జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, February 11, 2016

అందుకే ఇన్నాళ్లు గుర్తింపుతో ఉన్నాం - సీనియర్‌ నటి జమున




‘‘గడిచిన రోజులు ఎంతో మంచివి. హెచ.ఎమ్‌. రెడ్డి, బి.ఎన,రెడ్డి, కె.వి.రెడ్డి, తాతినేని ప్రకాశరావు వంటి దర్శకులు నాలాంటి వారిని నాయికలుగా తీర్చిదిద్ది, వైవిధ్యమైన పాత్రలిచ్చి ప్రొత్సహించారు కాబట్టే తెలుగు పరిశ్రమలో ఇన్నాళ్లు మంచి గుర్తింపుతో ఉండగలిగాం. అలనాటి దర్శకులను స్ఫూర్తిగా తీసుకుంటే ఇప్పుడొస్తున్న యువ దర్శకులు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు’’ అని సీనియర్‌ నటి జమున అన్నారు.

 తెలుగు సినిమా పుట్టినరోజు వేడుక కళామంజూష కల్చరల్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో జరిగింది. ఈ సందర్భంగా సీనియర్‌ నటీమణులు కృష్ణవేణి, జమున, గీతాంజలి, ప్రతాప్‌ ఆర్ట్స్‌ అధినేత కె. రాఘవ, గాయని రావు బాలసరస్వతి, రావి కొండలరావు, కాకరాల వెంకట సత్యనారాయణ, రెంటాల జయదేవలను జ్ఞాపికలతో సత్కరించారు. 

‘‘1935లో ‘సతీ అనసూయ’తో నన్ను బాలనటిగా పరిచయం చేసిన సి.పులయ్యగారిని ఎప్పటికీ మరువలేను. నటిగా, నిర్మాతగా సినీ పరిశ్రమలో నాకెన్నో మంచి అనుభవాలున్నాయి’’ అంటూ కృష్ణవేణి అలనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. 

‘‘చాలామంది మన సినిమా పుట్టినరోజును మరచిపోయాం అనుకుంటారు. పరిశ్రమకు చెందిన ఎవరొకరి జన్మదిన వేడుక ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. అలా చూస్తే నిత్యం తెలుగు పరిశ్రమ పుట్టినరోజు వేడుక జరుపుకుంటునట్లే’’ అని కోడి రామకృష్ణ అన్నారు. 

‘‘తెలుగు పరిశ్రమ స్థాయి ఎంతో పెరిగింది. మున్ముందు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’’ అని కె. రాఘవ తెలిపారు. 

ఎస్వీ కృష్ణారెడ్డి,, కె. అచ్చిరెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్‌, బాబ్జీ, రావిపల్లి రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





















(Published in 'Andhra Jyothy' daily, Cinema Page, 8th Feb 2016, Monday)
.................................

సిగ్గుపడాలా? గర్వపడాలా!? (తెలుగు సినిమా తల్లి జన్మదినోత్సవ వేడుకలు)




chitram...
మొట్టమొదటి తెలుగు టాకీ సినిమా భక్తప్రహ్లాద ప్రదర్శితమై 84 ఏళ్లయన సందర్భంలో పాత తరానికి చిరు సన్మానం. చిత్రంలో అచ్చిరెడ్డి, రాఘవ, రామారావు, జయదేవ, కృష్ణవేణమ్మ, రావు బాలసరస్వతి, జమున, గీతాంజలి, రావికొండలరావు


......................................










వందస్తుల ఆకాశ హార్మ్యానికైనా
-పునాది ఒక్కటే ఉంటుంది.
80 ఏళ్ల జీవిత ప్రయాణమైనా
-పుట్టుకనుంచే మొదలవుతుంది.
మనిషికైనా మహాక్రతువుకైనా.. విధ్వంసానికైనా వినోదాలకైనా -ఒక మొదలుంటుంది. అది తెలియకుండానే తెలుగు సినిమాకు 84 ఏళ్లు వచ్చేశాయి. పేగు తెంచుకున్న బిడ్డ -ప్రపంచంలోకి రాగానే ఆ అద్భుత ఘడియలను తడిమి తడిమి వెతుక్కుంటాం. ఎంతోమంది బిడ్డలకు జన్మనిచ్చి, కళాకారులుగా గుర్తింపునిచ్చిన తెలుగు సినీ కళామతల్లి -ఆవిర్భావ ఘడియల్ని మాత్రం చరిత్ర పేజీల్లో నిక్షిప్తం చేయలేకపోయాం. దాని నీడన బతికేస్తూనే -మొదలును నరికేసే ప్రయత్నం మాత్రం
దిగ్విజయంగా చేసేస్తున్నాం.

మంచో చెడో, తెలిసో తెలియకో, దొరికిన ఆధారాలు నిజమో కాదోనన్న శంకలు పెట్టుకోకుండా చిన్నదో పెద్దదో -్ఫబ్రవరి 6న హైదరాబాద్‌లో కొందరు ఔత్సాహికులు చిన్న మహత్కార్యం నిర్వహించారు. పొరుగు రాష్ట్రం రికార్డుల్లో నిక్షిప్తమైవున్న ‘్భక్త ప్రహ్లాద’ ప్రదర్శిత తేదీని గుర్తు చేసుకున్నారు. అదే తెలుగు సినిమా ‘డేట్ ఆఫ్ బర్త్’ అన్న ఆనవాళ్లను ఆనవాయితీ చేసే సదుద్దేశంతో -ఆనందంగా వేడుక జరుపుకున్నారు. పదేళ్ల ప్రయత్నంతో ఆ తేదీని ఒకరు వెలికితీస్తే, వందేళ్ల సినిమాకు ఇంత అన్యాయం చేశామా? అన్న సిగ్గుతో కొందరు కనీసం చిన్న పండగైనా చేశారు. అసలా తేదీని ఎవరు నిర్థారించారు? తెలుగు సినిమా జన్మదినంగా ఆ రోజునే ఎందుకు జరుపుకోవాలన్న -అనుమానాలు అక్కడెవరికీ రాలేదు. నిజానికి రాకూడదు కూడా. ఎందుకంటే -అసలు లేనిదానికంటే తెలిసిన తేదీని ‘సినిమా బర్త్ డే’ అనుకుని సెలబ్రేషన్ చేయడం ఉత్తమం కనుక.

ఇంతకాలం మూలాలను గాలికి వదిలేసుకున్నందుకు సిగ్గుపడాలా? ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని చిన్న ప్రయత్నంగా వెలికితీసిన ‘డేట్ ఆఫ్ బర్త్’ను అతి చిన్నగానైనా సెలబ్రేట్ చేసుకున్నందుకు గర్వపడాలా? అన్నది -సినిమాను నమ్ముకున్నోళ్ల, సినిమాను అమ్ముకుంటున్నోళ్ల, సినిమాను అభిమానించి ఆరాధించేవాళ్ల ఆత్మసాక్షిమీద ఆధారపడి ఉంటుంది.

ఎవరెస్ట్ ఎత్తాలనుకుంటే అత్యాశగానీ, ఎక్కాలనుకోవడంలో తప్పులేదుగా. నిన్న జరిగింది అలాంటి ప్రయత్నమే. తెలుగు సినిమాను ప్రత్యేకంగా ఉద్దరించాల్సిన పని లేదు. కనీసం -దాని పుట్టుకను గాలికొదిలేయకుండా నిక్షిప్తం చేసుకోవడం, పండుగ చేసుకోవడం మాత్రం చారిత్రక అవసరం. అందుకు -ఇచ్చకాలు చెప్పే గొప్ప స్టార్లు ఎంతవరకూ సహకరిస్తారో చూద్దాం.
ప్రపంచ సినిమా ప్రారంభమైనప్పుడే -తెలుగు సినిమా అంకురార్పణకు ఆలోచనా బీజం పడింది. మూకీ సినిమాగా ఆరంభమైంది. అయితే మూకీకి -్భషతో సంబంధం లేదు కనుక వాటిని విడిచిపెట్టాలి. మూకీ నుంచి మొదలైన అడుగులు టాకీకి చేరడంతో -తొలి తెలుగు టాకీ సినిమాగా భక్తప్రహ్లాద విడుదలైంది. నిజానికి ఆ సినిమా విడుదల రోజే -తెలుగు సినిమా డేట్ ఆఫ్ బర్త్. ఆ రోజు ఎప్పుడు? అన్నది కొనే్నళ్ల వరకూ అంతుచిక్కనిదే.
**

టాకీలు వచ్చిన తరువాత -సినిమా నిర్మాణంలో మునిగిపోయిన ముందుతరం చరిత్రను నమోదును చేయడం తెలుగు పరిశ్రమ మర్చిపోయింది. షూటింగ్‌ల్లో మునిగిపోయి గొప్ప చిత్రాలను రూపొందించారే తప్ప, చరిత్రను నిక్షిప్తం చేసుకోవాలన్న ఆలోచనకు రాలేకపోయారు. తొలి తెలుగు చిత్రం తొలిసారి తెరపై ఎప్పుడు ఆవిష్కృతమైందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఆ విషయాన్ని నిర్ధారించుకోడానికి 80ఏళ్లు పట్టింది. డేట్ ఆఫ్ బర్త్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి మరో నాలుగేళ్ల కాలం గడిచింది. తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద తెరపై తొలిసారి ఫిబ్రవరి 6, 1932లో ప్రదర్శించారన్న విషయాన్ని ఔత్సాహిక జర్నలిస్ట్ రెంటాల జయదేవ నాలుగేళ్ల క్రితమే నిరూపించాడు. అయినా పరిశ్రమ పెద్దలకు అదేమంత గొప్ప విషయం అనిపించలేదు. తెలుగు సినిమా తల్లి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోడానికి ఒక మొదలు దొరికిందన్న ఆనందం కలగలేదు.
**

సినిమా అనేది వినోదాన్ని పంచే వేడుక. స్వర్గయుగం నుంచీ ఎన్నో సినిమా వేడుకలు జరిగాయి. పరిశ్రమలోనూ, ప్రతి చిత్రంలోనూ, సినిమా విడుదలకు, వందరోజుల ప్రదర్శనకు.. ఇలా చిన్న కారణాలకూ పెద్ద వేడుకలే చేశారు. చేస్తూ వస్తున్నారు. ఆ వేడుకలు శృతిమించి స్టార్ హీరోల బర్త్‌డేలు, ఆడియో విడుదలలు, టీజర్లు, ఫస్ట్ పిక్ విడుదలలూ ఇలా వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు -స్టార్ హీరో సోషల్ మీడియా ఫాలోవర్స్ లక్షదాటినా, మేకోవర్ స్టిల్‌కు మిలియన్ లైకులొచ్చినా -పండుగలు చేస్తూనే ఉన్నారు. వీటన్నింటికీ మూలమైన -సినిమా పుట్టుకను మాత్రం పట్టించుకున్న వాళ్లు లేరు. బిడ్డ పుడితే జన్మనక్షత్రం, రాసిఫలం చూసుకుని ఉన్నతమైన భవిష్యత్ కోసం జాతకం రాయించుకుంటాంగానీ, -ఇంతమంది బిడ్డలకు కళా జన్మనిచ్చిన తెలుగు సినిమా పుట్టినరోజు జరుపుకోవడానికి తీరికలేనంత బిజీ అయిపోవడం నిజంగా దురదృష్టం. ఇప్పటి వరకూ పుట్టిన తేదీ తెలీదు కనుక జరపలేదు అనుకోవచ్చు, తెలిసిన తరువాతైనా ఏదీ పండుగ. ఎక్కడ వేడుక?
**
1932లో మాట్లాడే సినిమా మొదలైంది కనుక ఇప్పటికి 84 ఏళ్ల తెలుగు సినిమా అంటున్నాం. బాల్యం నుంచీ ఎయే దశలో ఏయే ఆనందం పొందుతామో -అలాగే తెలుగు సినిమా కూడా వనె్నచినె్నలు పోయి, దెబ్బలు తగిలించుకుని, ముళ్లనుదాటుకుని, కొన్ని సందర్భాల్లో పూలపై నడుస్తూ.. మొత్తానికి ఉన్నతమైన దశకు చేరకుంది. కష్టనష్టాలకు, సుఖానందాలకు నిలువెత్తు సాక్ష్యంగా ఇప్పటికీ -అప్పటి తరం నిలిచే ఉంది. వాళ్లను కదిలిస్తే కథలుగా చెప్తారు కూడా. కానీ కదిలించేది ఎవరు? చరిత్రను నిక్షిప్తం చేసేది ఎవరు?.
**
ఫిబ్రవరి 6, 2016.
పరిశ్రమను ప్రేమించే కొందరు వ్యక్తులు తెలుగు సినిమా తల్లి బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. కళామంజూష పేరిట ఏర్పాటు చేసిన సాంస్కృతి సంస్థ తరఫున దర్శకుడు బాబ్జీ, రామ్ రావిపల్లి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ లాంటివాళ్లు అందులో పాలుపంచుకున్నారు. నిజానికిది -చిరు ప్రయత్నమే. కానీ -తెలుగు సినిమా చరిత్రలోని మొదటి అంకాన్ని రికార్డు చేసుకోవాలన్న చారిత్రక అవసరాన్ని గుర్తు చేసే చేదు నిజం. తెలుగు సినిమా పుట్టుపూర్వోత్తరాల గురించి వచ్చే తరాలు తెలుసుకోవాలంటే -ఇప్పుడు మనం వాటిని రికార్డు చేసి తీరాలన్న సంకల్పం వాళ్లది. అదృష్టంకొద్దీ ఇప్పటికీవున్న అప్పటి ఉద్ధండ నటీనటులు, దర్శకులు చెప్పే విషయాలను భద్రపర్చాలన్న సంకల్పం వాళ్లది. అప్పటి చరిత్ర మూలాల్ని కనుక్కోడానికైనా -ఇలాంటి చిరు ప్రయత్నాలు మొదలెట్టాలన్న కర్తవ్యాన్ని గుర్తు చేసే వేడుకది.
**
అందాల కలల ప్రపంచానికి సంబంధించిన తొలి అడుగు కనుక్కున్నారన్నది ఇక్కడ ప్రధానం కాదు. కానీ- ఈ ప్రయత్నం నుంచే అనేక చారిత్రక కోణాలు తెలుసుకునే ద్వారాలు తెరుచుకుంటాయి. అప్పటి సినిమా నిర్మాణ విశేషాల చరిత్ర అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం తెలుగు సినిమా తొలి ప్రదర్శన తేదీని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ‘బర్త్ డే’గా నిర్వహించారు. ఇందులో తొలి నాళ్లల్లో కథానాయికగా నటించి, అనేక చిత్రాలను శోభనాచల స్టూడియో ద్వారా రూపొందించి అనేక మంది లెజెండ్స్‌ను పరిశ్రమకు పరిచయం చేసిన సి కృష్ణవేణి, తొలితరం నేపథ్యగాయని రావు బాలసరస్వతి, శతాధిక వృద్ధుడైనా ఇప్పటికీ మంచి కథ దొరికితే సినిమా తీస్తానంటున్న ప్రతాప్ ఆర్ట్స్ కె రాఘవతోపాటు అలనాటి నటీమణులు జమున, గీతాంజలి, నటులు కాకరాల, రావి కొండలరావు, కెఎస్ రావు లాంటి వాళ్ళను సత్కరించుకుని పండుగ చేసుకున్నారు. వాళ్ల అనుభవాలను తెలుసుకుని ఆనందించారు. ఈ ప్రయత్నం చల్లారిపోకుండా, తడారిపోకుండా సినీ పరిశ్రమలోని పెద్దలు నడుంకట్టాలి. అప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమకు సరైన రికార్డు లేదని బాధపడుతూ సిగ్గుపడే పరిస్థితికి ఫుల్‌స్టాప్ పెట్టినవాళ్లం అవుతాం. కేవలం తళుకు బెళుకు చిత్రాలు చూపడమే కాదు, పరిశ్రమ చరిత్రనూ చెప్పేవాళ్లం అవుతాం. ఎవరో ఒకరు పూనుకుంటారులే అనుకోకుండా -పరిశ్రమ మనకు అన్నం పెట్టిందన్న నిజమైన అభిమానం ఉన్న వాళ్లంతా తరువాతి ‘బర్త్‌డే’లు పెద్ద ఎత్తున నిర్వహించడానికి పూనుకోవాలి. మూడుపువ్వులు ఆరుకాయల చరిత్రను లిఖించే సంప్రదాయాన్ని శాశ్వతంగా కొనసాగించాలి.
..............................................
జాతకం ఎలా?

ఎంతో ఆనందాన్ని, వినోదాన్ని పంచే తెలుగు సినిమా ఇటీవలి కాలంలో ఎందుకు వెలవెలబోతోందన్న ప్రశ్న -ఓ ఔత్సాహిక వ్యక్తికి కలిగిందట. జాతకం చెప్పమని జ్యోతిష్యుడు దగ్గరకెళ్తే -అందుకు పుట్టిన తేదీ కావాలని కోరాడట. అధ్యయనాలు, అష్టకష్టాల తరువాత ఒక తేదీని నిర్థారించుకున్న ఆ వ్యక్తి -తెలుగు సినిమా పుట్టిన తేదీని మళ్లీ జ్యోతిష్యుడికి చూపించాడట. మీ పరిశ్రమలో సిఎం అయిన నటుడున్నాడా? అని ప్రశ్నించాడట జ్యోతిష్యుడు. ఉన్నాడని సమాధానమిచ్చాడు ఔత్సాహికుడు. తన పాటతో అలరించిన గంధర్వ గాయకుడు ఉన్నాడా? అన్న ప్రశ్నకు ఘంటశాల పేరు చెప్పాడట. పరిశ్రమకు అంతర్జాతీయఖ్యాతి తెచ్చిన రెండు కళ్లలాంటి నటులున్నారా? అన్న ప్రశ్నించాడట పుట్టిన రోజుతో జాతకాన్ని చూస్తూ జ్యోతిష్యుడు. ఎన్టీఆర్, ఎన్నాఆర్‌ల పేర్లు చెప్పాడట ఔత్సాహికుడు. అయితే, ఇదే మీ తెలుగు సినీ కళామతల్లి పుట్టిన రోజయ్యా! అంటూ నిర్థారించాడట జ్యోతిష్యుడు. ఆ రోజునే మనమిప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం.
-ఎస్వీ కృష్ణారెడ్డి
.................................
ఎగతాళితో ప్రేరణ
నేను చెన్నయ్‌లో ఉన్నప్పుడు ఓ తమిళ పాత్రికేయుడు చేసిన ఎగతాళి తెలుగు సినిమా బర్త్ డేట్‌ను కనుక్కోవడానికి ప్రేరణ అయ్యింది. అన్ని రకాల ఆధారాలతో తమిళ సినిమాకు చరిత్రవుంది, మీకు లేదా? అంటూ ఎగతాళిగా ప్రశ్నించినపుడు జవాబు కోసం వెతకడం ప్రారంభించాను. ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నయ్, ముంబయి ప్రాంతాల్లో తిరిగి పదేళ్లు చేసిన కృషికి -చిన్న ఫలితం దొరికింది. అది -తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాదను శ్రీ కృష్ణ ఫిలిమ్స్ పతాకంపై బొంబాయికి చెందిన నిర్మాతలు రూపొందించారు. ముంబయి గెజిట్‌లో విడుదల చేసిన సెన్సార్ సర్ట్ఫికెట్‌ను పరిశీలిస్తే -అది ఫిబ్రవరి 6, 1932న విడుదలైందని అర్థమైంది. ఆ తేదీనే తొలి తెలుగు సినిమా ప్రదర్శన తేదీగా పరిగణించాలి.

- రెంటాల జయదేవ్
...............................
ఆమే.. అన్నం పెట్టింది!
తొలి నాళ్లల్లో నేను శోభనాచల స్టూడియోలో రికార్డింగ్ అసిస్టెంట్‌గా ఉండేవాడిని. షూటింగ్ కోసం కృష్ణవేణమ్మ నృత్యాన్ని సాధన చేస్తూ, రికార్డు చేసిన పాటను ప్రొజెక్టర్‌లో వెనక్కితిప్పి మళ్లీ మళ్లీ వినిపించమనేవారు. ప్రొజెక్టర్‌ను వెనక్కు తిప్పి పాటను వినిపించేవాళ్లం. సాంకేతికంగా సౌలభ్యం లేకున్నా, అంత కష్టాన్ని అప్పట్లో భరిస్తూ నిబద్ధతగా సాధన చేసేవారు. మీర్జాపురం రాజావారు మాటిమాటికీ ప్రొజెక్టర్‌ను వెనక్కు తిప్పుతున్నానంటూ ఉద్యోగంలోనుంచి తీసేస్తానన్నారు. అప్పుడు కృష్ణవేణమ్మ నేను రిహార్సల్స్ చేస్తున్నందువల్ల మళ్లీ మళ్లీ ప్రొజెక్టర్‌ను వెనక్కు తిప్పి పాట పెట్టమన్నానని చెప్పడంతో నా ఉద్యోగం నిలబడింది. నాకు ప్రమోషన్ కూడా ఇచ్చారు. కళాకారులను బిడ్డల్లా చూసుకునే రోజులవి. అందుకే స్వర్ణయుగంగా ఇప్పటికీ భావిస్తుంటాం.
- కెఎస్ రావు
.....................................
థ్రిల్లింగ్‌గా వుంది

తెలుగు సినిమా పుట్టిన రోజు ఉత్సవంలో పాల్గొనడం థ్రిల్‌గా ఉంది. వేలంటైన్స్, హీరోల హ్యాపీ బర్త్‌డేలు సెలబ్రేట్ చేసుకుంటున్న మనకి సినిమా బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక డేట్ దొరికినందుకు గర్వించాలి. స్వర్ణయుగం సినీ కాలానికి ఆనవాళ్లుగా ఉన్న కృష్ణవేణమ్మ, జమున, గీతాంజలి వంటి వారిని సన్మానించుకోవడం మనల్ని మనం గౌరవించుకోడవమే.
- కాశీ విశ్వనాథ్

- Article written by Sarayu Sekhar
.......................................












































.......................................
...........................

తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు


తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు  [Held on 06-Feb-2016- Saturday at Prasad Labs, Hyderabad]

http://www.tv5news.in/newsdetails.aspx?ID=37622&SID=73&Title=Telugu%20cinema%20birthday%20celebrations


http://www.tv5news.in/WatchVideo.aspx?ID=37622&SID=73&Title=Telugu%20cinema%20birthday%20celebrations


(Telecasted in TV5 news channel on 7th Feb 2016, Sunday)
.............................................