జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, May 8, 2014

సినీతారలు ఎన్నికల్లో గెలుపోటముల్ని మార్చగలరా..?!

తెలంగాణలో మైకులు బంద్ అయ్యాయి. ప్రచారం ముగిసింది. ఇక జరగాల్సిన తంతు మిగిలింది. అయితే, ఇన్ని రోజుల ప్రచారంలో నటుల హడావుడి ఎన్నడూ లేనంత పీక్స్ కి చేరింది. స్టార్ హీరోల నుండి అవకాశాల్లేక ఖాళీగా ఉన్న బాబులు, బుల్లితెర నటులు అంతా మండుటెండలో వివిధ పార్టీల తరపున ఓట్ల వేటలో శ్రమించారు. ప్రచారంలో ఒకటే హడావుడి చేశారు. వెండితెరపై కనిపిస్తే చాలు. ఎక్కడలేని ఇమేజ్ వచ్చేస్తుంది. మామూలు మనుషులకు అతీతం అనేలా తయారు చేస్తుంది. మరి, ఈ ఇమేజ్ కు ఓట్లు తెచ్చిపెట్టేంత శక్తి ఉందా? అసలు నటుల మీటింగ్ లకు వచ్చిన జనం అంతా సరదాగా వాళ్లని చూడ్డానికి మాత్రమే వచ్చారా? లేక అవన్నీ ఓట్లుగా మారతాయా? అనే ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి.

వాళ్లకంత సీన్ లేదా..?
    సిల్వర్ స్క్రీన్ ఓ మత్తు ఓ మాయాజాలం. ప్రేక్షకులకే కాదు. నటులకు కూడా. థియేటర్ లో మోగే చప్పట్లు, ఈలలు వాళ్లను సరికొత్త లోకానికి తీసుకెళతాయి. ప్రేక్షకుల అభిమానం మామూలు మనుషుల నుండి నటులకు ఓ ప్రత్యేకతను ఆపాదిస్తుంది. ఒంటి చేత్తో పది మందిని ఇరగదీసినట్టే, కంటి చూపుతో కాల్చేసినట్టే, బయట కూడా ఏదైనా చేయగలమనుకుంటారు. ఆ వేడిలోంచే పాలిటిక్స్ వైపు అడుగులేస్తారు. కానీ, నటనకు పడే చప్పట్లన్నీ ఓట్లుగా మారవని రియలైజ్ కావటానికి కొంచెం సమయం పడుతుందని పరిశీలకుల అభిప్రాయపడుతున్నారు.
చిరంజీవి..
    నల్లటి అద్దాల మాటున ఉన్నంత సేపే విలువ. కనిపించీ కనిపించనట్టు తిరుగుతూ ఉంటేనే బ్రాండ్ విలువ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పబ్లిక్ లోకి ఎంట్రీ ఇస్తారో బ్యాంక్ ఎకౌంట్లో సొమ్ము కరిగినట్టు, ఇమేజ్ కూడా డైల్యూట్ అవుతుంది. ఒకరిద్దరు తప్ప ఎంతో మంది నటుల విషయంలో ఇది ప్రూవ్ అవుతూనే ఉంది. ఉదాహరణకు మన మెగాస్టార్ కి ఒకప్పుడు ఎంత హంగామా ఉండేది. చిరు అంటే ఓ రేంజ్. అతని డైలాగ్, డాన్స్, ఫైట్స్ ఫ్యాన్స్ ని పిచ్చెక్కించేవి. మరి ఇప్పుడు చిరు అలా పక్కనించి పోతున్నా, తేలికగా తీసుకునే వాళ్లు ఎంతోమంది. రాజకీయాల్లో చేరి వాస్తవ రూపం ప్రజలకు అందుతూ, ఇమేజ్ బద్దలైపోయి భ్రమలు వీడితే ఇలాగే జరుగుతుందని పరిశీలకుల అభిప్రాయం.


రోజా..
   అదే రోజాని తీసుకుంటే ఆమె స్టార్ హీరోయిన్. అందంతో అభినయంతో ఆకట్టుకున్న నటి. కానీ రాజకీయాల్లో ఆమె మాటల్ని ప్రజలు ఏనాడూ పట్టించుకోలేదు. మీటింగ్ లో ఆమెను చూడ్డానికే ఎగబడ్డారు కానీ, ఓటేయటానికి కాదని రుజువయింది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.


గెలుపోటములను సినీ నటులు రాయగలరా?
    రాజకీయ నాయకుల గెలుపోటములను సినీ నటులు రాయగలరా? అదే నిజమైతే ఈ పాటికి రాజకీయాలు వేరే డైరక్షన్ లో ఉండేవి. ఇండస్ట్రీ కరిష్మాను అడ్డు పెట్టుకుని ఓ దుమ్ము రేపేద్దామని రాజకీయనేతలు కూడా ఆశపడుతుంటారు. దానికోసం సిల్వర్ స్క్రీన్ నుండి బాబుల్ని ఇంపోర్ట్ చేసుకునే పనిలో పడతారు. కానీ, ఆ ఇమేజ్ ప్రచారంలో టైం పాస్ పాప్ కార్న్ లా తప్ప పెద్ద ఎఫెక్ట్ ఉండదని ఎన్నో సార్లు రుజువయింది. థియేటర్ లో చప్పట్లు మోగినంత మాత్రాన, వాళ్లు చెప్పే మాటల్ని జనాలు వింటారని, నమ్మేస్తారని భావించలేమని విశ్లేషకుల అభిప్రాయం.


తారల ప్రచారంపై తగ్గిన ఆసక్తి..
    ఎన్నికల ప్రచారంలో సినీ తారలు జోరుగా పాల్గొంటున్నా ప్రజలకు మాత్రం మొహం మొత్తినట్లుగా కనిపిస్తోంది. ఓటర్లకు తారల ప్రచారంపై ఆసక్తి తగ్గిపోయినట్లుగా ఉంది. తారలు ప్రచారం చేస్తున్నా సినిమా తార అనే అభిమానంతో వచ్చినా ఈ ప్రచార ప్రభావం ఓటర్లపై అంతగా పడే పరిస్థితి ఇప్పుడు లేదని విశ్లేషకులు అంటున్నారు.


సినీ తారల పట్ల తగ్గిన ఆదరణ..
    సినీ తారల పట్ల రాను రాను తెలుగు ఓటర్లలోనూ కొంత ఆదరణ తగ్గుతోందనిపిస్తుంది. ఇప్పటికీ సినీ గ్లామర్ అంటే ఆకర్షణ ఉంది. తమ అభిమాన నటులు వస్తే జనం ఎగబడతారు. అంతే కానీ ఏదో ఒక పార్టీ తరపున ప్రచారం చేస్తే వారి మాటలకు ప్రభావితమై ఓట్లు రాలే సీన్ లేదని విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యేకించి ఈ ఎన్నికల్లో పార్టీల్లో చేరిన వారే ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. పార్టీకి సంబంధం లేని వారు ఈసారి ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. గతంలో కూడా తారలు ప్రచారం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2004 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అభ్యర్థుల గెలుపు కోసం నటులు ప్రచారం చేశారు. ఈ ట్రెండ్‌ కాస్తో కూస్తో 2009 ఎన్నికల్లోనూ కొనసాగింది. 2004లోనూ, 2009లోనూ స్టార్లు ఎక్కడ సభలు పెట్టినా జనం వచ్చారు. కానీ ఓట్లు మాత్రం రాల్లేదు.


పని చేయని సినీ గ్లామర్...
    2009లో రాష్ట్ర రాజకీయ వెండితెరపై సినీ గ్లామర్ ఏమాత్రమూ పని చేయలేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ప్రజారాజ్యం పార్టీ అట్టర్ ఫ్లాపై చతికిలపడింది. తిరుగులేని అభిమానాన్ని సంపాదించుకున్న హీరో చిరంజీవి తో పాటు పవన్ కల్యాణ్ కూడా కాలికి బలపం కట్టుకుని తిరిగి ఎంతగా ప్రచారం చేసినా లాభం లేకపోయింది. చిరు హోల్ ఫ్యామిలీ అంతా జనాల్లోకి వచ్చినా తేలికగా తీసుకున్నారు. 2009 ఎన్నికల్లో చిరంజీవికి ధీటుగా బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ రంగంలోకి దిగారు. బాలకృష్ణ మీసాలు మెలేసి తొడకొట్టారు. జూనియర్ సీనియర్ వేషంలో సుడిగాలి పర్యటన చేశాడు. కానీ, నో యూజ్. రాజకీయాలు వేరు, సినిమాలు వేరనడానికి మన ఎన్నికలే నిదర్శనంగా నిలుస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.


తుస్సుమన్న పవన్..
    జనసేన పేరుతో పవన్‌ కల్యాణ్‌ సొంత కుంపటి పెట్టినా టిడిపి, బిజెపికి మద్దతు ఇచ్చి తుస్సుమనిపించారు. జనసేనపార్టీతో కాంగ్రెస్‌, టిడిపి, బిజెపి, వైసిపి పార్టీలకు చుక్కలు చూపిస్తాడనిపించినా చివరకు ట్రాక్ మార్చేశాడు. వాస్తవానికి గతంలో సామాజిక తెలంగాణ అంటూ పీఆర్పీ తరపున పవన్ తెలంగాణలో ప్రచారం చేశాడు. కానీ, ఇంతా చేస్తే వచ్చింది రెండు సీట్లే. ఇప్పుడు పవన్ ప్రచారానికి మాత్రం అంతకంటే ప్రభావం ఉండకపోవచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి.


బలహీనంగా సినీ తారల ప్రచార..
    ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చాయంటే తారలు తళుక్కు మనేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక తెలుగునాట ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెలుగు సినీ తారల ప్రచార భాగస్వామ్యం చాలా బలహీనంగా ఉందంటున్నారు విశ్లేషకులు.


పార్టీల్లో సినీ గ్లామర్..
    ప్రతీ ఎన్నికల్లోనూ సినీ తారలు గ్లామర్ కెరీర్ నుంచి పొలిటికల్ కెరీర్ కు షిప్ట్ అయినా ఒకరిద్దరు మాత్రమే నిలదొక్కుగోగలిగారు. దక్షణాదిన నందమూరి తారకరామారావు , ఎన్జీ రామచంద్రన్, జయలలిత లాంటి వారు మాత్రమే అటు ప్రచారం, ఇటు రాజకీయ జీవితంలో నిలదొక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చాయంటే తారలు తళుక్కు మనేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక తెలుగునాట ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెలుగు సినీ తారలు విభజన సెగల మధ్య ఆచి తూచి అడుగేస్తున్నారు.


తగ్గిన తెలుగు తారల జోరు..
    ఈ ఎన్నికల్లో సినీ నటులు బాలకృష్ణ, మురళీమోహన్, బాబుమోహన్, జయసుధ, రోజా, విజయశాంతి, హేమ మరికొందరు నటులు పాల్గొంటున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రచార సారథి చిరంజీవి తమ పార్టీ అభ్యర్థుల తరపున ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం మోడీ పాటపాడుతుంటే, కృష్ణంరాజు బిజెపి సీమాంధ్ర ప్రచార కమిటీ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. పార్టీలన్నీ మారి సెకండ్ రౌండ్ మొదలుపెట్టనున్న జీవిత, రాజశేఖర్ కూడా బిజెపి తరపున ప్రచారంలో ఉన్నారు. నాగార్జున మోడీకి మద్దతు ప్రకటించినప్పటికి, ఎన్నికల ప్రచారంలో మాత్రం పాల్గొనడం లేదు. కమెడియన్లు అలీ, వేణుమాధవ్‌ టిడిపిలో చేరినా వారికి సీట్లు దక్కలేదు. తారలు ప్రచారంలో పాల్గొంటున్న కారణాలేవైనా, సినిమా ఇమేజ్ మాత్రమే పబ్లిక్ ని రప్పిస్తుందని, అవి ఓట్లుగా మారే అవకాశాలు తక్కువే అని గత అనుభవాలు చెప్తున్నాయి. ఈ సారి ఏం జరుగుతుందో వేచి చూడాలి. 


(Telecasted in 10tv= WIDE ANGLE programme, 28th April 2014, Monday)
.................................

0 వ్యాఖ్యలు: