వాల్ట్ డిస్నీ పిక్చర్స్ వాళ్ళ సినిమా అనగానే చిన్నప్పటి నుంచి చూసినవాటి అనుభవంతో మన కళ్ళ ముందు ఓ ఊహా దృశ్యం కదలాడుతుంది. ఈ ప్రపంచ ప్రసిద్ధ సంస్థ తెలుగులోకి వచ్చిన తీసిన తెలుగు సినిమా అనేసరికి బోలెడంత ఆసక్తి కలుగుతుంది. తెలుగు సినిమాలో అరుదుగా కనిపించే ప్రొఫెషనలిజమ్ ఇందులో కచ్చితంగా కనబడుతుందని ఆశ పుడుతుంది. దానికి తోడు, సినిమా ట్రైలర్లు కూడా దృశ్యపరంగా అద్భుతం అనిపిస్తే ఇంక వేరే చెప్పాలా. అందుకే, ఊళ్ళోకి ‘అనగనగా ఓ ధీరుడు’ వచ్చిందని తెలియగానే మనసు లాగింది. పాత పాట మాటల్లో చెప్పాలంటే, ‘మాయదారి సినిమోడు నా మనసే లాగేసిండు....’ అలా ఈ రాత్రి ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమా చూశా.
చెప్పొద్దూ... సినిమా చూస్తున్నంత సేపూ ఏదో హాలీవుడ్ సినిమా చూస్తున్నట్లే అనిపిస్తుంది. ఆ విజువల్సు, ఆ సెట్లు, ఆ ఛాయాగ్రహణం, ఆ ఎడిటింగ్, ఆ ఫైట్లు, అన్నిటికీ మించి సినిమాలోని ఆ గ్రాఫిక్స్ (సి.జి.ఐ - కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్ ) అన్నీ కొత్త లోకాల్లోకి తీసుకువెళతాయి. అయితే, అన్నీ ఉన్నా అయిదోతనం లేదన్నట్లు ఈ సినిమాకు ఓ పటిష్ఠమైన కథ, దాన్ని నేర్పుగా నడిపే కథనం, గందరగోళం లేకుండా వాటిని చూపే విధానమే కరవయ్యాయి. అందుకే, ఆ మేరకు అనగనగా ఓ ధీరుడు ఆశాభంగం కలిగిస్తాడు. కొందరికి మరీ నిరాశే మిగులుస్తాడు.
కథా సంగ్రహం ఈ చిత్ర కథ ఓ చిత్రమైన కథ. కన్నీటి బొట్టు ఆకారంలో ఉండే అంగరాజ్యంలోని అగర్త అనే ఊళ్ళో పిల్లలు రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. దానికంతటికీ కారణం దుష్టశక్తి కాలనేత్ర ప్రభావంతో, సర్పశక్తి తోడుగా విజృంభిస్తున్న ఆత్మ - ఐరేంద్రి (మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న). ఈ క్షుద్రశక్తి బారి నుంచి వారిని కాపాడాలంటే అక్కడకు చాలా దూరంలోని పుష్పగిరి కోనలోని ఆశ్రమంలో స్వామీజీ (సుబ్బరాయశర్మ) సంరక్షణలో పెరుగుతున్న దైవాంశ సంభూతురాలైన 9 ఏళ్ళ మోక్ష (బేబీ హర్షిత) వల్లనే అవుతుంది. ఆమెను తీసుకురావడం కోసం అగర్త నుంచి ఓ వ్యక్తి బయలుదేరతాడు. మోక్షను అతనితో పంపుతూ, ఓ యోధ (సిద్ధార్థ) అనే ఓ అంగ రక్షకుణ్ణి తోడుగా ఇస్తాడు స్వామీజీ. అంధుడైనా సరే, కత్తి పడితే ఎంతటివారినైనా ఎదిరించి, ఓడించగల ధీరుడు.
అంధుడైన ఆ యోధుడికి ఓ ఫ్లాష్ బ్యాక్. ఒకప్పుడు అతనికీ కళ్ళుండేవనీ, అతను ఆ కళ్ళను ఎలా పోగొట్టుకున్నాడనీ ఆ కథలో చూపెడతారు. మోక్షను ఎలాగైనా పట్టి, తెచ్చి, చంద్రగ్రహణం రోజున ఆమె రక్తంతో అమరత్వం పొందాలన్న దురాశతో మంత్రగత్తె అయిన రాణి ఐరేంద్రి ఏం చేసింది, ఆ తరువాత ఏమైంది, హీరో ప్రేయసి ప్రియ (శ్రుతీ హాసన్ ) ఏమైంది, ఆమెకూ ఐరేంద్రికీ సంబంధం ఏమిటి వగైరా అంతా మిగతా సినిమాలో చూడవచ్చు.
నటనా విభాగం ఒకప్పటి షావోలిన్ తరహా పోరాట చిత్రాల నుంచి ఇటీవలి హ్యారీ పోటర్ వరకు ఎన్నో చిత్రాలు, కథల ప్రభావం స్పష్టంగా తెలిసిపోయే సినిమా ఇది. ఇందులో యోధగా సిద్ధార్థ చాలా చురుకుగా, ఉత్సాహంగా కనిపించారు. యుద్ధ సన్నివేశాల్లోనూ ఆ వేగం చూపించారు. అయితే, ఎటొచ్చీ, కొన్నిచోట్ల అంధుడి పాత్రలో ఆయన నటన కళ్ళున్నవ్యక్తి చేసినట్లే ఉండడం లోపం. ఆ చిన్నపాటి లోపం వెండి తెరపై కొన్నిసార్లు పెద్దదిగా కనిపించేస్తుంది. ఇక, మంత్రాలు తెలిసిన ప్రియ పాత్రలో శ్రుతీ హాసన్ (కమలహాసన్ పెద్ద కుమార్తె) మల్లె తీగలా నాజూగ్గా ఉంది. తెలుగులో ఇదే తొలి పరిచయమైన శ్రుతితో హీరోయిన్ కు తక్కువ, వ్యాంప్ కు ఎక్కువ తరహా నటన ఎందుకు చేయించారో అర్థం కాదు. మంత్రగత్తె రాణి ఐరేంద్రి పాత్రలో మంచు లక్ష్మీ ప్రసన్న (తెలుగు తెరపై ఆమెకూ ఇదే తొలి పరిచయం) నటన ప్రభావవంతంగా ఉంది. వాచికాభినయంలో కూడా ఆమె చేసిన కృషి చాలా వరకు ఫలించింది. ఆ పాత్రకు మేకప్ దగ్గర నుంచి, వస్త్రాలంకరణ, విజువల్ ఎఫెక్ట్ ల వరకు అన్నీ చాలా బాగా అమరాయి. మోక్షగా బేబీ హర్షిత నిండుగా అనిపించలేదు. పైగా, కథకు ఆ పాత్రే కీలకమైనా, దానితో చేయించింది కూడా ఏమీ లేదు. ‘నిమ్మ, దానిమ్మ’ అనే సేనాని సుడిగుండంగా రవిబాబు ఫరవాలేదనిపిస్తారు. మిగిలినవన్నీ కథానుసారం వచ్చి పోయే పాత్రలు.
(మిగతా భాగం మరి కాసేపట్లో...)
0 వ్యాఖ్యలు:
Post a Comment