జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, January 26, 2011

నిబద్ధ పాత్రికేయుడు శివలెంక శంభుప్రసాద్ శత జయంతి నేడే!



(బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆంధ్రపత్రిక దినపత్రిక, వారపత్రిక, భారతి మాసపత్రికల అధిపతి, దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి మేనల్లుడూ, అల్లుడూ అయిన స్వర్గీయ శివలెంక శంభుప్రసాద్ గారి శత జయంతి నేడు (2011 జనవరి 26). ఆ సందర్భంగా దాదాపు 50 ఏళ్ళ పాటు ఆంధ్రపత్రిక ప్రచురణలకు కార్యక్షేత్రమైన చెన్నపట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ, మద్రాసు తెలుగు జర్నలిస్టు మిత్రులం కలసి శతజయంతి స్మరణోత్సవ సభ నిర్వహిస్తున్నాం. ఆయనను స్మరిస్తూ, 92 ఏళ్ళ సీనియర్ జర్నలిస్టు - ఆంధ్రపత్రిక కార్యనిర్వాహక సంపాదకులూ అయిన మద్దాలి సత్యనారాయణ శర్మ గారు రాసిన ఈ ప్రత్యేక వ్యాసం - సాహితీ, పత్రికాభిమానుల కోసం...)


అక్షయ భావాల అక్షర తేజం


--- రచన -- మద్దాలి సత్యనారాయణ శర్మ

ఆం ధ్రపత్రిక, సచిత్ర వారపత్రిక, భారతి, ఉగాది సంచికలకు 1938నుంచి 1972 వరకు సంపాదకత్వం వహించిన శివలెంక శంభుప్రసాద్‌కు నేడు శతజయంతి. ఆ కాలపు తెలుగు పత్రికా సంపాదకులలో శంభుప్రసాద్‌ది ఒక ప్రత్యేక స్థానం. 1936 నాటికే ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఇరుగు పొరుగు ప్రాంతాలకంటే అధికంగా ఉండేది. పత్రికల ప్రాచుర్య ప్రాబల్యాలు కూడా ఎక్కువ. పెద్ద దినపత్రికలే కాక చిన్న వార, పక్ష మాస పత్రికలు కూడా వివిధ రకాలుగా పాఠకుల అభిమాన ఆదరాలను పొందడానికి బహురకాలుగా ప్రయత్నిస్తూ ఉండేవి.
వీటిలో ముఖ్యమైనవి: సంపాదకుల పేర్లను ప్రముఖంగా ముఖపత్రాలపై ప్రచురించుకొనడం.... అప్పట్లో ప్రామాణికాలుగా పరిగణితమైన హిందూ, స్టేట్స్‌మన్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ టైమ్స్ పత్రికలవలె ఆంధ్రపత్రిక, తమిళ స్వదేశమిత్రన్‌కూడ సంపాదకుల పేర్లను ‘ఇంప్రింటు’లో మాత్రమే చూపేవి. వీటి సంపాదకులు అరుదుగా సభలలో, సమావేశాలలో పాలొన్నప్పటికీ విషయ ప్రాధాన్యంతో వార్తలు వేయడమేగాని తమ ఫోటోలను తమ పత్రికలలో వేసుకునేవారు కాదు. ఆంధ్రపత్రిక సంపాదకుడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఈ ప్రమాణాలను పాటించేవారు. తమ పత్రికా సిబ్బందిలో ఎవరైనా అత్యుత్సాహంతో తమను గురించి వ్యక్తిగత వార్తను గానీ, తమ ఫోటోనుగానీ పొరపాటున ప్రచురిస్తే మందలించేవారు. నాగేశ్వరరావు పంతులు నిర్యాణానంతరం ఆ పత్రిక ప్రచురణ, సంపాదక బాధ్యతలను వహించిన శంభుప్రసాద్ కూడా కట్టకడపటి వరకూ ఆ ప్రమాణాలను పాటించారు.

నాగేశ్వరరావు పంతులు బహు వ్యాపకం పెట్టుకున్నందున ఆయన ఉపన్యాసాల, ప్రసంగాల వార్తలు వేయక తప్పేది కాదు. అట్లాగే శంభుప్రసాద్ రాజ్యసభ, రాష్ట్ర శాసనమండలి సభ్యత్వాలను స్వీకరించినపత్యాగమయం..జీవితం!్పడు కూడ ఆ ప్రమాణాలను తుచ తప్పకుండా పాటించారు, ఇష్టాగోష్టులలో పాల్గొనడానికే తప్ప వేదికలెక్కడానికి ఒప్పుకునే వారు కాదు. నోరి నరసింహ శాస్ర్తీ వంటి పెద్దలకు కూడా ఆయనను వేదిక ఎక్కించడం సాధ్యం కాలేదు.
రాజ్య సభ , శాసనపరిషత్ సభ్యత్వం కాలంలో వివిధ సమస్యలపై వివరాలను సేకరించి, తన అభిప్రాయాలను సూచిస్తూ ఆయా మంత్రిత్వ శాఖలకు లిఖిత పత్రాలను పంపేవారు కాని సభలో సవాళ్లు విసిరీ, వాగ్ధాటి చూపీ పేరు ప్రఖ్యాతులు పొందాలని వాంఛించలేదు. నిత్యాధ్యయనంతో బహువిషీయ పరిజ్ఞానం సాధించినవాడు. వ్యక్తిగత సంభాషణలు, ఉత్తరప్రత్యుత్తరములలో ఆయన ప్రజ్ఞను గ్రహించిన రచయితలు ఎందరో ఎంతో ప్రశంసిస్తూ ఆయన మరణించినపుడు పత్రికలకు రాశారు.

