జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, December 30, 2015

కామెడీ పాళ్లెక్కువ... సౌఖ్యం? ('సౌఖ్యం' మూవీ రివ్యూ)

కామెడీ పాళ్లెక్కువ సౌఖ్యం?

చిత్రం : 'సౌఖ్యం'
తారాగణం : గోపీచంద్, రెజీనా
కథ, మాటలు : శ్రీధర్ సీపాన
కెమేరా : ప్రసాద్ మూరెళ్ళ
సంగీతం : అనూప్
నిర్మాత : ఆనంద్ ప్రసాద్
స్ర్కీన్ ప్లే,దర్శకత్వం : ఏ.యస్. రవికుమార్ చౌదరి

హీరో గోపీచంద్‌ది చిత్రమైన కెరీర్. నటుడిగా హీరో పాత్రలతో
 మొదలై విలన్‌గా రాణించి, మళ్ళీ హీరోగా విజృంభించిన
 వెర్సటాలిటీ అతనిది. కానీ ఒకసారి అగ్రహీరోగా పేరు 
తెచ్చుకున్నాక సక్సెస్ నిలబెట్టుకోవడం అనుకునేంత 
ఈజీ కాదు. ఆ క్రమంలో కొన్ని సెంటిమెంట్లకూ, మరికొన్ని
 ఇమేజ్ చట్రాలకూ బందీ కావాల్సి వస్తుంది. ఒక రకమైన 
యాక్షన్, కామెడీ ఫార్ములా ఇటీవల అందరికీ సేఫ్ బెట్
 అయింది. ‘సాహసం’ లాంటి కొన్ని ప్రయోగాలు ఆశించినంత
 విజయం సాధించకపోవడంతో గోపీచంద్ ఆ మార్గం పట్టారు.
 అందుకు తగ్గట్లే గత ఏడాది వచ్చిన ‘లౌక్యం’ ఊహించని
 రీతిలో విజయం సాధించింది.

అలా ‘శంఖం’, ‘శౌర్యం’, ‘లౌక్యం’ తర్వాత ఆయన నవ్వులకే 
ప్రాధాన్యమిస్తూ చేసిన యాక్షన్ ఫిల్మ్ ఈ ‘సౌఖ్యం’.
 టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి లాంటి యక్షప్రశ్నలేయకుండా 
కథలోకి వెళితే - అమ్మానాన్న (ప్రగతి, ముఖేశ్‌రుషి), 
బాబాయ్ (రఘుబాబు) లాంటి బంధాలెన్నో ఉన్నా రెక్లెస్‌గా
 జీవితం గడిపే ఒక యువకుడు శ్రీను (గోపీచంద్). 
అనుకోకుండా అతనికి ఒక రైలు ప్రయాణంలో శైలజ (రెజీనా) 
ఎదురవుతుంది. చూసీచూడగానే ఆమెను ప్రేమించేస్తాడు. 
యాదృచ్ఛికంగా పదే పదే ఆమెను కలుస్తాడు. తమది
 విధి కుదిర్చిన బంధమని అంటాడు.

మొదట కాదనుకున్నా, చివరకు హీరో ప్రేమకు ఆమె
 సరేనంటుంది. తీరా ఆమె వల్ల హీరో కుటుంబం చిక్కుల
 పాలవుతుంది. అప్పటికే ఊళ్ళో భావూజీ అనే విలన్ (ప్రదీప్ రావత్)
 గుంపుతో హీరో గొడవపడి ఉంటాడు. హీరోను తెలివిగా తప్పించడం
 కోసం కలకత్తా వెళ్ళి, కింగ్ మేకర్ పి.ఆర్. (మలయాళ నటుడు దేవన్)
 కూతురిని తీసుకురమ్మంటాడు భావూజీ. సరేనని అక్కడకు
 బయల్దేరతాడు హీరో. తీరా ఆ పి.ఆర్. కూతురే, హీరో ప్రేమించిన హీరోయిన్.

కలకత్తా వెళ్ళిన హీరో అక్కడ పి.ఆర్.ను ధైర్యంగా ఎదిరించి
 మరీ, హీరోయిన్‌ను వెంటబెట్టుకొని వస్తాడు. అయితే, 
భావూజీ గ్యాంగ్ అసలు పన్నాగం తెలిసి, వాళ్ళకు మాత్రం
 చెప్పడు. హీరోయిన్‌ను తన కోడల్ని చేసుకోవాలనుకున్న 
భావూజీ అది తెలిశాక ఏం చేశాడు? కలకత్తా ముఖ్యమంత్రి 
కొడుక్కి తన కూతుర్ని కట్టబెట్టా లనుకున్న పి.ఆర్. 
కలకత్తా నుంచి వచ్చి, హైదరాబాద్‌లో ఏం చేశాడు? 
హీరో తన ప్రేమనెలా పెళ్ళి పీటలకెక్కించాడన్నది ఓపికగా
 వెండితెరపై చూడాలి.  

గోపీచంద్ సహా సుపరిచిత తారలెందరో కనిపించిన ఈ సినిమా
  కథలో చాలా సీన్లు ముందే ఊహించేయగలుగుతాం.
 ఫస్టాఫ్‌లో హీరోయిన్ అడ్రస్ కనుక్కోవడానికి హీరో పడే
శ్రమతో మంచి లవ్‌స్టోరీగా నడు స్తుందనుకుంటాం. 
అంతలోనే అది ముగిసి, కథ యాక్షన్ టర్‌‌న తీసుకుంటుంది. 
ఆ తరువాత మళ్ళీ పూర్తిగా కామెడీ బాట పట్టించారు. 
ఇవాళ అందరూ వినోదానికే మార్కులేస్తున్నారనే భావంతో
 స్క్రిప్ట్‌లో నవ్వులపాళ్ళే ఎక్కువుండేలా చూసుకున్నారు.

ఫస్టాఫ్‌లో ట్రైన్ ఎపిసోడ్‌లో బామ్మ పాత్రధారి సీనియర్ నటి 
‘షావుకారు’ జానకితో మద్యం ఎపిసోడ్, పోసాని లోదుస్తుల
 ఎపిసోడ్ లాంటివి పెట్టారు. సెకండాఫ్‌కు వచ్చేసరికి పృథ్వి, 
కృష్ణభగవాన్, జ్యోతి బృందంతో ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ 
లాంటి పాపులర్ సినిమాల స్పూఫ్ బిట్స్ చేయించారు. 
చివరలో బ్రహ్మానందం ఎపిసోడ్, అలాగే ప్రదీప్‌రావత్‌తో 
‘గబ్బర్‌సింగ్’శైలి అంత్యాక్షరి ఎపిసోడ్ లాంటి కామెడీ బిట్స్ - 
ఇలా వీలున్నవన్నీ చేశారు.

మధ్య మధ్యలో జీపుల్లో ఛేజ్‌లు, పవర్‌ఫుల్ ఫైట్లతో 
గోపీచంద్ యాక్షన్ ఇమేజ్ యథాశక్తి వాడారు.
 కెమేరా వర్‌‌క, కొన్నిపాటల చిత్రీకరణ బాగున్న
 ఈ సినిమాకు ప్రధాన బలంతో పాటు బలహీనతా
 కామెడీనే. బలమైన భావోద్వేగాలుంటేనే వినోదం 
దానికి అదనపు బలమని మర్చిపోతే ఎంత నవ్వుకున్నా ఏం లాభం?


- రెంటాల జయదేవ

(Publishe in 'Sakshi' daily, 26th Dec 2015, Saturday)
.............................................

