జె.వి. సోమయాజులుది నిండైన విగ్రహం... ఖంగుమని వినిపించే స్వరం...
తమ్ముడు రమణమూర్తితో కలసి ఆయన ప్రాణం పోసిన నాటక పాత్రలనేకం...
కానీ, ఒక్క సినిమా, ఒకే ఒక్క పాత్ర ఆయన జీవితాన్నే మార్చేశాయి. ‘శంకరాభరణం’ శంకరశాస్త్రిగా చెరగని ముద్ర వేసిన సోమయాజులు ‘కన్యాశుల్కం’కీ, తమ్ముడికీ
కొన్నేళ్ళు ఎందుకు దూరమయ్యారు? ఎన్నో ఏళ్ళు కలసి నటించినా, తమ్ముణ్ణి
ఎందుకు మెచ్చుకోలేదు? ఇవాళ సోమయాజులు జన్మదినం సందర్భంగా
నిజజీవిత శంకరశాస్త్రి జ్ఞాపకాల కిటికీని 81 ఏళ్ళ తమ్ముడు తెరిచారు.
మాది శ్రీకాకుళం జిల్లా లుకులామ్ అగ్రహారం. మా తాత గారు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్య సోమయాజి. మా నాన్న గారు జె.వి. శివరామమూర్తి ఆ రోజుల్లో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్. మా అమ్మా నాన్నలకు మేము అయిదుగురం అబ్బాయిలం, ఒక అమ్మాయి. జె.వి. సోమయాజులు రెండో సంతానమైతే, నేను నాలుగో సంతానం. అన్నయ్య పూర్తి పేరు - జొన్నలగడ్డ వెంకటసుబ్రహ్మణ్య సోమయాజులు. మేమంతా ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుంచి మేమిద్దరం అన్నదమ్ముల లాగా కాకుండా, మంచి స్నేహితుల లాగా ఉండేవాళ్ళం. ఒకరినొకరం ‘ఒరేయ్’ అంటూ, పేర్లతోనే పిలుచుకొనేవాళ్ళం.
రంగస్థలంపై తొలి రోజుల్లో...
మా అన్నయ్య సోమయాజులు, నేను, నా తరువాతి వాడైన జె.వి. శ్రీరామ్మూర్తి - మేమంతా రంగస్థల పక్షులం. స్కూలు, కాలేజ్ రోజుల నుంచే అందుకు భూమిక ఏర్పడింది. నాటకం పేరు గుర్తు లేదు కానీ, కాలేజీ రోజుల్లో వితంతువైన బోడెమ్మ వేషం వేశాడు అన్నయ్య. అది ఆయన తొలి నటనానుభవం. తర్వాత పెద్ద బ్యాచ్‌ను వదిలేసి, మా పిల్లకుంకల బ్యాచ్‌లో సభ్యుడయ్యాడు. అప్పటి నుంచి నేను, అన్నయ్య కలసి మా ‘కవిరాజు మెమోరియల్ క్లబ్’ పక్షాన ఆత్రేయ ‘ఎన్జీఓ’, కవిరాజు ‘దొంగాటకం’, ప్రఖ్య శ్రీరామ్మూర్తి ‘కాళరాత్రి’ - ఇలా ఎన్నెన్నో పట్టుదలగా, ఉత్సాహంగా ఆడేవాళ్ళం! డెరైక్టర్‌గా నాటకంలో ముఖ్యమైన పాత్ర అన్నయ్యకిచ్చేవాణ్ణి. మిగిలినవాళ్ళకు తగిన పాత్రలు ఇచ్చేసి, అందరూ వదిలేసిన పాత్ర నేను వేసేవాణ్ణి. అదీ పద్ధతి. నాటకంలో పాత్రపోషణ ఎలా ఉండాలనే దాని మీద మా అన్నయ్యకూ, నాకూ వాదనలు జరిగిన సందర్భాలున్నాయి. వాడి దగ్గర సుగుణం ఏమిటంటే, ఒకసారి డెరైక్టర్ చెప్పాక, దాన్ని అర్థం చేసుకొని చెప్పినట్లు చేసేసేవాడు.
ఏళ్ళ తరబడి ‘కన్యాశుల్కం’ జైత్రయాత్ర
ఊళ్ళో నాటకాలు వేస్తున్న తొలి రోజుల నాటికే సోమయాజులు ప్రభుత్వాఫీసులో క్లర్క్. పొద్దుటి నుంచీ సాయంత్రం దాకా ఆఫీసులో ఉండేవాడు కాబట్టి, రిహార్సల్స్ కష్టంగా ఉండేది. అందుకే, వాడు అన్నం తింటున్నప్పుడు కూడా పక్కనే ఉండి స్క్రిప్టు చదివి వినిపించేవాణ్ణి. అవన్నీ గుర్తుపెట్టుకొనేవాడు. అన్నదమ్ములం నాటకాలు వేస్తుంటే, మా అమ్మ చూసి, ఎంతో ఆనందించేది. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ చేపట్టినప్పుడు కీలకమైన రామప్ప పంతులు వేషం మా అన్నయ్యకిచ్చి, నేను గిరీశం వేషం కట్టాను. తొలిసారిగా విజయనగరంలో 1953 ఏప్రిల్ 20న ‘కన్యాశుల్కం’ వేశాం. ఆ రోజు మొదలు 1995 సెప్టెంబర్ 22న ఆఖరు ప్రదర్శన దాకా 42 ఏళ్ళ పాటు ‘నటరాజ కళాసమితి’ బృందంగా ‘కన్యాశుల్కం’ కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చాం. దేశమంతటా మాకు అఖండ కీర్తి వచ్చింది. నటుడిగా వాడిలో ఉన్న పెద్ద బలం - ఆత్మవిశ్వాసం. పాత్ర స్వభావం ఆకళింపు చేసుకున్నాక, దాన్ని మరెవ్వరూ చేయలేరన్నంతగా చేసేసేవాడు. ఇద్దరం కలసి నాటకాలు వేస్తున్నప్పుడు పరిషత్ పోటీల్లో చాలాసార్లు ఉత్తమ నటుడి విషయంలో నాకూ, వాడికీ మధ్య పోటీ టై అయ్యేది.
ఫ్లాప్‌తో... సినీ రంగ ప్రవేశం
1957లో నేను సినిమాల్లోకి వెళ్ళాను. ఎల్వీ ప్రసాద్ మేనల్లుడు కె.బి. తిలక్ ‘ఎం.ఎల్.ఎ’ చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరయ్యా. తరువాత 22 ఏళ్ళకు దర్శకుడు యోగి ‘రారా కృష్ణయ్యా!’ ద్వారా వైజాగ్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న అన్నయ్యను తెరపైకి తెచ్చాడు. మొదట వేయనని పట్టుబట్టినా, నా చీటీ చూసి, స్క్రిప్టు చదివి, నా సలహా మేరకు అన్నయ్య ఒప్పుకున్నాడు. తీరా, సినిమా ఫ్లాపైంది.
ఆ తరువాత సినిమాల్లోనూ, సమాజంలోనూ మా అన్నయ్యను రాత్రికి రాత్రి మార్చేసిన సినిమా - ‘శంకరాభరణం’. ఆ స్క్రిప్టు ప్రకారం ‘శంకరాభరణం’ శంకరశాస్త్రి పాత్రకు తెలిసిన ముఖాలు పనికిరావు, కొత్తవాళ్ళు కావాలి. అలాగని కథను పండించాలంటే కొత్తవాళ్ళయితే కుదరదు, అనుభవం ఉండాలి. ఏం చేయాలని విశ్వనాథ్ ఆలోచిస్తున్నప్పుడు, ఆయనకు మా అన్నయ్య పేరు చెప్పారు యోగి. ‘రారా కృష్ణయ్య’ ఫ్లాపవడంతో, అన్నయ్య ఇష్టపడలేదు. కానీ, ‘ఈ సినిమా చేస్తే అఖండ కీర్తి వస్తుంద’ంటూ స్క్రిప్టు తెలిసిన నేను అన్నయ్యను అతి కష్టం మీద ఒప్పించి, మద్రాసుకు రప్పించాల్సి వచ్చింది. మొదట వద్దు వద్దన్నా చివరకు అంగీకరించాడు. ‘శంకరాభరణం’ (1980 ఫిబ్రవరి 2న) విడుదలై, ఇంటింటా పాటలు మారుమోగేసరికి రాత్రికి రాత్రి స్టారైపోయాడు.
మనిషిని మార్చేసిన ‘శంకరాభరణం’
వాడు ఇంట్లో కూడా అచ్చం శంకరశాస్త్రి తరహాలోనే ఉండేవాడు. మొదటి నుంచీ వాడికి మహా రాజసం. అవతలవాళ్ళు పది మాటలు మాట్లాడితే, ఒక మాట ‘ఊ’, ‘ఆ’ అనేవాడు. ఇంట్లో పిల్లలను కఠినమైన క్రమశిక్షణతో పెంచాడు. అవన్నీ ఆ పాత్రకు సరిపోయాయి. అందుకే, ఓ సారి మా వదిన నాతో, ‘రమణా! శంకరశాస్త్రి అంటూ జనం మీ అన్నయ్య వెంట వెర్రెత్తిపోయి, చచ్చిపోతున్నారు గానీ, ఏవిటి చేశాడోయ్ అక్కడ! రోజూ ఇంట్లో మనం చూసే భాగోతమే కదా!’ అని అంది నవ్వుతూ. ఒక్కమాటలో చెప్పాలంటే, పాత్రను మా వాడు పోషించలేదు. నిజజీవితంలోలా ప్రవర్తించాడు.
అయితే, ఒకరకంగా చూస్తే - ఆ సినిమా, పాత్ర సోమయాజులుకు ఎంత పేరు తెచ్చాయో, నటుడిగా అంత చెరుపూ చేశాయని తరువాత తరువాత నాకు అనిపించింది. అంతటి అఖండ కీర్తితో సహజంగానే ఎవరికైనా దర్పం వస్తుంది. చుట్టూ భజనపరులు తయారయ్యారు. తరువాత కొద్దికాలానికి మునుపెప్పుడో ఒప్పుకున్న ‘కన్యాశుల్కం’ నాటక ప్రదర్శన చేయాల్సి వచ్చింది. కానీ, ‘ఇంత పేరొచ్చాక, ఇప్పుడు ‘కన్యాశుల్కం’ రామప్ప పంతులు పాత్ర చేయలేను. జనం నన్ను ఆ పాత్రలో అంగీకరించరు’ అన్నాడు సోమయాజులు. దాంతో, నాకు కోపం వచ్చింది. ‘నాటకం కన్నా, పాత్ర కన్నా నటుడు గొప్పవాడేమీ కాదు. ఏ వేషం నీకు గుర్తింపు తెచ్చి, నిన్ను నటుడిగా తీర్చిదిద్దిందో అది వేయనంటున్నావు. నీ లాంటివాడితో కలసి మళ్ళీ రంగస్థలం ఎక్కను’ అని చెప్పేశాను. అలా శంకరశాస్త్రి పాత్ర పుణ్యమా అని దాదాపు తొమ్మిదేళ్ళు నాకూ, వాడికీ మధ్య రాకపోకలు, మాటలు లేవు. కానీ, చివరకు ‘కన్యాశుల్క’మే మళ్ళీ మమ్మల్ని కలిపింది. ఆ నాటకం నూరేళ్ళ పండుగకు విజయనగరం వాళ్ళు మళ్ళీ మా బృందంతో ప్రదర్శన వేయించాలని పట్టుబట్టి, మమ్మల్ని కలిపారు. గురజాడ వారు తొలిసారిగా ప్రదర్శించిన విజయనగరం కోటలోనే ఆ నాటక ప్రదర్శన దిగ్విజయంగా వేశాం. ఆ నూరేళ్ళ ఉత్సవ సందర్భంగా ఆ ఒక్క ఏడాదిలోనే దేశమంతటా మళ్ళీ కొన్ని పదుల ప్రదర్శనలిచ్చాం! గొడవ కాకముందైతేనేం, తరువాత అయితేనేం... మా అన్నయ్య, నేను - ఇద్దరం కలసి తెరపై నటించాం. కలిసి నటించినా, మాట్లాడుకున్నా ఎందుకనో నాకూ, వాడికీ మధ్య మునుపటి సద్భావం పోయింది. ముభావంగానే ఉండేవాడు. కానీ, (గద్గదికంగా...) అప్పటికీ, ఇప్పటికీ వాడంటే నాకు ప్రేమ, గౌరవమే.
అరుదైన నిజాయతీ... అపూర్వ గౌరవం...
మా అన్నయ్యలోని మరో గొప్పతనం ఏమిటంటే, క్లర్క్‌గా మొదలైనవాడు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఎదిగాడు. ఎవరైనా వచ్చి ఏ సాయం అడిగినా, తన అధికార పరిధిలో చేయగలిగినదంతా చేసేవాడు. వాళ్ళ ఇల్లు నిలబెట్టేవాడు. కానీ, ఏనాడూ ఒక్క రూపాయి లంచం తీసుకోలేదు. ‘శంకరాభరణం’ తరువాత వాడి ఉద్యోగం కూడా ఇబ్బందుల్లో పడింది. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా నటించి, పారితోషికం తీసుకున్నాడని గిట్టనివాళ్ళు పిటిషన్లు పెట్టారు. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ‘శంకరాభరణం’ సినిమా తెప్పించుకొని, చూసి, ‘మన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు ఇంత గౌరవం తెచ్చినవాణ్ణి మనం గౌరవించుకోవాలి’ అన్నారు. ఆ వెంటనే మన తెలుగునాట తొలిసారిగా కల్చరల్ ఎఫైర్స్ అనే శాఖను సృష్టించి, దానికి డెరైక్టర్‌గా సోమయాజులును నియమించారు. అలాగే, ‘కళాకారుడైన ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సినిమాల్లో నటించి, పారితోషికం అందుకోవచ్చు. దానికి అనుమతి అవసరం లేదు’ అని కూడా ప్రత్యేక ఉత్తర్వు జారీ చేశారు. గమ్మత్తేమిటంటే, అసలు ‘శంకరాభరణం’కి అన్నయ్యకు దక్కిన పారితోషికం కేవలం రూ. 6 వేలు. అదీ సినిమా విడుదలై, అఖండ విజయం సాధించాక ఓ ఏడాది గడచిన తరువాత! ‘శంకరాభరణం’ తరువాత ‘త్యాగయ్య’, ‘సప్తపది’, ‘వంశవృక్షం’ - ఇలా అనేక సినిమాల్లో అన్నయ్య నటించినా, శంకరశాస్త్రి లాంటి చిరస్మరణీయ పాత్ర మరొకటి కనపడలేదు. ఆ పాత్ర ఒక స్టార్‌ను సృష్టించింది. కానీ, అదే పాత్రతో వచ్చిపడ్డ ఇమేజ్ ఒక మంచి నటుణ్ణి మింగేసింది.
- సంభాషణ: రెంటాల జయదేవ
(Published in 'Sakshi' daily, 30 July 2013, Wednesday)
.................................
డియర్ మేరీ
2 months ago