జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, May 29, 2015

కొత్త సూర్యుడు (Exclusive Interview with Hero Surya)

హీరోగా ఎంతో సంపాదిస్తాం...
పేరు, ఇమేజ్, డబ్బు... ఎట్‌సెట్రా... ఎట్‌సెట్రా...
మరి, మనిషిగా ఏం సంపాదించాలి?
తెలుగునాడు దాకా విస్తరించిన తమిళ హీరో సూర్యను అడిగి చూడండి. చాలా చెబుతాడు... ‘ఎదిగినకొద్దీ ఒదిగి ఉండమ’నే ఫిలాసఫీకి నిదర్శనంగా నిలుస్తాడు. సినిమా నుంచి జీవితం దాకా కొత్త సూర్యుడు కనిపిస్తాడు.

 కొత్త సూర్యుడు
‘రాక్షసుడు’ చిత్ర ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన హీరో సూర్య

కొత్త దర్శకులు, కొత్త తరహా సినిమాలతో ఇటీవల తమిళ చిత్రసీమలో చాలా మార్పులొచ్చాయి.


గతంలో ప్రతి ఆరేడేళ్ళకు మార్పు వచ్చేది. ఇప్పుడు ప్రతి రెండున్నరేళ్ళకు ఐడియాల్లో, ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు వస్తోంది. మారుతున్న టెక్నాలజీ, ఇంటర్నెట్ వల్ల - షార్ట్ ఫిల్మ్స్‌ను యూ ట్యూబ్‌లో పెట్టడం, ఫిల్ము పోయి సినిమా డిజిటలైజ్ కావడం, 5డి కెమేరాతో కూడా సినిమాలు తీయడం, కోటి బడ్జెట్ లోపలే రెండు గంటల సినిమా తీయగలగడం సాధ్యమయ్యాయి. రెగ్యులర్ మెలోడ్రామా పక్కనపెట్టి, కొత్త కంటెంట్‌ను జనం కోరుతున్నారు. ఇదంతా వెల్‌కమ్ చేయాల్సిన మార్పు.
     
సమకాలీన తమిళ హీరోల గురించి మీరేమంటారు?

ఒకే కథ, స్క్రిప్ట్‌ను ఒక్కో హీరో, ఒక్కో దర్శకుడు ఒక్కో రకంగా తీస్తారు. అలాగే, కొత్త జనరేషన్ వాళ్ళు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే తీరు, వాళ్ళకు సినిమా ద్వారా చెప్పే విషయాలు, ఆ ఎక్స్‌ప్రెషన్స్ వేరుగా ఉంటాయి. ఒక యాడ్‌లా ఫాస్ట్‌గా చెప్పాలనుకుంటారు. ఎమోషన్ ఒక్క సెకన్‌లో అలా వచ్చి, వెళ్ళిపోవాలి. ఎమోషన్స్‌ను ఎక్స్‌టెండ్ చేయకూడదు. ఇప్పుడంతా టీ-20 జనరేషన్.
    
న్యూ జనరేషన్ సినిమాకు మీరెలా సిద్ధమవుతున్నారు?

ఒకటే మంత్రం. కొత్త ఆలోచనల్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉండాలి. కొత్త దర్శకులతో పనిచేయాలి. వాళ్ల కొత్త ఐడియాలతో, ఎడ్వెంచరస్‌గా ముందుకెళ్ళాలి.

ఈ సినిమాను మీరే నిర్మించడానికి కారణం?

మలయాళంలో వచ్చిన ‘హౌ ఓల్డ్ ఆర్ యు’ నచ్చి, ‘జో’ మళ్ళీ తెర మీదకు రావాలంటే ఇలాంటి బలమైన ఉమన్ సెంట్రిక్ ఫిల్మే సరైనదని రీమేక్ చేశాం. నిర్మాణం మరొక రికి అప్పగించి, రాజీ పడే కన్నా బాగా తీసి, జనానికి మంచి కంటెంట్ ఇవ్వాలనుకుని, సొంతంగా నిర్మించా. చాలామంది స్త్రీలకు స్ఫూర్తి నిస్తోంది. పత్రికలన్నీ ‘ఎల్లా ఆన్గళుమ్ పార్క వేండియ పడమ్’ (మగవాళ్ళంతా చూడాల్సిన సినిమా) అని రాశాయి.  
   