Tuesday, December 29, 2015

అల్లరిమొగుడి కామికల్ సీక్వెల్ - 'మామ మంచు అల్లుడు కంచు' (మూవీ రివ్యూ)

అల్లరిమొగుడి కామికల్ సీక్వెల్

టైటిల్ : మామ మంచు అల్లుడు కంచు
జానర్ : కామెడీ ఎంటర్ టైనర్
తారాగణం : మోహన్ బాబు,అల్లరి నరేష్, మీనా, రమ్యకృష్ణ, పూర్ణ, అలీ
మాటలు : శ్రీదర్ సీపాన
సంగీతం : అచ్చు, రఘు కుంచె, కోటి
దర్శకత్వం : శ్రీనివాస్ రెడ్డి
నిర్మాత : మంచు విష్ణు

ఇరవైమూడేళ్ళ నాటి ‘అల్లరి మొగుడు’ గుర్తుందా? హిట్టయిన
 ఆ సినిమా కథనూ, అదే హీరోయిన్లనూ తీసుకొని, దానికి
 కొనసాగింపుగా కామెడీగా అల్లుకున్న సీక్వెల్ ‘మామ మంచు-అల్లుడు కంచు’.
 కాకపోతే, మరాఠీ హిట్‌ను బేస్ చేసుకున్నారు. భక్తవత్సలంనాయుడు (మోహన్‌బాబు) 
కిద్దరు భార్యలు. మొదటి భార్య సూర్యకాంతం (మీనా)కో కూతురు శ్రుతి (పూర్ణ).
 రెండో భార్య ప్రియంవద (రమ్యకృష్ణ)కో కొడుకు గౌతవ్‌ు (వరుణ్‌సందేశ్).
 అయితే, ఒకరికొకరికి తెలీకుండా రెండిళ్ళ సెటప్‌ను గుట్టుగా 
నెట్టుకొస్తుంటాడు. ఇంతలో అతని కూతుర్ని ప్రేమిస్తాడు 
బాలరాజు (అల్లరి నరేశ్).

కానీ ఆ పెళ్ళి నాయుడికిష్టం ఉండదు. మరోపక్క కొడుకేమో 
నాయుడంటే పడని సన్యాసిరావు (కృష్ణభగవాన్) కూతురు 
దివ్య (సోనియా)ని ప్రేమి స్తాడు. ఆ పెళ్ళేమో నాయుడు 
ఎలాగైనా చేయాలి. దాంతో, ఇక డ్రామా ఆడడానికి
 స్నేహితుడు ఇస్మాయిల్ (అలీ) సాయం తీసుకుంటాడు. 
అప్పటి నుంచి కామెడీ ఆఫ్ ఎర్రర్‌‌స మొదలవుతుంది. 
కాబోయే అల్లుడు ‘కంచు’ కాదు, ‘మంచు’ అని
 మామకర్థమవుతుంది. ఏకకాలంలో అటు 
కూతురి పెళ్ళి, ఇటు కొడుకు పెళ్ళి నాయుడు
 చేయాల్సొస్త్తుంది. ఏం జరిగిందన్నది మిగతాకథ.
 
ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు ఫార్ములా సూపర్‌హిట్ 
బాక్సాఫీస్ సూత్రం. శోభన్‌బాబు (‘కార్తీకదీపం’) నుంచి
 వెంకటేశ్ (‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’), జగపతిబాబు
 దాకా అందరూ ఆ ఫార్ములానూ, ఇద్దరు భార్యల మధ్య 
నలిగే హీరో అవస్థనూ బాగానే వాడారు. ఈ సినిమాలో 
ఇప్పుడు దానికే, అల్లుడి ట్రాక్ అదనమైంది. నలభై ఏళ్ళ
 సినిమా కెరీర్ పూర్తయిన మోహన్‌బాబుకు ఇలాంటి 
పాత్రలు కొట్టినపిండే. ఆయన తన కోర వయసులో వేసిన 
ఆ తరహా పాత్రల కామెడీని ఇప్పటికీ అవే హావభావాలతో
 చూపారు. తన విలక్షణ డైలాగ్ డెలివరీని ఆసరాగా 
చేసుకొని, రచయితలతో ఆ తరహా డైలాగులు రాయించారు. పలికారు.

‘మాయ్యా’ అంటూ అమాయకురాలైన భార్యగా మీనా, 
హుందాతనం నిండిన ఇల్లాలుగా రమ్యకృష్ణ కనిపిస్తారు. 
‘అల్లరి’ నరేశ్‌కు కూడా ఈ తరహా కామెడీ అలవాటే. అలీ, 
కృష్ణభగవాన్ లాంటి వాళ్ళు ఎప్పటిలానే అవసరమనుకున్నప్పుడల్లా 
ఆంగిక, వాచికాలతో కాస్తంత శృంగారం ధ్వనించేలా చేశారు.
 కోటి నేపథ్య సంగీతం, ‘చెమ్మచెక్క...’ లాంటి ఒకటి రెండు 
పాటలు బాగున్నాయి.
 
ఫస్టాఫ్ అంతా కాబోయే మామా అల్లుళ్ళు మోహన్‌బాబు, 
అల్లరి నరేశ్‌ల మధ్య పిల్లి - ఎలుక చెలగాటం తరహా సీన్లు 
ఎక్కువ. అదే పద్ధతిలో చివరిదాకా వెళితే, ఒకలా ఉండేది.
 సెకండాఫ్‌కు వచ్చేసరికి మామ తన రెండు కాపురాల
 వ్యవహారం బయటపడకుండా ప్రయత్నించే వైపు కథ 
క్రమంగా మొగ్గుతుంది. కథ కొంత ఊహించదగినదే 
కాబట్టి, ఎంత ఆసక్తిగా కథనం ఉందన్న దాని మీదే 
దృష్టి అంతా నిలుస్తుంది. ఒకరికి ఇద్దరు ముగ్గురు
భక్తవత్సలంనాయుడు పాత్రలతో క్యారెక్టర్ల మధ్య జరిగే
 ఈ కన్‌ఫ్యూజింగ్ కామెడీ డ్రామా అచ్చం అందుకు తగ్గట్లే
 ఉంటుంది. ‘‘ఏమిటయ్యా ఈ కన్‌ఫ్యూజన్?’’ అని ఒకచోట 
కృష్ణ భగవాన్‌తో అనిపిస్తారు కూడా. అయితే, అంతా 
వినోదంలో భాగమే అని సరిపెట్టుకోవాలి. మొత్తం మీద 
ఈ గుడుగుడు గుంజాలాటలో బోలెడన్ని పాత్రలొస్తుంటాయి. 
నటీనటులు ఆలోచించే గ్యాప్ ఇవ్వకుండా తెరపై నిండుగా
 కనిపిస్తుంటారు. మొత్తానికి, ఇప్పటికే 500 చిత్రాలు 
దాటిపోయిన మోహన్‌బాబు కెరీర్‌లో అదనంగా మరో 
సినిమా, నరేశ్‌కు 50వ సినిమా అయిన ఈ మామా 
అల్లుళ్ళ డ్రామా మళ్ళీ పాత సినిమాల్ని గుర్తుకుతెస్తుంది.
 అలాంటివి ఇష్టపడితే... వినోద భక్తవత్సలమవుతుంది.

- రెంటాల జయదేవ
(Published in 'Sakshi' daily, 26th Dec 2015, Saturday)
..................................

Sunday, December 20, 2015

లో.... ఫర్ పూరీ ఫ్యాన్స్ (‘లోఫర్’ మూవీ రివ్యూ )

లో ఫర్ పూరీ ఫ్యాన్స్
సంగీతం: సునీల్ కశ్యప్,
కెమేరా: పి.జి. విందా,
నిర్మాతలు: శ్వేతాలాన, వరుణ్, తేజ, సి.వి. రావు, సి. కల్యాణ్,
కథ- స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్ 

‘నాన్నా! మా అమ్మ ఏమైంది’ అని అడిగే హీరో. ‘నాన్నా... 
నీ పెళ్ళాన్నీ... చంపేయనా’ అంటూ కన్నతల్లినే క్రూరంగా
 చంపే విలన్ కొడుకు! ఇలా దిగమింగుకోవాల్సిన
సెంటిమెంట్, మింగుడుపడని యాంటీ సెంటిమెంట్ - రెండూ
 ఉన్న వెండితెర విచిత్రం ‘లోఫర్’. డబ్బున్న ఇంటి 
అమ్మాయి లక్ష్మి (రేవతి)ని ప్రేమతో మురిపించి, పెళ్ళి 
ముగ్గులోకి దింపిన ప్రబుద్ధుడు మురళి (పోసాని). 
తీరా కొడుకు పుట్టాక, ఆస్తి తెమ్మని భార్యను వేధిస్తాడు.

