(‘శ్రీరామరాజ్యం’ సినిమా సమీక్ష - పార్ట్ 3)(మునుపు రాసినవేమో...
పార్ట్ 1 - ‘రామరాజ్యమంటే ఇదా...!?’,
పార్ట్ 2 - ‘శ్రీరామరాజ్యం - చిన్న లోపాలే పెద్ద శాపాలా?’
ఆ రెండు పోస్టులకు కొనసాగింపుగా ఇది చివరి భాగం)పౌరాణికాలకు పెట్టింది పేరైన మన తెలుగు చిత్ర పరిశ్రమలో 14 ఏళ్ళ తరువాత వచ్చిన పూర్తిస్థాయి పౌరాణిక చిత్రం - ఈ 'శ్రీరామరాజ్యం'. దీనికి ముందు తెలుగులో ఆఖరుగా వచ్చిన నేరు పౌరాణిక చిత్రం చిన్న ఎన్టీయార్ పసివయసులో రాముడిగా నటించిన బాలల చిత్రం 'రామాయణం' (1997). ఆ తరువాత వచ్చిన 'శ్రీరామదాసు', 'పాండురంగడు' లాంటివి పూర్తి పౌరాణిక చిత్ర వర్గంలోకి రావు. చిరంజీవి 'శ్రీమంజునాథ' పౌరాణికమైనా, అది అనువాద చిత్రం. మీడియాలో ఒక వర్గం మాత్రం 'రామాయణం' కన్నా ఏడాది ముందే బాలకృష్ణ నటించిన విజయా వారి 'శ్రీకృష్ణార్జున విజయం' (1996) చిత్రాన్నే ఆఖరుగా వచ్చిన పౌరాణిక చిత్రంగా పేర్కొంటూ, 'శ్రీరామరాజ్యం' ప్రచార కథనాలు ఇటీవల ప్రసారం చేసింది. ఏమైనా, చాలా ఏళ్ళ తరువాత వస్తున్న భారీ పౌరాణిక చిత్రంగా సహజంగానే 'శ్రీరామరాజ్యం' పై అందరిలో ఆసక్తి, తెలుగుదనానికి ప్రతీకలైన బాపు - రమణల చిత్రం కావడంతో కొన్ని అంచనాలు నెలకొన్నాయి. పైగా, పెరిగిన సాంకేతికత నేపథ్యంలో వస్తున్న మహదవకాశమైన ఈ భారీ పౌరాణికానికి పెద్ద సంఖ్యలో పెద్ద పెద్ద సాంకేతిక నిపుణులు పనిచేశారు.
సంగీతం, సాహిత్యం, నృత్యాల శ్రమ ఫలించిందా ?సంగీతం ఇళయరాజా అందించారు. పాటలు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాశారు. ఇళయరాజా సంగీతంలో ఒకటి, రెండు పాటల్లో తప్ప, మిగిలిన చోట్ల మునుపటి మ్యాజిక్ లేదు. 'సాగర సంగమం' లాంటి కొన్ని చిత్రాల్లో ఇప్పటికీ చెప్పుకొనే ఆయన మార్కు రీ-రికార్డింగు 'శ్రీరామరాజ్యం'లో వినిపించదు. ఉదాహరణకు, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులతో రాజమందిరంలో రాముడు వేదనాపూర్వకంగా సంభాషించే సన్నివేశం లాంటివి చూస్తే, రీ-రికార్డింగ్ జరపడానికి ముందే రీలు హాలుకు వచ్చేసిందేమో అనిపిస్తుంది. రీ-రికార్డింగ్ కి అంటూ హంగేరీకి కూడా వెళ్ళి వచ్చిన ఇళయరాజా బృందం అక్కడ ప్రత్యేకంగా చేసినదేమిటమని అనుమానం కలుగుతుంది.
