తెలుగు వాళ్ళకు అత్యంత ప్రీతిపాత్రమైన కావ్యం రామాయణం. ఆరాధ్యదైవం శ్రీరాముడు. ఆదర్శ దంపతులు సీతారాములు. రామాలయం లేని ఊరు తెలుగు నాట ఉండదు. తెలుగు వారి సంస్కృతి, జనజీవితంలో సీతారాములు అంతటి భాగం కాబట్టే, తెలుగు వెండితెర మీద కూడా రామాయణానికి అంత ప్రాధాన్యం ఉంది.
అంతెందుకు... తెలుగువారి సొంత
పెట్టుబడితో వచ్చిన తొలి చిత్రం 1934నాటి వేల్ పిక్చర్స్ వారి ‘సీతా కల్యాణం’. తెలుగు నేల నడిబొడ్డున నిర్మాణం, చిత్రీకరణ జరుపుకొన్న తొలి చిత్రం
1936లో రాజమండ్రిలో దుర్గాసినీ టోన్ స్టూడియో అధినేతలు నిడమర్తి సూరయ్య బ్రదర్స్
తీసిన ‘సంపూర్ణ రామాయణం’. అప్పటి నుంచి
ఈ 90 ఏళ్ళలో పదుల సంఖ్యలో రామాయణ గాథలు తెలుగు తెర మీదకు వచ్చాయి. ఎన్టీఆర్
దర్శకుడిగా చేసిన తొలి ప్రయత్నం ‘సీతారామ కల్యాణం’ (1961), జనం హారతులు పట్టిన ఎన్టీఆర్ – అంజలీదేవి ‘లవకుశ’
(1963), బాపు వెండితెర కావ్యం ‘సంపూర్ణ రామాయణం’ (1972), ‘సీతా
కల్యాణం’ (1976)... నుంచి పుష్కర కాలం క్రితం వచ్చిన బాపు –
రమణల ఆఖరి చిత్రం ‘శ్రీరామరాజ్యం’ (2011)...
దాకా చాలానే ఉన్నాయి. అందుకే, మరోసారి వేల కోట్ల ఖర్చుతో వస్తున్న ‘రామాయణం’ సినిమా అంటే, ఒకింత ఉత్సాహంతో థియేటర్లకు
వెళతాం.
రామాయణం అందరికీ తెలిసిన కథే! అందులోని సీతాపహరణ
ఘట్టం వరకు తీసుకొని రూపొందించిన చిత్రం ‘రామాయణ’ – పార్ట్ 1. విజువల్ ఎఫెక్ట్స్‌ను ప్రధాన బలంగా చేసుకొని, భారీ స్థాయిలో
నిర్మించిన వెండితెర రామాయణం ఇది. నమిత్ మల్హోత్రా నిర్మించగా నితీశ్ తివారీ
దర్శకత్వం వహించారు. తెలిసిన కథే అయినా, తెలుగు జనం విన్న, తెరపై చూసిన
రామాయణాలకూ, ఇప్పుడు తాజాగా వచ్చిన ఈ సినీ రామాయణానికీ పోలిక లేదు. వాల్మీకి
రామాయణాన్ని పాటించలేదంటూ సినిమా మొదట్లోనే గమనిక వేసేసినందుకు గాను ఇక తెరపై
వచ్చేది అంతా భరించాల్సిందే.
ఆ మధ్య వచ్చిన ‘ఆదిపురుష్’ (2023) చిత్రం చూశాం. ప్రభాస్ నటించిన ఆ సినిమా గ్రాఫిక్స్ నుంచి అభినయం
వరకు అన్ని విషయాల్లో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఇప్పుడు నితీశ్ తివారీ
దర్శకత్వంలోని తాజా ‘రామాయణం’కి గ్రాఫిక్స్ గండం చాలా వరకు తప్పింది. దాదాపు 4
వేల కోట్ల ఖర్చుతో తీశారంటున్న ఈ సినిమా కళ్ళు చెదిరే కథా ప్రపంచ నిర్మాణాలు,
ఆస్కార్ అవార్డు గెలిచిన ‘డీఎన్ఈజీ’
వారి విజువల్ ఎఫెక్ట్స్‌తో సై అంటుంది. అత్యధిక భాగం స్టూడియో సెట్లలోనే షూటింగ్
సాగిన ఈ చిత్రంలో లంకానగరం, యుద్ధంలో ఐరావతం పాల్గొనే సీన్లు, పుష్పక విమానం
దృశ్యాలు, సీతను అపహరించిన రావణుడితో పక్షిరాజు జటాయువు పోరాటం లాంటివి
ఆకర్షిస్తాయి.
అయితే, లోపాలూ చాలానే ఉన్నాయి. ఫలితంగా విమర్శలూ తప్పవు.
నిన్నటి సినిమా ‘ఆదిపురుష్’ గ్రాఫిక్స్‌లో తడబడితే, తాజా
రెండో సినిమా ‘రామాయణం’ స్క్రిప్టు,
పాత్రచిత్రణల విషయంలో చతికిలపడింది. హంగూ ఆర్భాటాలకిచ్చిన విలువ పాత్రల మధ్య మానవ
సంబంధాల విషయంలో చూపలేదు.
అన్ని కమర్షియల్ సినిమాలలో లాగానే ‘రామాయణం’ లోనూ హీరో, హీరోయిన్ల పరిచయం కమర్షియల్ ఫక్కీలో జరగడాన్ని అర్థం
చేసుకోవచ్చు. కానీ, ‘బాహుబలి’, ‘కెజిఎఫ్’ నుంచి చివరకు శవాల గుట్టపై కూర్చున్న హీరో
ఫక్కీలోని రావణుడి దాకా అనేక సినిమాల్లోని విజువల్స్ ప్రభావం తెరపై తరచూ
తెలిసిపోతూ ఉంటుంది. ఇంత పౌరాణికంలోనూ వీలైనంత కామెడీ, రొమాన్స్ చొప్పించాలన్న
ఆత్రం కనబడుతుంది.
ఈ సినిమాలో రాముడు కమర్షియల్ సినిమా హీరోలా ఓ నిలువెత్తు
కటౌట్ అయితే, లక్ష్మణుడేమో సినిమాలో కామిక్ రిలీఫ్ కోసం పణంగా పెట్టిన పాత్ర.
పొడగరి రాముడి సరసన ఈడూజోడూ సరిపోని సీత జంటగా కనిపిస్తారు. నిజానికి, మనకు రాముడంటే
పితృవాక్య పరిపాలకుడు. మూర్తీభవించిన ధర్మమూర్తి. అసమాన వీరుడు, అసహాయ శూరుడు. ఈ
సినిమాలో రాముడు మహా బేలగా కనబడతాడు. వనవాసానికి వెళ్ళమన్నప్పుడు పితృవాక్య
పరిపాలకుడిగా కాక, ఆఖరు నిమిషంలో తప్పనిసరి పరిస్థితుల్లో అడవికి వెళుతున్నట్టుగా కళ్ళ
నిండా నీళ్ళతో కనిపిస్తాడు. విశ్వామిత్రుడి వెంట పంపడానికి తండ్రి సంశయిస్తుంటే,
ఆయన వారించి, నచ్చజెప్పే బాధ్యతా విచిత్రంగా రాముడే తీసుకుంటాడు. అచ్చంగా ఇవాళ
జాతకాల విషయంలో ఆసక్తితో ఎగబడ్డట్టే... తన విధిరాత ఏమిటో తెలుసుకోవాలని సినిమా
అంతటా రాముడు పదే పదే అడుగుతుంటాడు.
ఇక, ఈ సినిమాలో సీత మనం కన్న విన్న రామాయణ పాత్రకు భిన్నమైనది.
కత్తి పట్టి, కదనంలోకి దూకే యోధురాలు. లక్ష్మణుడు దెబ్బలు తింటే, ఆయనకు పరిచర్యలు
చేసే వదిన గారు. రాక్షసులతో పోరులో దెబ్బ తిన్న మరిదికి భుజం కాసి, తీసుకొనిపోయే
కో-ఫైటర్. శూర్పణఖ మోహిస్తోందని రాముడికే చెప్పగల (అతి) తెలివైన మహిళ. శూర్పణఖతో
రాముడు మాట్లాడి వచ్చాక, మీరు ఏం మాట్లాడుకుంటున్నారని భర్తను అడిగే సగటు అనుమానపు
భార్య.
లక్ష్మణుడైతే... రాముడితో పాటు తానూ యాగ సంరక్షణకు
వస్తాననడం దగ్గర నుంచి తనకూ విద్య నేర్పమనడం దాకా వివిధ సందర్భాల్లో విశ్వామిత్రుడితో
పరాచికాలు ఆడుతుంటాడు. పరశురాముడు ఎదురైనప్పుడు, అన్న గారిని పక్కనబెట్టి తానే ఆవేశంతో
ముందుకొచ్చేస్తుంటాడు.
ఈ సినిమా రాముడు మాత్రం తక్కువ తిన్నాడా? శివధనుర్భంగం
తర్వాత తనను ప్రశ్నించవచ్చిన పరశురాముడితో యుద్ధానికి సిద్ధమంటాడు. పరశురాముడు
విసిరిన గొడ్డలిని కమర్షియల్ సినిమా హీరో లాగా లాఘవంగా ఒంటిచేతితో ఒడిసిపట్టుకుంటాడు.
సాక్షాత్ శ్రీమహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు... చివరకు రాముడి పాదాల చెంత
మోకరిల్లి వెళ్ళిపోవడం ఈ సినీ రామాయణంలో పరాకాష్ఠ. అంతెందుకు... శూర్పణఖకు సైతం
కించిత్ తలవంచి నమస్కరించినంత పని చేసేస్తాడు రాముడు.
“లక్ష్మణా... సీతా...”
అంటూ రామబాణంతో దెబ్బతిన్న బంగారు లేడిగా మారీచుడు మాయ చేసినప్పుడు, రక్షరేఖ రాసి
లక్ష్మణుడు వెళ్ళిపోతే... సీత హడావిడిగా పర్ణశాల లోపలకు వెళ్ళి తలుపులేసుకుంటుంది.
సాధువు రూపంలో రావణుడు వచ్చినప్పుడు రాక్షస భూమిలో రక్షణ అవసరం కాబట్టి గడప దాటి
రానంటుంది. ఇది ఈ సినిమా చేసిన మరో చమత్కారం. ఇలాంటి చిత్ర విచిత్రాలెన్నో ఈ సినీ రామాయణంలో
చూడవచ్చు.
కాస్ట్యూమ్‌ల దగ్గర నుంచి క్యారెక్టర్ బిల్డింగ్ దాకా
పౌరాణిక హిందీ టీవీ సీరియళ్ళ ప్రభావం పుష్కలంగా ఉన్న సినిమా ఇది. హిందీ టీవీ
సీరియల్స్‌లో రకరకాలుగా కనిపించే శూర్పణఖ (రకుల్ ప్రీత్ సింగ్) భర్త విద్యుత్
జీవుడి వృత్తాంతం ఈ చిత్రంలోనూ దర్శకుడి కన్వీనియన్స్‌కు తగ్గట్టు, రావణ పాత్రకు
సానుకూలంగా ఉండేలా దర్శనమిస్తుంది.
రాముడి పాత్రలో రణబీర్ కపూర్ విగ్రహపుష్టితో
కనిపించడమే తప్ప, అభినయంలో గొప్ప అనిపించలేకపోయారు. సీతగా సాయిపల్లవి కూడా సో సో.
లక్ష్మణుడిగా రవి దూబే, దశరథుడిగా అరుణ్ గోవిల్, రావణుడి తల్లి కైకసిగా శోభన,
మండోదరిగా కాజల్ అగర్వాల్ సహా పలువురు ప్రముఖ తారలు తెరపై కనిపిస్తారు. అయితే, ఈ
మూడుంబావు గంటల సినిమాలో క్యారెక్టర్ ఎలివేషన్లతో ఎక్కువ ఆకట్టుకొనేది మాత్రం
రావణుడిగా యశ్. ఒక రకంగా ఈ పార్ట్1లో రాముడి కన్నా రావణుడి పాత్రకే ప్రాధాన్యం
హెచ్చు. అణచివేతకు గురైన తన జాతి కోసమే దేవతల మీద యుద్ధం చేసినట్టూ, చెల్లెలు
శూర్పణఖకు జరిగిన అవమానం వల్లే సీతను అపహరించినట్టూ, ఆమె మీద మోహంతో కానట్టూ...