శంభుప్రసాద్ నాగేశ్వరరావుపంతులు సోదరి భ్రమరాంబగారి కడసారి బిడ్డ. మేనమామ ఇంటనే కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా ఎలకుర్రులో 1911 జనవరి 26న శంభుప్రసాద్ జన్మించారు. సాధ్యమైనంత సంపాదించి దేశహితానికి వినియోగించాలన్నఏకైక ధ్యాస, ధ్యానంతో చెన్నపట్నం, కలకత్తా, ముంబయిలకు వెళ్లిచొరవగా ధనార్జన మార్గాలను అనే్వషిస్తున్న నాగేశ్వరరావు పంతులు మేనల్లుని తీరు తెన్నులను చిన్నతనంలోనే గ్రహించి సరియైన మార్గంలో పెట్టి ప్రోత్సాహించారు.
శివలెంక వారి పెసరమిల్లి అగ్రహారంలో ప్రాథమిక విద్య ముగియడంతోటే సోదరి బావలను ఒప్పించి పిల్లవానిని చెన్నపట్నం తీసుకువెళ్లి అడయారులోని బెసెంట్ థియసాఫికల్ హైస్కూలులో చేర్పించారు. అప్పుడు చెన్నరాష్ట్రంలో తొలి ఆశ్రమ పాఠశాల అది. అక్కడే శంభుప్రసాద్‌కు స్వావలంబన అలవడింది. తర్వాత బందరు జాతీయ కళాశాలలో చేర్పించారు. తమ ఏకైక తనయ కామాక్షమ్మను ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత రవీంద్రుని శాంతినికేతన్‌కి పంపారు. అక్కడ పట్ట భద్రుడు అయిన మీదట ఆంధ్రపత్రిక సంస్థలోని అన్ని పనులు అభ్యసింపచేసారు.
శంభుప్రసాద్ సంసార జీవితం సొగసైనది, సంస్కారవంతమైనది. అనేక విద్యలు అభ్యసించిన అర్ధాంగి అనుకూలవతి. భర్తకు అన్నివిధాలా ఆసట బాసటగ ఉండి ఆయన కర్తవ్యనిర్వహణకు ఎంతో తోడ్పడింది. బంధుకోటితో నిండిన గృహ నిర్వహణలోను, పిల్లల పెంపకంలోను ఆమెదే ముఖ్యపాత్ర. ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.
నాగేశ్వరరావు పంతులు మనసుపడి నిర్మించిన శ్రీబాగు ఎల్లప్పుడు బంధు జనులతో కళకళలాడుతుండేది. పత్రికా సిబ్బందికి కూడా ఆ ఇంటి ఆతిధ్యం అనుభవించే అవకాశాలు లభించేవి. కార్యాలయంలో వినాయక చతుర్థి దసరారోజులలో పూజలు జరిగేవి.

వి.ఎస్.నయీపాల్ వంటి విదేశీ భారతీయుల ప్రముఖులు వచ్చినప్పుడు శంభుప్రసాద్‌ని కలిసి కాలక్షేపం చేసి ఆతిధ్యం పొందడం పరిపాటి. ఆ సందర్భంలో సంపాదకవర్గ సభ్యులకు కూడా పాల్గొనే అవకాశాలుండేవి. శంభుప్రసాద్ జీవితం,సంతృప్తికరంగా, ఆదర్శప్రాయంగా గడిచిపోయింది. ఆయన సన్నిహితులం అయిన కొందరం శతజయంతిని జరుపుతున్నాము.

Tuesday, January 18, 2011

సినిమాను గట్టెక్కించలేని సాంకేతిక నైపుణ్యం



(విజువల్సు విందు, కథ చెప్పగనేమందు... - పార్ట్ 2)

అనగనగా ఓ ధీరుడు సినిమాకు ప్రధాన బలమంతా - సాంకేతిక నిపుణుల కృషే. సౌందర్ రాజన్ అందించిన ఛాయాగ్రహణం బాగుంది. లొకేషన్లను కనువిందుగా చూపారు. చాలా రోజులకు తెలుగు తెర మీద వస్తున్న ఈ ఫ్యాంటసీ సినిమా అంతా ఓ చందమామ కథలా తెరపై సాగిపోయేందుకు ఉపయోగించిన కలర్ స్కీమ్ బాగుంది.

సాంకేతిక విభాగాల విశేష శ్రమ

సినిమాలోని అత్యధిక భాగం దృశ్యాలు, వాడిన దుస్తుల రంగులు, నేపథ్యం - అన్నీ కంటిని చీకాకుపరచకుండా హాయి నిచ్చేవిగా ఒదిగాయి. ఈ విషయంలో ఆర్ట్, మేకప్, కాస్ట్యూమ్స్ విభాగం వాళ్ళ పనితనం కూడా చెప్పుకోవాలి. కళా దర్శకత్వం (భూపేష్ ఆర్. భూపతి) సంగతికే వస్తే - ఆ సెట్లు, మౌల్డులు, వగైరా వా..వ్ అనిపిస్తాయి. ఇక, సినిమాలోని సర్ప కేశాలు, కాకాసురులు, సర్పిణి విన్యాసాలు - వగైరాల విజువల్ ఎఫెక్ట్ లు నిర్దుష్టంగా ఉండడం చిత్రానికి వన్నె తెచ్చింది.

సినిమా మొదట్లో, చివర్లో రవి శంకర్ (హీరో సాయికుమార్ తమ్ముడు, వదల బొమ్మాళీ వదల... లాంటి డైలాగులతో డబ్బింగ్ లో కింగ్) చేత వ్యాఖ్యానం ఇప్పించారు. అయితే, స్వరం ఎంత బాగున్నా, సినిమా కథలో అంతర్గతంగా ఉన్న గందరగోళాలు, దానికి తోడు ఎఫెక్టివ్ గా లేని డైలాగులతో ఆ వ్యాఖ్యానం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. అలాగే, ఈ సినిమాకు పాటల్లో కూడా గొప్పగా ఏమీ లేవు. ఉన్నంతలో ‘చందమామలా అందగాడినే...’, మునుపే విన్నట్లున్న రిథమ్ తో ‘నిన్ను చూడని...’ మాత్రం బాగున్నాయి. ఈ సినిమాకు కీరవాణి, కోటి, మిక్కీ జె. మేయర్, సలీమ్ - సులేమాన్ మర్చెంట్ లు అయిదుగురు సంగీత దర్శకులు. కాగా, సలీమ్ - సులేమాన్ మర్చెంట్ లు నేపథ్య సంగీతం సమకూర్చారు.

సినిమాలో కొన్ని లోటుపాట్లు

అయితే, ఇంతటి సాంకేతిక కృషి కూడా సినిమాలో ప్రేక్షకుల్ని పూర్తిగా లీనం చేయలేకపోయింది. సినిమా చూస్తుంటే, కథలోని చాలా లోటుపాట్లు ప్రేక్షకుల మనసుకు వీర లెవల్లో గంట కొడుతుంటాయి.

-- అసలు ఈ సినిమాలో ఐరేంద్రి మొదలు ఆమె దగ్గర సైన్యంలో ఉన్నవాళ్ళంతా మనుషులో, దెయ్యాలో, మంత్రగాళ్ళో చాలా సేపటి వరకు అర్థం కాదు.

