తొలి చిత్రాన్నే ఇంటిపేరుగా మార్చుకొని, ఈ ఏప్రిల్‌తో పన్నెండేళ్ళు పూర్తి చేసుకున్న నిర్మాత - ‘దిల్’ రాజు. చిన్న సినిమాలతో మొదలై పెద్ద సినిమాలు చేసి, పట్టిందల్లా బంగారమైన రోజులు, చేతులు కాల్చుకున్న అనుభవాలు - రెండూ చవిచూశారాయన. ‘కేరింత’ అనే చిన్న సినిమాతో శుక్రవారం జనం ముందుకొస్తున్న ఈ సినీ ప్రేమికుడితో...
* చాలారోజులకి చిన్న సినిమాతో ‘కేరింత’ కొడుతున్నారే!
(నవ్వేస్తూ...) ‘కొత్త బంగారు లోకం’ తర్వాత చాలాకాలానికి మంచి స్క్రిప్టు దొరికింది. కొత్తవాళ్ళతో చేశాం. హీరో హీరోయిన్లు సుమంత్ అశ్విన్, శ్రీదివ్యలను పక్కనపెడితే, ఇద్దరబ్బాయిలు, ముగ్గురమ్మాయిలను ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాం. ఏడాది పాటు స్క్రిప్టు మీద వర్క్ చేసి, అందులోని బెస్ట్ వెర్షన్‌ను ఇప్పుడు సినిమాగా అందిస్తున్నాం. వినోదంతో పాటు, చిన్న చిన్న భావోద్వేగాలతో కూడిన క్షణాలను తెరపై అందిస్తున్నాం. ‘ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం’ తరువాత నా బ్యానర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్.
* మొత్తానికి, పెద్దవి వదిలేసి, మళ్ళీ చిన్న సినిమాల మీద పడ్డారు?
2008 వరకు నేనూ వర్ధమాన హీరోలతో సినిమాలు తీసినవాణ్ణే. ఆ తరువాత ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘బృందావనం’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎవడు’-ఇలా వరుసగా పెద్ద సినిమాలు అనుకోకుండా సెట్ అవుతూ వచ్చాయి. రెండేళ్ళ నుంచి మంచి ఫీల్‌గుడ్ చిన్న సినిమా చేయాలనుకుంటున్నా. దాని ఫలితమే ఈ ‘కేరింత’. యూత్‌కీ, ఫ్యామిలీలకూ పట్టే ఇది చిన్న సినిమాగా మొదలైనా అందర్నీ ఆకర్షించి పెద్ద సినిమా అవుతుందని నమ్మకం.
* ఆ మధ్య ఆర్థిక నష్టాల్లో ఉండి, నిర్మాణం తగ్గించారని విన్నాం!
అదేమీ లేదు. ఏ నిర్మాతకైనా గడ్డుకాలం సహజమే. ఏ ప్రాజెక్ట్‌నైనా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోకపోతే, నష్టపోయేది నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌లే. నిజానికి, నిర్మాణంలో నేను పెద్ద నష్టపోయిందేమీ లేదు. అయితే, మారుతున్న నిర్మాణ పరిస్థితుల్నీ, అభిరుచుల్నీ ఆగి, అబ్జర్వ్ చేయ్యాలనుకున్నా. అందుకే, ఏణ్ణర్ధంగా ప్రొడక్షన్‌లో స్లో అయ్యా. అలా మొదలైందే ‘కేరింత’ సినిమా.
* ఇదే టైమ్‌లో డిస్ట్రిబ్యూషన్‌పై శ్రద్ధ పెట్టినట్లున్నారు!
అవును. ఈ మధ్య చాలా సినిమాలే డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చా. ఈ ఏడాది ‘పటాస్, సన్నాఫ్ సత్యమూర్తి, గంగ’ - ఇలా చాలా చేశా. ఆ రంగంలో ఈ ఏడాది నాకు బాగుంది.
* కానీ, వసూళ్ళ సమ్మర్ సీజన్ ఈసారి వేస్టయిందే! నూటికి నూరుపాళ్ళు మనం ఈ సమ్మర్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. కేవలం పెట్టుబడిని వెనక్కి తెచ్చిన బ్రేక్ ఈవెన్ సినిమాలే వచ్చాయి. ‘ఓ.కె. బంగారం’, ‘గంగ’ లాంటి డబ్బింగ్ సినిమాలే ఆడాయి. ప్రతి ఏటా సమ్మర్‌లో బాక్సాఫీస్ హిట్స్ వస్తాయి. కానీ, ఈసారి అలాంటి అద్భుతాలేమీ జరగలేదు. సినిమాల రిలీజ్‌లలో ప్లానింగ్ లేకపోవడం, ముందుగా అనుకున్న ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’, ‘కిక్2’ చిత్రాలు ఆలస్యమై రిలీజ్ కాకపోవడంతో ఇబ్బంది అయిపోయింది.
* సినిమాకు రిలీజ్ టైమ్ ఎంత కీలకమంటారు?
ఎంత మంచి సినిమా అయినా సరైన టైమ్‌కి రిలీజ్ చేయడం ముఖ్యం. రైట్ టైమ్‌లో రిలీజ్ చేస్తేనే హిట్లు, లాభాలు వస్తాయి.
* ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’కి నైజామ్‌లో మీరే డిస్ట్రిబ్యూటర్‌గా!
