తమిళ చిత్రాల్లో పేరు తెచ్చుకున్న నటి మోనిక ఇప్పుడు ఇస్లామ్ మతం స్వీకరించారు. అందుకు తగ్గట్లే తన పేరును ఎం.జి.రహీమాగా మార్చుకున్నారు. ఇకపై, సినిమాల్లో నటించనంటూ, నటనకు గుడ్‌బై చెప్పేశారు. ఈ హఠాత్పరిణామానికి కారణం ఏమిటన్నది ఆమె చెప్పలేదు కానీ, మతం మార్చుకున్న విషయాన్ని శుక్రవారం నాడు చెన్నైలో పత్రికా విలేకరులకు తెలియజేశారు. చిన్న వయసులోనే బాలనటిగా మొదలుపెట్టి నాయిక పాత్రల దాకా ఎదిగిన మోనిక తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 70 దాకా చిత్రాల్లో నటించారు.
‘‘బాల నటిగా మొదలైన నేను ఇన్నేళ్ళుగా సినీ రంగంలో విజయవంతంగా కొనసాగడానికి కారణమైన వారందరికీ కృతజ్ఞతలు. ఈ రంగాన్ని వదిలివెళ్లడం కష్టంగా ఉన్నా, తప్పడం లేదు’’ అని ఆమె ప్రకటించారు. అదే సమయంలో, ‘‘డబ్బు కోసమో, ఏదో ప్రేమ వ్యవహారం కోసమో నేను మతం మార్చుకోలేదు. నేను అలాంటి అమ్మాయిని కాదు. ఇస్లామ్‌లోని అంశాలు నచ్చడం వల్లే మతం మారాను’’ అని మోనిక వివరించారు. పెళ్ళి గురించి వివరాలను త్వరలోనే చెబుతానని ఆమె అన్నారు. వెంకటేశ్ సూపర్ హిట్ ‘చంటి’ (1991)లో, తమిళ ‘సతీ లీలావతి’ (’95)లో బాల నటిగా చేసిన మోనిక పెద్దయ్యాక తెలుగులో ‘శివరామరాజు’, ‘మా అల్లుడు వెరీగుడ్’, ‘కొడుకు’, ‘పైసాలో పరమాత్మ’ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె నటించిన మూడు తమిళ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. సినిమాల్లోకి వచ్చాక మోనికగా పేరు మార్చుకున్న రేఖా మారుతీరాజ్ ఇప్పుడిలా ఇస్లామ్ మతం పుచ్చుకోవడంతో మరోసారి పేరు మారినట్లయింది. (Published in 'Sakshi' daily, 31st May 2014, Saturday) ...............................................
వెండితెరపై కొన్ని పాత్రలకు కొంతమంది నటీనటులదే పేటెంట్. ఎన్నాళ్ళయినా, ఎన్నేళ్ళయినా ఆ పాత్రల పేర్లు చెప్పగానే వారే గుర్తుకొస్తుంటారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన అలాంటి పాత్రలంటే పౌరాణికాలే. ఇక, పాత్రధారి అంటే... పురాణ పాత్రలకు ప్రాణం పోసిన స్వర్గీయ నందమూరి తారక రామారావే స్ఫురిస్తారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీమహావిష్ణువు, పరమ శివుడు మొదలు ప్రతినాయకులైన రావణుడు, దుర్యోధనుడు దాకా ఏ పాత్ర పేరు చెప్పినా ఇవాళ్టికీ ఆయనే మదిలో మెదులుతారు. ముగ్ధమోహనరూపంతో, పాత్రోచితమైన ఆహార్యం, వాచికాలతో ఆనాడు వాళ్ళు అచ్చం ఇలాగే ఉన్నారేమో అని అందరూ అనుకొనేలా చేయడం ఆ మహానటుడు చేసిన అసాధారణ విన్యాసం. ఒక తెలుగు నటుడు వింధ్యకు ఇటు వైపునే కాక, అటు వైపునూ తన పాత్రలతో మెప్పించి, అంతర్జాతీయ సినీ చరిత్రకారులను సైతం అబ్బురపరచడం మనకు గర్వకారణమే. బెంగాలీయుల్ని కూడా కదిలించిన ఎన్టీఆర్ పౌరాణిక, జానపద చిత్రాలు, ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకున్న శాంతారామ్ లాంటి దర్శకులే అందుకు నిదర్శనం. పౌరాణికాలు, చారిత్రకాలు, జానపదాలు, సాంఘికాలు - ఇలా అన్ని తరహా చిత్రాల్లో మెప్పించినా, ముఖ్యంగా శ్రీకృష్ణుడంటే ఇప్పటికీ ఎన్టీఆరే.
1953లో షూటింగ్ మొదలైన ‘ఇద్దరు పెళ్ళాలు’లో మూడుపదుల వయసులో ఓ స్వప్నగీతంలో తెరపై కృష్ణుడిగా తొలిసారిగా కనిపించారాయన. అప్పటి నుంచి యాభై ఆరేళ్ళ వయసులో ‘శ్రీతిరుపతి వెంకటేశ్వర కల్యాణం’ (’79) దాకా ఇరవై ఏడేళ్ళ వ్యవధిలో ఒకే పాత్రను సుమారు 30 చిత్రాల్లో పోషించడం, జనాన్ని మెప్పించడం ఓ చరిత్ర. ప్రపంచ సినీ చరిత్రలో అలా ఒకే పాత్రను అన్నేళ్ళ పాటు చేసిన నటుడు ఇంకొకరు లేరు. ఇక, తెరపై ఓ నిర్దిష్టమైన వయసులోనే కనిపించే కృష్ణ పాత్రను వయసులో వచ్చిన మార్పులకు అతీతంగా మెప్పించడమూ ఆయనకే చెల్లింది. తెలుగునాట ఈ నటరత్నం జన్మించి, ఇవాళ్టితో 91 ఏళ్ళు నిండుతున్నాయి. ఇక, ఆయన తొలిసారిగా తెరపై శ్రీకృష్ణ పాత్రలో కనిపించి, ఈ ఏటితో 60 వసంతాలు పూర్తవుతున్నాయి. ఈ వజ్రోత్సవ పాత్రతో తెరపై ఆయన ఎప్పటికీ చిరంజీవే. (Published in 'Sakshi' daily, 28th May 2014, Wednesday) ........................................
కళా రంగం ద్వారా పైకొచ్చిన వ్యక్తులు తాము ఏ స్థాయికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా తమ మాతృరంగం మీద మమకారాన్ని మాత్రం వదులుకోలేరు. సినీ రంగానికి చెందినవారికి అది మరీ ఎక్కువగా వర్తిస్తుంది. అందుకనే, రాజకీయాల్లోకి వెళ్ళిన తరువాత కూడా సినీ ప్రముఖులు తమకు అంత గౌరవం తెచ్చిపెట్టిన చలనచిత్ర రంగం వైపు తరచూ ఆకర్షితులవుతూనే ఉంటారు. మొన్నటి ఎన్టీఆర్ నుంచి నిన్నటి జయప్రద దాకా ఆ ధోరణి చూస్తూనే ఉన్నాం. తాజాగా వెలువడుతున్న వార్తలను బట్టి చూస్తే, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కూడా ఆ బాటలోనే పయనిస్తున్నారు. సినీ రంగంలో అగ్రస్థాయికి చేరి, ఆనక రాజకీయాల్లోకి వెళ్ళిన చిరంజీవి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడైనా, ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం తరువాత కావాల్సినంత తీరిక దొరకడంతో తన తదుపరి చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఫిలింనగర్ వర్గాల కథనం. ఇప్పటికి 149 చిత్రాల్లో నటించిన చిరు ప్రతిష్ఠాత్మకమైన 150వ చిత్రానికి తన పుట్టిన రోజైన ఆగస్టు 22న శ్రీకారం చుడుతున్నట్లు భోగట్టా. ఎవరీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి? స్వాతంత్య్రానికి పూర్వం రాయలసీమ ప్రాంతంలో బ్రిటీషు పాలకులపై ధ్వజమెత్తిన వీరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఆ సినిమా తీయనున్నారని చెబుతున్నారు. కర్నూలు జిల్లా కోయిలకుంట్ల ప్రాంతానికి చెందిన వీరుడు ఆయన. అప్పట్లోనే కడప, అనంతపురం, బళ్ళారి, కర్నూలు పరిసరాల్లోని దాదాపు 66 గ్రామాలకు నేతృత్వం వహిస్తూ, సుమారు 2 వేల మంది బలగంతో బ్రిటీషు వారిని ఆయన ఎదిరించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి నిజామ్ నవాబు రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటీషు వారికి దత్తం చేసిన తరువాత, ఆ ప్రాంతం వారంతా తమ ఆదాయంలో కొంతభాగాన్ని బ్రిటీషు వారికి చెల్లించాల్సి వచ్చింది. దానికి నిరాకరించి, బ్రిటీషు వారితో పోరు సాగించి, ఆఖరుకు నమ్మకద్రోహుల వెన్నుపోటుతో తెల్లవారి చేత చిక్కి, ఉరికంబమెక్కుతాడు. ఇప్పటికీ జానపద గేయాల రూపంలో కథలు కథలుగా చెప్పుకొనే ఆ విప్లవ మూర్తి జీవితంలోని ఉత్తేజపూరితమైన చారిత్రక అంశాల ఆధారంగా ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ ఈ తాజా చిత్రానికి రచన సాగిస్తున్నారు. గతంలో చిరంజీవితో ‘ఠాగూర్’ లాంటి ప్రబోధాత్మక చిత్రం తీసిన వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తారట. చిరు తనయుడు రామ్‌చరణ్ తేజ్ స్వయంగా నిర్మించే ఈ చిత్రం కోసం ఇప్పటికే కెమేరామన్, స్టంట్‌మెన్‌తో సహా పలువురు సాంకేతిక నిపుణులను సైతం సంప్రదించి, వారిని సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. వరుసగా ఆఫర్లు... ఆఖరుగా ఏడేళ్ళ క్రితం 2007 జూలైలో ‘శంకర్‌దాదా జిందాబాద్’ చిత్రంలో పూర్తిస్థాయి హీరోగా చిరు కనిపించారు. ఆ తరువాత 2009లో రాజమౌళి ‘మగధీర’లో అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. ఇప్పుడీ కొత్త చిత్రం మొదలైతే అయిదేళ్ళ తరువాత ఆయన సెల్యులాయిడ్ పైకి వస్తున్నట్లు లెక్క. ఆగస్టులో మొదలుపెట్టి, సంక్రాంతి కల్లా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని భావిస్తున్నారు. నిజానికి, ఈ చిత్రం కన్నా ముందు దర్శకుడు గుణశేఖర్ తన ‘రుద్రమదేవి’ చిత్రంలో ఓ ప్రధాన భూమికను చిరుకు ఆఫర్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఆ ప్రతిపాదనను చిరు సున్నితంగా తోసిపుచ్చారు. అలాగే, ఈ మధ్య దర్శకుడు మణిరత్నం సైతం ప్రత్యేకంగా చెన్నై నుంచి వచ్చి చిరును కలిసి, కథ వినిపించారు. దాన్ని కూడా చిరు సుతారంగా పక్కనపెట్టేశారు. అయితే, కుమారుడు రామ్‌చరణ్ కోసం చెప్పిన కథకు మాత్రం ఆయన సుముఖత వ్యక్తం చేశారనీ, వీలైతే అందులో కాసేపు చిరు మెరుస్తారనీ మరో అనధికారిక వార్త. మొత్తం మీద, సినిమా ఏది, దర్శకుడెవరన్న అధికారిక సమాచారం కోసం కొన్నాళ్ళు ఆగాల్సి ఉన్నా, ఈ ఏడాది చిరు సినీ రంగ పునఃప్రవేశం మాత్రం ఖాయమన్నమాట. చిరు అభిమానులకూ, సగటు సినీ ప్రియులకూ ఇది మండు వేసవిలో మలయ మారుతమే! (Published in 'Sakshi' daily, 25th May 2014, Sunday) .......................................
భారతీయ సినిమాకు శత వసంతాలు పూర్తయి, అప్పుడే ఏడాది అయిపోయింది. అయితే, ప్రపంచంలోని అతి పెద్ద సినీ పరిశ్రమల్లో ఒకటైన మన సినీ రంగానికి సంబంధించి హంగామా మాత్రం తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల వాళ్ళు కూడా శత వసంత భారతీయ సినిమా గురించి మరింతగా తెలుసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకు తగ్గట్లే బ్రిటన్‌లో పుట్టి, అక్కడే పెరిగిన ప్రముఖ హాస్యనటుడు, సమాచార ప్రసార నిపుణుడు సంజీవ్ భాస్కర్ మన దేశానికి వచ్చి, ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారు. అందులో భాగంగా భారతీయ సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నారు.
తాజాగా ఆయన మన తెలుగు సినిమాకు సంబంధించి కూడా ఇంటర్వ్యూలు చేశారు. ‘మగధీర’, ‘ఈగ’, తాజాగా సెట్స్‌పై ఉన్న ‘బాహుబలి’ ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన సంచలన దర్శకుడు రాజమౌళి కూడా అలా ఇంటర్వ్యూ ఇచ్చిన వారిలో ఒకరు. రాజమౌళితో పాటు హీరో దగ్గుబాటి రానా, ఇంకా ‘బాహుబలి’ టీమ్‌లోని పలువురు నటులు, సాంకేతిక సిబ్బంది ఈ డాక్యుమెంటరీ కోసం తమ భావాలను పంచుకున్నారు. ‘‘గతంలో బి.బి.సి.లో వచ్చిన ‘ది కుమార్స్ ఎట్ నంబర్ 42’, ‘గుడ్‌నెస్ గ్రేషియస్ మి’ కామెడీ సిరీస్‌ల ఫేమ్ సంజీవ్ భాస్కర్ చిత్రీకరిస్తున్న నూరేళ్ళ భారతీయ సినిమా డాక్యుమెంటరీ కోసం ఆయనతో మాట్లాడాను. అది ఎంతో సంతోషాన్నిచ్చింది’’ అని రాజమౌళి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
గతంలో భారతదేశమంతటా తిరిగి, మన దేశం గురించి ‘ఇండియా విత్ సంజీవ్ భాస్కర్’ పేరిట డాక్యుమెంటరీ సిరీస్‌ను సమర్పించి, నటించిన అనుభవం యాభయ్యేళ్ళ సంజీవ్‌ది. అలా ఇప్పటి పాకిస్తాన్‌లోని తన తాతల నాటి ఇంటిని కూడా ఆయన చూసి వచ్చారు. బి.బి.సి.లో సమర్పించిన కామెడీ సిరీస్‌లతో పాటు ఈ డాక్యుమెంటరీ ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. కాబట్టి, ఆయన తీస్తున్న ఈ తాజా నూరేళ్ళ భారతీయ సినిమా డాక్యుమెంటరీ కూడా చరిత్రలో నిలిచిపోతుందని ఆశించవచ్చు. మరి, ఇన్నేళ్ళ మన సినిమా గురించి, అందులోనూ తెలుగు సినిమా గురించి నవతరం దర్శకుడు రాజమౌళి, ఇతర తెలుగు ప్రముఖులు తమ భావాలు పంచుకోవడం ఆనందించదగ్గ విషయమేగా! (Published in 'Sakshi' daily, 23rd May 2014, Friday) ........................................................
కొన్నేళ్ళ పాటు కథారూపంలోనే ఉండిపోయి, నిర్మాతలెవరూ చిత్రరూపమివ్వడానికి ముందుకు రాని ఓ స్క్రిప్టు ఆ తరువాతెప్పుడో తెరకెక్కడం విచిత్రమే. అన్నేళ్ళు ఆగిన ఆ కథతో వచ్చిన సినిమా సూపర్ హిట్టవడం విశేషమైతే, ఇక ఆ కథ ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా ఆరు భాషల్లో రీమేకై, హిట్టవడం మరో విశేషం. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు బిడ్డల్లో ఒకరు అమాయకులు, మరొకరు దేనినైనా ఎదిరించి నిలిచే ధైర్యవంతులైతే ఎలా ఉంటుందనే ఆ ఇతివృత్తం ఇప్పటికీ సగటు బాక్సాఫీస్ సినీ సూత్రం. దాన్ని వాటంగా వాడుకొంటూ శ్రీదేవి ‘చాల్ బాజ్’ (1989) లాంటి ఎన్నో సినిమాలు ‘ఫ్రీ మేక్’లుగా వచ్చాయి. చాలామటుకు విజయాన్ని చవిచూశాయి. మరి, ఈ సినిమాలన్నిటికీ మూలం మన తెలుగు సినిమా కావడం మనకు గొప్పే కదా! ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ‘రాముడు - భీముడు’ 1964 మే 21 విడుదలై, ఇవాళ్టికి యాభై వసంతాలు నిండుతున్నాయి. ఆకట్టుకొనే అభినయం, అలరించే సంగీత సాహిత్యాలతో ఇవాళ్టికీ తీపిజ్ఞాపకమైన ఈ స్వర్ణోత్సవ చిత్ర విశేషాల్లో కొన్ని... ఓ తల్లికి ఇద్దరు పిల్లలు. అనుకోకుండా పుష్కరాల్లో ఒకడు తప్పిపోతాడు. మిగిలిన ఒక్కడూ అపురూపంగా పెరిగి అమాయకుడైతే, ఎవరికో దొరికిన రెండో పిల్లాడు బీదరికంలో పెరిగినా, ధైర్యవంతుడవుతాడు. పెరిగి పెద్దయిన వీళ్ళిద్దరూ చిత్రమైన పరిస్థితుల్లో ఒకరి స్థానంలోకి మరొకరు వెళతారు. అప్పుడు జరిగిన నాటకీయ సంఘటనలేమిటి? వారిద్దరూ అన్నదమ్ము లుగా ఎలా కలిశారు? దుర్మార్గుల ఆటలు ఎలా కట్టాయి? ఇదీ ఎన్టీఆర్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ‘రాముడు - భీముడు’ చిత్ర కథాంశం. ఇది సాంఘిక చిత్రమే కానీ, రచయిత డి.వి. నరసరాజు మొదట దీన్ని జానపద కథగా అల్లారు. ‘ప్రిజనర్ ఆఫ్ జెండా’, వేదం వెంకట రాయశాస్త్రి రచన ‘ప్రతాపరుద్రీయం’ లాంటి వాటి స్ఫూర్తితో ఆ కథ అల్లారు. ఆ తరువాత ఈ జానపదాన్ని సాంఘిక కథగా మార్చారు. నలుగురైదుగురు దర్శక, నిర్మాతల దగ్గర తిరిగినా కెమేరా ముందుకు రాని ఈ కథ తాపీ చాణక్య దర్శకత్వంలో, డి. రామానాయుడు చేతిలో పడ్డాక, బాక్సాఫీస్ ఫార్ములా అయి కూర్చుంది. రీమేక్‌లో ఇదో రికార్డు!:
ఇవాళ దేశంలోని అనేక భాషల్లో సినిమాలు నిర్మించి, శతాధిక చిత్ర నిర్మాతగా ‘దాదాసాహెబ్ ఫాల్కే’ స్థాయికి ఎదిగిన డి. రామానాయుడు ‘సురేష్ ప్రొడక్షన్స్’ పతాకంపై నిర్మించిన తొలి సినిమా ఈ ‘రాముడు - భీముడు’. అంతకు ముందు ఇతరుల చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ‘అనురాగం’ అనే ఓ చిత్రానికి పెట్టుబడి పెట్టి డబ్బులు పోగొట్టుకున్న ఆయన ఈ సినిమాతోనే పూర్తిస్థాయి నిర్మాతగా కెరీర్‌ను ప్రారంభించారు. అప్పట్లో 6 లక్షల బడ్జెట్‌లో ఎన్టీఆర్, జమున, ఎల్. విజయలక్ష్మి, ఎస్వీ రంగారావు, శాంతకుమారి ప్రధాన తారాగణంగా తయారైన ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. ఇన్ని ప్రింట్లు, ఇన్ని కేంద్రాల్లో రిలీజులు లేని ఆ రోజుల్లోనే 30 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం జరుపుకొన్న తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. దాంతో ఈ కథను తమిళం (ఎమ్జీఆర్‌తో ‘ఎంగ వీట్టు పిళ్ళై’), హిందీ (దిలీప్ కుమార్‌తో ‘రామ్ ఔర్ శ్యామ్’) భాషల్లో ‘విజయా’ నాగిరెడ్డి తీశారు. అలాగే, కన్నడం, మలయాళం, ఒరియా, బెంగాలీ భాషల్లోకి ఈ చిత్రం రీమేకైంది. తెలుగు నుంచి అత్యధికంగా 6 భాషల్లోకి అధికారికంగా రీమేకైన సినిమా ఇవాళ్టికీ ఇదొక్కటే! రిపీట్ రన్స్‌లోనూ బాగా ఆడిన ఈ చిత్రాన్ని లేడీ ఓరియెంటెడ్ కథగా మార్చి, హిందీలో ‘సీతా ఔర్ గీతా’, తెలుగులో ‘గంగ - మంగ’ లాంటివి వచ్చాయి. అనిల్ కపూర్ ‘కిషన్ కన్హయ్య’, శ్రీదేవి ‘చాల్‌బాజ్’ తరహాలో అనధికారిక ‘ఫ్రీ మేక్’లుగా వచ్చిన సినిమాలు కోకొల్లలు. ఆఖరుకు కొద్దిపాటి మార్పులు, చేర్పులతో సాక్షాత్తూ ఎన్టీఆర్ కుమారుడైన బాలకృష్ణతో ‘రాముడు - భీముడు’ అన్న టైటిల్‌తోనే తెరకెక్కింది. తెరపై ఓ హిస్టారికల్ డాక్యుమెంట్: ఈ సినిమాలో ఎన్టీఆర్, శాంతకుమారి అక్కాతమ్ముళ్లు. సినిమా కథలో భాగంగా వారి తల్లితండ్రులుగా కూడా ఆ ఇద్దరే తెరపై పెయింటింగ్‌ల రూపంలో వయసు పైబడ్డ రూపంలో కనిపించడం విశేషం. వారిద్దరూ అలా జోడీగా కనిపించే సినిమా ఇదొక్కటే. నటుడు కైకాల సత్యనారాయణ ఈ చిత్రంలో ప్రత్యేకించి పాత్ర పోషణ చేయలేదన్న మాటే కానీ, సినిమా అంతటా ఎన్టీఆర్‌కు డూప్‌గా నటించారు. ఇక, పెండ్యాల బాణీల్లో వచ్చే స్ఫూర్తిదాయక గీతం ‘ఉందిలే మంచికాలం ముందు ుుందునా...’ (రచన- శ్రీశ్రీ), యుగళ గీతాలు ‘తెలిసిందిలే తెలిసిందిలే...’, ‘అదే అదే...’ (సినారె), హాస్య గీతాలు ‘సరదా సరదా సిగరెట్టు...’, ‘తగునా ఇది మామ..’ (కొసరాజు) ఇవాళ్టికీ సూపర్‌హిట్లే. కృష్ణానదిపై నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మిస్తున్న సమయంలో శ్రమకోర్చి మరీ అక్కడ ‘దేశమ్ము మారిందోయ్.. కాలమ్ము మారిందోయ్...’ (కొసరాజు) పాటను చిత్రీకరించారు. ఎన్టీఆర్, ఎల్. విజయలక్ష్మి బృందంపై వచ్చే ఆ పాట ఆనాటి మన ‘ఆధునిక దేవాలయ’ నిర్మాణ దృశ్యాలకు ఇప్పుడు వెండితెరపై మిగిలిన ఓ హిస్టారికల్ డాక్యుమెంట్.