-- చిన్నారి మోక్షకు కథానాయకుడైన యోధ ఆశ్రమంలో ఉన్నప్పటి నుంచి చిరకాలంగా తెలుసు కదా. అలాంటప్పుడు దైవశక్తులున్న ఆ అమ్మాయి, హీరోకు చాలా ముందుగానే కళ్ళు రప్పించవచ్చు. అలా ఎందుకు చేయదో అర్థం కాదు. ఆ తరువాత అగర్తకు ప్రయాణం ప్రారంభించాక మాత్రం హీరోయిన్ లేని లోకాన్ని తాను చూడదలుచుకోలేదనడం వల్లే హీరోకు ఆ అమ్మాయి కళ్ళు రప్పించలేదన్నట్లుగా చూపారు.

-- ఇక ఐరేంద్రి ఫ్లాష్ బ్యాక్ ఏమిటో, అంగరాజ్యంలోని ఆ అగర్త వాసులు ఆమెను అలా సజీవంగా ఎందుకు దహనం చేశారో అర్థం కాదు. అకసాత్తుగా ఆ సన్నివేశం తెర మీదకు వచ్చి, అంతే అర్ధంతరంగా వెళ్ళిపోతుంది.

-- దుష్టశక్తుల నుంచి పసిపాపలను కాపాడుతుందని చెబుతూ వచ్చిన మోక్ష ఆఖరికి వచ్చేసరికి ఆ పని ఏ మేరకు, ఎలా చేసిందో అర్థం కాదు - ఒక్క విలన్ ను అనంతాకాశంలో విలీనం చేయడం తప్ప.

-- అన్నిటి కన్నా ముఖ్యంగా ఎంతటి ఫ్యాంటసీ కథ అయినా, దీని కంటూ ఓ కాలం, స్థలం ఉండాలి కదా. సినిమా నేపథ్యం కానీ, సంభాషణలు కానీ, ఆ వ్యవహారం కానీ అవేవీ అంతుబట్టనివ్వవు.

-- పైగా, సినిమాలో కొన్నిచోట్ల వినిపించే ‘మాకు సమయం బొక్క’ (హీరో), ‘జప్ఫా గాడు’ (బ్రహ్మానందం) లాంటి డైలాగులు సమకాలీన సినిమాలను తలపిస్తూ, ప్రాచీన కథాకాలమనే ఫ్లేవర్ ను కూడా వీలైనంత చెడగొట్టాయి. (మాటలు - శశి రాజసింహ, సహ రచన - రాహుల్ కోడా).

-- ఇక, జిలేబీగా ఆడా మగా కాని తరహా పాత్రలో అలీ మాటలు, చేష్టలు, హీరోకీ - అతనికీ మధ్య జరిగే సంభాషణలు చిన్న పిల్లల వాల్ట్ డిస్నీ చిత్రానికి తగినట్లు లేవు.

ఈ సినిమాకు రచన, దర్శకత్వ బాధ్యతలు ప్రకాశ్ కోవెలమూడి (ప్రముఖ దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావుకు మనుమడు) చేపట్టారు. వాల్ట్ డిస్నీతో కలసి కె. రాఘవేంద్రరావు బి.ఏ. ఈ చిత్రాన్ని సమర్పించడమే కాక, తండ్రిగా తనయుడి దర్శకత్వానికి క్రియేటివ్ సూపర్ విజన్ బాధ్యతలు నిర్వహించారు. కానీ అవేవీ ఈ చిత్ర కథ, కథనం, పాత్రల స్వభావ చిత్రణలో కావలసిన నాటకీయతను రప్పించలేకపోయాయి. గందరగోళం లేకుండా కథను సాఫీగా చెప్పలేకపోయాయి. ఇక, కళ్ళెదుటే కనిపిస్తున్న దృశ్యానికి కూడా కొన్ని చోట్ల పాత్రలతో చెప్పించిన డైలాగులు, వాటి ప్రవర్తన చూస్తే - రంగస్థల నాటికలు గుర్తొస్తాయి.

ఈ ఎనిమిది రీళ్ళ యు (యూనివర్సల్ ) సర్టిఫికెట్ సినిమాలో గంట సేపు సాగే ప్రథమార్ధం ఫరవాలేదల్లే ఉందే అనిపిస్తుంది. కానీ, ద్వితీయార్ధం సాగే రెండో గంట మాత్రం చీకాకు పరుస్తుంది. అతిగా చొచ్చుకువచ్చే పాటలు అందుకు అదనం.

మొత్తం మీద, రకరకాల రంగు రంగుల రేఖాచిత్రాలతో సినిమా ముందొచ్చే టైటిల్స్, ఆఖరున వచ్చే టైటిల్స్ చూస్తే - ఈ సినిమాకు తెర వెనుక ఎంత శ్రమ, ఎందరి కృషి ఉందో అర్థమవుతుంది. అంతమంది టెక్నీషియన్లు కష్టపడబట్టే, చిత్రం సాంకేతికంగా, విజువల్ గా గొప్పగా తయారైందని అనిపిస్తుంది. తెలుగు సినిమాల్లో ఈ తరహా స్థాయిని ఊహించడమే కష్టమైన రోజుల్లో, వాటిని తెరపై చూపి(సి)నందుకు గర్వించవచ్చు. అయితే, ఎంతటి సాంకేతిక విన్యాసమైనా, ఎన్ని స్పెషల్ ఎఫెక్టులైనా కథలో, కథనంలో పట్టు లేకపోతే, ఎలా నిష్ప్రయోజనమవుతాయో ఈ సినిమా చూసి గ్రహించవచ్చు.

కొసమెరుపు --

సినిమా చూసి తిరిగొస్తూ ఉంటే, నా ముందే నడుస్తున్న ఓ సగటు ప్రేక్షకులిద్దరు మాట్లాడుకుంటూ వెళుతున్నారు. ఒక మిత్రుడు తన వెంటే ఉన్న రెండో మిత్రుడితో, ‘‘ఆ మధ్య ఆయిరత్తిల్ వరువన్ (తెలుగులో గత ఏడాది వచ్చిన యుగానికొక్కడుకు తమిళ మాతృక) చూశాం. ఇప్పుడిది చూశాం. రెంటికీ కథ గందరగోళంగా ఉంది. అర్థం కాలేదురా’’ అంటున్నాడు. దానికి ఆ రెండో మిత్రుడు - ‘‘కనీసం అది తమిళం కాబట్టి, అర్థం కాలేదంటే అర్థం ఉందిరా. కానీ, ఇది తెలుగే కదరా’’ అని బదులిచ్చాడు. దీని భావమేమి రాఘవేంద్రా? అందుకే ఒక్క మాటలో అనగనగా ఓ ధీరుడు - విజువల్స్ విందు! కథ చెప్పగనేమందు...!?

