జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, January 25, 2015

పేరడీ కామెడీలో సునామీ - ఎమ్మెస్

పేరడీ కామెడీలో సునామీ
హిట్టయిన పాత్రలు, నిజజీవిత మనుషులను వెండితెరపై అనుకరించడంలో అగ్రశ్రేణి నటుడు - ఎమ్మెస్. ఆ సినిమాలు ఇవాళ్టికీ టీవీ చానళ్ళలో వాటి ఒరిజినల్ హీరోలనూ, గెటప్‌లనూ గుర్తు చేస్తూ కామెడీ పండిస్తున్నాయి. ‘ఒట్టేసి చెబుతున్నా’లో ఫ్యాక్షన్ చిత్రాల హీరోలకు పేరడీగా రెడ్డినాయుడు (రెనా) పాత్రలో నవ్వించారు. ‘బాద్షా’లో హార్రర్ చిత్రాల రివెంజ్ నాగేశ్వరరావుగా ఒక ప్రముఖ దర్శకుణ్ణి గుర్తుకు తెస్తూ, పదే పదే ట్వీట్లు చేసే పాత్రను పండించారు.
‘దుబాయ్ శీను’లో నటుడు ఫైర్‌స్టార్ సాల్మన్‌రాజుగా నిన్నటి తరం అగ్రహీరో ఒకరిని అనుకరిస్తూ ఆయన చేసిన గోడ మీద పిడకల స్టెప్పు, డైలాగ్ మాడ్యులేషన్ తెగ నవ్వించాయి. ‘దూకుడు’లో పోషించిన బొక్కా వెంకటరత్నం పాత్ర రిపీట్ ఆడియన్స్‌ను రప్పించింది. దాంతో ఎమ్మెస్ పేరడీ కామెడీలో స్టార్ హీరో అయ్యారు.

...............................

నీ దూకుడు సాటెవ్వరూ..! ( నటుడు ఎమ్మెస్ నారాయణకు శ్రద్ధాంజలి!)

నీ దూకుడు సాటెవ్వరూ..!
‘ఈ నగరానికి ఏమైంది? ఒక వైపు నుసి... ఒక వైపు పొగ...’ తెలుగునాట థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసేవారందరికీ సుపరిచితమైన ధూమపాన వ్యతిరేక ప్రచార ప్రకటన ఇది. ఇప్పుడు ప్రేక్షకులతో పాటు తెలుగు సినీపరిశ్రమ వర్గీయులందరి మదినీ తొలిచివేస్తున్న ప్రశ్న - ‘ఈ చలనచిత్ర సీమకు ఏమైంది? దాదాపుగా వారానికి ఒకరుగా వెంట వెంటనే ఎంతోమంది ప్రముఖులను పోగొట్టుకుంటున్నాం’ అని! సంగీత దర్శకుడు  చక్రి , దర్శకుడు కె. బాలచందర్, రచయిత గణేశ్ పాత్రో, నటుడు ‘ఆహుతి’ ప్రసాద్, నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్... ఇప్పుడు నటుడు ఎమ్మెస్ నారాయణ... నిండా నెలరోజుల్లోనే ఆరుగురు ప్రముఖులు దూరమయ్యారు.
సంక్రాంతి సందర్భంగా సొంత ఊరు వెళ్ళి, అక్కడ తీవ్ర అనారోగ్యం పాలైన ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూయడంతో - ఈ చలనచిత్ర నగరానికి ఏ శాపం తగిలిందంటూ అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కెరీర్‌లోనే కాదు... ఆఖరికి  కన్నుమూయడంలోనూ తొందరపడి దూకుడు ప్రదర్శించిన ఎమ్మెస్ మరణంతో కామెడీ కన్నీళ్ళు పెడుతోంది.
 
‘‘నువ్వు హీరోవంటే ఎలా నమ్మావ్ రా కళ్ల కింద క్యారీ బ్యాగ్‌లు వేసుకుని’’ అని బ్రహ్మానందం అంటే ‘‘గ్రాఫిక్స్‌లో తీసేస్తారేమో అనుకున్నా’’అని అమాయకంగా చెప్పి, ‘దూకుడు’ చిత్రంలో కడుపుబ్బ నవ్వించిన  కామెడీ యాక్టర్ ఎమ్మెస్ నారాయణ ఉరఫ్ మైలవరపు సూర్యనారాయణ.

సమకాలీన నటుల్లో తాగుబోతు క్యారెక్టర్లకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన నటుడు ఎమ్మెస్ ఇలా తెరపై పూయించిన నవ్వులు ఎన్నో. ‘‘నిద్రపోయేటప్పుడే విశ్రాంతి తీసుకో... మెలకువగా ఉండి పడుకోవద్దు ’’ అని తండ్రి చెప్పిన సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్న ఒకప్పటి లెక్చరర్ సినీ రచయితగా ప్రారంభించి, నటుడిగా నిలదొక్కుకోవడానికి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 1951 ఏప్రిల్ 16న పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో పుట్టిన ఎమ్మెస్ వ్యవసాయ కుటుంబీకులు.
 
తెలుగంటే మక్కువ...
తెలుగంటే ఎంతో ఇష్టమున్న ఎమ్మెస్ ‘భాషా ప్రవీణ ’ కోర్సులో చేరారు. అది పాసయ్యాక దగ్గర్లోని ఊళ్లోని ఓ హైస్కూల్‌లో తెలుగు పండి ట్‌గా పనిచేశారు. చదువుకొనే రోజుల్లోనే 1971లో తమ కాలేజీ లెక్చరర్ పరుచూరి గోపాలకృష్ణ రాసిన ‘సోషలిజం’ అనే నాటకంలో కథానాయకుడిగా నటించారు. పెన్నుతోనూ ప్రాణాలు కాపాడవచ్చన్న ఒకే ఒక్క ఆశయంతో 1977నాటి  దివిసీమ ఉప్పెన  బాధితులను ఆదుకోవడానికి  ‘జీవచ్ఛవం’ అనే నాటిక రాసి, స్కూల్ పిల్లలతో వేయించారు.

అలా చందాలు పోగుచేసి తన వంతు సాయం చేసిన ఉదార మనస్తత్త్వం ఎమ్మెస్‌ది. ఆ తరువాత ఆయన భీమవరం కాలేజీలో లెక్చరర్‌గా చేశారు. అక్కడ విద్యార్థులతో వేయించిన నాటకాలకు ప్రైజులు కూడా రావడంతో మంచి పేరు వచ్చింది.  ‘‘మా నారాయణ మాస్టార్’’  అనిపించుకుని అభిమానానికి పాత్రుడయ్యారు.

భార్య ప్రోత్సాహంతో సినిమాల్లోకి....

ఉద్యోగం చేస్తుండగానే కథలు రాయడం మొదలుపెట్టారు. భార్య కళాప్రపూర్ణ ప్రోత్సాహంతో శనివారాలు సర్కారు ఎక్స్‌ప్రెస్ ఎక్కి మద్రాసు వెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు.  కానీ ఫలితం లేకపోయే సరికి ఉద్యోగానికి ‘లాస్ ఆఫ్ పే’ పెట్టి మద్రాసులోనే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ సమయంలోనే ‘పేకాట పాపారావు’, ‘హలో నీకు పెళ్లంట’,‘ ప్రయత్నం’, ‘అలెగ్జాండర్’ చిత్రాలకు కథలందించారు. ఎమ్మెస్ ఒకేరోజు ఏడుసార్లు కథ చెప్పిన రోజులున్నాయి.  
 
సీరియల్ రైటర్‌గా..
మేకప్‌మేన్ జాస్తి మాధవరావు టీవీ సీరియల్‌కు కథ రాసే అవకాశం వచ్చింది. వెంటనే ఒప్పుకొని ‘నారీమణిహారం’ పేరుతో స్త్రీ జీవితంలోని ముఖ్యఘట్టాలను 13 ఎపిసోడ్లుగా రాసి ఇచ్చారు. ఎమ్మెస్ ప్రతిభ చూసి ముచ్చటపడిన మాధవరావు ఆయనను నటుడు మురళీమోహన్‌కు పరిచయం చేశారు. ఆయన ఓ ఎపిపోడ్ కథ విని ఎమ్మెస్‌కు వెంటనే చాన్స్ ఇచ్చారు. కానీ అప్పుడే తండ్రి చనిపోవడం ఎమ్మెస్ జీవితంలో పెద్ద విషాదం.

తరువాత మళ్ళీ మద్రాసు వెళుతూ, రాత్రి సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో రాసుకున్న ‘సవ్యసాచి’ కథ మురళీమోహన్‌కి వినిపించారు. ‘అది బాగా నచ్చింది కానీ, ఇంత మంచి కథకు నేను సరిపోను’ అని మురళీమోహన్ వెనక్కు తగ్గారు. అది రవిరాజా పినిశెట్టి చేతుల్లోకి వెళ్లింది. కానీ రవిరాజా ‘చంటి’ సినిమాతో బిజీ కావడంతో ‘సవ్యసాచి’ తెరకెక్కలేదు.
 
రవిరాజా పరిచయంతో...
ఎమ్మెస్ కథలు చెప్పే విధానం నచ్చడంతో దర్శకుడు రవిరాజా పినిశెట్టి ఆయనలో మంచి నటుడు దాగున్నాడని పసిగట్టారు. ‘ఎమ్. ధర్మరాజు ఎంఏ’లో చెవిటి వాడి పాత్రతో తొలి అవకాశమిచ్చారు. కాలక్రమంలో హాస్యనటుడిగా, ముఖ్యంగా తాగుబోతు పాత్రలకూ, పేరడీ రోల్స్‌కూ మారుపేరుగా నిలిచారు. ఆయన కామెడీకి వరుసగా ఐదు సార్లు (‘మా నాన్నకు పెళ్లి’ (1997), ‘రామసక్కనోడు’ (1999), ‘సర్దుకుపోదాం రండి’ (2000), ‘శివమణి’’ (2003), ‘దూకుడు’ (2011) చిత్రాలకు) నంది అవార్డులు అందుకున్నారు.

‘దూకుడు’ చిత్రానికే ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. తాగుబోతు పాత్రలలో ఆయన నటించిన తీరు నిజంగా అద్భుతం. కెరీర్‌లోని 700కు పైగా చిత్రాల్లో సుమారు 200 సార్లు తాగుబోతు పాత్రలు పోషించి, ప్రతిసారీ మెప్పించారు. నవ్వించడమే కాక, గుండెలు పిండే పాత్రలతో కన్నీళ్లు కూడా పెట్టించారాయన. ‘పిల్ల జమిందార్’ చిత్రంలో తెలుగు మాస్టారు పాత్ర అందుకు ఒక మచ్చుతునక.
 
దర్శకుడిగా....
స్వయానా రచయిత, నటుడైన ఎమ్మెస్ దర్శకుడిగానూ ప్రయత్నించారు. ఏకైక కుమారుడు విక్రమ్ కుమార్ హీరోగా ‘కొడుకు’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం ఆయనను ఆర్థికంగా బాగా దెబ్బతీసింది. ఆ తరువాత శివాజీ నటించిన ‘భజంత్రీలు’ అనే మరో చిత్రానికీ దర్శకత్వం వహించారు. ఆయన కుమార్తె శశికిరణ్ సైతం ఇటీవలే ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ సినిమాతో దర్శకురాలయ్యారు.

పిల్లలు స్థిరపడాలంటూ చివరి వరకు ఆయన పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. అయితే, అలవాట్ల విషయంలో అజాగ్రత్త, ఆరోగ్యంపై చూపిన అశ్రద్ధ ఎమ్మెస్‌ను అర్ధంతరంగా 63 ఏళ్లకే మింగేశాయి. తెలుగు తెరపై నవ్వులు పూయించిన ఈ తెలుగు మాస్టారి హఠాన్మరణం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.
 
విచిత్రం ఏమిటంటే, ఎమ్మెస్ కన్నుమూసిన శుక్రవారం ఉదయమే విడుదలైన ‘పటాస్’ చిత్రంలోనూ ఆయన ఒక పేరడీ హీరోగా నటిస్తే, ఆయన కుమారుడు విక్రమ్ దర్శకుడిగా తండ్రితో కలిసి ఒక షాట్‌లో కనిపిస్తారు. ఆ చిత్రం క్లైమాక్స్‌లో ‘సునామీ స్టార్ సుభాష్’ పాత్రలో ఎమ్మెస్ నారాయణ యాదృచ్ఛికంగా చెప్పిన ఆఖరి డైలాగ్ కూడా ‘ఈ నగరానికి ఏమైంది?...’ అన్నదే! చనిపోయిన రోజు కూడా థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించిన ఆ హాస్య సంజీవికి చెమర్చిన కళ్ళతో శ్రద్ధాంజలి!

- రెంటాల జయదేవ 

(published in 'Sakhi' daily, 24th Jan 2015, Saturday)
........................................

అక్కినేనికి ‘నటసామ్రాట్’బిరుదు అలా ఇచ్చాం! - సీనియర్ జర్నలిస్ట్ తుర్లపాటి కుటుంబరావు

నేడు (22nd Jan 2015) అక్కినేని ప్రథమ వర్ధంతి

‘నటసామ్రాట్’బిరుదు అలా ఇచ్చాం!


 ఎంతలో తిరిగివచ్చింది ఏడాది! ‘నట సామ్రాట్’ అక్కినేని మనల్ని విడనాడి దివికేగి సంవత్సరమైందా? ఆయన మన మధ్య ఉన్నట్టు, ఇంకా హైదరాబాద్ రవీంద్రభారతిలో సభలో మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నదే! అందులోనూ ఆయన పార్థివ శరీరాన్ని చూడని నాకు ఆయన తన అభిమానులతో తన అనుభవాల గురించి ముచ్చటిస్తున్నట్టే అనిపిస్తున్నది! అక్కినేని నాగేశ్వరరావు జీవితం బహువిచిత్రమైనది. అదొక అద్భుత గాథ. వ్యక్తిత్వ వికాస విద్యార్థులకు ఆదర్శ పాఠ్యగ్రంథం!
 
 లేకపోతే, ఒక సాధారణ రైతు కుమారుడు అలభ్యమైన అప్పటి మద్రాసులో చిత్రజగత్తుకు వెళ్లడమేమిటి? అక్కడ హీరోలకు హీరో కావడమేమిటి? నాల్గవ తరగతి కూడా సరిగ్గా చదవని ఆ అబ్బాయి అమెరికా ప్రభుత్వం ఆహ్వానంపై అమెరికా వెళ్లడమా? చివరికి ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూషణ్’లు ఆయన నట జీవితాన్ని అలంకరించడమా? అందువల్లనే, అక్కినేనిది అద్భుత చరిత్ర; ఆయన బాల్య జీవితాన్ని పరిశీలిస్తే, ప్రపంచ ప్రఖ్యాతులైన పెక్కుమంది
 
 మహామహుల బాల్య జీవితంలో కానవచ్చే విశేషాలే కానవస్తాయి! తల్లిదండ్రులకు అక్కినేని కడగొట్టు సంతానం. పుట్టిన వారి వరుసలో ఆయన తొమ్మిదవవాడు! ఆయనకు ముందు పుట్టిన బేసి సంఖ్య పిల్లలు పోవడం వల్ల ఈ తొమ్మిదో వాడేం జీవిస్తాడని అందరూ ఆశ వదులుకున్నారు!
 
 గండాలమారి
 దానికి తగ్గట్టే ఆ పిల్లవాడికి మెడపై కణితి లేవడం ప్రారంభించింది! ఇంకేమున్నది? ఇక లాభం లేదని వైద్యం కూడా మానేశారు. కాని, ఆ గొంతు లక్షలాది ఆంధ్ర ప్రేక్షకుల హృదయాలను భవిష్యత్తులో ఉర్రూత లూగించడం విధి విలాసమైతే, ఆ కణితి ఏమి చేస్తుంది? మందు లేకుండానే అది మానిపోయింది! చిన్నప్పుడు ఆయనకు జలగండం, అగ్ని గండం తప్పాయి. గండాలన్నీ గడిచి అక్కినేని వారి అబ్బాయి గట్టెక్కాడు!
 
 పున్నమ్మ గారికి ఆడపిల్లలు లేరు. ఈ అబ్బాయినే అమ్మాయిగా చూసుకుని సంతోషించాలని అతనికి ఆడపిల్లవలె జడవేసేది, పరికిణీలు తొడిగేది! మరి, వేష భాషలే కదా మనిషిని మార్చివేసేది! అమ్మాయి వేషం వేసే సరికి అబ్బాయి గారికి అమ్మాయిల వలె కులకడం, నడవడం అలవాటయింది. అందువల్ల, నాటకాలలో ఆడ వేషాలు వేయడం నాగేశ్వరరావుకు చిన్నప్పుడే అబ్బింది! తల్లి ఆరోగ్యం సరిగా లేనందున, ఆమెకు వంట, మిగిలిన ఇంటి పని చేసిపెట్టి, బడికి వెళ్లి చదువుకుంటూ, అది అయిన తరువాత మైలు దూరంలో ఉన్న నాటకాల రిహార్సల్ స్థలానికి వెళ్లేవాడు. ఆయన ఆడవేషం, ఆ తళుకు, ఆ బెళుకు, ఆ కులుకు చూసి కొందరు ఆ పాత్రధారి నిజంగా అమ్మాయే అనుకునేవారట! అప్పుడు ఆయన పారితోషికం మూడు రూపాయలు!
 
 ఒకసారి తెనాలిలో నాటకం వేసి, విజయవాడ మీదుగా గుడివాడ వెళదామని విజయవాడ రైలు స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తున్న నాగేశ్వరరావును ‘ప్రతిభా పిక్చర్స్’ ఘంటసాల బలరామయ్య చూశారు! అప్పుడు తాను తీస్తున్న ‘శ్రీ సీతారామ జననం’లో శ్రీరాముడు వేషానికి ఈ కుర్రవాడు సరిపోయేట్టు ఉన్నాడని భావించి, అక్కినేని అన్నగారితో మాట్లాడి, ఆ తరువాత ఆ ఆడపాత్రధారి చేత తన చిత్రంలో మొదటిసారిగా మగ పాత్రను వేయించారు! అక్కడి నుంచి అక్కినేని వెనుదిరిగి చూడలేదు. ఇది 1944 నాటి మాట. అప్పటికి నాగేశ్వరరావు వయస్సు 19 సంవత్సరాలు. ఇక అప్పటి జానపద చిత్రాల యుగంలో ఈ నవ యువకుడే అమ్మాయిల కలల రాకుమారుడు! అలా ఆనాటి జానపద చిత్రాలలో నాగేశ్వరరావు ‘హీరో నాగేశ్వరరావు’ అయ్యాడు!

 
 అక్కినేని ‘దేవదాసు’కు అర్హుడా?
 1952లో వినోదా పిక్చర్స్ వారు బెంగాలీ నవల ‘దేవదాసు’ను తెలుగులో చిత్రించదలచి అక్కినేనిని కథానాయకుడుగా నిర్ణయించి, ప్రకటించేసరికి చాలామందికి ఆశ్చర్యం కలిగింది! జానపద చిత్రాల రాకుమారుడు ఆ తాగుబోతు పాత్రకు ఏమి పనికి వస్తాడన్న విమర్శలు బయలుదేరాయి! అప్పటిలో - 1952లో - నేను ‘ప్రతిభ’ అనే తెలుగు వారపత్రికకు ఎడిటర్‌గా పని చేస్తున్నాను. ‘‘అక్కినేని దేవదాసు పాత్రకు అర్హుడా?’’ అన్న శీర్షికతో నేను నా పత్రికలో ఒక వ్యాసం రాశా. అది నాగేశ్వరరావు దృష్టికి వెళ్లింది! 1953లో ఆ చిత్రం విడుదలై, యావదాంధ్ర దేశంలో నాగేశ్వరరావు ‘దేవదాసు’ పాత్రను గురించి జనం వింతగా చర్చించుకుంటున్నారు. విజయవాడలో నాగేశ్వరరావుకు అప్పుడే సన్మానం జరిగింది. ఆ సన్మానానికి నేను కూడా వెళ్లాను. సభానంతరం అక్కినేని నా వద్దకు వచ్చి, ‘‘ఏమండీ! ‘దేవదాసు’ పాత్రకు నేను అర్హుడినా? అనర్హుడినా?’’ అని చిరునవ్వుతో అడిగేసరికి నేను కొంచెం బిడియంతో ‘‘హ్యాట్సాఫ్ టు యు’’ అని అభినందించేసరికి ఆయన ముఖంలో ఆనందం వెల్లివిరిసింది!
 
 అక్కినేనికి ముఖస్తుతి పనికిరాదు. సద్విమర్శనే ఆయన ఆహ్వానించేవారు. ‘దేవదాసు’కు తాను పనికిరానన్న విమర్శను పెద్ద సవాల్‌గా తీసుకుని, ఆ పాత్రలో మెప్పు పొందడానికి తాను అహోరాత్రులు తపనపడ్డానని ఆయన నాతో అన్నారు. ఆ తరువాత దాదాపు పది సంవత్సరాల అనంతరం నేను లక్నోలో ‘హిందీ సినీ లెజెండ్’ దిలీప్‌కుమార్‌ను కలుసుకున్నప్పుడు ఆయన ‘దేవదాసు’ పాత్రను అభినందించారు. ఆయనకు ‘ట్రాజెడీ కింగ్’ అని బిరుదు. ‘నా కంటే మీ నాగేశ్వరరావే బాగా నటించారు’’అని దిలీప్ అన్నారు.
 
 అలాగే ‘కన్నడ కంఠీరవ’ రాజ్‌కుమార్ కూడా అదే మాట అన్నారు. మొత్తం మీద ‘దేవదాసు’ పాత్రను సైడల్, బారువా, దిలీప్, షారుక్‌ఖాన్ మొదలైన మహానటులు ఎందరు పోషించినా, అక్కినేని ‘దేవదాసు’కు ఆయనే సాటి!ఆ తరువాత ఆయన నట జీవితంలో 60వ చిత్రం ‘దొంగల్లో దొర’ 1957 జూలై 19న విడుదలైంది. అది అక్కినేని నట జీవిత వజ్రోత్సవం. ఆ సందర్భంగా ఆయనను సినీ జీవితంలోకి పంపిన విజయవాడలో ఆయనకు భారీ ఎత్తున సన్మానాన్ని తలపెట్టాము. ఎలా సన్మానించాలన్న సమస్య వచ్చినప్పుడు అక్కినేనికి దీటైన సాంఘిక చిత్రాల హీరో లేడని, ఆయనకు ‘నటసామ్రాట్’ అన్ని బిరుదు అన్ని విధాల తగినదని నేను సూచించినప్పుడు ఆహ్వాన సంఘం వారు అంగీకరించారు.
 
 అక్కినేని ఎత్తిపొడుపు!
 1957లో ఆగస్టులో విజయవాడలో జరిగిన అక్కినేని సన్మాన సభలో ‘నటసామ్రాట్’ బిరుదు ఇస్తూ, సన్మాన పత్రం రాసిన నేనే దాన్ని చదివి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బెజవాడ గోపాలరెడ్డితో కలిసి, అక్కినేనికి సమర్పించగా, ఆయన ‘‘ ‘నేను నటసామ్రాట్’ బిరుదుకు తగినవాడినంటారా?’’ అంటూ నా వంకకు తిరిగి నవ్వుతూ అన్నారు. నవ్వడం నా వంతు, ఏమిటో తెలియక ఆశ్చర్యపోవడం గోపాలరెడ్డిగారి వంతు అయింది! ఆ తరువాత ఆయనకు ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూషణ్’ - ఎన్ని అవార్డులు వచ్చినా, ‘నట సామ్రాట్’కు చాలిన బిరుదు లేదని ఆయన చాలా సందర్భాల్లో అంటూ వచ్చారు.
 
 చివరికి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో అక్కినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నప్పుడు ఆయనను అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి కూడా ‘నటసామ్రాట్ నాగేశ్వరరావుజీ’ అని సంబోధించారు!ఔను! నటసామ్రాట్ అంటే నాగేశ్వరరావు! నాగేశ్వరరావు అంటే నటసామ్రాట్! అందువల్లనే, తనకు ఆ బిరుదు వచ్చి, 50 ఏళ్లు అయిన సందర్భంగా 2007లో అక్కినేని నన్ను హైదరాబాద్ ఆహ్వానించి, నాకు స్వర్ణకంకణం తొడిగారు! ‘నటసామ్రాట్’ అంటే అక్కినేనికి అంత ప్రియతమ బిరుదు!


తుర్లపాటి కుటుంబరావు

(సీనియర్ జర్నలిస్ట్)         

(Published in 'sakshi' daily, 22nd Jan 2015, Thursday)
...................................

Friday, January 23, 2015

అప్పుడాయన కళ్లెర్రజేసి ఉంటే...నా పరిస్థితి ఏమయ్యేదో! - రావి కొండలరావు


సినిమా ప్రపంచంలో పాత్ర పరంగా కాకుండా వ్యక్తిగతంగా కొందరు ఆలోచిస్తారు. ఒక పాత్ర ఇంకో పాత్రని దూషిస్తే రెండో పాత్రధారి, మొదటి పాత్రధారిని ఉద్దేశించి ‘‘అతనెవడు నన్ను తిట్టడానికి?’’ అని అడిగిన సందర్భాలున్నాయి. రాజ్యం పిక్చర్స్ ‘హరిశ్చంద్ర’లో యస్.వి. రంగారావు- హరిశ్చంద్రుడు, గుమ్మడి -విశ్వామిత్రుడు. ఒక దృశ్యంలో విశ్వామిత్రుడు, హరిశ్చంద్రుడు తన ముందు మోకరిల్లి ఉండగా, తలను కాలితో తన్నాలి. రంగారావు ఒప్పుకోలేదు. ‘‘గుమ్మడెవరు నన్ను తన్నడానికి?’’ అని అంగీకరించపోతే, ‘డూప్’ షాట్ తీసుకున్నారు. ‘ప్రేమించి చూడు’లో రేలంగిని, అల్లు రామలింగయ్య ‘బావా’ అనాలి - దృశ్యపరంగా. రేలంగి ఒప్పుకోలేదు. అలిగి కూచుంటే దర్శకుడు పి. పుల్లయ్య బుజ్జగించారు. ఇలాంటివి ఇంకా ఎన్నో కనిపిస్తాయి. ‘ప్రేమించి చూడు’లో నేను, అక్కినేని వారికి (హీరో) తండ్రిని.

  పదిమంది నా గురించి చెప్పి.. చెప్పి.. చెబితేగాని, దర్శకుడు పి. పుల్లయ్యగారు ఆ వేషం నాకివ్వలేదు. ఆ భయం ఉంది వేషం మొదలు పెడుతున్నప్పుడు. పైగా, మొట్టమొదటి రోజు నా షూటింగు, నాగేశ్వరరావుగారిని తిట్టడంతో ఆరంభం! ‘‘ఒరే గాడిదా, ఎక్కడ తిరుగుతున్నావురా?’’ అని డైలాగు ఆరంభం. ఒళ్లు వణుకు, గుండె దడ. నాగేశ్వరరావు గారు నాకు బాగా తెలుసు గాని, ఆయనతో నటించడం అదే మొదలు. పైగా దృశ్యంలో గుమ్మడి, జగ్గయ్య, రేలంగి కూడా ఉన్నారు. ‘‘ఈ రావి కొండలరావు నన్ను గాడిదా అని తిడతాడా? అసలు ఈ వేషం ఇతనికెందుకు ఇచ్చారు?’’ అని అక్కినేని, కళ్లెర్రజేస్తే? అమ్మో! ‘‘రిహార్సల్ - రావయ్యా కొండల్రావు చెప్పు డైలాగ్’’ అని పుల్లయ్యగారు అరుస్తున్నారు. నా పక్కనే ఉన్న సహాయ దర్శకుల దగ్గర నెమ్మదిగా మొర పెట్టుకుంటున్నాను.

  షాట్‌కి వెళ్లడం లేదు. ‘‘ఏం జరుగుతోందక్కడ? ఏమిటాలస్యం?’’ అని హీరోగారూ ఓ కేక వేశారు. సహాయకులు వెళ్లి అక్కినేనికి వివరించారు - నాలో జరుగుతున్న ఘర్షణ. ‘రండి - రండి ఇలా’ అని పిలిచారు హీరో. నెమ్మదిగా వెళ్లాను. ‘‘ఏమిటి? ఏమిటా సందేహం?... ఎవర్ని తిడుతున్నారు మీరు? నన్నా? మీ కొడుకునా?... తన కొడుకుని, తండ్రి ‘గాడిదా’ అని తిడుతున్నాడు. అంతేగాని, అక్కినేని నాగేశ్వరరావుని, రావి కొండలరావు ‘గాడిద’ అనడం లేదు కదా. ఆలోచిస్తారేమిటండీ - విజృంభించండి. రండి’’ అని భుజం తట్టి ప్రోత్సహించారు.

  అంతే. రిహార్సల్‌లో దంచాను. టేక్‌లోనూ మార్కులు కొట్టాను. అదీ - అక్కినేని ప్రోత్సాహం! తక్కిన కొందరు పెద్ద తారలు అన్నట్టుగా ‘వీడెవడు నన్ను గాడిదా’ అనడానికి అని, ఆయన ఒక్క మాట అని ఉంటే - నేను సినిమాల్లో నిలదొక్కుకోగలగడానికి కారణమైన ఆ పాత్ర పోయేది. అసలు నా సినిమా జీవితం- నటుడిగా - అక్కడే ఆగిపోయేది! ఆయన ముఖ్య నటుడు. ఏం చెబితే అది జరుగుతుంది. కానీ ఆయన పాత్రపరంగా ఆలోచించారే గాని, వ్యక్తిగతంగా ఆలోచించలేదు. ఎంతటి పెద్ద మనసు! నాలాగా ఎంతోమంది కొత్తవారికి ఇచ్చిన ప్రోత్సాహం విషయంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఇది నేను మరచిపోలేను!     
     
- రావి కొండలరావు
సీనియర్ నటుడు, జర్నలిస్ట్  

................................

Monday, January 19, 2015

సమస్యలను ఎదుర్కొనే కిటుకు అదే! - - స్వామి జ్ఞానదానంద, ‘రామకృష్ణ మఠం’ హైదరాబాద్ అధ్యక్షులు

సమస్యలను ఎదుర్కొనే కిటుకు అదే!

‘‘ఇనుప నరాలు, ఉక్కు కండరాలున్న యువకులు వంద మందిని నాకు ఇస్తే, ఈ దేశాన్నే మార్చేస్తాను!’’ అన్న ద్రష్ట స్వామి వివేకానంద. ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి మొత్తం యువతీ యువకుల చేతుల్లోనే ఉందని నూరేళ్ళ క్రితమే గుర్తించి, ఆ సంగతిని అప్పుడే బాహాటంగా చాటిన దార్శనికత ఆయనది. నేడు స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా రామకృష్ణ మఠం హైదరాబాద్ అధ్యక్షులు స్వామి జ్ఞానదానందతో సాక్షి సంభాషణ...

- స్వామి జ్ఞానదానంద,  ‘రామకృష్ణ మఠం’ హైదరాబాద్ అధ్యక్షులు

దాదాపు నూట ఇరవై ఏళ్ళ క్రితం అమెరికా నుంచి స్వామి వివేకానంద తన సోదర శిష్యులకు ఉత్తరం రాస్తూ, ‘‘కిన్నామ రోదసి... న జడః కదాచిత్‌॥అని పేర్కొన్నారు. అంటే, ‘ఓ మిత్రమా! నువ్వెందుకు విలపిస్తున్నావు? సమస్త శక్తీ నీలోనే ఉంది. ఓ శక్తిశాలీ! నీ సర్వశక్తి స్వభావాన్ని వెలికి తీసుకురా! ఈ లోకం సమస్తం నీకు పాదాక్రాంతమవుతుంది’ అని! ముఖ్యంగా, యువతరం ఈ సంగతిని గుర్తుంచుకోవాలి. దేనికీ దిగాలుపడకుండా, నిరాశలో కూరుకుపోకుండా మనలోని దైవిక స్వభావాన్ని గుర్తు చేసుకోవాలి. మనం సామాన్యులం కాదనే స్పృహతో ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చు.

ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలను‘నువ్వెందుకూ పనికిరావు. శుద్ధదండగ... ‘నువ్వు పాపివి! నిష్ర్పయోజకుడివి’ అని పదే పదే అనడం వల్ల చివరకు వారు అలానే తయారవుతారు. అలా కాకుండా, సానుకూల దృక్పథంతో ప్రోత్సహిస్తే - పైకి వస్తారు! యువతరం ఇప్పుడు నిద్రాణ స్థితిలో ఉంది. కమ్ముకున్న తెరలను చీల్చుకొని, నిద్రావస్థ నుంచి వాళ్ళు మేల్కొనాలి. తమలోని శక్తిని గ్రహించి, తమ లోపలే ఉన్న ఆ మహాపురుషుణ్ణి దర్శించాలి. అలా తమ అసలు సిసలు ఆత్మ స్వభావాన్ని గ్రహించి, తమ ఔన్నత్యాన్ని తెలుసుకుంటే చాలు - అన్నిటా విజయం వరిస్తుంది.  ‘లేవండి! మేల్కొనండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి!’ అని స్వామి వివేకానంద పదే పదే గుర్తు చేసింది అందుకే!

మన ఆత్మస్వభావం తెలుసుకోకపోతే - ఎలా తయారవుతామనడానికి ఒక కథ ఉంది. అనగనగా ఒక గొర్రెల కాపరి. ఒకసారి నిండు గర్భిణి అయిన ఒక ఆడసింహం అతని గొర్రెల మంద మీద పడింది. ఆ గందరగోళంలో ఆ సింహం మరొక సింహం పిల్లకు జన్మనిచ్చి, మరణించింది. గొర్రెల కాపరి దగ్గర, ఆ మందలో ఒక గొర్రెపిల్లగా, గడ్డి తింటూ, గొర్రెస్వభావంతో పెరిగిందా - గొర్రెసింహం. తీరా ఒకసారి ఒక సింహం దాడికి వచ్చినప్పుడు, గొర్రెల్లో ఒకదానిలా భయపడిపోతున్న ఈ గొర్రెసింహాన్ని చూసి, తీసుకెళ్ళి, బావిలోని నీటిలో ప్రతిబింబం చూపి, దాని స్వభావాన్ని ఎరుకపరిచింది. అప్పటి నుంచి ఆ పిల్ల సింహం మరుగునపడ్డ తన స్వభావాన్ని గ్రహించి, గర్జన చేసింది. ఈ కథలో ఈ పిల్ల సింహం మనమైతే, మనకు మన నిజ స్వభావాన్ని తెలియజెప్పే పెద్ద సింహం - స్వామి వివేకానంద. ఇవాళ్టికీ స్వామీజీ బోధనల్ని చదివి, తమకు తాము బోధించుకొని, ఆచరణలో పెడితే యువకులు సింహాలై గర్జిస్తారు. వారి వ్యక్తిత్వమే పూర్తిగా మారిపోతుంది.

దురదృష్టవశాత్తూ ఇవాళ్టి సమాజంలో జనం తమలో దైవత్వం ఉందనీ, తాము అమృతపుత్రులమనీ విస్మరిస్తున్నారు. సమస్యలొస్తే - దైర్యంగా ఎదుర్కోవడం లేదు. దూరంగా పారిపోతున్నారు. తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు.  కానీ, దాని వల్ల లాభం లేదు. పారిపోయే కొద్దీ సమస్యలు ఇంకా బలపోతమవుతాయి. వెంటాడతాయి. వేధిస్తాయి. మనం బలహీనమైపోతాం. అలాకాక, ధైర్యంగా ఎదుర్కొంటే,  సమస్యలు బలహీనమై, పారిపోతాయి. అదే అసలు కిటుకు!

చదువంటే మార్కులు, ర్యాంకుల పంటలే కాదు...  మనిషి శీల నిర్మాణ విద్య. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతూ మనిషిలో మానసిక బలాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ, నిర్భీతినీ పెంపొందించాలి. అలాంటివి బోధించడానికే, రామకృష్ణ మఠం శాఖలు కృషి చేస్తున్నాయి. హైదరాబాద్ శాఖలో ఏటా దేశం నలుమూలల నుంచి వచ్చిన యువతీ యువకులతో ‘యువజన సమ్మేళనం’ జరుపుతున్నాం. అలాగే, ‘హౌ టు ఓవర్‌కమ్ టెన్షన్ అండ్ వర్రీ’, ‘హౌ టు ఓవర్‌కమ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్’ లాంటి అంశాలపై తరచూ క్లాసులు, సెమినార్లు, ఉపన్యాసాలు నిర్వహిస్తున్నాం. వాటివల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడడం స్వయంగా చూస్తున్నాం.

ఒక్కముక్కలో చెప్పాలంటే - స్వామీజీ ఆ రోజుల్లోనే అన్నట్లు - యువతరానికి ముఖ్యంగా కావాల్సింది ఆత్మవిశ్వాసం. అది ఉంటే చాలు - మిగిలినవన్నీ జీవితంలో సాధించుకోగలుగుతారు. మరి, అలా మన మీద మనకు నమ్మకం కలిగించే బోధనలంటే - ఈ తరానికి స్వామి వివేకానంద బోధనల వినా మరో మార్గం లేదు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఏటా జరుపుకొనే ఈ జాతీయ యువజన దినోత్సవం నాడు మరోసారి ఆయన మాటలను పునశ్చరణ చేసుకుందాం. ఆ మాటలను ఆచరణలో పెట్టి, నవ భారత నిర్మాణానికి నడుం కడదాం!! సర్వం శ్రీ రామకృష్ణార్పణమస్తు

- రెంటాల  జయదేవ

(Published in 'Sakshi' daily, 12th Jan 2015, Monday)
.....................................

Sunday, January 18, 2015

‘జగపతి’వారి టాప్ 5 మూవీస్

 ఆరాధన (1962): సక్సెస్‌ఫుల్ ఎక్స్‌పెర్‌మెంట్
 చాలా రిస్కీ కథాంశమిది. సినిమా సగంలో కథానాయకుడు గుడ్డివాడవుతాడు. ఏయన్నార్‌లాంటి రొమాంటిక్ హీరోతో ఇలాంటి సినిమా చేయడమంటే సముద్రంలో ఈత కొట్టడంలాంటిదే. దర్శక, నిర్మాత బీఎన్ రెడ్డి సగం షూటింగ్ అయ్యాక రష్ చూసి ‘మీ ప్రయత్నం వృథా’ అని హెచ్చరించినా, వీబీ రాజేంద్రప్రసాద్ వెన్ను చూపలేదు. కథే శ్రీరామరక్ష అనుకున్నారు. ఆయన మొండితనం, సాహసం ఫలించింది. ‘ఆరాధన’ సినీ చరిత్రలో నిలిచిపోయింది. ‘నా హృదయంలో నిదురించే చెలి’, ‘ఆడదాని ఓరచూపులో’, ‘వెన్నెలలోని వికాసమే’ లాంటి గొప్ప గొప్ప పాటలు ఇందులోవే.
 
 ఆత్మబలం (1964): వండర్‌ఫుల్ థ్రిల్లర్
 ఒక్క పాటతో హిస్టరీలో నిలిచిపోవడం, హిస్టరీగా మారడం అంటే ఇదేనేమో! ఈ సినిమా పేరు చెప్పగానే ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ పాట గుర్తుకు రాకపోతే ఒట్టు. ఈ సినిమా లేకపోతే జగపతి సంస్థ లేదు. ‘ఆరాధన’ తర్వాత ప్రధాన భాగస్వామి చనిపోవడం, ఇతర భాగస్వాములు దూరమవడంతో ఒంటరైపోయారు వీబీ రాజేంద్రప్రసాద్. అయితే ఊరు తిరిగి వెళ్లిపోవాలి. లేకపోతే ఒంటరిగా సినీ సముద్రాన్ని ఈదాలి. వీబీ రాజేంద్రప్రసాద్ మొండివాడు. చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలనుకున్నారు. అలా ‘ఆత్మబలం’ మొదలు పెట్టారు. హిట్టుకొట్టారు. ఇందులో ఏడు పాటలూ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి.
 
