ఏ సినిమా అయినా సాధారణ స్థాయిలో విజయవంతమైందంటే, దానికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ, ఓ సినిమా అఖండ విజయం సాధించిందంటే, దానికి ప్రధాన కారణం మాత్రం ఒకటే. అప్పటి దాకా ఉన్న మూసను ఛేదించి, కొత్త పంథా తొక్కడం. ఆంతకు మునుపు వచ్చిన చిత్రాలకు భిన్నమైన దోవలో నడక సాగించడం. సరిగ్గా ఇవాళ్టికి 60 ఏళ్ళ క్రితం వచ్చిన 'పెళ్ళి చేసి చూడు' చిత్రం చేసినది అదే. ఇన్నేళ్ళ తరువాత కూడా ఆ సినిమా గుర్తున్నదీ, ఇవాళ్టికీ దాన్ని గుర్తు చేసుకుంటున్నదీ అందుకే.
నాలుగేళ్ళకు ఒకసారి మాత్రమే ఫిబ్రవరిలో 29 రోజులుండే లీపు సంవత్సరంలో 'పెళ్ళి చేసి చూడు' విడుదలైంది. విజయవాడలోని శ్రీదుర్గాకళా మందిరంలో ఈ హాస్యరసభరిత చిత్రం ఏకంగా 182 రోజులు ఆడింది. ఇంకా చెప్పాలంటే, ఆ దశకంలో 'పాతాళ భైరవి' తరువాత అతి పెద్ద ఘన విజయం సాధించిన చిత్రం ఇదే. 1952లో ఫిబ్రవరి 29న విడుదలైన ఈ చిత్రం అలా తెలుగు గడ్డ మీద రజతోత్సవం జరుపుకొన్న తొలి సాంఘిక చిత్రంగా రికార్డు సృష్టించింది.
మూసను బద్దలు కొట్టి, మరెందరికో స్ఫూర్తితొలి పూర్తి తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' విడుదలయ్యాక సరిగ్గా 20 ఏళ్ళకు వచ్చిన చిత్రం -'పెళ్ళి చేసి చూడు'. నిజానికి, 'పెళ్ళి చేసి చూడు' కన్నా ముందే గణనీయమైన సంఖ్యలో సాంఘికాలు వచ్చాయి. వాటిలో 'బారిస్టర్ పార్వతీశం', 'బోండాం పెళ్ళి', 'భలే పెళ్ళి' లాంటి కొన్ని హాస్యరస చిత్రాలూ ఉన్నాయి. కానీ, అంతకు మునుపటి సాంఘిక చిత్రాల్లో కథానాయక పాత్రలు ఎక్కువ భాగం కొంత పెద్ద వయసువి. పెళ్ళాం, పిల్లలతో, కుటుంబంలోని రకరకాల జంఝాటాలతో సతమతమవుతూ ఉండేవి. కొండకచో, విషయలోలత, స్వార్థపరత్వం లాంటి అవలక్షణాలూ ఉండేవి. మానసిక దౌర్బల్యంతో బాధపడుతుండేవి. అలా ప్రధానంగా కొంత మేర నెగటివ్ క్యారెక్టరైజేషన్ తో నాయక పాత్రలు ఉండేవి.
సరిగ్గా ఆ మూసను బద్దలుకొట్టి, కొత్త పుంత తొక్కడం 'పెళ్ళి చేసి చూడు'లోని ప్రత్యేకత. ఇందులో హీరోది పాజిటివ్ క్యారెక్టరైజేషన్. అనుకున్నది చేయడానికి అవసరమైతే అబద్ధమాడి, అన్ని రకాల సాహసాలూ చేయడానికి తెగించే ధీరుడు. ముఖ్యంగా బామ్మ గారి, తాత గారి భావాలకు ఎదురొడ్డే యోధుడు. యువతరం భావావేశాలకు సరైన సైదోడు. పెళ్ళి కావాల్సిన నవ యువకుడు. వరకట్నం లాంటి దురాచారాలను ఎదిరించే కుర్రవాడు. ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్ళి చేసుకొని, వంద అబద్ధాలైనా ఆడి, ఆఖరికి ఇంట్లో వాళ్ళను కూడా ఒప్పించే నవతరం ప్రతినిధి. అందుకే, 'పెళ్ళి చేసి చూడు'లో ఎన్టీయార్ పోషించిన వెంకట రమణ పాత్రలో అప్పటి కుర్రకారు తమను చూసుకుంది. వయసు మీద పడ్డ పెద్ద తరం చిన్న వయసులో ధైర్యం చాలక తాము చేయని పనిని తెరపై హీరో చేసి చూపిస్తే, చప్పట్లు కొట్టింది.
కేవలం హాస్యరస భరితంగానే మిగిలిపోకుండా, దానికి వ్యంగ్యాన్ని మిళాయించడం ఈ సినీ వంటకానికి గుబాళింపు తెచ్చిన తాళింపు. సెటైర్ తో కలగలిసిన హాస్యరసభరిత చిత్రంగా 'పెళ్ళి చేసి చూడు' నూటికి నూటయాభై మార్కులు తెచ్చుకుంది. తెలుగు తెరకు అప్పట్లో కొత్తగా తోచిన ఆ రకం హాస్యానికి తరతరాలకూ తరగని స్ఫూర్తిగా నిలిచింది. 'పెళ్ళి చేసి చూడు' ప్రత్యేకత అది.
పాటలు, పిల్లల తీపి చేష్టలు ఆణిముత్యాల లాంటి చిత్రాలెన్నిటినో అందించిన విజయా సంస్థ వారి కానుకే ఈ 'పెళ్ళి చేసి చూడు' కూడా. ఎన్టీయార్, ఈ సినిమాలో హాస్యం, పాత్రధారుల అభినయానికి తోడు పాటలు, సంగీతం చిత్ర విజయానికి కీలకమయ్యాయి. 'ఓ భావిభారత భాగ్య విధాతలారా...' అంటూ మొదలై, 'పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని....' అంటూ సాగే పింగళి నాగేంద్రరావు రచన, ఘంటసాల మార్కు స్వరాలాపనలతో ఆ పాట ఇవాళ్టికీ నిత్య నూతనం. పెళ్ళీడు కొచ్చిన కుర్రకారుకు తారక మంత్రం. అలాగే, బాల నటులైన మాస్టర్ కుందు (గాదె రామకృష్ణారావు) తదితరుల మీద వచ్చే 'అమ్మా నొప్పులే... అమ్మమ్మా నొప్పులే...' అనే ఊటుకూరి సత్యనారాయణ రచన ఒక తరంలో పిల్లలకూ, పెద్దలకూ పెద్ద ఫేవరెట్ గీతం. బడికి వెళ్ళమనగానే కడుపు నొప్పి అని మారాం చేసే పిల్లలు, ఇంట్లో గారెలు వండామనగానే నొప్పి పోయి, ఆకలి అని చెప్పడం లాంటివి మన నిజ జీవితాల్లో నుంచి తెర మీదకు నడిచొచ్చిన సన్నివేశాలే. ఆబాలగోపాలం తెర మీది పాత్రల్లో తమను తాము చూసుకోవడానికి అంతకు మించి ఇంకేం కావాలి. సినిమాలోని మొత్తం 17 పాటల్లో 'రాధనురా...', 'ఎవడొస్తాడో చూస్తాగా...', 'చిట్టీ భయమెందుకే...' లాంటి చాలా పాటలు జనానికి ఇవాళ్టికీ గుర్తే.
ఎన్టీయార్, కథానాయిక జి. వరలక్ష్మి, ఎస్వీయార్ లాంటి చేయి తిరిగిన నటీనటుల మాట చెప్పనక్కర లేదు. కానీ, 'రేడియో బాలన్నయ్య'గా ప్రసిద్ధులైన న్యాయపతి రాఘవరావు శిక్షణలోని 'బాలానంద' సంఘం పిల్లలు కెమేరా ముందు నటిస్తున్నట్లు కాకుండా, సహజంగా ప్రవర్తించడం, ముఖ్యంగా సిసింద్రీ పాత్రలో మాస్టర్ కుందు అభినయం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఆ సినిమా బాల నటీనటుల్లో ఒకరైన మాస్టర్ మోహన్ (అమ్మా నొప్పులే... అంటూ పాటలో అభినయించే అబ్బాయి) ఇవాళ మనకు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నత బాధ్యతలు నిర్వహించిన ఐ.ఏ.ఎస్. అధికారి కందా మోహన్ అంటే, ఒకింత ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయి.
తెలుగు సినీ ఫార్ములాల్లో చక్రపాణీయంఅంతకు ముందు 'ధర్మపత్ని' (1941)తో మాటల రచయితగా మొదలై, 'స్వర్గసీమ' (1945) కథా రచయితగా ఎదిగి, 'షావుకారు' (1950)కు కథ, సంభాషణలూ రెండూ తానే అందించిన చక్రపాణి అదే వరుసలో కథ, కథనం, సంభాషణలు అందించిన సినిమా ఇది. ఇందులో చక్రపాణి మార్కు హాస్యం, సమకాలీన సామాజిక పరిస్థితులపై చురకలు చోటుచేసుకున్నాయి. విజయా సంస్థపై నాగిరెడ్డి - చక్రపాణి సంయుక్తంగా అందించిన చాలా భాగం చిత్రాల్లో ఇవి తప్పనిసరి దినుసులు. 'పెళ్ళి చేసి చూడు'తో సహా ఆ చిత్రాలు ఇవాళ్టికీ ఎవర్ గ్రీన్ గా మిగలడానికీ, తరువాతి తరాల దర్శక - నిర్మాతలకు పాఠ్యగ్రంథాలుగా మారడానికీ అది ఓ ముఖ్య కారణం. గమనిస్తే, విజయా వారి చిత్రాలైన ఆ తరువాతి 'మిస్సమ్మ', 'అప్పు చేసి పప్పు కూడు' మొదలు ఇటీవలి జంధ్యాల మార్కు సినిమాల దాకా ఈ వ్యంగ్యభరితమైన హాస్య రస పూరిత కథలు చాలానే వచ్చాయి. జనానికి నచ్చాయి. 'నేను దర్శకుడిగా హాస్యరసభరిత చిత్రాల తీయడానికి విజయా వారి చిత్రాలే కారణమ'ని సాక్షాత్తూ జంధ్యాలే ఓ సందర్భంలో చెప్పారంటే, ఆ తరహా చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ గా 'పెళ్ళి చేసి చూడు' ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు.
సావిత్రికి గుర్తింపుఇక, 'గృహప్రవేశం' రోజుల నుంచి ఇలాంటి ఘట్టాలను తెర కెక్కించడంలో అనుభవమున్న దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ 'షావుకారు' తరువాత 'పెళ్ళి చేసి చూడు' మీదుగా 'మిస్సమ్మ'కు వచ్చేసరికి హాస్యరస పరిపోషణలో చేయి తిరిగిన నిర్దేశకుడు కావడం కూడా గమనించదగ్గ విషయం. హీరోయిన్ గా ఎదగడానికి ముందు అభినేత్రి సావిత్రి కాస్తంత గుర్తుపెట్టుకొనే పాత్ర వేసింది కూడా తొలిసారిగా 'పెళ్ళి చేసి చూడు'లోనే. 'సంసారం'లో కథానాయిక స్నేహితుల్లో ఒకరైన జూనియర్ ఆర్టిస్టుగా తెరపై తళుక్కున మెరిసి మాయమైన ఆమె 'పాతాళ భైరవి'లో డ్యాన్సర్ గా, 'రూపవతి'లో వ్యాంప్ తరహా పాత్రలోనే కనిపించారు. తొలిసారిగా 'పెళ్ళి చేసి చూడు'లో నటుడు యండమూరి జోగారావుకు జోడీగా, సహాయక పాత్రకు ఎదిగారు. ఆ సినిమా తరువాతే సావిత్రి 'పల్లెటూరు'లో ఎన్టీయార్ సరసన నాయిక అయ్యారు. ఆ పైన 'దేవదాసు'తో తిరుగులేని నటి అనిపించుకున్నారు.
గమ్మత్తేమిటంటే, 'పెళ్ళి చేసి చూడు' అంత హిట్టయినా, ఎన్టీయార్ సరసన నాయికగా నటించిన జి. వరలక్ష్మి ఆ తరువాత ఆయన పక్కన రెండు మూడు సినిమాల్లో మాత్రమే నాయికగా, అదీ పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో కనిపించడం. ఆ తరువాత కాలంలో జి. వరలక్ష్మి తల్లిగా నటిస్తే, ఆమెకు కొడుకుగా ఎన్టీయార్ పాత్ర పోషణ చేయడం తెలుగు సినిమాల్లో కనిపించే హీరో డామినేషన్ కూ, ఎన్టీయార్ లాంటి ఆ తరం నటీనటుల సుదీర్ఘమైన హీరో ఇన్నింగ్స్ కూ ప్రతీకలు.
విజయ గాథ'పెళ్ళి చేసి చూడు' చిత్రకథ తెలుగుతో పాటు తమిళంలో కూడా ఇదే హీరో హీరోయిన్లతో ఏకకాలంలో నిర్మాణమైంది. తెలుగు వెర్షన్ వచ్చి విజయవంతమయ్యాక, కాస్త ఆలస్యంగా 1952 ఆగస్టు 15న 'కల్యాణం పణ్ణి పారు'గా ఆ తమిళ రూపం విడుదలైంది. ఆ తమిళ చిత్రంలో మాత్రం ఓ పాటను రంగుల్లో చిత్రీకరించారట. అప్పట్లో అదో పెద్ద విశేషం. తమిళంలోనూ సినిమా హిట్టే. అప్పట్లోనే విజయా వారే ఈ చిత్రాన్ని హిందీలోనూ తీద్దామనుకున్నా కుదరలేదు. ఆఖరికి ఇరవై ఏళ్ళ తరువాత 1972లో దర్శక - నిర్మాత ఎల్వీ ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో 'షాదీ కే బాద్'గా ఈ కథను హిందీలో నిర్మించారు. కానీ, స్క్రిప్టులో చేసిన మార్పులు, బాల నటీనటుల పాత్రల ప్రాధాన్యం మాతృకలో కన్నా తగ్గడం లాంటి అనేక కారణాలతో సినిమా ఆడలేదు.
తెలుగు 'పెళ్ళి చేసి చూడు' వాణిజ్య విజయానికి వస్తే, తొలివిడతలో 15 కేంద్రాల్లో విడుదలై, 11 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. ఆలస్యంగా మలి విడతలో విడుదలైన కేంద్రాలను కూడా కలుపుకొంటే, మొత్తం 26 కేంద్రాల్లో నూరు రోజులు ఆడింది. విజయవాడలో రజతోత్సవం సరేసరి. నిజానికి, ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలోనే ఎన్టీయార్, ఏయన్నార్ నటించిన సాంఘిక చిత్రం 'సంసారం' (1950) కూడా రజతోత్సవ చిత్రంగా పేరు తెచ్చుకుంది. కాకపోతే, ఆ సినిమా ఆడింది 170 రోజులు. అదీ మద్రాసులోని పల్లవరంలోని జనతా థియేటర్ లో. పూర్తిగా మన తెలుగు గడ్డ మీదకు వస్తే, తొలి తెలుగు సాంఘిక రజతోత్సవ చిత్రంగా విజయవాడ దుర్గాకళామందిరంలో 182 రోజులు ఏకధాటిగా వీరవిహారం చేసిన 'పెళ్ళి చేసి చూడు' నిలుస్తుంది. పంచదార గుళిక లాంటి హాస్యం, చురుక్కున తగిలీ తగలని వ్యంగ్యం, మాటల్లో కాకుండా పాత్రల ప్రవర్తనల్లో కలగలసిపోయిన సందేశం - ఇవన్నీ 'పెళ్ళి చేసి చూడు'ను మరెన్నో శతమానోత్సవాల దాకా చెప్పుకొనేలా చేస్తాయి. వాణిజ్య విజయమే కాదు, విశేష ప్రభావమే ఏ సినిమా వజ్రపు తునకో చెప్పేందుకు అసలైన గీటురాయి.
తాజా కలం - ఇప్పుడే అందిన వార్త. ఇవాళ రాత్రి 10.30 గంటలకు తెలుగు టీవీ చానల్ 'ఈ' టి.వి.లో 'పెళ్ళి చేసి చూడు' చిత్రం ప్రసారమవుతోంది. హాస్యరసాభిమానులు మిస్ కాకండి...