కవి, పండితుడైన జొన్నవిత్తుల పాటల్లో 2, 3 వినగా, వినగా బాగున్నాయి. 'జగదానంద కారకా... జయ జానకీ ప్రాణనాయకా... ' అన్న త్యాగరాయ కీర్తన మకుటంతో రాసిన పల్లవి సినిమా రిలీజుకు ముందు నుంచే తెలుగు నాట ఇంటింటా మారుమోగింది. ఇక, 'దేవుళ్ళే మెచ్చింది... మీ ముందే జరిగింది... ' అంటూ లవకుశులు చేసే రామాయణ గానం కూడా విన్నకొద్దీ ఎక్కే పాట. అందులో ముఖ్యంగా సీతకు అగ్నిపరీక్ష సందర్భాన్ని ప్రస్తావిస్తూ రాసిన '...ఎవ్వరికీ పరీక్ష, ఎందులకీ పరీక్ష, ...రాముడి ప్రాణానికా, జానకి దేహానికా.... ' లాంటి వాక్యాలు మనసుకు తాకుతాయి. సీతను అడవిలో వదిలే సమయంలో వచ్చే విషాద గీతం 'గాలి..నింగి..నీరు... ' కూడా ఇళయరాజా బాణీలో, భావోద్వేగాలను పండించిన ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం వాణిలో కదిలిస్తుంది. శ్రేయా ఘోశల్ లాంటి గాయనీ గాయకులు ఈ చిత్ర గీతాలను బాగానే పాడారు.
అయితే, వచ్చిన చిక్కేమిటంటే, మొత్తం మీద పాటల్లో సాహిత్యం బాగున్నా, కథకు కావాల్సిన ఆర్తి, ఆవేదన, ఆవేగం అన్ని చోట్లా పలకలేదు. పైగా, విడిగా వినప్పటి కంటే, తెరపై దృశ్యంతో కలసి విన్నప్పుడు వాటి స్థాయి మరికొంత తగ్గిందేమో అనిపిస్తుంది. ఇక, ఆల్ టైమ్ హిట్లుగా నిలిచిన 'లవకుశ'లోని 'శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా... ', 'ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు...' లాంటి పాటలతో పోలికలు రానే వస్తాయి. అదీ ఓ ప్రతికూలతే. అన్నట్లు ఈ చిత్రానికి మొదట్లో వెన్నెలకంటితో 2 పాటలు, కొన్ని పద్యాలు కూడా రాయించారు. రికార్డు కూడా చేసినట్లున్నారు. మరి, సినిమాలో అవేవీ లేవు. జొన్నవిత్తులదే సింగిల్ కార్డు. దీనికి వెనుక కథేమిటో తెలియదు.
ఈ చిత్రానికి డ్యాన్స్ మాస్టర్ సీనియర్ టెక్నీషియన్ శ్రీను. అయితే, ఈ సినిమాలోని నృత్యగీతాలు, ముఖ్యంగా రాముల వారి అయోధ్యా నగర ప్రవేశం, సీతమ్మవారి సీమంతం పాటలకు కంపోజ్ చేసిన బృంద నృత్యాలు పౌరాణిక సినిమాలకు తగ్గట్లుగా అనిపించవు. పైగా శాస్త్రానుసారం రంగస్థలి మీద ఉండకూడని లోపాలూ ఉన్నాయి. ఉదాహరణకు, ముఖ్య తార (ల)ను మధ్యలో పెట్టుకొని, బృంద నర్తకులు చుట్టూ తిరిగి నర్తిస్తున్నప్పుడు కథకూ, సినిమాకూ ప్రధానమైన ఆ ముఖ్య తారలు, వారి ముఖాలు కనపడాలి కదా. వారు కనపడరు సరి కదా, ఈ బృంద నర్తకుల పృష్ఠ భాగాలు తెరపై తారట్లాడుతూ, చూపరులకు చెప్పుకోలేని చీకాకు కలిగిస్తాయి.