 అదృష్టవంతులు (1969): అడ్వాన్స్‌డ్ యాక్షన్
 ఏయన్నార్‌తో చేసిన యాక్షన్ సినిమా ఇది. మేకింగ్ చాలా అడ్వాన్డ్స్ థాట్స్‌తో ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్రెయిన్ ఫైట్ అయితే ఎక్స్‌లెంట్. గ్లామర్ హీరోయిన్ జయలలితతో మేల్ కేరెక్టర్ చేయించాలనుకోవడం తమాషా ఆలోచన. ఇందులో జగ్గయ్య విలన్‌గా చేశారు. ఆయన డెన్‌ని సీసీ టీవీలతో మోడ్రన్‌గా డిజైన్ చేయించడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నాగార్జునకు ఈ సినిమాలో యాక్షన్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా విలన్ డెన్ సెటప్ ఆయనకు తెగ నచ్చేసింది.
 
 దసరా బుల్లోడు (1971): బాక్సాఫీస్‌కి న్యూ బ్లడ్
 ఈ సినిమాతో అనుకోకుండా దర్శకుడయ్యారు వీబీ రాజేంద్రప్రసాద్. ‘జగపతి’ సంస్థ ఆస్థాన దర్శకుడైన వి. మధుసూధనరావు బిజీగా ఉండటంతో తానే మెగాఫోన్ పట్టాల్సి వచ్చింది. తొలి షెడ్యూలు కృష్ణా జిల్లాలో తీస్తే, రష్ మొత్త పోయింది. మళ్లీ రీషూట్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమా అంతా దాదాపుగా అవుడ్డోర్‌లోనే తీశారు. సినిమా సూపర్‌హిట్టయ్యింది.అక్కినేని స్టెప్పుల హవా మొదలైంది ఈ సినిమాతోనే. ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మి’, ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా’, ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్’ తదితర పాటల కోసం కుర్రకారు వేలంవెర్రిగా ఎగబడ్డారు. అక్కినేని-వాణిశ్రీ కాంబినేషన్, పాటలు, స్టెప్పులు, మాటలు, మాస్ ఎలిమెంట్స్, మేకింగ్ వేల్యూస్‌తో బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిసింది. ఈ సినిమా విజయంతో వీబీ రాజేంద్రప్రసాద్ విజృంభించి దర్శకునిగా 17 సినిమాలు తీశారు. ‘దసరాబుల్లోడు’ని హిందీలో జితేంద్ర, రేఖ, షబనా ఆజ్మీతో ‘రాస్తే ప్యార్’గా రీమేక్ చేసి విజయం సాధించారు.
 
 బంగారు బాబు (1973): గెస్ట్ మల్టీ స్టారర్
 ఓ సినిమా హీరోయిన్ పారిపోయి రహస్యంగా ఓ స్టేషన్ మాస్టర్ దగ్గర ఆశ్రయం పొందుతుంది. జీవితంలో కొంగొత్త రుచులేంటో చూస్తుంది. ఇదీ ‘బంగారు బాబు’ సినిమా కథ. అప్పట్లో ప్రేక్షకులకు చాలా కిక్కిచ్చిన కథ ఇది. ‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది’ అంటూ ఏయన్నార్, వాణిశ్రీ పాడిన డ్యూయెట్ ఇప్పటికీ రెపరెపలాడుతూనే ఉంటుంది. ప్రముఖ నటులు శివాజీ గణేశన్, రాజేష్‌ఖన్నా, కృష్ణ, శోభన్‌బాబులు గెస్ట్‌లుగా కనిపించడం అప్పట్లో నిజంగా గ్రేట్.
 

(Published in 'Sakshi' daily, 13th Jan 2015, Tuesday)
.............................................

జగమెరిగిన ‘జగపతి’వారి పాటలు



 చిటపట చినుకులు పడుతూ వుంటే - ఆత్మబలం (1964)
 ఎక్కడికి పోతావు చిన్నదానా - ఆత్మబలం
 నువ్వంటే నాకెందుకో అంత ఇది - అంతస్తులు (1965)
 అయ్యయ్యో బ్రహ్మయ్య - అదృష్టవంతులు (1968)
 మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో -  అదృష్టవంతులు
 ము.. ము... ముద్దంటే చేదా -  అదృష్టవంతులు
 చిటాపటా చినుకులతో కురిసింది వాన - అక్కాచెల్లెలు (1970)
 పాండవులు పాండవులు తుమ్మెద - అక్కాచెల్లెలు
 నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే - దసరా బుల్లోడు (1971)
 పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ - దసరా బుల్లోడు
 చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది - బంగారుబాబు (1973)
 ఏడడుగుల సంబంధం - బంగారుబాబు
 నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్లాలని -
 మంచి మనుషులు (1974)
 నీవు లేక నేను లేను - మంచి మనుషులు
 నేనీ దరిని నువ్వా దరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ -
 బంగారు బొమ్మలు (1977)
 చిటపట చినుకుల మేళం - ముద్దుల కొడుకు (1979)
 దులపర బుల్లోడా - ఆస్తిపరులు (1964)
ప్రియా ప్రియతమా రాగాలు - కిల్లర్ (1991)

(Published in 'Sakshi' daily, 13th Jan 2015, Tuesday)
.............................

Friday, January 16, 2015

ఆత్మబలంతో నెగ్గిన దసరా బుల్లోడు! - వి.బి. రాజేంద్రప్రసాద్‌



 తెలుగు సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. 1960, 70లలో దాదాపు అరవై ఏళ్ళ క్రితం సమాజంపై సినిమాల ప్రభావం,ప్రజల్లో సినిమాల పట్ల క్రేజు ఎక్కువవుతున్న రోజుల్లో తెలుగు నేలపై కోస్తా తీరం నుంచి సినీ రంగంలోకి వచ్చిన తరానికి చెందిన వ్యక్తి - వి.బి. రాజేంద్రప్రసాద్‌గా ప్రసిద్ధులైన వీరమాచనేని బాబూ రాజేంద్రప్రసాద్. నాటకాల్లో నటించి, ఆ అనుభవం, ప్రేమతో అటు నుంచి వెండితెరపైకి వచ్చారాయన. నటుడు కావాలనే కోరికతో సినీ రంగానికి వెళ్ళినా, నిర్మాతగా మొదలై, అపూర్వమైన విజయాలు సాధించి, అనుకోని రీతిలో దర్శకుడిగా మారి, ఆ విభాగంలోనూ రాణించిన ఘనత ఆయనది.

 రంగస్థలంపై స్త్రీ పాత్రధారి!
 ఎనభై రెండేళ్ళ క్రితం 1932 నవంబర్ 4న కృష్ణాజిల్లా ఉయ్యూరులో జన్మించిన వి.బి. రాజేంద్ర ప్రసాద్ స్వగ్రామం - గుడివాడ తాలూకా డోకిపర్రు గ్రామం. ఆయన తండ్రి జగపతిరావు చౌదరి భూస్వామి. స్కూలు చదువంతా పామర్రు, గన్నవరం, బందరుల్లో చేసిన ఆయన కాకినాడ పి.ఆర్. కాలేజీలో బి.ఎస్సీ చేశారు. కాలేజీ రోజుల్లోనే నటనపై మోజుతో ఆయన రంగస్థలం వైపు ఆకర్షితులయ్యారు. ఇప్పటి ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఆ సమయంలోనే అదే కాలేజీలో బి.ఏ. చదువుతున్నారు. తరువాతి రోజుల్లో ీసినీ హీరోగా రాణించిన హరనాథ్ వీళ్ళకు ఒక ఏడాది జూనియర్. మరికొందరితో కలసి వీరంతా ఒక బృందంగా ఏర్పడి, నాటక రంగ ప్రముఖుడు బళ్ళారి రాఘవ పేరిట ‘రాఘవ కళా సమితి’ ఏర్పాటు చేసి, ఆ గొడుగు కింద నాటకాలు ప్రదర్శించేవారు.

  వడ్డాది సూర్యనారాయణ, తరువాత కాలంలో సినీ రంగంలో పేరు తెచ్చుకున్న విజయచందర్, అర్జా జనార్దనరావు, మాడా వెంకటేశ్వరరావు తదితరులు ఆ సంస్థలో కీలకసభ్యులు. ఆనాటి రంగస్థల ప్రముఖుడు డాక్టర్ గరికపాటి రాజారావుతో ఆ సంస్థను ప్రారంభించారు. ఆ రోజుల్లో రాజేంద్రప్రసాద్ రంగస్థలంపై ఆడవేషాలు కూడా వేసి, మెప్పించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ‘అంతర్ కళాశాలల నాటక పోటీ’ల్లో ఆత్రేయ ‘కప్పలు’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, రాజేంద్రప్రసాద్ కథానాయిక పంకజం పాత్రను అద్భుతంగా పోషించారు. ఆ స్త్రీ పాత్రలో ఆయన ఉత్తమ నటిగా, అదే నాటకంలో ఏడిద నాగేశ్వరరావు ఉత్తమ నటుడిగా బహుమతులు గెల్చుకోవడం విశేషం. ఆత్రేయ ‘వరప్రసాదం’, రెంటాల గోపాలకృష్ణ ‘ఇన్‌స్పెక్టర్ జనరల్’, అవసరాల సూర్యారావు ‘పంజరం’, అనిసెట్టి సుబ్బారావు ‘చెప్పు కింద పూలు’, పినిశెట్టి శ్రీరామమూర్తి ‘ఆడది’ లాంటి నాటకాలను అనేక చోట్ల ప్రదర్శించి, బహుమతులందుకున్నారు.

 తండ్రి పేరిట చిత్ర నిర్మాణ సంస్థ
 అక్కినేని నాగేశ్వరరావుతో పరిచయం రీత్యా, హీరోగా రాణించాలని సినీ రంగానికి వచ్చిన ఆయన అక్కినేని సలహాతో చిత్ర నిర్మాణం వైపు మళ్ళారు. తొలి సినిమా విఫలమైతే, వ్యవసాయానికి వచ్చేయాలని షరతు పెట్టి తండ్రి జగపతిరావు చౌదరి ఆయనకు యాభై వేలు ఇచ్చారు. తండ్రి పేరు మీదే తమ చిత్ర నిర్మాణ సంస్థకు ‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ అని పేరు పెట్టారు రాజేంద్రప్రసాద్. మరో మిత్రుడు పి. రంగారావుతో కలసి స్థాపించిన ఆ సంస్థపై ఆయన నిర్మించిన తొలి చిత్రం - ‘అన్నపూర్ణ’. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఆ తరువాత వరుసగా ‘ఆరాధన’, ‘ఆత్మబలం’, ‘అంతస్తులు’, ‘ఆస్తిపరులు’, ‘అదృష్టవంతులు’ తదితర చిత్రాలను అందించారు. ఆ చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి. అలా అతి కొద్ది కాలంలోనే తెలుగు చిత్రసీమలోని నాగిరెడ్డి - చక్రపాణిల ‘విజయ’, దుక్కిపాటి మధుసూదనరావు ‘అన్నపూర్ణ’ తదితర ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థల సరసన రాజేంద్రప్రసాద్ ‘జగపతి’కి స్థానం దక్కింది.

 ఆయన కొలువు... స్టార్స్‌కు నెలవు
 అక్కినేనికి బాగా సన్నిహితుడైన రాజేంద్రప్రసాద్ సహజంగా ఆయనతోనే అప్పట్లో ఎక్కువ సినిమాలు నిర్మించారు. ఆనాటి మరో ప్రముఖ నటుడు జగ్గయ్య ‘జగపతి’ వారి చిత్రాల్లో పర్మినెంట్ ఆర్టిస్ట్. ఇక, భానుమతి, ఎస్వీ రంగారావు, జమున, జయలలిత, బి. సరోజాదేవి, వాణిశ్రీ, మంజుల, శోభన్‌బాబు - ఇలా స్టార్స్‌తో రాజేంద్రప్రసాద్ చిత్రాలు ప్రేక్షకులకు కనువిందు చేసేవి. ఆయన తమ ‘అంతస్తులు’ చిత్రానికి జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. అలాగే, ‘ఆస్తిపరులు’ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ పురస్కారం లభించింది. అక్కినేని, బి. సరోజాదేవి నటించిన ‘ఆత్మబలం’ వానపాట ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’ లాంటి వాటితో ఇవాళ్టికీ జనహృదయాల్లో నిలిచిపోయింది.

 ఆపద్ధర్మ దర్శకత్వం... ఆల్‌టైమ్ హిట్ సాంగ్స్
 ఇటు కథ, అటు పాటలు, మరోపక్క సంగీతం - ఇలా అన్నీ దగ్గరుండి చూసుకొనే ఆ తరం ఉత్తమ నిర్మాతల్లో వి.బి. రాజేంద్ర ప్రసాద్ ఒకరు. దర్శకుడు వి. మధుసూదనరావు డేట్స్ కుదరకపోవడంతో, అక్కినేని ప్రోత్సాహం అండగా, అనుకోని పరిస్థితుల్లో ‘దసరాబుల్లోడు’తో రాజేంద్రప్రసాద్ దర్శకుడయ్యారు. సినిమా రూపకల్పనపై, సామాన్య ప్రేక్షక జనం నాడిపై ఆయనకున్న అవగాహనకు సాక్ష్యం - వాణిశ్రీ, అక్కినేని నటించిన ‘దసరాబుల్లోడు’ అప్పట్లో ఆల్‌టైమ్ హిట్ కావడం! ఆ చిత్రంలోని ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల...’, ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా...’, ‘నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే...’ పాటలు ఇవాళ్టికీ జనం నోట నిలిచిపోయాయి.

 అలాగే, దర్శకుడిగా ఆయన రెండో చిత్రం ‘బంగారు బాబు’, ఆ సినిమాలో మళ్ళీ అదే అక్కినేని, వాణిశ్రీపై వచ్చే ‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది...’ పాట ఆ తరం ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే! ‘మంచి మనుషులు’, ‘బంగారు బొమ్మలు’, ‘ముద్దుల కొడుకు’, ‘ఎస్.పి. భయంకర్’, ‘కెప్టెన్ నాగార్జున’ తదితర చిత్రాలుఆయన దర్శకత్వంలోవే! తెలుగుతో పాటు తమిళంలో ‘ఎంగళ్ తంగరాజా’, ‘ఉత్తమన్’, ‘పట్టాకత్తి భైరవన్’, హిందీలో ‘రస్తా ప్యార్‌కే’, ‘బేకరార్’ చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అలాగే, పల్లవి వారి ‘అందరూ దొంగలే’, అన్నపూర్ణా స్టూడియో వారి భాగస్వామ్యంతో తీసిన ఎన్టీఆర్ - ఏయన్నార్‌లతో ‘రామకృష్ణులు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తన చిత్రాల్లోని హిట్ పాటలను గీతమాలికగా రూపొందించి, ‘చిటపట చినుకులు’ పేరిట రెండు భాగాల సినిమాలుగా విడుదల చేసి, అక్కడా విజయం అందుకున్నారు. అలాగే, దర్శకుడు దాసరితో ‘లంచావతారం’, రవిరాజా పినిశెట్టితో ‘బంగారు బుల్లోడు’, ఫాజిల్‌తో ‘కిల్లర్’ తదితర చిత్రాలు అందించారు.

 
కార్మికుల కోసం సినీ నిర్మాణం
 అభిరుచి గల నిర్మాతగా, సంస్కారవంతుడైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ అందుకు తగ్గట్లే తన కోసం శ్రమించే వారి బాగు చూసేవారు. జగపతి సంస్థలో పనిచేసే కార్మికుల బాగు కోసం ఆ రోజుల్లోనే ఆయన ‘పిచ్చిమారాజు’ అనే చిత్రం నిర్మించారు. ఆ చిత్రం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కార్మికులకే పూర్తిగా కేటాయించారు. అప్పట్లో మద్రాసులోని తెలుగు చిత్రసీమతో పాటు తమిళ, తదితర పరిశ్రమల్లోనూ అది పెద్ద సంచలనమైంది. ఆయన పెద్దకుమారుడి పేరు - రామ్‌ప్రసాద్. రెండో కుమారుడు - యోగేంద్రకుమార్, మూడో కుమారుడు జగపతిబాబుకు తన తండ్రి పేరునే పెట్టుకున్నారు రాజేంద్రప్రసాద్. తరువాతి కాలంలో కుమారుడు జగపతిబాబును ‘సింహస్వప్నం’ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేశారు. హీరో కావాలన్న తన చిన్నప్పటి కోరికను అలా కుమారుడి రూపంలో తీర్చుకున్నారు.

 ఆధ్యాత్మిక చింతనలో...
 చిత్ర పరిశ్రమలో పరిస్థితులు మారి, నష్టాలు వచ్చాక ఆయన క్రమంగా చిత్ర నిర్మాణానికి దూరం జరిగారు. మద్రాసు నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాక, ఇక్కడి ‘ఫిలిమ్‌నగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’లో కీలక బాధ్యతలు పోషించారు. అలాగే, జీవితంలోని చివరి అంకాన్ని పూర్తిగా దైవభక్తిలో గడిపారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఫిలిమ్‌నగర్‌లో ఫిల్మ్‌చాంబర్ పక్కనే కొండపై నెలకొన్న దేవాలయాల సముదాయం ‘దైవసన్నిధానం’ నిర్మాణంలో ఆయన ముఖ్యపాత్ర వహించారు. చిత్రసీమకు చేసిన సేవకు గుర్తింపుగా 2003లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ప్రతిష్ఠాత్మక ‘రఘుపతి వెంకయ్య అవార్డు’తో గౌరవించింది. కాగా, సీనియర్ సినీ జర్నలిస్టు భగీరథ ఈ సినీ దిగ్గజం జీవిత చరిత్రకు ‘దసరా బుల్లోడు’ పేరిట పుస్తకరూపం ఇవ్వడం విశేషం. చిన్నప్పటి నుంచి ఉబ్బసంతో బాధపడుతూ, కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతూ వచ్చిన రాజేంద్రప్రసాద్ సోమవారం రాత్రి కన్నుమూయడంతో పాత తరం ప్రముఖ దర్శక, నిర్మాతల్లో మరొకరు కనుమరుగయ్యారు. ఇవాళ ఆయన లేరు... కానీ, ఆయన సినిమాలు, వాటిలోని పాటలు మాత్రం తెరస్మరణీయంగా మిగిలిపోయాయి.

- రెంటాల జయదేవ

..................................................

Thursday, January 15, 2015

'ఐ' సినిమా రివ్యూ

'ఐ' సినిమా రివ్యూ

తారాగణం - విక్రమ్, అమీ జాక్సన్, సంతానం, సురేష్ గోపి, రామ్‌కుమార్, మాటలు - శ్రీరామకృష్ణ, పాటలు - సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, సంగీతం - ఏ.ఆర్. రెహమాన్, ఛాయాగ్రహణం - పి.సి. శ్రీరామ్, ఎడిటింగ్ - ఆంథోనీ, కళ - ముతురాజ్, నిర్మాత - ‘ఆస్కార్’ వి. రవిచంద్రన్, దర్శకత్వం - శంకర్
...............................................
ఒక మామూలు కథాంశం, ఇతివృత్తం కూడా దాన్ని మనం ఊహించుకొనే తీరు వల్ల అత్యద్భుతంగా మనోనేత్రం ముందు సాక్షాత్కరించవచ్చు. సృజనశీలురైన దర్శకులకు సర్వసాధారణంగా ఉండే లక్షణం ఇదే! ముఖ్యంగా, తమిళనాడులో మొదలుపెట్టి, ఇవాళ దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన దర్శకుడు శంకర్‌లో తరచూ కనిపించే లక్షణం అది. డొనేషన్లు, అవినీతి లాంటి మామూలు కథల్ని కూడా విజువలైజేషన్ ప్రతిభతో, తన టేకింగ్ సామర్థ్యంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు. అది ఆయన బలం. ఏ మాత్రం తేడా వచ్చినా, అదే బలహీనత అవుతుంది.

ఇప్పటి వరకు ఒక్క ‘స్నేహితులు’ (తమిళ హీరో విజయ్ నటించిన చిత్రం) మినహా ప్రతిసారీ ఆ ఊహాశక్తితో బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించిన శంకర్ తాజా కానుక - ‘ఐ’ (...మనోహరుడు). సుదీర్ఘ కాలం నిర్మాణంలో ఉండి, అనేక అవాంతరాలను దాటుకొని, ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా ‘భోగి’ నాడు విడుదలైంది ఈ సినిమా. మరి, పెరిగిన అంచనాలను తన సెల్యులాయిడ్ కల్పనా సామర్థ్యంతో శంకర్ అందుకున్నారా?

కథ ఏమిటంటే...


లింగేశ (విక్రమ్) మంచి బాడీ బిల్డర్. వ్యాయామశాలలో కష్టపడి కసరత్తులు చేసి, ప్రత్యర్థులను కూడా ఎదుర్కొని, మిస్టర్ ఆంధ్రాగా ఎంపికవుతాడు. అలా అనుకోకుండానే ప్రత్యర్థులకు శత్రువు అవుతాడు. ఇంతలో అతను చిరకాలంగా వాణిజ్య ప్రకటనల్లో చూసి ఆరాధిస్తున్న మోడల్ దియా (ఎమీ జాక్సన్) పరిచయమవుతుంది.

తోటి మోడల్ జాన్ నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొని, అతని వల్ల యాడ్స్ నుంచి తొలగింపునకు గురవుతుంది. ఆ క్రమంలో కొత్త మోడల్‌గా బాడీ బిల్డర్ లింగేశను ఎంచుకొని, అతణ్ణి ‘లీ’గా తీర్చిదిద్దుతుంది. ఆ క్రమంలో వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. లీ ఎదుగుదలను చూసి ప్రత్యర్థి బాడీ బిల్డర్ రవి, జాన్, స్టైలిస్ట్ ఓజ్మా  తదితరులు ఓర్వలేకపోతారు. ఆ పరిస్థితుల్లో వారేం చేశారు? అప్పుడు లీ ఏమయ్యాడు? లీ, దియాల ప్రేమ కథ ఏమైంది? మొదలైనవన్నీ మిగతా సినిమా.

ఎలా నటించారంటే...


‘ఐ’ చిత్రంలో ఉన్న కీలక పాత్రలు, పాత్రధారులు కొద్దే. కానీ, అందరిలోకీ అత్యధికంగా శ్రమించిందీ, ఎక్కువ మార్కులు కొట్టేసేదీ మాత్రం నిస్సందేహంగా విక్రమ్. కండలు తిరిగిన బాడీ బిల్డర్‌గా, ఆ వెంటనే అందమైన నాజూకు మోడల్‌గా, అటు వెంటనే కండలు కరిగిపోయి - ఒళ్ళంతా వికృతంగా తయారైన గూనివాడిగా విభిన్న ఛాయలున్న పాత్రను ఆయన పోషించారు.

నిజం చెప్పాలంటే, ఈ వేర్వేరు షేడ్స్‌లోనూ ఆయన అచ్చంగా అతికినట్లు సరిపోవడమే కాక, ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఒకే చిత్రంలో ఒకదానికొకటి సంబంధం లేని ఇన్ని ఛాయల్ని పోషించడానికి శారీరకంగా, మానసికంగా మూడేళ్ళ పాటు విక్రమ్ పడిన కష్టం, ఆ పాత్రల స్వరూప స్వభావాలకు తగ్గట్లు చూపిన హావభావాలు కచ్చితంగా అవార్డు దక్కించుకోదగ్గవి అనిపిస్తుంది.

మోడల్‌గా ఎమీ జాక్సన్ అందంగా ఉన్నారు. కొంతసేపు బలమైన ఎమోషన్స్ పండించే అవకాశం దక్కించుకున్నారు. హీరో ఫ్రెండ్‌గా సంతానం (తెలుగులో డబ్బింగ్ వాయిస్ ఇచ్చింది కమెడియన్ శ్రీనివాసరెడ్డి) తన పంచ్ డైలాగులతో కాసేపు నవ్విస్తారు. డాక్టర్ వాసుదేవరావుగా సురేష్ గోపి, ఇతరులది పాత్రోచిత నటనకే పరిమితం.

సాంకేతిక నిపుణుల పనితీరేమిటంటే...


సినిమా 24 క్రాఫ్ట్స్ సమష్టి కృషి అయినప్పటికీ, చాలా కొద్ది సినిమాల్లోనే సాంకేతిక నిపుణులందరి పనితనం, సమష్టి కృషి తెరపై కనిపిస్తుంటుంది. ‘ఐ’ సినిమా కచ్చితంగా 24 క్రాఫ్ట్స్ సమష్టి కృషికి నిదర్శనమే. పి.సి. శ్రీరామ్ కెమేరా వర్క్, లైటింగ్ చేసిన తీరు చైనాలోని వివిధ లొకేషన్స్‌లో, పాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఏ.ఆర్. రెహమాన్ బాణీల్లో వేదనను ధ్వనించే ‘నువ్వుంటే నా జతగా...’ (రచన - రామజోగయ్యశాస్త్రి, గానం - సిద్ శ్రీరామ్, ఇషత్ ్రఖాద్రే), శ్రావ్యంగా వినిపించే ‘పూలనే కునుకేయమంటా...’(రచన- అనంత శ్రీరామ్, గానం - హరిచరణ్, శ్రేయా ఘోషల్) ఆకట్టుకుంటాయి.

అలాగే, ద్వితీయార్ధంలో కొన్నిచోట్ల రెహమాన్ నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని గాఢతను పెంచింది. ముతురాజ్ కళా దర్శకత్వ ప్రతిభ దాదాపు ఎకరంపైగా స్థలంలో వేసిన ‘నువ్వుంటే నా జతగా...’ పాటలోని విశాలమైన సెట్‌లో, అలాగే గూనివాడి డెన్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీరామకృష్ణ డబ్బింగ్ డైలాగ్‌ల్లోనూ పంచ్‌లు బాగానే పడ్డాయి.

సినిమాలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సినవి - యాక్షన్ సీన్లు, విజువల్ ఎఫెక్ట్‌లు, మేకప్. ప్రథమార్ధంలో వచ్చే బాలీ బిల్డర్ల ఫైట్, చైనాలో జరిగే సైకిల్ ఫైట్, ద్వితీయార్ధంలో చేతులు కట్టేసిన స్థితిలో హీరో చేసే ఫైట్, క్లైమాక్స్‌కు ముందొచ్చే ట్రైన్ ఫైట్ - ఈ నాలుగూ మాస్ ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి. సినిమా మొదట్లో వచ్చే ‘పరేషానయ్యా...’ (రచన - సుద్దాల, గానం - విజయ్ ప్రకాశ్, నీతీ మోహన్)లో చేతిలోని మొబైల్ ఫోన్, నీటిలో నుంచి చేప హీరోయిన్‌గా మారడం లాంటి విజువల్ ఎఫెక్ట్‌లు (జాతీయ అవార్డు గ్రహీత శ్రీనివాస్ ఎమ్. మోహన్) బాగున్నాయి. న్యూజిలాండ్‌కు చెందిన ‘వీటా’ వారు గూనివాడి వేషానికి వేసిన మేకప్ సహజంగా అనిపిస్తుంది. ఈ వంద కోట్ల పైచిలుకు సినిమాలో చిత్ర నిర్మాణ విలువలూ పుష్కలంగా ఉన్నాయి.  

ఎలా ఉందంటే...


ఒక దిగువ మధ్యతరగతి అబ్బాయి, అందమైన హై సొసైటీ అమ్మాయిల మధ్య సాగే ప్రేమకథ ఇది. అందులోనే  పైకి వస్తున్నవాళ్ళ మీద పక్కనున్న ప్రత్యర్థులకు ఉండే ఈర్ష్య, అసూయ, ద్వేషం,ఆ పైన ప్రతీకారం లాంటి అంశాలన్నీ కలగలిపారు. ప్రేమ అనేది బాహ్య సౌందర్యానికి సంబంధించినదా? లేక హృదయ సౌందర్యానికి సంబంధించినదా? అనే మౌలికమైన ఆలోచనను చాలా తెలివిగా వీటన్నిటి మధ్య జొప్పించారు. ఆ సందర్భంలో ఎదురయ్యే వేదనను చూసినప్పుడు ఆ రూపం మీద జుగుప్స కన్నా ప్రేక్షకులకు కూడా కరుణ, జాలి కలుగుతుంది. అయితే, కురూపి, అందగత్తెల ప్రేమ లాంటివి కె.వి. రెడ్డి తీసిన వాహినీ వారి ‘గుణసుందరి కథ’ రోజుల నుంచి బాలకృష్ణ ‘భైరవద్వీపం’ దాకా చాలా జానపదాల్లోనే చూశాం. దాన్ని సోషలైజ్ చేసి, ఆధునిక హంగులు కలిపితే - ‘ఐ’.

సినిమా మొదలుపెట్టడమే ఒక కురూపి, అందమైన హీరోయిన్‌ను ఎత్తుకుపోవడంతో! అలా ఆసక్తికరంగా మొదలైన కథ వర్తమానానికీ, గతానికీ మధ్య తిరిగే స్క్రీన్‌ప్లే విధానంతో ముందుకు నడుస్తుంది. మొదట కాస్తంత ఇబ్బందిగా అనిపించినా, గడుస్తున్న కొద్దీ ఈ రకమైన కథాకథనానికి ప్రేక్షకుడు అలవాటు పడతాడు. ప్రథమార్ధమంతా కాస్తంత నిదానంగా నడుస్తూ, ఫ్లాష్‌బ్యాక్‌లోని ఒక దశను చెప్పడానికే సరిపోతుంది. ద్వితీయార్ధంలో అసలు కురూపి అయిన గూనివాడి రూపం వెనుక ఉన్న అసలు ఫ్లాష్‌బ్యాక్. ఆ తరువాత విలన్లపై ప్రతీకారం విషయానికి వచ్చేసరికి మళ్ళీ చిత్రం ఊపందుకుంటుంది. వెరసి సినిమా కొన్ని ఘట్టాల్లో విజువల్‌గా వండర్ అనిపిస్తుంది.

అయితే, ఈ చిత్ర కథలోనూ లాజిక్కులు వెతికితే చాలా లోపాలే కనిపిస్తాయి. ఒక మామూలు మోడల్‌ను నాశనం చేయడానికి అంత పెద్ద కంపెనీ యజమాని అలా రంగంలోకి దిగుతాడా? హీరోయిన్‌తో జాన్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నా కోపగించుకోని డాక్టర్ ఆ తరువాత హీరోపై మాత్రం ఎందుకు పగబడతాడు? లాంటి ప్రశ్నలకు జవాబులు వెతికినా దొరకవు. గతంలో ఎప్పుడూ ఒక సందేశంతో ప్రేమ కథను మిళితం చేస్తూ, మరింత అద్భుతాలు చూపిన శంకర్ ఇలాంటి కథను తీశారేమిటని పెదవి విరిచేవారూ ఉంటారు. 3 గంటల ఆరు నిమిషాల ఏడు సెకన్ల నిడివి ఉండడం కూడా సినిమాకు ఒక రకంగా మైనస్సే.

మొత్తం మీద దీర్ఘకాలం నిర్మాణంలో ఉండిపోవడం వల్ల పెరిగిపోయిన నిర్మాణవ్యయం, అంతకు మించి పెరిగిన అంచనాలను అందుకోవాలంటే ‘ఐ’లోని విజువల్ వండర్ అంశాలు, సాంకేతిక నైపుణ్యం సరిపోతాయా? లేక సినిమాలో పదే పదే వినిపించే డైలాగ్ లాగా.... ప్రేక్షకులు కూడా.... ‘‘అంతకు మించి...’’ ఆశించామంటారా? అదే ఇప్పుడు వేచి చూడాల్సి ఉంది. 


- రెంటాల జయదేవ


(Published in 'Sakshi' website, 14th Jan 2015, Wednesday)
.....................

Wednesday, January 14, 2015

‘గోపాల గోపాల’ సినిమా రివ్యూ

‘గోపాల గోపాల’  సినిమా రివ్యూ

తారాగణం: పవన్ కల్యాణ్, వెంకటేశ్, శ్రీయ, మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, ఆశిష్ విద్యార్థి, కృష్ణుడు, స్క్రీన్‌ప్లే: భూపతిరాజా, దీపక్‌రాజ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, పాటలు: సీతారామశాస్త్రి, చంద్రబోస్, అనంత శ్రీరామ్, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమేరా: జయనన్ విన్సెంట్, కళ: బ్రహ్మ కడలి, యాక్షన్: అలన్ అమీన్, డ్రాగన్ ప్రకాశ్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: డి. రామానాయుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అభిరామ్ దగ్గుబాటి, నిర్మాతలు: శరత్ మరార్, డి. సురేశ్‌బాబు, కథనం - దర్శకత్వం: కిశోర్‌కుమార్ పార్థసాని (డాలీ)

కొన్ని కథలు చెబితే ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని కథలు విన్నప్పటి కన్నా, చూస్తేనే ఆసక్తికరంగా ఉంటాయి. సినిమాకు వచ్చేసరికి మామూలు కథాంశాన్ని అయినా,తెరపై చూపడంలోని నేర్పును బట్టి ఆసక్తికరంగా మార్చేయవచ్చు. కానీ, ఆ నేర్పే గనక కొరవడితే, ఎంత మంచి కథాంశమైనా, సినిమా హాలు దాకా వచ్చేసరికి చప్పగా తయారవుతుంది. దర్శకుడి సామర్థ్యంతో పాటు అతనికి దక్కిన స్వేచ్ఛ, కథను సన్నివేశాలుగా, పాత్రలను సహజంగా మలుచుకోవడంలో చూపే సత్తా లాంటి అనేక అంశాలన్నీ అందుకు కారణాలే!

ముఖ్యంగా, ఒక భాషలో హిట్టయిన కథాంశాన్ని మన భాషలోకి తెచ్చుకున్నప్పుడు ఎక్కడ యథాతథంగా అనుసరించాలి, ఎక్కడ సృజనాత్మకత చూపాలి, మన పాత్రధారులతో ఆ పాత్రల్లోకి ఎలా పరకాయ ప్రవేశం చేయించాలన్నది అనుభవం, ఆలోచనతో చేయాల్సిన పని. పరేశ్ రావల్ నటించిన హిందీ హిట్ ‘ఓ మై గాడ్’ చిత్రాన్ని మనవాళ్ళు తెలుగులోకి ‘గోపాల... గోపాల...’గా తెచ్చిన తీరు చూశాక ఇలాంటి ఆలోచనలన్నీ కలుగుతాయి.

కథ ఏమిటంటే...
గోపాలరావు (వెంకటేశ్) ఒక మధ్యతరగతి మనిషి. దేవుడి బొమ్మలు, గంగాజలం - ఇలా భక్తి సంబంధమైన సామగ్రి అమ్మే వ్యాపారి. అయితే, విచిత్రంగా అతడికి దేవుడి మీద, పూజా పునస్కారాల మీద నమ్మకం ఉండదు. మానవత్వం మీద, తోటి మనిషికి సాయపడడం మీదే గురి. అతని భార్య మీనాక్షి (శ్రీయ) మహా దైవభక్తురాలు. చిన్నారి కొడుకు మోక్షను కూడా వీర దైవభక్తుడిగా చేస్తుంటుంది. ఈ క్రమంలో అనుకోకుండా సిద్ధేశ్వర మహరాజ్ (పోసాని కృష్ణమురళి) అనే దొంగ స్వామీజీతో గోపాలరావుకు ఘర్షణ ఎదురవుతుంది. దేవుణ్ణి నమ్మనివాడు నాశనమవుతాడంటూ సిద్ధేశ్వర్ శాపనార్థాలు పెడతాడు.

ఇంతలో అనుకోకుండా వచ్చిన చిన్న భూకంపంలో ఊరంతా బాగున్నా, గోపాలరావు కొట్టు ధ్వంసమవుతుంది. ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళేమో ఈ ప్రకృతి వైపరీత్యం ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అంటూ బీమా సొమ్ము ఇచ్చేది లేదంటారు. ఆ క్రమంలో తనకు నష్టపరిహారం ఇవ్వాలంటూ గోపాలరావు చివరకు దేవుడి మీద కోర్టులో కేసు వేస్తాడు. దేవుడి పేరు చెబుతూ ఆశ్రమాలు, ఆలయాలు నడుపుతున్న స్వామీజీలకు నోటీసులిస్తాడు. ఆ క్రమంలో మతవాదులు అతనిపై దాడికీ దిగుతారు. ఆ సమయంలో సాక్షాత్తూ దేవుడే (పవన్‌కల్యాణ్) మానవరూపంలో దివి నుంచి భువికి దిగి వస్తాడు. దేవుడిపైనే కేసు వేసిన వ్యవహారం నచ్చక, బంధువులతో పాటు పెళ్ళాం బిడ్డలు కూడా హీరో ఇల్లొదిలి వెళ్ళిపోతారు. అక్కడికి సినిమా ప్రథమార్ధం. ఆ తరువాత సంచలనాత్మకమైన ఈ దేవుడిపై గోపాలరావు కేసు కోర్టులో ఏమైంది? మానవరూపంలో వచ్చి, గోపాలం ఇంటిలోనే దిగిన దేవుడు అతనికి ఏం చెప్పాడు, ఏం చేయించాడు, చివరకు గోపాలరావు జీవితం ఏమైందన్నది మిగతా సినిమా.

ఎలా నటించారంటే....
దేవుడి మీద నమ్మకం కన్నా మానవత్వం మీద నమ్మకం ఎక్కువున్న గోపాలరావు పాత్రలో వెంకటేశ్ పాత్ర పరిధి మేరకు నటించడానికి ప్రయత్నించారు. అయితే, మానవత్వం మిన్న అని వాదించే కొన్ని ఘట్టాల్లో మాత్రమే ఆయన అభినయ ప్రతిభ వెలికి వచ్చింది. దేవుడుగా పవన్ కల్యాణ్ తన మాటలో, నటనలో మార్దవాన్ని మేళవించి, దైవత్వం ఉట్టిపడేలా చేయాలని చూశారు. అలవాటైన హావభావాలకు దూరంగా ఉంటూ కొత్తగా కనిపించారు. ప్రస్తుతం జనంలో ఉన్న క్రేజుతో హాలులో కేరింతలు కొట్టించారు.

ఇక, మనిషిలో, ప్రవర్తనలో  స్త్రీత్వాన్నీ, వ్యూహరచనలో క్రూరత్వాన్నీ కలగలుపుకొన్న లీలాధర స్వామిగా మిథున్ చక్రవర్తికి ఇది తొలి తెలుగు సినిమా. హిందీ ‘ఓ మై గాడ్’లో పోషించిన పాత్రనే మరింత సమర్థంగా ఆయన అభినయించారు. కొన్ని చిన్న చిన్న హావభావాలను కూడా తన అనుభవంతో తెరపై బాగా పండించారు. వెంకటేశ్ భార్యగా శ్రీయది ప్రాధాన్యం లేని చిన్న పాత్ర. మిగిలిన పాత్రలు, పాత్రధారులు సన్నివేశానికి తగ్గట్లు వచ్చిపోతుంటారు.

సాంకేతిక నిపుణుల పనితీరెలా ఉందంటే...
అసలు ‘కిషన్ వర్సెస్ కన్హయ్య’ అనే నాటకం ఈ చిత్రకథకు మూలం. దాని ఆధారంగా వచ్చిన ‘ఓ మై గాడ్’ హిందీ చిత్రం అధికారిక మాతృక. ఆ స్క్రిప్టును తెలుగుకు తగ్గట్లు చిన్న చిన్న మార్పులు, చేర్పులతో అల్లుకున్నారు. ‘‘వేగం బండిలో కాదు మిత్రమా... దాన్ని నడిపేవాడి నరంలో ఉంటుంది!’’ (వెంకటేశ్‌తో పవన్ కల్యాణ్) లాంటి కొన్ని మెరుపులు డైలాగుల్లో ఉన్నాయి.

