జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, April 20, 2026

మళ్ళీ మన ముందుకు... ఆ మహామహులు!

            - పది గంటల శ్రవ్య – దృశ్య రూపకంగా అలనాటి నాటక ప్రస్థానం

- నాటి నాటక మహామహుల అభినయాన్ని నవతరం కళ్ళ ముందుంచే అపూర్వ ప్రయత్నం

 

నూరు వసంతాలు దాటిన తెలుగు నాటక ప్రస్థానంలో ఎన్నో మెరుపులున్నాయి. మరెన్నో నేర్చుకున్న పాఠాలున్నాయి. ఉత్తుంగ తరంగమై నిలిచి, ఉత్థాన పతనాలెన్నో చూసిన ఈ రంగస్థల స్రోతస్విని ప్రయాణంలో ఎందరో మహానుభావులు... తమ జీవితాన్నే కళకు దివ్య సమర్పణం చేసిన ఎందరెందరో మహామహులు. రంగస్థలం, వెనుక దాన్ని అనుసరించి వచ్చిన వెండితెర రంగుల ప్రపంచం... ఉభయత్రా తమ ప్రతిభా సంపత్తులతో ఆ రంగాలకు కొత్త కాంతులు జోడించిన ఆ దివ్యమూర్తులను నేటి తరానికి పరిచయం చేస్తే? వారిని స్మరిస్తూ, వారి గానం, అభినయాలను శ్రవ్య – దృశ్య రూపంలో కళ్ళ ముందు నిలిపితే? ఆ రూపంలో కొత్త తరానికి మన అలనాటి నాటక ప్రస్థానంపై స్థూలంగా అవగాహన కలిగిస్తే? అదిగో.... అలాంటి విశిష్ట ప్రయత్నమే అలనాటి నాటక ప్రస్థానం.

 

పరిశోధన, పరిశ్రమల మేళవింపు

 

గమనిస్తే... 1880ల నుంచి ఇప్పటి వరకు ఎందరో నటులు, నాటక కర్తలు, దర్శకులు, సాంకేతిక నిపుణుల ప్రతిభాపాటవాల వల్లే తెలుగు నాటక రంగం ఇప్పటి అత్యున్నత స్థితిని చేరుకుంది. అయితే, తెలుగునాట నాటక విమర్శ, పరిశోధన... రెండూ తక్కువే. మన తెలుగు నాటక చరిత్రను కూలంకషంగా గ్రంథస్థం చేసినదీ అతి స్వల్పమే. బళ్ళారి రాఘవ నుంచి నిన్న మొన్న దివంగతులైన వందలాది నటీనటుల అభినయ వైదుష్యం అరకొరగా అయినా అక్షరాల రూపంలో ఉందేమో కానీ, వారి గాన మాధుర్యం, నట వైదుష్యాలను ప్రత్యక్షంగా చూసినవారు నేడు అరుదు. అలాంటి పరిస్థితుల్లో... అంతకంతకూ చదవడం తగ్గిపోతున్న నవతరాన్ని సైతం దృష్టిలో పెట్టుకొని, మన నాటక రంగ శ్రవ్య, దృశ్య వైభవాన్ని రూపకంగా అందించేందుకు చేసిన ప్రయత్నం ఇది. ఈ తరానికి అలవాటైన, అందరికీ అందుబాటులో ఉన్న యూ ట్యూబ్ వేదికగా అజో... విభో... కందాళం ఫౌండేషన్ ఈ అరుదైన కానుకను సమర్పించింది.


అలా... నాటి మేటి నటీనటుల శ్రవ్య – దృశ్య కళారూపకం ఈ అలనాటి నాటక ప్రస్థానం. మొత్తం 8 భాగాలుగా దీన్ని అందించారు. అన్ని భాగాలూ కలిపి దాదాపు 10 గంటల నిడివి గల సిరీస్ ఇది. ఒక్కమాటలో ఈ సిరీస్ ఎంతో శ్రమతో సాగించిన యజ్ఞం. ప్రముఖ నాటక రంగ పరిశోధకుడు – రచయిత డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు ఈ రూపకం కోసం అనేక నెలల పాటు పరిశోధించారు. సంబంధిత నటీనటుల దృశ్య, శ్రవ్య ఖండికల సేకరణ నిమిత్తం చాలానే పరిశ్రమించారు. ఆ పరిశోధన, పరిశ్రమ... ఈ రూపకాన్ని చూస్తున్నప్పుడు కళ్ళకే కాదు... మనసుకు కూడా తడతాయి.



 

మూడేళ్ళ క్రితమే... మరో మహత్తర అక్షర కృషి

 

కొద్దిగా వెనక్కి వెళితే... అజో-విభొ- కందాళం ఫౌండేషన్ వారే మూడేళ్ళ క్రితం తెలుగు నాటకరంగ మూలస్తంభాలు పేరిట అపూర్వమైన గ్రంథాన్ని ప్రచురించారు. తెలుగు నాటకరంగ అభివృద్ధికి కృషి చేసిన తొలి, మలి తరాల రచయితలు, నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల సంక్షిప్త పరిచయాలతో కూడిన వ్యాస సంకలనం అది. తెలుగు రంగస్థలంపై వారి ప్రాథమిక కృషితో పాటు అరుదైన వారి ఛాయాచిత్రాలను కూడా గుదిగుచ్చిన దాదాపు వెయ్యి పేజీల బృహత్ గ్రంథమది. ఆ రచన కూడా డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు చేసినదే! మరో రచయిత వాడ్రేవు సుందరరావు ఆ కృషిలో ఆయనకు భాగస్వామిగా వ్యవహరించారు. అందులో 120 మంది నాటక రచయితలు, 117 మంది నటులు – దర్శకులు, 24 మంది సాంకేతిక నిపుణులు... వెరసి 261 మంది దివంగత మహనీయమూర్తుల గురించిన సమాచారం, అపురూపమైన ఫోటోలతో అందించారు.


ఒక రకంగా ఆ బృహత్ రచన సమయంలోనే కందిమళ్ళకు ఈ అలనాటి నాటక ప్రస్థానం శ్రవ్య – దృశ్య రూపకం ఆలోచన వచ్చి ఉండాలి. బహుశా అందుకే... నవతరాన్ని మరింత ఆకట్టుకొనేలా, అలనాటి నటీనటుల కృషి తెలిసేలా వారే పాడిన గ్రామఫోన్ రికార్డులు, నటించిన సినిమాలలోని దృశ్యాలు కష్టపడి సేకరించి, ఈ అరుదైన రూపకాన్ని రూపొందించారు. అందమైన మాలగా గుదిగుచ్చారు. ఈ ప్రయత్నం రంగస్థల అభిమానులందరికీ అమితమైన ఆనందం పంచుతుంది. పేర్లు చదవడమే తప్ప, ప్రత్యక్షంగా తాము చూడని అమరులైన దాదాపు 84 మంది అలనాటి సుప్రసిద్ధ నటీనటులను మళ్ళీ కళ్ళ ముందు ఉంచుతుంది. అప్పటి వారి మాట, పాట, అభినయాలను ఈ తరం మళ్ళీ మళ్ళీ చూసుకొనే అవకాశం కల్పిస్తుంది.

 

కళ్ళ ముందు... నాటి అపూర్వ కళాప్రతిభ

 

బళ్ళారి రాఘవ, బలిజేపల్లి లక్ష్మీకాంతం, యడవల్లి సూర్యనారాయణ, వేమూరి గగ్గయ్య, స్థానం నరసింహారావు, మాధవపెద్ది వెంకట్రామయ్య, తుంగల చలపతిరావు, బందా కనకలింగేశ్వరరావు, అద్దంకి శ్రీరామమూర్తి, దాసరి కోటిరత్నం లాంటి 1920 – 30ల తరం ఈ రూపకంలో కనిపిస్తారు. అలాగే, ఆధునికులైన గరికపాటి రాజారావు, కె. వెంకటేశ్వరరావు, ఎ.ఆర్. కృష్ణ, చాట్ల శ్రీరాములు, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి మొదలు జమునా రాయలు వరకు పలువురి పాటలు, పద్యాలు, నటన నిండిన వీడియోలు కూడా ఇందులో ఉన్నారు. ఎంతో శ్రమ, ఖర్చుతో కూడిన ఈ బృహత్తర యజ్ఞానికి అజో- విభొ- కందాళం ఫౌండేషన్ పక్షాన ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ ఆర్థికంగానూ, అన్ని విధాల గానూ అండగా నిలిచారు. ఈ పదిగంటల రూపకాన్ని పూర్తిగా ఉచితంగా, అందరికీ అందుబాటులో ఉంచారు.

యూ ట్యూబ్ వేదిక కావడం ఈ శ్రవ్య – దృశ్య కళారూపకానికి ఉన్న ప్రధానమైన వెసులుబాటు. ఎందుకో తెలియని పరుగుపందేలతో, ఎప్పుడూ తీరిక దొరకని ఈ ఆధునిక కాలంలో... ఎవరి వీలును అనుసరించి వారు ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ భాగాలను చూసే సౌకర్యం లభిస్తుంది. దేశ విదేశాలలోని నాటక రంగ ప్రియులకూ, పరిశోధకులకూ అలా ఇది ఓ అయాచిత వరం.

 

తొలిసారిగా... జంట నగరాల్లో!

 

ఇటీవలే గుంటూరులో లాంఛనంగా ఆవిష్కరణ జరుపుకొన్న ఈ రూపకాన్ని ఇప్పుడు హైదరాబాద్ – సికింద్రాబాద్ జంటనగరాల్లోని కళాభిమానులకు తొలిసారిగా పరిచయం చేయనున్నారు. అజో-విభొ-కందాళం ఫౌండేషన్, ప్రముఖ రంగస్థల వేదిక రసరంజని సంయుక్తంగా ఆ పరిచయ సభను నిర్వహిస్తున్నాయి. తెలుగు నూతన సంవత్సర కానుకగా ఈ మార్చి 23, సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ పరిచయ సభ జరగనుంది. హైదరాబాద్‌ రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ థియేటర్‌లో జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంలో నాటక రంగ ఆచార్యులు డాక్టర్ డి.ఎస్.ఎన్. మూర్తి, కళాపోషకులు – ప్రభుత్వ మాజీ సలహాదారు కె.వి. రమణాచారి, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు, కేంద్ర సంగీత – నాటక అకాడెమీ పురస్కార గ్రహీత దీర్ఘాసి విజయభాస్కర్, రూపకాన్ని రూపొందించడానికి శ్రమించిన కందిమళ్ళ సాంబశివరావు, ఆచార్య అప్పాజోస్యలు సత్యనారాయణ తదితరులు పాల్గొంటున్నారు. పది గంటల నిడివి గల అలనాటి నాటక ప్రస్థానం రూపకాన్ని ఆనాటి సభలో ఒక గంట నిడివికి కుదించి, ముఖ్యాంశాలను సభికులందరికీ ప్రదర్శించనుండడం విశేషం.

   


ఒక్కమాటలో... తెలుగు నాటకం, సినిమాలు రెంటితోనూ ముడిపడ్డ అలనాటి మహామహుల కృషిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూసేందుకు, వినేందుకు ఈ రూపకం ఓ అద్భుత అవకాశం. నాటక రంగ అభిమానులకే కాదు... మన ఘన చరిత్రపై ఆసక్తి ఉన్నవారందరికీ ఈ కళారూపకం మృష్టాన్నభోజనం. దృశ్య – శ్రవ్య వేదికల్లో నాటి ప్రయోగాల నుంచి నేటి వరకు వచ్చిన మార్పులను తులనాత్మకంగా అధ్యయనం చేయదలుచుకున్నవారికైతే... ఇది సిద్ధాన్నం. తాజా పరిచయ సభ సాక్షిగా పెద్దల మాటలు వింటూ, ఆ రూపకాన్ని ఆస్వాదించే అపూర్వ అవకాశానికి అందరూ ఆహ్వానితులే.

-  రెంటాల జయదేవ

Sunday, April 19, 2026

కళ్ళకు కట్టిన ఓ మహనీయ జీవితం

 

-      శతజయంతి వేళ ప్రజాసేవకుడు మండలి వెంకట కృష్ణారావు అపూర్వ నాటక ప్రదర్శన

 

సమకాలీనులైన ప్రముఖుల జీవితాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం... తెర మీదైనా, వేదిక మీదైనా ఎప్పుడూ కత్తి మీద సామే. ఒక బయోగ్రఫీని బయోపిక్ సినిమా, లేదా డ్రామాగా మలచాలంటే... అప్పటి సాంఘిక వాతావరణాన్ని పునఃసృష్టించడంలో చిక్కులతో సహా దర్శక, రచయితలకు సవాలక్ష సవాళ్ళు ఉంటాయి. వాటిని అధిగమించి, ప్రేక్షకులతో శభాష్ అనిపించుకోవడంలోనే సృజనశీలురైన ప్రయోక్తలు, నటులకు అపరిమితమైన ఆనందం కలుగుతుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభవం మిగులుతుంది. సరిగ్గా అలాంటి నాటకమే... శతవసంత సేవామూర్తి, సాంస్కృతిక దీప్తి మండలి వెంకట కృష్ణారావు జీవితకథగా రంగభూమిపై ప్రదర్శితమైన మహాపురుషుడు... మండలి.

చిన్ననాటి నుంచి చివరి వరకు విలువలతో కూడిన జీవితం గడిపిన మండలి వెంకట కృష్ణారావు జీవన ప్రస్థానాన్ని రంగస్థలంపై చూపేందుకు చేసిన అద్భుత ప్రయత్నం ఇది. వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ మాజీ సంచాలకులు, ప్రముఖ నాటక రచయిత, కేంద్ర సంగీత నాటక అకాడెమీ పురస్కార గ్రహీత డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ ఈ అపూర్వ నాటక రచన చేశారు. ప్రసిద్ధ నటుడు – నాటక ప్రయోక్త గంగోత్రి సాయి ఈ ప్రదర్శనలో కీలకమైన మండలి వారి పాత్రను పోషించడమే కాక, సమర్థంగా దర్శకత్వం వహించారు. సాయి దర్శకత్వంలో విజయవాడ సమీపంలోని తాడేపల్లికి చెందిన అరవింద ఆర్ట్స్ నాటక సమాజం వారు ఈ నాటకాన్ని మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సభ సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రదర్శించారు. ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి కె.వి. రమణాచారి సారథ్యంలోని ప్రసిద్ధ రసరంజని నాటక సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన సాగింది. దాదాపు రెండు గంటల పైచిలుకు నిడివి గల నాటకం నిలబడి మరీ చూసిన ప్రేక్షకుల సాక్షిగా ఆద్యంతం అలరించింది. 


            కళకు టెక్నాలజీ తోడ్పాటు... రంగభూమిపై ఏఐ దృశ్యాల వినియోగం

 

సినిమాలోని స్టార్ట్... కట్ లకు భిన్నంగా అక్కడికక్కడ ఆగకుండా సాగే నాటకంలో దృశ్యాలను పండించాలంటే రంగాలంకరణ కీలకం. మరి, వందేళ్ళ క్రితం నాటి పరిస్థితుల్ని వేదికపై మళ్ళీ సృష్టించాలంటే ఎంతో శ్రమ. అందుకే, మహాపురుషుడు... మండలిలో ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఇప్పటి దాకా మనం తెర మీదే చూస్తున్న కృత్రిమ మేధ (ఏఐ)ను రంగస్థలంపై దృశ్యనేపథ్యాలకు సహాయంగా వినియోగించుకోవాలనే ఆలోచన చేశారు. రంగస్థలిపై ఎల్ఈడీ తెరపై చూపుతున్న అప్పుడెప్పుడో ఆ కాలానికి చెందిన ఫోటోలు – దృశ్యాలు - పాటల చలనచిత్రాన్నీ, వేదికపై నటీనటులు ఇప్పటికిప్పుడు చూపుతున్న హావభావాల రంగస్థల ప్రదర్శననూ తెలివిగా మిళితం చేశారు. చలనచిత్రాన్నీ, రంగస్థలాన్నీ... ఒకదానికొకటి పరిపూరకంగా మార్చారు. మంత్రిగా కారు సౌకర్యం ఉన్నా అది వద్దని, సామాన్యులతో కలసి బస్సులో ప్రయాణిస్తూ మండలి కృష్ణారావు వారు చూపిన నిరాడంబరత, గడిపిన ఆదర్శ జీవనాన్ని ప్రస్తావించారు.

 

అధిక ఖర్చుతో కూడిన సెట్లకు బదులు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక సౌలభ్యాన్ని వాడుకోవడం రంగస్థలంపై కొంతకాలంగా ఉన్నదే. గతంలో చాలా ఏళ్ళ క్రితమే గుమ్మడి గోపాలకృష్ణ లాంటి రంగస్థల సుప్రసిద్ధులు ఇలా టెక్నాలజీని వినియోగించుకున్నారు. అమెరికాలోని క్యాలిఫోర్నియాలో చూసిన ఓ తెలుగువారి ప్రదర్శనతో స్ఫూర్తి పొందిన గోపాలకృష్ణ వెనువెంటనే 2014లోనే తన సత్యహరిశ్చంద్ర పౌరాణిక నాటకంతో తెలుగునాట రంగస్థలంపై ఇలా వీడియో ద్వారా నేపథ్య దృశ్య ప్రదర్శన విధానాన్ని మొదలుపెట్టారు. సత్యహరిశ్చంద్ర, ఆపైన శ్రీకృష్ణ రాయబారం’, ‘వేమన, శ్రీనాథుడు లాంటి నాటకాలకు శ్మశానం, కౌరవ సభ లాంటి వాటిని ప్రత్యేకంగా సెట్ వేయకుండా, ఎల్ఈడీ తెరపై వీడియో ప్రొజెక్షన్ ద్వారా నేపథ్యంగా చూపుతూ, దాని ముందు పాత్రలు నటించడమనే టెక్నిక్‌ను ఆయన తెలుగునాట వాడి చూపించారు.

ఆ తర్వాత కాలంలో ఆచార్య కోట్ల హనుమంతరావు లాంటివారు వడ్డేపల్లి కృష్ణ రచించిన జయ జయహే తెలంగాణ లాంటి నృత్య నాటకాలకూ, అలాగే ప్రతాప రుద్రమ నాటక త్రయానికీ ఆ పద్ధతిని వినియోగించారు. ఇటీవలి కాలంలో పలువురు యువకులు కొత్తగా వచ్చిన ఏఐని నేపథ్య దృశ్యాలకు వాడడం మొదలుపెట్టారు. తాజాగా విజయవాడకు చెందిన రంగస్థల నట - దర్శకుడు పి.వి.ఎన్. కృష్ణ లాంటి వారు తమ ఛత్రపతి శివాజీ నాటకానికి సైతం ప్రదర్శనలో ఈ తరహా ప్రయోగాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నారు.

అయితే, ఎల్ఈడీ తెరల ఖర్చు, శ్రమతో కూడిన ఈ ప్రయోగం అన్నిచోట్లా సులభసాధ్యం కాదు. సన్నివేశానికి తగ్గట్టు అమరకపోతే నాటకానికీ నగుబాటే. తాజా మహాపురుషుడు... మండలినాటకంలో మాత్రం నేపథ్యంలో వాడిన ఏఐ సృష్టి దృశ్యాలలో ఒకటీ అరా చిన్న లోటుపాట్లున్నా సమయ సందర్భాలకు తగ్గట్టు సమర్థంగా ఉపయోగించారు. సామాన్యుల్ని మెప్పించారు. ఈ వినూత్న ప్రయోగంతో... ప్రదర్శన పద్ధతుల్లో తెలుగు నాటకరంగాన్ని మరో కొత్త పుంత తొక్కించారు. ప్రేక్షకుల మనఃఫలకంపై వేదికను అపూర్వంగా వెలిగించారు.

 

నాటకంగా... తెలుగు వెలుగుల జీవితం

 

రచన విషయానికొస్తే – గాంధీ, అంబేద్కర్ లాంటి జాతీయ నాయకులపై నాటక రచనలు, ప్రదర్శనలు కొత్త కాదు. అయితే, తెలుగు సమాజంలోని త్యాగపురుషులు, జాతీయోద్యమ నాయకులపై మాత్రం అవి చాలా అరుదే. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుపై చాలాకాలం క్రితం ఆచార్య మొదలి నాగభూషణశర్మ ప్రజానాయకుడు ప్రకాశం అంటూ నాటక రచన చేశారు. అప్పట్లో రసరంజని సంస్థ దాన్ని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చింది. ఇప్పుడు మండలి వెంకట కృష్ణారావుపై తాజా నాటకం మహాపురుషుడు... మండలి ఆ అరుదైన ప్రయత్నాల వరుసలో తాజా చేర్పు. తెలంగాణ ప్రాంతం నుంచి సుప్రసిద్ధులైన తెలుగు తేజాలు సురవరం ప్రతాపరెడ్డి, కొత్వాల్ రాజా బహదూర్ వెంకట రామారెడ్డి లాంటి ప్రసిద్ధులపై నాటక రచన చేసిన అనుభవం దీర్ఘాసి విజయభాస్కర్‌ది. ఆ అనుభవంతో పాటు మండలి వారిపై అభిమానం, ఆయన సేవాతత్పర జీవితంపై లోతైన అవగాహనతో ఆనాటి పరిస్థితుల్ని అక్షరాక్షరంలో నింపుకొని విజయభాస్కర్ ఈ రచన చేశారు. అది ఈ నాటక ప్రదర్శనలో అడుగడుగునా ప్రస్ఫుటమవుతుంది.

 

మండలి వంశ చరిత్ర మొదలు కృష్ణారావు బాల్యం, స్వాతంత్ర్యోద్యమ కాలప్రభావం, బ్రిటీషు పాలకులపై సాగిన క్విట్ ఇండియా ఉద్యమం, రైతుల పక్షాన చేపట్టిన పోరాటాలు, స్వాతంత్ర్యానంతర రాజకీయాల్లో అవిస్మరణీయమైన కాంగ్రెస్ నేతగా కృష్ణారావు ఎదిగిన తీరు, పార్లమెంట్ సభ్యుడి నుంచి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దాకా చేపట్టిన పదవులు, చేసిన సత్కార్యాలు, తెలుగు అధికార భాషా సంఘం – ఉర్దూ అకాడెమీ – బాలల అకాడెమీ – వివిధ కార్పొరేషన్లు ఆదిగా అనేక మౌలిక సంస్థల ఏర్పాటులో ఆయన కృషి, అవనిగడ్డలో గాంధీ క్షేత్రం స్థాపన, పులిగడ్డ వంతెన సహా చివరి వరకు ప్రజాక్షేమం కోసమే పలవరించిన తీరు, రాజకీయాల్లో ఆయన తాత్విక భావధారకు కొనసాగింపుగా మండలి బుద్ధప్రసాద్‌ ముందుకు రావడం... ఇలా దాదాపు కొన్ని దశాబ్దాల సమీప కాలపు సమకాలీన చరిత్రను ఈ నాటకంలో కళ్ళ ముందుకు తెచ్చారు రచయిత. ముఖ్యంగా, తెలుగు భాషా, సాంస్కృతిక వికాసానికి మండలి వారు చేసిన కృషి, 1977 నవంబర్‌లో వేలమందిని పొట్టనబెట్టుకున్న దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన సాగించిన అనుపమానమైన సేవను ఈ నాటకం మరోసారి గుర్తు చేసింది. మళ్ళీ ఈ తరానికి పరిచయం చేయడంలో అన్నివిధాలా కృతకృత్యమైంది.



 

విజయవంతమైన రచనా భాస్వరం

 

పి.వి. నరసింహారావు, జలగం వెంగళరావు లాంటి రాజకీయ ఉద్దండుల పాత్రలు నాటకంలో కనిపించడం, కీలక సందర్భాల్లో వారు మండలి వారికి ఇచ్చిన తోడ్పాటును చూపించడం ప్రేక్షకులలో పురా జ్ఞాపకాల పేటికలను తెరుస్తుంది. ప్రధాన నాటక అంశాన్ని నేపథ్యంగా తీసుకొని, ఆ పరిధిని దాటకుండానే సమయం, సందర్భాన్ని బట్టి ఎప్పటికీ వెంటాడే డైలాగులు కొన్ని రాశారు. మనసులో మలినం లేని ప్రతి మనిషీ మాధవుడే..., భాష చచ్చిపోతే... జాతి సగం చచ్చినట్టే,జనంతో కలసి నడిచేవాడు మామూలు మనిషి, జనానికి ముందుండి నడిపించేవాడు నాయకుడు,శ్వాస కన్నా ఆశ పెద్దది, అటు శవాలు... ఇటు జీవచ్ఛవాలు లాంటి అనేక సంభాషణలే అందుకు ఉదాహరణ. అలాగే, నాటకాన్ని నడిపే సూత్రధారుల సంభాషణల్లో సందర్భానుసారం సమకాలీన కలుషిత రాజకీయ వాతావరణాన్ని స్ఫురింపజేస్తూ, బలంగా మాటల కొరడా ఝళిపించడం మరో విశేషం.

రచనతో పాటు ప్రదర్శనలోనూ వివిధ పాత్రధారులు, నేపథ్య సంగీతం సహా పలువురు సాంకేతిక నిపుణుల సాయంతో రక్తికట్టిన నాటక ప్రదర్శన ఇది. సామాన్య రైతుల పాత్రల నుంచి మండలి వారి సహధర్మచారిణి పాత్ర దాకా అందరూ బాగా చేయడంతో చిన్నపాటి లోపాలేవీ కనిపించకుండా పోయాయి. గరిష్ఠ భూపరిమితి చట్టం కింద భూములు ఇవ్వబోమన్న కామందుల సందర్భంలో ఓ పాత్ర పదే పదే చెప్పే ఒక్క డైలాగుతో హాస్యం పండితే... స్వాతంత్ర్య కాలంలో సాగుభూములను ఇతర అవసరాలకు కేటాయించిన ప్రభుత్వ నిర్ణయ వేళ భూమికీ – రైతుకూ మధ్య అనుబంధాన్ని చెబుతూ బడుగు రైతులు బాధపడే సందర్భం మనసును మెలిపెడుతుంది. ఏడున్నర ఎకరాల భూమిలో అయిదున్నర ఎకరాలను నిరుపేదలకు అందించిన మండలి వారి త్యాగనిరతిని చూసినప్పుడు మన కాలంలో మన మధ్యనే ఇలాంటి ఓ నిస్వార్థ జీవి నడయాడాడనే భావనతో తీయటి బాధతో గుండె అంతా నిండిపోతుంది.  

 

కన్నీరు పెట్టించిన అపూర్వ అభినయం

 

ఇంత నాటకంలోనూ దాదాపుగా ద్వితీయార్ధమనిపించే చివరి గంట హైలైట్. మధ్యవయసు మండలి పాత్రను పోషించిన గంగోత్రి సాయి అక్కడ నాటకాన్ని పూర్తిగా తన భుజాలపై నడిపించారని చెప్పక తప్పదు. తమిళ రాజకీయ నేత కామరాజ్‌ను తలపించే పొడుగు చేతుల హాఫ్ హ్యాండ్స్ ఖాదీ చొక్కా నుంచి హిట్లర్ మీసకట్టు, ఎడమ చేతితో పంచె చెరగును పట్టుకొని నడిచే నడక, నిరాడంబరమైన నడత, మాట తీరులో మార్దవం, మానవీయత... వీటన్నిటితో అక్షరాలా మండలి కృష్ణారావును అణువణువునా శరీరంలో ఆవాహన చేసుకొని గంగోత్రి సాయి నటించారు. అందులోనూ, 1975 నాటి తొలి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ – ప్రసంగ సందర్భం, అలాగే 1977 నాటి ప్రకృతి విలయతాండవ వేళ తల్లడిల్లిన ఆ మానవతా మూర్తి హృదయాన్ని రంగస్థలంపై అభినయించిన తీరు, నాటక పతాక సన్నివేశం లాంటివి మరీ ప్రత్యేకం. చిమ్మచీకటిలో టార్చిలైటు వేసుకొని, శవాల దిబ్బల మధ్య కొన ఊపిరితో కొట్టుకుంటున్న అభాగ్యుల కోసం మండలి వారు అన్వేషించే సన్నివేశం, కాళ్ళకు పుండ్లు అయినా కట్లు కట్టుకొని మరీ తిరుగాడే దృశ్యం లాంటివి ఎంతటివారినైనా కన్నీళ్ళు పెట్టించక మానవు. మండలి వారి పాత్ర పోషించిన గంగోత్రి సాయి కాళ్ళకు దణ్ణం పెట్టాలనుంది అని కవి – గాయకుడు, తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ సభ్యుడు గోరటి వెంకన్న అన్నారంటే వేదికపై వెలిగిన అభినయ దీప్తిని అర్థం చేసుకోవచ్చు.



జీవితపు చివరి క్షణాల ఘట్టంలో... ఇటు భార్యాబిడ్డలతోనూ, అటు ప్రజాక్షేమం కోసం రాజకీయ నాయకులతోనూ మండలి వారి పాత్ర సంభాషించే సందర్భం నాటకాన్ని మరో మెట్టు పైకి ఎక్కించింది. అటు రచయిత రచనా సామర్థ్యం, ఇటు ప్రధానపాత్రధారి అభినయ నైపుణ్యం... పరస్పరం పోటీ పడ్డాయి. ఒకటికొకటి జతకలసి, ప్రేక్షక హృదయాలను తడిపేశాయి. సాత్వికాభినయంతో, నెమ్మదిగానే అయినా స్థిరంగా సాగే సంభాషణా శైలితో, శాంత - కరుణ రసాలను గంగోత్రి సాయి పండించిన తీరు ప్రేక్షకులు కళ్ళారా చూసి అనుభవించదగ్గ వైయక్తిక అనుభూతి. అనేక సందర్భాల్లో ఈ నాటకం అప్రయత్నంగా కన్నీరు పెట్టించింది. ఇది మరిచిపోలేని అనుభవం అని ప్రముఖ రంగస్థల – సినీ రచయిత తనికెళ్ళ భరణి లాంటి వారు అభిప్రాయపడింది అందుకే! ఒక రకంగా ఈ నాటక ప్రేక్షకులందరి సార్వజనీన అనుభవం కూడా అదే!!

 

అక్షరాలా... అంతిమ పరమార్థం

నిజాయతీ, నిరాడంబరత, నిస్వార్థం, కార్యదీక్ష, ప్రజాసంక్షేమమే పరమావధి తదితర సుగుణాలు రాశి పోసిన ఇలాంటి నాయకుల జీవితాలు వర్తమాన సమాజానికీ, సందర్భానికీ అత్యంత అవసరం. ఆ ఉద్దేశంతోనే ఈ నాటకాన్ని సొంత ఖర్చుతో డాక్యుమెంటరీగా చిత్రీకరించడానికి మాజీ ఎమ్మెల్యే వి. ప్రభాకర చౌదరి ముందుకు వస్తానన్నది. మరో అడుగు ముందుకేసి, ఈ ప్రదర్శనను నేటి తరం రాజకీయ నాయకులు చూసేలా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో శాసన సభ, శాసన పరిషత్తుల్లో ఈ నాటకాన్ని ప్రదర్శించాలి. ఈ నాటకం చూసి కనీసం 20 మంది రాజకీయ నాయకులు మారినా ఈ దేశం బాగుపడుతుంది" అని దర్శకుడు శివనాగేశ్వరరావు అన్న మాటలు ఆలోచించాల్సినవి. తప్పకుండా ఆచరించి తీరాల్సినవి. ఇప్పటికే అవనిగడ్డలో మొదలుపెట్టి విశాఖపట్నం మీదుగా ముచ్చటగా మూడో ప్రయత్నంగా హైదరాబాద్‌లో అలరించిన మహాపురుషుడు... మండలి లాంటి రచన, ప్రదర్శనల అంతిమ పరమార్థం అదే కదా!                              

  
-
రెంటాల జయదేవ

నిజాయతీపరులకు నేడు చోటేదీ!

            - మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సభలో మాజీ సీఎం

 

స్వాతంత్ర ్య  సమరయోధుడు, ప్రజాసేవనే పరమార్థంగా భావించిన త్యాగమూర్తి, మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు లాంటి “నిజాయతీపరులకు ఇవాళ రాజకీయ వ్యవస్థలో చోటు లేకుండా పోయింది. ఎన్నికలనేవి కేవలం డబ్బుతో ముడిపడిన వ్యవహారంగా మారిపోయాయి” అని సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి వాపోయారు. “డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్న ఓటర్లంటే ఎమ్మెల్యేకూ, గెలిచిన దగ్గర నుంచి అవినీతి గురించి ఆలోచించే ఎమ్మెల్యేలంటే ముఖ్యమంత్రులకూ గౌరవం లేకుండా పోయింది. అలాగే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష దారుణంగా ఉంది. ఆ పరిస్థితులు మారితేనే, ప్రజాస్వామ్యానికి మనుగడ. లేదంటే, రాజకీయాలన్నా, రాజకీయ నాయకులన్నా సమాజంలో గౌరవమే లేకుండా పోతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. సీనియర్ రాజకీయ నేత మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీనియర్ రాజకీయ నాయకుడైన తన తండ్రికీ, మండలి వారికీ ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, “మండలి వంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని, ఈ తరం ముందుకు సాగాల్సిన అవసరం ఉంద”ని కిరణ్‌కుమార్ రెడ్డి ఉద్బోధించారు. ఇవాళ ప్రవేశ పెడుతున్న అనేక రాష్ట్రాల బడ్జెట్‌లలో మౌలిక వసతుల నిర్మాణానికి చేసే క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ కన్నా ప్రజాకర్షక పథకాలతో పంచే తాయిలాలకే పెద్ద పీట వేస్తుండడం విషాదమని ఆయన అభిప్రాయపడ్డారు.

 


 మరో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు – రాజకీయ నేత జలగం ప్రసాదరావు సభలో పాల్గొంటూ, “అత్యంత భయానకమైన 1977 నాటి దివిసీమ ఉప్పెన సమయంలో మా నాన్న గారికి క్యాబినెట్ సహచరుడైన మండలి వెంకట కృష్ణారావు ఆ ప్రాంతాన్ని తిరిగి నిలబెట్టడం కోసం సాగించిన నిస్వార్థ సేవను మరిచిపోలేం” అని జ్ఞాపకం చేసుకున్నారు. మంత్రిగా కారు సౌకర్యం ఉన్నా అది వద్దని, సామాన్యులతో కలసి బస్సులో ప్రయాణిస్తూ మండలి వారు చూపిన నిరాడంబరత, గడిపిన ఆదర్శ జీవనాన్ని ప్రస్తావించారు. మూడున్నర దశాబ్దాల పైగా నాటక రంగానికి విశేష కృషి చేస్తున్న ప్రముఖ రంగస్థల సంస్థ ‘రసరంజని’ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు, రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి డాక్టర్ కె.వి. రమణాచారి అధ్యక్షత వహించారు. తొలిసారిగా ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ నిర్వహించడమే కాక, తెలుగు భాషా సంస్కృతుల వికాసం కోసం ఆఖరివరకు శ్రమించిన మండలి వారి సామాజిక, సాంస్కృతిక సేవలను రమణాచారి సహా హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి గ్రంథి భవానీ ప్రసాద్, ఆచార్య కొలకలూరి ఇనాక్, సినీ – నాటక రచయిత, నటుడు తనికెళ్ళ భరణి, తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడు – కవి గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, తదితర అతిథులు స్మరించారు.

 

 జలగం వెంగళరావు సీఎంగా ఉండగా 1975 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న మండలి వెంకట కృష్ణారావు అహరహం శ్రమిస్తే... కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండగా 2012 డిసెంబర్‌లో తిరుపతిలో జరిగిన నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేసేందుకు మండలి వారి కుమారుడు మండలి బుద్ధ ప్రసాద్ త్రికరణశుద్ధిగా కృషి చేశారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రమణాచారి ప్రభృతులు ఆత్మీయంగా ఆ సంగతులను సభికులతో పంచుకున్నారు. మండలి బుద్ధ ప్రసాద్, ఆయన కుమారుడు రాజా సహా పలువురు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, రాజకీయ నాయకులు, రంగస్థల అభిమానులు సభలో పాల్గొన్నారు.

 

 శత జయంతి సభానంతరం డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ రచించగా, గంగోత్రి సాయి దర్శకత్వం వహిస్తూ, ప్రధాన పాత్ర పోషించిన ‘మహాపురుషుడు... మండలి’ నాటక ప్రదర్శన రెండు గంటలకు పైగా అద్భుతంగా సాగింది. మండలి వెంకట కృష్ణారావు ఆదర్శ రాజకీయ, సేవా జీవితాన్ని ప్రేక్షకులను కదలకుండా చూసేలా చేసింది. ఆ అపూర్వ ప్రదర్శన ఆద్యంతం చూసి, నట – రచయిత తనికెళ్ళ భరణి, సినీ దర్శకుడు శివనాగేశ్వరరావు సహా పలువురు ఆత్మీయంగా స్పందించడం విశేషం.

 - రెంటాల జయదేవ




పునః స్వాగతం

కాలం చిత్రమైనది.

మన ప్రమేయం లేకుండానే తనతో పాటు తీసుకుపోతుంది. ఒక్క క్షణమైనా ఆగి, ఆలోచించుకొనే అవకాశమివ్వకుండా తనతో  పాటు ప్రవాహ వేగంతో తీసుకుపోతుంది.

ఆ ప్రవాహ వేగంలోనే ఎప్పుడో స్పృహ కలిగి, ఆలోచనలో పడితే... చాలా దూరం వచ్చేశామనిపిస్తుంది. అప్రయత్నంగా ముందుకు సాగుతున్నప్పటికీ... మరోమారు లోలోపలకు చూసుకోమన్న సంకేతం వినిపిస్తుంది. మర్చిపోతున్న అక్షరాల దారుల్లో మళ్ళీ మళ్ళీ మనల్ని వెతుక్కోవాల్సిన అవసరం కనిపిస్తుంది. 

అదిగో... అందుకే... సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ మీ ముందుకు... 

మునుపటిలానే... మీ 'ఇష్టపది'ని ఆదరించి, అక్కున చేర్చుకుంటారు కదూ!  

సదా...

మీ...

'ఇష్టపది'