విజువల్సు విందు! కథ చెప్పగనేమందు... !?



వాల్ట్ డిస్నీ పిక్చర్స్ వాళ్ళ సినిమా అనగానే చిన్నప్పటి నుంచి చూసినవాటి అనుభవంతో మన కళ్ళ ముందు ఓ ఊహా దృశ్యం కదలాడుతుంది. ఈ ప్రపంచ ప్రసిద్ధ సంస్థ తెలుగులోకి వచ్చిన తీసిన తెలుగు సినిమా అనేసరికి బోలెడంత ఆసక్తి కలుగుతుంది. తెలుగు సినిమాలో అరుదుగా కనిపించే ప్రొఫెషనలిజమ్ ఇందులో కచ్చితంగా కనబడుతుందని ఆశ పుడుతుంది. దానికి తోడు, సినిమా ట్రైలర్లు కూడా దృశ్యపరంగా అద్భుతం అనిపిస్తే ఇంక వేరే చెప్పాలా. అందుకే, ఊళ్ళోకి ‘అనగనగా ఓ ధీరుడు’ వచ్చిందని తెలియగానే మనసు లాగింది. పాత పాట మాటల్లో చెప్పాలంటే, ‘మాయదారి సినిమోడు నా మనసే లాగేసిండు....’ అలా ఈ రాత్రి ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమా చూశా.

చెప్పొద్దూ... సినిమా చూస్తున్నంత సేపూ ఏదో హాలీవుడ్ సినిమా చూస్తున్నట్లే అనిపిస్తుంది. ఆ విజువల్సు, ఆ సెట్లు, ఆ ఛాయాగ్రహణం, ఆ ఎడిటింగ్, ఆ ఫైట్లు, అన్నిటికీ మించి సినిమాలోని ఆ గ్రాఫిక్స్ (సి.జి.ఐ - కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్ ) అన్నీ కొత్త లోకాల్లోకి తీసుకువెళతాయి. అయితే, అన్నీ ఉన్నా అయిదోతనం లేదన్నట్లు ఈ సినిమాకు ఓ పటిష్ఠమైన కథ, దాన్ని నేర్పుగా నడిపే కథనం, గందరగోళం లేకుండా వాటిని చూపే విధానమే కరవయ్యాయి. అందుకే, ఆ మేరకు అనగనగా ఓ ధీరుడు ఆశాభంగం కలిగిస్తాడు. కొందరికి మరీ నిరాశే మిగులుస్తాడు.

కథా సంగ్రహం

ఈ చిత్ర కథ ఓ చిత్రమైన కథ. కన్నీటి బొట్టు ఆకారంలో ఉండే అంగరాజ్యంలోని అగర్త అనే ఊళ్ళో పిల్లలు రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. దానికంతటికీ కారణం దుష్టశక్తి కాలనేత్ర ప్రభావంతో, సర్పశక్తి తోడుగా విజృంభిస్తున్న ఆత్మ - ఐరేంద్రి (మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న). ఈ క్షుద్రశక్తి బారి నుంచి వారిని కాపాడాలంటే అక్కడకు చాలా దూరంలోని పుష్పగిరి కోనలోని ఆశ్రమంలో స్వామీజీ (సుబ్బరాయశర్మ) సంరక్షణలో పెరుగుతున్న దైవాంశ సంభూతురాలైన 9 ఏళ్ళ మోక్ష (బేబీ హర్షిత) వల్లనే అవుతుంది. ఆమెను తీసుకురావడం కోసం అగర్త నుంచి ఓ వ్యక్తి బయలుదేరతాడు. మోక్షను అతనితో పంపుతూ, ఓ యోధ (సిద్ధార్థ) అనే ఓ అంగ రక్షకుణ్ణి తోడుగా ఇస్తాడు స్వామీజీ. అంధుడైనా సరే, కత్తి పడితే ఎంతటివారినైనా ఎదిరించి, ఓడించగల ధీరుడు.

అంధుడైన ఆ యోధుడికి ఓ ఫ్లాష్ బ్యాక్. ఒకప్పుడు అతనికీ కళ్ళుండేవనీ, అతను ఆ కళ్ళను ఎలా పోగొట్టుకున్నాడనీ ఆ కథలో చూపెడతారు. మోక్షను ఎలాగైనా పట్టి, తెచ్చి, చంద్రగ్రహణం రోజున ఆమె రక్తంతో అమరత్వం పొందాలన్న దురాశతో మంత్రగత్తె అయిన రాణి ఐరేంద్రి ఏం చేసింది, ఆ తరువాత ఏమైంది, హీరో ప్రేయసి ప్రియ (శ్రుతీ హాసన్ ) ఏమైంది, ఆమెకూ ఐరేంద్రికీ సంబంధం ఏమిటి వగైరా అంతా మిగతా సినిమాలో చూడవచ్చు.