త్వరలో... కలర్‌లో: నాలుగైదేళ్ళు రచయిత దగ్గరే మూలిగిన ఈ చిత్ర కథ తెరకెక్కిన వేళా విశేషమేమో కానీ, అటు ‘సురేష్ ప్రొడక్షన్స్’ అయిదు దశాబ్దాలుగా నిర్విరామంగా సినిమాలు తీస్తూ, 15 భారతీయ భాషల్లో 150 దాకా సినిమాలు తీసిన ప్రతిష్ఠాత్మక సంస్థగా ఎదిగింది. ఇటు ఈ కథాంశమూ దేశంలోని అనేక భాషల్లో పదే పదే తెరకెక్కుతూ వచ్చింది. అందుకే, రామానాయుడుకు ఈ సినిమా ఓ స్పెషల్. ‘‘నా సంస్థకు విత్తనమైన ఎన్టీఆర్ ‘రాముడు - భీముడు’నూ, ఆ తర్వాత కొన్నేళ్ళకు మళ్ళీ ఎన్నో కష్టాల్లో ఉండగా నా సంస్థను నిలబెట్టిన ఏయన్నార్ ‘ప్రేమనగర్’నూ మర్చిపోలేను’’ అని ప్రత్యేకించి పదే పదే ప్రస్తావిస్తుంటారు. ఈ కథను ఎన్టీఆర్ మనుమడైన ఈ తరం హీరో ఎన్టీఆర్‌తో మళ్ళీ తీయాలని ఆయన కోరిక. ఆ సంగతి ఆయన ప్రకటించారు కూడా. ఆ ప్రయత్నం ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో, అయిదు పదుల ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్‌లోకి మారుస్తున్నారు. త్వరలోనే విడుదల చేసే పనిలో ఉన్నారు. ఓ కథకూ, సినిమాకూ అంతకన్నా అరుదైన గౌరవం ఇంకేముంటుంది! - రెంటాల జయదేవ (Published in 'Sakshi' daily, 21st May 2014, Wednesday) .........................................................
రామ్‌గోపాల్ వర్మ... ఈ పేరు చెప్పగానే ఎవరికైనా చటుక్కున స్ఫురించేది ఓ విలక్షణ వ్యక్తిత్వం. ఆయన మాటలైనా, చేతలైనా ఎప్పుడూ ఏదో ఒక సంచలనమే. సినిమా హిట్టు, ఫ్లాపులతో ఆయనకు సంబంధం లేదు. వాటికి అతీతంగా అనునిత్యం వార్తల్లో ఉండడం వర్మలోని విశేషం. మరి, అలాంటి విలక్షణ వ్యక్తి ఎవరిని చూసి ప్రభావితమయ్యారు?
దేన్ని చూసి, ఏం చదివి ప్రేరణ పొందారు?
ఎవరి మీదైనా సరే మాటల తూటాలు పేల్చే ఈ మనిషికి బతుకు మీద భయం లేదా?
రండి... రామూను అడిగేద్దాం... ఆయన మాటల్లోనే వివరణ వినేద్దాం.
నన్ను ప్రధానంగా ప్రభావితం చేసిన వ్యక్తి - ఇంజినీరింగ్ కాలేజ్‌లో నాకు జూనియర్ అయిన నా స్నేహితుడు సత్యేంద్ర. అతను చాలా తెలివైనవాడు. ఇంటర్నెట్ లాంటివేవీ లేని ఆ రోజుల్లో విశాఖపట్నం నుంచి విజయవాడకు చదువుకోవడానికి వచ్చిన పద్ధెనిమిదేళ్ళ అతను ఆ తరం విద్యార్థులు ఎవరూ ఊహించని రీతిలో ఎన్నెన్నో పుస్తకాలు చదివాడు. ఆరు నెలల పాటు నేను, అతను రూమ్మేట్లం. అతనితో మాట్లాడుతుంటే, అదో చెప్పలేని అనుభూతి. ఒకసారి పరీక్షల ముందు నేను, సత్యేంద్ర విజయవాడలోని లీలామహల్‌లో ఓ ఇంగ్లిషు సినిమాకు వెళ్ళాం. సత్యేంద్ర ఆ సినిమా చూడడం అప్పటికి ఏడోసారి. ఇంతలో మా కాలేజ్ ప్రిన్సిపాల్ తుమ్మల వేణుగోపాలరావు కూడా అదే సినిమాకు వచ్చారు.
‘ఏమిటి ఇలా వచ్చార’ని ఆయన అడిగితే, ‘మీరు కాలేజ్‌లో నేర్పే దాని కన్నా, ఈ సినిమాల ద్వారా నేర్చుకునేది ఎక్కువ. అందుకే, ఈ సినిమాకు ఏడోసారి వచ్చా’ అన్నాడు సత్యేంద్ర. ‘ఈ సినిమా నేను చూశాను. ఇందులో అంత ఏముంది?’ అన్నారు ప్రిన్సిపాల్. ‘మీకు కనిపించనిదేదో, నాకు కనిపించింది’ అన్నాడు సత్యేంద్ర. చూడడానికి అతని మాట తీరు అలా నిర్లక్ష్యంగా అనిపించినా, అంత తెలివైన విద్యార్థిని నేను చూడలేదంటే నమ్మండి. చివరకు, మా ప్రిన్సిపాల్ గారు కూడా ఓ సందర్భంలో ‘నేను మరువలేని విద్యార్థి’ అంటూ సత్యేంద్ర మీద చాలా గొప్పగా ఓ వ్యాసం రాశారు. దాన్నిబట్టి అతను ఎలాంటివాడో అర్థం చేసుకోండి.
అవడానికి కాలేజీలో నాకు జూనియర్ అయినా, సత్యేంద్ర మాటలు, అతను ప్రస్తావించిన పుస్తకాల పఠనం నన్నెంతగానో మార్చేశాయి. అతనితో మాట్లాడితే, మనకు తెలియని ఓ అభద్రత కలుగుతుంది. ఆయన తెలివితేటల ముందు మనమంతా పురుగులలాగా అనిపిస్తుంది. ప్రస్తుతం విజయవాడలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు సత్యేంద్ర. ఈ మధ్యే మూడు నెలల క్రితం కూడా అతనితో ఫోన్‌లో మాట్లాడాను. అతని మాటల్లోని తార్కికత మనల్ని ఆలోచనల్లో పడేస్తుంది. మనలోని అజ్ఞానపు తెరలు ఒక్కొక్కటిగా విడిపోతూ, ఉంటాయి.
‘భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను’ లాంటి ప్రకటనల వెనుక ఉన్న మన అంతరంగాన్ని ఆయన ప్రశ్నిస్తారు. కేవలం దేశాన్ని ప్రేమిస్తున్నావా, ఇక్కడి వ్యక్తులను ప్రేమిస్తున్నావా, కులాలు - మతాలు - ప్రాంతాల లాంటి విభేదాలు ఏమీ లేకుండా వ్యక్తులను ప్రేమించగలవా అని ఆయన చెప్పే తర్కం ఆలోచనలో పడేసేది. మనలో గూడు కట్టుకున్న స్థిరమైన అభిప్రాయాలనూ, భావాలనూ అతని మాటలు ఛిన్నాభిన్నం చేసేస్తాయి. నా జీవిత తాత్త్వికత అంతా ఆ పుస్తకాల ప్రభావమే!