అతుకుల బొంతగా ఆధునిక సాంకేతికత జి.జి. కృష్ణారావు కూర్పు అద్భుతాలు, ఆశ్చర్యాలు లేకుండా, సాఫీగా సాగిపోతుంది. కళా దర్శకత్వానికి వస్తే - ఎస్. రవీందర్, కిరణ్ కుమార్ లు ఆ బాధ్యతలు నిర్వహించారు. ప్రధానంగా, వాల్మీకి ఆశ్రమం (కళా దర్శకుడు ఎస్. రవీందర్), అయోధ్య రాజమందిరం లాంటివి పూర్తి స్థాయి అచ్చమైన సెట్లయితే, మిగిలినవి కొద్దిగా వేసిన సెట్ కు, మిగతా భాగం విజువల్ ఎఫెక్టులు జోడించిన వర్చ్యువల్ సెట్లు.
సుమారు రెండుమ్ముప్పావు గంటల ఈ సినిమాలో దాదాపుగా రెండుంబావు గంటల దాకా గ్రాఫిక్స్ ఉన్నాయి. అందు కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు - ఏకంగా నాలుగు సంస్థల వారు (ఇ.ఎఫ్.ఎక్స్, పిక్సెలాయిడ్, మకుట, ఆరెంజ్ మీడియా) శ్రమించారు. కానీ, తెరపై తుది ఫలితం మాత్రం తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. అయోధ్యా నగర వీధులు, రాజ ప్రాసాదంలో కోటంత ఎత్తు గోడలు, ద్వారాలు, తలుపులు వగైరాలన్నీ కంప్యూటర్ లో రూపొందించిన వర్చ్యువల్ సెట్లే. ఇలాంటి వర్చ్యువల్ సెట్లు సైతం కంటికి తేడా తెలియకుండా గ్రాఫిక్స్ లో నేర్పుగా చేసిన తీరు మనం మునుపటి ‘అరుంధతి’, ‘మగధీర’ (2009) చిత్రాల్లో చూశాం. కానీ, ‘శ్రీరామరాజ్యం’లో మాత్రం ఈ గ్రాఫిక్స్ విశ్వామిత్ర సృష్టి సెట్స్ లో చాలా భాగం సహజంగా లేవు. నాటకాల్లో, పాత కాలపు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో పరిసర వాతావరణాన్ని సృష్టించడానికి గుడ్డ మీద వేసిన బొమ్మలను వాడినట్లుగా ఉంది.
పైగా, కెమేరా కంటి (ప్రేక్షకుడి) దృక్కోణానికి కానీ, సన్నివేశంలోని పాత్రధారులు నిలబడిన తలానికి సారూప్యంగా కానీ, వారి కదలికలకు తగ్గట్లుగా కానీ ఈ బ్లూ మ్యాట్ ద్వారా సృష్టించిన గ్రాఫిక్ సెట్లు లేవు. ఒకరకంగా ఇవి ఆధునిక సాంకేతికతలోనూ మనం ఇంకా ఆటవిక యుగంలోనే ఉన్నామని చెప్పకనే చెబుతాయి.
ఇక, అయోధ్యలోని రాజమందిర అంతర్భాగంలోని సూర్య భగవానుడి భారీ విగ్రహం మనవాళ్ళ అరకొర గ్రాఫిక్స్ లో మెల్లకన్నుతో సాక్షాత్కరిస్తుంది. పైగా, సినిమాలో ఓ సన్నివేశంలో దాన్ని మిడ్ క్లోజప్పులో చూపేసరికి, హాలులో ప్రేక్షక జనం హాహాకారం చేయడం ఒక్కటే తక్కువ. ఆ మందిరంలో రాముడి పూర్వీకులైన రఘువంశ రాజుల విగ్రహాలూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒక్క విగ్రహం మాత్రం చేతిలో ధనుస్సుతో 'సత్య హరిశ్చంద్ర' సినిమాలోని పెద్ద ఎన్టీయార్ పోలికలతో చూడగానే, గుర్తుపట్టేలా ఉంటుంది.
జంతు సంక్షేమ మండలి కఠిన నిబంధనలైతేనేం, ఈ రోజుల్లో పెరిగిన ఖర్చు వల్ల అయితేనేం ఈ సినిమాలో వాల్మీకి ఆశ్రమంలో కనిపించే లేళ్ళు, జింకలు, నెమళ్ళు వగైరాలన్నీ గ్రాఫిక్స్ సృష్టే. అయితే, వాటిని సరిగా దృశ్యంలో అతకకపోవడంతో, జింకల పక్కనే, వాటి కొమ్ముల మధ్య నుంచి పాత్రధారులు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇక్కడ కూడా కంప్యూటర్ సృష్టికీ, కెమేరా కంటితో పాత్రధారుల మీద తీసిన దృశ్యానికీ పర్ స్పెక్టివ్ లో తేడా తెలుస్తుంటుంది. రథంలో లక్ష్మణుడు, సీతను అడవికి తీసుకువెళ్ళే దృశ్యంలో వచ్చే టాప్ యాంగిల్ షాట్లకూ ఇదే తంటా వచ్చింది.
కెమేరాతోనూ కొరవడిన తృప్తిఇటీవల కాలంలో బాపు చిత్రాలు, ‘శ్రీభాగవతం’ సీరియల్ కు పనిచేసిన సీనియర్ టెక్నీషియన్ పి.ఆర్.కె. రాజు గారే ఈ చిత్రానికీ ఛాయాగ్రాహకులు. పాత్రధారులను చూపిన తీరు, లైటింగ్ వగైరాల్లో కెమేరా పనితనం బాగుందనిపిస్తుంది. బాపు మార్కు క్లోజప్పులు సరే సరి. కానీ, ఇద్దరు పాత్రధారుల మధ్య సాగే సంవాదాల లాంటి దృశ్యాల్లో కెమేరా తేలిపోయింది.
పాత్రధారుల్లో ఒకరు కెమేరాకు దగ్గరగా ముందు, వేరొకరు కెమేరాకు కాస్త దూరంగా వెనుక ఉన్నప్పుడు కెమేరాను స్థిరంగా ఉంచి, డైలాగు చెబుతున్న పాత్రధారి మీదకు లెన్సును ఫోకస్ పెట్టడం సాధారణంగా ఆనవాయితీ. డైలాగు చెప్పే అతను ఫోకస్ లో, డైలాగు లేని రెండో పాత్రధారి అవుటాఫ్ ఫోకస్ లో ఒకే ఫ్రేములో కనిపించడం మనం సినిమాల్లో చూస్తుంటాం. కెమేరా కదలకుండా ఉంటూనే, డైలాగు చెప్పే పాత్రధారి మారినప్పుడల్లా ఆ పాత్ర మీదకు ఫోకస్ మాత్రం మారుతూ వస్తుంది. ఈ ప్రాథమికమైన పద్ధతిని పాటించకుండా, కెమేరాతో పాటు ఫోకస్ ను కూడా కదపకుండా అలాగే ఉంచేసిన దృశ్యాలు 'శ్రీరామరాజ్యం'లో కొన్నిచోట్ల కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. దాంతో, కొన్నిసార్లు డైలాగు చెబుతున్న పాత్రధారి అవుటాఫ్ ఫోకస్ లో ఉంటాడు. అందుకే, ఇంతటి బ్రహ్మాండమైన నిర్మాణ విలువలున్న భారీ బడ్జెట్ సినిమాలోనూ, ఈ లోపాలు ప్రేక్షకుడికి రసభంగం కలిగిస్తాయి. తెలియని అసంతృప్తిని కలిగిస్తాయి.