నటనా విభాగం

ఒకప్పటి షావోలిన్ తరహా పోరాట చిత్రాల నుంచి ఇటీవలి హ్యారీ పోటర్ వరకు ఎన్నో చిత్రాలు, కథల ప్రభావం స్పష్టంగా తెలిసిపోయే సినిమా ఇది. ఇందులో యోధగా సిద్ధార్థ చాలా చురుకుగా, ఉత్సాహంగా కనిపించారు. యుద్ధ సన్నివేశాల్లోనూ ఆ వేగం చూపించారు. అయితే, ఎటొచ్చీ, కొన్నిచోట్ల అంధుడి పాత్రలో ఆయన నటన కళ్ళున్నవ్యక్తి చేసినట్లే ఉండడం లోపం. ఆ చిన్నపాటి లోపం వెండి తెరపై కొన్నిసార్లు పెద్దదిగా కనిపించేస్తుంది. ఇక, మంత్రాలు తెలిసిన ప్రియ పాత్రలో శ్రుతీ హాసన్ (కమలహాసన్ పెద్ద కుమార్తె) మల్లె తీగలా నాజూగ్గా ఉంది. తెలుగులో ఇదే తొలి పరిచయమైన శ్రుతితో హీరోయిన్ కు తక్కువ, వ్యాంప్ కు ఎక్కువ తరహా నటన ఎందుకు చేయించారో అర్థం కాదు. మంత్రగత్తె రాణి ఐరేంద్రి పాత్రలో మంచు లక్ష్మీ ప్రసన్న (తెలుగు తెరపై ఆమెకూ ఇదే తొలి పరిచయం) నటన ప్రభావవంతంగా ఉంది. వాచికాభినయంలో కూడా ఆమె చేసిన కృషి చాలా వరకు ఫలించింది. ఆ పాత్రకు మేకప్ దగ్గర నుంచి, వస్త్రాలంకరణ, విజువల్ ఎఫెక్ట్ ల వరకు అన్నీ చాలా బాగా అమరాయి. మోక్షగా బేబీ హర్షిత నిండుగా అనిపించలేదు. పైగా, కథకు ఆ పాత్రే కీలకమైనా, దానితో చేయించింది కూడా ఏమీ లేదు. ‘నిమ్మ, దానిమ్మ’ అనే సేనాని సుడిగుండంగా రవిబాబు ఫరవాలేదనిపిస్తారు. మిగిలినవన్నీ కథానుసారం వచ్చి పోయే పాత్రలు.

(మిగతా భాగం మరి కాసేపట్లో...)

Saturday, January 15, 2011

బాలయ్య నటిస్తే, బాగా లేదనకూడదా!?

‘పరమ వీర చక్ర’ సినిమా గురించి రాసిన రెండు టపాల సమీక్ష అత్యధిక శాతం మందికి నచ్చినా, ఒక బ్లాగర్ మాత్రం నా మీద విరుచుకుపడ్డారు. నాకు లేనిపోనివి అంటగడుతూ వ్యాఖ్యానించారు. నిజానికి, నా టపాలను వారు జాగ్రత్తగా చదివితే, అలా అర్థం చేసుకొనే పరిస్థితే వచ్చేది కాదు. హీరో అల్లు అర్జున్ గురించి అనలేదేం, రామ్ చరణ్ తేజ్ ను గురించి మాట్లాడలేదేం, నయాపైసా నటన లేకపోయినా గ్లామర్ తో నెట్టుకొస్తున్న నాగార్జున మాటేమిటి ---- అంటూ సదరు వ్యాఖ్య చేసిన వ్యక్తి నన్ను ప్రశ్నించారు. దీనికి నేను ఓ చిన్న వివరణ ఇవ్వదలిచాను.

ఏ సినిమా పైన అయినా (నా చిత్తశుద్ధికి లోపం లేకుండా) నిజాయతీగా రాయాలనేది నేను అనుకున్న, ఆచరిస్తున్న నియమం. ఎవరో ఒకరి వైపో, ఒక వర్గం వైపో నిలబడి మాట్లాడాల్సిన, రాయాల్సిన అవసరం నాకు లేదు. పర్సనల్ గా వెళ్ళాల్సిన పనీ అంతకన్నా లేదు. జర్నలిజంలో చెప్పే మొదటి పాఠాలు, నియమాలు అవి. వాటిని పాటించడానికే సదా నేను ప్రయత్నిస్తుంటాను. గతం నుంచి ఇప్పటి దాకా సరిగ్గా గమనిస్తే, నా రాతలు అందుకు తగ్గట్లే ఉంటాయి. అంతే తప్ప, సదరు వ్యాఖ్య చేసిన వ్యక్తి అనుకుంటున్నట్లు నాకు బాలయ్య తక్కువా కాదు, మరెవరో ఎక్కువా కాదు. ద్వేషించాల్సినంత ద్రోహం హీరో బాలకృష్ణ ఎవరికైనా (పోనీ, నా మటుకు నాకు) ఏం చేశారని. సినిమాను సినిమాగా చూసి, అందులోని లోటుపాట్లు చెప్పడమే నా ఉద్దేశం.

పైగా, హీరో, హీరోయిన్ల గురించి చెబుతున్నప్పుడు అనివార్యంగా వాళ్ళ అందచందాలు, చూపులకు వాళ్ళు ఎలా ఉన్నదీ చెప్పక తప్పదు (ముఖ్యంగా గ్లామరే ఇరుసుగా నడుస్తున్న మన చిత్రపరిశ్రమలో...). ఫలానా నటి లేదా నటుడు మునుపటి కన్నా సన్నబడి, ఆకర్షణీయంగా తయారయ్యారని అన్నప్పుడు అభిమానులుగా ఆనందిస్తున్నాం కదా. అలాంటప్పుడు శరీరాకృతిపై పట్టు తప్పినప్పుడు ఆ మాట ఎవరైనా ఎత్తి చూపితే ఆగ్రహిస్తే ఎలా. చదివిన వెంటనే కాస్తంత కటువుగా తోచినా, ఇలాంటి సతార్కికమైన విమర్శల వల్ల అవతలి వాళ్ళు జాగ్రత్తపడతారు. తరువాతి చిత్రాల్లోనైనా జాగ్రత్తపడతారు. అలాంటి లోపాలు సరిచేసుకుంటారు. దానివల్ల వాళ్ళ తదుపరి ప్రయత్నాలు బాగుంటాయి. ఏ రచనకైనా, ముఖ్యంగా విమర్శల పరమార్థం అదే. అలా కాకుండా, ఉన్నది కూడా అసలు చెప్పకూడదంటే ఎలా. అత్త తిట్టినందుకు కాదు... తోడికోడలు నవ్వినందుకు... అంటే ఇదే.

Friday, January 14, 2011

పండగకు ‘పరమ వీర చక్ర’కు వెళ్ళండి! పగలబడి నవ్వండి!!

(.. వినోదం కోసం పరమ వీర చక్ర - పార్ట్ 2)

ఆఫీసులో మంచి హడావిడిలో ఉండగా, నిన్న మధ్యాహ్నం ఓ మెసేజ్ వచ్చింది. ఊళ్ళోకి ‘పరమవీర చక్ర’ వచ్చిందనీ, ఈ ఒక్క రోజే ఫలానా హాలులో అనీ. ఆలసించిన ఆశాభంగం అన్న ఈ ఆకర్షణీయమైన ఆఫర్ చూసి, ఎప్పటిలానే సినిమా పిచ్చోళ్ళం టెంప్ట్ అయ్యాం. పోలో మంటూ రాత్రి పొద్దుపోయాక, సెకండ్ షోకి వెళ్ళాం.

కథ, కథనం

రాత్రి 10 గంటలు దాటాక సినిమా మొదలయ్యే వేళకే బాల్కనీ ఫుల్లు. టైటిల్స్ అవుతూనే ఓ చిన్న జర్క్. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఎన్టీయార్ ‘బొబ్బిలిపులి’లో ఒకటి రెండు ఘట్టాలు తెరపై కనిపించేసరికి... ఒకటే అరుపులు, ఈలలు, గోల. అప్పటి ఎన్టీయార్ దృశ్యాలకు ఇప్పటి గర్భవతి జయసుధ దృశ్యాలకూ అతకని గ్రాఫిక్స్ తో కథ మొదలవుతుంది. (చిన్న ఎన్టీయార్ యమదొంగ, బృందావనం లాంటి సినిమాల్లో ఇప్పటికే ఇలాంటి సీన్లు చూసేసి, మిమిక్రీ వాళ్ళతో చెప్పించిన అతకని పెద్ద ఎన్టీయార్ కొత్త డైలాగులు చూసి, మనం ముక్కు చీదుకున్న సంగతి గుర్తుంది కదా. ఇప్పుడు ఆ గోరుచుట్టుపై ఇది రోకటి పోటు).

ఆ సీన్ అవగానే రావణబ్రహ్మ గెటప్ లో బాలయ్య ప్రత్యక్షం. నాటకాల ఫక్కీ సినిమా షూటింగ్ సీన్ తో కథ మొదలు. నిజ జీవితంలో ఓ పెద్ద సినిమా హీరో - చక్రధర్ (బాలకృష్ణ). ఇక, ఆ హీరో వేసే రావణబ్రహ్మ గెటప్, కార్మిక నాయకుడి గెటప్, కొమరం భీమ్ గెటప్ లలో సినిమా ఇంచ్ కూడా ముందుకు కదలకుండా ఓ ముప్పావు గంట గడిచిపోతుంది. సినిమాకు ఓ కథ చెప్పి, ఒప్పించడం కోసం ఓ ఆర్మీ ఆఫీసర్ జితేంద్ర (మురళీమోహన్) మాటి మాటికీ వస్తుంటాడు.

ఓ ఆర్మీ అధికారి కథ అది. ఆ పాత్ర స్వరూప స్వభావాలు మాత్రం చెప్పి, మిగిలిన కథను చెప్పడం కాదు, నేరుగా చూపిస్తానంటూ మన హీరోను హెలికాప్టర్ లో హిమాచల్ ప్రదేశ్ కు తీసుకువెళతారు. అక్కడ ఓ మంచు గుహలోకి తీసుకెళ్ళిన సైనిక అధికారులతో ...కథ అన్నారు, సినిమా అన్నారు. ఇక్కడకు తెచ్చారేమిటి... అంటూ హీరో చక్రధర్ అడుగుతాడు. సరిగ్గా అదే డైలాగులతో మనసులో మధనపడుతున్న ప్రేక్షకులకు ఎంతోసేపటిగా ఎదురుచూస్తున్న ఇంటర్వెల్ అప్పటికి లభిస్తుంది. బతుకు జీవుడా అంటూ కాసేపు బయటకెళ్ళి ఊపిరి పీల్చుకొనే వీలు కలుగుతుంది.

ఆ మంచుగుహలో మంచం మీద అచేతనంగా పడి ఉన్న సైనికాధికారి మేజర్ జయసింహ (మళ్ళీ బాలకృష్ణే) కనిపిస్తాడు. అచ్చం తనకు జిరాక్స్ కాపీలా ఉన్న అతణ్ణి చూసి, హీరో చక్రధర్ గతుక్కుమంటాడు. అప్పటి దాకా వాళ్ళు చెప్పిన ఆర్మీ అధికారి కథ సినిమా స్క్రిప్టు కాదనీ, నిజజీవిత గాథ అనీ తెలుసుకుంటాడు. ఆ ఆర్మీ అధికారి అలా అచేతనంగా పడి ఉన్నాడెందుకన్నది ఫ్లాష్ బ్యాక్. ఆ కథలో అంతర్భాగంగా సినీ హీరోను ఇక్కడకు ఎందుకు తెచ్చారన్నది ఓ ట్విస్టు. చివరకు ఆర్మీ అధికారి కర్తవ్యాన్ని హీరో ఎలా పూర్తి చేశాడు, ఏం చేశాడన్నది - మిగతా కథ. కొడుకు సినిమా హీరో కావడం ఏ మాత్రం ఇష్టం లేని తల్లి (జయసుధ), ఆమె మొదటి సీనులో పెద్ద ఎన్టీయార్ తో కనిపించిన దానికీ, సినిమా ఆఖరి సీనుకీ ముడిపెట్టడంతో దాదాపు మూడు గంటల తెరపై నాటకం ముగిసిపోతుంది.

హీరో చక్రధర్ ను గుడ్డిగా ప్రేమించే ఓ అభిమాని జ్యోతిక (షీలా). ఆమె అక్క హేమ (హేమ), మరదలి మీద కన్నేసే ఆమె సైంటిస్టు భర్త (బ్రహ్మానందం), రోబో చడ్డీ (ఆలీ)ల ట్రాక్ సినిమాతో సంబంధం లేకుండా స్క్రీన్ మీద మధ్య మధ్య వస్తూ పోతూ ఉంటుంది. సినిమాను 16 రీళ్ళ నిడివికి పెంచడానికీ, కాసేపు (అప)హాస్యానికే తప్ప ఈ సన్నివేశాల వల్ల పైసా ప్రయోజనం లేదు.

పులిని చూసి పెట్టుకున్న వాతలు...

అర్థం పర్థం లేని కథ, దానికి అంతకన్నా అవకతవక స్క్రీన్ ప్లే, పదే పదే అవే అరిగిపోయిన డైలాగుల కాలుష్యం - వెరసి ఈ సినిమా. సైనికాధికారి పాత్రలోనూ, ఇటు సినిమా హీరో పాత్రలోనూ బాలకృష్ణతో చాలా సందర్భాల్లో అనవసరపు అతి డైలాగులు చాలానే చెప్పించారు. చివరికొచ్చేసరికి సైనికాధికారుల కన్నా వీర విజృంభణతో ఓ సినిమా హీరో అందరినీ మట్టి కరిపించడం ఓ పెద్ద పజిల్.

