చిన తాజా మల్టీస్టారర్ చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద'. నటుడు, నిర్మాత మోహన్‌బాబు, ఆయన కుటుంబంలోని మిగిలిన ఇద్దరు హీరోలూ కలసి దీనిలో నటించారు. సంక్రాంతి తరువాత మళ్ళీ ఆకట్టుకొనే సినిమాలేవీ లేని సందర్భంలో వచ్చిన ఈ చిత్రం పేరులో తెలుగుదనాన్ని నింపుకొన్నా, మళ్ళీ పాత మూస కథాకథన ధోరణికే ఓటేసి, నిరాశపరిచింది.
.........................................................................................
చిత్రం: పాండవులు పాండవులు తుమ్మెద, తారాగణం: మోహన్‌బాబు, రవీనాటాండన్, విష్ణువర్ధన్‌బాబు, హన్సిక, మనోజ్, ప్రణీత, ముఖేశ్ ఋషి, సంగీతం: బప్పా బి. లహరి, అచ్చు, నేపథ్య సంగీతం: చిన్నా, రచన: బి.వి.ఎస్. రవి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్,
గోపీమోహన్, దర్శకత్వం: శ్రీవాస్
గోపీమోహన్, దర్శకత్వం: శ్రీవాస్
......................................................................................
కాలేజీలో ఉండగా ప్రేమించుకున్నా, జీవితంలో పెళ్ళి చేసుకోలేకోపోయిన వ్యక్తులు - నాయుడు (మోహన్‌బాబు), సత్య (రవీనా టాండన్). ఒకరికొకరు దూరమైనా, వేరే వాళ్ళ పిల్లల్ని సొంత బిడ్డలుగా పెంచుకుంటూ ఉంటారు. అనుకోకుండా చాలా కాలం తరువాత ఎదురైన వారిద్దరూ లేటు వయసులో భార్యాభర్తలవుతారు. టూరిస్టు గైడ్ నాయుడు పిల్లలు (మనోజ్, వరుణ్ సందేశ్, తనీశ్), సత్య పిల్లలు (విష్ణు, వెన్నెలకిశోర్)లు మొదట కారాలూ మిరియాలూ నూరుకున్నా, దగ్గరవుతారు. ఇంతలో వాళ్ళను ఒక్కటి చేసిన హనీ (హన్సిక) కోసం విలన్ల వేటతో ఓ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది కథ. ఫస్టాఫ్ అక్కడికి అయిపోతుంది.
సెకండాఫ్‌లో ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న ఆ విలన్ల కథేమిటి, వారి నుంచి కాపాడేందుకు హీరో కుటుంబమంతా వేసిన నాటకమేమిటన్నది సెకండాఫ్.
ఈ సినిమాకూ, హిందీ హిట్ 'గోల్‌మాల్ 3'కీ సంబంధం లేదని నటుడు మోహన్‌బాబు చెప్పారు కానీ, ఈ సినిమా ఫస్టాఫ్ అంతా 'గోల్‌మాల్ 3' కథే! సెకండాఫ్ మాత్రం ఇటీవలి కాలంలో మనకు అలవాటైన తెలుగు సినిమా ఫార్ములానే ఆశ్రయించింది. రచన చేసిన బి.వి.ఎస్. రవి, స్క్రీన్‌ప్లే రాసిన కోనవెంకట్, గోపీ మోహన్‌లు తమకు అలవాటైన హిట్ ఫార్ములా ఫక్కీలో వెళ్ళారు. విలన్ ఇంట్లో జరగనున్న హీరోయిన్ పెళ్ళిని హీరో, అతని బృందం ఆపడమనే రొటీన్ పద్ధతిలోనే కథ నడిపించారు. చిత్రం ఏమిటంటే, అరువు తెచ్చుకున్న హిందీ కథతో నడిచే ఫస్టాఫ్ కన్నా, అలవాటైపోయిన నడకలో సాగే సెకండాఫే కొంతలో కొంత మెరుగనిపించడం!
సెకండాఫ్‌లోనే కొద్దిగా వినోదమైనా ఉంది. నటుడు మోహన్‌బాబు వయస్సు మీద పడినా, తనదైన ఒకప్పటి డైలాగ్ డెలివరీ ఫక్కీని పండించేందుకు ప్రయత్నించారు. అందులోని ప్రయాస సినిమా మొదట్లో కనిపించేసినా, పోనూ పోనూ ఆయన తన పాత తరహాను నిలబెట్టుకున్నారు.
మంచు విష్ణు, అతని తమ్ముడు మనోజ్‌లలో నిజానికి మనోజ్‌దే ఎక్కువ నిడివి, గుర్తింపు ఉన్న పాత్ర అని చెప్పాలి. ఫస్టాఫ్‌లో అల్లరి అబ్బాయిగా, సెకండాఫ్‌లో అమ్మాయి వేషంలో, ఆ తరువాత పోలీసాఫీసర్ గెటప్‌లో మూడు భిన్నమైన తరహాల్లో ఆయన నటించారు. అది ఆయనకు మార్కులు తెస్తుంది. మోహన్‌బాబుకు జోడీగా నటించిన రవీనా టాండన్, విష్ణుకు జోడీ అయిన హన్సిక, మనోజ్‌కు జోడీ అయిన ప్రణీతల్లో కాస్తంత ఎక్కువసేపు తెరపై కనిపించేది హన్సికేే! కానీ, ఈ ముగ్గురు ఆటపాటల్లో కనిపించడానికే ఎక్కువగా ఉపయోగపడ్డారు. చిత్రకారుడు బాపు, గీత రచయిత సినారెల అభిమానిగా 'బాపురె' అని పేరు పెట్టుకున్న తెలుగు భాషాభిమానిగా బ్రహ్మానందం కాసేపు వినోదం అందిస్తారు. ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, 'తెలంగాణ' శకుంతల - ఇలా సినిమాలో చాలామందే కనిపించి వెళుతుంటారు.
సాంకేతిక విభాగాల పరంగా సినిమాలో ఆహా, ఓహౌ అని చెప్పుకోవడానికి ఉన్నవి తక్కువే. ఉన్నంతలో 1980ల నాటి తరహా డైలాగులైనా, మోహన్‌బాబు సంభాషణల్లో కొన్నిచోట్ల మెరుపులు మెరిశాయి. ఆ డైలాగుల్లో కొన్ని తాను స్వయంగా రాసుకున్నవే అని మోహన్‌బాబు ఆ మధ్య చెప్పారు. సంగీతం, సాహిత్యం సో సో గానే మిగిలిపోవడం ఓ మైనస్‌పాయింట్. అన్నదమ్ములు విష్ణు, మనోజ్‌లు ఇటు స్టంట్స్ విభాగంలోనూ, అటు కో- డైరెక్టర్లగానూ సినిమా చిత్రీకరణలో బాగానే వేలు పెట్టారు. పాండవుల అజ్ఞాత వాస కథ అయిన 'నర్తనశాల'ను సోషలైజ్ చేసిన సెకండాఫ్‌లో అనవసరమైన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటికి కత్తెర వేయడంలో ఎడిటర్, దర్శకుడు విఫలమైనట్లున్నారు. సినిమా తీయలేకపోయారో, తీసే స్వేచ్ఛ నిర్మాతల నుంచి అందుకోలేకపోయారో కానీ 'లక్ష్యం' చిత్ర ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వంలో చూపించిన మెరుపులేమీ లేవు. టైటిల్ వరకు తెలుగుదనం నింపడానికి ప్రయత్నించిన ఈ సినిమా వెరసి హిందీ, తెలుగు కథల కిచిడీగా మారింది. బ్యాంకాక్‌లోని ఫస్టాఫ్‌నూ, కౌరవపురం గ్రామంలో జరిగే సెకండాఫ్‌నూ బలవంతంగా కలిపి కుట్టారని అర్థమై పోతూ ఉంటుంది.
కొసమెరుపు: వెరసి, ఈ రెండు గంటల ముప్ఫై ఆరు నిమిషాల చిత్రం లక్ష్మీ ప్రసన్న లేదన్న లోటు మినహా అక్షరాలా మంచు మోహన్‌బాబు కుటుంబమంతా ఉన్న ఫ్యామిలీ ప్యాక్. కానీ, మధ్య మధ్య వచ్చే అసభ్య సన్నివేశాలతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవుతుందా అన్నది సందేహమే!
- రెంటాల జయదేవ
........................................................................
0 వ్యాఖ్యలు:
Post a Comment