జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, July 6, 2013

తెలుగు తెరపై మళ్లీ త్రీడీ హంగామాతెలుగు తెరపై ఇప్పుడిక మరో కొత్త హంగామా మొదలవుతోంది. రానున్న పదిహేను రోజుల వ్యవధిలోనే ఏకంగా రెండు నేరు తెలుగు 3డి చిత్రాలు విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. 'అల్లరి' నరేశ్‌ హీరోగా నటించిన వినోదభరిత చిత్రం 'యాక్షన్‌ - 3డి' ('విత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌' అనేది ఉప శీర్షిక) రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా, నందమూరి కల్యాణరామ్‌ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న 'ఓం' 3డి చిత్రం పూర్తిస్థాయి యాక్షన్‌ మూవీగా ఆ వెంటనే జనం ముందుకు రానుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని తయారవుతున్న ఈ రెండు చిత్రాలూ తెలుగు నాట సరికొత్త వినోద హంగామాకు తెర తీస్తున్నాయి. 


ఇప్పటికి సరిగ్గా 29 ఏళ్ళ క్రితం మన దేశంలో తయారైన తొలి త్రీడీ చిత్రంగా మలయాళ సినిమా 'మై డియర్‌ కుట్టి చేతాన్‌' విడుదలైంది. ఆ తరువాత చెదురుమదురుగా త్రీడీ చిత్రాలొచ్చినా, చాలా కాలం విరామం తరువాత మళ్ళీ గత ఆరేడేళ్ళుగానే తెరపై 3డి హంగామా పెరిగింది. హాలీవుడ్‌ చిత్రాలతో పాటు, హిందీలో ఓ పక్క షా రుఖ్‌ ఖాన్‌ 'రా.వన్‌', 'డాన్‌-2' లాంటివి మామూలు సినిమాల లాగా 2డి రూపంలో రూపొంది, ఆనక 3డి వెర్షన్‌లోకి మారి, జనం ముందుకు రావడం మొదలైంది. 

ఒకపక్క హాలీవుడ్‌, మరో పక్క హిందీ చిత్ర సీమల త్రీడీ హంగామాతో, దర్శకుడు శంకర్‌ - హీరో రజనీకాంత్‌ల 2007 నాటి బాక్సాఫీస్‌ హిట్‌ 'శివాజీ' కూడా 2012లో 3డి రూపంలోకి కన్వర్ట్‌ అయింది. మాతృకను రీ-మాస్టరింగ్‌ చేసి, అరగంట సేపు నిడివిని తగ్గించి, భారత దేశంలో తొలిసారిగా 'డాల్బీ ఎట్మాస్‌' అనే సరికొత్త ఆడియో పరి జ్ఞానంతో ఈ చిత్రాన్ని 'శివాజీ -3డి'గా నిర్మాతలైన ఏ.వి.ఎం. సంస్థ వారు 2012 డిసెంబర్‌ 12న రజనీకాంత్‌ జన్మదిన కానుకగా తమిళంలో విడుదల చేశారు. ఇలా మళ్ళీ చాలా కాలం తరువాత జనంలో 3డి చిత్రాల పట్ల క్రేజు పెరిగిన నేపథ్యంలో అనువాద చిత్రాలు కాకుండా, తెలుగులో నేరుగా ఇప్పుడు మళ్ళీ రెండు 3డి చిత్రాలు వస్తు న్నాయి. 

''మునుపటి కన్నా ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరి గింది. 3డి చిత్రాల రూపకల్పన పరిజ్ఞానం కూడా ఆధునికతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్లో 3డి చిత్రాలపై ఉన్న ఆసక్తికి అనుగుణంగా ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా రూపొందించాలని భావించాను'' అని 'యాక్షన్‌-3డి'తో దర్శకుడి అవతారమెత్తుతున్న నిర్మాత అనీల్‌ సుంకర 'జీవన'కు వివరించారు. 