 తేను పొమ్మన్న భార్యను వదిలేసి, కన్నబిడ్డను తనతో
 పాటు ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళి అతణ్ణీ తనలాగే 
చేస్తాడు. భార్యకేమో పిల్లాడు చనిపోయాడనీ, పిల్లాడికేమో
 అమ్మ చనిపోయిందనీ తేలిగ్గా అబద్ధం చెప్పి, నమ్మిస్తాడు.
 పాతికేళ్ళ తరువాత పిల్లాడు రాజు (వరుణ్‌తేజ్) మోసాలు, 
దొంగతనాలతో లోఫర్ అవుతాడు. కానీ, అమ్మ ప్రేమ కోసం 
తపిస్తూ, అమ్మలందరిలో తన అమ్మను చూసుకొంటూ ఉంటాడు.

ఇంట్లోవాళ్ళు చేస్తున్న ఇష్టం లేని పెళ్ళి వద్దనుకొని, 
పారిజాతం అలియాస్ మోనీ (దిశా పాట్నీ) హీరో 
వాళ్ళున్న జోధ్‌పూర్‌కు వస్తుంది. ఒక వాన కురిసిన 
వేళ వేడి వయసు పాటలో హీరోకు దగ్గరైపోతుంది. 
హీరోయిన్ కోసం ఇంట్లోవాళ్ళే విలన్‌లై వెంటపడతారు.
 ఇంతలో ఆమె మేనత్త (రేవతి) వస్తుంది. చనిపోయిందనుకున్న
 తన తల్లే ఆమె అని హీరో గుర్తిస్తాడు. కానీ ఈ లోఫర్‌ను 
తల్లి అసహ్యించుకుంటుంది. హీరో షాక్‌లో ఉండగా ఇంటర్వెల్.

అత్తతో కలసి పారిపోతున్న హీరోయిన్‌ను ఇంటి విలన్లే
 తీసుకెళ్ళిపోతారు. అమ్మ కోసం హీరో కూడా 
అక్కడికొస్తాడు. పారిపోయొచ్చిన హీరోయిన్, 
అన్నయ్యలు తనను వెతికి పట్టుకొని మరీ ఇంటికి 
తీసుకెళ్ళాక ఎక్కడా ప్రతిఘటించదు. కాపాడడానికి 
హీరో ఉన్నాడనే ధైర్యం కావచ్చు. విలన్‌లైన హీరోయిన్
 తండ్రి, అన్నలతో హీరో ఎలా ఆడుకున్నాడు? 
అమ్మ ప్రేమనెలా పొందాడన్నది కొంత సెంటిమెంట్,
 కొండంత యాక్షన్ జోడించిన మిగతా సినిమా.

‘ముకుంద’, ‘కంచె’ ద్వారా సుపరిచితమైన 
వరుణ్‌తేజ్ ఈ మూడో సినిమాకు మరికొంత
 మెరుగైనట్లనిపిస్తారు. డ్యాన్సులు, స్టైలింగ్‌లో 
మునుపటి కన్నా జాగ్రత్త తీసుకున్నారు. 
వెరసి, కెమేరాకు ఈ వర్ధమాన హీరో, అతనికి
 ప్రేక్షకులు క్రమంగా అలవాటుపడుతున్నారు.  
తెలుగు తెరకు పరిచయమైన దిశా పాట్నీ నటన 
పాటల్లో చూడాలి. హీరో తండ్రి మురళి పాత్రలో 
పోసాని కృష్ణ మురళి - ఒక్క దెబ్బతో కామెడీ,
 విలనిజమ్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఎదిగారు. 
కాకపోతే, పాత్రను బట్టి యాక్షనూ కొంత మలుచుకోవాల్సింది.

 పసిబిడ్డకు దూరమైన తల్లిగా బాధ, కోపం, 
ఆవేశం లాంటివెన్నో ఉన్న తల్లి పాత్రకు రేవతి తగిన 
నటి. ఆమెను ఎంచుకున్నట్లే, ఆ ఎమోషన్‌‌స పండేలా 
తగినన్ని సీన్లూ రాసుకోవాల్సింది. ముఖేశ్‌రుషి, 
అతని కొడుకుల బ్యాచ్, గవ్వలేసే అమ్మాయి పాత్రలు
 విలనిజమ్ వాతావరణాన్ని మొదట బాగానే 
క్రియేట్ చేశాయి. కానీ, కథలో హీరోయిజానికి 
దీటుగా నిలిచే విలన్, విలనిజమ్ కనిపించవు. 
కామెడీ కోసం సినిమా ఫస్టాఫ్‌లో సప్తగిరి, 
ధన్‌రాజ్, సెకండాఫ్‌లో హీరోయిన్‌ను పెళ్ళాడాలని
 వచ్చే సై్పడర్‌బాబుగా అలీ, ‘శ్రీమంతుడు’ తరహా
 స్పూఫ్‌తో బ్రహ్మానందం - ఇలా ఫేమస్ కమెడియన్స్‌ను పెట్టారు.

నిర్మాణ విలువలు కనిపించే ఈ సినిమాను 
కథా నేపథ్యానికి తగినట్లే, ఎక్కువ భాగం రాజస్థాన్‌లో 
జోధ్‌పూర్ పరిసరాల్లో తీశారు. అక్కడి రాజప్రాసాదాలు, 
ఆ పరిసరాలు చూపడంలో, పాటల చిత్రీకరణలో
 కెమేరా పనితనం కనిపిస్తుంది. ‘నువ్వేడేస్తుంటే
 పిల్లా నాకు...’ (రచన - భాస్కరభట్ల) పాట పల్లవి
 కొద్దిరోజులు మాస్ నోట వినిపిస్తుంది. ‘దునియాతో
 నాకేంటమ్మా’ (రచన - సుద్దాల, గానం - కారుణ్య) 
అంటూ తల్లి సెంటిమెంట్‌తో హీరో పాడే సందర్భం 
బాగుంది. గ్రూప్‌తో పాటు హీరో డ్యాన్స్ చేయకుండా
 తన ఫీల్‌నే వ్యక్తీకరిస్తే సందర్భశుద్ధిగానూ ఉండేది.

పూరి జగన్నాథ్‌కు దర్శకుడిగా ఈ ఏడాది రిలీజైన
 మూడో సినిమా ఇది. ఈ రోజుల్లో ఒకే ఏడాది 
చకచకా మూడు సినిమాలు తీసి, రిలీజ్ చేసి, 
నాలుగోది ఆల్రెడీ స్టార్ట్ చేసిన టాప్ డెరైక్ట రంటే 
పూరీ ఒక్కరే! అయితే, వేగంలో పడ్డాక విషయం 
కాస్త అటూ ఇటూగా ఉండడం అర్థం చేసుకోవాలి. 
డైలాగ్స్‌లో ‘వెర్రి పుష్పాలు’, ‘క్రికెట్ (కే) బాల్స్’ లాంటి 
మాటలు హాలులో హాయిగా వినిపిస్తాయి.
 సందట్లో సడేమియాగా మంచితనం నిండిన స్త్రీలిప్పుడు
 డైనోసార్లలా అంతరించిపోయారంటూ లిబరల్ సోషల్
 కామెంటూ ఉంది. నవమోసాలూ మోసిన తల్లి పడే
 బాధ దేవుడికైనా తెలియవంటూ రేవతి చెప్పే సీన్, 
ఆ డైలాగులు బాగున్నాయి.

హీరోయిన్ తండ్రి వగైరాల కాస్ట్యూమ్స్, వారుండే
 ప్రాసాదాలు జైపూర్‌లో ఉన్న ఫీలింగ్ కలిగిస్తాయి. 
తీరా హీరో తల్లిని సముద్రపుటొడ్డున గుడిసెలో
 చూశాక, కథ విశాఖ తీరంలో జరుగుతోందేమోనని 
సర్దుకోవాలి. వెరసి, కథాస్థలం ఏమిటన్న దాంట్లో 
ప్రేక్షకులు మరికొంత స్పష్టతను ఆశిస్తే తప్పు లేదు. 
విలన్ కొడుకు కన్నతల్లినే కర్కశంగా చంపే సీన్,
 ఆ సీన్‌లో కొడుకు డైలాగ్ డెలివరీ, హావభావాలు 
వగైరా సున్నిత మనస్కులకు జీర్ణం కావు. 
‘నేనే నీ కొడుకు’నని తల్లితో హీరో నిజం
 చెప్పుకోలేకపోవడం లాంటివి ఎమోషనల్‌గా
 ఇంకా వర్కౌట్ చేయడానికి స్కోప్ ఉన్న సందర్భాలు.