ఈ సినిమాలో హీరో చక్రధర్ పాత్ర రకరకాల సినిమాల్లో నటించిందంటూ బాలకృష్ణకు ఇష్టమైన పౌరాణికాది గెటప్ లు వేయించారు. ఇందులో రావణబ్రహ్మగా నాటకాల తరహా గదతో బాలకృష్ణ చేసే నటన చూస్తే నవ్వాగదు. పెద్ద ఎన్టీయార్ తరహా పర్సనాలిటీ లేని బాలయ్య ఒంటి మీద అదుపు కోల్పోయి, పెద్ద పొట్ట, సన్న కాళ్లతో నడుస్తూ వస్తుంటే మంచి పాత్రలు సైతం పాత్రధారుల చేతుల్లో ఎలా ధ్వంసమవుతాయో తెలుసుకోవచ్చు. సీతారామ కల్యాణం చిత్రంలో రావణబ్రహ్మగా పెద్ద ఎన్టీయార్ చేసిన అభినయానికీ, దీనికీ హస్తిమశకాంతరం. పైగా ఎన్టీయార్ తన విశాలమైన శిరోభాగానికి తగ్గట్లు చేయించుకున్న కిరీటాన్ని చిన్న తల బాలయ్య పెట్టుకుంటూ ఉంటే, కిరీటం తెగ వదులుగా, తలకు మరీ పెద్దగా ఎబ్బెట్టుగా అనిపించింది. ఇక, మండోదరి పాత్రలో వేదను చూడలేం. సగం గ్రాంథికం, సగం వ్యావహారికంతో ఆ డైలాగులు సరేసరి. ఇదే ఇలా ఉంటే, బాపు దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న రాబోయే ‘శ్రీరామరాజ్యం’ సినిమాను తలుచుకుంటేనే మనకు భయం పుడుతుంది.

జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఉద్యమకారులను మంచి చేసుకోవాలనే దురాలోచన / ధూరాలోచనతో బాలకృష్ణతో గిరిజన యోధుడు కొమరం భీమ్ గెటప్ కూడా వేయించారు. ఉన్నంతలో ఈ గెటప్ లోనే బాలకృష్ణ బాగున్నారు. అయితే, బాలకృష్ణతో ఈ గెటప్ తో అతిగా అభినయింపజేయడమే బాగా లేదు.

సినిమాలో నాయికలుగా కనిపించిన షీలా చేసిందేమీ లేదు - కనిపించినప్పుడల్లా హీరోను కామపు చూపులతో చూడడం తప్ప. ఇక, మరో హీరోయిన్ అమీషా పటేల్, విలన్ వేషంలో రజియా సుల్తానాగా వచ్చే నేహా ధూపియాలను చూస్తే మనం కనీసం పదేళ్ళ క్రితం సినిమా చూస్తున్నామో అన్న అనుమానం వస్తుంది. కనిపించకుండా పోయిన నాయికలను ఏరుకొని తెచ్చి, ఈ సినిమా చేయించిన దర్శక - నిర్మాతల ‘అభిరుచి’కి జోహార్లు.

మంత్రిగా నాగినీడు (గత ఏడాది రాజమౌళి ‘మర్యాద రామన్న’లో విలన్), ఆర్మీ ఆఫీసర్లుగా విజయకుమార్, మురళీమోహన్, కోవర్టుగా చరణ్ రాజ్ - ఇలా సినిమాలో తారాగణం చాలానే ఉంది. వాళ్ళు చేసిందీ, చేయగలిగిందీనే ఏమీ లేదు. సినిమాలో సినిమా హీరో కథను చూపడంతో, దర్శకులు కోడి రామకృష్ణ, బి. గోపాల్, సింగీతం శ్రీనివాసరావు, శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను, నిర్మాతలు డి. రామానాయుడు, పరుచూరి కిరీటి, రచయిత జొన్నవిత్తుల వగైరాలందరూ వాళ్ళ వాళ్ళ నిజజీవిత పాత్రల్లోనే కనిపిస్తారు.

సిగ్గనిపించే సాంకేతిక పనితనం

సాంకేతిక విభాగాల వ్యవహారం కూడా నవ్వు తెప్పిస్తుంది. సినిమాలో దుర్వినియోగం చేసిన (ముఖ్యంగా పాటల చిత్రీకరణలో) లెన్సులను చూస్తే 2011 నాటి సినిమానా ఇది అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలూ అంతే. హీరో ఓ తలుపు లో నుంచి నడుచుకుంటూ వస్తుంటే చాలు, ఆ ధాటికే పక్కనే ఉన్న నాలుగు అద్దాల తలుపులలో నుంచి రౌడీలు ఎగిరి ఇటు పడుతుంటారు. హీరో ఒంటి చేత్తో వందల మందిని గిరగిరా తిప్పి అవతల పడేస్తుంటాడు. మేకప్ కూడా కొన్నిచోట్ల కృతకంగా ఉంది. బాంబు దాడిలో దెబ్బ తిన్న ఆర్మీ అధికారి గెటప్ లో బాలకృష్ణ ముఖాన్ని క్లోజప్ లో చూపించినప్పుడు, ...మేకప్ ఎవడ్రా... అంటూ అరుపులు వినిపించాయంటే, పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమాలో ఎంతోమందితో పాటలు రాయించుకున్నప్పటికీ, వారి పేర్లు వేస్తూనే, తాను కూడా పాటల వ్యవహారంలో చేతులు పెట్టి, కథ - మాటలు - పాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం అని దాసరి నారాయణరావు చెప్పుకున్నారు. సినిమాలో ఒక్క పాట కూడా గుర్తుండదు. మణిశర్మ బాణీలూ అంతే. పైగా, తన పాత హిట్ పాటలకు తనే కాపీ. మేజర్ బాలకృష్ణకూ, నేహా ధూపియాకూ మధ్య వచ్చే డ్రీమ్ సాంగ్ సాకీ వస్తుండగానే, ‘పోకిరి’లోని ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే...’ అంటూ హాల్లో జనం ఘొల్లుమన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భావస్ఫోరకంగా పాడిన ఒకటి రెండు గీతాలు మాత్రం హాలులో వినడానికి బాగానే ఉన్నాయి.

ఈ సినిమా కోసం బాలకృష్ణను నానా కష్టపెట్టి రకరకాల స్టెప్పులు వేయించారు. కానీ, ఆ తరహా కీళ్ళవాతం స్టెప్పులతో హాలంతా ఒకటే గోల. డ్రెస్ సెన్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హీరోకు అసహ్యంగా పెరిగిపోయిన కటి ప్రాంతాన్ని కప్పిపుచ్చడానికో ఏమో, ఓ డ్యూయట్లో ఏకంగా కోటు కూడా వేయించారు. అది చూస్తే సంక్రాంతి బుడబుక్కల వేషాలు గుర్తుకురావడం ఖాయం.

టెక్నాలజీ పెరిగిపోయి, డిజిటల్ ఇంటర్మీడియట్ లు, కలర్ కరెక్షన్ లూ వచ్చేసిన ఈ రోజుల్లో ఈ సినిమాలో సగం పైగా సన్నివేశాలు, దృశ్యాలు అలుక్కుపోయినట్లుగా, అస్పష్టంగా ఉన్నాయి. ఇక, రంగులన్నీ అలికేసినట్లుగా, ముదురు రంగులు తెర నిండుగా పరవడం ప్రేక్షకుడికి దెబ్బ మీద దెబ్బ.

హాలంతా సందడే సందడి

మా ఊళ్ళోని ఆ హాలులో ఒక్క రోజే ఈ సినిమా కావడంతో, బాల్కనీ అంతా జనంతో నిండిపోయింది. అయితే, సినిమా మొదలైన కాసేపటికే జనానికి విషయం అర్థమైపోయింది - తొందరపడి వచ్చి బాగా బుక్కయిపోయామని. ఇక, సినిమాలో వచ్చిన ప్రతి చెత్త సన్నివేశానికీ, డైలాగుకీ జనం హాయిగా అల్లరి చేస్తూ సినిమా చూశారు. గంట దాటే సరికి జనం భరించ లేక, ...ఒక్క బ్రేక్ ఇవ్వు బాసూ, మళ్ళీ వస్తాం... అని గేళి చేస్తూ, గోల సాగించారు. ఇంటర్వెల్ అని తెర మీద పడగానే, హాలులో... ఓ... అంటూ లాంగ్ బెల్ విన్న స్కూలు పిల్లల్లా అరిచారు. విభిన్నమైన నేపథ్యాలు, ఆలోచనలు, అభిరుచులున్న సమూహానికి ఏక కాల దృశ్య ప్రదర్శన రూపం - సినిమా అంటాం. కానీ, ఇంత ముక్త కంఠంతో జనమంతా ఏకాభిప్రాయంతో సినిమా చూసిన అనుభవం నాకు తొలిసారిగా పరమవీర చక్రలోనే కలిగింది. ప్రేక్షకులందరినీ ఒక్క తాటి మీదకు తెచ్చినందుకు ఈ చిత్ర దర్శకుణ్ణీ, హీరోనూ తప్పకుండా అభినందించాల్సిందే.

కొసమెరుపు --

అన్నట్లు ఈ సినిమాలో ‘‘నన్ను కొట్టినా చస్తావు, నేను కొట్టినా చస్తావు’’ అంటూ 15 పైగా టేకులు చెప్పే ఓ డైలాగు ఉంది. కాసేపు ఆ భాగోతం చూశాక, నాతో వచ్చిన నా సీనియర్ సహోద్యోగి ఒకాయన ఓ అద్భుతమైన డైలాగు కాయిన్ చేశారు. అది ఏమిటంటే , (బాలకృష్ణ తన సినిమాకు వచ్చిన ప్రేక్షకులతో...) ‘‘నేను సినిమా చేసినా చస్తావు, నువ్వు సినిమా చూసినా చస్తావు...’’

ఏమైనా, వీటన్నిటికి సిద్ధపడి, సినిమా చూడడం కోసం కాకుండా, సరదాగా మిత్రులతో కలసి కాలక్షేపంగా తెర మీద ఏదో చూస్తూ, కామెంట్లు చేసుకోవడానికైతే ఇటీవలి కాలంలో ఇంత మంచి సినిమా మరొకటి లేదు. అందుకే నా మాట మాత్రం ఒకటే -- పండగ అయిపోయి, సినిమా ఎత్తేసే లోగా ‘పరమ వీర చక్ర’ చూడండి. పగలబడి నవ్వుకోండి....

(బ్లాగు మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..)

Thursday, January 13, 2011

వినోదం కోసం ‘పరమ వీర చక్ర’

మీరు ఈ మధ్య కాలంలో ఏ సినిమా చూసినా తలనొప్పితో తిరిగొస్తున్నారా.? ఏదీ మీకు తగినంతగా వినోదం పంచడం లేదని బాధపడుతున్నారా? తెలుగు సినిమాల మీద కచ్చితమైన అభిప్రాయం చెప్పలేక సతమతమవుతున్నారా? అయితే, మీరు అర్జెంటుగా ‘పరమ వీర చక్ర’ సినిమా చూడాల్సిందే. సరైన స్నేహితులతో కలసి ఈ సినిమాకు వెళ్ళండి. మీకు నూటికి నూరుపాళ్ళు వినోదం గ్యారెంటీ. దానికి నేను హామీ.

మీరు పెట్టిన ప్రతి పైసాకూ వినోదం అందిస్తూ, తెర పై ప్రతి మాటకూ, హీరో ప్రతి కదలికకూ, దర్శకుడి ప్రతి ఆలోచనకూ పగలబడి నవ్వుకోవచ్చు. సినిమా చూస్తున్నంత సేపూ మీరు తెగ ఎంజాయ్ చేస్తారు. తెలుగు సినిమా ఇంకా ఇలాగే ఉన్నందుకు తెగ నవ్వుకుంటారు. 150వ సినిమాగా కూడా ఇలాంటి సినిమా తీయగల దర్శకులు మన దగ్గరే ఉన్నందుకు ఏమనాలో తెలియక విషాదంగా నవ్వుతారు. ఈ చిత్రాలను అత్యద్భుత చిత్రాలుగా చెప్పుకు తిరుగుతున్న మన హీరోలనూ, దర్శక, నిర్మాతలనూ చూసి విరగబడి నవ్వుతారు. అందుకే, తప్పక చూడండి. ‘పరమ వీర చక్ర.’ ఆలస్యం చేయకండి. కొంపదీసి ఆలస్యం చేస్తే, మీరు చూద్దామన్నా హాలులో ఈ సినిమా ఉండదు....

(ఈ అర్ధరాత్రి ‘పరమ వీర చక్ర’లో మాకు కలిగిన మహదానందం గురించి రేపు తెల్లవారాక... నిద్ర లేచాక..తరువాతి పోస్టులో...)