సత్యేంద్ర తరువాత నన్ను అమితంగా ప్రభావితం చేసినవి పుస్తకాలే. ఇంటర్మీడియట్ చదువుతుండగానే నేను కాల్పనిక సాహిత్యమంతా చదివేశాను. కాల్పనికేతర సాహిత్యం, ఫిలాసఫీ పుస్తకాలు మాత్రం ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాకే చదవడం మొదలుపెట్టాను. ఇప్పుడు నేను ఎక్కువగా ఫిలాసఫీ పుస్తకాలు, అందులోనూ పొలిటికల్ ఫిలాసఫీ పుస్తకాలు తెగ చదువుతుంటాను. వాటిని నాకు పరిచయం చేసింది సత్యేంద్రే. ఆయన స్నేహం వల్లే నేను జర్మన్ తత్త్వవేత్త నీషే, అయన్ ర్యాండ్ లాంటి ప్రసిద్ధులు రాసిన పుస్తకాలు చదివాను. అయన్ ర్యాండ్ రచనలన్నీ దాదాపు చదివేశాను. ముఖ్యంగా ఆమె రచనలు, నీషే రాసిన ‘దజ్ స్పేక్ జరాథుస్త్రా’ - నన్ను బాగా ప్రభావితం చేశాయి. అన్నట్లు నేను ఇందాక చెప్పిన సత్యేంద్ర కూడా ఇప్పుడు ఓ పుస్తకం రాస్తున్నాడు. అతని ఆలోచనలతో నిండిన ఆ పుస్తకం జనం ఆలోచించే తీరును మార్చి వేస్తుందని ఆయన నమ్మకం. కచ్చితంగా అది ఓ సంచలనమవుతుంది.
తెలుగు పుస్తకాల విషయానికి వస్తే, నేను ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి అభిమానిని. ఆమె రాసిన ‘రామాయణ విషవృక్షం’ చదివాను. అలాగే, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, చలం రచనలు చదివాను. చలం మంచి రచయితే కానీ, ఆ భావాలు అప్పటికి కూడా కొత్త ఏమీ కాదు. అవన్నీ ప్రపంచ ప్రసిద్ధులైన నీషే తదితరుల తాత్త్వికతలో ఉన్నవే. ఆ సినిమాల జాబితా చాలా పెద్దది!
ప్రపంచ సినీ చరిత్రలో ఆణిముత్యాలని చెప్పదగ్గ చిత్రాలు కొన్ని నా మీద ప్రభావం చూపాయి. వాటి జాబితా పెద్దదే. అయితే, చటుక్కున నాకు గుర్తొచ్చే సినిమాలు - ‘గాడ్ ఫాదర్’, ‘మెకన్నాస్ గోల్డ్’, ‘ఎగ్జార్సిస్ట్’. భారతీయ సినిమాల్లోకి వస్తే ‘షోలే’, ‘అర్ధ్ సత్య’ లాంటివి నన్ను ప్రభావితం చేశాయి. అలాగే, నా మీద ప్రభావం చూపాయని అనలేను కానీ, నేను బాగా ఇష్టపడిన తెలుగు సినిమాలు మాత్రం చాలానే ఉన్నాయి. దాసరి నారాయణరావు గారి ‘శివరంజని’, బాలచందర్ గారి సినిమాల లాంటివి నాకెంతో ఇష్టం. అలాగే, షార్ట్‌ఫిలిమ్‌లు, నేషనల్ జాగ్రఫీ చానల్‌లో వచ్చే డాక్యుమెంటరీలు కూడా తరచూ చూస్తూ ఉంటాను. వాటి ప్రభావం నా మీద కొంత ఉంది.
నాకెప్పుడూ, దేనికీ భయం లేదు!
అవతలివాళ్ళను భయపెట్టడం నాకు ఇష్టం. కానీ, చిత్రమైన విషయం ఏమిటంటే, నాకు ఎప్పుడూ భయం అనిపించదు. చాలా ఏళ్ళ క్రితం మహారాష్ట్రలోని లాతూరులో భయంకరమైన భూకంపం వచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు నేను బొంబాయిలో ఎనిమిదో అంతస్థులోని ఇంట్లో ఉన్నా. భవనమంతా ఒక్కసారిగా భయంకరంగా ఊగుతోంది. భూకంపం వచ్చిన విషయం నాకు అర్థమైంది. కిందకు వెళదామని అనుకున్నా. కానీ, వెంటనే ఈ లోపలే భవంతి కూలిపోయి చనిపోతామేమోలే... ఇంకెందుకు వెళ్ళడం అనిపించింది. అంతే! అక్కడే ఉండిపోయి, భూకంపం వచ్చినప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని నిర్ణయించుకున్నా. భవంతి గోడలు విరిగినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందా అని ఆలోచిస్తూ కూర్చున్నా! - రెంటాల జయదేవ (Published in 'Sakshi' daily, 18th May 2014, Sunday) .....................................
సినీ తారలకూ, రాజకీయాలకూ అవినాభావ సంబంధం ఉన్న దేశం మనది. తాజా సార్వత్రిక ఎన్నికలు కూడా ఆ సంగతిని మరోసారి స్పష్టం చేశాయి. తూర్పున బెంగాల్ నుంచి పశ్చిమాన గుజరాత్ దాకా, ఉత్తరాన పంజాబ్, ఉత్తర ప్రదేశ్ నుంచి దక్షిణాన కేరళ దాకా అనేక రాష్ట్రాల్లో సినీ తారలు బాక్సాఫీస్ దగ్గర కాక, బ్యాలెట్ పెట్టెల వద్ద పోటీ పడ్డారు. లోక్‌సభతో పాటు మన రాష్ర్ట శాసనసభ బరిలోనూ తారలు సందడి చేశారు. మనవాళ్ళ సంగతి కాస్త పక్కనపెట్టి, ఇతర రాష్ట్రాల సంగతి గమనిస్తే, ఈ ఎన్నికల్లో కౌంటింగ్ సెంటర్ల వద్ద హిట్టయినవాళ్ళూ, ఫ్లాపైనవాళ్ళూ చాలామందే! సినీతారలుగా సుప్రసిద్ధులైన హేమమాలిని, మున్ మున్ సేన్, కిరణ్ ఖేర్, పరేశ్ రావల్, మలయాళ నటుడు ఇన్నోసెంట్ లాంటి వారు ఎన్నికలలో గెలిచి, పార్లమెంట్ సభ్యులయ్యారు. అదే సమయంలో జయప్రద, నగ్మా, గుల్‌పనగ్, నటుడు రాజ్‌బబ్బర్, అమేథీలో రాహుల్ గాంధీతో పోటీపడ్డ నటి స్మృతీ ఇరానీ తదితరులు ఈ ఎన్నికల పోరులో మట్టికరిచారు. హిందీ చిత్రసీమలో ‘డ్రీమ్‌గర్ల్’గా పేరొందిన రాజ్యసభ సభ్యురాలు హేమమాలిని ఈ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లోని మథుర లోక్‌సభా స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ పక్షాన పోటీచేశారు. యు.పి.లో వీచిన మోడీ ప్రభంజనంలో ఆమె అక్కడ ఇటీవలి వరకు లోక్‌సభ సభ్యులైన రాష్ట్రీయ లోక్‌దళ్ అభ్యర్థి జయంత్ చౌధరిని ఓడించారు. ప్రముఖ సినీ, రంగస్థల నటి కిరణ్ ఖేర్ ఎన్నికల యుద్ధంలోకి దిగిన తొలిసారే విజయ ఢంకా మోగించారు. నటుడు అనుపమ్‌ఖేర్ సతీమణి అయిన ఆమె పంజాబ్‌లోని చండీగఢ్ నుంచి బి.జె.పి. పక్షాన పోటీ చేసి, రైల్వేశాఖ మాజీ మంత్రి అయిన పవన్ కుమార్ బన్సల్‌ను భారీ తేడాతో ఓడించడం విశేషం.
అదే స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున తొలిసారిగా ఎన్నికల గోదాలోకి దిగిన నటి గుల్ పనగ్ మూడో స్థానంలో నిలిచారు. నటీమణులే కాక, నటులు కూడా ఈసారి లోక్‌సభకు బాగానే సినీ గ్లామర్ తెస్తున్నారు. ప్రముఖ క్యారెక్టర్ యాక్టర్ పరేశ్ రావల్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ తూర్పు స్థానంలో బరిలోకి దిగి, సమీప కాంగ్రెస్ ప్రత్యర్థిని ఓడించారు. చాలా కాలంగా బి.జె.పి.ని నమ్ముకున్న నటుడు వినోద్ ఖన్నా గడచిన 2009 ఎన్నికల్లో ఓటమి పాలైనా, ఈసారి గురుదాస్‌పూర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. ఇక, మరో సీనియర్ హిందీ నటుడు శత్రుఘ్న సిన్హా పాట్నా సాహిబ్ స్థానం నుంచి నాలుగోసారి గెలిచారు. బి.జె.పి. పక్షాన బరిలోకి దిగిన ఆయన కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన ప్రాంతీయ భాషా నటుడు కునాల్ సింగ్‌తో ఢీ కొనడం విశేషం. ఈ ఇద్దరు నటుల పోరులో, సహజంగానే సీనియర్ అయిన శత్రుఘ్న సిన్హా గెలిచారు.
ప్రేక్షకుల ముందు ప్రత్యక్ష ప్రదర్శనల్లో తన హాస్య విన్యాసాల ద్వారా ఆకట్టుకొనే పాపులర్ కమెడియన్ భగవంత్ మాన్... పంజాబ్‌లోని సంగ్రూర్ నుంచి పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి అయిన శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సాను ఓడించారు. సుప్రసిద్ధ భోజ్‌పురీ గాయకుడు - నటుడు మనోజ్ తివారీ బి.జె.పి. పక్షాన నిలిచి, ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి గెలిచారు. బాలీవుడ్ గాయకుడు బాబుల్ సుప్రియో పశ్చిమ బెంగాల్‌లోని అసనోల్ నుంచి గెలిస్తే, తెలుగు వారికీ సుపరిచితుడైన ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి బి.జె.పి. తరఫున దిగినా విజయం వరించలేదు. అదే రాష్ట్రంలోని శ్రీరామ్‌పూర్ నుంచి రేసులో మూడో ప్లేసుకే ఆయన పరిమితమయ్యారు.
పశ్చిమ బెంగాల్‌లో కూడా ఈసారి సినీ తారల ఎన్ని కల సందడి ఎక్కువగా ఉంది. బంకురా నియోజక వర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పక్షాన బరిలోకి దిగిన ప్రముఖ నటి మున్ మున్ సేన్ (తెలుగులో కె.విశ్వనాథ్ ‘సిరివెన్నెల’ చిత్రంలో నటించారు) అక్కడ తలలు పండిన రాజకీయవేత్తను ఢీకొని, గెలవడం విశేషం. బీర్‌భూమ్ నుంచి శతాబ్ది రాయ్, మిడ్నాపూర్ నుంచి సంధ్యా రాయ్, కృష్ణానగర్ నుంచి తపస్ పాల్, ఘటల్ నుంచి దేవ్‌గా ప్రాచుర్యం పొందిన దీపక్ అధికారి విజేతలుగా నిలిచారు. ఈసారి కేరళలోని చేలక్కుడి స్థానం నుంచి ప్రముఖ మలయాళ నటుడు ఇన్నోసెంట్ వామపక్షాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి, గెలిచారు. క్యాన్సర్‌తో బాధపడుతూ, ఇటీవలే కోలుకున్న ఆయన విజయం సాధించారు. రాజకీయ దిగ్గజాలను ఢీ కొనేందుకు సినీ గ్లామర్‌ను వాడుకొనేందుకు ఈసారి దేశవ్యాప్తంగా చాలా పార్టీలు ప్రయత్నించాయి. అయితే, అన్నిచోట్లా అది పనిచేయలేదు. లక్నో స్థానంలో బి.జె.పి. జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో ‘ఆప్’ పక్షాన నటుడు జావేద్ జాఫ్రీ పోటీ పడినప్పటికీ, రాజకీయ చైతన్యం ముందు సినిమా ఇమేజ్ పని చేయలేదు. ఇక, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పైన అమేథీ స్థానంలో బి.జె.పి. పక్షాన పోటీపడిన టి.వి. నటి స్మృతీ ఇరానీ ఆఖరుకు ఓటమి పాలైనా, మొదట్లో మంచి పోటీ ఇచ్చి, వార్తల్లో నిలిచారు. ఓటములూ ఎక్కువే!
ఓటర్ల రాజకీయ చైతన్యం ముందు కొందరు సుప్రసిద్ధ తారల ఆకర్షణ మంత్రం పప్పులుడకలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన హిందీ నటుడు రాజ్ బబ్బర్ (ఘాజియాబాద్ స్థానం), ఇటీవల అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ చిత్రంలో విలన్‌గా పాపులరైన భోజ్‌పురి సూపర్‌స్టార్ రవి కిషన్ (ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి డివిజన్‌కు చెందిన జౌన్‌పూర్ స్థానం), తెలుగులోనూ పేరున్న హిందీ నటి నగ్మా (మీరట్ స్థానం) కౌంటింగ్ కేంద్రాల్లో చతికిలబడ్డారు.
చిత్రం ఏమిటంటే, భోజ్‌పురీ చిత్రాలకు అపర అమితాబ్ బచ్చన్‌గా పేరున్న రవి కిషన్ అయిదో స్థానానికే పరిమితమవ్వాల్సి వచ్చింది. నగ్మా నాలుగో స్థానానికీ నెట్టివేయబడ్డారు. కర్నాటకలోని మండ్యా నుంచి జనతాదళ్ (ఎస్) అభ్యర్థిగా గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన యువ కన్నడ నటి రమ్య తాజా ఎన్నికల్లో తన స్టార్ ఎట్రాక్షన్‌ను చూపించలేకపోయారు. ఈ సారి ఓటమి పాలైన వారిలో ‘ఆరక్షణ్’, ‘సత్యాగ్రహ్’ లాంటి తాజా రాజకీయ చైతన్య చిత్రాల దర్శకుడైన ప్రకాశ్ ఝా (బీహార్‌లోని పశ్చిమ చంపారణ్), మరో దర్శక - నటుడు మహేశ్ మంజ్రేకర్ (ముంబయ్ వాయవ్యం), రాష్ట్రీయ ఆమ్ పార్టీ పేరిట బరిలోకి దిగిన నటి రాఖీ సావంత్, కొన్నేళ్ళుగా ఉత్తరాదిన రాజకీయాలకు గ్లామర్ పెంచిన తెలుగు నటి జయప్రద (ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నౌర్) ఉన్నారు. ఏమైనా, ఈ సారి మునుపటి కన్నా ఎక్కువ గ్లామరే ఎన్నికలకు వచ్చింది. విజేతలతో అది తాజా లోక్‌సభకూ విస్తరించనుంది. (Published in 'Sakshi' daily, 18th May 2014, Sunday) ......................................
వివాదం రేపిన నటుడు ప్రకాశ్‌రాజ్ వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతమైంది. శుక్రవారం నాడు హైదరాబాద్‌లో జరిగిన సమన్వయ సంఘ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ పెద్దమనిషి పాత్ర పోషించి, పరిశ్రమ పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చింది. మహేశ్‌బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆగడు’ సినిమా సెట్స్‌పై ప్రకాశ్‌రాజ్ తనను అసభ్యకరమైన భాషలో నిందించారంటూ కో-డెరైక్టర్ ఒకరు ‘తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘా’నికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిందే. ఆ వ్యవహారం గత నెలలో చినికి చినికి గాలివానగా మారింది.
ప్రకాశ్‌రాజ్‌పై చర్య కోరుతూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు వెళ్ళడమే కాక, తెలుగు సినిమాల్లో ప్రకాశ్‌రాజ్‌కు సహాయ నిరాకరణ చేయాలంటూ దర్శకుల సంఘంలో చర్చ రేగింది. ప్రకాశ్‌రాజ్‌పై నిషేధం విధిస్తారని కూడా ప్రచారం సాగింది. ఆ పరిస్థితుల్లో వారం పదిరోజుల క్రితం ప్రకాశ్‌రాజ్ స్వయంగా విలేకరుల ముందుకు వచ్చి, ఈ వ్యవహారం వెనుక ఓ దర్శకుడు ఉన్నాడంటూ శ్రీను వైట్ల పేరును పరోక్షంగా ప్రస్తావించి, ప్రశ్నలు అడిగేందుకు అవకాశమివ్వకుండా వెళ్ళిపోయారు. ఈ వివాదంపై ఫిల్మ్ చాంబర్‌లో దర్శకుల సంఘం, నిర్మాతల మండలి, నటీనటుల సంఘంతో ప్రతినిధులతో ఏర్పాటైన సమన్వయ సంఘం శుక్రవారం సమావేశమైంది. ఇందులో ప్రకాశ్‌రాజ్‌తో సదరు కో-డెరైక్టర్‌కు క్షమాపణ చెప్పించినట్లు సమా చారం. ప్రకాశ్‌రాజ్‌తో కొంత షూటింగ్ జరిపి, ఆనక అభిప్రాయ భేదాల కారణంగా అతని స్థానంలో సోనూ సూద్‌ను దర్శకుడు తేవడంతో, నిర్మాతలకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది. దాంతో, ప్రకాశ్‌రాజ్, శ్రీను వైట్లతో నిర్మాతకు నష్టపరిహారం ఇప్పించాలని తీర్మానించినట్లు సమాచారం. ప్రకాశ్‌రాజ్‌పై చర్యలేవీ తీసుకోరాదని నిర్ణయించారు.
అయితే, ఈ విషయంపై మరింత సమాచారం ఇచ్చేందుకు అటు దర్శకుల సంఘం వర్గాలు కానీ, ఇటు చాంబర్ వర్గాలు కానీ సుముఖత వ్యక్తం చేయకపోవడం గమనార్హం. ‘చాంబర్ అధ్యక్షుడు ఎన్.వి. ప్రసాద్ మినహా మేమెవరం దీని గురించి మాట్లాడడానికి వీలు లేదు. పత్రికలకు ఎక్కవద్దంటూ ముందే చెప్పేశారు. మా నోటికి తాళం వేశారు’ అని ఆ వర్గాలు పేర్కొనడం విశేషం. ఈ వ్యవహారంలో దర్శకుల సంఘం ఇప్పటికే దూకుడుగా వ్యవహరించిందంటూ చాంబర్ పెద్దలు అక్షింతలు వేసినట్లు సమాచారం. శ్రీను వైట్ల, ప్రకాశ్‌రాజ్, నిర్మాత గోపి ఆచంట తదితరులు హాజరైన ఈ సమావేశంలో ‘‘అంతా సాఫీగా జరిగింది. ఇకపై ఇలాంటి వివాదాలతో పత్రికలకు ఎక్కరాదనుకున్నాం’’ అని సాయంత్రం పొద్దుపోయాక అందు బాటులోకొచ్చిన చాంబర్ అధ్య క్షుడు ఎన్.వి. ప్రసాద్ ‘సాక్షి’తో అన్నారు. వివరాలు మాత్రం వెల్లడించకుండా దాటేశారు. ఈ వివాదం సమసిపోయిందన్న మాట నిజమే కానీ, ‘దూకుడు’ లాంటి ఘన విజయంలో భాగస్వాములైన ప్రకాశ్‌రాజ్, దర్శకుడు శ్రీను వైట్ల మధ్య అభిప్రాయ భేదాలకు తెరపడిందా అన్నది బేతాళప్రశ్న. (Published in 'Sakshi' daily, 10th May 2014, Saturday) ...............................................
తెలంగాణలో మైకులు బంద్ అయ్యాయి. ప్రచారం ముగిసింది. ఇక జరగాల్సిన తంతు మిగిలింది. అయితే, ఇన్ని రోజుల ప్రచారంలో నటుల హడావుడి ఎన్నడూ లేనంత పీక్స్ కి చేరింది. స్టార్ హీరోల నుండి అవకాశాల్లేక ఖాళీగా ఉన్న బాబులు, బుల్లితెర నటులు అంతా మండుటెండలో వివిధ పార్టీల తరపున ఓట్ల వేటలో శ్రమించారు. ప్రచారంలో ఒకటే హడావుడి చేశారు. వెండితెరపై కనిపిస్తే చాలు. ఎక్కడలేని ఇమేజ్ వచ్చేస్తుంది. మామూలు మనుషులకు అతీతం అనేలా తయారు చేస్తుంది. మరి, ఈ ఇమేజ్ కు ఓట్లు తెచ్చిపెట్టేంత శక్తి ఉందా? అసలు నటుల మీటింగ్ లకు వచ్చిన జనం అంతా సరదాగా వాళ్లని చూడ్డానికి మాత్రమే వచ్చారా? లేక అవన్నీ ఓట్లుగా మారతాయా? అనే ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి. వాళ్లకంత సీన్ లేదా..? సిల్వర్ స్క్రీన్ ఓ మత్తు ఓ మాయాజాలం. ప్రేక్షకులకే కాదు. నటులకు కూడా. థియేటర్ లో మోగే చప్పట్లు, ఈలలు వాళ్లను సరికొత్త లోకానికి తీసుకెళతాయి. ప్రేక్షకుల అభిమానం మామూలు మనుషుల నుండి నటులకు ఓ ప్రత్యేకతను ఆపాదిస్తుంది. ఒంటి చేత్తో పది మందిని ఇరగదీసినట్టే, కంటి చూపుతో కాల్చేసినట్టే, బయట కూడా ఏదైనా చేయగలమనుకుంటారు. ఆ వేడిలోంచే పాలిటిక్స్ వైపు అడుగులేస్తారు. కానీ, నటనకు పడే చప్పట్లన్నీ ఓట్లుగా మారవని రియలైజ్ కావటానికి కొంచెం సమయం పడుతుందని పరిశీలకుల అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి.. నల్లటి అద్దాల మాటున ఉన్నంత సేపే విలువ. కనిపించీ కనిపించనట్టు తిరుగుతూ ఉంటేనే బ్రాండ్ విలువ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పబ్లిక్ లోకి ఎంట్రీ ఇస్తారో బ్యాంక్ ఎకౌంట్లో సొమ్ము కరిగినట్టు, ఇమేజ్ కూడా డైల్యూట్ అవుతుంది. ఒకరిద్దరు తప్ప ఎంతో మంది నటుల విషయంలో ఇది ప్రూవ్ అవుతూనే ఉంది. ఉదాహరణకు మన మెగాస్టార్ కి ఒకప్పుడు ఎంత హంగామా ఉండేది. చిరు అంటే ఓ రేంజ్. అతని డైలాగ్, డాన్స్, ఫైట్స్ ఫ్యాన్స్ ని పిచ్చెక్కించేవి. మరి ఇప్పుడు చిరు అలా పక్కనించి పోతున్నా, తేలికగా తీసుకునే వాళ్లు ఎంతోమంది. రాజకీయాల్లో చేరి వాస్తవ రూపం ప్రజలకు అందుతూ, ఇమేజ్ బద్దలైపోయి భ్రమలు వీడితే ఇలాగే జరుగుతుందని పరిశీలకుల అభిప్రాయం. రోజా.. అదే రోజాని తీసుకుంటే ఆమె స్టార్ హీరోయిన్. అందంతో అభినయంతో ఆకట్టుకున్న నటి. కానీ రాజకీయాల్లో ఆమె మాటల్ని ప్రజలు ఏనాడూ పట్టించుకోలేదు. మీటింగ్ లో ఆమెను చూడ్డానికే ఎగబడ్డారు కానీ, ఓటేయటానికి కాదని రుజువయింది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. గెలుపోటములను సినీ నటులు రాయగలరా? రాజకీయ నాయకుల గెలుపోటములను సినీ నటులు రాయగలరా? అదే నిజమైతే ఈ పాటికి రాజకీయాలు వేరే డైరక్షన్ లో ఉండేవి. ఇండస్ట్రీ కరిష్మాను అడ్డు పెట్టుకుని ఓ దుమ్ము రేపేద్దామని రాజకీయనేతలు కూడా ఆశపడుతుంటారు. దానికోసం సిల్వర్ స్క్రీన్ నుండి బాబుల్ని ఇంపోర్ట్ చేసుకునే పనిలో పడతారు. కానీ, ఆ ఇమేజ్ ప్రచారంలో టైం పాస్ పాప్ కార్న్ లా తప్ప పెద్ద ఎఫెక్ట్ ఉండదని ఎన్నో సార్లు రుజువయింది. థియేటర్ లో చప్పట్లు మోగినంత మాత్రాన, వాళ్లు చెప్పే మాటల్ని జనాలు వింటారని, నమ్మేస్తారని భావించలేమని విశ్లేషకుల అభిప్రాయం. తారల ప్రచారంపై తగ్గిన ఆసక్తి.. ఎన్నికల ప్రచారంలో సినీ తారలు జోరుగా పాల్గొంటున్నా ప్రజలకు మాత్రం మొహం మొత్తినట్లుగా కనిపిస్తోంది. ఓటర్లకు తారల ప్రచారంపై ఆసక్తి తగ్గిపోయినట్లుగా ఉంది. తారలు ప్రచారం చేస్తున్నా సినిమా తార అనే అభిమానంతో వచ్చినా ఈ ప్రచార ప్రభావం ఓటర్లపై అంతగా పడే పరిస్థితి ఇప్పుడు లేదని విశ్లేషకులు అంటున్నారు. సినీ తారల పట్ల తగ్గిన ఆదరణ.. సినీ తారల పట్ల రాను రాను తెలుగు ఓటర్లలోనూ కొంత ఆదరణ తగ్గుతోందనిపిస్తుంది. ఇప్పటికీ సినీ గ్లామర్ అంటే ఆకర్షణ ఉంది. తమ అభిమాన నటులు వస్తే జనం ఎగబడతారు. అంతే కానీ ఏదో ఒక పార్టీ తరపున ప్రచారం చేస్తే వారి మాటలకు ప్రభావితమై ఓట్లు రాలే సీన్ లేదని విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యేకించి ఈ ఎన్నికల్లో పార్టీల్లో చేరిన వారే ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. పార్టీకి సంబంధం లేని వారు ఈసారి ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. గతంలో కూడా తారలు ప్రచారం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2004 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అభ్యర్థుల గెలుపు కోసం నటులు ప్రచారం చేశారు. ఈ ట్రెండ్ కాస్తో కూస్తో 2009 ఎన్నికల్లోనూ కొనసాగింది. 2004లోనూ, 2009లోనూ స్టార్లు ఎక్కడ సభలు పెట్టినా జనం వచ్చారు. కానీ ఓట్లు మాత్రం రాల్లేదు. పని చేయని సినీ గ్లామర్... 2009లో రాష్ట్ర రాజకీయ వెండితెరపై సినీ గ్లామర్ ఏమాత్రమూ పని చేయలేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ప్రజారాజ్యం పార్టీ అట్టర్ ఫ్లాపై చతికిలపడింది. తిరుగులేని అభిమానాన్ని సంపాదించుకున్న హీరో చిరంజీవి తో పాటు పవన్ కల్యాణ్ కూడా కాలికి బలపం కట్టుకుని తిరిగి ఎంతగా ప్రచారం చేసినా లాభం లేకపోయింది. చిరు హోల్ ఫ్యామిలీ అంతా జనాల్లోకి వచ్చినా తేలికగా తీసుకున్నారు. 2009 ఎన్నికల్లో చిరంజీవికి ధీటుగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. బాలకృష్ణ మీసాలు మెలేసి తొడకొట్టారు. జూనియర్ సీనియర్ వేషంలో సుడిగాలి పర్యటన చేశాడు. కానీ, నో యూజ్. రాజకీయాలు వేరు, సినిమాలు వేరనడానికి మన ఎన్నికలే నిదర్శనంగా నిలుస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తుస్సుమన్న పవన్.. జనసేన పేరుతో పవన్ కల్యాణ్ సొంత కుంపటి పెట్టినా టిడిపి, బిజెపికి మద్దతు ఇచ్చి తుస్సుమనిపించారు. జనసేనపార్టీతో కాంగ్రెస్, టిడిపి, బిజెపి, వైసిపి పార్టీలకు చుక్కలు చూపిస్తాడనిపించినా చివరకు ట్రాక్ మార్చేశాడు. వాస్తవానికి గతంలో సామాజిక తెలంగాణ అంటూ పీఆర్పీ తరపున పవన్ తెలంగాణలో ప్రచారం చేశాడు. కానీ, ఇంతా చేస్తే వచ్చింది రెండు సీట్లే. ఇప్పుడు పవన్ ప్రచారానికి మాత్రం అంతకంటే ప్రభావం ఉండకపోవచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి. బలహీనంగా సినీ తారల ప్రచార.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చాయంటే తారలు తళుక్కు మనేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక తెలుగునాట ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెలుగు సినీ తారల ప్రచార భాగస్వామ్యం చాలా బలహీనంగా ఉందంటున్నారు విశ్లేషకులు. పార్టీల్లో సినీ గ్లామర్.. ప్రతీ ఎన్నికల్లోనూ సినీ తారలు గ్లామర్ కెరీర్ నుంచి పొలిటికల్ కెరీర్ కు షిప్ట్ అయినా ఒకరిద్దరు మాత్రమే నిలదొక్కుగోగలిగారు. దక్షణాదిన నందమూరి తారకరామారావు , ఎన్జీ రామచంద్రన్, జయలలిత లాంటి వారు మాత్రమే అటు ప్రచారం, ఇటు రాజకీయ జీవితంలో నిలదొక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చాయంటే తారలు తళుక్కు మనేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక తెలుగునాట ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెలుగు సినీ తారలు విభజన సెగల మధ్య ఆచి తూచి అడుగేస్తున్నారు. తగ్గిన తెలుగు తారల జోరు.. ఈ ఎన్నికల్లో సినీ నటులు బాలకృష్ణ, మురళీమోహన్, బాబుమోహన్, జయసుధ, రోజా, విజయశాంతి, హేమ మరికొందరు నటులు పాల్గొంటున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రచార సారథి చిరంజీవి తమ పార్టీ అభ్యర్థుల తరపున ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం మోడీ పాటపాడుతుంటే, కృష్ణంరాజు బిజెపి సీమాంధ్ర ప్రచార కమిటీ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. పార్టీలన్నీ మారి సెకండ్ రౌండ్ మొదలుపెట్టనున్న జీవిత, రాజశేఖర్ కూడా బిజెపి తరపున ప్రచారంలో ఉన్నారు. నాగార్జున మోడీకి మద్దతు ప్రకటించినప్పటికి, ఎన్నికల ప్రచారంలో మాత్రం పాల్గొనడం లేదు. కమెడియన్లు అలీ, వేణుమాధవ్ టిడిపిలో చేరినా వారికి సీట్లు దక్కలేదు. తారలు ప్రచారంలో పాల్గొంటున్న కారణాలేవైనా, సినిమా ఇమేజ్ మాత్రమే పబ్లిక్ ని రప్పిస్తుందని, అవి ఓట్లుగా మారే అవకాశాలు తక్కువే అని గత అనుభవాలు చెప్తున్నాయి. ఈ సారి ఏం జరుగుతుందో వేచి చూడాలి. (Telecasted in 10tv= WIDE ANGLE programme, 28th April 2014, Monday) .................................
