జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, September 30, 2015

‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ - కొత్త సినిమా గురూ!

అమ్మకానికి చాలా వస్తువులుంటాయి. దాదాపు అన్నీ డిస్కౌంట్ మీదే దొరుకుతాయి. కాంపిటీషన్ పెరిగేకొద్దీ డిస్కౌంట్ పెరుగుతుంది.కుర్ర హీరోల్లో కాంపిటీషన్ భేషుగ్గా ఉంది.అయినా, సుబ్రమణ్యం సేల్ వితౌట్ డిస్కౌంట్ నడుస్తోంది. మేనమామల పోలికని కొందరు... మెగాస్టార్ మూవ్‌మెంట్లని ఇంకొందరు... బాక్సాఫీస్‌కి బాగా పనికొస్తాడని అందరూ... మూడో సినిమాకు మూడ్ సెట్టయింది! శుక్రవారం కంటే ముందే సాయిధరమ్ తేజ్ సోల్డ్!!
చిత్రం: సుబ్రమణ్యం ఫర్ సేల్
పాటలు: భువనచంద్ర, చంద్రబోస్, వనమాలి, భాస్కరభట్ల
సంగీతం: మిక్కీ జె. మేయర్
 కెమెరా: సి. రామ్‌ప్రసాద్
ఎడిటింగ్: గౌతంరాజు
స్క్రీన్‌ప్లే: రమేశ్‌రెడ్డి, సతీశ్ వేగేశ్న, తోట ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: హర్షిత్
సహ నిర్మాతలు: శిరీష్ - లక్ష్మణ్
నిర్మాత: ‘దిల్’ రాజు
 కథ-మాటలు-దర్శకత్వం: హరీష్‌శంకర్
నిడివి: 154 నిమిషాలు

సినీ ప్రపంచంలో కథలు పది పన్నెండే అన్నది ఒక సూత్రీకరణ. ‘కొత్త కథలంటూ ఉండవు. ఒక పాయింట్ తీసుకొని పాత కథనే కొత్తగా చెప్పాల’న్నది సినీజనం నమ్మే బాక్సాఫీస్ సూత్రం. ఈ రెంటినీ అర్థం చేసుకోవడమే కాక, ఇప్పటి ట్రెండ్‌లో ఎంటర్‌టైనింగ్‌గా సినిమా తీయాలని చేసిన ప్రయత్నం - ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.

 ఎవడీ సుబ్రమణ్యం? ఏమా కథ?
 తల్లీతండ్రీ లేని పిల్ల సీత (రెజీనా). పెదనాన్న, బాబాయ్‌ల ప్రేమతో పెరుగుతుంది. ఫేస్‌బుక్‌లో మూడేళ్ళుగా చాటింగ్ చేస్తున్న అమెరికా అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ఇంట్లోవాళ్ళు ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారంటూ, అతనితో పెళ్ళి, అమెరికాలో చదువంటూ పారిపోతుంది. ఇక, అమెరికాలో సుబ్రమణ్యం (సాయిధరమ్‌తేజ్)ది వేరే కథ. ప్రతి క్షణాన్నీ డాలర్‌గా మార్చాలని రకరకాల జాబ్స్ చేస్తుంటాడు. అమెరికాలో హీరో, హీరోయిన్లిద్దరూ తారసపడతారు. ఆమెను అమెరికా రప్పించిన ప్రేమికుడు మోసగాడన్న విషయం తెలిశాక, హీరో ఆమెను కాపాడతాడు. అలా దగ్గరైన వాళ్ళిద్దరూ డబ్బు కోసం ఒక చోట భార్యాభర్తలుగా నటించి, ‘బెస్ట్ కపుల్’ ప్రైజ్ కూడా కొట్టేస్తారు.
 కజిన్ సిస్టర్ పెళ్ళికని హీరోయిన్, సవతి చెల్లి పెళ్ళికని హీరో ఇండియాకొస్తారు. హీరోయిన్ వెంట వాళ్ళింటికి హీరో కూడా వెళతాడు. అక్కడ వారిద్దరినీ అందరూ భార్యాభర్తలనుకుంటారు. వీళ్ళు కూడా తప్పనిసరై, అదే నాటకం ఆడతారు. మరోపక్క హీరోను చూసి ‘సుబ్రమణ్యం తిరిగొచ్చాడు’ అంటూ కొందరు విలన్లు వెంట పడతారు. విలన్ చెల్లితో పెళ్ళికి ఒప్పుకొని, తీరా అనుకోని పరిస్థితుల్లో హీరో అమెరికా పారిపోయాడన్నది ఫ్లాష్‌బ్యాక్. హీరో వారి నుంచి ఎలా బయటపడ్డాడు? హీరోయిన్, హీరోల పెళ్ళి ఎలా అయిందన్నది మిగతా కథ.   

