జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, July 9, 2013

సినీ సహారాలో ఓ ఒయాసిస్సు - మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు సినిమా సమీక్ష సినీ సహారాలో ఓ ఒయాసిస్సు


ఈ మధ్య కాలంలో థియేటర్‌కు వెళ్ళిన దగ్గర నుంచి ప్రత్యేక నృత్య గీతాలు, పంచ్‌డైలాగులు, వెకిలి కామెడీ, ఒళ్ళు వేడెక్కించే సన్నివేశాలు, చెవులు దిమ్మెత్తించే ఫైట్లతో విసిగిపోని సగటు తెలుగు సినీ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ రొడ్డకొట్టుడు చిత్రాల బారి నుంచి బయటపడేసేవారి కోసం ఎదురుచూస్తున్న సమయంలో మిణుకు మిణుకుమంటూ వెలిగిన తాజా చిరు దీపం -మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు చిత్రం. ఎంతసేపటికీ ఫార్ములా లెక్కలతో, బాక్సాఫీస్‌భయాలతో సతమతమవుతూ, తీసిందే తీసే తెలుగు సినీ సహారాలో ఈ చిత్రం ఓ ఒయాసిస్సు!

 (ప్రజాశక్తి దినపత్రిక, 9 జూలై 2013, మంగళవారం, పేజీ నం. 8లో ప్రచురితమైన రివ్యూ తాలూకు పూర్తి పాఠం ఇది)
 .........................................................................
చిత్రం: మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, తారాగణం: శ్రీదివ్య, క్రాంతి చంద్‌, జార్జ్‌, రావు రమేశ్‌, ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి, కూర్పు: ధర్మేంద్ర కాకరాల, సంగీతం: రవీంద్ర ప్రసాద్‌, నేపథ్య సంగీతం: పవన్‌కుమార్‌, సమర్పణ: జక్కం జవహర్‌బాబు, నిర్మాత: జి. ఉమాదేవి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, కళ, దర్శకత్వం: జి.వి. రామరాజు
............................................................................
  
          పురుషుడు ఏ స్వేచ్ఛనైతే తన హక్కుగా భావిస్తాడో, ఆ స్వేచ్ఛను స్త్రీకి ఇస్తే చాలు. అంతకు మించి స్త్రీ ఏమీ ఆశించదు అన్నది ఈ చిత్ర ఇతివృత్తం. ఆ అంశాన్ని తన ఈ తొలి చిత్రం ద్వారా చెప్పదలుచుకున్నారు దర్శకుడు రామరాజు.

          కథ:

జీవితంలోని చిన్న చిన్న సంతోషాలు, ఆనందాలను హాయిగా అనుభవిస్తూ గడపాలనుకొనే యువతి - లక్ష్మి (శ్రీదివ్య). జాతకాలు కుదిరాయంటూ, ఆమెకు ఓ యువకుడి (జార్జ్‌)తో పెద్దలు పెళ్ళి చేసేస్తారు. కానీ, అతనికేమో జీవితమంటే ప్రేమ, ఆప్యాయతలు కాదు... డబ్బు, హోదా మాత్రమే! నాకు సంబంధించినంత వరకు రెండే నిజాలు. ఒకటి - నేను! రెండు - డబ్బు!! అంటూ, సంపాదనే లోకంగా గడుపుతూ, కట్టుకున్న భార్యను వ్యక్తిత్వమున్న ఓ మనిషిగానైనా చూడడు.

          వైవాహిక జీవితంలోని ఈ అసంతృప్తిని దూరం చేసుకొనేందుకు లక్ష్మి ప్రయత్నిస్తుంది. తండ్రి (రావు రమేశ్‌), బంధువులు కూడా కొన్నాళ్ళయితే అంతా సర్దుకొంటుందని, ఆమెకు నచ్చజెబుతుంటారు. ఆ పరిస్థితుల్లో ఆమెకు అనుకోకుండా సినీ గీత రచయిత క్రాంతి (క్రాంతి చంద్‌)తో పరిచయం ఏర్పడుతుంది. విదేశాలకు వెళితే భారీ జీతంతో పెద్ద ఉద్యోగం చేసే అవకాశమున్న ఈ ఎలక్ట్రానిక్స్‌గోల్డ్‌మెడలిస్ట్‌అవన్నీ కాదనుకొని, తనకు ఇష్టమైన పని చేయాలని ఈ రచనా జీవితాన్ని ఎంచుకుంటాడు. అతనికీ, కథానాయికకూ మధ్య పరిచయం ఎలా పెరిగింది, వారి మధ్య అనుబంధం ఏమిటి, చివరకు ఏ మల్లెల తీరాలకు సిరిమల్లె పువ్వు లాంటి నాయిక చేరిందన్నది మిగతా చిత్ర కథ.

కథనం:

శారీరకంగా కొట్టకున్నా, ఆర్థిక, లైంగిక వేధింపులు లేకున్నా, వ్యక్తిత్వాన్ని గౌరవించనప్పుడు ఏ వైవాహిక బంధమైనా ఎంత బలహీనంగా మారుతుందో ఈ చిత్రకథ చూపెడుతుంది. పురుషాధిక్య భావజాలమే ప్రబలమైన మన సమాజంలోని సగటు ప్రేక్షకులకు కొత్త ఆలోచననూ, చూపునూ అందించేందుకు ప్రయత్నిస్తుంది. మనసు లేని చోట మనుగడ ఎంత కష్టమో గుర్తు చేస్తుంది. ఒకసారి పెళ్ళయిన తరువాత ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా భర్త తోడిదే లోకంగా బతకాలంటూ సతీ సూత్రాలను ప్రవచించిన సినిమాలు, దానికి తలొగ్గిన కథానాయిక పాత్రలు చాలానే వచ్చాయి. కాగా, స్త్రీ పాత్రల్లో వచ్చిన మార్పును చెప్పడానికి ఈ సినిమా తాజా ఉదాహరణ. ఇద్దరు స్త్రీ పురుషులు నాలుగు గోడల మధ్య, ఒకే చూరు కింద కలసి ఉండడానికీ, మనసులు కలిసే తీరం అన్వేషణలో అద్వైతానుభూతికి చేరడానికీ మధ్య ఉన్న తేడాను ఈ చిత్రం స్పష్టం చేస్తుంది.

కథాకథన శైలిలో శేఖర్‌కమ్ముల ఆనంద్‌ తరహా చిత్ర ధోరణిని ఇది గుర్తు చేస్తుంది. చకచకా తెరపై కదిలే దృశ్యాలకు అలవాటైపోయిన ప్రేక్షకులకు ఈ సినిమా అతి నిదానం అనిపించడంలో ఆశ్చర్యం లేదు. అయితే, పాత్రల మానసిక సంఘర్షణకు ప్రాధాన్యమిస్తూ, కథానాయిక ఆత్మకథనంగా సినిమాను నడిపే పద్ధతిని ఎంచుకోవడంతో ఆ రకమైన కథా గమనం తప్పినట్లు లేదు.

రెండు గంటల మీద కాసేపు సాగే ఈ చిత్రంలో ప్రథమార్ధమంతా కథానాయిక బలహీన వైవాహిక బంధాన్నీ, ఆమెకు ఎదురైన కొత్త పరిచయాన్నీ చూపి, ఆమె తన మనోభావాన్ని వ్యక్తం చేసిన చోట ఆసక్తికరంగా ఇంటర్వెల్‌ఇచ్చారు. ఆమె ఎటువైపు, ఎలా అడుగులు వేసి, తన భవిష్యత్‌జీవితాన్ని తీర్చిదిద్దుకుందన్నది ద్వితీయార్ధం.

అయితే, ఈ కథలో భర్త నుంచి నాయిక పూర్తిగా దూరమవడానికి చూపిన ప్రాతిపదిక మరింత బలంగా ఉండాల్సింది. పాత్రల మధ్య అంతస్సంఘర్షణకు మరికొన్ని బలమైన సన్నివేశాలను కథారచయిత రాసుకొని ఉంటే, సినిమా ఇంకా చిక్కగా ఉండేది.

అయితేనేం, కథానాయిక లక్ష్మి పాత్రను శ్రీదివ్య చాలా చక్కగా పోషించారు.  సినిమా చాలా వరకు ఆమె మాటల్లో సాగుతుంది. దాంతో, డబ్బింగ్‌ఎంతో కీలకం. అది కూడా బాగా కుదిరింది. భర్త, గీత రచయిత పాత్రధారులు పరిధుల మేరకు నటించారు. రావు రమేశ్‌తండ్రి పాత్ర కనిపించేది మూడు, నాలుగు సన్నివేశాల్లోనే అయినా, పాత్రను పండించారు. ముఖ్యంగా, చివరలో ఓ తండ్రిగా కుమార్తె పట్ల తన బాధ్యతను వ్యక్తం చేసే దృశ్యం కదిలిస్తుంది. సినీ సంగీత దర్శకఁడు రాజ్‌తన నిజజీవిత పాత్రలో ఓ సన్నివేశంలో కనిపిస్తారు.

లోకం స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది. కానీ, ఇవ్వదు. తను గీసిన గీతలోనే ఉండమంటుంది అంటూ మహిళా స్వేచ్ఛ వైపు, మనసును వెతుకుతూ పోతే మిగిలేవన్నీ మల్లెల తీరాలే అంటూ డబ్బే జీవితంగా కాక మనసుకు నచ్చిన విధంగా ఆనందంగా జీవించడం వైపు ఈ చిత్రం ఆలోచనలను ప్రేరేపిస్తుంది.

నిర్మాణ, సాంకేతిక విలువలు:

మూడే మూడు ప్రధాన పాత్రలతో, పరిమితమైన లొకేషన్లలో, సహజంగానే అతి పరిమిత బడ్జెట్‌లో ఈ సినిమాను రూపొందించారు. కానీ, సినిమా చూస్తూ ఒకసారి ఆ పాత్రల మానసిక స్థితిలోకి ప్రేక్షకుడు ప్రవేశించాక, అవేవీ గుర్తుకు రావు.

పైగా, మాటలు, పాటలు, నేపథ్య సంగీతం - చాలా చక్కగా అమరాయి. ‘‘ప్రేమ, మనసు, ఆకాశం -వీటిని నచ్చిన విధంగా వర్ణించుకోవచ్చు కానీ, హద్దులు గీయలేం!’’ (నాయికతో క్రాంతి), ‘‘సంపాదించు! కానీ లైఫ్‌ను బిజినెస్‌చేయకు!’’ (భర్తతో కథానాయిక), ‘‘భార్యగా అవడం వేరు! భార్యగా బతకడం వేరు!!’’ (కథానాయిక), ‘‘కోపం కూడా ఒక ఫీలింగే! నాకు తన మీద అది కూడా లేదు!’’ (భర్త గురించి నాయిక)‘‘మానవ సంబంధాలు గ్యారంటీలతో రావు, మనమే పోషించుకోవాలి’’ (హీరోయిన్‌తో క్రాంతి), ‘‘మానసికంగా తనతో లేనప్పుడు ఇంకా తను నా భర్త ఏమిటి?’’ (హీరోయిన్‌) - ఇలా సినిమాలోని వివిధ సందర్భాల్లో అభిప్రాయాల వ్యక్తీకరణగా వచ్చే అనేక సంభాషణలు ఎవరినైనా ఆలోచనలోకి నెడతాయి.

తెలుగుదనం నిండిన సాహిత్యం పాటల్లో పరుచుకుంది. అందులోనూ ఆ సాహిత్యం స్పష్టంగా వినిపించడం, బాణీలు శ్రావ్యంగా ఉండడం విశేషం. నీ నీడన ఇలా నడవనా..., మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా... లాంటి గీతాలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి (గీత రచయిత: ఉమా మహేశ్వరరావు). చీకటి నలుపున మనమే, చిగురాకుల ఎరుపున మనమే... లాంటి అభివ్యక్తీకరణలు మనసును మీటుతాయి.

చాలా సందర్భాల్లో మాటలు తక్కువ కాబట్టి ఆ సన్నివేశాల బలిమిని పెంచడానికి చిన్న చిన్న గీత ఖండికలు, బ్యాక్‌గ్రౌండ్‌మ్యూజిక్‌ను దర్శకుడు సమర్థంగా వినియోగించుకున్నారు.  కళ, ఛాయాగ్రహణం, కూర్పు కథావాతావరణానికి తగ్గట్లు ఉన్నాయి. అయితే, డిజిటల్‌కెమేరాతో చిత్రీకరణలోని పరిమితులు తెరపై కొంత తెలిసిపోతుంటాయి. సాహిత్యం మీద దర్శకుడికున్న అభిరుచి, చలంతో సహా పలువురు రచయితల ప్రభావం సినిమాలో స్పష్టమవుతుంటాయి.
సినీ నిర్మాణ, కథన పద్ధతులను మరికొంత మెరుగుపరుచుకుంటే, అభిరుచి ఉన్న ఈ దర్శకుడి నుంచి మరిన్ని మంచి చిత్రాలను ఆశించవచ్చనే ఆశ కలుగుతుంది.

వెరసి, రొటీన్‌పాటలు, ఫైట్ల కథలతో విసిగిపోయి, ఓ రెండు గంటల పాటు మనలాంటి ఓ మామూలు వ్యక్తి జీవితాన్ని స్లో పేస్‌లో, కవితాత్మక భావుకతతో వెండితెరపై చూద్దామనుకుంటే ఈ చిత్రానికి నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు. కొంత సీరియల్‌ఫక్కీలో సాగినా, సీరియస్‌గా చేసిన సిన్సియర్‌ప్రయత్నం సున్నిత హృదయుల మనస్సును తాకుతుంది.

కొసమెరుపు:

ప్రారంభమైన పది నిమిషాల తరువాత  హాలులో అడుగుపెట్టిన దంపతులిద్దరు సినిమా అయిపోయాక బయటకు వస్తుండగా, మొదటి నుంచి చూస్తే ఇంకా బాగుండేది. సినిమా మళ్ళీ చూద్దామా? అని భర్తతో భార్య అనడం వినిపించింది. అవును మరి! సినిమాలో ఓ చోట భర్తతో కథానాయిక, ‘‘నీకు నీ ప్రపంచం బయట ఉంది. కానీ, నాకు నా ప్రపంచం నాలో ఉంది!’’ అంటుంది. అలా లోపల ప్రపంచంలోకి ప్రయాణించదలిచిన వారికి సినీ రూపకర్తలే చెప్పినట్లు ఈ సినిమా ఎ జర్నీ త్రూ యువర్‌హార్ట్‌!
-         రెంటాల జయదేవ

(Published in 'Praja Sakti' daily, 9th July 2013, Monday, Page No.8)
........................................................

1 వ్యాఖ్యలు: