జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, November 27, 2011

రామరాజ్యమంటే ఇదా...!?(‘శ్రీరామరాజ్యం’సినిమా సమీక్ష - పార్ట్ 1)

ఆఫీసు పని ఒత్తిళ్ళ వల్లనైతేనేం, ఆరోగ్య కారణాల వల్లనైతేనేం, వ్యక్తిగత సమయాభావం వల్లనైతేనేం, ఇటీవల సినిమాలకు వెళ్ళడం అనివార్యంగా తగ్గింది. కానీ, చాలా ఏళ్ళ తరువాత వస్తున్న పౌరాణికం, బాపు గారి దర్శకత్వం, బాలకృష్ణ శ్రీరామపాత్రపోషణ అనేసరికి మనసు పీకింది. ‘శ్రీరామరాజ్యం’సినిమాకు ఇవాళ ఆదరా బాదరాగా వెళ్ళింది అందుకే. అయితే, అంచనాలు ఎక్కువగా పెట్టుకొని వెళితే, ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా నాకు మరోసారి రుచి చూపించింది.

సినిమాకు వెళ్ళకముందే సాయంత్రం ఓ మిత్రుడి ఫోన్. సినిమా కన్నుల పండుగ అని చెప్పాడు. మరో మిత్రుడు ఫోన్ చేసి, సినిమాకు టాక్ - ఆంధ్రాలో సూపర్. అమెరికాలో అయితే మరీ సూపర్ డూపర్ అన్నాడు. అంతే, ఇనుమడించిన ఉత్సాహంతో ఆఖరి నిమిషంలో టికెట్లు ఎలాగోలా కొనుక్కుని వెళ్ళాను. అంతకు ముందు ‘‘ రాము గాక రాము‘‘ అని భీష్మించుకున్న కొందరు మిత్రులు కూడా, ఈ పాజిటివ్ ఫీడ్ బ్యాక్, టాక్ విని, ఉత్సాహపడ్డారు. అంతా కలసి వెళ్ళాం.

కానీ, ఆఖరికి అనుకున్నదే అయింది. సినిమా ఎందుకో అందరూ చెబుతున్నంత ఆహా, ఓహోగా అనిపించలేదు. అదే సమయంలో, సినిమా తయారీలో ఉండగా బాలకృష్ణ, నయనతార, తదితరుల గురించి వ్యక్తం చేసిన నెగటివ్ కామెంట్లంత నాసిగానూ లేదు. అయితే, ‘శ్రీరామరాజ్యం’ అన్న టైటిల్ కూ, ఈ సినిమా కథకూ సంబంధం చాలా తక్కువ. ఆ టైటిల్ పెట్టడం వెనుక ఉన్న భావమేమిటో సినిమాలో ఎక్కడా స్పష్టం కాదు.

రామరాజ్యమంటే ఎలా ఉండేదో, రామరాజ్యాన్ని ఇవాళ్టికీ ఎందుకు ఆదర్శంగా చెప్పుకుంటారో అన్న విషయాలు సినిమాలో చూపలేదు. పట్టాభిషేక సమయంలో కిరీటధారి రాముడిగా బాలకృష్ణ నోట నాలుగు పొలిటికల్ డైలాగుల ఉపన్యాసంలో పొడిపొడి మాటలు మాత్రం వినిపిస్తారు.

ఒక కథ - మూడు సినిమాలు

ఉత్తరరామాయణ కథ తెలుగు తెరకు కొత్త కాదు. దేవకీ బోస్ దర్శకత్వంలో తీసిన హిందీ ‘సీత’ (1934)ఆధారంగా, ఆ సెట్లు, ఆభరణాలు ఆసరాగా చేసుకొని సి. పుల్లయ్య దర్శకత్వంలో అదే నిర్మాతలు ఈస్టిండియా వారు తెలుగులో ‘లవకుశ’ (1934) నిర్మించారు. అది మొదటిది. గ్రామీణ జనం బళ్ళు కట్టుకొని మరీ పట్నానికి వచ్చి, సినిమా చూసిన సినిమా అది. అప్పుడప్పుడే మూకీల నుంచి టాకీలకు మళ్ళుతున్న తెలుగు నాట సినిమా హాళ్ళు తీర్థప్రజతో నిండిన తొలి చిత్రం దాదాపు అదే. అప్పటి దాకా మూగ చిత్రాలను ప్రదర్శిస్తున్న హాళ్ళు చకచకా టాకీ ఎక్విప్మెంట్ ను బిగించుకున్నదీ ఈ సినిమా అపూర్వ విజయ పర్యవసానమే.

ఆ సినిమా మన తండ్రులు, తాతల తరమే తప్ప మనం చూడలేదు. ఆ సినిమా వీడియో కూడా అలభ్యం. ఇక, మన మనస్సుల్లో చెరగని ముద్ర వేసిందల్లా ఆ తరువాత , అదే సి. పుల్లయ్య గారి దర్శకత్వంలో మొదలై, ఆయన కుమారుడు సి.ఎస్. రావు నిర్దేశకత్వంలో పూర్తయిన లలితా శివజ్యోతి వారి ‘లవకుశ’ చిత్రం (1963). సీతారాములుగా అంజలీదేవి, ఎన్టీయార్ నటించిన ఆ చిత్రం ఏ రకంగా చూసినా ఓ క్లాసిక్. పట్టుగా నడిచే స్క్రీన్ ప్లే, సదాశివబ్రహ్మం రచన, పాత్రధారుల అభినయం, మరీ ముఖ్యంగా ఘంటసాల సంగీతం, పి.లీల - సుశీల లాంటి గంధర్వ గాయనీమణుల అద్భుత గానవైదుష్యం, వీటన్నిటినీ సమస్థాయిలో నడిపిన దర్శకత్వ ప్రతిభ - ఇలా అన్నీ ఒకదానితో మరొకటి పోటీపడుతూ ఆ సినిమాను అజరామరం చేశాయి.


ఆ ‘లవకుశ’ ఓ చరిత్ర

వసూళ్ళలోనూ, చూసిన ప్రేక్షకుల సంఖ్యలోనూ ఎన్టీయార్ ‘లవకుశ’ చిత్రానిది ఓ చరిత్ర. అప్పటి దాకా తెలుగులో ఏ సినిమాకూ అత్యధికంగా రూ. 25 లక్షలు మించి వసూళ్ళు రాలేదు. కానీ, ‘లవకుశ’ చిత్రం వసూళ్ళు ఏకంగా కోటి రూపాయలు దాటాయి. సినిమా హాళ్ళలో అమ్మిన టికెట్ల ఆధారంగా లెక్కవేస్తే, అంతకు మునుపెన్నడూ ఏ సినిమానూ చూడనంత మంది ఆ సినిమాను చూశారు. చుట్టుపక్కలి గ్రామాల వారందరూ సమీపంలోని పట్టణ సినీ కేంద్రానికి వెళ్ళి సినిమా చూడాల్సిన ఆ 1960ల ప్రథమార్ధంలో, దాదాపు ప్రతి రిలీజు కేంద్రంలోనూ ఆ ఊరి జనాభా కన్నా నాలుగైదు రెట్లు ఎక్కువ మంది ఎన్టీయార్ ‘లవకుశ’ చిత్రం చూశారు. అప్పట్లో వరంగల్ కేంద్రం గురించి వచ్చిన ప్రకటనే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. 1963లో వచ్చిన ఆ చిత్రం ఆ తరువాతెప్పుడో పుట్టిన 1970లు, 1980ల నాటి తరానికి కూడా సుపరిచితమైనదే. అంటే, ఆ సినిమా మళ్ళీ మళ్ళీ హాళ్ళలో విడుదలై, ఎన్ని రోజులు ఆడిందో, ఎంతెంత మందిని ఆకర్షించిందో, ఆ రిపీట్ రన్లలో ఇంకెంత వసూలు చేసిందో ఊహించుకోవచ్చు. ఆ రకంగా తెలుగు సినీ చరిత్రలో అత్యధిక కాలం ఆడిన సినిమాగా ‘లవకుశ’ను పేర్కొన్నా తప్పు లేదు. అలాంటి చిత్రకథను మళ్ళీ తెరకెక్కించడం సాహసమే అయినా, ‘‘శ్రీరామరాజ్యం’’ యూనిట్ అందుకు సిద్ధపడింది.