'ఓం -3డి' చిత్ర నిర్మాత, హీరో నందమూరి కల్యాణరామ్‌ కూడా ''కొత్తగా ఏదైనా చేయా లన్న తపనతో''నే ఈ త్రీడీ చిత్ర నిర్మాణానికి దిగారు. అందు కోసం కాలాన్నీ, ఖర్చునూ లెక్క చేయకుండా 'కల్యాణరామ్‌ కత్తి' (2010) చిత్రం తరువాత గడచిన రెండున్నరేళ్ళ పైగా ఇదే ధ్యాసలో మునిగి తేలుతున్నారు. అనీల్‌ తొలిసారిగా కామెడీ 3డి చిత్రంతో ముందుకొస్తుంటే, కల్యాణ్‌రామ్‌ తొలిసారిగా పూర్తి యాక్షన్‌ కథా చిత్రాన్ని 3డిలోకి తెస్తుండడం విశేషం. అటు 'యాక్షన్‌' అనీల్‌కు దర్శకుడిగా తొలి చిత్రమైతే, ఇటు 'ఓం' సినిమా దర్శకుడు సునీల్‌ రెడ్డికి మొదటి సినిమా కావడం గమనార్హం. విజయవాడలో పుట్టి, అక్కడే తెగ సినిమాలు చూస్తూ పెరిగిన అనీల్‌కు తన చిన్నప్పటి 'చిన్నారి చేతన - 3డి' నాటి హంగామా గుర్తే! అయితే! అప్పటి 3డి పరిజ్ఞానానికీ, ఇప్పటి దానికీ చాలా తేడా ఉందంటారాయన! అంతేకాదు. సినిమాలో చూపే దృశ్యాల్లో కూడా ''ఇప్పటి త్రీడీకీ, అప్పటి త్రీడీకీ చాలా తేడా ఉంది. అప్పట్లో ప్రేక్షకుడి మీదకు కత్తి, బుల్లెట్‌ లాంటివి దూసుకురావడం లాంటి అద్భుత రస ప్రధాన దృశ్యాలే ఉండేవి. కానీ, ఇప్పుడు పూర్తిగా సినిమాలోని వాతావరణం, తెర మీది దృశ్యంలోని రకరకాల అంశాలు త్రీ డైమన్షనల్‌ రూపంలో కనిపించడం మీదే ఎక్కువ దృష్టి. దీని వల్ల ప్రేక్షకుడికి ఓ కొత్త విధమైన అనుభూతి కలుగుతుంది'' అని అనీల్‌ వివరించారు. 

తీయాలంటే తిప్పలెన్నో! 

అయితే, 3డి సినిమాలు తీయడం అంత సులభమేమీ కాదు. మామూలు కెమేరామన్‌తో పాటు, 3డి దృశ్యాల చిత్రీక రణ సరిగ్గా వస్తున్నదీ, లేనిదీ పర్యవేక్షించడానికి '3డి స్టీరియో గ్రాఫర్‌' పేరిట మరో నిపుణుడు కూడా అవసరం. చేయితిరిగిన అలాంటి నిపుణులు ప్రస్తుతానికి హాలీవుడ్‌లోనే ఉన్నారు. అదీ చాలా కొద్దిమందే! వారిని ప్రత్యేకంగా ఇక్కడకు రప్పించి, షూటింగ్‌ జరిగినన్నాళ్ళూ వెంట ఉంచుకోవాల్సి ఉంటుంది. పైగా, ''3డి సినిమా తీయాలంటే, బోలెడంత సహనం కావాలి. కొన్నిసార్లు రోజు మొత్తం మీద రెండు షాట్లు కూడా తీయలేక పోతాం. అనుకోకుండా సాంకేతికంగా ఏవో చిన్న ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కెమేరాల పని తీరుతో సహా ఏ చిన్న సాంకే తిక ఇబ్బంది వచ్చినా, బొంబాయి నుంచి ప్రత్యేక నిపుణుణ్ణి పిలిపించి, ఆ లోపాన్ని సరిదిద్దాల్సిందే! వాటన్నిటినీ, సహిస్తూ, ఆర్థిక భారాన్ని భరిస్తూ, యూనిట్‌ అందరూ ఓపిగ్గా పని చేస్తే కానీ, సరైన ఉత్పత్తి బయటకు రాదు! 'యాక్షన్‌' చిత్రంతో మాకు అవన్నీ అలవాటైపోయాయి'' అని అనీల్‌ సుంకర చిరునవ్వుతో తన స్వీయానుభవాన్ని వివరించారు. 