 బోలెడన్ని సీన్లు... పాత్రలు...
 మూడు పాటలు, ఆరు సీన్లుగా సినిమా ఫస్టాఫ్ సుదీర్ఘంగా నడిచినట్లనిపించినా, సెకండాఫ్ వినోదం ఎక్కువ పంచుతుంది. ఈ సినిమాలో లేనిది లేదు. కోట శ్రీనివాసరావు, జీవా, సప్తగిరి, ‘ప్రభాస్’ శీను - ఇలా ప్రముఖులు చేసిన ఒకటి, రెండు సీన్ల పాత్రలున్నాయి. ఒకటికి నాలుగు పెళ్ళి సీన్లున్నాయి. పీటల మీద పెళ్ళిళ్ళు ఆఖరు క్షణంలో ఆగిపోవడాలున్నాయి. ఒకరిని ప్రేమిస్తూ, వేరొకరితో పెళ్ళికి సిద్ధపడడమనే త్యాగాలుంటాయి. పెళ్ళి కాని వ్యక్తులు పెళ్ళయినంత ఫీలింగిచ్చే చీటింగ్ డ్రామా ఉంది. ఒకరికి ముగ్గురు విలన్లుంటారు. ‘చంటిపిల్ల తప్పిపోతే వెతుక్కోవాలి. ఎదిగినపిల్ల పారిపోతే మర్చిపోవాలి’ లాంటి జీవితసూత్రాలు ఒకదాని వెంట మరొకటొచ్చి పడిపోతుంటాయి. ఎప్పటికప్పుడు మనసు మార్చుకొని మాట మార్చే పాత్రలుంటాయి. ఇలా చాలా ఐటమ్సున్నాయి.

 హుషారైన నటన... ఉత్సాహంగా డ్యాన్సులు...
మొదలైంది మొదటైనా, రిలీజ్‌లో రెండోదిగా మారిన ‘రేయ్’ చిత్రం నుంచే ‘సుప్రీమ్ హీరో’ బిరుదాంకితుడైన నటుడు సాయిధరమ్ తేజ్. ముచ్చటైన ఈ మూడో సినిమాలోనూ హీరోయిజమ్‌పై డిపెండయ్యారు. రూపురేఖల్లోనే కాదు, హావభావాల్లోనూ తన ‘మెగా’ మేన మామల నుంచి ఈ కొత్త హీరో చాలానే పుణికిపుచ్చుకున్నారు. తెరపై అది తరచూ తొంగిచూస్తుంటుంది. సన్నివేశాల్లో హుషారుగా, డ్యాన్సుల్లో ఎనర్జిటిక్‌గా చేశారు.

‘సీత... సీత ఇక్కడ... అంత ఈజీ కాదు...’ అనే కథానాయిక పాత్రలో రెజీనా అందంగా ఉంది. ఆ పాత్ర రూపకల్పనతో పోలిస్తే ఆమె ఆకర్షణే సినిమా అంతటా కొంత నిలకడైన విషయం. రావు రమేశ్ విలక్షణ మాట తీరుతో విలనిజమ్ చూపారు. మరో విలన్‌కి చెల్లెలుగా నటి ఆదా శర్మ ఇంట్లో ఏసీ రిపేరింగ్‌కు వచ్చే మెకానిక్‌తో లవ్‌లో పడే పాత్రలో కనిపిస్తారు. చంచల స్వభావమున్న ఈ చిన్న పాత్ర ఆమె కెరీర్ కన్నా కథకే కీలకం. విదేశాల్లో స్థిరపడ్డ ఒకప్పటి విలన్ ప్రదీప్‌శక్తి రెస్టారెంట్ ఓనర్‌గా చాలాకాలానికి కనిపించారు.

 సెకండాఫ్‌లో... కామెడీ రిలీఫ్
 పెళ్ళి, మొగుడుకు సంబంధించి సాగే ఈ కన్‌ఫ్యూజన్ డ్రామాలో రిలీఫ్ - బ్రహ్మానందం పోషించిన చింతకాయ్ పాత్ర. వంట రాకపోయినా చేయి తిరిగిన వంటవాడిలా బిల్డప్ ఇస్తూ, అమెరికాకు వచ్చే ఆ పాత్రలో బ్రహ్మానందం నటన, అతని అంతరాత్మ చేసే విన్యాసం నవ్విస్తాయి. రౌడీ గ్యాంగ్ ‘ఫిష్’ వెంకట్ బృందం చేసే చేష్టలు వినోదం పంచుతాయి. ఈ చిత్రంలో ‘జమ్.. పంకజమ్.. మిఠాయి పంకజమ్’ (ఓనర్ భార్య-బ్రహ్మానందం ట్రాక్), ‘మొహం మొగ్గలా ఉండడం’, లైంగిక చర్యను సంకేతిస్తూ ‘కారులో యోగా’ లాంటి డైలాగుల్ని వినిపిస్తారు. ‘(శోభనంగదిలో) నువ్వు అరిస్తే మంచి మేటరున్న మొగుడు దొరికాడనుకుంటారు’ అని హీరోయిన్ గురించి హీరోతో అనిపిస్తారు.

 కొత్తగా రేకెత్తే... పాత జ్ఞాపకాలు
 సాంకేతిక విభాగాల్లో - ఛేజింగుల్లో కెమేరా వర్క్, టాప్ యాంగిల్ షాట్స్, హైవే ఫైట్ (ఫైట్ మాస్టర్ రామ్ - లక్ష్మణ్) లాంటివి ప్రత్యేకించి గుర్తుంటాయి. హీరో ఒక్కడికే కాక చాలా భాగం సీన్లకీ బోలెడంత బిల్డప్ ఇచ్చిన వైనం సినిమాలో కనిపిస్తుంది. కానీ, బ్రహ్మాండం బద్దలవుతుందనుకొనే ప్రతి సీనూ, బద్దలు చేస్తుందనుకున్న ప్రతి పాత్రా మళ్ళీ మామూలుగా మారిపోతూ, ప్రేక్షకుల ఊహకందకుండా తిరుగుతాయి. ఒక రకంగా ఇది ప్లస్సే అయినా, మోసపోయాననే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలిగితేనే చిక్కు. ఇక, చివరకొచ్చేసరికి ఉడికీ ఉడకని సెంటిమెంట్, సగటు సీరియల్ తరహా క్లైమాక్స్ ఎదురవుతాయి. మొత్తానికి, దర్శకుడు చెప్పినట్లే, ఈ సినిమా గతంలో వచ్చిన అనేక చిత్రాల ప్యాట్రన్‌లో నడిచే కలగూర గంప. ‘మొగుడు కావాలి’, ‘బావగారూ బాగున్నారా’ నుంచి ఎన్టీయార్ ‘బృందావనం’ దాకా చాలా సిన్మాలు, సీన్లు గుర్తొస్తాయి. ‘గువ్వా గోరింకతో...’ రీమిక్స్ కొన్నేళ్ళ వెనక్కి తీసుకువెళుతుంది.  వెరసి, పాత వెండితెర జ్ఞాపకాలనే కొత్తగా అమెరికా బ్యాక్‌డ్రాప్‌తో కళ్ళ ముందుకు తెచ్చే కమర్షియల్ ఎంటర్‌టైనర్ - ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.   

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 25th Sep 2015, Friday)
..................................................