అన్నట్లు... చివర్లో ‘థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మూవీ- పూరి’ 
అంటూ టైటిల్ పడుతుంది. చాలాకాలానికి అమ్మ
 సెంటిమెంట్‌తో సినిమా తీసినప్పుడు ఆయన 
అలా ఫీల్‌తో చెప్పడం, ఆసాంతం చూశాక జనం
 కూడా ఆ థ్యాంక్స్‌కు తామూ అర్హులమేననుకోవడం
 తప్పు పట్టలేం!

...................................................
తెర వెనుక ముచ్చట్లు
- పూరి ఈ కథను హీరో నితిన్‌తో అనుకున్నారు. 
నితిన్ పక్కకు తప్పుకోవడంతో, వరుణ్‌తేజ్‌తో తెర మీదకొచ్చింది.
-  పూరి అనుకున్న పేరు ‘లోఫర్’. కానీ, ఆయన గురువు వర్మ
 ‘మా అమ్మ మహాలక్ష్మి’ అంటూ సాఫ్ట్ టైటిల్ పెట్టమన్నారు.  
- ఒక దశలో ‘అమ్మ’ టైటిల్ కూడా ఆలోచించారట. 
- రెండేళ్ళ క్రితమే దిశా పరిచయానికి పూరి సిద్ధమయ్యారు. 
ఆ ప్రాజెక్ట్ ఆగడంతో, ‘లోఫర్’లో ఛాన్సిచ్చారు.
.....................................................

- రెంటాల జయదేవ

.....................................

Thursday, December 17, 2015

ఫార్ములా టైగర్ రోరింగ్ (‘బెంగాల్ టైగర్’ మూవీ రివ్యూ)

ఫార్ములా టైగర్ రోరింగ్
తారాగణం:   రవితేజ, తమన్నా, రాశీఖన్నా, బొమన్ ఇరానీ
కెమేరా :       ఎస్. సౌందరరాజన్
ఎడిటింగ్:     గౌతంరాజు 
 సంగీతం:     భీమ్స్ సిసిరోలియో
నిర్మాత:       కె.కె. రాధామోహన్
కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్ నంది
 ‘‘డబ్బున్నవాడితో పెట్టుకోవచ్చు, పవరున్న వాడితో పెట్టుకోవచ్చు..
 కానీ తెలివైనవాడితో పెట్టుకోకూడదు.’’ తాజా ‘బెంగాల్ టైగర్’లో 
డైలాగ్ ఇది. అలాంటి తెలి వైన హీరో పాత్ర, పాత్రచిత్రణ - 
మనకు కొత్తేమీ కాదు. కాకపోతే దాన్నెలా ప్యాకేజ్ చేసి,
 తెరపై చెప్పారన్నదే కీలకం. ఆ ఫార్ములా అరువు తెచ్చుకొని,
 కొత్త రేపర్‌లో ప్యాక్ చేసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘బెంగాల్ టైగర్’. 
 గోదావరి జిల్లాలోని గ్రామంలో ఆకాశ్ నారాయణ్ (రవితేజ) కుటుంబం.
 అతనికి అమ్మ (ప్రభ), ఇద్దర న్నలు - వదినలు, అమ్మమ్మ (రమాప్రభ). 
ఒకసారి పెళ్ళిచూపుల్లో పెళ్ళికూతురు (అక్ష) పాపులరైనవాణ్ణే పెళ్ళి 
చేసుకుంటాననడంతో హీరో కంగు తింటాడు. పేపర్‌లో పేరు, ఫోటో వచ్చేలా
 పాపులరయ్యేందుకు ప్రయత్నం మొదలుపెడతాడు. మంత్రి 
సాంబ (సాయాజీ షిండే)ను పబ్లిక్ మీటింగ్‌లో రాయి పెట్టి కొట్టి, 
పాపులరైపోతాడు. రక్తం కారేలా గాయమైన మంత్రి తీరా హీరో గారి
 మాట తీరు, ధైర్యం నచ్చి, తన దగ్గరే పనికి పెట్టుకుంటాడు. 
అలా అక్కడ జీతానికి పని చేస్తూనే హోమ్ మంత్రి నాగప్ప (రావు రమేశ్) 
కూతురు శ్రద్ధ (రాశీఖన్నా)ను ఫ్యాక్షనిస్ట్ ప్రత్యర్థుల బారి నుంచి కాపాడతాడు.
  అలా హోమ్ మంత్రి మనసునూ చూర గొంటాడు. ఆయన నాలుగింతల 
జీతామిస్తాననే సరికి, మొదటి మంత్రిని నడిరోడ్డుపై వదిలేసి, హోమ్
 మంత్రి దగ్గర ప్రత్యేక అధికారిగా హీరో చేరతాడు. మరింత ఫేమస్ 
అవుతాడు. పెళ్ళి ఫిక్సయిన శ్రద్ధను సైతం ప్రేమలో పడేస్తాడు.
 తీరా ఆమెనిచ్చి పెళ్ళి చేయడానికి సిద్ధపడితే, ముఖ్యమంత్రి 
గజపతి (బొమన్ ఇరానీ) సాక్షిగా హీరో ప్లేటు తిప్పేస్తాడు. 
తాను ఇప్పటికే మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానీ, 
కాకపోతే తనది వన్‌సైడ్ లవ్ అనీ చెబుతాడు. 
ఆ అమ్మాయినే ఇచ్చి పెళ్ళి చేస్తా మని 
ముఖ్యమంత్రే హామీ ఇచ్చాక, హీరో ఆ అమ్మాయె వరో 
చెబుతాడు. అందరూ షాకవుతారు. 
ఆ అమ్మాయి - మీరా (తమన్నా). ఆ షాక్ దగ్గర ఇంటర్వెల్ కార్డు. 
 తీరా అది కూడా హీరో ఆడిన నాటకమేనని తెలిసీ 
తెలియగానే, అతని తెలివికి ఆ పెద్దింటి అమ్మాయి ఫ్లాటైపోతుంది. 
‘ఐ లవ్ యు’ చెప్పేస్తుంది. అది నచ్చని సి.ఎం. 
ఈ హీరో బ్యాక్‌గ్రౌండ్ ఎంక్వైరీ చేయిస్తాడు. 
ఆత్రేయపురంలో అందరి బాగు కోసం పనిచేసిన 
స్వర్గీయ జయనారాయణ్ (నాగినీడు) కొడుకే హీరో 
అని తెలిసి, షాకవుతాడు. రౌడీలతో హీరోను వేటాడతాడు.
 వాళ్ళ నుంచి తప్పించుకొని, సి.ఎం.తో 24 గంటల 
పందెం గెల్చిన హీరో- చివరకి రూ. 500 కోట్ల బేరానికి 
ప్రేమను వదులుకోవడానికి సిద్ధమవుతాడు. 
అతనలా ఎందుకు చేశాడు? ఇంతకీ హీరో తండ్రి 
ఎవరు? ఈ సి.ఎం.కూ, చనిపోయిన ఆయనకూ 
సంబంధం ఏమిటి? ఇలా ఒక్కొక్కరినీ మెట్లుగా 
చేసుకుంటూ సి.ఎం. కూతురి దాకా వెళ్ళిన హీరో 
అసలు లక్ష్యం ఏమిటన్నది సెకండాఫ్ చివరలో
 వచ్చే ఫ్లాష్‌బ్యాక్, ఆ తరువాత జరిగే క్లైమాక్స్ ఫైట్, సీన్. 
 సినిమాలో ఇద్దరు హీరోయిన్లు, చిన్నా పెద్దా కలిపి 
ముగ్గురు విలన్లు, నలుగురైదుగురు కమెడియన్లు, 
ఒక సెంటిమెంటల్ తండ్రి పాత్రధారి - ఇలా చాలామంది 
తెరపై వచ్చి పోతుంటారు. కానీ, హీరో పాత్ర చుట్టూ, 
అతని భుజాల మీద మొత్తం నడుస్తుంది. ప్రత్యర్థిని 
తెలివిగా పడేసే తరహా పాత్రచిత్రణ రవితేజకు అలవాటే. 
అందుకే, ఆయన అనాయాసంగా చేశారు. ఇటు 
నిర్మాణ విలువలు, అటు కెమేరా పనితనం, డి.ఐ. వర్క్ 
స్పెషల్‌గా ఉన్న ఈ సినిమాలో మొన్నటి ‘కిక్2’లా కాకుండా,
 రవితేజ తెరపై పుంజుకున్నట్లనిపిస్తారు. నిడివిపరంగా చూస్తే 
రాశీఖన్నా ఎక్కువ, తమన్నా తక్కువ అన్న మాటే కానీ, 
నటన, పరిధి ప్రకారం చూస్తే ఈ పాత్రలు రెండూ రెండే!
 మంత్రుల మొదలు సి.ఎం. దాకా ప్రతి ఒక్కరూ హీరో
 చేతిలో బకరాలే కాబట్టి, విలనిజమ్‌ను మరీ అతిగా 
ఆశించకూడదు. అప్పటికీ, (మాజీ) సి.ఎం. పాత్ర రౌడీలతో 
కలసి ఆఖరులో గొడ్డలి కూడా పట్టి, హీరోతో పోరాడుతుంది. 
 బురదలో కూరుకున్న రౌడీల దేహాల మీద నుంచి
 హీరో వెళ్ళే థ్రిల్లింగ్ విజువల్‌తో మొదలయ్యే 
ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే సినిమాటిక్‌గా, 
కథాగమనానికి కన్వీనియంట్‌గా నడిచిపోతాయి.
 రైతే వెన్నెముకంటూ ‘వ్యవసాయంలో సాయం ఉంది. 
అగ్రికల్చర్‌లో కల్చర్ ఉంది. అసలు ప్రపంచానికి సేవ 
చేసే గుణం రైతుకే ఉంది’ (సాయాజీ షిండే), 
‘ఆస్తులు, వాస్తుల్ని కాదు.. దోస్తుల్ని నమ్ముతా’ (రవితేజ) 
లాంటి మంచి మాటలు చాలానే ఉన్నాయి. మెగాఫ్యామిలీ, 
పవర్‌స్టార్ ప్రస్తావ నలు, త్రివిక్రమ్ మార్కు హిట్ డైలాగ్‌లకు 
పేరడీలు సరేసరి. భీమ్స్ బాణీల్లో మాస్ పాటలున్నా, మెలొడీ 
‘చూపులతో దీపాలా’ చాలాకాలం గుర్తుంటుంది. చిన్నా 
నేపథ్య సంగీతం, పదేపదే వచ్చే థీమ్ మ్యూజిక్ హాల్ 
నుంచి బయటకొచ్చాకా చెవుల్లో రింగుమంటాయి. 
 ఈ సినిమాకు, ముఖ్యంగా ఎక్కువ శాతం మంది మెచ్చే
 ఫస్టాఫ్‌కు వినోదం బలం. పురోహితుడు ‘సెల బ్రిటీ శాస్త్రి’గా 
పోసాని కొంత, హీరో కావాలని తపించే ‘ఫ్యూచర్‌స్టార్
 సిద్ధప్ప’గా పృథ్వి చాలావరకు సినిమాను నిలబెట్టారు. 
రిపోర్టర్ అమలాపురం పాల్ అలియాస్ అమలాపాల్‌గా
 బ్రహ్మానందం కనిపిస్తారు. కామెడీతో ఫస్టాఫ్ 
వినోదాత్మకంగా ఉందనిపిస్తుంది. హీరో ప్రవర్తనకు కారణం చెప్పే
 సెకండాఫ్‌కొచ్చేసరికి పాత్రలకు క్లారిటీ వస్తుంది. 
ప్రేక్షకులకూ సినిమాపై స్పష్టతొస్తుంది. గడచిన హిట్ ‘రచ్చ’ను 
దర్శకుడు ఈసారీ కొంత అనుసరించినట్లు కనిపిస్తుంది.
 శంకర్ ‘ఒకే ఒక్కడు’ నుంచి పాపులరైన సి.ఎం (చీఫ్ మినిస్టర్) 
వర్సెస్ సి.ఎం (కామన్‌మ్యాన్) ఫార్ములా వినడానికెప్పుడూ
 బాగుంటుంది. లాజిక్‌లందకపోయినా, గేవ్‌ునెంత తెలివిగా 
అల్లుకుంటే అంత కిక్. ఆ క్రమంలో సెకండాఫ్ కొంత బిగువైతే, 
రెండున్నర గంటల ‘బెంగాల్ టైగర్’ మన తెలివికి 
పనిపెట్టని మాస్ కామెడీ. ఒకరికి ఇద్దరు 
హీరో యిన్ల గ్లామరస్ ఎంటర్‌టైనర్. 
 - రెంటాల జయదేవ