నిజాయితీ, నిర్మాణ విలువలే శ్రీరామరక్ష78 ఏళ్ళ వయసులోనూ దర్శకుడిగా బాపు తన మార్కు చూపడానికి తపించారు. ప్రతి ఫ్రేమునూ సౌందర్యభరితంగా చూపాలని ప్రయత్నించారు. తనకు మాత్రమే ప్రత్యేకమైన ఫ్రేములతో దృశ్యాలను కన్నులపండుగ చేశారు. నేటి తరాన్ని దృష్టిలో ఉంచుకొని ముళ్ళపూడి వెంకట రమణ సామాన్య జనభాషలో రచన చేశారు. ఒకటి, రెండు చోట్ల తన కలంలో మెరుపులూ మెరిపించారు.
కానీ, కథను తెరపై నడిపిన తీరులో, అందుకు ఎంచుకున్న ఘట్టాల్లో క్రమానుగత పరిణామం, రసావిష్కరణకు ప్రాతిపదిక, ఆ దిశగా ప్రయాణం, తుది ఫలితం సమగ్ర రూపం ధరించలేదు. ఈ కథ మొత్తాన్నీ సింహావలోకనం చేస్తే - కథలోని పాత్రలకు ఎదురయ్యే సమస్యకు మూలం - సీతపై లోకనింద. దానికి వెరచిన రాముడి ప్రతిస్పందన ఏమిటంటే - సీతాపరిత్యాగం. అంటే ఆ యాక్షన్ కు రాముడి రియాక్షన్ అది. దాని పర్యవసానం - భార్యాభర్తల వియోగం, రాముడికీ, సీతకూ మానసిక సంఘర్షణ. ఈ చిక్కుముడిని విడదీసే ముగింపు - రాముడు, లవకుశులు తమ బాంధవ్యం తెలుసుకొని కలుసుకోవడం.
స్క్రిప్టుకు ప్రధానమైన ఈ అంశాల్లో రాముడి మానసిక సంఘర్షణ, భర్తృ వియోగ బాధతో సీతా సాధ్వి వేదన, తల్లితండ్రులు అని తెలియకుండానే శ్రీరాముడి మీద, సీతమ్మ మీద లవకుశులు గౌరవ అనురాగాలు పెంచుకోవడం, రాముడు సీతమ్మను కారడవుల పాలు చేశాడని తెలిసి సాక్షాత్తూ ఆయననే తిరస్కరించడం లాంటివి ఎంత బాగా ఎలివేట్ అయితే, తెరపై కథ అంత బాగా పండుతుంది. దానికి బాల లవకుశుల చేష్టలతో అద్భుత, హాస్య రసాలు కూడా తగు పాళ్ళలో చేరిస్తే మరింత బాగుంటుంది. కానీ, ఈ చిత్రంలో అవన్నీ దేనికవిగా మిగిలాయి. కలసికట్టుగా కుదరలేదు. పైగా, మామూలు ఘట్టాలుగానే వచ్చాయి తప్ప, మనస్సును ఆర్ద్రపరిచే అనుభవాలుగా మారలేదు.
సినిమా అనేది నటీనటులు, సాంకేతిక నిపుణుల సమష్టి కృషి అయిన సమాహార కళ కావడంతో ఏ విభాగంలోని ఏ చిన్న లోపమైనా, ఇతర విభాగాలపై ప్రభావం చూపుతుంది. అది అనివార్యం. 'శ్రీరామరాజ్యం'కూ అదే జరిగింది. ఇంతటి ప్రచార ఆర్భాటంలోనూ, దేవతా వస్త్రాల కథలో లాగా అందరి ఆహా ఓహోల మధ్యలోనూ సినిమాకు ప్రేక్షకులూ, వసూళ్ళూ తక్కువగా ఉండడానికి కారణం అదే.
ఈ సినిమాకు సంబంధించి మారు మాట్లాడకుండా మెచ్చుకోవాల్సింది మాత్రం - నిర్మాతనే. లాభనష్టాల ధ్యాస లేకుండా, ఈ కథను ఈ తరం వారికి అందించాలన్న ఆయన కృత నిశ్చయానికి జోహార్లు. అందుకోసం ఆయన సర్వశక్తులూ కేంద్రీకరించి చేసిన వ్యయం సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. ఈ పౌరాణిక చిత్రం ఈ రోజుల్లో ప్రతి ఫ్రేములో ఇంత రిచ్ గా కనబడడానికి ఆయనే కారణం. యూనిట్ ను నమ్మి ఆయన పెట్టిన ప్రతి పైసానూ తెర మీద కళకళలాడే దృశ్యాల్లో చూడవచ్చు. కరెన్సీ కట్టల కోసమే సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో ఇప్పటి తరం కోసం, ఇలాంటి చిత్రం తీయాలనే ఈ రకం నిర్మాత ఉండడమే పెద్ద విచిత్రం, విశేషం. తమ ఊళ్ళోని ఆలయంలో వెలసిన శ్రీరామచంద్రుణ్ణి నమ్ముకొని ఆయన ఇంత సాహసం చేశారు. ఆ భక్తి శ్రద్ధలూ, నిజాయితీలే ఆయనకూ, ఈ సినిమాకూ శ్రీరామరక్ష. ఆయన కోసమైతే ఈ సినిమా అందరం తప్పనిసరిగా చూడాల్సిందే. ఉత్తర రామాయణ గాథను బాపు - రమణల బాణీలో ఈ తరం పిల్లలకూ చూపాల్సిందే.
కొసమెరుపు --పౌరాణిక చిత్రాలతో ఇంటింటా దేవుడిగా వెలిసిన పెద్ద ఎన్.టి.ఆర్.కు నిజజీవితంలో వీపు మీద ఎడమవైపున చింతగింజంత పుట్టుమచ్చ ఉంటుంది. ఆయన సినిమాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంటుంది. గమ్మత్తేమిటంటే, ఆయన కుమారుడైన బాలకృష్ణకు ఈ సినిమాలో కావాలని వీపు మీద పెట్టుడు పుట్టుమచ్చను మేకప్ లో సృష్టించారు. అయినా వారసత్వ హీరోల వెర్రి కానీ, ఈ పెట్టుమచ్చలతో పెద్దాయనను అనుకరించే కన్నా, ఆ అనుకరణేదో ఇలాంటి పాత్రపోషణ సందర్భంలో ఆయన పాటించే నియమాలు, చేసే కఠోర పరిశ్రమలో ఉండి ఉంటే, ఈ ముదురు రాముడు కూడా తెరపై మరింత అందంగా ఉండేవాడేమో...!?
అన్నట్లు, 'శ్రీరామరాజ్యం' చిత్ర నిర్మాణం మొదలైనప్పుడు ఈ సినిమాలో భరతుడి పాత్ర సాయికుమార్ పోషిస్తున్నట్లు దర్శక, నిర్మాతలు చెప్పారు. తీరా ఏమైందో కానీ, సినిమా విడుదలయ్యాక తెర మీద మాత్రం భరతుడి పాత్రలో నటుడు సమీర్ కనిపించారు. అయితే, ఈ సినిమా గురించి టీవీల్లో, పేపర్లలో, ఇంటర్నెట్ లో విపరీతమైన హడావిడి చేస్తున్న మీడియాలో కొందరు సినిమా విడుదల రోజు దాకా భరతుడిగా సాయికుమార్ అని రాస్తూ వచ్చారు. అంతే కాదు, తీరా సినిమా విడుదలయ్యాక కూడా ఇప్పటికీ భరతుడిగా సాయికుమార్ నటించినట్లు రాస్తూనే ఉండడం చిత్రాతిచిత్రం. విడుదలకు ముందు వివరాలు కనుక్కొని రాయకపోతే మానె, కనీసం విడుదలై కళ్ళారా సినిమా చూశాకైనా తప్పు దిద్దుకోకపోతే.... ఇంకేమనాలి..!?
రామ......! రామ.....!