'యాక్షన్‌ -3డి' చిత్రం తీయడానికి దాదాపు ఏణ్ణర్ధం పైగా పట్టింది. దాదాపు 130 రోజులు షూటింగ్‌ జరిగింది. అందులో, రోజూ ఏకధాటిగా 20 గంటలు కాల్షీట్లతో పని చేసిన దినాలే ఎక్కువ. హీరో 'అల్లరి' నరేశ్‌ తన కెరీర్‌లో అత్యధిక దినాలు పని చేసిన చిత్రం ఇదే! అలాగే, 3డి సినిమా కావడంతో, ''రేయింబ వళ్ళు పని చేస్తే కూడా నిర్మాణానంతర కార్యకలాపాలకు 3 నెలల సమయం పట్టింది.'' సహజంగానే, ఈ సినిమాకు అయ్యే ఖర్చు కూడా అలానే ఉంటుంది. ఒక హీరోతో సాధారణంగా చేసే చిత్ర నిర్మాణం కన్నా, 3డి చిత్రమంటే 40 శాతం మేర ఎక్కువ ఖర్చు అవుతుందని నిర్మాణ వర్గాల ఉజ్జాయింపు లెక్క. 'అల్లరి' నరేశ్‌ నటించే చిత్రాలకుండే సగటు మార్కెట్‌కు దాదాపు మూడింతల ఖర్చుతో 'యాక్షన్‌'ను తయారు చేయాల్సి వచ్చింది. అలాగే, కల్యాణరామ్‌ సైతం తన చిత్రాల మార్కెట్‌కు చాలా ఎక్కువ రెట్లు ఖర్చు చేస్తూ, సాహసోపేత ప్రయత్నం చేస్తున్నారు. 

కెమేరా పనే కీలకం! 

తెర మీద మామూలుగా బొమ్మలు కదులుతున్నట్లుండే సర్వసాధారణ సినిమాల (సాంకేతికంగా చెప్పాలంటే 2డి వెర్షన్‌)కూ, మన కళ్ళె దుటే పాత్రలు సజీవంగా తిరుగుతున్నట్లు అనిపించే త్రీడీ సినిమాల (3డి వెర్షన్‌)కూ కెమేరాలతో చిత్రీకరణ విషయంలో చాలా తేడాయే ఉంది. ''త్రీడీ చిత్రీకర ణకు కూడా మామూలు సినిమాల చిత్రీకరణకు వాడే రెడ్‌ వన్‌, ఎపిక్‌ కెమేరా లాంటివే వాడతారు. అయితే, దృశ్యాన్ని ఒక కెమె రాతో కాక రెండు కెమేరాలతో చిత్రీకరిస్తారు. ఆ రెండు కెమేరాల మధ్య నిర్ణీతమైన దూరం ఉండేలా, వాటిని ఓ ఫ్రేమ్‌కు బిగి స్తారు. వాటిలో ఒక కెమేరా ఒక కన్ను అయితే, రెండో కెమేరా ఏమో రెండో కన్ను లాంటిది. ఒక కంటితో కాక, మనం రెండు కళ్ళతోనూ చూసినప్పుడే ఏ వస్తువుకైనా, పొడవు, వెడల్పు, లోతు - ఈ మూడు డెమెన్షన్లూ తెలుస్తాయి కదా! ఇదీ అలాగే అన్న మాట! ఆ రెండు కెమేరాలూ ఏకకాలంలో మొదలై, ఒకే రకంగా కదులుతూ ఉండేలా వాటిని సమన్వయపరచాల్సి (సింక్రనైజ్‌ చేయాల్సి) ఉంటుంది. ఆ సమన్వయాన్నీ, చిత్రీకరించిన దృశ్యం తగినంత డెప్త్‌తో ఉన్నదీ, లేనిదీ 3డి-స్టీరియోగ్రాఫర్‌ చూస్తాడు'' అని అనీల్‌ సుంకర విశదీకరించారు. 

3డి దృశ్యాల చిత్రీకరణలో కెమేరాల సమన్వయానికి మాన్యువల్‌ రిగ్స్‌, ఆటోమేటిక్‌ రిగ్స్‌ అని రెండు రకాల పద్ధతులు అనుసరించవచ్చు. ఆటోమేటిక్‌ రిగ్స్‌పై కెమేరాతో చిత్రీకరణ జరిపితే, ఎగుడుదిగుడు ప్రాంతాలు, రోడ్ల మీద ఇబ్బంది గనక, 'యాక్షన్‌ -3డి'కి మాన్యువల్‌ రిగ్సే వాడారు. మాన్యువల్‌ రిగ్స్‌ వేసి, 3డి దృశ్యాల చిత్రీకరణ జరిపే అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరైన 3డి-స్టీరియోగ్రాఫర్‌ కీత్‌ డ్రైవర్‌ను వినియోగించుకు న్నారు. కెమేరామన్‌గా సర్వేష్‌ మురారి వ్యవహరించారు. 3డి చిత్రాల షూటింగ్‌లో కెమేరా పనితనం అంత కీలకం గనకనే, కల్యాణరామ్‌ తన 'ఓం' చిత్రానికి ఏకంగా 'అవతార్‌', 'ప్రొమెథియస్‌' లాంటి హాలీవుడ్‌ చిత్రాలకు పని చేసిన ముగ్గురు స్టీరియోగ్రాఫర్ల సేవలను వినియోగించుకున్నారు. ఛాయా గ్రహణ బాధ్యతలను అజయన్‌ జోసెఫ్‌ విన్సెంట్‌ నిర్వహిం చారు. స్టీరియోగ్రాఫర్లను హాలీవుడ్‌ నుంచి ఇక్కడకు రప్పించి, వారికి రోజువారీగా పారితోషికం చెల్లిస్తూ, సినిమా షూటింగ్‌ జరిగినన్నాళ్ళూ వెంట ఉంచుకోవడం మన దేశవాళీ 3డి చిత్రా లకు పెద్ద ఖర్చే! 

అయినా సరే, మన నిర్మాతలు అందుకు వెనుకాడలేదు. ''హాలీవుడ్‌లో ప్రస్తుతం ఏటా పక్కాగా 3డిలో తయారవుతున్న చిత్రాలు దాదాపు 50 ఉంటాయి. వాటికి పని చేసేందుకు పూర్తిస్థాయి నిపుణులైన స్టీరియోగ్రాఫర్లు ఓ పాతిక మందే ఉంటారు. అలాంటి వారిని తెచ్చి, చిత్రాన్ని రూపొందిస్తు న్నప్పుడు ఆ మాత్రం ఖర్చు తప్పదు'' అని అనీల్‌ అభిప్రాయపడ్డారు. 

సినిమాలు సరే! థియేటర్ల మాటో... 

తెలుగు నాట త్రీడీ చిత్రాల నిర్మాణం, ప్రదర్శన ఇప్పటికీ తక్కువే కాబట్టి, ఈ సినిమాలు తీయడంలోనే కాదు, ప్రదర్శనలోనూ ప్రస్తుతం కొన్ని చిక్కులున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 40 హాళ్ళలోనే పూర్తి స్థాయిలో త్రీడీ చిత్రాల ప్రదర్శనకు అనువైన తెర, ప్రొజెక్టర్‌ వగైరా ఉన్నాయి. ఇప్పుడు 'యాక్షన్‌-3డి'తో మరో పది హాళ్ళు కొత్తగా ఆ వసతిని సమకూర్చు కుంటున్నాయి. పూర్తిస్థాయి త్రీడీ చిత్ర సందర్శన అనుభూతిని అందించనున్నాయి. అయితే, ఇవన్నీ సినీ ప్రదర్శన రంగం పరిభాషలో 'ఎ' సెంటర్లయిన పెద్ద పట్టణాలే. 