తెలుగులో రిలీజ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా?

‘జో’కు ఇక్కడ మంచి మార్కెటుంది. జనానికి తను బాగా తెలుసు. రీమేక్ చేయలేను. డబ్ చేయాలనుంది.

రానున్న మీ చిత్రం తమిళంలో ‘మాస్’, తెలుగులో ‘రాక్షసుడు’ అంటున్నారు. సంబంధమే ఉన్నట్లు లేదు.

(నవ్వేస్తూ...) రెండు టైటిల్స్‌కూ అండర్ కరెంట్‌గా ఒక సంబంధం ఉంది. తమిళంలో నా పాత్ర పేరు - మాసిలామణి. అందుకు తగ్గట్లుగా అక్కడ ‘మాస్’ అని పెట్టాం. తెలుగులో హీరో నాగార్జున గారు ‘మాస్’ పేరుతో ఒక సూపర్‌హిట్ చిత్రం చేసేశారు. దాంతో, కథకూ, పాత్రకూ తగ్గట్లు ‘రాక్షసుడు’ అని పెట్టాం.

ఈ సినిమా హార్రర్ అనీ, థ్రిల్లర్ అనీ రకరకాలుగా...  

దర్శకుడు వెంకట్ ప్రభు కానీ, నేను కానీ గతంలో ఎప్పుడూ చేయని తరహా సినిమా. ఇది హార్రర్ సినిమా కాదు. దెయ్యాలు, భూతాల లాంటివి ఉండవు. భయ పెట్టే యాక్షన్ థ్రిల్లర్, ఎంటర్‌టైనర్ అని చెప్పవచ్చు.

నయనతారతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?

‘గజిని’తో మొదలుపెడితే... నయన్‌తో నాకిది మూడో సినిమా. ఆమెలో ఎంతో మెచ్యూరిటీ వచ్చింది. ఆమె నడుచుకుంటూ వచ్చి, కెమేరా ముందు నిల్చొనే విధానం, పనిచేసే తీరు ఎంతో మారింది. 

మీరు, దర్శకుడు వెంకట్ ప్రభు మంచి ఫ్రెండ్సనుకుంటా?

(నవ్వుతూ...) మేమిద్దరం స్కూల్‌మేట్లం. అతను నా కన్నా కేవలం నాలుగు నెలలు చిన్న. అయినా సరే, నన్ను ‘అన్నా’ అని పిలుస్తాడు. (నవ్వులు...) నన్ను అలా పిలిచే మొట్టమొదటి దర్శకుడు అతనే! నేను, మహేశ్‌బాబు, వెంకట్ ప్రభు, యువన్ శంకర్‌రాజా, కార్తీక్ రాజా, తమ్ముడు కార్తీ - మేమందరం చెన్నైలో సెయింట్ బీట్స్ స్కూల్‌లో చదువుకున్నవాళ్ళమే. సినిమా అంటే దర్శకుడితో దాదాపు పది నెలలు కలిసి ప్రయాణించాలి. ముందు నుంచి స్నేహితులం కాబట్టి, మేము కలిసి పనిచేయడం ఈజీ అవుతుంటుంది.

మీరు, మహేశ్, వెంకట్ ప్రభు కలసి చేయనున్నారని...

(నవ్వేస్తూ...) అది మహేశ్‌బాబుతో కాదు. రవితేజ సార్, నేను, వెంకట్ ప్రభు కలసి సినిమా చేయాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్ళలేదు.

సినిమా కథలో దర్శకుడికి కరెక్షన్స్ చెబుతారట!

 (ఒక్క క్షణం ఆగి...) అలాగని కాదు... దర్శకుల శక్తిసామర్థ్యాలు, వాళ్ళు అంతకు ముందు చేసిన ప్రాజెక్ట్‌లు నాకు తెలుసు. కాకపోతే, వాళ్ళ బెస్ట్ నా సినిమాకు ఇచ్చేలా చేయాలని చూస్తుంటా. ఆ విషయంలో నేను కొంత స్వార్థపరుణ్ణి. (నవ్వులు...) అందుకే, ఆ సినిమా కథ, స్క్రీన్‌ప్లే పరిధిలోనే ఎంత వరకు వెళ్ళవచ్చు, ఏయే కొత్త ఎలిమెంట్స్ తీసుకొచ్చి కలపవచ్చనేది చూస్తుంటాం. బేసిక్‌గా నా సబ్జెక్ట్‌లు నా కన్నా పెద్దవిగా ఉండాలని కోరుకుంటా. అంతే తప్ప నేను స్క్రిప్ట్‌నూ, కథనూ డామినేట్ చేయాలనుకోను.
     
మీకు గ్రాఫిక్స్ మీద అవగాహన ఉందట?

అంతలేదు. ‘అదెల్లా ఓవర్ బిల్డప్ సర్!’ (అదంతా మరీ ఓవర్‌గా బిల్డప్ ఇవ్వడం సార్). నాకో మంచి ఫ్రెండ్ ఉన్నాడు. అతను లండన్ వెళ్ళి, 15 ఏళ్లు అనుభవం సంపాదించి, చెన్నైకి తిరిగివచ్చాడు. అతను నా తాజా సినిమా గ్రాఫిక్స్‌కు హెల్ప్ చేశాడు.  
     
సినిమా మీద ఇంత అవగాహన ఉంది. దర్శకత్వం చేపట్టే ఛాన్సుందా?

నాట్ ఎట్ ఆల్! అయామ్ హ్యాపీ విత్ మై డెరైక్టర్స్. కాకపోతే, నేను నటించలేకున్నా, మంచి విషయం ఉన్న చిన్నతరహా సినిమాలను నిర్మించాలని అనుకుంటున్నా. ఎందుకంటే, అలాంటి కథల్ని మన హీరో ఇమేజ్‌కు తగ్గట్లు మార్చడం, విషయాన్ని డైల్యూట్ చేయడం సరైనది కాదు. అందుకే, ఆ సినిమాల్లో నేను నటించకుండా, కేవలం నిర్మించాలనుకుంటున్నా.

ఆస్కార్ సినిమాలు చూస్తుంటారా? ఇటీవల నచ్చిన హాలీవుడ్ హీరోలు?

అంత లెవల్ లేదు సార్! నిజం చెప్పాలంటే, నేను అంత శ్రద్ధగా, రోజూ రాత్రి హాలీవుడ్ సినిమా చూసి పడుకొనే రకం కాదు. ఎక్కువగా స్క్రిప్టులు చదువుతుంటా. ప్రాంతీయ భాషా సినిమాలు చూస్తుంటా. వాటి గురించి తెలుసుకుంటూ ఉంటా. అంతే తప్ప, విదేశీ సినిమాలను చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అవడం ఉండదు. ఆ మధ్య ఆస్కార్ వచ్చిన ‘బర్డ్ మ్యాన్’ చూశా. బాగుంది. కాకపోతే, ఆ సినిమా బాగా అర్థం కావడానికి, ఆ పాత్ర లాగా కనిపించడానికి అతని ప్రయత్నం గురించి అర్థం చేసుకోవడానికి ఒకటికి, నాలుగుసార్లు చూడాలి.
     
మీ ఇంట్లోనే తమ్ముడు కార్తీ నుంచి మంచి పోటీ! నటుడిగా మీకూ, అతనికీ పోలికలు, తేడాలు?

కార్తీ సినిమాలు తెగ చూస్తాడు. స్క్రీన్‌ప్లే, స్క్రిప్ట్, షాట్ డివిజన్ లాంటివి బాగా ఎనలైజ్ చేయగల సమర్థుడు. ఆ విషయంలో వాడికి నా కన్నా బెటర్ నాలెడ్జ్ ఉంది. నిజానికి, వాడు దర్శకుడు కావాలనుకున్నాడు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. అందుకే, వాడికి సినిమా మేకింగ్‌లో విషయాలు తెలుసు. ఫలానా షాట్ ఎలా తీశారనేది అబ్జర్వ్ చేసి, అప్రీషియేట్ చేయడం ఒక్కోసారి నాకు తెలియదు. కానీ, కార్తీ అలా కాదు. వాడు సినిమాలు ఎంచుకొనే విధానం నాకు నచ్చుతుంది. వాడైనా, నేనైనా మా దగ్గరకొచ్చిన ఏ మంచి స్క్రిప్ట్‌నూ వదులుకోం. నాలుగైదేళ్ళుగా చేస్తున్నదదే.

ధనుష్ లాగా బాలీవుడ్‌కు వెళ్ళాలని మీకెప్పుడూ అనిపించలేదా?

నేనిక్కడ హ్యాపీగా ఉన్నా. ఇక్కడ ఎలాంటి వ్యాక్యూమ్ లేదు. అలాంటప్పుడు ఇక్కడ వదిలేసి, మరోచోటికి వెళ్ళడమెందుకు?
     
మీ కుటుంబం సేవాకార్యక్రమాలు చేస్తారనీ, దిగువ తరగతికి చెందిన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తున్నారనీ విన్నాం.

అవును. ‘అగరమ్ ఫౌండేషన్’ (అగరమ్ డాట్ ఇన్) అని సంస్థను 2006లో ప్రారంభించాం. 2010 నుంచి దానిలో ‘విదై’ అని ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ ప్రారంభించాం. అందులో గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివే ఫస్ట్ జనరేషన్ కిడ్స్‌ను ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళు కాలేజ్ చదువు దాకా వెళ్ళి, డిగ్రీ పూర్తి చేసేవరకు సమస్తం మేము సమకూరుస్తాం. పిల్లలకు సైకోమెట్రిక్ టెస్ట్‌లు కూడా పెట్టి, వాళ్ళకు ఏది బాగా వస్తుందో ఆ కోర్సులో చేర్పిస్తాం. వాళ్ళకు ఏదో ఫీజు కట్టేసి వదిలేయడం కాకుండా, వాళ్ళు ప్రొఫెషనల్ డిగ్రీ చదివే నాలుగేళ్ళూ వాళ్ళ గురించి పట్టించుకొనే వలంటీర్లు ఉంటారు. ప్రతి వారం వాళ్ళకు వర్క్‌షాపులు పెడతాం. ఐ.ఎ.ఎస్. ఆఫీసర్లతో ఇంటరాక్షన్ పెడతాం. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుస్తాం. అలా సమగ్రమైన విద్యను అందించడం మా ప్రాజెక్ట్ లక్ష్యం. దాని వల్ల వాళ్ళు బాగా చదువుకొని, మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మళ్ళీ ‘అగరమ్’కు వచ్చి, వలంటీర్లుగా పనిచేస్తున్నారు. నటులుగా కన్నా, వ్యక్తులుగా మా కుటుంబానికి ఎక్కువ తృప్తినిస్తున్న పని ఇది.


మీ నాన్న గారైన... ఆ తరం ప్రముఖ హీరో శివకుమార్ ప్రభావం మీ మీద ఏ మేరకు ఉంది?

నాన్న గారి ప్రభావం చాలా ఉంది. మాలోని మంచి లక్షణాలన్నిటికీ మా అమ్మా నాన్నే కారణం. మాకు కొన్ని విలువలు నేర్పారు. చాలామంది నటీనటుల జీవితాల్లో ఏం జరిగిందో మా నాన్న గారు మాతో పంచుకునేవారు. ‘ఈ ఇమేజ్, ఈ జీవితం అంతా ఒక నీటి బుడగ లాంటిది. ఏ క్షణమైనా ఈ బుడగ పేలిపోతుంది. కోట్ల మంది చూసి, మెచ్చుకొనే సినీ జీవితం ఒక అదృష్టం. అయితే, అంతా మన ప్రతిభ అనుకొంటే పొరపాటు. మనకు తెలియని అతీత శక్తి ఆశీర్వాదం వల్ల ఈ పేరు ప్రతిష్ఠలు, డబ్బు వచ్చాయని గ్రహించాలి. ‘సక్సెస్, ఫెయిల్యూర్... ఏదీ శాశ్వతం కాదు. ప్రతిదీ వెళ్ళిపోతుంద’ని గుర్తుంచుకోవాలి’ అని చెబుతుంటారు. అదే నా జీవన సూత్రం.
- Rentala Jayadeva

(Published in 'Sakshi' daily, Family Page, 21st May 2015, Thursday)
...............................................

0 వ్యాఖ్యలు: