జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, July 28, 2013

'ఎవడు' చిత్రం రిలీజ్ వాయిదా తెర వెనుక కథేంటి?













  • ఆగస్టు 21కి 'ఎవడు' వాయిదా!
  • ముందు ప్రకటించినట్లే ఆగస్టు 7నే 'అత్తారింటికి దారేది'
  • మూడు వారాల ఉత్కంఠకు తెర
అభిమానులను ఊరిస్తూ వస్తున్న 'ఎవడు' చిత్రం విడుదల ఆఖరికి వాయిదా పడింది. రామ్‌చరణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నిజానికి ఈ నెల 31న విడుదల కావాలి. ఆ విషయాన్నే నిర్మాత 'దిల్‌' రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి కొన్నాళ్ళుగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ విషయాన్ని పదే పదే మీడియాతో నిర్ధారించారు కూడా! తీరా, శనివారం సాయంత్రం సినిమా విడుదలను ఆగస్టు 21కి వాయిదా వేస్తున్నట్లు అనూహ్య ప్రకటన చేశారు. దీంతో, ఆగస్టు 7న రిలీజ్‌ కానున్న పవన్‌ కల్యాణ్‌ - త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల 'అత్తారింటికి దారేది?' చిత్రానికి ఎట్టకేలకు సొంత మెగా కుటుంబం నుంచి పోటీ తప్పినట్లు అయింది.

ఈ అనూహ్య పరిణామాల పూర్వాపరాల విషయానికి వెళితే, నిజానికి గడచిన మూడు, నాలుగు వారాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ చర్చించుకుంటున్న విషయం - రామ్‌ చరణ్‌ తేజ్‌ 'ఎవడు', పవన్‌ కల్యాణ్‌ 'అత్తారింటికి దారేది?' చిత్రాల విడుదల గురించే! రంజాన్‌ కానుకగా 'అత్తారింటికి దారేది?' చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర దర్శక, నిర్మాతలు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇంతలో 'ఎవడు' చిత్రాన్ని జూలై 31న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించడం చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ తదితర 'మెగా' కుటుంబ అభిమానుల్ని షాక్‌కు గురి చేసింది. 

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పెద్ద హీరోల, భారీ బడ్జెట్‌ చిత్రాలు రెండూ వారం తేడాలో పోటాపోటీగా విడుదల అవుతాయనడం వారికి మింగుడు పడలేదు. పదుల కోట్లు వెచ్చించి, వందలాది థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు కావడంతో, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా తమ పెట్టుబడుల గురించి ఆందోళన చెందారు. అయితే, విడుదల తేదీలు మార్చేది లేదంటూ రెండు చిత్రాల వాళ్ళూ తమ వాదనకే కట్టుబడడంతో, పీటముడి పడింది. ఈ ఉత్కంఠ ఇలా రెండు, మూడు వారాలు కొనసాగాక, ఎట్టకేలకు ఇప్పుడు 'ఎవడు' చిత్ర దర్శక, నిర్మాతలే వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

బాబాయి, అబ్బాయిల పోటీనా?
'ప్రజాశక్తి' సేకరించిన అత్యంత విశ్వసనీయమైన తెర వెనుక సమాచారం ప్రకారం 'అత్తారింటికి దారేది?' చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నిర్మాత భోగవల్లి ప్రసాద్‌, బృందం కొన్ని నెలల ముందే తమ చిత్రం రిలీజ్‌ గురించి, 'ఎవడు' నిర్మాత 'దిల్‌' రాజుతో చర్చించారు. ఆయనను పిలిపించి, తమ సినిమా రిలీజ్‌ను ఆగస్టు 7 అని ఖరారు చేసుకుంటున్నట్లు చెప్పారు. వాళ్ళ 'ఎవడు' సినిమా రిలీజ్‌ ఎప్పుడని కూడా అడిగారు. 'ఎవడు' చిత్రాన్ని జూన్‌ నెలాఖరులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్‌ చేస్తున్నట్లు 'దిల్‌' రాజు చెప్పారు. దాంతో, దానికి కనీసం నెల రోజుల పైగా విరామం ఉండేలా చూడాలని పవన్‌ కల్యాణ్‌ బృందం చర్చించుకొని, ఆగస్టు 7న తమ చిత్రం రిలీజ్‌ను నిర్ధారించుకున్నారు. 

''ఆ మాటే 'దిల్‌' రాజుకు చెప్పాం. ఆయన కూడా సమ్మతించారు. తీరా, 'ఎవడు' రిలీజ్‌ వాయిదాల మీద వాయిదాలు పడుతూ, జూలై 31కి వచ్చింది. దాంతో, లేని పోటీ కాస్తా వచ్చిపడింది'' అని 'అత్తారింటికి...' చిత్ర యూనిట్‌లోని అత్యున్నత వర్గాల వారు 'ప్రజాశక్తి'కి వివరించారు.

డేటు..పవన్‌ ముందే చెప్పాడు!
'అత్తారింటికి...' చిత్రం రిలీజ్‌ డేట్‌ను తమ కన్నా ముందుగానే ప్రకటించారని 'దిల్‌' రాజు కూడా బాహాటంగా ఒప్పుకున్నారు. అయితే, ఆ యూనిట్‌ చెప్పిన విధంగా 'అత్తారింటికి...' చిత్రం ఆగస్టు 7న ఎక్కడొస్తుంది లెమ్మని 'ఎవడు' దర్శక, నిర్మాతలు మితిమీరిన ధీమాకు పోయారు. తీరా, అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకొని, ఆగస్టు 7కే పవన్‌ సినిమా రిలీజ్‌కు సిద్ధమైపోవడంతో, 'ఎవడు' టీమ్‌కు షాక్‌ కొట్టింది. లేనిపోని పోటీ తలనొప్పి వచ్చిపడింది. 

అటు అబ్బాయి రామ్‌చరణ్‌ సినిమా, ఇటు బాబాయి పవన్‌ కల్యాణ్‌ సినిమా కావడంతో అభిమానుల్లో, వ్యాపార వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో, 'అత్తారింటికి...' రిలీజ్‌ను పోస్ట్‌పోన్‌ చేయించడానికి తెర వెనుక చాలానే ప్రయత్నాలు జరిగినట్లు భోగట్టా. 

''తెర వెనుక చాలా తతంగమే జరిగింది. పంచాయతీలూ సాగాయి. కానీ, మేము ముందుగానే అందరినీ సంప్రతించి, అనుమతి తీసుకొని నిర్ణయించిన తేదీ కావడంతో, మమ్మల్ని ఎవరూ తప్పు పట్టలేకపోయారు'' అని పేరు ప్రచురించడానికి ఇష్టపడని 'అత్తారింటికి...' యూనిట్ సభ్యుడొకరు వివరించారు.

చివరకు, హీరో పవన్ కల్యాణ్ సైతం 'ముందే చెప్పి, ఖరారు చేశాం కాబట్టి, 'ఎవడు' కోసం 'అత్తారింటికి...' రిలీజ్ ను మార్చుకోవాల్సిన పని లేద'ని కరాఖండిగా చెప్పినట్లు కృష్ణానగర్ కబురు. 'అత్తారింటికి..' రిలీజ్ మారే సూచనలు లేకపోవడంతో, మరో దారి లేక 'ఎవడు' రిలీజ్ ను 'దిల్' రాజు బృందమే మార్చుకోవాల్సి వచ్చింది. రాఖీ (శ్రావణపూర్ణిమ), మెగాస్టార్ చిరంజీవి జన్మదిన (ఆగస్టు 22) కానుకగా ఆగస్టు 21కి 'ఎవడు' జనం ముందుకొస్తాడని ప్రకటించాల్సి వచ్చింది. ఈ తాజా వాయిదా ప్రకటనకు చిరంజీవి తదితరుల సలహా కూడా కారణమని చెబుతున్నారు. 

ఏతావతా, 'జంజీర్' (తెలుగులో 'తుఫాన్') రిలీజ్ ఖరారైపోయినందువల్ల  తాము వెనక్కి వెళ్ళడం కుదరని గతంలో పదే పదే చెప్పిన 'ఎవడు' బృందం ఇప్పుడు మాత్రం ఆ మాటను పక్కన పెట్టేయడం విశేషం. 

''మనసుంటే మార్గం ఉంటుంది. 'ఎవడు' వాయిదా వేసుకోవడం వాళ్ళ చేతుల్లో పనే'' అని 'అత్తారింటికి..' వర్గాలు 'ప్రజాశక్తి'తో గతంలోనే అన్నాయి. వారు అన్నట్లే, చివరకు మార్గం సుగమం కావడం గమనార్హం. అయితే, రిలీజ్ తేదీల్లో పోటీ నివారణ జరిగింది. 

కానీ, రేపు బాక్సాఫీస్ ఫలితం, వసూళ్ళ  దగ్గర కూడా ఈ రెండు చిత్రాలకూ పోటీ రాదని గ్యారెంటీ ఏముంది. ఆ సంగతే 'కృష్ణానగర్' వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
మరి, ఈ పోటీని తప్పించే దారేది...? తప్పించగలది ఎవడు..? ఇవన్నీజవాబులేని ప్రశ్నలే. 

- రెంటాల జూనియర్

(Published in 'Praja Sakti' daily, 28th July 2013, Sunday, Page No.8)
..............................................................................

''బాబాయిని చరణ్ గౌరవిస్తాడు! భయపడడు!'' - 'ఎవడు' చిత్రం వాయిదాపై నిర్మాత 'దిల్‌' రాజు


జూలై 31న విడుదల కావాల్సిన 'ఎవడు' చిత్రాన్ని ఆగస్టు 21కి వాయిదా వేయడంపై వివరణ నిచ్చారు నిర్మాత దిల్ రాజు. పవన్ కల్యాణ్ కూ, ఆయన నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రానికీ భయపడి ఏమీ తాము ఈ నిర్ణయం తీసుకోలేదని ఆయన వివరించారు.


'ఎవడు' వాయిదా గురించి వెబ్‌సైట్లతో సహా మీడియాలో రకరకాల కథనాలు, ఊహాగానాలు వస్తున్నాయంటూ, శనివారం సాయంత్రం పొద్దు పోయాక, నిర్మాత 'దిల్‌' రాజు విలేఖరుల సమావేశం పెట్టి మరీ తన వివరణ ఇచ్చారు. ''(పవన్‌) కల్యాణ్‌ బాబాయి. చరణ్‌ అబ్బాయి. బాబాయిని అబ్బాయి గౌరవిస్తాడే కానీ, భయపడడు. కేవలం మెగా అభిమానుల్లో ఎవరినీ నొప్పించకూడదనే ఉద్దేశంతోనే ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశాం. 'అత్తారింటికి..' విడుదలైన రెండు వారాల తరువాత ఆగస్టు 21న 'ఎవడు' వస్తుంది. శనివారం మధ్యాహ్నం మేమంతా చర్చించుకొని, ఈ నిర్ణయం తీసుకున్నాం. బాబాయి, అబ్బాయిల సినిమాలు రెండూ ఒకే నెలలో విడుదల కానున్నాయి. ఫ్యాన్స్‌కు ఇది పండగే! రెండూ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలవుతాయి'' అని 'దిల్‌' రాజు వివరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ''రిలీజయ్యాక తెరపై చూస్తే కదా! ఏ సినిమా సత్తా ఏంటే తెలిసేది. నాకు తెలిసి రెండు చిత్రాలూ పెద్ద హిట్టయ్యే సినిమాలే'' అని పేర్కొన్నారు.
'ఎవడు' కోసం రెండేళ్ళ పాటు శ్రమించామని చెప్పిన 'దిల్‌' రాజు ఈ చిత్రం కోసం రచయితలు, సాంకేతిక నిపుణులు దర్శకుడికిచ్చిన సహకారం మరువలేనిదన్నారు. ''2011లో దర్శకుడు వంశీ పైడిపల్లి ముప్పావుగంట సేపు నాకు 'ఎవడు' కథ చెప్పాడు. ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్ళే సినిమా అవుతుందిది అనుకున్నాను. పోస్ట్‌ ప్రొడక్షన్‌ అంతా పూర్తయ్యాక శుక్రవారం నాడు ఈ సినిమా చూశా. కథ విన్నప్పుడు కలిగిన ఉద్వేగమే మళ్ళీ కలిగింది. రేపు హాల్లోని ప్రేక్షకులకు కూడా ఇదే ఉద్వేగం కలిగితే, సినిమా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది'' అని 'ఎవడు' గురించి ఆయన దృఢమైన విశ్వాసం వ్యక్తం చేశారు.

(Published in 'Praja Sakti' daily, 28th July 2013, Sunday, Page no.8)
...........................................................

Saturday, July 27, 2013

అసంతృప్తి మిగిల్చే నవలా చిత్రం (ఆకాశంలో సగం - సినిమా సమీక్ష)




సాహిత్యానికీ, సినిమాకూ ఉన్న పోలికల కన్నా తేడాలే ఎక్కువ. మాధ్యమాలు వేర్వేరు కావడంతో, ఏదైనా ప్రసిద్ధ సాహిత్య కృషిని వెండితెర మీదకు తీసుకురావడం కత్తి మీద సాము. పైగా, అప్పటికే ప్రాచుర్యం పొంది, పాఠకుల ఊహాలోకంలో గీసేసుకున్న చిత్రాన్ని వెండితెరపై మరోసారి చలనచిత్రంగా చూపించడానికి మామూలు సినిమా కన్నా పదింతలు కష్టపడాల్సి ఉంటుంది. అందుకే, ప్రసిద్ధమైన నవలలు తెర మీదకు వచ్చినప్పుడు జనం హర్షించడానికి ఎంత అవకాశం ఉందో, తమ ఊహల్లోని కథను తెరపై సరిగ్గా చూపలేదంటూ చప్పరించేసే ప్రమాదమూ పొంచి ఉంది. రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ పాపులర్‌ నవల 'అనైతికం' ఆధారంగా వచ్చిన 'ఆకాశంలో సగం' చిత్రం అలాంటి ప్రమాదాన్నే ఎదుర్కొంది.
కొంత విరామం తరువాత తెలుగులో వచ్చిన నవలా చిత్రం ఇది. చాలా ఏళ్ళ క్రితం వచ్చిన పాపులర్‌ నవల, కొంత చర్చ లేవనెత్తిన వివాదాస్పద రచన 'అనైతికం' కావడంతో, సహజంగానే ఆ కథను దర్శకుడు ప్రేమ్‌రాజ్‌ ఎలా తీశారా అని ఆసక్తిగా సినిమాకు వెళతాం.
.........................................................................................
చిత్రం: ఆకాశంలో సగం, తారాగణం: ఆశా సైనీ, చంద్రమహేశ్, అల్లరి రవిబాబు, శ్వేతాబసు ప్రసాద్, కథ:  యండమూరి వీరేంద్రనాథ్, మాటలు:  పరుచూరి బ్రదర్స్, సంగీతం:  యశోకృష్ణ, పాటలు:  సుద్దాల అశోక్ తేజ, నిర్మాత: మల్కాపురం శివకుమార్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం:  ప్రేమ్ రాజ్
..........................................................................................
కథ: ముంబయిలో కుమార్తె (శ్వేతాబసు ప్రసాద్‌)తో కలసి జీవిస్తుంటుంది వసుంధర (మయూరి అలియాస్‌ ఆశాసైనీ). ఆమె ఓ సింగిల్‌ పేరెంట్‌. ''ఆమెకు భర్త లేడు, ఈ అమ్మాయికి తండ్రి లేడు'' అంటూ సూటిపోటి మాటలు వినాల్సి రావడంతో, తన తండ్రి ఎవరన్నది చెప్పమంటూ కూతురు, తల్లిని నిలదీస్తుంది. అప్పుడు తల్లి తన డైరీని కూతురికిస్తుంది.
ఆ డైరీలో తల్లి రాసుకున్న తన జీవితమే ఫ్లాష్‌బ్యాక్‌గా నడిచే ఈ సినిమా. వసుంధర ఓ మధ్యతరగతి అమ్మాయి. భర్త (దర్శకుడు చంద్రమహేశ్‌) ఓ మామూలు ఉద్యోగి. అందరు అమ్మాయిల లాగే వసుంధరకు కూడా జీవితం మీద కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. కానీ, అన్నిటికీ నిరుత్సాహపరుస్తూ మాట్లాడే భర్త మనస్తత్త్వం, సంసారంలోని చిన్న చిన్న సంతోషాల పట్ల కూడా అతనికి ఉన్న అనాసక్తి ఆమెను కుంగదీస్తాయి. పైగా, అన్నిటికీ ఏదో ఒక అడ్డుపుల్ల వేసే ఛాదస్తపు అత్త గారు (కాకినాడ శ్యామల), తన పనిలో తాను మునిగిపోయే బావ గారు (దర్శక - నటుడు 'అల్లరి' రవిబాబు), పూజా పునస్కారాలతో గడిపే తోడి కోడలు, సినిమాలూ షికార్లకూ తిరిగే ఆడపడుచు... ఇలా ఎవరికి వారేగా ఉండే కుటుంబమది.

ఆ పరిస్థితుల్లో భర్తతో కలసి సరదాగా టూర్‌కు ప్లాన్‌ చేస్తుంది వసుంధర. తీరా ఊరెళుతున్న సమయంలోనే 'డిసెంబర్‌ 6' ఘర్షణలు తలెత్తుతాయి. ఆ సమయంలో వసుంధరను ఒంటరిగా వదిలేసి, భర్త పారిపోతాడు. ఒంటరిగా మిగిలిన ఆమె వెంట రౌడీలు పడతారు. అప్పటికి చిత్ర ప్రథమార్ధం ముగుస్తుంది. ఆ తరువాత ఆమె ఏమైంది, ఆమె జీవితం ఎలా అనుకోని మలుపు తిరిగిందన్నది చిత్ర ద్వితీయార్ధం.
నవలలో ఏముంది?
'ఏ స్త్రీ అయినా వివాహ బంధం నుంచి, భర్త నుంచి ఏం కోరుకుంటుంది? సామాజికంగా, మానసికంగా, బౌద్ధికంగా తోడు... కష్టనష్టాల్లో కాసింత ఓదార్పు! అది లేనప్పుడు ఆ ఓదార్పు హస్తం కోసం ఆమె అర్రులు చాస్తుండడాన్ని సాకుగా తీసుకొని, ఆమెను తమ అవసరాలకు వాడుకోవడం పురుషాధిక్య భావజాలంలోని వికృతి. అసలు స్త్రీ పురుషులు ఇండిపెండెంట్‌ కాదు... ఇంటర్‌ డిపెండెంట్‌' అన్న వాదనను 'అనైతికం'లో యండమూరి వినిపించే ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తూ చాలామంది స్త్రీవాదులు ''పురుషుణ్ణి తమ శత్రువుగా పరిగణిస్తున్నారు. నిజానికి, సమాజం వేరు. పురుషుడు వేరు. సమాజంలో పురుషుడు ఒక భాగం మాత్రమే...'' అని నవలలో పాత్రలతో అనిపిస్తారు. కాబట్టి శత్రువుగా భావించాల్సింది సమాజంలోని ఈ భావజాలాన్నే తప్ప, అందులో ఓ చిన్న భాగం మాత్రమే అయిన పురుషుణ్ణి కాదంటారు.
నైతికం, సామాజిక, ఆర్థికం - అనే మూడు కట్టుబాట్లకు ప్రతీకలుగా అహల్య, ఆమె వదిన అచ్చమ్మ, అహల్య కూతురు శ్యామల అనే మూడు పాత్రలతో 'అనైతికం' నవల సాగుతుంది. ఆ పాత్రలు తమ కోణం నుంచి తమ కథలను తాము చెబుతూ వస్తాయి. ఈ పాత్రల జీవితాల్లో జరిగే సంఘటనల తాలూకు మానసిక సంఘర్షణే కథకు మూలం. దీన్ని సినిమాగా తీయాలన్న దర్శక, నిర్మాతల సాహసానికి అభినందనలు చెప్పాలి.
సినిమాలో ఏం చూపారు?
అయితే, పేరుకు ఇది యండమూరి 'అనైతికం' ఆధారంగా తీసినది అయినప్పటికీ, వెండితెర మీదకు ఎక్కిస్తుండే సరికి, పేరుతో పాటు, కథను చాలా మార్చారు. దర్శకుడు చాలా కన్వీనియంట్‌గా అహల్య కథను... అదీ చాలా కొద్ది ఘట్టాలు, కొన్ని సంభాషణలు మాత్రం తీసుకొని ఈ సినిమా తీశారు. ఆ క్రమంలో నవలలో ఉన్న విస్తృత చిత్రణ, సమస్య తాలూకు సమగ్ర స్వరూపం పూర్తిగా మిస్సయ్యాయి. తానేమి చెప్పదలుచుకున్నదీ దర్శకుడికే స్పష్టత లోపించింది.
సినిమా చూస్తుంటే, తెర మీద ఓ అసమగ్ర, అస్పష్ట వ్యక్తిత్వంతో పాత్రలు తిరుగుతున్నట్లనిపిస్తుంది. కథనే తప్ప, జీవితాన్ని చూస్తున్నట్లు అనిపించదు. ఫలితంగా, ప్రేక్షకుడు ఆ ఘట్టాలలో లీనం కాలేడు. పూర్వాశ్రమంలో పాత్రికేయుడిగా పనిచేసి, సినీ రచయితగా మారి, పరుచూరి బ్రదర్స్‌ వద్ద సహాయకుడిగా పనిచేసిన అనుభవం ఈ చిత్ర దర్శకుడు ప్రేమ్‌రాజ్‌ది. గతంలో 'నగరం నిద్రపోతున్న వేళ...' తీసిన ఆయనకు ఇది రెండో సినిమా. స్క్రీన్‌ప్లే కూడా ఆయనే రాసుకున్నారు. మాటల క్రెడిట్‌ తన గురువులు పరుచూరి బ్రదర్స్‌కు ఇచ్చారు. దురదృష్టవశాత్తూ, సినిమా స్క్రీన్‌ప్లేలో కానీ, దర్శకత్వ విధానంలో కానీ ప్రేమ్‌రాజ్‌ ఆసక్తిని రేకెత్తించ లేకపోయారు.
 నిజానికి కథ చాలా సంక్లిష్టమైంది. విమర్శనాత్మకమైంది. దీన్ని తెరకెక్కించడం అంత ఆషామాషీ విషయం కాదు. తీరా, తీసుకున్న కాన్సెప్ట్‌ మంచిదే అయినా, దాన్ని ఎగ్జిక్యూట్‌ చేయడంలో సవాలక్ష లోపాలతో, తడబడ్డారు.
కథలోని అసలు పాయింట్ ను వదిలేసి, ''మమ్మల్ని (స్తీలను) ఆకాశంలో సగం అనక్కర లేదు. ఆకాశం కింద నుంచి వెళ్ళే పాసింగ్‌ క్లౌడ్స్‌కు ఇచ్చే విలువైనా ఇవ్వండి'' అంటూ కథానాయిక వసుంధర పాత్ర దేబిరించిన పద్ధతిలో మాట్లాడేలా చూపించారు.  ఆ మాటకొస్తే, కథానాయిక వసుంధర పాత్ర అనే కాదు, సినిమాలోని ఏ పాత్రకూ సరైన వ్యక్తిత్వాన్ని కానీ, వాటి ప్రవర్తనకు తగిన ప్రాతిపదికను కానీ దర్శకుడు కల్పించలేకపోయారు. 
నిర్మాణ విలువల కోసం వెతుక్కోవడం అనవసరమనిపించే ఈ రెండు గంటల వ్యవధి చిత్రంలో ఇతర సాంకేతిక శాఖల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉందని చెప్పాలి. పాటల్లో ఒకటీ, రెండూ..(యశోకృష్ణ సంగీతం, సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం) వినసొంపైన గళాల్లో ఆకర్షిస్తాయి. ఛాయాగ్రహణం, కూర్పు, రీరికార్డింగ్ ల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది.  ''18 మంది దర్శకులు నటించిన తొలి తెలుగు చిత్రం'' అంటూ ఈ చిత్రానికి చేసిన ప్రచారం కేవలం పబ్లిసిటీకే తప్ప, సినిమాకు ఉపకరించిన దాఖలా తెరపై కనిపించదు. పైగా, పోసాని కృష్ణమురళి పోషించిన ఇన్‌స్పెక్టర్‌ పాత్ర కనిపించేది మూడు, నాలుగు నిమిషాలే అయినా, దుస్సహమైన అనుభవంగా మిగిలింది.
ఏతావతా, నవల చదవకుండా మామూలుగా వెళ్ళినా ఈ చిత్రం నిరాశ పరుస్తుంది. ఇక, ఇప్పటికే నవలను చదివి, దాని మీద ఓ అభిప్రాయంతో ఈ సినిమాకు వెళితే, ఆ నిరాశ అంతకు పదింతలు పెరుగుతుంది. ఓ మంచి కాల్పనిక రచనను సినిమాగా ఎలా తీయకూడదో తెలుసుకోవడానికి ఈ చిత్రం ఓ రెండు గంటల వెండితెర పెద్ద బాలశిక్ష. 
కొసమెరుపు : 
చట్టబద్ధమైన హెచ్చరిక - వాల్‌పోస్టర్లలో 'యు/ఏ' సర్టిఫికెట్‌, ఆశాసైనీ అందాల ప్రదర్శనలు చూసి, ఏదేదో ఊహించుకొని సినిమాకు వెళ్ళి, ఆశాభంగానికి గురైతే, అందుకు దర్శక, నిర్మాతలు, నటీనటులెవ్వరూ బాధ్యులు కారు!

- రెంటాల జయదేవ 

(ప్రజాశక్తి దినపత్రిక, 27 జూలై 2013, శనివారం, పేజీ నం.8లో ప్రచురితమైన సినిమా సమీక్ష పూర్తి పాఠం ఇది)
.......................................................

Wednesday, July 24, 2013

70వ దశకం కలల రాణి, అందాల నటి మంజుల


నిన్నటి తరం దక్షిణాది సినీ నాయిక, నటి మంజుల మంగళవారం నాడు (జూలై 23వ తేదీ) చెన్నైలో మరణించారు. ఆమె వయస్సు 59 సంవత్సరాలు. 
ఆమె భర్త విజయకుమార్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు తమిళ, తెలుగు చిత్రాల్లో తరచూ కనిపించే పాపులర్‌ నటుడు. వారం రోజుల క్రితం ఇంటిలో కిందపడి తీవ్రంగా గాయపడ్డ మంజుల గత బుధవారం నుంచి చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంతలో కామెర్లు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. కడుపులో తీవ్రమైన నొప్పి, రక్తం గడ్డకట్టడం లాంటి సమస్యలు ఆమెను బాధించాయి. చికిత్స జరుగు తుండగానే చివరకు, మంగళవారం ఉదయం శ్రీరామచంద్ర మెడికల్‌ కాలేజ్‌ (ఎస్‌. ఆర్‌.ఎం.సి) హాస్పిటల్‌లో కన్నుమూశారు. 'సింగం' (తెలుగులో 'యముడు') తదితర చిత్రాల దర్శకుడు హరి ఆమెకు అల్లుడు. 
''మంగళవారం ఉదయం ఆమె పూర్తిగా స్పృహ కోల్పోయారు. ఆమె ఆఖరి క్షణాల్లో కుటుంబమంతా దగ్గరే ఉంది. మూత్రపిండాల వ్యవస్థ వైఫల్యంతో ఆమె మరణించినట్లు, డాక్టర్లు ప్రకటించారు'' అని మంజుల సవతి కుమారుడు, నటుడు అరుణ్‌ విజరు తెలిపారు. తమిళ, తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు పలువురు మంజుల భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. బుధవారం నాడు చెన్నైలో మంజుల భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. 

70వ దశకం.. కలల నాయిక

దాదాపు మూడు దశాబ్దాల కాలం పాటు దక్షిణాది భాషల్లో నటిగా వెలిగిన మంజుల 1953 సెప్టెంబర్‌ 9న జన్మించారు. బాల నటిగా మొదలై, ఆనక కథానాయికగా ఎదిగిన తారల్లో మంజుల ఒకరు. నిజానికి, బాల నటిగా నటించిన హీరో సరసనే పెద్దయ్యాక కథానాయిక పాత్రలు కూడా పోషించిన ఘనత శ్రీదేవి కన్నా ముందే 1970లలోనే మంజుల సాధించారు. అప్పట్లో తమిళ అగ్రహీరో శివాజీ గణేశన్‌తో తెరపై బాలనటిగా కనిపించిన ఆమె ఆ తరువాత ఆయనతోనే కథానాయికగా ప్రేక్షకులను అలరించారు. తమిళ చిత్రం'శాంతి నిలయం' (1969)లో జెమినీ గణేశన్‌ కుమార్తెగా సహాయ పాత్రలో ఆమె నటించారు. తెలుగులో కూడా ఎస్వీ రంగారావు నటించిన 'కత్తుల రత్తయ్య' (1972), 'ఆస్తి మూరెడు ఆశ బారెడు...' లాంటి హిట్‌ పాటలున్న కె. బాలచందర్‌ 'భలే కోడళ్ళు' (1968) లాంటి చిత్రాల్లో బాల నటిగా మెరిసిన మంజుల హీరోయిన్‌ అయ్యాక తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లోనూ నాయికగా పెద్ద హీరోలతో కనువిందు చేశారు.

1970ల తొలి రోజుల్లో ఆమె తమిళ చిత్ర సీమలో అగ్రశ్రేణి కథానాయికగా వెలిగిపోయారు. అగ్ర హీరో ఎం.జి.ఆర్‌.తో కలసి 'రిక్షాకారన్‌' (1971), విదేశాల్లో ఎం.జి.ఆర్‌. చిత్రీకరించిన సంచలనాత్మక భారీ చిత్రం 'ఉలగమ్‌ సుట్రుమ్‌ వాలిబన్‌' (1973-తెలుగులో 'లోకం చుట్టిన వీరుడు'గా అనువాదమైంది) లాంటి హిట్స్‌తో సినీలోకంలో పేరు తెచ్చుకున్నారు. తమిళంలో జెమినీ గణేశన్‌, ఎస్‌.పి. ముత్తురామన్‌, తెలుగులో ఎన్టీయార్‌, ఏయన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కన్నడంలో విష్ణువర్ధన్‌, అలాగే తరువాతి తరంలో తమిళ హీరోలైన కమలహాసన్‌, రజనీకాంత్‌లతో ఆమె నటించారు.

అందం, అభినయం తోడయ్యాయి..

1970లలో అందాల తారగా ఆమె ఎంతో మంది సినీ ప్రియులకు కలల రాణి. ఎన్టీయార్‌తో 'మనుషులంతా ఒక్కటే!' (1976), 'మగాడు' (హిందీ 'దీవార్‌'కు రీమేక్‌ - 1976), 'మా ఇద్దరి కథ' (1977) తదితర చిత్రాల్లో ఆమె నటించారు. ఇక, ఏయన్నార్‌ సరసన 'దొరబాబు' (1974), 'మహాకవి క్షేత్రయ్య' (1976), జగపతి వారి 'బంగారు బొమ్మలు' (1977) తదితర చిత్రాల్లో అలరించారు. కృష్ణ, శోభన్‌బాబుల సరసన ఆమె పలు హిట్‌ చిత్రాల్లో మెరిశారు. కృష్ణతో 'మాయదారి మల్లిగాడు' (1973), 'దేవుడు లాంటి మనిషి' (1975), 'మనుషులు చేసిన దొంగలు' (1977) తదితర చిత్రాల్లో అలరించారు. అల్లూరి సీతారామరాజు' (1974)లో కూడా కథలో కీలకమైన సహాయ పాత్ర పోషించారు.

ఇక, 'జగపతి పిక్చర్స్‌' అధినేత, దర్శక - నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్‌ అప్పట్లో నిర్మించిన చిత్రాల్లో ఆస్థాన నాయికగా వెలిగారామె. ఓ హిందీ హిట్‌ చిత్రం ఆధారంగా రాజేంద్రప్రసాద్‌ రూపొందించిన 'మంచి మనుషులు' (1974) చిత్రంలో శోభన్‌బాబు, మంజులపై వచ్చే స్కేటింగ్‌ బరిలో వచ్చే పాట 'పడకు పడకు వెంట పడకు...' పాట ఆల్‌టైమ్‌ హిట్‌ అయింది. లైలా, మజ్ను తదితర చారిత్రక పాత్రలతో అంతర్నాటకాలుగా వచ్చే ఆ పాట, అందులోని గెటప్‌లు రంగుల్లో అలరించాయి. 'నీవు లేక నేను లేను...', 'నిన్ను మరచిపోవాలని అన్ని విడిచి వెళ్ళాలని ఎన్నిసార్లో అనుకున్నా...' లాంటి పాపులర్‌ పాటలు ఆ చిత్రాన్ని పెద్ద హిట్‌గా నిలిపాయి. అదే చిత్రం తరువాత తమిళంలో శివాజీ గణేశన్‌తో 'ఉత్తమన్‌' (1977)గా రీమేక్‌ అయితే, అందులోనూ మంజులే హీరోయిన్‌. శోభన్‌బాబుకు జంటగా 'ఇద్దరూ ఇద్దరే' (1976), 'మొనగాడు' (1976), 'పిచ్చి మారాజు' (1976) తదితర చిత్రాల్లోనూ మంజుల నటించారు. 'నా పేరే భగవాన్‌' (1976) లాంటి హిట్‌ చిత్రాలకూ ఆమె అందం, అభినయం తోడయ్యాయి.

ఆధునిక వస్త్రాల్లో అందాల హీరోయిన్‌
బి. సరోజాదేవి, వాణిశ్రీల తరువాతి తరం నాయికగా మంజుల తన గ్లామర్‌తో 1970లలో సామాన్య ప్రేక్షకుల్ని ఉర్రూతలూపారు. అప్పటి దాకా కథానాయికలు ఒద్దికైన కట్టూ బొట్టుతో, అభినయ ప్రధాన పాత్రలతోనే ఆకట్టుకోవడం ఆనవాయితీ. అప్పుడప్పుడే రంగుల చిత్రాల యుగం ఆరంభమవుతున్న దశలో ఆధునిక వస్త్రధారణతో అమితంగా ఆకర్షించారు. తన ట్రేడ్‌మార్క్‌ కింది పెదవి బిగింపుతో, ముద్దుగా, బొద్దుగా కనిపించే మంజులకు తమిళ, తెలుగు సినీ మాస్‌ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

గ్లామరస్‌గా కనిపించడానికి వెనుకాడని నాయిక పాత్రతో సినిమా ఎంత పెద్ద హిట్టవుతుందన్న దానికి మంజుల నటించిన చిత్రాలు ఉదాహరణగా నిలిచాయి. అలా తరువాతి రోజుల్లో శ్రీదేవి, జీనత్‌ తమన్‌ తరహా హీరోయిన్ల శకానికి ఆమె పునాది వేశారని చెప్పుకోవచ్చు. అప్పట్లో కుర్రకారులో ఆమెకు ఎంత క్రేజంటే, తెలుగులో హీరో కృష్ణ సొంతంగా 'దేవుడు చేసిన మనుషులు' (1973) సినిమా నిర్మిస్తూ, అందులో వచ్చే 'తొలిసారి నిన్ను ...' అంటూ వచ్చే పాటలో అతిథి తారలుగా జమున, మంజులను ఎంచుకోవడం గమనార్హం. కృష్ణ - మంజుల జంటగా వచ్చిన 'మాయదారి మల్లిగాడు'లోని 'వస్తా.. వెళ్ళొస్తా... మళ్ళెప్పుడొస్తా... రేపు సందేళకొస్తా...' కూడా అప్పట్లో తరచూ రేడియోలో మారుమోగిన గీతమే. తెలుగు, తమిళం, కన్నడం - ఇలా ఏ భాషలో నటించినా ఆ భాషలో ముద్దుగా మాట్లాడుతూ, తానే డబ్బింగ్‌ చెప్పుకోవడం మంజులలోని మరో ప్రత్యేకత.

సహాయ పాత్రల్లో...

ఇక, 1980లకు వచ్చాక మంజుల క్రమంగా తల్లి, చెల్లి లాంటి సహాయ పాత్రల్లో కనిపించసాగారు. 1990లలో ఆమె కొద్ది చిత్రాల్లో మాత్రమే కనిపించారు. ఆ సమయంలో దర్శకుడు రవిరాజా పినిశెట్టి, ఆమెతో కొన్ని చిత్రాల్లో నటింపజేశారు. హీరో వెంకటేశ్‌ నటించిన 'చంటి' (1992)లో, అహంకారి అత్త పాత్ర పోషించిన 'సరదా బుల్లోడు' (1996) ఆమెకు అలా వచ్చినవే! వెంకటేశే నటించిన 'వాసు' (2002) ఆమె తెలుగులో కనిపించిన చివరి చిత్రాల్లో ఒకటి. ''మంజుల అభిమానిని'' అని పేర్కొనే తమిళ దర్శకుడు కె.ఎస్‌. రవికుమార్‌ సైతం ఆమెను అయిదు త్రాల్లో నటింపజేశారు. మొత్తం మీద దాదాపు 100కు పైగా సినిమాల్లో మంజుల నటించినట్లు పరిశ్రమ వర్గాల అంచనా.

హీరోయిన్‌గా నటిస్తున్న రోజుల్లో తమిళ చిత్రం 'ఉన్నిడమ్‌ మయంగుహిరేన్‌'లో పాత్రపోషణ చేసిన మంజుల ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే సహ నటుడు విజయకుమార్‌ను ఇష్టపడి వివాహమాడారు. వారి కుమార్తెలు ప్రీత, వనిత, శ్రీదేవి ముగ్గురూ కూడా తెరపై తారలుగా కనిపించడం విశేషం. విజయకుమార్‌కు మునుపటి వివాహం ద్వారా కలిగిన అరుణ్‌ విజరు, అనిత, కవిత కూడా సినీ సీమతో సంబంధమున్న వారే! తగాదాల కారణంగా సొంత కుమార్తె వనిత ఆ మధ్య రచ్చకెక్కి, మీడియాలో తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటి నుంచి కుటుంబంలో ఉద్రిక్తతలు పెరిగి, మంజుల అనారోగ్యం పాలబడ్డారు.

స్నేహ సంబంధాలు
తమిళ చిత్ర సీమలో తన తరువాతి తరం నాయికలు చాలామందితో మంజులకు స్నేహ సంబంధాలు ఉండేవి. వారితో విందు, వినోదాల్లో ఆమె సరదాగా పాల్గొనేవారు. మంజుల ఆకస్మిక మరణం పట్ల నటీమణులు రాధిక, ఖుష్బు, రజనీ కాంత్‌ కుమార్తె ఐశ్వర్యా ధనుష్‌ తదితరులు దిగ్భ్రాంతి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ''ఎంతో ఆప్యాయంగా ఉండే మంజులా విజయకుమార్‌ చాలా సరదా మనిషి. ఇవాళ ఆమెను ఇలా చూస్తుంటే, మధురమైన ఆ పాత సంగతులన్నీ గుర్తుకొస్తున్నాయి. ఆమె చూపిన ప్రేమ, ఆప్యాయత మరువలేనివి'' అని సినీ, టీవీ నటి, నిర్మాత రాధికా శరత్‌కుమార్‌ అన్నారు.

''నా దృష్టిలో మంజులా ఆంటీ ఎంతో అందమైన మహిళ. ఆమె చూపిన ప్రేమాభిమానాలు మర్చిపోలేనివి'' అని మంజుల మరణ సమయంలో పక్కనే ఉన్న నటి ఖుష్బూ పేర్కొన్నారు. ''దర్శకుడు సి.సుందర్‌తో నా వివాహం జరగడానికి కారణం ఆమే! ఆమె ఇంట జరిగిన న్యూ ఇయర్‌ పార్టీకి వెళ్ళినప్పుడు, ఆమె నా నుదుట కుంకుమ దిద్ది, మూడు నెలల్లో పెళ్ళవుతుంది అన్నారు. అప్పటికి సుందర్‌, నా ప్రేమ వ్యవహారం బెడిసికొట్టి ఉంది. అయినా, చివరకు అంతా సర్దుకొని మార్చి కల్లా మా వివాహం జరిగింది. నా జీవితంలోని కీలక వ్యక్తుల్లో ఆమె ఒకరు'' అని ఖుష్బూ అన్నారు. బహుశా, అందం, ఆత్మవిశ్వాసం, ఆప్యాయత కలగలిసిన నటిగా, మంచి మనిషిగా మంజుల చాలా కాలం పాటు సన్నిహితులకు గుర్తుండిపోతారు.

- రెంటాల జయదేవ

(ప్రజాశక్తి దినపత్రిక, 24 జూలై 2013, బుధవారం సంచికలో ప్రచురితం)
........................................................

సగమే ఫలించిన 'సాహసం' (సినిమా సమీక్ష)


కొన్ని కథలు చదవడానికి బాగుంటాయి... మరికొన్ని కథలు వినడానికి బాగుంటాయి... కానీ, వాటిలో చాలా కొద్ది కథలే చూడడానికి కూడా బాగుండేవి! ఎందుకంటే, చదవడంలో, వినడంలో పాఠకుల, శ్రోతల ఊహాశక్తే హద్దు. అనుభవాన్నీ, అనుభూతినీ ఇచ్చేది అదే! కానీ, చూడడానికి వచ్చేసరికి కంటికి కనిపిస్తున్నంత వరకే అనుభవానికీ, అనుభూతికీ ఆధారం. అందుకే, చిన్నప్పుడు చదువుకొన్న చందమామ కథ కూడా చదువుతున్నప్పుడు ఉన్నంత మజా దాన్ని ఎవరో దృశ్యీకరించినప్పుడు కనిపించదు. సాహసగాథలు, నిధి నిక్షేపాల అన్వేషణ గాథలకు కూడా ఆ ఇబ్బంది తప్పదు. ఆ ఇబ్బంది తెలిసీ, దాన్ని నెత్తినపెట్టుకొని, దర్శక, నిర్మాతలు చేసిన 'సాహసం' ఈ చిత్రం.

.........................................
చిత్రం: సాహసం, తారాగణం: గోపీచంద్‌, తాప్సీ, శక్తి కపూర్‌, లక్కీ అలీ, అలీ, మాటలు: కె.కె. రాధాకృష్ణ కుమార్‌, పాటలు: అనంత్‌ శ్రీరామ్‌, సంగీతం: శ్రీ, కళ: ఎస్‌. రామకృష్ణ, కెమేరా: శ్యామ్‌దత్‌, స్టంట్స్‌: సెల్వ, డిజిటల్‌ ఎడిటర్‌: జి.వి. చంద్రశేఖర్‌, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సహ నిర్మాతలు: భోగవల్లి బాపినీడు, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌, కథ, కథనం, దర్శకత్వం: యేలేటి చంద్రశేఖర్‌
........................................

విభిన్న కథాంశాలతో, వినూత్న చిత్రాలను రూపొందిస్తారని పేరున్న దర్శకుడు యేలేటి చంద్రశేఖర్‌ ఈ సారి నిధి - నిక్షేపాల అన్వేషణ కథను ఎంచుకున్నారు. సాహసోపేతమైన అన్వేషణ అనే కోవలోని కథలు తెలుగు తెరకు కొత్త ఏమీ కాదు. కౌబారు చిత్రంగా 'మోసగాళ్ళకు మోసగాడు', కౌబారులోనే వినోదం మిళాయించిన కథగా 'టక్కరి దొంగ', ఫ్యాంటసీ చిత్రంగా 'అంజి' లాంటివన్నీ అదే కుదురు నుంచి వచ్చినవే! ఇక, 'సాహసం' విషయానికే వస్తే...

కథ : 

వందల ఏళ్ళ క్రితం కనిష్కుల కాలంలో రాజులు దాచిన ఓ నిధి పెషావర్‌ సమీపంలో నిగూఢంగా ఉందని లెక్క. కాగా, దాదాపు 60 ఏళ్ళ పైచిలుకు క్రితం హీరో తాత సత్యనారాయణ వర్మ (సుమన్‌) పెద్ద వజ్రాల వర్తకుడు. భారతదేశ విభజన సందర్భంగా అల్లర్ల సమయంలో అల్లరి మూకల నుంచి ప్రాణాలనూ, అమూల్య వజ్రాలు, ఆభరణాలను కాపాడుకోవడం కోసం వాటన్నిటినీ మూట గట్టుకొని పారిపోతాడు. సురక్షిత మార్గమని రాజుల కాలం నాటి రహస్య ద్వారం గుండా ప్రయాణిస్తాడు. ఆ ప్రయాణంలో అనుకోకుండా ఆయన చేతిలోని వజ్రాల సంచీ ఓ రహస్య నిధి ప్రాంతంలో పడిపోతుంది. అక్కడ చావును తప్పించుకొని, తనకు దొరికిన గరుత్మంతుడి హారంతో భారత్‌కు వచ్చేసి, సామాన్యుడిలా బతుకుతాడు. ఆ వివరాలన్నీ డైరీలో రాసి, ఆ వజ్రాలు తన వారసులకు చెందాలంటూ వీలునామా రాసి, చనిపోతాడు.

దిగువ మధ్యతరగతి కుటుంబంగా గడుపుతున్న అతని వారసుడే మనుమడైన గౌతమ్‌ (గోపీచంద్‌). ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే హీరో ఎప్పటికప్పుడు ఎంతో ధనవంతుణ్ణి అయిపోవాలని కలలు కంటూ ఉంటాడు. అలాంటి వాడికి అనుకోకుండా దొరికిన తాత వీలునామా, డైరీ, లాకెట్‌ ద్వారా తాత పోగొట్టుకున్న వజ్రాల సంగతి తెలుస్తుంది. ''నాది కానిది కోటి రూపాయలు కూడా ముట్టుకోను. నాది అన్నది అర్ధరూపాయి కూడా వదులుకోను'' అన్నది హీరో తత్త్వం. దాంతో, తాత వజ్రాల కోసం అన్వేషణ మొదలుపెడతాడు. మరోపక్క పాకిస్తాన్‌లో సాగుతున్న పురాతత్త్వ శాస్త్రవేత్తల అన్వేషణ ద్వారా రాజుల కాలం నాటి ఆ నిధిని సొంతం చేసుకోవాలని అక్కడి సాయుధ ముఠా నేత సుల్తాన్‌ (శక్తి కపూర్‌) చూస్తుంటాడు. హీరో అక్కడకు ఎలా వెళ్ళాడు, ఏం జరిగిందన్నది మిగతా కథ.

బలాలు, బలహీనతలు...

'సాహసం'లోని బలాలు ఏమిటంటే, యాక్షన్‌ హీరోగా గోపీచంద్‌కు ఉన్న ఇమేజ్‌. ధైర్యం, సాహసం, నిజాయతీ, కాస్తంత చిలిపితనం నిండిన పాత్రను అతను చులాగ్గా పోషించిన తీరు. కథానాయిక శ్రీనిధిగా తాప్సీ కథాపరంగా చేయడానికి ఉన్నది తక్కువే. అయితే భక్తి, కాకపోతే భయాందోళనలకు గురి కావడం తప్ప మరో భావం లేకుండా ఆమె పాత్ర నడిచిపోతుంది. ఇక, క్రూరత్వం అంతగా కనిపించకపోయినా సుల్తాన్‌గా ఒకప్పటి ప్రసిద్ధ హిందీ విలన్‌ శక్తి కపూర్‌ నటన, గెటప్‌ ఆఫ్‌ఘనిస్తానీయుల్ని తలపిస్తూ బాగా కుదిరాయి. పాకిస్తాన్‌లో కనిపించే ఖయామత్‌ రాజుగా అలీ కాసేపు సినిమాలో రిలీఫ్‌.

కథ, కథనం యేలేటి చంద్రశేఖర్‌వే అయినా, ఈ సినిమాకు దాదాపు మరో అరడజను మంది కథా సహకారం అందించారు. కథాసహకారంతో పాటు సంభాషణల రచనలోనూ భాగమున్న కె.కె. రాధాకృష్ణ కుమార్‌ సంభాషణలు ముఖ్యంగా చిత్ర ప్రథమార్ధంలో ఆకట్టుకుంటాయి. ''కథంతా విని - కసబ్‌, పాకిస్తాన్‌కు ఏమవుతాడని అడిగినట్లు'' (అలీ) లాంటివి థియేటర్‌లో నవ్వులు పూయిస్తాయి.

సినిమాలో హీరో హీరోయిన్లకు ఒకటే డ్యుయెట్‌. ఓ నేపథ్య గీతం, సినిమా మొదట్లో టైటిల్స్‌ పడుతుండగా ఓ పాట, చివరలో రోలింగ్‌ టైటిల్స్‌ సందర్భంగా టైటిల్‌ సాంగ్‌ వస్తాయి. ఇది సగటు తెలుగు ప్రేక్షకుడికి తృప్తినివ్వవు. పైగా, హాలులో వింటూ ఉండగానే మర్చిపోయేలా పాటలున్నాయి. రీ-రికార్డింగ్‌, ముఖ్యంగా శబ్దగ్రహణం (జాతీయ అవార్డుల గ్రహీత ఎ.ఎస్‌. లక్ష్మీనారాయణ ఆడియోగ్రాఫర్‌) తెరపై దృశ్యాల్లోని భావగాఢతను పెంచాయి. కళా దర్శకత్వం, కెమేరా పనితనం బాగున్నాయి. సినిమా విజువల్‌గా ఓ చక్కటి అనుభూతినిస్తుంది. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ కూడా చాలానే వాడారు. ఒకటీ, అరా మినహా అవీ బాగానే ఉన్నాయి.

ఎలా ఉందంటే...

పాత్రల పరిచయం, కథా నేపథ్య వివరణ, హీరో తాత ఫ్లాష్‌బ్యాక్‌తో ప్రథమార్ధం చకచకా నడుస్తుంది. హీరో, హీరోయిన్ల పాకిస్తాన్‌ పర్యటనతో ఆసక్తిని నిలబెడుతుంది. కానీ, విలన్‌కూ, హీరోకూ మధ్య ఢ అంటే ఢ మొదలయ్యే ద్వితీయార్ధానికి వచ్చే సరికి సినిమా క్రమంగా పట్టు సడలింది. హీరో ఎలాగూ నిధిని సాధిస్తాడన్నది సగటు సినిమా సూత్రం కాబట్టి, ప్రేక్షకుల ఆసక్తి అంతా అది ఎలా సాధ్యమైందన్న దాని మీదే! కానీ, అక్కడ విజువల్‌ ఎఫెక్ట్‌ల మీద ఉన్నంత శ్రద్ధ, ఒక అంతస్సూత్రంగా సన్నివేశాలను నడిపే తీరులో కనిపించదు. ఒక దశకు వెళ్ళాక, కథలో హీరో పాత్రదే డామినేషన్‌ అయిపోయి, విలన్‌ వట్టి డమ్మీ అనిపిస్తాడు.

నిధిని చేరుకొనే ఘట్టాలు, ముఖ్యంగా దిగుడు బావి, బాణాల మందిరం లాంటి అంశాలు బాగానే ఉన్నా అవొక్కటే అందరినీ ఆకట్టుకోలేవు. ఈ చిత్రంలో లోటుపాట్లు కూడా చాలానే ఉన్నాయి. హీరో తాత 'పుష్కళావతి డైమండ్స్‌' పేర వ్యాపారం సాగించిన అంత పెద్ద వజ్రాల వ్యాపారి అయినా సరే, హీరో తండ్రి (నారాయణరావు)కి కానీ, ఇంట్లో వాళ్ళకు కానీ ఆయన సంగతులు కానీ, ఆ వ్యాపారం గురించి కానీ, దేశవిభజనలో ఇక్కడకు వచ్చేశామన్నట్లు కానీ తెలియవన్నట్లు చూపించడం నప్పలేదు. అలాగే, పాకిస్తాన్‌లోని పెషావర్‌ సమీపంలో ఉందన్నట్లు కథలో చూపిన హింగ్‌లాజ్‌ దేవి (ఆలయం) హీరో కుటుంబానికి తరతరాలుగా కులదేవత అయినప్పుడు, దాని వివరాలేమిటో, ఎందుకో అన్న సంగతి హీరోకూ, అతని కుటుంబానికీ తెలియదన్నట్లు చూపడం కూడా నమ్మశక్యం కాని విషయమే. హీరో వాళ్ళ పాత ఇంట్లో పై కప్పు ఊడిపడి, అందులో నుంచి తాత వీలునామా, డైరీ, ఖాళీ వజ్రాల సంచీ లాంటివి దొరకడం ఒక మిస్టరీ అయితే, వాటి గురించి ఇంట్లో చర్చే జరగకపోవడం సహజమైన స్పందనకు విరుద్ధంగా కనిపిస్తుంది.

అలాగే, కథ ప్రకారం హింగ్‌లాజ్‌ దేవి ఆలయం ఉన్నదీ, నిధుల అన్వేషణలో ప్రవేశించాల్సిన మార్గమూ ఒకచోట కాగా, పురావస్తు తత్త్వవేత్తలు తవ్వకాలు జరిపేది మాత్రం వేరొకచోట! ప్రవేశ మార్గానికీ, నిజంగా నిధి ఉన్న ప్రదేశానికీ మధ్య చాలా దూరముందని గ్రహించి, ప్రేక్షకులు సర్దిచెప్పుకోవాల్సిందే! ఇలాంటి నిధుల అన్వేషణ కథల్లో చూపే పగ, ప్రతీకారాల ఫార్ములా కానీ, ప్రత్యేకించి వినోదం, వీనుల విందైన పాటలు కానీ 'సాహసం'లో లేకపోవడం సామాన్య ప్రేక్షకులకు కొంత అసంతృప్తి కలిగిస్తుంది. భక్తినీ, మూఢ విశ్వాసాన్నీ సున్నితంగా వేరు చేసి చూపే మాటలు, దృశ్యాలతో పాటు, ''అదృష్టం కోసం యంత్రాలను కాకుండా కష్టమనే మంత్రాన్ని నమ్ముకో'' లాంటి ఆలోచనాత్మక సంభాషణలూ సినిమాలో ఉన్నాయి. వెరసి, చివరకు వచ్చేసరికి ఈ చిత్ర యూనిట్‌ పడ్డ కష్టం మాత్రం 'అడ్వెంచరస్‌ యాక్షన్‌' కథా చిత్ర ప్రియులకే కాలక్షేపమనిపిస్తుంది.

కొసమెరుపు : మ్యాప్‌ను కూడా నీళ్ళలో పడేసే హీరో, మైండ్‌ వాయిస్‌లా తనలో తానే మాట్లాడుకుంటూ నిధి అన్వేషణలో ప్రతి చిక్కుముడినీ తానే విప్పడంతో కథలో మజా ఏముంది! అందుకనే, విజువల్‌గా బాగున్నా, ప్రేక్షకులను అందులో పూర్తిగా లీనం కానివ్వని ఈ చిత్రం - సగమే ఫలించిన 'సాహసం'! 

- రెంటాల జయదేవ 

..........................................................

Friday, July 19, 2013

ఓం -3డి చిత్రంపై హీరో, నిర్మాత కల్యాణరామ్ తో ఇంటర్వ్యూ - పార్ట్ 4




ఇన్ని త్రీడీలు వస్తున్నా, త్రీడీ చిత్రీకరణకు తగిన సామగ్రిని ఎంచుకోవడానికి శ్రమించాల్సి వచ్చిందా?
అవును. భారత్‌లో తీసిన హార్రర్‌ చిత్రం 'హాంటెడ్‌ -3డి' ఎక్విప్‌మెంట్‌ను బొంబాయి వెళ్ళి చూశాం. కానీ, ఆ కెమేరా రిగ్‌ చాలా నిదానంగా కదులుతుంది. 3డి సినిమాల్లో చిత్రీకరణకు ఉపయోగించే, రెండు కెమేరాలూ, దాని తాలూకు సరంజామాను అంతా పట్టి ఉంచేదాన్ని 'రిగ్‌' అంటారు. అది చాలా కీలకం. కానీ, 'హాంటెడ్‌'కు వాడిన రిగ్‌ పరిమితమైనది. నియంత్రిత వాతావరణంలో, స్టడీ షాట్లే ఎక్కువగా వాడుతూ ఆ సినిమా తీశారు. కానీ, దానితో 'ఓం' లాంటి యాక్షన్‌ సినిమాలు తీయడం కుదరదు. దాంతో, ఏటా తమ చిత్రాల్లో అధిక శాతం వాటిని 3డిలో తీసే హాంకాంగ్‌, థాయిలాండ్‌, వియత్నాం లాంటి ఆసియా దేశాల వైపు వెళ్ళాం. హాంకాంగ్‌లో ప్రయోగాత్మకంగా షూటింగ్‌ చేసి, వేసుకొని చూశాం. బాగుందనుకున్నాం. కానీ, 3డి చిత్రీకరణలో కీలకమైన కన్వర్జెన్స్‌ పాయింట్‌ అనేది మాన్యువల్‌గా ఎప్పటికప్పుడు చూసుకోవడం ఆ కెమేరా రిగ్‌లోని సమస్య. అదీ కుదరదులెమ్మని భారత్‌కు తిరిగి వచ్చేశాక, అమెరికాలోని ఓ తెలిసిన ఆయన 'అవతార్‌' చిత్రీకరణకు తోడ్పడిన 'త్రీ యాలిటీ' అనే సంస్థ గురించి చెప్పారు. వారు అత్యుత్తమ టెక్నాలజీతో చేసిన అధునాతమైన సామగ్రి - 'టి.ఎస్‌5 రిగ్‌'. ఇప్పటికీ త్రీడీ చిత్రీకరణలో దాన్ని మించిన కెమేరా రిగ్‌ లేదు. పూర్తిగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా నడిచే రిగ్‌ అది. రెండు కెమేరాలనూ ఆటోమేటిగ్గా అనుసంధానించుకొని, ఏకకాలంలో మొదలయ్యేలా చూసుకొంటూ, ఆటోమేటిగ్గా కన్వర్జెన్స్‌ కూడా చేసుకోవడం దాని ప్రత్యేకత. కానీ, అది చాలా ఖరీదైనది. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని మా టీమ్‌లోని హరి (బావమరిది), అనిల్‌ - అందరూ పట్టుబట్టడంతో, చివరకు ఆ రిగ్‌ను పూర్తిగా అద్దెకు తెచ్చుకున్నాం. ఒక రిగ్‌ టెక్నీషియన్‌, ఈ వ్యవహారం మొత్తాన్నీ పర్యవేక్షించే ఒక స్టీరియోగ్రాఫర్‌, అలాగే 'డిజిటల్‌ ఇమేజ్‌ ట్రాన్స్‌ఫరింగ్‌' (డి.ఐ.టి) టెక్నీషియన్లు ఇద్దరు - ఇలా మొత్తం నలుగురు హాలీవుడ్‌ సాంకేతిక నిపుణుల్ని కూడా వెంట తెచ్చుకున్నాం.
'అవతార్‌'కి పనిచేసిన డేవిడ్‌ టేలర్‌ కూడా ఆ టీమ్‌లో ఉన్నారట! వాళ్ళతో పూర్తి చేశారన్న మాట!
అది అంత సులభమేమీ కాలేదు. వాళ్ళందరూ ఓ నెలరోజులు ఇక్కడ ఉండి పనిచేస్తుంటే, మొత్తం 3డి చిత్రీకరణ ప్రక్రియను మన టెక్నీషియన్‌ నేర్చుకోవాలని అనుకున్నాం. కానీ, అది మన వాళ్ళ వల్ల కాలేదు. దాదాపు ఎనిమిదేళ్ళ పాటు ఎవరెవరి దగ్గరో అసిస్టెంట్‌గా ఉండి తాను నేర్చుకుని, క్రమంగా స్టీరియోగ్రాఫర్‌గా ఎదిగిన పని మొత్తం నెల రోజుల్లో ఎవరికైనా ఎలా ఒంటబడుతుందని'అవతార్‌' స్టీరియోగ్రాఫర్‌ డేవిడ్‌ టేలర్‌ మాతో అన్నారు. పైగా, ఆ నెలరోజుల వ్యవధిలోనే ఒకసారి రిగ్‌లో ఏదో సమస్య వచ్చి, చిప్‌ పాడైతే రోజంతా శ్రమించి దాన్ని బాగు చేశారు రిగ్‌ టెక్నీషియన్‌. ఇవన్నీ చూశాక, తీరా వీళ్ళు వెళ్ళిపోయాక షూటింగ్‌లో ఏదైనా సమస్య వస్తే కష్టమని అర్థమైపోయింది. దాంతో, పదిహేను రోజుల పాటు షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చి, హాలీవుడ్‌ టెక్నీషియన్లే చిత్రం పూర్తయ్యే దాకా ఉండేలా ఒప్పందం కుదుర్చుకొని, సినిమా చేశాం.
త్రీడీలో షాట్లు తీయడం చాలా శ్రమతో, కాలవ్యయంతో కూడినవటగా!
అవును. త్రీడీలో చిత్ర నిర్మాణం మీద మన దగ్గర మునుపెవ్వరూ పుస్తకాలు రాయలేదు కదా! ఇప్పుడైతే, నా అనుభవం మొత్తంతో నేనే పుస్తకాలు రాయగలను. పైగా త్రీడీ సినిమా తీయడం మనకిక్కడ అలవాటు లేదు కాబట్టి, ఆ పని, ఆ పద్ధతులు ఒక్క కెమేరామన్‌కో, దర్శకుడికో కాదు... ఆఖరికి లైట్‌ బారు దాకా అందరికీ తెలియాలి. అప్పుడే అందరూ సమన్వయంతో, హాయిగా పనిచేయగలుగుతారు.
మామూలుగా సినిమా చిత్రీకరణకు, సాంకేతిక భాషలో చెప్పాలంటే 'ఒక స్టాప్‌' లైటింగ్‌ పెడతారు. కానీ, త్రీడీ చిత్రీకరణకు మాత్రం అంతకన్నా ఒకటిన్నర స్టాప్‌ ఎక్కువ లైటింగ్‌ పెట్టాలి. ఇలా త్రీడీ చిత్రీకరణ అంటే ఏమిటని యూనిట్‌లో అందరికీ అర్థం కావడానికే టైమ్‌ పడుతుంది. పట్టింది కూడా! ఇంత ఎక్విప్‌మెంట్‌, ఇంతమంది టెక్నీషియన్లు ఉన్నా మొదటి రోజున ఒక్క షాటే తీయగలిగాం. అయితే, అందరికీ పని అర్థమై, ఓ గాడిలో పడేసరికి రోజుకు సగటున 25 షాట్లు తీశాం! ఒక రోజునైతే ఏకంగా 30 షాట్లు తీశామంటే నమ్మండి! అలా త్రీడీ చిత్రీకరణకు ఎంతో శ్రమించాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌లో కూడా ఎంతో శ్రద్ధ తీసుకొని, కొన్ని నెలలు కష్టపడ్డాం. అందుకే, హాలీవుడ్‌ చిత్రాల స్థాయికి దీటుగా 'ఓం -3డి' ఉంటుందని నేను ఢంకా బజాయించి చెబుతున్నా. సినిమా చూశాక, అందరూ నా మాటలతో ఏకీభవిస్తారు.
- రెంటాల జయదేవ 
(ప్రజాశక్తి డైలీ, 15 జూలై 2013, సోమవారం, పేజీ నం. 8)
.........................................

ఓం -3డి చిత్రంపై హీరో, నిర్మాత కల్యాణరామ్ తో ఇంటర్వ్యూ - పార్ట్ 3


తమ్ముడు జూనియర్‌ ఎన్టీయార్‌తో మీ బంధం?
ఎవరి పనుల్లో వాళ్ళం ఉన్నా, కలిసినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. మంచి, చెడ్డా చెప్పుకుంటూ ఉంటాం. మా మధ్య మంచి అనుబంధమే ఉంది. నా పుట్టిన రోజుకు కూడా తను నాకు శుభాకాంక్షలు తెలిపాడు.
రానున్న ఎన్నికల్లో టిడిపికి మీరేం చేస్తారు?
రాజకీయాలు నా వృత్తి కాదు. నేను ప్రాథమికంగా సినిమా వాణ్ణి. అయితే, మా తాత గారు తెలుగువారి అభ్యున్నతి కోసం పెట్టిన ఈ పార్టీ కోసం అధినాయకత్వం ఏం చెబితే అది చేస్తాను. ప్రచారంలో పాల్గొనమంటే పాల్గొంటాను. నా వంతుగా తిరుగుతాను.
సినిమా హీరో అయిన మీకు సామాన్యుల కష్టనష్టాల గురించి తెలుసంటారా?
అప్పటి దాకా అందరం కలిసే ఉన్నప్పటికీ, మా తాత గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే, మా మీద ఆ ప్రభావం ఉండరాదని మా నాయనమ్మ మా నాన్న గారు వాళ్ళతో వేరుగా ఉండమని చెప్పింది. అన్నయ్య జానకీరామ్‌, అక్కయ్య సుహాసిని, నేను - మేము కూడా మామూలు వాళ్ళలాగే పెరిగాం. విజయవాడ, కోయం బత్తూరుల్లో చదివాను. అమెరికాలోని షికాగోలో ఇలినాయిస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో ఎం.ఎస్‌. చేశాక, అక్కడ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఏడాది పాటు పనిచేశా. కాబట్టి, నాకు సామాన్యుల కష్టనష్టాలు తెలుసు.
కానీ, ఇప్పుడు మీరు హీరో కదా!
హీరో అయితే ఏం? మాకు ఏమైనా కొమ్ములు న్నాయా? మేము కూడా మీరు తినే తిండి తినాల్సిందే. అదే నీళ్ళు తాగాల్సిందే! ప్రేక్షకులం దరూ సినిమా చూస్తేనే మేము ఇక్కడ ఉండేది!
నాన్న గారికీ, చంద్రబాబుకీ విభేదాలంటూ...
(కాస్త అసహనంగా...) అవేవీ నాకు తెలియదు. అయినా, ఒక మాట చెబుతాను. నా బావమరిది హరి నాకు వెన్నెముక అని 'ఓం' ఆడియో ఫంక్షన్‌లో చెప్పాను. అంత మాత్రాన మేమెప్పుడూ పరస్పర భిన్నాభిప్రాయాలు లేకుండా ఉన్నామనా? కాదు! ఏ కుటుంబంలోనైనా, బంధంలోనైనా చిన్నా, చితకా తేడాలు వస్తూనే ఉంటాయి. సర్దుకొంటూ ఉంటాయి. అవి లేనిదెక్కడ చెప్పండి! మీ కుటుంబంలో ఉండవా? కానీ, సమయం వచ్చినప్పుడు అందరం కలసికట్టుగా నిలబడతాం. ప్రత్యర్థిపై కలబడతాం! ఇదీ అంతే! 
- రెంటాల జయదేవ 
(ప్రజాశక్తి డైలీ, 15 జూలై 2013, సోమవారం)
.....................................

ఓం -3డి చిత్రంపై హీరో, నిర్మాత కల్యాణరామ్ తో ఇంటర్వ్యూ - పార్ట్ 2


కథ కోసం త్రీడీనా? లేక త్రీడీకై కథ ఎంచుకున్నారా?
మీరే ఒక్క మాట చెప్పండి! మనం కథ డిమాండ్‌ చేసిందని కలర్‌కూ, సిక్స్‌ ట్రాక్‌ స్టీరియోకూ, డాల్బీకీ వెళ్ళామా? లేదుగా! మామూలు 2డి సినిమాను చూసినట్లు కాకుండా, నిజ జీవితంలో మన ఎదురుగా జరుగుతున్న ఘటనను రెండు కళ్ళతో చూస్తున్న అనుభూతిని ప్రేక్షకుడికి కలిగించాలంటే 3డి అవసరం. 'ఓం - 3డి' సినిమాలో కూడా యాక్షన్‌ ఉంది, సెంటిమెంట్‌ ఉంది. త్రీడీ ద్వారా ఆ అంశాలను మరింత కనువిందుగా చూపే వీలు కలుగుతుంది. పైగా, భారత దేశంలో ఇప్పటి వరకు ఫ్యాంటసీలు, 'హాంటెడ్‌' లాంటి హారర్‌ చిత్రాలు వచ్చాయి. అయితే, చాలా సినిమాలను 2డిలోనే తీసి, 3డి ఫార్ముట్‌లోకి మార్చడం జరుగుతోంది. కానీ, 'ఓం' అలా కాదు. పూర్తిగా 3డి కెమేరాలోనే చిత్రీకరించిన సినిమా. భారతదేశంలోనే మొట్టమొదటి యాక్షన్‌ 3డి చిత్రమూ ఇదే!
కానీ, ఇటీవల సినిమాలను 2డిలో తీసి, 3డిలోకి మార్చేసి, 3డిలో తీశామని మభ్యపెట్టడం జరుగుతోంది!
అలాగని ఏ సినిమానూ నిందించలేం. ఇవాళ 3డి కెమేరా అంటేనే, ఎత్తు, వెడల్పుతో దాదాపు 50 కిలోల బరువుండే భోషాణం పెట్టె అంత ఉంటుంది. ఓ చిన్న కారులోనో, బాత్‌రూమ్‌లోనో ఒక షాట్‌ తీయాంటే, అంత పెద్ద కెమేరా అక్కడ పట్టను కూడా పట్టదు. కాబట్టి, ఆచరణాత్మక దృక్పథంతో, అలాంటి సందర్భాలలోని దృశ్యాలను 2డిలో చిత్రించి, ఆ పైన 3డి ఫార్మట్‌లోకి మార్చుకోక తప్పదు. కాబట్టి, 90 శాతం సినిమా 3డిలో తీసి, మిగిలిన దాన్ని 2డిలో తీసి, 3డిగా మార్చితే తప్పు లేదు. కానీ, 10 శాతమే 3డిలో తీసి, దాన్ని 3డి సినిమాగా ప్రచారం చేసుకోవడమే తప్పు.
జనాన్ని అంతగా ఆకర్షించే అంశాలు ఇందులో ఏమున్నాయి?
ఈ చిత్ర కథే ఓ హైలైట్‌. సినిమాలో ప్రతి పాత్రా బాగుంటుంది. ప్రతి పాత్రకూ కథలో ప్రాధాన్యం ఉంటుంది. సినిమాలో కార్తీక్‌, సురేశ్‌, సితార, సంపత్‌రాజ్‌, రావు రమేశ్‌ - ఇలా ప్రతి ఒక్కరూ కథ ముందుకు వెళ్ళడానికి ఉపకరించే పాత్రలను ధరించినవాళ్ళే. సాంకేతిక విభాగాల్లో అజయన్‌ విన్సెంట్‌ ఛాయాగ్రహణం, సునీల్‌రెడ్డి దర్శకత్వం, ఫైట్లు - అన్నీ బ్రహ్మాండంగా కుదిరాయి. ఈ చిత్రానికి, సాయికార్తీక్‌ అద్భుతమైన రీరికార్డింగ్‌ ఇచ్చాడు. అతని పనితనం తెలుసుకుందామని ఒక థీమ్‌ సాంగ్‌ కొట్టివ్వమని అడిగాను. అది ఎంతో బాగుండడంతో, అబ్బురపడి, అతణ్ణే సంగీతానికి తీసుకున్నాం. మా ఆఫీసులోనే అన్ని ఏర్పాట్లూ పెట్టించి, దాదాపు రెండున్నర నెలల పాటు రీ-రికార్డింగ్‌ చేశాం. ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది - ఈ చిత్ర శబ్దగ్రహణం గురించి! గతంలో శంకర్‌ చిత్రాలు 'కాదలన్‌' (తెలుగులో 'ప్రేమికుడు'), 'కన్నత్తిల్‌ ముత్తమిట్టాల్‌' (తెలుగులో 'అమృత')కు జాతీయ అవార్డులు అందుకున్న చెన్నైలోని ఆడియోగ్రాఫర్‌ ఏ.ఎస్‌. లక్ష్మీనారాయణ దగ్గరకు సినిమా తీసుకువెళ్ళాం. 'శివాజీ', 'రంగం', 'తుపాకీ' తదితర చిత్రాలెన్నిటికో పని చేసిన దేశంలోని అత్యుత్తమ ఆడియోగ్రాఫర్లలో ఆయన ఒకరు. ఆయన సినిమా చూసి, ''దృశ్యపరంగా ఇంత బాగున్న ఈ అద్భుతమైన సినిమా''ను అత్యుత్తమ ఎక్విప్‌మెంట్‌ ఉన్న ఏ.ఆర్‌. రెహమాన్‌ స్టూడియోలో చేద్దామన్నారు. అక్కడే క్వాలిటీకి రాజీ పడకుండా 35 రోజులు మిక్సింగ్‌ చేశారు. మనవాళ్ళెవరి దగ్గరా లేని, అద్భుతమైన టెక్నిక్‌ ఆయన దగ్గర ఉందని తుది రూపం చూశాక నాకు అర్థమైంది. ఇలాంటి అత్యుత్తమ దృశ్య, సాంకేతిక నైపుణ్యాలెన్నో ఉన్న సినిమా 'ఓం'. మూడు ముక్కల్లో చెప్పాలంటే - ఇది ఎంతో ఎమోషనల్‌ చిత్రం, థ్రిల్‌కు గురి చేసే చిత్రం, విజువల్‌గా అద్భుతంగా ఉండే చిత్రం. ఆధునిక కాలానికి తగ్గట్లు ట్రెండీగా ఉండే సినిమా. కథను తరువాతి దశకు తీసుకువెళ్ళేందుకు, పాటలోనే కథ చెప్పే మూడు గీతాలు తప్ప, ఇందులో డ్రీమ్‌ సాంగ్స్‌ లాంటివి ఏమీ ఉండవు. చకచకా సాగిపోతూ, సరిగ్గా రెండు గంటల పాటు ఉత్కంఠగా సాగుతుంది.
ఇంత పెద్ద ప్రయత్నానికి మీకు ఆర్థికంగా, హార్దికంగా అండగా ఉన్నదెవరు? నిరుత్సాహం కలిగినప్పుడల్లా మీకు దాన్ని దూరం చేసిందెవరు?
మా యూనిట్‌, నా కుటుంబం నా వెంట నిలిచారు. విందులు, వినోదాలంటూ నేను ఎక్కడికీ బయట తిరిగే రకం కాదు. భార్య, పిల్లలు, కుటుంబంతో నాకు ప్రగాఢమైన అనుబంధం. మా పిల్లలతో ఆడుకుంటే చాలు! ఎంతటి ఒత్తిడి అయినా నాకు దూరమవుతుంది. కానీ, 2, 3 నెలలుగా వాళ్ళతో ఆడుకోవడానికి కూడా కుదరడం లేదు. డిజిటల్‌ ఇంటర్మీడియట్‌ (డి.ఐ), డి.టి.ఎస్‌. లాంటి పనులతో నెలన్నర పైగా చెన్నైలోనే ఉన్నా. సినిమా రిలీజ్‌ కాగానే, మళ్ళీ పిల్లలతో గడపాలి.
అన్నట్లు ఈ సినిమాకు మీ అమ్మాయి నందమూరి తారక అద్విత పేరు నిర్మాతగా వేస్తున్నట్లున్నారు. కారణం?
ఎందుకో నాకు అదో సెంటిమెంట్‌ అనిపించింది. మా నందమూరి కుటుంబంలో తాతగారి తర్వాత దాదాపు 54 మంది పుట్టారు. కానీ, సరిగ్గా ఆయన పుట్టిన మే 28వ తేదీన ఎవరూ పుట్టలేదు. మా అమ్మాయి అద్విత 2010 మే 28న జన్మించింది. అందుకే, మా తాత గారి పేరు మీద ఉన్న మా సంస్థ నిర్మిస్తున్న ఈ పదో సినిమాకు ఆయన రూపంగా పుట్టిన మా అమ్మాయి పేరు వేస్తున్నా.
అయితే, ఇక మీ అబ్బాయి శౌర్యరామ్‌ను సినిమా హీరోను చేస్తారా?
వాడికిప్పుడు అయిదేళ్ళు. పెద్దయ్యాక ఏమవుతాడో ఏం చెప్పగలం. నవ తరం పిల్లలకు తమ జీవితం గురించి స్పష్టమైన అవగాహన ఉంటుంది. నన్ను నటుణ్ణి కావాల్సిందని ఎవరూ చెప్పలేదు. మా వాళ్ళెవరూ నన్ను ప్రభావితం చేయలేదు. నా ఇష్టంతో నేను వచ్చాను. ఏ పని చేసినా, మనకు తృప్తినివ్వడం ముఖ్యం!
3డి సినిమాలకు ప్రేక్షకులున్నారు సరే! అన్ని థియేటర్లు లేవు కదా!
'ఓం' నిర్మాణ ఆరంభ సమయం నాటికి రాష్ట్రంలో దాదాపు 20కి మించి త్రీడీ థియేటర్లు లేవు. కానీ, అదృష్టవశాత్తూ ఇవాళ వాటి సంఖ్య దాదాపు 65కు పెరిగింది. మా సినిమా రిలీజ్‌ లోపు మరో 5 హాళ్ళు త్రీడీ ప్రదర్శనకు అనువుగా మారే అవకాశముంది. త్రీడీ ప్రొజెక్టర్లు నెలకు రూ. 45 వేలకు అద్దెకు దొరుకుతున్నాయి. అలా నేను ఓ 35 హాళ్ళకు త్రీడీ పెట్టించాలని ప్లాన్‌ కూడా చేశాను. అయితే, ఈ త్రీడీ చిత్రాల ప్రొజెక్షన్‌కు 'సిల్వర్‌ స్క్రీన్‌' కావాలి. ఒక్కో స్క్రీన్‌ 6 నుంచి 7 లక్షలు అవుతుంది. అవి అద్దెకు లేవు. లేదంటే, బ్రహ్మాండంగా మరిన్ని హాళ్ళలో త్రీడీ పెట్టేవాణ్ణి. ఏమైనా, మిగతా చోట్ల 2డి వెర్షన్‌ రిలీజ్‌ చేస్తాం.
ఈ 'ఓం' చిత్ర నిర్మాణానికి చాలా కాలమే పట్టినట్లుందే!
2010 డిసెంబర్‌ నుంచి 2011 నవంబర్‌ దాకా ప్రీ-ప్రొడక్షన్‌ వర్క్‌ చేశాం. త్రీడీ కెమేరాలు ఎక్కడెక్కడ, ఏమేమి ఉన్నాయి, మనకు ఏది పనికొస్తుంది లాంటివన్నీ దాదాపు రిసెర్చ్‌ చేశాం. అవన్నీ ముగించుకొన్నాక అప్పుడు సెట్స్‌ మీదకు వెళ్ళాం. మొత్తం 120 రోజులు షూటింగ్‌ చేశాం. ఆ తరువాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌కు చాలా నెలలు పట్టింది. అలా దాదాపు రెండున్నరేళ్ళ శ్రమ - ఈ చిత్రం వెనుక ఉంది. కొత్త టెక్నాలజీతో, క్వాలిటీగా సినిమా అందించాలంటే ఆ మాత్రం శ్రమ తప్పదు. సినిమా హాలుకు వచ్చినవారి నెవరినీ 'ఓం' నిరాశపరచదు. మళ్ళీ చెబుతున్నా! హాలీవుడ్‌ స్థాయిలో ఉండే సినిమా ఇది. అందుకు నేను హామీ! సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సైతం ఈ సినిమా చూసి, మెచ్చుకున్నారు.
తమిళంలో ధనుష్‌తో తీయడానికి చర్చలు చేస్తున్నారట!
(నవ్వేస్తూ...) రజనీకాంత్‌ గారు ఈ సినిమా చూశారు. ''టెక్నికల్‌గా ఓ అద్భుతం ఈ సినిమా. ఈ సినిమాతో తెలుగువాళ్ళు గర్వించేలా చేస్తావు!'' అని ఆయన అన్నారు. మాతో దాదాపు గంటన్నర సేపు మాట్లాడారు. అంత పెద్ద సూపర్‌స్టార్‌ అలా అనడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇక, తమిళంలో రీమేక్‌ సంగతంటారా... ఇప్పుడే ఏమీ చెప్పలేను. గాలిలో మేడలు కట్టడం నా లక్షణం కాదు. చూద్దాం! ఏం జరుగుతుందో! నిర్ణయమయ్యాక తప్పకుండా చెబుతాను.
'ఓం' తరువాత మీ తదుపరి ప్రణాళికల మాటేమిటి?
నాకే తెలియదు. అంతా 19న 'ఓం' విడుదల తరువాతే!

- రెంటాల జయదేవ 
(ప్రజాశక్తి దినపత్రిక, 15 జూలై 2013)
...............................................

హాలీవుడ్‌ స్థాయి సినిమా ఇది..అందుకు నేను హామీ! -'ఓం-3డి' హీరో కల్యాణరామ్‌తో ఇంటర్వ్యూ (పార్ట్ 1)


హాలీవుడ్‌ స్థాయి సినిమా ఇది..అందుకు నేను హామీ!



  • 'ఓం-3డి' హీరో కల్యాణరామ్‌
ఓ సినిమా ప్రీ-ప్రొడక్షన్‌కు దాదాపు పది నెలలు... ప్రొడక్షన్‌కు మరో ఏడాదికి పైగా... రీ-రికార్డింగ్‌కే రెండున్నర నెలలు... వట్టి సౌండ్‌ మిక్సింగ్‌కు 35 రోజులు... వెరసి ఒక్క పోస్ట్‌ ప్రొడక్షన్‌కే సంవత్సర కాలం..ఇదంతా ఏ హాలీవుడ్‌ చిత్ర నిర్మాణమో కాదు! సినిమా తీస్తున్నది ఏ హాలీవుడ్‌ నిర్మాతో అంత కన్నా కాదు! ''భారతదేశంలోనే మొట్టమొదటి యాక్షన్‌ 3డి చిత్రం''గా వస్తున్న ఆ సినిమా పక్కా తెలుగు చిత్రం. తీస్తున్నది తెలుగు నిర్మాత, హీరో. '' సినిమా మీద ప్రేమతో, కొత్తదనం కోసం తపనతో '' ఇలా రెండున్నరేళ్ళ పైచిలుకు కాలాన్నీ, పాతిక కోట్లకు పైగా ధనాన్నీ వెచ్చించి 'ఓం - 3డి' చిత్రాన్ని నిర్మించారు హీరో నందమూరి కల్యాణరామ్‌. జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్ర విడుదలకు సంబంధిం చిన పనుల్లో తలమునకలై ఉన్న ఆయన తీరిక చేసుకొని మరీ దాదాపు రెండు గంటల పాటు 'ప్రజాశక్తి'కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ భారీ ప్రయత్నం వెనుక కథా కమామిషు, తన కెరీర్‌ గురించి వివరించారు. హీరోయిజమ్‌ కానీ, వారసత్వ హజం కానీ లేకుండా మామూలుగా వ్యవహరించే ఈ 35 ఏళ్ళ యువకుడితో భేటీలోని ముఖ్యాంశాలు:
పదేళ్ళ కెరీర్‌ను సింహావలోకనం చేసుకుంటే ఏమనిపిస్తోంది?
ఈ పదేళ్ళ ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగిచూసుకుంటే, ఓ చిన్న తృప్తి ఉంది. ప్రతి సినిమానూ ఓ మెట్టుగా చేసుకొని, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలనేది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ప్రయాణం సాగించాను. నా మొదటి రెండు సినిమాలూ ఫ్లాపులే. ఆ సమయంలో కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో నేను చేసిన ప్రయత్నం 'అతనొక్కడే!' ఆ సినిమా పెద్ద హిట్టయ్యింది. జనం నన్ను తమవాణ్ణి చేసుకున్నారు. ఎప్పటికప్పుడు జనం స్పందన, అభిమానుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని, కొత్త తరహా చిత్రాలు చేస్తూ వచ్చాను. తప్పులు తెలుసుకుంటూ, వాటిని దిద్దుకుంటూ ముందుకు వెళుతున్నాను. ఈ పదేళ్ళనే కాదు, ఇలా జీవితాంతం ఓ నటుడిగా నన్ను నేను విశ్లేషించుకుంటూ వెళతా. ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ, ఈ పదేళ్ళలో పది చిత్రాలతో పది మెట్టు ఎక్కా. కొత్త తరహా ప్రయత్నం చేసి, వాళ్ళు ఆశించినది ఇచ్చినప్పుడల్లా జనం నన్ను ఆశీర్వదించారు.
జనం ఏం ఆశిస్తున్నారో ఎలా తెలుసుకుంటారు?
చిత్రాల జయాపజయాలతో పాటు, ప్రేక్షకుల నుంచి, అభిమా నుల నుంచి వచ్చే స్పందనను బట్టి తెలుసుకుంటాం. ప్రతి నటుడికీ ఒక యాక్సెప్టెన్స్‌ రేషియో ఉంటుంది. ఆ నటుడు ఏ తరహా పాత్రలు, కథలు చేసినప్పుడు జనం అక్కున చేర్చుకుంటున్నారో గ్రహించడం కీలకం. మా బాబాయి బాలకృష్ణ కానీ, తారక్‌ (ఎన్టీయార్‌ జూని యర్‌) కానీ పక్కా కమర్షియల్‌ చేసెయ్యగలరు. కానీ, నేను పూర్తి కమర్షియల్‌ సినిమా చేసినా, పూర్తి వినోదభరిత చిత్రం చేసినా నప్పదు. నా నుంచి జనం ఆశిస్తున్నది - కమర్షియల్‌ సినిమాలైనా, విభిన్న తరహా స్క్రీన్‌ప్లే ఉన్న చిత్రాలనే! కథలో, కథనంలో ఏదో ఒక్క కొత్త కోణం ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి 'అతనొక్కడే', 'హరేరామ్‌' చిత్రాలు చేసినప్పుడల్లా జనం నన్ను ఆశీర్వదించారు. 'అతనొక్కడే' పెద్ద హిట్టయింది. ఇక, 'హరే రామ్‌' చిత్ర విజయ స్థాయి ఒక రేంజ్‌లోనే ఉన్నప్పటికీ, దానికి నా కెరీర్‌లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్ళు వచ్చాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో 'ఓం' చిత్రాన్ని త్రీడీలో తీస్తున్నాం.

పదేళ్ళలో పది సినిమాలంటే చాలా తక్కువ కదా! ఎందుకలా?
తక్కువే! కానీ, నేను అంతే! నా దగ్గరకు వచ్చిన ప్రతి సినిమా చేయను. నాకు నచ్చితేనే చేస్తాను. అందులో ఏదైనా కొత్తదనం ఉందేమో చూసుకొంటాను. అలాగైతే, 'మీరు చేసిన ప్రతి సినిమాలో ఏం కొత్తదనముంది? వాటిలో ఏం నచ్చి చేశారు? వాటిలో కూడా కొన్ని ర కూడా ఫ్లాపయ్యాయి కదా!' అని మీరు అడగవచ్చు. ఆ నిర్ణీత క్షణంలో నాకు బాగుందని, కొత్తగా అనిపిస్తే చేసేశానంతే! ఆ క్రమంలో కొన్నిసార్లు మంచి సినిమాకు 'నో' చెప్పి, రొటీన్‌ సినిమా చేయడమూ జరిగింది. నచ్చితేనే సినిమా చేస్తాననే విధానం వల్ల ఓ సుఖం ఉంది. తీరా సినిమా వచ్చాక, దాని ఫలితం ఎలా ఉన్నా సరే మనల్ని మనమే తప్ప, వేరెవరినీ తప్పు పట్టనక్కర లేదు. నేనెవరినీ తప్పు పట్టాలనుకోను. కాబట్టి, ఈ పద్ధతి హాయి కదా!
మీ చిత్ర నిర్మాణ సంస్థకు యన్టీఆర్‌ ఆర్ట్స్‌ అని పేరు పెట్టడం సెంటిమెంటల్‌ గానా? వారసత్వ లబ్ధి కోసమా?
వారసత్వ లబ్ధి కోసం కానే కాదు! ఒకవేళ ఎవరైనా అలా అనుకున్నా, మా తాత గారి పేరు వాడుకొనే సర్వహక్కులూ ఆ రక్త సంబంధీకులం, మనుమలమైన మాకు ఉన్నాయి కదా! నిజం చెప్పాలంటే, అలా అనుకోలేదు. నేను నిర్మాతగా మారదామనుకొన్నప్పుడు మా నాన్న గారికి (హరికృష్ణ) చెప్పాను. గతంలో 'దాన వీర శూర కర్ణ', 'డ్రైవర్‌ రాముడు', 'అనసూయమ్మ గారి అల్లుడు', 'పట్టాభిషేకం' లాంటి పలు చిత్రాలు నిర్మించిన నాన్న గారు 'చిత్ర నిర్మాణం చాలా కష్టమ'ని చెప్పినా, నా పట్టుదల చూసి 'సరే! నీ ఇష్టం నాన్నా' అన్నారు. మా చిత్ర నిర్మాణ సంస్థకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ, నాన్న గారినే సలహా అడిగాను. నేనెప్పుడూ కుటుంబ వ్యవస్థనూ, విలువలనూ నమ్ముతాను. మనల్ని కని, పెంచినవారి అండదండలు, ఆశీస్సులకు మించి మనకు ఏం కావాలి? అందుకే, 'మీరేం పేరు చెబితే అది పెడతా!' అన్నాను. అప్పుడాయన క్షణం కూడా ఆలస్యం చేయకుండా 'నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌' అని చెప్పారు. అయితే, ఫిల్మ్‌ ఛాంబర్‌లో వేరెవరైనా యన్‌.టి.ఆర్‌. అనే సంక్షిప్త నామం వచ్చేలా పేరు పెడితేనో అన్న అనుమానం లేవనెత్తారు. దాంతో, నేనే ఆ రెండు పేర్లతోనూ బ్యానర్‌ను రిజిస్టర్‌ చేయించాను. మా నిర్మాణ సంస్థ పేరు వెనక ఇంత కథ ఉంది.

కానీ, నిర్మాతలకు, దర్శకులకు అందుబాటులో ఉంటున్నారా?
పారితోషికం గురించి కూడా ఎన్నడూ ఆలోచించని నేను అందరికీ అందు బాటులోనే ఉన్నా. ఎవరైనా మంచి కథతో రావచ్చు.

మీ చిత్రాల్లో సరైన హిట్లు రెండే! అయినా పట్టుదలగా ఇప్పుడీ 'ఓం' లాంటి భారీ చిత్రాన్ని నెత్తికెత్తుకున్నారు. ఏమిటీ ధైర్యం?

ఏమోనండీ నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి నాది మొండి పట్టుదల, ధైర్యం. నాకు నచ్చిన పని చేయడానికి తెగించి ముందుకు వెళుతుంటాను. ఇక, భారీగా చిత్రాలు తీయడం మాటంటారా? నాకు నచ్చిన పని చేస్తున్నాను. వీటి వల్ల ప్రాణాలు పోయేదేమీ లేదు కదా! మహా అయితే, వాణిజ్య ఫలితం కాస్త అటూ ఇటూ అవుతుంది. అంతేగా! లాభమైనా, నష్టమైనా అది నాకు, నా కుటుంబానికే కదా! వేరెవరినీ ఎఫెక్ట్‌ చేయడం లేదు కదా! పైగా, ఈ రోజు వరకు నా ఫ్యామిలీ నన్నెప్పుడూ ఎంతో ప్రోత్సహిస్తూ, ధైర్యంగా నిలిచారు. వాళ్ళకే అంత నమ్మకం, ధైర్యం ఉన్నప్పుడు నేనెందుకు ఆందోళన చెందడం! పైగా, ఏ విషయంలోనైనా ఆశావహంగా ఉండాలి. దాన్ని బట్టే ఫలితం!
మొండితనం వచ్చింది నాన్న గారి నుంచా?
మా నాన్న గారి నుంచి, అంత కన్నా ముఖ్యంగా మా తాత గారి నుంచి! కథ ఎంతో నచ్చి, ఇండస్ట్రీలో ఎంతో అందగాడని పేరున్న ఆయనే ముడతలు పడిన ముఖంతో కనిపించే 'బడిపంతులు' చిత్రంలోని వేషం వేశారు. అందరూ ఏవేవో అనుకున్నా, ఆయన మొండి తనం ఫలితాన్నిచ్చింది. కాబట్టి, ధైర్యే సాహసే లక్ష్మీ అంటూ తెగించాల్సిందే! అయితే, 'ఓం' త్రీడీ చిత్రం విషయంలో నాది ఆత్మవిశ్వాసం. దానితో వచ్చిన మొండితనం. (నవ్వుతూ...) మొండితనం, మూర్ఖత్వం, ఆత్మవిశ్వాసం - మూడూ ఒకే వరసలో ఉంటాయి. ఒక్కోదానికీ మధ్య కొద్దిగా తేడా! ఆ గీత దాట కూడదు.
ఇంత భారీగా 'ఓం' తీయడానికి కారణం?
సినిమా కథ బాగా నచ్చింది. ఓ ప్రత్యేకమైన స్క్రీన్‌ప్లే ఉంది. గతంలో హీరోయిన్‌ ఒకరిని చంపడమనే దానితో కథ మొదలుపెట్టి, 'అతనొక్కడే' చిత్రంతో కొత్త తరహా స్క్రీన్‌ప్లేను అందించాం. అలాగే, ఇప్పుడీ 'ఓం -3డి' కూడా ఓ అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో, విభిన్నమైన కోణంతో నడిచే సినిమా. తరువాత వచ్చే సన్నివేశం ఏమిటన్నది ఊహించలేం. పైగా, ఇది చక్కటి కమర్షియల్‌ చిత్రం.
ట్రైలర్‌ బాగుంది. కానీ, రొటీన్‌ పగ, ప్రతీకారాల కథేమోనని అనిపిస్తోంది. ఈ కథకు త్రీడీ అవసరమంటారా?
(ఠక్కున అందుకుంటూ...) చూడండి. 'హరే రామ్‌' సినిమాకు మేము 'ఫ్లరు కామ్‌'ను వాడార. 'ఫ్లరు కామ్‌' అంటే, మనం రిమోట్‌తో నియంత్రిస్తూ ఉంటే, మనకు కావాల్సిన పద్ధతిలో గాలిలో ఎగురుతూ, కావాల్సిన కోణంలో చిత్రీకరణ సాగించే కెమేరా! ఆ వినూత్న టెక్నాలజీని వాడి, సినిమా తీయడం తెలుగు చలనచిత్ర చరిత్రలో అదే తొలిసారి. ఆ తరువాత దాన్ని తారక్‌ 'శక్తి', వెంకటేశ్‌ 'షాడో', తదితర చిత్రాల్లో వాడారు. అందుబాటులో ఉన్న ఆధునికతను వాడుకుంటే ప్రేక్షకుడి సినిమా వీక్షణ అనుభూతి ఎంతో పెరుగుతుంది. గతంలో బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలు హిట్టవుతున్నా కలర్‌కు వెళ్ళాం కదా! అలాగే, ఆడియోలో కూడా మోనో నుంచి స్టీరియో, డి.టి.ఎస్‌, డాల్బీ మీదుగా ఇప్పుడు ఆరో-3డి దాకా వచ్చాం కదా! ఇవన్నీ ఎందుకంటే, సినిమా బాగుందంటే, దానిలోని అనుభూతిని ఒకటికి పదింతలు చేయడానికి! 


 - రెంటాల జయదేవ    
(Published in 'Praja Sakti' daily, Monday, 15 July 2013)
.............................................................

Thursday, July 18, 2013

ఎన్.టి.ఆర్. చిత్ర నిర్మాణ సంస్థ - ఆరు పదుల ఘన చరిత్ర


తొలి పూర్తి తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' 1932 ఫిబ్రవరి 6న విడుదలైనప్పటి నుంచి ఇప్పటి దాకా ఎనభై ఒక్కేళ్ళ పై చిలుకు కాలంలో 4 వేలకు పైగానే తెలుగు సినిమాలు వచ్చినట్లు ఓ అంచనా. ఈ చిత్రాల నిర్మాణం ద్వారా తెలుగు సినీ పరిశ్రమను అభివృద్ధి పథంలో నడిపించినవారు ఎందరో ఉన్నారు. తొలినాళ్ళ బొంబాయి, కలకత్తా నిర్మాతల నుంచి స్ఫూర్తిని అందుకొని, 'వేల్‌ పిక్చర్స్‌' (పి.వి. దాసు), 'రోహిణీ పిక్చర్స్‌' (హెచ్‌.ఎం. రెడ్డి), 'వాహినీ' పిక్చర్స్‌ (బి.ఎన్‌. రెడ్డి), సారథీ, భరణి (రామకృష్ణ - భానుమతి), 'విజయ' (నాగిరెడ్డి - చక్రపాణి) లాంటి తెలుగువారెందరో చిత్ర నిర్మాణంలోకి వచ్చారు. అయితే, చిత్ర పరిశ్రమలోని ప్రధాన విభాగాలైన చిత్ర నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన, స్టూడియో నిర్వహణలు - నాలుగింటిలోనూ నాటి నుంచీ నేటి దాకా కొనసాగుతున్న సంస్థ తెలుగునాట 'ఎన్‌.ఏ.టి' ఒక్కటే! ఇది నటుడు, దర్శక - నిర్మాత కీర్తిశేషులు నందమూరి తారక రామారావు స్థాపించిన సంస్థ. 'నేషనల్‌ ఆర్ట్‌ ్స'గా మొదలై 'రామకృష్ణా హార్టీకల్చరల్‌ స్టూడియోస్‌'గా ఇవాళ్టికీ కొనసాగుతున్న ఈ ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థకు ఇవాళ్టితో 60 ఏళ్ళు నిండుతున్నాయి. ఆ సంస్థ పతాకంపై ఎన్టీయార్‌ నిర్మించిన తొలి చిత్రం 'పిచ్చి పుల్లయ్య' ఇప్పటికి సరిగ్గా ఆరు దశాబ్దాల క్రితం 1953 జూలై 17న విడుదలైంది. ఈ సందర్భంగా ఆ సంస్థ ఘనచరిత్రలోని వివరాలు, విశేషాల ప్రత్యేక కథనం...

కాలేజీ రోజుల నుంచే రంగస్థల పాత్రలు పోషిస్తూ వచ్చిన ఎన్టీయార్‌ తరువాతి రోజుల్లో మిత్రులతో కలసి 'నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్‌' పేరు మీద నాటక సమాజం నెలకొల్పారు. 1945 ప్రాంతం నుంచి అప్పటి బెజవాడ (నేటి విజయవాడ) కేంద్రంగా రంగస్థల ప్రదర్శనలిచ్చేవారు. ఆ నేపథ్యమే ఆయనను 1947లో సినిమా రంగం వైపు నడిపించింది. ఎల్వీ ప్రసాద్‌ దర్శకత్వంలో ప్రణాళికా రచన దశలోనే ఆగిపోయిన 'శ్రీమతి' చిత్రానికి గాను 1947లో ఎన్టీయార్‌ తొలిసారిగా మేకప్‌ స్టిల్‌ దిగారు. ఆ పైన ఎల్వీ ప్రసాద్‌ దర్శకత్వంలోనే 'మనదేశం' (విడుదల: 1949 నవంబర్‌ 24)తో వెండితెర మీదకు వచ్చారు.

కళాభిరుచితో చిత్ర నిర్మాణంలోకి...
రంగస్థలం మీద నటుడిగా మొదలైన ఎన్టీయార్‌ సినీ రంగానికి వచ్చాక కేవలం నటనతో సరిపెట్టుకోలేదు. అక్కడ నుంచి నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక, స్టూడియో విభాగాలకు ఎన్టీయార్‌ క్రమంగా విస్తరించారు. తాను ఏ రంగంలోకి వచ్చి, పేరు, డబ్బు సంపాదించారో, అదే రంగ పురోభివృద్ధికి తన వంతుగా తోడ్పడ్డారు. తొలిసారిగా తెరపై కనిపించిన సంవత్సరం మీద నాలుగు నెలలకే 'పాతాళభైరవి' (1951 మార్చి 15)తో 'స్టార్‌ హీరో'గా జనసామాన్యానికి చేరువైన ఎన్టీయార్‌ను ఆయనలోని కళారాధన ఊరుకోనివ్వ లేదు. కళాకారుడిగా అభిరుచిని నిలుపుకొని, కళాత్మక విలువలున్న చిత్రాల నిర్మాణంతో ఆత్మసంతృప్తిని పొందడం కోసం సినీ నటుడైన మూడేళ్ళకే ఆయన నిర్మాతగా మారారు. 'నేషనల్‌ ఆర్టు ్స' పతాకంపై 'పిచ్చి పుల్లయ్య' నిర్మించారు.


ఆ చిత్రానికి పేరొచ్చినా, డబ్బు రాలేదు. దాంతో, చిత్ర నిర్మాణ సంస్థ పేరును స్వల్పంగా మార్చి, తమ నాటక సమాజమైన 'నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్‌' (ఎన్‌.ఏ.టి) పేరుతో 'తోడు దొంగలు' (1954 ఏప్రిల్‌ 15) నిర్మిస్తూ, నెగటివ్‌ టచ్‌ ఉన్న వయసు మళ్ళిన పాత్ర వేశారు. ఆ చిత్రానికీ ప్రశంసలే తప్ప, వసూళ్ళు రాలేదు. దాంతో, 'కేవలం సందేశాలతో కళాత్మక చిత్రాలు నిర్మించడం కాకుండా, కళనూ - వ్యాపారాన్నీ సమతూకంలో కలిపి, పంచదార పూతతో కూడిన మాత్రగా సందేశాన్ని అందించాలన్న అభిప్రాయానికి వచ్చా'రు ఎన్టీయార్‌. అలా ఆయన నిర్మాతగా తన మూడో చిత్రం 'జయసింహ' మొదలు చిత్ర నిర్మాణంలో విజయ పరంపరకు శ్రీకారం చుట్టారు.

అలా 1953లో ఆయన స్థాపించిన సంస్థ పెద్దబ్బాయి రామకృష్ణ మరణించాక 1966లో 'శ్రీకృష్ణ పాండవీయం'తో 'రామకృష్ణ - ఎన్‌.ఏ.టి' అయింది. స్టూడియో నిర్మాణం ప్రారంభించాక, 1974లో 'తాతమ్మ కల' నుంచి 'రామకృష్ణా సినీ స్టూడియోస్‌' అయింది. 1992లో 'సామ్రాట్‌ అశోక' నాటి నుంచి 'రామకృష్ణా హార్చీకల్చరల్‌ సినీ స్టూడియో'గా చిత్ర నిర్మాణం సాగిస్తోంది. కాలగతిలో రకరకాల పేర్లు మార్చుకుంటూ వచ్చినా ఇప్పటికి 60 ఏళ్ళుగా తెలుగు నాట చిత్ర నిర్మాణంలో ఉన్న ఏకైక సంస్థ ఇదే కావడం విశేషం. మధ్యలో 'ఎన్టీయార్‌ ఎస్టేట్‌ ప్రొడక్షన్‌' (200వ చిత్రం 'కోడలు దిద్దిన కాపురం' - 1970 అక్టోబర్‌ 21), 'తారకరామా ఫిల్మ్‌ యూనిట్‌' (చిత్రం 'డ్రైవర్‌ రాముడు' - 1979 ఫిబ్రవరి 2), 'ఎన్టీయార్‌ ట్రస్ట్‌' (క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు నిధుల కోసం 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' - 1991 ఏప్రిల్‌ 19) లాంటి వివిధ పతాకాలను నెలకొల్పారు ఎన్టీయార్‌. 996లో ఎన్టీయార్‌ మరణం తరువాత కూడా 'పెద్దన్నయ్య' (1997), 'శుభలేఖలు', 'గొప్పింటి అల్లుడు', 'యువరత్న', తాజాగా తారకరత్న హీరోగా 'వెంకటాద్రి' (2009) వరకు ఆయన వారసులు చిత్ర నిర్మాణ సంస్థను కొనసాగిస్తూ, సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు.

గణాంక వివరాల్లోకి వెళితే... ఈ ఆరు పదుల ప్రస్థానంలో మొత్తం 43 చిత్రాలను ఈ సంస్థ నిర్మించింది. అందులో తెలుగు చిత్రాలు 40 కాగా, తమిళం రెండు ('శ్రీకృష్ణ పాండవీయం' తమిళ వెర్షన్‌ 'రాజసూయం', శివాజీ గణేశన్‌తో ఎన్టీయార్‌ 'చండశాసనుడు' రీమేక్‌ 'చరిత్ర నాయకన్‌'), హిందీ ఒకటి ('బ్రహ్మర్షి విశ్వామిత్ర' హిందీ వెర్షన్‌). ఈ చిత్రాల్లో కొన్నింటికి ఎన్టీయారే నిర్మాతగానూ వ్యవహరిస్తే, మరికొన్నింటికి ఆయన తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు, ఇంకొన్నిటికి కుమారులు హరికృష్ణ, రామకృష్ణ, మోహనకృష్ణల పేర్లు కనిపిస్తాయి. సాంఘికం, పౌరాణికం, చారిత్రక, జానపద కోవలు నాలుగింటిలోనూ చిత్రాలు తీసి, ఘనవిజయాలు సాధించిన తెలుగు సినీ సంస్థ ఇదొక్కటే కావడం మరో విశేషం. 'సీతారామ కల్యాణం' నుంచి 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' దాకా 10 పౌరాణికాలు, స్థల పురాణ కథ అయిన 'పాండురంగ మాహాత్మ్యం' నుంచి 'శ్రీనాథ కవిసార్వభౌమ' దాకా 7 చారిత్రకాలు తీసిన చిత్ర నిర్మాణ సంస్థగా చెరిగిపోని రికార్డు సృష్టించింది. 

ప్రతిభావంతులకు అవకాశం
ఎన్టీయార్‌ తన చిత్రాల ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులను తెలుగు తెరకు తెచ్చారు. హీరోయిన్లుగా వహీదా రెహమాన్‌ ('జయసింహ'), బి. సరోజాదేవి ('పాండురంగ మాహాత్మ్యం'), గీతాంజలి ('సీతారామ కల్యాణం'), నాగరత్నం ('గులేబకావళి కథ'), కె.ఆర్‌. విజయ ('శ్రీకృష్ణ పాండవీయం'), మీనాక్షీ శేషాద్రి ('బ్రహ్మర్షి విశ్వామిత్ర')లను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. సంగీత దర్శకుల్లో జోసెఫ్‌ - కృష్ణమూర్తి (గులేబకావళి కథ), సుప్రసిద్ధ హిందీ సంగీత దర్శకులు సి. రామచంద్ర (అక్బర్‌ - సలీం - అనార్కలి), రవీంద్ర జైన్‌ (బ్రహ్మర్షి విశ్వామిత్ర), మాటల రచయితల్లో సముద్రాల జూనియర్‌ (తోడు దొంగలు), కొండవీటి వెంకట కవి (దానవీర శూర కర్ణ), నాగభైరవ కోటేశ్వరరావు (బ్రహ్మర్షి విశ్వామిత్ర), రతన్‌బాబు (సామ్రాట్‌ అశోక), జంట రచయితలుగా పరుచూరి బ్రదర్స్‌ (అనురాగ దేవత), సినీ గీత రచయితల్లో సి. నారాయణ రెడ్డి (గులేబకావళి కథ), ఛాయాగ్రాహకుల్లో రవికాంత్‌ నగాయిచ్‌ ('సీతారామ కల్యాణం'), కె.ఎస్‌. ప్రకాశ్‌ ('డ్రైవర్‌ రాముడు'), నందమూరి మోహనకృష్ణ ('అగ్గి రవ్వ') తదితరులు ఈ బ్యానర్‌ నుంచి తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించినవారే!

ఏటికి ఎదురీదే ప్రయోగాలు
చిత్ర నిర్మాణంలో ప్రయోగాలకు కూడా ఎన్టీయార్‌ వెరవలేదు. కొంత ఆఫ్‌బీట్‌ దోవలో, డీ గ్లామర్‌ పాత్రలు వేసే ధోరణికి 'తోడు దొంగలు' శ్రీకారం చుట్టింది. నెగటివ్‌ పాత్ర వేస్తూ, కొత్త హీరో హీరోయిన్లతో 'సీతారామ కల్యాణం' తీశారు. హీరో, విలన్‌ పాత్రలు రెండూ తానే ధరించి, ఏకకాలంలో నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించి 'శ్రీకృష్ణ పాండవీయం' తీయడం అప్పట్లో ఓ సంచలనం. అలాగే తెలుగులో త్రిపాత్రాభి నయానికీ (కులగౌరవం - 1972), దుర్యోధనుణ్ణి పాజిటివ్‌ కోణంతో చూపడానికీ (దాన వీర శూర కర్ణ - 1977), పంచపాత్రాభినయానికీ (శ్రీమద్విరాటపర్వం - 1979) తెర తీశారు.

నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఏటికి ఎదురీదే తత్వంతో సొంత సంస్థపై సినిమాలు తీయడానికీ ఎన్టీయార్‌ వెనుకాడలేదు. రాష్ట్ర విభజన ఉద్యమం జరుగుతున్నప్పుడు సమైక్యంగా ఉండాలంటే 'తెలుగు జాతి మనది... నిండుగ వెలుగు జాతి మనది...' అని పాట పెట్టి మరీ 'తల్లా? పెళ్ళామా?' (1970 జనవరి 8) తీశారు. అలాగే, దొంగ బాబాలను వ్యతిరేకంగా 'కోడలు దిద్దిన కాపురం' (1970 అక్టోబర్‌ 21) నిర్మించారు. ఊరందరికీ భిన్నంగా కేంద్ర ప్రభుత్వ కుటుంబ నియంత్రణ విధానాన్ని వ్యతిరేకిస్తూ, 'తాతమ్మ కల' (1974 ఆగస్టు 30) కన్నారు. కథాపరంగా వేమన చరిత్రలో వచ్చే నగ సన్నివేశాన్ని సెన్సార్‌ కట్‌ చేయడానికి ఒప్పుకోకుండా, మూడేళ్ళ పాటు సెన్సార్‌తో పోరాడి 'శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' (1984 నవంబర్‌ 29) రూపొందించారు.

గమ్మత్తేమిటంటే, ఈ సంస్థపై వచ్చిన చిత్రాలు తొమ్మిందింటికి కేంద్ర ప్రభుత్వ ('తోడు దొంగలు', 'సీతారామ కల్యాణం', 'వరకట్నం'), రాష్ట్ర ప్రభుత్వాల (శ్రీకృష్ణ పాండవీయం, కోడలు దిద్దిన కాపురం, శ్రీకృష్ణసత్య, తల్లా పెళ్ళామా, తాతమ్మ కల) నుంచి అవార్డులు, గుర్తింపులు దక్కాయి. (1968లో రష్యాలో జరిగిన మాస్కో చలనచిత్రోత్సవానికి తెలుగు నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన చిత్రం 'ఉమ్మడి కుటుంబం'). తెలుగు నాట ఇప్పటి దాకా ఏ ఒక్క నిర్మాణ సంస్థకూ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ఇన్ని అవార్డులు, ఇంత గుర్తింపు రాకపోవడం విశేషం.

ఇప్పటికీ ప్రదర్శన, పంపిణీ, స్టూడియో విభాగాల్లో..

రాష్ట్రంలోనే మొట్టమొదటి 70 ఎం.ఎం. థియేటర్‌గా రాజధాని హైదరాబాద్‌లో 'రామకృష్ణా' థియేటర్‌ (1968 నవంబర్‌ 8)ను నిర్మించి, ప్రదర్శక రంగంలోకీ ఎన్టీయార్‌ చిత్ర నిర్మాణ సంస్థ విస్తరించింది. ఆపైన అక్కడే 'రామకృష్ణా 35 ఎం.ఎం', అటు తరువాత కాచిగూడలో 'తారకరామా' (1978) హాళ్ళు కట్టారు. ఇప్పటికీ ఈ మూడు సినిమా హాళ్ళూ ఎన్టీయార్‌ కుటుంబ సభ్యుల నిర్వహణలోనే ఉన్నాయి.

అలాగే, 'అగ్గి రవ్వ' (1981 ఆగస్టు 14) చిత్రాన్ని 'రామకృష్ణా మోషన్‌ పిక్చర్‌ డిస్ట్రిబ్యూషన్‌' పేర విడుదల చేసి, పంపిణీ రంగంలోకి వచ్చారు. అప్పటి నుంచి నైజామ్‌ ప్రాంతంలో ఈ పంపిణీ సంస్థ ద్వారా సినిమాల విడుదల సాగిస్తూ వచ్చారు. ఇవాళ్టికీ సికింద్రాబాద్‌లోని ఆర్పీ రోడ్‌లో ఈ పంపిణీ సంస్థ నడుస్తోంది.

రాష్ట్ర రాజధానిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో 1974లో స్టూడియో నిర్మాణానికి కూడా ఎన్టీయార్‌ నడుం బిగించారు. ముషీరాబాద్‌లోని సుమారు 3 ఎకరాల సొంత స్థలంలో 'రామ కృష్ణా స్టూడియో' కట్టారు. 1976 జూన్‌ 7న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చేతుల మీదుగా దాన్ని ప్రారంభించారు. ఆ తరువాత 1980 మార్చిలో నాచారం ప్రాంతంలో పన్నెండెకరాల స్థలంలో 'రామకృష్ణా హార్టీకల్చరల్‌ సినీ స్టూడియో'ను నెలకొల్పారు. తరువాతి రోజుల్లో ముషీరాబాద్‌ నుంచి నాచారానికి స్టూడియోను పూర్తిగా తరలించారు. ఇప్పటికీ ఈ స్టూడియోలో షూటింగ్‌లు జరుగుతున్నాయి.

తొలి రోజుల్లో అభిరుచి గల కథా చిత్రాల నిర్మాణానికి మొగ్గు చూపిన ఎన్టీయార్‌ తీరా స్టూడియో నిర్మించాక, దానికి రోజువారీ పని కల్పించడం కోసం స్వీయ నిర్మాణ సంస్థపై 'అగ్గిరవ్వ', 'రౌడీ రాముడు - కొంటె కృష్ణుడు', 'సింహం నవ్వింది' లాంటి తక్కువ స్థాయి వాణిజ్య పంథా చిత్రాలనూ నిర్మించడం విషాదం.

ఏమైనా అరవై ఏళ్ళ క్రితం ఎన్టీయార్‌ నాటిన విత్తనం వటవృక్షమై, వివిధ శాఖలుగా విస్తరించి, ఇవాళ్టికీ చిత్ర పరిశ్రమలో తనదైన స్థానంలో కొనసాగడం విశేషం. ఇక, నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక, స్టూడియో విభాగాల్లో ఎన్టీయార్‌ కుటుంబం తరువాత నిర్మాత డి. రామానాయుడి 'సురేష్‌ ప్రొడక్షన్స్‌', రామోజీరావు 'ఉషాకిరణ్‌ మూవీస్‌' లాంటివి తెలుగు వారి కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్నాయి. దక్షిణాది సినీసీమలో ఇంతటి ఘన చరిత్ర మన తెలుగు సినిమాకు ఉండడం సినీ ప్రియులకు గర్వకారణమే!

- రెంటాల జయదేవ     

............................................................................