ఇలా అన్ని విషయాల్లో రావణుడి పాత్రలో తప్పేమీ లేదన్నట్టు స్క్రిప్టు రాసుకున్నారా
అనిపిస్తుంది. “సహనమా? యుద్ధమా?” అనే రావణుడి
మానసిక సంఘర్షణ ఘట్టమైతే... బాపు ‘సంపూర్ణ రామాయణం’లో రామ రావణ యుద్ధ సందర్భంలో ఎస్వీఆర్ అత్యద్భుతంగా చేసిన అంతః సంఘర్షణ
సన్నివేశాన్ని గుర్తు చేస్తుంది.
ఇక, ఈ ‘రామాయణం’ సినిమాలో పాత్రల
స్వభావ చిత్రణ గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. శ్రీరాముడు స్వయంగా
శ్రీమహావిష్ణు అంశలో పుట్టినవాడని చెబుతూనే, ఆ పాత్రను సామాన్య మానవుడిలా
చూపడానికి ప్రయత్నించడం స్క్రిప్టులో పెద్ద లోపం.
అడవిలో రాక్షసులు వెంటపడినప్పుడల్లా పోరుభూమిలో
రామలక్ష్మణులు (రణబీర్ కపూర్, రవి దూబే) ఇద్దరూ కావచ్చు, సీతారామ లక్ష్మణులు
(సాయిపల్లవి, రణబీర్ కపూర్, ) ముగ్గురూ కావచ్చు... వెన్నుచూపి పారిపోతూ, పరుగులు
తీస్తుంటారు. వీరాధివీరుల లాగా కన్నా, అవకాశం కోసం చూస్తూ పక్కనుంచి బాణాలు వేసే
భీరువుల లాగా ప్రేక్షకులకు అనిపిస్తే... అది దర్శకుడి తప్పే. లక్ష్మణుణ్ణి సీత
ఆదుకుంటే, రాముణ్ణి లక్ష్మణుడు రక్షిస్తాడు. యాగ సంరక్షణకు రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుడు
తీసుకువెళతాడు కానీ, సినిమాలో తర్వాత ఆ ఊసే ఎత్తడు. తాటక – సుబాహుల (మూలకథలోని
తాటక, మారీచ, సుబాహులు ముగ్గురి బదులు ఇద్దరికే పరిమితం చేశారెందుకో దర్శక,
రచయితలు)తో పోరు మాత్రమే చూపిస్తాడు. ఆ ఇద్దరి మరణం తర్వాత ఓ పెళ్ళిళ్ళ పేరయ్యలా
సీతా స్వయంవరానికి శ్రీరాముణ్ణి తీసుకువెళ్ళాలనే తాపత్రయంలోనే విశ్వామిత్రుడు కనబడతాడు.
అందుకు తగ్గట్టే రాముడి పాత్ర సైతం సీతతో పెళ్ళి కోసం తహతహలాడుతున్నట్టే
కనిపిస్తుంది. ఆ విషయంలో సీత సైతం తక్కువేమీ కాదన్నట్టు తెరపై చూపారు. ఇది పరమ
విడ్డూరం.
ఈ సినిమాలో రావణుడితో పోరాడి, రెక్కలు తెగిన జటాయువు కన్నుమూయబోతూ...
సీతను అపహరించింది ఎవరో, అతని బలాబలాలు ఏమిటో, బంధు బలగం ఎవరో... సమస్తం
శ్రీరాముడికి చెప్పేసి మరీ చనిపోవడం... వాల్మీకి రామాయణంలోని ఘట్టమే. కానీ, జనబాహుళ్యంలో
ప్రాచుర్యం పొందిన రామకథకు కొంత భిన్నమైనది. ఎత్తుకెళ్ళినది రావణుడు, ఉన్నది లంకలో
అని తెలిశాక... ఇక వానరుల సీతాన్వేషణ, హనుమంతుడి లంకా దహనం లాంటి సుందరకాండ
ఘట్టాలను వచ్చే భాగంలో ఎలా చూపిస్తారో చూడాలి.
ఒక్క ముక్కలో... ఇదంతా వాల్మీకి రామాయణానికి నితేశ్
తివారీ క్రియేటివ్ ఫ్రీడమ్ వెర్షన్ అని సరిపెట్టుకోవాల్సిందే! సీతారాముల్ని
సామాన్య మానవులుగా చూపడానికే ఇదంతా అన్న వాదనతో ఓహో అనాల్సిందే!!
రచయిత రాశారో, డబ్బింగ్‌లో చెప్పారో తెలీదు కానీ మన
తెలుగు వెర్షన్‌లో మాత్రం తెలుగు పదాల్లో తప్పుడు చెవులకు బాణాల్లా తగులుతాయి. ‘శాంత స్వభావి’కి బదులు ‘శాంత స్వభావుడు’
ఎదురవుతాడు. అంధకారం ‘ఆవరించడా’నికి బదులు
‘ఆవహిస్తుం’టుంది. ‘పర్యవసానం’ ఏమో పర్యావసానం’
అవుతుంది. ‘సము’పార్జించడం కాస్తా ‘సమ’పార్జించడం అయ్యింది. ‘ప్రావీణ్యురాలే’మో ‘ప్రావీణ్య’రాలు అవుతుంది. తెలుగు
భాషాభిమానులు ఈ సినిమాలో తరచూ ఇలాంటి అనర్ఘరత్నాలు విని తరించవచ్చు.
ఈ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతంలో
శబ్దాల గురించే తప్ప శ్రావ్యత గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. సీతారాముల
తొలిచూపు, సెకండాఫ్‌లో కొన్ని కొన్ని ఘట్టాల్లో మాత్రమే నేపథ్య సంగీతం
తెలిసొస్తుంది. ఇక, ఎక్కడో ఒక్కచోట తప్ప, సినిమాలో పాటలు పూర్తి నామమాత్రం.
వచ్చిందీ, వెళ్ళిందీ కూడా తెలియదు.
మొత్తానికి, భారతీయులు ఆరాధించే రామాయణానికి ఇది
నితేశ్ తివారీ వెర్షన్ అని సమాధానపడాలి. రామాయణం కథను ‘అవెంజర్స్’ తరహా గ్రాఫిక్స్‌తో చూడగలిగామని సంతోషపడాలి. కొండొకచో కొత్త తరానికి (జెన్
జీకి) బహుశా కథ ఇలాగే చెప్పాలేమో అని మన మీద మనమే అనుమానపడాలి. నిన్నటి ‘ఆది పురుష్’తో పోలిస్తే నేటి ‘రామాయణం’ చాలావరకు మెరుగ్గా ఉందని సాంత్వన చెందాలి.
2028 దీపావళికి వచ్చే ‘రామాయణం – పార్ట్ 2’ లో ఆంజనేయ స్వామిగా సన్నీ డియోల్‌తో చేయించే సినీ ఇంద్రజాలం కోసం వేచి
చూడాలి. కాకపోతే, ఇంతటి ఈ నితీశ్ తివారీ నార్త్ ఇండియన్ ‘రామాయణం’ చూశాక, మన పాత ‘సీతారామ కల్యాణం’, ‘సంపూర్ణ రామాయణం’ లాంటివి తక్షణం
మళ్ళీ చూడాలనిపిస్తుంది. గ్రాఫిక్స్‌తో కన్నా క్యారెక్టర్ల ఎమోషనల్ గ్రాఫ్‌తో మన
తెలుగు సినీ స్రష్టలు సృష్టించిన కళాఖండాల గొప్పతనం మరోసారి తెలిసొస్తుంది.
- రెంటాల జయదేవ




.jpeg)