సినీ హీరోలు పొలిటికల్ స్టేట్మెంట్లిస్తున్నారు. ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారో చెప్తేస్తున్నారు. కొంతమంది మరో అడుగు ముందుకేసి కండువాలు కప్పేసుకుంటున్నారు. అయితే రాజకీయాల్లో నటుల ఎంట్రీ కొత్త విషయమేం కాదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం చాలా ఆసక్తికరం. కొందరు డైరెక్ట్ గా ఏదో ఒక పార్టీలో చేరుతున్నారు. మరికొందరు మేం రావటం లేదంటూనే పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతల్ని కలిసొస్తున్నారు. అసలు ఏ నటుడు ఏ ఎజెండాతో వస్తున్నారు? ప్రజలకు ఏం చెప్తున్నారు? ఏం దాస్తున్నారు? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? పవనిజం.. జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కల్యాణ్ మోడీ జపం మొదలుపెట్టారు. ఏకంగా అహ్మదాబాద్ వెళ్లి మరీ మోడీని కలిసి వచ్చారు. ఇక మోడీని కలిసిన నాగార్జున అయితే గుజరాత్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందంటూ మూర్ఛపోయినంత పనిచేశారు. మోహన్ బాబు అదే బాటలో ఉంటే, మంచు లక్ష్మి మోడికే నా మద్దతు అని స్టేట్మెంటిచ్చేశారు. నటుడు శివాజీ మోడీయే దేశానికి ఊపిరి అంటున్నారు. ఇక కమెడియన్లు ఆలీ, వేణుమాధవ్ బాబుగారి పక్కన చేరారు. ఏంటి వీరి ఎజెండా? ప్రజా సేవకోసమేనా? వేరే లక్ష్యాలేమన్నా ఉన్నాయా? బుద్ధిగా రంగేసుకుని నాలుగురాళ్లు వెనకేసుకోకుండా పొలిటికల్ ఎంట్రీ కొట్టడం వెనుక ఏ ప్రయోజనాలున్నాయి? ఇప్పుడు ఫిల్మ్ నగర్ లోనే కాదు.. ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇది.
తెలుగు ఇండస్ట్రీ ఇన్ సెక్యూరిటీలో ఉందా..? ఎన్టీఆర్, ఎమ్జీఆర్. రాజకీయాల్లో సక్సెస్ పుల్ పర్సనాలిటీస్. వాళ్లు సినిమాలనుండి ప్రజల్లోకెళ్లి, వారితో మమేకమైన బలాన్ని కూడగట్టుకుని రాజకీయంగా తమ ముద్ర వేశారు. నేటి నటులు కూడా అలాగే ఉన్నారా? నాగార్జున... క్రమశిక్షణ గల నటుడిగా, మనీ మేనేజ్ మెంట్ బాగా తెలిసిన నటుడిగా పేరు. ప్రజలకు అగ్రనటుడిగా తెలిస్తే, కాస్త దగ్గరిగా తెలిసిన వారికి మంచి బిజినెస్ మెన్ అని కూడా అర్థమవుతుంది. ఇలాంటి నాగార్జునకు అహ్మదాబాద్ లో ఏం పని? పరిగెత్తి మోడీగారిని కలవటం వెనుక కారణాలేంటి? మరో నటుడు పవన్ కల్యాణ్ జనసేన పేరుతో, భారీ సినిమా లాంటి హైప్ తో జనాల ముందుకొచ్చారు. కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. తెలుగు జాతి గౌరవం అంటూ చాలా చాలా మాటలు చెప్పారు. కానీ, ఎజెండా గురించి ఏం చెప్పలేదే అని ప్రజల్లో సందేహం అలాగే ఉంది. కానీ పవన్ ఎప్పుడైతే అహ్మదాబాద్ బాట పట్టారో అప్పటి నుంచి ప్రజల్ని మరింత అయోమయంలోకి నెట్టారు.
పవన్, నాగార్జున, మోహన్ బాబు, ఇదే వరుసలో మరికొందరు నటులున్నారు. విభజన తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీ అంతా హైదరబాద్ లోనే కాన్ సన్ ట్రేట్ అయి ఉంది. పైగా పెద్ద పెద్ద తారలు నిర్మాతల ఆస్తులు, వ్యాపారాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే పార్టీ ఇండస్ట్రీతో ఎలా వ్యవహరిస్తుందో ఊహించలేని విషయం. అందుకే, తమ ప్రయోజనాల కాపాడుకోటానికి తమ స్థానం నిలబెట్టుకోటానికి జాగ్రత్తపడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
పాలిటిక్స్ లోకి వస్తున్న నటుల లక్ష్యం ఏంటి..? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి పాలిటిక్స్ లోకి వచ్చిన వారి చిట్టా రాస్తే చాంతాడంత అవుతుంది. వీరిలో ఇకరిద్దరిని మినహాయిస్తే నిజంగా ప్రజలకోసం పాటుపడ్డవారు లేరని వాదనలున్నాయి. ధియేటర్ లో చప్పట్లను ఓట్లుగా మార్చుకుని, ఆ తర్వాత సినిమాలకే పరిమితమై పబ్లిక్ కి అంజాన్ గొట్టే నటులే ఎక్కువని ప్రజలంటున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చేవారు మాత్రం చేసేదేముందని ప్రశ్నిస్తున్నారు? ప్రజాసేవకు నటులు కట్టుబడి ఉండలేదని అందుకే చాలామంది ఒక్కసారి గెలుపుకు మాత్రమే పరిమితమయ్యారని విశ్లేషకుల వాదన. ఇప్పుడు కొత్తగా వచ్చే నటుల్లో కూడా ప్రజా సేవకు కట్టుబడి ఉండేవారు తక్కువే అంటున్నారు సినీ,రాజకీయ విశ్లేషకులు.
ఇంతకీ నాగార్జున మోడీకి ఎందుకు జై కొడుతున్నట్టు? వాస్తవానికి నాగార్జున అధికారంలో ఉన్నవారికి ఎప్పుడూ దగ్గరగానే ఉంటూ వచ్చారు. అది వైఎస్ అయినా, చంద్రబాబు అయినా.. ఇప్పుడు మోడీని కలవడం ద్వారా యువ సామ్రాట్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం అనే విషయం మాత్రం ఇప్పుడు స్పష్టంగా అర్థం అవుతోందని విశ్లేషకుల వాదన.
మోడీని కలవడం వెనుక రాజకీయాల కారణాలు లేవని నాగార్జున చెబుతున్నప్పటికీ ఆయన బిజెపి తరఫున ప్రచారం చేసే అవకాశాలు లేకపోలేదు. 2009 ఎన్నికల్లోనూ నాగార్జున వైయస్ రాజశేఖర్‌రెడ్డితోనూ బాగా సఖ్యతను ప్రదర్శించారు. పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసిడర్ గా సంక్షేమ పథకాలపై ప్రచారం చేశారు. నాగార్జున ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోకి చెందిన భూమి వినియోగంపై రాయతీలు పొందారనే వాదనలున్నాయి. వైఎస్సార్ మరణించాక ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలతోనూ నాగార్జున సఖ్యత కొనసాగించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుతోనూ సన్నిహిత సంబంధాలు మెయింటెయిన్ చేశారు.
అయితే, నాగార్జున మాత్రం మోడీని కలవటం వెనుక ఎలాంటి రాజకీయ ఎజెండా ఏదీ లేదన్నారు. తమ కుటుంబానికి పదవులు, రాజకీయాలు అక్కర్లేదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రగతికి తగిన విధంగా సహకరించాలని తాను మోడీని కోరినట్లు చెబుతున్నారు.
ఆస్తుల భద్రత కోసమేనా..? నాగార్జున మన్మధుడే కాదు.. బిజినెస్ మెన్ కూడా. సినీ నటుల్లో ఈ రేంజ్ లో సంపాదించిన మరొకరు లేరని టాక్. కానీ, వందల కోట్లలో ఉన్న ఆస్తుల్లో మేజర్ గా ఉన్న ఆస్తులు హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి. పైగా, అన్నపూర్ణ స్టూడియో లోని ఏడెకరాలని వ్యాపారావసరాలకు వాడుకుంటున్నట్టు టాక్ . ఇవి కాకుండా రియల్ ఎస్టేట్ లో బాగా ముందున్నట్టు సమాచారం. పైగా మా టివిలోను షేర్ ఉంది. ఇప్పుడు విభజన తర్వాత వాటి పరిస్థితి ఏంటా అనే బెంగ నాగ్ కు పట్టుకుందనే వాదనలున్నాయి. తన వందల కోట్ల ఆస్తులకు ఏ ప్రమాదం రాకుండా ఉండేందుకే, మోడీని కలిశారని పరిశీలకుల వాదన.
నాగ్ పై పలు ఆరోపణలు.. అక్కినేని నాగార్జునపై హైటెక్ సిటీ సమీపంలోని గురుకుల ట్రస్టు, తమ్మడి చెరువు భూములను ఆక్రమించినట్టు ఆరోపణలున్నాయి. మాదాపూర్‌లోని తమ్మిడి చెరువును నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కోసం 150 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఆక్రమించారంటూ లోకాయుక్తకు జనంకోసం అనే ఓ స్వచ్ఛంధ సంస్థ ఫిర్యాదు కూడా చేసింది. ఆ భూములను ప్రభుత్వానికి సమర్పించాలని కూడా డిమాండ్ చేసింది.
ఇక సినిమా నిర్మాణం కోసం అన్నపూర్ణ స్టూడియోను తీసుకుని అందులో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పెట్టడం ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందుతున్నట్టు గతంలో టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే, నాగార్జున చెప్తున్నట్టు రెండు రాష్ట్రాల అభివృద్ధి మాటేమో కానీ, తాను మాత్రం పవర్ ఎవరి చేతిలో ఉన్నా నష్టం రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది.
అసలు పవన్ లక్ష్యం ఏంటి? అది ఎవరు వదిలిన బుల్లెట్టో నిన్నటిదాకా ఎవరికీ అర్థం కాలేదు. సినిమాల్లో ఇమేజ్, ఒంటి చేత్తో పదిమందిని ఇరగదీసిన దమ్ము చూసి కోట్లాది మంది ప్యాన్స్ అయ్యారు. చేగువేరా బొమ్మ, విప్లవం ఛాయలు ధ్వనించే డైలాగ్స్ పవన్ కల్యాణ్ కి నటుల్లో ఓ డిఫరెంట్ ఫ్లేవర్ నిచ్చాయి. కానీ, పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినట్టే పెట్టాడు. అజ్ఞాతంలోకి జారి పోయాడు. అసలు తన ఎజెండా ఏంటో, ఏం చేయదలుచుకున్నాడో అయోమయపు మాటలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడనే వాదనలున్నాయి. పవన్ చేగువేరా పేరు చెప్పుకుంటూనే నరహంతకుడిని హత్తుకున్నాడు. విప్లవం మాటలు వల్లిస్తూనే, సామ్రాజ్యవాద ప్రతినిధితో కలిసిపోయాడు.
మార్పు రావాలంటూనే ఛాందసత్వాన్ని ఆహ్వానిస్తున్నాడు. శాంతి మంత్రాన్ని ఆలపిస్తూనే, వేలాది ప్రాణాలు తీసిన రక్తపు చేతులను పట్టుకున్నాడు గద్దర్ పాటకు గంతులేశానంటూనే, మతతత్వాన్ని కావలించుకున్నాడు. పవన్ ఇచ్చిన షాక్ నుండి ఫ్యాన్స్ ఇంకా తేరుకోలేదంటే ఆశ్చర్యపడనక్కర్లేదు.