‘కొన్నిసార్లు రావడం లేటవచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా’, ‘సమర్థులు మాకెందుకని ఇంట్లో కూర్చుంటే, అసమర్థులు రాజ్యమేలతారు’, ‘దారి చూపించడం వరకే నా పని. గమ్యాన్ని చేరుకోవడం నీ పని’ (పవన్ కల్యాణ్) లాంటి రాజకీయ ధ్వనితో కూడిన మాస్ డైలాగులు సన్నివేశం, సందర్భంతో పని లేకుండా అభిమానులకు వీనులవిందు చేస్తాయి. అయితే, చాలాచోట్ల సన్నివేశాల రూపకల్పనలో, డైలాగుల్లో సహజత్వం కన్నా తెచ్చిపెట్టుకున్న కృత్రిమత్వం తెలుస్తుంటుంది.

పిల్లి ఎదురురావడం, బల్లిపాటు, వాస్తు లాంటి మనలోని మూఢనమ్మకాలను ప్రశ్నిస్తూ సినిమా మొదట్లో వచ్చే ‘ఎందుకో ఎందుకో రెండు కాళ్ళు ముఖ్యమంటు...’ పాట ఆలోచింపజేస్తుంది. ఇక, ద్వితీయార్ధంలో ‘భాజే భాజే...’ అంటూ పవన్ కల్యాణ్ బృందంపై వచ్చే పండగ పాట ప్రేక్షకులతోనూ స్టెప్పులు వేయిస్తుంది. మిగిలిన పాటలు కూడా సందర్భోచితంగా వచ్చినవే అయినా, గుర్తుండేలా సాగవు. సినిమా అనేక చోట్ల నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని భావోద్వేగాలను పెంచడానికి ఉపకరిస్తుంది.

శ్రీయతో, పవన్ కల్యాణ్ మాట్లాడే సన్నివేశం లాంటి చోట్ల ఛాయాగ్రహణ పనితనం కనిపిస్తుంటుంది. సినిమాలో మొదటి పాట లాంటి చోట్ల చకచకా సన్నివేశాన్ని నడిపిన ఎడిటర్, సెకండాఫ్‌కు వచ్చేసరికి ఆ సన్నివేశాలు, వాటిలోని అంశాల తాలూకు అనివార్యత వల్లనేమో ఆ ‘టెంపో’ను చూపలేకపోయారు. పవన్ కల్యాణ్ భువి మీదకు వచ్చే సన్నివేశం, అక్కడి యాక్షన్ ఘట్టం ఇంటర్వెల్‌కు ముందు సినిమాలో ఊపు తెస్తుంది.

ఎలా ఉందంటే...
ఫస్టాఫ్‌కే కథ, హీరో లక్ష్యం తెలిసిపోతాయి. ఇక, సెకండాఫ్‌లో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి పడ్డ కష్టం, దేవుడి సాయం, మానవత్వం వర్సెస్ దైవం పేరుతో సాగే వ్యాపారం లాంటి కీలక ఘట్టాలను చూపాలి. కానీ, సరిగ్గా అక్కడకు వచ్చే సరికే కథనం నీరసపడిపోయింది. కోర్టులో వెంకటేశ్ వాదన, ‘బోనులో భగవంతుడు’ టీవీ చర్చాకార్యక్రమం లాంటివి, ఆ మాటకొస్తే చివరాఖరులో గోపాలరావుకూ - గోపాలదేవుడికీ జరిగే సంభాషణ లాంటివి సుదీర్ఘమైన మోనో యాక్షన్ లాగా సాగుతాయి. దాంతో, ప్రేక్షకుడు సహనానికి పరీక్ష ఫీలవుతాడు.

నిజానికి, మతం పేరిట, మనిషిలో దేవుడి పట్ల ఉన్న భయాన్ని సొమ్ము చేసుకుంటూ సాగుతున్న వ్యాపారమనే పాయింట్‌ను ‘ఓ మై గాడ్’ బాగా చర్చకు పెట్టింది. అదే విషయాన్నే తాజాగా ఆమిర్‌ఖాన్ ‘పీకె’ కూడా మరో కోణంలో సహజంగా, సమర్థంగా చూపెట్టింది. ఆ రెండిటినీ జనం చూసేసిన తరువాత రావడం - ‘గోపాల... గోపాల...’కున్న బలహీనత!

ఈ రకమైన ఇతివృత్తానికి ప్రేక్షకులను మానసికంగా సిద్ధం చేయడానికి మాతృకలు ఉపయోగపడినా, ఇప్పటికే చూసేసిన కథాంశంలా ఆనుకొనే ప్రమాదం ఉంది. పైగా, దైవం మీద ప్రేమ కన్నా భయంతో చేసే శుష్క పూజల కన్నా, సాటి మనిషిని ఆదుకోవడమే అసలు దైవత్వమనే పాయింట్‌ను ఇంకా బలంగా చెప్పాల్సింది. మరోపక్క స్వామీజీలు మతం, దైవం పేరుచెప్పి మోసం చేస్తుంటే, గంగాజలమంటూ ట్యాప్ తిప్పి పట్టిన నీళ్ళిచ్చే హీరో చేస్తున్నది మాత్రం ఏమిటనిపిస్తుంది. వెరసి, పాత్రధారులే తప్ప, పాత్రలు కనిపించని ఈ రీమేక్‌కు పండగ సెలవులు, పవన్ కల్యాణ్ క్రేజు కలిసొస్తాయి కానీ, అది ఎన్ని రోజులన్నది దాదాపు రూ. 50 కోట్ల పైచిలుకు ప్రశ్న.


- రెంటాల జయదేవ
 

(Published in 'Sakshi' internet, 11th Jan 2015, Sunday)
.............................................

Saturday, January 3, 2015

వెయ్యి నవలల చెయ్యి - కొవ్వలి లక్ష్మీనరసింహారావు


వెయ్యి నవలల చెయ్యి

అరవై ఏళ్ళ క్రితం ఆయన రచనలంటే తెలుగు పాఠకులకు వేలంవెర్రి. నెల తిరిగే లోపలే పదే పదే ముద్రణకు వచ్చిన ఆయన నవలలు కొల్లలు. రచననే వృత్తిగా చేసుకొని, వెయ్యికి పైగా నవలలు రాసి, సామాన్యుల్లో పఠనాభిలాషను పెంచి, పుస్తకాలకు పాఠకలోకాన్ని అందించిన ఆ తెలుగు రచయిత  - కొవ్వలి లక్ష్మీనరసింహారావు. పాపులర్‌గా... కొవ్వలి! ఏడాదికి వంద నవలల చొప్పున రాసి, 30వ ఏటకే 600 నవలలు పూర్తిచేసిన ఘనత కొవ్వలిది. ఆయన రచనలపై సాహిత్య అకాడెమీ, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ రేపు హైదరాబాద్‌లో ‘చర్చా సదస్సు’ నిర్వహిస్తున్నాయి. సందర్భంగా కొవ్వలి రెండో కుమారుడు, రిటైర్‌‌డ బ్యాంక్ అధికారి లక్ష్మీనారాయణ పంచుకున్న కొన్ని జ్ఞాపకాలు...  
 
కొవ్వలి లాంటి సుప్రసిద్ధుడికి సంతానమైనందుకు మా తోబుట్టువులం నలుగురం ఇవాళ్టికీ ఎంతో గర్విస్తుంటాం. వెనక్కి తిరిగి చూస్తే - నాన్న జీవితం, రచనా జీవితం గమ్మత్తుగా సాగాయనిపిస్తుంది. ఆయన పుట్టింది నూట రెండేళ్ళ క్రితం జూలై 1వ తేదీన తూర్పు గోదావరి జిల్లా తణుకులో! మా తాతయ్య ప్లీడరు గుమస్తా. రెండేళ్ళ వయసులోనే తల్లి పోవడంతో, అక్కల దగ్గరే నాన్న పెరిగారు. రాజమండ్రిలోని వీరేశలింగం హైస్కూల్‌లో మెట్రిక్ చదివే రోజుల్లో ప్రముఖులు జయంతి గంగన్న హెడ్‌మాస్టర్, ‘హాస్యబ్రహ్మ’ భమిడిపాటి కామేశ్వరరావు లెక్కల మాస్టారు.. నాన్నను తీర్చిదిద్దినవారు ఆ ఇద్దరూ!

నాన్న రచనలు చేయడానికి స్ఫూర్తినిచ్చిన సంఘటన ఒకటుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర పోడూరులో నాన్న, వాళ్ళ అక్కయ్య పోడూరి కామేశ్వరమ్మ దగ్గర ఉన్న రోజులవి. ఒకరోజున ఒక ఇల్లాలు ఇంట్లో చంటి పిల్లాడు మలవిసర్జన చేస్తే, ఒక కావ్యంలోని కాగితం చించి, దాంతో శుభ్రం చేసి, కిటికీలో నుంచి పారేయడం నాన్న కంట పడింది. అర్థం కాని ఆ గ్రాంథిక భాష, విషయం వల్ల ఆ పని చేసినట్లు ఆ ఇల్లాలు చెప్పడంతో నాన్నలో ఆలోచన మొదలైంది. వెంటనే ఆయన ఇల్లొదిలి, ఏడాది పాటు దేశాటన చేశారు. ఎలాంటి భాషతో, ఏ విషయాల మీద రాస్తే సాహిత్యం జనానికి చేరుతుందని అందరినీ అడిగి ఒక అభిప్రాయానికి వచ్చారు. తిరిగొచ్చాక 23వ ఏట 1935లో తొలి నవల ‘పల్లెపడుచులు’ రాశారు. వాడుక భాష, ఆకర్షణీయమైన శైలితో సాగిన ఆ సాంఘిక నవలకు మంచి స్పందన రావడంతో వరుసగా నవలలు రాసుకుంటూ వెళ్ళారు. బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ, వితంతు పునర్వివాహాలను సమర్థిస్తూ, స్త్రీ స్వేచ్ఛను ప్రతిపాదిస్తూ, సంఘ సంస్కరణ దృష్టితో ఆయన రాసిన నవలలు కొద్ది రోజుల్లోనే ఆకట్టుకున్నాయి. మూడు పదుల వయసొచ్చేనాటికి 600 నవలలు రాశారాయన.

 సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రకం, అపరాధ పరిశోధన - ఇలా అన్ని కోవల రచనలూ ఆయన చేశారు. అతి తక్కువ ధరకే పుస్తకాలివ్వాలని తపించారు. నాన్న అధిక శాతం నవలలు రాసింది ఏలూరు, రాజమండ్రిల్లో! సినిమా వాళ్ళ పిలుపు మేరకు మద్రాసుకు వెళ్ళాక, ‘భయంకర్’ అనే కలం పేరుతో డిటెక్టివ్ రచనలు చేశారు.
 నిజానికి, నాన్నకు సినిమాల మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. సినిమావాళ్ళు బలవంతపెట్టడంతో మద్రాసుకు వెళ్ళారు. నటి కన్నాంబ సొంత చిత్రాలు నిర్మించ తలపెట్టినప్పుడు మొదటి సినిమా ‘తల్లిప్రేమ’ (1941)కు నాన్నతోనే రాయించారు. అది ఆయన తొలి సినీ రచన. తరువాత డి.ఎల్. నారాయణ ‘వినోదా’ సంస్థను స్థాపించి, సినిమాలు తీస్తూ, నాన్న గారి ‘మెత్తని దొంగ’ నవల ఆధారంగా ‘శాంతి’ చిత్రం నిర్మించారు. ఆ చిత్రం పేకేటి శివరామ్ తొలి సినిమా. అలా 1950ల నుంచి మద్రాసులో నాన్న స్థిరపడ్డారు. కైకాల సత్యనారాయణ తొలి చిత్రం ‘సిపాయి కూతురు’ నాన్న నవలే.

నాన్న రచనలంటే నటి సూర్యకాంతం గారికి మహా ఇష్టం. ఆయన తన వెయ్యో నవల ‘మంత్రాలయ’ను ఆమెకే అంకితమిచ్చారు. ఆ సభలో నేపథ్య గాయకుడు పి.బి. శ్రీనివాస్ వచ్చి, ఉచితంగా పాట కచ్చేరీ చేశారు. అలాగే, నాన్నకి మద్రాసులో షష్టిపూర్తి జరుగుతుంటే, ఆ విషయం వార్తాపత్రికల ద్వారా తెలుసుకొని, గాయకులు ఘంటసాల స్వయంగా వచ్చారు. ‘‘కొవ్వలి గారి షష్టి పూర్తి అంటే దేవుడి పెళ్ళి లాంటిది. దానికి ఎవరూ రమ్మని ప్రత్యేకించి, ఆహ్వానించనక్కర లేదు’’ అంటూ శాలువా కప్పివెళ్ళారు. నటులు సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, చిత్తూరు నాగయ్య గార్లు మేమంటే అభిమానం చూపేవారు. నాన్న గారు పోయాక ఆ మధ్య తిరుమలలో వెంకన్న కల్యాణం చేయించుకొని, మద్రాసుకు కుటుంబ సమేతంగా వెళుతున్నాను. ఆ రోజున మా సీట్ల వెనకాలే బాపు - రమణలు కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళి ‘కొవ్వలి గారి అబ్బాయి’నంటూ పరిచయం చేసుకున్నా. బాపు ఎంతో సంతోషించారు. ముళ్ళపూడి వారైతే లేచి నిల్చొని, ‘తెలుగు రచయితలకు పాఠకుల భిక్ష పెట్టింది మీ నాన్న గారే!’ అంటూ నమస్కరించారు. నాన్న రచనా వారసత్వం పిల్లలెవరికీ రాకపోయినా, ఆ రోజుల్లో ఆయన మీద ప్రముఖులకున్న గౌరవం ఇవాళ్టికీ మాకు మిగిలిన అపురూప వారసత్వం. ఆత్మాభిమానంతో, ఎవరినీ ఏ సాయం అడగని తత్త్వం వల్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందుల పాలైనా మమ్మల్ని మంచి పౌరులుగా నాన్న పెంచారు.

 నాన్న నవలల జాబితా మొత్తం మా దగ్గర ఉంది. మొత్తం వెయ్యిన్నొక్క నవలలు. అయితే, మొదటి నుంచి రచనల్ని భద్రపరుచుకొనే అలవాటు నాన్నకు లేదు. దాంతో, తొలి రోజుల్లో రాసిన నవలలు కొన్ని వందలు మా దగ్గర లేవు. పెళ్ళయిన తరువాత నుంచి మా అమ్మ ప్రతి నవల కాపీ భద్రంగా దాచేది. అలా మా దగ్గర ఇప్పటికి అయిదారొందల నవలలే ఉన్నాయి. మిగిలినవి సేకరిస్తున్నాం. తాజాగా ‘విశాలాంధ్ర’ వారు 18, ‘ఎమెస్కో’ వారు 43 పుస్తకాలు ప్రచురించారు. పాతిక భాగాల జానపద నవల ‘జగజ్జాణ’ను వెయ్యి పేజీలతో ఒకే సంపుటిగా ఇటీవల విడుదల చేస్తే, చక్కటి స్పందన వచ్చింది. త్వరలో ‘విషకన్య’ రానుంది.

 వెయ్యిన్నొక్క నవలలు రాసిన ఆధునిక తెలుగు రచయితగా నాన్న గారు కొవ్వలిది ఇవాళ్టికీ ఒక రికార్డే. ఇప్పటికి నూట రెండేళ్ళ క్రితం పుట్టిన ఆ మనిషిని ఇవాళ్టికీ సజీవంగా నిలిపింది ఆ రచనలే. అవన్నీ మళ్ళీ అందుబాటులోకి రావాలి. కొందరు ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్ర్పచారం, ‘చౌకబారు నవలలు’ అంటూ వచ్చిన అపప్రథ తొలగిపోవాలి. అదే మేము కోరుకొనేది. సాహిత్య అకాడెమీ ‘చర్చా సదస్సు’ ఆ కృషిలో మొదటిమెట్టు!
 
 
స్త్రీ స్వేచ్ఛ, సంఘసంస్కరణ లాంటి భావాలతో రచనలు చేసినందు వల్లే నాన్న గారి నవలలపై అప్పట్లో ఛాందసులు, సంప్రదాయవాదులు లేనిపోని ప్రచారం చేశారు. ఆ నవలల్ని గమనిస్తే, వాటిలో ఒక్క శాతమైనా అసభ్యత, అశ్లీలం ఉండవు. పెపైచ్చు, ప్రతి నవలకూ ముందే ‘సూచన’ అంటూ నాన్న ఆ రచన ద్వారా సమాజానికి తానివ్వదలుచుకున్న సందేశం ఏమిటో రాశారు. ఆ సూచనలన్నీ ఒక పుస్తకంగా తేవాలనుకుంటున్నాం.
 
- రెంటాల జయదేవ


(Published in 'Sakshi' daily, 13th Dec 2014)
...................................

Thursday, January 1, 2015

ఆ పాట.. ఆయన.. చిరంజీవులు

సందర్భం: రచయిత మోదుకూరి జాన్సన్ వర్ధంతి

ఆ పాట.. ఆయన.. చిరంజీవులు - by Vijaya Chander

ఆ పాట.. ఆయన.. చిరంజీవులు
Gollapudi, Modukuri Johnson, KV Gopala Swamy

 ‘కరుణామయుడు’ సినిమాకు సంబంధించి నాకెన్నో అనుభవాలు, అనుభూతులు ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది రచయిత మోదుకూరి జాన్సన్‌తో ఆ సినిమాకు సాగిన ప్రయాణం... ఆ చిత్రానికి ఆయన మాటలు, ‘కదిలింది కరుణరథం...’ పాట రాసిన సందర్భం. మోదుకూరి, నేను - ఇద్దరం రంగస్థలం మీద నుంచి సినీ రంగానికి వచ్చినవాళ్ళమే. ఆయనతో నాకు అప్పట్లో పరిచయం లేదన్న మాటే కానీ, మోదుకూరి రాసిన ‘నటనాలయం’ నాటకం అప్పట్లో ఎంతో పేరు తెచ్చుకుంది. ఆ నాటకం చూసే ఏయన్నార్ - ఆదుర్తి సుబ్బారావులు తమ సొంత చిత్రం ‘మరో ప్రపంచం’తో ఆయనకు సినీ రచయితగా అవకాశమిచ్చారు.

  నటుడిగా నాకూ అదే తొలి చిత్రం. అలా అప్పటి నుంచి ఆయనతో నాకు ప్రత్యక్ష పరిచయం. ‘కరుణామయుడు’కి మాటల రచనకు క్రీస్తు జీవితం, సందేశాలతో పరిచయమున్న రచయిత అయితే బాగుంటుందని అనుకున్నాం. నేను, నా భాగస్వామి సజ్జల చిట్టిబాబు కలసి మోదుకూరి గారైతే బాగుంటుందని తీసుకున్నాం. ‘అమృతవాణి’ సంస్థ తరఫున ఫాదర్ క్రిస్టఫర్ కొయిలో ఆంగ్లంలో తయారు చేసిన ఇంగ్లీషు స్క్రిప్టు ఆధారంగా ముగ్గురం ముందుకు సాగాం. దాదాపు 13 గంటల నిడివి గల స్క్రిప్టును ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఉండేలా 2 గంటల 45 నిమిషాల నిడివికి కుదించాం.

 మోదుకూరి అప్పటికే పేరున్న రచయిత. పెద్ద చిత్రాలకు కథ, మాటలు అందించారు. అయితే క్రీస్తు కథ కాబట్టి, ఈ చిత్ర రచనా విధానం గురించి ఆయనతో మాట్లాడడానికి నేను, చిట్టిబాబు గారు వెళ్ళాం. క్రీస్తు మీద చిత్రం కాబట్టి, ప్రత్యేకంగా ధ్వనించే క్రైస్తవ తెలుగులో మాటలు రాస్తానన్నారాయన. అయితే, నేను మాత్రం వద్దని వాదించా. ‘‘మనం ఈ సినిమా తీస్తున్నది కేవలం క్రైస్తవుల కోసం కాదు. క్రైస్తవేతరులతో సహా అందరూ చూడడం కోసం! కాబట్టి, అందరికీ అర్థమయ్యే సులభమైన తెలుగులో రాయాలి’’ అన్నా. చివరకు క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్‌కు చెందిన ఫాదర్ బాలగర్ (స్కాట్లండ్) కూడా నన్ను సమర్థించారు. మోదుకూరి గారు కూడా మా వాదనలోని అంతరార్థాన్ని గ్రహించి, అంగీకరించారు. మామూలు తెలుగులో మాటలు రాశారు. ‘కరుణామయుడు’ రిలీజయ్యాక ఆ మాటలు, ఆ శైలి తరువాతి క్రీస్తు చిత్రాలకు ఒక ఒరవడి పెట్టాయి.

 అలాగే, ఆ చిత్రాన్ని అందరిలోకీ తీసుకువెళ్ళిన పాట - ‘కదిలింది కరుణరథం...’. క్రీస్తు జననం నుంచి పునరుత్థానం వరకు అన్నీ ఉండే ‘కరుణామయుడు’లో అతి కీలకమైన పాట - యేసు క్రీస్తు శిలువ మోస్తూ పాడే ఆ గీతం. అది సినిమాకు గుండెకాయ. నిజానికి, ఆ పాటను మోదుకూరితో రాయించాలనుకోలేదు. ఆయన రాసిన మొదటి వెర్షనూ అది కాదు. అసలు ఆ పాటను శ్రీశ్రీ, ఆత్రేయల్లో ఎవరితోనైనా రాయించాలని నా ఆలోచన. ఆ చర్చ జరుగుతున్నప్పుడు మోదుకూరి గారు ‘చూడు విజయ్! ఆ కీలకమైన పాట నేను రాస్తా. నచ్చితే పెట్టుకో’ అన్నారు. అప్పటికే ఆయన ‘దేశోద్ధారకులు’ (‘స్వాగతం దొరా...’ పాట) లాంటి చిత్రాల్లో పాటలు రాశారు. నాకంత ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నా. మంచి గాయకుడు కూడా అయిన మోదుకూరి పిలిచారు. ఆయన ఏదైనా రచన చేస్తున్నా, వినిపిస్తున్నా తెల్లటి టర్కీ టవల్ కట్టుకొని, మంచం మీద బాసింపట్టు వేసుకొని చెప్పేవారు. ఆ పాట చాలా చెత్తగా ఉందంటూ ఆ మాటే ఆయనకు మొహం మీద చెప్పేశా.


 ఎన్టీఆర్ ‘పాండురంగ మాహాత్మ్యం’లోని ‘హే కృష్ణా! ముకుందా!’ పాట లాగా చాలా ఉన్నత స్థాయిలో ఉంటూ, దయ, ప్రేమ, దుఃఖం, కరుణ - ఇలా అన్ని రకాల ఛాయలూ ప్రతిఫలించేలా పాటలో వేదన కనపడాలని చెప్పా. మోదుకూరి మారుమాట్లాడకుండా టవల్ మీదే బాత్‌రూమ్‌లోకి వెళ్ళి, షవర్ కింద నీళ్ళలో దేవుణ్ణి కన్నీటితో ప్రార్థిస్తూ, తడిసి ముద్దై వచ్చి, మరొక్క ఛాన్సిస్తే రాసిస్తానన్నారు. నేను సరేనన్నా. అలా షవర్ కింద నీటిలో తన కన్నీటిని దాచుకొని, ఆయన రెండోసారి రాసిందే - ‘కదిలింది కరుణరథం..’ అన్న సూపర్‌హిట్ పాట.

  ఆయన రెండోసారి రాసిన వెర్షనే - ‘కదిలింది కరుణరథం... సాగింది క్షమా యుగం... మనిషి కొరకు దైవమే... కరిగి వెలిగె కాంతిపథం...’ అన్న సూపర్‌హిట్ పాట. కులమతాలకు అతీతంగా ‘కరుణామయుడు’ అందరికీ చేరువ కావడానికీ, అంత బాగా ఆడడానికీ - ఎంతో తాత్త్వికత, క్రీస్తు జీవిత సారమున్న ఆ పాట ఓ కారణం. నిడివి ఎక్కువగా ఉండే ఈ పాటను డబుల్ పేమెంట్ ఇచ్చి, మద్రాసు విజయా గార్డెన్స్‌లో సంగీత దర్శకుడు జోసెఫ్ వి. కృష్ణమూర్తి, బి. గోపాలం సంగీతంలో రికార్డింగ్ చేయించడానికి చేతిలో తగినంత డబ్బులు లేక అవస్థ పడ్డాను. దేవుడి మీద భారం వేస్తే, ఆటలో డబ్బులొచ్చాయి. అలా ఆ పాట రికార్డింగ్ చేశాం. ఎస్పీబీ తక్కువ పారితోషికం తీసుకొని పాడారు. ఇక, వేర్వేరు లొకేషన్లలో చిత్రీకరణ జరపాలని మొదటే బరువైన కొయ్య శిలువ తయారు చేయించాం. ప్రతి లొకేషన్‌లో కొద్దిగా తీశాం. అలా షూటింగ్ జరిగినన్ని రోజులూ అన్ని చోట్లకూ ఆ శిలువ మోసుకుంటూ వెళ్ళాం.

 ఎన్నో ఇబ్బందుల మధ్య నాలుగేళ్ళు నిర్మాణంలో ఉండి, 1978 డిసెంబర్‌లో విడుదలైన ‘కరుణామయుడు’ మా జీవితాలనే మార్చేసింది. తరువాత నేను తీసిన ‘దయామయుడు’, ‘ఆంధ్రకేసరి’ చిత్రాలకూ మోదుకూరే రచయిత. అలాగే, బాపు-రమణల ‘రాజాధిరాజు’లో ఆయన రాసిన ‘రాజ్యము బలము మహిమ నీవే నీవే...’ పాట కూడా సుప్రసిద్ధం. వ్యక్తిగా ఎంతో మంచివాడు, అభ్యుదయ భావాలున్న మోదుకూరికి ఇవాళ్టికీ రావాల్సినంత గుర్తింపు, పేరు రాలేదు. యాభై ఏళ్ళ వయసుకే ఆయన అర్ధంతరంగా మరణించడంతో ఒక మంచి రచయితను కోల్పోయాం. కానీ, ‘కరుణామయుడు’తో పాటు ఆయన, ఆయన పాట చిరంజీవులే!

 (సంభాషణ- రెంటాల జయదేవ)

(Published in 'Sakshi' daily, 25th Dec 2014)
............................................