‘బాహుబలి’ తాజా కబుర్లు
* మే 31నాటి తెలుగు ఆడియో రిలీజ్ వాయిదా.
* ట్రయిలర్ మాత్రం 31న నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేసే చాన్‌స?
* ప్రత్యేక హిందీ ట్రయిలర్ ముంబయ్‌లో జూన్ 1న.
* తమిళ ఆడియో విడిగా చెన్నైలో.
* ఫ్యాన్‌స వద్దకే ప్రభాసొచ్చే ప్లాన్?
* జూలై 10న సినిమా రిలీజ్
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బాహుబలి’ తెలుగు ఆడియో, ట్రైలర్‌ల విడుదల వాయిదా పడింది. మే 31 హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో వేలాది అభిమానుల మధ్య జరుపుదామనుకున్న వేడుక చివరకు అదే అభిమానుల సంఖ్య కారణంగా ఆగడం విచిత్రం. దాదాపు 35 వేల మంది ఫ్యాన్స్ ఫంక్షన్‌కు హాజరవుతారని అంచనా వేశారు. చిత్ర యూనిట్ అందుకు ఏర్పాట్లు చేస్తున్నా, గతంలో ‘గోపాల... గోపాల’, ‘బాషా’, ‘మిర్చి’ ఆడియో ఫంక్షన్లలో లాగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందంటూ పోలీసులు చెప్పారు.
పరిమిత సంఖ్యలో జనమైతే అనుమతి ఇస్తామన్నారు. బుధవారం సాయంత్రం ఈ విషయం తెలిసిందనీ, దాంతో కొందరినే అనుమతించి, వేలాది ఫ్యాన్‌సను నిరాశపరచడం ఇష్టం లేక ఆఖరి క్షణంలో తెలుగు ఆడియో రిలీజ్‌ను వాయిదా వేస్తున్నామనీ ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి తెలిపారు. పరిస్థితి అర్థం చేసుకొని, ఫ్యాన్‌స తమను క్షమించాలంటూ రాజమౌళి, హీరో ప్రభాస్, నిర్మాతల్లో ఒకరైన శోభూ యార్లగడ్డ అభ్యర్థించారు.
‘బాహుబలి’ చిత్రానికి సంబంధించి తొలిసారిగా పెట్టిన విలేకరుల సమావేశంలో గురువారం ఉదయం వారు ఈ విషయం ప్రకటించారు. ‘‘ఇప్పటి దాకా సినిమా రిలీజ్ డేట్లే వాయిదా వేయాల్సి వచ్చింది. దానిలాగే ఇప్పుడు ఆడియో రిలీజ్ కూడా అనుకోకుండా పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చింది’’ అని రాజమౌళి కొంత బాధగా అన్నారు. ‘మిర్చి’ ఆడియో తరువాత దాదాపు రెండున్నరేళ్ళుగా అభిమానుల ముందుకు రాని ప్రభాస్ సైతం ‘‘ఆడియో, సినిమా రిలీజ్‌లతో జనానికి దగ్గర కావాలని మేము కూడా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాం’’ అన్నారు. తెలుగు ఆడియో విడుదల ఎప్పుడు, ఎలా చేయాలి, ఫ్యాన్స్ రావడానికి ఇబ్బంది అయితే ఫ్యాన్స్ దగ్గరకే ప్రభాస్ వెళ్ళేలా వేర్వేరు ఊళ్ళలో చేయాలా అన్నది ప్లాన్ చేస్తున్నామని రాజమౌళి వివరించారు.
హిందీ ఆగదు...
ఇది ఇలా ఉండగా, హిందీ డబ్బింగ్ వెర్షన్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ట్రైలర్‌ను మాత్రం ముందుగా ప్లాన్ చేసినట్లే, జూన్ 1న ముంబయ్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తమిళ ఆడియోను చెన్నైలో ప్రత్యేకంగా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ‘‘బాహుబలి ఫస్ట్‌పార్ట్ రీరికార్డింగ్, సౌండ్ మిక్సింగ్ దాదాపు అయిపోయాయి. విజువల్ ఎఫెక్ట్స్ పనే జరుగుతోంది. తుది నిడివి 2.30 నుంచి 2.35 గంటల మధ్య ఉంటుంది. రెండో పార్ట్ షూటింగ్ 70 శాతం అయిపోయింది’’ అని రాజమౌళి వివరించారు.
ఈ చిత్రం కోసం టికెట్ రేట్లు పెంచమంటూ ప్రభుత్వాలను కలిసినట్లుగా వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ‘‘మేమెవర్నీ కలవలేదు. ఇలాంటి వార్తలు మాకిప్పుడు కామెడీగా ఉన్నాయి’’ అని రాజమౌళి నవ్వేశారు. కాగా, ఆడియో రిలీజ్ వాయిదా కూడా పబ్లిసిటీ స్టంట్‌లో భాగమా అని కొందరు రంధ్రాన్వేషణ చేస్తున్నారు. రాజమౌళి మటుకు, ‘మీడియా పుణ్యమా అని, ఈ సినిమాకు అద్భుతమైన పబ్లిసిటీ వచ్చింది. ఇప్పుడున్న హైప్ చూస్తే, ఇప్పటికే ఒక శాచురేటెడ్ స్థితికి పబ్లిసిటీ వచ్చింది. ఫ్యాన్స్ కోసమే తప్ప, హైప్ కోసమైతే ఇంత భారీ ఆడియో ఫంక్షన్ ప్లాన్ చేయాల్సిన అవసరమే లేద’న్నారు. ఎనీ డౌట్స్!
.................................
నలుమూలల నుంచి ఫ్యాన్స్ ప్రత్యేక బస్సుల్లో రావాలని ప్లాన్ చేసుకున్నాం. రెండేళ్ళ పై చిలుకు తర్వాత ప్రభాస్‌ను చూడవచ్చని ఆశపడ్డాం. తీరా ఆడియో వాయిదాతో మేము కొంత నిరుత్సాహపడ్డాం. పాటలు, సినిమా కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నాం.
- జె.ఎస్.ఆర్. శాస్త్రి, ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ సలహాదారు, గుంటూరు
........................................
‘కాన్స్’లో 10 నిమిషాలు చూపించాం!
దేశంలోకెల్లా అధిక బడ్జెట్ చిత్రాల్లో మా ‘బాహుబలి’ ఒకటి. అంకెలు వగైరా ఇప్పటికిప్పుడు చెప్పలేను. హిందీలో మా చిత్రాన్ని ఎవరైనా పెద్దవాళ్ళు తీసుకుంటే బాగుంటుందనిపించింది. కరణ్ జోహార్, ఆయన మిత్రుడు అనిల్ తడానీ వచ్చి మార్కెటింగ్, పబ్లిసిటీ, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెటింగ్ కోసం ఇటీవల ముగిసిన ఫ్రాన్స్ లోని కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ దగ్గర కొందరికి 10 నిమిషాల ‘బాహుబలి’ క్లిపింగ్ చూపాం. రెస్పాన్స్ బాగుంది.
- శోభూ యార్లగడ్డ, నిర్మాతల్లో ఒకరు
..................................
(Published in 'Sakshi' daily, 29th May 2015, Friday)
......................................
డియర్ మేరీ
2 months ago