అవును. నేను తీయలేని చారిత్రక సినిమాలు, భారీ సినిమాలను ఇలా కొని, డిస్ట్రిబ్యూట్ చేసి, తృప్తి పడుతుంటా. ఈ రెండు సినిమాలపై చాలా అంచనాలున్నాయి. రెండూ వేర్వేరు తరహా సినిమాలు. చరిత్రను మార్చకుండా కథను కథలా తీయాల్సిన సినిమా ‘రుద్రమదేవి’. కొన్ని ఎపిసోడ్స్ చూశా. బాగుంది. ఇమాజినేషన్‌కు పరాకాష్ఠ ‘బాహుబలి’. అది మన తెలుగు సినీసీమ విస్తృతినీ, మార్కెట్‌నూ, ప్రేక్షకుల ఆలోచననూ మారుస్తుందని నా నమ్మకం.
* మీరెక్కువగా యూత్‌ఫుల్ సినిమాలు నిర్మించడానికి కారణం?
సినిమాకు మున్ముందుగా వచ్చేది - యూత్, మాస్. నేను పెరిగిన వాతావరణం వల్ల కావచ్చు. నాకు మాస్ మీద పట్టు లేదు. పైగా, లాజిక్‌లు లేకపోయినా మాస్‌కు పట్టే కథలు నేను ఊహించలేను. అందుకే, నాకు పట్టున్న యూత్‌ఫుల్ సినిమాలు ఎక్కువగా చేస్తా. మాస్ మీద పట్టున్న దర్శకులు తమ స్క్రిప్ట్ మీద నమ్మకంతో వచ్చినప్పుడు, వాళ్ళను నమ్మి మాస్ సినిమాలు తీశా.
* సినిమా గురించి ఇంత తెలుసు. దర్శకత్వం వహించాలని లేదా?
(నవ్వుతూ...) లేదు. డెరైక్టరైతే, మనం తీస్తున్న ప్రాజెక్ట్‌ను బాగా ప్రేమించేసి, తీస్తున్నదే అద్భుతం అనుకుంటాం. అలా అనుకోకపోతే, సినిమా తీయలేం. దాంతో, జడ్జిమెంట్ పోతుంది. అలా కాకుండా, ఒక మామూలు ప్రేక్షకుడిలా ఉంటూ, ఆడియన్స్‌కు ఏం కావాలనేది గమనిస్తూ, నిర్మాతగా కొనసాగడమే నాకిష్టం. స్క్రిప్టు దశ నుంచి రిలీజైన సినిమా మంచిదని ప్రేక్షకులకు తెలియజెప్పి, వాళ్ళను హాళ్ళకు రప్పించే పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ దాకా అన్నింటినీ బాధ్యతగల నిర్మాత చూసుకోవాలి. అన్నింటిలో ఇన్‌వాల్వ్ అయి, యూనిట్‌తో కలసి ప్రయాణిస్తేనే నిర్మాత బాగుంటాడు.
* కానీ సిండికేట్లు, ‘ఆ నలుగురు’... ఇలా మీలోనే యూనిటీ లేదు!
(గంభీరంగా...) నిర్మాతల్లో ఎప్పుడూ ఐకమత్యం ఉండదు. ఆ మాటకొస్తే, క్రియేటివ్, కాంపిటీటివ్ ఫీల్డ్ దేనిలోనైనా అనైక్యత సహజం. కానీ, నిజంగా సినిమాలు తీస్తున్న పాతికమందో, యాభై మందో నిర్మాతలంతా ఒక తాటి మీదకొస్తే అద్భుతాలు చేయచ్చు. అందరి మధ్య ఐక్యత తేవాలని ఈ తరంలో మేము ప్రయత్నిస్తున్నాం. మార్పు రావడానికి టైమ్ పడుతుంది. ఓర్పు కావాలి.
* నిర్మాతగా ఈ 12 ఏళ్ళలో ఎందుకొచ్చిందీ ఖర్మ అనిపించలేదా?
లేనే లేదు. నిర్మాతగా సినిమాకు సంబంధించి ‘ఏ’ టు ‘జడ్’ అన్నీ చూసుకోవాలనుకొనే వ్యక్తిగా సక్సెస్, ఫెయిల్యూర్లకు అతీతంగా సినిమాను నేను ప్రేమించాను. అది తగ్గలేదు. తగ్గదు.
* ఐనా మీపై విమర్శలు, గాసిప్‌లొచ్చాయి. అప్పటి మానసిక స్థితి?
(సాలోచనగా...) చూడండి. నాకు తెలియకుండానే మంచి సినిమాలు తీశా. గుర్తింపు వచ్చింది. అయితే, మంచితో పాటూ చెడూ వస్తుంది. ఈ రంగంలోని అందరినీ తృప్తి పరచలేం కదా! అందుకే, విమర్శలూ వస్తాయి. నాది తప్పని అనిపిస్తే, నేనే ఫోన్ చేసి, సారీ చెబుతా. ఇక, సినిమా, రాజకీయాలు, క్రీడా రంగాల్లో గాసిప్‌లు తప్పవు. టైమ్‌పాస్ కోసం ఎవరెవరో ఏవేవో రాస్తుంటారు. దాని బదులు నాకే ఫోన్ చేసి అడిగితే, వాస్తవం చెబుతా కదా! అలా అడగరు కాబట్టే, అది గాసిప్ అయింది.
- రెంటాల జయదేవ
(Published in 'sakshi' daily, 11th June 2015, Thursday)
...................................................
డియర్ మేరీ
2 months ago