పవన్ పార్టీ పెడుతున్నాడంటే సంతోషించిన వాళ్లు కూడా ఇప్పుడు పెదవివిరుస్తున్నారు. మోడీని కలిసినప్పుడే అసలు విషయం స్పష్టమైందంటున్నారు విశ్లేషకులు. ఇది ఎవరు వదిలిన బుల్లెట్టో, ఏ దారి వెతుక్కుంటూ పోతుందో, ప్రజలకు అర్థమయిందని చెప్తున్నారు.
చరిత్ర పరిశీలిస్తే..\ వీళ్లే మొదలు ఆఖరు కాదు. అసలు ఇప్పటిది కాదీ చరిత్ర. వెతుక్కుంటూ పోతే మూలాలు నలుపు తెలుపు కాలంలోనే కనిపిస్తాయి. సిల్వర్ స్క్రీన్ నుండి స్ట్రైట్ గా జనాల మధ్యకు దూకిన నటులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తారు. వెండితెర వెలుగులతో జనాల మధ్య కొచ్చి రాజకీయాల అంతు చూద్దామనే కోరిక చాలామందికి కలిగింది. అంచనాలు కొండంత ఉంటే, చేసింది మాత్రం రవ్వంతే.
నటులు పాలిటిక్స్ లోకి రావటం కొత్త విషయమేం కాదు. అయితే, కొందరు చరిత్ర సృష్టిస్తే, మరికొందరు మాత్రం నాలుగురోజులకే చాపచుట్టేశారు.. సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే వచ్చే ఇమేజ్ అలాంటిలాంటిది కాదు. సినిమాల్లో చేసే అద్భుతాలు నిజజీవితంలో అసాధ్యంగానో, కష్టసాధ్యంగానో కనిపించే సాహసాలు వాళ్లను ఎక్కడకో తీసుకెళతాయి. ఒక నిజంలాంటి భ్రమలో, భ్రమలాంటి కొత్త ప్రపంచంలో మొత్తంగా రియాల్టీకి దూరమయ్యే పరిస్థితి కొన్నిసార్లు వస్తుంది. ఇక్కడ అభిమానాన్ని కురిపించే కోట్లాది మందిని చూసి, వారే బలమనుకొని, రాజకీయాల్లోకి ఎంట్రీ కొట్టేస్తారు. ఇక్కడ హిట్టయ్యేవారి కంటే ఫట్టయ్యే వాళ్లే ఎక్కువ..
సరిగ్గా ఇప్పుడు కూడా అదే జరుగుతోందనే వాదనలున్నాయి. సేవ చేయాలన్న ధృక్పథం కంటే స్వప్రయోజనాల్ని కాపాడుకోవటమో లేక పదవులతో సరదా తీర్చుకోవటం తప్ప పాలిటిక్స్ ని నటులు సీరియస్ గా తీసుకున్న సందర్భాలు తక్కువే అని పరిశీలకుల వాదన.
సినిమా వేరు రాజకీయాలు వేరు.. నటనకు జీవితానికి చాలా తేడా ఉంది. అలరించటం, అభిమానుల గుండెల్లో చిరకాలం నిలిచిపోవటం నటులకున్న వరం. కానీ, ఇంకో అడుగు ముందుకేసి ప్రజల మధ్యే ఉండి సేవ చేస్తానంటే తప్పు లేదు. కానీ, అక్కడ నటన కుదరదు, వాస్తవంలోకి రావాల్సిందే. ఈ లాజిక్ తెలియక ఎక్కడ నటించాలో, ఎక్కడ జీవించాలో తెలియని కన్ఫ్యూజన్ లో కొందరు నటులు ప్రయాస పడుతుంటారు. అభిమానుల్నీ గందరగోళపెడతారు. చాలా కొద్దిమంది నటులు మాత్రమే జనబాహుళ్యానికి దగ్గరై, వారిలో మమేకమై సమాజం కోసం నిజాయితీగా నిలబడతారు.. అలాంటి వ్యక్తులకు ప్రజలెప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉంటారు.. (This story was telecasted in 10tv - 20 March 2014, Thursday) ......................................
గత శతాబ్దపు తొలి రోజుల్లో, తెర మీద కదిలే బొమ్మల కళగా చలనచిత్రం ముందుకొస్తున్న మొదటినాళ్ళలో తన సమకాలికులు చాలా మంది కన్నా చలనచిత్ర రూపకల్పనలోని కళనూ, టెక్నిక్‌నూ మరింత మెరుగ్గా అర్థం చేసుకున్న భారతీయుడు-దాదాసాహెబ్ ఫాల్కే. ఆయన రూపొందించిన తొలి మూవీ ‘రాజా హరిశ్చంద్ర’ (1913). భారతదేశంలో తయారైన తొలి పూర్తి నిడివి కథాకథనాత్మక చిత్రంగా ఆ సినిమా చరిత్రకెక్కింది. అలా తొలి భారతీయ ఫీచర్ ఫిల్మ్‌కు దర్శక, నిర్మాత కావడంతో దాదాసాహెబ్ ఫాల్కే ‘భారత చలనచిత్ర పరిశ్రమకు పితామహుడి’గా విశిష్టతను సంపాదించుకున్నారు. ‘దాదాసాహెబ్’గా ప్రసిద్ధుడైన ఆయన అసలు పేరు - ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. 1870 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని త్రయంబకంలో సంస్కృత పండితుల ఇంట జన్మించిన ఆయన ఎంతో శ్రమించి, తన సినీ కళా తృష్ణను తీర్చుకున్నారు.
అప్పట్లో అన్నీ ఆయనే: ఈ కళా మాధ్యమం కొత్తగా దేశంలోకి వస్తున్న ఆ రోజుల్లో ఆయన వట్టి దర్శకుడు, నిర్మాతే కాదు. తన సినిమాకు తానే రచయిత, కళా దర్శకుడు, కెమేరామన్, కాస్ట్యూమ్ డిజైనర్, ఎడిటర్, ప్రాసెసర్, ప్రింటర్, డెవలపర్, ప్రొజెక్షనిస్టు, డిస్ట్రిబ్యూటర్ కూడా అంటే ఇవాళ ఆశ్చర్యం కలుగుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కెమేరా, ప్రాసెసింగ్ యంత్రం, ముడి ఫిల్మ్ మినహా మిగతాదంతా దేశవాళీ సాంకేతిక నైపుణ్యంతో ఫాల్కే తొలి ఫీచర్‌ఫిల్మ్ ‘రాజా హరిశ్చంద్ర’ తీయడం ఓ చరిత్ర. తెరపై బొమ్మలు కదలడమే తప్ప మాట్లాడని ఆ మూకీ సినీ యుగంలో దాదాపు పాతికేళ్ళ వ్యవధిలో ఆయన 100 సినిమాలు, 30 లఘు చిత్రాలు రూపొందించారు. సినిమా మాట నేర్చి, టాకీలు వచ్చాక ఆయన హిందీ, మరాఠీ భాషల్లో కొల్హాపూర్ సినీటోన్‌కు ‘గంగావతరణ్’ తీశారు. ఫాల్కేకు అదే తొలి టాకీ అనుభవం. తీరా అదే ఆయన ఆఖరి చిత్రం కూడా కావడం విచిత్రం. చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలై, చిత్ర పరిశ్రమలో తగినంత గుర్తింపునకు కూడా నోచుకోని ఫాల్కే 1944 ఫిబ్రవరి 16న నాసిక్‌లో కన్నుమూశారు.
అత్యున్నత సినీ పురస్కారం: మన దేశ సినీపరిశ్రమకు పునాదులు వేసిన తొలితరం వ్యక్తి ఫాల్కేను నిరంతరం గుర్తు చేసుకొనేందుకు వీలుగా ఆయన శతజయంతి సందర్భంగా ఆయన పేరు మీద భారత ప్రభుత్వం 1969లో ప్రత్యేకంగా ఓ అవార్డును నెలకొల్పింది. అలాగే, శతజయంతి పూర్తయిన వేళ భారత తంతి, తపాలా శాఖ 1971 ఏప్రిల్ 30న ఫాల్కేపై ప్రత్యేక తపాలా బిళ్ళ, కవరు విడుదల చేసింది. భారతీయ సినిమా పురోభివృద్ధికి వివిధ మార్గాలలో విశేషంగా సేవలందించిన సినీ రంగ కురువృద్ధులకు ఒకరికి ప్రతి ఏటా ప్రత్యేక గుర్తింపుగా ఇచ్చే అత్యున్నత పురస్కారమే -‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’. దీన్ని ‘భారతీయ ఆస్కార్ అవార్డు‘గా పరిగణిస్తారు. జీవన సాఫల్యంగా ఇచ్చే పురస్కారం 1969లో నటి దేవికారాణి మొదలుకొని తాజాగా 2013వ సంవత్సరానికి గాను కవి, దర్శక, నిర్మాత గుల్జార్ వరకు ఇప్పటి వరకు 45 మంది భారతీయ సినీ దిగ్గజాలను వరించింది. మొదట్లో ఈ పురస్కార గ్రహీతలకు ఓ ప్రశంసా ఫలకం, శాలువా, రూ. 11 వేల నగదుతో సత్కరించేవారు. కాలక్రమంలో అది పెరుగుతూ వచ్చి, గడచిన పదేళ్ళ నుంచి ‘ఫాల్కే అవార్డు గ్రహీత’లను స్వర్ణ కమలం, శాలువా, పది లక్షల రూపాయల నగదుతో సత్కరిస్తున్నారు. ఈ అవార్డును అందుకున్న తెలుగువారిలో అన్నదమ్ములైన దర్శకుడు బి.ఎన్. రెడ్డి (1974), నిర్మాత బి. నాగిరెడ్డి(’86), అలాగే మూకీ కాలం నుంచి నటుడైన హైదరాబాదీ పైడి జైరాజ్ (’80), దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ (’82), హీరో అక్కినేని నాగేశ్వరరావు (’90), నిర్మాత డి. రామానాయుడు (2009), హైదరాబాద్‌తో అనుబంధమున్న దర్శకుడు శ్యామ్ బెనెగల్ (2005) ఉన్నారు. మన దర్శక, నిర్మాతల్లో, సాంకేతిక నిపుణుల్లో ఆ స్థాయిని అందుకొనే అర్హత ఇంకా చాలామందికి ఉన్నా, ఆ గౌరవం దక్కకపోవడం మాత్రం విషాదమే! - రెంటాల జయదేవ