ఇక, చిన్న పట్నాలైన 'బి', 'సి' కేంద్రాల్లో దాదాపు మరో 100 హాళ్ళలో కూడా కొంత వరకు త్రీడీ ఎఫెక్ట్‌ కనిపించేలా, ప్రత్యేకమైన కళ్ళద్దాలిచ్చి, చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. మొత్తం ఈ 150 హాళ్ళలోనే త్రీడీ అనుభూతి. మరో 100 హాళ్ళలో నేరుగా మామూలు సినిమాల లాగా ఉండే 2డి వెర్షన్‌నే ప్రదర్శించనున్నారు. అంటే, ఎంత ఖర్చు పెట్టి, 3డి సినిమా తీసినా వాటి ప్రదర్శనకు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న థియేటర్‌ వసతులు పరిమితమే అన్నది ఓ లోటు! 

కానీ, అనీల్‌ మాత్రం అందుకోసం నిరాశ పడాల్సిన పని లేదంటున్నారు. ''అన్ని భాషల్లోనూ భవిష్యత్తు అంతా 3డి చిత్రాలదే! కాబట్టి, అందుకు అనువైన థియేటర్లు కూడా క్రమంగా పెరుగుతాయి'' అంటారాయన. త్రీడీ చిత్రాల ప్రదర్శన కోసం 2కె ప్రొజెక్టర్‌, అందుకు అనువైన వేరే తెర లాంటివి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు దాదాపు 10- 15 లక్షల దాకా ఖర్చవుతుందని ఓ లెక్క. రానున్న మూడు నాలుగేళ్ళలో కొత్త థియేటర్లతో పాటు పాత హాళ్ళు కూడా ఆ వసతుల్ని సమకూర్చుకుంటాయని సినీ వర్గాల అంచనా. 

అలాగే, త్రీడీ సినిమా నిర్మాణానికి ఎక్కువ ఖర్చయినా, కన్నుల పండుగగా ఉంటే ఆ చిత్రాలు చూడడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి, ఆ మేరకు ఆ సినిమాల వ్యాపార ప్రతిపాదనలు కూడా మామూలు కన్నా 50 శాతం హెచ్చుతోనే వస్తున్నాయన్నది అనీల్‌ లాంటి వారి అనుభవం. ఆయన తెలివిగా తన చిత్రాన్ని ఏకకాలంలో తమిళంలో కూడా అక్కడి నేటివిటీకి తగ్గ మార్పులు, చేర్పులతో 'ఓ పోడు' పేరిట తీశారు. తెలుగు 'యాక్షన్‌' విడుదలైన మూడు వారాల విరామం తరువాత ఈ తమిళ వెర్షన్‌ విడుదల కానుంది. కామెడీ కన్నా, ఎక్కువగా పాటల మీద దృష్టి పెట్టిన పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌ ఈ చిత్రమని ఆయన అన్నారు. 

రానున్నది త్రీడీ యుగం 

ఆధునిక సాంకేతికతతో తొలినాళ్ళ ప్రయత్నాలు కాబట్టి, ఈ 3డి చిత్రాల నిర్మాణానికి అనుసరించాల్సిన పద్ధతులపై పరిశోధనకూ, అవగాహనకూ, షూటింగ్‌కూ ఎక్కువ సమయం పట్టింది. కానీ, క్రమంగా అలవాటైన పనిగా ఇది సులభమవుతుందనీ, రాగల రెండేళ్ళలో మామూలు సినిమా చేసినంత సులభంగా త్రీడీ చిత్రాలూ వచ్చేస్తాయనీ అనీల్‌, కల్యాణరామ్‌ లాంటి వారు అభిప్రాయపడుతున్నారు. అన్నీ పూర్తయ్యాక సినిమా మొత్తం ఇప్పుడు చూసుకుంటే, పడ్డ కష్టాన్ని మరిపిస్తోందంటారు అనీల్‌. 

'3డి షూటింగ్‌లో కెమేరాకూ, మనం చిత్రీకరిస్తున్న వస్తువుకూ మధ్య కచ్చితమైన నిర్ణీత దూరం ఉండాలి. కాబట్టి, మామూలు సినిమాల్లో లాగా జిమ్మీ జిబ్‌ల లాంటివి వాడేసి, మన ఊహకు తోచినట్లు త్రీడీ సినిమా తీయలేం. ఇటీవలే జిమ్మీకి పెట్టే 3డీ కెమేరా రిగ్‌ కూడా వచ్చింది. కానీ, ఇప్పటికైతే కేవలం ట్రాక్‌, ట్రాలీ షాట్లతోనే సినిమా తీయాల్సి ఉంటుంది. కాబట్టి, మన ఊహల్ని యథాతథంగా తెర మీదకు తేవడంలో కొంత రాజీ పడాల్సి వచ్చిందని అసంతప్తి అనిపించవచ్చు. అయితే, నూటికి నూరుపాళ్ళూ కష్టపడి, ప్రాణం పెట్టి సినిమా తీసినప్పుడు ప్రేక్షకులకు కూడా అది నచ్చడం గ్యారెంటీ'' అన్నారు అనీల్‌ సుంకర. ప్రయత్నంలో త్రికరణ శుద్ధిగా లోపం లేనప్పుడు ఫలితంలో లోటు జరుగుతుందని ఎవరైనా ఎలా అనగలరు! ఇప్పుడొస్తున్న మన భారీ 3డి చిత్రాల్లోని అతి పెద్ద సానుకూల అంశం చిత్తశుద్ధితో కూడిన ఆ ప్రయత్నమే!
                                           - రెంటాల జయదేవ 
***************************************************

మనదేశంలో తొలి 3డి చిత్రం

నిజానికి, తెలుగు సినీ ప్రేక్షకులకు వెండితెరపై 3డి చిత్రాలు కొత్త ఏమీ కాదు. భారతదేశంలో తయారైన తొలి 3డి చిత్రం 'మై డియర్‌ కుట్టి చేతాన్‌' 1984 ఆగస్టులో తొలిసారిగా విడుద లైంది. జిజో దర్శకత్వంలో కేరళలోని నవోదయ స్టూడియోకు చెందిన ఎం. అప్పచ్చన్‌ నిర్మించిన ఈ చిత్రం ప్రాథ మికంగా మలయాళ చిత్రమైనా, తమిళంలో 'చుట్టి చేతన్‌'గా, తెలుగులో 'చిన్నారి చేతన'గా అనువదించి విడుదల చేశారు. ప్రత్యేకమైన కళ్ళజోడు పెట్టుకొని చూస్తుంటే, తెరపై దృశ్యాలు కళ్ళెదుటే, చేతికి బారెడు దూరంలో నిజంగానే జరుగుతున్న అనుభూతి కలగడం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. 

మీదకు దూసుకు వచ్చే త్రిశూలాలు, మంత్ర దండాల లాంటి అద్భుత రస ప్రధాన దృశ్యాలతో అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించిన ఈ సినిమా తెలుగు రూపం 'చిన్నారి చేతన' అప్పట్లో ఓ పెను సంచలనం. త్రీడీ కళ్ళద్దాల కోసం టికెట్‌ రేటుకు అదనంగా రూపాయో, రెండో వసూలు చేయడం, సినిమా చూసి బయటకు వచ్చేస్తున్నప్పుడు ఆ అద్దాలను మళ్ళీ వెనక్కు ఇచ్చేయడం లాంటివి అప్పటి ప్రేక్షకులకు ఇప్పటికీ ఓ తీపి జ్ఞాపకమే. 

ఆ విజయంతో చిన్నారి ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని, వారిని ఆశ్చర్యా నందాల్లో ముంచెత్తే దృశ్యాలతో మరికొన్ని 3డి సినిమాలు అప్పట్లో వచ్చాయి. కృష్ణంరాజు, సుహాసిని నటించిన 'సాగర్‌- 3డి', జంతువుల గురించి కామెం టరీతో వచ్చిన 'జంతు ప్రపంచం - 3డి', అలాగే దర్శక - నిర్మాత బి. విఠలా చార్య తీసిన జానపద - ఫ్యాంటసీ చిత్రం 'జై భేతాళ -3డి' లాంటివన్నీ అప్పటి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నవే! అయితే, 'చిన్నారి చేతన' స్థాయి విజయాన్ని అవి అందుకోలేదు. ఆ తరువాత మళ్ళీ 3డిల హవా తెలుగులో కనపడలేదు.

అదే సినిమా... ముచ్చటగా మూడు సార్లు... 

మలయాళ చిత్రం 'మై డియర్‌ కుట్టి చేతాన్‌'కే కొన్నేళ్ళ తరువాత ప్రముఖ హిందీ తార ఊర్మిళా మాతోండ్కర్‌ నటించిన దృశ్యాలను కొత్తగా జోడించి, మలయాళంతో పాటు, హిందీలో 'ఛోటా చేతన్‌'గా 1997లో విడుదల చేశారు. మలయాళంలో తొలిసారిగా డి.టి.ఎస్‌. సౌండ్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఈ రెండో వెర్షన్‌కు దక్కిండి.

హిందీలోనూ ఈ చిత్రం విజయవంతమైంది. ఇక, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా నటించిన మేజిక్ మేజిక్ చిత్రం లాంటి ఒకటీ, అరా ప్రయత్నాలు 2000లలో జరిగాయి. అవి అంత ఘన విజయమేమీ సాధించలేదు. ఇంతలో హాలీవుడ్ చిత్రాల 3డి రూపాల హంగామా మొదలైంది. అవతార్ లాంటి బ్లాక్ బస్టర్ ఆంగ్ల చిత్రాలు 3డి రూపంలో బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించసాగాయి. దాంతో, మళ్ళీ మనవాళ్ళ దృష్టి 3డి చిత్రాల రూపకల్పన మీద పడింది.

       
        దాంతో, హిందీలో, తమిళ చిత్ర సీమలో ఈ 3డి క్రేజును సొమ్ము చేసుకొనే కృషి ముమ్మరమైంది. తమిళంలో కొత్త 3డి సినిమాలు వస్తుండగానే, ఆధునిక త్రీడీ టెక్నాలజీలను సమన్వయం చేసుకొని, 2010లో మరోసారి పాత - చుట్టి చేతన్ - సినిమాకే నటులు ప్రకాశ్ రాజ్, సంతానమ్ లతో కూడిన దాదాపు అరగంట నిడివి కొత్త దృశ్యాలను కలిపి, 2011 ఆగస్టు 25న సరికొత్తగా - డిజిటల్ 3డి - రూపంలో తమిళ, మలయాళాల్లో విడుదల చేశారు. అప్పుడూ ఆ సినిమా హిట్టే. ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అందుకుంటూ, సరికొత్త దృశ్యాలను జోడించుకుంటూ, మొత్తం మూడుసార్లు నిర్మాణమై, విడుదలైన ప్రతిసారీ విజయం సాధించడం - మై డియర్ కుట్టి చేతన్ - ప్రత్యేకత. పైగా, తొలిసారి 3డి రూపంలో విడుదలై, ఆ పైన మూడో విడత నిర్మాణంలో డిజిటల్ 3డి రూపం సంతరించుకొని విడుదలైన తొలి సినిమా ప్రపంచంలో ఇదే.

              - రెంటాల జయదేవ 
***************************************************
(published on Thurs, 20 Jun 2013 in Prajasakti daily, page no.5)
***************************************************

1 వ్యాఖ్యలు: