జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, April 27, 2015

నిదురిస్తున్న తోటలోకి... పాట ఒకటి వచ్చింది!

మీరెప్పుడైనా రాజమండ్రి వెళ్ళారా? అక్కడి దేవిచౌక్ సెంటర్‌కు వెళ్ళండి. ఒక భవనంలో మేడ మీద చిన్న గదిని బయట నుంచి చూస్తే, సవాలక్ష వ్యాపార దుకాణాల్లో అదీ ఒకటనే అనిపిస్తుంది. కానీ, ‘జనరంజని ఆడియో లైబ్రరీ’ అనే ఆ గదిలోని ర్యాకుల్లో ఎనభై మూడేళ్ళ తెలుగు సినీ చరిత్రకు సంబంధించిన కీలకమైన సాక్ష్యాధారాలున్నాయని ఎవరూ ఊహించరు. ఆ షాపు కాని షాపులోకి వెళితే కొద్ది గంటల వ్యాపార పనులు మినహాయిస్తే, రాత్రీ పగలూ అక్కడే నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ గడిపే నలభై ఎనిమిదేళ్ళ గోలి సాయిబాబు కనిపిస్తారు. గడచిన పదిహేడేళ్ళుగా తాను సాగిస్తున్న సినీ గీత సమాచార సేకరణతో సినీ ప్రియులకూ, పరిశోధకులకూ సాదరంగా స్వాగతం పలుకుతారు.

1932 ఫిబ్రవరి 6న విడుదలైన తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ మొదలు రానున్న బాలకృష్ణ ‘లయన్’ దాకా ఈ ఎనభై మూడేళ్ళలోని దాదాపు 6 వేల నేరు తెలుగు సినిమాల్లోని 90 శాతం పాటల సమాచారాన్ని ఆనందంగా పంచుకుంటారు. తెలుగు సినీ చిత్రగీతాల వివరాలతో 1200 పేజీల్లో నాలుగు భాగాలుగా నాలుగు పుస్తకాలను అందించే ప్రయత్నంలో ఉన్నారాయన. ఇప్పటికే అందులో రెండు సంపుటాలు ‘జన రంజని... రాగం తానం పల్లవి’ పేరిట వెలువరించారు. ఇళయరాజా స్వరపరచిన తెలుగు పాటలన్నిటి సమాచారంతో ‘రాగబంధం’ అనే సినీగీత మాలికను తాజాగా ప్రచురించారు. ఇలాంటి మరిన్ని ప్రచు రణలతో సినీగీత సమాచారఖనిగా అవతరిస్తున్న పరిశోధకుడు కాని పరిశోధకుడు గోలి సాయిబాబు ప్రస్థానం చాలా చిత్రంగా అనిపిస్తుంది.


నిదురిస్తున్న తోటలోకి...  పాట ఒకటి వచ్చింది!

సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన సాయిబాబుది స్వస్థలం - తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి 3 కిలోమీటర్ల దూరంలోని వడ్లమూరు గ్రామం. పదేళ్ళ క్రితం రాజ మండ్రి వచ్చి, స్థిరపడ్డారు. ‘‘మా నాన్న గారు రైతు. అయితే, ఆయనకు సినిమా పాటలంటే మహా ఇష్టం. రేడియోలో, ఆయన ఇంటికి తెచ్చిన ఆడియో క్యాసెట్లలో పాటలు వినడం ద్వారా చిన్నప్పటి నుంచి వాటి మీద ఆసక్తి పెరిగింది’’ అని సాయిబాబు వివరిస్తారు.

నిజం చెప్పాలంటే, న్యాయశాస్త్రంలో డిగ్రీ వరకు చదువుకొన్న ఆయన చివరకు ఈ సినిమా పాటల సమాచార సేకరణ, ముద్రణే తన జీవితమవుతుందని ఎన్నడూ ఊహించ లేదు. ఆయన భార్య కూడా ‘లా’ గ్రాడ్యుయేటే. కానీ, ‘లా’ ప్రాక్టీస్ చేసే బదులు, ఓడరేవుల్లో సరుకుల ఎగుమతి, దిగుమతికి సంబంధించిన క్లియరెన్సులు చూసే ‘క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్’ అవ్వాలని మొదట్లో ఆయన భావించారు. అందుకోసం విశాఖ పట్నంలో మూడేళ్ళు అంతా నేర్చుకొని, పరీక్ష పాసై, లెసైన్‌‌స కూడా సంపాదించారు. తీరా అప్పటి కాకినాడ పోర్టును ప్రైవేట్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అశనిపాతమైంది. ‘‘ఊహించని ఆ ఎదురుదెబ్బ నా జీవితాన్ని మలుపు తిప్పింది’’ అంటారాయన. విశాఖలోని ‘సర్వారాయుడు ప్రెస్’ చూసి, ముద్రణ రంగం వైపు మొగ్గారు. అయితే, సొంతంగా ప్రెస్ నడపడం కష్టమన్న మిత్రుల సలహా మేరకు, ప్రచురణ రంగానికి పరిమితమయ్యారు.

అప్పుతో మొదలైన ఆసక్తికర సేకరణ

మరి, ఈ సినిమా పాటల సమాచార ప్రచురణ ఆసక్తి ఎలా కలిగింది? ‘‘1997లో నాకు ఇష్టమైన కొన్ని పాటలు రికార్‌‌డ చేయించుకోవాలనుకున్నా. తీరా చూస్తే వాటి సమాచారం దొరకలేదు. ఎవరూ సరిగ్గా చెప్పలేకపోయారు. నా లాంటి పాత పాటల ప్రియులకు సమాచారం దొరకడం ఎంత కష్టంగా ఉందో అప్పుడు తెలిసింది. హిందీలో సినీ గీతాల సమాచారంతో ‘గీత కోశాలు’న్నట్లే, తెలుగులోనూ ఉంటే ఎంత బాగుండనిపించింది’’ సరిగ్గా అదే సమయంలో ఊళ్ళో ఒకాయన పాటల రికార్డింగ్ షాపు తీసేస్తుంటే, పాటల మీద ప్రేమతో ఏకంగా ఆ షాపులోని గ్రావ్‌ుఫోన్ రికార్డులు, ఆడియో క్యాసెట్లు ‘‘ఇంట్లో తెలియకుండా రూ. 30 వేలు అప్పు చేసి, కొనేశా. అవన్నీ ఇంట్లో పెడితే తెలుస్తుందని, నా మిత్రుడి షాపులో అప్పజెప్పాను. అప్పట్లో వాటితో వ్యాపారం చేయాలని కూడా నాకు తెలీదు. ఆసక్తితో చేశాను’’ అంటారాయన. అలా మొదలైన ఆయన పాటల సేకరణ ఇవాళ తెలుగు సినిమా చరిత్రలోని 90 శాతం పాటల స్థాయికి చేరింది. ఈ సమాచారం సినిమా పత్రికలు, పుస్తకాల దాకా పాకింది.

ప్రామాణికంగా సినీగీత సమాచారం

అయితే, ఆ సమాచారం, పాటల వివరాలు కేవలం తన ఒక్కడికే పరిమితం కాకుండా, అందరికీ పంచాలనుకున్నారు. ఆడియో క్యాసెట్ల ముఖచిత్రాలు, గ్రావ్‌ుఫోన్ కవర్లు, 5 వేల పైచిలుకు నేరు - డబ్బింగ్ తెలుగు సినిమాల వీడియోలు ఆయనకు ప్రాథమిక ఆధారాలయ్యాయి. 1932 నుంచి 2010 దాకా విడుదలైన ప్రతి తెలుగు సినిమా పేరు, నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, తారాగణం, ఆ చిత్ర గీతాల మొదటి లైన్లు - సంవత్సరాల వారీగా ఆయన సిద్ధం చేశారు.

‘జన రంజని... రాగం... తానం... పల్లవి’ అనే నాలుగు భాగాల పుస్తకంలో 3వ భాగం (1989-2005), 4వ భాగం (2006-2010) ఇప్పటికే వెలువడ్డాయి. ఇక, 1932 నుంచి 1975 వరకు పాటల సమాచారంతో మొదటి భాగం, 1976 నుంచి 1988 దాకా సమా చారంతో రెండో భాగం రానున్నాయి. అలాగే, తెలుగు సినిమాల్లో యాక్టర్, రచయిత, సింగర్, సంగీత దర్శకుల వారీగా 1980ల చివరి దాకా వచ్చిన 3650 ప్రసిద్ధమైన గీతాల వివరాలను ‘జనరంజని’ అనే చిరు పుస్తకంలో ఇప్పటికే అందించారు. గాయకులు రామ కృష్ణ, ఏసుదాస్, రచయితలు దేవులపల్లి, సినారె, కొసరాజు తదితరుల సమస్త సినీగీత వివరాల పుస్తకాలకూ డేటా సిద్ధం చేస్తున్నారు. ఆ సమాచారాన్నంతా ‘జనరంజని ఆడియో లైబ్రరీ’ (ఫోన్: 93901 58999)లో అందరికీ అందుబాటులో ఉంచారు. ఎవరైనా వచ్చి, వాటిని రిఫర్ చేసుకోవచ్చు.

పాటకు కేరాఫ్ అడ్రస్

బరువు తక్కువ కాగితంలో, అందుబాటు వెలలో సినీగీత సమాచార పుస్తకాలు తేవడం సాయిబాబు ప్రత్యేకత. తాజాగా ఇళయరాజా తెలుగులో చేసిన 347 సినిమాల్లోని 1800 పాటల వివరాలూ ‘రాగబంధం’ అనే పుస్తకంగా తెచ్చారు. పుస్తక విక్రేతలు అమ్మకం ధరలో 40 శాతం తీసేసుకుంటుండడంతో, తానే స్వయంగా తన బుక్స్ విక్రయిస్తున్నారు

పరిశ్రమ పట్టించుకోని బృహత్తర ప్రయత్నం

‘‘సినిమా చరిత్రకు సంబంధించి ఎవరూ ఎవరికీ సమాచారం అందించని దాపరికం ఉంది. అందుకే, నా దగ్గర ఉన్న సమాచారం మొత్తాన్ని అందరికీ అందించాలని పుస్తకాలుగా తెస్తున్నా’’ అని ఈ ఔత్సాహిక సినీగీత  సేకర్త, అపర పరిశోధకుడు చెప్పారు. ఈస్టిండియా ‘లవకుశ’ (1934) పాటల నుంచి ఆడియో, 1935 నుంచి తెలుగు సినిమాల వీడియోలు సాయిబాబు దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ ఏ ఊరెళ్ళినా, తన దగ్గర లేని పాటలు, సినిమాల లిస్టు పెట్టుకొని, వాటి సేకరణలో నిమగ్నమవుతారు. ఇందుకోసం ఇప్పటికి కొన్ని లక్షలు ఖర్చుచేశారు. అందుకు ఆయన భార్య కానీ, పదో తరగతికి వచ్చిన ఏకైక కుమారుడి బాధ్యత కానీ అడ్డు రాలేదు. ‘‘భావితరాలకు ఉపకరించే ఈ సమాచారానికి వెల కట్టలేం. ఇందులోని మానసిక తృప్తి నేను ఖర్చు చేసిన లక్షల కన్నా విలువైనది’’ అని నవ్వేస్తారాయన. ‘‘నెట్‌లో ఇప్పుడు డేటా లభిస్తున్నా, చాలా తప్పులుంటున్నాయి. పైగా నా దగ్గరున్న పాట, సినిమాలన్నీ ఒరిజినల్ క్వాలిటీవే. ఇవి చరిత్ర పునర్నిర్మాణానికి తోడ్పడ తాయి’’ అంటారాయన. సినీ పరిశ్రమ పెద్దలు, పరిశోధకులు చేయాల్సిన బృహత్తరమైన పనిని ఔత్సాహికుడైన ఒక సామాన్యుడు తన వ్యక్తిగత ఆసక్తితో లక్షల ఖర్చుతో నెత్తికెత్తుకోవడం విశేషం. నిదురిస్తున్న పరిశోధక, పండితమ్మన్యుల్ని మేల్కొల్పుతూ, తెలుగు సినిమా తోటలోకి వచ్చిన ఒక తీయటి పాట- సాయిబాబు ప్రయత్నం. ఆయన కృషి మరికొందరికి ఆదర్శమైతే, భవిష్యత్తులో సమగ్ర సినీగీత సమాచారాన్ని అందిస్తే, అంతకన్నా కావాల్సింది ఏముంది!                          

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 26th Apr 2015, Sunday, Family Page)
.......................................................

Sunday, April 26, 2015

ప్రేక్షకుల్ని ‘దోచేయ్’! (సినిమా రివ్యూ - దోచేయ్)

సినిమా రివ్యూ - దోచేయ్
దొంగతనం, దోపిడీలు, తెలివితేటలతో సాగే మైండ్ గేమ్ - లాంటివి ఎప్పుడూ బాగుంటాయి. వాటిని సరిగ్గా తెరపై చూపెడితే, బాక్సాఫీస్ హిట్లు వచ్చి పడతాయి. కానీ, వాడిన ఫార్ములానే వాడడం, అదీ కథ లేకుండా కథనంతోనే మెప్పించాలనుకోవడం, చివరకు ఆ కథనం కూడా అంత ఆసక్తికరంగా లేకపోవడం లాంటి బలహీనతలు ఎక్కువైతే కష్టమే. హీరో మోసగాడు... దొంగతనాలు చేసేవాడు అనే క్యారెక్టరైజేషన్‌తో గతంలో ‘స్వామి రారా’ సినిమా తీసిన యువ దర్శకుడు సుధీర్ వర్మ ఈసారి అక్కినేని నాగచైతన్యతో చేసిన ప్రయోగం - ‘దోచేయ్’.
 .......................................
చిత్రం - దోచేయ్, తారాగణం - నాగచైతన్య, కృతీ సనన్, పోసాని కృష్ణమురళి, రవిబాబు, బ్రహ్మానందం, రావు రమేశ్, ‘ప్రభాస్’ శీను, పాటలు - కృష్ణచైతన్య, శ్రీమణి, కృష్ణకాంత్, సంగీతం - సన్నీ ఎం.ఆర్,ఆర్ట్ - నారాయణరెడ్డి, కెమేరా - రిచర్డ్ ప్రసాద్,ఫైట్స్ - పీటర్ హెయిన్, విజయ్, కెచా ఖంఫకడీ, కూర్పు -  కార్తీక శ్రీనివాస్,నిర్మాత - బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ, కథనం, దర్శకత్వం - సుధీర్ వర్మ
....................................


కథ ఏమిటంటే...
చందు (నాగచైతన్య) ఒక చిన్న సైజు మోసగాడు. తన స్నేహితుల బృందంతో కలసి, మోసాలు, దొంగతనాలు చేస్తూ, చెల్లెలు లలితను డాక్టర్ చదువు చదివిస్తుంటాడు. అతని తండ్రి (రావు రమేశ్) జైలులో ఉంటాడు. చెల్లెలి మెడికల్ కాలేజీలోనే చదువుతున్న మీరా (కృతీ సనన్)తో హీరోకు పరిచయమవుతుంది. వాళ్లిద్దరూ ప్రేమలో పడతారు. ఇంతలో గుండె నొప్పి తండ్రికి ఆపరేషన్ చేయించడానికి కావాల్సిన డబ్బు కోసం, దాన్ని హోమ్ మినిస్టర్ పి.ఏ (జీవా)కు అందజేయడం కోసం హీరో తంటాలు పడతాడు. అదే సమయానికి చిల్లర దొంగతనాలతో మొదలుపెట్టి మర్డర్లు, దోపిడీల దాకా ఎదిగిన మాణిక్యం (పోసాని కృష్ణమురళి) ముఠాలోని వ్యక్తుల డబ్బు హీరో చేతిలో పడుతుంది. ఒకపక్క తండ్రిని కాపాడుకొనే ప్రయత్నం, మరో పక్క మాణిక్యం ముఠా వెంటాడడం, ఇంకోపక్క సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (‘అల్లరి’ రవిబాబు) ఇన్వెస్టిగేషన్‌ల మధ్య సినిమా సా...గుతుంది. ఈ క్రమంలో హీరోకూ, విలన్‌కూ మధ్య ఉన్న ఒక బంధం బయటపడుతుంది. అది ఏమిటి? విలన్‌ను హీరో ఎలా డీల్ చేశాడు? చివరకు ఏమైందన్నది మిగతా సినిమా.
     
ఎలా నటించారంటే...
మోసాలు, ఎత్తులు పెయైత్తులతో ముందుకు నడిచే చందు పాత్రను తనదైన మార్గంలోకి మలుచుకొని, నటించాలని నాగచైతన్య శతవిధాల ప్రయత్నించారు. కాకపోతే, అనుకున్నట్లుగా అందులో సఫలం కాలేకపోయారు. మునుపు చేసిన అనేక సినిమాల్లో లాగానే కనిపిస్తారు. పాత్ర కన్నా నాగచైతన్యే తెర మీద తెలుస్తుంటారు. నవీన యుగపు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ పాత్ర - మీరా (కృతీ సనన్)ది. కాలేజ్ ఎగ్గొడుతూ, వారానికి రెండు మూడు సినిమాలు చూస్తూ, ‘లైట్స్’ బ్రాండ్ సిగరెట్లు తాగే తరహా పాత్ర ఆమెది. కాకపోతే, ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానంలో క్లారిటీ కనపడదు. హీరో తన వెంటపడుతున్నాడు, తన మీద అపారమైన ప్రేమ ఉందనే పాయింట్ తప్ప, హీరోను ఆమె ప్రేమించడానికి లాజిక్ వెతకడం వృథా శ్రమ. పొడుగ్గా, నాజూగ్గా ఉండే కృతీ సనన్ అందంగా ఉన్నా, హీరోకు తగ్గ జోడీయేనా అని అనుమానం కలుగుతుంది.

ఈ చిత్రంలో ప్రధానమైన విలన్ పాత్ర మాణిక్యం. ఆ పాత్రను పోసాని కృష్ణమురళి పోషించారు. ఆయన తనకు అలవాటైన భంగిమలు, నటనతోనే మరోసారి కనిపించారు. ఒకటి, రెండు చోట్ల యథాశక్తి నవ్వించారు. కానీ, విలన్ పాత్ర కాస్తా వినోదతరహాగా మారిపోయింది. సినిమా సెకండాఫ్ చివరలో వచ్చే హీరో బుల్లెట్‌బాబుగా బ్రహ్మానందం కాసేపు వినోదం పండిస్తారు. కానీ, సినిమా యాక్టర్ల మీద, అక్కడి వాతావరణం మీద వేసిన కొన్ని జోకులు సినిమా వాళ్ళు తమను తామే మరీ తక్కువ చేసుకొనేలా ఉన్నాయనిపిస్తుంది.   

సాంకేతిక విభాగాల సంగతేంటంటే...
ఈ సినిమాకు ప్రధానమైన బలహీనతల్లో సంగీతం, పాటలు ముందు వరుసలో నిలుస్తాయి. ఒక్క పాటైనా గుర్తుండేలా కానీ, గుర్తుపెట్టుకొనేలా కానీ లేదు. కొన్నిచోట్ల సన్నివేశంలో లేని గాఢతను నేపథ్య సంగీతంలో అందించాలని అతిగా ప్రయత్నించారు. అది అతకలేదనే చెప్పాలి. రాసుకున్న కథలో, తీసుకున్న సన్నివేశాల్లోనే కథను ఆసక్తిగా నడపని, అనవసరపు అంశాలు చాలా ఉన్నాయి. దర్శక - రచయిత తీసుకున్న ఆ నిర్ణయానికి కేవలం ఎడిటర్‌నే తప్పుబట్టి ఉపయోగం లేదు. సినిమా తీశాకే కాదు... తీయక ముందు రచన దశలోనూ ఎడిటింగ్ కత్తెర పదునుగా ఉండాల్సింది. ఉన్నంతలో కెమేరా, యాక్షన్ ఎపిసోడ్లు ఫరవాలేదనిపిస్తాయి. కాకపోతే, చివరి ఛేజ్ దగ్గరకు వచ్చే సరికి అది వీడియో గేమ్ తరహాలో మిగిలింది. ఆశించిన ఉద్విగ్నతను కలిగించలేకపోయింది.

వివిధ సందర్భాల్లో సినిమాలో తెరపై కనిపించే ‘శివ’ వాల్‌పోస్టర్, ‘క్షణ క్షణం’ సినిమా వీడియో, నేపథ్యంలో కొన్ని సినిమా పాటలు వగైరా అన్నీ దర్శకుడికి రామ్‌గోపాల్‌వర్మ మీద ఉన్న అభిమానాన్ని చెప్పకనే చెబుతుంటాయి. కథానాయకుడు దొంగ, దోచుకోవడమనే ఫార్ములాకు ఉన్న స్ఫూర్తి తెలుస్తుంటుంది. కానీ, దర్శకుడు సుధీర్ వర్మకు ఇది రెండో సినిమానే కావడంతో ఆ అనుభవ రాహిత్యం తెలిసిపోతుంటుంది. ముఖ్యంగా, బ్యాంక్ దోపిడీ లాంటి చోట్ల దొంగ - పోలీసుల విజువల్స్ లాంటివి భారీ చిత్రాలకు తగ్గట్లు అనిపించవు.

ఎలా ఉందంటే...
కొంత అస్తుబిస్తుగా ఉన్న నాగచైతన్య కెరీర్‌కు గత ఏడాది ‘మనం’ చిత్రం ఒక కొత్త ఊపునిచ్చింది. కానీ, ఆ తరువాత కూడా ఈ యువ హీరో కెరీర్ ఆశించినంత వేగంగా ముందుకు పోలేదు. ఈ పరిస్థితుల్లో సక్సెస్‌లో ఉన్న నవ యువ దర్శకుడు సుధీర్‌వర్మ కథతో ముందుకు రావాలనుకోవడం తెలివైన పని. అయితే, మునుపు ‘స్వామి రారా’ లాంటి ఫ్రెష్‌నెస్ ఉన్న హిట్ చిత్రంతో ఆకర్షించిన సుధీర్ వర్మ తొలిసారి అచ్చి వచ్చిన దొంగతనం, ఛేజ్‌ల ఫార్ములానే మళ్ళీ ఎంచుకున్నారు. కానీ, అతిగా, అనవసరంగా వాడితే పదునైన ఆయుధమైనా మొద్దుబారినట్లే, ఎంత హిట్ ఫార్ములాకైనా ఆ గతి తప్పదని ‘స్వామి రారా’ చూసి ఆనందించిన కళ్ళతో... ఈ ‘దోచేయ్’ సినిమా చూశాక అర్థమవుతుంది.

హీరోకూ, విలన్‌కూ మధ్య పగ, ప్రతీకారాలు కానీ, తెలివితేటల యుద్ధం కానీ ప్రభావశీలంగా లేని సినిమా ఇది. ఇంకా చెప్పాలంటే, బలహీనమైన విలన్ పాత్ర కామెడీగా మారింది. రెండు కోట్ల బ్యాంక్ దోపిడీ సీన్‌తో మొదలుపెట్టి, దాన్ని చాలాసేపటికి ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర ముడిపెట్టడం, విలన్ వెతుకుతున్న వ్యక్తి తాలూకు చెల్లెలు హీరోయినే అన్నట్లు బిల్డప్ ఇవ్వడం లాంటి స్క్రీన్‌ప్లే టెక్నిక్‌లు ఎఫెక్టివ్‌గా లేవు. పైగా, దర్శకుడి చేతిలో మోసపోయిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగి, ఎదురుతన్నే ప్రమాదం ఉంది. కాగా, హీరోయిన్ పట్ల తన ప్రేమను హీరో వ్యక్తం చేసే ఘట్టాలు రెండూ బాగున్నాయి. పగతో కన్నా హీరోయిన్ పట్ల ప్రేమతో కొడుతున్నానంటూ రౌడీలను హీరో చితగ్గొట్టడం కొత్తగా అనిపిస్తుంది. అలాగే, పుట్టినరోజు నాడు అలిగిన హీరోయిన్‌ను బుజ్జగించడానికి వెళ్ళిన హీరో, ఆమెతో ప్లకార్డులతో తన భావాలు వ్యక్తీకరించే సీన్ కూడా ఫ్రెష్ ఫీలింగ్ అందిస్తుంది. సినిమాలో ఇలాంటి ఘట్టాలు కొన్ని అక్కడక్కడా మురిపిస్తాయి. దాదాపుగా సినిమా అంతా అయిపోయాక వచ్చిన పోసాని కృష్ణమురళి పాత్ర పోలీసు, కోర్టు సన్నివేశాల కామెడీ కూడా అలాంటిదే. కాకపోతే, అప్పటికే చాలా సినిమా చూసేసిన ఫీలింగ్‌తో ఉన్న ప్రేక్షకుడు కాసేపు నవ్వుకోవడానికే తప్ప, సినిమాను గుండెకు మనసారా హత్తుకోవడానికి అది ఉపయోగపడకపోవడం విషాదం.

మొత్తం మీద, ఒక విషయాన్ని తొలిసారి చూసినప్పుడు కలిగే ఫీలింగ్ కొత్తగా ఉంటుంది. గొప్పగా ఉంటుంది. కానీ, అదే ఫార్ములాను అతుకుల బొంత కథతో, అర్థంపర్థం లేని మలుపులతో, సుదీర్ఘమైన అనాసక్తికరమైన కథనంతో ప్రయత్నిస్తే? అది మనసు దోచే ప్రయత్నంగా కాక, విలువైన డబ్బు, అంతకన్నా విలువైన కాలం దోచేసిన విఫల ప్రయోగంగా ప్రేక్షకుడికి గుర్తుండిపోతుంది! కావాలంటే, మూడు గంట, నూటయాభై రూపాయల కరెన్సీ వెచ్చించి, కొన్ని కొన్ని ఎపిసోడ్లుగా మాత్రం ఫరవాలేదనిపించే ‘దోచేయ్’ చూడండి!

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' Website edition, 24th April 2015, Friday)
............................................

Friday, April 24, 2015

ఆ వార్త నిజం కాదు! - గాయని సునీత ఇంటర్వ్యూ

సుమధుర గాయని... తెరపై తారలకు తెర వెనుక గాత్ర ధారిణి...
 ప్రముఖులను బుల్లితెరపై ఇంటర్వ్యూలు చేయడంలో 
తనదైన ముద్ర వేసే యాంకర్... సునీత. మాటలో నవనీతం.., 
మనిషిలో మంచితనాల కలగలుపు ఆమె. ఎదిగినా ఒదిగి 
ఉండే వినయం ఆమె సొంతం. మహేశ్‌బాబు చిత్రం 
‘బ్రహ్మోత్సవం’లో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఆమె 
నుంచే ఒక క్లారిటీ... ఈ చిరు ఇష్టాగోష్ఠి...
ఆ వార్త నిజం కాదు!

 ఎలా ఉన్నారండీ?
 చాలా బాగున్నాను. ఈ మధ్య రెండు మూడు నెలలు ఆస్ట్రే లియా,
ఖతర్, ఐర్లండ్, అమెరికా - ఇలా రకరకాల దేశాలు తిరిగి వచ్చాను.
అక్కడ సంగీత విభావరులు కూడా చేశాం. పిల్లలతో కలసి ఆస్ట్రేలియాలో
 సరదాగా సెలవులు గడిపినట్లు గడిపి, వచ్చాను.

  ఉన్నట్టుండి ఇవాళ అంతా మీ గురించి వార్తలే?
 (నవ్వేస్తూ...) అవును. పొద్దుటి నుంచి నన్ను అభినందిస్తూ
 ఫోన్లూ, మెసేజ్‌లూ, పుష్పగుచ్ఛాలూ వస్తూనే ఉన్నాయి.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న
‘బ్రహ్మోత్సవం’లో నటిస్తున్నానని! నాకు ఏం మాట్లాడాలో
 తెలియడం లేదు.

  ఇంతకీ నటిస్తున్నారా? ఎప్పటి నుంచి షూటింగ్?
 అయ్యబాబోయ్! నేను నటిస్తున్నట్లు వచ్చిన ఆ వార్త
నిజం కాదండి. ఆ పాత్రకు నేనైతే బాగుంటుందని చిత్ర
యూనిట్‌లో అనుకొని ఉంటారు. ఇంతలో ఆ వార్త
అలా బయటకు వచ్చేసుంటుంది.   

  అయినా, మీకు నటన కొత్త కాదు. డబ్బింగ్‌లో, గానంలో
 భావాలు పలికించడం ఒక రకంగా నటనేగా. ఆ మధ్య 
శేఖర్ కమ్ముల ‘అనామిక’ చిత్రానికి ప్రమోషనల్ 
పాటలోనూ చేశారు.  
 నిజమే. కానీ, గానం నా ప్రాణం. డబ్బింగ్ చెప్పడం
నాకిష్టం. కానీ, తెరపై నటించడం చాలా కష్టమైన పని.
అది స్వయంగా కొన్నేళ్ళుగా నేనిక్కడ చూస్తూనే ఉన్నా కదా.

  అయితే, మీకసలు నటించే ఉద్దేశమే లేదా?
 బాబోయ్... అంతేసి పెద్ద పెద్ద ప్రకటనలు చేయను,
చేయలేను. (నవ్వు) ఎవరైనా మన గురించి ఆలోచించారంటే
వాళ్ళ ఆలోచనని మనం గౌరవించాలి. జీవితంలో ఎప్పుడేం
జరుగుతుందో, ఏ టైమ్ కి ఏమవుతుందో ఎవరు చెప్ప గలం?
బలమైన పాత్రచిత్రణ ఉండి, సంగీత ప్రధానమైన కథతో,
 ఏ ఆఫ్‌బీట్ సినిమా ఆఫర్‌తోనో ఎవరైనా కలిస్తే?

  సినిమాల్లో నటిస్తే పాపులారిటీ, డబ్బు వస్తాయేమో?
 (మళ్ళీ నవ్వేస్తూ...) గాయనిగా నాకు ఇప్పటికే ఒక
 హీరోయిన్‌కు ఉండేంత పాపులారిటీ ఉంది. అందుకే, 
నన్నింకా ఎగ్జయిట్ చేసే పని చేయాలనిపిస్తోంది.

  ఈ మధ్య మిమ్మల్ని ఎగ్జయిట్ చేసిన విషయం?
 ‘ఓకే బంగారం’ చిత్ర ప్రచార నిమిత్తం హైదరాబాద్
వచ్చిన దర్శకుడు మణిరత్నం, సంగీత దర్శకుడు
 రెహమాన్‌లను ఇంటర్వ్యూ చెయ్యడం. కొన్ని గంటలు
 నిరీక్షించాల్సొచ్చినా, చివరకు గంటన్నర సేపు వాళ్ళతో
 మాట్లాడిన అనుభవం చాలా ఎగ్జయిటింగ్ అనుభవం.

  రెహమాన్ సంగీతంలో పాడినట్లు లేరు...
 అవునండి. ఇంకా ఆ అదృష్టం పట్టలేదు. ఆయన ఎంత
వినయశీలి అంటే, ఎన్నో విషయాలు హాయిగా మాట్లాడారు.
 ‘యూ’ ట్యూబ్‌లో ఉండే నా కాఫీ వీడియో ఆయనకు చాలా
 నచ్చిందట. దాని గురించి ట్వీట్ కూడా చేయాలనుకున్నారట.
 పనిలో పనిగా ఆయన సంగీతంలో కనీసం ఒక్క పాటైనా
పాడాలనుందన్నా. ఆయన తప్పనిసరిగా చేద్దామన్నారు.
ఆ ఛాన్‌‌స ఎప్పుడొస్తుందో చూడాలి. ఇళయరాజా గారి
 సంగీత దర్శకత్వంలో పరిచయమయ్యానని తెలుసుకొని,
 ‘ఇంకేం... తిరుగు లేదు’ అనేశారు.

 దర్శకులు మణిరత్నం గారు ఏమన్నారు?
 ఆయన మరీ సింపుల్. ఆయనను కలవడం ఇదే
తొలిసారి. మణీజీ పనిలో పనిగా, తన తరువాతి చిత్రానికి
 గాయనిగా రెహమాన్ నుంచి వాగ్దానం తీసేసుకోమన్నారు.
కొంపతీసి మణీజీ జపనీస్ సినిమా తీస్తే ఎలా పాడిస్తానని
రెహమాన్ చమత్కరించారు. చాలా సరదాగా గడిచింది.
నన్ను ఒక పాట పాడమంటే వాళ్ళ సినిమాలోదే
‘ఏదో అడగనా...’ పాట పాడాను. ‘ఆహ్లాదంగా, ప్రశాంతంగా
 ఇంటర్వ్యూ చేశా’వంటూ మణీజీ మెచ్చుకున్నారు.
మద్రాసులో 1996 - 97లో రెండేళ్ళు నేనుండడం,
 అక్కడ పెద్ద పెద్దవాళ్ళ దగ్గర పాడడం అన్నీ గుర్తొచ్చాయి.
 ‘పెళ్ళి పందిరి’తో నేను డబ్బింగ్ కళాకారిణి అయింది
 కూడా అక్కడే. అక్కడ నేర్చుకున్నవెన్నో ఇప్పటికీ
నాకు ఉపకరిస్తున్నాయి.

 ఇటీవల మీరు చేసిన ఎసైన్‌మెంట్ల గురించి...
 కల్యాణీమాలిక్, ఆర్పీపట్నాయక్ వద్ద మంచి పాటలు
 పాడా. రాబోయే సినిమాల్లో వింటారు.

రెంటాల జయదేవ

................................................

Thursday, April 23, 2015

నాయన మాటలు ఇప్పటికీ గుర్తే! - బి. వెంకట్రామరెడ్డి, ప్రముఖ నిర్మాత - ‘విజయ’ నాగిరెడ్డి కుమారుడు

 బి. నాగిరెడ్డి... చెన్నైలో ‘విజయ- వాహినీ’ స్టూడియో అధినేతగా, సకుటుంబ చిత్రాల నిర్మాతగా, చందమామ - విజయచిత్ర పత్రికల యజ మానిగా, విజయ హాస్పిటల్ నిర్వాహకుడిగా ఆయనది అద్భుత చరిత్ర. ఆ దార్శనికుడి సినీ వారసత్వం కొనసాగేలా ప్రతి ఏటా ‘సకుటుంబ వినోదా త్మక చిత్రం’ కేటగిరీలో ఒక్కో తెలుగు, తమిళ చిత్రాన్ని ఎంపిక చేసి, ఆ నిర్మాతను గౌరవిస్తున్నారు - నాగిరెడ్డి ఆఖరి కుమారుడు - చిత్ర నిర్మాత బి. వెంకట్రామరెడ్డి (బాబ్జీ). 2014కి తెలుగులో ‘రేసు గుర్రం’ చిత్ర నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్, డాక్టర్ వెంకటేశ్వరరావులకు ‘బి. నాగిరెడ్డి స్మారక పురస్కారం’ ఈ ఆదివారం హైదరాబాద్‌లో అందిస్తున్నారాయన. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన పంచుకున్న మనోభావాలు...
నాయన మాటలు ఇప్పటికీ గుర్తే!
-  మా ‘విజయా’ వారి చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించిన ఎమ్జీయార్, ఎన్టీఆర్, జయలలిత - ముగ్గురూ రాష్ట్ర ముఖ్యమంత్రులయ్యారు. అది మాకెంతో గర్వకారణమైన విషయం. అలాగే, కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్ సైతం మా సినిమాల్లో నటించారు. కొన్నేళ్ళ క్రితం అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను నేరుగా కలుసుకున్నాం. ‘విజయ సంస్థతో, నాగిరెడ్డి గారితో ఎన్నో తీపి జ్ఞాపకాలున్నాయి’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. మా నాయనకూ, మా సంస్థకూ ఇవాళ్టికీ ఉన్న గౌరవానికి అది ఉదాహరణ.

 - నాయనతో అనుబంధం ఉన్న సినిమా వ్యక్తులు, ఆ తరం క్రమంగా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతుంటే, బాధగా అనిపిస్తోంది. మా ‘విజయా’ సంస్థకు పర్మినెంట్ హీరో ఎన్టీఆర్ గారు. ఆయనతో మాది ప్రత్యేక బంధం. ఏయన్నార్ గారు మా ‘విజయా’ హీరో కాకపోయినా, నాయనతో ఆయన అనుబంధం అంతా ఇంతా కాదు. ఆయన పెళ్ళికి శుభలేఖలు ముద్రించింది మా నాయనే! దానికి, మా నాయన డబ్బు కూడా తీసుకోలేదట. అలాగే, ఏయన్నార్ 60 చిత్రాల పూర్తి వేడుకకు తగిన వేదిక ఏదీ ఆయనకు దొరకలేదు. దాంతో, మా నాయన అప్పటికప్పుడు ‘విజయా గార్డెన్స్’ వేదిక కట్టించారు. హైదరాబాద్‌లో ‘అన్నపూర్ణా స్టూడియో’ కడుతున్నప్పుడు ఆ డిజైనింగ్‌లో నాయన సలహాలిచ్చారు. అందుకే, ఏయన్నార్‌కు నాయనంటే అభిమానం.

-  అలాగే, రామానాయుడు గారితో ప్రత్యేక అనుబంధం. నిజానికి, నాయన ఎప్పుడూ పార్ట్‌నర్‌షిప్‌లకు పోడు. ఆయనకు పెద్దగా ఇష్టం లేకపోయినా - నాగిరెడ్డి గారి పిల్లలమైన మేము, రామానాయుడి గారు కలసి ‘విజయా - సురేశ్ కంబైన్స్’ స్థాపించాం. అలా ‘పాప కోసం’తో మొదలుపెట్టి ‘సురేశ్ మూవీస్’, ‘సురేశ్ ఇంటర్నేషనల్’ లాంటి బ్యానర్లపై 20 చిత్రాలు నిర్మించాం. తెలుగు, తమిళ, హిందీల్లో ‘ప్రేమ్‌నగర్’ కూడా మేము కలసి తీసినదే.    మా నాయనదీ, చక్రపాణి గారిదీ అపురూపమైన స్నేహబంధం. మా నాయన ఎప్పుడూ సకుటుంబంగా చూడదగ్గ, సందేశాత్మక చిత్రాలు తీయాలనేవారు.

చక్రపాణి గారేమో ‘మెసేజ్ ఇవ్వడానికి సినిమా తీసే కన్నా, టెలిగ్రామ్ పంపితే చౌక కదా!’ అని ఛలోక్తి విసిరేవారు. అయితే, మూడో వ్యక్తి మాటల్లో ఈగ వాలనిచ్చేవారు కాదు.  నాయనంటే చక్రపాణి గారికంత ప్రేమ. చక్రపాణి గారు పోయాక నాయనలో చిత్ర నిర్మాణంపై ఉత్సాహం తగ్గింది.    నాయనను చూసి పెరిగిన నాకు, ఆయన  లాగానే చిత్ర, భవన నిర్మాణాల మీద ఆసక్తి.ఆ పను ల్లోనే ఉన్నా. 1991లో ‘చందమామ - విజయా కంబైన్స్’పై చిత్రాలు తీయడం ప్రారంభించా. తెలుగులో రాజేంద్రప్రసాద్‌తో ‘బృందావనం’, బాలకృష్ణతో ‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయము’, తమిళంలో రజనీకాంత్‌తో ‘ఉళైప్పాళి’, కమలహాసన్‌తో ‘నమ్మవర్’, అలాగే ‘కరుప్పు వెల్లై’ లాంటి చిత్రాలు తీశాను.

 - నాయన ఉండగా, నిర్మాతగా నా పేరు పడడం నాకిష్టం లేదు. అయితే, 2004లో నాయన చనిపోవడంతో, ఆయన ఆశయాలకు కొనసాగింపుగా ‘విజయా ప్రొడక్షన్‌‌స’ పేరు పెట్టి, తమిళంలో విశాల్‌తో ‘తామ్రపరణి’, ధనుష్‌తో ‘పడిక్కాదవన్’, ‘వేంగై’, ఇటీవలే అజిత్‌తో ‘వీరవ్‌ు’ చిత్రాలు తీశా. తెలుగులోనూ సినిమాలు తీయాలని ఉంది. కానీ, పెరుగుతున్న వ్యయం, పారితోషికాలు, మారుతున్న పరిస్థితుల మధ్య ఆలోచించాల్సి వస్తోంది.  మద్రాసులో ప్రారంభించిన మొట్టమొదటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాదే. 1972లోనే మా ‘విజయా హాస్పిటల్ ట్రస్ట్’ ప్రారంభించాం. తరువాత రెండేళ్ళకు ’74లో కేవలం 30 పడకలతో ప్రారంభమైన మా ఆస్పత్రి ఇవాళ 750 పడకలతో, దాదాపు 1800 మంది ఉద్యోగులతో నడుస్తోంది. ప్రతి ఏటా నాయన జయంతికి ఉచిత వైద్యశిబిరం ద్వారా వందలమందికి సేవలందిస్తున్నాం. మా ఆవిడ భారతీరెడ్డి ఆస్పత్రికి సి.ఇ.ఒ.గా బాధ్యతలు చూస్తోంది.

 - మా నాయన నాగిరెడ్డి గారి పిల్లల్లో అందరి కన్నా చిన్నవాణ్ణయినా, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా. ‘‘ఉద్యోగుల క్షేమం చూడాలి, వాళ్ళకు ముందు జీతభత్యాలివ్వాలి. వర్కర్లను ఎప్పుడూ ‘మీరు’ అనే తప్ప, తక్కువ చేసి పిలవకూడదు. వినయం ఎంత ఉంటే, అంత మంచిది. ఎప్పుడూ ఒకరితో పోల్చుకోకూడదు. నీ పైన ఎంతమంది ఉన్నారనే దాని కన్నా, కింద ఎంత మంది ఉన్నారనేది చూసుకోవాలి’’ - ఇలా ఆయన చెప్పిన జీవిత సూత్రాలు ఇప్పటికీ నాకు గుర్తే. ఈ తరానికీ మార్గ దర్శకమైన జీవితం, సందేశం ఆయ నది. అందుకే, ఆయనపై మంచి కాఫీ టేబుల్ బుక్ తేనున్నాం.

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 19th Apr 2015, Sunday)
...............................................

Wednesday, April 22, 2015

‘డి.టి.ఎస్’ మధుసూదనరెడ్డి హఠాన్మరణం

‘డి.టి.ఎస్’ మధుసూదనరెడ్డి హఠాన్మరణం

ప్రముఖ శబ్దగ్రాహకుడు, డి.టి.ఎస్. మిక్సింగ్‌లో సుప్రసిద్ధుడూ అయిన సౌండ్ ఇంజనీర్ పి. మధుసూదనరెడ్డి ఇక లేరు. తీవ్రమైన గుండెపోటు రావడంతో, సోమవారం ఉదయం ఆయన హఠాత్తుగా కన్నుమూశారు. ఆదివారం రాత్రి పొద్దుపోయేదాకా ‘దోచేయ్’ చిత్రం మిక్సింగ్ పనిలో తీరిక లేకుండా ఉండి, ఆ వ్యవహారం పూర్తి చేసుకొని ఆయన ఇంటికి తిరిగి వచ్చారు. సోమవారం ఉదయం నిద్ర లేచి, పిల్లల స్కూలు పని మీద వెళ్ళి ఇంటికి తిరిగొస్తూ, మెట్ల మీదే ఆయనే కుప్పకూలిపోయినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కొద్ది గంటల క్రితం దాకా తమ మధ్యే సినిమా పనిలో గడిపిన మధుసూదనరెడ్డి హఠాన్మరణం తెలుగు సినీ పరిశ్రమ వర్గీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
 
 నిండా యాభయ్యేళ్ళు కూడా లేని మధుసూదనరెడ్డి సినీ శబ్దగ్రహణ విభాగంలో పేరున్న సాంకేతిక నిపుణుడు. ఆయనకు భార్య శశి, ఇద్దరు కుమారులు ఉన్నారు. చెన్నైలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్న ఆయన ప్రముఖ ఆడియోగ్రాఫర్ స్వామినాథన్ వద్ద శిష్యరికం చేశారు. మధుసూదనరెడ్డి స్వతంత్రంగా ఆడియోగ్రాఫర్‌గా చేసిన చిత్రాల్లో ‘గులాబి’, ‘సిసింద్రీ’ మొదలు మహేశ్ ’ఒక్కడు’, అనుష్క ‘అరుంధతి’, గత ఏడాది రిలీజైన అక్కినేని కుటుంబ చిత్రం ‘మనం’ మొదలైనవి అనేకం ఉన్నాయి. ఇంజనీర్‌గా మొదలుపెట్టి సౌండ్ రికార్డిస్టుగా, డిజైనర్‌గా ఎదిన ఆయన గడచిన రెండు దశాబ్దాల పైచిలుకు కెరీర్‌లో దాదాపు 125 చిత్రాలకు పైగా శబ్ద గ్రహణం చేశారు. అందరూ ‘డి.టి.ఎస్. మధు’ అని ముద్దుగా పిలుచుకొనే ఆయన పని విషయంలో నాణ్యతకూ, నిర్దుష్టతకూ మారుపేరు. సినిమా విడుదలైన తరువాత కూడా సౌండ్ సరిగా లేదని తనకు అసంతృప్తి కలిగితే, ఔట్‌పుట్‌ను మార్చి, కొత్త ప్రింట్లు పంపేవారు.
 
 శబ్ద విభాగంలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాల్ని ఆకళింపు చేసుకొని, వాటిని నిత్యం పనిలో వాడే మధుసూదనరెడ్డికి ‘ఒక్కడు’, ‘అరుంధతి’ తదితర చిత్రాలు నంది పురస్కారాలు తెచ్చాయి. శబ్దగ్రహణ శాఖలో 9 సార్లు నంది అవార్డులు అందుకున్న ఘనుడాయన. ఎంతో పేరొచ్చినా, అందరితో స్నేహంగా ఉంటూ మంచిమనిషిగా పేరు తెచ్చుకున్నారు. చాలాకాలం ఆయన రామానాయుడు స్టూడియోలో పనిచేశారు. కొంతకాలం క్రితం స్టూడియో నుంచి బయటకొచ్చేసి, హైదరాబాద్‌లోని మణికొండలో ఆఫీసు పెట్టుకొని, శబ్దగ్రహణంలో కృషి చేస్తున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌తో సహా చాలామంది మిక్సింగ్‌కు మధుసూదనరెడ్డినే ఆశ్రయించేవారంటే, ఆయన పని మీద ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. ఒక మంచి టెక్నీషియన్‌ను కోల్పోయామంటూ పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 21st Apr 2015, Monday)
.....................................................

Monday, April 20, 2015

యువ ప్రేక్షకులకే ఓ.కె. బంగారం!

...............................................
చిత్రం - ‘ఓ.కె. బంగారం’, తారాగణం - దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్, లీలా సామ్సన్, ప్రకాశ్‌రాజ్, ప్రభూ లక్ష్మణన్, రమ్యా సుబ్రమణియమ్, కణిక, బి.వి. దోషీ, మాటలు - కిరణ్, పాటలు - సీతారామశాస్త్రి, సంగీతం - ఏ.ఆర్. రెహమాన్, ఛాయాగ్రహణం - పి.సి. శ్రీరామ్, కొరియోగ్రఫీ - బృంద, కూర్పు - ఏ. శ్రీకర్‌ప్రసాద్, నిర్మాత - ‘దిల్’ రాజు, రచన, దర్శకత్వం - మణిరత్నం
..................................................
 దాదాపు పాతికేళ్ళ క్రితం దేశంలో మొదలైన ఆర్థిక సరళీకరణ, ఆ వెంటనే వచ్చిన ప్రపంచీకరణ ప్రభావంలో పుట్టి పెరిగిన కొత్త తరం ఇప్పుడు పరవళ్ళు తొక్కుతోంది. దేశాన్నీ, ప్రపంచాన్నీ ముందుండి నడుపుతున్న ఈ తరానికి పెళ్ళి, కెరీర్ లాంటి అంశాలపై ఉన్న అభిప్రాయాలు, కుటుంబ సంబంధాలపై ఉన్న ఆలోచనలు ఎలాంటివి? వివాహ వ్యవస్థ కన్నా సహజీవనమైతే బరువు బాధ్యతలు ఉండవని వారు అనుకోవడంలో ఎంత నిజాయతీ ఉంది? వాటిని తెరపై చూపితే ఎలా ఉంటుంది? దర్శక - రచయిత మణిరత్నం చేసిన తాజా వెండితెర ప్రయత్నం - ‘ఓ.కె. బంగారం’ అదే! ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత - పంపిణీదారు ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో అందించారు.

 కథ ఏమిటంటే...

  హైదరాబాద్ వెస్ట్‌మారేడ్‌పల్లి కుర్రాడు ఆదిత్య కంటమనేని అలియాస్ ఆది (దుల్కర్ సల్మాన్) ఉద్యోగ నిమిత్తం ముంబయ్ వెళతాడు. అక్కడ తన అన్నయ్య స్నేహితుడైన గణపతి (ప్రకాశ్‌రాజ్), భవాని (లీలా శామ్సన్) దంపతుల ఇంటికి వెళతాడు. అప్పటికి 23 ఏళ్ళుగా ముంబయ్‌లో స్థిరపడిన ఆ దంపతుల ఇంట్లోనే ఒక గదిలో పేయింగ్ గెస్ట్‌లా ఆశ్రయం పొందుతాడు. అంతకు ముందు రైల్వేస్టేషన్‌లో చూసిన తారా కళింగ అలియాస్ తార (నిత్యా మీనన్) అనే ఔత్సాహిక ఆర్కిటెక్ట్‌తో అతనికి స్నేహం ఏర్పడుతుంది. తారకు ఏడేళ్ళ వయసప్పుడే ఆమె తల్లి, తండ్రి విడిపోతారు. కోయంబత్తూరులో పెద్ద ఫ్యాక్టరీ, వ్యాపారాలు నడిపే ధనికురాలైన తల్లికి కూడా దూరంగా తార స్వతంత్రంగా బతుకుతుంటుంది. మిత్రురాలు, సహోద్యోగిని అయిన అనన్య పెళ్ళిలో కలిసిన ఆది, తారలిద్దరికీ ‘పెళ్ళి ఈజ్ ఓన్లీ ఫర్ ఫూల్స్’ అనీ, దానికన్నా బాదరబందీ లేని ‘లివ్ - ఇన్ రిలేషన్‌షిప్’ మెరుగనీ బలమైన అభిప్రాయం ఉంటుంది. ప్రేమ పెరిగిన వారిద్దరూ, వివాహబంధానికి వెలుపలే ఆది గదిలోనే కలసి ఉండాలని నిర్ణయించుకుంటారు.

ఈ వివాహేతర జీవన సంబంధంతో కలిసిన యువ జంటకు సమాంతరంగా వివాహ బంధంలోని గొప్పదనాన్ని చూపే భవాని - గణపతి దంపతుల కథ నడుస్తుంటుంది. ఒకప్పటి ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు భవాని ప్రస్తుతం అల్జీమర్స్ వ్యాధితో, తద్వారా వచ్చే మతిమరుపుతో బాధపడుతూ ఉంటుంది. అయినా ఆమెను ప్రేమతో చూస్తూ, సమస్త సపర్యలూ చేస్తుంటాడు గణపతి. గేమింగ్ యానిమేషన్‌లో ఉన్న హీరో అమెరికా వెళ్ళాలని కలలు కంటూ ఉంటే, సంప్రదాయ సంగీతంలో దిట్ట అయిన హీరోయిన్ ఆర్కిటెక్చర్‌లో పై చదువులకు ప్యారిస్ పోదామనుకుంటుంది. ఈ కెరీర్ స్వప్నాల మధ్య ‘లివ్ ఇన్ రిలేషన్‌షిప్’లో ఉన్న ఆ యువ జంట ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు? వారి జీవితాలు ఎటు మళ్ళాయి? లాంటివన్నీ మిగతా చిత్ర కథ.

 ఎలా నటించారంటే...

ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి కుమారుడైన దుల్కర్ సల్మాన్ ఇప్పటికే కొన్ని మలయాళ, తమిళ చిత్రాల్లో నటించారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల లాంటివీ అందుకున్నారు. తెలుగు తెరపై తొలిసారిగా కనిపించిన ఈ యువ నటుడు తెరపై బాగున్నారు. ఇక, ఇటీవలి కాలంలో తన అభినయం ద్వారా అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్న నిత్యా మీనన్ సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కళ్ళతోనూ అభినయించగల సామర్థ్యం, సన్నివేశానికీ - సందర్భానికీ తగ్గట్లు ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగల నైపుణ్యం, శారీరక సౌందర్యాన్ని మించిన ఆత్మిక ఆకర్షణ నిత్యా మీనన్‌ను అందరికీ ఆత్మీయురాలిని చేస్తుంది. గతంలో కొన్ని మలయాళ చిత్రాల్లో కలసి నటించిన దుల్కర్, నిత్యల మధ్య కెమిస్ట్రీ మరోసారి వెండితెరను అద్భుతంగా వెలిగించింది. గతంలో కేంద్ర సెన్సార్‌బోర్డు చైర్మన్‌గా పనిచేసి, మోడీ నేతృత్వంలోని బి.జె.పి. ప్రభుత్వం వచ్చాక వివాదాల మధ్య రాజీనామా చేసిన ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి లీలా శామ్సన్ ఈ చిత్రంలో భవానిగా ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. ఆమెను అమితంగా ప్రేమిస్తూ, వంటతో సహా అన్నీ చూసుకొనే భర్త పాత్రలో ప్రకాశ్‌రాజ్ బాగున్నారు. ముఖ్యంగా, వానలో వారిద్దరూ కలిసే సన్నివేశం అప్రయత్నంగా కళ్ళు చెమర్చేలా చేస్తుంది.

 సాంకేతిక విభాగాల పనితీరెలా ఉందంటే...

ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు బాగున్నాయి. వాటికి మణిరత్నం శైలి చిత్రీకరణ, పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణ ఇంద్రజాలం, శ్రీకర్‌ప్రసాద్ ఆ దృశ్యాలను ఏర్చికూర్చిన విధానం నవతరాన్ని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ‘రారా ఆటగాడా...’, ‘మన మన మన మెంటల్ మదిలో...’, ‘ఏదో అడగనా...’ లాంటి పాటలు పదే పదే కూనిరాగం తీయాలనిపిస్తాయి. అది ఈ సినిమాకు ఉన్న పెద్ద సానుకూల అంశం. సీతారామశాస్త్రి కలం మరొక్కసారి తన పదును చూపిన సినిమా ఇది. ముఖ్యంగా, ఈ సినిమాకు రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం రొటీన్ సినిమాలు, వాటిలోని రీరికార్డింగ్‌కు భిన్నంగా ఉంది. సంప్రదాయ సంగీత నేపథ్యం కథలో ఉండడంతో, అందుకు తగ్గట్లు రెహమాన్ అక్కడక్కడ వాడిన సంగీత శకలాలూ, బిట్లూ బాగున్నాయి. తమిళంలో ‘లైవ్ సౌండ్’తో తీసిన ఈ చిత్రానికి తెలుగు అనువాదంలో కథానాయకుడికి మన తెలుగు హీరో నాని డబ్బింగ్ చెప్పారు. నిత్యా మీనన్, ప్రకాశ్‌రాజ్‌లు తమకు తామే డబ్బింగ్ చెప్పుకోవడం పాత్రలకు నిండుదనం తెచ్చింది. తెలుగులో కిరణ్ డైలాగులు రాసిన ఈ చిత్రంలో ‘దిడీలని’ (గబుక్కున అని అర్థం), ‘ముట్టాళ్’ (తెలివిలేనివాడు అని అర్థం) లాంటి తమిళ పదాలను తెలుగు వెర్షన్‌లో యథేచ్ఛగా ఎందుకు వాడారో అర్థం కాదు.

 ఎలా ఉందంటే...

దేశం గర్వించే దిగ్దర్శకుడు మణిరత్నం అందించిన మరో ప్రేమకథా చిత్రమిది. నిజానికి, అందమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో మణిరత్నం దిట్ట. ‘మౌనరాగం’ రోజుల నుంచి... ‘గీతాంజలి’ మీదుగా... మొన్నటి ‘సఖి’ దాకా అది బాక్సాఫీస్ సాక్షిగా పదే పదే ఋజువవుతూ వస్తున్న సత్యం. ఇటీవల ‘రావణ్’, ‘కడలి’ లాంటి పెద్ద ఎదురుదెబ్బలే తగిలిన ఆయన ఈ సారి ‘సహజీవన’మనే సమకాలీన అంశాన్నీ, తనకు పట్టున్న ప్రేమకథనూ కలిపి వెండితెరపై పసందైన వంటకాన్ని వండి వడ్డించారు. తమిళంలో ‘ఓ కాదల్ (ఓ.కె) కన్మణి’గా తయారైన ఈ చిత్రం తెలుగులో ‘ఓ.కె. బంగారం’గా అనువాదమైంది. పదిహేనేళ్ళ క్రితం మాధవన్, షాలిని జంటగా మణిరత్నమే తీసి, తమిళ ఉగాది కానుకగా (2000 ఏప్రిల్ 14న) విడుదలైన తమిళ ‘అలై పాయుదే’ (తెలుగులో ‘సఖి’గా విడుదలై, హిట్టయింది) ఛాయలు ఈ కొత్త చిత్రం నిండా పరుచుకున్నాయి. అందుకే, ఒక రకంగా ఇది సమకాలీన వాతావరణానికి తగ్గట్లుగా తీసిన ‘సఖి - 2015’ అని కూడా చెప్పవచ్చు.

 ఒకరకంగా సహజీవనానికి చాలావరకు సానుకూలంగా అనిపించే ప్రమాదమున్న సినిమా ఇది. అయితే, ‘ఒక్క మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే చాలా? అప్పుడిక అంతా ఓ.కేనా?’ అని హీరోయిన్ పాత్ర వేసే ప్రశ్న మాత్రం నిజంగానే ఆలోచింపజేస్తుంది. ఫస్టాఫ్ కొంత నిదానంగా అనిపించినా, పాత్రల పరిచయం, వాటి గమ్మత్తై ప్రవర్తన, చిన్ని చిన్ని అందమైన అంశాలతో నడుస్తుంది. చాలామంది ప్రేక్షకులను మళ్ళీ తమ యౌవనదశలోకి ప్రయాణింపజేస్తుంది. ఇక, ఈ తరం యువ ప్రేక్షకుల మాటైతే ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. అయితే, ఈ కథకు సెకండాఫ్‌కు కీలకం. హీరో హీరోయిన్ల ప్రవర్తన, వైఖరిలోని మార్పునూ, ఘర్షణనూ తెలియజెప్పే ఈ భాగం ఎంత కన్విన్సింగ్‌గా ఉంటే, సినిమా అంత బాగుంటుంది. కానీ, దురదృష్టవశాత్తూ, ఆ క్రమంలో కథ, కథనం అస్తుబిస్తు అయినట్లు కనిపిస్తుంది. దాంతో, సెకండాఫ్‌లో చాలాసేపు ప్రేక్షకులు తెరపై జరుగుతున్న కథ నుంచి కొంత దూరమవుతారు.

నిజానికి, అప్పటికే 15 మంది గర్ల్ ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేసిన హీరో తనను 16వ గర్ల్ ఫ్రెండ్‌గా ఎంచుకున్నా, హీరోయిన్ అతనికి దగ్గరవడానికి తగిన కారణం కనిపించదు. అలాగే, వారిని తమ ఇంట్లోని గదిలో ఉండడానికి ప్రకాశ్‌రాజ్ కుటుంబం అంగీకరించడానికీ బలమైన కారణం చూపలేదు. హీరో, హీరోయిన్ల మధ్య ఉన్నది తెలియని ఆకర్షణా, ప్రేమా, ‘లివ్ ఇన్ రిలేషన్‌షిప్’ ముసుగులో ఉన్న కామమా అన్న అనుమానమూ వస్తుంది. డైలాగుల గందరగోళం మధ్య హీరోయిన్‌కు హీరో కనిపించని రెండు రోజులు అసలేమైందన్న విషయమూ స్పష్టంగా అర్థం కాదు. హీరో, హీరోయిన్ల వైపు బంధువులంతా ఒప్పుకున్నాక కూడా పెళ్ళికి వారు సిద్ధం కాకపోవడానికి  మొత్తానికి, పెళ్ళి వద్దనుకొనే దశ నుంచి పెళ్ళి చేసుకుందామనుకొనే దశకు మారిన ఒక జంట జీవితంగా ఇది ‘న్యూ ఏజ్ లవ్‌స్టోరీ’. సంప్రదాయ సంగీత నేపథ్యమున్నా, సంప్రదాయ జీవన విధానానికి విరుద్ధంగా సాగే ఈ చిత్రం కొత్తతరంలో ఉండే సరదాలు, అనుభూతులు, అనుమానాలను ప్రతిఫలిస్తుంది. స్వేచ్ఛ, స్వతంత్ర లైంగిక జీవనాన్ని ప్రతిపాదిస్తూ, కొన్ని వర్గాలనే ఆకట్టుకుంటుంది. కాకపోతే, మణిరత్నం ఇమేజ్, ఆయన మార్కు విజువల్స్, పాటల మీద ప్రేక్షకులకుండే అభిమానమే ఈ ‘ఫీల్ గుడ్ సినిమా’కు శ్రీరామరక్ష. వెరసి, ఫుల్‌మీల్స్ కాలేకపోయిన ఈ సినిమా ఒక్కముక్కలో -  కొందరికే ఓ.కె. బంగారం!

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' Internet Edition, 17th April 2015, Friday)
......................................................

Friday, April 17, 2015

నేను వేధిస్తుంటా.. అతను సహిస్తుంటాడు..! - (దర్శకుడు మణిరత్నం... సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ల ‘డబుల్ ధమాకా’ ఇంటర్వ్యూ)

నేను వేధిస్తుంటా.. అతను సహిస్తుంటాడు..!
దర్శకుడు మణిరత్నం... సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్... ఇద్దరూ ఒకేసారి మీడియా ముందుకు వస్తే! రెండు మేరునగాలనూ కూర్చోబెట్టి, 5 నిమిషాల్లోనే అంతా అడిగేయమంటే? బుధవారం ‘ఓ.కె. బంగారం’  పాటల విజయోత్సవం కోసం హైదరాబాద్ సుడిగాలి పర్యటన జరిపారు ఆ ఇద్దరు. ప్లైట్ దిగుతూనే రెహమాన్ నాంపల్లి దర్గా సందర్శన, సానియా మిర్జాతో భేటీ, వెంటనే ఆడియో ఫంక్షన్, ప్రత్యేక టీవీ ఇంటర్వ్యూ, ‘బాహుబలి’ రాజమౌళితో రెహమాన్ మంతనాలు - మణిరత్నం ముచ్చట్లు... ఉన్న కాసేపూ ఊపిరి సలపని హడావిడి. 4 గంటలు నిరీక్షించి, అలసిన మీడియా... కాలానికి అతీతమైన ఆ క్రియేటర్‌‌సని పరిమిత కాలవ్యవధిలోనే ఆవిష్కరించాలని ప్రయత్నించింది. నటుడు ప్రకాశ్‌రాజ్ కలగ జేసు కుంటూ ఉండగా, సాగిన  ‘డబుల్ ధమాకా’ నుంచి...

  మరికొద్ది నెలల్లో అరవయ్యో ఏట అడుగుపెడుతున్నారు. అయినా, ‘ఓ.కె. బంగారం’ లాంటి ఇంత అందమైన ప్రేమకథా చిత్రాన్ని తీయడం ఆశ్చర్యం!
 మణిరత్నం: (ఆశ్చర్యం నటిస్తూ...) ఎవరు అరవయ్యో ఏట అడుగుపెడుతున్నది! నాకు ఇప్పటికీ ఇరవై ఒక్క ఏళ్ళ చిల్లరే! (నవ్వులు...)

  మీరు తరచూ బొంబాయి నగర నేపథ్యంలో చిత్రాలు తీస్తుంటారు. ఈ సినిమా కూడా ఆ నేపథ్యంలో సినిమానే! ఆ నగరం పట్ల మీ ఆకర్షణకు ప్రత్యేక కారణం?
 మణి: నేను తీసిన చిత్రాల్లో ఒకటైన ‘బొంబాయి’ అయితే, పూర్తిగా ఆ నగరం చుట్టూ తిరిగిన కథ. అయితే, ఆ కథ, ఆ నేపథ్యం వేరు. నిజం చెప్పాలంటే, నాకు బొంబాయి (ఇప్పటి ముంబై) నగరమంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ, ఇష్టం. రెండు మూడేళ్ళు నేను అక్కడే చదువుకున్నాను. పెపైచ్చు, భారతదేశంలో బాగా పురోగమిస్తున్న అనేక మహానగరాలకు ప్రతీక బొంబాయి నగరం. అందుకే, ఈ కథకు ఆ నేపథ్యమైతే బాగుంటుందని ఎంచుకున్నా.

  బొంబాయిలో ఉండే ఉల్లాసం, ఉత్సాహం కథకు ఉపకరిస్తుందనా?
 మణి: ప్రతి నగరానికీ తనదైన ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. ఈ చిత్ర కథ ఒక నిర్ణీత వాతావరణంలో, ప్రపంచంలో జరుగుతుంది. అది బొంబాయిలో ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. అందుకనే ఆ నగర నేపథ్యం తీసుకున్నాం.

  మీ సినిమాలు సమాజం నుంచి ప్రేరణ పొందుతుంటాయి. మరి, ఈ సినిమా?
 మణి: ఈ సినిమా కథ కూడా సమాజంలో నుంచి తీసుకున్నదే! ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈ సినిమా ఇవాళ్టిని, ఇవాళ్టి ప్రపంచాన్ని చూపిస్తుంది. ఇవాళ్టి యువతీ యువకులు, వయసు మీద పడ్డవాళ్ళు, వాళ్ళ మనోభిప్రాయాలను ఈ సినిమా చూపెడుతుంది. వారి మానసిక వైఖరినీ, వారు తీసుకొనే నిర్ణయాలనూ, వారి మధ్య ఉన్న ఘర్షణనూ ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది.

  ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు మీరు ఏ రకమైన రీసెర్చ్ చేస్తుంటారు?
 మణి: ఏదైనా ఒక ప్రత్యేకమైన కథ, ఒక ప్రత్యేకమైన పాత్ర అనుకున్నప్పుడు స్వరూప స్వభావాలకు కొంత రీసెర్చ్ అవసరం. కానీ, జీవితం నుంచే కథలనూ, పాత్రలనూ ఎంచుకున్నప్పుడు మనం చూసిన విషయాలు, మనకు ఎదురైన అనుభవాలు, అనుభూతులు కీలకమవుతాయి. కళ్ళూ, చెవులూ విప్పార్చి, అన్నీ గమనిస్తూ ఉంటే... చాలు. అదే మనకు రీసెర్చ్.

 ‘సహజీవనం’ అనే అంశంపై ఈ చిత్రకథ సాగుతుందని విన్నాం. ఇవాళ్టికీ సమాజం ఒక నేరంగా చూస్తున్న ఇలాంటి క్లిష్టమైన అంశాన్ని ఎంచుకున్నారేం?
 మణి: ఈ చిత్ర కథ కేవలం ‘సహజీవనం’ అనే అంశంపై సాగేది కాదు. ‘ఓ.కె. బంగారం’ సినిమా వివాహం గురించి, వివాహవ్యవస్థ పట్ల కథలోని ప్రధాన పాత్రలకు ఉన్న వైఖరి గురించి, వారి అభిప్రాయాల గురించి! కాబట్టి, ఈ సినిమా అనేక విషయాలనూ, పలువురు వ్యక్తులనూ స్పృశిస్తుంది. ప్రతి ఒక్కరూ ఆ అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా, ఇవాళ ప్రపంచీకరణ ప్రభావంతో పెరుగుతున్న ఈ తరం యువతీ యువకులు ఏ రకమైన పాశ్చాత్య ప్రభావానికి లోనవుతున్నారు, అదే సమయంలో మన భారతీయ విలువల్లో వేటికి కట్టుబడి ఉన్నారనేది ఈ చిత్రం చూపిస్తుంది.

  తెలుగు నేటివిటీ కోసం ఏమైనా మార్పులు చేశారా?

 మణి: ఈ చిత్రకథను దేశంలోని ఒక మహానగర నేపథ్యంలో చూపెట్టాం కాబట్టి, ఇది మనందరికీ తెలిసిన కథ, మన మధ్యే జరుగుతున్న కథ అనిపిస్తుంది. తెలుగు, తమిళం అనే తేడా లేకుండా ఇది తమ కథ అనే భావిస్తారు.  

 ఈ చిత్రం తమిళ వెర్షన్ ‘ఓ కాదల్ కన్మణి’ని షూటింగ్ జరుగుతున్నప్పుడే డైలాగులు, శబ్దం కూడా రికార్డు చేసేలా ‘సింక్ సౌండ్’తో చిత్రీకరించారేం?
 మణి: నన్నడిగితే, ఏ సినిమానైనా అలా ‘సింక్ సౌండ్’లోనే తీయాలంటాను! ‘సింక్ సౌండ్’తో తీయగలిగితే, అలా తీయడమే చాలా మంచిదని నా అభిప్రాయం. ఈ సినిమాను అలా తీయడం నాకెంతో సంతోషం అనిపించింది. అలా చేయడం వల్ల ఆర్టిస్టుల హావభావాలు, దానికి ప్రతిస్పందన, సెట్స్ మీదే రికార్డయిన ఆ సౌండ్‌లోని సూక్ష్మ వివరాలు, విశేషాలు తోడై అద్భుతంగా ఉంటుంది. డైలాగుల్లోనే కాక, మొత్తం సినిమాకే కొత్త జవజీవాలొస్తాయి.

 అలా ‘సింక్ సౌండ్’లో తీయడం కష్టం కాదా?  
 మణి: కష్టమే! ఆ మాటకొస్తే, షూటింగ్‌తో సహా అనేక విషయాలు కష్టమే. అయినా, మనం చేయాలి. కష్టంగా ఉంటుంది కదా అని, భయపడి వదిలేయకూడదు కదా! వీలుంటే, నా రాబోయే చిత్రాలకు కూడా ఇదే పద్ధతి పాటిస్తా.
 ప్రకాశ్‌రాజ్: (పక్క నుంచి అందుకుంటూ...) నటీనటుల దృష్టిలో నుంచి చెప్పాలంటే, ‘సింక్ సౌండ్’ చాలా కీలకం. నటిస్తున్న నటీనటులకు ఆ భాష తెలియాలి. ఆ డైలాగ్ చెబుతూ భావప్రకటన చేయడం తెలియాలి. దీనివల్ల తరువాతెవరో డబ్బింగ్ చేస్తారనే సౌకర్యం ఉండదు. ఆ క్షణాన్ని కెమేరా ముందు జీవించగలగాలి. నటీనటులు జాగ్రత్తగా, చైతన్యంతో ఉండాలి. ఆ సినిమా పట్ల ఎంతో నిజాయతీతో, నిబద్ధతతో ఉండాలి. ఒక నటుడిగా నాకు అది అనుభవమైంది.
 మణి: ప్రకాశ్‌రాజ్ మనసుకు హత్తుకొనేలా చెప్పారు. థ్యాంక్స్ ప్రకాశ్.

 గతంలో చక్కటి ప్రేమకథ ‘సఖి’ తీశారు. ఇప్పుడు ఈ సినిమా...
 ప్రకాశ్‌రాజ్: రెండూ భిన్నమైన సినిమాలు. శుక్రవారం మీరే చూస్తారు.

  చాలాకాలం తర్వాత మీరు, కెమేరామన్ పి.సి. శ్రీరామ్ మళ్ళీ కలసి పనిచేశారు...
 మణి: మళ్ళీ కలసి పనిచేయడమని నేను అనను. ఎందుకంటే, శ్రీరామ్ మా టీమ్‌లో ఎప్పుడూ సభ్యుడే! నా సినిమాకు కెమేరామన్‌గా పనిచేయని సందర్భాల్లో కూడా ఆయన మా జట్టులో వాడే! నేను తీసే ప్రతి సినిమా స్క్రిప్టూ ఆయనకు తెలుసు. ఆయన నాకు ‘బౌన్స్ బోర్డ్’ లాంటివాడు. నాకు ఆయన ఎంత మిత్రుడంటే, నా ప్రతి సినిమా ఆయనతో చర్చిస్తూ ఉంటా.

  మీకు వేటూరిగారితో అలవాటు. ఇప్పుడు సీతారామశాస్త్రిగారితో పనిచేయడం?
 మణి:  వేటూరి గారితో అనేక సంవత్సరాలు కలసి ప్రయాణించాను. ఇప్పుడు శాస్త్రి గారితో పనిచేయడం కూడా అచ్చం ఆ అనుభూతి లాగానే, ఎంతో బాగుంది. ఆయన రాసిన సాహిత్యం ఎంతో ఆనందాన్నిచ్చింది.

  రెహమాన్ గారూ! ఈ చిత్రంలో మీ అబ్బాయి స్వరంగేట్రం చేస్తున్నట్లున్నాడు!
 ఎ.ఆర్. రెహమాన్: నిజానికి, మా కుటుంబం వినడం కోసం ఒక పాట చేశా. అనుకోకుండా, మణి సార్ ఆ పాట విన్నారు. వెంటనే, ‘ఆ పాట నాకు కావాలి. ఈ సినిమాలో వాడతాను’ అన్నారు. అసలైతే, ఆ పాటను మ్యూజిక్ వీడియో చేయాలని, నా వ్యక్తిగత మిత్రులు వినేలా వాళ్ళకు ఇవ్వాలనీ ముందు అనుకున్నాను. కానీ, మణి సార్ అడిగేసరికి, సినిమాలో పెట్టేశా.
 మణి: నువ్విప్పటికీ ఆ పాటతో మ్యూజిక్ వీడియో చేయచ్చు.(నవ్వులు...)
 రెహమాన్: (నవ్వేస్తూ...) మణిరత్నం సినిమాలో రావడం గొప్ప విషయం కదా! ఆ పాటకు మంచి స్పందన వచ్చింది. ఒక సంగీత కళాకారుడైతే, ఆ పాట విన్నప్పుడల్లా ఎందుకనో కళ్ళవెంట నీళ్ళొచ్చేస్తున్నాయంటూ భావోద్వేగంగా మెసేజ్ పెట్టారు. రోజూ దాని గురించి అలాంటి మెసేజ్‌లొస్తూనే ఉన్నాయి.

  రెండు దశాబ్దాల పైచిలుకుగా మణిరత్నంతో మీ అనుబంధం గురించి..?
 మణి: (మధ్యలోనే అందుకుంటూ...) నేను వేధిస్తుంటా... అతను దాన్ని సహించి, నాకు కావాల్సింది ఇస్తుంటాడు. (నవ్వులు)
 రెహమాన్: నేను చాలా కాలంగా చెప్పాలనుకుంటున్న విషయం చెప్పాలి. మణి సార్‌లో ఒక ప్రత్యేక లక్షణం ఉంది. సాధారణంగా అందరూ అవతలివాళ్ళను పాపులారిటీని బట్టి, వాళ్ళ జయాపజయాలను బట్టి జడ్జ్ చేస్తుంటారు. ఈ హీరో పాపులర్, ఈ సంగీత దర్శకుడు ఇప్పుడు ఊపు మీద ఉన్నాడు... ఇలా చూసి, వాళ్ళను పెట్టుకోవాలని చూస్తుంటారు. ఫ్లాపులు వచ్చినవాళ్ళను దూరం పెట్టేస్తుంటారు. కానీ, మణి అలా జడ్జ్ చేయరు. అవతలి వాళ్ళు ఎంత ప్రేమతో, ఇష్టంతో నాణ్యమైన పని అందిస్తారన్నదే చూస్తారు. సదరు యాక్టర్ సక్సెస్‌లో ఉన్నాడా, ఫెయిల్యూర్‌లో ఉన్నాడా అని కాకుండా, ఆ వ్యక్తి ఎంత చక్కటి నటన అందిస్తారు, ఆ పాత్రను ఎంత అద్భుతంగా పండిస్తారన్నదే చూస్తారు. చేసే పని మీద శ్రద్ధ, ప్రేమ ఉంటే చాలు... మిగతావాళ్ళంతా పక్కనపెట్టినవాళ్ళను సైతం ఆయన ఆనందంగా స్వాగతిస్తారు. దగ్గరకు తీసుకొని, తన ప్రాజెక్ట్‌లో భాగం చేసుకొని, ప్రేమిస్తారు. అది ఆయనలోని గొప్ప లక్షణం. ఫ్లాపుల్లో ఉన్న ఫలానా వ్యక్తిని తీసుకుంటే, నా సినిమా కూడా ఫ్లాపవుతుందేమో లాంటి మూఢనమ్మకాలు ఆయనకు లేనే లేవు.

  మణి సార్! మీరు గతంలో మమ్ముట్టితో, ఇప్పుడీ సినిమాలో ఆయన కుమారుడు దుల్కర్‌తో పనిచేశారు. ఎవరిని ఇష్టపడ్డారు?
 మణి: వారిద్దరూ ఒకరికొకరు పూర్తి భిన్నం. మమ్ముట్టి లాంటి దిగ్గజం ఛాయలో పెరుగుతూ, ఆయన ప్రభావం లేకుండా నటించడం చాలా కష్టం. కానీ, విచిత్రంగా దుల్కర్ అదే చేశాడు. తండ్రిని అనుకరించకుండా, ఆత్మవిశ్వాసంతో అభినయించాడు. అది గొప్ప విషయం. నన్నడిగితే, ఏ ఇద్దరినీ ఒకరినొకరు పోల్చి, ఎవరు ఇష్టమని జడ్‌‌జ చేయాల్సిన పని లేదు.

 దుల్కర్, నిత్యామీనన్‌ల ఎంపికకు ప్రత్యేక కారణమేదైనా ఉందా?
 మణి: కేవలం నా మనుగడ కోసమే. (నవ్వులు...). తీస్తున్న సినిమాకు సులభంగా అందుబాటులో ఉంటూ, కథలోని పాత్ర లకు తమదైన అదనపు విలువను జోడిస్తూ, ఈ కథ నిజంగా జరిగిందని తెరపై అనిపించగలిగే వాళ్ళనెంచుకుంటూ ఉంటా.

  రెహమాన్‌జీ.. ఈ చిత్రానికి చేసి, పక్కన పెట్టేసిన పాటలేమైనా?
 రెహమాన్: మేము మరో పాట కూడా చేశాం. తీరా సినిమా చూశాక, ఆ పాట సరిగ్గా అతికినట్లు అనిపించలేదు. షూట్ చేసిన ఆ పాట తీసేశాం. నేను ఎంత కష్టపడి చేసిన పాటైనా సరే, బాగా లేదనుకుంటే పక్కనపెట్టాల్సిందే!
 మణి: రెహమాన్‌లోని గొప్ప విషయం అదే. ఇతరులు అలా ఉండరు. అతను ఎంతో శ్రమపడి, చేసిన పాటను సైతం వద్దని అంటే పక్కనపడేస్తాడు.  నేను మాత్రం తీసిన ఏ సీన్ కైనా ఎవరైనా అలా అంటే, తగాదా పడతా (నవ్వులు...)

  రెహమాన్‌జీ.. మీరు కానడ రాగం తరచూ వాడతారు. మణి గారు అడుగుతుంటారా?
 మణి: నాకే రాగమూ తెలీదు.

 ‘మౌనరాగం’ తెలుసేమో?
మణి: హ్హ...హ్హ... హ్హ...
రెహమాన్: పాట వినిపించ గానే, ఎవరీ సింగర్ అని మణి అడిగారంటే, ఆ పాట బాగుందని. ఈ సినిమాలో విలాస్‌ఖాన్, తోడి లాంటి అనేక రాగాలు వాడాలని చూశా. అయితే, మనకు ఎన్ని రాగాలు వచ్చని కాక, అవి ఎలాంటి భావాన్ని ఇస్తున్నాయనేది ముఖ్యం. అందుకే, చాలా సింపుల్‌గా వెళ్ళిపోయాను.

 మణీజీ! మీ సినిమాలు యువతరం, పెద్దవాళ్ళు అందరూ చూస్తుంటారు. ఇన్ని వర్గాలకు నచ్చేలా ఎలా తీస్తారు?
 మణి: ఫలానా వయస్సు వాళ్ళకు నచ్చాలంటూ తీయను. ఎవరూ అలా తీయ కూడదు. ఎంచుకున్న కథను దానికి తగ్గట్లు తీయాలి. దాన్ని నిజాయతీగా తీయాలి. మన మనసుకు ముందుగా నచ్చేలా తీయాలి. అది ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని ఆశించాలి. అంతే.

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 16th April 2015, Thursday)
...................................

Thursday, April 16, 2015

'మా' కథ (‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలు)

-  దక్షిణ భారత సినీ నటీనటుల సంఘంగా 1950ల నాటికే మద్రాసులో ‘నడిగర సంగం’ మొదలైంది. ఏ భాషా సినీపరిశ్రమ ఆ భాషా ప్రాంతానికి తరలివెళ్ళడంతో, ఎక్కడికక్కడ కొత్తగా ప్రాంతీయ భాషా నటీనటుల సంఘాలు వచ్చాయి. అలా తెలుగు నటులకు ‘మా’ ఏర్పాటైంది. కళాకారులకు ‘అమ్మ’ లాంటిదనే ఉద్దేశంతో, అమ్మ ఒడిని లోగోగా పెట్టుకున్న ఈ సంఘాన్ని 21 ఏళ్ళ క్రితం 1993 అక్టోబర్ 4న స్థాపించారు.

- చిరంజీవి సంస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ సంస్థ కార్యవర్గ కాలపరిమితి రెండేళ్ళు. ప్రతి రెండేళ్ళకూ ఎన్నికలు జరగాలి. గతంలో కృష్ణ, నాగార్జున, మోహన్‌బాబు, నాగబాబు తదితరులు ‘మా’ అధ్యక్షులుగా పనిచేశారు. మురళీమోహన్ అత్యధికంగా 6 సార్లు (12 ఏళ్లు) అధ్యక్షపదవి నిర్వహించారు.

 -  తెలుగు సినిమాల్లో నటించే తారలంతా ‘మా’లో కానీ, దీని గుర్తింపున్న ఇతర ఆర్టిస్టు సంఘాల్లో కానీ తప్పనిసరిగా సభ్యులై ఉండాలి. సభ్యుల సంక్షేమం, పారితోషిక సమస్యల పరిష్కారం ‘మా’ చూస్తుంది.  కనీసం 8 చిత్రాల్లో నటిస్తే కానీ, ‘మా’లో సభ్యత్వమివ్వరు. జీవిత కాల సభ్యులు (709), గౌరవ సభ్యులు (2), సీనియర్ సిటిజన్లు (28) కలిపి ‘మా’లో సభ్యుల సంఖ్య 739. వీరిలో ఓటు హక్కున్నది 702 మందికే.

‘- మా’లో సభ్యత్వానికి రుసుము ఒకప్పుడు స్వల్పమే కాగా, ఇప్పుడది అక్షరాలా లక్ష రూపాయలు. ఇంత భారీ రుసుముతో పేద కళాకారులకు దూరమై, పెద్దవాళ్ళకు గొడుగుగా ‘మా’ మారిందనేది ఒక విమర్శ.  కళాకారుల సంక్షేమానికీ, ప్రకృతి వైపరీత్యాల బాధితుల సహాయానికీ పలు కార్యక్రమాలు చేసిన నిధులు సేకరించిన ఘన చరిత్ర ‘మా’ది. ప్రస్తుతం 3 కోట్ల 22 లక్షల దాకా నిధీ ఉంది.

- అయితే, నిరుపేదలూ, వృద్ధులూ అయిన అర్హులైన అనేకమంది కళాకారులకూ ఆర్థిక సహాయం, మెడీక్లెయిమ్ లాంటి వసతులు ఇవాళ్టికీ మృగ్యమే.  ‘మా’కు ఇప్పటికీ సొంత భవనం లేదు. కొనుగోలు చేసిన ఒక అంతస్తు వేరే చోట ఉన్నా, చాలాకాలంగా హైదరాబాద్‌లోని ఏ.పి. ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రాంగణంలో చిన్న కార్యాలయంలోనే నడుస్తోంది.

- రెంటాల

(Published in 'Sakshi' daily, 29th March 2015, Sunday)
..................................................

ఎన్నికల సిని 'మా' నేడే!

ఎన్నికల సినిమా నేడే!
దాదాపు వారం రోజులుగా రకరకాల వివాదాలు, వ్యాఖ్యలు, ప్రతివ్యాఖ్యలతో సినీ పరిశ్రమతో పాటు, సామాన్యుల దృష్టిని కూడా ఆకర్షిస్తున్న ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఏ.పి. ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రాంగణంలో ఆదివారం నాడు పోలింగ్ జరగనుంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే పోలింగ్‌లో 702 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియను ఆపు చేయాలంటూ నటుడు ఒ. కల్యాణ్ వేసిన పిటిషన్‌ను విచారిస్తున్న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ ఎన్నికలను ఆపకుండా నిర్వహించ వచ్చనీ, అయితే తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు కౌంటింగ్ జరపడం కానీ, ఫలితాలు ప్రకటించడం కానీ చేయవద్దనీ శుక్రవారం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు ఎన్నికల అధికారి - ‘మా’కు న్యాయ సలహాదారైన వి. కృష్ణమోహన్ ‘సాక్షి’కి తెలిపారు. ‘‘కోర్టు ఆదేశాల మేరకే అంతా జరపడానికి ఏర్పాట్లు చేశాం. పోలింగ్ ప్రక్రియ మొత్తాన్నీ వీడియో తీస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.

 ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు - ఇలా మొత్తం 6 విభాగాల్లో పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగా 6 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇ.వి.ఎంల)ను వినియోగిస్తున్నారు. ‘‘సాంకేతిక ఇబ్బందులెదురైతే ప్రత్యామ్నాయంగా మరొక యంత్రాన్ని అదనంగా అట్టిపెడుతున్నాం’’ అని ఆయన వివరించారు. గతంలోని అనేక ఎన్నికల లాగానే ఈసారీ సీనియర్ నటుడు జి. నారాయణరావు సహాయ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. నిజానికి, 1993లో ఏర్పాటైన ‘మా’కు తొలి అయిదు కార్యవర్గాలూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 2000లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. కాగా, 2002 అక్టోబర్ 10న జరిగిన ఎన్నికల్లో ‘మా’ అధ్యక్ష పదవికి మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లు పోటీపడ్డారు.

అప్పట్లో 8 ఓట్ల తేడాతో రాజేంద్రప్రసాద్ ఓడిపోయారు. ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ బరిలోకి దిగారు. ఈ సారి కూడా ఆయనకూ, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడైన మురళీ మోహన్ ఆశీస్సులున్న జయసుధకూ మధ్య అధ్యక్ష పదవికి పోటీ జరగడం విశేషం. ‘‘ఈ మధ్య ఇంత భీకరమైన ‘మా’ ఎన్నికల పోరు జరగలేదు’’ అని పలువురు సీనియర్లు పేర్కొన్నారు. ఇప్పటి దాకా ఏ ఎన్నికల్లోనూ 50 శాతం మించి పోలింగ్ జరగని ‘మా’లో ఆదివారం పోలింగ్ ముగిసినప్పటికీ, 31వ తేదీ మంగళవారం కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు ఫలితాల ఉత్కంఠ కొనసాగనుంది. ఆ తరువాత కూడా కోర్టు వాయిదాలు, తుది తీర్పుకు మరికొంత ఆలస్యమయ్యే సూచనలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.

 నోరు నొక్కేశారు!
 ఇది ఇలా ఉండగా, తాజా ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్న ఒ. కల్యాణ్ ‘మా’లోని అవకతవకలపై శనివారం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్‌తో పాటు జయసుధ, అలీ, నరేశ్, హేమ తదితరులపై ఆయన విమర్శనా స్త్రాలు సంధించారు. ‘మురళీమోహన్ బంధుప్రీతి వల్ల ‘మా’కు 50 లక్షల నష్టం వచ్చింది. ఇప్పటి దాకా అనేక లేఖలు రాసినా లాభం లేకపోయింది. ధైర్యం చేసి, పెదవి విప్పిన నా నోరు నొక్కేస్తున్నారు’ అని కల్యాణ్ ఆరోపించారు. రాజేంద్రప్రసాద్ ప్యానెల్‌కూ, తనకూ సంబం ధం లేదనీ, స్వతంత్రంగా పోటీ చేస్తున్నాననీ ఆయన వివరించారు. ‘మా’లో అంతా మురళీమోహన్ చెప్పిందే వేదం, రాసిందే చట్టంలా నడుస్తోందని కల్యాణ్ ఆరోపించారు.
- రెంటాల

(Published in 'Sakshi' daily, 29th March 2015, Sunday)
............................................

Monday, April 13, 2015

మా మధ్య...గొడవలు పెట్టకండి బాబూ! - త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ

మాటల మాంత్రికుడు’... మంచి మనిషి... మనవైన విలువలను తెరపై చూపెట్టే దర్శకుడు... సంక్లిష్టంగా కాకుండా సరళంగా జీవితాన్ని జీవించమనే సినీ తాత్త్వికుడు... త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఎవరి నిర్వచనం వారిది. ఆయన మాత్రం ఎవరేమన్నా... అవేవీ పట్టించుకోనట్లే ఫకాలున నవ్వేసి... చేయి కలిపి, పక్క నుంచి ముందుకెళ్ళిపోయే పాదరసం. ‘స్వయంవరం’తో స్వతంత్ర సినీ రచయితగా మొదలుపెట్టి, ‘నువ్వే - నువ్వే’తో దర్శకుడైన ఈ భీమవరం బుల్లోడు ఇప్పటికి అరడజను సినిమాలను దర్శకుడిగా అందించారు. మనుషుల మధ్య అనుబంధాలు, మనవైన విలువలను తెరపై ఆవిష్కరించి, మనల్ని మనకే గుర్తుచేసే ఈ దిట్ట అల్లు అర్జున్‌తో తన తాజా ఏడో చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’లోనూ ఆ పనే విజయవంతంగా చేశారు. ఏణ్ణర్ధం క్రితం పవన్‌కల్యాణ్‌తో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ ‘అత్తారింటికి దారేది’ అందించిన త్రివిక్రమ్ తాజా రిలీజ్‌పై సంధించిన ప్రశ్నల పరంపరకిచ్చిన జవాబులు...
మా మధ్య...గొడవలు పెట్టకండి బాబూ!
 
  ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి స్పందన అంచనాలకి తగ్గట్టే ఉందా?
 ప్రతి సినిమాకూ నేను కోరుకునేది ఒకటే - సినిమా కొను క్కున్న బయ్యర్లకు వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చేయాలని.  మాట్లాడకుండా చూసేసే మల్టీప్లెక్స్ జనం కన్నా, నవ్వుతూ, ఈలలేస్తూ, తెర మీది కథ నచ్చిందో నచ్చలేదో తమ స్పందన ద్వారా చెప్పేసే సింగిల్ థియేటర్‌లోనే నేనెప్పుడూ సినిమా చూస్తా. హైదరాబాద్ సుదర్శన్‌లో చూశా. సామాన్య ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తోంది. ప్రాథమికంగా ‘సన్నాఫ్...’ మాస్ సినిమా కాదు కాబట్టి, క్రమంగా కుటుంబ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుంది. మరి కొద్ది రోజులైతే కానీ వాణిజ్య పరంగా సినిమా స్థాయి ఏమిటో తెలియదు. ఇక, నా వరకు అంటారా? కథ రాసి, సినిమా తీయడమే తప్ప, ప్రత్యేకించి అంచనాలు పెట్టుకోను.

  గత చిత్రాలతో పోలిస్తే, ఇందులో వినోదం తగ్గిందని..
 (మధ్యలోనే అందుకుంటూ...) కేవలం వినోదాత్మక కథలే కాక, వేరే కథలు కూడా చెబుతూ ఉండాలి కదా. నేను రాసుకున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కథను నిజాయతీగా తెర కెక్కించడానికి ప్రయత్నించా. ఆ క్రమంలో ఏ మేరకు కుది రితే అంతే వినోదం ఉంది. ఏవేవో ఐటమ్ ఇరికించలేదు.

  అంటే... హీరోలకు తగ్గట్లు కథలు రాయనంటారు...
 ఆ మాటంటే అబద్ధం. ఒక కథ అనుకున్నాక, ఆ కథలో చేసే హీరోకు తగ్గట్లు కొంత సర్దడం సహజం. కథను నిజాయతీగా తెరకెక్కిస్తూనే, వాణిజ్యపరంగా పెట్టుబడి తిరిగొచ్చేలా డిజైన్ చేస్తుంటాం. అదే సమయంలో నా మటుకు నేను చెప్పాలనుకున్న విలువల గీత దాటకుండా చూసుకుంటా.

  కానీ, హీరో పాత్రను 300 కోట్లొదులుకొనే మంచివాడిగా చూపడం...
 మంచివాళ్ళ కథలు బోరింగ్‌గా ఉంటాయని మనకు అపనమ్మకం. కానీ, ఈ భూమండలంపై అతి మంచివాడిగా కనిపించే రామాయణంలో రాముడి కథే చూడండి - అది ఇప్పటికి ఎన్నో భాషల్లో వచ్చింది. ఎన్నోసార్లు తెరకెక్కింది. ఒక మంచి వాణ్ణి హీరోగా పెట్టుకొని, అతనికి ఎదురయ్యే సవాళ్ళను అతనెదు ర్కొన్న తీరుతో, కథను ఆసక్తికరంగా, ఇష్టపడేలా చెప్పాలని ప్రయత్నించా.

  ఈ చిత్రకథకూ, మీ నిజజీవితానికీ సంబంధం ఉందా?
 నా వ్యక్తిగతం కాదు కానీ, చాలామంది జీవితాల్లో జరిగిన విషయాలు, నా స్నేహితులు, బంధువుల కుటుంబాల్లో జరిగిన కొన్ని ప్రధాన ఘటనల్ని సినిమాకు తగ్గట్లు నాటకీయంగా మలుచుకొని చేశా. ఎమ్మెస్ నారాయణ, రావు రమేశ్‌ల ఘట్టం పశ్చిమగోదావరి జిల్లాలోని వేగేశ్వరపురం అనే చిన్న ఊరులోని మా అమ్మ మేనమామల జీవితం నుంచి ప్రేరణ పొంది తీసుకున్నా. అన్న ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టిన తమ్ముడు, ఆస్తుల గురించి పట్టించుకోకుండా మూడు తరాలుగా కలిసుంటున్న ఆ కుటుంబాల స్ఫూర్తితో ఆ ఘట్టాన్ని సినిమాకు తగ్గట్లుగా మలిచా.

  తండ్రీ కొడుకులు ప్రకాశ్‌రాజ్, బన్నీల మధ్య ఇంకా సీన్లు పెట్టాల్సిందేమో?
 ఈ కథలో తండ్రి గొప్పతనం గురించి చెప్పాలనుకున్నా కానీ, ఆ పాత్రతోనే కథ నడపాలనుకోలేదు. కొడుకుకూ, తండ్రికీ మధ్య సీన్లతో ఆ గొప్పతనం చెప్పా లనుకోలేదు. తండ్రి, ఆస్తి ఉండగా కొడుకు గొప్పగా మాట్లాడే కన్నా, రెండూ పోయాక, తండ్రి గొప్పతనం కోసం కొడుకు పాటుపడడం గొప్పే కదా!

 కానీ, ‘మాటల మాంత్రికుడి’ పంచ్‌లు లేవనీ, బన్నీ ఎనర్జిటిక్‌గా లేరనీ...
 (నవ్వేస్తూ...) ‘మాటల మాంత్రికుడ’ని మీరంటారు కానీ, అదేమీ నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా... ఆ కథకు, ఆ సన్నివేశానికి అనిపించిన మాటలు రాయడమే. తండ్రి చనిపోయాక ఆ బాధలో ఉన్న హీరో వెంటనే పంచ్ డైలాగులు మాట్లాడితే బాగుండదు కదా! ఇక, ‘జులాయి’, ‘రేసుగుర్రం’ లాంటి చిత్రాల్లో ఉరికే జలపాతంలో ఉత్సాహంగా ఉండే బన్నీని చూశాం. మళ్ళీ అదే పద్ధతిలో కంఫర్‌‌ట జోన్‌లో వెళ్ళకుండా, హుందాగా, బాధ్యతతో కూడిన పాత్రలో ఆయనను చూపాలని కావాలనే నిర్ణయించుకున్నాం.

ఒక మెయిన్‌స్ట్రీమ్ సిన్మాలో సమంతను డయాబెటిక్‌గా చూపడం విచిత్రమేనే?
 హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలని మనం ఒక మూసలో పడ్డాం. ఏం? నల్లగా ఉన్నవాళ్ళు, ఆరోగ్య సమస్యలున్న అమ్మాయిలు కథలో హీరోయిన్ పాత్ర కాకూడదా? అయినా ఇవాళ ప్రపంచాన్నీ, అందులోనూ మన దేశాన్నీ పట్టిపీడిస్తున్న మహమ్మారి డయాబెటిస్. అది వచ్చినవాళ్ళను మనం జాలిగా చూస్తుంటాం. కానీ, కమలహాసన్, యాంకర్ గౌరవ్ కపూర్, క్రికెటర్ వసీం అక్రం లాంటి విజయసాధకులు డయాబెటిక్స్. అందుకే, అలాంటి ఆరోగ్య సమస్య ఉన్న వ్యక్తిని అందరూ ప్రేమించేలా, ఇష్టపడేలా చూపాలని హీరో యిన్‌ను అలా చూపించాం. మొదట మా యూనిట్‌లోనూ భిన్నాభిప్రాయా లొచ్చాయి. తీరా చూశాక, ముఖ్యంగా సూట్‌కేస్ ఫైట్, అక్కడి కామెడీ చూశాక, అంతా ఇష్టపడ్డారు. సినిమా టైటిల్‌పైనా అలాంటి చర్చే జరిగింది.

  ‘సన్నాఫ్...’లో భారత, రామాయణాల్ని ఎక్కువ ప్రస్తావించారు. కారణం?
 నా దృష్టిలో రామాయణ, భారతాలను మించిన అద్భుత సాహిత్యం ఎవరూ రాయలేదు. వాటిలో స్పృశించని అంశం లేదు. అందుకే, వాటిని సందర్భాను సారంగా ప్రస్తావించా. అందులో తప్పేం లేదు కదా.

 బలమైన విలన్ లేరనీ, హీరోతో అతణ్ణి చంపించలేదనీ కూడా ఒక విమర్శ?
 నిజానికి, ఈ కథలో నటుడు ఉపేంద్ర విలన్ కాదు. బయట ఏం చేసినా, భార్య ఎదుట మంచిగా ఉండాలనుకొనే వ్యక్తి. ప్రాథమికంగా ఈ కథలో ఉపేంద్రను చంపాలని చూసే సంపత్‌రాజ్ విలన్. కానీ, అతనికీ, హీరోకూ నేరుగా ఘర్షణ లేదు. పైగా, హీరోతో, విలన్‌ను చంపించడమనే కాన్సెప్ట్‌కు నేను కొంత వ్యతిరేకిని. ‘వాదనల ద్వారా అభిప్రాయాలు మారవు, వ్యక్తులను చంపడం ద్వారా వ్యవస్థ మారదు’ అని నా నమ్మకం. అందుకే, ‘అతడు’, ‘జల్సా’ - ఇలా దాదాపు నా ప్రతి సినిమాలో ఊహించని పరిస్థితులు, ఘటనల్లో విలన్ చనిపోతాడు తప్ప, హీరో చంపడు. ఇందులోనూ అంతే!

 ‘సన్నాఫ్...’పై సినీవర్గాల్లో కొంత మిశ్రమ స్పందన వినిపిస్తోంది...
 మనం ఏ ట్రేడ్‌లో ఉంటే అందులో తెలియకుండానే కొంత స్టిఫ్ అయిపోతుం టాం. సినీరంగంలోనూ అంతే. సామాన్య ప్రేక్షకుల్లాగా నవ్వొస్తే నవ్వి, ఏడు పొస్తే ఏడవం. బాగుందో, బాగాలేదో ఒక్క ముక్కలో చెప్పలేం. ఫస్టాఫ్ బాగున్నా సరే, సెకండాఫ్ ఎలా తీశాడో చూడాలంటూ ఇంటర్వెల్‌లో వ్యాఖ్యా  నిస్తాం. హాలులో కూర్చున్నా, చూస్తున్న సినిమాను ఆస్వాదించకుండా క్షణ క్షణానికీ అప్‌డేట్లు వాట్సప్‌లో, ట్విట్టర్‌లో ఇస్తాం. ఇది మనందరి బలహీనత. నా ఒక్క సినిమానే ఆడాలి, ఇతరులెవరివీ ఆడకూడదనుకుంటే తప్పు. అందరి సినిమాలూ పోతే, మనతో మళ్ళీ సినిమా తీయడానికి మిగిలేదెవరు?

 ఈ సినిమా నిర్మాణంలో మీరూ భాగస్వామి అని ఒక టాక్ నడుస్తోంది...
 (గట్టిగా నవ్వుతూ...) మా నిర్మాత రాధాకృష్ణ గారు, నేను బాగున్నాం. మా మధ్య గొడవలు పెట్టకండి బాబూ! ఇప్పటి దాకా ఏ సినిమాలోనూ నేను పైసా పెట్టుబడి పెట్టలేదు. భాగస్వామినీ కాలేదు. కాకపోతే, బడ్జెట్ నియంత్రణ లాంటి విషయాల్లో నిర్మాతకు మన వైపు నుంచి వీలైనంత సాయం చేస్తుంటాం. ఇవాళ సినిమాలపై పణంగా ఒడ్డుతున్న సొమ్ము పెద్దది కాబట్టి, నిర్మాత క్షేమం కోసం యూనిట్ తన వంతు పాత్ర పోషిస్తుంది. అంతే.

  మీరు తీసిన సినిమా మీరే చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది?
 ఏ క్రియేటర్‌కీ తన సృష్టి తనకు పూర్తిగా నచ్చదు. ఇంకా ఏదో, మెరుగ్గా చేయాలనిపిస్తూ ఉంటుంది. మనకున్న పరిమిత సమయం, బడ్జెట్‌లో ఉన్నంతలో బాగా తీస్తాం. తీరా అంతా అయ్యాక,  బయటివాళ్ళకు తెలియకపోయినా మన లోటుపాట్లు మనకు తెలుస్తుంటాయి. అందుకే తీయడమైపోయాక, నా సినిమా కూడా నేను చూడలేను. నేను తీసింది నాకే నచ్చదు. ఆ సృజనాత్మక తృష్ణతో ఎప్పటికప్పుడు ఇంకా నేర్చుకొని, మరింత మంచి సినిమా తీయాలనుకుంటా.

 పాటలకూ, భోజనం సీన్‌కూ పేరొచ్చింది!
 కథ, సందర్భాలు చెప్పగానే దేవిశ్రీ చాలా మంచి పాటలిచ్చాడు. ‘కమ్ టు ది పార్టీ’ పాటకైతే, సీతా రామశాస్త్రి గారు పల్లవి రాశాక ట్యూన్ కట్టాడు. ‘సూపర్ మచ్చీ’ పాట మొదటి ట్యూన్ నచ్చలేదంటే, మరునాటికల్లా తానే పాట పల్లవి రాసి మరీ అద్భుతమైన ట్యూన్‌తో వచ్చాడు. ఇలా ఎన్నో! ఇక, ఉపేంద్ర ఇంట్లో భోజనం సీన్‌లో ఒక పాత్రకు భయం, మరోపాత్రకు ఆశ్చర్యం, వేరొక పాత్రకు జరిగిందేమిటో తెలియని తనం - ఇలా రకరకాల ఎమో షన్‌‌స ఉంటూనే, ప్రేక్షకు డికి మాత్రం వినోదం  కలిగించాలి. అది రాయడం, తీయడం చాలా కష్టమైంది. అలాగే, అందరితో కటువుగా, భార్య వస్తుంటే మాత్రం మంచిగా ఉండే ఉపేంద్ర పాత్రలోని రెండు పార్శ్వాలను చూపే సీన్ కూడా! ఇలాంటివి బాగా రాశాక, దానితో కలిగే ఆనందం వేరు. అందుకే నేను తుది ఫలితం కన్నా, ఆ పని చేసే క్రమాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తా.

  రాజమౌళి హీరోలతో మీరు, మీ హీరో లతో ఆయన చేయరని వెబ్‌సైట్ల కథనం...
 (నవ్వేస్తూ...) కథకు తగ్గట్లు కుది రిన హీరోలతో చేస్తాం తప్ప, ఫలానా వాళ్ళతో చేయకూడదని ఎవరూ అను కోరు. ఎన్టీఆర్, రామ్ చరణ్... ఇలా అందరితో చేయాలని ఉంది. కథ, డేట్లు కుదరాలిగా! ఏమైనా ఈ వార్త నాకు కొత్త. నేను వెబ్‌సైట్లు చదవను. టీవీ పెద్ద చూడను. దాని వల్ల జీవితం ఎంత సుఖంగా ఉందో చూడండి (నవ్వులు...).

  రాజమౌళిలా మీరూ మన సినిమాను ఇతర భాషల్లోకి తీసుకెళ్ళి, మార్కెట్ పెంచే కథలతో సినిమా తీయచ్చుగా?
 ‘ఈగ’, ‘బాహుబలి’ లాంటివి అలాంటి అద్భుత ప్రయ త్నాలు. నిజాయతీగా మన దగ్గరా అలాంటి కథ ఉంటే చేయాలి తప్ప, ఆయన చేస్తున్నారని మనమూ చేయాలనుకోవడం తప్పు.

 మీ తదుపరి చిత్రం?
 ఇంకా ఏదీ ఖరారవలేదు.

 పవన్ కల్యాణ్, మీరు తీస్తామన్న ‘కోబలి’?
ఉంది. అది ఒక రకంగా ప్యారలల్ సినిమా. అందుకే, మేమే తీయాలను కున్నాం. సాంకేతికంగా క్లిష్ట మైన, ఉన్నత ప్రమా ణాలున్న ఆ చిత్రం కోసం విదేశీ నిపు ణుల్నీ సంప్రతిం చాం. అందుకే కొన్ని లక్షలు ఖర్చు చేశాం. త్వరలోనే చేస్తాం.

ఆడియో ఫంక్షన్‌లో అన్నట్లు పవన్ మీకు దేవుడా? అంతకు మించా?
 మంచి మిత్రుడు. అంతే.

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' Telugu daily, 12th April 2015, Sunday)

.......................................


Sunday, April 12, 2015

మానవ సంబంధాలే... త్రివిక్రమ్ బాక్సాఫీస్ ఆస్తి (సినిమా రివ్యూ - సన్ ఆఫ్ సత్యమూర్తి)

..........................................
 చిత్రం - సన్ ఆఫ్ సత్యమూర్తి, తారాగణం - అల్లు అర్జున్, సమంత, నిత్యా మీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, సంపత్‌రాజ్, ‘వెన్నెల’ కిశోర్, పాటలు - ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, దేవిశ్రీ ప్రసాద్, సంగీతం - దేవిశ్రీ ప్రసాద్, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్- సాయిగోపాల్ ఆర్., కెమేరా - ప్రసాద్ మురెళ్ళ, ప్రొడక్షన్ డిజైనర్ - ఎస్. రవీందర్, యాక్షన్ - పీటర్ హెయిన్, కూర్పు - ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.వి. ప్రసాద్, నిర్మాత - సూర్యదేవర రాధాకృష్ణ, రచన - దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్
.........................................

సినిమా రివ్యూ - సన్ ఆఫ్ సత్యమూర్తి

ఒకే కథను ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతారు. చెప్పేవాడు గనక చేయితిరిగిన కథకుడైతే, మామూలు కథ కూడా వెండితెరపై కళ్ళకు కొత్తగా కనిపిస్తుంది. హఠాత్తుగా నాన్న చనిపోవడంతో వీధిన పడ్డ కుటుంబాన్ని కాపాడే ఒక కథానాయకుడి కథ మనకు కొత్త కాకపోవచ్చు. కానీ, దానికి నాన్న బోధించిన విలువలే అతి పెద్ద ఆస్తి అనే పాయింట్‌నూ, ఆయన గౌరవాన్ని కాపాడేందుకు హీరో ఎంత దూరమైనా వెళ్ళడాన్నీ జోడించి తీస్తే? త్రివిక్రమ్ - అల్లు అర్జున్‌ల కాంబినేషన్‌లో వచ్చిన తాజా సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (‘...విలువలే ఆస్తి’ అనేది ఉపశీర్షిక) అలాంటి కథే. ఆస్తికీ, ఆనందానికీ లింక్ లేదని ప్రతిపాదిస్తుంది.

కథ ఏమిటంటే...

విరాజ్ ఆనంద్ (అల్లు అర్జున్) ఒక పెద్ద కోటీశ్వరుడైన సత్యమూర్తి (అతిథి పాత్రలో ప్రకాశ్‌రాజ్) కుమారుడు. మనుషులు, అనుబంధాల కన్నా ఆస్తులు, డబ్బులు విలువైనవి కావనే మంచి మనిషి. అనుకోని ఒక దుర్ఘటనలో ఆయన చనిపోతాడు. తండ్రి చెప్పిన విలువల్ని కాపాడడం కోసం రూ. 300 కోట్ల ఆస్తిని అప్పులవాళ్ళకు వదిలేసి హీరో తన కుటుంబంతో వీధిన పడతాడు. అప్పటికే పల్లవి (అదాశర్మ)తో కుదిరిన పెళ్ళిని మామ (రావు రమేశ్) క్యాన్సిల్ చేస్తాడు. అమ్మ (పవిత్రా లోకేశ్), మతి చెడిన అన్నయ్య (‘వెన్నెల’ కిశోర్), వదిన, వాళ్ళ చిన్నారి పాప సంరక్షణభారం హీరో మీద పడుతుంది. ఆర్థిక సంపాదన కోసం హీరో చివరకు వెడ్డింగ్ ప్లానర్ అవతారమెత్తుతాడు. తీరా ఆ పెళ్ళి తనను కాదన్న పల్లవిదే! అక్కడ జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో సమీరా అలియాస్ సుబ్బలక్ష్మి (సమంత)తో హీరో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమను దక్కించుకోవడానికీ, చనిపోయిన తన నాన్న మీద ఆమె తండ్రి సాంబశివరావు (రాజేంద్రప్రసాద్) వేసిన అభాండాన్ని చెరిపివేయడానికీ హీరో ఏకంగా తమిళనాడులోని రెడ్డియార్‌పట్టి వద్ద స్థిరపడ్డ ఓ తెలుగు కుటుంబం దగ్గరకు వెళతాడు. అక్కడికి ఫస్టాఫ్.

తమిళనాట కొన్ని గ్రామాలకు నియంతగా వ్యవహరించే దేవరాజు నాయుడు (ఉపేంద్ర), అతని భార్య (స్నేహ)ల కుటుంబంలోకి హీరో, అతని మిత్రుడు పరంధామయ్య (అలీ) చేరతారు. అక్కడ జరిగిన అనేక సంఘటనల మధ్య 600 మంది ప్రైవేటు సైన్యమున్న దేవరాజు తన చెల్లెలు వల్లి (నిత్యామీనన్)ని హీరోకు ఇచ్చి పెళ్ళిచేయాలనుకుంటాడు. ఇష్టం లేని ఆ పెళ్ళిని హీరో ఎలా తప్పించుకున్నాడు, 8 వేల గజాల స్థలం అమ్మకం విషయంలో తన తండ్రి మీద పడ్డ అభాండాన్ని ఎలా చెరిపేసుకున్నాడన్నది మిగతా కథ.

ఎలా చేశారంటే...

క్యారెక్టర్ ఆర్టిస్టు ఎమ్మెస్ నారాయణ ఆకస్మికంగా మరణించడానికి ముందు నటించిన చివరి సినిమాల్లో ఒకటి ఇది. షూటింగ్ అయిపోయాక ఆయన మరణించడంతో, వేరొకరి మిమిక్రీతో డబ్బింగ్‌ను తెలివిగా మేనేజ్ చేసిన ఈ చిత్రబృందం ఈ సినిమాను గౌరవంగా ఎమ్మెస్‌కే అంకితం చేసింది. నిజానికి, ఈ సినిమా నిండా బోలెడంతమంది నటీనటులు. కాబట్టి, ఏ ఫ్రేమ్‌లో చూసినా తెర నిండుగా నటీనటులు కనిపిస్తూనే ఉంటారు. ఇన్ని పాత్రల మధ్యనా అల్లు అర్జున్ విపరీతమైన ఎనర్జీతో, విచిత్రమైన ఒక డైలాగ్ డెలివరీ శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. బాధ్యతాయుతమైన కొడుకుగా, చలాకీ ప్రేమికుడిగా రకరకాల షేడ్స్ ఉన్న పాత్రను బాగా పోషించారు. కొన్ని పాటలకు చులాగ్గా అతను వేసిన స్టెప్పులు బాగున్నాయి. మెయిన్‌స్ట్రీమ్ సినిమాల హీరోయిన్ సమంత డయాబెటిక్ పేషెంట్ లాంటి పాత్ర పోషించడం విశేషమే. అందం, అభినయం కలగలిసిన పాత్రపోషణ ఆమెది. నిత్యా మీనన్ కనిపించేది కాసేపే అయినా, బాగున్నారు. అదాశర్మది చాలా కొద్దిసేపు కనిపించే పాత్ర. ఫస్టాఫ్‌లో అలీ, సెకండాఫ్ చివరలో బ్రహ్మానందం కామెడీ పండించే పనిని భుజానికి ఎత్తుకున్నారు. ఉపేంద్ర, కోట శ్రీనివాసరావు, స్నేహ లాంటి వారు నిడివి రీత్యా చిన్నవే అయినా, ఆ యా పాత్రలు నిండుగా కనిపించడానికి తోడ్పడ్డారు.

సాంకేతిక విభాగాల పనితీరేమిటంటే...

ఫస్టాఫ్ సెంటిమెంట్ సన్నివేశాలతో కొంత నిదానంగా నడుస్తుంది. ఇక, సెకండాఫ్‌లో కొంత వేగంగానే నడిచినా, అనేక అంశాలను ఒక్కచోట గుదిగుచ్చడంతో ఏ పాత్ర మీదా, సంఘటన మీదా పూర్తి శ్రద్ధ పెట్టే అవకాశం లేకుండాపోయింది.అయితేనేం, ఈ సినిమాకున్న అనేక బలాల్లో పాటలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ముఖ్యమైనవి. ఇప్పటికే ఈ పాటలు రేడియోలో, టీవీల్లో మారుమోగుతున్నాయి. ముఖ్యంగా, ‘చల్ చలో చలో....’ (రచన - రామజోగయ్య శాస్త్రి, గానం - రఘు దీక్షిత్) అనే పాట జీవన తాత్త్వికతను బోధిస్తూ, ఆలోచింపజేసేలా సాగుతుంది. దేవిశ్రీ ప్రసాదే స్వయంగా రాసి, శ్రావణభార్గవితో కలసి పాడిన ‘సూపర్ మచ్చీ...’ పాట సినిమా చివరలో పక్కా మాస్ శైలిలో ఉర్రూతలూపుతుంది. అలాగే, ‘కమ్ టు ది పార్టీ...’ (గానం - విజయ్ ప్రకాశ్) అనే పార్టీ గీతం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కలానికి ఉన్న ఆధునిక పాళీని చూపుతుంది. రాగల కొద్దిరోజులు జనం నోట నానుతుంది. శ్రీమణి రాసిన ‘జారుకో...’ గీతం (గానం - దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్, ఎం.ఎం. మానసి) గమ్మత్తుగా ధ్వనిస్తుంది. ఇక, ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫీ, రవీందర్ కళా దర్శకత్వం కథానుగుణంగా సాగుతాయి. పీటర్ హెయిన్ చేసిన యాక్షన్ సన్నివేశాల్లో సూట్‌కేసు దొంగలపై హీరో చేసే ఫైటు లాంటివి బాగుంటాయి.

ఎలా ఉందంటే...

హీరో ప్రయాణం ఎక్కడో మొదలై మరెక్కడే తేలినట్లూ, బలమైన విలన్ సినిమాకు కరవైనట్లూ అనిపించే ప్రమాదం ఉన్న ఈ స్క్రిప్టు నిజానికి అంతకన్నా బలమైన మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. మనం ఎదుటివాళ్ళకు ఏది చేస్తే, అదే మనకూ తిరిగి వస్తుంది. ఎదుటివాళ్ళకు మనం మంచి చేసినా, కోరుకున్నా... అదే మనకూ లభిస్తుందనే విషయాన్ని అంతర్లీనంగా చెప్పే వెండితెర కథ ఇది. త్రివిక్రమ్‌కు బాగా పేరు తెచ్చిన ‘అతడు’, ‘అత్తారింటికి దారేది’ లాంటి వాటి లాగానే ఈ చిత్రం కూడా మానవ సంబంధాలు, బంధాలు, బాంధవ్యాల చుట్టూ తిరిగే కథే. బహుశా అందుకే కావచ్చు... అక్కడక్కడా ఇది త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్‌ల ‘అత్తారింటికి దారేది’నీ, తమిళ నేపథ్యంతో వచ్చిన షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’నూ గుర్తుకుతెస్తుంది. ఇవన్నీ కుటుంబ కథలు కావడం, సకుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీసినవి కావడం అనివార్యంగా పోలికలు తెస్తుంది.

కాకపోతే, చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా మనసుకు హత్తుకొనేలా, అదీ ప్రేక్షకుడు ఒక్కక్షణం ఆగి ఆలోచించేలాగా కూడా చెప్పడం రచయితగా, దర్శకుడిగా త్రివిక్రమ్‌కు ఉన్న పెద్ద బలం. పైగా, కథలోని ఏ సంఘటననూ ఏకబిగిన ఒకేసారిగా పూర్తిగా వెల్లడించరు. దాన్ని విడతల వారీగా చెప్పుకుంటూ, ముడులు విప్పుకుంటూ వెళ్ళడంలో ఒక ప్రయోజనం ఉంది. ఆ సంఘటనలోని రకరకాల కోణాలు మెల్లగా వెల్లడవుతూ, ఒక సస్పెన్స్‌నూ, సర్‌ప్రైజ్‌నూ ఆఖరు వరకూ కొనసాగిస్తాయి. హీరో తండ్రి తాలూకు ప్రమాదమనే సంఘటనను హీరో దృష్టిలో ఒకసారి కొంత, హీరోకు ప్రత్యర్థి (విలన్ అనచ్చా?) దృష్టిలో మరికొంత, దానికి కొనసాగింపుగా నిత్యా మీనన్ దృష్టిలో మరికొంత వెల్లడించడం అలాంటిదే! ఇలాంటి సినీ కథన పద్ధతి ఆసక్తికరంగానూ, రొటీన్‌కు భిన్నంగానూ అనిపిస్తుంది. డైలాగ్ కామెడీ కన్నా దృశ్యాలు, భావప్రకటన ద్వారా విజువల్ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యమివ్వడం కూడా కొత్తగా అనిపిస్తుంది.

ఈ సినిమా మొత్తాన్నీ ఆయన ఒక మంచి నవల తరహాలో నేరేట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో పాత్రలు, సంఘటనలు, కొన్నిచోట్ల రచయితగా రాసిన డైలాగులు మామూలు కన్నా ఎక్కువే. హీరో మరీ ఎక్కువ మాట్లాడుతున్నాడేమో అనీ అనిపిస్తుంది. అయితే, రొటీన్ సినిమాలకు భిన్నమైన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. కొన్నిచోట్ల త్రివిక్రమ్ రాసిన డైలాగులు, పాత్రల ద్వారా వల్లించిన జీవన సూక్తులు చిరకాలం గుర్తుండిపోతాయి. హీరో మాటల్లో వచ్చే ‘‘ మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత. పిల్లలు  మోయాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం’’..., ‘‘మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్’’..., ‘‘భార్యను గెలవాలంటే కప్పులు పగలగొట్టడం కాదు సార్! (మధ్యలో ఉన్న) ఆ గోడ బద్దలుకొట్టండి!’’ లాంటి డైలాగులు అందుకు ఉదాహరణ. తమిళనాట సన్నివేశాలకు ‘కూడు తిన్నారా?’ లాంటి అక్కడ మాట్లాడే తెలుగే వాడేందుకు శ్రమించారు. ఇవన్నీ సినిమాకు పాజిటివ్ అంశాలు

అయితే, ఏ సీన్‌కు ఆ సీన్‌గా బాగుందనిపించే ఈ రెండు గంటల 42 నిమిషాల సినిమాలో వచ్చే సవాలక్ష సబ్‌ప్లాట్లు, తండ్రి గౌరవాన్నీ - ఆయన చెప్పిన విలువలనూ కాపాడుకోవడం కోసం హీరో పడే పాట్లు చూశాక కొన్నింటికి సరైన వివరణలు, తార్కికమైన ముగింపులు కనపడవు. హీరో ప్రేమిస్తున్నది అదాశర్మ స్నేహితురాలైన సమంతను అని పెళ్ళి ఏర్పాట్ల మధ్య పదే పదే చెబుతూ వస్తారు కానీ, ఆ పక్కనే కనిపిస్తున్న రాజేంద్రప్రసాద్ కూతురే ఆ అమ్మాయన్న సంగతిని తరువాత సీన్ల ఎప్పుడో బయటపెట్టడం ఒక సినిమాటిక్ స్క్రీన్‌ప్లే కన్వీనియన్స్. ఇక, నిత్యామీనన్ నిజానికి ప్రేమిస్తున్నది తన మేనమామనే అయినా, హీరోతోనూ ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించడం తికమక కలిగిస్తుంది. అలాగే, ఉపేంద్ర ఇంటిపక్కనే అతని బావమరిది ఉన్నాడని చెబుతారు, చూపిస్తారు కానీ, సినిమాలో అతను మళ్ళీ కనిపించడు. తమిళనాడులోని ఉపేంద్ర ఇంటికి హీరో బృందం రావడానికే కారణమైన సదరు బావమరిది పాత్ర ఆ తరువాత వారి గురించి పట్టించుకోదెందుకో తెలియదు.

ఇలాంటి లూజ్ ఎండ్స్‌ను పక్కనపెడితే, మొత్తం మీద ఈ సినిమా సగటు ప్రేక్షకులను నిరాశ పరచదు. అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది. మర్చిపోతున్న మానవ సంబంధాలు, మనం వదిలేసుకుంటున్న మంచి విలువలను మరోసారి గుర్తు చేస్తుంది. ఆ మేరకు ఈ దర్శక - రచయితనూ, తీసిన నిర్మాతనూ అభినందించాల్సిందే! కాకపోతే, పెళ్ళి భోజనానికని సిద్ధమై వచ్చిన ప్రేక్షకులు పూర్తిస్థాయిలో సంతృప్తి పొందుతారా అన్నదే కించిత్ అనుమానం. అయితే, అవేవీ ఈ సినిమా కమర్షియల్ విజయాన్ని అడ్డుకోలేవన్నది మాత్రం అనుమానం అక్కర్లేని నిజం.

కొసమెరుపు - 
అన్నట్లు... ఈ సినిమాలో హీరో పాత్రను ఒకరు నందు అంటారు... మరొకరు ఆనంద్ అంటారు... ఇంకొందరు విరాజ్ అని పిలుస్తారు. వెరసి అతని పూర్తి పేరు - విరాజ్ ఆనంద్ అని ప్రేక్షకులే గ్రహించాలి. మొత్తానికి, సినిమాలో ఒక ప్రధానమైన కథకు బోలెడన్ని ఉపకథలు కలిపినట్లే, ఒక హీరో పాత్రకు ఇన్ని పేర్లు, ముద్దు పిలుపులూ ఉండడం అరుదైన విచిత్రమే! మొత్తానికి, త్రివిక్రమ్ మార్కు డైలాగులు, కథన విధానం, అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ బాణీల్లోని పాటలు లాంటి వాణిజ్య విలువలు ఈ ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి బాక్సాఫీస్ వద్దే కాక, రేపు పదే పదే టీవీ చానళ్లలో ప్రసారానికీ తరగని ఆస్తి. ‘త్రివిక్రమ్ సినిమా అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి’ అనుకొంటూ, గత చిత్రాల పోలికలతో ‘అంతకు మించి...’ కావాలని కోరుకోకపోతే, వేసవి సినీ కాలక్షేపానికి ఇంతకు మించి కావాల్సింది ఇంకేముంటుంది!

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' Web edition, 9th Apr 2015, Thursday)
...........................................................