సూర్య సినిమాకు తప్పు చేశా! - నిర్మాత లగడపాటి శ్రీధర్‌

ఆయన సిల్వర్‌స్పూన్‌తో పుట్టారు. సిల్వర్‌స్క్రీన్ గురించి కలగన్నారు. పదేళ్ళ క్రితం నిర్మాతయ్యారు. లగడపాటి శ్రీధర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఏం సంపాదించినా అన్నీ సినిమాల వల్లే కాబట్టి, చుట్టూ ఉన్నవాళ్ళను ‘సినిమాల’తోనే సంతోషపెట్టాలనుకొన్నారు. శుక్రవారం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...’తో రానున్నారు. ఈ సందర్భంగా ఇవాళ్టి బర్త్‌డే బాయ్ శ్రీధర్‌తో కాసేపు...

 * వరుసగా కన్నడం నుంచి రీమేక్ చేస్తున్నారేం?
 బడ్జెట్ పరిమితులున్న చోట, తప్పనిసరై క్రియేటివిటీ వెల్లివిరుస్తుంది. కన్నడంలో అదే జరుగుతోంది. నన్నడిగితే, మన చిన్న సినిమాలకు కన్నడ చిత్రాలే నమూనా లాంటివి. వాటిని గనక తెలుగుకు తగ్గట్లు రీ-ప్యాకేజ్ చేసుకొని, ఇంప్రూవ్ చేసుకుంటే, మంచి చిన్న సినిమాలు వస్తాయి. అందుకే, ‘పోటు గాడు’, తాజాగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...’ లాంటివి చేయగలిగా.

* కానీ, చిన్న సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారంటారా?
 ప్రొడక్షన్ వ్యాల్యూస్, పబ్లిసిటీతో సహా 5 కోట్లలో సినిమా తీస్తే కానీ, ప్రేక్షకుల్ని ఆకర్షించే చిన్న సినిమా రాదు. అలాంటి ప్రయత్నమే ప్రేమ ఇతివృత్తంగా తీసుకొని తీస్తున్న ‘కృష్ణమ్మ...’ ప్రేమకు ఒక గైడ్‌లా ఉంటుంది. స్కూలు మొదలు కెరీర్ దాకా పన్నెండేళ్ళ ప్రేమ ప్రయాణాన్ని చూపెట్టాం.

 * డిజిటల్ ఏజ్‌లో స్వచ్ఛమైన ప్రేమను కోరేవారు, చూసేవారు ఉంటారా?
 ఇందులో టైమ్‌పాస్ లవ్, టైమ్‌లెస్ లవ్ - రెండూ చూపించాం. జీవితంలో చాంపియన్ కావాలంటే, సిన్సియర్ ప్రేమే అవసరమని చెప్పాం.

 * బయట ఎమోషనల్‌గా ఉండే మీరు, ప్రేమ కథలు తీయడం...?
 (మధ్యలోనే అందుకుంటూ...) కుటుంబ విలువల మీద నాకు ఆసక్తి ఎక్కువ. సిన్సియర్ ప్రేమను చూపిస్తూ, కన్నడంలో చంద్రు తీసిన ‘ప్రేమ్ కహానీ’, ‘తాజ్‌మహల్’, ‘చార్మినార్’ మూడూ వసూళ్ళ వర్షం కురిపించాయి. ‘తాజ్‌మహల్’ను ‘పోటుగాడు’గా తీశా. ఇప్పుడు ఇది చేశా.

 * డెరైక్షన్, కెమేరా, సంగీతం- వీటికి కన్నడ టీమ్‌నే వాడారేం?
 చాలా రీమేక్స్‌లో ఒరిజినల్‌లో ఉన్న ఫ్లేవర్ మిస్సయిందని అనుకుంటూ ఉంటాం. అందుకే, ‘చార్మినార్’ దర్శకుడు (చంద్రు), కెమేరామన్ (కె.ఎస్. చంద్రశేఖర్), సంగీత దర్శకుడు (హరి) ముగ్గురినీ తీసుకున్నా.

* మీ జోక్యం ఎక్కువనేనా స్టార్స్‌తో సినిమా తీయలేదు?
 స్టార్స్ కోసం సినిమాలు తీయలేను. సినిమాను ప్రేమిస్తా. చేస్తున్న పని ప్రతి సెకనూ ఆస్వాదిస్తా. టీమ్ సక్సెసే నా సక్సెస్ అనీ, ప్రేక్షకుల వినోదానికి బాధ్యుడిగా నిలవాలనీ భావిస్తా. అవన్నీ తెలిసినవాళ్ళే నాతో చేయడానికి ముందుకొస్తారు. కాంబినేషన్స్‌తో డబ్బులు పెట్టి కూర్చోవడం ఇష్టం లేదు. అందుకే, నాకెప్పుడూ నిద్ర లేని రాత్రుల్లేవు.

 * మరి, సూర్య ‘సికిందర్’ను డబ్ చేసిన విషయం...?
 (మధ్యలోనే...) వేరేవాళ్ళ మాట నమ్మి, చూడకుండానే రిలీజ్ చేసేశా. అది నేను చేసిన తప్పు. అలా మళ్ళీ చేయను.

* నిర్మాతగా ఈ పదేళ్ళలో ఆర్థికంగా పోగొట్టుకున్నదే ఎక్కువేమో?
 నో రిగ్రెట్స్! కాకపోతే, ఛాన్సిచ్చి చూద్దామని ‘అండర్ డాగ్స్’ మీద తరచూ పందెం కాశాను. పాఠాలు నేర్చుకున్నా. ఇప్పుడిక దీన్ని బిజినెస్‌గానే చేయాలనుకుంటున్నా. ఇకపై మంచి రేసుగుర్రాలపైనే పందెం కాస్తా.

* మీ అబ్బాయి కూడా సినిమాల్లోకి వచ్చి, నటిస్తున్నట్లున్నాడు!
 మా అబ్బాయి విక్రమ్ (9వ తరగతి)కి నటుడు కావాలని ఆశ. దర్శకుడు సురేందర్‌రెడ్డి ‘రేసుగుర్రం’లో పరిచయం చేశారు. ‘కృష్ణమ్మ...’లో చిన్నప్పటి ఎపిసోడ్‌లో వాడు నటించాడు. అందరూ రకరకాల స్టార్స్ అని పేరు పెట్టుకుంటుంటే, వాడు ‘గ్లోబల్ స్టార్’ అని పెట్టుకున్నాడు (నవ్వు).

* మీ రాబోయే సినిమాలు?
 తమిళ సూపర్‌హిట్ ‘గోలీసోడా’ హక్కులు కొన్నా. అన్నీ కుదిరితే, ఆ రీమేక్ చేయాల్సిందిగా ‘అతనొక్కడే’ కథా చర్చల రోజుల నుంచి మాకు సన్నిహితుడైన దర్శకుడు సురేందర్‌రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నా. చూద్దాం.

* ఏమిటీ అన్నీ రీమేక్‌లేనా? అవి సేఫ్ అనా? సొంత కథలు చేయరా?
 మూడు నాలుగు మించి కొత్త కథలెవరూ చెప్పలేరు. మొదట నేనూ కొత్త ఐడియాలతో వచ్చా. ఇప్పుడు రీమేక్‌లు చేస్తున్నా. అది సొంత కథా, రీమేకా అని కాదు - జనానికి కావాల్సినవి, నచ్చేవి ఇవ్వాలనుకుంటున్నా.

* మీ డ్రీమ్ ‘స్టైల్ -2’ ఏమైంది?
 స్క్రిప్ట్ సిద్ధం. అద్భుతంగా నాట్యం చేసే అమ్మాయి చుట్టూ తిరిగే కథ. అలాంటి నటి కోసం చూస్తున్నా. వేటూరి గారు చివరి రోజుల్లో బెడ్ మీద ఉంటూనే, ‘స్టైల్ -2’ కోసం రెండు అద్భుతమైన పాటలు రాశారు. ఎప్పటికైనా ఈ సినిమా తీసి, ఆయనకు అంకితమిస్తా.     
  - రెంటాల

(Published in 'Sakshi' daily, 14th June 2014)
...................................................