ఆ కుర్రాడికి పెద్ద సినీ నేపథ్యమే ఉంది. తాత ఎ. సంజీవి పేరున్న ఎడిటర్. తండ్రి ఎ.శ్రీకర్‌ప్రసాద్ ఏకంగా ఎనిమిది జాతీయ అవార్డులు అందుకున్న ఎడిటర్. అలాంటి కుటుంబంలోని కుర్రాడు సినీ రంగంలోకి రావడం చిత్రమేమీ కాదు. కానీ, 27 ఏళ్ళ అక్షయ్ అక్కినేని... ఎడిటింగ్ శాఖలో కాకుండా దర్శకత్వంలో అడుగుపెట్టడం మాత్రం చిత్రమే. పైగా, తొలి అడుగే హిందీ చిత్రసీమలో! పెపైచ్చు తొలి చిత్రమే 3డిలో! అదీ కాక, ఆ సినిమా తమిళ, తెలుగు భాషల్లో సూపర్‌హిట్టయిన ‘పిజ్జా’కు రీమేక్! ఇన్ని విశేషాలతో వచ్చే నెల 18న ‘పిజ్జా-3డి’ దర్శకుడిగా జనం ముందుకొస్తున్న అక్షయ్‌తో కాసేపు...
మీ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది?
చిన్నప్పటి నుంచీ సినిమా రంగంలోకి రావాలన్నది నా కల. అయితే, అది దర్శకత్వమా, ఎడిటింగా అనుకోలేదు. పెద్దయ్యాక దర్శకత్వం వైపు మొగ్గు చూపా. ఆలిండియా స్థాయిలో మంచి ర్యాంక్ వచ్చి, ఐ.ఐ.టి.లో చేరాల్సి ఉన్నప్పటికీ, అటు వెళ్ళకుండా సినీ రంగం వైపు వచ్చేశా.
మీ ఇంట్లో ఏమీ అనలేదా? నాన్నగారు ‘అలా కాదు... ఇలా’ అని చెప్పలేదా?
నేను సినిమాల్లోకి వెళతానని చెప్పగానే, నాన్న ఎందుకు, ఏమిటి అని అడుగుతారనుకున్నాను. కానీ, ఒక్క క్షణమైనా మరో ఆలోచన చేయకుండా ఆయన సరే అన్నారు. ఒక్కగానొక్క బిడ్డనైన నన్ను మా అమ్మ కూడా ప్రోత్సహించింది.
దర్శకత్వంలోకి రావాలనుకున్నప్పుడు మీరు ఎలాంటి శిక్షణ తీసుకున్నారు?
చిన్నప్పటి నుంచి నాన్న ఎడిటింగ్ సూట్‌లలో, సినిమా ల్యాబ్‌లలో తిరుగుతూ పెరగడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వచ్చా. చెన్నైలోని పూనమల్లి హైరోడ్‌లో ఉన్న ఎస్.ఐ.ఐ.టి-జె.ఇ.ఇ.లో ప్లస్ 2 చదివిన నేను లయోలా కాలేజ్‌లో విజువల్ కమ్యూనికేషన్స్ కూడా చేశా. ఆ సమయంలోనే చాలా మ్యూజిక్ వీడియోలకూ, షార్ట్‌ఫిల్మ్‌లకూ పనిచేశా. పవన్‌కల్యాణ్ ‘పంజా’ చిత్రానికి దర్శకుడు విష్ణువర్ధన్ దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా సినీ రంగంలో అడుగుపెట్టా. ‘అడియోస్’ అనే లఘుచిత్రానికి రచన, దర్శకత్వం వహించా. అది చూపెట్టినప్పుడు, దర్శక - రచయిత బిజయ్ నంబియార్‌కు నచ్చి, తన దగ్గర పని చేయడానికి నన్ను ముంబయ్‌కి వచ్చేయమన్నారు. ఆయన దర్శకత్వంలో ‘ఎం’ టి.వి.లో వచ్చిన ‘రష్’ అనే టీవీ షోకు కూడా సహాయ దర్శకుడిగా పనిచేశా. ఆ పైన ఆయన దర్శకత్వంలోనే విక్రమ్ హీరోగా తయారైన ‘డేవిడ్’ అనే తమిళ, హిందీ చిత్రానికి పనిచేశాను. ఆయనే నాకు ‘పిజ్జా’ హిందీ రీమేక్‌తో దర్శకుడిగా భారీ అవకాశమిచ్చారు.
దర్శకుడిగా తొలి అవకాశమే పెద్దది రావడం విశేషమే! తొలి చిత్రంగా రీమేక్‌ను ఎంచుకోవడం సేఫ్ అనా?
తెలుగు అనువాద రూపంలోనే కాక, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్‌గా కూడా అలరించిన కథ కావడం, అలాగే హిందీలో ప్రతిష్ఠాత్మక యు టి.వి. సంస్థ నిర్మించడం లాంటివన్నీ తొలి సినిమాకే లభించడం విశేషమే. మంచి అవకాశం వచ్చిందని అంగీకరించానే తప్ప, రీమేకా, మరొకటా అన్నది ఆలోచించనే లేదు. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కథలో మార్పులు చేశాను. మాతృకతో పోలిస్తే, దాదాపు 60 నుంచి 70 శాతం మార్చాం కాబట్టి, ఓ కొత్త సినిమా చూస్తున్నట్లే అనిపిస్తుంది.
మరి 3డి ఎందుకు ఎంచుకున్నట్లు?
కథను బాగా చెప్పడానికి 3డి టెక్నాలజీ తోడ్పడుతుందని నేనేప్పుడూ అనుకుంటూ ఉంటాను. పైగా, ‘పిజ్జా’ కథకు ఇది అతికినట్లు సరిపోతుంది. సినిమా ప్రారంభిస్తున్నప్పుడే 3డిలో తీయాలనుకున్నాం.
తొలి సినిమానే 3డిలో తీయడం కష్టం కాలేదా?
3డి వ్యవహారం చూడడానికి ఓ టీమ్ ఉంది. సినిమా చిత్రీకరణ ప్రారంభించే ముందు నేను, నా కెమెరామన్ జయకృష్ణ గుమ్మడి కలసి 3డిలో చిత్రీకరణ గురించి వారం రోజుల పాటు అధ్యయనం చేశాం. పుస్తకాలు చదివి, నెట్‌లో చూసి, దాని మీద అవగాహన పెంచుకున్నాం. 3డిలో చిత్రీకరణ విధానమైన స్టీరియోస్కోపీలో రకరకాల పద్ధతులున్నాయి. అందులో ఒకటి ఎంచుకున్నాం. వేగంగా, సాఫీగా పని చేసే సెమీ-ఆటోమేటిక్ రిగ్ అయిన ‘టి.ఎస్ 5’ను వాడాం. ఇన్ని జాగ్రత్తల వల్ల ముంబయ్‌లోనే 45 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసేశాం.
మీ నాన్న దగ్గర ఎడిటింగ్ చూశారు. ఇప్పుడు దర్శకత్వం చేశారు. ఇదే కష్టమనిపించిందా?
ఎడిటింగ్‌లోకి నేను వెళ్ళకూడదని కాదు కానీ, నా మటుకు నాకు దర్శకత్వం మరింత ఆనందదాయకమని అనిపించింది. నన్నడిగితే ఎడిటింగ్, దర్శకత్వం - దేనికదే ఓ పెను సవాలు. ఆ రెండు సవాళ్ళనూ పోల్చలేం.
ఈ చిత్రానికి మీ నాన్నే ఎడిటర్. ఆయనతో కలసి దర్శకుడిగా పని చేయడం ఎలా ఉంది?
మొదటి వారం రోజులు కష్టమైంది. వ్యక్తిగతంగా తండ్రీ కొడుకులుగా కాక, వృత్తి నిపుణులమైన ఎడిటర్ - దర్శకులుగా వ్యవహరించడానికి కాస్తంత టైమ్ పట్టింది. ఆ తరువాత ఈ ప్రక్రియ అందమైన ప్రయాణంగా మారింది.
దర్శకుడిగా మీ పని తీరు చూసి, ఆయన ఏమన్నారు?
సంతోషించారు. ఓ ఎడిటర్‌గా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ పట్ల ఆనందం వెలిబుచ్చారు. కొన్నిచోట్ల మరికొంత బాగుండాల్సిందన్నారు.
ఇంతకీ దర్శకునిగా ఏం నేర్చుకున్నారు?
ఎంతో నేర్చుకున్నాను. గతంలో నేర్చుకున్నవెన్నో వదిలించుకున్నాను. నా తోటి టెక్నీషియన్ల నుంచి నేర్చుకుంటూనే ముందుకు వెళ్ళాలి... వెళతాను కూడా!
ఒక వ్యక్తిగా మీ నాన్న నుంచి మీరు నేర్చుకున్నది?
అది చెత్త సినిమా కావచ్చు, మంచి సినిమా కావచ్చు... పని చేస్తున్నప్పుడు త్రికరణశుద్ధిగా, సర్వశక్తులూ పెట్టి కృషి చేయాలి. ఆ విషయం ఆయన నాకెప్పుడూ చెప్పలేదు కానీ, ఆయన ఆ పనే చేస్తారు. ఆయనను చూసి నేనది నేర్చుకున్నాను.
దర్శకుడిగా తదుపరి ప్రణాళికలు
‘పిజ్జా - 3డి’ తరువాత ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. కాకపోతే, దర్శకుడిగా ప్రయాణం సాగిస్తాను. ప్రస్తుతం ముంబయ్‌లో ఉన్నా, నా కేంద్రస్థానం - మద్రాసే. తమిళనాట పుట్టి పెరిగి, ముంబయ్ దాకా వచ్చిన తెలుగు కుర్రాడిగా తమిళ, హిందీ, తెలుగు భాషలు మూడింటిలోనూ తప్పక సినిమాలు చేస్తాను. ప్రేక్షకులను అలరిస్తాను.
- రెంటాల జయదేవ
(Published in 'Sakshi' daily, 7th July 2014, Monday)
..............................................
తోడుకునేవాళ్లకి తోడుకున్నంత
4 years ago
0 వ్యాఖ్యలు:
Post a Comment