Tuesday, December 15, 2015

టైటిలాభరణం ('శంకరాభరణం' మూవీ రివ్యూ)

టైటిలాభరణం
కొత్త సినిమా గురూ!  ‘శంకరాభరణం’

కెమేరా- సాయిశ్రీరామ్, ఎడిటింగ్ - ఛోటా కె. ప్రసాద్,
నిర్మాత - ఎం.వి.వి. సత్యనారాయణ, 
కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వ పర్యవేక్షణ - 
కోన వెంకట్, దర్శకత్వం - ఉదయ్ నందనవనమ్,

శంకరాభరణం. పేరు వినగానే ఆణిముత్యం లాంటి సినిమా గుర్తుకొస్తుంది.
 తెలుగువాణ్ణి తలెత్తుకు తిరిగేలా చేసిన ఆ ఫిల్మ్ టైటిల్‌తో మరో సినిమా 
చేయడం సాహసం. పెపైచ్చు, ఆ టైటిల్‌తో క్రైమ్ కామెడీ తీయడం మరీ
 సాహసం. కానీ, ‘సాహసం శాయరా డింభకా! విజయం వరిస్తుంది’ అన్నది
 నమ్మి, ఆ పనికే దిగారు ఇప్పుడీ కొత్త చిత్ర దర్శక, నిర్మాతలు. అలా వచ్చింది 
కోన వెంకట్ అన్నీ తానై తీసి, తీయించిన కొత్త ‘శంకరాభరణం’.

టైటిల్ క్యూరియాసిటీ పక్కనపెట్టి, ‘దొరకునా ఇటువంటి సినిమా’ అని
పాడుకుంటూ కథలోకొస్తే - రఘు (సుమన్) అమెరికాలో కోటీశ్వరుడు.
 అతని భార్య రజ్జూ దేవి (సితార). ఓ కూతురు, ఓ కొడుకు
 గౌతమ్ (నిఖిల్). కష్టపడకుండా, కులాసా జీవితం గడిపే హీరో 
జీవితంలో ఒక పెద్ద కుదుపు. నమ్మినవాళ్ళు మోసం చేయడంతో 
ఆస్తులు పోయి, అర్జెంటుగా కోట్లు కట్టకపోతే కటకటాల వెనక్కి వెళ్ళే
 ముప్పులో పడతాడు హీరో తండ్రి.

పాతికేళ్ళ క్రితం ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేని పెళ్ళి చేసుకొని, అమెరికా
 వచ్చేశాననీ, బీహార్‌లోని ‘శంకరాభరణం’ అనే ప్యాలెస్‌కు తానే
 వారసురాలిననీ, దాన్ని అమ్మి అప్పుల నుంచి బయటపడవచ్చనీ
 హీరో తల్లి చెబుతుంది. ఆ ప్యాలెస్ అమ్మి డబ్బు తేవడానికి అమెరికా
 నుంచి హీరో బీహార్ బయల్దేరతాడు.

ఇక్కడ బీహార్‌లో విలువైన దేనినైనా కిడ్నాప్ చేసి, డబ్బులు గుంజడం 
బిజినెస్. రాష్ట్ర హోమ్ మంత్రి  (‘మిర్చి’ సంపత్) కూడా ఆ కిడ్నాపింగ్
 ముఠాల వెనుక మనిషే. బీహార్ వచ్చిన హీరో తమ ప్యాలెస్‌లో ఉంటున్న
 మామయ్య బద్రీనాథ్ (రావు రమేశ్)నీ, ఆయన బంధుగణాన్నీ మాయ
 చేసి, ప్యాలెస్ అమ్మేయడానికి ప్లాన్ చేస్తాడు. అమెరికా వెళ్ళాలని
 మోజు పడే మామయ్య చిన్న కూతురు హ్యాపీ (నందిత) హీరోను
 ప్రేమిస్తుంది. మరోపక్క అతనూ దగ్గరవుతాడు.

ఈ అమెరికా ఎన్నారై దగ్గర బోలెడంత డబ్బుందని ఊరంతా
భ్రమపడుతుంది. దాంతో, కిడ్నాపర్ భాయ్ సాబ్ (సంజయ్ మిశ్రా)
 హీరో, హీరోయిన్లను కిడ్నాప్ చేస్తాడు. తీరా తన దగ్గర డబ్బులే 
లేవని అసలు నిజం చెప్పి, హీరో తనను మరో కిడ్నాపర్‌కి కోట్లకు 
అమ్మించేలా చేస్తాడు. అలా ఒక కిడ్నాపర్ నుంచి మరో 
కిడ్నా పర్‌కు హీరో, హీరోయిన్లు ట్రాన్‌‌సఫరవుతుంటారు. 
ఈ కిడ్నాప్ డ్రామాల కథ ఎటు నుంచి ఎటు, ఎన్ని 
మలుపులు తిరిగిందన్నది మిగతా సినిమా.         

కథ కన్నా సీన్లు, క్యారెక్టర్లు సవాలక్ష ఉన్న ఈ సినిమాకు
 తీసుకున్న పాయింట్ బాగుంది. కానీ, దాన్ని ఆసక్తికరంగా
 చెప్పడంలో తడబాటు తప్ప లేదనిపిస్తుంది. తెర నిండా
కళకళలాడుతూ చాలా మంది ఆర్టిస్టులున్నారు. ఒకరి వెంట
 మరొకరుగా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు. కానీ, మనసు 
కెక్కేలా వాళ్ళ నటనను చూపెట్టే సన్నివేశాలే వెతుక్కోవాలి.
వెరైటీ స్క్రిప్ట్‌లతో ముందుకొస్తున్న హీరో నిఖిల్ ఈసారి అమెరికన్ 
ఇంగ్లీష్ యాసలో ఎన్నారైగా అలరించడానికి శాయశక్తులా యత్నించారు.

అమెరికా మోజున్న హ్యాపీగా నందితది కాలక్షేపం క్యారెక్టర్. 
కిడ్నాపింగ్ విలన్లుగా ఒకరికి ముగ్గురున్నారు. ఎవరికివారు
 ఫరవాలేదనిపిస్తారు. కానీ, ఎవరూ ప్రధాన విలన్ కాకపోవడమే
 చిక్కు. లేడీ కిడ్నాపింగ్ లీడర్ మున్నీ దీదీగా అంజలిది సినిమా
చివర కాసేపు వచ్చే స్పెషల్ అప్పీయరెన్స్. నాలుగు సీన్లు, కాసిన్ని
 డైలాగులు, ఒక స్పెషల్ సాంగ్ ఉన్నాయి. సినిమా నిండా చాలామంది
 కమెడియన్లున్నారు.

కొన్నిచోట్ల నవ్విస్తారు. ఎక్కువ మార్కులొచ్చేది థర్టీ ఇయర్స్ పృథ్వికి, 
అతని ఎస్సై పాత్ర ‘పర్సంటేజ్’ పరమేశ్వర్‌కి! అయితే, 
లేడీ కిడ్నాపింగ్ ముఠా స్త్రీలంతా కలసి అతడిపై పడి, 
గదిలోకి తీసుకెళ్ళడం లాంటివి కామెడీ అనుకోలేం.   

‘లాజిక్‌లు వెతక్కండి... మ్యాజిక్ చూడండి’ అని స్టాట్యూటరీ
 సిల్వర్‌స్క్రీన్ వార్నింగ్‌తో మొద లయ్యే సినిమా ఇది. కాబట్టి, 
బీహార్‌లో మనుషులు అచ్చ తెలుగు యాసల్లో ఎలా మాట్లా డుతున్నారు
లాంటి సందేహాలు శుద్ధ వేస్ట్. ముందే చెప్పేశారు కాబట్టి, ఇక
 సినిమా అంతా మ్యాజిక్ చూడడం కోసం కళ్ళలో వత్తులు 
వేసుకోవాల్సి ఉంటుంది! సీనియర్ కో-డెరైక్టర్ ఉదయ్నం
దనవనమ్‌కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా. కానీ, 
దర్శకత్వ పర్యవేక్షణంతా కోన వెంకట్‌దే. ఎవరి భాగమెంతో 
తెరపై చూసి చెప్పడం కష్టమే.

కథనంలో బిగింపు, ఎడిటింగ్‌లో తెగింపు అవసరమని
 గుర్తొచ్చే ఈ సినిమాలో అందమైన లొకేషన్లలో కెమేరా
 పనితనం భేష్. ప్రవీణ్ లక్కరాజు బాణీల్లో కొన్ని బాగున్నాయి.
 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దగ్గరే వాద్యఘోష పెంచారు. వెరసి, ఫస్టాఫ్‌లో 
కథ ముందుకు జరగకపోయినా డైలాగ్ మీద డైలాగ్ పడిపోయే
 ఆర్టిస్టుల హడావిడి, రీరికార్డింగ్ హంగామాతో ఉక్కిరిబిక్కిరవుతాం.
 సెకండాఫ్‌లో పృథ్వి ఎంటరయ్యాక జనం వినోది స్తారు. 
డబ్బు కన్నా అనుబంధాలు ఎక్కువని చెప్ప డానికీ,
హీరోకూ- ఫ్యామిలీకీ మధ్య ఎమోషనల్ స్ట్రగుల్‌కీ తోడ్పడే
 సీన్లు ఇంకా అల్లుకోవాల్సింది.

ముగింపు దగ్గరకొస్తుంటే వేగం పెరిగే ఈ ఫిల్మ్‌లో ఆఖరి
 టైటిల్ కార్డు - ‘వేర్లు బలంగా ఉంటేనే చెట్టు నిలుస్తుంది. 
బంధాలు బలంగా ఉంటేనే కుటుంబం నిలుస్తుంది’. అలాగే,
 స్క్రిప్టు బలంగా ఉంటేనే సినిమా నిలుస్తుంది. మరి, ఆ బలం,
 బాక్సా ఫీస్ దగ్గర అలా నిలిచే సత్తా ఈ ‘శంకరాభరణం’కి ఉందా? 
అది ప్రేక్షకదేవుళ్ళు చెప్పాల్సిన తీర్పు.

 - రెంటాల జయదేవ

.................................................. 
* హిందీ హిట్ ‘ఫస్ గయేరే ఒబామా’ హక్కులు కొని, దాన్ని
 తెలుగులోకి మలుచుకున్నారు కోన వెంకట్.  ఈ చిత్రానికి
 పనిచేసిన సంగీత దర్శకుడు ప్రవాస భారతీయుడు.

* బీహార్ నేపథ్యంలో జరిగే ఈ కిడ్నాప్ కథ షూటింగ్
 ప్రధానంగా  మహారాష్ట్ర, పరిసరాల్లో చేశారు. ఇటీవల 
రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్ వచ్చిన కొద్ది సినిమాల్లో ఇది ఒకటి.
....................................................

(Published in Sakshi daily, 5th Dec 2015, Saturday)

Monday, December 14, 2015

యాక్టింగ్ గ్రేట్... డెరైక్షన్ వీక్... తమాషా ( ‘తమాషా’ (హిందీ) మూవీ రివ్యూ)

యాక్టింగ్ గ్రేట్... డెరైక్షన్ వీక్... తమాషా
కొత్త సినిమా గురూ! -  ‘తమాషా’ (హిందీ)


రొమాంటిక్ సినిమాలు తీయడంలో దిట్ట దర్శకుడు ఇమ్తియాజ్ అలీ.
మాజీ ప్రేమికులు - రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకోనే.
వీళ్ళ ముగ్గురి కాంబినేషన్‌లో ఒక చిత్రమైన ప్రేమకథ.
తాజా హిందీ చిత్రం ‘తమాషా’ మీద ఆసక్తి కలగడానికి 

అంతకన్నా ఇంకేం కావాలి?
కానీ, ఇందులో చర్చించిన పాయింట్ అంతకు మించి!

చిత్రం - ‘తమాషా’ (హిందీ)
తారాగణం - రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనే
కెమేరా - రవివర్మన్
సంగీతం - ఏ.ఆర్. రహమాన్,
ఎడిటింగ్ - ఆర్తీ బజాజ్
నిర్మాత - సాజిద్ నడియాడ్‌వాలా
రచన, దర్శకత్వం - ఇమ్తియాజ్ అలీ

జీవితం ఎలా జీవించాలి? ఎవరి కోసం జీవించాలి? చిన్నప్పుడు 
ఇంట్లో తల్లి తండ్రుల నుంచి స్కూల్‌లో టీచర్ దాకా, పెద్దయ్యాక
 ఫ్రెండ్‌‌స మొదలు ఆఫీస్‌లో బాస్ దాకా ప్రతి ఒక్కరూ కండిషనింగ్ 
చేసేవాళ్ళే. చుక్కలకు ఎగరనివ్వకుండా రెక్కలు కత్తిరించేవాళ్ళే. 
మరి అప్పుడు జీవితం ఎలా జీవించాలి? ఎవరి కోసం జీవించాలి? 
తాత్త్వికంగా అనిపించినా, వాస్తవికంగా అందరూ ఎదుర్కొనే
 సమస్య ఇది.

ముఖ్యంగా, మనసుకు సంకెళ్ళు లేకుండా, ఊహాప్రపంచంలోకి 
విహరిస్తూ, నచ్చింది చేస్తూ నచ్చినట్లు బతకాలని తపించేవాళ్ళకు
 అది మరీ పెద్ద సమస్య. మరి, అలాంటి ఒక అబ్బాయి
 వేద్ (రణబీర్‌కపూర్)కీ, ఒక అమ్మాయి తార (దీపిక)కీ 
మధ్య ఒకరి గురించి మరొకరికి తెలియనప్పుడు ప్రేమ పుడితే?
 పేర్లయినా తెలియకుండానే విడిపోయిన వారిద్దరూ నాలుగేళ్ళ
 తరువాత మళ్ళీ ఎదురైతే? ఇలాంటి ఒక చిత్రమైన నేపథ్యాన్ని, 
ఎంచుకున్న సమస్యకు జోడించి, దర్శకుడు ఇమ్తియాజ్ అలీ 
అందించిన న్యూ ఏజ్ లవ్‌స్టోరీ - ‘తమాషా’.

నవతరం మనస్తత్తాన్నీ, చిత్రమైన ప్రేమకథల్నీ రంగరించి 
విచిత్రంగా చెప్పడంలో పేరున్న ఇమ్తియాజ్ అలీ ఈసారీ 
ఆ శైలినే అనుసరించారు. సాదాసీదాగా సినిమాలన్నీ నడిచే
 లీనియర్ పద్ధతిలో కాక, నాన్-లీనియర్ కథనాన్ని
 ఎంచుకున్నారు. అందుకు తగ్గట్లే ఆయన తీసుకున్న
 హీరో, హీరోయిన్ పాత్రల్లో బోలెడంత మానసిక సంఘర్షణ, 
వదులుకోలేని భయాలు, వదిలించుకోలేని గతం - వర్తమానాలు
 ఉంటాయి.

ఆ పాత్రలకు తెరపై బొమ్మ కట్టడంలో రణ్‌బీర్ కపూర్, దీపికా
 పదుకొనేలు నూటికి నూరుపాళ్ళూ సక్సెస్ అయ్యారు. 
ముఖ్యంగా తండ్రితో పాటు సొసైటీ చేసిన కండిషనింగ్‌తో 
మనసును చంపుకొని, యాంత్రికంగా ఉద్యోగం చేసే వేద్
 పాత్రలో రణ్‌బీర్ నటన బాగుంది. అలాగే, అతనెవరో తెలీని
పరిస్థితుల్లో అతనిలోని ఆ కోణాన్నే ఇష్టపడి, ప్రేమించి, ఆనక
 ఆ లక్షణం కనబడనప్పుడు దూరం జరిగే లవర్‌గా దీపిక 
యాక్షన్ సూపర్. ఈ నిజజీవిత మాజీ లవర్‌‌స మధ్య కెమిస్ట్రీ 
వెండితెరను వెలిగించింది.

గతంలో ‘జబ్ ఉయ్ మెట్’, ‘లవ్ ఆజ్ కల్’తో అభినందనలు 
అందు కున్న ఇమ్తియాజ్ అలీ ఈ సారి అనుకున్న కథను 
వెండితెరపై కన్విన్సింగ్‌గా చూపించడంలో తడబడ్డారనిపిస్తుంది.
 ఫస్టాఫ్‌లో చిన్న పిల్లాడి ఎపిసోడ్ దగ్గరే చాలాసేపు గడవడంతో, 
ఇంటర్వెల్ ముందు కానీ కాస్తంత కథ జరిగినట్లు అనిపించదు. 
అసలు కథ నడిచేదంతా సెకండాఫ్‌లో.

కాకపోతే, సెకండాఫ్‌లో ఒక దశ దాటిన తరువాత హీరో పాత్ర
 ప్రవర్తన అతని మానసిక స్వస్థతను అనుమానించేలా చేస్తుంది.
 ఒక దశలో హీరో పెళ్ళి ప్రతిపాదనను హీరోయిన్ కాదనడానికి 
కానీ, ఆ తరువాత అతణ్ణి మక్కువతో అక్కున చేర్చుకోవడానికి 
కానీ సరైన భూమికను సినిమాలో చూపెట్టలేకపోయారు. 
ఈ లోపాలు నీరుగార్చినా, సినిమాలో కాస్తయినా గుర్తుండేవి
 హీరో, హీరోయిన్ల అభినయమే.

రవివర్మన్ కెమేరా వర్‌‌కలో సిమ్లా మొదలు ఫ్రాన్‌‌స మీదుగా
 కలకత్తా, ఢిల్లీ దాకా అన్నీ కనువిందు చేస్తాయి. ఏ.ఆర్. 
రహమాన్ సంగీతంలో పంజాబీ సాంగ్ లాంటి కొన్ని ఊపు 
తెప్పిస్తాయి. హిందీ సినిమాల నిర్మాణ విలువల సంగతి 
వేరుగా చెప్పనక్కరలేదు. అన్నీ ఉన్నా... అదేదో అన్నట్లు...
 డెరైక్షన్ వీక్ అవడంతో ఆశించిన తృప్తి కలగకపోతే, ఎవరిని 
తప్పు పడతాం. 
                    
- రెంటాల

(Published in 'Sakshi' daily, 28th Nov 2015, Saturday)
.....................................

Sunday, December 13, 2015

వెళ్ళాలని తను.. వద్దని నేను! (‘తను - నేను’ మూవీ రివ్యూ)

వెళ్ళాలని తను..  వద్దని నేను!
చిత్రం: ‘తను - నేను’
తారాగణం: సంతోష్ శోభన్, అవికా గోర్, రవిబాబు
కథ - స్క్రీన్‌ప్లే - మాటలు:సాయి సుకుమార్, పి. రామ్మోహన్
ఆర్ట్: ఎస్. రవీందర్
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్
సంగీతం: సన్నీ ఎం.ఆర్
సమర్పణ: డి. సురేశ్‌బాబు
నిర్మాత - దర్శకుడు: పి. రామ్మోహన్


కథ చెబుతూ... కళ్ళకు కట్టించడం వేరు. కళ్ళెదుట తెరపై చూపిస్తూ,
 మెప్పించడం వేరు. మొదటిది రచన, కథన సామర్థ్యాలకు గీటురాయి 
అయితే, రెండోది తెరపై కథాకథనమనే దర్శకత్వ నైపుణ్యానికి పరీక్ష. 
గతంలో ‘అష్టాచమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘ఉయ్యాల - జంపాల’
 లాంటి విభిన్న తరహా ప్రయత్నాలను తెర పైకి తేవడంలో పేరు
 తెచ్చుకున్న ఉన్నత విద్యావంతుడు పి. రామ్మోహన్ ఈసారి
 దర్శకుడిగా కొత్త అవతారమెత్తారు. అమెరికా డబ్బు మీద 
మోజు, ఆ జీవితం మీద వ్యామోహం పెరిగిన ప్రస్తుత 
పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో ఒక రొమాంటిక్ కామెడీ అల్లారు.

కథేమిటంటే... హైదరాబాద్‌లో ‘ఈస్ట్ వెస్ట్’ మనీ ట్రాన్స్‌ఫర్
 కంపెనీ కాల్‌సెంటర్‌లో పనిచేస్తుంటాడు కిరణ్ (సంతోష్ శోభన్). 
పెంచిన నాయనమ్మ చనిపోతే, ఆమె ఇంట్లోనే ఒంటరిగా ఉంటాడు. 
అతనికి నరేశ్ (అభిషేక్ మహర్షి) వగైరా మంచి ఫ్రెండ్స్.
 బెంగుళూరులో ఉంటున్న నరేశ్ ఫ్రెండ్ కీర్తి (అవికా గోర్)
 ఒకసారి హైదరాబాద్ వస్తుంది. ఆమెను చూసీ చూడగానే
 హీరో ప్రేమిస్తాడు. కొన్ని సీన్ల తరువాత ఆమె కూడా అతని 
ప్రేమలో పడుతుంది.

కీర్తి కుటుంబానిదో కథ. తండ్రి బండిరెడ్డి సర్వేశ్వరరావు (రవిబాబు)కు 
అమెరికా పిచ్చి. కొడుకు, కూతురైనా బాగా చదివి, అమెరికా వెళ్ళి, 
డబ్బు సంపాదిస్తే, తాను పెద్ద ఇల్లు, కారు కొనుక్కోవాలనుకొనే 
తరహా. కొడుకేమో లవ్ మ్యారేజ్ చేసుకొని, చెక్కేస్తాడు. 
తండ్రి కోరికకు కట్టుబడి, ఎనిమిదో ఏటే దేవుడి మీద ఒట్టేసి మరీ
 ఒప్పుకున్న కూతురు కీర్తి. అమెరికా వెళ్ళాలన్నది ఆమె ధ్యేయం. 
హీరో అందుకు పూర్తిగా విరుద్ధం. అమెరికా అన్నా, అక్కడ సెటిలైన 
ఎన్నారైలన్నా కడుపు మంట. ఛస్తే అక్కడికి పోనంటాడు.
 అక్కడికి ‘బ్రేక్’ (అప్).

 సెకండాఫ్‌కి వస్తే, హీరోకూ, అమెరికా అంటే అతనికున్న
 అసహ్యానికీ ఒక చిన్న ఫ్లాష్‌బ్యాక్. ఏడాది వయసున్న హీరోను 
వదిలేసి, అతని అమ్మా నాన్న డబ్బు సంపాదన వేటలో అమెరికా
 వెళ్ళిపోతారు. గత 20 ఏళ్ళలో మూడే మూడుసార్లు ఇండియా వచ్చి, 
చూసిపోతారు. నాయనమ్మ దగ్గరే పెరిగిన హీరోకు, ఆమె చనిపోయినా
 రాని నాన్న అంటే సహజంగానే అసహ్యం. అందుకే, ఎవరూ లేరన్నట్లు
 పెరుగుతుంటాడు. ఈ విషయం తెలిసిన హీరోయిన్ అమెరికా వెళ్ళడం
 మానేసి అయినా, హీరోనే పెళ్ళాడాలనుకుంటుంది. కానీ, వాళ్ళ
 పెళ్ళికి హీరోయిన్ తండ్రి అడ్డంకి అవుతాడు. అప్పుడు హీరో 
ఏం కోరుకున్నాడు? ఏమైంది?

వినోదం నిండిన ఈ ప్రేమకథ సంతోష్ శోభన్‌కు హీరోగా తొలి సినిమా.
 ఆ అనుభవ రాహిత్యమేదీ కనిపించనివ్వలేదీ కొత్త కుర్రాడు. 
అవికా గోర్ కెరీర్ జాబితా లెక్క ఈ సినిమాతో మరో అంకె పెరిగింది.
 పురుషాధిక్య భావజాలం, బద్ధకం నిండిన శాడిస్టు బండిరెడ్డి
 సర్వేశ్వరరావు పాత్రలో హీరోయిన్ తండ్రిగా రవిబాబు ఉన్న 
కాసేపు హాలులో కొత్త ఉత్సాహం తెస్తారు. ఇక, హీరోయిన్ తల్లి
 పాత్రలో సత్యా కృష్ణన్‌ది మొగుడి ప్రవర్తనను సదా మనసులోనే
 తిట్టుకొనే మహిళ పాత్ర. అందుకే, భర్త చనిపోయాక ఆమెలో
 విషాదఛాయలేమీ లేకపోవడం సహజమనుకోవాలి. అభిషేక్
 మహర్షి వినోదం పంచుతారు.  

ఇప్పటి వరకు నిర్మాతగా ఉన్న పి. రామ్మోహన్‌కు దర్శకుడవడంతో 
వంట చేయించుకొనే బాధ్యత నుంచి చేసే బాధ్యతకు మారినట్లయింది.
 దాని వల్ల వచ్చే పాజిటివ్‌లు, నెగటివ్‌లు కూడా సహజమే. ఆ శైలి 
చూస్తే - నగేశ్ కుకునూర్, శేఖర్ కమ్ముల లాంటి దర్శకుల తొలినాళ్ళు, 
స్వతంత్ర సినీ రూపకర్తల సినిమాలు గుర్తుకొస్తాయి. అందుకే, దీన్ని
 పూర్తి కమర్షియల్ సినిమాగా చూడలేం. సాంకేతిక విభాగాల తీరూ 
అందుకు తగ్గట్లే ఉన్నాయి.

సెపరేట్ కామెడీ, స్పెషల్ ఐటమ్ సాంగ్‌లు లేని ఈ ప్రేమకథలో తీసుకున్న
 పాయింట్ చిన్నది. 130 నిమిషాల సినిమాగా మజ్జిగ పల్చ నైంది. 
వరస చూస్తే పరుగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం 
మంచిదని ఈ దర్శక, నిర్మాతల అభిప్రాయమేమో అనిపిస్తుంది.
 వేగంగా పరుగులు తీయకున్నా, ఫస్టాఫ్ బాగుందనిపించేలా 
నడిపారు. హీరో ఫ్లాష్‌బ్యాక్ కథ బయటికొచ్చి, కథలో కీలక
 పాయింట్ తెలిసిన తరువాత పరిస్థితి మారింది. ఒక్కముక్కలో- 
ఈ కథ సంసారపక్షం. కథనమే కాదు, నిర్మాణమూ అంతే. 
రొమాంటిక్ కామెడీలు చూసేవారి కిది ఓ.కె. అంతకు మించి 
అదనంగా ఏదైనా కోరుకుంటేనే చిక్కు!

.......................................................
ఈ స్క్రిప్ట్ రామానాయుడు ఫిల్మ్‌స్కూల్ సాయిసుకుమార్ రాసింది.
 కేవలం 33 షూటింగ్ డేస్.  
హైదరాబాద్ పరిసరాల్లో, వికారాబాద్‌లో షూటింగ్. 
సెకండాఫ్‌లోని డ్యూయట్ పుణే దగ్గర లోనావాలా పరిసరాల్లో తీశారు.
  హీరో సంతోష్ శోభన్ ‘వర్షం’ చిత్ర దర్శకుడైన శోభన్ 
కుమారుడు. గతంలో ‘గోల్కొండ హైస్కూల్’ చిత్రంలో 
క్రికెట్ టీవ్‌ు కెప్టెన్ పాత్ర పోషించారు. ఇప్పుడు హీరోగా పరిచయం.
...........................................................

- రెంటాల జయదే 

(Published in 'Sakshi' daily, 28th Nov 2015, Saturday)
.......................................