ఇప్పుడు యలమంచిలి సాయిబాబు నిర్మాతగా, బాలకృష్ణతో బాపు - రమణల ‘‘శ్రీరామరాజ్యం’’ ముచ్చటగా మూడోది. తెలుగు రంగస్థలం మీద, సినీ లోకంలో ‘లవకుశ’గా ప్రసిద్ధమైన ఉత్తర రామాయణ కథను తెరకెక్కిస్తూ, ఆ పేరు పెట్టకపోవడంలోనే జంకు తెలుస్తోంది. కానీ, పోల్చిచూడడాలు అనివార్యమని వారికీ తెలుసు. అయితే, కొత్త పేరు పెట్టినా ఆ పేరుకు న్యాయం చేయలేకపోయారు. (ఈ పేరు కూడా 1943లో హిందీ, మరాఠీల్లో విజయ్ భట్ దర్శకత్వంలో వచ్చిన మ్యూజికల్ హిట్ ‘రామ్ రాజ్య’ పేరు నుంచి అరువు తెచ్చుకున్నదే. అదీ లవకుశుల కథే). ఇంకా చెప్పాలంటే, గొప్పగా చెప్పుకొనే రామరాజ్యంలో జరిగింది ఇదా అని అనుమానపడేలా చేశారు.

పాత కథకు కొత్త మార్పులు

పధ్నాలుగేళ్ళ అరణ్యవాసం, రావణ సంహారం తరువాత సీతా లక్ష్మణ హనుమత్ సమేతుడై వానర ప్రముఖులు తోడు రాగా రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు చేరడం, పట్టాభిషిక్తుడు కావడం, సీతాదేవి గర్భవతి కావడం, లోకనిందకు వెరచి సీతా సాధ్విని రామచంద్రుడు అడవిలో వదిలి రమ్మనడం, లక్ష్మణుడు అన్న ఆజ్ఞను శిరసావహించడం, వాల్మీకి ఆశ్రమంలో సీతాదేవి ఆశ్రయం పొందడం, లవకుశుల జననం, విద్యాబుద్ధులు నేర్వడం, వారి రామాయణ కథా గానం, రాముడి అశ్వమేథ యాగం, అశ్వాన్ని లవకుశులు బంధించడం, తండ్రితోనే యుద్ధానికి తలపడడం, ఆఖరికి అసలు విషయం తెలియడం, సీతాదేవి భూమాత ఒడిలో చేరడం, లవకుశులకు పట్టాభిషేకం చేసి, రాముడి అవతార సమాప్తి - ఇదీ స్థూలంగా కథ.

నిజానికి, అందరికీ తెలిసిన, తెరపై చూసేసిన కథను మరోసారి చెప్పదలిచినప్పుడు ఇబ్బందే. అయితే, చెబుతున్నది సెల్ ఫోన్లు, సోషల్ నెట్ వర్క్ సైట్ల నవతరానికి, పౌరాణిక చిత్రాల పొడ తెలియని యువతరానికి కాబట్టి, ఈ చిత్ర రచయిత ముళ్ళపూడి వెంకట రమణ భాష, భావం వీలైనంత సరళంగా ఉండేలా చూశారు. (పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు కూడా ఆ బాటలోనే నడిచారు). వాల్మీకి ఆశ్రమంలో సీతా సాధ్వి సేవ కోసం బాల హనుమంతుణ్ణి బాలరాజు పాత్రగా ప్రవేశపెట్టి మూలంలో లేని మార్పు చేశారు ముళ్ళపూడి. తద్వారా కథాగమనంలో కొత్తదనం కోసం కృషి చేశారు. ఆ మార్పు బాగున్నా, దాన్ని సమర్థంగా స్క్రిప్టులో వాడుకోలేకపోయారు. ఆ కొత్త పాత్రతో ప్రధాన రసానికి పరిపోషకంగా హాస్య, అద్భుత, కరుణ రసాలు వేటినీ పండించడానికి ప్రయత్నించనేలేదు.

అలాగే, సీతారాముల ప్రణయ సన్నివేశాల్లో బాపు - రమణల మార్కు కనబడుతుంది. మోతాదు మించనివ్వకపోయినా, రెగ్యులర్ కమర్షియల్ ప్రేమ సినిమాలు చాలకనా, ఆరాధ్యదేవతలైన సీతారాముల మధ్య ఇలాంటి ఘట్టాలు చూపెట్టాలా అని మొహం చిట్లించిన వాళ్ళూ లేకపోలేదు. సినిమాగా, కళాత్మక వ్యక్తీకరణగా మనం సరిపెట్టుకున్నా, మూతిముడుచుకున్న మహాభక్తుల ఆ సెంటిమెంట్ ను పూర్తిగా కొట్టిపారేయలేం.

ఇక, రాముల వారి ఏకపత్నీ వ్రతాన్నీ, పరాయి కాంతల నీడనైనా తాకని ఆయన నిష్ఠనూ తెలిపే సంఘటన సినిమాలో కొత్తగా ఉంది.

రాముడిగా అనూహ్యంగా బాలయ్య

ఉద్దేశపూర్వకంగానో, యాదృచ్ఛికంగానో, ‘శ్రీరామరాజ్యం’ అనే పేరు, హీరోల చుట్టూ తిరిగే సినీ పరిశ్రమ ధోరణికి తగ్గట్లుగా ఉన్నా, నిజానికి ఇది సీత కథ. అడవిలో వదిలి రమ్మని భర్తే ఆజ్ఞాపించడంతో ఆమెకు కలిగిన వ్యధ. అక్కడే అడవిలో పుట్టిన ఆమె పిల్లలు ఆఖరికి తండ్రిని చేరిన గాథ. అందుకే, సహజంగానే ఇందులో శ్రీరాముడి పాత్ర తెరపై ఆట్టే కనిపించదు. అయినా సరే, పౌరాణిక పాత్రల మీద మమకారం, తండ్రి పోషించిన పౌరాణికాలకు తెలుగు నాట తనదే పేటెంట్ అన్న నమ్మకంతో ఈ సినిమాలో బాలకృష్ణ నటించారు.

తండ్రి పోలికలే తప్ప, స్వరూప, స్వభావాల రీత్యా పెద్దాయనకు ఉన్న సానుకూలతలు కొన్ని లేకపోవడం బాలయ్యకు లోటే. అదుపులో లేని శరీరం చాలా సార్లు అడ్డొస్తూ, అర్థమై పోతూ ఉంటుంది. శాంత, శోక, కరుణ రసాన్వితమూర్తి అయిన ఉత్తర రామాయణ రాముడు అందుకు పూర్తి భిన్నంగా, ఎర్రటి కళ్ళతో రోజూ రాత్రి పొద్దుపోయే దాకా నిద్ర లేదని తెలిసిపోతుంటాడు. కరుణ రసపూరిత ఘట్టాల్లోనూ ఎర్రటి కళ్ళతో క్రోధావేశంతో ఉన్నాడేమో అనిపిస్తాడు.

అయినప్పటికీ, అనూహ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఊహించినదాని కన్నా చాలా బాగున్నారు. అదే పనిగా అలవాటైపోయిన ఆంగిక, వాచిక హావ భావ విన్యాసాలకు దూరంగా, నియంత్రితమైన నటనను కనబరచడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. డైలాగులే లేని కొన్ని దృశ్యాల్లో, ముఖ్యంగా వేగు భద్రుడు వచ్చి, లోకనిందను తెలిపిన సందర్భంలో మ్రాన్పడిపోవడం లాంటి చోట్ల దర్శకుడి ఆలోచనలు, సూచనలకు తగ్గట్లు క్లోజప్పుల్లో బాలకృష్ణ లీనమై నటించిన తీరు బాగుంది.

(తరువాయి భాగం మరికాసేపట్లో...)

9 వ్యాఖ్యలు: