గత శతాబ్దపు తొలి రోజుల్లో, తెర మీద కదిలే బొమ్మల కళగా చలనచిత్రం ముందుకొస్తున్న మొదటినాళ్ళలో తన సమకాలికులు చాలా మంది కన్నా చలనచిత్ర రూపకల్పనలోని కళనూ, టెక్నిక్‌నూ మరింత మెరుగ్గా అర్థం చేసుకున్న భారతీయుడు-దాదాసాహెబ్ ఫాల్కే. ఆయన రూపొందించిన తొలి మూవీ ‘రాజా హరిశ్చంద్ర’ (1913). భారతదేశంలో తయారైన తొలి పూర్తి నిడివి కథాకథనాత్మక చిత్రంగా ఆ సినిమా చరిత్రకెక్కింది. అలా తొలి భారతీయ ఫీచర్ ఫిల్మ్‌కు దర్శక, నిర్మాత కావడంతో దాదాసాహెబ్ ఫాల్కే ‘భారత చలనచిత్ర పరిశ్రమకు పితామహుడి’గా విశిష్టతను సంపాదించుకున్నారు. ‘దాదాసాహెబ్’గా ప్రసిద్ధుడైన ఆయన అసలు పేరు - ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. 1870 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని త్రయంబకంలో సంస్కృత పండితుల ఇంట జన్మించిన ఆయన ఎంతో శ్రమించి, తన సినీ కళా తృష్ణను తీర్చుకున్నారు.
అప్పట్లో అన్నీ ఆయనే:
ఈ కళా మాధ్యమం కొత్తగా దేశంలోకి వస్తున్న ఆ రోజుల్లో ఆయన వట్టి దర్శకుడు, నిర్మాతే కాదు. తన సినిమాకు తానే రచయిత, కళా దర్శకుడు, కెమేరామన్, కాస్ట్యూమ్ డిజైనర్, ఎడిటర్, ప్రాసెసర్, ప్రింటర్, డెవలపర్, ప్రొజెక్షనిస్టు, డిస్ట్రిబ్యూటర్ కూడా అంటే ఇవాళ ఆశ్చర్యం కలుగుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కెమేరా, ప్రాసెసింగ్ యంత్రం, ముడి ఫిల్మ్ మినహా మిగతాదంతా దేశవాళీ సాంకేతిక నైపుణ్యంతో ఫాల్కే తొలి ఫీచర్‌ఫిల్మ్ ‘రాజా హరిశ్చంద్ర’ తీయడం ఓ చరిత్ర. తెరపై బొమ్మలు కదలడమే తప్ప మాట్లాడని ఆ మూకీ సినీ యుగంలో దాదాపు పాతికేళ్ళ వ్యవధిలో ఆయన 100 సినిమాలు, 30 లఘు చిత్రాలు రూపొందించారు. సినిమా మాట నేర్చి, టాకీలు వచ్చాక ఆయన హిందీ, మరాఠీ భాషల్లో కొల్హాపూర్ సినీటోన్‌కు ‘గంగావతరణ్’ తీశారు. ఫాల్కేకు అదే తొలి టాకీ అనుభవం. తీరా అదే ఆయన ఆఖరి చిత్రం కూడా కావడం విచిత్రం. చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలై, చిత్ర పరిశ్రమలో తగినంత గుర్తింపునకు కూడా నోచుకోని ఫాల్కే 1944 ఫిబ్రవరి 16న నాసిక్‌లో కన్నుమూశారు.
అత్యున్నత సినీ పురస్కారం:
మన దేశ సినీపరిశ్రమకు పునాదులు వేసిన తొలితరం వ్యక్తి ఫాల్కేను నిరంతరం గుర్తు చేసుకొనేందుకు వీలుగా ఆయన శతజయంతి సందర్భంగా ఆయన పేరు మీద భారత ప్రభుత్వం 1969లో ప్రత్యేకంగా ఓ అవార్డును నెలకొల్పింది. అలాగే, శతజయంతి పూర్తయిన వేళ భారత తంతి, తపాలా శాఖ 1971 ఏప్రిల్ 30న ఫాల్కేపై ప్రత్యేక తపాలా బిళ్ళ, కవరు విడుదల చేసింది. భారతీయ సినిమా పురోభివృద్ధికి వివిధ మార్గాలలో విశేషంగా సేవలందించిన సినీ రంగ కురువృద్ధులకు ఒకరికి ప్రతి ఏటా ప్రత్యేక గుర్తింపుగా ఇచ్చే అత్యున్నత పురస్కారమే -‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’. దీన్ని ‘భారతీయ ఆస్కార్ అవార్డు‘గా పరిగణిస్తారు. జీవన సాఫల్యంగా ఇచ్చే పురస్కారం 1969లో నటి దేవికారాణి మొదలుకొని తాజాగా 2013వ సంవత్సరానికి గాను కవి, దర్శక, నిర్మాత గుల్జార్ వరకు ఇప్పటి వరకు 45 మంది భారతీయ సినీ దిగ్గజాలను వరించింది. మొదట్లో ఈ పురస్కార గ్రహీతలకు ఓ ప్రశంసా ఫలకం, శాలువా, రూ. 11 వేల నగదుతో సత్కరించేవారు. కాలక్రమంలో అది పెరుగుతూ వచ్చి, గడచిన పదేళ్ళ నుంచి ‘ఫాల్కే అవార్డు గ్రహీత’లను స్వర్ణ కమలం, శాలువా, పది లక్షల రూపాయల నగదుతో సత్కరిస్తున్నారు.
ఈ అవార్డును అందుకున్న తెలుగువారిలో అన్నదమ్ములైన దర్శకుడు బి.ఎన్. రెడ్డి (1974), నిర్మాత బి. నాగిరెడ్డి(’86), అలాగే మూకీ కాలం నుంచి నటుడైన హైదరాబాదీ పైడి జైరాజ్ (’80), దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ (’82), హీరో అక్కినేని నాగేశ్వరరావు (’90), నిర్మాత డి. రామానాయుడు (2009), హైదరాబాద్‌తో అనుబంధమున్న దర్శకుడు శ్యామ్ బెనెగల్ (2005) ఉన్నారు. మన దర్శక, నిర్మాతల్లో, సాంకేతిక నిపుణుల్లో ఆ స్థాయిని అందుకొనే అర్హత ఇంకా చాలామందికి ఉన్నా, ఆ గౌరవం దక్కకపోవడం మాత్రం విషాదమే!
- రెంటాల జయదేవ
(Published in Sakshi daily, 30th Apr 2014, Wednesday)
..........................................................
నిష్పాక్షికత- అనేది ఎంతవరకు సాధ్యమో!
2 days ago
0 వ్యాఖ్యలు:
Post a Comment